‘‘సహజ సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన స్వరూప ప్రయోగీ ఆత్మలుగా అవ్వండి’’
ఈరోజు జ్ఞానదాత, వరదాత తమ జ్ఞాన స్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞాన స్వరూపులుగా మరియు యోగయుక్తులుగా ఎంతవరకు అయ్యారు? జ్ఞానాన్ని వినడానికి మరియు వినిపించడానికి నిమిత్తులుగా అయ్యారా లేక జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? సమయమనుసారంగా యోగాన్ని జోడించేవారిగా అయ్యారా లేక సదా యోగీ జీవితము కలవారిగా అనగా ప్రతి కర్మలోనూ యోగయుక్తమైన, యుక్తియుక్తమైన, స్వతహా మరియు సదా యోగిగా అయ్యారా? ఏ బ్రాహ్మణ ఆత్మనైనా మీరు జ్ఞానీలు మరియు యోగీలా అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? అందరూ జ్ఞానీలు మరియు యోగీలే కదా? జ్ఞాన స్వరూపులుగా అవ్వటము అనగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ సమర్థంగా ఉంటాయి. వ్యర్థం సమాప్తమైపోతుంది ఎందుకంటే ఎక్కడైతే సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండలేదు. ప్రకాశము మరియు అంధకారము రెండూ కలిసి ఉండవు. కావున ‘జ్ఞానము’ ప్రకాశము, ‘వ్యర్థము’ అంధకారము. వర్తమాన సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చెయ్యటంపై అటెన్షన్ పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయము, సంకల్పం రూపీ బీజాన్ని సమర్థంగా తయారుచేసుకోవాలి. ఒకవేళ సంకల్పం రూపీ బీజము సమర్థంగా ఉంటే మాటలు, కర్మలు, సంబంధాలు సహజంగానే సమర్థంగా అవుతాయి. కనుక జ్ఞాన స్వరూపులు అనగా ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము సమర్థము.
యోగ స్వరూప ఆత్మలుగా అందరూ అయ్యారు కానీ ప్రతి సంకల్పము స్వతహాగా, యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి, ఇందులో నంబరువారుగా ఉన్నారు. ఎందుకని నంబరు తయారైంది? విధాత కూడా ఒక్కరే, విధి కూడా ఒక్కటే అయినప్పుడు ఇక నంబరువారుగా ఎందుకున్నారు? యోగీలుగా అయితే అయ్యారు కానీ ప్రయోగీలుగా తక్కువమంది అవుతారు అన్నదానిని బాప్‌దాదా చూసారు. యోగము చెయ్యటము మరియు చేయించటము, ఈ రెండింటిలో అందరూ తెలివైనవారు. యోగము చేయించటము రాదు అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఏ విధంగా యోగము చెయ్యటము మరియు చేయించటములో యోగ్యులుగా ఉన్నారో, అలాగే ప్రయోగము చెయ్యటంలో యోగ్యులుగా అవ్వాలి మరియు యోగ్యులుగా తయారుచెయ్యాలి - దీనినే యోగీ జీవితము అనగా యోగయుక్త జీవితమని అంటాము. ఇప్పుడు ప్రయోగీ జీవితము యొక్క అవసరముంది. యోగము యొక్క నిర్వచనము ఏదైతే తెలుసో, దేనినైతే వర్ణిస్తారో, ఆ విశేషతలన్నీ ప్రయోగంలోకి వస్తాయా? అన్నింటికన్నా ముందు మీలో మీరు ఇది చెక్ చేసుకోండి - నా సంస్కార పరివర్తనలో ఎంతవరకు ప్రయోగీగా అయ్యాను. ఎందుకంటే మీ అందరి శ్రేష్ఠ సంస్కారాలే శ్రేష్ఠ ప్రపంచ రచనకు పునాది. ఒకవేళ పునాది దృఢంగా ఉన్నట్లయితే ఇతర విషయాలన్నీ స్వతహాగా దృఢంగా ఉండనే ఉంటాయి. కనుక సమయానికి సంస్కారాలు ఎక్కడా మోసం చేయడం లేదు కదా అని చూసుకోండి. శ్రేష్ఠ సంస్కారాలను పరివర్తన చేసే ఎటువంటి వ్యక్తి అయినా, వస్తువైనా, పరిస్థితి అయినా, యోగ ప్రయోగము చేసే ఆత్మను శ్రేష్ఠత నుండి సాధారణతలోకి కదిలించలేరు. విషయమే అటువంటిది, వ్యక్తియే అలా ఉన్నారు, వాయుమండలము అలా ఉంది, అందుకే శ్రేష్ఠ సంస్కారాలను పరివర్తన చేసి సాధారణంగా లేక వ్యర్థంగా చేసుకున్నాము అని అనటం కాదు, ఇలా అనేవారిని ప్రయోగీ ఆత్మ అని అంటామా? ఒకవేళ సమయానికి యోగ శక్తుల ప్రయోగం జరగకపోతే వారిని ఏమంటాము? కనుక ముందుగా ఈ పునాదిని చూసుకోండి - ఎంతవరకు సమయానికి ప్రయోగీగా అయ్యాను? ఒకవేళ స్వయం యొక్క సంస్కారాల పరివర్తకులుగా అవ్వనట్లయితే కొత్త ప్రపంచ పరివర్తకులుగా ఎలా అవుతారు?
ప్రయోగీ ఆత్మ యొక్క మొదటి గుర్తు - సంస్కారాలపై ప్రయోగంలో సదా విజయీ. రెండవ గుర్తు - ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులపై యోగ ప్రయోగం ద్వారా విజయీ. ఎప్పటికప్పుడు ప్రకృతి అలజడి కూడా యోగీ ఆత్మలను తన వైపుకు ఆకర్షితం చేస్తుంది. అటువంటి సమయములో యోగం అనే విధి ప్రయోగములోకి వస్తుందా? ఎప్పుడైనా యోగీ పురుషులను లేక పురుషోత్తమ ఆత్మలను ప్రకృతి ప్రభావితమైతే చెయ్యటం లేదు కదా? ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు పురుషోత్తమ ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసి. యజమాని దాసి ప్రభావంలోకి వస్తే, వారినేమంటారు? ఈరోజుల్లో పురుషోత్తమ ఆత్మలను ప్రకృతి సాధనాలు లేక సౌకర్యాల రూపంలో ప్రభావితం చేస్తుంది, సాధనాలు లేక సౌకర్యాల ఆధారంపై యోగి జీవితముంటుంది. సాధనాలు లేక సౌకర్యాలు తక్కువైతే యోగయుక్తంగా ఉండటము కూడా తక్కువైపోతుంది - దీనినే ప్రభావితమవ్వటము అని అంటారు. యోగీ లేక ప్రయోగీ ఆత్మ యొక్క సాధన ఎదురుగా సాధనాలు స్వతహాగా వాటంతటవే వస్తాయి. సాధనాలు సాధనకు ఆధారంగా ఉండకూడదు కానీ సాధన సాధనాలను స్వతహాగా ఆధారంగా చేసుకుంటుంది, ఇటువంటివారిని ప్రయోగీ ఆత్మ అని అంటాము. కనుక చెక్ చేసుకోండి - సంస్కార పరివర్తనలో విజయిగా మరియు ప్రకృతి ప్రభావముపై విజయిగా ఎంతవరకు అయ్యారు? మూడవ గుర్తు - వికారాలపై విజయి. యోగీ-ప్రయోగీ ఆత్మల ముందు ఈ పంచ వికారాలు, ఇవి ఇతరుల కొరకు విష సర్పాలు కానీ యోగీ-ప్రయోగీ ఆత్మలైన మీ కొరకు ఈ సర్పాలు మెడలోని మాలగా అవుతాయి. బ్రాహ్మణులైన మీ యొక్క మరియు బ్రహ్మా బాబా యొక్క అశరీరి తపస్వీ శంకర స్వరూపం యొక్క స్మృతిచిహ్నాన్ని ఇప్పుడు కూడా భక్తులు పూజిస్తూ మరియు గాయనం చేస్తూ ఉంటారు. రెండవ స్మృతిచిహ్నము - ఈ సర్పాలు మీకు ఎంతగా అధీనమైపోతాయంటే మీరు సంతోషంతో నాట్యము చేసేందుకు స్టేజ్ వలె అవుతాయి. విజయులుగా అయినప్పుడు ఏమి అనుభవము చేస్తారు? ఏ స్థితి ఉంటుంది? సంతోషంలో నాట్యము చేస్తూ ఉంటారు కదా. కనుక ఈ స్థితిని స్టేజ్ రూపంలో చూపించారు. స్థితిని కూడా స్టేజ్ అని అంటాము. ఈ విధంగా వికారాలపై విజయీగా అవ్వాలి - ఇటువంటివారిని ప్రయోగీ అని అంటాము. కనుక ఎంతవరకు ప్రయోగీగా అయ్యాము అన్నదానిని చెక్ చేసుకోండి. ఒకవేళ యోగాన్ని సమయానికి ప్రయోగించకపోతే, యోగ విధి ద్వారా సమయానికి సిద్ధి లభించకపోతే దానిని యథార్థ విధి అని అంటారా? సమయము తన తీవ్ర గతిని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంది. అనేకత, అధర్మము, తమోప్రధానత ప్రతి క్షేత్రములో తీవ్రగతితో పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయములో మీ యోగ విధి యొక్క వృద్ధి మరియు విధి ద్వారా సిద్ధిలో వృద్ధి తీవ్రగతితో ఉండటము అవసరము. నంబరు ముందుకు వెళ్ళడానికి ఆధారము ప్రయోగీగా అయ్యే సహజ విధి. కానీ బాప్‌దాదా ఏం చూసారంటే - సమయానికి ప్రయోగము చెయ్యటంలో తీవ్ర గతికి బదులుగా సాధారణ గతి ఉంది. ఇప్పుడు దీనిని పెంచండి. అప్పుడేమి జరుగుతుందంటే, సిద్ధి స్వరూపాన్ని అనుభవము చేస్తూ ఉంటారు. మీ జడ చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే అనుభవాన్ని చేస్తూ ఉంటారు. చైతన్యములో సిద్ధి స్వరూపులుగా అయ్యారు, అందుకే ఈ స్మృతిచిహ్నము కొనసాగుతూ వస్తుంది. రిద్ధి-సిద్ధి కలవారు కాదు, విధి ద్వారా సిద్ధి. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? అన్నీ ఉన్నాయి కానీ సమయానికి ప్రయోగించటము మరియు ప్రయోగము సఫలమవ్వటము, ఇటువంటివారినే జ్ఞాన స్వరూప ఆత్మ అని అంటాము. ఇటువంటి జ్ఞాన స్వరూప ఆత్మలు అతి సమీపమైనవారు మరియు అతి ప్రియమైనవారు. అచ్ఛా!
సదా యోగ విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని అనుభవము చేసేవారికి, సదా సాధారణ సంస్కారాలను శ్రేష్ఠ సంస్కారాలలోకి పరివర్తన చేసేవారికి, సంస్కార పరివర్తక ఆత్మలకు, సదా ప్రకృతిజీతులకు, వికారాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ ఆత్మలకు, సదా ప్రయోగం యొక్క గతిని తీవ్రంగా ఉన్నట్లు అనుభవము చేసే జ్ఞాన స్వరూపులకు, యోగయుక్త యోగీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(నవంబరు 24న ఇద్దరు కుమారీల సమర్పణ సమారోహము తర్వాత రాత్రి 10 గంటలకు ఆల్‌రౌండర్ దాదీగారు తమ పాత శరీరాన్ని వదిలి బాప్‌దాదా ఒడికి చేరుకున్నారు, 25వ తారీఖు మధ్యాహ్నం వారి అంతిమ సంస్కారాలను చెయ్యటం జరిగింది, సాయంకాలము మురళి తరువాత దాదీలతో మిలనము చేసే సమయంలో బాప్‌దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు ఈ విధంగా ఉన్నాయి)
ఆటలో రకరకాల ఆటలను చూస్తుంటారు. సాక్షీగా అయ్యి ఆటను చూడటంలో ఆనందం కలుగుతుంది కదా. అది ఉత్సవమైనా లేక ఎవరైనా శరీరము వదిలినా గానీ ఏమనిపిస్తుంది? ఆటలో ఆటగా అనిపిస్తుంది. అంతేకాక ఎలాగైతే ఆట జరుగుతుందో మరియు సమయమనుసారంగా సమాప్తమైపోతుందో, ఇది కూడా అలానే అనిపిస్తుంది కదా. అలాగే ఏదైతే జరిగిందో అది సహజంగా సమాప్తమయ్యింది కావున ఆటలానే అనిపిస్తుంది. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర ఉంటుంది. సర్వాత్మల శుభ భావన, అనేక ఆత్మల శుభ భావన ప్రాప్తించటము, ఇది కూడా ప్రతి ఆత్మ యొక్క భాగ్యానికి లభించిన సిద్ధి. కావున ఏదైతే జరిగిందో, అక్కడ ఏం చూసారు? ఆటను చూసారా లేక మృత్యువును చూసారా? ఒక వైపు ఆ అలౌకిక స్వయంవరాన్ని చూసారు మరియు రెండో వైపు శరీరాన్ని మార్చుకునే ఆటను చూసారు. కానీ రెండూ ఎలా అనిపించాలి? ఆటలో ఆట. ఏమైనా తేడా ఉంటుందా? స్థితిలో తేడా వస్తుందా? అలౌకిక స్వయంవరాన్ని చూడటంలో మరియు శరీరము మారటాన్ని చూడటంలో ఏమైనా తేడా వచ్చిందా? ఆలోచన ఏమైనా కాస్త మారిందా లేక మారలేదా? సాక్షీగా అయ్యి ఆటను చూసినట్లయితే దేని విధి దానిదే. సహజంగా నష్టోమోహులుగా అవ్వటము, ఇది బహుకాలపు యోగ విధి ద్వారా కలిగిన సిద్ధి. కనుక నష్టోమోహులు, సహజ మృత్యువు యొక్క ఆటను చూసారు. ఈ ఆటలో ఏ రహస్యాన్ని చూసారు? దేహపు స్మృతి నుండి కూడా ఉపరామము. వ్యాధి ద్వారా గానీ, విధి ద్వారా గానీ మరే ఇతర ఆకర్షణా అంతిమ సమయములో ఆకర్షితము చెయ్యకూడదు. దీనినే సహజంగా శరీరాన్ని మార్చటము అని అంటాము. మరి ఏం చెయ్యాలి? నష్టోమోహ, సెంటరు కూడా గుర్తు రాకూడదు. (టీచర్లను చూస్తూ) ఎవరైనా జిజ్ఞాసువులు గుర్తు రావటము, సెంటరులోని ఏ వస్తువైనా గుర్తు రావటము, పక్కకు పెట్టినవి గుర్తు రావటము... ఇలా ఉండకూడదు. అన్నింటి నుండి అతీతము మరియు తండ్రికి ప్రియము. మొదటి నుండే అంచులను వదిలేసారు. ఏ అంచునూ ఆధారంగా చేసుకోకూడదు. గమ్యముపై తప్ప మరి దేనిపైనా ఆకర్షణ ఉండకూడదు. అచ్ఛా!
నిర్మల్శాంత దాదీతో మిలనము:- సంగఠన బాగా అనిపిస్తుందా? సంగఠనకు విశేషమైన శోభ ఉంటుంది. అందరి దృష్టి ఎంత ప్రేమగా మీ అందరివైపుకు వెళ్తుంది! ఎంతవరకైతే ఎంత సేవ ఉంటుందో, అంత సేవ శరీరము ద్వారా జరగాల్సిందే. ఎలాగైనా సరే శరీరం నడుస్తూనే ఉంటుంది. శరీరాన్ని నడిపించే పద్ధతి వచ్చింది కదా. మంచిగా నడుస్తుంది ఎందుకంటే తండ్రి మరియు అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి, ఇక వేరే పనేముంది. అందరూ మిమ్మల్ని చూస్తూ-చూస్తూ ఎంత సంతోషిస్తారు, కావున సంతోషాన్ని పంచుతున్నారు కదా. తింటున్నారు కూడా, పంచుతున్నారు కూడా. మీరు ప్రతి ఒక్కరూ దర్శనీయ మూర్తులు. అందరి దృష్టి నిమిత్త ఆత్మల వైపుకు వెళ్తుంది కనుక దర్శనీయ మూర్తులుగా అయినట్లు కదా. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదా యొక్క వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1
బ్రాహ్మణ జీవితానికి ఆధారము - స్మృతి మరియు సేవ
డ్రామా అనుసారంగా బ్రాహ్మణ జీవితములో అందరికీ సేవ యొక్క ఛాన్స్ లభించింది కదా ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి ఆధారమే స్మృతి మరియు సేవ. ఒకవేళ స్మృతి మరియు సేవ బలహీనమైతే, ఏ విధంగా శరీర ఆధారము బలహీనమైనప్పుడు శరీరము మందులతో నడుస్తుంది కదా, అలా బ్రాహ్మణ జీవితములో ఒకవేళ స్మృతి మరియు సేవ యొక్క ఆధారము దృఢంగా లేకుండా బలహీనంగా ఉన్నట్లయితే ఆ బ్రాహ్మణ జీవితము కూడా ఒక్కోసారి వేగంగా నడుస్తుంది, ఒక్కోసారి ఢీలాగా నడుస్తుంది, ఏదైనా నెడితే నడుస్తుంది. ఏదైనా సహయోగము లభిస్తే, ఏదైనా తోడు లభిస్తే, ఏవైనా పరిస్థితులు అనుకూలిస్తే నడుస్తారు, లేదంటే ఢీలా అయిపోతారు కనుక స్మృతి మరియు సేవ అనే విశేష ఆధారము సదా శక్తిశాలిగా ఉండాలి. రెండూ శక్తిశాలిగా ఉండాలి. సేవ చాలా ఉంది, స్మృతి తక్కువగా ఉంది లేక స్మృతి చాలా బాగుంది సేవ తక్కువగా ఉంది అంటే తీవ్ర గతి ఉండజాలదు. స్మృతి మరియు సేవ, రెండింటిలో తీవ్ర గతి ఉండాలి. శక్తిశాలిగా ఉండాలి. మరి రెండూ శక్తిశాలిగా ఉన్నాయా లేక తేడా వస్తుందా? ఒక్కోసారి సేవ ఎక్కువవుతుంది, ఒక్కోసారి స్మృతి ఎక్కువవుతుందా? రెండూ కలిపి-కలిపి ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ. స్వార్థముతో కూడిన సేవ కాదు, నిస్వార్థ సేవ ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటము చాలా సహజము. ప్రతి కర్మలో, కర్మ సమాప్తి కన్నా ముందు సదా విజయము కనిపిస్తుంది, విజయము లభించే ఉంది అన్న ఇంతటి స్థిరమైన నిశ్చయము అనుభవమవుతుంది. ఒకవేళ బ్రాహ్మణ ఆత్మలకు విజయము లభించకపోతే ఇంకెవరికి లభిస్తుంది? క్షత్రియులకు లభిస్తుందా? బ్రాహ్మణులకు విజయము లభిస్తుంది కదా. ప్రశ్నార్థకము ఉండదు. చేయడమైతే చేస్తున్నాములే, నడవడమైతే నడుస్తున్నాములే, చూద్దాములే, అయిపోతుందిలే, అవ్వడం అవ్వాలి కదా... ఇక ఈ మాటలు రావు. ఏమవుతుందో తెలియదు, అవుతుందో లేదో తెలియదు... ఇవి నిశ్చయముతో కూడుకున్న మాటలా? నిశ్చయబుద్ధి కలవారే విజయులు అన్న గాయనము ఉంది కదా? ప్రాక్టికల్‌గా జరిగింది కాబట్టే గాయనము ఉంది. నిశ్చయబుద్ధికి గుర్తు - విజయము నిశ్చితము. ఎవరికైనా ఏదైనా శక్తి ఉంటే, ధన శక్తి గానీ, బుద్ధి శక్తి గానీ, సంబంధ-సంపర్కాల శక్తి గానీ ఉంటే వారికి ఇదేమంత పెద్ద విషయము, ఇదసలు విషయమే కాదు అన్న నిశ్చయము ఉంటుంది. మీవద్దనైతే అన్ని శక్తులు ఉన్నాయి. ధనం యొక్క శక్తి ఉందా లేక ధన శక్తి కోటీశ్వరుల వద్ద ఉందా? అన్నింటికంటే పెద్ద ధనము అవినాశీ ధనము, అది సదా తోడుగా ఉంటుంది. కనుక ధనం యొక్క శక్తి కూడా ఉంది, బుద్ధి యొక్క శక్తి కూడా ఉంది, పొజిషన్ యొక్క శక్తి కూడా ఉంది. ఏయే శక్తులైతే గాయనము చెయ్యబడ్డాయో, ఆ శక్తులన్నీ మీలో ఉన్నాయి. ఉన్నాయా లేక ఎప్పుడైనా ప్రాయః లోపమైపోతాయా? వీటిని ఇమర్జ్ రూపంలో అనుభవము చెయ్యండి. ఉన్నదైతే సర్వశక్తిమంతుని సంతానంగా కానీ అనుభవము అవ్వదు అని ఇలా అనుకోవటము కాదు. మరి అందరూ నిండుగా ఉన్నారా లేక కొద్ది-కొద్దిగా ఖాళీగా ఉన్నారా? సమయానికి విధి ద్వారా సిద్ధి ప్రాప్తించాలి. అవసరమైన సమయానికి ఉండవు కానీ చాలా శక్తులు ఉన్నాయి అని మాత్రం నషా ఉండటము కాదు. ఎప్పుడూ మీ శక్తులను మర్చిపోవద్దు, ఉపయోగిస్తూ వెళ్ళండి. ఒకవేళ స్వయము కొరకు కార్యములో ఉపయోగించడము వచ్చినట్లయితే ఇతరుల కార్యములో కూడా ఉపయోగించగలుగుతారు. పాండవులలో శక్తి వచ్చిందా లేక ఎప్పుడైనా క్రోధము వస్తుందా? కొద్ది-కొద్దిగా క్రోధము వస్తుందా? ఎవరైనా క్రోధం చేస్తే క్రోధం వస్తుందా, ఎవరైనా అవమానిస్తే క్రోధం వస్తుందా? శత్రువు వస్తే ఓటమి కలుగుతుంది అన్నట్లుంది ఇది. మాతలకు కొద్ది-కొద్దిగా మోహం కలుగుతుందా? పాండవులకు ప్రతి కల్పములోని తమ విజయము యొక్క సంతోషము సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా పాండవులను గుర్తు చేసుకుంటే పాండవులు అన్న పదంతో విజయము ఎదురుగా వస్తుంది కదా. పాండవులు అనగా విజయీ. పాండవుల కథలో ఉన్న రహస్యమే ఏమిటి? విజయము కదా. కనుక ప్రతి కల్పములోని విజయులు. ఇమర్జ్ రూపంలో నషా ఉండాలి. మర్జ్ అయ్యి ఉండకూడదు. అచ్ఛా!
గ్రూప్ నం.2
సర్వుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నిర్మానులుగా అవ్వండి
అందరూ స్వయాన్ని సదా కోట్లలో కొద్దిమందిగా మరియు కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవము చేస్తారా? లేక కోట్లలో కొద్దిమంది అని ఏదైతే గాయనము చెయ్యబడిందో అది వేరే ఎవరోనా? లేక మీరేనా? కనుక ప్రతి ఒక్క ఆత్మకూ ఎంతటి మహత్వము ఉంది అనగా ప్రతి ఆత్మా మహానాత్మ. కనుక ఎవరు ఎంత మహానులుగా ఉంటారో, మహానతకు గుర్తు ఏమిటంటే ఎంతటి మహానులో అంతే నిర్మానులు ఎందుకంటే సదా నిండుగా ఉన్న ఆత్మలు. వృక్షం ఎంత నిండుగా ఉంటుందో అంత ఒంగి ఉంటుంది అని వృక్షం గురించి అంటారు కదా. అలా నిర్మానతయే సేవ చేస్తుంది. వృక్షం ఒంగి ఉండటమనేది సేవ చేస్తుంది, ఒకవేళ ఒంగి ఉండకపోతే సేవ చెయ్యదు. కనుక ఒక వైపు మహానత ఉంది మరియు రెండో వైపు నిర్మానత ఉంది. ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారు సర్వుల ద్వారా గౌరవాన్ని పొందుతారు. స్వయము నిర్మానులుగా అయినట్లయితే ఇతరులు గౌరవం ఇస్తారు. ఎవరైతే అభిమానములో ఉంటారో వారికి ఎవ్వరూ గౌరవం ఇవ్వరు. వారి నుండి దూరంగా పారిపోతారు. కనుక మహానులుగా మరియు నిర్మానులుగా ఉన్నారా లేదా అన్నదానికి గుర్తు ఏమిటంటే - నిర్మానులు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎక్కడకు వెళ్ళినా, ఏది చేసినా అది సుఖదాయకముగా ఉంటుంది. కనుక దీని ద్వారా చెక్ చేసుకోండి, మేము ఎంత మహానులుగా ఉన్నాము? సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చెయ్యాలి. ఇలాగే ఉంటుందా లేక ఎప్పుడైనా దుఃఖం కూడా లభిస్తుందా? నిర్మానత తక్కువగా ఉన్నట్లయితే సుఖాన్ని కూడా సదా ఇవ్వలేరు. మరి సదా సుఖాన్ని ఇస్తూ, సుఖాన్ని తీసుకుంటారా లేక ఎప్పుడైనా దుఃఖాన్ని ఇస్తూ, దుఃఖాన్ని తీసుకుంటారా? సరే, ఇవ్వరు, కానీ తీసుకోవటమైతే తీసుకుంటారా? కాస్త ఫీల్ అవుతున్నారంటే తీసుకున్నట్లే కదా. ఒకవేళ ఏ విషయంలోనైనా ఎవరైనా ఫీల్ అయితే దానిని దుఃఖము తీసుకోవటము అని అంటాము. ఎవరైనా ఇచ్చినాగానీ, మీరు తీసుకోకండి, ఇదైతే మీపై ఆధారపడి ఉంది కదా. ఎవరివద్దనైనా ఉన్నదే దుఃఖమన్నప్పుడు వారేమి ఇస్తారు? దుఃఖాన్నే ఇస్తారు కదా. కానీ మీ పని - సుఖాన్ని తీసుకోవటము మరియు సుఖాన్ని ఇవ్వటము. ఎవరైనా దుఃఖాన్ని ఇస్తుంటే, నేనేం చెయ్యాలి, నేను దుఃఖాన్ని ఇవ్వలేదు కానీ వారు ఇచ్చారు అని ఇలా అనటము కాదు. మీకు మీరు చెక్ చేసుకోవాలి - ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని. తీసుకోవటములో కూడా తెలివి కావాలి కదా, కనుకనే బ్రాహ్మణ ఆత్మల గాయనము ఉంది - సుఖ సాగరుని పిల్లలు, సుఖ స్వరూప సుఖదేవులు అని. కనుక సుఖ స్వరూప సుఖదేవ ఆత్మలు. దుఃఖ ప్రపంచాన్ని వదిలేసారా, పక్కకు వచ్చేసారా లేక ఇప్పటివరకు కూడా ఒక కాలు దుఃఖధామంలోనూ, ఒక కాలు సంగమయుగములోనూ ఉందా? కొద్ది-కొద్దిగా అక్కడ బుద్ధి ఉండిపోయింది అని ఇలా అయితే కాదు కదా? కాలు లేకపోయినా గానీ వ్రేలు కొద్దిగా ఉండిపోయిందా? దుఃఖధామాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇక దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. అచ్ఛా!
ఇది వెరైటీ గ్రూపు. డబల్ విదేశీయులు కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నాగానీ ఒక్కరికి చెందినవారు. ఒక్కరికి చెందినవారు, ఒకటిగా ఉన్నారు. అందరూ ఒకటిగా ఎలా ఉన్నారు? అందరూ బ్రాహ్మణ ఆత్మలు. ఇవైతే సేవ కోసం భిన్న భిన్న స్థానాలలో కూర్చున్నారు, కానీ స్మృతి ఏమి ఉంటుంది? మేము ఒక్కరికి చెందిన వారము, మేమంతా బ్రాహ్మణ ఆత్మలము. ఇంత సంతోషం ఉంటుందా? బ్రాహ్మణులు పరస్పరంలో కలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది! ఆ సంతోషం కూడా అవినాశి సంతోషం. ఎందుకంటే ఇది మీ ఖజానా కదా. మరి మీ ఖజానాను మీతో పెట్టుకుంటారా లేక వేరు చేస్తారా? అందరూ ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అర్థమయిందా! ఇప్పుడు ఎగరాలి, నడవకూడదు.
వర్తమానం మరియు భవిష్యత్తులో ఎప్పుడూ కలవరపడరు కదా. స్వ స్థితి ముందు పరిస్థితి ఏమీ కాదు. ఎంత పెద్ద పర్వతమైనాగానీ మీరు ఎత్తులో ఉంటే పర్వతం కూడా చిన్నగా కనిపిస్తుంది. కనుక, ఎప్పుడైనా పరిస్థితి పెద్దదిగా ఉంది అనిపించినప్పుడు ఎగిరే కళలోకి వెళ్ళిపోండి. అప్పుడు పరిస్థితి ఆటబొమ్మగా అనిపిస్తుంది. ఏమి జరిగినా, ఎలా ఉన్నాగానీ ఎగరే కళ ముందు ఏదీ నిలవదు.
గ్రూప్ నం. 3
మాయాజీతులుగా అవ్వడానికి మాస్టర్ సర్వశక్తిమంతుని పొజిషన్‌ను స్మృతిలో ఉంచుకోండి
మిమ్మల్ని మీరు కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా అనుకుంటున్నారా? సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? లేదా అప్పుడప్పుడు చేసుకుంటున్నారా? ఒకవేళ ఏ రకమైన మాయ నీడ పడినా కమల పుష్పం అంటారా? మరి మాయ వస్తోందా లేక అందరూ మాయాజీతులుగా ఉన్నారా? ఎందుకంటే సదా మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తిమంతులైన శ్రేష్ఠ ఆత్మగా అనుకుంటే మాస్టర్ సర్వశక్తిమంతుల ఎదుట మాయ రానేరాదు. మాయ చీమ లాంటిదా లేక సింహం లాంటిదా? మరి చీమపై విజయం ప్రాప్తి చేసుకోవడం పెద్ద విషయమా? మీ స్మృతి యొక్క ఎత్తైన స్టేజ్‌లో ఉన్నప్పుడు మాయ అనే చీమని జయించడం సహజంగా అనిపిస్తుంది, కానీ బలహీనంగా ఉన్నప్పుడు చీమ కూడా సింహంలా అనిపిస్తుంది. కాబట్టి సదా అమృతవేళ ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి - నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను/మాస్టర్ సర్వశక్తిమంతురాలను అని. అప్పుడు అమృతవేళ స్మృతి రోజంతా సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది. ఎలాగైతే స్థూల పొజిషన్ ఉన్నవారు తమ పొజిషన్‌ను మరచిపోరు. ఈనాటి ప్రైమ్ మినిస్టర్ ‘నేను ప్రైమ్ మినిస్టర్‌ను’ అని మరచిపోతారా? మీ పొజిషన్ మాస్టర్ సర్వశక్తిమంతులు, కాబట్టి మరచిపోలేరు. కానీ మరచిపోతుంటారు, అందుకే ప్రతిరోజూ అమృతవేళ ఈ స్మృతిని ఇమర్జ్ చేయడం ద్వారా నిరంతర స్మృతి ఉంటుంది.
ప్రపంచం దేనినైతే వెతుకుతోందో అది మాకు ప్రాప్తించింది, ప్రపంచం వారు తిరస్కరించారు కానీ తండ్రి మమ్మల్ని ముందుంచారు అనే నషా మాతలకు ఉందా?
(మూడు భాషల వారు కూర్చుని ఉన్నారు) అంతే, ఈ వెరైటీ భాషల సమయం కొద్దిసమయానికే ఉంటుంది. తర్వాత ఒకే భాష అయిపోతుంది. ఏది ఆ ఒక భాష అవుతుంది? (హిందీ అవుతుంది) అయితే మీరు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు చూడండి స్థూల చదువు జరుగుతోంది, ఆధ్యాత్మిక చదువు కూడా జరుగుతోంది. హిందీ కూడా నేర్చుకుంటున్నారు కదా.
మంచిది, లగ్నం, స్నేహం బాగున్నాయి. ఎంత స్నేహం ఉంది? సాగరుడు కూడా దీని ముందు ఏమీ కాదు. ఎవరు ఎంత స్నేహంలో ఉంటారో, అంతగా తండ్రి ద్వారా పదమారెట్ల స్నేహం ప్రాప్తించినట్లు అనుభవం చేసుకుంటారు. అచ్ఛా! అందరూ ఉల్లాస-ఉత్సాహాలలో ఉన్నారు కదా. ఎలాంటివారు ఎలా అయ్యారు!
గ్రూప్ నం. 4
ధైర్యం మరియు ఉల్లాస-ఉత్సాహాల ఆధారంగా ఎగిరే కళను అనుభవం చేసుకోండి
సదా ఎగిరే కళ కొరకు ప్రత్యేకంగా ఏ స్మృతి అవసరం? ఎప్పుడూ కిందకి రాకూడదు, సదా పైన ఉండాలి దానికి ఏమి అవసరం? ఎగరడానికి రెక్కలు కావాలి కదా. మరి ఎగిరే కళ యొక్క రెండు రెక్కలు ఏవి? (జ్ఞానము మరియు యోగము) జ్ఞానము మరియు యోగముతో పాటు ధైర్యం మరియు ఉల్లాస-ఉత్సాహాలు. ధైర్యం ఉంటే, ధైర్యంతో ఏమి కావాలంటే, ఎలా కావాలంటే అలా చేయవచ్చు. అందుకే హిమ్మతే బచ్చే మదదే బాప్ (పిల్లలు ధైర్యం వహిస్తే తండ్రి సహాయం చేస్తారు) అని గాయనం చేయబడింది. మరి ధైర్యం మరియు ఉల్లాస-ఉత్సాహాలు ఉంటున్నాయా? ఎందుకంటే ఏ కార్యంలోనైనా సఫలతను పొందడానికి ఉల్లాస-ఉత్సాహాలు చాలా అవసరం. ఒకవేళ ఉల్లాస-ఉత్సాహాలు లేకపోతే కార్యం సఫలం కాజాలదు. ఎందుకు? ఎక్కడైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉండవో అక్కడ అలసట చాలా ఎక్కువగా ఉంటుంది, అలసిపోయినవారు ఎప్పుడూ విజయం సాధించలేరు. కాబట్టి ధైర్యం మరియు ఉల్లాస-ఉత్సాహాలు - ఈ ఆధారంగా సదా ఎగిరే కళ యొక్క అనుభవం చేసుకోవచ్చు. వర్తమాన సమయానుసారంగా ఎగిరే కళ లేకపోతే గమ్యానికి చేరుకోలేరు. ఎందుకంటే పురుషార్థం ఒక జన్మది, ప్రాప్తి 21 జన్మలకే కాదు మొత్తం కల్పానిది. ద్వాపరం తర్వాత కూడా పూజ్యులుగా అవుతారు కదా. ఒక జన్మ శ్రమ మరియు అనేక జన్మల ప్రాప్తి. మరి ఎంత తీవ్ర గతితో పురుషార్థం చేస్తున్నారు? ఇలాంటి తీవ్ర పురుషార్థులా లేక సాధారణ పురుషార్థులా? సమయం స్మృతిలో ఉన్నప్పుడు తీవ్ర పురుషార్థం చేయకుండా ఉండలేరు. సమయం యొక్క మహత్వాన్ని సదా గుర్తుంచుకోండి. ఒక్క జన్మలో అనేక జన్మలు సంస్కరించబడతాయి, సఫలమవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు కానీ అనుభవం చేసుకున్నారు.
ఇప్పుడు ఏ విశేషత చేస్తారు? ప్రదర్శని మరియు మేళా చేస్తారా! మేళా అనేది కామన్ అయిపోయింది. కొత్తగా ఏమి చేస్తారు? ఏమి చేశారో, ఎంత చేశారో అది బాగా చేశారు, కానీ ఇప్పుడు ఏదైనా పవర్ఫుల్ మైక్‌ను తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ సమయంలో తయారీ ఎక్కువగా చేయాలి, కాబట్టి మైక్ కావాలి కదా, వారు మీ తరఫున ఒకేసారి అనేకులకు సందేశం ఇవ్వాలి. మీరు ఎంతకాలం మీ పరిచయాన్ని ఇస్తూ ఉంటారు? ఇప్పుడు ఇతరులు మీ పరిచయం ఇవ్వాలి. మాతలారా, అలాంటి మాతలను తయారుచేయండి. వారి ధ్వని బిగ్గరగా అవ్వగలిగేటువంటి మాతలు చాలామంది ఉన్నారు. ఎవరి ధ్వని బిగ్గరగా ఉంటుందో వారిని మైక్ అంటాము. శ్రమ తక్కువ, ఫలం ఎక్కువగా లభించాలి. మేము తండ్రి యొక్క రైట్ హ్యాండ్ (కుడి భుజం), అనగా సదా ప్రతి కార్యంలో సహయోగి ఆత్మలము అనే ఈ స్మృతిలోనే సదా ఉండండి. రైట్ హ్యాండ్ అద్భుతం చేస్తుంది కదా. అచ్ఛా, కుమారీలు కూడా వచ్చారు. కుమారీలు కమాల్ చేసే ప్లాన్ తయారుచేస్తున్నారా లేక స్వయాన్ని చిన్నవారిగా అనుకుంటున్నారా? ఏమి కమాల్ చేస్తారు? అందరికంటే పెద్దవారికంటే కూడా మీరు పెద్దవారిగా అయిపోయేలా, వారు చిన్నవారైపోయేలా అనుకోండి. బాగుంది, కుమారీల జీవితం శ్రేష్ఠమైపోయింది. మిమ్మల్ని మీరు భాగ్యవంతులుగా అనుకుంటున్నారు కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 5
విశేష పాత్రధారి అనగా ప్రతి అడుగు, ప్రతి సెకను సదా అలర్ట్, నిర్లక్ష్యంగా ఉండకూడదు
సదా మిమ్మల్ని మీరు నడుస్తూ- తిరుగుతూ, తింటూ-తాగుతూ అనంతమైన వరల్డ్ డ్రామా యొక్క స్టేజీపై విశేష పాత్రధారి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? విశేష పాత్రధారిగా ఉన్నవారికి సదా ప్రతి సమయం తమ కర్మ అనగా పాత్రపై అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం డ్రామాకు ఆధారమే హీరో పాత్రధారి. మరి ఈ మొత్తం డ్రామాకు ఆధారం మీరే కదా! మరి విశేష ఆత్మలకు లేదా విశేష పాత్రధారులకు సదా ఇంతగా అటెన్షన్ ఉందా? విశేష పాత్రధారులు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరు. అలర్ట్‌గా ఉంటారు. మరి ఎప్పుడైనా నిర్లక్ష్యం రావడం లేదు కదా? చేస్తున్నాము లే, చేరుకుంటాములే అని ఆలోచించడం లేదు కదా? చేస్తున్నారు కానీ ఏ గతితో చేస్తున్నారు? నడుస్తున్నారు కానీ ఏ గతితో నడుస్తున్నారు? వేగంలో (గతిలో) తేడా ఉంటుంది కదా. ఎక్కడ కాలినడకన వెళ్ళేవారు, ఎక్కడ ప్లేన్‌లో వెళ్ళేవారు! చెప్పడానికి అయితే కాలినడకన వెళ్ళేవారు నడుస్తున్నారు, ప్లేన్‌లో వెళ్ళేవారు నడుస్తున్నారు అని అంటారు కానీ ఎంత వ్యత్యాసం ఉంది! కాబట్టి నడుస్తున్నాము, బ్రహ్మాకుమార్గా అయ్యాము అనగా నడుస్తున్నాము అని కాకుండా ఏ గతితో నడుస్తున్నారు అనేది ముఖ్యము. తీవ్ర గతి ఉన్నవారే సమయానికి గమ్యానికి చేరుకుంటారు. లేకపోతే వెనుకబడిపోతారు. ఇక్కడ కూడా ప్రాప్తి అయితే లభిస్తుంది, కానీ అది సూర్యవంశీ ప్రాప్తా లేక చంద్రవంశీ ప్రాప్తా అనే తేడా ఉంటుంది కదా. కాబట్టి సూర్యవంశంలోకి రావడానికి ప్రతి సంకల్పం, ప్రతి మాటలో సాధారణత సమాప్తమవ్వాలి. ఒకవేళ ఏ హీరో యాక్టర్ అయినా సాధారణ యాక్ట్ చేస్తే అందరూ నవ్వుతారు కదా. కాబట్టి, నేను విశేష పాత్రధారిని, అందుకే నా ప్రతి కర్మ విశేషంగా ఉండాలి, ప్రతి అడుగు విశేషంగా ఉండాలి, ప్రతి సెకను, ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్ఠంగా ఉండాలి అనే స్మృతి సదా ఉండాలి. ఏదో ఒక 5 నిమిషాలు సాధారణంగా జరిగిపోయింది అని అనుకోకూడదు. ఐదు నిమిషాలు కేవలం ఐదు నిమిషాలు కాదు. సంగమయుగం యొక్క ఐదు నిమిషాలు ఎంతో మహత్వమున్నవి, ఐదు నిమిషాలు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ. అందుకే ఇంతటి అటెన్షన్ ఉండాలి. వీరినే తీవ్ర పురుషార్థి అంటాము. తీవ్ర పురుషార్థుల స్లోగన్ ఏది? ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు’, మరి ఇది సదా గుర్తుంటోందా? ఎందుకంటే సదా కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి అటెన్షన్ కూడా సదా ఉండాలి. ఇప్పుడు కొద్ది సమయం సదా ఉండే అటెన్షన్ చాలా కాలం, సదా కాల ప్రాప్తిని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి సమయం ఈ స్మృతి ఉండాలి మరియు నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా సాధారణత వస్తోందా? అని చెకింగ్ ఉండాలి. ఎలాగైతే తండ్రిని పరమ ఆత్మ అని అంటారో, వారు పరమ్ కదా. అలాగే తండ్రి లాగే పిల్లలు కూడా ప్రతి విషయంలోనూ పరమ్ అనగా శ్రేష్ఠులు.
కాబట్టి ఇప్పుడు స్వయం యొక్క పురుషార్థం కూడా తీవ్రంగా ఉండాలి మరియు సేవలో కూడా తక్కువ సమయం, తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత ఉండాలి. ఒకరు అనేకుల పని చేయాలి. కాబట్టి అలాంటి ప్లాన్ తయారుచేయండి. పంజాబ్ చాలా పాతది, సేవ యొక్క ఆది నుండి ఉంది, కాబట్టి ఆది స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఆది రత్నాన్ని తీసుకురండి. అయినా పంజాబ్‌ను సింహం అని అంటారు కదా. మరి సింహం గర్జిస్తుంది కదా. గర్జన అనగా బిగ్గర ధ్వని. ఏమి చేస్తారు మరియు ఎవరు చేస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. అచ్ఛా!
*** ఓంశాంతి ***
