‘‘కొత్త సంవత్సరములో సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగరండి మరియు సర్వుల పట్ల మహాదాని, వరదానిగా అయి వ్యర్థాన్ని సమాప్తము చేయండి’’
ఈరోజు నవ యుగ కొత్త సృష్టి యొక్క రచయిత అయిన బాప్‌దాదా తమ నవ యుగానికి ఆధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. బాప్‌దాదాతో పాటు పిల్లలైన మీరందరూ సదా సహయోగులు, అందుకే మీరే ఆధారమూర్తులు. ప్రపంచము లెక్కలో ఈ రోజు సంవత్సరము యొక్క సంగమము. పాత సంవత్సరము వెళ్ళిపోతూ ఉంది మరియు కొత్త సంవత్సరము వస్తూ ఉంది. ఇది సంవత్సరము యొక్క సంగమ దినము మరియు మీరు అనంతమైన సంగమయుగములో కూర్చున్నారు. మీరందరూ కొత్త సంవత్సరముతోపాటు నవ యుగం కోసం అందరికీ అభినందనలు చెప్తారు. ఒక్క రోజు కోసం అభినందించరు, కానీ నవ యుగములోని అనేక జన్మల కొరకు అభినందనలు చెప్తారు. ఈ సమయములో బ్రాహ్మణ ఆత్మలమైన మనది కొత్త జీవితమని ఈ సంగమములో మంచి రీతిలో అనుభవము చేస్తారు. కొత్త జీవితములోకి వచ్చేసారు కదా. బ్రాహ్మణుల ప్రపంచమే కొత్తది. అమృతవేళ నుండి చూసినట్లయితే కొత్త రీతి, కొత్త ప్రీతి ఉంది. పాత ప్రపంచములోని దినచర్య మరియు కొత్త జీవితమైన బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యలో ఎంత వ్యత్యాసం ఉంది! అన్నీ కొత్తవైపోయాయి - స్మృతి కొత్తది, వృత్తి కొత్తది, దృష్టి కొత్తది, అన్నీ మారిపోయాయి కదా. మరియు కొత్త జీవితము ఎంత ప్రియముగా అనిపిస్తుంది! మామూలుగా కూడా కొత్త వస్తువు అందరికీ ప్రియమనిపిస్తుంది. పాత వస్తువును విడిచిపెట్టాలనుకుంటారు మరియు కొత్త వస్తువును తీసుకోవాలనుకుంటారు. మరి ఇది ఈ సమయము యొక్క చిన్నని కొత్త ప్రపంచము. ప్రపంచం కూడా కొత్తది మరియు సంస్కారాలు కూడా కొత్తవి, అందుకే ప్రపంచమువారు కూడా కొత్త సంవత్సరాన్ని ఆర్భాటంగా జరుపుకుంటారు.
జరుపుకోవడము అంటే అర్థము - ఉల్లాస-ఉత్సాహాలలోకి రావడము. ఉత్సాహము ఉంటుంది, అందుకే జరుపుకునే రోజును ఉత్సవము అని అంటారు. ఉత్సాహముతోనే ఒకరికొకరు అభినందనలు లేక శుభాకాంక్షలు ఇస్తారు లేక గ్రీటింగ్స్ ఇస్తారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ కోసం ప్రతి రోజు ఉత్సవము. సదా ఉత్సవములో అనగా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు. ఈ ఉల్లాస-ఉత్సాహాలే బ్రాహ్మణ జీవితము. ప్రపంచపు రీతి అనుసారంగా విశేషమైన రోజును జరుపుకుంటారు, ఈ రోజు జరుపుకునేందుకు అందరూ చేరుకున్నారు కదా. కానీ మీ నవ యుగము, కొత్త జీవితము యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. రెండవ తారీఖు వచ్చిందంటే ఉల్లాస-ఉత్సాహాలు సమాప్తమైపోతాయి, ఒక నెల గడిచిందంటే ఇంకా సమాప్తమైపోతాయి అని అలా కాదు. ప్రతి రోజూ ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి, తక్కువ అవ్వవు. అలా ఉంది కదా? లేక తమ-తమ స్థానాలకు వెళ్తే ఉత్సాహము సమాప్తమైపోతుందా? ప్రతి ఘడియ ఉల్లాస- ఉత్సాహాలతో కూడుకున్నది ఎందుకంటే ఉల్లాస-ఉత్సాహాలే బ్రాహ్మణులైన మీ ఎగిరే కళకు రెక్కలు. ఈ ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉంటారు. ఒకవేళ కార్యార్థము కర్మలోకి వచ్చినా కూడా, ఎగిరే కళ యొక్క స్థితితో కర్మయోగిగా అయ్యి కర్మలోకి వస్తారు. కనుక ఎగిరే కళ కలవారు కదా, రెక్కలు లేకుండా ఎగరలేరు. ఎగిరే కళకు రెక్కలైన ఈ ఉల్లాస-ఉత్సాహాలు సదా తోడుగా ఉంటాయి. ఈ ఉల్లాస-ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకు అతి పెద్ద శక్తి. నీరస జీవితము కాదు. ప్రపంచమువారైతే, ఏం చేయాలి, రసము లేదు, నీరసముగా ఉంది, రస విహీనముగా ఉంది అని అంటారు మరియు మీరేమంటారు - ఉల్లాస-ఉత్సాహాలనే సారము ఉండనే ఉంది. ఎప్పుడూ నిరాశ చెందజాలరు. సదా దిల్‌ఖుష్‌గా ఉంటారు. ఎటువంటి కష్టతర విషయమైనా కానీ, ఉల్లాస-ఉత్సాహాలు కష్టాన్ని సహజంగా చేసేస్తాయి. ఉత్సాహము తుఫానును కూడా తోఫా (కానుక)గా చేసేస్తుంది, పర్వతాన్ని కూడా కేవలం ఆవగింజ వలె కాదు కానీ దూది వలె చేస్తుంది. ఉత్సాహము ఎటువంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనముగా అనుభవము చేయిస్తుంది, అందుకే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే నవ యుగానికి ఆధారమూర్తులు నవ జీవితము కల బ్రాహ్మణ ఆత్మలు మీరు. మీ గురించి మీకు తెలుసు. అంగీకరించారా లేక కేవలం తెలుసుకున్నారా? ఏమంటారు? తెలుసుకున్నారు కూడా, అంగీకరించారు కూడా మరియు అలాగే నడుచుకుంటున్నారు కూడా. కల్ప క్రితము కూడా మేమే ఉండేవారము, ఇప్పుడు కూడా ఉన్నాము మరియు అనేక సార్లు మేమే తయారవుతామని సదా ఈ ఉత్సాహము ఉంటుంది. కనుక అవినాశీ ఉత్సాహము అయ్యింది కదా. ఉండేవారు, ఉన్నారు మరియు సదా ఉంటారు - మూడు కాలాలకు చెందినవారిగా అయ్యారు కదా. గతము, వర్తమానము మరియు భవిష్యత్తు, మూడు కాలాలు అయ్యాయి. కనుక అవినాశీగా అయ్యారు కదా. అవినాశీ ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఆత్మలు నంబరువారుగా ఉన్నారా లేక అందరూ నంబర్‌వన్‌గా ఉన్నారా అని బాప్‌దాదా చూస్తున్నారు. ఉండడమే నిశ్చయబుద్ధి విజయులు అన్నప్పుడు, విజయీలైతే తప్పకుండా నంబర్‌వన్‌గా ఉంటారు కదా, నంబరువారుగా ఏమైనా ఉంటారా!
కావున సదా నవ జీవితము యొక్క ఈ ఉత్సాహములో ఎగురుతూ వెళ్ళండి ఎందుకంటే మీరు ఆధారమూర్తులు. కేవలము మీ జీవితం కోసమే ఆధారము కాదు, కానీ విశ్వములోని సర్వాత్మలకు ఆధారమూర్తులు. మీ శ్రేష్ఠ వృత్తితో విశ్వములోని వాతావరణము పరివర్తన అవుతూ ఉంది. మీ పవిత్ర దృష్టితో విశ్వములోని ఆత్మలు మరియు ప్రకృతి - రెండూ పవిత్రంగా అవుతున్నాయి. మీ దృష్టితో సృష్టి పరివర్తన అవుతూ ఉంది. మీ శ్రేష్ఠ కర్మలతో శ్రేష్ఠాచారీ ప్రపంచము తయారవుతూ ఉంది. కావున ఎంత బాధ్యత ఉంది! విశ్వం యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరించి ఉన్నారు కదా? లేక ఎప్పుడైనా భారీగా అనిపించినప్పుడు తీసేస్తారా? ఏం చేస్తారు? ఎవరైతే డబల్ లైట్‌గా ఉంటారో, వారికి ఈ బాధ్యతా కిరీటము కూడా సదా లైట్‌గా(తేలికగా) అనుభవమవుతుంది, భారీ అనిపించదు. ఈ సమయములోని కిరీటధారులు భవిష్య కిరీటధారులుగా అవుతారు. మరి కొత్త సంవత్సరములో ఏం చేస్తారు? అవ్యక్త సంవత్సరాన్ని కూడా జరుపుకున్నారు, అవ్యక్త సంవత్సరము అనగా ఫరిశ్తాగా అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా? ఫరిశ్తాలు ఏం చేస్తారు?
అవ్యక్తము అంటే అర్థమే ఫరిశ్తా. సంవత్సరము పూర్తి అయ్యింది, మరి ఫరిశ్తాలుగా అయ్యారు కదా లేదా అవ్వలేదా? అవ్యక్త సంవత్సరాన్ని ఇప్పుడు ఇంకా పెంచాలా? రెండు సంవత్సరాలను ఒక సంవత్సరంగా తయారుచేయాలా? ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకున్నారు, ఇప్పుడు ఫరిశ్తాలుగా అయ్యి ఏం చేస్తారు?
సదా ప్రతి రోజు, ప్రతి సమయము మహాదానిగా మరియు వరదానిగా అవ్వాలి. కనుక ఈ సంవత్సరాన్ని మహాదాని, వరదాని సంవత్సరముగా జరుపుకోండి. ఎవ్వరు సంబంధ-సంపర్కములోకి వచ్చినా సరే, ఆ ఆత్మకు మహాదానిగా అయ్యి ఏదో ఒక శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని దానము ఇవ్వాల్సిందే. మూడు ఖజానాలు ఎంత నిండుగా అయ్యాయి! జ్ఞానం యొక్క ఖజానా నిండుగా ఉందా లేక కాస్త తక్కువగా ఉందా? మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారు కదా. కావున జ్ఞానం యొక్క ఖజానా కూడా ఉంది, శక్తుల ఖజానా కూడా ఉంది మరియు గుణాల ఖజానా కూడా ఉంది. మూడింటిలో సంపన్నంగా ఉన్నారా లేక ఒక్కదానిలో సంపన్నంగా ఉండి, రెండింటిలో లేరా? వర్తమాన సమయములో ఆత్మలకు మూడింటి అవసరము చాలా ఉంది. మొత్తం రోజంతటిలో ఏదో ఒకటి దానము ఇవ్వాల్సిందే, జ్ఞానాన్ని కానీ, శక్తులను కానీ, గుణాలను కానీ, ఇవ్వాల్సిందే. మహాదానీ ఆత్మలు దానము ఇవ్వని రోజు ఏదీ ఉండకూడదు. సంవత్సరము పూర్తయిపోయిన తర్వాత మాకైతే అవకాశము లభించనే లేదని అనడము - ఇలా ఉండకూడదు. అవకాశం తీసుకోవడము కూడా మీపైనే ఉంది, అవకాశము ఇచ్చేవారు ఇస్తే అప్పుడు అవకాశము తీసుకోగలరా లేక స్వయము కూడా అవకాశము తీసుకోగలరా, తీసుకోవడము వచ్చా? లేదంటే ఎవరైనా ఇస్తేనే తీసుకోవడము వచ్చా? ఎవ్వరూ అవకాశము ఇవ్వకపోతే అప్పుడేమి చేస్తారు? చూస్తూ, ఆలోచిస్తూ ఉంటారా? మొత్తం రోజంతటిలో బ్రాహ్మణ ఆత్మలతో కానీ, అజ్ఞానీ ఆత్మలతో కానీ సంబంధ-సంపర్కములోకైతే వస్తూనే ఉంటారు కదా, ఎవరితో సంబంధ సంపర్కములలోకి వచ్చినా, వారికి ఏదో ఒక దానము అనగా సహయోగాన్ని ఇవ్వండి. దానము అన్న పదానికి ఆత్మిక అర్థము సహయోగము ఇవ్వడము. మరి రోజూ మహాదాని లేక వరదానిగా అయ్యి వరదానము ఎలా ఇస్తారు? వరదానము ఇచ్చే విధి ఏమిటి? మీ జడ చిత్రాలైతే ఇప్పటి వరకు వరదానములు ఇస్తూనే ఉన్నాయి. కావున వరదానాన్ని ఇచ్చే విధి - ఏ ఆత్మ సంబంధ-సంపర్కములోకి వచ్చినా సరే, వారికి మీ స్థితి యొక్క వాయుమండలము ద్వారా మరియు మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా సహయోగాన్ని ఇవ్వండి అనగా వరదానాన్ని ఇవ్వండి. ఎలాంటి ఆత్మ అయినా కానీ, దూషించేవారైనా కానీ, నిందించేవారు కానీ, మీ శుభ భావన, శుభ కామనల ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా అటువంటి ఆత్మకు కూడా గుణ దానము లేక సహనశీలతా శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా క్రోధాగ్నిలో కాలిపోతూ మీ ఎదురుగా వస్తే, అగ్నిలో నూనె వేస్తారా లేక నీళ్ళు వేస్తారా? నీళ్ళు వేస్తారు కదా లేక కొన్ని నూనె చుక్కలు కూడా వేస్తారా? ఒకవేళ క్రోధి ఎదురుగా మీరు నోటి ద్వారా క్రోధం చేయలేదు, నోటితోనైతే శాంతిగా ఉన్నారు కానీ కళ్ళ ద్వారా, ముఖం ద్వారా క్రోధ భావనను పెట్టుకున్నట్లయితే, అది కూడా నూనె చుక్కలు వేసినట్లు. క్రోధంతో ఉన్న ఆత్మ పరవశమై ఉంటుంది, దయ అనే శీతల జలం ద్వారా వరదానము ఇవ్వండి. మరి అటువంటి వరదానిగా అయ్యారా? లేకపోతే ఏ సమయములో అవసరం ఉందో, ఆ సమయములో సహనశక్తి యొక్క బాణము నడవదా? ఒకవేళ ఏ అమూల్య వస్తువైనా సమయానికి కార్యములో ఉపయోగపడకపోతే దానిని అమూల్యమైనది అని అంటారా? అమూల్యము అనగా సమయానికి దాని విలువను కార్యములో పెట్టడము. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? మహాదానిగా, వరదానిగా అవ్వండి. చైతన్యములో సంస్కారాన్ని నింపుకున్నప్పుడే జడ చిత్రాల ద్వారా కూడా వరదానీ మూర్తులుగా అవుతారు. సంస్కారాలనైతే ఇప్పుడే నింపుకోవాలి కదా, లేక ఏ సమయములో మూర్తిగా అవుతారో ఆ సమయములో నింపుకుంటారా?
మహాదానీ-వరదానీ మూర్తులుగా అవ్వడము ద్వారా వ్యర్థము స్వతహాగానే సమాప్తమైపోతుంది ఎందుకంటే ఎవరైతే మహాదానిగా ఉన్నారో, వరదానిగా ఉన్నారో, ఇతరులకు ఇచ్చేటువంటి దాతగా ఉన్నారో, మరి దాతకు అర్థమే సమర్థులు. సమర్థంగా ఉన్నప్పుడే ఇవ్వగలరు. కావున ఎక్కడ సమర్థత ఉంటుందో, అక్కడ వ్యర్థము స్వతహాగానే సమాప్తమవుతుంది. సమర్థ స్థితి అంటే స్విచ్ ఆన్ అవ్వడము. ఎలాగైతే ఈ స్థూల లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయడము అనగా అంధకారాన్ని సమాప్తం చేయడము, ఇటువంటి సమర్థ స్థితి అనగా స్విచ్ ఆన్ చేయడము. మరి స్విచ్ సరిగ్గా ఉందా లేక అప్పుడప్పుడు సరిగ్గా ఉంటూ, అప్పుడప్పుడు లూజ్ అయిపోతుందా లేక ఫ్యూజ్ పోతుందా? ఆన్ చేయడమైతే వస్తుంది కదా. ఈ రోజుల్లోనైతే చిన్న-చిన్న పిల్లలు కూడా స్విచ్ ఆన్ చేయడములో తెలివైనవారిగా ఉంటారు. టి.వి. స్విచ్ ఆన్ చేస్తారు కదా. మరి స్విచ్ ఆన్ చేయడము ద్వారా ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తము చేసే శ్రమ నుండి విముక్తులవుతారు. అవ్యక్త ఫరిశ్తాల శ్రేష్ఠ కార్యము ఇదే. ఇంకేం నవీనతను చేస్తారు? అవ్యక్త సంవత్సరములో మీ చార్టును పెట్టుకున్నారా లేక అప్పుడప్పుడు పెట్టుకున్నారు, అప్పుడప్పుడు పెట్టుకోలేదా? అప్పుడప్పుడు చేసేవారిగా అయ్యారా లేక సదా కాలము చేసేవారిగా అయ్యారా? అప్పుడప్పుడు పెట్టుకునేవారు ఎక్కువగా ఉన్నారు.
ఈ కొత్త సంవత్సరములో కొత్త చార్టును పెట్టుకోండి. ఏ కొత్త చార్టును పెట్టుకుంటారు? నాలుగు సబ్జెక్టుల గురించైతే మంచి రీతిలో తెలుసుకున్నారు. కనుక ఈ సంవత్సరములో ఈ చార్టునే పెట్టుకోండి, నాలుగు సబ్జెక్టులలోనూ - జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో, ప్రతి సబ్జెక్టులో ప్రతి రోజూ ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. జ్ఞానము అనగా వివేకవంతులుగా అవ్వడము, వివేకాన్ని ఇవ్వడము మరియు వివేకవంతులుగా అయి నడుచుకోవడము. జ్ఞానములో కూడా నవీనతకు అర్థము, స్వయములో ఏ లోపమైతే ఉందో దానిని ధారణ చేసినట్లయితే నవీనత అయినట్లే కదా. కాదు అన్నదాని నుండి అవునుగా అయ్యింది అంటే కొత్తది అయినట్లే కదా. ఇదే విధంగా యోగ ప్రయోగంలో ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అనుభవం చేయండి. యోగంలో చాలా మంచిగా కూర్చున్నారు, చాలా మంచిగా యోగం జోడించారు, కానీ నవీనత ఏముంది? పర్సెంటేజ్‌ను పెంచుకోవడము కూడా నవీనతయే. ఈ రోజు ఒకవేళ మీ యోగం యొక్క పర్సెంటేజ్ 50 శాతము ఉంది మరియు రేపు 50 నుండి వృద్ధి జరిగింది అంటే నవీనత జరిగినట్లే. ఒక్క నెలలోనే 50-50 వరకే పెంచడము అని కాదు. కావున నాలుగు సబ్జెక్టులలోనూ స్వ ప్రగతిలో నవీనత, విధిలో నవీనత, ప్రయోగంలో నవీనత, ఇతరులను సహజయోగిగా తయారుచేయడములో ఇంకా పర్సెంటేజ్‌ను పెంచడము అనగా నవీనత. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చానా, ఎవరిపైనైనా కోపం చేసానా, ఇదైతే సాధారణ చార్టు. ఇదైతే మీ రాయల్ ప్రజలు ఎవరైతే ఉంటారో, వారు కూడా పెట్టుకుంటారు. మీరు రాయల్ ప్రజలా లేక రాజులా? కావున నవీనత ద్వారా స్వతహాగానే తీవ్ర పురుషార్థపు సమీపత యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. ఏం చార్టు పెట్టుకోవాలో అర్థమైందా? మరియు ప్రతి మూడు నెలలకు ఒకసారి పంపించండి, ప్రతి రోజూ చార్టును ఇక్కడకు పంపవద్దు, పని పెరిగిపోతుంది. ఈ సంవత్సరమైతే మీరు ఎకానమీ కూడా చేయాలి కదా! ఈ సంవత్సరము విశేషంగా ఎకానమీకి సంబంధించినది. ఏక్ నామీ మరియు ఎకానమీ. జ్ఞాన సరోవరాన్ని తయారుచేస్తున్నారు కనుక అన్నింటిలో ఎకానమీ చేయండి. అన్ని ఖజానాలలో, సమయములో కూడా, సంకల్పంలో కూడా, సంపదలో కూడా, అన్నింటిలో ఎకానమీ. కనుక ప్రతి మూడు నెలలు స్వయమే సాక్షిగా అయ్యి చార్టును చెక్ చేసుకుని క్లుప్తంగా మీ సమాచారాన్ని ఇవ్వండి. ప్రతి మూడు నెలలలో చూసుకోండి - ప్రగతి జరుగుతుందా లేక ఎలా ఉన్నామో అలాగే ఉన్నామా? పడిపోయే కళలోకైతే వెళ్ళవద్దు. కానీ ఎలా ఉన్నారో అలాగే ఉండడము కూడా ఉండకూడదు. పురుషార్థం చేయడములో చాలా చిన్నవారిగా కాకూడదు. చాలా చిన్నవారిగా అవ్వడము మంచిగా అనిపిస్తుందా! ఇలా అనవద్దు, చేయాలనైతే అనుకుంటాము కానీ ఏం చేయాలి...! ఏం చేయాలి-ఏం చేయాలి అని అనవద్దు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా... ఇది బ్రాహ్మణుల భాష కాదు. కానీ ఇలా చేయండి అని ఇతరులకు కూడా సహయోగము ఇస్తారు. ఏ చార్టును పెట్టుకోవాలో అర్థమైందా? ఎవరెవరు ఏమేమి చేస్తారో ఇప్పుడు చూస్తాము.
బాప్‌దాదా స్నేహము కారణంగా పేరును ప్రకటించరు. ఎవరు ఏమేం చేసారో తెలుసు కదా. ఈ రోజుల్లో టి.వి. యొక్క ఫ్యాషన్ ఉంది, బాప్‌దాదా వద్ద కూడా టి.వి. ఉంది. గడిచిన సంవత్సరము ఏ పనినైతే ఇచ్చామో దానిని ఎవరు ఎంత చేసారు అన్నది బాప్‌దాదాకు తెలుసు. సగం విలువ (హాఫ్ కాస్ట్) కలవారిగా ఎంతమంది ఉన్నారు, పూర్తి విలువ (ఫుల్ కాస్ట్) కలవారిగా ఎంతమంది ఉన్నారు అని పేర్లు ప్రకటించాలా?
కనుక ఈ సంవత్సరము స్వయము కోసం కూడా మరియు సర్వుల కోసం కూడా మహాదానీ, వరదానీ మూర్తులుగా అవ్వండి మరియు ప్రతి రోజూ ఏదో ఒక నవీనతను అనగా ఉన్నతిని తప్పకుండా తీసుకురండి. మరి ఇది స్వయం కోసం చేసే పురుషార్థము. సేవలో ఏం చేస్తారు? సేవలో కూడా నవీనతను తీసుకురావాలి కదా. మేళాలను కూడా చాలా చేసారు, ప్రదర్శనీలనైతే లెక్కలేనన్ని చేసారు, సెమినార్లు-కాన్ఫరెన్సులను కూడా చాలా చేసారు, ఇప్పుడు శబ్దాన్ని ప్రసిద్ధము చేసే మైక్లనైతే తయారుచేయాల్సిందే, కానీ దానికి విధి ఏమిటి? ముందు కూడా వినిపించాము కానీ తక్కువ చేసారు. సేవ యొక్క రిజల్టులో ఏం చూడడము జరిగిందంటే, పెద్ద నిమిత్త ఆత్మలను సమీపంగా తీసుకువచ్చేందుకు ముందుగా, ఎవరైనా రాజకీయనేత కానీ, ఎవరైనా పెద్ద పారిశ్రామికవేత్త కానీ, ఎవరైనా పెద్ద ఆఫీసర్ కానీ, వారిని సమీపంగా తీసుకువచ్చేందుకు సాధనము - వారి సెక్రటరీలను మంచిగా సమీపములోకి తీసుకురండి. మీరు పెద్దవారి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వారు బాగుంది- బాగుంది అంటూ తర్వాత నిద్రపోతారు. వారిని మళ్ళీ మేల్కొలిపేందుకు ఇంత సమయమైతే లభించదు, వారు ఇవ్వరు, మీరు వెళ్ళలేరు, అందుకే సెక్రటరీలు ఎవరైతే ఉంటారో, వారు మారరు కూడా, పెద్దవారైతే అందరూ మారిపోతూ ఉంటారు. ఈ రోజు ఒక మినిస్టర్ యొక్క సేవను చేస్తారు మరియు రేపు వారు ప్రజలుగా అయిపోతారు. సెక్రటరీలు మంచిగా సహయోగులుగా అవ్వగలరు. కనుక ఏ వర్గము యొక్క సేవలోనైనా ఈ సంవత్సరము విశేషంగా సెక్రటరీలు, మేనేజర్లు లేక ప్రైవేట్ అసిస్టెంట్లు, ఎవరైతే శక్తిశాలిగా ఉన్నారో, పెద్దవారికి సమీపంగా ఉంటారో, ఆ ఆత్మల సేవను విశేషంగా చేయండి.
మరొక విషయము, ముందు కూడా సూచన ఇచ్చాము - వర్తమాన సమయములో ‘తక్కువ ఖర్చు మరియు ఎక్కువ ఖ్యాతి’ ఉండాలి, దానికి విధి - చిన్న లేక పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అసోసియేషన్ ఉంటే వారితో సంబంధ-సంపర్కాలు పెట్టుకోండి, రెడీగా ఉన్న స్టేజ్‌పై పేరు ప్రఖ్యాతి చేయండి. తక్కువ ఖర్చు, ఎక్కువ ఖ్యాతి ఉండాలి. చేస్తున్నారు కానీ ఇంకా తీవ్ర గతితో చేయండి. ప్రతి దేశంలో లేక ప్రతి గ్రామంలో లేక ప్రతి జిల్లాలో రకరకాల అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో లేక కార్యాలను చేసే చాలా వర్గాలవారు ఎవరైతే ఉన్నారో, కాన్ఫరెన్సులు చేసేవారు లేక సమ్మేళనాలు చేసేవారు, రెడీగా ఉన్న స్టేజ్‌పై సందేశాన్ని ఇవ్వండి. అప్పుడు సమయము మరియు శ్రమ, రెండూ మిగులుతాయి. ఇప్పుడు దీనిని తీవ్ర గతిలోకి తీసుకురండి. చెక్ చేసుకోండి - ఏ దేశానికి లేక ఏ స్థానానికి నిమిత్తమయ్యారో, ఆ స్థానములోని ఏ సంస్థ కూడా వంచితమవ్వకూడదు ఎందుకంటే వర్తమాన సమయంలో వాయుమండలము పరివర్తన అయిపోయింది. ఇప్పుడు భయం తక్కువగా ఉంది, స్నేహం ఎక్కువగా ఉంది, మంచిదని అంగీకరిస్తారు. మంచిగా అవ్వరు కానీ మంచిదని అంగీకరిస్తారు, అందుకే ఈ రెండు రకాల సేవలకు ఇంకా అండర్లైన్ చేసినట్లయితే సహజంగా మైక్‌లు తయారైపోతారు. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు కనుక కొత్త విధి మరియు విధానము కూడా కావాలి కదా.
ఈ కొత్త సంవత్సరము అమృతవేళలో సదా ఈ స్లోగన్‌ను ఇమర్జ్ చేసుకోండి - ‘‘సదా ఉల్లాస-ఉత్సాహంలో ఎగరాలి మరియు ఇతరులను కూడా ఎగిరేలా చేయాలి’’. మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి - అమృతవేళ చెక్ చేసుకోవడము మరియు రోజంతా మర్జ్ చేయడము, మళ్ళీ రాత్రికి, ఈరోజైతే ఊరికే అలా గడిచిపోయిందని ఆలోచించుకోవడము, ఇలా ఉండకూడదు. ఇలా కాదు, ఉల్లాస-ఉత్సాహాలకు బదులుగా వేరే మార్గంలోకైతే వెళ్ళలేదు కదా? ఎగిరే కళకు బదులుగా వేరే ఏ కళ అయినా తనవైపుకు ఆకర్షితము చేయలేదు కదా? అని మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి, ఇమర్జ్ చేసుకోండి అచ్ఛా!
నలువైపులా ఉన్న నవ జీవితాన్ని అనుభవం చేసే సర్వ బ్రాహ్మణ పిల్లలకు, సదా నవ యుగానికి ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా సంకల్పం, మాట మరియు కర్మ ద్వారా మహాదానీ-వరదానీ ఆత్మలకు, సదా స్వ స్థితి ద్వారా ఇతరుల పరిస్థితులను కూడా సహజము చేసే సమర్థ ఆత్మలకు, సదా ప్రతి రోజూ స్వయములో ప్రగతిని అనగా నవీనతను అనుభవం చేసే సమీప ఆత్మలకు, సదా ఏక్నామీ మరియు ఎకానమీ చేసే తండ్రి సమానమైన సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
నిమిత్త ఆత్మలు ప్రతి క్షణం ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించేవారు. భవిష్యత్తు మీ కొరకు నిశ్చయమై ఉంది, అది జరగాల్సిందే. కానీ ప్రత్యక్ష ఫలం ఎంత మధురమైనది! ఇప్పటికిప్పుడు చేశారు, ఇప్పటికిప్పుడు శ్రేష్ఠమైన ప్రాప్తి యొక్క అనుభూతిని పొందుతూనే ఉన్నారు. అత్యంత శ్రేష్ఠమైన ప్రత్యక్ష ఫలం ఏంటంటే సమీపతను అనుభవించడం. సమీపతకు గుర్తు సమానంగా తయారవ్వడమే. మీరు ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించేవారు, అందుకే సదా హెల్దీ, వేల్దీ మరియు హ్యాపీ. ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? హెల్దీగానూ ఉన్నాం, వేల్దీగానూ ఉన్నాం మరియు హ్యాపీగానూ ఉన్నాం అని చెప్తారు. సాకార ప్రపంచంలో ఈ రోజుల్లో పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని అంటారు కదా. హెల్దీగా ఉండేందుకు సాధనంగా ఫలాలను చెప్తారు. మరి మీరైతే ప్రతి సెకను ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉన్నారు, లభిస్తూనే ఉంది. అందుకే సదా ఎవర్ హెల్దీగా ఉన్నారు. బాప్‌దాదా వినిపించారు కదా, బ్రాహ్మణ పిల్లలను ఎవరైనా ‘ఏమిటి విశేషాలు (క్యా హాల్ హై)?’ అని అడిగితే ఏం చెప్తారు? ‘ఖుష్హాల్’ (సంతోషంగా) ఉన్నామని చెప్తారు. మరి నడక (చాల్) ఎలాంటిది? ఫరిశ్తాల నడక. ఫరిశ్తాల నడక మరియు ఖుష్హాల్. (సభను అడుగుతూ) అందరూ అలాగే ఉన్నారు కదా లేక ఎప్పుడైనా మీ పరిస్థితిలో లేదా నడకలో (హాల్-చాల్) తేడా వస్తుందా? ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏం అడుగుతారు? ‘ఏమిటి సంగతులు (క్యా హాల్-చాల్ హై)?’ అని అడుగుతారు. బ్రాహ్మణులు అంటేనే ఖుష్హాల్ మరియు ఫరిశ్తాల నడకతో సదా ఎగిరేవారు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో ఖుష్‌హాల్‌గా ఉండాలి. బేహాల్ (బాధపడటం) కాదు, ఖుష్హాల్. నాట్యం చేయండి, పాడండి. నాట్యం చేయడం, పాడటం వచ్చు కదా. కాబట్టి పాడండి మరియు నాట్యం చేయండి, ఇంకేం చేయాలి? బ్రహ్మా భోజనం తినండి, నాట్యం చేయండి మరియు పాడండి. ఎక్కడ ఉన్నా కానీ స్మృతిలో తయారుచేస్తున్నారు, స్మృతిలో తింటున్నారు కాబట్టి అది బ్రహ్మా భోజనమే. మరి అంతా సరిగ్గానే ఉంది కదా? అంతా అత్యంత శ్రేష్ఠంగా ఉంది.
అచ్ఛా, డబల్ విదేశీయులు డబల్ సంతోషంగా ఉంటారా? అలా అని చాలా సంతోషంగా ఉండి, మళ్లీ ఎప్పుడైనా చాలా ఉదాసీనంగా అయిపోవడం... ఇలా చేయకూడదు. ఈ సంవత్సరంలో ఉదాసీనత లేదా ఒంటరితనం లేదా వ్యర్థ భావాన్ని అసలు రానివ్వకూడదు. అప్పుడే కదా నూతన ప్రపంచాన్ని సమీపానికి తీసుకువస్తారు. అచ్ఛా! నూతన సంవత్సరంలో నూతన ఉల్లాసం ఉంది, నూతన ఉత్సాహం ఉంది. ఇప్పుడు అందరినీ ఇలా ఆడిస్తూ-పాడుతూ ఉండండి. అచ్ఛా! ప్రతి సమయమూ శుభాకాంక్షలే కదా. అవినాశి శుభాకాంక్షలు. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1
స్మృతి యొక్క ఛత్రఛాయలో ఉంటే మాయాజీతులుగా అయిపోతారు
అందరూ సదా మిమ్మల్ని మీరు తండ్రి యొక్క ఛత్రఛాయలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? తండ్రి యొక్క స్మృతే ఛత్రఛాయ. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా తోడు యొక్క అనుభూతి కూడా అవుతుంది. ఛత్రఛాయలో ఉండటం అంటే సదా సేఫ్‌గా ఉండటం. సంకల్పంలో కూడా ఛత్రఛాయ నుండి బయటకు వచ్చినప్పుడే మాయ యొక్క దాడి జరుగుతుంది. ఛత్రఛాయలో ఉండటం అంటే మాయాజీత్ విజయులుగా కావడం. మరి అందరూ మాయాజీతులేనా లేక ఎప్పుడైనా ఓటమి, ఎప్పుడైనా విజయమా? మాతలు ఏమనుకుంటున్నారు? ఓటమి విజయాల ఆట అయితే ఆడటం లేదు కదా? ఛత్రఛాయలో ఉండే వారందరూ సదా మాయాజీతులే. ఇది మీ యొక్క స్మృతిచిహ్నమే. మర్యాద అనగా స్మృతి యొక్క రేఖ లోపల ఉంటే లోపలికి వచ్చే ధైర్యం ఎవరికీ ఉండదు. స్మృతి యొక్క రేఖ దాటితే మాయ ఎలాగూ తెలివైనదే. మీరు తెలివైనవారా లేక మాయ తెలివైనదా? ఎప్పుడూ ఓడిపోవడం లేదు కదా? సదా విజయులైన ఆత్మల యొక్క స్మృతిచిహ్నం ఏమిటి? విజయమాల విజయి రత్నాలకు స్మృతిచిహ్నం. అనేకసార్లు విజయులుగా అయ్యారు కాబట్టే కదా స్మృతిచిహ్నం తయారైంది. అనేకసార్లు విజయులు - ఈ స్మృతితో సదా సమర్థంగా ఉంటారు. అనేకసార్లు చేసిన కార్యమే అయినప్పుడు, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఏదీ నూతన విషయం కాదు. ఏదైనా నూతన విషయం విన్నా లేదా చేయాల్సి వచ్చినా ‘ఇలా చేయాలా, ఎలా చేయాలి...’ అని ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి మీ ఆత్మలో లెక్కలేనన్ని సార్లు చేసిన సంస్కారాలు నిండి ఉన్నాయి. ‘ఏమవుతుంది’ అనే సంకల్పం కాదు, శ్రేష్ఠంగా జరిగే ఉంది. ‘బాబా’ అన్న వెంటనే తండ్రి తోడు యొక్క అనుభూతి అదే సెకనులో, అదే సంకల్పంలో అయి తీరుతుంది. సెకను విషయం ఇది. అంత శక్తి ఉంది కదా. మాస్టర్ సర్వశక్తిమంతులు అంటేనే శక్తులు జమ అయి ఉన్నాయి, అందుకే మాస్టర్ సర్వశక్తిమంతులు. ఏమైనా జరగనీ, ఎలాంటి పరిస్థితి అయినా రానీ కానీ మాస్టర్ సర్వశక్తిమంతులుగా ఉన్నారు, సదా ఉంటారు. అంతేగానీ ‘ఇంత విషయం ఆలోచించలేదు, ఇలా కూడా జరుగుతుందా!’ అని అనకూడదు. ఎందుకంటే మీరు విచలితులయ్యేలా ఏదైనా నూతన రూపంలో రావాలని మాయకు కూడా తెలుసు. కానీ ఏ రూపంలో, ఎలాంటి పరిస్థితి వచ్చినా మాస్టర్ సర్వశక్తిమంతులు ఎప్పుడూ అలజడిలోకి రాలేరు. విషయం పెద్దది కాదు, మీరు అత్యంత గొప్పవారు. ఈ నషా ఉంది కదా? కేవలం ముందుకు సాగుతూ ఉండాలి, ఆగకూడదు, వెనుకబడిపోకూడదు. ముందుకు ముందుకు ఎగురుతూ వెళ్లాలి. ఎగిరే కళ ఉన్నవారు కదా లేక ఎప్పుడైనా కాసేపు ఆగే కళ కూడా బాగుంటుందా? నడుస్తూ నడుస్తూ, ఎగురుతూ ఎగురుతూ అలసిపోతారని ఆగిపోతారా! కాబట్టి సదా ఎగిరేవారు, మాయ యొక్క ఏ స్టేషన్లోనూ ఆగేవారు కాదు. ఎప్పుడైనా మాయ యొక్క ఏదైనా వస్తువు ఆకర్షిస్తే స్టేషన్లో దిగిపోతారా ఏంటి! అందరూ పక్కానా? ధైర్యం బాగుంది. ధైర్యం ఉంచితే సహాయం లభిస్తుంది. ఇది మీ స్వంత రాజ్యం కాదు కదా ఆర్డర్ వేసి నడవడానికి. ఇతరుల రాజ్యంలో మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. మరి ‘మన రాజ్యం వచ్చేసింది’ అనే నషా ఉంది కదా! లక్ష్మీనారాయణుల రాజ్యం వస్తుందా లేక మీ రాజ్యం వస్తుందా? మీ అందరి రాజ్యమే ఉంటుంది. తనది అయిన వస్తువుపై తప్పకుండా నషా ఉంటుంది. ఇది మన రాజ్యం. ‘ఏమో, నేను రాజు అవుతానో లేక ప్రజ అవుతానో’ అనే సంకల్పం కూడా మనస్సులోకి రాకూడదు. రాజులయితే అవుతారు, కానీ ప్రజలను తయారుచేశారా? ఇంతమంది రాజులు తయారైతే ప్రజలు కూడా అంతేమంది కావాలి కదా. బాప్‌దాదా కూడా పిల్లల నిశ్చయాన్ని, నషాను చూసి సంతోషిస్తారు. ఈ నూతన సంవత్సరంలో ఏమైనా జరగనీ, కానీ ఈ తీవ్ర పురుషార్థాన్ని వదలకండి. ఇలా పక్కాగా ఉండండి. ‘ఏం చేయాలి... మాయ వచ్చేసింది... ఇది జరిగింది... ఇది చేశాం...’ అని ఉత్తరాలు రాయకండి. ఎలాంటి ఉత్తరం రాస్తారు? కేవలం రెండే అక్షరాలు రాయండి O.K. అని. పొడవైన ఉత్తరాలు రాయకండి. ‘నేనూ సంతోషంగా ఉన్నాను, అందరూ నాతో సంతోషంగా ఉన్నారు’ – అంతే, ఈ ఒక్క లైన్ మాత్రమే రాయండి. ఎందుకంటే ఇతరులు కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అంతేకానీ స్వయంగా మీరే ‘నేను బాగున్నాను’ అని చెప్పుకుంటారా ఏంటి! అచ్ఛా!
గ్రూప్ నం. 2
పరమాత్మ ప్రేమే బ్రాహ్మణ జీవితానికి ఆధారం, అతీతంగా అయితే ఈ ప్రేమకు పాత్రులుగా అవుతారు
అందరూ మిమ్మల్ని మీరు ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? లేక ప్రవృత్తిలో ఉండటం వల్ల ప్రవృత్తికే ప్రియమైనవారుగా అవుతున్నారా, అతీతంగా కాలేకపోతున్నారా? ఎవరైతే అతీతంగా ఉంటారో వారే ప్రతి కర్మలో ప్రభు ప్రేమను అనగా తండ్రి యొక్క ప్రేమను అనుభవం చేస్తారు. అతీతంగా ఉండకపోతే పరమాత్మ ప్రేమను కూడా అనుభవం చేయలేరు. పరమాత్మ ప్రేమే బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారం. సాధారణంగా కూడా ‘ప్రేమ ఉంటేనే జీవితం, ప్రేమ లేకపోతే జీవితమే లేదు’ అని అంటారు. కాబట్టి బ్రాహ్మణ జీవితానికి ఆధారమే పరమాత్మ ప్రేమ, అది అతీతంగా ఉన్నప్పుడే లభిస్తుంది. మోహం ఉంటే పరమాత్మ ప్రేమ లభించదు. అతీతంగా ఉంటేనే ప్రేమ లభిస్తుంది. అందుకే ఎంత అతీతంగా ఉంటే అంత ప్రియంగా ఉంటారని అంటారు. లౌకిక జీవితంలో స్థూల రూపంలో ఎవరైనా అతీతంగా (దూరంగా) ఉంటే వీరు ప్రేమకు పాత్రులు కారని అంటారు. కానీ ఇక్కడ ఎంత అతీతంగా ఉంటే అంత ప్రియం. కొద్దిగా కూడా మోహం ఉండకూడదు, కానీ సేవాధారి. ఒకవేళ ప్రవృత్తిలో ఉంటే సేవ కొరకే ఉన్నారు. ‘ఇది నా కర్మల లెక్కాచారము, కర్మ బంధనం...’ అని ఎప్పుడూ అనుకోకండి, ఇది సేవ. సేవా బంధనంలో బంధించబడటం వల్ల కర్మ బంధనం సమాప్తమైపోతుంది. సేవా భావం లేనంత వరకు కర్మ బంధనం లాగుతూనే ఉంటుంది. తండ్రి ఇచ్చిన శ్రీమతంపైనే నడుస్తున్నారు కానీ మీ లెక్కాచారాల ప్రకారం కాదు. కర్మ బంధనమా లేక సేవా బంధనమా... దానికి గుర్తు ఏంటంటే - కర్మ బంధనం అయితే దుఃఖపు అల వస్తుంది, సేవా బంధనం అయితే దుఃఖపు అల రాదు, సంతోషం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా దుఃఖపు అల వస్తే అది కర్మ బంధనం అని అర్థం చేసుకోండి. కర్మ బంధనాన్ని మార్చి సేవా బంధనంగా తయారు చేసుకోలేదు, పరివర్తన చేయడం రాలేదు. మీరు విశ్వ సేవాధారులు, కాబట్టి విశ్వంలో ఎక్కడ ఉన్నా అది విశ్వ సేవ కొరకే. ఈ విషయం పక్కాగా గుర్తుంటుందా లేక ఎప్పుడైనా కర్మ బంధనంలో చిక్కుకుపోతారా? సేవాధారి ఎప్పుడూ చిక్కుకోరు. వారు అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. అతీతంగా ఉండాలని అర్థమైతే చేసుకుంటారు కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో అతీతంగా ఉండాలి. ఏ పరిస్థితీ లేనప్పుడు లౌకికంలో కూడా అతీతంగానే ఉంటారు. కానీ అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి అతీతంగా కాదు, సదా అతీతంగా. ఎప్పుడో ఒకసారి ఉండే వారు రాజ్యాన్ని కూడా ఎప్పుడో ఒకసారే చేస్తారు. సదా రాజ్యం చేయాలంటే సదా అతీతంగా కూడా ఉండాలి కదా. అందుకే ‘సదా’ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అన్ని సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి. ఇప్పుడు ‘ఎప్పుడో ఒకసారి’ అనే సంస్కారాలు నింపుకుంటే, నింపుకున్న ఆ సంస్కారాలే పనిచేస్తాయి. రికార్డు నింపేటప్పుడు కొద్దిగా అటుఇటుగా నింపినా అది అలాగే నిండిపోతుంది కదా. కాబట్టి సంగమంలోనే 84 జన్మల శ్రేష్ఠ రాజ్యాన్ని ఏలే ఉన్నత పదవి సంస్కారాలు నింపుకుంటారు, అందుకే ఇప్పటి నుండే ప్రతి పురుషార్థ సబ్జెక్ట్‌లో ‘సదా’ అనే పదాన్ని చూడండి. ‘నడుస్తున్నాం, చేస్తున్నాం...’ అని కాదు, నడుస్తున్నాం కానీ ఏ వేగంతో నడుస్తున్నాం? చేస్తున్నాం కానీ ఎలాంటి కర్మ చేస్తున్నాం? ఇది చెక్ చేసుకోవాలి కదా.
కాబట్టి అతీతంగా ఉండటానికి గుర్తు - ప్రభు ప్రేమ యొక్క అనుభూతి. ఎంత ప్రేమ ఉంటే అంత వేరుగా ఉండలేరు, సదా తోడుగా ఉంటారు. తోడుగా ఉండటాన్నే ప్రేమ అని అంటాము. కాబట్టి పరమాత్మ ప్రేమ అంటే సదా పరమాత్మ తోడు ఉండటం. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉన్నట్లుగా అనుకోవడం లేదు కదా? తండ్రి తోడుగా ఉన్నారు కదా. తండ్రి తోడుగా ఉన్నప్పుడు భారాన్ని మీ తలపై వేసుకోకండి. భారాన్ని తండ్రికి ఇచ్చి తేలికగా (లైట్‌గా) అయిపోండి. భారాన్ని ఉంచుకుంటే గందరగోళానికి గురవుతారు. లైట్‌గా ఉంటే ఎగురుతూ ఉంటారు. అంతా తండ్రికి అప్పగించేయండి. ఏదీ లేనప్పుడు భారం ఎందుకు ఉంటుంది? ఏదైనా దాచి ఉంచితేనే భారం, అప్పుడే గందరగోళం. తండ్రికి అప్పగించలేదు, కొద్దిగా దాచుకుని జేబు ఖర్చుకు ఉంచుకున్నారా ఏంటి? జేబు ఖర్చు ఉంటే ఎప్పుడైనా పనికివస్తుందని అనుకుంటున్నారా! మరి మాతలు జేబు ఖర్చు ఉంచుకున్నారా? సాధారణంగా కూడా మాతలకు ఒక అలవాటు ఉంటుంది - చీర కొంగున ముడివేసి దాచి ఉంచుకుంటారు. చీర మూలన కూడా కట్టేసుకుంటారు. కాబట్టి బాగా చూడండి, ఎక్కడైనా దాచి ఉంచారా? తండ్రికి అప్పగించారు అంటే నష్టోమోహా అయిపోయినట్లేనా? పాండవులు నష్టోమోహానా? అచ్ఛా, నష్టో క్రోధా? రోబ్ (అధికారం చలాయించడం) సమాప్తమైందా లేక కొద్దికొద్దిగా రోబ్ వస్తుందా? ‘నాకు అధికారం ఉంది’ అని భావిస్తే రోబ్ వచ్చేస్తుంది. కాబట్టి కేవలం నష్టోమోహా కాదు, నష్టోక్రోధా కూడా కావాలి. రోబ్ కూడా ఉండకూడదు, నిర్మానంగా ఉండాలి. మరి ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? కొద్దికొద్దిగా ఉన్న రోబ్‌కు కూడా సెలవు ఇచ్చేస్తారా? సంవత్సరం పూర్తయింది, రోబ్ కూడా పూర్తయిందా లేక ఎప్పుడైనా దాన్ని స్నేహితుడిగా చేసుకుంటారా? అది పనికొచ్చే వస్తువు కాదు కదా. ‘కొద్దిగా రోబ్ చలాయించాల్సిందే కదా!’ అని అనుకోవద్దు.
కాబట్టి నష్టోమోహా అంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండటం. ఉంటూ కూడా అతీతంగా ఉండటం. మరి మాతలందరూ ధైర్యవంతులేనా? ఈ సంవత్సరంలో మోహం రాదా? మోహం అర్థ కల్పం యొక్క సహచరుడు, అది అంత తేలికగా ఎలా వెళ్తుంది! చూశారు కదా, నష్టోమోహాగా అయితే ఏమవుతుందో మరియు మోహం ఉంచితే ఏమవుతుందో? మరి ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి అద్భుతం చేస్తారో చూద్దాం!
గ్రూప్ నం. 3
టైటిల్ యొక్క స్మృతితో ఆ స్థితిలో స్థితులయ్యే అనుభవాన్ని పొందండి
మిమ్మల్ని మీరు సదా స్వదర్శన చక్రధారి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? స్వ దర్శనము అనగా స్వ యొక్క గుర్తింపు. స్వను బాగా గుర్తించారా - ‘నేను ఎవరిని?’ అని. మిమ్మల్ని మీరు సరిగ్గా గుర్తించారా? కేవలం ‘నేను ఆత్మను’ అని తెలుసుకోవడం మాత్రమే తెలుసుకోవడం కాదు, ‘నేను ఎలాంటి ఆత్మను’ అనేది స్మృతిలో ఉంటుందా? మీకెన్ని టైటిల్స్ ఉన్నాయి? (చాలా ఉన్నాయి) మరి ఆ టైటిల్స్ గుర్తుంటాయా లేక మరిచిపోతారా? ఎప్పుడైనా గుర్తుంటాయా, ఎప్పుడైనా మరిచిపోతారా? మాయ ఓడిస్తూనే ఉన్నా ‘నేను మహావీరుడను’ అని చెప్పుకుంటారా ఏంటి? ఎందుకంటే తండ్రి ద్వారా లభించిన టైటిల్స్ ఉన్నవే స్థితిలో స్థితులు కావడం కొరకు. కాబట్టి టైటిల్ గుర్తుకురాగానే అలాంటి స్థితి తయారవ్వాలి. అలాంటి స్థితి తయారవుతుందా లేక కదలిపోతూ ఉంటుందా? లౌకిక ప్రపంచంలో ఏదైనా టైటిల్ లభిస్తే ఆ టైటిల్‌తో పాటు ఆ సీటు కూడా లభిస్తుంది కదా. ఉదాహరణకు జడ్జి టైటిల్ లభిస్తే ఆ జడ్జి సీటు కూడా లభిస్తుంది కదా. జడ్జి సీటుపై కూర్చోకపోతే ఈయన జడ్జి అని ఎవరు నమ్ముతారు? స్థితి లేకుండా కేవలం బుద్ధితో ‘నేను స్వదర్శన చక్రధారిని, నేను స్వదర్శన చక్రధారిని’ అని వర్ణిస్తూ పరదర్శనంలో ఉంటే సీట్లో సెట్ కానట్లే కదా. కాబట్టి ఏ టైటిల్ అయితే స్మృతిలోకి తెచ్చుకుంటారో అలాంటి సమర్థవంతమైన స్థితి తప్పకుండా కావాలి, అప్పుడే ‘అవును, వీరు స్వదర్శన చక్రధారి, వీరు హీరో యాక్టర్’ అని అంటారు. యాక్టింగ్ సాధారణంగా ఉండి ‘ఈయన హీరో యాక్టర్’ అంటే ఎవరు నమ్ముతారు? మరియు సదా ఇది గుర్తుంచుకోండి - ఈ టైటిల్స్ ఇచ్చేది ఎవరు? ప్రపంచంలో ఎంత పెద్ద టైటిల్ అయినా ఆత్మ ఆత్మకే ఇస్తుంది. ప్రెసిడెంట్ కావచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ ఎవరు? ఆత్మయే కదా. సంగమంలో స్వయంగా తండ్రియే పిల్లలకు టైటిల్స్ ఇస్తున్నారు. ఎంత నషా ఉండాలి! ఈ ఆత్మిక నషాగా ఉంటుందా? దేహాభిమానం యొక్క నషా కాదు. క్రోధం చేస్తూ ‘నేను కంటిపాప వంటి రత్నాన్ని’ అని చెప్పుకుంటే అది నషా కాదు. అలా చేయడం లేదు కదా? మాతలు ఏం చేస్తున్నారు? ఇంట్లో గొడవలు చేస్తూ ‘మేము బాబా యొక్క అచల-నిశ్చల ఆత్మలము’ అని అనుకోవడం లేదు కదా? కాబట్టి సదా మీ విభిన్నమైన టైటిల్స్‌ను స్మృతిలో ఉంచుకోండి, ఆ స్థితిలో స్థితులై నడవండి, అప్పుడు ఎంత ఆనందం లభిస్తుందో చూడండి.
స్వదర్శన చక్రధారి అనగా సదా మాయాజీత్. స్వదర్శన చక్రధారి ముందు మాయ ధైర్యం చేయలేదు. మరి మాయ ఎప్పుడైనా వస్తుందా లేక వెళ్లిపోయిందా? మరి మాయ ఓడిపోయి వెళ్తుందా లేక మిమ్మల్ని ఓడించి వెళ్తుందా? మాయతో ఓటమి జరుగుతుందా? స్వదర్శన చక్రం యొక్క గాయనం కల్పం క్రితం కూడా పాడబడింది. స్వదర్శన చక్రం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. మరి కల్ప క్రితం స్వదర్శన చక్రధారులుగా ఎవరు అయ్యారు? మీరేనా లేక వేరే ఎవరైనా ఉన్నారా? కల్పం క్రితం కూడా మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు, సదా మీరే ఉంటారు. ఇది మీ పక్కా అనుభవమే కదా?
అచ్ఛా, ఇది వెరైటీ గ్రూప్. కానీ ఈ సమయంలో అందరూ ఎవరు? ఎక్కడివారు? రాజస్థాన్ వారా, కర్ణాటక వారా? లేక మధుబన్ వారా? మీ అందరి ఒరిజినల్ అడ్రస్ ఏది? మౌంట్ అబూనా? మధుబన్ నివాసులే కదా. సేవ నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. ఆత్మ రూపంలో అడ్రస్ పరంధామం, బ్రాహ్మణ ఆత్మ రూపంలో అడ్రస్ మధుబన్. మరి ‘మేము మధుబన్ నివాసులము’ అనే సంతోషం ఉంది కదా! సేవ నిమిత్తం ఎక్కడ ఉన్నా మీ అసలు అడ్రస్‌ను మరిచిపోతారా ఏంటి! కలకత్తాలో ఉండే వారైనా ‘ఒరిజినల్‌గా మేము రాజస్థాన్ వారం’ అని అంటారు. కాబట్టి బ్రాహ్మణులు అంటే మధుబన్ నివాసులు. అలా అనుకోవడం వల్ల మీ హద్దు సేవా స్థానంతో ఎప్పటికీ మోహం ఏర్పడదు. కాబట్టి సదా ప్రవృత్తిలో ఉంటూ ‘సేవా స్థానంలో సేవ కొరకే ఉన్నాం’ అనే లక్ష్యం ఉంచుకోండి. ఎక్కడ ఉంటున్నారో అక్కడ వాతావరణాన్ని సేవా స్థానంలా తయారుచేశారా లేక సెంటర్ వాతావరణం వేరు, ఇంటి వాతావరణం వేరా? కొద్దికొద్దిగా ‘నాది’ అనే భావం వచ్చేస్తుందా? ‘ఇది గృహస్థ ఇంటి వాతావరణం, ప్రవృత్తి’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రవృత్తి అంటేనే పర-వృత్తిలో ఉండటం, పర అనగా నాది అనే భావం లేకపోవడం. తండ్రిది అయినప్పుడు పర-వృత్తి. అలా ఉంటున్నారా లేక తయారుచేసే ప్రయత్నం చేస్తున్నారా? వినాశనం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారా ఏంటి? ఎవరైనా వస్తే వీరు అతీతంగా మరియు ప్రభువుకు ప్రియంగా ఉన్నారని అనుభవం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అలౌకికంగా అయిపోయారు కదా. కాబట్టి వాతావరణం కూడా లౌకికం కాదు, అలౌకికం. అలౌకికం అనగా లౌకికానికి అతీతమైనది. ఇప్పుడు చూద్దాం, ఈ నూతన సంవత్సరంలో నవీనతను తీసుకురావడంలో ఎవరు నంబర్ ముందు తీసుకుంటారో! అందరూ నంబర్‌వన్ అవుతారు. చెప్పడం మరియు చేయడం రెండూ సమానంగా ఉండాలి. చాలా చెప్పి తక్కువ చేయడం కాదు. చెప్పడం, చేయడం సమానంగా ఉంటారినే బ్రాహ్మణులు అని అంటాము.
గ్రూప్ నం. 4
మూడు కాలాలు అత్యంత శ్రేష్ఠంగా ఉండటమే బ్రాహ్మణ జీవితం యొక్క జన్మపత్రిక
మిమ్మల్ని మీరు నూతన జీవితం అనగా బ్రాహ్మణ జీవితం కలిగిన ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? అందరూ బ్రాహ్మణ ఆత్మలేనా? మరి ఈ నూతన జీవితంలో మీ జన్మపత్రిక మారిపోయిందా లేక కొద్దికొద్దిగా పాతది కూడా ఉందా? బ్రాహ్మణుల జన్మపత్రిక ఏమిటి? ఆది దేవీ-దేవతలు, ఇప్పుడు బి.కె.లు కదా, పక్కానా? మరి మీ రోజువారీ జన్మపత్రిక ఏమిటి? గురువారం బాగుంది, బుధవారం బాగులేదు అని అంటారా, ఏమంటారు? (ప్రతి రోజూ బాగుంది) కాబట్టి జన్మపత్రిక మారిపోయింది కదా. బ్రాహ్మణుల జన్మపత్రికలో మూడు కాలాలు అత్యంత శ్రేష్ఠమైనవే. జరిగింది శ్రేష్ఠమైనది, జరుగుతున్నది మరింత శ్రేష్ఠమైనది, జరగబోయేది చాలా చాలా చాలా శ్రేష్ఠమైనది. కేవలం మాట వరుసకు కాదు, బ్రాహ్మణ జీవితం యొక్క జన్మపత్రిక సదా అత్యంత శ్రేష్ఠమైనది. అందరి మస్తకంలో శ్రేష్ఠమైన భాగ్యరేఖ గీయబడి ఉంది. మీ భాగ్యరేఖను చూసుకున్నారా? బాగుంది కదా? ఎన్ని జన్మల గ్యారంటీ ఉంది? 21 జన్మలా లేక 84 జన్మలా? 84 జన్మలలో విదేశీయులుగా అయిపోయారు. (సేవ కొరకు అయ్యాము) చాలా మంచి సమాధానం చెప్పారు. విదేశాలలో సేవ జరుగుతోందని డబల్ విదేశీయులుగా అయ్యారు. మిమ్మల్ని ‘భారత సేవాధారులు’ అని అనము, ‘విశ్వ సేవాధారులు’ అని అంటాము. ఏ ఒక్క ప్రాంతమూ మిగిలిపోకూడదు, అందుకే వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు. మీరు మీ దేశంలో లేకపోతే భారత్ నుండి ఎక్కడి వరకు వెళ్లగలరు? అందుకే సేవ కొరకు చేరుకున్నారు. ఈ నషా ఉందా? మరి సేవ చేస్తున్నారు కదా? ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే స్మృతి మరియు సేవ. స్మృతి లేకుండా ఉండలేరు, సేవ లేకుండా ఉండలేరు. శరీరంలో శ్వాస ఎలాగైతే సహజమో మరియు ఎంత అవసరమో, స్మృతి మరియు సేవ కూడా అలాగే సహజంగా అయిపోవాలి. బ్రాహ్మణ జీవితంలో స్మృతి మరియు సేవ సహజమైనవి మరియు అత్యంత అవసరమైనవి.
మీరు చాలా భాగ్యవంతులు, భాగ్యవిధాతయే మీ భాగ్యరేఖను శ్రేష్ఠంగా తయారుచేశారు. భాగ్యవిధాతను మీవారిగా చేసుకున్నారు. చేసుకున్నారు కదా! అందరూ ఏం చెప్తారు? ‘మా బాబా’ అని. ‘నాది’ అనేది ఎప్పుడూ మరచిపోరు కదా. డబల్ విదేశీయులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తండ్రికి సమీపంగా చేరుకున్నారని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. దేహంతో దూరంగా ఉన్నారు కానీ హృదయంతో ఎంత సమీపంలో ఉన్నారు! సదా ఎక్కడ ఉంటారు? తండ్రి హృదయ సింహాసనంపై. అన్నిటికంటే ముఖ్యమైనది హృదయమే కదా. ఎవరిపైనైనా ప్రేమ ఉంటే ‘నా హృదయంలో దాచుకున్నాను’ అని అంటారు. మీరు కూడా ప్రియస్మృతులను పంపినప్పుడు హార్ట్ (హృదయం)నే పంపుతారు కదా. కాబట్టి సమీపంలో ఉండటం అంటే హృదయ సింహాసనాధికారిగా కావడం. అందరూ హృదయ సింహాసనాధికారులేనా లేక కొందరు బాహువుల్లో, కొందరు మెడలో ఉన్నారా? హృదయాన్నే హృదయ సింహాసనం అని అంటాము. ఎవరైతే ఇప్పుడు హృదయ సింహాసనాధికారులుగా అవుతారో వారే విశ్వ రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. మరి డబల్ విదేశీయులు కూడా రాజ్య సింహాసనంపై కూర్చుంటారు కదా? అచ్ఛా. ధైర్యం బాగుంది. ధైర్యం యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించాలి. సదా ధైర్యంతో ముందుకు ఎగురుతూ ఉండండి.
గ్రూప్ నం. 5
సర్వ ఖజానాలను సఫలం చేయడమే సఫలతను పొందేందుకు సహజ సాధనం
అందరూ మిమ్మల్ని మీరు సఫలతా మూర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? సఫలత బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారం - అని అనుభవం చేస్తున్నారా? సదా సఫలత సహజంగా ఉండేందుకు సాధనం లేదా అత్యంత సహజమైన విధి ఏమిటి? నిశ్చయంలో కూడా శ్రమపడాల్సి వస్తుంది, తోడుగా ఉండేందుకు కూడా శ్రమపడాల్సి వస్తుంది. అత్యంత సహజమైన సాధనం ఏంటంటే - సర్వ ఖజానాలను సఫలం చేస్తూ వెళ్లండి, అప్పుడు సఫలత తనంతట తానే మీ ముందుకు వస్తుంది. సఫలం చేయడమే సఫలతను పొందడం. మరి సఫలం చేయడం వచ్చా? అచ్ఛా, సమయాన్ని సఫలం చేస్తే దానికి సఫలతగా మీకు ఏమి లభిస్తుంది? ఇక్కడ సమయాన్ని సఫలం చేసేవారు సత్యయుగం, త్రేతాయుగంలోనే కాకుండా ఇక్కడ చేసే సఫలత వల్ల కల్పమంతటి సమయంలో రాజ్య అధికారులుగా లేదా పూజనీయ అధికారులుగా అవుతారు. ఇక్కడ ఒక జన్మ సమయాన్ని సఫలం చేస్తే ఎన్ని జన్మల కొరకు సమయం సఫలమైపోతుంది. అలాగే లభించిన ఖజానాలన్నింటినీ సఫలం చేస్తూ వెళ్లండి. ఎన్ని ఖజానాలు ఉన్నాయి! మరి రోజంతా సర్వ ఖజానాలను సఫలం చేస్తున్నారా లేక ఎప్పుడైనా కొన్నింటిని, ఎప్పుడైనా మరికొన్నింటిని చేస్తున్నారా?
ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సర్వ ఖజానాలను యూజ్ చేస్తారు కదా. ఎందుకంటే ఎంత సఫలం చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ తగ్గిపోవు, పెరుగుతాయి. మరి అందరూ మిమ్మల్ని మీరు సంతుష్ట మణులుగా భావిస్తున్నారా? ఎప్పుడూ అసంతుష్టంగా అవ్వడం లేదు కదా? ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో అత్యంత పెద్ద ఖజానా సంతుష్టంగా ఉండటమే. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అంతా ఉన్నట్లే. ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉండి తీరుతుంది.
(రాత్రి 12 గంటలకు బాప్‌దాదా కొవ్వొత్తులను వెలిగించి, కేక్ కట్ చేశారు, ఆ తర్వాత అందరినీ కలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు)
ఈ గ్రూప్ చాలా అదృష్టవంతమైనది, హృదయానికి సమీపంగా ఉన్నారు మరియు నయనాల ముందు కూర్చున్నారు. సాధారణంగా కూడా బాప్‌దాదా చెప్పారు కదా, అందరూ సంతుష్టత యొక్క రత్నాలు. సర్వ ప్రాప్తి స్వరూపులు, దీని కొరకు ఏ పాట పాడుతారు? ‘పొందాల్సింది పొందేసాము’. అచ్ఛా, U.K.కి ఉన్న వరదానం ఏమిటి? O.K. అని. మరి O.K. గా ఉన్నారా? ఇతరులను కూడా O.K.గా తయారుచేస్తున్నారా లేక స్వయం మాత్రమే ఉంటారా? ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతిరోజూ ఏదో ఒక రకంగా మహాదానిగా, వరదానిగా కావాలి, కాబట్టి సదా ఇతరులకు కూడా సేవ చేస్తూ ఉండండి. లండన్ నివాసులు లేదా U.K. నివాసులు శ్రేష్ఠమైన భాగ్యవంతులు, వారికి విశేష ఆత్మల పాలన లభిస్తూ ఉంటుంది. మరియు అన్నిటికంటే ముందు త్వరిత దానము మహా పుణ్యముగా మురళి కూడా లండన్‌కే చేరుతుంది.
భారత్ వాసులకు చేరని అనేక సమాచారాలు లండన్‌కు చేరుతాయి. ఎందుకంటే విదేశాలలో మొదటి సెంటర్ తెరిచేందుకు లండన్ నిమిత్తమైంది. మరి ఇప్పుడు లండన్ వాళ్లు ఏం చేస్తారు? అన్ని సబ్జెక్టులలో నంబర్‌వన్.
అయినప్పటికీ విదేశాలలో సేవ చేసే వారందరికీ బాప్‌దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి శ్రమ, ఉత్సాహం చాలా బాగున్నాయి. ధైర్యం కారణంగా సఫలత లభిస్తోంది, ముందు ముందు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ధైర్యాన్ని సదా తోడు ఉంచుకోండి. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ తండ్రి సహాయం ఉండితీరుతుంది.
బాప్‌దాదా వీడ్కోలు చెప్పే సమయంలో పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు:-
నలువైపులా ఉన్న సర్వ పిల్లల నూతన సంవత్సర ఉత్సాహభరితమైన ప్రియస్మృతులు మరియు శ్రేష్ఠమైన కానుకలు లభించాయి. బాప్‌దాదా సర్వ పిల్లలకు, పదమాపదమ భాగ్యవంతమైన ఆత్మలకు పదమాపదమ రెట్ల ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఈ సంగమయుగం మరియు నూతన ప్రపంచం రెండింటి శుభాకాంక్షలను ఇస్తున్నారు. నూతన సంవత్సరం ఆరంభంలో ఉత్సవం జరుపుకుంటారు మరియు ఒకరి నోరు ఒకరు తీపి చేసుకుంటారు. మరి మీరందరూ ఏ తీపిని తినిపిస్తారు? ప్రతి సమయం, ప్రతి రోజూ అందరికీ ‘దిల్ఖుష్’ (హృదయాన్ని సంతోషపరిచే) మిఠాయిని తినిపిస్తూ ఉండండి. ఈ తీపిని అందరూ తినవచ్చు కదా. తింటూ ఉండండి, తినిపిస్తూ ఉండండి. సదా ఏ ఆత్మతో సంబంధ-సంపర్కాలలోకి వచ్చినా మొదట చిరునవ్వుతో కలవండి, ఆ తర్వాత దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తూ కలవండి. మరి గిఫ్ట్ ఏమిస్తారు? గుణాల గిఫ్ట్ ఇవ్వండి, శక్తుల గిఫ్ట్ ఇవ్వండి. మీ దగ్గర చాలా గిఫ్ట్‌లు ఉన్నాయి కదా. స్టాక్ ఉందా? కాబట్టి గిఫ్ట్‌లను బాగా పంచండి. సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. నూతన సంవత్సర గుడ్‌మార్నింగ్. అచ్ఛా!
*** ఓంశాంతి ***
