‘‘నిశ్చయబుద్ధికి గుర్తులు - నిశ్చిత విజయము మరియు సదా నిశ్చింత స్థితి యొక్క అనుభవము’’
ఈరోజు పిల్లలందరి రక్షకుడు మరియు శిక్షకుడు అయిన బాప్‌దాదా తమ బ్రాహ్మణ పిల్లలందరి పునాదిని చూస్తున్నారు. వర్తమాన శ్రేష్ఠ జీవితము యొక్క పునాది నిశ్చయము అన్నదైతే అందరికీ తెలుసు. ఎంతగా నిశ్చయం రూపీ పునాది పక్కాగా ఉంటుందో అంతగానే ఆది నుండి ఇప్పటివరకు సహజ యోగిగా ఉండడము, నిర్మల స్వభావము, శుభ భావనా వృత్తి మరియు ఆత్మిక దృష్టి సదా నేచురల్ రూపములో అనుభవమవుతాయి. ప్రతి సమయము నడవడిక మరియు ముఖము ద్వారా వాటి మెరుపు అనుభవమవుతుంది ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవితములో ‘నేను ఇటువంటివాడిని మరియు బాబా ఇటువంటివారు’ అని కేవలము తెలుసుకోవటము మాత్రమే కాదు, కానీ తెలుసుకోవటము అంటే అర్థము - దేనినైతే తెలుసుకుంటారో దానిని స్వీకరించటము మరియు దాని అనుసారంగా నడుచుకోవటము.
బాప్‌దాదా చూస్తున్నారు - ఏయే పిల్లలైతే స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలుచుకుంటారో వారందరూ, మేము నిశ్చయబుద్ధి కలవారిమి అని నషాతో చెప్తారు. కావున బాప్‌దాదా నిశ్చయబుద్ధి కల పిల్లలందరినీ అడుగుతున్నారు - మేము నిశ్చయబుద్ధి కల విజయులము అని మీరందరూ చెప్పుకుంటున్నప్పుడు మరి ఒక్కోసారి విజయము, ఒక్కోసారి ఓటమి ఎందుకు ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త అలజడి కలిగినప్పుడు ఆ సమయములో నిశ్చయము సమాప్తమైపోతుందా? సదా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నప్పుడు మరి సదా విజయులుగా ఉన్నారా? లేక మధ్యమధ్యలో గుటకలు మింగుతున్నారా లేక కునికిపాట్లు పడుతున్నారా? నిశ్చయమనే పునాది నలువైపులా గట్టిగా ఉందా లేక నాలుగు వైపులకు బదులుగా ఒక్కోసారి ఒకవైపు, ఒక్కోసారి రెండువైపుల ఢీలాగా అయిపోతుందా? ఏ వస్తువునైనా దృఢంగా చేసేటప్పుడు నలువైపుల నుండి టైట్ చెయ్యటం జరుగుతుంది కదా. ఒకవేళ ఒకవైపైనా కూడా కాస్త కదిలేదిగా ఉన్నట్లయితే కదిలిపోతుంది కదా! కనుక నాలుగు రకాల నిశ్చయము అనగా తండ్రిపై, స్వయముపై, డ్రామాపై మరియు బ్రాహ్మణ పరివారముపై నిశ్చయము. ఈ నాలుగు రకాల నిశ్చయాన్ని తెలుసుకోవటమే కాదు కానీ వాటిని స్వీకరించి వాటిపై నడుచుకోవాలి. ఒకవేళ తెలుసుకున్నా కానీ ఆ విధంగా నడుచుకోకపోతే విజయము కింద-మీద అవుతుంది. ఏ సమయములోనైతే విజయము అలజడిలోకి వస్తుందో, అప్పుడు నాలుగు వైపులలో ఏ వైపు అలజడిలో ఉంది అన్నదానిని చెక్ చేసుకోండి. బాప్‌దాదా చూస్తూ ఉంటారు - చాలామంది పిల్లలకు తండ్రిపై పూర్తి నిశ్చయము ఉంది, ఇందులో పాస్ అయిపోయారు కానీ స్వయముపై ఏదైతే నిశ్చయము ఉండాలో అందులో తేడా వచ్చేస్తుంది. తెలుసుకుంటారు కూడా, నేను ఇటువంటివాడిని, నేను అటువంటివాడిని అని అంటారు కూడా, కానీ దేనినైతే తెలుసుకుంటారో, స్వీకరిస్తారో, అది స్వరూపములో, నడవడికలో, కర్మలలో ఉండాలి - ఇందులోనే తేడా వచ్చేస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని, విశ్వ కళ్యాణకారిని అని ఒకవైపు ఆలోచిస్తారు, మరోవైపు చిన్న పరిస్థితిపై విజయము పొందలేకపోతారు. ఉన్నదైతే మాస్టర్ సర్వశక్తివంతులుగా కానీ ఈ పరిస్థితి చాలా పెద్దది, ఈ విషయమే ఇటువంటిది! అని అనుకుంటారు. మరి కేవలము తెలుసుకోవటమే కానీ స్వీకరించి నడుచుకోకపోతే దానిని నిశ్చయము అని అంటారా? నేను విశ్వ కళ్యాణకారిని అని అంటారు లేక అనుకుంటారు కానీ విశ్వం సంగతి పక్కన పెట్టండి, స్వ కళ్యాణములో కూడా బలహీనంగా ఉంటారు. ఒకవేళ ఆ సమయములో వారిని - స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వ కళ్యాణకారులుగా అవ్వలేరా అని అడిగినట్లయితే ఏ సమాధానమిస్తారు - ఉన్నదైతే విశ్వ కళ్యాణకారులుగానే కానీ స్వ కళ్యాణము చేసుకోవటము చాలా కష్టము, ఈ విషయంలో మారటము కష్టము! మరి విశ్వ కళ్యాణకారులు అని అంటారా లేక బలహీనులు అని అంటారా? కనుక స్వయములో కూడా పరిస్థితుల అనుసారంగా, సమయము అనుసారంగా, సంబంధ-సంపర్కాల అనుసారంగా నిశ్చయమనేది స్వరూపములోకి రావాలి, ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారికి విజయము తప్పకుండా లభించే ఉంటుంది. ఏ విధంగానైతే అందరికీ, నేను శ్రేష్ఠ ఆత్మను అని పక్కా నిశ్చయము ఉంది, ఈ విషయములో ప్రపంచములోని వైజ్ఞానికులెవరైనా కూడా మీరు ఆత్మ కాదు, శరీరము అని మిమ్మల్ని కదిలించేందుకు ప్రయత్నించినా గానీ మీరు ఒప్పుకోరు, పైగా వారిని ఒప్పించేట్లు చేస్తారు. కనుక ఏ విధంగానైతే నేను శరీరాన్ని కాను, నేను ఆత్మను అన్నది పక్కాగా ఉందో మరియు ఎటువంటి ఆత్మను అన్నది కూడా పక్కాగా ఉందో, అదే విధంగా ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారి విజయము కూడా అంతగానే నిశ్చితంగా ఉంటుంది. ఓటమి అసంభవము మరియు విజయము నిశ్చితము. అలాగే, విషయాలు కూడా చివరి వరకూ వచ్చేవే ఉన్నాయి అన్నది కూడా నిశ్చితము. కానీ వాటిల్లో విజయులుగా అయ్యేందుకు ఒకే సమయంలో నలువైపుల కల నిశ్చయము పక్కాగా ఉండాలి. మూడింటిలో నిశ్చయము ఉండి, ఒకదాంట్లో లేకపోతే విజయము నిశ్చితము అన్నట్లు కలుగదు, కానీ శ్రమపడటం ద్వారా విజయము కలుగుతుంది. నిశ్చిత విజయము కలవారు శ్రమపడాల్సిన అవసరము ఉండదు. చాలా సార్లు చాలామంది ఏమంటారంటే, బాప్‌దాదా అయితే చాలా మంచివారు, బాబా తండ్రి, మేము పిల్లలము అన్నదైతే పక్కా, మా సంబంధము తండ్రితోనే ఉంది కానీ దైవీ పరివారముతో ఘర్షణ కలుగుతుంది, ఆ విషయములో నిశ్చయము కింద-మీద అయిపోతుంది, అందుకే పరివారాన్ని వదిలేస్తారు, తేలికగా తీసుకుంటారు. మరి ఒకవైపు ఢీలా అయిపోయింది కదా. పరివారము లేకుండా మాలలోకి ఎలా వస్తారు? మాల ఎప్పుడు తయారవుతుంది? పూస-పూసతో కలిసినప్పుడు మరియు ఒకే దారములో కూర్చబడినప్పుడు మాల తయారవుతుంది. ఒకవేళ వేరు-వేరు దారాలలో వేరు-వేరు పూసలుగా ఉన్నట్లయితే దానిని మాల అని అనము. కావున పరివారము అనేది మాల. ఒకవేళ పరివారాన్ని వదిలి మూడు నిశ్చయాలు పక్కాగా ఉన్నా కూడా విజయము నిశ్చితము కాదు. పరివారములోని ఘర్షణల నుండి దూరంగా ఉంటూ, తండ్రిని ఆధారంగా చేసుకుని పరివారానికి దూరంగా ఉన్నట్లయితే అది నడుస్తుందా? పని తండ్రితో ఉందా లేక సోదరులతో ఉందా? తండ్రితో పని ఉంది, వారసత్వము తండ్రి నుండి లభించనున్నది, సోదరీ-సోదరుల నుండి ఏం లభిస్తుంది? కానీ బ్రాహ్మణ జీవితములోని అతీతత్వము ఏమిటంటే ధర్మము మరియు రాజ్యము, రెండింటి స్థాపన జరుగుతుంది, కేవలము ధర్మ స్థాపన మాత్రమే కాదు. ఇతర ధర్మ పితలు కేవలం ధర్మ స్థాపన చేస్తారు, తండ్రి విశేషత ఏమిటంటే ధర్మము మరియు రాజ్యము యొక్క స్థాపనను చెయ్యటము. మరి రాజ్యములో ఒక్క రాజు మాత్రమే ఏం చేస్తారు? చాలా మంచి సింహాసనము ఉన్నా, కిరీటము కూడా ఉన్నా, ఏం చేస్తారు? రాజధాని కూడా కావాలి కదా? మరి రాజధాని అనగా బ్రాహ్మణ పరివారమే రాజ్య పరివారము, అందుకే బ్రాహ్మణ పరివారములో ప్రతి పరిస్థితిలో నిశ్చయబుద్ధి ఉండాలి, అప్పుడు రాజ్య భాగ్యములో కూడా సదా రాజ్య అధికారిగా అవుతారు. కనుక ఇలా అనుకోకండి - పరివారముతో పడకపోయినా ఏం ఫర్వాలేదు, తండ్రితో అయితే బాగానే ఉంది కదా, డ్రామాను ఒకవేళ మర్చిపోయినా గానీ తండ్రి అయితే తప్పకుండా గుర్తుంటారు కదా! కానీ ఏ బలహీనత అయినా ఒకే సమయంలో వస్తుంది. ఒకవేళ స్వ స్థితి అనగా స్వ పై నిశ్చయము కూడా బలహీనంగా అయినట్లయితే విజయము నిశ్చితం అయ్యేదానికి బదులుగా అలజడిలోకి వస్తుంది. కనుక బాప్‌దాదా నిశ్చయమనే పునాదిని చెక్ చేస్తున్నారు. ఏం చూసారు?
సదా నాలుగు రకాల నిశ్చయములు ఒకే సమయములో కలిసి ఉండటం లేదు, ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి కదులుతాయి, అందుకే సదా విజయులుగా ఉండే అనుభవాన్ని పొందలేకపోతున్నారు. అప్పుడు ఇలా ఆలోచిస్తారు - జరగాల్సింది ఏమో ఇది కానీ ఎందుకు జరగలేదో తెలియదు? చాలానే శ్రమించాను, చాలా బాగా ఆలోచించాను... కానీ ఆలోచించటము మరియు జరగటము, ఇందులో తేడా వస్తుంది. నిశ్చయానికి కల నాలుగు వైపులు ధృఢంగా లేవని దీని అర్థము. అంతేకాక నవ్వు వచ్చే విషయము ఏమిటంటే డ్రామా అని కూడా అంటూ ఉన్నారు, ఇదైతే డ్రామా, ఇదైతే డ్రామా... అని అంటూ ఉన్నారు కానీ చాలా బాగా కదిలిపోతూ కూడా ఉన్నారు. ఒక్కోసారి సంకల్పాలలో కదిలిపోతారు, ఒక్కోసారి మాటల వరకు కూడా కదిలిపోతారు, ఒక్కోసారి కర్మల వరకు కూడా వచ్చేస్తారు. ఆ సమయంలో ఏమనిపిస్తూ ఉండవచ్చు, ఆ దృశ్యాన్ని ఎదురుగా తీసుకురండి, డ్రామా డ్రామా అని కూడా అంటూ ఉంటారు మరియు ఊగిసలాడుతూ కూడా ఉంటారు! కానీ నిశ్చయబుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయి. ఒకవేళ విధి సరిగ్గా ఉంటే సిద్ధి ప్రాప్తించకపోవటము అనేది జరగనే జరగదు. కనుక ఎప్పుడైనా ఏ కార్యములోనైనా విజయము ప్రాప్తించకపోతే నిశ్చయములో లోపముంది అని అర్థం చేసుకోండి. నలువైపుల చెక్ చేసుకోండి, ఒకవైపు కాదు.
ఇంకొక విషయము, ఏ విధంగా నిశ్చిత విజయమనేది నిశ్చయబుద్ధికి గుర్తో అలాగే వారు నిశ్చింతగా ఉంటారు. ఎటువంటి వ్యర్థ చింతన రానే రాదు. శుభచింతన తప్ప వ్యర్థము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. వ్యర్థము వచ్చింది, దానిని పారద్రోలాము అన్నట్లు ఉండకూడదు. నిశ్చయబుద్ధి కలవారి ముందుకు వ్యర్థము రాజాలదు ఎందుకంటే ఎందుకు, ఏమిటి మరియు ఎలా - ఇది వ్యర్థము అంటే. డ్రామా రహస్యము గురించి తెలుసు అన్నప్పుడు, మీరు ఆదిమధ్యాంతాలు తెలిసినవారు అన్నప్పుడు, మరి ఎవరికైతే డ్రామా ఆదిమధ్యాంతాలు తెలుసో, వారు చిన్న విషయము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోలేరా! తెలుసుకోని కారణంగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా - ఈ వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. ఒకవేళ డ్రామాపై చలించని నిశ్చయము ఉన్నట్లయితే, నాలెడ్జ్‌ఫుల్‌గా కూడా ఉంటే, శక్తిశాలిగా కూడా ఉంటే వ్యర్థ సంకల్పాలు మిమ్మల్ని కదిలించేందుకు ధైర్యం కూడా చేయలేవు. కానీ ఎప్పుడైతే కదులుతారో, అప్పుడు ఏం జరిగిందో తెలియదు అని ఆలోచిస్తారు! అందుకే బాప్‌దాదా నవ్వుతారు - డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు, తమ 84 జన్మలను తెలుసుకున్నారు, కానీ ఆ ఒక్క విషయం గురించి తెలియదు! మీరు చాలా తెలివైనవారు! ఎప్పటికప్పుడు తెలివితేటలను చూపిస్తుంటారు కదా! కల్పవృక్షంలోని అన్ని ఆకుల గురించి తెలుసా, తెలియదా? అందరూ వృక్షము యొక్క పునాదిలో కూర్చున్నారా? లేక 7-8 మందే కూర్చున్నారా? కానీ వేర్లలో కూర్చున్నవారికి వృక్షము గురించి తెలుసా? మీకు ఆకు ఆకు గురించి తెలుసు, మరి ఇది ఎందుకు తెలియదు? కనుక నిశ్చయానికి గుర్తు నిశ్చింత స్థితి, దీనిని అనుభవము చెయ్యండి. అవుతుందో-అవ్వదో, ఏమవుతుంది, చెయ్యటమైతే చేస్తున్నాము, ఏం జరుగుతుందో చూడాలి - దీనిని నిశ్చింతత అని అనము. బాబా ముందు కూడా ఫిర్యాదు చేస్తారు - మీరు సహాయకులు కదా, మీరు రక్షకులు కదా, మీరు ఇది కదా, మీరు అది కదా... ఫిర్యాదు చెయ్యటము అనగా అధికారాన్ని పోగొట్టుకోవటము. ఇది చేసి పెట్టండి కదా, ఇది జరిగేలా చూడండి కదా - అని అధికారులు ఫిర్యాదులు చేయరు. నిశ్చయబుద్ధి అనగా నిశ్చింతత. కనుక ఈ ప్రాక్టికల్ గుర్తులను మీలో మీరే చెక్ చేసుకోండి. మేమైతే ఉన్నదే నిశ్చయబుద్ధి కలవారిగా అని ఇలా నిర్లక్ష్యులుగా ఉండిపోకూడదు. ఏ నిశ్చయము బలహీనంగా ఉంది అన్నదానిని చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. కేవలము చెక్ చేసుకోవటము మాత్రమే కాదు. బాప్‌దాదా అన్నారు - చెకర్ (చెక్ చేసుకునేవారు) గా అవ్వడంతో పాటు మేకర్ (తయారయ్యేవారు) గా కూడా ఉండాలి. కేవలము చెక్ చేసుకునేవారిగా అవ్వటం మాత్రమే కాదు. చెక్ చేసుకోవడము అంటే అర్థమే క్షణంలో ఛేంజ్ అవ్వటము. కానీ చెక్ చేసుకుని, ఛేంజ్ చేసుకోకపోతే చాలాకాలము నుండి స్వయములో నిరాశకు లోనయ్యే సంస్కారాలు పక్కా అవుతూ ఉంటాయి మరియు బహుకాలపు సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవే అంతిమంలో తప్పకుండా ఎదుర్కొంటూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా - అంతిమంలో నేను తండ్రి గురించి తప్ప ఇంకేదీ ఆలోచించను అని అనుకున్నా కానీ అది జరగదు. బహుకాలపు అభ్యాసము అవసరము. లేదంటే ఒక క్షణము శివబాబా, శివబాబా, శివబాబా... అని ఆలోచిస్తారు, మరు క్షణంలో మాయ - లేదు, నీలో శక్తి లేదు, నువ్వు ఉన్నదే బలహీనంగా అని అంటుంది, కనుక యుద్ధము నడుస్తూ ఉంటుంది. నిశ్చింతగా లేకపోతే బ్రాహ్మణ జీవిత అంతిమ కాలం యొక్క లక్ష్యము గురించి ఏదైతే వర్ణిస్తారో అది ఎలా సహజమవుతుంది! ఒకవేళ అంతిమము వరకు ఈ వ్యర్థ సంకల్పాలు ఉన్నట్లయితే అవే భూతాలు, యమదూతల రూపంలో వస్తాయి. వేరే ఏ యమదూతలు రారు, ఈ వ్యర్థ సంకల్పాలు, స్వయములోని బలహీనతలు, ఇవే యమదూతల రూపములో వస్తాయి. యమదూతలు ఏం చేస్తారు? భయపెడతారు. మరియు ఇతరుల విషయంలో ఏమి చెప్తారంటే - వారు విమానములో వెళ్తారు అనగా ఎగిరే కళతో దాటేస్తారు. నిజంగా విమానము మొదలైనది ఏదీ ఉండదు, అది ఎగిరే కళ యొక్క అనుభవము. అందుకే మొదటి నుండే చెక్ చేసుకుని ఛేంజ్ చేసుకోండి. ఎప్పటికల్లా చేస్తారు? చేస్తాము అని అంటూ బాప్దాదానైతే సంతోషపరుస్తారు, ప్రతిజ్ఞను కూడా వ్రాస్తారు కానీ అది కాగితం వరకే ఉంటుందా లేక జీవితము వరకు ఉంటుందా?
అచ్ఛా, ఈ రోజు మధుబన్ నివాసుల టర్న్ కూడా. బాప్‌దాదాకు మధుబన్ వారి పట్లనైతే విశేష స్నేహము ఉంది. అందరి పట్ల ఉంటుంది, అయినా కూడా మధుబన్ నివాసుల పట్ల కాస్త విశేషంగా ఉంటుంది ఎందుకంటే వారు నిమిత్తులు. ఎంతైనా చూడండి, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు కదా. మధుబన్ వారు ఆతిథ్యము ఇవ్వటంలో పాస్ అయ్యారు కదా. అతిథి సత్కారము చేయడమే మహానత. ఎవరికైతే అతిథి సత్కారము చేయడం వస్తుందో, వారు మహానులుగా తప్పకుండా అవుతారు. కేవలము తినటము, త్రాగటము విషయములో మాత్రమే కాదు కానీ మనస్ఫూర్వకమైన స్నేహంతో కూడిన అతిథి సత్కారము, ఇది అన్నింటికన్నా శ్రేష్ఠమైనది. ఎన్ని పిక్నిక్లను చేసినా గానీ మనస్ఫూర్వకమైన స్నేహము లభించకపోతే ఏమీ లభించలేదు అని అంటారు. అలా మధుబన్ వారు మనస్ఫూర్వకమైన స్నేహంతో కూడిన అతిథి సత్కారము చేస్తారు. అలాగే చేస్తారు కదా లేక ఎవరైనా కింద-మీద చేస్తే, బాప్‌దాదా ఇలానే చెప్పారు అని అంటారా? అలా చెయ్యకూడదు. స్నేహ సాగరుని పిల్లలు కదా. ఎప్పటివరకు స్నేహమివ్వాలి? అని అనకూడదు. మీరు చిన్న బిందెకు పిల్లలు కారు, సాగరునికి పిల్లలు, అనంతము.
అందరివద్ద స్నేహమనే స్టాక్ ఉంది కదా? మాతల వద్ద కూడా ఉంది, కుమారీల వద్ద కూడా ఉంది, పాండవుల వద్ద కూడా ఉంది. సాగరమే ఉందా లేక కొద్దిగా ఉందా? కావున ఎప్పుడూ క్రోధాన్ని అయితే చెయ్యరు కదా? స్నేహ సాగరులు అన్నప్పుడు మరి క్రోధము ఎక్కడి నుండి వచ్చింది? ఇతరుల సంస్కారాలను తెలుసుకుని వారిని సంతృప్తి పరుస్తారు కదా. వారు తప్పు అయి ఉండవచ్చు కానీ మీరైతే నాలెడ్జ్‌ఫుల్ కదా, వారేంటి అన్నది మీకైతే తెలుసు కదా. కానీ ఆ సమయములో ఏమంటారు - వీరు ఇలా చేసారు కదా, అందుకే మేము కూడా చేసాము. తప్పు వల్ల మరొక తప్పు జరిగితే ఏమి అద్భుతము చేసినట్లు? వారు తప్పు చేసారు మరియు మీరు వారికి తప్పునే బదులుగా ఇచ్చారు! ఒక్కసారి క్రోధం ఏం కాదు, కానీ పదే-పదే క్రోధం చేస్తూ ఉంటారు అని చాలా మంది అంటారు కదా. మీకు తెలుసు కదా - ఎవరికైతే స్వభావమే క్రోధంతో కూడినదిగా ఉంటుందో, వారు క్రోధం చెయ్యకపోతే ఇంకేమి చేస్తారు! వారి పని క్రోధం చేయటము, మరి మీ పని స్నేహాన్ని ఇవ్వటమా లేక క్రోధం చేయటమా? వారు పది సార్లు క్రోధం చేస్తే మీరు ఒక్కసారైనా జవాబిస్తారు కదా? ఇవ్వకపోతే వారు 20 సార్లు క్రోధం చేస్తారు! అప్పుడేం చేస్తారు? మరి ఇంతటి సహనశక్తి ఉందా? లేకపోతే వారు 10 సార్లు చేసినప్పుడు, మీరు కొద్దిగా చేస్తే ఏమి ఫర్వాలేదా? వారు అబద్ధం చెప్పారు, మీరు క్రోధం చేసారు, మరి ఇది కరక్టేనా? తర్వాత - వారు అబద్ధం చెప్పారు కదా, అందుకే క్రోధం వచ్చింది అని చాలా ధైర్యంగా చెప్తారు. కానీ అబద్ధం చెప్పటము బాగా అనిపించలేదు, మరి క్రోధం చేయటము మంచిదా! మీరు స్నేహ సాగరుని మాస్టర్ స్నేహ సాగరులు. మాస్టర్ స్నేహ సాగరుని నయనాలలో, హావ-భావాలలో, వృత్తిలో, దృష్టిలో కొద్దిగా కూడా వేరే ఏ భావము రాదు. ఒకవేళ కొద్దికొద్దిగా ఆవేశము వస్తే వారిని స్నేహ సాగరులు అని అంటారా? లేక వారు లోటా నా? ఏం జరిగినా గానీ, మొత్తము ప్రపంచమంతా మీపై క్రోధం చేసినా గానీ, మాస్టర్ స్నేహ సాగరులు ప్రపంచాన్ని లెక్క చెయ్యరు. వారు నిశ్చింత చక్రవర్తులు. దేని గురించైతే చింత ఉండేదో దానిని పొందేసారు. ఇప్పుడు ఈ వ్యర్థ విషయాల నుండి నిశ్చింత చక్రవర్తులు. చెకింగ్ చేసుకునే చింత పెట్టుకోండి, ఛేంజ్ అవ్వాలనే చింత పెట్టుకోండి, కానీ వ్యర్థము విషయంలో నిశ్చింత. ఇలా చెయ్యగలరా లేక పిల్లలు, మనుమలు, మునిమనుమలు, మునిమనుమరాళ్ళు... కాస్త క్రోధం చేస్తే, కాస్త కింద-మీద చేస్తే, అప్పుడు స్నేహానికి బదులుగా వేరే భావన కూడా వచ్చేస్తుందా? ఆఫీసుకు వెళ్తారు, బిజినెస్‌కు వెళ్తారు, పనివారు అటువంటివారు లభిస్తారు, వాయుమండలము అటువంటిది లభిస్తుంది... కానీ వ్యర్థము నుండి నిశ్చింత చక్రవర్తులు. సమర్థంగా అవ్వడంలో నిశ్చింతగా అవ్వకండి. కొంతమంది దీనిని వ్యతిరేకంగా కూడా తీసుకుంటారు. ఎక్కడైతే మర్యాద ఉంటుందో అక్కడ - బాప్‌దాదా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి అని చెప్పారు కదా అని అంటారు. కానీ మర్యాదలను పాటించటంలో నిశ్చింతులుగా ఉండకూడదు. మీ టైటిల్ మర్యాదా పురుషోత్తములు. ఈ మర్యాదలే బ్రాహ్మణ జీవితం యొక్క అడుగులు. ఒకవేళ అడుగులో అడుగు వెయ్యకపోతే గమ్యము ఎలా లభిస్తుంది? బ్రహ్మాబాబా అడుగులో అడుగు వెయ్యండి. ఈ మర్యాదలే అడుగులు. ఒకవేళ ఈ అడుగులలో ఏ కొంచెమైనా కింద-మీద అయినట్లయితే గమ్యము నుండి దూరమైపోతారు, తర్వాత కష్టపడాల్సి వస్తుంది. బాప్‌దాదాకు పిల్లలు కష్టపడటము బాగా అనిపించదు. సహజయోగి అని అంటారు, కానీ చేస్తుంది శ్రమ. మరి ఇది బాగా అనిపిస్తుందా? అచ్ఛా.
(బాప్‌దాదా డ్రిల్ చేయించారు) ఎవరెడీగా ఉన్నారా? ఇప్పుడే బాప్‌దాదా ‘అందరూ కలిసి బయలుదేరండి’ అని చెబితే వెంటనే బయలుదేరుతారా? లేక, ఫోన్ చేయాలి, టెలిగ్రామ్ చేయాలి, మేము వెళ్తున్నాము అని చెప్పాలి అని ఆలోచిస్తారా? టెలిఫోన్ లైన్లు కూడా దొరకవు కదా! ఎక్కడికి వెళ్లారు అని ఇంట్లోవారు అనుకుంటారు కదా! ఆత్మ అయితే ఒక్క సెకనులోనే వెళ్లిపోతుంది. అప్పుడు, ఇంకా ఒక సబ్జెక్టులో నేను బలహీనంగా ఉన్నాను అని గుర్తుకు వస్తుందా? లేదా, ఇంట్లోని వస్తువులను సర్దిపెట్టి వస్తాను, వెళ్తున్నామని ఒక్క సమాచారం ఇచ్చి వస్తాను అని అనిపిస్తుందా? ఇలాంటి ఆలోచనలు కొద్దిగా అయినా వస్తాయా? రావు కదా! అందరూ బంధనముక్తులవ్వాలి. ఇప్పటి నుంచే చెక్ చేసుకోండి, బంగారపు గానీ, వెండి గానీ ఏదైనా దారం ఇంకా మిగిలి ఉందా? ఇనుము దారం మందంగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. కానీ బంగారం, వెండి దారాలు ఆకర్షించేస్తాయి. ఎవరెడీ అంటే ఆర్డర్ వచ్చిన వెంటనే బయలుదేరిపోవడం. అంతగా ‘నాది’ అనే భావన నుండి ముక్తులయ్యారా? అన్నిటికంటే పెద్ద ‘నాది’ ఏమిటో చెప్పాం కదా! దేహభానంతో పాటు దేహాభిమానానికి సంబంధించిన బంగారం, వెండి దారాలు చాలా ఉన్నాయి. అందుకే సూక్ష్మ బుద్ధితో, మహీన బుద్ధితో చెక్ చేసుకోండి - ఏదైనా అల్పకాలిక నషా ఈ దారంలా మారి మిమ్మల్ని ఆపడానికి కారణం అవుతుందా? నాదేమీ లేదు, నాదేమీ లేదు అని స్థూల బుద్ధితో ఆలోచించకండి. అనుసరించడంలో ఎల్లప్పుడూ బ్రహ్మా బాబాను అనుసరించండి. అందరిలో గుణాలను గ్రహించడం వేరు, కానీ అనుసరించవలసింది బ్రహ్మా బాబానే. చాలామంది సోదర సోదరీలను అనుసరించడం ప్రారంభిస్తారు. కానీ వారు ఎవరిని అనుసరిస్తారు? వారు బ్రహ్మా బాబాను అనుసరిస్తారు. మరి మీరు వారినే ఎందుకు అనుసరిస్తారు? నేరుగా ఎందుకు అనుసరించరు? మీరందరూ బ్రహ్మాకుమారులే కదా! లేక ఫలానా అన్నయ్య కుమార్, ఫలానా అక్కయ్య కుమార్ అని ఏమైనా ఉందా? ఫాలో ఫాదర్ అని చెప్పబడింది గానీ, ఫాలో బ్రదర్స్-సిస్టర్స్ అని కాదు. వారి విశేషతను చూడండి, గౌరవించండి. కానీ గైడ్ మాత్రం ఒక్క బాబాయే. ఏ అన్నయ్య గానీ, అక్కయ్య గానీ గైడ్ కాలేరు. గైడ్ ఒక్కరే. గాడ్ గైడ్, సాకారంలో ఉదాహరణ బ్రహ్మా బాబా. అంతే. మరి బ్రహ్మా బాబాను అనుసరిస్తున్నారా? లేక, బ్రహ్మా బాబాను చూడలేదు, తెలియదు. మరి ఎలా అనుసరిస్తాం అని అనుకుంటున్నారా? అలా అనుకోరు కదా! టీచర్లను చూశారు, సోదర సోదరీలను చూశారు, కానీ బాబాను చూడలేదు అని అనుకుంటున్నారా? ఎవరైనా నిమిత్తులు కావచ్చు. కానీ వారిని నిమిత్తులుగా చేసింది ఎవరు? వారంతట వారే కాలేదు కదా! బాబాయే చేశారు. మరి బాబానే గుర్తుకు వస్తారు కదా!
అచ్ఛా, అందరూ బాగా సెట్ అయ్యారా? నిద్ర, భోజనం అన్నీ బాగున్నాయా? లేక చాలా దూరంగా ఏ మూలనైనా పంపించారా? భక్తి మార్గంలో యాత్రలకు ఎంత దూరం నడుస్తారు! మీరు దూరంగా ఉన్నా తీసుకురావడానికి బస్సు వస్తుంది. హాయిగా వస్తున్నారు కదా! బ్రహ్మా బాబా ముందు అయితే ఈ కౌచ్‌లు(సోఫాలు), కుర్చీలు కూడా లేవు. ఇప్పుడు చూడండి, కౌచ్‌లు, కుర్చీలపై కూర్చున్నారు. ఎంత హాయిగా కూర్చున్నారు! శరీరాలు పాతవయ్యాయి కాబట్టి వాటికి సాధనాలు అవసరం అని బాప్‌దాదాకు కూడా తెలుసు. అయినప్పటికీ ఒక అభ్యాసం తప్పనిసరిగా ఉండాలి. ఏ సమయంలోనైనా సాధనాలు లేకపోయినా, సాధనలో విఘ్నం కలగకూడదు. ఏది లభించినా అది మంచిదే. కుర్చీ లభించినా మంచిదే, నేల లభించినా మంచిదే. అందరూ హాయిగానే ఉన్నారా? లేక మంచం కావాలా? ఇళ్లలో మంచంపై పడుకుంటారు కదా! ఇక్కడ నేలపై పడుకుంటే ఏమైంది? మార్పు కావాలి కదా! మార్పు కోసం ఎంత ఖర్చు చేసి వెళ్తారు! అక్కడ మంచంపై పడుకుంటారు, ఇక్కడ నేలపై పడుకుంటారు, మార్పు వచ్చింది కదా! ముందే చెప్పాం కదా, ఎంత సాధనాలు పెంచితే అంత సంఖ్య డబల్, ట్రిపుల్ అవుతుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు జ్ఞాన సరోవర్ నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం, జ్ఞాన సరోవర్ కూడా చిన్నదైపోయింది అంటారు. ఇది జరగాల్సిందే. ఎందుకంటే సేవను ముగించాలా? లేక కొనసాగించాలా? సంపన్నంగా చేసి సమాప్తి చేయాలి. మరి సంపన్నం ఎప్పుడు అవుతుంది? కనీసం 9 లక్షల మాల తయారైనప్పుడు.
పంజాబ్, హర్యానా, హిమాచల్:- అచ్ఛా, వీరు ఎన్ని మాలలు తయారు చేస్తారు? ఒక లక్షా, రెండా, మూడా? (4 లక్షలు) నాలుగు లక్షలు తయారు చేస్తారా! అప్పుడు బాగుంది. మిగతా జోన్లు ఆనందంగా ఉండండి, పంజాబ్ మాల తయారు చేస్తుంది. అచ్ఛా, ఇప్పటివరకు 50 వేల వరకు చేరిన జోన్ ఏదైనా ఉందా? ఏ జోన్‌లోనూ 50 వేలు లేరు. కనీసం ప్రతి జోన్ 50 వేలైనా తయారు చేయాలి. పంజాబ్ సంఖ్య ఎంత? (12 వేలు) చాలా బాగుంది. నాలుగు లక్షల లక్ష్యం పెట్టుకున్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ-కాశ్మీర్ - మొత్తం నాలుగు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో లక్ష తయారు చేస్తే పెద్ద విషయమేమిటి? కానీ ఎప్పటికి తయారు చేస్తారు? సత్యయుగ ఆది వరకు? లేక ఇప్పుడేనా? పంజాబ్ వారు సమీపతను మరింత సమీపానికి తీసుకువచ్చేవారు. సంపూర్ణతే సమీపతకు ఆధారం. కాబట్టి పంజాబ్ విశేషత ఏమిటంటే, తమను తాము సంపూర్ణంగా చేసుకొని అంతిమ సమయాన్ని సమీపానికి తీసుకురావడం. ధైర్యం ఉందా? ఎంతగా మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకుంటారో, అంతగా సంపూర్ణత, సమీపత దగ్గరకు వస్తాయి. ఎల్లప్పుడూ సమీపంగా ఉండేవారు, సమయాన్ని కూడా సమీపానికి తీసుకువచ్చేవారు. చూడండి, పంజాబ్ వారు ఒక విజయాన్ని సాధించారు. వాతావరణాన్ని మార్చారు. ఉగ్రవాద వాతావరణాన్ని మార్చారు. ఇప్పుడు సమాప్తిని తీసుకురావడంలో కూడా అంతే ధైర్యవంతులుగా అవ్వండి. పంజాబ్ అంటే ధైర్యవంతులు. శరీరంలోనూ, ఆత్మలోనూ. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావడం, సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు. బాబా సమానంగా అయ్యేవారే సమీపంగా ఉంటారు. కాబట్టి అటువంటి సమీప ఆత్మలుగా ఉండండి. ఈ స్మృతి శక్తితో ఎల్లప్పుడూ ముందుకు సాగండి. అర్థమైందా? అచ్ఛా.
బాంబే, నాగ్‌పూర్, పూణే, జల్గావ్ (మహారాష్ట్ర):- మహారాష్ట్ర వారు ఎన్ని మాలలు తయారు చేస్తారు? (5 లక్షలు) మహారాష్ట్రలో బాంబే కూడా ఉంది. బాంబేకు ‘నరదేశావర్’ అనే బిరుదు ఉంది. మరి డబ్బులోనే నరదేశావర్ అవుతారా? మాల మణులను తయారు చేయడంలో కూడా నరదేశావర్ అవ్వాలి. మరి మహారాష్ట్ర ఐదు లక్షలు తయారు చేస్తుందా! 9 లక్షలు పూర్తయ్యాయి కదా అని అనుకోకండి. పంజాబ్ నాలుగు లక్షలు తీసుకువస్తుంది, మహారాష్ట్ర ఐదు లక్షలు తీసుకువస్తుంది. తర్వాత ఎంపిక కూడా ఉంటుంది కదా! కొందరు త్రేతా ప్రజలుగా, కొందరు సత్యయుగ ప్రజలుగా ఉంటారు. అందుకే ఎక్కువగా తయారు చేయండి. మహారాష్ట్ర గొప్పతనం అంటే ఎల్లప్పుడూ విజయమే. గొప్పతనం విజయంలోనే ఉంది. ఎల్లప్పుడూ నిర్విఘ్న స్థితి ద్వారా విజయం సాధించే ఆత్మలు. విజయము నిశ్చితము అని భావించే నిశ్చయబుద్ధి విజయులు. ఎందుకంటే మీరు విజయులు కాకపోతే మరెవరు అవుతారు? అవ్వాల్సిందే. మహారాష్ట్ర ప్రజలను కూడా మహాన్‌గా తయారు చేయాలి. చిన్నచిన్నవారిని కాదు. పంజాబ్ ధైర్యవంతులైన ప్రజలను తయారు చేయాలి, బలహీనులను కాదు.
కర్ణాటక:- అచ్ఛా, కర్ణాటక వారు ఎన్ని మాలలు తయారు చేస్తారు? (రెండు లక్షలు) చాలా బాగుంది. కర్ణాటక వారికి స్నేహం అనే ఇంద్రజాలం చాలా త్వరగా పనిచేస్తుంది. జ్ఞానం పూర్తిగా అర్థమవుతుందో లేదో, కానీ స్నేహంలో నంబర్‌వన్. భాష కారణంగా జ్ఞానం సగమే అర్థమవుతుంది. కానీ స్నేహంలో నంబర్‌వన్. చూడండి, స్నేహానికి గుర్తు ఏమిటంటే, చాలా సెంటర్లు తెరుస్తున్నారు. ఇప్పుడు ఒకటి చేర్చాలి, నిర్విఘ్న ప్రజలను తయారు చేయాలి. నిర్విఘ్న రాజధానిని తయారు చేయాలి. కాబట్టి కర్ణాటక వారు ఏమి గుర్తుంచుకోవాలి? నిర్విఘ్న రాజ్యాధికారులను, నిర్విఘ్న సహయోగులను తయారు చేయాలి. వృద్ధిలో చాలా మంచివారు. కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఎంత స్నేహమో, అంతే నిర్విఘ్న స్థితి కూడా ఉండాలి. ఈ రెండింటి సమతుల్యతతో కర్ణాటక వారికి ఆశీర్వాదాలు సహజంగానే లభిస్తాయి. కాబట్టి కర్ణాటక వారు అండర్లైన్ చేసుకోండి — నిర్విఘ్న వృద్ధి. అచ్ఛా.
గుజరాత్:- గుజరాత్‌పై బాప్‌దాదాకు, దాదీలకు చాలా అధికారం ఉంది. ఏ పని వచ్చినా గుజరాత్‌పైనే అధికారం చూపుతారు. మరి గుజరాత్ విశేషత ఏమిటి? సేవలో కూడా అధికారి. సేవలో అధికారి అయితే రాజ్యంలో కూడా అధికారులే అవుతారు. చూడండి, సేవలో ‘హా జీ, హా జీ’ అంటారు కదా! మరి రాజ్యంలో ఏమవుతుంది? జీ హజూర్, జీ హజూర్. సహయోగం ఇవ్వడంలో నంబర్‌వన్. ఎందుకంటే డ్రామా అనుసారంగా సమీప భాగ్యం లభించింది. ఇప్పుడు గుజరాత్‌కు, ప్రతి ఒక్కరూ ఒక్కో బస్సు సిద్ధం చేసి రండి అని చెబితే ఎన్ని బస్సులు వస్తాయి? చాలా వస్తాయి కదా! ఎవరెడీ సంఖ్య ఉంది కదా! మహారాష్ట్రను, దూర ప్రాంతాలను పిలిస్తే దూరం కారణంగా కష్టం అవుతుంది. కానీ గుజరాత్‌కు ఆ భాగ్యం ఉంది. సేవలో బాధ్యతలు తీసుకునే వారూ చాలా మంచివారు. పదేపదే అడిగేవారు కాదు. బాధ్యత తీసుకోవడంలో ముందుంటారు. ఇది కూడా డ్రామాలో సహజంగా లభించిన భాగ్యమే. ఆర్డర్ ఇస్తే వెంటనే సిద్ధమవుతారు. (దాదీతో) ఇప్పుడు చూడండి, మేళా గురించి మీరు నిశ్చింతగా ఉన్నారు కదా! ఎందుకంటే గుజరాత్ బాధ్యత తీసుకుంది. కాబట్టి బాధ్యత అనే కిరీటాన్ని ధరించిన పిల్లలను చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తారు.
భోపాల్:- భోపాల్ సంఖ్య ఎంత? (5 వేలు) చాలా తక్కువ. మరి ఏమి చేస్తారు? ఐదు వేల ముందు ఒక బిందువు పెడతారు. మంచి ప్రజలను తీసుకువస్తారు కదా! చాలా బాగుంది. ఎల్లప్పుడూ విధి ద్వారా సహజ వృద్ధిని పొందే శ్రేష్ఠ ఆత్మలు. త్వరగా వృద్ధిని సాధిస్తారు కదా! అయినప్పటికీ సేవా సాధనాలు మంచివి ఉన్నాయి. ఇద్దరు, నలుగురు మంచి మైకులను తయారు చేస్తే, బిందువు పెట్టడం కష్టమేమీ కాదు. మంచి అవకాశం ఉంది. చూడండి, సెంట్రల్ ప్రభుత్వం వారు మీకు సమయాన్ని ఇవ్వడం కష్టం, స్టేట్ వారు సమయాన్ని సులభంగా ఇస్తారు. సంబంధ-సంపర్కాల ద్వారా సులభంగా దగ్గరవ్వచ్చు. అందుకే మైకులను తయారు చేయండి. ఒక మైక్ వెనుక అనేక ఆత్మలు సులభంగా వస్తాయి. ఒకరి స్వరం ద్వారా అనేకమందికి కళ్యాణం జరుగుతుంది. వారిని కేవలం స్నేహితులు, పరిచయస్తులుగా కాకుండా, దగ్గరి సంబంధీకులుగా చేయండి. మరి భోపాల్ వారు మైకులను తయారు చేసి తీసుకువస్తారా? లేక ఇప్పటికే సిద్ధంగా ఉన్నారా? తీసుకురాగలరు. మంచి అవకాశం ఉంది. సంబంధం ఉంది. కానీ మరింత దగ్గరి సంబంధం కావాలి. ఎల్లప్పుడూ శ్రేష్ఠ విధి ద్వారా వృద్ధిని పొందేవారిగా ఉండండి. అర్థమైందా? మీ విశేషత ఏమిటి? సహజ వృద్ధిని చేసేవారు. అచ్ఛా.
రాజస్థాన్:- రాజస్థాన్‌లో ఆబూ వారు కూడా ఉన్నారా? లేక వేరా? ఇది సెంట్రల్. అది సెంటర్. ప్రధాన కేంద్రం రాజస్థాన్‌లోనే ఉంది. ఇది రాజస్థాన్ గొప్పతనం. లైట్ హౌస్ కూడా రాజస్థాన్‌లోనే ఏర్పడింది కదా! ఇప్పుడు సెంట్రల్లో లైట్ హౌస్ ఉంది. మరి సెంటర్లలో ఏముంది? లైట్ ఉందా? లేక లైట్ హౌస్ ఉందా? జైపూర్ లైట్ మాత్రమేనా? లేక లైట్ హౌస్‌నా? ఎన్ని చోట్ల వెలుగు ఇచ్చారు? లైట్ హౌస్ పని ఏమిటి? చుట్టుపక్కలకే వెలుగు ఇవ్వడమా? లేక నాలుగు దిక్కులకూ వెలుగు ఇవ్వడమా? నాలుగు దిక్కులకూ వెలుగు ఇస్తుంది కదా! కాబట్టి రాజస్థాన్ మొత్తం వెలుగుతో నింపాలి. జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ మొదలైన చోట్ల వెలుగు వెలిగించారు. ఇప్పుడు లైట్ నుండి లైట్ హౌస్‌లుగా అవ్వండి. రాజస్థాన్‌లో ఒక్క ప్రాంతం కూడా ఎండిపోయినట్టుగా మిగలకూడదు. రాజస్థాన్‌ను ఎడారి అంటారు. కానీ బ్రాహ్మణ జీవితంలో అత్యంత పచ్చగా, సస్యశ్యామలంగా ఉండేది రాజస్థానే. రాజస్థాన్‌లో ఇసుక ఉంది అంటారు కదా! ఆ ఇసుక స్థానంలో బంగారు మహళ్లు తయారవుతాయి. అవ్వాల్సిందే కదా! కాబట్టి ఇసుకను బంగారంగా మార్చండి. రాజస్థాన్ ఏమి చేస్తుంది? బంగారం వంటి ఆత్మలను తయారు చేస్తుంది. బంగారు మహళ్లు కూడా తయారు చేస్తుంది. చూడండి, ఢిల్లీలో రాజధాని ఏర్పడుతుంది కదా! రాజస్థాన్ ఎంత దగ్గరగా ఉంది. అక్కడ కూడా ఏర్పడుతుంది కదా! కాబట్టి రాజస్థాన్ మట్టిని బంగారంగా మారుస్తుంది. అంత ఉత్సాహం ఉందా? రాజస్థాన్‌ను పరిస్తాన్గా మార్చేవారు. నాలుగు దిక్కులా పరిస్తాన్ సువాసన వ్యాపించాలి. సంఖ్యను పెంచండి. సంఖ్యతో పాటు మైకులను కూడా తయారు చేయండి. ప్రతి రాష్ట్రం మంచి మైకులను తయారు చేయాలి. చిన్న మైక్ అయినా సరే, పెద్ద మైక్ అయినా సరే. చూడండి, రాజస్థాన్ మైక్ ఎంత కమాల్ చేసింది! ఈ రోజు జ్ఞాన సరోవర్‌లో మైక్‌నే పని చేసింది కదా! కాబట్టి ప్రతి రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటక మొదలైనవన్నీ మైకులను తయారు చేయాలి. ప్రతి రాష్ట్రం నుండి మైకులు కలిస్తే ఒక సంగఠన ఏర్పడుతుంది. సంగఠన ధ్వని సులభంగా వ్యాపిస్తుంది. కాబట్టి రాజస్థాన్ వారు మాలను కూడా తయారు చేయాలి, మైకులను కూడా తయారు చేయాలి. అచ్ఛా.
ఆగ్రా:- ఆగ్రా వారు ఏమి చేస్తారు? ఆగ్రాలో మట్టి, ఇటుకలతో చేసిన తాజ్ మహల్ ఎలా ఆకర్షిస్తుందో, అలాగే ఆగ్రా గురించి, ఇక్కడ తాజ్ మహల్ మాత్రమే కాదు, కిరీటధారులు కూడా గుప్త వేషంలో ఉన్నారు అని ప్రసిద్ధి చెందాలి. ప్రజలు తాజ్ మహల్‌ను మాత్రమే చూడడానికి కాకుండా, ఆ కిరీటధారులు ఎక్కడున్నారు? అని వెతుకుతూ రావాలి. అంతటి ఆకర్షణ కలిగిన కిరీటధారులుగా ఉండాలి. ఇక్కడ గుప్త వేషంలో కొన్ని శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు అనే వైబ్రేషన్స్ రావాలి. ద్వాపరంలో ఋషి మునులు సతోప్రధాన స్థితిలో ఉండేవారు కాబట్టి దూరం నుంచే వారి ప్రభావం ఉండేది. వారినే వెతుక్కుంటూ వెళ్లేవారు. వారు ఎవరినీ పిలిచేవారు కాదు. మరి ఆత్మజ్ఞానం కలిగిన ఋషి మునులు ఆకర్షించగలిగితే, పరమాత్మ జ్ఞానులు ఎందుకు ఆకర్షించలేరు? కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము కిరీటధారులుగా, బాధ్యతగలవారిగా భావించాలి. ప్రజలను ఆకర్షించి బాబా వారిగా చేయడం నా బాధ్యత. నావారిగా కాదు, బాబావారిగా చేయాలి. కాబట్టి ఆగ్రా వారు ఈ నవీనతను చూపించండి. అందరి దృష్టి మీవైపు వెళ్లాలి. అర్థమైందా? వజ్రాలను తయారు చేయండి. కిరీటంలో ఉన్నవి నకిలీ వజ్రాలు. మీరు నిజమైన వజ్రాలను తయారు చేయండి. అచ్ఛా.
నేపాల్:- నేపాల్‌ను దేశమని కూడా అంటారు, విదేశమని కూడా అంటారు. అందువల్ల డబల్ ప్రయోజనం పొందుతున్నారు. డబల్ విదేశీయుల టర్న్ వచ్చినప్పుడు, మేము విదేశీయులం అని అంటారు, ఇండియా టర్న్ వచ్చినప్పుడు, మేము ఇండియన్స్ అని అంటారు. డబల్ ఛాన్స్ తీసుకుంటారు. అచ్ఛా. నేపాల్‌లో కూడా భావనగలవారు చాలా మంది ఉన్నారు. ప్రేమతో వినేవారు కూడా మంచివారు. నేపాల్ నేలలో కూడా భావన చాలా మంచిగా ఉంది. రెండవ విశేషత ఏమిటంటే, ఎక్కువ విషయాలలో తలదూర్చరు; తమలో తాము ఆనందంగా ఉంటారు. గందరగోళం చాలా తక్కువ చేస్తారు. అందుకే వృద్ధి కూడా బాగా జరుగుతోంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. చాలా మంచిదని అనము, కానీ మంచిగా ఉంది. నేపాల్వారు కూడా ఇంకా మైక్‌లను తయారు చేయలేదు. సహయోగులు, సమయం వచ్చినప్పుడు సహయోగం ఇస్తారు. కానీ సన్నిహిత సంబంధంలోకి తీసుకురావడం ద్వారా బిగ్గరగా ధ్వని వస్తుంది. ఇప్పుడైతే చిన్న స్వరమే వినిపిస్తుంది; అది నేపాల్‌లోనే వ్యాపిస్తుంది. బిగ్గరగా ధ్వనిని వినిపించే వారిని తయారు చేయండి. ప్రతి స్టేట్‌లో ఇద్దరు, ముగ్గురు మైక్‌లు కూడా తయారైతే ఎంత శోభగా ఉంటుంది! అప్పుడు మీరంతా సేవ చేయడానికి అంత శ్రమపడాల్సిన అవసరం ఉండదు. మీరు లైట్‌గా ఉంటారు, వారు మైక్లుగా ఉంటారు. మీరు కేవలం లైట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు లైట్ కూడా ఇస్తున్నారు, మైక్ కూడా అవుతున్నారు. అప్పుడు మైక్‌లు వారవుతారు, మీరు లైట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి సేవలో ఒక కొత్త మలుపు తీసుకురండి. నవీనత తీసుకురండి. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా! విదేశాల నుండి కూడా ప్రతి దేశం నుండి రావాలి, ఇక్కడి ప్రతి స్టేట్ నుండి కూడా రావాలి. కానీ మైక్‌లను తయారు చేయండి. అప్పుడు మైక్‌ల దర్బార్ ఏర్పడుతుంది. ఇంతమంది మైక్‌లు ఒకచోట చేరితే స్వరం కూడా బిగ్గరగా అవుతుంది. కాబట్టి ఇటువంటి నవీనతతో కూడిన ప్రోగ్రామ్ చేయండి. ముందుగా మైక్‌లను తయారు చేసి, తరువాత తేదీ నిర్ణయించండి. కానీ ఏ మూల, ఏ స్టేట్ కూడా మిగిలిపోకూడదు. ఎక్కడైనా ధ్వని బిగ్గరగా చేయాలంటే నాలుగు వైపులా మైక్‌లు పెడతారు కదా! అలా నాలుగు వైపులా మైక్‌లు ఉంటే ధ్వని చాలా పెద్దదిగా వినిపిస్తుంది. మైక్‌లన్నీ ఒకే స్వరం మాట్లాడితే నాలుగు వైపులా ఒకే స్వరం వినిపిస్తుంది – ఇదే ప్రత్యక్షత జెండా. కాబట్టి ఇప్పుడు తయారీ చేయండి. మరి అన్ని జోన్లవారు, మాకు కూడా వరదానం లభించింది అని సంతోషపడటం మాత్రమే కాదు, వెళ్లి సేవ చేయండి. ఢిల్లీ వారు ముందుగా చేయాలి. ఢిల్లీ, బాంబే – ఈ రెండూ కూడా పేరు తెచ్చే జోన్లు. అందరూ, నిజంగానే పరివర్తకులు మీరే అని చెప్పేలా అద్భుతాన్ని చేసి చూపించండి. వీరూ ఉన్నారు - కాదు, వీరే ఉన్నారు అని అనాలి. ఇప్పుడు, వీరూ ఉన్నారు, వారూ ఉన్నారు, వీరూ మంచివారు అంటున్నారు. వీరే మంచివారు అన్న ధ్వని వినిపించినప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. అనేకులు కాదు, ఒక్కరే. మరి అన్ని జోన్లవారు ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కొందరు మనసా సేవ చేయండి, కొందరు వాచా సేవ చేయండి. మనసా సేవ అయితే అందరూ చేయగలరు కదా! కాబట్టి వైబ్రేషన్లు వ్యాపింపజేయండి. వాణి ద్వారా కాకపోయినా, మనసా ద్వారా మీ సహయోగాన్ని అందించండి. అందరి వేలు అవసరం. అర్థమైందా? అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు అంటే దూరదేశీయులు మరియు దూరాందేశీ (దూరదృష్టి కలిగినవారు). భారతదేశంలో సందేశం ఇచ్చేవారిని దర్వేశ్ అని కూడా అంటారు. కాబట్టి డబల్ విదేశీయులు దూరాందేశీ బుద్ధి కలిగినవారు. దూరాందేశీ బుద్ధి అంటే ప్రతి పరిస్థితిని, ప్రతి విషయాన్ని ఆది-మధ్య-అంతం అనే మూడు కాలాల దృష్టితో తెలుసుకొని చూసేవారు. మరో మాటలో చెప్పాలంటే త్రికాలదర్శులు. కాబట్టి ఏ పని చేసినా త్రికాలదర్శిగా చేయాలి. ఒక కాలాన్ని మాత్రమే చూడకూడదు. మూడు కాలాలను తెలుసుకొని, అర్థం చేసుకొని, వాటి ప్రకారం నడుచుకునేవారినే దూరాందేశీ బుద్ధిగలవారు అంటారు. ఏ పని చేసినా మూడు కాలాలను తెలుసుకొని చేసేవారు ఎప్పుడూ భ్రమించరు. వారు ఎల్లప్పుడూ విజయం పొందుతారు. సహజ విజయం. శ్రమపడి గెలవడం కాదు. శ్రమపడి విజయం సాధిస్తే ఆ శ్రమలోనే సగం ఆనందం పోతుంది. కానీ సహజంగా విజయం లభిస్తే నషా, సంతోషం, మజా అన్నీ ఉంటాయి. మరి డబల్ విదేశీయులు త్రికాలదర్శులా? లేక ఒకకాలదర్శులా? తొందరపాటులో ఒక కాలాన్ని మాత్రమే చూసి పని చేయడం లేదు కదా! త్రికాలదర్శి అంటే ఆలోచించి, అర్థం చేసుకొని పని చేసేవారు. తొందరలో కేవలం వర్తమానాన్ని చూసి పని చేస్తే మోసపోతారు. కానీ త్రికాలదర్శులై పని చేస్తే విజయం సహజంగానే లభిస్తుంది. కాబట్టి సహజ విజయాన్ని పొందేవారు త్రికాలదర్శులు, అంటే దూరాందేశీ బుద్ధిగలవారు. అర్థమైందా?
మధుబన్ నివాసులు:- (బాప్‌దాదా ఆబూలోని వివిధ సేవా స్థానాలలో సేవ చేస్తున్న సోదరసోదరీలను చేతులు ఎత్తమని చెప్పారు) చూడండి, పీస్ పార్క్ కూడా తక్కువేమీ కాదు. లండన్, అమెరికా అన్నీ మరిచిపోతారు. పీస్ పార్క్‌ను చూసినవారు దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత అనుకరించినా, ఆత్మీయత యొక్క దృశ్యం రాదు, ప్రేమ యొక్క దృశ్యం రాదు. కాబట్టి శ్రమకు ఫలితం లభిస్తోంది. శ్రమను కూడా ఎంతో ప్రేమతో చేశారు కదా! కేవలం నీరు మాత్రమే పోయలేదు, ప్రేమ అనే నీటిని కూడా పోశారు. అందుకే అక్కడి వాతావరణం అతీతంగా, ప్రియంగా ఉంది. అలాగే జ్ఞాన సరోవర్ వారు కూడా ఎంతో ప్రేమతో శ్రమ చేస్తున్నారు. మంచి ఫలితం ఉంది. నిశ్చయబుద్ధిలో అయితే అందరికన్నా నంబర్‌వన్. ఎంతమంది వెళ్లి, ఇది సిద్ధం కాదు, సిద్ధం కాదు అని చెప్పినా, వారు ఎంత ‘కాదు’ అన్నారో, వీరు అంత ‘అవును’ అన్నారు. అందుకే నిశ్చయానికి విజయం లభిస్తుంది. సిద్ధం అవ్వాల్సిందే, బాబా రావాల్సిందే. అందుకే మీ నిశ్చయానికి అభినందనలు. అచ్ఛా. తలహటి వారు కూడా ఉల్లాసంలోకి వచ్చారు. మిలన మేళాను నిర్వహించడానికి తయారీ చేస్తున్నారు. అచ్ఛా, శోభ ఉండాలి కదా! ఏదైనా నవీనత ఉండాలి కదా! ఓం శాంతి భవన్ హాల్లో అయితే ఎప్పుడూ కూర్చుంటూనే ఉంటారు. కానీ నవీనత కూడా కావాలి కదా! ఎంతోమంది ఆత్మల సంకల్పం నెరవేరుతుంది! ఫిర్యాదులు కూడా తగ్గిపోతాయి. మరి తలహటిలో తయారీ బాగా జరుగుతోందా? పెద్ద విషయంగా అనిపించడం లేదు కదా! సంతోషంలో కష్టమైనదీ సహజంగా అనిపిస్తుంది. అచ్ఛా. ఆబూ నివాసులు ఏమి చేస్తున్నారు? సహయోగం అందిస్తున్నారు. ఎప్పుడైనా ఏ పని వచ్చినా ఆబూ నివాసులు దానిని పూర్తి చేస్తారు. అచ్ఛా. మ్యూజియం కూడా మంచి సేవ చేస్తోంది. మ్యూజియం సేవాధారి పిల్లలు కూడా ఎంతో శ్రమ చేస్తున్నారు. మ్యూజియం అంటే నడిచే, తిరిగే సేవా స్థానం. ఈ మ్యూజియం కూడా ఎంతమంది సేవాకేంద్రాలను ప్రారంభించి ఉంటుంది! ఎన్నో ఆత్మల ధరిణిని పరివర్తన చేసింది. ఇక్కడి ప్రభావం అక్కడి కేంద్రాలలో కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వారు స్వేచ్ఛగా ఉంటారు. బుద్ధి కూడా స్వేచ్ఛగా ఉండడం వల్ల ప్రభావం బాగా పడుతుంది. తరువాత అదే అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యూజియం సేవ కూడా తక్కువేమీ కాదు. అన్ని స్థానాల సేవ కూడా మంచిదే. ఇక్కడ (ఓం శాంతి భవన్లో) గ్రూపులకు వివరించేవారి సేవ కూడా మంచి సేవే. ఇలా అన్ని చోట్ల సేవ సహజంగా జరుగుతోంది, ప్రభావం కూడా పెరుగుతోంది. అచ్ఛా.
అచ్ఛా, మధుబన్వారు ఏమి చేస్తారు? మధుబన్వారు ఎల్లప్పుడూ తమను తాము ఆధారమూర్తులు, ఉదాహరణమూర్తులు అని భావించాలి. సాకార కర్మలో మధుబన్ నివాసులు ఉదాహరణలు, అలాగే ఆధారమూర్తులు కూడా. ఎందుకంటే ఆత్మీయ సాధనాలన్నీ మధుబన్ నుండే వెళ్తాయి. అందువల్ల మధుబన్వారు ‘మేము మధుబన్ గదుల్లో ఉన్నాము లేదా ‘పాండవ్ భవన్లో ఉంటున్నాము’ అని భావించకూడదు. ప్రతి కర్మలో, ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో ఆధారమూర్తులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కర్మలో, వాణిలో చూసే విశేషతను ప్రాక్టికల్‌గా మధుబన్లోనే చూస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ ఆధారమూర్తులుగా, ఉదాహరణమూర్తులుగా ఉండండి. మంచి చేసినా ఉదాహరణగా అవుతారు; మిక్స్ చేసినా ఉదాహరణగా అవుతారు. ఉదాహరణలు ఎల్లప్పుడూ మధుబన్వారినే ఇస్తారు. అందుకే ఈ పెద్ద బాధ్యత అనే కిరీటము మధుబన్ నివాసులపై ఉంది. అచ్ఛా. సంగమ్ భవన్ వారు కొద్దిమందే ఉన్నా, ఎంతో అలుపెరుగని సేవ చేస్తున్నారు. సంగమ్ నివాసులు పరుగుపరుగున చేసే పనిని బాగా నిర్వహిస్తున్నారు.
అచ్ఛా, హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్ చాలా బాగుందా? లేక బాగుందా? చూడండి, హాస్పిటల్ విశేషత ఏమిటంటే, సాధారణంగా రోగులు రాకూడదని అనుకుంటారు. కానీ హాస్పిటల్ మాత్రం రోగులు రావాలని కోరుకుంటుంది. రోగులు రాకపోతే నిరాశ చెందుతుంది. రోగులను సహనశీలులుగా చేస్తుంది. కాబట్టి హాస్పిటల్‌కు కేవలం రోగులే కాదు, సహనశక్తిని అలవరచుకునే రోగులు కూడా వస్తారు. అచ్ఛా. హాస్పిటల్ వల్ల అత్యధిక ప్రయోజనం బ్రాహ్మణులకే ఉంది. అంబులెన్స్‌లో కూర్చొని వెంటనే చేరిపోతారు. ఇది మంచి సహయోగం. ఒకవైపు బ్రాహ్మణులకు సహాయం, మరోవైపు, వీళ్లు ఏమీ చేయరు అనుకునేవారు కూడా, అవును, వీళ్లు చాలా చేస్తున్నారు అని భావిస్తారు. హాస్పిటల్ సేవను పెంచింది కదా! ఏమీ చేయరు అనే భావనను చేస్తున్నారు అనే భావనగా పరివర్తన చేసింది. అలాగే ఉంది కదా! అచ్ఛా. హాస్పిటల్వారికి సమయం దొరికితే మనసా సేవ చాలా చేయండి. దానితో సమయం దొరకదు. అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ నిశ్చయబుద్ధి శ్రేష్ఠ ఆత్మలకు, సదా నిశ్చిత విజయీ ఆత్మలకు, సదా నిశ్చింత ఆత్మలకు, సదా శ్రేష్ఠ విధి ద్వారా వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అయ్యే విశేష ఆత్మలకు, సదా ఒకే తండ్రి, ఒకే బలము, ఒకే భరోసాలో చలించకుండా-స్థిరంగా ఉండే సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీజీ బాంబే, అహ్మదాబాద్‌కు మరియు జానకి దాదీ పూణే సేవకు వెళ్లి వచ్చారు) చక్కర్లు వేసి వచ్చారు. సంతుష్టతను కలిగించే సంతుష్ట మణులు మీరు. కాబట్టి సంతుష్ట మణులు ఎక్కడికి వెళ్లినా సంతుష్టతను కలిగిస్తారు కదా! శరీర సంబంధమైన వారినైనా, మనస్సుకు సంబంధించిన వారినైనా, రెండు విధాలుగా సంతుష్టులను చేస్తారు. అందుకే బాప్‌దాదా ఎల్లప్పుడూ సంతుష్ట మణులు అని అంటారు. (అందరి ప్రియస్మృతులు అందించారు) మంచిది. ప్రియస్మృతుల బుట్టను నింపుకొని వచ్చారు. ప్రతి అడుగులో పదమాలు నిండి ఉన్నాయి. అందుకే మీరు చక్కర్లు వేయడం ద్వారా అనేకమంది యొక్క చక్కర్లు సమాప్తమవుతాయి. ఎవరికి ఏమి కావాలో అది లభిస్తుంది. అందుకే అనేకమంది వ్యర్థ చక్కర్లు సమాప్తమవుతాయి. అలాగే అనుభవమవుతోంది కదా! దాదీలపై అందరికీ ప్రేమ ఉంది కదా! ఎవరెవరు నిమిత్తులో వారందరిపైనా ప్రేమ ఉంది. (దాదీ జానకి) మంచిది. దృఢ నిశ్చయంతో అన్నీ సరిగా అయిపోతాయి. సంస్కారాలు ఎంత కఠినంగా ఉన్నా, ఎక్కడ దృఢత్వం ఉంటుందో అక్కడ అవన్నీ ఒక్కసారిగా మైనం వలె సమాప్తమైపోతాయి.
జగదీష్ అన్నయ్యతో:- ఇప్పుడు ఏ నవీనత చేస్తారు? (మైక్‌లను తయారు చేయడానికి విశాల ప్రోగ్రామ్) ఒక్కసారి అన్ని మూలల నుండి ఒకేసారి ధ్వని వస్తే అది బిగ్గరగా అవుతుంది. హా జీ, హా జీ అంటూ ముందుకు సాగండి. చివరకు అందరూ హా జీ అనాల్సిందే. విదేశాలవారు దేశంవారికి హా జీ అనాలి, దేశంవారు విదేశాలవారికి హా జీ అనాలి. ఎక్కడ హా జీ ఉంటుందో అక్కడ కార్యం జరిగిపోయినట్లే.
సాధనం చాలా మంచిది. కేవలం బాలకులుగా మరియు యజమానులుగా అవ్వడం రావాలి. సమయానికి బాలకులు, సమయానికి యజమానులు. అందరికీ అవ్వడం వచ్చా? లేక బాలకులుగా అవ్వాల్సిన సమయంలో యజమానితనం వచ్చేస్తుందా? కాబట్టి హా జీ అనే పాఠాన్ని ఎవరు దృఢంగా చేసుకున్నారో బాప్‌దాదా చూస్తారు. అందరూ చేస్తారు, అలా చేయరని కాదు. కానీ కార్యం సమయంలో చూస్తాము. అచ్ఛా!
(దాదీ చంద్రమణి అలహాబాద్ కుంభమేళాకు వెళ్తున్నారు) మీకు చాలా మంచి సీటు లభించింది. చక్కర్లు వేస్తూ ఉండండి, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండండి. ఇతరులను కూడా ఆనందంలోకి తీసుకువస్తూ ఉండండి.
అచ్ఛా, పాండవులు మరియు శక్తులు ఇద్దరి సంగఠన మంచిగా ఉంది. శక్తులు లేకుండా పాండవులు నడవలేరు. పాండవులు లేకుండా శక్తులు నడవలేరు. ఆది నుండి అంతం వరకు ఇద్దరి అవసరం ఉంది, అలాగే ఉంటుంది.
అచ్ఛా, ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చినా, అందరూ అత్యంత భాగ్యవంతులు, శ్రేష్ఠులు, బాబాకు ప్రియమైనవారు. విదేశాల నుండి వచ్చినా, దేశం నుండి వచ్చినా ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారే. అందరూ బాబాకు అలంకారం. మీరు లేకుండా బాబా ఏమీ చేయలేరు. అందుకే బాప్‌దాదా కూడా ముందుగా పిల్లలు అని అంటారు. మరి ప్రతి ఒక్కరూ నేను ప్రియమైనవాడిని అని భావిస్తున్నారా? ఒక్క అనంతమైన బాబాయే అందరికీ ప్రేమ ఇవ్వగలరు. ఆత్మలు ఇవ్వలేవు, బాబా ఇవ్వగలరు. ఎందుకంటే బాబా అనంతమైనవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను బాబాకు ప్రియమైనవాడిని అని భావించాలి. పేరు చెప్పినా, చెప్పకపోయినా అందరూ ప్రియమైనవారే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
