‘‘శివజయంతి యొక్క కానుక - శ్రమను వదిలి ప్రేమ అనే ఊయలలో ఊగండి’’
ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన తమ పిల్లలతో తమ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. స్వయం తండ్రి కలుసుకునేందుకు మరియు జరుపుకునేందుకు వచ్చారంటే పిల్లలది ఎంతటి భాగ్యము. ప్రపంచములోనివారైతే పిలుస్తూ ఉంటారు - రండి, ఎప్పుడు వస్తారు, ఏ రూపములో వస్తారు, ఆహ్వానిస్తూ ఉంటారు కానీ పిల్లలైన మీ విషయములో స్వయంగా తండ్రి జరుపుకునేందుకు వచ్చారు. ఇటువంటి విచిత్ర దృశ్యాన్ని ఎప్పుడూ స్వప్నములో కూడా ఆలోచించి ఉండరు, కానీ ఈరోజు సాకార రూపములో జరుపుకునేందుకు పరుగు-పరుగున వచ్చి చేరుకున్నారు. తండ్రి కూడా నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షితులవుతారు - వాహ్, సాలిగ్రామ పిల్లలూ వాహ్! వాహ్ సాకార స్వరూపధారి ఫరిశ్తాల నుండి దేవతలుగా కాబోయే పిల్లలూ వాహ్. భక్తులైన పిల్లలకు మరియు జ్ఞానీ ఆత్మలైన పిల్లలకు మధ్యన ఎంత వ్యత్యాసము ఉంది. భక్తులు భావన యొక్క అల్పకాలికమైన ఫలాన్ని పొంది సంతోషపడిపోతారు. వాహ్-వాహ్ యొక్క పాటలను పాడుతూ ఉంటారు, కానీ జ్ఞానీ ఆత్మలైన పిల్లలైన మీరు కేవలం కొద్దిపాటి అల్పకాలిక ఫలాన్ని పొందరు, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని వారసత్వానికి అధికారులుగా అవుతారు. కనుక భక్త ఆత్మలకు మరియు జ్ఞానీ ఆత్మలైన పిల్లలకు మధ్యన ఎంత వ్యత్యాసము ఉంది! శివజయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు మరియు మీరు కూడా జరుపుకోవటానికే వచ్చారు కానీ జరుపుకోవటంలో ఎంత తేడా ఉంది! శివజయంతిని జరుపుకోవటానికే వచ్చారు కదా! పరుగు-పరుగున వచ్చారు. కొందరు అమెరికా నుండి, కొందరు లండన్ నుండి, కొందరు ఆస్ట్రేలియా నుండి, కొందరు ఆసియా నుండి ఎంత స్నేహంతో వచ్చి చేరుకున్నారు. ఇది తండ్రి జయంతితోపాటు పిల్లల జయంతి కూడా, కనుక తండ్రితోపాటు పిల్లల జయంతికి కూడా బాప్‌దాదా నుండి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సాకార ప్రపంచములో పిల్లలు లేకుండా బాబా ఒంటరిగా ఏ కార్యాన్నీ చెయ్యలేరు. పిల్లలపై అంత ప్రేమ ఉంది. ఒంటరిగా చెయ్యనే చెయ్యలేరు. ముందుగా పిల్లలను నిమిత్తం చేస్తారు, ఆ తరువాత వెన్నెముకగా అయ్యి, కంబైండుగా అయ్యి, చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తారు. సాకార ప్రపంచములో ఒంటరిగా, పిల్లలు లేకుండా ఉండటము బాబా ఇష్టపడరు. నిరాకారీ ప్రపంచములోనైతే పిల్లలైన మీరు బాబాను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. బాబా ఆజ్ఞతోనే వెళ్తారు కానీ సాకార ప్రపంచములో బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. పిల్లలు తప్పకుండా తోడు ఉండాలి. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అన్నది పిల్లల ప్రతిజ్ఞ కూడా కానీ నిరాకారీ ప్రపంచము వరకు.
పిల్లలందరికీ తండ్రి జయంతిని జరపాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఎంత ఉన్నాయి అనేది బాప్‌దాదా చూస్తున్నారు. అందుకే బాబా కూడా చూడండి, పిల్లల స్నేహములో మీతోపాటు సాకార శరీరాన్ని అద్దెకు తీసుకుని వచ్చి చేరుకున్నారు. దీనినే అలౌకిక ప్రేమ అని అంటారు. పిల్లలు బాబా లేకుండా ఉండలేరు మరియు బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. ప్రేమ కూడా ఎంతగానో ఉంది, అలాగే ఎంతో అతీతంగా కూడా ఉంటారు, అందుకే బాబాకు అతీతము మరియు ప్రియము అనే మహిమ ఉంది. పిల్లలు బాబా కోసం అనేక రకాల కానుకలను తీసుకొచ్చారు, కార్డులు, వస్తువులు, మనసులోని ఉల్లాసముతో కూడిన ఉత్తరాలు ఏవేవైతే బాబా దగ్గరకు తీసుకొచ్చారో, వాటన్నింటి యొక్క మ్యూజియం ఈరోజు వతనములో పెట్టడం జరిగింది. మీ మ్యూజియం సేవది మరియు బాబా మ్యూజియం స్నేహముది. కనుక అందరూ వేటినైతే తీసుకొచ్చారో లేక పంపించారో, అందరి స్నేహ సంపన్న కానుకలు బాబా వద్ద ఇప్పుడు కూడా మ్యూజియంలో పెట్టి ఉన్నాయి. వాటిని చూస్తూ-చూస్తూ బాబా సంతోషిస్తూ ఉంటారు. వస్తువు పెద్దది కాదు కానీ ఎప్పుడైతే వస్తువులో స్నేహము నిండుతుందో అప్పుడు ఆ చిన్న వస్తువు కూడా చాలా గొప్పదిగా అవుతుంది. బాప్‌దాదా వస్తువును చూడరు, కాగితపు కార్డును లేక ఉత్తరాన్ని చూడరు, అందులో నిండి ఉన్న హృదయపూర్వకమైన స్నేహాన్ని చూస్తారు, అందుకే బాబా వద్ద స్నేహము యొక్క మ్యూజియం ఉంది అని అన్నారు. ఇటువంటి మ్యూజియం మీ ప్రపంచములో లేదు. ఉందా ఇటువంటి మ్యూజియం? లేదు. బాబా ఒక్కొక్క ప్రేమపూర్వకమైన కానుకను చూస్తూ ఉంటే, ఆ కానుకను చూడగానే అందులో పిల్లల ముఖం కనిపిస్తుంది. మీ దగ్గర ఇలాంటి కెమేరా ఉందా? లేదు. కానుకలను చూస్తుంటే బాప్‌దాదాకు ఒక శుభ సంకల్పం వచ్చింది, చెప్పమంటారా? అది చేయాల్సి ఉంటుంది. చేస్తారా, సిద్ధంగా ఉన్నారా? ఆలోచించకూడదు.
బాప్‌దాదాకు ఈ సంకల్పం వచ్చింది - ఈ కానుకలైతే బాబా వద్దకు చేరుకున్నాయి, కానీ వీటితోపాటు బాప్‌దాదాకు మరొక కానుక కావాలి. మీ కానుకలు చాలా బాగున్నాయి కానీ బాప్‌దాదాకు ఇంకొకటి కూడా కావాలి. మరి ఆ కానుకను ఇస్తారా? ఆ మాటకొస్తే ఈ స్మృతి చిహ్నాన్ని ఏదైతే జరుపుకుంటున్నారో, శివజయంతి అనగా ఏదో ఒకటి అర్పణ చేస్తారు. బలిహారమవుతారు. కావున బాప్‌దాదా ఆలోచించారు, బలిహారమైతే పిల్లలందరూ అయ్యారు. బలిహారమయ్యారా లేక ఇప్పుడింకా కొద్ది-కొద్దిగా మీ వద్ద జాగ్రత్తగా పెట్టుకున్నారా? ఈరోజున వ్రతము కూడా పెట్టుకుంటారు. కావున బాప్‌దాదాకు సంకల్పము వచ్చింది, అదేమిటంటే పిల్లలు నడుస్తూ-నడుస్తూ అప్పుడప్పుడు కాస్త అలసిపోతారు, చాలా శ్రమను అనుభవం చేస్తారు లేదా నిరంతర యోగాన్ని జోడించటాన్ని కష్టంగా అనుభవం చేస్తారు. అయిపోతుందిలే అని ఆలోచిస్తారు... బాబాకు ధైర్యం చెప్తారు, ఓదారుస్తారు - మీరు చింతించకండి, అయిపోతుంది అని. కానీ బాప్‌దాదాకు పిల్లల యొక్క అలసట లేక ఒంటరితనము లేక అప్పుడప్పుడు కొందరు కాస్త నిరాశకు కూడా లోనవుతారు, మా భాగ్యములో ఉందో లేదో తెలియదు... అని అప్పుడప్పుడు ఆలోచిస్తారు, ఇది బాబాకు మంచిగా అనిపించదు. అన్నింటికంటే ఎక్కువగా బాబాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. యజమానులు కానీ శ్రమపడుతున్నారా! బాబాకు కూడా పిల్లలుగా మరియు యజమానులుగా ఉన్నారు. భగవంతునికి కూడా యజమానులు కానీ శ్రమపడుతున్నారా! ఇది మంచిగా అనిపిస్తుందా? వినటానికి కూడా మంచిగా అనిపించదు. కనుక బాబాకు ఇలా సంకల్పము కలిగింది - పిల్లలు పుట్టినరోజు కానుకనైతే తప్పకుండా ఇవ్వనే ఇస్తారు, మరి ఈరోజున పిల్లలందరూ దీనినే ఎందుకు కానుక రూపములో ఇవ్వకూడదు. ఆ స్థూలమైన కానుకలు ఏవైతే ఇచ్చారో, అవి వతనములో ఎలాగూ ఇమర్జ్ అయ్యాయి, కానీ నిరాకారీ ప్రపంచములో ఆ కానుకలు ఇమర్జ్ అవ్వవు. అక్కడికైతే సంకల్పము అనే కానుక చేరుకుంటుంది. కనుకు బాబాకు - ఈరోజు పిల్లల నుండి ఈ కానుకను తీసుకోవాలి అని సంకల్పము వచ్చింది. మరి ఈ కానుకను ఇస్తారా లేక ఇచ్చి మళ్ళీ అక్కడకు వెళ్ళి తిరిగి తీసేసుకుంటారా? మధుబన్‌లో ఇచ్చింది మధుబన్‌లో ఉంటుంది, మా దేశములో మా దేశములో ఉండేట్లుగా ఉంటాము అని అనరు కదా? పిల్లలు చాలా తెలివైనవారిగా అయిపోయారు. అది తిరిగి రావాలని మేము కోరుకోము కానీ అది వచ్చేస్తుంది అని బాబాకు చెప్తారు. అది వచ్చేస్తుంది, సరే, మీరెందుకు స్వీకరిస్తున్నారు? అది వచ్చేస్తుంది, నిజమే, కానీ మీకు ఇష్టం లేని వస్తువును ఎవరైనా మీకు బలవంతంగా ఇస్తే దానిని మీరు తీసుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు కదా? మరి ఎందుకు స్వీకరిస్తున్నారు? మాయ అయితే తిరిగి తీసుకువస్తుంది కానీ మీరు స్వీకరించకండి. ఇటువంటి ధైర్యము ఉందా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ అక్కడకు వెళ్ళి - బాబా, ఏం చేయను, అనుకోలేదు కానీ అయిపోయింది అని అనవద్దు. అటువంటి ఉత్తరాలైతే వ్రాయరు కదా? మీ ధైర్యము మరియు బాబా సహాయము. ధైర్యాన్ని తగ్గనివ్వకండి, అప్పుడు చూడండి బాబా సహాయము లభిస్తుందా లేదా అని. ధైర్యాన్ని పెట్టినట్లయితే బాబా సహాయము అవసరమైన సమయంలో లభిస్తుంది మరియు లభించవలసిందే, ఇది గ్యారంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది. ధైర్యము మీది, సహాయము బాబాది. మరి సంకల్పం ఏమిటి? ధైర్యం ఉందా, లేదా అని ముఖాలు చూస్తున్నారు! మీరు ధైర్యం ఉన్నవారే, ఎందుకంటే ఒకవేళ ధైర్యం లేకపోతే బాబాకు చెందినవారిగా అవ్వరు. బాబాకు చెందినవారిగా అయ్యారు అంటేనే ధైర్యం ఉంది అని ఋజువవుతుంది. కానీ ఒక చిన్న విషయాన్ని చేస్తున్నారు, అదేమిటంటే అవసరమైన సమయములో ధైర్యాన్ని కాస్త మర్చిపోతారు. ఎప్పుడైనా, ఏదైనా జరిగితే, అది జరిగిపోయిన తరువాత ధైర్యము, సహాయము గుర్తుకొస్తాయి. అవసరమైన సమయములో అన్ని శక్తులను, సమయ ప్రమాణంగా ఉపయోగించాలి, అటువంటివారినే జ్ఞాన స్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలు అని అంటారు.
బాప్‌దాదాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది, అది ఏ విషయమో తెలుసా? చెప్పండి. (చాలామంది వినిపించారు). అందరూ కరెక్టుగా చెప్పారు, కానీ బాబా సంకల్పము వేరే ఉంది. మీరు చాలా గుహ్యమైనవి వినిపిస్తున్నారు, జ్ఞాన సంపన్నులైపోయారు కదా.
బాప్‌దాదా దేనికి సంతోషిస్తున్నారంటే - చాలామంది పిల్లలు, మేము 108 మాలలోకి వస్తాము అని ఉత్తరాలు, చీటీలు వ్రాసారు. చాలా చీటీలు వచ్చాయి. బాప్‌దాదా ఆలోచించారు - ఇంతమంది 108 మాలలోకి వస్తే 5 వరుసలతో కూడిన 108 మాలను తయారుచెయ్యవలసి ఉంటుంది. 5-6-7-8 వరుసల మాలను తయారుచెయ్యాలి కదా? ఎవరైతే ఇలా సంకల్పము చేసారో, లక్ష్యాన్ని పెట్టుకున్నారో చాలా మంచిది. కానీ ఈ సంకల్పాన్ని మధ్యమధ్యలో దృఢం చేస్తూ ఉండండి. ఢీలా అవ్వనివ్వకండి. మాయ వచ్చేసింది, ఇప్పుడిక మాలలోకి వస్తామో, రామో తెలియదు అనైతే అనరు కదా! తెలియదు, తెలియదు... అని అనకండి. మీరు తెలుసుకున్నారు, మీరు మాలలోకి వచ్చేదే ఉంది. దృఢత అనే ముద్రను వేస్తూ ఉండండి - అవును, నేను 108 మాలలోకి రావాల్సిందే, ఏం జరిగినా సరే నా నిశ్చయమైతే చలించనిది, అఖండమైనది. ఇటువంటి చలించని, అఖండమైన నిశ్చయము ఉందా? అయితే మిమ్మల్ని కదిలించేందుకు మాయను పంపించమంటారా? వద్దా? భయపడుతున్నారా? మాయ మీకు భయపడుతుందా లేక మీరు మాయకు భయపడతారా? మాయ మీ తలుపులను చూస్తుంది - ఇక్కడ తెరిచి ఉందా, అక్కడ తెరిచి ఉందా అని చూసుకుంటుంది, వెతుకుతూ ఉంటుంది. మీరు గాభరా ఎందుకు పడతారు? మాయ అసలేమీ కాదు. మాయ అసలేమీ కాదు అని అనండి, అప్పుడది అసలేమీ కాకుండా అయిపోతుంది. మాయ రాలేదు, రాలేదు అని అనుకుంటే అది ఇక రాలేదు. ఏం చెయ్యాలి... ? అని అనుకుంటే మాయకు తలుపులు తెరిచినట్లు, ఆహ్వానించినట్లు. మంచి విషయము ఏమిటంటే - చాలామంది పిల్లలు 108 మాలలోకి వచ్చే ప్రతిజ్ఞను చేసారు. చేసారు కదా? ఎవరైతే - మేము 108 మాలలోకి వస్తాము అని అన్నారో వారు బాగా పైకి చేతులెత్తండి. బాగా డ్రిల్ చెయ్యండి. చాలా మంచిది, అభినందనలు. 108 మాలలోకి ఎంతమంది వస్తారు, మేమెక్కడ వస్తాము అని ఆలోచించకండి. ముందు నుండే లెక్కలు వేయడం మొదలుపెడతారు - దాదీ వస్తారు, దీదీ వస్తారు, దాదాలు కూడా వస్తారు, అడ్వాన్స్ పార్టీవారు కూడా వస్తారు, మా నంబరు వస్తుందో లేదో తెలియదు! బాప్‌దాదా 8-10 వరుసల మాలను తయారుచేస్తారు, అందుకే మీరు ఈ విషయములో చింతించకండి అని బాప్‌దాదా చెప్పారు. ఇతరులను చూడకండి, మీకు నంబరు తప్పకుండా లభించేదే ఉంది, ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. మీరు పక్కకు తప్పుకోకండి. మాల మధ్యలో దారాన్ని ఖాళీ చేయకండి. ఒక పూస మధ్యలో నుండి విరిగిపోయినా, తొలగిపోయినా మాల మంచిగా అనిపించదు. కేవలము ఇది మాత్రం చెయ్యకండి, ఇకపోతే బాబా గ్యారంటీ ఇస్తున్నారు, మీరు తప్పకుండా వస్తారు.
ఈరోజు జయంతిని జరుపుకోవటానికి వచ్చాము, మురళిని వినిపించటానికి రాలేదు. ఎవరెవరైతే ఉన్నారో వారందరూ మాలలోకి వచ్చేయండి, 108 మాలలోకి అందరికీ వెల్కమ్. భక్తి మార్గమువారు 108 మాలను తయారుచేసారు. బాప్‌దాదా దానిని ఎంత పెద్దదిగా అయినా చెయ్యగలరు. కేవలము ఇందులో కానుకనైతే బాబా తప్పకుండా తీసుకుంటారు, కానుకను వదిలిపెట్టరు. ఇది చిన్నపాటి కానుకే, పెద్దదేమీ కాదు, ఎందుకంటే బాబా పిల్లలందరి 6 నెలల చార్టును చూసారు. ఏం చూసారు? ఒకవేళ పిల్లలెవరైనా కాస్త కింద-మీద అయినా, అచల స్థితి నుండి అలజడిలోకి వచ్చినా, అందుకు కారణము కేవలం 3 ముఖ్యమైన విషయాలు, ఆ మూడు విషయాలే రకరకాల సమస్యలుగా, పరిస్థితులుగా అయ్యి వస్తాయి. ఆ మూడు విషయాలు ఏమిటి?
అశుభము లేక వ్యర్థము ఆలోచించటము, అశుభము లేక వ్యర్థము మాట్లాడటము మరియు అశుభము లేక వ్యర్థము చెయ్యటము. ఆలోచించటము, మాట్లాడటము మరియు చెయ్యటము - ఇందులో చాలా సమయము వృధా అవుతుంది. ఇప్పుడు వికర్మలు తక్కువ అవుతున్నాయి, వ్యర్థము ఎక్కువవుతుంది. వ్యర్థము యొక్క తుఫాను కదిలించేస్తుంది. ముందుగా ఆలోచనల్లో వస్తుంది, తరువాత మాటల్లో, ఆ తరువాత కర్మల్లో వస్తుంది మరియు రిజల్టులో ఏం చూడటం జరిగిందంటే - కొందరికి మాటల్లో మరియు కర్మల్లో వ్యర్థం రాదు కానీ ఆలోచనల్లో చాలా వస్తుంది. తయారయ్యే సమయమేదైతే ఉందో అదంతా ఆలోచించడములోనే గడిచిపోతుంది. కనుక బాప్‌దాదా ఈరోజు ఈ మూడు విషయాలను - ఆలోచించటము, మాట్లాడటము మరియు చెయ్యటము, ఈ కానుకను అందరి నుండి తీసుకోవాలని అనుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఇచ్చేసారో వారు చేతులెత్తండి. ఈ చేతులెత్తిన వీడియోను బాగా తియ్యండి, అన్ని పక్కల నుండి తియ్యండి. చేతులు బాగా పైకి ఎత్తండి. డ్రిల్ చెయ్యరు, అందుకే లావు అయిపోతారు. అచ్ఛా, అందరూ దీనిని ఇచ్చేసారు. తిరిగి తీసుకోకండి. నోటి నుండి వచ్చేసింది, ఏం చెయ్యాలి అని అనకూడదు. నోటిపై దృఢ సంకల్పం అనే బటన్ పెట్టండి. దృఢ సంకల్పము అనే బటన్ అయితే ఉంది కదా? ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. ప్రేమకు గుర్తు ఏమిటంటే ప్రేమ ఉన్నవారు కష్టపడుతుంటే చూడలేరు. ఆ సమయంలో బాప్‌దాదా ఏమి ఆలోచిస్తారంటే బాప్‌దాదా సాకారములో వెళ్ళి ఆ బిడ్డకు ఏదైనా చెప్పాలి అని, కానీ వారు ఆకారీ, నిరాకారీ రూపములో ఉన్నారు కదా. అందరూ పూర్తిగా శ్రమ పడటము నుండి దూరమై ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండండి. ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. శ్రమను సమాప్తం చెయ్యాలి, సమాప్తం చెయ్యాలి అని ఆలోచించకండి. కేవలము ప్రేమ అనే ఊయలలో కూర్చుండిపోండి, శ్రమ దానంతట అదే సమాప్తమైపోతుంది. వదిలేందుకు ప్రయత్నించకండి. కూర్చునేందుకు, ఊగేందుకు ప్రయత్నము చెయ్యండి.
శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యే జయంతి. అంతే కదా? బాబాకు పిల్లలపై నమ్మకము ఉంది. కొంతమంది పిల్లలు బాబాకు కూడా తెలియని విధంగా ఎలా బాబా నుండి పక్కకు వెళ్ళిపోతారో అర్థం కాదు. ఛత్రఛాయ కింద కూర్చుని ఉండండి. బ్రాహ్మణ జీవితము యొక్క అర్థము ఊగటము, మాయలో ఊగటము కాదు. మాయ కూడా ఊపుతుంది. అమృతవేళ చూడండి, మాయ ఎలా ఊపుతుందంటే, సూక్ష్మవతనములోకి వచ్చేందుకు బదులుగా, నిరాకారీ ప్రపంచములోకి వచ్చేందుకు బదులుగా నిద్రాలోకములోకి వెళ్ళిపోతారు. యోగము డబల్ లైట్‌గా చేస్తుంది అని అంటారు కానీ తల భారమైపోతుంది. కనుక మాయ కూడా ఊయలను ఊపుతుంది కానీ మాయ ఊయలలో ఊగకండి. అర్థకల్పము మాయ ఊయలలో బాగా ఊగి చూసారు కదా. ఏం లభించింది? ఏమైనా లభించిందా? అలసిపోయారు కదా! ఇప్పుడు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగండి, సంతోషమనే ఊయలలో ఊగండి, శక్తుల అనుభూతులనే ఊయలలో ఊగండి. మీకు ఎన్ని ఊయలలు లభించాయంటే అవి ఇక్కడి రాకుమారులు, రాకుమారీలకు కూడా ఉండవు. ఏ ఊయలలో కావాలంటే ఆ ఊయలలో ఊగండి. ఇప్పుడు ప్రేమ అనే ఊయలలో ఊగండి, ఇప్పుడు ఆనందము అనే ఊయలలో ఊగండి, ఇప్పుడు జ్ఞానము అనే ఊయలలో ఊగండి. ఎన్ని ఊయలలు ఉన్నాయి! లెక్కలేనన్ని ఉన్నాయి. కనుక ఊయల నుండి దిగిపోకండి. ఎవరైతే అల్లారుముద్దు పిల్లలు ఉంటారో, వారి గురించి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే - పిల్లల కాళ్ళు మట్టిలోకి వెళ్ళకూడదు. పిల్లలు ఒడిలో అన్నా ఉండాలి, ఊయలలో అన్నా ఉండాలి, తివాచిపై అన్నా ఉండాలి, మట్టిలోకి కాళ్ళు వెళ్ళకూడదు. ఇలానే ఉంటుంది కదా? మరి మీరు ఎంతటి అల్లారుముద్దు పిల్లలు! మీలాంటి అల్లారుముద్దు పిల్లలు మరెవరైనా ఉన్నారా? పరమాత్ముని అల్లారుముద్దు పిల్లలు ఒకవేళ దేహభానములోకి వచ్చినట్లయితే మరి దేహమంటే ఏమిటి? మట్టి కదా! దేహాన్ని ఏమంటారు? మట్టి, మట్టిలో కలిసిపోతుంది. మరి ఇది మట్టి కదా. మట్టిలో కాళ్ళు ఎందుకు పెడతారు? మట్టి మంచిగా అనిపిస్తుందా? కొంతమంది పిల్లలకు మట్టి మంచిగా అనిపిస్తుంది, కొంతమంది మట్టిని తింటారు కూడా. కానీ మీరు తినకండి, మట్టిలో కాళ్ళు కూడా పెట్టకండి. సంకల్పం వచ్చింది అంటే కాలు పెట్టడమని అర్థము. సంకల్పములో కూడా దేహ భానము రాకూడదు. ఆలోచించండి, గుర్తు పెట్టుకోండి - మేము ఎంతటి అల్లారుముద్దు పిల్లలము, ఎవరికి అల్లారుముద్దు పిల్లలము! సత్యయుగములో కూడా పరమాత్మునికి అల్లారుముద్దు పిల్లలుగా ఉండరు. దివ్య ఆత్మలకు అల్లారుముద్దు పిల్లలుగా ఉంటారు. కానీ ఈ సమయములో పరమాత్మ అయిన తండ్రికి అల్లారుముద్దు పిల్లలు. పిల్లలు ధైర్యమనే చేతితో కానుకను ఇచ్చారు, అందుకే బాప్‌దాదా వారికి థ్యాంక్స్ చెప్తున్నారు, షుక్రియా, ధన్యవాదాలు. అచ్ఛా.
అచ్ఛా, ఈ రోజు డబల్ విదేశీయుల ప్రత్యేక రోజు. వచ్చినవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న డబల్ విదేశీయులు చేతులు పైకి ఎత్తండి. హాల్లో మూడు వంతులు డబల్ విదేశీయులే ఉన్నారు. బాబా కూడా స్వాగతం పలుకుతున్నారు, రండి, ఎల్లప్పుడూ వస్తూ ఉండండి. చూడండి, పిల్లలు పెరుగుతూనే ఉన్నారు, భూమి మాత్రం చిన్నదవుతోంది. ఈ హాలు నిర్మించినప్పుడు ఇంత పెద్ద హాలు నిండుతుందని అనుకున్నారా? ఇప్పుడు ఈ హాలు మాత్రమే కాదు, క్రింద కూడా ఎన్నో గీతా పాఠశాలలు ఏర్పడ్డాయి. ఎంతోమంది పిల్లలు క్రింద కూర్చొని (మధుబన్‌లో) మురళి వింటున్నారు. ఇప్పుడు చూడండి, క్రింద (శాంతివన్లో) హాల్ నిర్మించినా కూడా సంఖ్య చెప్పాల్సిందే అంటున్నారు. ఇంత పెద్ద హాలు ఎందుకు నిర్మించారు? సంఖ్యను పరిమితం చేయడానికా లేక స్వేచ్ఛ ఇవ్వడానికా? దీనివల్ల ఏమి రుజువవుతోంది? మీ అందరూ విశ్వానికి యజమానులు కావాలి. విశ్వానికి యజమానులు అయ్యేవారికి ఇలాంటి వాటన్నీ చిన్నవే అవుతాయి. ఈ హాలు ఏమాత్రం కాదు, మొత్తం విశ్వమే మీకు లభించాల్సిందే.
(బాప్‌దాదా డ్రిల్ చేయించారు) మనసుకు యజమానులు కదా! అయితే స్టాప్ అంటే వెంటనే ఆగిపోవాలి. మీరు స్టాప్ అని చెప్పినా మనస్సు మాత్రం నడుస్తూనే ఉంటే, యజమానిత్వ శక్తి తక్కువగా ఉందని అర్థం. యజమాని శక్తిమంతుడైతే, యజమాని ఆదేశం లేకుండా మనస్సు ఒక్క సంకల్పం కూడా చేయలేదు. స్టాప్ అంటే స్టాప్. నడువు అంటే నడవాలి. ఎక్కడ నడపాలనుకుంటే అక్కడే నడవాలి. అలా కాకుండా మనస్సుకు చాలాకాలంగా వ్యర్థం వైపు వెళ్లే అలవాటు ఉంది. మీరు దానిని శుద్ధ సంకల్పాల వైపు నడిపిస్తే, అది వ్యర్థం వైపు వెళ్లిపోతే, యజమాని తన యజమానిత్వాన్ని సరిగా వినియోగించడం తెలియదని అర్థం. ఈ అభ్యాసం చేయండి. స్టాప్ అని చెప్పగానే ఆగుతోందా లేదా అని పరిశీలించండి. లేక కొంతసేపు నడిచి తర్వాత ఆగుతోందా? ఒకవేళ కారుకు బ్రేక్ వేస్తే, కొంతదూరం వెళ్లిన తర్వాత ఆగితే, అలాంటి కారు పనికొస్తుందా? దాన్ని నడిపేవాడు అర్హుడా లేక ప్రమాదం చేసేవాడా? బ్రేక్ వేస్తే వెంటనే సెకనులో ఆగిపోవాలి. ఇదే అభ్యాసం కర్మాతీత స్థితికి దగ్గర చేస్తుంది. సంకల్పం చేయడమనే కర్మలో కూడా ఫుల్ పాస్ కావాలి. కర్మాతీతం అంటే ప్రతి సబ్జెక్టులో ఫుల్పాస్. 75 శాతం కాదు, 90 శాతం కాదు, ఫుల్ పాస్. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, మీ అనుభవంలో అన్ని శక్తుల నిల్వ (స్టాక్) ఆచరణలో ఉపయోగంలోకి వచ్చినప్పుడు. ముందే చెప్పాము కదా, అన్ని శక్తులను బాబా ఇచ్చారు, మీరు స్వీకరించారు. కానీ సమయానికి ఉపయోగిస్తున్నారా లేదా? లేక కేవలం నిల్వగానే ఉంచారా? నిల్వ ఉండి, అవసరమైన సమయంలో ఉపయోగించకపోతే, ఉన్నా లేకపోయినా ఒకటే. దీనిని అనుభవించండి. పరిస్థితి ఎంత సున్నితమైనదైనా, మనస్సు, బుద్ధికి, న్యారేగా ఉండి ఆటను చూడు అని ఆదేశిస్తే, ఆ పరిస్థితి మీ అచంచల స్థితి అనే ఆసనం క్రింద నలిగిపోతుంది. అది మీ ఎదుట నిలబడదు. ఆసనాన్ని విడవకండి. ఆసనంలో కూర్చునే అభ్యాసమే సింహాసనాన్ని పొందిస్తుంది. ఆసనంపై కూర్చోవడం రాకపోతే, సింహాసనంపై కూడా అప్పుడప్పుడే కూర్చోగలరు. ఆసనమే సింహాసనాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఆసనం ఉంది, తర్వాత సింహాసనం ఉంటుంది. చంచలమైనవారు ఆసనంపై ఏకాగ్రంగా కూర్చోలేరు. అందుకే చెప్పాము, వ్యర్థం సమాప్తం, అశుభం సమాప్తం అయితే అచంచలంగా అవుతారు. అచంచల స్థితి అనే ఆసనంపై సులభంగా, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండగలరు. చూడండి, మీ అందరికీ గుర్తుగా ఇక్కడ అచల్‌ఘర్ ఉంది. అచల్‌ఘర్ చూసారు కదా! అది ఎవరి గుర్తు? మీ అందరి స్థితికి గుర్తుగా ఉన్నది అదే. అనుభవించండి, ప్రయత్నించండి, ఉపయోగించండి. అన్ని శక్తులు ఉన్నాయి అని మాత్రమే అనుకోకండి. సమయానికి ఉపయోగంలోకి రావాలి. ఉపయోగించకపోతే అవసరమైన సమయంలో మోసపోవచ్చు. అందుకే చిన్న చిన్న పరిస్థితులలోనే ఉపయోగించి చూడండి. పరిస్థితులు రావాల్సిందే, వస్తూనే ఉంటాయి. ముందే బాప్‌దాదా చెప్పారు, ప్రస్తుత సమయంలో ప్రతి శక్తిని అనుభవిస్తూ ముందుకు సాగండి. ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని అనుభవించండి. అటువంటి అనుభవమూర్తులుగా అవ్వండి. ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు, మీ అనుభవ సహాయంతో వారికి కూడా ప్రాప్తి కలగాలి. రోజురోజుకూ ఆత్మలు శక్తిహీనులవుతున్నారు, ఇంకా అవుతూనే ఉంటారు. అలాంటి ఆత్మలకు మీ శక్తుల అనుభూతుల ద్వారా ఆధారంగా నిలిచి అనుభూతిని కలిగించండి. అచ్ఛా. యజమానులే కదా! అయితే యజమానులకు బాబా సలాం చేస్తున్నారు. అచ్ఛా.
(66 దేశాల నుండి బాబా పిల్లలు వచ్చారు) 66 దేశాల నుండి వచ్చిన పిల్లలందరికీ పదమారెట్లు అభినందనలు. చివరికి ప్రపంచమంతా మీరే నాలుగు దిక్కులా వ్యాపిస్తారు. ఎక్కడ చూసినా తెల్లని వస్త్రాలు ధరించిన ఫరిశ్తాలు కనిపిస్తారు. అచ్ఛా.
అమెరికా:- అమెరికా నుండి ఎన్ని దేశాల వారు వచ్చారు? (19) ఆ 19 దేశాలవారు చేతులు పైకి ఎత్తండి. అమెరికా ఏ జల్వా చూపిస్తుంది? పేరు చాలా బాగుంది. అమెరికా అంటే ఆ మేరే, ఆ మేరే. కాబట్టి అమెరికా తప్పిపోయిన పిల్లలందరినీ ఆ మేరే, ఆ మేరే అంటూ బాబావారిగా చేస్తుంది. అలాగే కదా! అక్కడ అభివృద్ధి జరుగుతోంది కదా! ఇంకా జరుగుతూనే ఉంటుంది.
ఆఫ్రికా:- (ఆఫ్రికాలోని 13 దేశాలవారు వచ్చారు) అందరూ చేతులు పైకి ఎత్తండి. ఇందులో సౌత్ ఆఫ్రికా, మారిషస్ కూడా ఉన్నాయా? ఆఫ్రికా ఏమి చేస్తుంది? ఆఫ్రికా ‘‘ఆఫరీన్’’ అనిపించుకునే స్థాయికి చేరుతుంది. సేవ అనే నగారాను అంత బలంగా మోగిస్తుంది, నాలుగు దిక్కుల నుండి ఆఫరీన్! ఆఫరీన్! అనే మాట వినిపిస్తుంది.
ఏషియా:- (ఏషియాలోని 13 దేశాలవారు వచ్చారు) ఏషియా ఏమి చేస్తుంది? సర్వ ఆత్మల ఆశలను నెరవేరుస్తుంది. అందరి ఆశలు నెరవేరినప్పుడు అందరూ వాహ్ ఏషియా! వాహ్! అని అంటారు.
యూరప్:- (యూరప్‌లోని 17 దేశాలవారు వచ్చారు) అందులో లండన్ కూడా ఉందా? యూరప్ విదేశ సేవకు పునాది. పునాది ఎప్పుడూ అందరి దృష్టిలో ఉంటుంది, పునాది ఎంత బలంగా ఉందో అందరూ చూస్తారు. యూరప్ నుంచే పునాది విస్తరించింది. అక్కడి నుండి అనేక శాఖలు విస్తరించాయి. విత్తనం నాటినప్పుడు ముందుగా రెండు ఆకులు వస్తాయి కదా! అయితే మొదటి సెంటర్లు ఏవి? లండన్ మరియు హాంకాంగ్. ఈ రెండు ఆకులే కమాల్ చేశాయి. ఆ రెండు ఆకుల నుండి కాండం వచ్చింది, కాండం నుండి కొమ్మలు, కొమ్మల నుండి శాఖలు విస్తరించి, డబల్ విదేశీయుల వృక్షం పచ్చగా, పుష్టిగా ఎదిగింది. కాబట్టి యూరప్‌లోని ఆ రెండు మొదటి ఆకులైన లండన్ మరియు హాంకాంగ్‌కు పదమారెట్లు అభినందనలు. (యూరప్ వారు చేతులు పైకి ఎత్తండి.) మొదటి ఆకులే కాబట్టి విస్తరణ తప్పకుండా జరుగుతుంది.
మిడిల్ ఈస్ట్:- (3 దేశాల నుండి వచ్చారు) వీళ్లు చాలా బాగున్నారు. ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్నారు. ఇంకా కొద్దిమందే ఉన్నారు. ఇకపై మిడిల్ ఈస్ట్, మోడల్ ఈస్ట్ కావాలి. మీ సేవను అంతగా పెంచండి, అన్ని దేశాలవారు మిమ్మల్ని మిడిల్ ఈస్ట్ అని కాకుండా మోడల్ ఈస్ట్ అని పిలవాలి. పెంచుతారు కదా! ప్రపంచ శ్రేయస్సు జరగాలంటే మిడిల్ ఈస్ట్ శ్రేయస్సు కూడా జరగాలి. లేకపోతే ప్రపంచంలోని ఒక మూల మిగిలిపోతుంది. అది మంచిది కాదు. అందుకే ఎవరైనా మిడిల్ ఈస్ట్ అంటే, కాదు, మోడల్ ఈస్ట్ అని చెప్పండి.
రష్యా:- రష్యా వారందరూ చేతులు పైకి ఎత్తండి. చాలా బాగున్నారు. రష్యా ఏమి చేస్తుంది? రష్యాలో చాలా కాలం కమ్యూనిస్టుల పాలన సాగింది. ఇప్పుడు అక్కడ దేవతల రాజ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అది భారతదేశానికి దగ్గరగా ఉంది కదా! భారతదేశానికి దగ్గరగా వస్తుంది కాబట్టి స్వర్గంగా మారుతుంది. చాలా దూరంలో ఉన్న దేశాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. రష్యా దగ్గరగా ఉంది. ఇప్పుడు దేవతల రాజ్యం లేకపోయినా, చాలాకాలం కమ్యూనిస్టుల పాలన సాగింది. ఇప్పుడు స్వతంత్రంగా ఉంది. ఇక మళ్లీ రాజు-రాణుల రాజ్యం వస్తుంది. రాజు-రాణుల రాజ్యం నచ్చుతుందా? చాలా బాగుంది. అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది. బాప్‌దాదా సేవతో సంతోషంగా ఉన్నారు. రష్యా వారు, మేము బాప్దాదాపై పూల రేకులు చల్లుతాము అని చెప్పారు కదా! అయితే ఇలా చేతులు చేయండి - చల్లినట్టే అయింది. సువాసన కూడా వచ్చింది. మీ హృదయ స్నేహ పుష్పాలు బాబా వద్దకు చేరాయి. అచ్ఛా.
ఆస్ట్రేలియా:- ఆస్ట్రేలియా వారు చేతులు పైకి ఎత్తండి. ఆస్ట్రేలియా నుండి కొద్దిమందే వచ్చారు. కానీ ఆస్ట్రేలియా ముందుగా ఫస్ట్ స్థానానికి రావాలి. అక్కడ బాప్‌దాదాకు చెందిన ఎంతోమంది మంచి ఆది రత్నాలు ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది గుప్తంగా ఉన్నారు. భట్టీలో ఉన్నారు. ఇప్పుడు రిట్రీట్ హౌస్ వచ్చింది కదా! ఇక బయటకు వస్తారు. తర్వాత ఆస్ట్రేలియా యొక్క పెద్ద సమూహం కనిపిస్తుంది. మ్యాప్‌లో ఆస్ట్రేలియా ఎంత పెద్దదో, అలాగే బ్రాహ్మణ కుటుంబంలో కూడా పెద్దదవుతుంది. ప్రస్తుతం భట్టీలో బాగా సిద్ధమవుతున్నారు. బాప్‌దాదాకు ఆస్ట్రేలియాపై చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు లండన్, ఆస్ట్రేలియా మధ్య పోటీ ఉండేది. లండన్ కంటే కూడా ఆస్ట్రేలియాలో ఎక్కువ సంఖ్య ఉండేది. ఇప్పుడు గుప్తంగా ఉన్నారు. త్వరలో ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు తెలియని వారిగా ఉన్నా, త్వరలో అందరికీ తెలిసిన వారవుతారు. అచ్ఛా. డబల్ విదేశీయులు రిఫ్రెష్ అయ్యారా? మీ కోసం ప్రత్యేకంగా బాప్‌దాదా వచ్చారు. డబల్ విదేశీయులపై డబల్ ప్రేమ ఉంది.
మొదటిసారి వచ్చినవారితో:- మొదటిసారి వచ్చినవారు చేతులు పైకి ఎత్తండి. చాలా మంది ఉన్నారు. ఈరోజు బాబా జన్మదినం. మీరు మొదటిసారి వచ్చారు కాబట్టి, బాబా ఈ రోజున మీ కొత్త జన్మదినాన్ని కూడా జరుపుతున్నారు. జన్మదిన గీతం పాడండి. అచ్ఛా. ఈ అలౌకిక జన్మదినానికి పదమారెట్లు అభినందనలు. శుభాకాంక్షలు. అచ్ఛా.
(ఈ రోజు శివబాబా జన్మదినాన బ్రహ్మా బాబా, బాబాకు ఏ బహుమతి ఇచ్చారు?) బ్రహ్మా బాబా ముందే అన్నీ ఇచ్చేశారు. తన వద్ద ఏదీ ఉంచుకోలేదు. సంపూర్ణమైనప్పుడు అన్నీ సమర్పించారు. ఆయన వద్ద ఇప్పుడు ఏమీ లేదు. మీ పిల్లల వద్ద ఇంకా దాచినవి ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వాలి. ఇప్పుడు బ్రహ్మా బాబా మీ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ చేతులు చాపి, రండి పిల్లలూ, రండి పిల్లలూ అని పిలుస్తున్నారు. కాబట్టి బాబా సమానంగా అయి వతనానికి రండి. పరమధామ ద్వారం కూడా మీ కోసం తెరవకుండా ఎదురుచూస్తోంది. బ్రహ్మా బాబా మధ్య మధ్యలో, ద్వారం తెరవండి, ద్వారం తెరవండి అంటారు. కానీ బాబా మాత్రం, ఇంకా కొంచెం ఆగండి, కొంచెం ఆగండి అంటున్నారు.
అచ్ఛా, డబల్ విదేశీయులందరూ బాగా కలుసుకున్నారు కదా! పెద్ద కుటుంబం అయితే అన్నింటినీ పెద్ద స్థాయిలో పంచుకోవాలి. చిన్న కుటుంబం అయితే చిన్న స్థాయిలో పంచుకుంటారు. కుటుంబం పెద్దదైతే, దానికి తగ్గట్టే అన్నీ జరుగుతాయి. మీరు ఆలోచించండి, కుటుంబం పెద్దది కాకపోతే రాజ్యం ఎవరిపై చేస్తారు? ఐదుగురు, పది మందిపైనా? 108 మాల పూసలు సిద్ధమయ్యాయి. అయితే రాజ్యం చేయడానికి ప్రజలు కూడా కావాలి కదా! అందుకే పెద్ద కుటుంబం తప్పనిసరిగా ఉండాలి. అచ్ఛా.
నలువైపుల ఉన్న అతి-అతి భాగ్యవంతులైన పిల్లలకు, ఎవరైతే స్వయం శివబాబాతో శివజయంతిని జరుపుకుంటున్నారో, అటువంటివారికి పదమాల రెట్లు ఏంటి, ఇంకా ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే, ఇటువంటి మహా భాగ్యవంతులైన ఆత్మలకు, సదా బాబా ఆజ్ఞపై ప్రతి అడుగును వేసే బాబాకు స్నేహీ మరియు సమీప ఆత్మలకు, సదా యజమాని స్థితి అనే అచంచల ఆసన నివాసుల నుండి భవిష్య సింహాసన నివాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబాతోపాటు ఆనందంగా ప్రేమ అనే ఊయలలో ఊగుతూ వెంట వచ్చే పిల్లలకు, అటువంటి బాప్‌దాదా యొక్క సహచరులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు, యజమానులందరికీ బాబా యొక్క నమస్తే.
దాదీలతో:- తమ తమ ఆసనాలపై కూర్చోండి, చిన్న రాజదర్బార్ కదా. స్వరాజ్య అధికారులైన రాజులు తమ దర్బారులో కూర్చోండి. (సభతో) మీ అందరికీ కూడా రాజదర్బార్ బాగా నచ్చుతుంది కదా! ఇది సంగమయుగ దర్బార్. మీరందరూ కూడా క్రింద కూర్చోలేదు, పైన కూర్చున్నారు. చూడండి, వీరు సింహాసనంపై ఉన్నారు మరియు మీరందరూ హృదయ సింహాసనంపై ఉన్నారు. ఈ సింహాసనం చిన్నది, కానీ హృదయ సింహాసనం చాలా పెద్దది.
(నిర్వైర్ అన్నయ్య బాప్‌దాదాకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు) మీకూ అభినందనలు. పాండవులందరి తరఫున వారి ప్రియస్మృతులను తీసుకొచ్చారు, అందుకే పాండవులకు ప్రత్యేక అభినందనలు. శక్తుల తరఫున కూడా ఎంతోమంది శక్తులు వచ్చారు కాబట్టి వారికి కూడా ఎన్నో ఎన్నో అభినందనలు.
మీ అందరికీ మనం సింహాసనాధికారులమనే నశా ఉంటుంది కదా! ఈరోజు ఫరిశ్తాలు, రేపు సింహాసనాధికారులు. ప్రతి ఒక్క బిడ్డ సింహాసనాధికారులు అవ్వాల్సిందే. మనం బహుశా ప్రజలోకి వెళ్తామని అలా అనుకోకండి. కాదు. రాయల్ ఫ్యామిలీలోకి రావాల్సిందే. బాబాకు చెందినవారిగా అయిన తర్వాత సంగమయుగ వారసత్వంతో పాటు రాజులైనా, రాయల్ ఫ్యామిలీ వారైనా అవ్వాల్సిందే. రాజ్య కుటుంబంలోకి రావాల్సిందే. అర్థమైందా?
డబల్ విదేశీయుల మధ్య భారతవాసులు దాగి ఉన్నారు. భారతవాసులు చేతులు ఎత్తండి. భారతవాసులు ప్రతి ఒక్కరి నోటా ఉన్నారు. భారత్ గొప్పది, భారత్ స్వర్గం, భారత్ ఉన్నతమైనది. కాబట్టి భారతవాసులు ఉన్నతమైనవారే, కానీ భారతవాసులు మహాదానులు. డబల్ విదేశీయులకు ఛాన్స్ ఇస్తారు. అందుకే మహాదాని భవ.
(బాబా కూడా భారతదేశం వారే కదా!) బాబా విశ్వం వారే, కేవలం భారతదేశానిది కాదు. విశ్వ కళ్యాణకారి. భారత కళ్యాణకారి అంటే చిన్నదైపోతుంది. విశ్వ కళ్యాణకారి అంటే విశ్వానికి బాబా. భారత్ అనేది హద్దు అయిపోతుంది. అందుకే బాబా స్వర్గంలోకి రారు. అలా అయితే హద్దు అయిపోతుంది కదా. అనంతమైన బాబా అనంతమైన దానిలోనే ఉంటారు. డబల్ విదేశీయులు సదా సర్వ వరదానాలతో సంపూర్ణులుగా ఉండండి. బాప్‌దాదాకు తెలుసు, ఒక్కో డాలర్ అయినా లేదా ఏ కరెన్సీ అయినా ఎంతో శ్రమపడి కూడబెట్టుకుని వస్తారని. శ్రమ, కష్టాలు భారతవాసులకు కూడా ఉన్నాయి. విదేశీయులు విమానంలో కూర్చుని వచ్చేస్తారు. భారతవాసులు అయితే రైలు, బస్సుల్లో రావాల్సి ఉంటుంది. కానీ ఒక్కో డాలర్ కూడబెట్టే టాక్ట్ (యుక్తి) మాత్రం డబల్ విదేశీయులలో ఎక్కువగా ఉంటుంది.
శాంతివనం కోసం తమ పొట్ట కోసం ఉంచుకున్న రొట్టెను కూడా ఆదా చేసి పంపిస్తున్నారు. బాప్‌దాదాకు తెలుసు, తాము పప్పు-రొట్టె తింటారు, శాంతివనానికి పంపిస్తారు. భారతవాసులైనా, విదేశీయులైనా — అందరి ప్రాణం జ్ఞాన సరోవర్లోనూ, శాంతివనంలోనూ ఉంది. హృదయపూర్వక ప్రేమ ఉంది. (ఇక ముందు ఏమవుతుంది?) ముందూ అలాగే అవుతుంది. శాంతివనం కూడా ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు, అందుకే ‘‘నెక్స్ట్’’ అని చెప్పడం లేదు.
(వినాశనానికి ముందు ప్రతి ఖండంలోకి ఒకసారి బాబా రావాలి) చూడండి, డ్రామా. బాబా లండన్‌కు కూడా వచ్చారు. కానీ మధుబన్ మహిమ మాత్రం మధుబన్దే. ముందుకు వెళ్లాక ఏమవుతుందో ముందే చెబితే మజా అయిపోతుంది. అందుకే ముందేమవుతుందో చూడండి! అచ్ఛా, బహుమతిని పార్సల్ చేసి పంపించారా! తిరిగి తీసుకోకండి. అచ్ఛా, డబల్ విదేశీయులు సంతోషంగా ఉన్నారా? డబల్ విదేశీయులందరూ సౌకర్యంగా ఉన్నారా? (అన్ని భవనాలు నిండిపోయాయి.) ఎవరూ పట్టరాణులు కాలేదా? ఇప్పుడు పటరాణులుగా చేస్తాం. మీ అటాచీని(బ్యాగు)ను పరుపుగా చేసుకోండి. కనీసం దిండుగా అయినా ఉపయోగించుకోవచ్చు. అదీ ఒక మంచి దృశ్యమే కదా! అటాచీ దిండుగా ఉంటుంది, అందరూ విష్ణువులా హాయిగా పడుకుని ఉంటారు. ఎంత బాగుంటుంది! డబల్ విదేశీయులను తప్పకుండా పట్టరాణులుగా చేస్తాం. చూడండి, స్థాపన ప్రారంభంలో ఈ విశేష ఆత్మలందరూ మూడు అడుగుల స్థలంలోనే నిద్రపోయారు. నాలుగు అడుగులు కూడా కాదు, మూడు అడుగులే, చాపపై. విశేష మహారథులు చాపపై నిద్రించేవారు. కాబట్టి ఆదిలో జరిగినదే అంతంలో మీరు కూడా చేస్తారు కదా! తర్వాత నడుము నొప్పి వచ్చిందని కారణం చెప్పరు కదా! ఏ నొప్పి వచ్చినా డాక్టర్లు కూడా ఏమంటారు? నేలపై నిటారుగా పడుకోండి. మంచంపై కాదు, నేలపై నిటారుగా పడుకోండి, అప్పుడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వీరందరూ ఎవరెడీ. డబల్ విదేశీయులు అంటే డబల్ ఎవరెడీ. అచ్ఛా. బాగా జరుపుకోండి.
(బాప్‌దాదా తన చేతులతో జెండా ఎగురవేసి అందరికీ శివజయంతి శుభాకాంక్షలు తెలిపారు)
పిల్లలందరూ శివపిత జెండాను ఎగురవేశారు. ఈ హాల్లో జెండా ఎగురవేసినట్లే, అలాగే త్వరలోనే ప్రపంచమంతటా ఉన్న ప్రతి హాల్లో ఈ ప్రియమైన, విశిష్టమైన జెండా ఎగురుతుంది. అందరి నోటా, అందరి హృదయంలో ఇదే గీతం వినిపిస్తుంది, వచ్చారు, వచ్చారు, మన బాబా వచ్చారు. అందరి హృదయాల్లో ఆనందపు చప్పట్లు మోగుతాయి. ఈ జెండా కేవలం నిమిత్తమాత్రమే. కానీ అత్యున్నతుడైన బాబా వచ్చారు, వచ్చారు. రావలసిన వారు వచ్చారు. మనందరినీ తీసుకెళ్లేవారు వచ్చారు. ఇదే భావనతో ప్రపంచమంతటా ఈ జెండా ఎగురుతుంది. మీరందరూ చూస్తారు, మీరందరూ తెల్లని తెల్లని ఫరిశ్తాల రూపంలో కనిపిస్తారు. బాబాతో పాటు మీ అందరి గురించీ కూడా గీతాలు పాడతారు. మన పూజ్య దేవీదేవతలు వచ్చారు, వచ్చారు అని పాడతారు. మీరు కాస్త త్వరగా తయారైపోండి. అప్పుడు చాలా త్వరలోనే ఈ జెండా ఎగురుతుంది. తర్వాత అందరూ అన్ని ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. అచ్ఛా, ఈ ప్రియమైన మరియు విశిష్టమైన జెండాకు అందరికీ అభినందనలు.
*** ఓంశాంతి ***
