‘‘వ్యర్థమును మరియు నెగెటివ్‌ను అవాయిడ్ చేసి అవార్డును తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి’’
ఈరోజు బాప్‌దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన తమ ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల, ఆ సుఖమయమైన ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క క్షణంలో సమాప్తము చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వ శక్తి సంపన్నమైనది, అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇటువంటి శ్రేష్ఠమైన పరమాత్మ ప్రేమకు ఎంత కొద్దిమంది ఆత్మలైన మీరు పాత్రులు. ఇటువంటి శ్రేష్ఠ పాత్రులైన ఆత్మలను బాప్‌దాదా చూస్తూ-చూస్తూ హర్షితులవుతారు. బాబా ఏ విధంగా హర్షితులవుతారో, అదే విధంగా పిల్లలు కూడా హర్షితులవుతారు కానీ నంబరువారుగా. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు - సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగే అవినాశీ రత్న భవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనస్సు రూపీ పాదాన్ని కింద పెట్టకండి ఎందుకంటే మొత్తము విశ్వములోని ఆత్మలలోకెల్లా పరమాత్మునికి అల్లారు ముద్దు అయినవారు, ప్రియమైనవారు మీరే. కావున బాప్‌దాదా పిల్లలకు ఇవే ఆశీర్వాదాలను ఇస్తున్నారు - ఈ పరమాత్మ ప్రేమలోనే లవ్లీనులై ఉండండి. ఇటువంటి లవ్లీనులైన ఆత్మల వద్దకు ఎటువంటి పర-స్థితి లేక మాయా అలజడి రాలేదు. పాదము కింద పెట్టినట్లయితే మాయ కూడా భిన్న-భిన్న ఆటలను ఆడేందుకు వస్తుంది, భిన్న-భిన్న రూపాలను ధరించి ఆకర్షిస్తుంది. లవ్లీన ఆత్మల యొక్క సర్వ శక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ మూడవ నేత్రము, జ్వాలాముఖి నేత్రము మాయను శక్తిహీనంగా చేస్తుంది. కావున విశేష ఆత్మలైన మీ అందరికీ, బ్రాహ్మణులందరికీ బాప్‌దాదా ద్వారా జన్మ తీసుకున్నప్పటి నుండే మూడవ నేత్రము లభించి ఉంది. కానీ బాబా చూస్తున్నారు - అప్పుడప్పుడు పిల్లల యొక్క మూడవ నేత్రము చాలా శ్రమతో కూడిన పురుషార్థము చేస్తూ-చేస్తూ అలసిపోతుంది మరియు అలసిపోయిన కారణంగా మూసుకుపోతుంది. మాయ వద్ద కూడా చూసేటువంటి నేత్రం చాలా దూరదృష్టి కలదిగా ఉంటుంది, దూరం నుండే చూసేస్తుంది. ఇప్పుడిక నా రాజ్యం పోయినట్లే అని ఇప్పుడు మాయ కూడా అర్థం చేసుకుంది, అందుకే మాయకు భయపడకండి. చాలా సంతోషంగా, సర్వ శక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలు ఇవ్వండి. వచ్చేందుకు అవకాశాన్ని ఇవ్వకండి, వీడ్కోలు ఇవ్వండి. మాయ కూడా బ్రాహ్మణ ఆత్మలతో, శ్రేష్ఠ ఆత్మలతో యుద్ధం చేస్తూ-చేస్తూ అలసిపోయింది. బలహీనత కారణంగా మీరే స్వయం మాయను ఆహ్వానిస్తారు. అది అలసిపోయి ఉంది కానీ మీరు ఆహ్వానించేటప్పటికి అది కూడా అవకాశాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవము ఏమి చెప్తుంది? ఇప్పుడు మాయలో ముందు ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా లేక మీరు శక్తిశాలురా? అది ప్రయత్నమైతే చేస్తుంది ఎందుకంటే మీరే ఆహ్వానిస్తారు కనుక అది అవకాశాన్ని ఎందుకు తీసుకోదు. బలహీనులుగా ఎందుకు అవుతారు? బాబా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే - మీరు మాస్టర్ సర్వశక్తిమంతులా కాదా? అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తిమంతులా లేక సదా సర్వశక్తిమంతులా? మీరు ఎవరు? సదా శక్తిశాలురా? మరి ఇప్పుడిక వెళ్ళిపో అని మాయకు చెప్పమంటారా? మీరు దానిని పిలవకండి. ఇప్పుడు సమాప్తం చేయి అని బాబా మాయకు చెప్తారు. అప్పుడు మాయ - నన్ను ఆహ్వానిస్తున్నారు అని బాబాకు చెప్తుంది. మరి బాబా ఏం చెయ్యాలి? ఒకవేళ ఏ రకమైన బలహీనత అయినా మనసులోనైనా, మాటలలోనైనా లేక సంబంధ-సంపర్కములోనైనా వస్తే, అది మాయను ఆహ్వానించడము అని అర్థం చేసుకోండి. దానికి కూడా ఆహ్వానపు వైబ్రేషన్లు చాలా త్వరగా చేరుకుంటాయి.
ఈ మహా ఉత్సవాన్ని అయితే చాలా బాగా జరుపుకుంటున్నారు. కానీ ఉత్సాహము సదా ఉండాలి, అందుకే ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరము చాలా ఉత్సవాలను జరుపుకుంటున్నారు కదా? (ఈ గ్రూపులో ఈశ్వరీయ సేవలో ఆది రత్నాలైన సోదరుల సన్మాన సమారోహమును మరియు టీచరు అక్కయ్యల సిల్వర్ జూబ్లీ కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగింది). ప్రతి గ్రూపులో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కావున బాప్‌దాదా ఈ సంవత్సరము ఉత్సవాన్ని జరుపుకోవటము అనగా మాయకు వీడ్కోలు ఇవ్వటము అని భావిస్తారు. కేవలం గోల్డెన్ చున్నీని వేసుకుని కూర్చోవటం కాదు, గోల్డెన్ చున్నీని ధరించటం అంటే గోల్డెన్ యుగానికి చెందినవారిగా అవ్వటము. దృశ్యమైతే చాలా మంచిగా అనిపిస్తుంది కానీ సదా గోల్డెన్ స్థితి అనే చున్నీని ధరించి ఉండాలి. అలా కాకుండా చున్నీని తీసారు, ఉత్సవం పూర్తయ్యింది, మళ్ళీ ఎలా ఉన్నవారు అలానే ఉండిపోవటము కాదు. ఇది ఉత్సాహాన్ని కలిగించే ఫంక్షన్. కావున ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో లేక జరుపుకోవటానికి వచ్చారో వారు చేతులెత్తండి. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. బాగా జరుపుకోండి కానీ జరుపుకోవటము అనగా తయారవ్వటము మరియు తయారుచెయ్యటము. ఉత్సవాన్ని జరుపుకునే సమయంలో మీకు మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి - సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహములో ఉండే ఆత్మను. బాప్‌దాదాకు కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. కనుక ఈ సంవత్సరాన్ని బాప్‌దాదా మాయకు వీడ్కోలు ఇచ్చే సంవత్సరంగా జరపాలని కోరుకుంటున్నారు. మరి ఇటువంటి ఉత్సవాన్నే జరుపుకుంటారు కదా? రేపు ఏదైతే జరుపుకుంటారో, అది ఈ విధంగానే జరుపుకుంటారు కదా. సిల్వర్ జూబ్లీని జరుపుకుంటారు కదా? గోల్డెన్ జూబ్లీ అయినా లేక సిల్వర్ జూబ్లీ అయినా, అదైతే ఉత్సవమే కదా! మేమైతే సిల్వర్ జూబ్లీ వారము, ముందు గోల్డెన్ జూబ్లీ వారు తయారవ్వాలి, అప్పుడు మేము తయారవుతాము అని అనుకోకండి. ఇలా ఆలోచించకండి. ఎవరైతే జరుపుకోలేదో వారు - ఉత్సవాన్ని జరుపుకునేవారి కోసమే బాప్‌దాదా చెప్తున్నారు అని భావించకండి. ఇది అందరి కోసము చెప్తున్నాము. బ్రాహ్మణ జీవితం యొక్క ఉత్సవాన్ని అయితే జరుపుకున్నారు కదా! బ్రాహ్మణులుగా అయితే అందరూ అయ్యారా లేక బ్రాహ్మణులుగా కూడా అవుతూ ఉన్నారా? అయిపోయారు. కనుక బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే ఆత్మలు అనగా సదా ఉత్సాహములో ఉండటము మరియు ఇతరులను కూడా ఉత్సాహములోకి తీసుకురావటము. ఇదే బ్రాహ్మణుల వృత్తి. ఆ బ్రాహ్మణులైతే నోటితో కథలు వినిపిస్తారు కానీ బ్రాహ్మణులైన మీరు నోటితో మాట్లాడినా, ఉత్సాహాన్ని ఇప్పించేందుకే మాట్లాడుతారు. అవతలి వారు ఎటువంటి ఆత్మ అయినా సరే, మీ విరోధి అయినా సరే... ఎందుకంటే లెక్కాచారం కూడా ఇక్కడే సమాప్తమవ్వాలి, కానీ ఎటువంటి ఆత్మ అయినా సరే, బ్రాహ్మణుల పని ఉత్సాహభరితమైన కథలను వినిపించటము, ఉత్సాహభరితమైన విషయాలను వినిపించటము. వారు ఏడుస్తూ ఉన్నా, మీరు వారిని ఉత్సాహముతో నాట్యం చేయించండి. ఎవరికైనా మనసులో ఉత్సాహము ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాదాలు నాట్యం చెయ్యటం మొదలుపెడతాయి. ఈ ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు చివర్లో ఏం చేస్తారు? అందరూ డ్యాన్స్ చేస్తారు కదా! ఇదైతే పాదాలతో చేసే డ్యాన్స్. బ్రాహ్మణ ఆత్మ ఉత్సాహాన్ని ఇప్పించకుండా, ఉత్సాహములో ఉండకుండా ఉండలేదు. ఉత్సాహాన్ని దూరం చేసే విషయాలు ఉంటున్నాయి మరియు ఉంటాయి కూడా, కానీ బాప్‌దాదా ఈ సంవత్సరములో పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశను పెట్టుకుంటున్నారు - గతం గతః (జరిగిందేదో జరిగిపోయింది), ఈరోజు వరకు ఎటువంటి ఆత్మలు సంబంధ-సంపర్కములో ఉన్నా, వారు ఎటువంటివారైనా సరే, నెగెటివ్ వారైనా, ఎదిరించేవారైనా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా కానీ ఈ సంవత్సరము నెగెటివ్ మరియు వ్యర్థమైన దృష్టికోణాన్ని సమాప్తం చెయ్యండి. స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఒకవేళ స్నేహాన్ని ఇవ్వలేకపోతే, శక్తిని ఇవ్వలేకపోతే, చూస్తూ, వింటూ, సంపర్కములోకి వస్తూ వ్యర్థమైన మరియు నెగెటివ్ విషయాలను మనసులో పెట్టుకోకుండా అవాయిడ్ చెయ్యండి (దూరం పెట్టండి). మనసు మరియు బుద్ధిలో ధారణ అవ్వకూడదు, అవాయిడ్ చెయ్యండి. పరివర్తన చెయ్యండి. నెగెటివ్‌ను మరియు వ్యర్థాన్ని పరివర్తన చేసి మనసులో ఇముడ్చుకోండి. ఇలా ఈ రెండు విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో, వారికి బాప్‌దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారము ద్వారా అత్యంత మంచి మరియు అత్యంత పెద్ద అవార్డ్ లభిస్తుంది. ఇతర ఆత్మలకైతే ఆత్మలే అవార్డు ఇస్తారు. అవార్డులు లభిస్తాయి కదా? మరి ఇది పరమాత్మ ఇచ్చే అవార్డ్. అవాయిడ్ చెయ్యండి, అవార్డ్ తీసుకోండి. ధైర్యము ఉందా? అచ్ఛా.
పాండవులలో ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో, వారిలో ధైర్యము ఉందా? అవార్డ్ తీసుకుంటారా? అందరూ చేతులెత్తారు, ఈరోజు తారీఖును అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు తారీఖు ఏంటి? (14 డిసెంబరు) కావున ప్రతి మాసంలో 14వ తారీఖున స్వయాన్ని చెక్ చేసుకోండి. అచ్ఛా - సిల్వర్ జూబ్లీ వారు ఎవరైతే అవార్డ్ తీసుకుంటామని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి. సిగ్గుగా అనిపిస్తుందని చేతులెత్తకండి. బాప్‌దాదా అవకాశాన్ని ఇస్తున్నారు, ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేకపోతే ఎత్తకండి, ఏం ఫర్వాలేదు. బాప్‌దాదా ఇంకా ఎక్కువ సకాష్ ఇస్తారు, వేరే ఏమీ కాదు. ఇంకా కొంచెం ధైర్యం కావాలి అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? సిల్వర్ జూబ్లీ చేసుకున్న టీచర్లు ఎవరైనా అలా ఉన్నారా? సరే, ఇక్కడ చేతులు ఎత్తకపోయినా, సిగ్గుగా అనిపిస్తుంటే తర్వాత వ్రాసి ఇవ్వండి. ఫంక్షన్ జరుపుకునేటప్పుడు వ్రాసి ఇవ్వండి, ఒకవేళ మాకు ఎక్స్ట్రా ధైర్యం కావాలి అని అనిపిస్తే, దాని కోసం విశేషంగా ట్యూషన్ పెడతాము. ఎవరైతే చదువులో బలహీనంగా ఉంటారో, వారికి ఏం చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా! అచ్ఛా. మధుబన్ వారు చేతులెత్తండి. నిలబడండి. మధుబన్ వారు అవకాశాన్ని బాగా తీసుకుంటారు. అచ్ఛా, మధుబన్ వారు అవార్డ్ తీసుకుంటారా? అందరూ చేతులెత్తారా? ట్యూషన్ అవసరం లేదా? ధైర్యవంతులు. అచ్ఛా - బాప్‌దాదా లెక్క తీసుకుంటారు. మధుబన్ వారికి అభినందనలు.
ఇకపోతే మూలమూలల నుండి వచ్చిన స్నేహి, సహయోగి, సంబంధంలో ఉండే పిల్లలు వచ్చారు, వారికి విశేషంగా బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు, రెండు, మర్యాదలలో నడుచుంటున్నందుకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. కనీసం ఒక సంవత్సరం మర్యాదలలో నడుచుకున్నారు, అందుకే ఇక్కడకు చేరుకున్నారు. కొందరు చతురులు కూడా ఉంటారు కానీ మెజారిటీ మర్యాదలను పాలన చేసినవారే ఉన్నారు. మరి ప్రవృత్తిలో ఉంటూ మర్యాదలలో నడుచుకునేవారు, మర్యాదలను పాటించే ఆత్మలకు మర్యాదలను పాటించినందుకు కూడా అభినందనలు తెలుపుతున్నాము.
అచ్ఛా, మేము మాయకు వీడ్కోలు చెప్తాము అని మాతలు ధైర్యమును ఉంచుతారా? ఉంచుతాము అని భావిస్తే ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అచ్ఛా – ప్రవృత్తిలో ఉండే పాండవులు, ధైర్యము ఉందా? అవార్డ్ తీసుకుంటారా? ఒక్క చేతి చప్పట్లు కొట్టండి. బాప్‌దాదాకు అయితే సంతోషంగా ఉంటుంది, చూడండి, బేహద్దు హాలు, బేహద్దు నషా ఉంటుంది కదా. సౌకర్యంగా కూర్చునేందుకు స్థానమైతే ఉంది కదా! ఇంత దూరం నుండి చూడలేకపోతున్నాము అని మీరు ఫిర్యాదు చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చాలా సౌకర్యంగా కూర్చుని వింటున్నారు, టి.విలో కూడా చూడవచ్చు. 9 లక్షలు తయారైతే అప్పుడు ఏమి చేస్తారు? అప్పుడు కూర్చునేందుకు స్థానము లభిస్తుందా? అందుకే, ఎవరైతే ముందు వస్తారో వారు భాగ్యవంతులు. ఎలా అయితే ఇప్పుడు మీరు మీకన్నా ముందు వచ్చిన వారి భాగ్యాన్ని మెచ్చుకుంటారు కదా, మీరు చాలా భాగ్యవంతులు అంటారు కదా, అలా, ఇప్పుడు మీరెవరైతే వచ్చారో, మిమ్మల్ని చూసి మీ తర్వాత వచ్చే వారు కూడా మీ భాగ్యాన్ని మెచ్చుకుంటారు అని బాప్‌దాదా చెప్తున్నారు. వృద్ధి అయితే జరగాలి కదా? లేకపోతే రాజధాని ఎలా తయారవుతుంది?
ఈ సంవత్సరము వీడ్కోలు మరియు అభినందనలకు చెందినది మరియు ఈ సంవత్సరములో విశేషంగా పిల్లలు ఏదైతే సంకల్పము చేసారో, దానిని ప్రాక్టికల్‌గా చేసేవారికి బాప్‌దాదా యొక్క ఎక్స్ట్రా సహాయము కూడా లభిస్తుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్యమధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది కానీ సంకల్పములో దృఢంగా ఉండండి. సంకల్పము రూపీ పాదము కదలకూడదు, చలించకుండా ఉండాలి, అప్పుడు బాప్‌దాదా ద్వారా ఎక్స్ట్రా సహాయము అనుభూతి అవుతుంది. కేవలం దానిని తీసుకునే శక్తి కావాలి. ఒకే బలము, ఒకే నమ్మకము... ఏం జరిగినా కానీ, తయారవ్వాల్సిందే. ఈ సంకల్పము రూపీ పాదాన్ని దృఢంగా పెట్టుకోండి. కావున విషయాలైతే వస్తాయి కూడా, కానీ ఎలా అనుభవం చేస్తారంటే విమానంలో వెళ్ళేటప్పుడు మేఘాలు కిందనే ఉండిపోతాయి మరియు స్వయం మేఘాలపైన ఉంటారు. మేఘాలు ఒక మనోరంజక దృశ్యంగా అవుతాయి. అలా ఎంతటి కారు మబ్బులలాంటి విషయాలైనా కానీ, అక్కడ సమస్యకు పరిష్కారము లేక సమాధానము ఆ సమయములో కనిపించకపోయినా కానీ, ఈ మబ్బులు వెళ్ళిపోయేందుకే వచ్చాయి, ఈ మేఘాలు చెదిరిపోయేదే ఉంది, ఉండిపోవు అన్న దృఢ నిశ్చయము ఉండాలి. ఇటువంటి ఎగిరే కళ యొక్క స్థితిలో స్థితులైపోండి, అప్పుడు ఎంతటి గాఢమైన కారు మబ్బులైనా కానీ చెదిరిపోతాయి మరియు మీరు దృఢతా బలంతో సఫలురుగా అయ్యే తీరుతారు. ఇది ఎలా అవుతుంది అని భయపడకండి! మంచే అవుతుంది, ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు, సమయము ఎంతగా సమీపంగా వస్తూ ఉంటుందో అంతగానే కొత్త-కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాలు అనే కారు మబ్బులు వస్తాయి. ఇక్కడే అన్నీ సమాప్తమవ్వనున్నాయి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - రోజురోజుకూ ఇటువంటి విషయాలు ఎక్కువవుతూనే ఉన్నాయి ఎందుకు? ఏ పిల్లలైతే ధర్మరాజుపురిని దాటేది లేదో, అటువంటివారికి సంగమము యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాలకు చెందిన అన్ని లెక్కాచారాలు ఇక్కడే సమాప్తమవ్వవలసి ఉంటుంది. ధర్మరాజుపురిలోకి వెళ్ళేది ఉండదు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతలు, ఇవి ఇక్కడే అంతమవ్వనున్నాయి, అందుకే జబ్బు బయటకు రావటము అనేది అది అంతమయ్యేందుకు గుర్తు. సమయం సమీపంగా ఉంది అన్నదైతే కనిపించటం లేదు, ఇంకా వ్యర్థ సంకల్పాలు ఎక్కువవుతున్నాయి... అని ఆలోచించకండి! ఇవి సమాప్తమయ్యేందుకే బయటకు వస్తూ ఉన్నాయి. వాటి పని రావటము మరియు మీ పని ఎగిరే కళ ద్వారా, సకాష్ ద్వారా పరివర్తన చెయ్యటము. భయపడకండి. కొంతమంది పిల్లల విశేషత ఏమిటంటే బయటకు భయపడటం కనిపించదు కానీ లోపల మనసు భయపడుతూ ఉంటుంది. బయటకేమో - లేదు, లేదు, ఏమీ లేదు, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది అని అంటారు. కానీ లోపల దాని సెగ ఉంటుంది. అందుకే బాప్‌దాదా ముందు నుండే వినిపిస్తున్నారు - భయపెట్టే విషయాలు వస్తాయి కానీ మీరు భయపడకండి. మీ శస్త్రాలను వదిలిపెట్టకండి. ఎవరైతే భయపడతారో, భయపడినప్పుడు వారి చేతిలోని వస్తువులు జారి కిందపడిపోతాయి. అలాగే మనసులో కూడా భయపడుతారు కదా, అప్పుడు శస్త్రాలు లేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పడిపోతాయి, మర్జ్ అయిపోతాయి, అందుకే భయపడకండి, మీకు ముందు నుండే తెలుసు. త్రికాలదర్శులుగా అవ్వండి, నిర్భయులుగా అవ్వండి. బ్రాహ్మణులు పరస్పరం సంబంధాలలో నిర్భయులుగా అవ్వద్దు, మాయ విషయంలో నిర్భయులుగా అవ్వండి. సంబంధాలలోనైతే స్నేహము మరియు నిర్మానత ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మనస్ఫూర్తిగా స్నేహాన్ని ఇవ్వండి, శుభ భావనను ఇవ్వండి, దయ చూపించండి. నిర్మానులుగా అయ్యి వారిని ముందు ఉంచి ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి. దీనినే కారణము రూపీ నెగెటివ్‌ను సమాధానము రూపీ పాజిటివ్‌గా చెయ్యటము అని అంటాము. ఈ కారణము, ఈ కారణము, ఈ కారణము... కారణము లేక సమస్యను పాజిటివ్ సమాధానముగా చెయ్యండి.
బాప్‌దాదాకు ఒక విషయంలో అప్పుడప్పుడు నవ్వు వస్తుంటుంది. అది ఏ విషయమో తెలుసా? తెలుసా? ఒక వైపేమో ఛాలెంజ్ చేస్తారు - బాబా, మేము ప్రకృతి జీతులుగా అవుతాము, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము, ఇలా అంటారు కదా? ప్రకృతిని మారుస్తారు కదా? ఇలా ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చెయ్యగలరు. కానీ సంబంధ-సంపర్కాలలో ఏవైనా విషయాలు వస్తే వాటిని సమాధానపరచలేకపోతారు, పరివర్తన చెయ్యలేకపోతారు. ఇది నవ్వొచ్చే విషయం కదా - ప్రకృతి జడమైనది, దాని విషయంలోనైతే ఛాలెంజ్ చేస్తారు కానీ బ్రాహ్మణ ఆత్మలను పరివర్తన చెయ్యటము అనేది చెయ్యలేకపోతారు. ఇంకా ఏం ఆలోచిస్తారు? ఇది జరగదు, ఇది జరిగేదే లేదు, ఇది జరగనే జరగదు, మారనే మారరు. మరి అటువంటప్పుడు ప్రకృతిని ఎలా మారుస్తారు? స్వయం మారి ఇతరులను మార్చండి. సరే, వారు తప్పు, 100 శాతము తప్పు. కానీ మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? బాబాతో ఏ ప్రతిజ్ఞను చేసారు? స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన చేస్తాము, ఈ ప్రతిజ్ఞను చేసారా లేక మర్చిపోయారా? చేసాము అనైతే అందరూ అంటారు. ఎటువంటి విషయాలైనా సరే, విషయాలను మార్చేందుకు సహాయం తీసుకోండి కానీ వీరు మారటమే కష్టము అన్న ఈ సర్టిఫికేట్‌ను ఇవ్వకండి. సర్టిఫికేట్ ఇవ్వడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? ఇదైతే జరిగేదే లేదు, వీరైతే బాగుపడనే బాగుపడరు అని ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని జడ్జిగా ఎవరు చేసారు? ఊరికే అలా జడ్జి కుర్చీపై కూర్చుండిపోతారా? లేదంటే వకీలుగా అవుతారు. చాలా నియమాలు, చట్టాలు చెప్తారు, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని వాదిస్తారు. వకీలుగానూ అవ్వవద్దు, జడ్జిగానూ అవ్వవద్దు. ఈ అధికారాన్ని బాప్‌దాదా ఇవ్వలేదు. ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో వారి సహయోగాన్ని తీసుకోండి. ఆ నిమిత్త ఆత్మలు కూడా బాప్‌దాదా సలహాతోనే చేస్తారు. వారు తమ మన్మతాన్ని నడిపించరు.
కనుక ఈ సంవత్సరంలో ఈ అన్ని విషయాలను సమాప్తము చెయ్యండి అనగా మనసులో పరివర్తన చెయ్యండి, అవాయిడ్ చెయ్యండి. పైన ఉన్నవారి వరకు విషయాన్ని చేర్చారు, ఇక మీ బాధ్యత సమాప్తము. మీ ద్వారా పరివర్తన అవ్వకపోతే నిమిత్త ఆత్మల వరకు విషయాన్ని చేర్చటము మీ బాధ్యత. ఇక లా ను మీ చేతిలోకి తీసుకోకండి, అప్పుడే అవార్డుకు పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహములో ఉండండి మరియు ఉత్సాహాన్ని పెంచండి, ఈ స్మృతిలోనే బాప్‌దాదా ఇమర్జ్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్వయం ఉత్సాహములో ఉంటారో అప్పుడు అందరి చేతులను చేతిలోకి తీసుకుని అనగా మనస్సులోని స్నేహమనే చేతితో చేతిని కలిపి నాట్యము చేస్తారు, సంతోషంగా ఉంటారు. స్థూలమైన చెయ్యి కాదు, మనసుతో స్నేహమనే సహయోగము యొక్క చెయ్యి. దీనినే చేతితో చేతిని కలపటము అని అంటాము. స్నేహమనేది ఏదైనా చేస్తుంది, ఎందుకు చెయ్యలేదు! అంతేకాక ఇది పరమాత్మ స్నేహము, పరమాత్మ ప్రేమ. ఇది చేయలేనిది ఏముంది! అసంభవము అనేది బ్రాహ్మణుల డిక్షనరీలో లేనే లేదు. ఉత్సాహము కలవారు ఎప్పుడూ ఏ విషయములోనూ నిరాశకు, దుఃఖానికి లోను అవ్వరు. అచ్ఛా!
మరి, ఈ పాండవులు ఎవరైతే విశేషంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారో, వారు ఏమి చేస్తారు? నాకు పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అని పాండవులు ప్రతి ఒక్కరూ ఈ దృఢ సంకల్పం చేయండి, ఎందుకంటే మీరు ఆది పాలన పొందినవారు కదా! మరి బ్రహ్మా బాబా ఏమి చేశారు? బాధ్యతను తీసుకున్నారు కదా! లేక, ఇతడు మారడమే లేదు, ఇది జరగడమే లేదు అని అన్నారా? కాదు. ఇన్ని ఆత్మలలో పరివర్తన తీసుకువచ్చి చూపించారు కదా! సరే, ఇతరులను చూడకండి; కనీసం మిమ్మల్ని మీరు చూడగలరు కదా! మీలో పరివర్తన చేసుకున్నారా? లేక మీ బలహీనతలనే చూస్తూ ఉన్నారా? కాదు. కాబట్టి బ్రహ్మా బాబా పాలన పొందిన మీరు బ్రహ్మా బాబాను అనుసరించడానికి నిమిత్తులు. ఇందులో, ఇది పెద్దల బాధ్యత, మేమైతే డైరెక్షన్ ప్రకారం నడిచేవాళ్లం అని అనుకోకండి. కాదు. స్వ-పరివర్తన ద్వారా అందరి సంబంధ-సంపర్కాలలో పరివర్తన తీసుకురావడం ప్రతి చిన్నా పెద్దా ఆత్మ యొక్క బాధ్యత. ఏమవుతారు అని బాప్‌దాదా అడిగితే అందరూ ఏమంటారు? విశ్వ రాజులమవుతాము అంటారు. చిన్నా-చితకా కాదు, విశ్వ మహారాజులమవుతాము అంటారు. మరి విశ్వ మహారాజులయ్యే బాధ్యత ఉన్నప్పుడు, సంబంధ-సంపర్కాలలో పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత లేదా? ప్రతి ఆత్మ బాబా పాలనకు ప్రతిఫలంగా పరివర్తన చేయడంలో బాధ్యతగలది, సహయోగి. అంతేనా? ఈ గ్రూపు పాలన పొందిన గ్రూపు. కాబట్టి పాలన పొందిన దానికి ప్రతిఫలం – బాబా సమానంగా పాలన ఇవ్వడం. ఇందులో మీరెప్పుడూ చిన్నవారిగా భావించకండి. ఇందులో ప్రతి ఒక్కరూ గొప్పవారే. ఒక సంవత్సరం క్రితం వచ్చినవారైనా బాధ్యతగలవారే. మరి మీరు 30 సంవత్సరాల నుండి ఉన్నవారు. అందుకే బాప్‌దాదా ఈ గ్రూపును పరివర్తక గ్రూపు అని అంటారు. అవసరమైతే ఎక్కడైనా వంగవలసి వచ్చినా సరే. బ్రహ్మా బాబా వంగలేదా? వ్యతిరేకతను చూడలేదా? అత్యధిక నిందలను బ్రహ్మా బాబానే భరించారు. అత్యంత వ్యతిరేకతను కూడా బ్రహ్మా బాబానే చూశారు. ఇప్పుడు ఇద్దరు-నలుగురు వ్యతిరేకించినా దానిలో పెద్ద విషయం ఏముంది? అర్థమైందా, ఇది ఏ గ్రూపు? పరివర్తక గ్రూపు. బాగుందా? ఈ పేరు నచ్చిందా? పని కూడా నచ్చిందా? పేరు మాత్రమే కాదు, పని కూడా.
అచ్ఛా, సిల్వర్ జూబిలీ గ్రూపు ఏమి చేస్తుంది? వీరంతా నిమిత్త టీచర్లే. కాబట్టి ఈ సిల్వర్ జూబిలీ గ్రూపు తమ ఉత్సాహపూరిత లక్షణాల ద్వారా, ఎల్లప్పుడూ హర్షితంగా, సంతోషంగా ఉండే లక్షణాల ద్వారా అనేక ఆత్మలను ఆనందపరుస్తారు. టీచర్ల పని ఏమిటంటే – ఏడుస్తూ వచ్చినవారు నాట్యం చేస్తూ వెళ్లాలి. బాధతో వచ్చినవారు తమ గౌరవంలో (శాన్) స్థితులై వెళ్లాలి. పరేశాన్ అంటే తన శాన్‌కు దూరమవడం. కాబట్టి టీచర్ల పని – పరేశాన్ అయినవారిని తిరిగి శాన్‌లో స్థితుల్ని చేయడం. ఇదే సిల్వర్ జూబిలీ జరుపుకునేవారి సేవ. అంతేకానీ మీరే పరేశాన్ అవ్వకండి. కొందరు జిజ్ఞాసువులు కూడా అంటారు – మేము బయట నుండి పరేశాన్ అయి వస్తే, కొన్నిసార్లు అందరూ కాదు కానీ ఒక్కో టీచరే పరేశాన్గా ఉంటారు. మరి వారు మమ్మల్ని శాన్‌లో ఎలా స్థితుల్ని చేస్తారు? కానీ కాదు. టీచర్ అంటే ఎల్లప్పుడూ తన లక్షణాల ద్వారా ప్రతి ఆత్మకు సేవ చేయాలి. మాట్లాడే సమయం లేకపోయినా ఫరవాలేదు. ఒక్క సెకనులో తన హర్షిత హృదయం ద్వారా, హర్షిత మనస్సు ద్వారా, పరమాత్మ స్నేహంతో (ఆత్మీయ స్నేహం కాదు), దృష్టి ద్వారా ఆ ఆత్మను కూడా హర్షితంగా చేయాలి. టీచర్లు ఎప్పుడైనా పొరపాటున పరేశాన్ అయినా – అవ్వకూడదు కానీ పొరపాటున అయినా – వెంటనే బాప్‌దాదాతో కనెక్షన్ జోడించి, ఆత్మిక సంభాషణ చేసి, అదే సమయంలో తమను తాము సరిచేసుకోవాలి. ఇక్కడ బాప్‌దాదాతో కనెక్షన్ చేసే డ్రామా చూపించారు కదా! (నిన్న బొంబాయి చిన్న పిల్లలు బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణ చేసే డ్రామా చేశారు.) మరి మీరు బాప్‌దాదాతో కనెక్షన్ పెట్టలేరా? మీ దగ్గర వైర్లెస్ సెట్ లేదా? ఈ రోజుల్లో శాటిలైట్ ఉంది కదా, వెంటనే కనెక్ట్ అవుతుంది. మరి టీచర్ల దగ్గర ఉందా? అందరి దగ్గర ఉంది. సమయానికి ఉపయోగించండి చాలు. సరైన సమయంలో కేవలం స్మృతి అనే స్విచ్‌ను ఆన్ చేయండి. అంతే. అప్పుడు చూడండి, ఒక్క సెకనులో పరివర్తన జరుగుతుందో లేదో. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ డ్రామాను గుర్తు చేసుకోండి. కనెక్షన్ పెట్టండి. మరి, సిల్వర్ జూబిలీ గ్రూపు ఏమి చేయాలో అర్థమైందా? బాప్‌దాదాకు టీచర్లే ఎక్కువగా గుర్తుంటారు. ఎందుకంటే సేవకు నిమిత్తమైన వారు బ్రహ్మా బాబా భుజాలుగా నిమిత్తులయ్యారు. అంటే బాబా సమానంగా సేవలో ఉన్నారు కదా! అందుకే ఇలాంటి నిమిత్త సేవాధారులు బాప్‌దాదాకు ఎప్పుడూ గుర్తుంటారు. గోల్డెన్ జూబిలీ చేసుకున్నవారే గుర్తుంటారు, మేము కాదు అని అనుకోకండి. ముందు మీరే. చిన్నవారిపై మరింత ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే ఇప్పటి నుండి నేను మారాలి. చెడిపోయిన దానిని నేను సరిచేయాలి. ఇతరులు చెడగొట్టినా, నా పని సరిచేయడం – ఇదే భావన ఉండాలి. వారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనే ఫిర్యాదు కాదు. వారు చెడగొట్టడంలో నైపుణ్యం కలవారు; మీరు మీ పనిలో నైపుణ్యం కలవారై ఉండండి. చెడగొట్టేవాడు నైపుణ్యం కలవాడైతే, సరిచేసేవాడు ఎందుకు తక్కువ కావాలి? మీరు నైపుణ్యం కలవారైపోండి. ఇతరులు ఏమి చేసినా సరే. చెడిపోయిన దానిని బాగు చేసే బాబా సమానమైన ఆత్మలు మీరే. ఈ పని చేస్తారా? అయితే చేతులు ఊపండి. చేస్తారా? పక్కాగా? లేక అక్కడికి వెళ్లాక, దాదీ, మేమేం చేయాలి అని అంటారా! ఫిర్యాదు చేయరు కదా? ఈ రోజు ఈ శాంతివన్ డైమండ్ హాల్లోనే ఫిర్యాదుల ఫైల్ మొత్తాన్ని ముగించేసి వెళ్లండి. హర్షితంగా ఉండాలి, ఇతరులను కూడా హర్షితుల్ని చేయాలి. సరేనా? సిల్వర్ జూబిలీ వారిని కలిశాము కదా! ఇక, మమ్మల్ని కలవలేదు అనే ఫిర్యాదు ఉండదు కదా? ఈ రోజు రెండు గ్రూపులు ఉన్నాయి. కానీ బాబాకు పాండవులు కూడా ప్రియమే, టీచర్లు కూడా ప్రియమే. మరి ఏమనుకుంటున్నారు? ఇది సాధ్యమా? తల ఊపండి. పాండవులారా, ఇది సాధ్యమేనా? లేక, ఇది జరగాల్సిందే అంటారా? ప్రతి ఒక్కరూ తల ఊపండి. మేము చేయకపోతే మరెవరు చేస్తారు? అని చెప్పండి. బాప్‌దాదా ఆశల సితారలు మీరే. మీరు చేయకపోతే మరెవరు చేస్తారు? అచ్ఛా.
మాతలందరూ సంతోషంగా ఉన్నారా? ఏమైనా ఇబ్బంది కలిగిందా? (అందరూ చప్పట్లు కొట్టారు.) వీరికి ఈ రెండు చేతులతో చప్పట్లు కొట్టడం చాలా ఇష్టం. అచ్ఛా, పాండవులందరూ బాగున్నారా? ఎలాంటి ఇబ్బంది లేదా? శాంతివన్ బాగా నిర్మించబడిందా? నచ్చిందా? బాప్‌దాదా చాలా సంతోషిస్తారు, ఎందుకంటే పిల్లలందరి సహకారంతో ఈ శాంతివన్ నిర్మించబడింది. మీ అందరి సహకారంతో ఈ స్థలం ఏర్పడింది. అందుకే శాంతివన్‌కు సహకరించిన ఆత్మలందరికీ బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. చూడండి, ప్రతి సీజన్లో డబల్ విదేశీయుల వల్ల ఎంతో అందం పెరుగుతుంది. డబల్ విదేశీయులు మధుబన్కు అలంకారం. మిమ్మల్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు విదేశీయులు విదేశీ సంస్కృతి అనే గోడలను చెరిపివేసి వచ్చారు. ఆ పాట ఉంది కదా – అది డబల్ విదేశీయులకే చాలా చక్కగా సరిపోతుంది. భారతీయులు కూడా గోడలు దాటి వచ్చే ధైర్యం చేశారు, కానీ డబల్ విదేశీయులు డబల్ గోడలను దాటి తమ విశేష పాత్రను నమోదు చేసుకున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ డబల్ విదేశీయులు ఉన్నారో, వింటున్నారో, వారందరికీ కూడా బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. డబల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ కుటుంబంలోని విశేష వజ్రాలు. వజ్రం ఎంత ప్రకాశిస్తుందో, ఎంత అందంగా ఉంటుందో! అలాగే డబల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ కుటుంబంలో, బ్రాహ్మణ యుగంలో ఎంతో ప్రకాశిస్తున్న విశేష ఆత్మలు. విదేశాల నుండి లేఖలు కూడా వచ్చాయి. లేఖలు పంపిన వారి హృదయ విషయాలన్నీ బాప్‌దాదా దగ్గరకు చేరుతూనే ఉంటాయి. ఉల్లాస-ఉత్సాహాలు మరియు తీవ్ర పురుషార్థం యొక్క సువాసన చాలా బాగుంది. సమయం గడుస్తున్న కొద్దీ బాప్‌దాదా చూస్తున్నారు – ఇప్పుడు ఎక్కువమంది డబల్ విదేశీయులు జ్ఞానంలో మంచి ప్రావీణ్యం పొందారు. మాయను గుర్తించే దృష్టి కూడా ఇప్పుడు చాలా పదునుగా మారుతోంది. అందుకే బాప్‌దాదా ఆ లేఖల నుండి సువాసనను ఆస్వాదిస్తారు. వీరు నిజాయితీ గల హృదయం కలవారు. పడిపోయిన విషయాన్ని కూడా నిజాయితీగా రాస్తారు; ఎగిరిన విషయాన్ని కూడా నిజాయితీగా రాస్తారు. వీరి హృదయం స్వచ్ఛమైనది. ఎక్కడ స్వచ్ఛమైన హృదయం ఉంటుందో అక్కడ బాప్‌దాదా ఎల్లప్పుడూ అంటారు – స్వచ్ఛమైన హృదయం, కోరికల సాఫల్యం. ఏ ఉల్లాసాలు, ఏ ఆశలు ఉంచుకుంటారో అవి తప్పకుండా నెరవేరుతాయి. అంటే వారి కోరికలు ఫలిస్తాయి. బాప్‌దాదా సహాయాన్ని క్యాచ్ చేసుకోవడంలో కూడా వీరు చాలా మంచి వారు. అందుకే లేఖలు పంపినవారికీ, తమ తమ స్థానాల్లో వింటున్నవారికీ, ప్రపంచమంతటా ఉన్న డబల్ విదేశీయులందరికీ బాప్‌దాదా హృదయపూర్వకంగా పదమారెట్లు ప్రియస్మృతులు, అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా.
బొంబాయి సేవాధారి గ్రూపు చేతులు ఎత్తండి. చాలా బాగా చేశారు. బాప్‌దాదా బొంబాయిని ఎప్పుడూ నర్-దేసావర్ అంటారు – సంపాదించే బిడ్డ. బాప్‌దాదాకు బొంబాయి ఎప్పుడూ గుర్తుంటుంది. ఎంతో ధైర్యంతో సేవ చేస్తున్నారు. అందరూ సంతృప్తిగా ఉన్నారు, అందుకు అభినందనలు. బొంబాయిలో చాలా మంచి మహారథులు ఉన్నారు. ఒకరు మరొకరికి మించినవారే. ఎవ్వరూ ఎవరికీ తక్కువ కాదు. బాప్‌దాదా విశేషత ఆధారంగా చెబుతున్నారు. చాలా మంచి ధైర్యం చూపించారు. బొంబాయిలో సేవ ఒక మంచి వేదికపైకి వచ్చింది అన్నందుకు బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. బాగుంది కదా! సేవ యొక్క వేదిక కూడా చాలా మంచిదే కదా! అచ్ఛా. ప్రతి ఒక్కరూ తమ పేరుతోనే అర్థం చేసుకోవాలి – ఈ అభినందనలు, ఈ ప్రియస్మృతులు ప్రత్యేకంగా నాకే." పేర్లు మాత్రమే చెప్పడం లేదు. పేర్లు చెప్పడం ప్రారంభిస్తే అది ఒక మాలగా మారిపోతుంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న పరమాత్మ ప్రేమ అనే సుఖమయ, ఆనందమయ ఊయలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు, సదా దృఢ సంకల్పము ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా పరమాత్మ ఇచ్చే అవార్డును తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారీ ఆత్మలకు, సదా బాప్‌దాదా యొక్క పాలనకు రిటర్న్ ఇచ్చే బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మలకు బాప్‌దాదా యొక్క పదమా గుణాల, కోటానుకోట్ల కంటే కూడా ఎక్కువ ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకి మరియు సర్వ దాదీలకు దృష్టినిస్తూ:-
మంచి డ్యూటీ తీసుకున్నారా? అందరినీ సంతోషంలో నాట్యం చేయించే డ్యూటీ బాగుంది. ఇప్పుడు ఇదే కావాలి. శిక్షణను వినడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి సర్వ ఆది రత్నాలు ఈ డ్యూటీని విశేషంగా నిర్వహించండి. ఎవరెలా ఉన్నా సరే, మీ ఎదుటకు రాగానే సంతోషంతో నాట్యం ప్రారంభించాలి. మీరు డైరెక్టుగా దాత యొక్క పిల్లలు కదా మరియు మొదటి రచన కదా. కాబట్టి ఆది రచన యొక్క ప్రభావం అయితే ఉంది కదా. అందుకే బాప్‌దాదా కూడా ఆది రత్నాలకు విశేషంగా స్పెషల్ స్నేహాన్ని ఇస్తారు. ఇప్పుడు వాతావరణాన్ని వ్యాపింపజేసే అటువంటి సహయోగులను తయారు చేయండి. అచ్ఛా.
*** ఓంశాంతి ***
