‘‘మీ ముఖము ద్వారా బాబా గుణాన్ని ప్రత్యక్షము చెయ్యండి, అప్పుడు ప్రత్యక్షత నగారా మ్రోగుతుంది’’
ఈరోజు బాప్‌దాదా రెండు విశాల సభలను చూస్తున్నారు. ఒకటేమో, సాకార రూపములో మీరందరూ సమ్ముఖంగా ఉన్నారు, మరియు రెండవది, అవ్యక్త రూపములో ఉన్న విశాల సభను చూస్తున్నారు. నలువైపులా ఉన్న అనేకమంది పిల్లలు ఈ సమయములో అవ్యక్త రూపంలో తండ్రిని సమ్ముఖంగా చూస్తున్నారు, వింటున్నారు. రెండు సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి. ఈరోజు విశేషంగా అందరి మనసులలో బ్రహ్మా బాబా యొక్క స్మృతి ఇమర్జ్ అయి ఉంది ఎందుకంటే బ్రహ్మా బాబాకు ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. అందరికీ బ్రహ్మా బాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహము ఉంది ఎందుకంటే బ్రహ్మా బాబాకు కూడా ఒక్కొక్క బిడ్డ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏ విధంగా పిల్లలైన మీరు ఇక్కడ సాకారములో బ్రహ్మా బాబా యొక్క గుణాలను మరియు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటారో, అలాగే బ్రహ్మా బాబా కూడా పిల్లలైన మీ విశేషతలను, సేవలను గుణగానం చేస్తారు. మరి బ్రహ్మా యొక్క అవ్యక్త ధ్వని మీ అందరి వద్దకు చేరుకుంటుందా? మీరందరూ విశేషంగా అమృతవేళ నుండి ఏవైతే మధురాతి-మధురమైన విషయాలను మాట్లాడుతారో మరియు మధురాతి-మధురమైన ఫిర్యాదులను కూడా చేస్తూ ఉంటారో, వాటిని బ్రహ్మా బాబా విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు మరియు ఏమని గుణగానం చేస్తారు? వాహ్ నా చాలా కాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలూ, తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలూ వాహ్! బ్రహ్మా బాబా ఇప్పుడు పిల్లలైన మీ పట్ల ఏ శుభమైన ఆశలను పెట్టుకుంటారో తెలుసా?
నా పిల్లలు ప్రతి ఒక్కరూ తమ మూర్తి ద్వారా బాబా గుణాన్ని చూపించాలి - ఇదే బాబా కోరుకుంటున్నారు. ముఖాలు వేర్వేరుగా ఉన్నా కానీ అందరి ముఖం ద్వారా బాబా గుణము కనిపించాలి. మిమ్మల్ని ఎవరు చూసినా, మీ సంబంధములోకి ఎవరు వచ్చినా - వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి, మీలో బాబా కనిపించాలి, అప్పుడే సమయ సమాప్తి జరుగుతుంది. అందరి మనసుల నుండి ‘నా బాబా వచ్చేసారు, వారు నా తండ్రి’ అన్న ధ్వని వెలువడాలి. బ్రహ్మాకుమారీల తండ్రి అని కాదు, వారు నా తండ్రి. ఎప్పుడైతే అందరి మనసుల నుండి ‘నా బాబా’ అన్న ధ్వని వెలువడుతుందో, అప్పుడే ఈ ధ్వని నలువైపులా నగారాలా మ్రోగుతుంది. సైన్స్ సాధనాలు ఏవేవైతే ఉన్నాయో, ఆ సాధనాల నుండి - ‘నా బాబా వచ్చారు’ అన్న ఈ నగారా మ్రోగుతూ ఉంటుంది. ఇప్పుడేదైతే చేస్తున్నారో, దానిని చాలా మంచిగా చేసారు మరియు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అందరి నగారా కలిసి మ్రోగనున్నది. ఎక్కడ విన్నా కూడా - ‘రావాల్సినవారు వచ్చేసారు’ అన్న ఒకటే ధ్వనిని వింటారు, దీనినే బాబా యొక్క స్పష్టమైన ప్రత్యక్షత అని అంటాము. ప్రస్తుతం పేరు ప్రసిద్ధమైంది. మొదటి అడుగుగా - బ్రహ్మాకుమారీలు-బ్రహ్మాకుమారులు మంచి పని చేస్తున్నారు అని పేరు ప్రత్యక్షమైంది. ప్రస్తుతం విద్యాలయం గురించి మరియు కార్యం గురించి, జ్ఞానం గురించి మహిమ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. అలాగే, ఇటువంటి కార్యాన్ని మరెవ్వరూ చెయ్యలేరు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతవరకు చేరుకున్నారు. ఈ విషయం స్పష్టమైంది, నలువైపులా ఈ విషయానికి మహిమ జరుగుతుంది. కానీ ‘బాప్‌దాదా వచ్చేసారు’ అన్న ఈ విషయం ప్రస్తుతం ఇంకా స్పష్టమవ్వలేదు. ఇప్పుడు కొంచెం-కొంచెం పరదా తెరుచుకోవటం మొదలయ్యింది కానీ స్పష్టంగా తెరుచుకోలేదు. వీరికి బ్యాక్‌బోన్‌గా ఎవరో అథారిటీ ఉన్నారు అన్న విషయం తెలుసు కానీ - వారే బాప్‌దాదా అని, మేము కూడా ఆ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని ఉల్లాస-ఉత్సాహాలతో అనుకోవడంలో అడ్డుగోడ ఉంది. ఇప్పుడు అది జరగాల్సి ఉంది. ఒక అడుగైతే వేస్తున్నారు, అదే సహయోగమనే అడుగు. ఒక అడుగు వేయటం మొదలయ్యింది, సహయోగము ఇవ్వాలి అన్న ప్రేరణ లోపల నుండి రావటం మొదలయ్యింది, ఇప్పుడు రెండవ అడుగు ఏమిటంటే - స్వయం వారసత్వం తీసుకోవాలి అన్న ఉత్సాహములోకి రావాలి. ఎప్పుడైతే ఈ రెండు అడుగులు కలుస్తాయో, అప్పుడు నలువైపులా బాజాలు మ్రోగుతాయి. ఏ బాజాలు? నా బాబా. నీ బాబా కాదు, నా బాబా. ఏ విధంగా కార్యం గురించి మహిమ చేస్తారో, అలా, చేసేవారు-చేయించేవారు అయిన బాబా మహిమను చాలా సంతోషంగా ఊగిపోతూ పాడాలి. ఇది జరిగేదే ఉంది. మీకు కూడా ఈ దృశ్యము కళ్ళ ముందుకు, మనసులోకి, బుద్ధిలోకి వస్తూ ఉంది కదా! ఎందుకంటే పిల్లలందరికీ వారసత్వాన్ని ఇచ్చేందుకని బాబా మరియు దాదా వచ్చారు. ముక్తి కావచ్చు, జీవన్ముక్తి కావచ్చు, కానీ వారసత్వమైతే తప్పకుండా లభించాల్సిందే. ఎవ్వరూ వంచితులుగా ఉండరు ఎందుకంటే బాబా అనంతమైన యజమాని, అనంతమైన తండ్రి. కావున అనంతములో అందరూ వారసత్వం తీసుకోవాల్సిందే. యోగబలం ద్వారా తమ జన్మ-జన్మల పాపాలను తొలగించుకోలేకపోవచ్చు కానీ కేవలం బాబా వచ్చారు అని ఈ మాత్రం తెలుసుకున్నా సరే, ఇలా ఎంతోకొంత తెలుసుకోవటం వలన వారసత్వానికి అధికారులుగా తప్పకుండా అవుతారు. కనుక ఏ విధంగా బాబాకు అనంతమైన వారసత్వం ఇవ్వాలి అన్న సంకల్పం ఉందో, మరియు అది నిశ్చితముగా జరిగేదే ఉందో, అదే విధంగా మీ అందరి మనసులలో - మన సోదరీ-సోదరులందరూ అనంతమైన వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అనే శుభ భావన, శుభ కామన ఉత్పన్నమవుతుందా? మరి ఈ శుభ భావనను మరియు శుభ కామనను ప్రత్యక్ష రూపంలోకి ఎప్పుడు తీసుకొస్తారు? దీనికి సంబంధించిన డేట్‌ను ముందుగానే మీ మనసులో ఫిక్స్ చేసుకోండి, సంగఠన కంటే ముందు మనసులో ఫిక్స్ చేసుకోండి, ఆ తర్వాత సంగఠనలో ఫిక్స్ చేయండి, అప్పుడిక వినాశనం యొక్క డేట్ దానంతట అదే స్పష్టమవుతుంది, దాని గురించి చింత చేయకండి. దయ కలుగుతుందా లేక మేమైతే అధికారులుగా అయిపోయాము కదా అని ఈ అనందములోనే ఉంటున్నారా? ఆనందంలో ఉండండి, ఇదైతే చాలా మంచిదే, కానీ దయార్ద్రహృదయుడైన బాబా పిల్లలు ఇప్పుడు అనంతములో అందరిపైనా దయ చూపించండి. ఎప్పుడైతే ఇతరులపై దయ కలుగుతుందో, అప్పుడు మొదట స్వయంపై దయ కలుగుతుంది. అప్పుడిక ఆ ఒకటే చిన్న విషయం గురించి మీరు ఏదైతే పురుషార్థం చేయాల్సి వస్తుందో, అది ఇక చేయాల్సిన అవసరం ఉండదు. మాస్టర్ దయార్ద్ర హృదయులుగా, మాస్టర్ దయాళువుగా, మర్సిఫుల్గా అవ్వండి. ఈ గుణాన్ని ఇమర్జ్ చేయండి. ఇతరులపై దయ చూపించటంతో స్వయంపై దానంతటదే దయ కలుగుతుంది.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - బాప్‌దాదాకు పిల్లలలోని ఏ విషయము మంచిగా అనిపించదో తెలుసా? బాప్‌దాదాకు పిల్లలు కష్టపడటము లేక పదే-పదే యుద్ధం చెయ్యటం, ఇది మంచిగా అనిపించదు. బాబా కూడా - ఓ నా యోగీ పిల్లలూ అనే అంటారు, అంతేకానీ యుద్ధం చేసే పిల్లలు అని అనరు. యోగీ పిల్లలు అని అంటారు. మరి యోగీ పిల్లల పని ఏమిటి? యుద్ధం చెయ్యటమా? యుద్ధం చెయ్యటం మంచిగా అనిపిస్తుందా? వ్యాకులపడతారు కూడా మరియు యుద్ధం కూడా చేస్తూ ఉంటారు. యుద్ధము చెయ్యము అని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ కొంత సమయము తర్వాత యోగీకి బదులుగా యుద్ధం చేసేవారిగా అయిపోతారు. ఎందుకిలా? బాప్‌దాదా అనుకుంటారు - పిల్లలకు యోగం పట్ల ప్రేమ తక్కువ ఉంది, యుద్ధం పట్ల ప్రేమ ఎక్కువ ఉంది. మరి ఈరోజు నుండి ఏం చేస్తారు? యోధులుగా అవుతారా లేక నిరంతర యోగులుగా అవుతారా?
ఎన్ని జనవరి 18 తారీఖులు గడిచిపోయాయి అన్నదానిని బాప్‌దాదా చూసారు! విశేషంగా బ్రహ్మా బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు - నా పిల్లలూ, సమానులుగా అయ్యి వతనంలోకి రండి. వతనము మంచిగా అనిపించదా? యుద్ధం చెయ్యటమే మంచిగా అనిపిస్తుందా? యుద్ధం చెయ్యకండి. ఈరోజు నుండి యుద్ధం చెయ్యటాన్ని ఆపు చేయండి. చెయ్యగలరా? హాజీ అని చెప్పండి. మళ్ళీ అక్కడకు వెళ్ళి - మాయ వచ్చేసింది, యుద్ధం చేసి దానిని తరిమేసాము అని ఉత్తరాలను వ్రాయకండి. కొంతమందికి స్వయానికి సంబంధించిన మాయ వస్తుంది మరియు కొంతమంది ఇతరుల మాయను చూసి స్వయం మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. ఇదెందుకు, ఇదేమిటి... ఇతరుల యొక్క ఈ మాయను తమలోకి తీసుకువస్తారు. ఇలా కూడా చెయ్యకండి. మాయ నుండి విడిపించటము బాబా పని, మీరు స్వ పురుషార్థములో తీవ్రంగా అవ్వండి, అప్పుడు మీ వైబ్రేషన్ల ద్వారా, వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ సహజముగానే పారిపోతుంది. ఒకవేళ ఎందుకు, ఏమిటిలోకి వెళ్ళినట్లయితే మీ మాయా పోదు, అలాగే ఇతరులదీ పోదు. ఎలాగైతే కొత్త సంవత్సరంలో పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చారో, ఇప్పుడు 1996 అని అనరు, 97 అని అంటారు కదా! ఒకవేళ ఎవరైనా పొరపాటున 96 అని అంటే మీరు - 96 కాదు, 97 అని అంటారు. అలాగే ఈరోజు ఎందుకు-ఏమిటి, ఇలా-అలా అన్న మాటలకు వీడ్కోలు ఇవ్వండి. ప్రశ్నార్థకం పెట్టకండి. బిందువు పెట్టండి, లేదంటే ప్రశ్నార్థకం పెట్టిన వెంటనే వ్యర్థ ఖాతా ఆరంభమవుతుంది. ఎప్పుడైతే వ్యర్థ ఖాతా ఆరంభమవుతుందో, అప్పుడు సమర్థత సమాప్తమైపోతుంది. ఎక్కడ సమర్థత సమాప్తమైపోతుందో, అక్కడ మాయ రకరకాల రూపాలతో, రకరకాల పరిస్థితుల ద్వారా తన కస్టమర్లుగా చేసుకుంటుంది. అప్పుడు ఎలా అవుతారు? యోగులుగానా లేక యోధులుగానా? యోధులుగా అవ్వకండి. దృఢ ప్రతిజ్ఞను చేసారా? లేక బాప్‌దాదా చెప్పినందుకు సరే అని అన్నారా? దృఢంగా చేసారా? మళ్ళీ మీ దేశానికి వెళ్ళిన తర్వాత కాస్త కచ్చాగా అవుతారా? శక్తులు ఏమంటారు? అవుతారా, అవ్వరా? అందరూ ‘సరే’ అని అనటం లేదు, అంటే స్వయంపై కొద్దిగా అనుమానము ఉంది. (అందరూ హాజీ అన్నారు) చూసుకోండి, టి.వి.లో మీ ఫోటో తీయబడుతుంది! తర్వాత బాప్‌దాదా ఆ టి.వి. క్యాసెట్‌ను పంపిస్తారు ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల - వారు కొత్తవారైనా లేక పాతవారైనా కానీ, ఎవరైతే మనస్ఫూర్తిగా ‘నా బాబా’ అని అన్నారో, కేవలము అనటమే కాదు కానీ అంగీకరించారు మరియు అంగీకరించి నడుచుకుంటున్నారో, ఆ ప్రతి ఒక్కరిపై బాబాకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, నామమాత్రమైన ప్రేమ కాదు.
బాప్‌దాదా చాలామంది పిల్లల స్థితిని చూస్తారు - ఈరోజు అంటారు, బాబా, ఓ నా బాబా, ఓ మధురమైన బాబా, ఏమని చెప్పను, ఏమని చెప్పకుండా ఉండను... మీరే నా ప్రపంచము, ఇలా చాలా మధురాతి-మధురమైన మాటలు మాట్లాడుతారు. మళ్ళీ రెండు-నాలుగు గంటల తర్వాత ఏదైనా విషయం వచ్చిందంటే భూతము వచ్చేస్తుంది. విషయము రాదు, భూతము వస్తుంది. బాప్‌దాదా వద్ద అందరివి భూతము లాంటి ఫొటోలు కూడా ఉన్నాయి. చూడండి, భూతనాథుని స్మృతిచిహ్నము కూడా ఒకటి ఉంది. కనుక బాప్‌దాదా భూతాలను కూడా చూస్తున్నారు - ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి మరియు ఎలా తరిమేస్తున్నారు. ఈ ఆటను కూడా చూస్తూ ఉంటారు. కొందరైతే గాభరా పడి నిరుత్సాహులుగా కూడా అయిపోతారు. అప్పుడు బాప్‌దాదాకు - ఇటువంటివారికి ఎవరో ఒకరి ద్వారా సంజీవని మూలికను తినిపించి మళ్ళీ బ్రతికించాలి అన్న శుభ సంకల్పమే వస్తుంది. కానీ వారు ఎంతగా మూర్ఛితులైపోతారంటే సంజీవనీ మూలిక వైపు చూడను కూడా చూడరు. ఇలా చెయ్యకండి. మొత్తం స్పృహ కోల్పోవద్దు, కాస్త ఉంచుకోండి. కొద్దిగా స్పృహ ఉన్నా కూడా రక్షింపబడతారు.
ఈ రోజు విశేషంగా బ్రహ్మా బాబా ప్రతి పిల్లవాడి రిజల్ట్‌ను గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజును మీరందరూ స్మృతి దినం లేదా సమర్థ దినం అని అంటారు. కాబట్టి బ్రహ్మా బాబా చూస్తున్నారు - ఇప్పటివరకు ఎన్ని సమర్థ దినాలను జరుపుకున్నారు? కానీ శాశ్వత సమర్థత ఎంతవరకు వచ్చింది? అయితే ఏమి చూసి ఉంటారు? ప్రస్తుత ఫలితాన్ని బట్టి, బాబా జ్ఞానంలో జ్ఞానసంపన్నులుగా, అలాగే మాయ గురించిన జ్ఞానంలో కూడా జ్ఞానసంపన్నులుగా ఎంతమంది తయారయ్యారు? మాయ గురించిన జ్ఞానంలో కూడా జ్ఞానసంపన్నులుగా అవ్వాలి. అలా అయితే మాయను దూరం నుండే గుర్తించగలుగుతారు. ఈ రోజు ఏదో ఒక పరీక్ష రాబోతోందని ముందుగానే తెలుసుకొని, ముందే సమర్థులైపోతారు. సమాచారములో ఏమి రాస్తారు? మాయ వచ్చింది, నేను తరిమేశాను, అప్పుడు అది వెళ్లిపోయింది. కానీ అది ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు రావడానికి మాయకు మీరు అనుమతి ఇచ్చారా? అనుమతి లేకుండా ఎవరైనా వస్తే, వారిని లోపలికి రానిస్తారా? పాపం! అర్థకల్పం నుండి తోడుగా ఉంది అని మాయపై దయ చూపరు కదా! మాయపై దయ చూపవద్దు. అంతమంది ఆత్మలపై దయ చూపండి. అయితే ఫలితంలో మొదటి మరియు రెండవ స్థానాలను కలిపి 50-50 మంది కనిపించారు. కేవలం మొదటి స్థానం మాత్రమే కాదు, మొదటి మరియు రెండవ స్థానాలను కలిపి 50 మంది. కానీ బాప్‌దాదాకు ఒక విషయం చూసి చాలా సంతోషంగా ఉంది - పిల్లలు బాబా స్నేహబలం ద్వారా తప్పకుండా విజయులవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నుదుటిపై విజయ తిలకం అంత స్పష్టంగా కనిపించాలి, దానిని చూసి ఇతరులు కూడా నిజంగా వీరే విజయ రత్నాలు అని అనుభవించాలి.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఫైనల్ చదువులో పిల్లలు ప్రతి ఒక్కరూ మూడు సర్టిఫికేట్లను తీసుకోవాలి - ఒకటేమో స్వయము స్వయముతో సంతుష్టంగా ఉండే సర్టిఫికేట్, రెండవది బాప్‌దాదా నుండి సర్టిఫికేట్ మరియు మూడవది పరివారములో సంబంధ-సంపర్కములోకి వచ్చేవారి నుండి సర్టిఫికేట్. ఈ మూడు సర్టిఫికేట్లు ఎప్పుడైతే లభిస్తాయో, అప్పుడు చదువు పూర్తయ్యిందని భావించవచ్చు. బాప్‌దాదా అయితే మాతో సంతుష్టంగా ఉన్నారు కదా అని భావించవద్దు. మూడు సర్టిఫికేట్లు కావాలి, ఒకటి సరిపోదు. కనుక చెక్ చేసుకోండి - మూడు సర్టిఫికేట్లలో ఎన్ని సర్టిఫికేట్లు లభించాయి? బాబా లేకపోయినా కూడా ఏమీ లభించదు. కానీ పరివారము వారి సంతుష్టతా సర్టిఫికేట్ ద్వారా కూడా చాలా లభిస్తుంది. పరివారములో ఎంతమంది ఆత్మల నుండైతే సర్టిఫికేట్ లభిస్తుందో, ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టంగా ఉంటారో, అంతగానే భక్తులు కూడా మీ పూజను సంతుష్టతతో చేస్తారు, ఏదో చేసామంటే చేసాము అన్నట్లు మొక్కుబడిగా చెయ్యరు, మనస్ఫూర్తిగా చేస్తారు. కనుక ఇక్కడ బ్రాహ్మణ జీవితములో ఎంతమంది బ్రాహ్మణులకు మీ పట్ల స్నేహము, గౌరవము ఉంటాయో, మనస్ఫూర్తిగా సంతుష్టులవుతారో, అంతగానే పూజ్యులుగా అవుతారు. పూజ్యుల పట్ల స్నేహము మరియు గౌరవము ఉంటుంది. కనుక ఎప్పుడెప్పుడైతే జడ చిత్రాల పూజ జరుగుతుందో, అప్పుడు ఆ చిత్రాలకు అంతే స్నేహము మరియు గౌరవము లభిస్తాయి. మొత్తం కల్పమంతటి ప్రారబ్ధాన్ని ఇప్పుడే తయారుచేసుకోవాలి. కేవలం అర్థకల్పపు రాజ్య ప్రారబ్ధమే కాదు, పూజ్య ప్రారబ్ధము కూడా ఇప్పుడే తయారవుతుంది. బాబా ద్వారా మా పని జరిగిపోతుంది కదా అని అనుకోకండి. అలా కాదు. బాబాకు పరివారము పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. కావున ఫాలో ఫాదర్ చేయండి. బ్రహ్మా బాబాను చూసారు, పిల్లలు ఎటువంటి వారైనా కానీ, శిక్షణాదాతగా అయ్యి శిక్షణను కూడా ఇచ్చేవారు కానీ శిక్షణతోపాటు మనసులో ప్రేమను కూడా పెట్టుకునేవారు. అలాగే, ప్రేమ అంటే బాహువులతో చూపించే ప్రేమ కాదు, కానీ ప్రేమకు గుర్తు - తమ శుభ భావన మరియు శుభ కామన ద్వారా మాయకు వశమై ఉన్న ఎటువంటి ఆత్మనైనా పరివర్తన చెయ్యటము. ఎవరైనా కానీ, ఎటువంటివారైనా కానీ ద్వేష భావము రాకూడదు. వీరైతే మారనే మారరు, వీరు ఇంతే అని అనుకోకూడదు. అలా కాదు. ఇప్పుడు దయార్ద్ర హృదయులుగా అయ్యే అవసరము ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు బలహీనంగా ఉన్న కారణంగా తమ శక్తి ద్వారా ఏదైనా పెద్ద సమస్యను దాటలేకపోతే, మీరు సహయోగులుగా అవ్వండి. దేని ద్వారా? కేవలం శిక్షణ ద్వారానే కాదు, ఈరోజుల్లో ప్రేమ మరియు శుభ భావన లేకుండా శిక్షణ రూపంలో చెప్తే ఎవరూ వినలేరు. ఇది ఫైనల్ రిజల్టు, శిక్షణ పని చెయ్యదు కానీ శిక్షణతోపాటు శుభ భావన, దయార్ద్రహృదయము, ఇవి సహజంగా పని చేస్తాయి. ఏ విధంగా బ్రహ్మా బాబాను చూసారు, ఈరోజు ఈ బిడ్డ పొరపాటు చేసారని బాబాకు తెలుస్తుంది కూడా, అయినా ఆ బిడ్డకు శిక్షణను ఒక పద్ధతితో, యుక్తితో ఇచ్చేవారు, అంతేకాక వారిని ఎంతగానో ప్రేమించేవారు కూడా. తద్వారా బాబాకు వారిపై ప్రేమ ఉందని వారు అర్థం చేసుకునేవారు మరియు ఆ ప్రేమలో తమ పొరపాటును అనుభవం చేసుకునే శక్తి కూడా వారికి వస్తుంది. ఈరోజు బ్రహ్మా బాబాను చాలా గుర్తు చేసుకున్నారు కదా! కనుక ఫాలో ఫాదర్ చేయండి. బాబా సమానంగా అయ్యే ధైర్యము ఉందా? మీ ధైర్యానికి అభినందనలు. బాప్‌దాదా మీ హృదయంలోని చప్పట్లను ముందే వినేస్తారు, మీరు సంతోషంతో చప్పట్లు కొడతారు కానీ బాబాకు మీ హృదయంలోని చప్పట్లు ముందు చేరుకుంటాయి.
బాప్‌దాదా కూడా ఒక సరదా విషయాన్ని వినిపిస్తారు. బ్రహ్మా బాబా యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది! నాకు ఒక విషయంలో డేట్ కాన్షెస్ (తారీఖును తెలుసుకోవాలన్న కోరిక) ఉంది అని బ్రహ్మా బాబా అన్నారు. డేట్ కాన్షెస్ కలవారిగా అవ్వవద్దు అని పిల్లలతో అంటాను, కానీ బ్రహ్మా బాబా ఒక విషయంలో డేట్ కాన్షస్‌గా ఉన్నారు, అది దేనికి సంబంధించిన డేట్? నా పిల్లలు ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులుగా ఎప్పుడు అవుతారు! అంతిమంలో జీవన్ముక్తులుగా అవుతాము అని అనుకోవద్దు, అలా కాదు. బహుకాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసము బహుకాలపు జీవన్ముక్త రాజ్య భాగ్యానికి అధికారులుగా చేస్తుంది. దానికన్నా ముందు మీరు ఇప్పుడు జీవన్ముక్తులుగా అయినట్లయితే జీవన్ముక్త స్థితి కల మీ ప్రభావము జీవనబంధనములో ఉన్న ఆత్మల బంధనాన్ని సమాప్తం చేస్తుంది. మరి ఈ సేవ చెయ్యరా? చెయ్యాలి కదా! మరి మీరు బ్రహ్మా బాబాకు ఉన్న డేట్ కాన్షెస్కు జవాబు ఇవ్వండి. ఎటువంటి బంధనమూ లేకుండా అందరూ జీవన్ముక్తులుగా అయ్యే ఆ డేట్ ఎప్పుడు వస్తుంది? బంధనాల యొక్క పెద్ద లిస్టును వర్ణిస్తారు, క్లాసులు చేయించేటప్పుడు బంధనాల యొక్క పెద్ద పొడవాటి లిస్టును తయారుచేస్తారు, కానీ బాబా అంటారు - అన్ని బంధనాలలోకెల్లా మొదటి బంధనము దేహ భానము యొక్క బంధనము. దాని నుండి విముక్తులుగా అవ్వండి. దేహమే లేనట్లయితే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మిమ్మల్ని మీరు వర్తమాన సమయంలో - నేను టీచర్‌ను, నేను స్టూడెంట్ను, నేను సేవాధారిని అని భావించేందుకు బదులు అమృతవేళ నుండే ఈ అభ్యాసం చెయ్యండి - నేను శ్రేష్ఠ ఆత్మను, ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కొరకు పై నుండి వచ్చాను. నేను ఆత్మను, ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేసుకోండి. మీరు ఆత్మ భానాన్ని ధారణ చేసినట్లయితే ఈ ఆత్మిక భానము అనేది మాయ భానాన్ని సదా కొరకు సమాప్తం చేస్తుంది. కానీ ఆత్మ భానము అనేది ఇప్పుడు నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండాలి, అది ఇప్పుడింకా ఎక్కువ ఉండాలి. బ్రహ్మా బాబా ఆత్మ పాఠాన్ని ఆది నుండి ఎంత పక్కా చేసుకున్నారు! గోడలపై కూడా - నేను ఆత్మను, పరివారమువారు కూడా ఆత్మలు, ప్రతి ఒక్కరి పేరుతో గోడలపై వ్రాసి కూడా ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. నేనూ ఆత్మను, వీరు కూడా ఆత్మ, వారు కూడా ఆత్మ అని డైరీలు నింపేసారు. మీరు ఆత్మ పాఠాన్ని ఇంతగా పక్కా చేసుకున్నారా? నేను సేవాధారిని అన్న పాఠాన్ని కొద్దిగా పక్కా చేసుకున్నట్లు ఉన్నారు కానీ ఆత్మనైన నేను సేవాధారిని అన్నది పక్కా అయినట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు. ప్రతి రోజూ శరీరంలోకి పై నుండి అవతరించండి, నేను అవతారమును, ఈ శరీరంలో అవతరించిన ఆత్మను, ఇలా అనుకున్నట్లయితే ఇక యుద్ధము చెయ్యవలసిన అవసరముండదు. ఆత్మ బిందువు కదా? కనుక అన్ని విషయాలకు బిందువు పడుతుంది. ఎటువంటి ఆత్మను? రోజూ ఏదైనా ఒక కొత్త-కొత్త టైటిల్ ను స్మృతిలో పెట్టుకోండి. మీ వద్ద ఎన్నో టైటిల్స్ యొక్క లిస్ట్ అయితే ఉంది కదా. నేను ఇటువంటి శ్రేష్ఠ ఆత్మను అని ప్రతిరోజూ కొత్త టైటిల్‌ను స్మృతిలో పెట్టుకోండి. ఇది సహజమా లేక కష్టమా? ఆత్మ బిందువు రూపంలో ఉంటుంది కనుక డ్రామా బిందువు కూడా ఉపయోగపడుతుంది మరియు సమస్యలకు కూడా సెకెండులో బిందువు పెట్టగలుగుతారు మరియు బిందువుగా అయ్యి పరంధామానికి బిందువుగా వెళ్ళగలరు. పరంధామానికి వెళ్ళాలా లేక డైరెక్టుగా స్వర్గములోకి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? ముందుగా ఇంటికి వెళ్తారా లేక రాజ్యములోకి వెళ్తారా? బాబాతోపాటు ఇంటివరకైతే వెళ్ళాలి కదా లేక డైరెక్టుగా రాజ్యములోకి వెళ్ళిపోతారా, బాబాను అడగరా! కావున బిందువైన బాబాతోపాటు బిందువుగా అయ్యి ముందు ఇంటికి వెళ్ళాలి. రాజ్యము యొక్క పాస్‌పోర్ట్ ఊరికే అలా లభించదు. పరంధామము నుండి రాజధానికి వెళ్ళే పాస్‌పోర్ట్ ఆటోమెటిక్‌గా లభిస్తుంది, అది ఎవ్వరూ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా నంబరువారుగా పరంధామము నుండి రాజ్యములోకి వస్తారు, పరంధామము నుండి మొదట ఏ ఆత్మ వెళ్తుంది? మీరు ఎవరితోపాటు వెళ్తారు? బ్రహ్మా బాబాతోపాటు వెళ్తారు! అందరూ రాజ్యములోకి కూడా కలిసి వెళ్తారా లేక రెండవ, మూడవ జన్మలోకి వస్తారా? వెళ్ళాలి కదా? ప్రేమ ఉంది కదా? బ్రహ్మా బాబానైతే వదలరు కదా, బాబాతోపాటు వెళ్తారా? మరి బాప్‌దాదాకు డేట్ చెప్తారా, చెప్పరా? (బాప్‌దాదా చెప్పాలి) బాప్‌దాదా అయితే ఇప్పుడే తయారవ్వండి అని అంటారు. అప్పుడు బాబా కూడా డేట్ కాన్షస్ నుండి మారిపోతారు. చూడండి, బ్రహ్మా బాబా రేపటి గురించి ఆలోచించారా? త్వరిత దానము, మహాదానము చేసారు. తీవ్ర పురుషార్థము, మొదటి పురుషార్థము చేసారు. రేపును చూడలేదు. రేపు ఏమవుతుంది, పరివారము ఎలా నడుస్తుంది! అని ఆలోచించారా? ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో అదీ మంచిది మరియు రేపు ఏదైతే జరగబోతుందో అది కూడా మంచిదే అనుకున్నారు. కనుకనే త్వరిత దానము మహాదానము చేసి మహాపుణ్యాన్ని సంపాదించుకున్నారు మరియు మొదటి నెంబరులో మహాన్‌గా అయ్యారు. ఇప్పుడు పిల్లలు త్వరిత దానము చేసేవారిగా అవ్వాలి. సంకల్పము చేసిన వెంటనే దానము చేసి మహాబలి అవ్వాలి. మొదటి డివిజన్‌లోకి ఎవరు వస్తారు అని చేతులు ఎత్తిస్తే అందరూ చేతులెత్తుతారు. ఇప్పుడు ఎత్తించినా అందరూ ఎత్తుతారు. ఎవ్వరూ చేతులు దించరు అన్నది బాప్‌దాదాకు తెలుసు. మొదటి డివిజన్‌లోకి రావాలన్నప్పుడు మొదటి నంబరులో ఉన్నవారిని ఫాలో అయితే చెయ్యండి. ఫాలో చెయ్యటము సహజము, కేవలం బ్రహ్మా బాబా అడుగులో అడుగు వెయ్యండి, కాపీ చెయ్యండి. కాపీ చెయ్యటము వస్తుందా, రాదా! ఫాలో చెయ్యటము వస్తుందా? మరి ఫాలో చెయ్యండి. ఇక చేయడానికి వేరే ఏముంది! అచ్ఛా.
విశాలమైన ఈ సభను చూసి సంతోషంగా ఉంది కదా! (అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.) అందరికీ ఒక చేతితో చప్పట్లు కొట్టడం నేర్పించండి. (అందరూ ఒక చేయిని ఊపారు.) ఇది బాగుంది. అచ్ఛా.
ఈసారి అన్ని జోన్లవారు వచ్చారు కదా! ఎక్కువ మంది అన్ని ప్రాంతాల నుండీ వచ్చారు.
మహారాష్ట్ర మరియు బొంబాయి:- చేతులు ఎత్తండి. మహారాష్ట్ర సేవకు నిమిత్తంగా ఉంది కదా! మంచి సేవకు నిదర్శనాన్ని చూపిస్తున్నారు. అందరూ సంతోషంగా సేవ చేస్తున్నారు. రాత్రిపూట కూడా సేవ చేస్తూ నిద్రకు సమయం దొరుకుతుందా? రాత్రింబవళ్లు చేసే ఈ సేవ మహా పుణ్యంగా అవుతుంది. రాత్రి అయినా కూడా సేవాధారులు సేవకు సిద్ధంగా ఉంటారు. అలానే ఉంది కదా మహారాష్ట్ర? ఫలితం చాలా బాగుంది. ముందుగా గుజరాత్ చేసింది, ఇప్పుడు మహారాష్ట్ర చేస్తోంది. ప్రతి సేవాధారి గ్రూపుకు దాని స్వంత విశేషత ఉంది. గుజరాత్‌కు కూడా టర్న్ వచ్చింది కదా! అచ్ఛా. చూడండి, సేవ కారణంగా మీకు డబల్ ఛాన్స్ లభించింది. మీ టర్న్‌లో కూడా రావచ్చు, సేవాధారిగా కూడా వచ్చారు. అందుకే సేవాధారులకు డబల్ ఛాన్స్ లభించింది. అచ్ఛా.
ఢిల్లీ:- ఢిల్లీ వారు డైమండ్ జూబిలీ ముగింపు ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా మంచిది. ఢిల్లీ నుండి ధ్వని అన్ని వైపులా సులభంగా వ్యాపిస్తుంది. అందుకే మంచి ధైర్యంతో కార్యం చేస్తున్నారు. డైమండ్ జూబిలీ సమాప్తి కూడా ఎంతో ఘనంగా జరగాల్సిందే. అచ్ఛా.
గుజరాత్:- గుజరాత్ అయితే పొరుగునే ఉంది. చప్పట్లు కొడితే వెంటనే హాజరైపోతుంది.
(కర్ణాటక, ఆంధ్ర, పంజాబ్, ఈస్టర్న్, నేపాల్, అస్సాం, ఒడిశా, ఇందోర్, యు.పి., బనారస్, భోపాల్, తమిళనాడు, రాజస్థాన్, ఆగ్రా, మధుబన్, డబల్ విదేశీయులు మొదలైన అన్ని జోన్లవారితో బాప్‌దాదా చేతులు ఎత్తించి కలుసుకున్నారు)
డబల్ విదేశీయులు మధుబన్ సభకు అలంకారంలాంటివారు. డబల్ విదేశీయులు ప్రియస్మృతులను ఇవ్వడంలోనూ, తీసుకోవడంలోనూ చాలా తెలివైనవారు. భారత్ గొప్పదే, కానీ విదేశాలు కూడా ఏమాత్రం తక్కువ కావు. వారు ఎల్లప్పుడూ తమ తమ విభిన్న రూపాలలో ప్రియస్మృతులను పంపుతూనే ఉంటారు. ఇప్పుడూ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎంతోమంది పిల్లలు పంపించారు. ముఖ్యంగా ఈ రోజున ఎంతోమంది పిల్లలు విధిపూర్వకంగా ప్రియస్మృతులను తెలియజేసారు. హృదయపూర్వకంగా మాత్రమే కాకుండా, కార్డులు మరియు లేఖల ద్వారా కూడా ప్రియస్మృతులను పంపుతారు. బాప్‌దాదా వద్దకు ప్రత్యేకంగా డబల్ విదేశీయుల ప్రియస్మృతులతో కూడిన లేఖలు, కార్డులు కూడా వచ్చాయి. బాప్‌దాదా అందరికీ పదమారెట్లు ప్రియస్మృతులతో పాటు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికీ అనేక ప్రాంతాల నుండి ఫరిశ్తా రూపంలో మధుబన్ సభకు చేరుకున్నారు. బాప్‌దాదా వారిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. రిజల్ట్‌లో ప్రియస్మృతులు మరియు సేవలోని ఉల్లాస-ఉత్సాహాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు డబల్ విదేశీయులలో అధికమంది ప్రియస్మృతులు మరియు సేవలో అనుభవజ్ఞులుగా అయ్యారు. ఇకముందు కూడా అలాగే అవుతూనే ఉంటారు. మొదట్లో ఉన్న ఆ చిలిపి బాల్యదశ ఇప్పుడు అధికమందిలో సమాప్తమైంది. ఇకముందు కూడా పూర్తిగా సమాప్తమవుతుంది.
అందుకే డబల్ విదేశీయులకు తీవ్ర పురుషార్థానికి అభినందనలు తెలియజేస్తూ బాప్‌దాదా ఈ స్లోగన్‌ను కూడా వినిపిస్తున్నారు: మాయ దృష్టి నుండి ఎల్లప్పుడూ సురక్షితులై, తమ దృష్టిలో ఎల్లప్పుడూ బాబాను నిలుపుకునేవారు. బాబా దృష్టిలో ఉన్నప్పుడు మాయ దృష్టి ఎప్పుడూ పడదు. కాబట్టి పిల్లలు ఎల్లప్పుడూ సురక్షితులుగానే ఉండాలి, ఉండాల్సిందే. అచ్ఛా.
ఇప్పటికిప్పుడే ఎవరైతే కూర్చుని ఉన్నారో, అందరూ ఒక్క క్షణములో అశరీరీ ఆత్మిక స్థితిలో స్థితులవ్వండి. శరీర భానములోకి రాకండి. ఆత్మ, పరమాత్మతో మిలనము చేసుకుంటూ ఉంది. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
ఈ అభ్యాసాన్ని పదే-పదే కర్మలు చేస్తున్నప్పుడు చేస్తూ ఉండండి. స్విచ్ ఆన్ చేసారు మరియు క్షణములో అశరీరిగా అయ్యారు... ఈ అభ్యాసము కర్మాతీత స్థితిని అనుభవము చేయిస్తుంది.
నలువైపులా ఉన్న సదా సమర్థ ఆత్మలకు, సదా బాప్‌దాదాను అనుసరించే సహజ పురుషార్థీ పిల్లలకు, సదా ఒక్క బాబాయే అని అనుకునేవారికి, ఏకాగ్ర బుద్ధి కలవారికి, ఏకరస స్థితిలో స్థితులై ఉండేవారికి, బిందువుగా అయ్యి బిందువైన బాబాతోపాటు వెళ్ళేవారికి, ఇటువంటి బాబా స్నేహీలు, సహయోగులు, సేవాధారులు అయిన పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- నిర్విఘ్నంగా మేళా సమాప్తి అయింది కదా!
(సాయంత్రం 7:30 గంటలకు, గ్లోబల్ హాస్పిటల్లో లండన్‌కు చెందిన షీలా అక్కయ్య తమ పాత శరీరాన్ని విడిచి బాప్‌దాదా ఒడిని చేరుకుంది. ఈ వార్తను బాప్‌దాదాకు తెలియజేశారు) ఎవరి పాత్ర అయితే ఉందో, వారి స్మారకం కూడా అలాగే ఉంటుంది. ఎవరి పాత్ర ఏదైతే ఉందో, అది ఎక్కడైనా, ఎలాగైనా, వారు తప్పకుండా నిర్వహించాల్సిందే. డబల్ విదేశీయులు కూడా అడ్వాన్స్ పార్టీలో ఉండాలి కదా! అడ్వాన్స్ పార్టీ అనే పుష్పగుచ్ఛంలో భిన్న భిన్న పుష్పాలు చేరుతున్నాయి. (పూర్తిగా సమర్పితురాలు. రెండు నెలలుగా ఇక్కడే ఉంది. చివరి మూడు-నాలుగు రోజులు సైలెన్స్‌లో ఉంది. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. రెండు-మూడు రోజులు హాస్పిటల్లో చికిత్స జరిగింది) అలాంటి మంచి ఆత్మలే కావాలి కదా! వారు వైబ్రేషన్స్ ద్వారా సేవ చేయగలరు. కాబట్టి దీనిని ‘‘వెళ్లిపోయింది’’ అని అనకూడదు, ‘‘సేవ కోసం వచ్చింది’’ అని చెప్పాలి. ఈ ఆత్మ కూడా అనేకమంది ఆత్మలకు అనంతమైన వైరాగ్యాన్ని కలిగించేందుకు నిమిత్తమైంది. ఇంత పెద్ద విశాల మేళా నుండి వెళ్లడం కూడా, ఈ అనంతమైన మేళాలో అనంతమైన పాత్రను నిర్వహించడమే. మరి మీరు ఏమంటారు? ‘‘వెళ్లిపోయిందా?’’ కాదు. వెళ్లిపోలేదు. కేవలం భిన్నమైన వేషధారణతో భిన్నమైన పాత్రను నిర్వహించడానికి వచ్చింది. (లండన్‌లో అందరూ ఆమె కోసం ప్రత్యేకంగా యోగం చేశారు) వారందరికీ కూడా ఈ విషయం చెప్పండి. అందరూ ఆమెకు యోగ సహకారం ఇవ్వండి, వైబ్రేషన్స్ ఇవ్వండి. (నిర్వైర్ అన్నయ్య అదే సమయంలో అందరికీ ఈ వార్తను తెలియజేశారు. అనంతరం అందరూ ఒక నిమిషం పాటు ఆ ఆత్మకు యోగదానం అందించారు)
వీడ్కోలు సమయంలో:- మీ అందరికీ ఈ శాంతివన్ విశాల హాలు నచ్చిందా? (హా జీ) అయితే దీన్ని ఎవరు నిర్మించారు? మీ అందరి సహకారపు వేలు వల్లే ఈ విశాల హాలు సిద్ధమైంది. బాబా ఉన్నారు, కానీ పిల్లల సహకారపు వేలు కూడా అవసరం. కాబట్టి నచ్చిందా? మరి దీని కంటే పెద్దది నిర్మిద్దామా? చాలా బాగుంది. ఇది పిల్లలందరి సహకారంతో నిర్మించబడింది. ఇంకా మిగిలి ఉన్న కార్యం కూడా తప్పకుండా పూర్తవుతుంది. మరి మీ అందరికీ ఈ మేళా, చాపలపై పడుకోవడం, భోజనం చేయడం నచ్చిందా? ఇబ్బంది అనిపించలేదా? ఏమైనా ఇబ్బంది అయ్యిందా? చూడండి, భక్తి మేళాలు కూడా మీరు చాలానే చేశారు. అక్కడ భోజనంతో పాటు మట్టిని కూడా తింటారు. మట్టిలోనే పడుకుంటారు. మట్టిలోనే భోజనం చేస్తారు. కానీ మీకు అయితే బ్రహ్మా భోజనం బాగా దొరికింది కదా! బ్రహ్మా భోజనం బాగానే దొరికిందా? ఎవరికైనా బ్రహ్మా భోజనం వల్ల ఇబ్బంది కలిగిందా? ఆరోగ్యం బాగోలేదా? మరి అనారోగ్యంగా ఉన్నవారు కూడా బాగయ్యారా? ఈ శాంతివన్ మేళా ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోసం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ శాంతివన్‌ను సేవలో కూడా ఉపయోగించండి. బ్రాహ్మణుడు అంటే సేవాధారి. కాబట్టి మీ సంబంధం, సంపర్కంలో ఉన్నవారు కూడా ‘‘మాకు కూడా ఒక అవకాశం దొరికితే బాగుండును’’ అని కోరుకుంటున్నారు. కానీ స్థలాభావం వల్ల మీరు వారికి సేవ చేయలేకపోయారు. ఇప్పుడు విశాల హృదయంతో వేలాదిమందికి సేవ చేయవచ్చు. పైన మీకు పరిమిత స్థలం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే హాలులో రెండు-మూడు గ్రూపులుగా యోగ శిబిరాలు నిర్వహించవచ్చు, కోర్సులు నిర్వహించవచ్చు. అలాగే వారసులను కూడా తయారు చేయవచ్చు. ఇక్కడి పాలన వల్ల వారసులుగా మారడం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడి వాతావరణం, అనుభవజ్ఞులైన దాదీల దృష్టి, పాలన సులభంగా పరివర్తన తీసుకురాగలవు. ఒక కార్యక్రమం బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ కోసం, మరొక కార్యక్రమం సేవ కోసం - ఇలా భిన్న భిన్న రూపాల్లో, ఒకే సమయంలో, గ్రూపులుగా విభజించి ఒకే హాలులో నిర్వహించవచ్చు. అలాగే ఉండడానికి ఉన్న పెద్ద హాలులను కూడా ఉపయోగించవచ్చు. మీరు ఎలా వచ్చారో, అలాగే మీ సంపర్కంలో ఉన్నవారి కోసం కూడా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉండండి. ‘ఇంత పెద్ద హాలు ఎలా ఉపయోగపడుతుంది అని అనుకోవద్దు. ఇది పెద్దదిగా కూడా ఉపయోగపడుతుంది, చిన్నదిగా కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంతమంది ఆత్మలను సిద్ధం చేస్తారా? ఈ హాలు ద్వారా 9 లక్షల మందిని సిద్ధం చేయండి. చేయగలరా? (ఈచ్ వన్ టీచ్ వన్ చేయండి) ఇది చాలా మంచి ఆలోచన. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని తీసుకువస్తే ఎంతమంది అవుతారు? ఇప్పుడు సమయానికి అనుగుణంగా సేవను కూడా అనంతమైనదిగా చేయండి. చిన్న చిన్న గ్రూపులు పైన కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలను తయారు చేయవచ్చు, రాయల్ ప్రజలను తయారు చేయవచ్చు, వారసులను తయారు చేయవచ్చు. నచ్చిందా? మరి రెండోసారి ఏమి చేస్తారు? ఇక్కడ కూర్చున్నంతమందిని తీసుకురావాలి. అంతకంటే ఎక్కువమందిని తీసుకురండి, కానీ తక్కువమందిని మాత్రం తీసుకురావద్దు.
మీ అందరికీ రిఫ్రెష్మెంట్ కావాలా? మీ కోసం భట్టీలు నిర్వహించాలా? కానీ ఇక్కడ భట్టీ చేసి, అక్కడికి వెళ్లి అలాగే కూర్చోవడం కాదు. భట్టీ అంటే శాశ్వత పరివర్తన. కాబట్టి, అందరూ సంతోషపడేలా, అలాంటి ప్రణాళిక రూపొందించండి. మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి - అందరూ మీ అనుభవం ద్వారా ప్రభావితులవ్వాలి. కనీసం ప్రభుత్వం కూడా ‘‘భారతదేశానికి శ్రేయస్సు కలగాలంటే, అది ఇక్కడి నుంచే సాధ్యమవుతుంది’’ అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు వేగంగా సేవ చేయండి. అర్థమైందా? ఇంకా మిగిలి ఉన్న పనులన్నింటినీ సక్రమంగా పూర్తిచేస్తూ ఉండండి. చేయాలనుకునే వారందరూ కలిసి పర్వతాన్ని కూడా ఎత్తగలిగితే, ఇది ఏమంత పెద్ద పని! బాప్‌దాదాకు కూడా ఈ విశాల మేళా చాలా ఇష్టం. పిల్లల ధైర్యానికి బాబా సహాయం తప్పకుండా ఉంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
