‘‘పాస్ విత్ ఆనర్‌గా అయ్యేందుకు సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకుని సంపన్నులుగా అవ్వండి’’
ఈరోజు బాప్‌దాదా ఏ సభను చూస్తున్నారు? నేటి ఈ సభలో పిల్లలు ప్రతి ఒక్కరూ హైయెస్ట్ (అత్యంత ఉన్నతమైనవారు) మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్ (అత్యంత సంపన్నమైనవారు) గా ఉన్నారు. ప్రపంచములోని వారు ఎంత రిచెస్ట్ అయినా కానీ, వారు ఒక్క జన్మ కొరకు రిచెస్ట్. ఒక జన్మ కూడా రిచెస్ట్‌గా ఉంటారో, ఉండరో, అది కూడా నిశ్చితము కాదు. ఈ ప్రపంచంలో ఎవరు ఎంత రిచెస్ట్ అయినా కానీ, అది ఒక్క జన్మ కొరకే. కానీ మీరు - మేము అనేక జన్మలకు రిచెస్ట్ అని నిశ్చయము మరియు నషాతో అంటారు ఎందుకంటే మీరందరూ అవినాశీ ఖజానాలతో సంపన్నులు. మీరు ఈ సమయములోని పురుషార్థము ద్వారా ఒక్క రోజులో కూడా చాలా సంపాదన చేసుకునేవారు అన్నది మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో మీరు ఎంత సంపాదన చేసుకుంటారో మీకు తెలుసా? లెక్క తెలుసు కదా! ఒక్క అడుగులో పదమాలు అన్న గాయనము ఉంది, అనుభవము ఉంది. ఒక్క రోజులో బాబా ద్వారా, బాబా యొక్క జ్ఞానం ద్వారా, స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. కనుక మొత్తం రోజంతటిలో ఎన్ని అడుగులైతే స్మృతిలో వేస్తారో, అన్ని పదమాలను జమ చేసుకుంటారు. మరి ఇటువంటి సంపాదనను చేసుకునేవారు, ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వములో ఎవరైనా ఉంటారా! లేక ఉన్నారా? విశ్వమంతా తిరిగి రండి, మీరు తప్ప మరెవ్వరూ ఇంతగా జమ చేసుకోలేరు, అందుకే బాబా అంటారు - ఆత్మలమైన మా భాగ్యము పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్ఠంగా తయారైంది అన్న శ్రేష్ఠ స్మృతిలో ఉండండి.
మీ ఖజానాలైతే తెలుసు కదా! ఈ సంగమయుగ సమయము ఎంత శ్రేష్ఠమైనది అని సమయము యొక్క ఖజానా గురించి కూడా తెలుసు. ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తిని అధికారిగా అయ్యి బాబా నుండి తీసుకుంటున్నారు. అన్ని అధికారాలనూ ప్రాప్తి చేసుకున్నారు కదా? ఒక్కొక్క శ్రేష్ఠ సంకల్పము ఎంతటి పెద్ద ఖజానా, సమయము కూడా పెద్ద ఖజానా, సంకల్పాలు కూడా పెద్ద ఖజానా, సర్వ శక్తులు అన్నింటికన్నా పెద్ద ఖజానా, ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత పెద్ద ఖజానా, ప్రతి ఒక్క గుణమూ ఎంత పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలోనూ స్మృతి చేయడం ద్వారా శ్వాస సఫలమవుతుంది అని ప్రపంచములోని వారు కూడా నమ్ముతారు. కావున మీ అందరి శ్వాస సఫలతా స్వరూపంగా ఉంటుంది, వ్యర్థంగా పోదు. ప్రతి శ్వాసలోనూ సఫలతా అధికారము ఇమిడి ఉంది. బాప్‌దాదా పిల్లలందరికీ అన్ని ఖజానాలను ఒకే విధంగా ఇచ్చారు. అన్నింటినీ ఇచ్చారు మరియు సమానంగా ఇచ్చారు. ఒకరికి ఒక వంతు, ఇంకొకరికి 10 రెట్లు, మరొకరికి 100 రెట్లు... ఇలా ఇవ్వలేదు. అందరికీ ఇచ్చే దాత, పిల్లలు ప్రతి ఒక్కరికీ అన్ని ఖజానాలను వారు బ్రాహ్మణులుగా అవ్వటంతోనే సమాన రూపములో ఇచ్చారు. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకుంటారు లేక ఎంత పోగొట్టుకుంటారు అనేది స్వయంపై ఆధారపడి ఉంటుంది. మేము మొత్తం రోజంతటిలో ఎంత జమ చేసుకుంటాము లేక ఎంత పోగొట్టుకుంటాము అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉంటారా? తప్పకుండా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక్క జన్మ కొరకు కాదు, ప్రతి జన్మ కొరకు, అనేక జన్మల కొరకు జమ కావాలి. జమ చేసుకునే విధి తెలుసా? అది చాలా సహజమైనది. కేవలం బిందువు పెడుతూ వెళ్ళండి. బిందువు గుర్తుంటే జమ అవుతుంది. స్థూల ఖజానాలో కూడా ఒకటి పక్కన బిందువు (సున్నా) పెడుతూ వెళ్తే దాని విలువ పెరుగుతూ ఉంటుంది కదా! అలాగే ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో దానికి కూడా ఫుల్స్టాప్ అనగా బిందువు. ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపముతో గుర్తు చేసినట్లయితే జమ అవుతూ ఉంటుంది. అనుభవము ఉంది కదా! బిందువు పెట్టారు మరియు వ్యర్థమవ్వటము సమాప్తమై జమ అవుతుంటుంది. బిందువు పెట్టడం వస్తుందా? చాలా సార్లు ఏమవుతుందంటే బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ బిందువుకు బదులుగా అది పెద్ద గీత అయిపోతుంది, బిందువుకు బదులుగా ప్రశ్న చిహ్నమైపోతుంది, ఆశ్చర్యార్థకమైపోతుంది. కనుక జమ ఖాతాను పెంచుకునేందుకు విధి బిందువు, మరియు పోగొట్టుకునేందుకు మార్గము పెద్ద గీత గియ్యటము, ప్రశ్నార్థకమును పెట్టడము, ఆశ్చర్యార్థకమును పెట్టడము. ఏది సహజము? బిందువే కదా! కనుక విధి చాలా సహజము, అదేమిటంటే - స్వమానము, బాబా స్మృతి మరియు అనవసరమైనవాటికి ఫుల్స్టాప్ పెట్టడము.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - ప్రతిరోజూ అమృతవేళ స్వయానికి స్వయం మూడు బిందువుల స్మృతి తిలకాన్ని పెట్టుకున్నట్లయితే ఒక్క ఖజానా కూడా వ్యర్థంగా పోదు, ప్రతి సమయము, ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాల జమ చార్టును చూసారు. అందులో ఏం చూసారు? ఇప్పటివరకు కూడా జమ ఖాతా ఎంతైతే ఉండాలో అంతగా లేదు. సమయము, సంకల్పాలు, మాటలు వ్యర్థం కూడా అవుతున్నాయి. నడుస్తూ-నడుస్తూ ఉండగా అప్పుడప్పుడు సమయం యొక్క మహత్వము ఇమర్జ్ రూపంలో తక్కువైపోతుంది. ఒకవేళ సమయం యొక్క మహత్వము సదా గుర్తున్నట్లయితే, ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే సమయాన్ని ఇంకా ఎక్కువగా సఫలము చేసుకోగలరు. మొత్తం రోజంతటిలో సాధారణ రూపంలో సమయం గడిచిపోతుంది. తప్పుగా గడుస్తుంది అని కాదు కానీ సాధారణంగా గడిచిపోతుంది. అలాగే సంకల్పాలు కూడా చెడు సంకల్పాలు నడవవు కానీ వ్యర్థంగా పోతున్నాయి. ఒక గంటను చెక్ చేసుకోండి, ప్రతి గంటలో సమయము కానీ లేక సంకల్పాలు కానీ ఎన్ని సాధారణంగా పోతున్నాయి? జమ అవ్వవు. అప్పుడు బాప్‌దాదా సూచన ఇస్తే, బాప్‌దాదాను కూడా ఎంతో ఓదారుస్తారు. బాబా, ఇటువంటి సంకల్పాలు కొన్నే వస్తున్నాయి, అంతే, ఇంకేమీ లేదు, సంకల్పాలలో కొద్దిగా నడుస్తుంది, సంపూర్ణమైపోతాము, బాగైపోతాము, ఇప్పుడింకా అంతిమ సమయం రాలేదు కదా, ఇంకా కొంచెం సమయం ఉంది కదా, సమయానికల్లా సంపన్నంగా అయిపోతాము అని అంటారు. కానీ బాప్‌దాదా పదే పదే చెప్పి ఉన్నారు - బహుకాలపు జమ కావాలి. జమ ఖాతాను అంతిమ సమయంలో సంపన్నంగా చేసుకుంటాము, సమయం వచ్చినప్పుడు తయారైపోతాము అని ఇలా అనటం కాదు! బహుకాలము జమ చేసుకున్నది బహుకాలము నడుస్తుంది. వారసత్వం తీసుకోవటంలోనైతే అందరూ - మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అనే అంటారు. త్రేతాయుగమువారిగా అవుతారా అని చేతులెత్తమంటే ఎవ్వరూ చేతులెత్తరు. కానీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారా అంటే అందరూ చేతులెత్తుతారు. ఒకవేళ బహుకాలపు జమ ఖాతా ఉంటే పూర్తి వారసత్వము లభిస్తుంది. ఒకవేళ కొంచెమే జమ ఉంటే పూర్తి వారసత్వము ఎలా లభిస్తుంది? అందుకే సర్వ ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా ఇప్పటి నుండే జమ చేసుకోండి. అయిపోతుందిలే, వచ్చేస్తాములే... ఇలా లే, లే అని అనకండి. ‘‘చెయ్యాల్సిందే’’ ఇది దృఢత. అమృతవేళ కూర్చున్నప్పుడు, మంచి స్థితిలో కూర్చుంటే - ఇది చేస్తాము, అది చేస్తాము, అద్భుతము చేసి చూపిస్తాము... అని లోలోపల మనసులో చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఇది మంచి విషయమే. శ్రేష్ఠ సంకల్పాలను చేస్తారు. కానీ బాప్‌దాదా అంటారు - ఈ అన్ని ప్రతిజ్ఞలను కర్మలోకి తీసుకురండి. కేవలం ప్రతిజ్ఞలు చెయ్యటమే కాదు కానీ ఏ ప్రతిజ్ఞలనైతే చేస్తారో వాటిని మనసా, వాచా మరియు కర్మలోకి తీసుకురండి. పిల్లలు సంకల్పాలు చాలా మంచి-మంచివి చేస్తారు, బాప్‌దాదా ఆ సమయంలో సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యాన్ని అయితే పెడుతున్నారు కదా. ఇలా అవుతాము, అది చేస్తాము... అని ధైర్యాన్ని అయితే చాలా మంచిగా పెడతారు. ఆ ధైర్యానికి బాప్‌దాదా సంతోషిస్తారు. కానీ ఎప్పుడైతే కర్మలోకి వచ్చేది ఉంటుందో, అది అప్పుడప్పుడు అన్నట్లు అయిపోతుంది. ప్రతిజ్ఞ చెయ్యటము చాలా సహజము. కానీ కర్మలో చెయ్యటము అనగా చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటము. ప్రతిజ్ఞలు చేసేవారైతే ఎంతోమంది ఉన్నారు కానీ వాటిని నిలబెట్టుకోవటం విషయంలో నంబరువారుగా అయిపోతారు. కనుక సంకల్పాన్ని మరియు కర్మను, ప్లాన్‌ను మరియు ప్రాక్టికల్‌ను - రెండింటినీ సమానం చెయ్యండి. చెయ్యగలరు కదా? బిజినెస్ వారు వచ్చారు. బిజినెస్ వారికి వ్యాపారం చెయ్యటం తెలుసు కదా! జమ చేసుకోవటం తెలుసు కదా! ఇంజనీర్లు మరియు సైంటిస్టులు కూడా ప్రాక్టికల్‌గా పని చేస్తారు. మరియు రూరల్ (గ్రామీణ) విభాగం వారు ఎవరైతే ఉన్నారో, బాప్‌దాదా వారిని రూలర్ (పరిపాలకులు) అని అంటారు, ఎందుకంటే ఒకవేళ వీరు సేవ చెయ్యకపోతే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. కనుక వచ్చిన ఈ మూడు విభాగాల వారూ కర్మ చేసేవారు. కేవలం చెప్పేవారు కాదు, చేసేవారు. మరి మీరంతా చేసిన ప్రతిజ్ఞలను కర్మలోకి తీసుకువచ్చే ఆత్మలే కదా! లేక కేవలం ప్రతిజ్ఞలను చేసేవారా? ప్రతిజ్ఞ చేసే సమయంలోనైతే బాప్‌దాదాకు ధైర్యాన్ని చూపించి సంతోషపరుస్తారు. బాప్‌దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ చేసిన ప్రతిజ్ఞల ఫైల్ ఉంది. అక్కడ (వతనములో) ప్రతిజ్ఞల ఫైల్‌ను పెట్టుకునేందుకు అలమారు లేక స్థలం కావలసిన పనేమీ లేదు. అప్పుడప్పుడు బాప్‌దాదా తమ అలౌకిక టి.వి.ని అకస్మాత్తుగా ఆన్ చేస్తారు. సదా ఆన్ చేయరు కానీ అప్పుడప్పుడూ ఆన్ చేస్తారు, అప్పుడు అన్నీ వినిపిస్తాయి. పరస్పరంలో ఏదైతే మాట్లాడుకుంటారో, అది కూడా వింటారు. అందుకే బాప్‌దాదా అంటున్నారు – వ్యర్థ ఖాతాను జమ ఖాతాలోకి మార్చుకుని జమ చేసుకోండి.
బ్రాహ్మణులు అనగా అలౌకికమైనవారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వము చాలా గొప్పది. అందులో ప్రాప్తులు చాలా ఎక్కువ. స్వమానము చాలా గొప్పది. మరియు సంగమ సమయములో బాబాకు చెందినవారిగా అవ్వటము, ఇది అన్నింటికంటే గొప్ప పదమాల రెట్ల భాగ్యము, అందుకే బాప్‌దాదా అంటారు, ప్రతి ఖజానాకు మహత్వాన్ని ఇవ్వండి. భాషణ చేసేటప్పుడు ఇతరులకు సంగమయుగ మహిమ గురించి ఎంతగా వినిపిస్తారు. ఒకవేళ ఎవరైనా మీకు - సంగమయుగ మహిమను వినిపించండి అని టాపిక్ ఇస్తే ఎంత సమయం వినిపించగలరు? ఒక గంట వినిపించగలరా? టీచర్లు చెప్పండి. ఎవరైతే అలా వినిపించగలరో వారు చేతులెత్తండి. మరి ఇతరులకు మహత్వాన్ని వినిపిస్తున్నారంటే మీకు మహత్వము గురించి చాలా బాగా తెలుసు. బాప్‌దాదా మీకు తెలియదు అని అనరు. వినిపించగలుగుతున్నారంటే తెలుసు కాబట్టే వినిపిస్తున్నారు కదా. కానీ జరిగేది ఏమిటంటే, అది మర్జ్ అయిపోతుంటుంది. ఇమర్జ్ రూపములో స్మృతిలో ఉండాలి, అది అప్పుడప్పుడు తక్కువైపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువవుతుంది. కనుక మీ ఈశ్వరీయ నషాను ఇమర్జ్ రూపములో ఉంచుకోండి. ఆ, నేనైతే అలా అయిపోయానులే... అని అనుకోకండి. ప్రాక్టికల్‌గా నేను అలా ఉన్నాను... అది ఇమర్జ్ రూపములో ఉండాలి. నిశ్చయము ఉంది కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నషా. కనుక మొత్తం రోజంతా ఈ నషా ఉండాలి. నేను ఎవరిని! అన్న ఆత్మిక నషా. ఈ నషా ఇమర్జ్ రూపములో ఉన్నట్లయితే ప్రతి క్షణమూ జమ అవుతూ ఉంటుంది.
మరి ఈరోజు బాప్‌దాదా జమ ఖాతాను చూసారు, అందుకే ఈరోజు విశేషముగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు, సమయ సమాప్తి అకస్మాత్తుగా జరుగనున్నది. తెలుస్తూ ఉంటుంది కదా, సమయము వచ్చేటప్పటికల్లా బాగైపోతాములే అని ఆలోచించకండి. ఎవరైతే సమయాన్ని ఆధారంగా చేసుకుంటారో, సమయం బాగు చేసేస్తుంది లేక సమయం వచ్చేటప్పటికి అయిపోతుందిలే... అని ఎవరైతే అనుకుంటారో, వారికి టీచర్ ఎవరయ్యారు? సమయమా లేక స్వయం పరమాత్మనా? పరమాత్మ ద్వారా సంపన్నంగా అవ్వలేకపోయారు కానీ సమయం సంపన్నంగా చేస్తుందా, దీనినేమంటారు? సమయం మీకు మాస్టరా లేక పరమాత్మ మీకు టీచరా? ఒకవేళ డ్రామా అనుసారంగా సమయం మీకు నేర్పించినట్లయితే లేక సమయం ఆధారముపై పరివర్తన జరిగినట్లయితే ప్రారబ్ధము కూడా సమయం వచ్చినప్పుడే లభిస్తుంది అన్నది బాప్‌దాదాకు తెలుసు ఎందుకంటే అక్కడ సమయం టీచర్ అయ్యింది. సమయం మీ కోసం ఎదురుచూస్తూ ఉంది, మీరు సమయం కోసం ఎదురుచూడకండి. అది రచన, మీరు మాస్టర్ రచయిత. కనుక రచయిత కోసం రచన ఎదురుచూడాలి, మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అయినా అసలు ఇందులో కష్టమేముంది? సహజమైనదానిని స్వయమే కష్టంగా చేసుకుంటారు. కష్టమేమీ కాదు, కానీ కష్టంగా చేసుకుంటారు. మీకు ఏదైతే భారమనిపిస్తుందో, ఆ భారాన్ని బాబాకు ఇచ్చేయండి అని బాబా అంటున్నప్పుడు, అది ఇవ్వటము మీకు రావటం లేదు. భారాన్ని ఎత్తుతారు, మళ్ళీ అలసిపోతారు కూడా, మళ్ళీ - ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి... అని బాబాకు ఫిర్యాదు కూడా చేస్తారు. మీపైకి ఎందుకు భారాన్ని ఎత్తుతున్నారు? మీ భారాలన్నింటినీ బాబాకు అర్పించెయ్యండి అని బాబా ఆఫర్ చేస్తున్నారు. 63 జన్మలు భారాన్ని ఎత్తే అలవాటు అయిపోయింది కదా! అలవాటుకు వశమైపోతున్నారు, అందుకే కష్టపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఏ కార్యమైనా సహజంగా అన్నా ఉంటుంది లేక కష్టంగా అన్నా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఎందుకుంటుంది? ఏదో కారణముంటుంది కదా! కారణమేమిటంటే - అలవాటుకు వశమైపోతున్నారు. బాప్‌దాదాకు పిల్లలు కష్టపడటము, ఇదే అన్నింటికంటే పెద్ద విషయంగా అనిపిస్తుంది. మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తిమంతులు, కానీ కష్టపడటమా? మీకు ఏ టైటిల్‌ను ఇచ్చుకుంటారు? కష్టయోగులా లేక సహజయోగులా? లేకపోతే మేము సహజయోగులము కాము అని మీ టైటిల్‌ను మార్చేసుకోండి. అప్పుడప్పుడు సహజయోగులు, అప్పుడప్పుడు కష్టయోగులా? అయినా యోగమంటే అసలు ఏమిటి? కేవలం స్మృతి చెయ్యటము, అంతే కదా! అంతేకాక శక్తిశాలీ యోగము ముందు కష్టమనేది ఉండనే ఉండదు. యోగమనేది లగనమనే అగ్ని. అగ్ని అనేది ఎంతటి కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది. లోహము కూడా మౌల్డ్ అయిపోతుంది. అటువంటప్పుడు ఈ లగనమనే అగ్ని కష్టాన్ని సహజం చెయ్యలేదా? చాలామంది పిల్లలు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. బాబా, ఏం చెయ్యాలి, వాయుమండలము అలా ఉంది, సహచరులు అలా ఉన్నారు, హంస-కొంగలు ఉన్నారు, ఏం చెయ్యాలి, పాత లెక్కాచారాలు అని అంటారు. ఇలా చాలా మంచి-మంచి మాటలను మాట్లాడుతారు. బాబా అడుగుతున్నారు - బ్రాహ్మణులైన మీరు ఏ కాంట్రాక్టును చేపట్టారు? విశ్వ పరివర్తన చేస్తాము అన్న కాంట్రాక్టును చేపట్టారు. మరి ఎవరైతే విశ్వాన్నే పరివర్తన చేస్తారో, వారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా?
మరి ఈరోజు ఏం చేస్తారు? జమ ఖాతాను పెంచుకోండి. అప్పుడు సహజయోగులము అని ఏదైతే చెప్తారో దానిని అనుభవము చేస్తారు. ఒక్కోసారి కష్టము, ఒక్కోసారి సహజము, ఇందులో మజా ఉండదు. బ్రాహ్మణ జీవితము అంటే ఆనందమయమైన జీవితము. సంగమయుగము అనందమయమైన యుగము. ఇది భారాన్ని మోసే యుగము కాదు. ఇది భారాన్ని దింపుకునే యుగము. కనుక చెక్ చేసుకోండి, మీ భాగ్యము యొక్క చిత్రాన్ని జ్ఞానమనే దర్పణములో మంచిగా చూసుకోండి. అద్దమైతే ఉంది కదా? లేక లేదా? పగిలిపోలేదు కదా? అందరికీ అద్దం లభించిందా? మాతలూ, అద్దం లభించిందా లేక ఎవరైనా దొంగలించారా? పాండవులైతే సంభాళించటంలో తెలివైనవారు కదా? అద్దం ఉందా? చేతులైతే బాగా ఎత్తారు. మంచిది. మీ భాగ్యము యొక్క చిత్రాన్ని చూసుకోండి మరియు సదా మీ భాగ్యము యొక్క చిత్రాన్ని చూసుకుని వాహ్-వాహ్ అన్న పాటను పాడండి. వాహ్ నా భాగ్యము! వాహ్ నా బాబా! వాహ్ నా పరివారము! పరివారము కూడా వాహ్- వాహ్. ఫలానావారు చాలా వాహ్-వాహ్, కానీ ఫలానావారు కొద్దిగా ఇలాంటివారు అని అనకూడదు. వాహ్ నా పరివారము! వాహ్ నా భాగ్యము! మరియు వాహ్ నా బాబా! బ్రాహ్మణ జీవితము అనగా వాహ్-వాహ్! అయ్యో-అయ్యో అని అనుకునే జీవితము కాదు. శారీరక వ్యాధి ఉన్నప్పుడు కూడా అయ్యో-అయ్యో అని అనుకోకూడదు. వాహ్! అని అనుకోవాలి. ఇలా అనుకోవటము కూడా బరువును దించుతుంది. ఒకవేళ మీ బరువు 10 మణ్‌ల (1 మణ్ - 40 కేజీలు) నుండి 3-4 మణ్లకు తగ్గిపోతే మంచిదేనా లేక అయ్యో-అయ్యో అని అంటారా? ఏమంటారు? వాహ్, భారము దిగిపోయింది! అని అంటారు. అయ్యో, నా పాత్రే ఇంత! అయ్యో, నన్ను ఈ వ్యాధి వదలటమే లేదు! అని అనకండి. మీరు వ్యాధిని వదలాలా లేక వ్యాధి మిమ్మల్ని వదలుతుందా? వాహ్-వాహ్ అని అనుకుంటూ ఉంటుంటే వాహ్-వాహ్ అని అనుకోవటం వలన వ్యాధి కూడా సంతోషపడుతుంది. చూడండి, ఇక్కడ కూడా అలానే అవుతుంది కదా, ఎవరి మహిమనైనా చేసినప్పుడు వాహ్-వాహ్ అని అంటారు కదా, అలాగే వ్యాధిని కూడా వాహ్-వాహ్ అని అనండి. అయ్యో, ఇది నా దగ్గరకే ఎందుకు వచ్చింది, ఇది నాకే లెక్కాచారమా అని అనకండి. ప్రాప్తి ముందు లెక్కాచారము అసలేమీ కాదు. ప్రాప్తులను ముందు ఉంచుకోండి మరియు లెక్కాచారాన్ని కూడా ముందు ఉంచుకోండి, అప్పుడదేమి అనిపిస్తుంది? చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఉద్దేశ్యమేమిటంటే బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా కానీ దానిని పాజిటివ్ రూపంలో చూడండి. నెగెటివ్‌ను పాజిటివ్ చెయ్యటమైతే వస్తుంది కదా. నెగెటివ్, పాజిటివ్ కోర్సును కూడా చేయిస్తారు కదా! ఆ సమయములో మీకు మీరు కోర్సు చేయించుకుంటే కష్టము సహజమైపోతుంది. కష్టము అన్న మాట బ్రాహ్మణుల డిక్షనరీలో ఉండకూడదు. అచ్ఛా - ఏ లెక్కాచారాలు ఉన్నా, ఆత్మతో ఉన్నా, శరీరంతో ఉన్నా లేక ప్రకృతితో ఉన్నా, ఎందుకంటే ప్రకృతి యొక్క ఈ పంచ తత్వాలు కూడా కొన్ని సార్లు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి, ఏ లెక్కాచారాన్ని అయినా యోగమనే అగ్నిలో భస్మము చెయ్యండి. ఏం చెయ్యాలో అర్థమైందా? జమ ఖాతాను పెంచుకోండి. మాటలలో కూడా సాధారణ మాటలు ఉండకూడదు, మాటలలో కూడా భిన్న-భిన్న భావాలు మరియు భావనలు ఉంటాయి, అంతేకాక మాటల ద్వారా భావము మరియు భావన తెలిసిపోతుంది. కనుక ఎల్లప్పుడూ ఏ మాటలు మాట్లాడినా కానీ, అందులో ఆత్మిక భావము ఉండాలి మరియు శుభమైన, శ్రేష్ఠమైన భావన ఉండాలి. మాటలు కూడా మరియు భావన కూడా. ఈర్ష్య, అసూయ, ద్వేషం... ఇవన్నీ మాయ భావనలు. సదా శుభ భావము మరియు శుభ భావన ఉండాలి. అలా ఉన్నాయా? చెక్ చేసుకోండి. సమయం యొక్క ఖజానా, మాటల ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా, గుణాల ఖజానా... ఒక్కొక్క ఖజానాను చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. ఈ అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ అని అంటాము అనగా పాస్ విత్ ఆనర్ అని అంటాము. ఏదో ఒక్క ఖజానా తక్కువగా జమ అయి ఉంటే ఏమవుతుందిలే అని అనుకోకండి, పాస్ విత్ ఆనర్‌గా అయ్యేందుకు అన్ని ఖజానాలలో ఖాతా నిండుగా ఉండాలి.
బాప్‌దాదా ఎదురుగా మీరు కూర్చున్నారు కదా, కేవలం మిమ్మల్నే చూడడం లేదు. దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా ఏ పిల్లలైతే ఉన్నారో వారందరినీ చూస్తున్నారు. ఎదురుగా లేకపోయినా హృదయంలో ఉన్నారు. ఈరోజు మీరు ఎదురుగా ఉన్నారు, రేపు ఇంకొకరు ఎదురుగా ఉంటారు. కానీ అందువల్ల బాప్‌దాదా మిమ్మల్ని చూడడం లేదని కాదు. వారు హృదయంలో ఉన్నారు, మీరు ఎదురుగా ఉన్నారు. ఇలా కాదు, మీరు హృదయంలో లేరు, కేవలం ఎదురుగా ఉన్నారు అని. అయితే ఎదురుగా ఉండడానికి తన ప్రాముఖ్యత ఉంది. అర్థమైందా?
బిజినెస్ చేసేవారు చేతులు ఎత్తండి. బిజినెస్ చేసేవారు ఏమి ఆలోచిస్తున్నారు? ముఖ్యంగా మీకు ఛాన్స్ లభించింది. బిజినెస్ చేసేవారికి బాబాతో కూడా బిజినెస్ చేయించండి. కేవలం మీరే చేసుకున్నారు, అది అయితే మంచిదే చేశారు. కానీ ఇతరులతో కూడా బాబాతో బిజినెస్ చేయించండి. ఎందుకంటే ఈరోజుల్లో బిజినెస్మెన్ అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. సమయానుసారంగా బిజినెస్ క్రిందికి వెళ్తోంది. అందుకే ఎంత డబ్బు ఉన్నా, డబ్బుతో పాటు, ఏమవుతుంది అన్న చింత ఉంది! కాబట్టి వారిని చింత నుండి తొలగించి, అవినాశీ ఖజానా యొక్క మహత్వాన్ని వినిపించండి. కాబట్టి ఎంతమంది బిజినెస్మెన్ వచ్చారో, చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా, మీలాంటి పనిని చేసే వారందరికీ సంతోషం యొక్క మార్గాన్ని చెప్పండి. బిజినెస్‌మెన్‌గా వచ్చిన మీ అందరికీ చింత ఉందా? ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అని చింత ఉందా? చింత లేకపోతే చేతులు ఎత్తండి. రేపు ఏదైనా జరిగితే? నిశ్చింత చక్రవర్తులు (బేఫికర్ బాద్షా) కదా? బిజినెస్మెన్ బేఫికర్ బాద్షాలు కదా? కొద్దిమంది మాత్రమే చేతులు ఎత్తారా? ఎవరికైనా కొంచెం-కొంచెం చింత ఉంటే వారు చేతులు ఎత్తవచ్చు, లేదా సిగ్గు వస్తుందా? బేఫికర్ బాద్షా, బేగంపూర్ యొక్క బాద్షా (నిశ్చింతపురికి చక్రవర్తి) అని బిరుదునే బాప్‌దాదా ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైనా అలాంటి విషయం వస్తే, తప్పకుండా వస్తుంది, కానీ మీరు బేగంపూర్లోకి వెళ్లిపోవాలి. బేగంపూర్‌లో కూర్చోవాలి. అప్పుడు బాద్షాలు కూడా అవుతారు, బేగంపూర్‌లో కూడా ఉంటారు. మీరు స్వయంగా ఆహ్వానం చేశారు కదా - పాత ప్రపంచం వెళ్లిపోవాలి, కొత్త ప్రపంచం రావాలి అని. అయితే అది ఎలా వెళ్తుంది? క్రిందా-పైనా అయినప్పుడే వెళ్తుంది. ఏది జరిగినా, మీరు నిశ్చింతగా (బేఫికర్‌గా) అవ్వాల్సిందే. మీరు స్వయంగా ఆహ్వానం చేశారు - పాత ప్రపంచం సమాప్తమవ్వాలి అని. అయితే పాత ప్రపంచంలో, పాత ఇంటిలో ఏమవుతుంది? ఒక్కోసారి ఇది విరుగుతుంది, ఒక్కోసారి అది పడిపోతుంది. కాబట్టి ఇది అయితే జరుగుతూనే ఉంటుంది. నథింగ్ న్యూ. ప్రతి విషయంలో బ్రహ్మా బాబా యొక్క పదం ఇదే - నథింగ్ న్యూ. జరగాల్సిందే, జరుగుతోంది, మరియు మనం బేఫికర్ బాద్షాలు. ఇలా బేఫిరకర్గా ఉన్నారా? బేఫికర్‌గా ఉంటే దివాలా కూడా తప్పించుకుంటారు. ఫికర్లో (చింతలో) ఉంటే, నిర్ణయం సరిగా ఉండదు. అప్పుడు ఒక్క రోజులో ఏమి నుండి ఏమిగా అయిపోతారో! ఇది అయితే మీకు తెలుసు. బేఫికర్‌గా ఉంటే, నిర్ణయం మంచిగా ఉంటుంది. అప్పుడు తప్పించుకుంటారు. ఇప్పటి సమయానుసారం ఇది చేయాలా లేదా చేయకూడదా అనే టచింగ్ లభిస్తుంది. అందుకే ఫికర్ అంటే బిజినెస్ కూడా పడిపోవడం, మీ స్థితి కూడా పడిపోవడం. కాబట్టి ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకోండి - బేఫికర్ బాద్షాలు. అప్పుడు ఫికర్ యొక్క విషయం కూడా మారిపోతుంది. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఎప్పుడూ నిరాశ అవ్వకూడదు. ధైర్యం ఉంచితే బాబా సహాయం లభిస్తూనే ఉంటుంది. సహాయం చేయడానికి బాబా బంధించబడి ఉన్నారు. కానీ ధైర్యం లేనివారికి సహాయకుడు కాదు. బాబా యొక్క సహాయం అయితే లభించలేదు అని మీరు ఆలోచిస్తారు. కానీ ముందు ఇది ఆలోచించండి - ధైర్యం ఉందా? ధైర్యం పిల్లలది, సహాయం బాబాది. సగం పదాన్ని పట్టుకోకండి. బాబా సహాయం కావాలి కదా! కానీ ధైర్యాన్ని ఉంచారా? నిరాశ చెందకుండా, ధైర్యాన్ని ఉంచుకుంటూ వెళ్తే సహాయం గుప్తంగా లభిస్తూనే ఉంటుంది. అయితే చెప్పండి - మీరు ఎవరు? బిజినెస్మెన్ అందరూ చెప్పండి - మీరు ఎవరు? నిశ్చింత చక్రవర్తులు కదా? దీనిని గుర్తుంచుకోండి. ధైర్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఏది జరిగినా సహాయం లభిస్తుంది. కానీ సగం గుర్తుంచుకోకండి. పూర్తిగా గుర్తుంచుకోండి. అచ్ఛా. మాతలు బిజినెస్మెన్ కాదా? (ఉన్నారు.) అయితే మాతలు కూడా నిశ్చింత చక్రవర్తులు కదా? నౌకర్లు అయిపోవద్దు. యజమానులుగా, చక్రవర్తులుగా ఉండండి. చింత ఉంటే ఉదాసీనత ఉంటుంది. ఉదాసీనత అంటే దాసిగా అవ్వడం. అందుకే చక్రవర్తులుగా ఉండండి. అచ్ఛా.
రెండవవారు - ఇంజినీర్లు మరియు శాస్త్రవేత్తలు, వారు చేతులు ఎత్తండి. శాస్త్రవేత్తలకు చాలా మంచి అనుభవం ఉంది. ఎలా అంటే, సైన్స్ రోజురోజుకీ చాలా సూక్ష్మంగా అవుతూ ఉంటుంది. అలాగే మీరు సైలెన్స్ మరియు సైన్స్ - రెండింటి అనుభవం కలిగినవారు. కాబట్టి మీలాంటి వారికే సైలెన్స్ యొక్క మహత్వాన్ని వినిపించండి. వారి కళ్యాణం కూడా చేయండి. కళ్యాణం చేయడం వస్తుంది కదా! సైలెన్స్ కూడా ఒక విజ్ఞానం. సైలెన్స్ యొక్క విజ్ఞానం ఏమిటి, దాని పరిచయాన్ని వారికి ఇవ్వండి. సైలెన్స్ యొక్క విజ్ఞానం ద్వారా ఏమేమి జరుగుతాయో, అది తెలుసుకోవడం వల్ల సైన్స్‌ను కూడా ఇంకా ఎక్కువగా రిఫైన్ చేయగలుగుతారు. ఎందుకంటే మన కొత్త ప్రపంచంలో కూడా విజ్ఞానం ఉపయోగంలోకి వస్తుంది కదా! కానీ రిఫైన్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఉన్న విజ్ఞానం యొక్క ఇన్వెన్షన్లో లాభం కూడా ఉంది, నష్టం కూడా ఉంది. కానీ కొత్త ప్రపంచంలో రిఫైన్ విజ్ఞానం ఉండడం వల్ల నష్టం అనే పేరే ఉండదు. కాబట్టి అలాంటి పెద్దపెద్ద శాస్త్రవేత్తలకు సైలెన్స్ యొక్క జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడు వారు కూడా మన కొత్త ప్రపంచంలో రిఫైన్ విజ్ఞానం యొక్క కార్యం చేయడంలో సహాయకులుగా అవుతారు. శాస్త్రవేత్తల సంఖ్య ఎంత ఉంది? ఇప్పుడు వచ్చినవారు ఎంతమంది? (350) మళ్లీ వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు? 350 మందే వస్తారా? ఏమి చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకువస్తారా? తీసుకురావాలంటే చేతులు ఎత్తండి. మీ పేరు అయితే నోట్ అయింది. బాప్‌దాదా చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మీ సమానంగా తయారుచేసి తీసుకురండి. ఎవరు తీసుకువస్తారో వారు చేతులు ఎత్తండి. వీరి టి.వి. తీయండి. ఇది కూడా ఆనందాలను జరుపుకోవడం, ఇంకా ఏమిటి? అచ్ఛా. బిజినెస్మెన్ చేతులు ఎత్తండి. వీరి టి.వి. కూడా తీయండి.
శాస్త్రవేత్తలతో పాటు ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఇంజినీర్లు ఏమి చేస్తారు? ఇంజినీర్లు ఏదో ఒక కొత్తది తయారుచేస్తారు. కాబట్టి సత్యయుగంలో కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి ఇతరులను సిద్ధం చేయండి. మీరు అయితే రాజులుగా అవుతారు కదా! మీరు ఇళ్లు కట్టేవారిగా అవ్వరు కదా! కాబట్టి కొత్త ప్రపంచం యొక్క రచనను చాలా బాగా చేయగలిగే అలాంటి ఆత్మలను సిద్ధం చేయండి. అలాంటి ఇంజినీరింగ్ చేయాలి, మొత్తం కల్పంలో అలాంటి వస్తువులు ఉండకూడదు. ద్వాపర, కలియుగంలో చాలా మంచి మంచి వస్తువులను తయారుచేస్తారు. కానీ కొత్త ప్రపంచంలో ఈనాటి శ్రేష్ఠమైన వస్తువుల కంటే కూడా సర్వశ్రేష్ఠమైన, ఆశ్చర్యకరమైన వస్తువులు ఉండాలి. అలాంటి ఇంజినీర్లను సిద్ధం చేయండి. సరే, వారు పూర్తి జ్ఞానాన్ని తీసుకోకపోయినా, రెగ్యులర్‌గా కాకపోయినా, బాబాను అయితే గుర్తించాలి. అలాంటి ఆత్మలు చాలామంది ఉన్నారు. వారు రెగ్యులర్‌గా కాకపోయినా, నిశ్చయం మరియు సంతోషంలో ఉంటారు. సంబంధంలో సహయోగులుగా ఉంటారు. అలాంటి ఆత్మలను కూడా సిద్ధం చేయండి. అర్థమైందా! చాలా బాగుంది. చూడండి, ఈ టర్న్‌లో మీకు ప్రత్యేక పాత్ర ఉంచబడింది. కాబట్టి ఏదైనా ప్రత్యేక కమాల్ చేస్తారు కదా! ఇప్పుడు ఫలితాన్ని చూస్తాము - బిజినెస్మెన్ ఎంతమందిని తీసుకువస్తారు, ఇంజినీర్లు మరియు శాస్త్రవేత్తలు ఎంతమందిని తీసుకువస్తారు? సంఖ్య అయితే తెలుస్తుంది కదా! రిపోర్టు వస్తుంది కదా - ఇంత సంఖ్య పెరిగింది అని. కాబట్టి వింగ్‌కు బాధ్యులుగా ఉన్నవారు ఒక సంవత్సరం యొక్క ఫలితాన్ని వ్రాయాలి. వీరందరూ ఒక సంవత్సరం తర్వాత వస్తారు కదా! అప్పుడు సంఖ్య ఎంత పెరిగిందో చూస్తాము.
హాస్పిటల్ యొక్క ట్రస్టీలు:- మీరు అందరూ ఏ అద్భుతాన్ని చేస్తారు? ఏ పేషెంట్ వచ్చినా, అతనికి పేషెన్స్ (ఓపిక) ఇచ్చి, ఇతరులను తీసుకురండి. విదేశాల నుండి కూడా తీసుకురండి.
మూడవ గ్రూప్ రూరల్ వింగ్:- చేతులు ఎత్తండి. ఇందులో మాతలు కూడా ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు. అచ్ఛా, మీరు ఏమి చేస్తారు? గ్రామ-గ్రామాన్ని మహలుగా చేయాలి. గ్రామంలో అలాంటి సేవ చేయండి, సత్యయుగ ప్రపంచంలో ఆ గ్రామాలు మహల్లుగా అయిపోవాలి. అందరికీ కొత్త ప్రపంచం యొక్క పరిచయాన్ని ఇవ్వండి. గ్రామంలోని వారు చాలా ప్రేమతో వింటారు. పెద్దపెద్ద వారు అయితే తక్కువగా వింటారు. కానీ గ్రామంలోని వారు చాలా ప్రేమతో వింటారు. గ్రామాన్ని మార్చి చూపించండి. ప్రభుత్వానికి ఈ గ్రామం ఎంతగా మారిపోయిందో తెలిసేలా చేయండి. మార్చగలరా? ప్రభుత్వం ముందు ప్రాక్టికల్‌గా ఒక నిదర్శనాన్ని చూపించగల అలాంటి ఒక గ్రామం ఉండాలి. గ్రామం-గ్రామంలో సేవ అయితే చేశారు. కానీ వీటిలో నుండి ఒక గ్రామాన్ని ప్రభుత్వానికి చూపించండి. చూడండి, ఈ గ్రామంలో ఎంత పరివర్తన వచ్చింది. అలా చేయగలరా? (అలాంటి సేవ చేశాము.) అయితే దానిని ప్రభుత్వానికి చేర్చండి. ప్రభుత్వం ముందు రికార్డు ఉంచండి. చూడండి, ఒక విషయం ఉంది. ప్రభుత్వం మీరు సామాజిక సేవ చేయడం లేదని అంటుంది. కానీ ఈ మధ్యకాలంలో బొంబాయిలో తోటలను మార్చి మంచి అందమైనవిగా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మురికి ప్రదేశాన్ని పార్క్‌గా మార్చడం, అనేక ఆత్మలకు నిమిత్తంగా అవ్వడం, ఇది దేశం యొక్క సామాజిక సేవ కాదా? ఎన్ని ఇళ్లను దోమల నుండి మరియు ఇతర క్రిముల నుండి రక్షించారు. సామాజిక సేవ అంటే ఏమిటి? ఇది సామాజిక సేవే కదా! కాబట్టి చుట్టుపక్కల వారి సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి. వీరు చాలా మంచి పని చేశారు అని వారు వ్రాసి ఇవ్వాలి. పిల్లలకు ఆడుకోవడానికి స్థలం కల్పించడం, వారి ఆరోగ్యాన్ని పెంచడం... ఇది సామాజిక సేవ కాకపోతే ఇంకేమిటి? కాబట్టి అలాంటి ఫోటోలు తీయండి. పిల్లల ఫోటోలు కూడా తీయండి, పెద్దవారి ఫోటోలు కూడా తీయండి. ఎంతమందిలో పరివర్తన వచ్చిందో, వారి సంతకాలు కూడా తీసుకోండి. తర్వాత ప్రభుత్వానికి చూపించండి - మేము సామాజిక సేవ చేస్తున్నామా లేదా? అర్థమైందా? అలాంటి రికార్డు సిద్ధం చేయండి. ఎన్ని తోటలు లభించాయో, వాటన్నింటి రికార్డు సిద్ధం చేయండి. ఏమిటంటే, ప్రభుత్వానికి అసలు తెలియదు. కానీ తప్పుడు విషయాలు మాత్రం చాలా త్వరగా వ్యాపిస్తాయి. మంచి సేవ మాత్రం తక్కువగా వ్యాపిస్తుంది. అందుకే ఈ సామాజిక సేవకు ఒక నిదర్శనాన్ని చూపించండి. సామాజిక సేవ చేయడం లేదని చెప్పేవారికి దీనిని చూపించండి. ఎంత సంతోషం లభిస్తుంది! సామాజిక సేవ చేసేవారు ఏమి చేస్తారు? దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తారు. వారిని సెట్ చేస్తారు. మీరు అయితే బుద్ధిని సెట్ చేస్తారు. ఇది సామాజిక సేవ కాకపోతే ఇంకేమిటి! కాబట్టి సేవ చాలా చేస్తున్నారు. కానీ రికార్డు మాత్రం తక్కువగా సిద్ధం చేస్తున్నారు. బొంబాయి పత్రికలలో ప్రచురించవచ్చు - ఇంతమంది ఆత్మలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు వస్తున్నారు, వారికి సంతోషం యొక్క సాధనాలు ఉన్నాయి, వారి ఆరోగ్యం మెరుగవుతోంది అని. ఇలాంటి రికార్డులు సిద్ధం చేయండి. అచ్ఛా. (బొంబాయిలోని కమలా నెహ్రూ పార్క్ కూడా లభిస్తోంది.) అది కూడా లభిస్తుంది. మీకు ఇలాంటి లేఖలు లభిస్తాయి కదా, వాటిని ఇతర నగరాలలో చూపించి అక్కడ కూడా చేయవచ్చు. అచ్ఛా.
కొత్తగా, మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. డ్రామా అనుసారంగా ఇప్పుడు వచ్చారు. కానీ బాప్‌దాదా యొక్క స్లోగన్ గుర్తుందా? లాస్ట్ సో ఫాస్ట్, మరియు ఫాస్ట్‌గా వెళ్లి ఫస్ట్ కూడా అవ్వవచ్చు. అవకాశం ఉంది. ఫస్ట్‌గా వెళ్లవచ్చు. కానీ జమా ఖాతాను ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా జమ చేసుకోండి. మీ భాగ్యం గుర్తుంటుంది కదా! ప్రత్యేకంగా కొత్తవారికి చెబుతున్నాము. ఎవరికైతే భాగ్యం గుర్తుంటుందో వారు చేతులు ఎత్తండి.
అచ్ఛా - ఎవరైతే ఒక్క క్షణంలో తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలము, ఏది ఆలోచించాలనుకుంటే ఆ ఆలోచనే నడుస్తూంటుంది అని అనుకునేవారు చేతులెత్తండి. ఒక్క క్షణంలో మైండ్ కంట్రోల్ అయిపోవాలి, ఇలా ఒక్క క్షణంలో అవ్వగలదా? ఒకవేళ అలా చెయ్యగలము అని అంటే వారు చేతులెత్తండి. అడిగాము కాబట్టి చేతులెత్తడం కాదు, కంట్రోల్ ఉంటే చేతులు ఎత్తండి? అచ్ఛా. చేతులు ఎత్తని వారికి ఒక నిమిషం పడుతుందా? లేదా దానికంటే కూడా ఎక్కువ సమయం పడుతుందా? ఇప్పుడు ఈ అభ్యాసం చాలా అవసరం. ఎందుకంటే అంతిమ సమయంలో ఈ అభ్యాసం చాలా పనికి వస్తుంది. ఎలాగైతే ఈ శరీరంలోని అవయవాలను, చేయి ఉంది, కాలు ఉంది, వీటిని సెకనులో ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకువెళ్లగలరు కదా! అలాగే మనసు మరియు బుద్ధిని కూడా నావి అనే అంటారు కదా! మనసుకు యజమానులైతే, ఇవి సూక్ష్మ అవయవాలు, అయితే వీటి మీద కంట్రోల్ ఎందుకు ఉండకూడదు? సంస్కారాల మీద కూడా కంట్రోల్ ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా - ఈ అభ్యాసం పక్కాగా అయినప్పుడు, అప్పుడు పాస్ విత్ ఆనర్ అవుతారు అని అర్థం. కాబట్టి లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి. అయితే రాజ్యాన్ని కంట్రోల్ చేసే ముందు స్వరాజ్య అధికారిగా అవ్వండి. అప్పుడు రాజ్య అధికారిగా అవుతారు. దీనికి కూడా సాధనం ఇదే — ఖజానాలను జమ చేసుకోండి. అర్థమైందా? అచ్ఛా - ఈ వాయుమండలములో, మధుబన్‌లో కూర్చుని ఉన్నారు. మధుబన్ యొక్క వాయుమండలము శక్తిశాలీ అయినది, ఈ వాయుమండలములో, ఈ సమయంలో మనస్సును కంట్రోల్ చెయ్యగలరా? నిమిషంలో చేసినా, క్షణంలో చేసినా చెయ్యగలరా? ఆత్మ పరంధామ నివాసిగా అయిపో అని మనసును ఆజ్ఞాపించండి. మనసు ఆజ్ఞను పాటిస్తుందా, పాటించటం లేదా అన్నది చూడండి. (డ్రిల్) అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలు, సదా కష్టాన్ని క్షణంలో పరివర్తన చేసే సదా సహజయోగులు, సదా సంకల్పాలు, సమయం, మాటలు, కర్మలను శ్రేష్ఠంగా చేసుకునేవారు, సదా పొదుపు ఖాతాను పెంచుకునేవారు, సదా మనసుకు యజమానులు, మనసు-బుద్ధి-సంస్కారాలను ఆజ్ఞానుసారంగా నడిపించేవారు, అటువంటి స్వరాజ్య అధికారీ పిల్లలకు, దేశములో ఉన్నా, విదేశములో ఉన్నా కానీ మనసుతోనైతే దూరంగా లేరు, నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులు, సేవ కోసం వచ్చిన వారందరూ, ప్రత్యేకంగా, యూ.పి. యొక్క టర్న్ ఉంది. యూ.పి. నుండి వచ్చిన సేవాధారులు చేతులు ఎత్తండి. చూడండి, సేవాధారులకు ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడూ పాడిందే — బ్రాహ్మణుల సేవ మహా పుణ్యమని సదా గాయనము చేయబడ్డది. భక్తి మార్గంలో 100 లేదా 200 మంది బ్రాహ్మణులకు సేవ చేస్తారు. మరి మధుబన్‌లో ఎంతమంది బ్రాహ్మణులకు సేవ చేస్తున్నారు! ఒక్కొక్క బ్రాహ్మణుని ఆశీర్వాదాలు సేవాధారులకు స్వతహాగానే లభిస్తాయి. చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జమా అయిపోతూనే ఉంటాయి. ఒకటి, ఆశీర్వాదాల ఖాతా జమా అవుతుంది. రెండవది, సేవ యొక్క పుణ్య ఖాతా జమా అవుతుంది. మూడవది, బ్రాహ్మణుల సమీప సంబంధంలోకి వస్తారు. మరియు బాప్‌దాదాను కలుసుకోవడానికి అదనపు టర్న్ లభిస్తుంది. కాబట్టి సేవ యొక్క ఫలం ఎంత ఉంది! సేవాధారి అంటే జమా చేసుకునేవారు. కాబట్టి చాలా మంచి సేవ చేసారు. హృదయంతో సేవ చేసారు. దిలారామ్ వద్దకు చేరిపోయింది. యూ.పి. వారు బాగున్నారు కదా! కాబట్టి ఎవరైతే సేవాధారిగా అయి వస్తారో, వారికి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. భవిష్యత్తులో అయితే లభిస్తుంది. కానీ వర్తమాన సమయంలో కూడా జమా అవుతుంది.
డబల్ విదేశీయులు కూడా చాలామంది కూర్చున్నారు. డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. చూడండి, డబల్ విదేశీయులకు అవకాశం కూడా చాలా లభిస్తుంది. ప్రతి గ్రూప్‌లో డబల్ విదేశీయులు ఉన్నారు. డబల్ విదేశీయులకు ఏ టర్న్‌లోనూ నిషేధం లేదు. అయితే ఇది తక్కువ భాగ్యమా? మీ అందరికీ తెలుసు కదా, వీరి త్యాగం, వీరి ధైర్యము మరియు హృదయ స్వచ్ఛతను చూసి బాప్‌దాదా ఎల్లప్పుడూ సంతోషిస్తారు. మీరు ఏమి అంటారు? సచ్చీ దిల్ తో మురాద్ హాసిల్... (సత్యమైన మనసు ఉంటే కోరిక నెరవేరుతుంది) కాబట్టి వీరు స్వచ్ఛమైన మరియు సత్యమైన హృదయం కలవారు. పడిపోయినా కూడా నిజం చెబుతారు, దాచిపెట్టరు. నిజం చెప్పడం వల్ల సగం తగ్గుతుంది. అందుకే డబల్ విదేశీయులను బాప్‌దాదా ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు మరియు ఎల్లప్పుడూ ప్రియస్మృతులు ఇస్తారు. అద్భుతం అయితే ఉంది. అద్భుతం చేస్తూ చేస్తూ బాప్‌దాదాతో పాటు తమ ఇంటికి చేరుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా డబల్ విదేశీయులకు పదమారెట్ల ప్రియస్మృతులు. భారతవాసులకు లేవు అని. భారతవాసులకు అయితే పదమా-పదమారెట్ల ప్రియస్మృతులు.
ఇండోర్ హాస్టల్ కన్యలు:- కన్యల కోసం ఇలా గానం చేయబడింది - ప్రతి ఒక్క కన్య 100 మంది బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠమైనది. ఎందుకు శ్రేష్ఠమైనది? ఎందుకంటే సేవ చేసి అంతమంది బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకోవాలి. అయితే కుమారీలు బోర్డింగ్ నుండి బయటకు వెళ్లి ఏమి చేస్తారు? ఏమి లక్ష్యం పెట్టుకున్నారు? సేవ చేస్తారా? తలపై కిరీటము పెట్టుకుంటారా లేక బుట్ట పెట్టుకుంటారా? ఏమి చేస్తారు? (కిరీటము.) ఉద్యోగం అనే బుట్టను అయితే ఎత్తుకోరు కదా! 100 మంది బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠమైనది అంటే అర్థము 100 మంది బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకుంటారు అని. అయితే అంత సేవ చేస్తారా? అచ్ఛా. ముందస్తుగా అభినందనలు. అందరి ఆశీర్వాదాలు తీసుకోండి. అచ్ఛా.
(బాప్‌దాదా మొత్తం హాల్లో తిరిగారు, పిల్లలందరికీ దృష్టి ఇచ్చి, తిరిగి స్టేజ్‌పైకి చేరుకున్నారు. మోహిని అక్కయ్య ఆరోగ్యం బాగాలేదు. అహ్మదాబాద్‌లో చెకింగ్ చేయించుకొని బాప్‌దాదా ఎదురుగా వచ్చారు.)
బాగా ఉన్నారు. బాగా ఉండేవారు, బాగా ఉన్నారు మరియు బాగా ఉంటారు. (డాక్టర్ 6-7 రోజుల విశ్రాంతి చెప్పారు.) చాలా త్వరగా బాగైపోయారు. ధైర్యము ఉంచారు కాబట్టి, ధైర్యము మరియు సహాయంతో చేరుకున్నారు. మధ్యలో ఇది పెట్టుకొని వచ్చారు.
దాదీలతో:- మంచి సేవ చేసారు. చాలా బాగుంది. ఎవరైతే నిమిత్తంగా ఉంటారో, వారికి, సమయానికి అదనపు శక్తి లభిస్తుంది. చూడండి, మీ అందరూ ఆది రత్నాల ఆధారంతోనే స్థాపన కార్యం నడుస్తోంది. అలాగే ఉంది కదా! బాప్‌దాదా అయితే ఎల్లప్పుడూ సేవ చేయగల రత్నాలను చూస్తూనే ఉంటారు. బాగుంది కదా! శరీరం యొక్క లెక్కాచారము ఉంది. కానీ ఉరికంబం వంటిది ముల్లుగా అయిపోతుంది. ఇబ్బంది పడరు. లెక్కాచారము తీరిపోతుంది. కానీ ఇబ్బంది (పరేషాన్) పడరు. స్వమానములో ఉంటారు. ఇతరులకు కూడా స్వమానమును గుర్తు చేస్తారు. యజమానులు కదా! శరీరాన్ని నడిపించే రమజ్ (యుక్తి) నేర్చుకున్నారు. శరీరానికి కూడా మీపై ప్రేమ ఉంది కదా! మహారథులపై అందరికీ ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కదా! (దాదీజీతో) చూడండి, ఎంత పని చేస్తారు! కానీ ఎల్లప్పుడూ హర్షితంగా ఉంటారు. నేర్చుకుంటున్నారు కదా! ఎప్పుడూ అలసట యొక్క గుర్తులు కనిపించవు. ఇదే బాబా సమానంగా ఉండే గుర్తు. బ్రహ్మా బాబా మహారథులకు, ప్రత్యేకంగా వీరికి అన్ని వరదానాలు, శక్తులు మరియు బాధ్యతలన్నీ ఇచ్చి వెళ్లారు. మీ అందరి కోసం బాప్‌దాదా ప్రత్యేకంగా వీరికి అలుపెరగకుండా ఉండే వరదానాన్ని ఇచ్చారు. మీ అందరూ కూడా అలుపెరగకుండా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు మరియు చేస్తూనే ఉంటారు. అచ్ఛా. పాండవులు కూడా గొప్పవారే.
*** ఓంశాంతి ***
