‘‘బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థము - ఆజ్ఞాకారులుగా అవ్వండి’’
ఈరోజు బాప్‌దాదా తమ హోలీహంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హోలీహంసలు. సదా మనసులో జ్ఞాన రత్నాలను మననం చేస్తూ ఉంటారు. హోలీహంసల పనే - వ్యర్థమనే రాళ్ళను విడిచిపెట్టడము మరియు జ్ఞాన రత్నాలను మననం చేయటము. ఒక్కొక్క రత్నము ఎంతో అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞాన రత్నాల గనిగా అయ్యారు, జ్ఞాన రత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు.
ఈరోజు బాప్‌దాదా పిల్లలలోని ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేస్తున్నారు. అది ఏమిటి? జ్ఞానం మరియు యోగము యొక్క సహజ ధారణకు సహజమైన సాధనము - బాప్ మరియు దాదాకు ఆజ్ఞాకారులుగా అయ్యి నడుచుకోవడము. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారులు, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారులు. మూడు రూపాలలోనూ ఆజ్ఞాకారులుగా అవ్వటము అనగా సహజ పురుషార్థులుగా అవ్వటము ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయము, ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే ఏ రకమైన శ్రమ కానీ లేక కష్టము కానీ అనుభవమవ్వదు. ప్రతి సమయానికీ, మనసా సంకల్పాలు, వాణి మరియు కర్మలు, ఈ మూడింటికీ ఆజ్ఞ స్పష్టంగా లభించి ఉంది. ఇది చెయ్యాలా-వద్దా, ఇది తప్పా-ఒప్పా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఆలోచించాల్సిన శ్రమ కూడా లేదు. పరమాత్మ ఆజ్ఞ సదా శ్రేష్ఠంగానే ఉంటుంది. ఏ కుమారులంతా అయితే వచ్చారో వారిది చాలా మంచి సంగఠన. మరి ప్రతి ఒక్కరూ బాబాకు చెందినవారిగా అవ్వటంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేసారా? బాబాకు చెందినవారిగా అయినప్పుడు అన్నింటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞను చేసారు? బాబా, తనువు-మనసు-ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో, కుమారుల వద్ద ధనమైతే ఎక్కువ ఉండదు, అయినా కానీ ఏదైతే ఉందో అదంతా మీదే. ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? తనువు కూడా, మనసు కూడా, ధనము కూడా మీవే మరియు సంబంధాలు కూడా అన్నీ మీతోనే - ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేసారా? తనువు-మనసు-ధనము, సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏమున్నాయి! మరి నాది అన్న భావము ఏమైనా ఉందా? అసలు అలా ఉండేందుకేముంది? తనువు, మనసు, ధనము, జనము... అన్నీ బాబాకు అర్పించేసారు. ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా? మధుబన్ వారు అర్పించారా? పక్కానే కదా! మనసు కూడా బాబాది అన్నప్పుడు ఇక నా మనసు అనేదే ఉండదు కదా! లేకపోతే మనసు నాదా? నాది అని అనుకుంటూ ఉపయోగించవచ్చా? మనసును బాబాకు ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నది తాకట్టు పెట్టిన వస్తువు. మరి ఇక యుద్ధం ఎందులో చేస్తుంటారు? నా మనసు చింతలో ఉంది, నా మనసులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనసు చంచలమవుతుంది... నాది అనేదే లేనప్పుడు, అది తాకట్టు పెట్టిన వస్తువు అన్నప్పుడు, మరి ఆ తాకట్టు పెట్టినదానిని నాదిగా భావించి ఉపయోగించుకోవటము, అది మోసము కాదా? మాయ వచ్చేందుకు ద్వారాలు - ‘‘నేను మరియు నాది’’. మరి తనువు కూడా మీది కాదు అన్నప్పుడు ఇక దేహాభిమానానికి సంబంధించిన ‘నేను’ అనేది ఎక్కడి నుండి వచ్చింది! మనసు కూడా మీది కాదు అన్నప్పుడు ఇక నాది-నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీదా లేక నాదా? బాబాదేనా లేక కేవలం చెప్పటం వరకే గానీ చేసేది లేదా? చెప్పటమేమో బాబాది అని, కానీ అనుకోవటం మాత్రం నాది అనా! కేవలం మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి - అందులో దేహాభిమానానికి చెందిన నేను అనేదీ లేదు, నాది అనేదీ లేదు. తనువును కూడా తాకట్టు వస్తువుగా భావించండి, మనసును కూడా తాకట్టు వస్తువుగా భావించండి అన్నది బాబా ఆజ్ఞ అన్నప్పుడు ఇక కష్టపడాల్సిన అవసరమేముంది? ఏ బలహీనత వచ్చినా ఈ రెండు పదాల ద్వారానే వస్తుంది - ‘‘నేను మరియు నాది’’. కనుక ఈ తనువూ మీది కాదు, అలాగే దేహాభిమానానికి చెందిన నేను అనేదీ లేదు. ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే మనసులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమని ఉంది? పాజిటివ్ ఆలోచించండి, శుభ భావనతో కూడిన సంకల్పాలను చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అనేది బాబా ఆజ్ఞయా? కాదు. కనుక మనసు మీది కాదు అన్నప్పుడు మళ్ళీ వ్యర్థ సంకల్పాలను చేస్తుంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేదనే కదా! కేవలం ఒక్క మాటను గుర్తు చేసుకోండి - నేను పరమాత్మకు ఆజ్ఞాకారీ బిడ్డను. ఇది బాబా ఆజ్ఞనా, కాదా అన్నదానిని ఆలోచించండి. ఎవరైతే ఆజ్ఞకారి బిడ్డగా ఉంటారో వారు సదా బాబాకు స్వతహాగానే గుర్తు ఉంటారు, స్వతహాగానే ప్రియంగా ఉంటారు, స్వతహాగానే బాబాకు సమీపంగా ఉంటారు. కనుక చెక్ చేసుకోండి - నేను బాబాకు సమీపంగా ఉన్నానా, బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నానా? ఒక్క మాటనైతే అమృతవేళ గుర్తు చేసుకోగలరు - ‘‘నేను ఎవరిని?’’ ఆజ్ఞాకారినా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారిగా ఉంటూ, అప్పుడప్పుడు ఆజ్ఞను అతిక్రమించేవాడినా?
బాప్‌దాదా సదా ఏమంటారంటే - ఏ రూపంలోనైనా ఒకవేళ ఒక్క బాబాతో ఉన్న సంబంధమే గుర్తుంటే, మనస్ఫూర్తిగా ‘బాబా’ అని వెలువడితే సమీపతను అనుభవము చేస్తారు. ‘‘బాబా-బాబా’’ అని కేవలం ఒక మంత్రంలా అనకండి. బయటివారు రామ-రామ అని అంటారు, అలా మీరు బాబా-బాబా అని అంటారు, అలా కాకుండా బాబా అన్న మాట మనసులో నుండి రావాలి. ప్రతి కర్మ చేసే కంటే ముందు చెక్ చేసుకోండి - మనసు కోసము, తనువు కోసము మరియు ధనం కోసము బాబా ఆజ్ఞ ఏమిటి? కుమారుల వద్ద ఎంత తక్కువ ధనం ఉన్నా కానీ ధనం విషయంలో లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞను ఇచ్చారో అలానే పెట్టుకున్నారా? లేకపోతే ఎలా అనిపిస్తే అలా ఉపయోగిస్తున్నారా? కుమారులు ప్రతి ఒక్కరూ ధనము యొక్క లెక్కల ఖాతాను కూడా పెట్టుకోవాలి. ధనాన్ని ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, మనసును కూడా ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, తనువును కూడా ఎక్కడ ఉపయోగించాలి, ఈ అన్ని విషయాలలో లెక్కల ఖాతా ఉండాలి. దాదీలైన మీరు ధారణా క్లాస్ చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా లెక్కల ఖాతా పెట్టుకోవాలి అన్నదానిని అర్థం చేయిస్తారు కదా! కుమారులకు తెలుసా లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడ ఉపయోగించాలి అన్నది తెలుసా? కొద్దిమంది చేతులు ఎత్తుతున్నారు. కొత్త కొత్తవారు కూడా ఉన్నారు, వారికి తెలియదు. ఏమేమి చెయ్యాలి అన్నది వారికి తప్పకుండా చెప్పండి! అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు, భారము అనిపించదు ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఏమిటంటే - కుమార్ అంటే లైట్, డబల్ లైట్. మేము నంబర్‌వన్‌లోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా? మరి లక్ష్యముతోపాటు లక్షణాలు కూడా కావాలి. లక్ష్యము చాలా ఉన్నతంగా ఉండి, లక్షణాలు లేకపోతే లక్ష్యానికి చేరుకోవటము కష్టము, అందుకే బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో, దానిని సదా బుద్ధిలో ఉంచుకుని ఆ తరువాత కార్యములోకి రండి.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా అర్థం చేయించారు, బ్రాహ్మణ జీవితము యొక్క ముఖ్య ఖజానాలు - సంకల్పము, సమయము మరియు శ్వాస. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా ఉండకూడదు, వ్యర్థంగా ఉండకూడదు. శ్వాస శ్వాసలోనూ మీ ఇష్టదేవతను గుర్తు చేసుకోండి అని భక్తిలో అంటారు. శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా... ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ సంకల్పము, సమయము మరియు శ్వాస - ముఖ్యమైన ఈ మూడు ఖజానాలు ఆజ్ఞ ప్రమాణంగా సఫలమవుతున్నాయా? వ్యర్థమైతే అవ్వటం లేదు కదా? ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు. అంతేకాక జమ ఖాతాను ఈ సంగమములోనే జమ చేసుకోవాలి. సత్య, త్రేతా యుగాలలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర, కలియుగాలలో పూజ్య పదవిని పొందాలన్నా, రెండింటి జమ ఈ సంగమములోనే చేసుకోవాలి. ఆ లెక్కన ఆలోచించండి - సంగమ సమయములోని జీవితము, ఈ చిన్న జన్మలోని సంకల్పాలు, సమయము, శ్వాస ఎంత అమూల్యమైనవి? ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఎలా పడితే అలా రోజు గడిచిపోయింది అన్నట్లు కాదు, ఒక రోజే కదా అలా గడిచిపోయింది అని కాదు, ఒక్క రోజులో చాలా, చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తే, వ్యర్థంగా సమయము గడిచిపోతే, పోనీలే 5 నిమిషాలే కదా పోయింది అని అనుకోకండి. దానిని కాపాడుకోండి. సమయమనుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఏదో ఒక ఆటను చూపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతిపతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే - ఎగిరే కళ ఆట. ప్రకృతి అయితే ఆటను చూపిస్తుంది కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ ఆటను చూపిస్తున్నారా?
ఒక బిడ్డ - ఇలా జరిగింది, అలా జరిగింది అని ఒరిస్సాలోని సముద్ర తుఫాను రిజల్టు గురించి వ్రాసి ఇచ్చారు. మరి ఆ ప్రకృతి ఆటనైతే చూసారు కదా. అయితే బాప్‌దాదా అడుగుతున్నారు - మీరు కేవలం ప్రకృతి ఆటనే చూసారా లేక మీ ఎగిరే కళ ఆటలో బిజీగా ఉన్నారా? లేక కేవలం సమాచారాన్ని వింటూ ఉన్నారా? సమాచారాన్ని అయితే అందరూ వినాల్సి ఉంటుంది కూడా, కానీ సమాచారాన్ని వినటంలో ఎంతైతే అభిరుచి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళ ఆటలో ఉండటానికి అభిరుచి ఉంటుందా? కొంతమంది పిల్లలు గుప్త యోగులుగా కూడా ఉన్నారు, అటువంటి గుప్త యోగీ పిల్లలకు బాప్‌దాదా సహాయము కూడా ఎంతగానో లభించింది మరియు అటువంటి పిల్లలు స్వయము కూడా అచలంగా, సాక్షిగా ఉన్నారు మరియు వాయుమండలములో కూడా అవసరమైన సమయానికి సహయోగాన్ని ఇచ్చారు. ప్రభుత్వం వారు, చుట్టుప్రక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతారో, అలా బ్రాహ్మణ ఆత్మలు కూడా తమ సహయోగముగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యము ఏదైతే ఉందో అది చేసారా? ఆ ప్రభుత్వము ఇది చేసింది, ఫలానా దేశము అది చేసింది... అని వాళ్ళు వెంటనే ప్రకటించటం మొదలుపెడతారు. మరి బాప్‌దాదా అడుగుతున్నారు - బ్రాహ్మణులైన మీరు కూడా మీ ఈ కార్యాన్ని చేసారా? మీరు కూడా అలర్ట్‌గా (జాగరూకులై) ఉండాలి. స్థూల సహయోగాన్ని ఇవ్వటము కూడా అవసరము, బాప్‌దాదా దానిని చెయ్యవద్దు అని అనరు, కానీ బ్రాహ్మణ ఆత్మల విశేష కార్యము ఏదైతే ఉందో, ఇతరులెవ్వరూ ఇవ్వలేని సహయోగమేదైతే ఉందో, ఆ సహయోగాన్ని మీరు అలర్ట్‌గా అయ్యి (జాగరూకులై) ఇచ్చారా? ఇవ్వాలి కదా! లేక వారికి కేవలం వస్త్రాలు, బియ్యమే కావాలా? ముందైతే మనసులో శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. మరి స్థూల సహయోగముతోపాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులే ఇవ్వగలరు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగినది అసలేమీ కాదు, ఇది కేవలం రిహార్సల్ మాత్రమే. అసలైనవైతే మున్ముందు రానున్నాయి. ఆ రిహార్సల్‌ను మీకు కూడా బాబా మరియు సమయము చేయిస్తున్నాయి. కావున మీ వద్ద ఏ శక్తులు మరియు ఖజానాలైతే ఉన్నాయో, వాటిని అవసరమైన సమయములో ఉపయోగించటము వస్తుందా?
కుమారులు ఏం చేస్తారు? శక్తులు జమ అయి ఉన్నాయా? శాంతి జమ అయి ఉందా? ఉపయోగించటము వస్తుందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతారు, ఇప్పుడు ప్రాక్టికల్‌లో చూపించండి. సాక్షిగా అయ్యి చూడాలి కూడా, వినాలి కూడా మరియు సహయోగాన్ని ఇవ్వాలి కూడా. చివర్లో అసలైనవి వాటి పాత్రను పోషించినప్పుడు, ఆ సమయములో వాటిని సాక్షిగా మరియు నిర్భయులుగా అయ్యి చూడాలి కూడా మరియు పాత్రను కూడా పోషించాలి. ఏ పాత్ర? దాత పిల్లలు, దాతగా అయ్యి ఆత్మలకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉండాలి. మరి మీరు మాస్టర్ దాతలే కదా? స్టాక్‌ను జమ చేసుకోండి, మీ వద్ద ఎంత స్టాక్ ఉంటే అంతగానే దాతగా అవ్వగలరు. అంతిమము వరకు మీ కోసమే జమ చేసుకుంటూ ఉన్నట్లయితే దాతగా అవ్వలేరు. అనేక జన్మలు ఏ శ్రేష్ఠ పదవినైతే పొందాలో, దానిని ప్రాప్తి చేసుకోలేరు. అందుకే ఒక విషయంలో మీ వద్ద స్టాక్‌ను జమ చేసుకోండి. శుభ భావన, శ్రేష్ఠ కామన యొక్క భండారా సదా నిండుగా ఉండాలి. రెండవది - విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తులను ఏ సమయములో, ఎవరికి ఏవి కావాలో వాటిని ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయమనుసారంగా కేవలము - మీ పురుషార్థానికీ మీ సంకల్పాలను మరియు సమయాన్ని ఉపయోగించండి, దానితోపాటు దాతగా అయ్యి విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి. మీరు చెయ్యాల్సిన పురుషార్థమునైతే వినిపించాము - అమృతవేళలోనే ‘నేను ఆజ్ఞాకారీ బిడ్డను’ అని అనుకోండి! ప్రతి కర్మకూ ఆజ్ఞ లభించి ఉంది. మేల్కొనేందుకు, నిద్రించేందుకు, తినేందుకు, కర్మయోగిగా అయ్యేందుకు, ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞాకారిగా అవ్వటము, ఇదే బాబా సమానంగా అవ్వటము. కేవలం శ్రీమతంపైనే నడవండి, మన్మతము వద్దు, పరమతము వద్దు. ఏదీ కలపకండి. ఒక్కోసారి మన్మతముపై, ఒక్కోసారి పరమతముపై నడిచినట్లయితే శ్రమించాల్సి ఉంటుంది, సహజం అనిపించదు, ఎందుకంటే మన్మతము, పరమతము ఎగరనివ్వవు. మన్మతము, పరమతము భారమైనవి మరియు ఆ భారము ఎగరనివ్వదు. శ్రీమతము డబల్ లైట్‌గా చేస్తుంది. శ్రీమతముపై నడవటం అనగా సహజంగా బాబా సమానంగా అవ్వటము. శ్రీమతముపై నడిచేవారిని ఏ పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు. మరి శ్రీమతముపై నడవటం వస్తుందా?
అచ్ఛా, మరి కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు? ఆహ్వానం లభించింది. విశేషమైన పాలన లభించింది. చూడండి, మీరు ఎంత ప్రియమైన పిల్లలైపోయారు! మరి ఇప్పుడిక మున్ముందు ఏం చేస్తారు? రెస్పాన్స్ ఇస్తారా లేక అక్కడకు వెళ్తే అక్కడివారిగా, ఇక్కడికి వస్తే ఇక్కడివారిగా ఉంటారా? అలా అయితే లేరు కదా? ఇక్కడైతే చాలా ఆనందములో ఉన్నారు, మాయ దాడి నుండి రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మధుబన్‌లో కూడా మాయ వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా? మధుబన్‌లో కూడా శ్రమించాల్సి వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు, మంచిది. బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. ప్రభుత్వము వారికి కూడా యూత్ గ్రూప్ వైపుకు అటెన్షన్ వెళ్లే సమయము వస్తుంది, కానీ మీరు ఎప్పుడైతే విఘ్న-వినాశకులుగా అవుతారో అప్పుడే వారి అటెన్షన్ వెళ్తుంది. విఘ్న-వినాశక్ అనేది ఎవరి పేరు? మీదే కదా! ఏ కుమార్‌నైనా ఎదుర్కొనేందుకు విఘ్నాలకు ధైర్యము ఉండకూడదు, అప్పుడు విఘ్న-వినాశకులు అని అంటాము. విఘ్నము ఓడిపోవాలే కానీ అది దాడి చెయ్యకూడదు. విఘ్న-వినాశకులుగా అయ్యే ధైర్యము ఉందా? లేకపోతే అక్కడకు వెళ్ళిన తరువాత - దాదీ, చాలా మంచిగా ఉండేవారము కానీ ఏమైపోయిందో తెలియదు అని ఇలా ఉత్తరం వ్రాస్తారా! ఇలా అయితే వ్రాయరు కదా? ఈ శుభవార్తను వ్రాయండి - ఓ.కే, వెరీ గుడ్, విఘ్న-వినాశకుడిని. కేవలం ఒక్క మాట వ్రాయండి, అంతే. చాలా పెద్ద ఉత్తరము వద్దు. ఓ.కే. అచ్ఛా. పెద్ద పెద్ద ఉత్తరాలు రాయవలసి వస్తే, దానిని రాయడానికే మీకు సంకోచం కలుగుతుంది. ఎలా రాయాలి? ఏమి రాయాలి? అని ఆలోచిస్తారు కదా! చాలామంది పిల్లలు, బాబాకు చార్టును రాయాలి అని అనుకుంటారు. కానీ రాయడానికి కూర్చునే సమయానికి ఆ రోజే ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. దానివల్ల రాసే ధైర్యమే ఉండదు. అలా ఎందుకు జరుగుతుంది? మీకు విఘ్న-వినాశకులు అనే బిరుదు లేదా? బాబా చెబుతున్నారు, ఏ విషయమైనా రాసినా, చెప్పినా దానిలో సగం అప్పుడే తొలగిపోతుంది. అందువల్ల ఎంతో లాభం ఉంటుంది.కానీ పెద్ద ఉత్తరాలు రాయకండి. ఓ.కే. అని సంక్షిప్తంగా రాయండి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే, మరుసటి రోజు ప్రత్యేక అటెన్షన్ ఉంచి విఘ్న-వినాశకులుగా అయి, తర్వాత ఓ.కే. అని రాయండి. పొడవైన కథలు రాయవద్దు. ఇది జరిగింది, అది జరిగింది... ఇతను ఇలా అన్నాడు, అతను అలా అన్నాడు... ఇవన్నీ రామాయణం, వాటి కథలు. జ్ఞాన మార్గంలో ఒకే ఒక్క అక్షరం ఉంది. అది ఏ అక్షరం? ఓ.కే. (O.K.). శివబాబా గుండ్రంగా ఉంటారు కదా, అలాగే ఓ (O) కూడా గుండ్రంగానే వ్రాస్తారు. కే (K) అంటే మీ కింగ్డమ్. కాబట్టి ఓ.కే. అంటే బాబా కూడా గుర్తుంటారు, కింగ్డమ్ కూడా గుర్తుంటుంది. అందుకే ఓ.కే.... అయితే ఓ.కే. అని వ్రాసి ప్రతిరోజూ పోస్టు చేయవద్దు. అలా చేస్తే పోస్టు ఖర్చు పెరుగుతుంది. ఓ.కే. అని వ్రాసి మీ టీచర్ వద్ద జమ చేయండి. ఆ తర్వాత టీచర్ పదిహేను రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అందరి సమాచారాన్ని ఒకేసారి వ్రాయాలి. పోస్టు మీద అంత ఖర్చు చేయకూడదు. ఆదా చేయాలి కదా. ఇక్కడ కూడా పోస్టులు ఎక్కువైపోతాయి కాబట్టి వాటిని చూడడానికి సమయం కూడా ఉండదు. మీరు ప్రతిరోజూ వ్రాయండి. టీచర్ వాటిని జమ చేసుకొని, ఒకే కాగితంపై ఓ.కే. లేదా నో (No) అని వ్రాయాలి. ఇంగ్లీష్ రాకపోయినా ఓ.కే. వ్రాయడం వస్తుంది, నో వ్రాయడం కూడా వస్తుంది. అది కూడా రాకపోతే, బాగుంది లేదా బాగాలేదు అని మాత్రమే వ్రాయండి. అయితే యువత యొక్క ఫలితం ఏమి వస్తుంది? ఓ.కే. అనే ఫలితమే వస్తుందా? లేక, అక్కడికి వెళ్లాక ఇలా జరిగింది, అలా జరిగింది అని చెబుతారా? అలా చేయకూడదు. యువత తమ కమాల్ చూపించాలి. అందరూ, ఇదే నంబర్ వన్ యువత్ గ్రూప్ అని చెప్పేలా ఉండాలి. అయితే ప్రత్యేకంగా లభించిందా? సాధారణంగా పార్టీలో వచ్చినప్పుడు అందరికీ ముందు కూర్చునే అవకాశం లభించదు. ఒకరు ఒకచోట, ఇంకొకరు ఇంకొకచోట కూర్చుంటారు. కానీ ఇప్పుడు మీరు పూర్తిగా ముందే కూర్చున్నారు. కాబట్టి ఈ మధుబన్ యొక్క స్నేహాన్ని, శక్తిని మరచిపోవద్దు. ఎప్పుడూ ఏది జరిగినా, మధుబన్ యొక్క రిఫ్రెష్మెంట్ను గుర్తు చేసుకోవాలి. అలా ఉన్నారా యువత? చూస్తాము. ఈ సమయంలో మొత్తం బ్రాహ్మణ కుటుంబం దృష్టి యువతపైనే ఉంది. యువత ఏమి చేస్తోంది, ఇక ముందు ఏమి చేస్తుంది అని అందరూ ఆలోచిస్తున్నారు.
బాప్‌దాదాకు కూడా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారా? అయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కేవలం మధుబన్లోనే సంతోషంగా ఉండటం కాదు. బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - నడుస్తూ, నడుస్తూ ఎవరైనా ఎందుకు నారాజ్ అవుతారు? జ్ఞానంలోని ఏదో ఒక రహస్యాన్ని (రాజ్) మరిచిపోతారు, అందుకే నారాజ్ (కోపం) అవుతారు. కాబట్టి మీరు అందరూ ప్రతి రహస్యాన్ని అర్థం చేసుకొని, ఆలోచించి, దృఢంగా అయ్యి వెళ్తున్నారు కదా. ఎప్పుడూ నారాజ్ అవ్వకూడదు - మీపై కూడా అవ్వకూడదు, ఏ ఆత్మపై కూడా అవ్వకూడదు. సంతోషంగా ఉండాలి. సెంటర్‌కు వెళ్లిన తర్వాత ఒక నెలవరకు మాత్రమే సంతోషం అనే ఖజానా నిల్వ ఉండి, తర్వాత మెల్లగా అయిపోతుందా? అయిపోదు కదా! ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. అలాగే, తనువు, మనస్సు, ధనం అన్నీ బాబాకు ఇచ్చేసారు కదా? మంచిది, హృదయాన్ని కూడా ఇచ్చేసారా? హృదయాన్ని బాబాకు ఇచ్చేసారా? హృదయాన్ని ఇచ్చేసినట్లయితే, బాబా ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగానే నడవాలి. మీ హృదయం ఇక మీ కోసం లేదు. అయితే చెప్పండి, ఎవరు తమ హృదయాన్ని దిలారామ్కు ఇచ్చేశారో, వారు మరే ఆత్మతోనైనా హృదయాన్ని కలుపుకుంటారా? కలుపుకోరు కదా! అయితే ఎవరితోనైనా హృదయ సంబంధమైన మాటలు, సంభాషణలు, దృష్టి లేదా వృత్తి ద్వారా అలాంటి ప్రవర్తన చేయరు కదా? లేక కొంత హృదయాన్ని ఇచ్చి, కొంత వేరెవరితోనైనా కలుపుకోవడానికి ఉంచుకున్నారా? హృదయాన్ని ఇచ్చేసారా? అయితే హృదయాన్ని ఇంకెక్కడా కలుపుకోకూడదు. అది బాబా యొక్క అమానత్తు. దిలారామ్కు హృదయాన్ని ఇచ్చేశారు. హృదయ సంబంధమైన కథలు చాలా వస్తుంటాయి. కాబట్టి కుమారులు గుర్తుంచుకోవాలి. అలాగే ప్రవృత్తిలో ఉన్నవారు కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఈరోజు కుమారుల రోజు కదా. అందుకే బాప్‌దాదా ఈ అటెన్షన్ ఇస్తున్నారు - ఇలాంటి రిపోర్టు ఎప్పుడూ రాకూడదు. నా హృదయం అనేది ఇక లేదు, బాబాకు ఇచ్చేసారు. అప్పుడు హృదయం ఇతరులతో ఎలా కలుస్తుంది! ఎవరి దృష్టి లేదా వృత్తి కొంచెమైనా బలహీనంగా ఉంటే, ఆ బలహీన హృదయాన్ని ఇక్కడి నుంచే బలంగా చేసుకొని వెళ్లాలి. దీనికి హా జీ ఉందా? లేక అక్కడికి వెళ్లిన తర్వాత, పరిస్థితులే అలా ఉన్నాయి అని చెబుతారా? ఏమి జరిగినా సరే, బాప్‌దాదా ముందు వాగ్దానం చేసిన తర్వాత ఎంతటి కష్టాలు వచ్చినా ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టకూడదు. బాబా ముందు వాగ్దానం చేయడం, వాగ్దానం తీసుకోవడం... ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఏ ఆత్మ ముందు వాగ్దానం చేయడం లేదు; పరమాత్మ ముందు వాగ్దానం చేస్తున్నారు. అందువల్ల ఆ వాగ్దానాన్ని ఎప్పుడూ చెరిపివేయకూడదు. ఈ జన్మ యొక్క ప్రతిజ్ఞను ఎప్పుడూ మరచిపోవద్దు.
ఇప్పుడు అందరూ ఒక నిమిషం పాటు మీ హృదయం నుండి... అయితే హృదయం మీది కాదు, బాబాకు ఇచ్చేసారు... అయినప్పటికీ హృదయంలో ఒక నిమిషం వాగ్దానం చేయండి - ఎల్లప్పుడూ విఘ్న-వినాశకులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటాము అని. (డ్రిల్)
అచ్ఛా, డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. డబల్ విదేశీయులను చూసి మీ అందరికీ కూడా సంతోషం కలుగుతుంది కదా! చూడండి, మిమ్మల్ని చూసి అందరూ ఎంత సంతోషపడుతున్నారో! ఎందుకంటే, సంగమయుగంలో డ్రామా ప్రకారం బాబాను ప్రత్యక్షం చేయడంలో డబల్ విదేశీయులకు చాలా మంచి పాత్ర ఉంది. డబల్ విదేశీయులు బాబా యొక్క ఒక బిరుదును ప్రత్యక్షం చేశారు అని బాప్‌దాదా అంటున్నారు. ఇంతకు ముందు భారత కళ్యాణకారి, ఇప్పుడు ప్రాక్టికల్‌గా విశ్వ కళ్యాణకారి అయ్యారు. మరి నిమిత్తులయ్యారు కదా! విదేశాల నుండి కల్ప క్రితపు ఆ కొత్త-కొత్త ఆత్మలు వచ్చినప్పుడు, బాప్‌దాదా కూడా వారి విశేషతను, వారి కమాల్‌ను చూస్తారు. బాప్‌దాదా భారతదేశంలోని తత్వశాస్త్రానికి (ఫిలాసఫికి) సంబంధించిన ఎన్నో విషయాలు కూడా చెబుతారు. అవి విదేశీయులకు అసలు తెలియవు. గణేశుడు ఎవరు, హనుమంతుడు ఎవరు, రామాయణం ఏమిటి, భాగవతం ఏమిటి, భక్తి ఏమిటి, ఏమీ తెలియదు. కానీ కల్ప క్రితం వారే కావడం వల్ల అన్ని విషయాలను వెంటనే క్యాచ్ చేసుకుంటారు. కాబట్టి వారి క్యాచింగ్ పవర్ చాలా బాగుంది. వారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకత ఉంది, ఏది వింటారో దానిని అనుభవంలోకి తీసుకువస్తారు. కేవలం వినడానికే పరిమితం కారు. శాంతి అనుభవం కావచ్చు, సంతోషం అనుభవం కావచ్చు, నిస్వార్థ ప్రేమ అనుభవం కావచ్చు, ఏదో ఒక అనుభవం వారిలో పరివర్తన తీసుకొస్తుంది. అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయుల కమాల్‌ను చూస్తూ ఉంటారు. వాహ్ పిల్లలూ వాహ్! అని అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కూడా అన్ని వైపులా విదేశాల నుండి వచ్చే సేవా వార్తలలో సేవ పట్ల మంచి ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం యోగం మరియు సేవలో కొంచెం బ్యాలెన్స్ ఇంకా కావాలి. అయినప్పటికీ సేవ పట్ల వారి ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయి. అలాగే ముందుకు సాగుతూనే ఉంటారు. ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, ఏ బలహీనతనైనా ఎప్పుడూ దాచిపెట్టరు. వారి హృదయం చాలా నిర్మలంగా ఉంటుంది. అందుకే వెంటనే మేకప్ చేసుకుంటారు. విన్నారా డబల్ విదేశీయులారా! బాప్‌దాదా ఎప్పుడూ వాహ్ పిల్లలూ వాహ్! అనే గీతాన్ని పాడుతూనే ఉంటారు. సాధారణంగా కూడా, పర్సనల్‌గా విదేశీయులను కలుసుకున్నాము కదా! అయినప్పటికీ చూడండి, ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాటిని దాటి ఇక్కడికి చేరుకుంటారు. ఎక్కువమంది విదేశీయులు ప్రతి సంవత్సరం తప్పకుండా రావడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. భారతదేశంలో ఉన్నవారు ఒక్కోసారి మిస్ చేయవచ్చు, కానీ వీరు అలా చేయరు. ఏది చేసైనా సరే వచ్చి తీరాల్సిందే అనుకుంటారు. చూడండి, రష్యా వారిని కూడా చూడండి. డబ్బు తక్కువ ఉన్నప్పటికీ వారి గ్రూప్ మాత్రం చాలా పెద్దదిగా వస్తుంది. కాబట్టి విదేశీయుల ధైర్యం చాలా బాగుంది. అందువల్ల ప్రతి ఒక్క విదేశీయునికి బాప్‌దాదా ప్రత్యేక ప్రియస్మృతులు మరియు అభినందనలు ఇస్తున్నారు.
విదేశాల టీచర్లు ముందే కూర్చున్నారు. వీరికి మధుబన్‌లో సేవ చేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మంచిది. గుజరాత్ వారు సేవలో ఉన్నారు. గుజరాత్ సేవాధారులు చేతులు ఎత్తండి. నిర్విఘ్న గుజరాత్ కదా! టీచర్లు కూడా అందరూ ధైర్యవంతులే. ఎప్పుడు పిలిచినా గుజరాత్ జీ హాజరు అనే పాఠాన్ని చదువుతుంది. చాలా బాగుంది. హా జీ, హా జీ" అని చెప్పేవారికి అనేక జన్మల పాటు అందరూ కూడా ఎదురుగా హా జీ, హా జీ అని చెబుతారు. చాలా బాగుంది. చూడండి, సేవ చేసే మొదటి అవకాశం గుజరాత్‌కే లభించింది. పిలవగానే హాజరు అయిపోతారు అని దాదీలు కూడా సందేహం లేకుండా ఉంటారు. చాలా బాగుంది. అచ్ఛా.
మధుబన్‌లో కూడా నాలుగు ఐదు భుజాలు ఉన్నాయి. మధుబన్ యొక్క విశేషత కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంది. మధుబన్ వారు తమ చార్టు పంపారు. అది బాప్‌దాదా వద్దకు చేరుకుంది. బాప్‌దాదా పిల్లలందరినీ, ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారీ పిల్లలు అన్న దృష్టితో చూస్తారు. విశేష కార్యము లభించింది మరియు ఎవరెడీగా అయ్యి చేసారు, ఇందుకు విశేషంగా అభినందనలను ఇస్తున్నాము. అచ్ఛా, ప్రతి ఒక్కరూ తమది స్పష్టంగా వ్రాసారు. (దాదీతో) మీరు కూడా రిజల్టు చూసి క్లాస్ చేయించండి. వారి అవస్థ గురించిన చార్టు బాగా వ్రాసారు. బాప్‌దాదా అయితే అభినందనలు ఇస్తూనే ఉన్నారు. సత్యమైన హృదయముపై సత్యమైన సాహెబ్ రాజీ అవుతారు.
అచ్ఛా, అందరూ వింటున్నారు కదా. దూరదూరాలలో కూర్చుని ఉన్నవారు కూడా వింటున్నారు కదా. (దేశ-విదేశాలలో ఇంటర్నెట్ ద్వారా మురళిని వింటున్నారు) దేహము, దేశముతో దూరంగా ఉన్నప్పటికీ, భిన్న-భిన్న సమయాలు అయినప్పటికీ వినడానికి చేరుకుంటారు, కావున బాప్‌దాదా ఆ పిల్లలందరినీ సమ్ముఖంలోనే చూస్తున్నారు. అందరూ మనసుకు సమీపంగా మరియు సమ్ముఖంగా ఉన్నారు. అచ్ఛా, సైన్సు సాధనాలతో లాభాన్ని తీసుకుంటున్నారు. నిజానికి ఈ సాధనాలన్నీ రిఫైన్ అయ్యి మీ కోసమే పని చేస్తాయి కానీ వీటిని సంగమయుగంలోనే ఉపయోగిస్తున్నారు, ఇందుకు అభినందనలు. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క ఆజ్ఞాకారీ పిల్లలకు, సదా విఘ్న-వినాశక పిల్లలకు, సదా శ్రీమతముపై సహజంగా నడిచేవారికి, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా ఆనందములో ఎగిరే మరియు ఎగిరింపజేసేవారికి, సర్వ ఖజానాల భండారాతో నిండుగా ఉండేవారికి, ఇటువంటి బాబాకు సమీపముగా మరియు సమానముగా ఉండే పిల్లలకు చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా, విశేషంగా అలసిపోనివారిగా మరియు ఎవరెడీగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగిరేవారికి బాప్‌దాదా యొక్క విశేష ప్రియస్మృతులు.
(బాప్‌దాదా డైమండ్ హాలులో కూర్చుని ఉన్న సోదర-సోదరీలందరికీ దృష్టి ఇవ్వడానికి హాలులో తిరిగారు)
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల చాలా-చాలా-చాలా ప్రేమ ఉంది. మాపై బాప్‌దాదాకు తక్కువ ప్రేమ ఉంది అని అనుకోకండి. మీరు మర్చిపోయినా కానీ బాబా నిరంతరము పిల్లలు ప్రతి ఒక్కరి మాలను జపిస్తూ ఉంటారు ఎందుకంటే బాప్‌దాదాకు ప్రతి బిడ్డ యొక్క విశేషత సదా ముందు ఉంటుంది. ఏ బిడ్డ కూడా విశేషముగా లేరు అన్నది లేదు. పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషమైనవారే. బాబా ఎప్పుడూ ఒక్క బిడ్డను కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని - నేను విశేష ఆత్మను మరియు విశేష కార్యము కొరకు నిమిత్తమై ఉన్నాను అని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా! అందరినీ కలవడం జరిగింది, అందరినీ కలిసాము కదా!
(దాదీ జానకిగారు జగదీశ్ అన్నయ్య యొక్క ప్రియస్మృతులను అందించారు.) అంతా బాగైపోతుంది. చాలా-చాలా ప్రియస్మృతులు ఇవ్వండి. అయినప్పటికీ మొదటి నుంచే సేవ యొక్క ఇన్వెన్షన్లో మంచి పాత్రను పోషించారు. విశేషత చూపించేవారికి విశేషంగా బాబా యొక్క దీవెనలు లభిస్తాయి.
దాదీ జానకితో:- మీరు బాగానే ఉన్నారు కదా! రెస్ట్ ఈజ్ బెస్ట్ అని బాప్‌దాదా చెప్పారు. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. సేవ ఉంది, కానీ మీరు ముందు కూడా ఉండాలి. మీ ఇద్దరి శరీరాలు విశేషమైనవి. ఆత్మలు అయితే విశేషమే, కానీ శరీరాలు కూడా విశేషమైనవి. అలాగే అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. అయినప్పటికీ శరీరాన్ని కూడా చూసుకోవాలి. అందరినీ సంతుష్టపరిచేవారైతే, శరీరాన్ని కూడా సంతుష్టపరచాలి కదా! అచ్ఛా.
దాదీజీతో:- చాలా బాగా నడిపిస్తున్నారు. బాప్‌దాదా పదమారెట్లు సంతోషంగా ఉన్నారు. మీ ఇద్దరి అద్భుతం ఉంది. బాప్‌దాదా అయితే ఉండనే ఉన్నారు. మీ అందరి రోమ-రోమాలలో బాబా ఉన్నారు. అందుకే అందరి రోమ-రోమాలలో బాబా యొక్క గుర్తును కలిగించడానికి నిమిత్తంగా ఉన్నారు. ఉల్లాస-ఉత్సాహాలు కలిగించడంలో నంబర్‌వన్‌గా ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరినీ చూసి బాప్‌దాదా చాలా సంతోషపడుతున్నారు. ప్రతిరోజూ ఎన్నోసార్లు మీ మాలను జపిస్తారు. వీరందరూ (దాదీలు) కూడా తోడుగా ఉన్నారు. అందరూ తమ తమ పని చేస్తున్నారు. ముందుగా ఈ ఇద్దరు ఉన్నారు, మిగిలినవారంతా కూడా మీతో ఉన్నారు. అందరూ సహచరులే. పాండవులు కూడా సహచరులే. వీరిని చూడండి, క్యాబిన్లో ఉన్నవారు చాలా మంచి సేవ చేస్తున్నారు. ఎవరి పేర్లు చెప్పాలి! అందుకే నిమిత్తంగా వీరి పేర్లు తీసుకుంటున్నాము. మిగిలినవారందరూ కూడా ఉన్నారు. ఒక్కొక్కరి మహిమను బాప్‌దాదా చెప్పడం ప్రారంభిస్తే, రాత్రంతా సమయం పడుతుంది. అచ్ఛా.
వల్లభ్ అన్నయ్యతో:- (బొంబాయిలో హార్ట్ బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఎనిమిది రోజుల్లో తిరిగి మధుబన్కు వచ్చారు.)
యోగయుక్తంగా ఉండడం వల్ల, మంచి పాత్రను పోషించడం వల్ల, లెక్కాచారము సహజంగానే తీరిపోయింది. ఎక్కువ కాలం కొనసాగలేదు. కొద్దిలోనే లెక్కాచారము తీరిపోయింది. ఇది మంచి విశేషతను చూపించారు. బాగుంది. చాలా బాగుంది. అసలు ఏమీ జరిగినట్టే అనిపించడం లేదు.
(డా. బనారసీతో) వీరికి కూడా పుణ్యం లభిస్తుంది. పుణ్యం జమ అవుతుంది. అచ్ఛా.
కాఠ్మాండు యొక్క శీలా బెహన్‌తో:- (యాక్సిడెంట్ జరిగిన పది సంవత్సరాల తర్వాత బాప్‌దాదాను కలుస్తున్నారు.) (నా బాబా అని శీలా బెహన్ అంటున్నారు). మేరీ బచ్చీ అని బాబా కూడా అంటున్నారు. మీరు బాబావారు, బాబా మీవారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. అదే మీ విశేషత. చాలా బాగుంది.
దీని తర్వాత బాప్‌దాదాకు జ్యోతిర్లింగ యాత్రల మ్యాప్ చూపించారు. బాప్‌దాదా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి ఇలా అన్నారు - ఇది ఆత్మికమైన అలౌకిక యాత్ర. అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో ఉండి, లైట్ హౌస్‌లుగా అయి వెళ్లండి. దాని ద్వారా అనేకమందికి బాబా యొక్క సందేశం లభిస్తుంది.
*** ఓంశాంతి ***
