Search for a command to run...
4 Feb 2001
‘‘సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్రగతితో కార్యములో వినియోగించండి’’
4 February 2001 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా విశ్వములోని నలువైపులా ఉన్న తమ స్వరాజ్య అధికారి పిల్లల యొక్క రాజ్య సభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా, పవిత్రతా ప్రకాశము కల కిరీటధారులుగా, అధికారపు స్మృతి కల తిలకధారులుగా, తమ తమ భృకుటిలో కల అకాల సింహాసనానికి అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారాన్ని అనుభవము చేస్తారో, అంతగానే భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారులుగా తప్పకుండా ఉంటారు. ‘‘నేను ఎవరిని’’ మరియు ‘‘నా భవిష్యత్తు ఏమిటి’’? అన్నదానిని ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా స్వయమే చూసుకోగలరు.
బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తున్నారు. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ, లౌకిక-అలౌకిక కార్యాలు చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నషా ఎంత సమయము మరియు ఏ శాతములో ఉంటుంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని సంకల్ప రూపములో గుర్తు చేస్తారు - నేను ఆత్మను అధికారిని, ఇలా ఒకటేమో సంకల్పములో ఆలోచించటము, పదే-పదే ‘నేను ఇలా ఉన్నాను’ అన్న స్మృతిని రిఫ్రెష్ చేసుకోవటము. మరొకటి ఏమిటంటే - అధికారము యొక్క స్వరూపములో స్వయాన్ని అనుభవము చేయటము మరియు ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులపై, మనసు-బుద్ధి-సంస్కారాల రూపీ సహయోగీ సహచరులపై రాజ్యం చెయ్యటము, అధికారముతో నడిపించటము. బాప్‌దాదా శ్రీమతముపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతం అనుసారంగా నడుస్తున్నారు అని అన్ని వేళలా పిల్లలైన మీరందరూ అనుభవీలే కదా. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. అదే విధంగా - ఓ స్వరాజ్య అధికారీ ఆత్మల్లారా, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు, మీ మనసు-బుద్ధి-సంస్కారాలనే సహయోగి సహచరులు, అందరూ మీ ఆజ్ఞపై నడుస్తున్నారా? ఒకటి, రెండు కర్మేంద్రియాలు ఏమైనా కాస్త అల్లరి అయితే చూపించటం లేదు కదా? మీ రాజ్యము లా అండ్ ఆర్డర్ (నియమ నిబంధనల) కు బదులుగా లవ్ అండ్ లా (ప్రేమ మరియు నియమము) లో యథార్థ రీతితో నడుస్తుందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తుందా లేక ఏవైనా కాస్త పెడచెవిన పెడుతున్నాయా? నా చెయ్యి, నా సంస్కారము, నా బుద్ధి, నా మనసు అని అంటున్నప్పుడు మరి నాది అన్నదానిపై నేను అనేవారి యొక్క అధికారము ఉందా? లేక ఒక్కోసారి నాది అనేది అధికారిగా అయితే, ఒక్కోసారి నేను అనేది అధికారిగా అవుతుందా? సమయం అనుసారంగా - ఓ స్వరాజ్య అధికారుల్లారా, ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసనాధికారులుగా అవ్వండి, అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్రగతితో ఇప్పించగలుగుతారు.
సమయము యొక్క పిలుపు ఇప్పుడు తీవ్రగతితో ఉంది మరియు అనంతమైనదిగా ఉంది. చిన్నపాటి రిహార్సల్‌ను చూసారు, విన్నారు. ఒకేసారి అనంతమైన మోడల్‌ను చూసారు కదా! బాధతో అరవటము కూడా అనంతంగా ఉంటుంది, మరణించటం కూడా అనంతంగా జరిగింది. చనిపోయేవారితోపాటు బ్రతికున్నవారు కూడా తమ జీవితములోని ఆందోళనతో మరణిస్తున్నారు. అటువంటి సమయములో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యం ఏమిటి? అయితే చెక్ చేసుకోండి, భూకంపం వస్తే ఇది చెయ్యాలి, తుఫాను వస్తే ఇది చెయ్యాలి, నిప్పు అంటుకుంటే ఇది చెయ్యాలి అని ఏ విధంగా స్థూల సాధనాల గురించి చెప్తారో అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద - సర్వ శక్తులు, యోగ బలము, స్నేహమనే అయస్కాంతము అనే సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఈ సాధనాలన్నీ సమయం కోసం సిద్ధముగా ఉన్నాయా? సర్వ శక్తులూ ఉన్నాయా? అన్నదానిని పరిశీలించుకోండి. ఎవరికైనా శాంతి అనే శక్తి కావాలనుకోండి, కానీ మీరు వారికి వేరే ఏదో శక్తిని ఇస్తే వారు సంతుష్టులవుతారా? ఏ విధంగానైతే ఎవరికైనా నీరు అవసరమనుకోండి, అప్పుడు మీరు వారికి 36 రకాల భోజనాన్ని ఇస్తే వారు సంతుష్టులవుతారా? కావున ఎవరెడీగా అవ్వటము అనేది కేవలం స్వయం అశరీరిగా అవ్వటంలోనే కాదు, అలా అయితే తయారవ్వాల్సిందే, కానీ ఏ సాధనాలైతే స్వరాజ్య అధికారముతో ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వముగా లభించాయో, ఆ అధికారాలన్నీ ఎవరెడీగా ఉన్నాయా? ఆ సమయములో ఏ మెషినరీ యొక్క అవసరమైతే ఉందో, దానిని విదేశాల నుండి వచ్చిన తరువాత కార్యములో పెట్టారు అని సమాచారాలలో వింటుంటారు కదా, అంటే సాధనాలు ఎవరెడీగా లేవని అర్థం కదా! సాధనాలన్నింటినీ అవసరమైన సమయంలో కార్యములో పెట్టలేకపోయారు, ఎంత నష్టము వాటిల్లింది!
కనుక - ఓ విశ్వ కళ్యాణీ, విశ్వ పరివర్తక ఆత్మల్లారా, సాధనాలన్నీ ఎవరెడీగా ఉన్నాయా? సర్వశక్తులూ మీ ఆర్డర్లో ఉన్నాయా? ‘నిర్ణయ శక్తి’ అని ఆర్డర్ చేయగానే అనగా సంకల్పం చేయగానే, ఒక్క క్షణం కంటే కూడా తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోవాలి, ‘ఓ స్వరాజ్య అధికారీ, నేను హాజరు’ అని అనాలి. ఇలా అర్డర్‌లో ఉన్నాయా? లేక స్వయంలోకి తెచ్చుకోవడానికి నిమిషం పడుతుంది, మరి ఆ తర్వాతనే ఇతరులకు ఇవ్వగలరా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో, అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లలందరి మనసులో ఈ సంకల్పమైతే నడుస్తుంది - మున్ముందు ఏమవుతుంది మరియు ఏం చెయ్యాలి? వాస్తవానికైతే ఎంతో జరిగేది ఉంది. వినిపించాము కదా, ఇదైతే కేవలం రిహార్సల్. ఇప్పుడు 6 నెలల ఏర్పాట్లకు గంట మ్రోగింది, గంట పెద్దగా అయితే ఇంకా మ్రోగలేదు. ముందు గంట మ్రోగుతుంది, తరువాత ఢంకా మ్రోగుతుంది. భయపడతారా? కొద్దికొద్దిగా భయపడతారా? శక్తి స్వరూప ఆత్మలది ఏ స్వరూపాన్ని చూపించారు? శక్తులను (శక్తి స్వరూపములో పాండవులు కూడా వచ్చినట్లే మరియు శక్తులు కూడా వచ్చినట్లే), సదా శక్తులను కొందరిని 4 భుజాలు కలవారిగా, కొందరిని 6 భుజాలు కలవారిగా, కొందరిని 8 భుజాలు కలవారిగా, కొందరిని 16 భుజాలు కలవారిగా చూపిస్తారు, సాధారణంగా చూపించరు. ఈ భుజాలు సర్వ శక్తులకు గుర్తులు, అందుకే సర్వశక్తిమంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ఇమర్జ్ చెయ్యండి. సమయం వచ్చినప్పుడు ఇమర్జ్ అయిపోతాయి అని ఆలోచించకండి, కానీ మొత్తము రోజంతటిలో స్వయము కొరకు రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి. అన్నింటికంటే మొదటి అభ్యాసము ఏమిటంటే - స్వరాజ్య అధికారము మొత్తము రోజంతటిలో ఎంతవరకు కార్యములో ఉపయోగపడుతుంది? నేను ఉన్నదే ఆత్మను యజమానిని అని అనుకోవటము కాదు. యజమానిగా అయ్యి ఆర్డర్ చేయండి మరియు చెక్ చేసుకోండి - ప్రతి కర్మేంద్రియము ప్రతి ఒక్కటి రాజునైన నా లవ్ మరియు లా (ప్రేమ మరియు నియమము) లో నడుస్తున్నాయా? మన్మనాభవ అని ఆజ్ఞాపించినప్పుడు మనసు నెగెటివ్ మరియు వ్యర్థ ఆలోచనలలోకి వెళ్తే, అది లవ్ మరియు లా అయినట్లా? మధురతా స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు, కానీ సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధము యొక్క మహారూపం కాకపోయినా కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశము మరియు చికాకు వస్తున్నాయంటే అది ఆజ్ఞను పాటించినట్లా? ఆర్డర్లో ఉన్నట్లా?
నేను నిర్మానంగా అవ్వాలి అని ఆర్డర్ చేసారు, కానీ వాయుమండలము అనుసారంగా ఎంతవరకు అణిగిమణిగి నడవాలి, ఏదో ఒకటి చూపించాలి కదా, నేనే అణిగి ఉండాలా, నేనే మరణించాలా, నేనే మారాలా అని ఆలోచించినట్లయితే ఇది లవ్ మరియు ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా? అందుకే విశ్వముపై, బాధతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై దయ చూపించే ముందు మీపై మీరు దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు మీరు నలువైపుల సకాశ్ ఇచ్చే, వైబ్రేషన్లను ఇచ్చే, మనసు ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే కార్యము ఎంతగానో చెయ్యాలి. ఇంతకుముందు కూడా వినిపించాము - ఇప్పటివరకు ఎవరెవరు ఎంతవరకైతే సేవకు నిమిత్తులుగా ఉన్నారో, వాటన్నింటినీ చాలా బాగా చేసారు మరియు చేస్తారు కూడా, కానీ ఇప్పుడు సమయము అనుసారంగా తీవ్రగతి మరియు అనంతమైన సేవ యొక్క అవసరము ఉంది. కనుక ఇప్పుడు ముందుగా ప్రతిరోజునూ చెక్ చేసుకోండి - స్వరాజ్య అధికారము ఎంతవరకు ఉంది? ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించాలి. యజమాని అయిన నేను ఈ సహచరుల ద్వారా, సహయోగుల ద్వారా కార్యాన్ని చేయిస్తున్నాను అన్న స్మృతి స్వరూపము ఉండాలి. స్వరూపములో నషా ఉన్నట్లయితే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు జీ హాజర్, జీ హజూర్ అని స్వతహాగానే అంటాయి. శ్రమించాల్సిన అవసరము ఉండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించటం, ఈరోజు సంస్కారాన్ని తొలగించటం, ఈరోజు నిర్ణయ శక్తిని ప్రత్యక్షం చెయ్యటం, ఇలా కాకుండా ఒక్క దెబ్బకు అన్ని కర్మేంద్రియాలు మరియు మనసు-బుద్ధి-సంస్కారాలు మీరు ఏది కోరుకుంటే అదే చేస్తాయి. ఇప్పుడు ఇలా అంటుంటారు కదా - బాబా, కోరుకోవడమైతే ఇలా కోరుకుంటున్నాము కానీ ఇప్పుడింకా అలా అంతగా అవ్వలేదు... కానీ తర్వాత ఏమంటారంటే - ఏదైతే కోరుకుంటున్నామో అది అయ్యింది, సహజంగా అయ్యింది. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? మీ అధికారము యొక్క సిద్ధులను కార్యములో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆర్డర్ చేయండి. సంస్కారము మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తుంది? సంస్కారము తొలగిపోవటం లేదు, ఎందుకు? సంస్కారము మీ ఆర్డర్‌కు బంధింపబడి ఉండాలి. యజమానత్వాన్ని తీసుకురండి. కనుక ఇతరుల సేవ చెయ్యటము చాలా-చాలా-చాలా-చాలా అవసరము. ఇదస్సలు ఏమీ కాదు, చాలా నాజూకైన సమయము వచ్చేదే ఉంది. అటువంటి సమయములో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిశ్తాగా అయ్యి, నలువైపుల తిరుగుతూ, శాంతి కావాలన్నవారికి శాంతిని, సంతోషము కావాలనుకున్నవారికి సంతోషాన్ని, సంతుష్టత కావాలనుకున్నవారికి సంతుష్టతను, ఫరిశ్తా రూపములో సకాష్ను ఇస్తూ మీరు తిరుగుతారు మరియు వారు అనుభవం చేస్తారు. ఎలాగైతే ఇప్పుడు మంచి నీరు లభించింది కావున చాలా దాహం తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, ఆధారము లభించింది అని అనుభవము చేస్తారు కదా, అలాగే ఫరిశ్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషము లభించింది అని అనుభవము చేస్తారు. ఇలా అంతః వాహకము అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. మరియు నలువైపుల తిరుగుతూ అందరికీ శక్తులను ఇస్తారు, సాధనాలను ఇస్తారు. మీ రూపము మీ ఎదురుగా వస్తుందా? ఇమర్జ్ చేసుకోండి. ఎంతమంది ఫరిశ్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాష్ ఇస్తూ ఉన్నారు, అప్పుడు ఏమంటారంటే - శక్తులు వచ్చారు... అని మీరు ఒక పాటను వేస్తారు కదా, శక్తుల ద్వారానే సర్వ శక్తిమంతుడు స్వతహాగానే నిరూపించబడతారు. విన్నారా.
ఏదైతే ఇప్పటివరకు చేసారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారంగా చాలా-చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు మున్ముందు ఇంకా చాలా-చాలా మంచిగా జరిగేదే ఉంది. అచ్ఛా. భయపడలేదు కదా? సమాచారాన్ని వింటూ, చూస్తూ భయపడ్డారా? ఇదైతే అసలేమీ కాదు. మీ వద్ద అంతా ఉంది మరియు ఇది అసలేమీ కాదు. కానీ ఎంతైనా వారు మీ సోదర-సోదరీలు కనుక వారి సేవ చెయ్యటము కూడా మంచిది. ఇప్పుడు రాజ్యాధికారంలో, అకాల సింహాసనముపై కూర్చుని ఉండండి, కిందకు పైకి రాకండి, అప్పుడు చూడండి - అది వీరే, అది వీరే, అది వీరే అని గవర్నమెంటు వారికి కూడా సాక్షాత్కారమవుతుంది. సింహాసనము నుండి కిందకు దిగకండి, అధికారాన్ని వదలకండి, ప్రతి సమయమూ అధికారాన్ని నడిపించండి, అధికారాన్ని ప్రతి సమయంలో నడిపించండి - అది కూడా స్వయంపై, ఇతరులపై కాదు. ఇతరులపై నడిపించకండి. అచ్ఛా.
కొత్త-కొత్త పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఎవరైతే ఈ కల్పములో, ఈసారి మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. మంచి పని చేసారు. ధైర్యం పెట్టి చేరుకున్నారంటే చేరుకున్నారు కదా. ఎవరైతే అలా కూర్చుండిపోయారో, వారు అలా కూర్చునే ఉండిపోయారు, కానీ ఏమీ జరగలేదు. ధైర్యము చాలా అవసరము. ఏ కార్యములోనైనా ధైర్యము ఉందంటే సఫలత ఉందని భావించండి. ధైర్యము తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది, అందుకే ధైర్యము మరియు నిర్భయత ఉండాలి. ఇదేమిటి ఇలా జరుగుతుంది అని భయంలోకి రాకండి. ఎవరైనా మరణిస్తున్నారంటే, మరణిస్తుంది వారు, కానీ భయం కలుగుతుంది మీకు. నిర్భయులుగా ఉండాలి. సరే, వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఆ ఆత్మకు దయాహృదయ భావనతో సహయోగాన్ని ఇవ్వండి, భయంలోకి రాకండి. భయం అనేది అన్నింటికన్నా అతి పెద్ద భూతము. ఇతర భూతాలు తొలగిపోగలవు కానీ భయము యొక్క భూతము చాలా కష్టం మీద తొలుగుతుంది. అది ఏ విషయం యొక్క భయం అయినా కావచ్చు, కేవలం మరణించేవారి గురించిన భయమే కాదు, అనేక విషయాల గురించి భయం ఉంటుంది. అనేక రకాల భయాలు ఉంటాయి, తమలోని బలహీనత కారణంగా కూడా భయం కలుగుతుంది. వీటన్నింటిలో నిర్భయులుగా అయ్యేందుకు ఏదైతే సహజమైన సాధనము ఉందో, అదేమిటంటే - సదా స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు. అప్పుడిక భయము ఎప్పుడూ రాదు. తప్పకుండా మనసులో ఏదైనా విషయము ఇమిడి ఉంటుంది, దాని వలనే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు ఉన్నట్లయితే సాహెబ్ సంతుష్టులవుతారు మరియు సర్వులు కూడా సంతుష్టులవుతారు.
అచ్ఛా - కొత్త కొత్తగా వచ్చే పిల్లలకు కొత్త జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు అభినందనలు. అచ్ఛా. విదేశాల నుండి కూడా చాలా మంది వచ్చారు. విదేశీ గ్రూపు వారు చేతులెత్తండి. (సుమారుగా 700 మంది వచ్చారు) మంచిది, వచ్చారు. స్వాగతము.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వారి సేవ టర్న్:- మహారాష్ట్ర వారు చేతులెత్తండి. (4000 మంది వచ్చారు) నాలుగు వేల మందికి నాలుగు పదమాల సార్లు అభినందనలు. బాగా చేసారు, ప్రతి గ్రూపుకు వారి వారి సేవ యొక్క శోభ ఉంటుంది ఎందుకంటే సేవ కంటే ముందు పరివారము ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశము లభిస్తుంది కదా. అవకాశము లభిస్తుంది కదా? లేదంటే మహారాష్ట్ర వారా లేక ఆంధ్రా వారా అని ఎవరు అడుగుతారు? కానీ విశేష సేవను చేసే అవకాశమును తీసుకోవటం ద్వారా పరివారం ముందుకు, దాదీలు, దాదాల ఎదురుగా వస్తారు, మరియు సంతోషం కూడా ఉంటుంది. ఎందుకని సంతోషము ఉంటుంది, కారణమేంటి? చూడండి, సెంటరులో ఎంతమందికి సేవ చేస్తారు? సరే, ఎక్కువలో ఎక్కువ 50 నుండి 100 మంది వరకు, కానీ ఇక్కడ సేవ చేసినప్పుడు వేలాది మందికి సేవ చేస్తారు మరియు వేలాది మందికి సేవ చేసినందుకు రిటర్న్‌లో అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా - చాలా మంచి సేవ చేసారు, చాలా మంచి సేవ చేసారు, ఈ ఆశీర్వాదాలు వెలువడుతాయి. ఆ ఆశీర్వాదాలు, ఒకటేమో వర్తమాన సమయములో సంతోషాన్ని ఇస్తాయి, మరొకటి జమ కూడా అవుతాయి. డబల్ లాభము. అందుకే - ఎవరైతే సేవ చేసారో, ఆ సేవకు ప్రతిఫలంగా సంతోషము కూడా లభించింది మరియు జమ ఖాతా కూడా జమ అయ్యింది. డబల్ లాభము కలిగింది కదా! ఇప్పుడు మెజారిటీ అన్ని జోన్ల వారు చాలా మంచిగా నేర్చుకున్నారు, అభ్యాసమైపోయింది. బాగా చేసారు, అభినందనలు. (100 మంది కుమారీల సమర్పణ జరిగింది). అచ్ఛా - ఆ 100 మంది కుమారీలు నిలబడండి. అందరూ చూడండి. ఎక్కడైతే టి.వి.లు ఉన్నాయో అందులో చూపించండి. మంచిది, మామూలుగా అయితే సమర్పితమయ్యే ఉన్నారు. కానీ సమర్పణ అనే పక్కా స్టాంప్ పడాలి. ఈ ఆల్మైటీ గవర్నమెంటు యొక్క స్టాంప్ చెరిగిపోదు. పక్కానే కదా! పక్కా! పక్కా? చాలా-చాలా-చాలా పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో, వారు ఇలా చేతులూపండి. చాలా పక్కానా? ఇది మహారాష్ట్ర కావున ఏదైనా మహానతను చూపిస్తారు కదా! చాలా మంచిది, బాప్‌దాదా వైపు నుండి చాలా, చాలా, కోటానుకోట్ల సార్లు శుభాకాంక్షలు, అభినందనలు. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క క్షణములో ఫరిశ్తాగా అయ్యి, విశేషంగా ఎక్కడైతే భూకంపం జరిగిందో, అక్కడ నలువైపులా ఫరిశ్తాగా అయ్యి, ఎగిరే కళ ద్వారా అక్కడ శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క సకాశ్ను వ్యాపింపజేసి రండి. ఒక్క క్షణములో చుట్టూ తిరిగి రండి. అందరూ తిరిగి రండి. అచ్ఛా. (డ్రిల్)
నలువైపులా ఉన్న దేశ-విదేశాలలో ఫరిశ్తా రూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారీ పిల్లలకు, సదా లవ్ మరియు లా తో మీ సహయోగులను, సూక్ష్మ లేక స్థూల సహయోగి సహచరులను నడిపించేవారికి, సదా బాప్‌దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మిక సాధనాలను ఎవరెడీగా చేసుకునేవారికి, ఆత్మనైన నేను రాజును అని భావిస్తూ రాజ్యాధికారము అనుభవము చేసుకునేవారికి, సదా ఎగిరే కళ ద్వారా ఫరిశ్తా రూపముతో నలువైపులా సకాశ్ను ఇచ్చే శక్తి స్వరూప ఆత్మలకు, సదా స్వచ్ఛమైన మనసు మరియు సత్యమైన మనసు ద్వారా నిర్భయంగా అయ్యి నిరాకారి స్థితిని అనుభవం చేసుకునే విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- మీ అందరికీ సంతోషం కలుగుతుంది కదా, మన నిమిత్త దాదీలు, దాదాలు ఎదురుగా వచ్చారు కావున సంతోషం ఉంది కదా! లేక మీరు కూడా రావాలనుకుంటున్నారా? ఎదురుగా ఉండడం ఇంకా మంచిది. ఎదురుగా ఉన్న వారిని ఎక్కువ చూస్తాము. ఇక్కడైతే ఇలా చేయాల్సి ఉంటుంది. మరియు ఎదురుగా ఉన్నవారినైతే పదే-పదే చూస్తున్నాము.
అచ్ఛా (జగదీశ్ అన్నయ్యగారితో) అంతా బాగానే ఉందా! అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే - స్వయాన్ని శరీర సహితంగా తండ్రికి అర్పించేసారు. ఆ మాటకొస్తే తండ్రికి తమదంతా ఇచ్చేసారు. ఇచ్చేసారు కదా లేక ఇవ్వాలా? నిమిత్త ఆత్మలైన మీరందరూ ఇచ్చేసారు, అందుకే మిమ్మల్ని సాకార రూపంలో ఫాలో చేస్తున్నారు. సాకార రూపంలో మహారథులను చూసి అందరికీ శక్తి లభిస్తుంది. మరి ఈ మొత్తం గ్రూప్ అంతా ఎవరు? శక్తి స్త్రోతలు కదా. అంతే కదా!
(నడిపిస్తున్నవారు చాలా చతురుడు అని దాదీ జానకి అన్నారు) వారు చతురుడు కాకపోతే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది. బాబా అంటున్నారు - నడుస్తున్నవారు తండ్రి కంటే కూడా ఎక్కువ చతురసుజనులు.
అచ్ఛా, అందరూ సదా ‘నా బాబా’ అన్న ఒక మాటను హృదయపూర్వకంగా పాడుతూ ఉంటారు. ఈ పాటను పాడటం అందరికీ వస్తుంది కదా. నా బాబా, ఈ పాటను పాడటం వస్తుందా? సహజమే కదా! నా అని అన్నారు మరియు తమవారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రి కంటే కూడా తెలివైనవారు అని బాబా అంటున్నారు. ఎందుకని? భగవంతుడిని బంధించేసారు. (జానకి దాదీతో) బంధించేసారు కదా! మరి బంధించినవారు శక్తిశాలి అయినట్లా లేక బంధించబడినవారా? ఎవరు శక్తిశాలి అయినట్లు? బంధించినవారు. ఈ విధంగా బంధించినట్లయితే నేను బంధింపబడతాను అని కేవలం విధిని వినిపించాము. అచ్ఛా!