Search for a command to run...
9 Mar 2009
హోలీకి విశేషమైన బహుమతి ఫరిశ్తా డ్రెస్‌ను రోజూ మధ్య-మధ్యలో ధారణ చెయ్యడము మరియు పాత సంస్కారాల హోలీని కాల్చివేయడము
9 March 2009 · తెలుగు
ఈరోజు హోలియస్ట్ బాబా తమ హోలీ పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలందరూ హోలీ పిల్లలు. మీరందరూ కూడా హోలీ జరుపుకోవడానికి వచ్చారు. ఆలోచించండి, హోలీ ఆత్మలైన మీపై ఏ రంగు పడిన కారణంగా మీరు హోలీగా అయ్యారు? రంగులైతే అనేకమున్నాయి. కానీ మీపై ఏ రంగు పడింది? దేని కారణంగా మీరు హోలీగా అయ్యారో ఆ శ్రేష్ఠమైన రంగు ఏమిటి? అన్నిటికన్నా అతి పెద్ద రంగు పరమాత్ముని సాంగత్యపు రంగు. పరమాత్ముని సాంగత్యపు రంగు పడగానే సహజంగానే హోలీగా అయ్యారు ఎందుకంటే పరమాత్ముని సాంగత్యము అవినాశి సాంగత్య రంగు. మిగతా రంగులైతే కొద్ది సమయము మాత్రమే ఉంటాయి కానీ పరమాత్ముని సాంగత్యపు రంగు పడడం ద్వారా సహజంగానే హోలీగా అనగా పవిత్రంగా అయిపోయారు. అపవిత్రంగా ఉన్న ఆత్మ రంగు పవిత్రంగా అయిపోయింది ఎందుకంటే మీరందరూ పరమాత్మను తమ సహచరునిగా చేసుకున్నారు, మీ తోడుగా పెట్టుకున్నారు అందుకే కంబైన్డ్‌గా అయ్యారు. ఈ కంబైన్డ్ స్వరూపము ప్రియంగా అనిపిస్తుంది కదా! ఈ కంబైన్డ్ రూపము ఎప్పుడూ వేరు కాలేదు. అనుభవం ఉంది కదా! సదా కంబైన్డ్‌గా ఉంటున్నారు కదా! ఒంటరిగా కాదు. మాయ ఒంటరిగా చేసేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఎవరైతే సదా కంబైన్డ్‌గా ఉంటున్నారో వారు ఎప్పుడూ వేరు కాలేరు ఎందుకంటే మాయ వేరు చేసి పాత సంస్కారాలను మళ్ళీ ఇమర్జ్ చేస్తుంది, పాత సంస్కారాలు ఇమర్జ్ అయినప్పుడు శుద్ధమైన సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనము పాత సంస్కారాలు, ఇవి భిన్న-భిన్న రూపాలలో ఇమర్జ్ అవుతూ ఉండటం వలన కంబైన్డ్ రూపము విడిపోతుంది. సదా కంబైన్డ్‌గా ఉంటున్నానా లేక ఒక్కోసారి ఒంటరిగా కూడా అవుతున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. మాయ యొక్క అనేక రూపాలనైతే తెలుసుకున్నారు కదా! అది చతురతతో దాని రంగును వేసేస్తుంది. విడిపోవడము అంటే మాయా రంగులో పడటము. ఈ నిర్లక్ష్యము, సోమరితనము అనేవి చాలా భిన్న భిన్న రూపాలలో వస్తాయి. వాటిని పిల్లలు కూడా గుర్తించలేకపోతారు ఎందుకంటే మాయ తన వైపుకు ఆకర్షిస్తుంది, పిల్లలు కూడా రావణుడి ఖజానా అయిన ఈ నిర్లక్ష్యము మరియు సోమరితనము, ఇవి తండ్రి ఖజానా కాదు, ఈ రావణుని ఖజానా గురించి నేను అలా అనుకోలేదు కానీ నా సంస్కారము అని ఎంతో నషాతో చెప్తారు. సంస్కారాన్ని నాది అని అనడం మొదలుపెడతారు. ఇవి పరమాత్ముని ఖజానానా లేక రావణుని ఖజానానా? దానిని నా సంస్కారము అని అనడము, ఆలోచించండి, సరైనదేనా? నాదిగా చేసెయ్యడము, ఇది మాయ చతురత. తండ్రి ఖజానా ప్రియమైనదా లేక రావణుని ఖజానా ప్రియమైనదా? సాధారణంగా పిల్లలు తమను తాము విడిపించుకోవడానికి నా సంస్కారము, అనుకోలేదు అని అంటారు. మరి ఆలోచించండి, ఇది నాదా! రావణుని సంస్కారాలను తమవిగా చేసుకోవడం వలన నెమ్మది-నెమ్మదిగా శుభ సంస్కారాలన్నీ సమాప్తమవుతూ ఉంటాయి. పరమాత్ముని సాంగత్యపు రంగు తగ్గుతూ ఉంటుంది మరియు మాయా రంగు ఇమర్జ్ అవుతుంది. కావున నాపై ఏ రంగు ఉంది అని నడుస్తూ-నడుస్తూ స్వయాన్ని పరిశీలించుకోండి. ప్రపంచంవారు కూడా హోలీలో ఏమి చేస్తారు? ముందుగా చెడును కాల్చివేసి ఆ తర్వాత రంగును వేసుకుంటారు, జరుపుకుంటారు. మరి మీపై బాప్‌దాదా సాంగత్యపు రంగునైతే వేసారు, దానితో పాటు జ్ఞాన రంగు, శక్తుల రంగు, గుణాల రంగును వేస్తూ ఉంటారు.
మరి అందరి మీద ఈ ఆత్మిక రంగు ఉంది కదా? ఉందా? చేతులెత్తండి. ఆత్మిక రంగు ఉంది, ఆ రంగు పోదు కదా! ఎవరిపై అయితే ఆత్మిక రంగు ఉందో, అవినాశి రంగు ఉందో, వారిపై మరే ఇతర రంగు పడలేదు. ఈ రంగుతో ఎంత హోలీగా అయ్యారు? ఎంతగా అంటే పూర్తి కల్పంలో మీ అంతటి హోలీ, పవిత్రంగా మరెవ్వరూ కాలేరు. మీ పవిత్రత, ప్రభువు యొక్క సాంగత్య రంగు, పరమాత్మ కంబైన్డ్‌గా ఉన్న అనుభవం అన్నిటికన్నా అతీతమైనది మరియు ప్రియమైనది. ఇతరులెవరైతే హోలీగా, పవిత్రంగా అవుతారో వారి శరీరం పవిత్రంగా కాదు, ఆత్మ పవిత్రంగా అవుతుంది. కానీ మీరు ఎంతటి హోలీగా, పవిత్రంగా అవుతున్నారంటే మీ శరీరము మరియు ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటాయి. పవిత్రతను సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని అని అంటారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు కలిసి ఉంటాయి ఎందుకంటే ఎక్కడ జనని ఉంటుందో అక్కడ పిల్లలు ఉంటారు. బాబా వచ్చి మిమ్మల్ని ఎంతటి హోలీగా చేస్తున్నారంటే మీ జడ చిత్రాలకు కూడా విధిపూర్వక పూజ జరుగుతుంది. మీ జడ చిత్రాలు కలియుగ అంతిమంలో కూడా, మీరు మీ చిత్రాలను చూస్తున్నారు కదా, ఎంత విధిపూర్వకంగా వాటి పూజ జరుగుతుంది, ఇది పవిత్రతలోని విశేషత. ఎంతమంది మహాత్ములు, ధర్మాత్ములు పవిత్రంగా అయినా కూడా ఎవ్వరి మందిరాలు తయారు కాలేదు. ఇటువంటి విధిపూర్వక పూజ ఎవ్వరిదీ జరుగదు మరియు అంతిమ జన్మ వరకు మీ చిత్రాలు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాయి. కొద్ది సమయము కోసం సుఖశాంతులను అనుభవం చేయిస్తాయి. మరి మీ హోలీలో మరియు ప్రపంచంవారి హోలీలో ఎంతటి తేడా ఉంది! మనోరంజనం కోసం మీరూ కొద్దిగా జరుపుకుంటారు కానీ సత్యమైన పరమాత్ముని సాంగత్య రంగు యొక్క హోలీ మరియు కంబైన్డ్ స్వరూపము యొక్క యథార్థమైన హోలీ మీరు జరుపుకుంటారు. హోలీను ప్రపంచంవారు కూడా భిన్న భిన్న విధాలుగా జరుపుకుంటారు. హోలీ అన్న మాట వెనుక కూడా ఒక రహస్యము ఉంది, అది మీకే తెలుసు, మీరే జరుపుకుంటారు. హోలీ అనగా హో లీ, గడిచిపోయిందేదో గడిచిపోయింది. మరి మీరందరూ పాత జీవితము, పాత విషయాలు, పాత సంస్కారాలు, పాత వ్యర్థ సంస్కారాలను హో లీ చేసేసారు కదా. గడిచిపోయిందేదో గడిచిపోయింది అని అనడము అంటే హో లీ. మరి ఇలా చేసారు కదా? లేక ఇప్పటికీ పొరపాటున పాత సంస్కారాలు వచ్చేస్తున్నాయా? మన జన్మయే క్రొత్తదైనప్పుడు, మీరందరూ మరజీవులుగా అయ్యారు కదా! అయ్యారా? మరజీవులుగా అయ్యారా? చేతులెత్తండి. అచ్ఛా. క్రొత్త జన్మ జరిగింది. మరి పాత జన్మ ఎలా గుర్తుకు వస్తుంది? పాతది, పాతదైపోయింది. ఒకవేళ గడిచిపోయిన విషయాలు లేక సంకల్పాలు, సంస్కారాలు ఇమర్జ్ అయితే ఏమని అంటారు? హోలీ జరుపుకున్నట్లా? హో లీ చెయ్యలేదు. పరమాత్ముని సాంగత్యపు రంగు మంచిగా పడలేదు. పరమాత్ముని సాంగత్యపు రంగు అంటే పాత జన్మను మర్చిపోవడము. పాత విషయాలను మర్చిపోవడము. ఎందుకంటే మరజీవగా అయిపోయారు కదా. ఎలా అయితే శరీరం ద్వారా ఒక జన్మను విడిచి మరొకటి తీసుకుంటారో అప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? మరి మీరందరూ ఇప్పుడు బ్రాహ్మణ జన్మను ధారణ చేసినవారు. మరి గత జన్మలోని సంస్కారాలు, వాటిని పొరపాటుగా నా సంస్కారాలు అని అంటున్నారు, అవి మీవా? ఇవి బ్రాహ్మణ జీవిత సంస్కారాలా? ఒకసారి నిర్లక్ష్యము, ఒకసారి రాయల్ సోమరితనము, సోమరితనములో చాలా భిన్న భిన్న రూపాలున్నాయి. ఎప్పుడైనా దీనిపై క్లాస్ చెయ్యండి. సోమరితనము ఎన్ని విధాలుగా ఉంటుంది మరియు రాయల్ రూపంలో ఎన్ని వస్తాయి!
మరి బ్రాహ్మణ జీవితము అనగా క్రొత్త జీవితము, ఇందులో పాతదేదీ ఉండజాలదు. మరి ఈరోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! మరి హోలీ అనగా హో లీ, మరి ఈరోజు హోలీ జరుపుకోవడము అంటే పాత సంస్కారాల హోలీను కాల్చివేయడము. కాల్చిన తర్వాతే జరుపుకోవడము ఉంటుంది. మరి ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపము. కాల్చి వేసారు, ఇప్పుడు జరుపుకోవాలి. ప్రభువు యొక్క సాంగత్యపు రంగులోని ఆనందాన్ని తీసుకునేవారు. కంబైన్డ్‌గా ఉండే అనుభవాన్ని చేసేవారు, ఎందుకని? హోలియస్ట్ తండ్రి మీపై హోలీగా, పవిత్రంగా అయ్యే రంగును వేసారు.
మరి ఈరోజు ఎటువంటి హోలీను జరుపుకుంటున్నారు? ఈరోజు నుండి విశేషంగా ఎటువంటి పాత సంస్కారాన్నీ రానివ్వకండి, ఈ హోలీను జరుపుకోండి. జరుపుకోగలరా లేక అప్పుడప్పుడూ వచ్చేస్తాయా? నేను చెయ్యాలనుకోవడం లేదు కానీ నా సంస్కారము అనే ఈ రాయల్ మాటను ఈరోజు దృఢ సంకల్పము అను విధితో సమాప్తం చేసెయ్యండి. ఇటువంటి హోలీని సదా జరుపుకునే ధైర్యాన్ని ఈరోజు చెయ్యగలరా? లేక అప్పుడప్పుడూ జరుపుకుంటారా? ఈరోజు నుండి పాత సంస్కారాల హోలీ, హో లీ, గడిచిందేదో గడిచిపోయింది, క్రొత్త జన్మ, ఆ పాత జన్మ సమాప్తము - ఇలా ధైర్యమును ఉంచగల మీరు బాబాకు అతి మధురాతి మధురమైన గారాల ముద్దుల పిల్లలు కదా! మరి ఈ సంకల్పము దృఢంగా, సంకల్పము కాదు దృఢ సంకల్పమును చేసే ధైర్యము ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యమును ఉంచారు. సరే, కొద్దిమంది ఉండిపోయారు, కానీ మీరందరూ తోడుగా ఉన్నారు కదా. పక్కా సహచరులు, రెండు చేతులెత్తండి. వీరందరి ఫోటోను తీయండి. అచ్ఛా. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తుతున్నారు.
మరి హోలీను హో లీగా జరుపుకుంటున్నందుకు బాప్‌దాదా మీకు పదమా పదమరెట్లు అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు పొరపాటున కూడా మీ నోటి నుండి నా సంస్కారము అన్న మాటను రానివ్వకండి. రావణుని సంస్కారాన్ని నాది అంటున్నారు, వింతగా ఉంది! రావణుడిని శత్రువు అని అంటారు, శత్రువు ఖజానాను తమదిగా చేసుకోవడము ఆశ్చర్యకరమైన విషయము! మేము ఏమంటున్నాము అని మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదా! పొరపాటుగా అనేస్తుంటారు. అనేస్తారు కానీ తర్వాత లోపల మనసు తింటూ ఉంటుంది, అనుభవం కూడా చేస్తూ ఉంటారు, బాబాతో మాట్లాడుతూ ఉంటారు, క్షమాపణ కూడా తీసుకుంటారు. బాబా, రేపటి నుండి చెయ్యను అని అంటారు కానీ మళ్ళీ చేస్తారు. ఇప్పుడు బాప్‌దాదా ఏమి చెయ్యాలి? చూస్తూ ఉండాలా? ఇప్పుడు ఇటువంటి మాటల హోలీని కాల్చివేయండి. చూడండి, కాల్చివేయడంలో కూడా ఒక మంచి విషయాన్ని చెబుతారు, కోకీ(ఒక మిఠాయి పేరు) తయారు చేసేటప్పుడు దానికి దారాన్ని కట్టి వేయిస్తారు. కోకీ తయారై తీసినప్పుడు కోకీ తయారవుతుంది కానీ దారం మాత్రం కాలదు. ఆత్మ అవినాశీ మరియు శరీరము వినాశీ అని మీరు నేర్చుకున్న మొట్టమొదటి పాఠానికి ఇది గుర్తు. ఈ పండుగలు, శాస్త్రాలు తయారు చేసేవారి అద్భుతం కూడా తక్కువేమీ కాదు, ఈ విషయాన్ని బాప్‌దాదా చూసారు. వారు కూడా బాబా పిల్లలే కానీ మీరు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు. పిండిలో ఉప్పంత ఉన్నా కానీ చాలా రమణీకంగా తయారు చేసారు. ప్రతి పండుగకు చూడండి ఒక స్మృతి చిహ్నాన్ని తయారు చేసారు. సూక్ష్మమైన కొన్ని విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేసారు. కానీ స్మృతి చిహ్నమైతే తయారు చేసారు కదా! భక్తిలో కూడా తక్కువేమీ చెయ్యలేదు, భక్తి అయితే ద్వాపర కలియుగాలలో కూడా గుర్తుంచుకోదగ్గ కొన్ని విషయాలను ఉంచింది. అతి వికారిగా కాకుండా కాపాడింది. బాప్‌దాదా ఈ సామాగ్రి, పండుగలు, శాస్త్రాలు తయారు చేసిన వారికి కూడా వాటి ఫలితాన్ని ఇస్తారు. ఏమైనా భక్తిలో కొంతైనా గుర్తు చేస్తున్నారు, వికారాల నుండి కొద్ది సమయమైనా దూరంగా ఉంటున్నారు.
మరి మీరు ఈరోజు ఎటువంటి హోలీను జరుపుకున్నారు? ఎటువంటి హోలీను జరుపుకున్నారు? హో లీ, అందరూ అనండి హో లీ. ఇలా అనండి (చేతితో సూచన) హో లీ. పక్కా కదా! జరుపుకున్నారా? జరుపుకున్నారా? అచ్ఛా. మరి రేపు మళ్ళీ మాయ వస్తుంది, ఎందుకంటే మాయ కూడా వింటుంది కానీ మీరు ఇలా అనకండి (మీ వైపుకు పిలవకండి). బాగుంది కదా, ఇందులో ఆనందం ఉంది కదా. ఆనందంగా ఉండండి.
బాబాను గుర్తుంచుకోండి, బాబా మాకు ఎన్ని ఆత్మిక రంగులను వేస్తున్నారు, వీటితో మీరు హోలీహంసలుగా అయిపోయారు. హోలీహంస అనగా నిర్ణయశక్తి కలిగిన హోలీహంస. ఏ పని చేసినా కూడా, ఒక సీట్‌ను ఫిక్స్ చేసుకోండి, ముందుగా ఆ సీట్‌పై కూర్చుని తర్వాత నిర్ణయం తీసుకోండి, ఆ సీట్ ఏమిటో తెలుసు కదా, ఆ సీట్ త్రికాలదర్శి సీట్. ముందుగా త్రికాలదర్శి సీట్‌పై సెట్ అయి మూడు కాలాలను చూడండి, కేవలం వర్తమానమే కాదు, ఆది మధ్య అంతిమము, మూడు కాలాలను చూడండి, మూడు కాలాలలోనూ లాభముందా లేక నష్టముందా? కొంతమంది పిల్లలు చాలా చతురమైనవారు. చతురతను వినిపించమంటారా? ఏమంటారంటే ఆ పనిని జరిపించాల్సి ఉంది కదా, అందుకే జరిపించాను కానీ చెయ్యకూడదు అని తెలుసు కానీ చేసేసాను అని. సరే చేసేసారు, మరి కర్మకు ఫలితం లభిస్తుంది కదా! కనుక చతురత చెయ్యకండి. బాబాను కూడా ఎంతో రంజింపజేస్తారు. పొరపాటు చేస్తారు కదా అప్పుడు బాప్‌దాదాకు ఎలాంటి మాటలు వినిపిస్తారంటే - బాబా మీరైతే దయా హృదయులు కదా! మీరు క్షమా సాగరులు కదా! బాబా ఎవరు అని బాబాకే గుర్తు తెప్పిస్తారు! మీరు చెప్పారు కదా, నాకు చెప్పేసి సమాప్తం చేసెయ్యండి అని. కానీ భావనతో వినిపించి సమాప్తం చేసెయ్యండి. ఒక్క మాటను పక్కా చేసుకోండి, వినిపిస్తారు కానీ ముందుగా దృఢ సంకల్పంతో స్వయాన్ని పరివర్తన చేసుకుని తర్వాత వినిపించండి. ఎంతగానో రంజింపజేస్తారు, మీరు చెప్పారు కదా! మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా అని బాబాకే గుర్తు చేయిస్తారు. ఎంతో చతురతను చూపిస్తారు. ఇప్పుడు చతురత చెయ్యకండి. ధైర్యమును ఉంచండి. చెయ్యవలసిందే, చేస్తాము అంటూ ము, ము అని అనవద్దు.
బాప్‌దాదా రోజంతటిలో ము, ము అనే పాటను చాలా వింటూ ఉంటారు. చేస్తాము, చూస్తాము, అవుతాము, కానీ వేగము ఎంత ఉంది? ము, ము అని అనేవారు బాబాతో వెళ్ళగలరా? బాబా అయితే ఎవరెడీగా ఉన్నారు, మరి ము, ము, అని అనేవారు ఎవరెడీగా కాలేదు. మరి బాబాతో ఎలా వెళ్ళగలరు? బాబాతో అందరూ వెళ్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటారు. బాబాకు పిల్లలు ఒక్కొక్కరిపై పదమారెట్ల ప్రేమ ఉంది. నా పిల్లలు తోడుగా వెళ్ళకపోవడాన్ని బాబా కోరుకోవడం లేదు. ఇంటికి తిరిగి వెళ్ళే సమయము వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి రావాలి. కలిసి ఇంటికి వెళ్ళకపోతే బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యంలోకి కూడా రాలేరు, వెనుక వస్తారు. మరి మీ ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా నడుస్తాము, లేక వస్తాము.... ఇందులో కూడా ము, ము అని అంటారా? చేరుకుంటాము, చూడు బాబా, తప్పకుండా చేరుకుంటాము, ఇప్పుడు ఈ భాషను సమాప్తం చెయ్యండి.
ఈరోజు బాప్‌దాదా వతనంలో కూడా హోలీ జరిపారు, ఎవరితో? మీరైతే ఇప్పుడు జరుపుకుంటారు. అడ్వాన్స్ పార్టీ వారితో హోలీని జరిపారు. అడ్వాన్స్ పార్టీ ఉంది కదా, పేరే అడ్వాన్స్ పార్టీ. అందుకే బాబా అడ్వాన్స్‌గా హోలీను జరిపారు. ఎటువంటి హోలీని జరిపారో తెలుసా? అడ్వాన్స్ పార్టీలోని వారందరూ క్రొత్తవారు మరియు పాతవారు, ఈ మధ్యలో వెళ్ళిన మహారథులను కూడా మీరు గుర్తు చేసుకుంటారు కదా, వారిని కూడా ఇమర్జ్ చేసుకున్నాము ఎందుకంటే ఎవరైతే వెళ్ళేవారు ఉన్నారో వారు చిన్నతనం నుండి అంటే ఎంతోకాలం నుండి తమ సేవా పాత్రను నిర్వర్తించారు. మీరు కూడా ఆ సేవా సహచరులను గుర్తు చేసుకుంటారు కదా! స్థానమైతే నింపవలసి ఉంటుంది కదా. మరి ఈరోజు వతనంలో మమ్మా, దీదీ మరియు దాదీ, విశేషంగా ఈ త్రిమూర్తులను అందరి సంగఠన మధ్య నిల్చోబెట్టాము, ఇతర సహచరులు కూడా ఉన్నారు కానీ ఈ ముగ్గురినీ విశేషమైన పాత్రతో నిల్చోబెట్టడం జరిగింది మరియు వీరికి గుర్తు తెప్పించాము, వీరికి గుర్తుంది కూడా. కానీ వీరు గుప్త రూపంలో సేవ చెయ్యవలసి ఉంటుంది. అమృతవేళ వీరు కూడా వతనంలో ఇమర్జ్ అవుతారు మరియు సేవకు వెళ్తారు. విశేషాత్మలు సేవను విడిచిపెట్టలేరు. వతనంలో అమృతవేళ సమయంలో వీరు రావడము ఫిక్స్. తమ అసలైన బ్రాహ్మణ జీవితంలో ఇమర్జ్ కావడము మరియు నలువైపుల ఏదో ఒక సేవార్థము మనసా సేవ, మనసు ద్వారా మనసు మరియు బుద్ధి ద్వారా ఆత్మల మనసు మరియు బుద్ధిని ఆకర్షించే విశేషమైన సేవను చేస్తారు. బాప్‌దాదా ఈరోజు ఈ త్రిమూర్తులను, మీరు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు.
బాబాకు తెలుసు అయినా అడుగుతారు కదా. వీరన్నారు, మేము రెండు విధాలుగా ప్రేరణను ఇస్తాము, ఒకటి-అలజడిని రేకెత్తించే వారికి కూడా మరియు రెండు నూతన సృష్టికి నిమిత్తంగా అయిన వారికి కూడా ఎందుకంటే మేము ఎదురు చూస్తున్నాము. మమ్మా అన్నారు, మేము ఎదురు చూస్తూ చాలా సమయమైంది. మా సఖీలను అడగండి, ఇంకా మా చేత ఎదురు చూడనిస్తారా లేక ఏర్పాట్లు చేస్తారా అని! మరి మమ్మా మరియు దాదీ, దాదీ సఖీలైతే చాలామంది కూర్చుని ఉన్నారు, సఖులు కూడా ఉన్నారు. తోడుగా ఉండే సోదరులు కూడా ఉన్నారు, సోదరీలు కూడా ఉన్నారు, వారి ప్రశ్న ఏమిటంటే ఎదురు చూడటం మా పని కానీ అడ్వాన్స్ స్టేజ్ వారి పాత్ర ఏమిటి? మేము ఎదురు చూస్తున్నాము (ఇంతజార్) కానీ మీ పని ఏర్పాట్లు చేయడము(ఇంతజామ్). మా పని వేచి ఉండటము. మరి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? బాబా పిల్లలైన మీరందరూ ఎప్పుడైతే సమానంగా, సంపూర్ణంగా అవుతారో అప్పుడు ఏర్పాట్లు పూర్తవుతాయి. అప్పుడు మా తరఫున ఒక ప్రశ్న అడగండి అని దీదీ అన్నారు. దీదీ ఏమన్నారు? మీ అందరికీ తెలుసు కూడా, అంటూ కూడా ఉంటారు ఎవరెడీ. మరి సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావడంలో ఎవరెడీగా ఉన్నారా? అప్పుడు దాదీ ఏమన్నారు? ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది. దాదీ అన్నారు, మాతో కలవడానికి ఎవరు వచ్చినా అందరూ అనేవారు, దాదీ మీకైతే కర్మాతీతంగా కావాలి, కర్మాతీతంగా కావాలి అన్న తపన ఉంది, మేము కూడా మీతో వస్తాము అని అనేవారు. ఇప్పుడు కూడా నా సహచరులను అడుగుతున్నాను, కర్మాతీతంగా కావలసిందే, కానీ ఎప్పుడు? ఎప్పుడు అన్నదానిని ఇప్పుడు లోకి ఎప్పుడు పరివర్తన చేస్తారు? మరి బాబా అయితే మందహాసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముందుగా వీరి ఆత్మిక సంభాషణ జరిగింది, మిగతా అందరూ కూడా వీరితో ఉన్నారు, మమ్మా మీరు బాగా చెప్పారు, దీదీ మీరు కొంచెం ఫోర్స్ నింపండి అంటూ దాదీతో ఇలా అన్నారు, దాదీ మీరైతే అందరికీ తోడును అందించారు. బాబా అవ్యక్తమయ్యాక మీరు నిర్వర్తించిన పాత్ర, మా అందరి హృదయాలలో దాదీలోని ఈ విషయము గుర్తుంది. దాదీ సహచరులు ఎవరైతే ఉండేవారో వారన్నారు, దాదీ ఇప్పుడు మీ విషయము గుర్తు చేసుకుని, సరే, బాబా అవ్యక్తంగా ఉన్నారు, శివబాబా నిరాకారుడు, వారు అవ్యక్త ఫరిశ్తా. కానీ దాదీ అయితే సాకారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరేదైతే ఆలోచించారో దానిని చేసి చూపించాలి. దాదీ వంటి బాధ్యతను తీసుకుని చూపించాలి. అంటే ఈరోజు మనసు విప్పి ఆత్మిక సంభాషణ జరిగింది. విన్నారా. ఇప్పుడు ఏమి చెయ్యాలి?
హోలీ అయితే జరుపుకున్నారు కదా! నిన్నటి విషయాలే పోయినప్పుడు ఇక గత జన్మ విషయాల గురించి ఏమి ఆలోచించాలి! అందరూ చిట్‌చాట్ చేసారు కదా మరి బాప్‌దాదా హోలీ జరపడం మొదలుపెట్టేసారు. అందరూ తెల్లని వస్త్రాలలో ఉన్నారు మరియు వతనంలో అయితే ఫరిశ్తా రూపాలలో ఉన్నారు. బాప్‌దాదా చెప్పకుండా అకస్మాత్తుగా హోలీ జరిపారు. అందరూ అర్థ చంద్రాకృతిలో కూర్చుని ఉన్నారు, నిలబడి లేరు. కూర్చుని ఉన్నారు, 4-5 లైన్లు ఉన్నాయి, నియమానుసారంగా కూర్చుని ఉన్నారు, చిన్నవారు, తర్వాత పెద్దవారు, ఆ తర్వాత ఇంకా పెద్దవారు. అప్పుడు బాప్‌దాదా ఏమి చేసారు? అకస్మాత్తుగా 7 రంగుల వజ్రాలు, తెలుసు కదా, వాటిని పౌడర్ చేసారు. పౌడర్ రూపంలో అందరిపై వేసారు. అసలే ఫరిశ్తా డ్రెస్ మెరుస్తూ ఉంది, దానిపై 7 రంగుల పౌడర్‌ను వెదజల్లారు. మీరు ఊహించండి, మెరుస్తున్న డ్రెస్‌పై 7 రంగుల పౌడర్ వెదజల్లబడ్డప్పుడు ఆ డ్రెస్ ఎలా ఉండి ఉంటుంది? సత్యయుగంలో కూడా ఇటువంటి డ్రెస్ లభించదు. అందరూ మెరిసిపోయారు. ఈ డ్రెస్ మెరిసింది కదా అప్పుడు దీదీ నషాతో వెళ్ళారు. ఎలా అయితే ఇక్కడ నషాతో వెళ్ళేవారో అలాగే నషాతో వెళ్ళి ఒక్కొక్కరిని పట్టుకుని డ్యాన్స్ చెయ్యడం ప్రారంభించారు. తర్వాత మధువనంలో మీరు గేవర్ (స్వీట్) తయారు చేస్తారు కదా, వతనంలో గేవర్‌ను ఇమర్జ్ చేయించాము. మధువనం నుండైతే రాలేదు, అందరికీ గేవర్‌ను తినిపించారు. ఇలా అందరూ ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. మీరు కూడా ఎలా అయితే రకరకాల డ్రెస్సులను మారుస్తూ ఉంటారో అలాగే మధ్య మధ్యలో రోజంతటిలో ఇటువంటి ఫరిశ్తా డ్రెస్‌ను మారుస్తూ దీని రుచిని కూడా చూడండి. కేవలం ఇమర్జ్ చేసుకోండి, 5 నిమిషాలు, 10 నిమిషాలు నేను ఫరిశ్తా రూపంలో ఉన్నాను, వస్త్రాన్ని మార్చండి, సాధారణం నుండి ఫరిశ్తా డ్రెస్‌ను ధరించండి మరియు బాప్‌దాదా ఒకసారి జ్ఞానము, ఒకసారి శక్తులు, మరోసారి గుణాల రంగును వేస్తున్నారు. ఫరిశ్తా డ్రెస్‌లో ఫరిశ్తాగా అయి 5-10 నిమిషాలు అనుభవం చెయ్యండి తర్వాత వస్త్రాన్ని మార్చండి. కర్మయోగులు కదా. రోజంతటిలో సమయము లభించినప్పుడల్లా ఫరిశ్తా డ్రెస్‌ను ధరించండి. బాబా ద్వారా ఈ రంగులు పడుతున్నాయి అని అనుభవం చేయండి. ఇప్పటి నుండే ఫరిశ్తా డ్రెస్ యొక్క అభ్యాసాన్ని చేసినప్పుడు డ్రెస్ వేసుకుంటే నషా పెరుగుతుంది మరియు ఫరిశ్తాగా కావడంలో సహాయం లభిస్తుంది. హోలీ రోజున బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలకు దీనిని బహుమతిగా ఇస్తున్నారు. డ్రెస్ ధరిస్తూ ట్రయల్ వేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. హోలీ బహుమతిగా ఫరిశ్తా డ్రెస్‌ను ఇస్తున్నాము. మధ్య-మధ్యలో ఈ అభ్యాసాన్ని చెయ్యండి. సహజమే కదా! డ్రెస్‌ను మార్చడమైతే వచ్చు కదా. వచ్చా? వచ్చు కదా? ఎలా అయితే ఈ డ్రెస్‌ను మారుస్తారో, రోజూ మారుస్తారు కదా. అలాగే ఫరిశ్తా డ్రెస్‌ను మార్చి చూడండి. ఎంత సుందరంగా, ఎంత మెరుస్తూ ఉంది. విన్నారా.
ఈరోజు వతనం సమాచారాన్ని వినిపించాము. మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటారు కదా. అడ్వాన్స్ పార్టీలోని మీ తోటివారందరినీ, ఎందుకంటే ఏదో ఒక స్థానం నుండి ఎంతోమంది వెళ్ళారు. మరి వెళ్ళినవారిని గుర్తు చేసుకుంటారు కదా. బాప్‌దాదా కూడా అమృతవేళ అడ్వాన్స్ పార్టీ వారితో విశేషంగా సేవ చేయిస్తారు ఎందుకంటే మొత్తం ప్రపంచమైతే నిద్రిస్తూ ఉంటుంది, వీరు డ్రెస్ మార్చుకుని వతనంలోకి వచ్చేస్తారు. విన్నారా. ఇప్పుడు ఏమి చేస్తారు? ఈ డ్రిల్‌ను మర్చిపోవద్దు. వస్త్రాన్ని మార్చండి, రోజంతటిలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు, 3 నిమిషాలైనా ఫర్వాలేదు, కూర్చోండి, కానీ తప్పకుండా కూర్చోండి, మార్చండి తప్పకుండా, ఇప్పటి నుండే సంస్కారాన్ని తయారు చేసుకోండి, ఫరిశ్తాగా కానంతవరకు దేవతగా కాలేరు. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలందరినీ కూడా బాప్‌దాదా చూస్తున్నారు, దూరంగా కూర్చున్నప్పటికీ సైన్స్ సాధనాల ద్వారా మెజారిటీ స్థానాలలో, సెంటర్లలోని వారు కూడా బాప్‌దాదాను చూస్తూ ఉన్నారు, మీరు టోలీ తింటారు కదా, అప్పుడు వారు కూడా టోలీ పంచుతారు. అందరూ దూరంగా కూర్చుని కూడా సమీపాన్ని ఎలా అనుభవం చేస్తున్నారు అని బాప్‌దాదా చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలకు ఎవరైతే సదా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాలో, ఎవరైతే ఈ సంకల్పాన్ని ధారణ చేసి ఉన్నారో మరియు దృఢత బలాన్ని ఎప్పటికప్పుడు ఈ సంకల్పానికి ఇస్తూ ఉంటారో, ఇలా నలువైపుల శుభ సంకల్పాన్ని ధారణ చేసుకునేవారికి, దీనితో పాటు బాబా ఆశలను పూర్తి చేసేటువంటి ఆశా సితారలకు, అలాగే దాదీ మాటలు, కర్మాతీతంగా కావలసిందే, కావలసిందే, కావలసిందే... మమ్మా మాటలు - సదా ఏది చెయ్యాలో దానిని ఈరోజే చెయ్యాలి, రేపటిపై వదలద్దు, దీదీ మాటలు - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి - ఇవి చెవులలో మారుమ్రోగుతూ ఉండాలి. పదే పదే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కర్మాతీతంగా కావాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న ధుని పెట్టుకోండి. ఈ మాటలను పదే పదే స్మృతిలోకి తీసుకువచ్చే సమర్థ ఆత్మలకు, హోలీ పిల్లలకు బాప్‌దాదా నుండి హోలీ శుభాకాంక్షలు, దీనితో పాటు అందరికీ బాప్‌దాదా ముందుగా మధువనం గేవర్, అందరూ నోరు తెరవండి, గేవర్ తినండి, తిన్నారా, అందరికీ చాలా-చాలా పదమారెట్లు బాప్‌దాదా మరియు అడ్వాన్స్ పార్టీలోని పిల్లలందరి ప్రియస్మృతులు మరియు తండ్రి నమస్తే.
యు.పి. బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారి సేవ టర్న్:- యు.పి వారితో మోహిని అక్కయ్య కూడా లేవండి. బాగుంది, యు.పి విశేషత ఏమిటి? ఆదిలో సెంటర్ మొదలైనప్పుడు యు.పి సెంటర్ విశేషమైనది. బాప్‌దాదా, మమ్మా ముందుగా యు.పి. సెంటర్లో ఉన్నారు. యు.పి.లో జ్ఞాన నదుల సమ్మేళనం కూడా ఉంది. పెద్దవాటిలో కూడా పెద్దది గంగా నది, జమునా నది ఢిల్లీలో ఉంది. యు.పి.లో గంగా నది ఉంది. గంగా నదికి ఉన్న గాయనము ఏమిటి? పతిత పావని. పతిత పావనిగా అయి పతిత ఆత్మలకు ఏదో ఒకటి ఇవ్వాలన్న తపన యు.పి. వారికి సదా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు యు.పి.లో సెంటర్లు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి కదా? ఆదిలో అయితే ఎంతో అందం ఉంది. సంపూర్ణ యుగళులు యు.పి.లో ఆరంభమయ్యారు. ఇప్పుడు కూడా యు.పి. ఏదైనా క్రొత్త కార్యాన్ని చేసి చూపించండి. ఈ ఫంక్షన్లు, సమ్మేళనాలు ఇవైతే అవుతూనే ఉంటాయి, కానీ ఏదైనా క్రొత్తది చేసి చూపించండి. ఏదైనా చేసి చూపించాలి అని అన్ని జోన్లు ఆలోచిస్తున్నాయి. ఢిల్లీ వారు కూడా ఆలోచిస్తున్నారు కదా! మంచిది. ఏదో ఒకటి చేస్తూ ఉండండి. బ్రాహ్మణ ప్రపంచంలో ఏదో ఒక వార్త గురించి ముద్రణ జరగాలి, మీ పత్రికలు కూడా ఉన్నాయి కదా. కనుక ఏదైనా క్రొత్త సమాచారము పత్రికల్లో రావాలి. యజ్ఞసేవలో యు.పి. కూడా తక్కువేమీ కాదు. మంచి సంఖ్య వచ్చింది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. టీచర్లు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏ టీచర్లు? తెలుసు కదా, ఎటువంటి టీచర్లంటే తమ ఫీచర్లు, నడవడిక మరియు ముఖము ద్వారా ఫ్యూచర్‌ను(భవిష్యత్తును) చూపేవారు. ఇప్పటి ఫ్యూచర్ ఏమిటి? ఫరిశ్తా. భవిష్య ఫ్యూచర్ దేవత. ప్రతి ఒక్క టీచర్ ఇప్పటి ఫ్యూచర్ అయిన ఫరిశ్తా, సరే దేవత అయితే భవిష్యత్తులో అవుతారు కానీ అంతిమ క్షణం యొక్క స్వరూపము ఫరిశ్తా, ఆ ఫీచర్లు నడవడిక మరియు ముఖము ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఎలా అయితే ఆరంభంలో మీరు సేవకు వెళ్ళినప్పుడు 14 సంవత్సరాల తపస్సు, బాప్‌దాదా మరియు తల్లి పాలనను తోడు తీసుకున్నారో, ఆరంభంలో సేవకు వెళ్ళినప్పుడు కొంతమంది సేవాధారీ ఆత్మలు జిజ్ఞాసువులకు ఒకసారి ప్రకాశ కిరీటము, ఒకసారి మస్తకంలో మెరుస్తున్న బిందువు, ఇవి కనిపించేవి మరియు మీలో పరిశీలించే శక్తి చాలా ఉండేది, ఎటువంటి ఆసురీ స్వభావం ఉన్నవారు వచ్చినా, ఎందుకంటే కుమారీలు అని పేరు కదా. కానీ ఆసురీ స్వభావం ఉన్న వారి ఆటలు సాగేవి కావు. ఎంత శక్తి మీలో ఉండేదంటే వారు స్వయం కాళ్ళపై పడి మేము ఏమనుకున్నాము, కానీ మీరు ఎవరు! అని అనేవారు. పవిత్రతలోని ఈ చమత్కారము ప్రత్యక్ష నడవడికలో, స్వప్నం వరకు కూడా ఉండేది. అపవిత్రత స్వప్నమాత్రంలో కూడా ఉండేది కాదు. ఉండేది కాదు అంటున్నాము, ఉంది అనడము లేదు. ఇప్పుడు మళ్ళీ మీ తోటివారిలో ఈ లైట్ మైట్ యొక్క దృఢత్వాన్ని తీసుకు రండి. ఈజీ కాదు. అందరికీ అర్థమైతే అవుతుంది, టీచర్లు నిమిత్తమైనవారు కదా, బాబా తరఫు నుండి మరియు టీచర్లు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు అందరిపై బాప్‌దాదాకు హృదయంలో ప్రేమ ఉంది ఎందుకంటే తండ్రి కార్యంలో సహయోగిగా ఉన్నారు. నిమిత్తంగా ఉన్నారు, సహయోగిగా ఉన్నారు. నలువైపుల విద్యార్థులందరి ముందు సాకార రూపంలో మీరు టీచర్లు. అవ్యక్త రూపంలో బాప్‌దాదా ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా మీకు సకాశ్ను ఇస్తూ ఉంటుంది. అమృతవేళ వతనంలోకి వచ్చినప్పుడు సఖీలను కూడా గుర్తు చేసుకుంటారు, సెంటర్లను కూడా గుర్తు చేసుకుంటారు. మరి యు.పి. అన్నిటికన్నా నంబర్‌వన్‌గా కావాలి, అవుతున్నారు. అద్భుతాన్ని చేస్తారు. చేయ్యాల్సిందే.
స్పార్క్ మరియు సైన్స్ ఇంజినీర్ వింగ్ మీటింగ్ ఉంది:- అచ్ఛా, మీటింగులు అయితే మీరు చేస్తూ ఉంటారు, మంచి ఉల్లాస ఉత్సాహాలతో చేస్తారు. ఇది బాప్‌దాదా చూస్తారు మరియు వింటారు కూడా. ధారణ కోసం ప్లాన్లు కూడా వేస్తూ ఉంటారు. బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు. అందరూ తమ స్వ ఉన్నతి మరియు సేవ కోసం క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచంవారికి ఇప్పుడు ఓదార్పును ఇవ్వవలసిన అవసరం ఉంది అన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. పరిస్థితులను చూసి వారు భయపడుతున్నారు. భయము వ్యాపిస్తుంది. ఇటువంటి సమయంలో మీరు విశేషంగా, ఆత్మలందరూ మీవారే, కానీ విశేషంగా మీరు మీ వర్గానికి ఓదార్పును ఇవ్వండి. ఒకవేళ మెడిటేషన్ కోర్స్‌ను చేసినట్లయితే మీ ఈ భయము, టెన్షన్ సమాప్తమైపోతాయి. ముందుగానే జ్ఞానాన్ని ఇవ్వకండి, మెడిటేషన్ చెయ్యండి మరియు చేయించండి. దీనికి ఆహ్వానాన్ని ఇవ్వండి, టెన్షన్ ఫ్రీ జీవితాన్ని అనుభవం చేసుకునే ప్రోగ్రామ్‌లు ఎక్కువగా పెట్టండి. చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కువగా చెయ్యండి. వారికి ఆధ్యాత్మిక శక్తిని అనుభవం చేయించండి. కేవలం భాషణ కాదు, అనుభవం చేయించండి. చిన్న చిన్న గ్రూపులకైనా ఫర్వాలేదు, చేయించండి. పెద్ద గ్రూపుకైనా చేయించండి కానీ అనుభవం చేయించండి. అనుభవం జరిగిన వ్యక్తి ఎప్పుడూ ఉండిపోడు. అనుభవం యొక్క అథారిటీ నంబర్‌వన్. అనుభవం జరిగిన వ్యక్తి ఎవరి ప్రభావంలోకీ రాలేడు. సమస్య వచ్చినప్పుడు గాబరా పడడు. ఎందుకంటే మెడిటేషన్‌తో శక్తి అనుభవం అవుతుంది. కనుక మెడిటేషన్లోని టెంప్టేషన్(ఆకర్షణ)ను ఎక్కువ అనుభవం చేయించండి. ప్రోగ్రాములైతే చేస్తూ ఉంటారు. అవి జరుగుతూనే ఉంటాయి, జరిపించండి కానీ విశేషంగా దీనిపై శ్రద్ధ పెట్టండి. ఎవరు వచ్చినా, కోర్స్ చేసినా, కోర్స్ మధ్యలో అనుభవం చేసుకున్నారా లేక కేవలం జ్ఞానం తీసుకున్నారా అని చూడండి. తప్పకుండా అనుభవం చేయించండి. ఏ విషయమైనా, జ్ఞానం ఆధారంగా పరమాత్మ జ్ఞానం అనుభవం కావాలి, యోగం ద్వారా తమలోని శక్తుల అనుభూతి జరగాలి, ధైర్యం రావాలి, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేసే ధైర్యం రావాలి మరియు ధారణకు ధైర్యం రావాలి. లేకపోతే ధారణ గురించి విని గాబరా పడిపోతారు. ముందుగా ప్రాప్తులను వినిపించండి, ఏ ప్రాప్తులు జరుగుతాయి. ప్రాప్తుల ఆకర్షణతో అందరూ మొదలుపెడ్తారు. పరమాత్మ పరిచయాన్ని ఇస్తున్నప్పుడు కూడా ముందుగా జరగబోయే ప్రాప్తుల గురించి వినిపించండి అప్పుడు ప్రాప్తుల ఆధారంతో ఆకర్షితులవుతారు. ఏమి లభిస్తుంది, ఎలా తయారవుతారు, సమస్యలు మీకు ఎలా సహజమైపోతాయి, ఇలా అనుభవాల విషయాలను వినిపించండి. ఇకపోతే పరస్పరంలో కలుసుకుంటారు, బాప్‌దాదా వద్దకు రిపోర్ట్ వస్తుంది, సంగఠనలోని కలయికను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. బ్రాహ్మణులకు కూడా రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. పరస్పరంలో కలుస్తారు కదా, ఏదో ఒక సలహాను ఇస్తారు. రెండు వర్గాలు బాగా చేస్తున్నాయి మరియు ముందు కూడా బాగా చేస్తూ ఉంటాయి. ఇది బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరీ సోదరులు 80 దేశాల నుండి వచ్చారు:- ఈసారి డబల్ విదేశీయులు యుగల్స్ కోసం, టీచర్ల కోసం.... భిన్న భిన్న ప్రోగ్రాములు తయారు చేసారు - యుగల్స్ చేతులెత్తండి. యుగల్స్ మంచిగా తయారవ్వడం బాప్‌దాదా చూసారు కానీ బాబా ఆశను పూర్తి చెయ్యలేదు. ఆశ ఏమిటి? ఎవరైనా ఒక మహామండలేశ్వరుడిని చరణాలపై వంగేలా చేయండి ఎందుకంటే మీరు సహజంగా వారిని ఫెయిల్ చెయ్యవచ్చు. మీరు వీలు కాదు అంటే మేము సహజంగా చేసాము అని మీరు అంటారు. మీ అనుభవ అథారిటీతో వారిని సహజంగా వంగేలా చెయ్యవచ్చు అప్పుడే గీతా భగవంతుడు నిరూపితమవుతారు. యుగల్స్లో ఈ శక్తి ఉంది. వారు కొంచెం ఢీలా అయినప్పుడు అన్ని విషయాలను ఒప్పుకోవడం మొదలుపెడతారు. బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది, యుగల్ చాలా అద్భుతం చేసి చూపించవచ్చు. ఎందుకు? ఇప్పుడు కూడా చేసారు, ఎప్పటి నుండైతే యుగల్-యుగల్ నడుస్తున్నారో, పాతగా కూడా అయిపోయారు ఇది చూసి, విని ఎంత సంఖ్య పెరిగింది! ఒక పనైతే చేసారు - మేము కూడా చెయ్యగలము, ఇల్లు వాకిలి వదలాల్సిన అవసరం లేదు అని అందరిలో ఉల్లాస ఉత్సాహాలను పెంచారు. వదలాలేమో అని భయపడేవారు కదా. కానీ మీరు వదలలేదు, తయారు చేసారు. ఏమైనా వదిలారా? తెల్లని వస్త్రాలు ధరించారు, రంగు వస్త్రాలు ధరించకూడదు అని ఏమీ లేదు. కానీ స్కూల్‌కు కూడా ఒక డ్రెస్ ఉంటుంది కదా. అంతేకానీ వద్దు అని కాదు. కావున యుగల్ చాలా అద్భుతాన్ని, ఛాలెంజ్‌ను చెయ్యగలరు. ఇటువంటి ప్రోగ్రామ్‌ను తయారు చెయ్యండి. ఏ యుగల్ తయారవుతారో చూస్తాము. ముందుగా ట్రయల్ వెయ్యండి. ఇటువంటి కనెక్షన్ వారు ఎవరైనా ఉంటే వారితో ట్రయల్ వేసి చూడండి. ఒకరు ఢీలా అయినా మరి కొంతమంది తయారవుతారు. బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది, యుగళ్ళ సమ్మేళనం మంచిగా అనిపిస్తుంది. అచ్ఛా.
ఇప్పుడు ఫారెన్ ట్రైనింగ్ టీచర్లు లేవండి:- అచ్ఛా. ట్రైనింగ్ లభించడం మంచిది అని టీచర్లు భావిస్తున్నారా? ఇది తప్పనిసరి, బాగుంది అని అనుకునేవారు చేతులెత్తండి. నిమిత్తమైన టీచర్లకు అభినందనలు. ఎందుకంటే మంచి కృషి చేసారు. వీరు డైరెక్ట్ సేవ చేస్తే నిమిత్తమైన మీకు పుణ్యం లభిస్తుంది. ఇది బాగుంది, క్రొత్త క్రొత్త టీచర్లు తయారవుతూ ఉంటారు, ఇది కూడా డ్రామాలో పాత్ర. ఫారెన్‌లో చూడండి ఎన్ని క్రొత్త క్రొత్త సెంటర్లు తెరుచుకుంటూ ఉన్నాయో, ఇది చాలా సంతోషకర విషయము. ట్రైనింగ్ తీసుకుని రాబోయే వారిని కూడా త్వరత్వరగా ఎగిరింపజేయడానికి నిమిత్తంగా అవుతారు. బాప్‌దాదా ఫారెనర్లందరికీ ఒకటి, అభినందనలు ఇస్తున్నారు ఎందుకంటే ఉద్యోగం చేస్తూ సెంటర్‌ను కూడా సంభాళిస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టండి. నిజానికి, టీచర్‌గా అయి సెంటర్‌ను నడిపించడము కూడా చాలా పెద్ద భాగ్యము, సాధారణ విషయము కాదు ఎందుకంటే టీచర్ కావడము అంటే వర్తమానంలో తండ్రి గద్దీకు యజమానిగా కావడము, అది మురళి వినిపించడము. మురళి ద్వారా ఆత్మలను రిఫ్రెష్ చెయ్యడము. బాప్‌దాదా టీచర్లను గురుభాయి అంటారు ఎందుకంటే మురళి వినిపించే సింహాసనానికి అధికారులుగా అవుతారు. నిమిత్తమవుతారు. లాభము కూడా ఉంది, నియమము కూడా ఉంది. రెండూ ఉన్నాయి. కానీ మీరు మీ అభిరుచితో సమయాన్ని కేటాయించి వచ్చినందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ట్రైనింగ్ చెయ్యడము బాప్‌దాదాకు చాలా నచ్చుతుంది. ఇంతమంది ట్రైనింగ్‌కు వచ్చి మంచి పని చేసారు. నిమిత్తంగా ఉన్నారు మరియు నిమిత్తంగా ఉన్నందుకు ఫలితము చాలా పెద్ద పుణ్య ఖాతా జమ అవుతుంది. నిమిత్త భావాన్ని వదిలిపెట్టకండి, నేను అని తీసుకురాకండి. నేను అనేది పాము వంటిది, నల్లటి పాము. మింగేస్తుంది. నిమిత్తంగా ఉన్నాను, చేయించేవాడు చేయిస్తున్నాడు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు. కంబైన్డ్‌గా ఉండండి. ఒంటరిగా ఉండద్దు. ఒంటరిగా ఉన్నారంటే మాయకు తలుపు తెరిచినట్లే. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా. ఫారెనర్లందరూ ప్రతి సంవత్సరము ఏదో ఒకటి చేస్తూ ఉండండి. బాగుంది. సేవా ప్లాన్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఒకరికొకరు ఉత్సాహాన్ని పెంచుకుంటూ ఉండండి, ఇదే పెద్ద సేవ. ట్రైనింగ్ చేయించిన నిమిత్త టీచర్లు లేవండి. వీరు కూడా బాగున్నారు. (ఛార్లీ అన్నయ్యతో) వీరు అన్నిటిలో ఛాన్స్‌ను తీసుకుంటారు, ఇది చాలా మంచిది. బాప్‌దాదా మీ సేవా రిజల్ట్‌ను చూసి సంతోషిస్తున్నారు. అందరి ముఖాలలో ఉల్లాస ఉత్సాహాలు కనిపిస్తున్నాయి, చాలా మంచిది.
ఇప్పుడు అందరూ హోలీ బహుమతిగా ఏమి ఇవ్వాలి? అది గుర్తుందా? గుర్తుంది కదా? బాప్‌దాదాకు పిల్లలు ఒక్కొక్కరిపై విశేషమైన ప్రేమ ఉంది. నిమిత్తంగా ఉన్నవారి మీద మాత్రమే ప్రేమ ఉంది అని కాదు. ఒక్కొక్కరు కోట్లలో కొద్దిమంది, లాస్ట్ నంబర్ కూడా కోట్లలో కొద్దిమంది. మరి కోట్లలో కొద్దిమంది అంటే మహాన్ కదా. కానీ ఎవరు ఎటువంటి వారైనా, లాస్ట్ అయినా, వారి పట్ల కూడా సదా వారిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఒకటి - ఒకరినొకరు స్వమాన దృష్టితో చూసుకోండి, ప్రతి ఒక్కరికీ స్వమానము ఉంది, లాస్ట్ నంబర్‌కు స్వమానము ఉంది, కోట్లలో కొద్ది మంది. ప్రెసిడెంట్కన్నా గొప్పవారే కదా. గుర్తించారు, నా బాబా అని అంటారు కదా. కనుక స్వమానంలో ఉండండి మరియు గౌరవమును ఇవ్వండి. ఐక్యత, లాస్ట్ నంబర్ వారు కూడా ఒక్క బాబా సంతానమే. బాబాను ఎదురుగా తీసుకురండి, వారి పొరపాటును ఎదురుగా తీసుకురాకండి. పరివారానికి చెందినవారు, వారిలో ఉల్లాసాన్ని తీసుకురండి, ఉత్సాహాన్ని తీసుకురండి, సరే, పొరపాట్లు చేస్తారు, ఏ ఏ పొరపాట్లు చేస్తారని బాప్‌దాదాకు తెలుసు, అవి దాగవు. కానీ నేను బ్రహ్మా కుమారి, బ్రహ్మా కుమారుడిగా ఎందుకు అయ్యాను, లక్ష్యము ఏమిటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. ఏ లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చారో, కేవలం స్వయాన్ని రక్షించుకోవడానికి కాదు, దాల్ రోటీ లభిస్తున్నాయి, మంచి సంగఠన, బ్రాహ్మణ జీవితంలో గొడవల నుండి సురక్షితంగా ఉంటాము....ఈ లక్ష్యంతో రాలేదు. ఎంతో మంచి లక్ష్యాన్ని తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కోసారి లక్ష్యానికి-లక్షణానికి మధ్య తేడా వస్తుంది. బాప్‌దాదాకు అంతా తెలుసు, కేవలం పేర్లు తీసుకోవడం లేదు, ఆ సమయం కూడా వస్తుంది. బాప్‌దాదా ఏమి చూసారంటే మెజారిటీ సాంగత్య దోషంలోకి వస్తున్నారు. మనసు కూడా తింటుంది. చెయ్యకూడదు కానీ సాంగత్యపు రంగు, బాబా సాంగత్యపు రంగు తక్కువగా పడ్డది అందుకే ఆ రంగు పడుతుంది. అయినప్పటికీ బాప్‌దాదా పిల్లలందరికీ ప్రేమను ఇచ్చి తమ వర్తమానాన్ని మరియు భవిష్యత్తును నిర్విఘ్నంగా చేసుకోండి అని అంటారు. సాంగత్య దోషంలోకి రాకండి. సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు, టెంప్టేషన్ ఉంటుంది, సాంగత్య దోషంలోకి రావద్దు. హద్దు యొక్క ప్రాప్తుల ఆకర్షణలోకి రావద్దు, ఎందుకంటే బాప్‌దాదాకు జాలి కలుగుతుంది. నా బాబా అంటారు కానీ నా బాబా అంటూ ఏమి చేస్తున్నారు? అందుకే ఈ హోలీ రోజున ఇటువంటి విషయాలను తెలివైనవారిగా అయి కాల్చివేయండి. అయినా టూ లేట్ బోర్డ్కన్నా ముందే మారిపోండి, బాప్‌దాదా సహాయం చేస్తారు కానీ అది సత్యమైన హృదయానికి. స్వచ్ఛమైన మనసుంటే కోరిక నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా చేసి చూడండి. సత్యమైన మనసుతో కోరిక నెరవేరకపోవడమన్నది జరుగదు. హోలీలో రంగులు వేస్తారు కదా, ఇష్టమొచ్చినట్లు వేసేస్తారు. మరి ఈరోజు హోలీను జరుపుకోండి. చెడు రంగును బాబా రంగులో ముంచండి. అచ్ఛా. ఈరోజు హోలీ కదా, జాలి కలుగుతుంది అని బాప్‌దాదా కూడా అనేసారు.
దాదీలతో:- ఈరోజు అడ్వాన్స్ పార్టీవారు గేవర్‌ను ఇమర్జ్ చేసుకున్నారు. మీకు కూడా తినిపించారు. దీదీ అయితే చాలా ఉల్లాసంగా ఉన్నారు. దాదీ కూడా. బాధ్యత ఉండింది కదా. ఇప్పటికీ బాధ్యత గుర్తుకు వస్తుంది. బాగుంది.
నిర్మల్శాంత దాదీతో:- మీ ముఖముతో తండ్రి మూర్తిని చూపిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తే అందరికీ బ్రహ్మా బాబా గుర్తుకు వస్తారు. బాగుంది. మీ ఆరోగ్యాన్ని సంభాళించుకుంటూ ఉన్నారు, చాలా మంచిది. (పర్దాదీది హోలీ రోజున అలౌకిక పుట్టినరోజు) అచ్ఛా, పుట్టిన రోజు, పూర్తి పుణ్యాన్ని జమ చేసుకున్నారు. అచ్ఛా, పర్దాదీ పుట్టినరోజు. (బాప్‌దాదా పూలమాలను వేసారు, చాలా సంతోషంగా ఉంటారు) ఇదే పాతవారి విశేషత, ఆదిరత్నాలు కదా అందుకే గాబరాపడరు, సంతోషంగా ఉంటారు.
శాంతమణి దాదీతో:- ఏదో ఒక సేవను చేస్తూ ఉంటారు. మురళి వినిపించడము కావచ్చు, అందరితో కలవడం కావచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మరియు ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు. వీరు కూడా మూర్తియే.
బృజ్‌మోహన్ అన్నయ్యతో:- ఢిల్లీ ప్రోగ్రామ్ చాలా బాగా అయింది మరియు మంచిగా ఉంటుంది.
రమేష్ అన్నయ్యతో:- పరస్పరంలో కలుసుకోవడం చాలా బాగుంది, ఎందుకంటే పురుషార్థం గురించి మరియు సేవ గురించి అటెన్షన్ ఉంటుంది. ఏ పాయింట్లయితే ఆలోచిస్తారో అవి చాలా బాగున్నాయి. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు.
వి.ఐ.పి. గ్రూప్‌తో:- మీరందరూ స్నేహిగా ఉండనే ఉన్నారు, సహయోగి కూడా. బాబాపై స్నేహము ఉంది కదా. స్నేహితుడు సమయానికి సహయోగిగా కూడా అవుతాడు. ఇప్పుడు ఏమి కావాలి? స్నేహిగా ఉన్నారు, సహయోగిగా ఉన్నారు, ఇప్పుడు ఏమి కావాలి? (పిల్లలుగా కావాలి) మంచి పిల్లలుగా కావాలా లేక అలా ఉన్నారా? పిల్లలుగా ఉన్నారా లేక కావాలా? ఏమంటారు? పిల్లలుగా ఉన్నారా? మరి తండ్రి సమానంగా కావాలి. నా బాబా అని మనస్ఫూర్తిగా వస్తుంది కదా, మంచిది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా స్వయాన్ని ఈ సేవలో మరి కొంత పాత్రను పెంచండి. మీ మీ పనులు అయితే చేసుకోవాలి, అది సరైనదే, బాబాను గుర్తించారు, ఇది కూడా బాగుంది. ఇప్పుడు సేవలో, యజ్ఞ సేవలో కావచ్చు, బయటవారి సేవ కావచ్చు, ఈ సేవా పాత్రను పెంచండి. కొంచెం ఎక్కువ సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇతరులలో మీ అనుభవాన్ని విని ఉల్లాసం వస్తుంది. భయం పోతుంది. కనుక మీరు సేవ చెయ్యండి.
ఆస్థా ఛానెల్లో ప్రోగ్రామ్ ఇచ్చే కనుప్రియ అక్కయ్యతో:- వీరికైతే భాగ్యము లభించింది. ఇంట్లో కూర్చునే భాగ్యం లభించింది. ఎంతమంది ఆత్మలకు దారిని చూపిస్తున్నారు, వాణి ద్వారా అయితే సేవ చేస్తున్నారు కదా, బాగుంది.
అచ్ఛా. ఏమి జరిగినా కానీ బాబా పిల్లలు. ఈ స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి మరియు పరిశీలించుకుంటూ ఉండండి అప్పుడు రోజురోజుకూ ముందుకు వెళ్తున్నామా లేక అక్కడే ఉండిపోతున్నామా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నతి కావాలి కదా. కనుక రోజురోజుకీ ఎందులో ముందుకు వెళ్ళాము, అడిషన్ ఏమి జరిగింది అన్నది పరిశీలించుకుంటూ ఉండండి. అచ్ఛా.
ఓంశాంతి