Search for a command to run...
15 Dec 2010
నాది అన్నదానిని నీది లోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, సెకండులో వ్యర్థానికి బిందువును పెట్టే అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పమును మరియు సమయాన్ని సఫలం చేయండి
15 December 2010 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే బాబా చింతలను తీసేసుకుని నిశ్చింత చక్రవర్తులుగా చేస్తున్నారు. కావున మీ ఈ సభ ఇప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయంనుండి లేస్తూనే నిశ్చింత స్థితిలో స్థితులవుతున్నారు. తింటూ, త్రాగుతూ, కర్మ చేస్తూ ఎటువంటి చింత లేదు. నిద్రిస్తున్నా నిశ్చింత. చక్రవర్తులు మరియు నిశ్చింతులు. లేచినా, నిద్రిస్తున్నా ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ బాబాకు చింతలను (ఫికర్) ఇచ్చేసి నషాను (ఫఖుర్) తీసుకున్నారు అందుకే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఏమి చేస్తుంది? ఫఖుర్ ఉన్నట్లయితే మీ మస్తకంలో ప్రకాశపు మెరుపు మెరుస్తుంది. ఒకవేళ ఫికర్ వచ్చినట్లయితే భారమనే బుట్ట వస్తుంది. మరి చెప్పండి, మీకు ప్రకాశపు మెరుపు ఇష్టమా లేక భారమనే బుట్ట ఇష్టమా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికీ ప్రియులుగా ఉంటారు మరియు ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతూ ఉంటారో, వారి మెరుస్తున్న ప్రకాశమును చూసి ఇతరులకు కూడా ఎంతగానో ప్రియమైనవారిగా అవుతారు. అందుకే బాప్‌దాదా సదా పిల్లలను నిశ్చింత చక్రవర్తి అన్న స్థితిలో ఉంటూ ఆ స్మృతి స్వరూపంలో స్థితి అయ్యే విధంగా చేస్తారు. ఇందువలననే మీ చిత్రాన్ని కూడా భక్తులు డబల్ కిరీటంతో చూపిస్తారు. ఒకటి ప్రకాశ కిరీటము, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తిత్వానికి గుర్తుగా కిరీటము. డబల్ కిరీటాన్ని చూపిస్తారు. కావున బాప్‌దాదా సదా పిల్లలందరికీ ఈ శిక్షణనే ఇస్తారు. సదా ఆనందంలో ఉండటము చాలా సహజము. ఎందుకు సహజము? కేవలం హద్దు యొక్క నాది అన్నదానిని బాబాకు ఇచ్చేయండి. నాది అన్నదానిని నీదిలోకి చేసినట్లయితే నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లే. ఒక్క అక్షరంలోనే తేడా ఉంది, నాది, నీది - నా, నీ. ఈ ఒక్క అక్షరం తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. సహజమే కదా! నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా? లేక ఇంకా చింతలు ఉన్నాయా? ఒకవేళ ఎప్పుడైనా ఫఖుర్ బదులుగా ఫికర్ వచ్చిందంటే అది కేవలం నీది అని అనుకోవడానికి బదులుగా నాది అనుకోవడం వలననే. అందరి లక్ష్యము ప్రాక్టికల్‌లో ఏముంది? చింతలను ఇచ్చేసారా లేక మధ్య మధ్యలో నషాను విడిచి చింతలోకి వస్తున్నారా? చింతలు ఉన్నాయా లేక నిశ్చింతగా ఉంటున్నారా? సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటున్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులు, పక్కానా లేక అప్పుడప్పుడా! నిశ్చింత చక్రవర్తులు, చేతులు పెద్దగా ఎత్తండి. అప్పుడప్పుడు వారు కూడా ఇందులో ఉన్నారు. సేవ యొక్క చింత వేరే విషయము. ఆ చింత ఇతరులను కూడా నిశ్చింతులుగా చేసే సాధనము. తమ సంస్కారాలతో చింత వస్తున్నట్లయితే ఆ సమయంలోనే నాది అని అనుకోవడానికి బదులుగా నీదిలోకి మార్చేయండి. బాబాకు చింతలను ఇచ్చేయండి మరియు నషాను తీసుకోండి ఎందుకంటే బాబా వచ్చిందే పిల్లల చింతలను తీసుకుని నషాను ఇవ్వటానికి. నాలో అప్పుడప్పుడూ బహు కాలపు సంస్కారాలు ఇమర్జ్ అవ్వడం లేదుకదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే కొంత సమయం నుండి పిల్లలకు బాప్‌దాదా ఏమని చెప్తున్నారంటే వర్తమాన సమయానుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరుగవచ్చు, ఎప్పుడైనా జరుగవచ్చు. కావున ఒక్క సెకండులో బిందువును పెట్టాలనుకున్నప్పుడు పెట్టగలగడంపై పిల్లలు అటెన్షన్ ఉంచాలి. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందువు ద్వారా ఒక్క సెకండులో వ్యర్థాన్ని సమాప్తం చెయ్యగలరా? ఇంతటి అభ్యాసం ఉన్నదా? లేక ఆ సమయంలో, అప్పుడున్న పరిస్థితుల అనుసారంగా పురుషార్థం చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా! బిందువును పెట్టాలనుకుంటే క్వెశ్చన్ మార్కు వస్తుందా-ఎందుకు, ఏమిటి, ఎలా... ఆ సమయంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నట్లయితే రాబోయే సమయంలో బాబాతోపాటుగా వెళ్తాము అన్న లక్ష్యమేదైతే ఉందో, బాబా అయితే సెకండులో వెళ్ళిపోతారు, ఎందుకంటే బిందువు, సెకండు కూడా బిందువు మరియు ఫుల్స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా ఇంతటి అభ్యాసము ఉన్నదా? ఇందుకోసం ఇప్పటి నుండే ఇందులో అభ్యాసకులుగా ఉంటేనే బాబా సమానంగా శ్రీమతము అను చేతిలో చేయి వేసి మీ ఇంటికి చేరుకోగలరు. బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, రెండు విషయాలపై అటెన్షన్‌ను అండర్లైన్ చేయండి. రెండు విషయాలు ఏమిటి?
ఒకటి, సంకల్పాల ఖజానా మరియు రెండవది, సమయపు ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి - జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, యోగం ద్వారా సంపన్నంగా అవ్వడానికి ముఖ్యమైన యుక్తులేవైతే ఉన్నాయో అన్నింటి ప్రాప్తిని ఇవ్వడం జరిగింది. ఈ సంగము సమయము పూర్తి కల్పంలోకి అమూల్యమైన విశేష సమయము. ఈ సమయంలోనే ఎంత ప్రాప్తి కావాలంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మయే గొప్ప జన్మ. ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల ప్రాలబ్ధాన్ని చేసుకోవాలి. సంగమయుగ సమయంలో ఒక్క సెకండు కూడా పోగొట్టుకోకూడదు. ఒక్క సెకండు యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంటుంది. ఒక్క సంవత్సరం జమ చేసుకున్నట్లయితే అనేక సంవత్సరాలకు ప్రాప్తి లభిస్తుంది కావున ఈ సమయపు విలువ ఒక్క సెకండు కాదు, నిమిషం కాదు, ఒక్క గంట కూడా గొప్పదే. ఒక్క సెకండు కూడా గొప్పదే. ఈ సంగమ జన్మకు విశేషమైన ఆధారము సంకల్పాలు. చూడండి, యోగం చేస్తున్నప్పుడు మన్మనాభవ అని అంటారు కదా. ఈ ఆధారమే పునాది. మనసు యొక్క పనే సంకల్పాలు చేయడము. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్రను అనుభవం చేసుకుంటారు. ఇతరులకు కూడా విశేషంగా భిన్న భిన్న సంకల్పాలను ఇచ్చి అభ్యాసం చేయిస్తారు కదా! మరి అందరూ పరిశీలించుకోండి - సమయపు వేగం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ, సంబంధాలలోకి వస్తూ అమూల్య రూపంలో ఉన్నదా? ఎందుకంటే సమయము అమూల్యమైనది. సంకల్పము సర్వశక్తిమంతునిగా తయారు చేస్తుంది.
కావున బాప్‌దాదా పదే పదే చెప్తున్నారు, బాప్‌దాదా యొక్క గారాల పిల్లలారా! హృదయంలో ఉండే పిల్లలారా! ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తం చేయండి. సఫలం చేసుకోండి. సఫలం చేయడమే సఫలతను పొందడము. ఒక్క సెకండే కదా పోయింది అని అనుకోకండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము సఫలమయ్యే విధంగా అంతటి అటెన్షన్ స్వయంపై ఉంచండి. ఈ విధంగా ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యంగా ఉండద్దు. బాప్‌దాదా చెప్పారు కానీ మనం అర్థం చేసుకోలేదు, సమయం గురించి ఆలోచించలేదు, సమయం ఎంతో ఫాస్టుగా వెళ్తూ ఉంది, వెళ్తుంది. ఇప్పుడు బాప్‌దాదా అందరినుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు, నేను ఆలోచించలేదు - ఇటువంటి మాటలు ఇక వినదల్చుకోలేదు. ఇప్పుడు నూతన సంవత్సరం కూడా రాబోతుంది. ఈ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందే బ్రాహ్మణ ప్రపంచంనుండి నిర్లక్ష్యమును, అలాగే సోమరితనాన్ని కూడా తీసెయ్యండి. సోమరితనం కూడా భిన్న భిన్న ప్రకారాలుగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న సమయంలో ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి. నూతన సంవత్సరం మొదలయ్యేసరికి బాప్‌దాదాకు ధైర్యంతో సంకల్పం చేసి వీటికి వీడ్కోలు ఇచ్చేయండి. సంవత్సరంతోపాటు వీటికి కూడా వీడ్కోలు చెప్పండి. ఇవ్వగలరా? ఇవ్వగలము అని భావించేవారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) వాహ్! పిల్లలు వాహ్! చేతులెత్తడంలో మాత్రం బాప్‌దాదాను ఎంతగానో సంతోషపరుస్తారు. చాలామంది పిల్లలు చేతులెత్తినందుకు రిటర్నుగా స్మృతిని చేయడం బాప్‌దాదా చూసారు. కొంతమంది స్మృతిలో ఉండటంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. బాప్‌దాదాతో చాలా మంచిగా ఆత్మిక సంభాషణను చేస్తారు. అయిపోతుంది, బాబా మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది... బాప్‌దాదా కూడా నిర్లక్ష్యంతో ఉన్న ఇటువంటి పిల్లలు చెప్పేది విని నవ్వుకుంటారు, మరింకేమి చేస్తారు! మంచిదే, చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు... చెయ్యాలి అనే ఆలోచిస్తూ ఉంటారుకానీ చేస్తున్నారా లేక చెయ్యడం లేదా అన్న చెకింగ్‌లో మాత్రం ఎలా ఉన్నారు! నిర్లక్ష్యంగా ఉన్నారు.
మరి ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలకు, తమ తమ దేశాలలో, తమ తమ స్థానాలలో ఎవరెవరైతే చూస్తున్నారో వారందరూ బాప్‌దాదాకు చక్కగా కనిపిస్తారు, వినిపిస్తారు కూడా. బాప్‌దాదా సమ్ముఖంలో ఉన్నవారికి మరియు తమ తమ స్థానాల నుండి చూస్తూ, వింటూ ఉన్నవారికి ఇదే చెప్తున్నారు - ఇప్పుడు పురుషార్థానికి, సంకల్పానికి మరియు సంగమ సమయానికి అండర్లైన్ చేయండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ప్రేమ యొక్క ఆధారంతో మంచి అభివృద్ధినే సాధిస్తున్నారు. ప్రేమ కారణంగా, బాబా ప్రేమ తిరిగి లభిస్తున్న కారణంగా ముందుకు నడుస్తున్నారు కూడా. కానీ బాబా ఏమని భావిస్తున్నారంటే ఎలా అయితే ప్రేమలో అనుభవిగా అయ్యారో అలాగే స్మృతి యొక్క సబ్జెక్టులో అనేక జన్మల వికర్మలను వినాశనం చేసుకోవడంలో మరింత అటెన్షన్‌ను ఇవ్వండి. ఎందుకని? వికర్మలు వినాశనమైతేనే తోడుగా వెళ్ళగలరు, లేకపోతే వెనుక వస్తారు. ప్రేమకు రెస్పాండ్ అవ్వడము అంటే ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు చెప్పినట్లు చేయడమే. బాబా ఆశించేదేమిటంటే పిల్లల ప్రేమ బాబాతో ఉన్నప్పుడు తోడుగా ఉండాలి కదా! రాజధానిలోకి కూడా బ్రహ్మా బాబాతో పాటుగా రావాలి. రాజధానిలోకి రావడము అంటే రాయల్ ఫామిలీలోకి రావడము. సింహాసనంపై కూర్చోకపోయినాకానీ రాయల్ ఫామిలీలో అయితే రావాలి కదా. ఇందుకు గుర్తు ఏమిటో బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు. దీని పరిశీలన ఎలా చేస్తారు! మీరు ఎప్పటినుండైతే వచ్చారో, జ్ఞానంలో మీ వయస్సు ఎంత ఉందో అంత సమయము ఒకవేళ మీరు బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే, ఎవరైతే ఎక్కువ సమయము హృదయ సింహాసనముపై ఉన్నారో, మట్టిలో పాదము పెట్టలేదో వారు దాని అనుసారంగా రాయల్ ఫామిలీలో దగ్గరి సంబంధంలోకి వస్తారు. రాయల్ ఫామిలీ వారిగా ఉంటారు. మరి ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నవారు తోడుగా ఉండటంలో వెనుకబడరు. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారో వారు ద్వాపర కలియుగాల సంబంధాలలో కూడా ఉంటారు. దగ్గరగా ఉంటారు. అందుకే ప్రేమను నిలుపుకునేవారిగా, సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి మరియు జన్మ జన్మల హక్కును తీసుకోండి. అందుకే బాప్‌దాదా పిల్లలందరినీ ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్టులో మెజారిటీ పాస్ అయ్యారు అని బాబా సర్టిఫికేట్‌ను ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలోనూ పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి, పాస్ (దగ్గరగా) ఉండాలి.
మొదటిసారి వచ్చినవారు లేవండి. మొదటిసారి వచ్చారా! సగం క్లాసు క్రొత్తవారే ఉన్నారు. వచ్చారు, క్రొత్తగా వచ్చినవారికి బాప్‌దాదా స్వాగతం పలుకుతున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. లేట్‌గా వచ్చినాకానీ టూ లేట్ కన్నాముందే వచ్చారు. ఇప్పుడు కొద్ది సమయంలోనే తీవ్ర పురుషార్థిగా అయ్యి తమ భవిష్యత్తును ఎంతగా పెంచుకోవాలనుకుంటే అంతగా తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు ఎందుకంటే ఇప్పటికీ పురుషార్థానికి మార్జిన్ ఉంది. ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. బాప్‌దాదా మరియు ఈ దైవీ పరివారము మీకు తోడుగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి వైబ్రేషన్లు ఇస్తారు కావున ముందుకు సాగండి, ధైర్యమును ఉంచండి. ధైర్యము మీది, సహాయము బాప్‌దాదా మరియు పరివారము చేస్తారు. ముందుకు సాగండి. సరేనా! సరే అనండి, ముందుకు సాగండి. అచ్ఛా.
సేవ టర్న్ గుజరాత్ జోన్‌ది:- గుజరాత్ వారు లేవండి. చేయి ఊపండి. గుజరాత్ వారి సంఖ్యయే ఈ హాలులో సగంపైగా ఉంది. బాగుంది. గుజరాత్ నుండి మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్ఛా. మొదటిసారి వచ్చినవారిలో కూడా గుజరాతే ఎక్కువగా ఉంది. అచ్ఛా - అభినందనలు.
ఇప్పుడు గుజరాత్లో రెగ్యులర్‌గా వచ్చేవారు మరియు టీచర్లు లేవండి. అచ్ఛా. సేవలో అయితే గుజరాత్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎందులో నంబరు తీసుకోవాలి? సంఖ్యలో అయితే నంబరును తీసుకున్నారు. ఇప్పుడు నిర్విఘ్నంగా అవ్వండి. బాప్‌దాదా ఏదైతే చెప్తున్నారో అందులో ఇప్పటివరకు ఏ జోన్ పేరు కూడా రిజల్టులో లేదు. అందరి లక్ష్యమైతే ఉంది కానీ ఇప్పటివరకు ఈ విషయంలో నంబరు తీసుకోలేదు. బాప్‌దాదా ఏమి చూసారంటే నంబరు తీసుకోవాలని లక్ష్యమైతే ఉంది కానీ ప్రాక్టికల్‌గా ఇప్పుడు ప్లాన్ మాత్రమే తయారు చేస్తున్నారు. నేను నంబరు తీసుకోవాలి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ భావించండి. తీసుకోవాలి కదా? తీసుకోవాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే లేచారో వారు తమ తమ సెంటరుపై, ఒక్కొక్క ఏరియాపై అటెన్షన్ ఇచ్చి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు తయారీ చెయ్యగలరు కదా! అక్కడైతే రాజు, ప్రజలు అందరూ ఒక్కటిగా ఉంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. కానీ సంస్కారాలు అక్కడ నింపుకోరు కదా, ఇక్కడే నింపుకోవాలి. కావున బాప్‌దాదా అందరికీ చెప్తున్నారు, చిన్న జోన్ అయినా, పెద్ద జోన్ అయినా కానీ, ఈ రిజల్టును చూడాలనుకుంటున్నారు. చెప్పండి, నిమిత్తంగా ఉన్న దాదీలు లేక దాదాలు ఈ బహుమతిని ఎవరు ముందుగా తీసుకుంటారు? గుజరాత్ తీసుకుంటుందా? ఎప్పటిలోపు తీసుకుంటుంది? 6 మాసాలు కావాలా? 6 మాసాలు... త్వరగా చేస్తారా, అభినందనలు. దాదీలు చెప్పండి, మొదటి నంబరు ఎప్పుడు కనిపిస్తుంది? కనిపిస్తుంది కదా!
మధువనంవారు లేవండి, మధువనంవారు. అచ్ఛా. చేయి ఊపండి. శాంతివన్, పైన పాండవ భవనము, పైన ఉన్న మూడు స్థానాలు (పాండవ భవనము, జ్ఞాన సరోవరము, పీస్ పార్కు), క్రింద ఉన్న శాంతివన్ మరియు ఐదవది హాస్పిటల్ - అంటే 5 పాండవులు అయినట్లు. మరి ముందుగా మధువనంవారు ఏమి చేస్తారు? చేస్తాము అనేవారు చేతులెత్తండి. కలపడం తెలుసు కదా! మధువనంవారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంఘటనను పక్కా చేసుకుని తోడుగా చేసుకోండి. ఇతర విషయాలలో తోడుగా పెట్టుకోవడం కాదు, ఇందులో (లక్ష్యమును సాధించడంలో) తోడుగా చేసుకుని మొదటి నంబరు మధువనం తీసుకోవాలి. తీసుకుంటారా! ఇప్పుడు ఇలా చేయి పెట్టండి. గడిచిందేదో గడిచిపోయింది. ఏదైతే జరిగిందో అందరూ చూసారు, విన్నారు. మధువనంవారికైతే చాలా బంగారు అవకాశం ఉంది. మధువనంలో అందరూ వచ్చేసారు. ఒకవేళ మధువనం వారు కలిసి, పాండవ భవనమువారు వేరు, మరో స్థానము వేరు అని కాదు. మధువనం అంటే అంతా ఒక్కటే. మరి మధువనంవారు చేస్తాము అని భావిస్తున్నారా! చేస్తాము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చెయ్యడమేమీ పెద్ద విషయం కాదు, బాప్‌దాదా ఉన్నారు, దాదీలున్నారు, పెద్ద విషయమైతే కానే కాదు. దాదీలు ఏమని భావిస్తున్నారు? మధువనం వారైతే నంబరువన్. బాగుంది, ఇది చేసి చూపించమని బాప్‌దాదా అందరికీ చెప్పారు. కానీ మధువన్ అయితే మధువనమే. గుజరాత్ వారు చేసి చూపిస్తామన్నారు. మంచిది. అందరూ వైబ్రేషన్లు ఇవ్వండి. అయిపోతుంది. పెద్ద విషయమేమీ కాదు. విఘ్నం యొక్క నామరూపాలు ఉండవు. ఏదైనా విషయము జరిగినా కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాకానీ, సమాప్తము. కొంత సమయం క్రితం దాదీ ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాఁ జీ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. లేదు అని అనము అన్నారు. హాఁ జీ, చాలా మంచిది. మధువనం మొదటి నంబరులోకి వెళ్తుంది. బాప్‌దాదాకు మధువనంపై నషా ఉంది కదా! ప్రతి జోన్‌ను చూసి నషా ఉంది. ఇప్పుడు మధువనం ముందుకు వచ్చింది కానీ బాప్‌దాదా అన్ని జోన్లవారికీ చెప్తున్నారు, హాఁ జీ, మధురమైన ఆత్మ, ఇది అందరి పక్కా పాఠము. పక్కానే కదా? బహుమతి అయితే మధువనం తీసుకోవాలి. ఒక్క సెకండులో గతం గతః అని అనగలరా? సరే పురుషార్థీలే కావచ్చు, జరిగిపోయింది కానీ గతం గతః చేసేసి ఎగరండి. ఎగిరేవారు వెనుకదానిని విడిచిపెడ్తారు, అప్పుడే ఎగురగలరు. అయితే చాలా మంచిది.
ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చేయండి. బాప్‌దాదా ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనతను చేయమని చెప్పారు. బాప్‌దాదాకు సమాచారము లభించింది, మరి ఇప్పుడు దేశము మరియు విదేశములోని యూథ్ కలిసి ఏదైతే ఆరంభించారో దాని ద్వారా మంచి రిజల్టు రావచ్చు. ఇప్పుడైతే ఇన్వెన్షన్ ప్రారంభించారు. కానీ భారతము మరియు విదేశము రెండూ కలిసి మరింత అద్భుతము చేయగలదు. ఇప్పుడైతే ఆరంభించారు. కానీ ఢిల్లీవారు మంచి ధైర్యమును ఉంచారు. ఇప్పుడు ప్రారంభించారు, ఇది విశ్వంలో వ్యాపించాలి. అయితే విదేశము మరియు దేశము కలిసి ఒక్క బ్రాహ్మణ పరివారంగా అయ్యింది మరియు విశ్వం ఎదుట విశ్వాన్ని కూడా ఏకం చేస్తారు. మొదలైతే అయింది, ఇప్పుడు ముస్లింలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్య దేశాలనుండి వచ్చే విధంగా ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాము చేయండి. అందరూ ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరం సహోదరులు, సహోదరభావం వ్యాపించాలి, ఇది విశ్వంలో ప్రసిద్ధి చెందాలి. ఒకే స్టేజిపై అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తుల అనుభవం ఉండాలి. అందరూ ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు బేహద్‌లోకి వెళ్తుంది. ఇది ఒక్క గాడ్లీ పరివారము అని ప్రసిద్ధి కావాలి. ఇకపోతే ఎవరైతే వస్తున్నారో, సేవ కూడా చేస్తున్నారు, స్వ పురుషార్థం కూడా చేస్తున్నారు, మరియు ఇది గాడ్లీ కార్యము. ఇది కూడా ప్రపంచంలో ప్రసిద్ధి కావాలి. ఒక్క పరివారము. అచ్ఛా.
గుజరాత్ వారు సంకల్పమైతే తీసుకున్నారు, చాలా మంచిది. ఇప్పుడు ఏదైనా నవీనతను తీసుకురండి. ప్రతి జోన్ వారు ఏదో ఒక క్రొత్త ప్లాన్‌ను తయారు చెయ్యండి. కేవలం మధువనం వారు లేక పెద్ద పట్టణాల వారు మాత్రమే చేయడం కాదు, అందరి ప్లాన్లలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతలన్నింటినీ కలుపుకుని ప్లాన్ చేయండంటే మా ప్రోగ్రాము జరుగుతుంది అని అందరూ భావించాలి. ఎడిషన్ ఏదైనా చేయాలనుకుంటే తమ తమ ఆలోచనలను అందించవచ్చు. కేవలం ఇప్పుడు సందేశం వేగంగా వ్యాపించాలి. మిగిలి ఉన్నవారికి కొంత సమయమన్నా లభించాలి కదా, కొంతైనా వారసత్వాన్ని పొందాలి కదా. అంతిమంలో వస్తే ఏమి పొందుతారు! కావున ఆలోచించండి, త్వరత్వరగా ఎంతో కొంత వారసత్వాన్ని పొందాలి. లేకపోతే మీకు ఫిర్యాదు వస్తుంది. మాకు చివరలో ఎందుకు చెప్పారు, కొద్దిగా అయినా వారసత్వాన్ని తీసుకోనిచ్చి ఉండాల్సింది అని ఫిర్యాదు వస్తుంది. ముక్తి యొక్క వారసత్వమైతే అందరికీ లభిస్తుంది, కానీ జీవన్ముక్తి యొక్క వారసత్వము. అచ్ఛా.
గుజరాత్ నుండి 50 కన్యలు సమర్పణ అయ్యారు:- అచ్ఛా, శక్తి లభించిందా! సమర్పణ అవ్వడము అంటే బాప్‌దాదా చెప్పింది చెయ్యడము. బాప్‌దాదా చెప్పింది చెయ్యాలి అని సంకల్పము చేసారా? చేసినట్లయితే చేతులెత్తండి. ముందుకు వచ్చి సమర్పణ సమారోహమునైతే చేసారు కానీ మున్ముందు ఎటువంటి ట్రైనింగ్ చేస్తారు లేక సమర్పణ చేస్తారు? ఎటువంటి విఘ్నము వచ్చినాకానీ నిర్విఘ్నముగా చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. ఇంతటి శక్తి వచ్చింది కదా? సమర్పణలో ఇది కూడా ఉంది కదా! మరి సమర్పణ అయ్యారు, ఇప్పుడు ఇందులో కూడా నంబరును తీసుకోండి. నిర్విఘ్నంగా ఉంటాము మరియు స్థానమును కూడా నిర్విఘ్నంగా చేస్తాము. నంబరును తీసుకోండి. మంచిది. ఒక అడుగు అయితే వేసారు. ఇప్పుడిక అడుగులు ముందుకే వేయండి. బాగుంది. ముందుకు నడుస్తూ ఉండండి మరియు ఇతరులనూ నడిపిస్తూ ఉండండి. అచ్ఛా. ఇప్పుడు మీరు నోరు తెరవండి, గులాబ్‌జామూన్ తినండి. బాప్‌దాదా కూడా సమర్పణ యొక్క టోలీ తినిపిస్తున్నారు.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు అనగా డబల్ పురుషార్థీలు, డబల్ తీవ్ర పురుషార్థీలు. ఎంతో ఉల్లాస ఉత్సాహాలు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఎలా ఉన్నాకానీ మెజారిటీ ప్రతి సంవత్సరం మధువనానికి చేరుకుంటారు. పరివారము మరియు బాప్‌దాదాతో సమ్ముఖంగా కలుసుకునేందుకు ఉత్సాహం చాలా ఉంది. ఎలాగైనా చేసి జమ చేస్తారు, వీరు తమ టికెట్టు కోసం జమ చేసుకునే భిన్న భిన్న విధానాలు చాలా బాగుండటాన్ని బాప్‌దాదా చూసారు. ఎలా అయినా చేసి ప్రతి సంవత్సరం మెజారిటీ చేరుకుంటారు. విదేశాన్ని కూడా ఇండియా చేసేసారు. మధువన వాతావరణంపై మరియు బాప్దాదాపై ప్రేమ ఉంది. ఈ ఉల్లాస ఉత్సాహాలు మరియు జమ చేసుకునేందుకు వీరు చేసే ప్రయత్నాలు చూసి బాబాకు హృదయంలో ఎంతో ప్రేమ కలుగుతుంది. వాహ్ విదేశీ వాహ్! మొదట్లో పెద్ద విషయంలా అనిపించేది కానీ ఇప్పుడు ఎలా వస్తున్నారంటే ఇండియా నుండి ఇతర గ్రూపులవలె వస్తున్నారు. ఇప్పుడు విదేశీయులులేని గ్రూపు లేదు. మధువనం లేక పూర్తి విశ్వ పరివారంపై ప్రేమ అంటే ఇది. బాప్‌దాదాతో అయితే ప్రేమ ఉండనే ఉంది. అందరూ బాప్‌దాదాతో మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు. బాప్‌దాదా అమృతవేళలో కూడా విదేశంలో తిరుగుతారు. బాప్‌దాదాకు రావడానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? అక్కడ కూడా బాప్‌దాదా తిరుగుతారు. ఎలా ఉన్నారని బాప్‌దాదా చూస్తారు. తపన ఉంది, మగ్నమయ్యేందుకు మంచి పురుషార్థాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మెజారిటీ విదేశీయులలో ఒక తపనను చూడడం జరిగింది. ఎలా అయితే ఇండియాలో స్థానాలేవీ మిగిలి ఉండకూడదు అని సేవ చేస్తున్నారో అలాగే విదేశాలలో కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఎంత వీలైతే అంత తిరుగుతూ సేవను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విదేశాలలో ఎన్ని దేశాలలో సెంటర్లు ఉన్నాయి? (137 దేశాలలో సేవ జరుగుతుంది) ఎన్ని సంవత్సరాలలో ఇన్ని తయారయ్యాయి? (లండన్వారు 2011లో 40 సంవత్సరాలు జరుపుకుంటారు) బాగుంది, చప్పట్లు కొట్టండి. (కొన్ని ప్రదేశాలలో స్పెయిన్, మెక్సికో వంటి దేశాలలో 30 సంవత్సరాలు జరుపుకుంటున్నారు) బాగుంది, మీ అందరికీ కూడా ఇది విని సంతోషంగా ఉంది కదా? ఎందుకని? ఇండియావారైనా, విదేశమువారైనా కనీసం బాబా వచ్చారు అన్న సందేశాన్ని అయితే అందించండి. నా తండ్రి వచ్చారు కానీ నాకు సందేశం లేదు అని ఎవ్వరూ అనకూడదు. ఇండియాలో కానీ, విదేశంలో కానీ, ఎంతో కాలం నుండి రాకపోయినా కానీ భగవంతుడు వచ్చారు అన్న సందేశం అందరికీ అందాలి. భగవంతుడు వచ్చారు, వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, ఈ సందేశాన్ని అందుకోవడంలో ఎవ్వరూ మిగలకూడదు. సందేశము ఇవ్వడము మీ పని, నడవడము వారి పని. కానీ, ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ సందేశమును అందించడము మీ పని. ఇప్పుడు ఎలా అయితే సైన్సు యొక్క సాధనాలు పెరుగుతున్నాయో, ఏ విషయమైనా ఎంతో త్వరగా చేరుకుంటుంది, అలాగే అందరికీ సందేశము అందే విధంగా ఏదైనా ప్లాన్‌ను ఆలోచించండి. వీలవుతుందా? వీలవుతుందా? కష్టమా? లేదు. మరి ఇప్పుడు లిస్టును తయారు చెయ్యండి. భారతదేశంలో ఎంతవరకు సందేశం చేరుకుంది, విదేశంలో ఎంతవరకు సందేశం చేరుకుంది? ఏదైనా సాధనము ఆలోచించండి, సైన్సు సాధనము కావచ్చు, సంబంధాలు పెంచుకునే సాధనము కావచ్చు కానీ ఫిర్యాదు రాకూడదు. ఇంకా సందేశము అందని దేశాలు చాలానే ఉండవచ్చు. చాలా మంచి సాధనాలు వస్తున్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్న ప్లాన్‌ను ఆలోచించవలసి ఉంటుంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి రోజూ ప్రతి గంట ముందుకు సాగుతున్నందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. మీరు సమాప్తి యొక్క సమయాన్ని ఎంత సమీపంగా తీసుకురావాలనుకుంటే అంత సమీపంగా తీసుకురావచ్చు. సమయం వచ్చినప్పుడు తయారవుతాము అన్న సంకల్పము బ్రాహ్మణులైన మీకు రాకూడదు, మీరు సమయాన్ని సమీపంగా తీసుకురండి. ‘ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమయము అను నన్ను సమీపంగా తీసుకురావాలి’ అని సమయము బాబాకు చెప్తుంది. ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురండి అని ప్రకృతి కూడా బాబాకు చెప్తుంది. మరి బాప్‌దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ఏమని జవాబు ఇవ్వాలి? సమయము వచ్చేసినట్లే అని చెప్పనా! మీ తరఫున ఈ జవాబు చెప్పమంటారా? ఏమని జవాబు ఇవ్వాలి? చెప్పండి. ఏమని జవాబు ఇవ్వాలి? ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురావడము అంటే స్వయాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసుకోవడము ఎందుకంటే బాప్‌దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లలతో సహా వెళ్తారు. మరి డేట్‌ను ఫిక్స్ చేయండి. ఎప్పటిలోపు? పని అయితే ఇచ్చాము, ఇక పరస్పరము సలహా తీసుకోండి. ప్రకృతికి బాప్‌దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ప్రకృతి చాలా అలజడిలో ఉంది. దుఃఖంలో ఉన్న ఆత్మలు మనసులో ఎంతో మొర పెట్టుకుంటున్నాయి. మనసా సేవను ఇప్పుడు మరింత పెంచండి. మనసా సేవను చేస్తున్నారు కానీ దానిని నిరంతరం పెంచుతూ ఉండండి ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖంలో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నాయి. మీరు వారికి శాంతి, సుఖము యొక్క అనుభూతిని చేయించండి. ఒక్క సెకండు కోసమైనా వారు శాంతిని అనుభవం చేయాలనుకుంటున్నారు. కొద్దిగా శాంతిని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా ఫర్వాలేదు, కొద్దిగా లభిస్తే చాలు అన్నట్లుగా ఉంది. కావున ఇప్పుడు మనసా సేవను పెంచండి. వాచ అయితే జరుగుతూనే ఉంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, బాప్‌దాదా ఏదైతే హోమ్‌వర్కును ఇచ్చారో అది గుర్తుంచుకోండి, గుర్తు చెయ్యండి. అచ్ఛా.
బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకు, విశ్వ కళ్యాణ కర్తవ్యంలో సదా ముందుకు సాగేవారికి బాప్‌దాదా దృష్టిని ఇస్తూ హృదయపూర్వక ప్రేమ మరియు అభినందనలు, అభినందనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చుని కూడా సమ్ముఖాన్ని అనుభవం చేస్తున్నారు మరియు బాప్‌దాదా పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకుని అందరికీ నమస్తే నమస్తే చేస్తున్నారు.
దాదీలతో:- (బాబా ఫోర్సు అందరినీ ప్రేరేపిస్తుంది, త్వరలో అందరికీ సందేశం లభిస్తుంది) చేరుతుంది కానీ ఈ సంస్కారాలు ఉన్నాయి కదా, వింటున్నప్పుడు ఫోర్సు వస్తుంది కానీ మధ్యలో ఈ సంస్కారాలు తెరను వేసేస్తాయి. బాబా అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు సంగఠనలో ఈ ప్రతిజ్ఞను చేయండి, మేమంతా కలిసి చేసి చూపిస్తాము మరియు రోజూ పరస్పరంలో తోడుగా ఉన్నవారు, అందరూ కలిసి ఇచ్చి పుచ్చుకోవడాలు చేసి నిద్రించండి అప్పుడు ఈరోజు సంపన్నమైనట్లు.
మోహిని అక్కయ్యతో:- (కాళ్ళు కదలడం లేదు) అయిపోతుంది. మధ్యలో చేసిన ఒక పొరపాటు కారణంగా పెరిగింది. కొద్దిగా ఆహార విషయంలో శ్రద్ధ వహించండి. లభించిన డైరెక్షన్ అనుసారంగా నడుచుకోండి, అయిపోతుంది.
(బాబా, శరీరాలను యవ్వనంగా చేయండి) ఇది డ్రామా చేతిలో ఉంది, బాబా చేతిలో లేదు. (బాప్‌దాదా చేతిలోనే ఉంది) అది టెంపరరీగా పని జరిపించడానికి మాత్రమే.
పర్దాదీతో:- చూడండి, వీరు సంతోషంగా ఉంటారు.
రమేష్ అన్నయ్యతో:- మీరు తయారు చేసిన ప్లాన్ సరైనదే. చేయవచ్చు. కూర్చుని మీ ప్లాన్‌ను తయారుచేసి ప్రారంభించవచ్చు. క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లు ఏమేమి వస్తున్నాయి, వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగము ఉంటుంది అని ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నవి జరుగుతాయి, నవీనతను ఆలోచించండి.
శాంతి అక్కయ్యతో:- అనారోగ్యంలో కూడా స్వయాన్ని నడిపించుకోవడము చక్కగా వచ్చేసింది. నాకు అనారోగ్యం ఉంది, నాకు అనారోగ్యం ఉంది అంటూ కూర్చుండిపోకుండా నడిపించడం మీకు వచ్చేసింది. (బాబా మీకు థ్యాంక్స్) మీకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే శరీరాన్ని నడిపించుకోగలుగుతున్నారు.
గోలో అన్నయ్య శాంతివన్లో సోలార్ పెట్టిస్తున్నారు:- మున్ముందు ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్న భయము ఇక లేదు కదా. ఎందుకంటే అందరి సంకల్పము ఉంది, అందరి ఉత్సాహం ఉంది కనుక కావలసిందే. అందుకే అందరి సంకల్పము తీసుకువస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి