Search for a command to run...
24 Oct 2010
సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ-సంస్కారాలను పరివర్తన చెయ్యడంలో తీవ్రతను తీసుకురండి, మనసు ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి
24 October 2010 · తెలుగు
ఈరోజు నలువైపుల ఉన్న పరమాత్మ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు విశ్వపు సింహాసనాధికారి పిల్లలను చూసి బాబా హర్షిస్తున్నారు. ఈ పరమాత్ముని హృదయ సింహాసనము కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. భృకుటి సింహాసనమైతే అందరి వద్ద ఉంది. కానీ పరమాత్మ సింహాసనం కేవలం బ్రాహ్మణ ఆత్మల భాగ్యంలో మాత్రమే ఉంది. ఈ పరమాత్ముని సింహాసనము విశ్వపు సింహాసనాన్ని ఇస్తుంది. బ్రాహ్మణులైన మీరే ఈ మూడు సింహాసనాలకు అధికారి ఆత్మలు. ఈ పరమాత్ముని సింహాసనము ఎంతో శ్రేష్ఠమైనది. మరే ఇతర యుగంలోనూ పరమాత్ముని సింహాసనము లభించదు. పరమాత్ముని సింహాసనము అని గాయనము కూడా ఉంది. పరమాత్ముని సింహాసనానికి అధికారులైన వారు భక్తి మార్గంలో కూడా మాలలోని పూసల రూపంలో గాయనం మరియు పూజ ఉంటాయి. కోట్లలో కొద్దిమంది రూపంలో గాయనం చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క పూసను ఎంతో ఉన్నతమైన దృష్టితో చూస్తారు. మరి మీ అందరికీ నషా ఉంది కదా! నషా ఉందా? మేము తప్ప మరెవ్వరూ ఈ సింహాసనాన్ని అనుభవం చేయలేరు అని నషా ఉందా? బ్రాహ్మణులైన మీ అందరికీ ఇది జన్మ సిద్ధ అధికారము. మీ కొరకు ఈ సింహాసనము మెడలోని హారము వంటిది. మేము భగవంతుని హృదయ సింహాసనానికి అధికారులము అన్న నషా ఉంటుందా? ఈ నషా మరియు సంతోషము అందరికీ సదా స్మృతిలో ఉంటుందా? నేను ఎవరిని! ఈ నిశ్చయము మరియు నషా ఉంటుందా?
బాప్‌దాదా అయితే మూడు సింహాసనాలకూ అధికారులైన ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు, వాహ్ నా శ్రేష్ఠ అధికారి పిల్లలు, వాహ్! పిల్లలంటారు, వాహ్ బాబా వాహ్! అని, బాబా అంటారు వాహ్ పిల్లలు, వాహ్! అని. స్వయంగా బాబాయే ఇటువంటి పిల్లల గాయనం చేస్తారు. మరి నేను ఎవరిని అన్న నషా ఉన్నదా? ఎంతగా నిశ్చయముంటుందో అంతగా నషా కూడా ఉంటుంది. నిశ్చయంతో కూడిన నషా మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. ఎవరికైతే నిశ్చయముంటుందో వారికి నషా తప్పకుండా ఉంటుంది. బాప్‌దాదా కూడా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ముఖము మరియు నడవడికతో ఆత్మలకు అనుభవం చేయించాలని ఆశిస్తున్నారు. వాణి ద్వారా అయితే అనుభవం చేయిస్తున్నారు, ఇప్పుడు అనుభవం చేసుకునే కార్యం మొదలయ్యింది. మొదట్లో విని ఆలోచించేవారు, ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీ స్థితి యొక్క ప్రభావం అనుభవం అవుతుంది. కావున మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నేను రోజంతా ఎంత సమయం పరమాత్ముని హృదయ సింహాసనంపై ఉంటున్నాను? ఎందుకంటే ఈ హృదయ సింహాసనము విశ్వ రాజ్యాన్ని ప్రాప్తింపజేయడానికి ఆధారము. ఎంత సమయము మీరు హృదయ సింహాసనానికి అధికారులుగా ఉంటారో అంత ఎక్కువ సమయము భవిష్యత్తులో రాజ్యవంశంలో అధికారులుగా అవుతారు. నేను బ్రాహ్మణునిగా అయినప్పటి నుండి ఎంత సమయము హృదయ సింహాసనాధికారిగా ఉన్నాను అని పరిశీలించుకోండి. దీని ఆధారంతో సింహాసనంపై అయితే నంబర్‌వారీగా కూర్చుంటారు కానీ సదా రాజ్య కుటుంబంలో, వంశంలో అధికారులుగా అవుతారు. ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? హృదయ సింహాసనం నుండి క్రిందకు దిగిపోవడం లేదు కదా? మీ లెక్కను మీరే చూసుకోండి ఎందుకంటే దీని ఆధారంతోనే మీరు సదా రాజ్య వంశంలోకి వస్తారు. సింహాసనాన్ని వదిలిపెట్టి మట్టిలో అడుగు పెట్టడంలేదు కదా అని పరిశీలించుకోండి! దేహభానమనే మట్టిలో కాలు పెట్టడం 63 జన్మల నుండి ఉన్న సంస్కారము. ఒకటి దేహభానము మరియు రెండవది దేహ అభిమానము. దేహ అభిమానపు మట్టి లోతైనది కానీ దేహ భానము కూడా మట్టియే. మనిషి చనిపోయినప్పుడు, కాల్చివేసేటప్పుడు కూడా మట్టి మట్టిలో కలిసిపోయింది అని అంటారు కదా. మరి మట్టిలో అడుగు పెట్టడం లేదు కదా అని పరిశీలించుకోండి! దేహ భానంలోకి రావడమంటే మట్టిలో అడుగు పెట్టడమే.
బాప్‌దాదా శ్రేష్ఠ ఆత్మలైన మీకు మూడు సింహాసనాలను ఇచ్చారు ఎందుకంటే గారాల పిల్లలు కదా, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు కూడా. గారాల పిల్లలను ఊయలలో కానీ, ఒడిలోగానీ పెట్టుకుంటారు. మట్టిలో కాలు పెట్టనివ్వరు. బాప్‌దాదా కూడా మూడు సింహాసనాలకు అధికారులైన పిల్లలకు భిన్న భిన్న ఊయలలను ఇచ్చారు. ఒకసారి శాంతి అను ఊయలలో ఊగండి, ఒకసారి సుఖము అను ఊయలలో ఊగండి, మరోసారి ప్రేమ అను ఊయలలో ఊగండి. సింహాసనము మరియు ఊయలలోనే కాలు పెట్టండి. మేము భవిష్యత్తులో ఎక్కడ వస్తాము? ఏమవుతాము? అని కొంతమంది పిల్లలు అడుగుతారు. అందుకు బాబా అంటారు, చెక్ చేసుకోండి, ఎంత సమయం నుండైతే వచ్చారో అంత సమయం ఊయలలో మరియు సింహాసనంపై ఉన్నారా? ఎంతగా ఉన్నారో అంతగా భవిష్యత్తులో రాయల్ వంశంలో ఉంటారు. రాయల్ ప్రజలోకి కూడా రారు, రాయల్ వంశంలోకి వస్తారు. కావున ఈ లెక్క ప్రతి ఒక్కరూ తమది తాము తీయండి. ఆలోచించండి. ఇతరులను చూడకండి, మీ లెక్కను చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏమి కోరుకుంటారు? రాయల్ వంశంలో, రాజ్య వంశంలో ఉండాలనే కదా. ఇప్పుడు సమాప్తి అయితే అకస్మాత్తుగా రానుంది. సమాప్తి అయ్యేలోపు ఎంత ఎక్కువ సమయము బాబా ఒడిలో, సింహాసనంపై, ఊయలలో ఉంటారో అంత సమయము రాయల్ కుటుంబంలో రాయల్ వంశంలో భాగ్యాన్ని పొందుతారు.
బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరికీ పూర్తి సమయము 21 జన్మలు రాయల్ వంశంలో, సూర్యవంశమైనాగానీ చంద్రవంశమైనాగానీ రెండు యుగాలలో రాయల్ ఫామిలీలో ఉండే అధికారాన్ని ఇస్తున్నారు. కానీ అధికారాన్ని తీసుకోవడము పిల్లలపై ఆధారపడి ఉంది. బ్రహ్మా బాబాపై మీకు ప్రేమ ఉంది, అలాగే బ్రహ్మా బాబాకు కూడా పిల్లలపై మీపై ప్రేమ ఉంది. బ్రహ్మా బాబా పిల్లలైన మిమ్మల్ని తమతోపాటు రాయల్ వంశంలో చూడాలని ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు – బ్రహ్మా బాబాకు దగ్గరగా రాయల్ వంశంలో ఉండేవారా లేక కొద్ది సమయం మాత్రమే ఉండేవారా? దూరంగా వెళ్ళాలని అనుకోవడం లేదు కదా! సంగమయుగమే ఇందుకు ఆధారము అని వినిపించడం జరిగింది. బాప్‌దాదాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా బాబా మరియు బ్రాహ్మణులు కలిసి ఉన్నారు, అవ్యక్త రూపంలో ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు.
ఇప్పుడు బాప్‌దాదా ఏమి చూసారంటే మాయ ఇప్పటివరకూ పిల్లల్ని వదిలి పెట్టలేదు. మాయకు కూడా మీపై ప్రేమ ఉంది. ఈరోజుల్లో విశేషంగా రెండు రూపాలలో మాయ ఛాన్సు తీసుకుంటుంది. రెండు రూపాలలో వస్తుంది - ఒకటి వ్యర్థ సంకల్పాలు మరియు రెండవది అక్కడక్కడ, అప్పుడప్పుడు నేను చేసింది, ఆలోచించింది రైటు, నేను తక్కువేమీ కాదు అన్న అల వస్తుంది. నేనే రైటు అన్న అల వస్తుంది. కానీ కనెక్షనులో ఉన్నవారు, నిమిత్తమైనవారు కూడా మీ ఆలోచనలకు సహకారమివ్వవచ్చు! ఇతరుల నుండి వెరిఫికేషన్ కూడా పొందవలసి ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృధా చేస్తాయి. అందుకే బాప్‌దాదా మురళిని మననం చేయమని, సేవను చేయమని రోజూ హోమ్‌వర్కును ఇస్తారు. ఒకవేళ మననం చేసినా లేక మననం చేస్తూ మగ్నమైపోయినాగానీ ఈ హోమ్‌వర్కు మనసును బిజీగా ఉంచే సాధనము. వినడము, మననము చేయడము మరియు మగ్నమవ్వడము అనే వాటిని అందుకే బాప్‌దాదా రోజూ హోమ్వర్కుగా ఇస్తారు. ఎలా అయితే పిల్లలకు ఎంత ఎక్కువ హోమ్‌వర్కును ఇస్తారంటే వారి బుద్ధి దానిని పూర్తి చేయడంలోనే ఉంటుందో అలాగే రోజూ మురళి, అందులో నాలుగు సబ్జెక్టుల హోమ్‌వర్కు ఉంది. మనసుకు కూడా ఉంది, వాణికి కూడా ఉంది, కర్మల పట్ల ఉంచాల్సిన అటెన్షన్ కూడా ఉంటుంది మరియు దివ్యత గురించిన సూచనలు కూడా ఉంటాయి. కావున హోమ్‌వర్కులో బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ విధిని మీ సొంతం చేసుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలు స్వతహాగా మీ నుండి వీడ్కోలు తీసుకుంటాయి ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే, స్మృతి యాత్రపై అందరికీ నంబరువారీగా అటెన్షన్ ఉంది. వాచ సేవపై కూడా అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు తమ సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చేయడము, ఈ స్వభావ సంస్కారాలను మీరు రాయల్ రూపంలో నేచర్ అని అంటారు, నా నేచర్, భావం లేదు కానీ నేచర్ ఉంది, ఈ ధారణ సబ్జెక్టు ఇప్పటికీ రాయల్ రూపంలో వస్తూనే ఉంది. ఇప్పుడు ఏ ధారణలలో అయితే లోటు ఉందో అందులో విశేషమైన అటెన్షన్ ఉంచండి అని బాప్‌దాదా సూచన ఇస్తున్నారు.
బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, ఇప్పుడు ధారణలో ఈ ముఖ్యమైన ధారణపై అటెన్షన్ పెట్టండి, ఏదైనా జరిగితే సెకండులో ఫుల్స్టాప్ పెట్టగలరా! లేక ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటూ క్వెశ్చన్మార్కు వస్తుందా? ఫుల్స్టాప్ కాదు, సగం ఫుల్స్టాప్ పెడ్తున్నారు. మున్ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మీరు సెకండులో ఫుల్స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలను సరి చేస్తూ కూర్చునే సమయం ఉండదు. సెకండులో ఫుల్స్టాప్ పెట్టే అవసరముంటుంది. ఇందుకోసం ఎంతో కాలం నుండి అభ్యాసం కావాలి, అప్పుడే సమయానికి విజయులుగా అవ్వగలరు. అలజడి సమయంలో స్వభావ సంస్కారాల పేపరు వచ్చినప్పుడు అందుకోసం ఇప్పటినుండే ఆ సమయం కోసం పురుషార్థం చేయండి. ఈ బహుకాలపు అభ్యాసము మున్ముందు మీకు ఎంతో సహయోగిగా అవుతుంది.
బాప్‌దాదా అమృతవేళ తిరుగుతూ అందరి పురుషార్థాన్ని పరిశీలిస్తారు. నాలుగు సబ్జెక్టులలో పురుషార్థం తీవ్రంగా ఉందా లేక సాధారణంగా ఉందా? మరి ఏమి చూసారు? సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు పురుషార్థంలో సదా తీవ్ర పురుషార్థం యొక్క అవసరముంది. సమయము తీవ్రగతితో సమాప్తికి దగ్గరగా వెళ్తుంది అని బాప్‌దాదా సూచన ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారంగా స్వభావ సంస్కారాల పరివర్తనలో విశేషంగా తీవ్రగతిని తీసుకురావాలి.
బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరినీ సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. మీ లక్ష్యం కూడా బాబా సమానంగా అవ్వాలనే కదా. ఇందుకు అన్నిటికన్నా సహజమైన సాధనము – బ్రహ్మా బాబాను అనుసరించడము. టాలీ చేసి చూడండి, ఏ కర్మ చేసినాకానీ ముందు పరిశీలించుకోండి, సమానంగా ఉంచండి. బ్రహ్మా బాబా ఈ విధమైన కర్మ, మాట లేక సంకల్పాలు చేసేవారా? ముందు ఆలోచించి తర్వాత చేయండి అని అంటారు కూడా. మాట్లాడే ముందు తూచి తర్వాత మాట్లాడండి. బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారో విన్నారా? మీరు కూడా ఆశిస్తున్నారు. ఆత్మిక సంభాషణ జరిగేటప్పుడు ఎంతో మధురాతి మధురమైన మాటలను బాబా వింటారు. ఉల్లాసంతో కూడిన మాటలు కూడా ఎన్నో చెప్తారు, ఇది చేసి చూపిస్తాము, ఇది చెయ్యాల్సిందే, ఇది జరగాల్సిందే. సంకల్పాలు ఎంతో ఉల్లాసంతో నిండి ఉంటాయి కానీ అవి కర్మల వరకు వచ్చేసరికి కొన్ని మారిపోతాయి, కొన్ని మాత్రమే జరుగుతాయి. సేవ గురించి భిన్న భిన్న ప్లాన్లు ఏవైతే ఆలోచిస్తున్నారో అవి బాప్‌దాదాకు నచ్చాయి. అనేక చోట్ల ప్రోగ్రాములు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వాచ ద్వారా లేక భిన్న భిన్న విధుల ద్వారా సేవను చేస్తున్నారు, సఫలత కూడా వస్తుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు కూడా. ఇప్పుడు కేవలం మనసా ద్వారా అనేక ఆత్మలకు సుఖము, శాంతి, సంతోషము, ప్రేమ యొక్క కిరణాలను అందించండి. ఈ సేవను కూడా కలిపి చేయండి. స్వయం యొక్క సంస్కార పరివర్తన లేక ఇతరుల సంస్కారాలకు సహయోగమివ్వడంలోనే కొందరి సమయం ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. కావున మనసా సేవ ద్వారా భిన్న భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి, ఇందులో అటెన్షన్. మున్ముందు దీని అవసరం ఎంతో ఉంటుంది. దీనిపై కూడా శ్రద్ధ వహించండి. ఎవరైతే ఈ సేవను నేను చేస్తున్నాను అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా. చేస్తున్నవారికి అభినందనలు. ఎవరైతే చేయడం లేదో వారు చేయాలి ఎందుకంటే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వినేవారు, వినిపించేవారు ఇద్దరూ కలుసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఈ సేవను ఎంత వీలైతే అంత ఇప్పటి నుండే అలవాటు చేసుకోండి. మనసు బిజీగా కూడా ఉంటుంది, అప్పుడు మన్మనాభవలో ఉండటం సహజమవుతుంది. మనసు బిజీగా ఉండటం ద్వారా స్వభావ సంస్కారాలను సహజంగా పరివర్తన చేసుకోవడంలో సహాయం లభిస్తుంది.
ఈరోజు విశేషంగా డబల్ విదేశీయుల మిలనం రోజు, బాప్‌దాదాకు సంతోషంగా ఉంది వాహ్ డబల్ విదేశీయులు వాహ్! బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, విశ్వంలోని నలు మూలలలో దాగి ఉన్న కల్ప క్రితపు పిల్లలు, డబల్ విదేశీయులు విశ్వ సేవలో నిమిత్తమై ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాలలో, గ్రామాలలో, పట్టణాలలో మిగిలిపోయిన స్థానాలకు చేరుకునే ప్లానును తయారు చేస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇందుకు అభినందనలు, అభినందనలు. లేకపోతే సమాప్తి అవుతున్నప్పుడు, పరిస్థితులు మారిపోతాయి. మీ అందరికీ దేశంగానీ, విదేశంగానీ, చాలా-చాలా-చాలా ఫిర్యాదులు లభిస్తాయి - మా తండ్రి వస్తే మీరు మాకు చెప్పలేదు అని అంటారు. సందేశమైతే ఇస్తారు, కానీ ఎన్నో ఫిర్యాదులు వస్తాయి. కావున ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేయండి, ఏ మూల కూడా మిగలకూడదు, ఇందుకు ప్రయత్నించండి. డబల్ విదేశీయులుగానీ, దేశంవారుగానీ ఇద్దరు పిల్లలు నలువైపుల ఎవరైతే తమ పురుషార్థాన్ని చేస్తున్నారో వారిని చూసి బాప్‌దాదా చాలా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకని? ఎందుకని సంతోషిస్తున్నారు? ఇప్పుడు దేశంలో, విదేశంలో ఈ ప్లానును తయారు చేస్తున్నారు, బాప్‌దాదాకు నచ్చింది, ఏదో ఒక సాధనంతో సందేశం చేరుకోవాలి. నిజానికి ఈ సైన్సు మీకు సమయానికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజురోజుకూ సాధనాలు క్రొత్తక్రొత్తవి వస్తూ ఉంటాయి. వాటిని నిర్విఘ్నులై కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి. సేవలను పెంచడానికి ఎక్కడ మీటింగులు పెట్టినాగానీ బాప్‌దాదా వాటిని వింటారు మరియు సంతోషిస్తారు, పిల్లలు సాధనాలను సేవలో వినియోగించడానికి బుద్ధిని ఆల్రౌండుగా ఉపయోగిస్తున్నారు. కావున ఏ ప్లానైతే తయారు చేస్తారో దానిని బాప్‌దాదా వింటారు, తిరుగుతూ ఉంటారు కదా. మీరు ఎక్కడైనా మీటింగు చేయండి, ఢిల్లీలో చేయండి, దేశంలో చేయండి, పట్టణంలో చేయండి, విదేశాలలో ఎక్కడైనా చేయండి, బాప్‌దాదా అన్నీ వింటారు. బాప్‌దాదా వద్ద కూడా సాధనాలున్నాయి. ఇందుకోసం విదేశాల నుండి, ఒక్కొక్క దేశం నుండి ఎవరెవరైతే వచ్చారో బాప్‌దాదా వారికి, ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తారు? చాలా-చాలా ప్రేమను ఇస్తారు. ఇప్పుడు కొద్దిగా తీవ్రతను తీసుకురండి. ప్లానును ప్రాక్టికల్లోకి క్రొత్త క్రొత్తగా తీసుకురండి. యజ్ఞం ఆరంభం అయ్యే కొన్ని సంవత్సరాల ముందే ఈ సాధనాలు తయారవ్వడం ప్రారంభమయ్యాయి. సైన్సు కూడా మీ సేవలో సహయోగిగా ఉంది. బాగా లాభాన్ని తీసుకోండి. మీకోసమే తయారవుతున్నాయి. రోజురోజుకూ ఎన్ని క్రొత్త క్రొత్త వస్తువులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయో చూడండి. ఈ డ్రామా మీకు సహయోగమును ఇస్తుంది. సాధనాలు మీకు సహకరిస్తున్నాయి. అచ్ఛా.
అందరూ సదా సంతోషంగా ఉన్నారు కదా! సదా సంతోషంగా ఉన్నారా? ఎవరైతే సదా సంతోషంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి, సదా సంతోషము. ఏదన్నా విషయము వచ్చినా కానీ సంతోషము ఉంటుందా? పరిస్థితులు వస్తాయి కదా, అయినాకానీ సంతోషంగా ఉంటున్నారా? ఉంటున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. వెల్కమ్ చేస్తారు కదా! గాబరా పడటం లేదు కదా, వెల్కమ్ చేస్తున్నారు కదా. అనుభవిగా చేస్తున్నాయి. ఈ విఘ్నాలు అనుభవం యొక్క అథారిటీని పెంచుతాయి. మాయ వచ్చింది, మాయ వచ్చింది అని అనకండి. ఇది పేపరు. మాయ-మాయ అంటూ మాయను ముందుకు పంపిస్తున్నారు. పేపరు అది. మాయను మీరు తెలుసుకున్నారు. మాయ ఏమిటి అని ఎన్ని సంవత్సరాల నుండి తెలుసుకున్నారు. కావున మాయను చూసి గాబరా పడవద్దు. పేపరు అని భావించి సంతోషంగా పేపరు వ్రాయండి మరియు అనుభవము అనే క్లాసులో ముందుకు వెళ్తూ ఉండండి. ఇది క్లాసులో ముందుకు వెళ్ళడమే కానీ గాబరా పడేది లేదు. ఏమి చెయ్యను, ఎలా చెయ్యను అని ఆలోచించడం బ్రాహ్మణుల పని కాదు. మీరు త్రికాలదర్శి ఉన్నారు. ఏమిటి, ఎందుకు, ఎలా అని రాకూడదు. పేపరు వస్తే అనుభవం అనే క్లాసులో సంతోషంగా ముందుకు వెళ్ళండి. సంతోషంగా ఉండండి. ఇప్పుడైతే అనుభవిగా అయ్యారు, అవుతూ ఉంటారు. అచ్ఛా.
విదేశీ టీచర్లు చేతులెత్తండి. టీచర్లు అనగా బాబా సమానము ఎందుకంటే ఎలా అయితే బాబా రోజూ మురళి వినిపిస్తారో, అలాగే మీరు కూడా మురళిని నడిపించడానికి సింహాసనాధికారులు. కావున బాబాకు సహచరులు. సహచరుల రూపంలో బాప్‌దాదా టీచర్లందరికీ, ఇండియాగానీ, విదేశంగానీ, టీచర్లందరికీ విశేషంగా బాబా ఏమిస్తున్నారు? శభాష్ పిల్లలు శభాష్! అచ్ఛా.
ఇప్పుడు ఎవరైతే ఇక్కడ హాలులో కూర్చుని ఉన్నారో, ఎక్కడి వారైనాకానీ, మళ్ళీ మధువనానికి వచ్చి బాబాను కలుసుకునేసరికి బాప్‌దాదా మీలో ఏమి చూడాలని ఆశిస్తున్నారు? చెప్పమంటారా? ఇది నాలో ఉండకూడదు అని మీరు స్వయం గురించి ఏదైతే భావిస్తారో, ఇది నాలో ఉండకూడదు అని అందరికీ తమ గురించి తెలుసు. దానిని పరివర్తన చేసి రావాలి. చేస్తారా? ఇందులో మిమ్మల్ని మీరే చూసుకోవాలి ఎందుకంటే ఇతరులెవ్వరూ ఇది చూడలేరు. మరి ఇది చెయ్యడానికి ఎవరు తయారుగా ఉన్నారు? రెండు చేతులనూ ఎత్తండి. బిందువు పెట్టేసారు కదా. అప్పుడు బాప్‌దాదా వారికి చిన్నదైనా, పెద్దదైనా బహుమతిని ఇస్తారు. పరివర్తన పండుగను చేసుకుందాము. ఇష్టమే కదా. ఇష్టమేనా? మీ మీ క్లాసువారికి కూడా చెప్పండి, ఎంతగా పరివర్తన తీసుకువస్తారో అంతగా మంచిది. సమయాన్ని సమీపంగా తీసుకువస్తారు. అచ్ఛా.
80 దేశాల నుండి 2200 మంది డబల్ విదేశీయులు వచ్చారు:- బాప్‌దాదా పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమను బహుమతిగా ఇస్తున్నారు. మొదటిసారి వచ్చినవారు లేవండి. మీ అందరికీ మీ ఆధ్యాత్మిక జన్మ దినానికి అభినందనలు, అభినందనలు. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు పరివారానికి శోభ, అలంకారము. అందుకే బాప్‌దాదా అంటారు, లేటుగా వచ్చినా కానీ టూ లేట్ కన్నా ముందే వచ్చారు. ఈ పరివారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు వచ్చినందుకు పరివారానికి విశేషమైన సంతోషం ఉంది. వచ్చారు, తప్పిపోయి ఉన్న మా పరివారంవారు తిరిగి వచ్చారు. ఇప్పుడు సమయానుసారంగా మీరు తీవ్ర పురుషార్థం చేయాలి. స్లో పురుషార్థము, ఢీలా పురుషార్థము వద్దు, తీవ్ర పురుషార్థం చేస్తే లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్టు రాగలరు. చేస్తారు కదా! చేస్తారా? బాగుంది. పరివారం తరఫున, బాప్‌దాదా తరఫున చాలా-చాలా-చాలా ప్రియస్మృతులను తీసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా.
మీడియాకు సంబంధించినవారితో:- బాగుంది, మీడియా ఒక సాధనము. సాధనాలను సేవలో ఉపయోగించడము మీ పని. మంచి మీటింగులు చేసుకున్నారని బాప్‌దాదా విన్నారు. మీడియా ద్వారా మూల మూలల వరకు సందేశం చేరుకోవాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఫిర్యాదు రావద్దు. బాగా చేసారు, బాగా చేస్తూ ఉంటారు మరియు నలువైపుల ఉన్న ఆత్మలకు తమ తండ్రి గురించిన సందేశము లభిస్తూ ఉంటుంది. ఏ ప్రోగ్రాములైతే జరుగుతున్నాయో, వీరు కూడా ప్రోగ్రాములు చేస్తారు కదా (నిజార్ భాయితో) ఇవి కూడా బాగున్నాయి. బాగుంది. ప్రతి స్థానంలో భవిష్య సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవి కూడా మంచిగా ఉన్నాయి. ఏదో ఒక రిజల్టు వస్తుంది. అభినందనలు. అచ్ఛా.
ఉత్తరాలు, ఫోన్లు, ఎవరెవరి ప్రియస్మృతులు బాప్‌దాదా కోసం వచ్చాయో, ఆ పిల్లలందరినీ బాప్‌దాదా తమ నయనాలలో ఇముడ్చుకుని, ప్రియస్మృతులు లేక సేవా సమాచారము లేక మనసు యొక్క పురుషార్థం గురించిన సమాచారాన్ని ఇచ్చారో, వారందరినీ బాప్‌దాదా మనసా ద్వారా ఇమర్జ్ చేసుకుని సుఖము, శాంతి యొక్క కిరణాలను ఇస్తున్నారు. కొందరు ఇక్కడకు పంపించి ఉండకపోవచ్చు కానీ మనసులో సంకల్పం చేసినాకానీ ఆ సంకల్పం కూడా బాబా వద్దకు చేరుకుంది.
నలువైపుల ఉన్న పిల్లల ధైర్యము, తండ్రి సహాయము, మధురాతి మధురమైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులను అందిస్తున్నారు. ఈ సంవత్సరం స్వయం కోసం లేక సేవాకేంద్రం కోసం లేక విశ్వాత్మల కోసం ఏదో ఒక ప్లానును తయారు చేయండి, దాని ద్వారా సేవ యొక్క బలము మరియు ఫలము సర్వాత్మలకు చేరుకోవాలి. నలువైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా యొక్క హృదయపూర్వక విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. ఓం శాంతి.
మున్ని అక్కయ్యతో:- బాగుంది, ఈ జన్మ దినాన్ని సేవ కోసం జరుపుకున్నారు. సేవ కోసం జరుపుకున్నారు, సేవకు రిటర్నుగా మీకు సేవ యొక్క బలము మరియు ఫలము లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు సమాప్తం చెయ్యండి. చాలు. మంచిగా జరుపుకున్నారు.
దాదీ జానకితో:- బాబా ఆడిస్తున్నారు, మీరు ఆడుతున్నారు. టైమ్‌కు లేపుతున్నారు కదా.
మోహిని అక్కయ్యతో:- ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారు. (బాబా, శరీర లెక్కాచారాలు ఎంత వరకు?) త్వరత్వరగా తీరుతున్నాయి, తీరిపోతాయి. కొద్దిగా సమయం పడుతుంది, వెనకటి లెక్కాచారము కదా. ఇప్పటిది కాదు, వెనకటిది. వెనకటి దానిని వెనక్కి నెడుతూ ఉండండి.
దాదీలతో:- అందరూ మహారథులు. మంచిగా ఉన్నారు మరియు మంచిగా ఉంటారు.
రుక్మిణి దాదీతో:- (దాదీ ఉన్నారు) అవును, ఆరంభించారు, నిమిత్తంగా ఉన్నారు.
పర్దాదీతో:- బాగున్నారు, లెక్కాచారాలను నవ్వుతూ, సంతోషంగా తీర్చుకునే విషయంలో అందరి ముందు సాంపుల్‌గా ఉన్నారు. అనారోగ్యం లేదు, సాంపుల్‌గా ఉన్నారు. అందరూ మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు. మీరు సాంపుల్‌గా ఉన్నారు.
రమ్ష్ అన్నయ్యతో:- మీ ఆరోగ్యాన్ని ఇప్పుడు సంభాళించుకోండి. అలాగే నడిపించేయకండి, కొద్దిగా శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోండి. ఇప్పటి వరకు ఎంతో బిజీగా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా విశ్రాంతిని ఇచ్చి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోండి. పనిలో ముందుకు వెళ్ళాలి కదా. మున్ముందు బాధ్యతలు తీసుకోవాలి, యజ్ఞాన్ని నడిపించాలి. కనుక శరీరాన్ని మంచిగా చేసుకోండి, విశేషమైన శ్రద్ధ వహించండి. శరీరమైతే పాతగా అయిపోయింది. (నిర్వైర్ అన్నయ్య) వీరు కూడా శ్రద్ధ పెడ్తారు కదా. పెట్టాలి, కానీ సేవలో ఏ లోటు రాకూడదు. ఇటువంటి ప్రోగ్రామును తయారు చెయ్యండి. సరేనా. (బృజ్ మోహన్ అన్నయ్య) ముగ్గురూ నిమిత్తంగా ఉన్నారు. స్వయంపై బాధ్యత ఉంది అని భావిస్తున్నారు కదా. (రమేష్ అన్నయ్య) పేపరును ఎదుర్కున్నారు, ఇందుకు అభినందనలు. చాలా చక్కగా దాటారు.
డబల్ విదేశీ సోదరసోదరీలు బాప్‌దాదాకు పుష్పగుచ్ఛమును మరియు పూలదండను సమర్పించారు:- ఇక్కడివారే, ఇక్కడికి చేరుకున్నారు. చాలా బాగుంది. పాత్రను మంచిగా నిర్వహిస్తున్నారు. అందరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. అచ్ఛా.
విదేశీ ముఖ్య సోదరీలతో:- ఈ గ్రూపు కూడా చాలా బాగుంది. నిమిత్తమై ఒకరికొకరు సహయోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భారతదేశపు పక్కా పిల్లలు, అనుభవి ఉన్నారు అందుకే నిమిత్తమయ్యారు. నిర్విఘ్నంగా నడుస్తుంది కదా. ఎటువంటి కష్టమూ లేదు కదా? సెట్ అయ్యారా? నియమాలు, చట్టాలతో కూడా సెట్ అయిపోయారు. (చక్రధారి అక్కయ్యతో) వీరిది నడుస్తుంది. చాలా బాగుంది. భారతదేశానికి చెందినవారైనా కానీ ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ చక్కగా కలిసిపోయారు. భారతము మరియు విదేశములో తేడా లేదు, ఇది బాగుంది. భారతదేశానికి చెందిన అనుభవి ఆత్మలు కాబట్టి హాండ్లింగ్ కూడా మంచిగా లభిస్తుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. (భారతదేశంలో కూడా సేవ అవకాశాలు లభిస్తున్నాయి) అవకాశాలు లభిస్తాయి, ఎక్కడ సేవ చేసినా ఒక్క విషయమే. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, గ్రామగ్రామాలలో ఏదైతే చేస్తున్నారో అది బాగుంది. ఎక్కడ సెంటరు లేదో అక్కడ సెంటరునుకానీ లేక సందేశాన్ని ఏదో ఒక విధంగా అందించండి. అచ్ఛా!
ఓంశాంతి