Search for a command to run...
18 Jan 1969
పితాశ్రీ గారు అవ్యక్తమైన తర్వాత గుల్జార్ సోదరి ద్వారా అవ్యక్త వతనము నుండి లభించిన దివ్య సందేశములు
18 January 1969 · తెలుగు
1. తనువు మరియు మనసుల అలజడిని సమాప్తం చేసి దేహి అభిమానులుగా అవ్వండి
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు శివబాబా అన్నారు – సాకార బ్రహ్మా యొక్క ఆత్మలో ఆది నుండి అంతిమము వరకు, 84 జన్మల చక్రాన్ని చుట్టే సంస్కారం ఉంది, అందుకే ఈరోజు కూడా తిరిగి రావడానికి వతనం నుండి వెళ్ళారు. ఎలా అయితే సైన్సు వారు రాకెట్ ద్వారా చంద్రుని వరకు చేరుకున్నారో, ఎంతగా చంద్రునికి దగ్గరవుతూ ఉంటారో అంతగా ఈ భూమి ఆకర్షణ నుండి దూరమవుతూ ఉంటారు, భూమి ఆకర్షణ సమాప్తమైపోతుంది. అక్కడకు చేరుకున్న తర్వాత చాలా తేలికగా అనిపిస్తుంది. పిల్లలైన మీరు సూక్ష్మవతనానికి చేరుకున్నప్పుడు స్థూల ఆకర్షణ సమాప్తమైనట్లుగా అక్కడ భూమి ఆకర్షణ ఉండదు. ఇది ధ్యానము ద్వారా, అది సైన్సు ద్వారా. మరో తేడాను కూడా బాబా వినిపించారు – వారు రాకెట్లో వెళ్తున్నప్పుడు వారి కనెక్షన్ క్రింది వారితో ఉంటుంది, కానీ ఇక్కడ ఎప్పుడు, ఎలా కావాలంటే అలా మన చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత బాబా ఒక దృశ్యాన్ని చూపించారు – ప్రకాశముతో నిండిన ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం క్రింద శక్తి సైన్యము మరియు పాండవ సైన్యము ఉన్నారు. పైన బాప్‌దాదా నిల్చుని ఉన్నారు. తర్వాత చాలా గుంపు అయిపోయింది. మనమందరం అక్కడ సాకారంలో కాదు మందిరంలోని సాక్షాత్కారమూర్తులుగా నిల్చున్నట్లుగా అనిపించింది. అందరూ పైకి చూడటానికి ప్రయత్నిస్తున్నారు కానీ పైకి చూడలేకపోతున్నారు. అందరూ అలమటిస్తున్నట్లుగా ఉన్నారు. కొంత సమయం తర్వాత ఒక ఆకాశవాణిలా మాటలు వినిపించాయి – ‘‘శక్తులు మరియు పాండవుల ద్వారానే కళ్యాణం జరుగనున్నది’’. ఆ సమయంలో మనందరి ముఖాలపై ఎంతో దయా భావన ఉంది. ఆ తర్వాత కొంతమందికి శక్తులు మరియు పాండవుల ద్వారా అవ్యక్త బ్రహ్మా యొక్క సాక్షాత్కారము, శివబాబా సాక్షాత్కారము జరిగాయి. ఆ దృశ్యము చూడదగ్గదిగాఉంది, కొందరు నవ్వుతున్నారు, కొందరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ప్రేమతో కన్నీళ్ళు కారుస్తున్నారు. కానీ శక్తులందరూ అగ్ని గోళములవలె తేజస్వీ రూపంలో స్థితులై ఉన్నారు. దీని గురించి బాబా ఏమన్నారంటే, అంతిమ సమయంలో మీ ఈ వ్యక్త శరీరం కూడా పూర్తిగా స్థిరమైపోతుంది. ఇప్పుడు పాత లెక్కాచారాలు ఉన్న కారణంగా శరీరము దాని వైపుకు మిమ్మల్ని లాగుతుంది కానీ అంతిమంలో పూర్తిగా స్థిరంగా, శాంతిగా అయిపోతుంది. మనసులోగానీ, తనువులోగానీ ఎటువంటి అలజడి ఉండదు, దీనినే బాబా దేహి అభిమాని స్థితి అంటారు. దృశ్యము సమాప్తమైన తర్వాత బాబా ఇలా అన్నారు – ఇప్పుడు దేహి అభిమానిగా అవ్వమని పిల్లలందరికీ చెప్పండి. సేవపై ఎంత శ్రద్ధ ఉందో అంతే శ్రద్ధ దేహి అభిమానిగా అవ్వాలన్న ముఖ్య విషయంపై కూడా ఉండాలి.
2. పాత సంస్కారాల రూపీ ఆకులను సమాప్తం చేసి బీజరూప అవస్థను తయారు చేసుకోండి
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు, పిల్లలైన మనందరినీ స్వాగతం చేయడానికి బాప్‌దాదా ఎదురుగా హాజరై ఉన్నారు. నేను చేరుకోగానే, సాకార రూపంలో దృష్టి ద్వారా స్మృతిని తీసుకున్నట్లుగానే అనుభవమయింది కానీ ఈనాటి దృష్టిలో విశేషంగా ప్రేమ సాగరుని రూపం ఇమర్జ్ అయి ఉంది. పిల్లలు ఒక్కొక్కరి స్మృతి నయనాలలో ఇమిడి ఉంది. బాబా అన్నారు – ‘‘స్మృతి అయితే పిల్లలందరూ పంపించారు, కానీ ఇందులో రెండు రకాల స్మృతులు ఉన్నాయి. కొంతమంది పిల్లల స్మృతి అవ్యక్తంగా ఉంది, మరికొందరి స్మృతిలో అవ్యక్త భావముతో పాటు వ్యక్త భావము కూడా మిక్స్ అయి ఉంది. 75 శాతం పిల్లల స్మృతి అవ్యక్తంగా ఉంది, కానీ 25 శాతం పిల్లల స్మృతి మిక్స్ అయి ఉంది’’. తర్వాత బాబా అందరికీ స్నేహము మరియు శక్తి నిండిన దృష్టినిస్తూ ముద్దలు తినిపించారు. ఆ తర్వాత ఒక దృశ్యము ఇమర్జ్ అయింది – ఏమి చూసానంటే, పిల్లలందరి సంగఠన నిల్చుని ఉంది, పైనుండి చాలా ఎక్కువగా పూల వర్షం కురుస్తుంది. పూర్తిగా నలు వైపుల పూలు తప్ప మరొకటి కనిపించడం లేదు. బాబా ఇలా వినిపించారు – ‘‘బచ్చీ, స్నేహము మరియు శక్తులనైతే బాప్‌దాదా పిల్లలకు ఇచ్చారు కానీ వాటితో పాటు దివ్య గుణ రూపి పూల వర్షాన్ని శిక్షణ రూపంలో కూడా చాలా ఇచ్చారు. కానీ దివ్య గుణాల శిక్షణను పిల్లలు యథాశక్తియే ధారణ చేసారు’’. ఆ తర్వాత మరో దృశ్యాన్ని చూపించారు – మూడు రకాల గులాబీ పుష్పాలు ఉన్నాయి, ఒకటి ఇనుము, రెండు ఇత్తడి, మూడు రియల్ గులాబి ఉన్నాయి. ‘‘పిల్లల రిజల్టు కూడా ఇలాగే ఉంది అని బాబా అన్నారు. ఇనుప పుష్పము అంటే ఇది పిల్లల కఠిన సంస్కారానికి గుర్తు. ఇనుమును బాగా కొట్టవలసి వస్తుంది కదా, వేడి చేయనంత వరకు, సుత్తి దెబ్బలు తగలనంత వరకు వంగదు. ఇలాగే కొంతమంది పిల్లల సంస్కారాలు ఇనుము వలె ఉంటాయి, ఎంత భట్టీలో కూర్చున్నా కానీ మారవు. రెండవ వారు, వంచితే, కష్టపడితే కొంత మారుతారు. మూడవ రకం వారు నేచురల్‌గానే గులాబీలు. ఇటువంటి పిల్లలు గులాబి సమానంగా అవ్వడానికి ఎటువంటి శ్రమ చేయలేదు’’. ఇలా వినిపిస్తూ-వినిపిస్తూ బాబా రియల్ గులాబి పుష్పాన్ని తమ చేతిలోకి తీసుకుని కొద్దిగా తిప్పారు. తిప్పగానే దాని రెక్కలన్నీ పడిపోయాయి. మధ్యలోని బీజము మాత్రమే మిగిలింది. అప్పుడు బాబా అన్నారు, ‘‘చూడు బచ్చీ, ఎలా అయితే దీని రెక్కలు ఎంతో త్వరగా మరియు సహజంగా విడిపోయాయో అలాగే పిల్లలు కూడా ఎటువంటి పురుషార్థము చేయాలంటే వెంటనే వారిలోని పాత సంస్కారాలు, పాత దైహిక సంబంధాలు అనే రెక్కలు విడిపోవాలి, ఆ తర్వాత బీజరూప స్థితిలో స్థితులవ్వాలి. సమయం వచ్చినప్పుడు ఎటువంటి సంస్కారం అనే రెక్క అంటుకొని ఉండకూడదు, వేరు చేయడానికి శ్రమ పడనవసరం లేకుండా ఉండాలి అని మా ఈ సందేశాన్ని పిల్లలందరికీ ఇవ్వండి. కర్మాతీత స్థితి సహజంగానే తయారవుతుందా లేక కర్మ బంధనము ఆ సమయంలో ఆటంకం వేస్తుందా? ఒకవేళ ఏదైనా లోటు ఉంటే దానిని పరిశీలించుకోండి మరియు నింపుకునే ప్రయత్నం చేయండి’’.
3. స్నేహము మరియు సంగఠన కోసం ఇతరుల సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి
ఈరోజు బాబాను మధుబనానికి రమ్మని ఆహ్వానించడానికి వెళ్ళాను – కానీ బాబాకు ఆ ఆలోచన లేదని బాప్‌దాదా సూచనల ద్వారా అర్థమయింది. ఇంతలో బాబా అన్నారు, ‘‘అచ్ఛా బచ్చీ, పిల్లలందరూ పిలిచారు, బాప్‌దాదా అయితే పిల్లల సేవాధారి’’. ఇప్పుడే కుదరదు అని, మళ్ళీ వెంటనే సరే వస్తాను అని బాబా ఎందుకు అన్నారు అన్న ఆలోచన వచ్చింది. నా మనసులోని ఆలోచనను తెలుసుకున్న బాబా ఇలా అన్నారు – కావాలనే బాబా ఈ కర్మ చేసి చూపించారు, పిల్లలైన మీరు కూడా ఒకరి సలహాలకు మరొకరు గౌరవాన్ని ఇచ్చుకోవాలి. ఎవరైనా అభిప్రాయం చెబితే, అది మీకు నచ్చకపోయినా కానీ మీరు వారి ఆలోచనను వెంటనే తిరస్కరించకండి. ముందు వారికి గౌరవం ఇవ్వండి, అవును, తప్పకుండా, చాలా బాగుంది అనండి. అప్పుడు వారి ఆలోచనల ఫోర్సు తగ్గుతుంది. తర్వాత మీరు వారికి చెప్పాలనుకున్నది వారు అర్థం చేసుకుంటారు. నేరుగా వారిని కట్ చేసేస్తే రెండు ఫోర్సులు గుద్దుకుని రిజల్టులో సఫలత రాదు. కనుక ఒకరి ఆలోచనలను అనగా సలహాలను ముందు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. దీని ద్వారానే పరస్పరంలో స్నేహము మరియు సంగఠన కొనసాగుతాయి.
4. సాకార అలంకారానికి ప్రాక్టికల్ స్వరూపము – అవ్యక్త స్థితిని తయారు చేసుకుని చూపించండి
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు, నేను చేరుకునేసరికి బాప్‌దాదా ఎదురుగానే ఉన్నారు కానీ ఏమి చూసానంటే బ్రహ్మా బాబా మెడలో అనేక మాలలు ఉన్నాయి. ఈ మాలలు తీసి చూడండి అని బాబా అన్నారు. మాలలు తీస్తుంటే కొన్ని పెద్ద మాలలు, కొన్ని చిన్న మాలలు ఉన్నాయి. దీని రహస్యం ఏమిటి బాబా అని నేను అడిగాను. బాబా అన్నారు, బచ్చీ, ఇవి అందరి ఫిర్యాదుల మాలలు. ఎందుకంటే పిల్లలు ఏకాంతంలో కూర్చున్నప్పుడు బాబాకు స్నేహంతో ఫిర్యాదులే చేస్తారు. పిల్లలందరూ బాబాకు ఫిర్యాదుల మాలను తప్పక వేసారు. పిల్లలకు డ్రామా గుర్తుంది కానీ అతి ప్రియమైన బాబా కూడా కదా. కనుక అకస్మాత్తుగా డ్రామాలోని అద్భుతమైన దృశ్యాన్ని చూసి పిల్లలందరూ మనసులోనే ఫిర్యాదులు చేసారు. జ్ఞానమైతే పిల్లలలో ఉంది కానీ జ్ఞానంతో పాటు ప్రేమతో కూడిన స్నేహము కూడా ఉంది కనుక ఈ ఫిర్యాదులను తప్పుగా భావించము. బాబా, వీటికి రెస్పాండ్ ఏమి ఇచ్చారు అని తర్వాత నేను బాబాను అడిగాను. పిల్లలను బట్టి రెస్పాండ్ అని బాబా అన్నారు. నేను కూడా పిల్లలకు రెస్పాండ్లో ఫిర్యాదుల మాలనే వేసాను. అదేమిటి? బాబా ఇలా వినిపించారు – బాబా ఆశ ఏదైతే పిల్లల మీద ఉందో అది సాకార రూపంలో బాబాకు కనిపించడం లేదు, అది ఇప్పుడు అవ్యక్త రూపంలో కనిపించాలి. ఈ ఫిర్యాదులు కూడా తియ్యని ఆత్మిక సంభాషణయే. ఇది కూడా పిల్లల ఆట. సాకార రూపంలో ఏదైతే బాబా అలంకరించారో అది ఇప్పుడు అవ్యక్త వతనంలో బాప్‌దాదా చూస్తారు. ఈ దృశ్యము పూర్తయింది. తర్వాత భోగ్‌ను స్వీకరింపజేసాను, తర్వాత నేను బాబాను ఇలా అడిగాను, బాబా, మీరు రోజంతా వతనంలో ఏమి చేస్తారు? బాబా అన్నారు, పద, నేను మీకు వతనంలోని మ్యూజియంను చూపిస్తాను. మీరైతే మ్యూజియం తయారు చేయకముందు ప్లాన్ చేస్తారు, బాబా మ్యూజియం అయితే ఒక్క సెకండులో తయారైపోతుంది. తర్వాత ఏమి చూసాను? ఒక పెద్ద హాలు ఉంది. ఒక్కటే హాలులో పిల్లలైన మనమంతా చాలామందిమి మోడల్స్ రూపంలో నిల్చుని ఉన్నాము. నేనన్నాను, బాబా, ఇదైతే మేమే మ్యూజియంలో నిల్చుని ఉన్నాము కదా. బాబా అన్నారు – బచ్చీ, ఇదే బాబా మ్యూజియం. ఇప్పుడు మీరు వెళ్ళి బాప్‌దాదా ఏమేమి అలంకరించారో ఒక మోడల్‌ను చూడండి. ఒక కళాకారుడు విగ్రహాన్ని అలంకరించినట్లుగా, బాప్‌దాదా ఏమేమి అలంకరించారో చూడండి అని బాబా అన్నారు. నేను మోడల్ వద్దకు వెళ్ళినప్పుడు నాకు ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. పూర్తిగా అలంకరింపబడిన విగ్రహమే కనిపించింది. బాబా అన్నారు, ముఖ్య అలంకారమైతే సాకారంలోనే బాబా పిల్లలకు చేసి వచ్చారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో ఏమి అలంకరిస్తున్నారు? అన్ని అలంకారాలైతే ఉన్నాయి, నగలు కూడా ఉన్నాయి, కానీ నగల మధ్యలో రత్నాలను పెడ్తున్నారు. బాబా చెప్పిన తర్వాత కొందరిలో ఎక్స్ట్రా రత్నాలు కనిపించాయి. బాబా అన్నారు, పిల్లలకు బాబా ఇచ్చే ముఖ్య శిక్షణ ఇదే – అవ్యక్త స్థితిలో స్థితులై వ్యక్త భావంలోకి రండి. ఏకాంతంలో కూర్చున్నప్పుడు అవ్యక్త స్థితి ఉంటుంది కానీ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త భావంలో స్థితులవ్వడమే మిస్ చేస్తున్నారు, కనుక ఏకరస కర్మాతీత స్థితి అనే రత్నము ఏదైతే ఉందో, అది లోపిస్తుంది. ఎవరి జీవితంలో ఏ లోపమైతే చూస్తున్నానో దానిని అలంకరిస్తున్నాను. సాకార రూపంలో ఈ కార్యం చేసేవాడిని, అదే ఇప్పుడు అవ్యక్త రూపంలో చేస్తున్నాను. మరి రోజంతా ఎలా అయితే బాబా పిల్లలను అలంకరిస్తున్నారో ఆ అనుభూతి పిల్లలకు వస్తుందా అని పిల్లలను అడగండి. ఆ సమయంలో ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో ఆ పిల్లలకు అనుభూతి కలుగుతుంది, బాబా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, అలంకరిస్తున్నారు అని అనిపిస్తుంది. అవ్యక్త వతనంలో నేను పిల్లలతో కలవడము, ఆహ్లాదపరచడం చేస్తుంటే, అవ్యక్త రూపంలో ఉన్న పిల్లలకు ఇది అనుభవం అవుతూ ఉంటుంది. నేను కూడా ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన పిల్లలను గుర్తు చేస్తాను. ఇటువంటి టచింగ్ పిల్లలకు కలుగుతూ ఉంటుంది. నేనన్నాను, బాబా, మీరు అందరినీ అవ్యక్త వతనంలోకి పిలవచ్చు కదా? ఇక్కడే పెద్ద సెంటరును తెరవండి. ఇప్పుడైతే పిల్లలందరూ ఉపరామంగా అయిపోయారు. బాబా అన్నారు, ఈ ఉపరామ స్థితి రావలసిందే. సదా తయారుగా ఉండాలి. దీనివలన స్మృతి యాత్రకు బలం లభిస్తుంది. ఈ ఉపరామ స్థితి సహజ స్మృతికి ఉపాయము. ఎక్కువ సమయం లేదు, బాబా ఎప్పుడైనా, ఎవరినైనా పిలుస్తారని పిల్లలకు చెప్పండి.
5. సాకారంలో ఉంటూ కూడా లైట్-మైట్ రూపులుగా అవ్వడానికి అంతర్ముఖులుగా అవ్వండి
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు, ప్రకాశ మబ్బులను దాటుకుంటూ వతనానికి వెళ్తున్నట్లుగా అనుభవం అయింది. మబ్బుల ప్రకాశం సూర్యాస్తమయంలోని ఎరుపు వర్ణంలో కనిపించింది. వతనానికి చేరుకోగానే అక్కడ కూడా మబ్బుల ప్రకాశం మధ్య బాప్‌దాదా ముఖము సూర్యచంద్రుల సమానంగా మెరుస్తూ కనిపించింది. దృశ్యము చాలా సుందరంగా కనిపించింది కానీ ఈరోజు వాతావరణం చాలా శాంతిగా ఉంది. బాప్‌దాదాతో మిలనమ కూడా చాలా శాంతి మరియు శక్తల భాసన కలిగించేదిగా ఉంది. ఆ తర్వాత బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు – పిల్లలైన మీరు సాకార శరీరంలో సాకార సృష్టిలో ఉన్నప్పటికీ ఇలాగే లైట్ మైట్ రూపంలో ఉండాలి, ఎవరు చూసినా కానీ వీరు ఫరిశ్తాలు తిరుగుతున్నారు అనిపించాలి. ఏకాంతంలో కూర్చుని అంతర్ముఖి అవస్థలో ఉంటూ స్వయాన్ని చెకింగ్ చేసుకున్నప్పుడే ఈ అవస్థ వస్తుంది. ఇటువంటి స్థితితోటే ఆత్మలకు పిల్లలైన మీ ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది. ఈ రోజు వతనంలో ఒకవైపు ఎంతో శాంతిగా ఉంది, మరో వైపు ప్రేమ రూపం కూడా ఎక్కువగా ఉంది. ఏమి చూసాను! బాబా బాహువులలో పిల్లలందరూ ఇమిడి ఉన్నారు. అలాగే బాబా ప్రేమ సాగరుని రూపంలో ఉన్నారు. బాబా అన్నారు – శక్తులైన మీరు కూడా సర్వ ఆత్మలను ఇలాగే మీ సమీపంలోకి తెచ్చుకోవాలి. మీ దృష్టిలో బాబా సమానంగా ప్రేమ మరియు శక్తి రెండు శక్తులు ఉంటే అప్పుడు ఆత్మలు సమీపంగా వస్తారు. ఆ తర్వాత బాబా మూడవ దృశ్యాన్ని చూపించారు – ఏమి చూసానంటే, బాబా ఎదురుగా చాలా కార్డులు ఉన్నాయి. ఈ కార్డులతో ఏదైనా సీనరీ వచ్చేలా ఈ కార్డులను అలంకరించమని బాబా చెప్పారు ఎందుకంటే ప్రతి కార్డు మీద సీనరీ యొక్క దృశ్యము ఉంది, కొన్నిటిలో చిత్రమైతే మరి కొన్నిటిలో శరీరము. నేను కార్డులను సెట్ చేస్తున్నాను అయితే కొన్ని సరిగ్గా కొన్ని తప్పుగా వస్తున్నాయి. బాప్‌దాదా చాలా నవ్వుతున్నారు. అందులో చాలా సుందరమైన సత్యయుగ దృశ్యాలు ఉన్నాయి. ఒకదానిలో కృష్ణుడు బాల్య రూపంలో ఊయలలో ఊగుతున్నాడు, కాంతలు (దాసీలు) ఊయలను ఊపుతున్నారు. మరో దానిలో సఖీసఖులు ఆడుకుంటున్నారు, అంటే పూర్తిగా సత్యయుగ దినచర్య ఉంది. ఆ తర్వాత వీడ్కోలు సమయంలో బాబా అన్నారు – బచ్చీ, శక్తి స్వరూప భవ మరియు ప్రేమ స్వరూప భవ అన్న సందేశాన్ని అందరికీ ఇవ్వండి.
6. స్నేహానికి రిటర్నుగా బాబా ఇచ్చే బహుమతి – పవిత్రంగా మరియు యోగిగా అవ్వండి
ఈరోజు ఈ దేహము మరియు దైహిక దేశము నుండి అతీతముగా సూక్ష్మవతనానికి, దేనినైతే బ్రహ్మాపురి అని కూడా అంటారో అక్కడకు వెళ్ళాను, అప్పుడు పరమాత్మ తండ్రి ఒక దృశ్యాన్ని చూపించారు – చాలా పెద్ద గుంపు ఉంది – ఎవరో టికెట్ ఇస్తున్నారు, అందరూ ఆ టికెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొంత సమయం తర్వాత కొందరికి టికెట్ లభించింది, కొందరికి టికెట్ లభించలేదు. టికెట్ లభించినవారు మనసులో ఎంతో ఆనందపడుతున్నారు, లభించనివారు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆ టికెట్ ఎక్కడి కోసం అన్న దానికోసం బాబా మరో దృశ్యాన్ని చూపించారు – ఒక పెద్ద సుందరమైన ద్వారము ఉంది. అది అకస్మాత్తుగా తెరుచుకుంది. ఎవరి వద్ద అయితే టికెట్ ఉందో వారు ద్వారము లోపలకు వెళ్ళిపోయారు, ఎవరి వద్ద అయితే టికెట్ లేదో వారు ఎంతో పశ్చాత్తాపముతో చూస్తూ ఉండిపోయారు. ఆ ద్వారముపై ఇలా వ్రాసి ఉంది – ‘‘స్వర్గ ద్వారము’’. బాబా దీని రహస్యాన్ని వినిపించారు, పరమాత్మ తండ్రి పిల్లల ద్వారా సత్యయుగ నూతన సృష్టి స్వర్గంలోకి వెళ్ళడానికి టికెట్ ఇప్పిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు ఇప్పుడు కాదు, తర్వాత తీసుకోవచ్చులే అని అనుకుంటున్నారు. కానీ తర్వాత సమయంలో టికెట్ లభించడం సమాప్తమైపోయి, స్వర్గంలోకి వెళ్ళడం నుండి వంచితులుగా అవ్వకూడదు. బాబా అన్నారు – కొంతమంది ఆత్మలు వింటారు, ఇది ఎటువంటి కార్యము జరుగుతుంది అని ఆలోచిస్తారు. బాప్‌దాదా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు –ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీ భాగ్యాన్ని పోగొట్టుకోకండి. ఈ దృశ్యాన్ని చూపించారు.
తర్వాత మరో దృశ్యాన్ని చూపించారు. నది ప్రవహిస్తుంది, దూరదూరాల నుండి ఎంతోమంది వచ్చి ఆ నదిలో స్నానం చేస్తున్నారు. కొంతమంది అక్కడే నదికి దగ్గరగానే ఉన్నారు కానీ అందులో స్నానం చేయడం లేదు. అయితే, నది ఎక్కడ, మేము అందులో స్నానం చేయాలి అది చాలామంది వారిని (నదికి దగ్గరగా ఉన్నవారిని) అడుగుతున్నారు, కానీ దగ్గరగా ఉన్నవారికి మాత్రం నదిలో స్నానం చేయడం ఎంత విలువైనదో తెలీదు. ఎవరైతే దప్పికతో ఉన్నారో వారికి కూడా ఆ దప్పిక యొక్క విలువను తగ్గించేస్తున్నారు. బాబా అన్నారు - బచ్చీ, ఇది జ్ఞాన గంగ. గంగకు దగ్గరగా ఉన్నవారు ఆబూ నివాసులు. దూరదూరాల నుండి వచ్చి స్నానం చేస్తున్నారు కానీ ఇక్కడివారు మహత్వాన్ని తెలుసుకోకుండా వారిని కూడా (దూరంగా ఉన్నవారిని) కూడా దూరం చేస్తున్నారు. ఈ పొరపాటులో ఎవ్వరూ ఉండిపోకండి, బాప్‌దాదాకు అందరూ పిల్లలే, ఆజ్ఞాకారీ పిల్లలు కాకపోవచ్చు కానీ పిల్లలంటే తండ్రికి ప్రియమే కదా. మరి పిల్లలకు బాబా శిక్షణ ఇస్తున్నారు, జ్ఞాన గంగలో స్నానం చేసే అమూల్య సమయం ఇప్పుడు లభించింది, దీనిని పోగొట్టుకోకండి. కొద్ది సమయం తర్వాత ఏమి చూసానంటే, కొందరు స్నానం చేసారు, కొందరు నీటిని నింపి పెట్టుకున్నారు, కానీ కొంత సమయం తర్వాత నది తన దారిని మార్చుకుంది, ఎవరైతే స్నానం చేయలేదో, నింపుకోలేదో వారు ఇతరుల నుండి ఒక్కొక్క చుక్క అడుగుతున్నారు, అలమటిస్తున్నారు. ఇటువంటి సమయం ఇప్పుడు రానుంది అని బాబా అన్నారు. తర్వాత బాబా పిల్లలందరి కోసం ఒక మహామంత్రాన్ని కానుకగా ఇచ్చారు. బాబా అన్నారు - ఒకటి పరమపిత అయిన నా స్మృతిలో అందరూ ఉండండి, మీ జీవితాన్ని పవిత్రంగా మరియు యోగిగా చేసుకోండి. బాప్‌దాదా స్నేహానికి రిటర్నుగా ఇదే మహామంత్రాన్ని కానుకగా అందరికీ ఇచ్చారు.
7. కర్మభోగముపై యోగబలము సాధించిన విజయము – ఒక అసాధారణ అనుభవము
ఈరోజు వతనానికి వెళ్ళగానే ఏమి చూసానంటే, శివబాబా మరియు మన బ్రహ్మాబాబా ఇద్దరూ కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఒక చిన్న కొండ తయారై ఉంది. అది ఏమిటి? అనేకానేక ఉత్తరాలు కనిపించాయి. ఎన్ని ఉత్తరాలు, ఎన్ని ఉత్తరాలంటే ఒక కొండే తయారయింది. నేను చేరుకోగానే బ్రహ్మా బాబా నన్ను చూసి, ఈషూ ఎక్కడ, ఉత్తరాలు చాలా ఉన్నాయి అన్నారు. నేను వచ్చాను బాబా అని నేను అన్నాను. ఈషూ బిడ్డను కూడా తీసుకువచ్చావు కదా అన్నారు బాబా. చూడు ఈషూ బచ్చీ, రెండు నిమిషాలలో నేను ఈ ఉత్తరాలన్నిటినీ పూర్తి చేసేస్తాను అన్నారు బాబా. శివ బాబా అయితే సాక్షిగా చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నారు. ఇంతలో ఈషూ సోదరి కూడా అక్కడ ఇమర్జ్ అయ్యారు. ఈషూ ముఖం చాలా శాంతిగా ఉంది. ఏమి ఆలోచిస్తున్నావు అని బాబా అడిగారు. ఉత్తరాలకు జవాబు ఇవ్వాలి కదా అన్నారు. ఆ సమయంలో సాకార వతనంలోని సంస్కారము పూర్తిగా ఇమర్జ్ అయినట్లుగా అనిపించింది. మమ్మా నిల్చుని అంతా చూస్తున్నారు. ఇంతలో శివబాబా బ్రహ్మా బాబాను అడిగారు, మీరెక్కడ ఉన్నారు? వతనంలోనే ఉన్నారా? ఒక్క సెకండులోనే రూపం మారిపోయింది. బాబా ఏమీ జవాబు చెప్పలేదు, పూర్తిగా డెడ్ సైలెన్సు వాతావరణంలో నిండిపోయింది. ఇంతలో, బచ్చీ, ఈ ఉత్తరాలను తెరిచి చూడు అని బాబా నాతో అన్నారు. బాబా, ఉత్తరాలు చాలా ఉన్నాయి కదా అని నేనన్నాను. దీనికైతే ఒక్క సెకండే పడుతుంది. ఎందుకంటే అన్నింటిలో ఒకే విషయం ఉంది. అన్ని ఉత్తరాలలో పిల్లల ఫిర్యాదులే ఉన్నాయని ఆ బాబా చెప్పారు. పిల్లలకు బాబా ఎలా రెస్పాండ్ చేస్తారో చూడండి. చూడండి, ఒక్క సెకండులో నేను అందరికీ జవాబు ఇస్తాను. తర్వాత బాబా అన్ని ఉత్తరాలకు, ఇక్కడి వలె, ఎర్రని అక్షరాలతో ఉత్తరం రాసారు. ఉత్తరంలో ఏమని వ్రాసి ఉందంటే –
‘‘బ్రాహ్మణ కులభూషణ, స్వదర్శన చక్రధారి, కనుపాపలైన పిల్లలకు, సమాచారము ఏమిటంటే, పిల్లలందరి ఫిర్యాదుల ఉత్తరాలు సూక్ష్మవతనానికి చేరుకున్నాయి. రెస్పాండ్ చేస్తూ బాప్‌దాదా పిల్లలకు చెప్తున్నారు, డ్రామా విధి యొక్క బంధనంలో సర్వ ఆత్మలు బంధింపబడి ఉన్నారు. అందరూ పాత్రలను పోషిస్తున్నారు. ఆ డ్రామాలోని మధురాతి మధురమైన బంధనం అనుసారంగా ఈరోజు నేను అవ్యక్త వతనంలో పాత్రను పోషిస్తున్నాను. పిల్లలందరూ మనస్ఫూర్తిగా, ప్రేమతో అవ్యక్త రూపం ద్వారా ప్రియస్మృతులను చాలా-చాలా-చాలా స్వీకరించండి. బాబా స్థితి ఎలా ఉందో అలాగే పిల్లల స్థితి ఉండాలి’’.
ఇది బాప్‌దాదా ఉత్తరము. తర్వాత బాబాకు నేను భోగ్‌ను స్వీకరింపజేసాను. బాబా అన్నారు, బచ్చీ, ఈరోజు కొంతమంది క్రొత్త పిల్లలు కూడా వచ్చారు. ఈరోజు నేను వారికి తినిపిస్తాను. తర్వాత వతనంలో బాబా పిల్లలందరినీ ఇమర్జ్ చేసుకుని తమ హస్తాలతో త్వరత్వరగా, దృష్టిని కూడా ఇస్తున్నారు, చేతులతో ముద్దలను కూడా తినిపిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్క సెకండే అయినా కానీ ఏదైతే దృష్టి ఇచ్చారో, ఆ దృష్టిలో చాలా నిండి ఉంది. ఆ తర్వాత మూడవ దృశ్యము చూసాను. అందరూ ఒక ప్రశ్నను అడగమన్నారు అని నేను బాబాకు చెప్పాను. బాబా అన్నారు - ఏ ప్రశ్న అయినా అడగవచ్చు, బాబా అయితే ఒక్క మాటలో జవాబు చెప్తారు.
ప్రశ్న:- చివరి సమయంలో మీరేమీ చెప్పలేదు. బాహ్య దృశ్యమునైతే మేమంతా విన్నాము కానీ ఆంతరికంగా ఏమి జరిగింది, ఆ అనుభవం వినాలని ఉంది.
బాబా అన్నారు - సరే బచ్చీ, తప్పకుండా. బాబా తమ అనుభవం వినిపిస్తారు, వినండి – బచ్చీ, ఆట అంతా 10-15 నిముషాలదే. ఆ కొద్ది సమయంలోనే అనేక ఆటలు జరిగాయి. అప్పుడు భిన్న భిన్న అనుభవాలు అయ్యాయి. మొదటి అనుభవం ఏమిటంటే, ముందుగా జోరుగా యుద్ధం జరిగింది. వేటి మధ్య యుద్ధం? యోగ బలము మరియు కర్మభోగము మధ్య. కర్మభోగము కూడా ఫుల్ ఫోర్సులో తన వైపుకు లాగుతుంది, యోగ బలము కూడా ఫుల్ ఫోర్సులోనే ఉంది. మిగిలి ఉన్న శారీరక లెక్కాచారాలన్నీ త్వరగా యోగ అగ్నిలో భస్మమవుతున్నట్లుగా అనిపించింది. మల్లశాలలో మల్లయుద్ధాన్ని చూస్తున్నట్లుగా నేనేమో సాక్షిగా ఉండి ఇదంతా చూస్తున్నాను. రెండింటి ఫోర్సులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత బాబా అన్నారు, కొంత సమయం తర్వాత కర్మభోగము (నొప్పి) పూర్తిగా నిర్బలమైపోయింది. నొప్పి పూర్తిగా మాయమైపోయింది. చివరకు యోగ బలము కర్మభోగముపై విజయం సాధించినట్లుగా అనిపించింది. ఆ సమయంలో మూడు విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి, అవి ఏవి? ఒక వైపు బాబాతో మాట్లాడుతున్నాను, బాబా మమ్మల్ని మీ వద్దకు పిలుచుకోండి అంటున్నాను. రెండవ వైపు ప్రత్యేకంగా పిల్లల స్మృతి ఏమీ రాలేదు కానీ పిల్లలందరి స్నేహపు స్మృతి శుద్ధ మోహం రూపంలో కలిగింది. పిల్లల వద్ద సెలవు తీసుకోలేదే అన్న శుద్ధ మోహంతో కూడిన ఆలోచన తప్ప మరే ఆలోచన లేదు. మూడవ వైపు, ఎలా ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది అన్నది కూడా అనుభవమయింది. బాబా తమ మొదటి మురళిలో చెప్పిన కర్మాతీత స్థితి, అతీత స్థితి గురించి, ఎలా శబ్దాల తర్వాత పూర్తి నిశ్శబ్దం వస్తుందో, ఆ డెడ్ సైలెన్సు అన్నది అర్థమయింది. అలాగే పూర్తిగా డెడ్ సైలెన్సు యొక్క అనుభవం జరుగుతూ ఉండినది. ఒక్కొక్క అంగం నుండి ఎలా ఆత్మ తన శక్తిని విడిచిపెడుతూ వస్తుందో కూడా చూసాను. కర్మాతీత అవస్థతో కూడిన మృత్యువు ఏమిటో అనుభవం అయింది. ఇదే నా అనభవం.
మేమందరమూ ఒకవేళ ఎదురుగా ఉండి ఉంటే బాబాను ఆపి ఉండేవారిమి అని పిల్లలందరూ అంటున్నారు అని బాబాకు చెప్పాను. బాబా అన్నారు – బచ్చీ, ఆపగలిగితే ఇది డ్రామా ఎందుకు అవుతుంది. నేనన్నాను, ఈ దృశ్యమైతే ఇంకా నిజం కాదనిపిస్తుంది, రియల్ డ్రామాలాగా అనిపించడం లేదు. బాబా అన్నారు - బచ్చీ, ఈ స్నేహ బంధం కారణంగా చివరి వరకు ఇది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది మరియు ఇప్పటికీ ఆ సంబంధం ఉంది కదా. సాకార రథం పోయినా కానీ బ్రహ్మా రూపంలో అవ్యక్త రూపంలో పాత్రను పోషిస్తున్నాను. బాబా అన్నారు - నేను కూడా ఒక్కోసారి సాకార వతనానికి వెళ్ళిపోతుంటాను, తర్వాత శివబాబా, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఇక్కడ కూర్చున్నా కానీ సాకార వతనంలోలాగానే, ఎక్కడైనా ఇల్లు తయారవుతుంటే అక్కడకు వెళ్ళిపోతాను. బాబా మా వద్దకు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది అని నేనన్నాను. బాబా అన్నారు, అవును, నేను తిరుగుతుంటాను కనుకనే పిల్లలకు నేను వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆత్మిక సంభాషణ జరిగుతూ ఉండింది.
తర్వాత బాబా ఒక దృశ్యాన్ని చూపించారు, ఒక చక్రం లోపల అనేక చక్రాలు కనిపించాయి. చక్రం ఎలా తయారై ఉందంటే ఆ చక్రం నుండి బయటకు రావడానికి 4-5 మార్గాలు కనిపిస్తున్నాయి కానీ ఎవ్వరూ రాలేకపోతున్నారు. బ్రహ్మాబాబా చక్రంలో తిరుగుతూ పాయింటు పైన అనగా జీరో పైన నిల్చున్నారు, కానీ బయటకు రాలేదు. ఇదే డ్రామా బంధనము అని బాబా అన్నారు. బ్రహ్మా కూడా డ్రామా చక్రం నుండి బయటకు రాలేరు. ఆ జీరో పాయింట్ వద్దకు చేరుకున్నారు కానీ డ్రామా యొక్క తియ్యని బంధనము ఉంది. ఆ తియ్యని బంధనాన్ని ఒక ఆటలా చూపించారు బాబా. తర్వాత మిశ్రీ, బాదాం తినిపించారు బాబా. సెలవు ఇచ్చారు, వెళ్ళు బచ్చీ, సమయం అయింది అన్నారు.
8. సంగఠనయే భద్రతకు సాధనము
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ కనిపించలేదు. దూరంగా ఏవో మాటలు వినిపించాయి – ఏదో ప్రత్యేకమైన కార్యము జరుగుతున్నట్లుగా అనిపించింది. నేను ముందు ఆగాను, తర్వాత ముందుకు వెళ్ళి చూస్తే ఏమి కనిపించిందంటే – శివబాబా, బ్రహ్మా బాబా, మమ్మా, విశ్వ కిశోర్ నలుగురూ మాట్లాడుకుంటున్నారు, ఎన్నో ప్లాన్లు వారి ముందుంచారు. అందులో కొన్ని మ్యాపులు కనిపించాయి, కానీ నాకు అర్థం కాలేదు. మమ్మా పిల్లలందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మమ్మా, మీరైతే బాబాను కూడా పిలిపించేసుకున్నారు కదా అని నేనన్నాను. మమ్మా అన్నారు – మమ్మా కూడా పిల్లలకు తల్లిదండ్రుల సాకార తోడు వీడాలి అని అనుకోవడం లేదు, కానీ డ్రామా. తర్వాత నేను బాబాను అడిగాను – బాబా, ఈ ప్లాన్లు ఏమిటి? బాబా అన్నారు – ఎలా అయితే మార్షల్ (మిలిటరీ) వద్ద అన్ని మాపులు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది, ఇక ముందు ఏమి చేయాలి అని, అలాగే ఇక్కడ కూడా స్థాపన గురించిన చర్చ జరుగుతుంది. దాని గురించి తర్వాత వినిపిస్తాము. తర్వాత ఒక దృశ్యాన్ని చూపించారు.
అందులో మూడు సంగఠనలు ఉన్నాయి. ఒకదానిలో ఎర్రని చీమలు పరస్పరం కలిసి బంతిలా అయిపోతున్నాయి. బ్రహ్మా బాబా ఆరంభంలో చూసిన దృశ్యంవంటిదిలా ఉంది ఇది. రెండవ సంగఠన మూలవతనంలో ఆత్మలు దీపాల వలె ఉన్నాయి. మూడవ సంగఠన – బ్రాహ్మణులైన మనందరిది. అందరమూ సర్కిల్ రూపంలో కూర్చుని ఉన్నాము, మధ్యలో బాప్‌దాదా ఉన్నారు. పువ్వు మధ్యలో బీజము, చుట్టూ ఆకులు ఉన్నట్లుగా ఉంది. దీని రహస్యాన్ని ఇలా వివరించారు – బచ్చీ, ప్రత్యక్షత ఆరంభమైనప్పుడు సంగఠనను చూసారు. అంతిమంలో కూడా ఆత్మలు సంగఠన రూపంలోనే ఉండాలి మరియు మధ్య కాలంలో కూడా సంగఠన ఉండాలి. సంగఠనకు శక్తి ఉంటుంది అప్పుడు ఎవ్వరూ కదిలించలేరు. చూడండి, బాప్‌దాదా ఎక్కడెక్కడి నుండి వెతికి సంగఠనను తయారు చేసారో! పిల్లలు కూడా సంగఠనలో నడుచుకున్నప్పుడు మాయ దాడి చేయదు. గులాబి పువ్వుగానీ లేక ఇతర ఏ పుష్పమునైనాగానీ దాని యోగ్య స్థానంలో ఉంచుతారు, అదే కేవలం రెక్కలు ఉంటే వాటిని చేతులతో త్వరగా నలిపివేస్తారు. అలాగే పిల్లల సంగఠన అనే పుష్పగుచ్ఛము ఉన్నట్లయితే విజయము ప్రాప్తిస్తుంది. ఎవ్వరూ దాడి చేయలేరు. ఇలా చెప్తూ, సంగఠన సేఫ్టీకి సాధనము అని పిల్లలకు చెప్పండి అని బాబా అన్నారు.
9. పూల అందం ఆకులతో ఉంటుంది, కనుక ప్రజలు అనే ఆకులను తయారు చేయండి
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు బాప్ దాదా ఇరువురూ చాలా బిజీగా ఉన్నారు. ఏమి చూసానంటే – ఇద్దరి ముందు పూలు కూడా ఉన్నాయి మరియు ఆకులు కూడా ఉన్నాయి. పుష్పగుచ్ఛంలో పూలు మరియు ఆకులు కూడా వేసినట్లుగా. పూలు రెండు మూడు రకాలు ఉన్నాయి, వాటిని చూస్తూ ఏరుతున్నారు. బాబా మరియు దాదా ఇరువురూ ఆ కార్యంలోనే బిజీగా ఉన్నారు. నన్ను చూడనే లేదు. నేను దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను చూసి చిరునవ్వుతో బాబా అన్నారు – నేను రోజంతా బిజీగా ఉంటాను. చూడు బచ్చీ, ఎంత పెద్ద కార్యము జరుగుతుందో! ఈ పూలు ఆకులు మూడు రకాలైనవి వేరువేరు చేసి పెట్టాము. ముందు బాబా నాకు పువ్వు చూపించారు, వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది, తర్వాత మధ్య క్వాలిటీ చూపించారు, అందులో పూలు చాలా ఉన్నాయి అలాగే కొన్ని ఆకులు కూడా ఉన్నాయి. పూలు మంచిగా ఉన్నాయి కానీ ఆకులు ఉన్నవి కొద్దిగా డిఫెక్టెడ్గా ఉన్నాయి. మూడవ క్వాలిటీలో ఆకులు ఎక్కువగా ఉన్నాయి, పూలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని గురించి బాబా నాకు ఇలా వివరించారు, మొదటి క్వాలిటీలో పూలు తక్కువగా ఉన్నాయి, వీరు పూర్తిగా బాబా హృదయంలో స్థానం సంపాదించిన పిల్లలు, ఇటువంటి మనసున్న అనన్య పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు. రెండవ నంబరు పిల్లలు చాలా మంచివారు, కానీ కొంత లోపం ఉంది. పూలుగా అయ్యారు కానీ కొంత లోటు ఉంది. ఇక మూడవ క్వాలిటీవారు ప్రజలు. అందులో కూడా వెనుక వచ్చే పూలు కూడా ఉండవచ్చు. మిగతా అందరూ ప్రజలు. రెండు ఉన్నతమైన క్వాలిటీ పిల్లలు. బాప్‌దాదా ఇప్పుడు పుష్పగుచ్ఛాన్ని తయారు చేస్తారు. పుష్పగుచ్ఛాన్ని అలంకరించేటప్పుడు కేవలం పూలతో అందం రాదు. అందులో కొన్ని ఆకులు కూడా కావాలి. మీరు పుష్పాలు కానీ మీతో పాటు ఆకులు కూడా కావాలి. మీరు రాజుగా అయితే ప్రజలు కూడా కావాలి కదా. ప్రజలు అనే ఆకుల మధ్య పూలు శోభాయమానంగా ఉంటాయి. ఇక్కడ కూర్చుని కూడా నేను మీ పిల్లల పుష్పగుచ్ఛాన్ని తయారు చేస్తున్నాను. ఒక పువ్వు ఎంతమంది ప్రజలను తయారు చేసింది అని చూస్తున్నాను. ఎవరు ఎక్కువ ప్రజలను తయారు చేసారో వారి పుష్పగుచ్ఛం అందంగా ఉంటుంది. తర్వాత బాబా ఒక ప్రశ్నను అడిగారు – దేవతకు పూలతో పూజ చేసేటప్పుడు ఆకులు తీసేసి కేవలం పూలతో ఎందుకు పూజ చేస్తారు? ఆకులైతే పువ్వుకు అందం కదా, మరి ఆకులు ఎందుకు తీసేస్తారు? బాబా అన్నారు, పిల్లలైన మీ ద్వారానే ఈ ఆచారాలు-సాంప్రదాయాలు మొదలయ్యాయి. మీరు మొదట్లో అర్పణ అయినప్పుడు ఒంటరిగా ఉన్నారు కానీ పుష్పాన్ని కొంత సమయం ఉంచాల్సి వస్తే ఆకులతో ఉంచుతాము అలాగే మీరు మొదట్లో అర్పణ అయినప్పుడు మీరు మాత్రమే అర్పణ అయ్యారు, తర్వాత మీరు 21 జన్మలు అవినాశిగా ఉండాల్సి ఉంది – కనుక ప్రజలు అనే ఆకులను పెట్టడం జరుగుతుంది. మొదట్లో మీరు వచ్చినప్పుడు ప్రజలు లేరు కానీ ఇప్పుడు పూలైన మీ శోభ ప్రజలు అను ఆకులతోటే ఉంటుంది కనుక ప్రజలను తయారు చేయండి అని బాప్‌దాదా అంటున్నారు.
10. స్నేహంతో పాటు శక్తి రూపులుగా అవ్వండి, అప్పుడు సఫలత లభిస్తుంది
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు, సూర్యుడి దగ్గరకు వెళుతూ ఉంటే వేడి అనిపించినట్లుగా ఈరోజు వతనంలో ముందుకు వెళుతూ ఉంటే ఏదో భట్టీలోకి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఈరోజు బాబా ఎర్రని ప్రకాశంలో ఎలాగైతే అవ్యక్త ఫీచర్లతో కనిపించేవారో అలా కనిపించసాగారు మరియు సూర్యుని సమానంగా కిరణాలను వ్యాప్తి చేస్తున్నారు. క్రింద పెద్ద సభ కనిపించింది. ఇటువంటి బ్రాహ్మణుల సభ సాకార రీతిలో ఎప్పుడూ జరగలేదు. బ్రాహ్మణులందరి పైకి ఆ కిరణాలు వెళ్తున్నాయి. నేను వతనానికి వెళ్ళాను కదా, నా మీదకు కూడా ఆ కిరణాల లైట్ మైట్ వస్తుంది. కొంత సమయం తర్వాత – నేను బాబాతో ఆ రూపంలోనే కలిసాను. బాబా, నేను భోగ్ తీసుకువచ్చాను అని బాబాకు చెప్పాను. బాబా భోగ్‌ను స్వీకరిస్తూ, తింటున్నప్పుడు ఎలా లైట్ మైట్ స్థితిలో ఉండాలో నేర్పిస్తున్నారు. బాబా, పిల్లలకు ప్రియస్మృతులను ఇస్తారు కదా అని తర్వాత నేను బాబాను అడిగాను. ఇందుకు బాబా ఏమన్నారంటే, స్నేహ రూపమైతే చాలా చూసారు, స్నేహంతో పాటు పిల్లల శక్తి రూపం యొక్క స్థితిని బాబా తయారు చేయాలనుకుంటున్నారు, అది ఇంకా తక్కువగా ఉంది. ఈరోజు బాబా స్నేహముతో పాటు శక్తిని కూడా నింపారు. దీని ద్వారానే సేవలో సఫలత లభిస్తుంది అని బాబా చెప్పారు. కేవలం స్నేహము కాదు స్నేహంతో పాటు శక్తిని కూడా నింపండి అని బాబా సందేశము ఇచ్చారు. బాబా దృశ్యంలో చూపించినట్లుగా, పిల్లలు ఈ సృష్టికి లైట్ మైట్ కిరణాలను ఇవ్వాలి. ఇన్ని రోజులు బాబా స్నేహ రూపంలో కలిసారు కానీ ఈరోజు స్నేహంతో పాటు లైట్ మైట్ రూపం కూడా కనిపించింది, నేను అది తీసుకోవడంలోనే లీనమై ఉన్నాను, తర్వాత తిరిగి సాకార వతనంలోకి వచ్చేసాను.
11. ఎడ్వాన్స్లో వెళ్ళి ఉన్న ఆత్మలు నూతన సృష్టికి ఆధారము
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు ఒక సభ ఏర్పాటు అయి ఉంది – క్లాసు జరుగుతుంది. ముందైతే నేను నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్ళాను. బాప్‌దాదా నయనాల ద్వారా స్వాగతం పలికారు. తర్వాత బాబా అన్నారు - బచ్చీ, వీరందరినీ కలువు, ఈ భోగ్‌ను అందరికీ తినిపించు. ఏమి చూసానంటే – ఎవరైతే ఎడ్వాన్స్లో శరీరం విడిచి వెళ్ళారో వారందరినీ ఇమర్జ్ చేసి బాబా క్లాస్ చేస్తున్నారు. తర్వాత అందరికీ మధుబన్ బ్రహ్మాభోజనాన్ని స్వీకరింపజేసాను. ఆ సంగఠనలో, వెళ్ళిపోయిన ఆత్మలందరూ ఉన్నారు. తర్వాత నేను ఒక దృశ్యాన్ని చూసాను – చాలా ఇళ్ళు తయారవుతున్నాయి. ఇంటి పైకప్పు తయారయ్యే సమయంలో దానికి ఎంతో ఆధారాన్ని ఇస్తారు కదా, తర్వాత సిమెంటు గట్టిగా అయ్యాక ఆ ఆధారాలను, కర్రలను తీసివేస్తారు. ఇదే విధంగా ఇంటి పై కప్పు తయారయ్యే పని చాలా జోరుగా జరుగుతుంది. నేను ఆ ఇంటిని చూస్తూ ఉన్నాను, బాబా మాయమైపోయారు. ఇంటిని తయారు చేయడానికి ఆధారాన్ని ఇస్తారు తర్వాత ఆధారాన్ని తీసివేస్తారు – ఈ దృశ్యాన్నే బాబా చూపించారు. ఈ దృశ్యాన్ని చూస్తూ నేను ఇక్కడకు చేరుకున్నాను.
12. స్నేహంతోపాటు జ్ఞాన పునాదిని గట్టిగా చేసుకోండి
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు బాబా కనిపించలేదు. కొద్ది సమయం తర్వాత బాబాను చూసాను, మీరు ఎక్కడకు వెళ్ళారు బాబా అని అడిగాను. బాబా అన్నారు – ఈరోజు సద్గురువారము కనుక పిల్లలందరి వద్దకు వెళ్ళి వచ్చాను. సాకార రూపంలో అయితే ఇంత కొద్ది సమయంలో అన్ని స్థానాలకు చేరుకోవడం వీలు కాదు. ఇప్పుడైతే అవ్యక్త వతనంలో అవ్యక్త విమానం ద్వారా రాకెట్‌కన్నా వేగంగా చేరుకోగలను. నేనన్నాను, మరి బాబా మీరు అందరి వద్దకు వెళ్ళి వచ్చారు కదా, ఏమి చూసారు అని అడిగాను. బాబా అన్నారు – మెజారిటీ పిల్లలు ఇప్పటి వరకు స్నేహంలో మంచిగా ఉన్నారు, ఇప్పుడేమవుతుంది అన్న సంకల్పం కూడా చాలామందిలో ఉంది. సంగఠన ఆధారంగా ఇప్పటివరకు మంచిగానే ఉన్నారు. స్నేహం ఆధారంగా ఏ పిల్లలైతే ఇప్పటివరకు నిలిచి ఉన్నారో ఇప్పుడు స్నేహంతో పాటు జ్ఞాన ఆధారం కొద్దిగా ఢీలా పడినా కానీ పిల్లలపై వాతావరణ ప్రభావం చాలా సులభంగా పడుతుంది. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెకింగ్ చేసుకోవాలి. అయినా కానీ వ్యక్త దేహంలో ఉన్నారు కనుక స్నేహంలో ఫోర్సు మొదట్లో మంచిగానే ఉంటుంది, కానీ ఈ స్నేహంలోనే రోజులు గడుస్తూ ఉంటే వాతావరణ ప్రభావం త్వరగా పడుతుంది. స్నేహం కొద్దీ, శివబాబా కళ్యాణకారి, బాబా ఏది ఇస్తే అది చాలు అని అంటుండవచ్చు, స్నేహం కారణంగా సంకల్పాలను ఆపేసారు. స్నేహం రిజల్టు మెజారిటీ అధికంగా ఉంది. వాతావరణ ప్రభావం మనపై పడకూడదు, మన ప్రభావం వాతావరణంపై ఉండాలి, అప్పుడు పద్ధతి ప్రకారం నడుచుకోగలరు. బాబా, మన వద్ద అయితే జ్ఞాన విషయాలే జరుగుతాయి కదా అని నేను అన్నాను. అప్పుడు బాబా అన్నారు – బచ్చీ, జ్ఞాన పునాదితో స్వయాన్ని సంతుష్టంగా పెట్టుకోవాలి, అటువంటి పిల్లలు తక్కువగా ఉన్నారు. ఈరోజు బాబా ఈ రిజల్టును వినిపించారు. వాతావరణాన్ని మనం మార్చాలి కానీ వాతావరణం మనల్ని మార్చడం జరగకూడదు, ఈ సందేశాన్ని అందరికీ వినిపించమన్నారు బాబా. తర్వాత భోగ్‌ను స్వీకరింపజేసిన తర్వాత బాబా ఒక దృశ్యాన్ని చూపించారు.
ఒక పెద్ద హాలు ఉంది, ఆ హాలులో నలువైపుల నుండి దుర్గంధం వస్తుంది. ఆ గదిలో రెండు మూడు సుగంధభరిత అగరబత్తీలు వెలుగుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా అగరబత్తీల సుగంధము దుర్గంధాన్ని అణిచేసింది. బాబా చెప్పారు – బచ్చీ, నలువైపుల దుర్గంధపు వాతావరణం ఉండినది కదా, కానీ ఇంత చిన్నని అగరబత్తీ వాతావరణాన్ని మర్చేసింది. అలాగే పిల్లలైన మీరు కూడా, వాతావరణ ప్రభావం మీపై పడుతుంది అనిపించినప్పుడు అగరబత్తీ ఉదాహరణను మీ ఎదుటకు తీసుకురండి, నేను సర్వశక్తిమంతుడైన తండ్రి సంతానమును. ఒకవేళ వాతావరణ ప్రభావం మనపై పడితే మనకన్నా అగరబత్తీలు మేలు కదా. పిల్లలైన మీరు ఎప్పుడైతే శక్తిశాలిగా, సుగంధభరితంగా అవుతారో అప్పుడు ఈ వాతావరణం అణిగిపోతుంది. బాబా అన్నారు, ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరికీ శిక్షణ అయితే లభించింది. శిక్షణను కూడా అందరూ మధురంగా స్వీకరించారు. కానీ ఎలా అయితే మధురంగా వింటున్నారో అలాగే మధురమైన రూపాన్ని ధారణ కూడా చేయాలి. తియ్యదనం తొందరగా అంటుకుంటుంది. ఎవరైతే ఇలా తియ్యగా తయారవుతారో వారు బాబాకు అంటుకుపోతారు. స్మృతి మరియు తియ్యదనము లేకపోతే వేరువేరుగా ఉంటారు. ఉప్పటి పదార్థాలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి, ఇలా ఉండే వారి స్థితి యోగయుక్తంగా ఉండదు. ఇప్పుడు ఏదైతే పిల్లలు విన్నారో అది అలాగే ధారణ చేసినట్లయితే బలం లభిస్తుంది.
13. అంతిమ వినాశన దృశ్యాన్ని చూడటానికి నిశ్చల స్థితిని తయారు చేసుకోండి
ఈరోజు నేను వతనానికి వెళ్ళినప్పుడు బాబా మరియు దాదా ఇద్దరూ ఎదురుగా నిల్చుని ఉన్నారు. వెళ్ళగానే నయనాల ద్వారా మిలనం జరిగింది, అప్పుడే అందరి ప్రియస్మృతులను అందించాను. నేను అందరి స్మృతిని ఇస్తున్నప్పుడు సాకార బాబా నా చేతిని పట్టుకున్నారు. అలా చేయి పట్టుకున్నప్పుడు ఏ మాయ జరిగిందోగానీ, సాగరంలో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా నేను కొంత సమయం ప్రేమ సాగరంలో లీనమైపోయాను. తర్వాత నేను ఆల్మైటీ బాబా వైపు చూసాను. బాబా అన్నారు, బచ్చీ, బాబాలో ముఖ్యంగా ఏ రెండు గుణాలైతే ఉన్నాయో వాటిని పిల్లలు సాకారంలో అనభవం చేసారు. ఆ రెండు గుణాలు ఏమిటి? ఎంతగా జ్ఞాన స్వరూపమో అంతగానే ప్రేమ స్వరూపము. పిల్లలు కూడా ఈ రెండు గుణాలను తమ నడవడికలో ధారణ చేసుకోవాలి. తర్వాత నేను బాబాను అడిగాను, ఇంతకుముందు, వతనంలో, వెళ్ళిపోయిన పిల్లల సంగఠన ఏదైతే జరిగిందో దాని రహస్యము ఏమిటి? పూర్తి రహస్యము అయితే తర్వాత వినిపిస్తాము, కానీ సాకార రూపంనుండి కొందరు సేవార్థంగా వెళ్ళిపోయారు, మరి కొందరు లెక్కాచారాలను తీర్చుకోవడానికి వెళ్ళిపోయారు, ఆ పిల్లలను కలుసుకోవడానికి పిలిపించాము. బాబా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు, ఎవరెవరు, ఏ రీతిలో, ఏ రూపంలో ఏమేమి చేస్తున్నారు అని అడిగాము. బాబా, వీరు ఏ రూపంలో స్థాపనా కార్యంలో బిజీగా ఉన్నారు అని నేను అడిగాను. బచ్చీ, ఇదైతే కాలం గడుస్తున్న కొద్దీ స్పష్టమవుతుంది, అయినా కానీ క్లుప్తంగా వినిపిస్తాము అంటూ బాబా ఇలా వినిపించారు – బచ్చీ, యుద్ధం జరిగేటప్పుడు ఏ సైన్యమైనా గెలవాలంటే కేవలం ఒక వైపు నుండే కాదు నాలుగు వైపుల నుండి సైన్యాన్ని పంపి చుట్టుముడ్తారు. ఈ సంగఠనతో ఏమి తెలిసిందంటే పిల్లలు ఎవరైతే వెళ్ళారో వారు నలువైపుల వ్యాప్తి చెంది ఉన్నారు. ఇప్పుడు నలు వైపుల స్థాపనకు పునాది పడింది. ఇప్పుడిక కేవలం ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంది, అంతే.
తర్వాత బాబా నాలుగు దశల మెట్లను చూపించారు. మొదటి దశ – జ్ఞానం వినిపించడము, ఆలోచించడము, అర్థం చేసుకోవడము మరియు నిశ్చయం జరగడము. కొందరు ఆలోచిస్తారు, కొందరు మధనం చేస్తారు. రెండవ దశ – అంతిమ సమయంలో ఎలా వినాశనం అవుతుంది. ఒకచోట వరదలలో మునిగిపోతున్నారు, మరోచోట మరొకటి జరుగుతుంది కానీ శక్తి సైన్యము మరియు పాండవులు మాత్రం స్థిరంగా నిల్చుని ఉన్నారు. మూడవ స్టేజిలో ఆత్మలు పరంధామానికి గాలిబుడగలులాగా వెళ్తున్నాయి. ఆ తర్వాత పరంధామం దృశ్యాన్ని కూడా బాబా చూపించారు. నాల్గవ దృశ్యము – స్వర్గము. స్వర్గంలో ఆత్మలు ఎలా చిన్న చిన్న పిల్లలలో ప్రవేశిస్తాయి అని చూపించారు. ఈ నాలుగు స్టేజీలు మెట్ల చిత్రం రూపంలో చూపించారు. ఈ మెట్లు చూపించడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేస్తూ బాబా ఇలా అన్నారు - ఇప్పుడు మేము ఏ స్టేజిలో ఉన్నాము అని పిల్లలు తమ బుద్ధిలో ఆలోచిస్తూ ఉండాలి. ధారణ చేయవలసిన అంతిమ స్థితిని లక్ష్యంగా బుద్ధిలో పెట్టుకుంటే పురుషార్థం వేగంగా జరుగుతుంది. వినాశన సమయంలో ఏ దృశ్యమునైతే చూపించామో అందులో పిల్లలైన మీరు నిశ్చల స్థితిలో ఉండాలి. ఆ తర్వాత బాబా నా చేతికి చాలా వజ్రాలు ఇచ్చి, ఈ వజ్రాల తిలకాన్ని పిల్లలందరికీ పెట్టమన్నారు. ఈ వజ్రాలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఆత్మ వజ్ర సమానంగా మస్తక మధ్యలో ఉంటుంది. ప్రతి ఆత్మ సత్యమైన వజ్రంలా మెరుస్తూ ఉండాలి. అచ్ఛా.
ఓంశాంతి