Search for a command to run...
20 March 1969 · తెలుగు
అందరూ ఏ స్మృతిలో కూర్చున్నారు? ఏ దేశంలో కూర్చున్నారు – వ్యక్త దేశంలో ఉన్నారా లేక అవ్యక్త దేశంలో ఉన్నారా? అవ్యక్తాన్ని వ్యక్తంలోకి తీసుకు వచ్చారా లేక మీరు అవ్యక్తం అయ్యారా? ఇప్పుడు ఈ మిలనాన్ని ఎక్కడ జరుపుకుంటున్నారు? అవ్యక్తుడిని వ్యక్త దేశంలోకి ఆహ్వానించారు. అందుకని అవ్యక్త బాప్దాదా వ్యక్త దేశంలో అవ్యక్త రూపంలో కలుసుకుంటున్నారు. అవ్యక్త రూపాన్ని వ్యక్తంలోకి తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? (ఇప్పుడు తయారీ జరుగుతుంది, పురుషార్థం జరుగుతుంది) ఎంత సమయం కావాలి? సంపూర్ణ స్థితిని ఈ సాకార రూపంలోకి తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? దర్పణంలో అయితే చూడగలరు కదా? సంపూర్ణ స్థితి యొక్క చిత్రాన్ని సాకారంలో చూసారు. సాకార తనువు ఏదైతే ఉండినదో అది సంపూర్ణ కర్మాతీత స్థితిలో లేదా? దానితో పోల్చి చెప్పండి. వారి వలె అయితే అవ్వవలసిందే. గుణాలనే ధారణ చేయాలి. మరి వారి అంతిమ స్థితికి మరియు మీ వర్తమాన స్థితికి ఎంత తేడా ఉంది? అందుకోసం ఎంత సమయం కావాలి? సాకారుడి రుజువును ఈ కళ్ళతో చూసారు. వారి ప్రతి గుణాన్ని, వారి ప్రతి కర్మను, మాటను మీతో పోల్చి చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సమయం అనుసారంగా 25 శాతం కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. పురుషార్థం చేయడానికి సమయం చాలా తక్కువగా ఉంది. కనుక, ఎలా అయితే స్మృతి యొక్క చార్టును పెడతారో అలాగే ఇప్పుడు ఈ చార్టును కూడా పెట్టండి. సాకారుడు ఏ కర్మను అయితే చేసేవారో, ఏ స్థితి, ఏ స్మృతి ఉండేదో వాటన్నింటితో పోల్చుకోండి. అచ్ఛా!
ఈరోజు కుమారీలకు పరీక్ష పెడ్తాము. అందరూ ఏదైతే పురుషార్థం చేస్తున్నారో అందులో ఏడు విషయాలను విడిచిపెట్టాలి మరియు ఏడు విషయాలను ధారణ చేసుకోవాలి. అవి ఏవి? (కుమారీలు అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు) విడిచిపెట్టాల్సినవైతే అందరికీ వినిపిస్తారు. 5 వికారాలు మరియు దానితో పాటు ఆరవది బద్ధకము మరియు ఏడవది భయం. ఈ భయం కూడా చాలా పెద్ద వికారము. శక్తుల ముఖ్య గుణమే నిర్భయత. కావున భయాన్ని కూడా విడిచిపెట్టాలి. అచ్ఛా, ఇప్పుడు ధారణ చేయవలసినవి ఏవి? తమ స్వరూపాన్ని తెలుసుకోవడము, అంటే స్వరూపము, స్వధర్మము, స్వ దేశము, సుకర్మ, స్వ లక్ష్యము, స్వ లక్షణము మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. ఈ ఏడు విషయాలను ధారణ చేసుకోవాలి. వీటిని ధారణ చేసుకుంటే ఎలా అవుతారు? శీతలా దేవి. కాళిగా అవ్వకండి. ఇప్పుడు శీతలా దేవిగా అవ్వాలి. వికారాలపై కాళిగా అవ్వండి. అసురుల ముందు కాళిగా అవ్వండి కానీ మీ బ్రాహ్మణ కులంలో శీతలంగా ఉండండి. అచ్ఛా!
ఓంశాంతి