Search for a command to run...
15 Feb 1969
ఎవరికైతే తండ్రి, టీచరు మరియు సద్గురువుతో పూర్తి కనెక్షన్ ఉంటుందో వారే సౌభాగ్యశాలురు
15 February 1969 · తెలుగు
(శివరాత్రి సందర్భంగా అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు - సంతరీ దాదీ తనువు ద్వారా)
ఈరోజు ఎవరిని స్వాగతం చేసే రోజు? (తండ్రి మరియు పిల్లలను) కానీ కొంతమంది పిల్లలు తమను తాము కూడా మర్చిపోయి ఉన్నారు, తండ్రిని కూడా మర్చిపోయి ఉన్నారు. ఇంతకముందు జరిగిన విధంగా ఇప్పుడు స్వాగతం ఉందా? ఎన్ని ఉత్తరాలు వచ్చేవి! అంటే మర్చిపోయారు కదా! బాబా ఉండనే ఉన్నారు అన్నప్పుడు మరి ఎప్పటి వరకు మర్చిపోతారు! ఇది నిశ్చయము, ఇది చదువు. చదువు స్థిరంగా ఉంటే కార్యం కూడా ఎలా ఉందో అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ నిశ్చయం లేదంటే కార్యంలో కూడా కొంచెం...... నేను ఎవరి సంతానమును అని పిల్లలు తమ పదవిని అర్థం చేసుకున్నారు. బాబా సదా ఉన్నారంటే పిల్లలు కూడా సదా ఉంటారు. కానీ దేహ అభిమానము మీ స్వధర్మాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మర్చిపోతే కార్యం ఎలా జరుగుతుంది? ఎలా ముందుకు వెళ్తారు? బాబా తమ పరిచయాన్ని ఇచ్చారు, పిల్లలకు కూడా తమ పరిచయం లభించింది. ఎంత సమయం నుండి ఈ లక్ష్యాన్ని పక్కా చేయించడంలో కష్టపడటం జరిగింది? ఆ కష్టానికి ఫలితం ఎక్కడ ఉంది? కేవలం గుర్తు తెప్పించడానికి ఇది చేస్తున్నాము, మురళి అయితే చెప్పేది లేదు. కేవలం పిల్లలను కలుసుకోవడానికి వచ్చాము. చాలా గుర్తు చేస్తున్నారు, బాబా, మీరు వస్తే చాలా రిఫ్రెష్ అవుతారు అని బిడ్డ చెప్పింది. రిఫ్రెష్ అయ్యే ఉన్నారు – ఒకవేళ నిశ్చయం ఉంటే. అయినా కానీ, కొద్ది సమయం కోసం పిల్లలను కలుసుకోవడానికి రావలసి వచ్చింది. స్వమాన స్మృతిని ఇప్పించడానికి వచ్చాము. పిల్లలూ, సదా స్వయాన్ని సౌభాగ్యశాలిగా భావించండి. ఎవరికైతే తండ్రి, టీచరు మరియు సద్గురువుతో పూర్తి కనెక్షన్ ఉంటుందో, పూర్తి తపన ఉంటుందో వారినే సౌభాగ్యశాలి అనడం జరుగుతుంది.
కన్యకు నిశ్చితార్థం జరిగిన తర్వాత ఏమి జరుగుతుంది? భర్తతో ఆకర్షణ ఏర్పడుతుంది. అప్పుడే సదా సౌభాగ్యవతి అంటారు. కానీ తను ఎప్పటివరకు సౌభాగ్యవతి? లోపల ఏమి నిండి ఉంది? కన్య అంటే వంద బ్రాహ్మణులకన్నా ఉత్తమురాలు అంటారు. నిశ్చితార్థం తర్వాత అశుద్ధంగా అయిన కారణంగా ఆంతరికంగా దౌర్భాగ్యశాలిగా అవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. సదా సౌభాగ్యవతి ఎవరు అవుతారు అన్నది బాబానే చెప్తారు. సదా పరమాత్మయందు పూర్తి తపన ఉన్నవారే సదా సౌభాగ్యవతులు.
ఇది చదువుకనే సమయము. బాబా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు, డైరెక్షన్లు ఇస్తూ చదివిస్తున్నారు. ఎప్పటివరకు చదివించాలో అప్పటివరకు చదివిస్తూ ఉంటారు. వినాశనం ఎదురుగా ఉంది, ఆ కనెక్షన్ బాబాతో ఉంది. బాబా దూరమవుతారు అని అనుకోకండి. దూరమయ్యేది లేదు, వీడ్కోలు చెప్పేది కూడా లేదు. వినాశనం అవ్వనంత వరకు బాబా తోడు ఉంటుంది. ఏదో కార్యం చేయడానికే బాబా వతనానికి వెళ్ళారు. సమయానుసారంగా ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఇందులో విడిపోవడం లేదు, దూరమవ్వడం లేదు, దూరమైనట్లుగా అనిపిస్తుందా? మీరు వీడ్కోలు పలికారా? ఒకవేళ వీడ్కోలు చెప్పి ఉంటే దూరం కూడా అవ్వాలి కదా. వీడ్కోలు చెప్పి ఉండకపోతే దూరమవ్వడం కూడా ఉండదు. ఇదంతా డ్రామాలో పాత్ర జరుగుతూ ఉంటుంది. బాబా ఆట జరుగుతుంది. ఆటలో ఆట జరుగుతుంది. ఇకముందు మరెన్నో ఆటలు చూసేది ఉంది. అంత ధైర్యము ఉందా? ధైర్యమును ఉంచితేనే చాలా చూడగలరు. ఎన్నో ఆటలు చూసేది ఉంది. అయితే అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తూ నడవాల్సి ఉంటుంది. ఒకవేళ జాగ్రత్తగా నడవకపోతే ఎక్కడైనా గుంతలు కూడా రావచ్చు, ప్రమాదాలు కూడా జరగవచ్చు. పిల్లలను కలవడానికి కొద్ది సమయం కోసం వచ్చాము. చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. వతనం నుండి చాలా చేయాల్సి ఉంటుంది. పిల్లల కోరికను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది, భక్తుల కోరికలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని కార్యాలు సంగమంలోనే జరుగుతాయి. బాబా పరిచయం లభించింది అంటే ఖజానా, లాటరీ లభించినట్లే. ఇప్పుడు పిల్లల సేవను పూర్తి చేసాము. వతనం నుండి ఇఫ్పుడు అందరి సేవలను పూర్తి చేయాలి. పిల్లలు సొంతవారు కూడా ఉన్నారు, సవతి పిల్లలు కూడా ఉన్నారు. అందరి సేవను చేయాల్సి ఉంటుంది కదా. ఉదయం కూడా వచ్చి దృష్టి ద్వారా పరిచయాన్ని ఇచ్చాము. దృష్టి ద్వారా సర్చ్లైటును ఇచ్చి అందరికీ సుఖాన్ని ఇవ్వడము తండ్రి కర్తవ్యము. ఇప్పుడైతే అందరూ మ్యూజియం సేవ చేయాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబా ఏ సేవా చిత్రాలనైతే తయారుచేయించారో వాటితో సేవ చేయాలి. వేలంత సహయోగము కూడా పర్వతాన్ని ఎత్తగలదు. గోపగోపికలు తమ వేలుతో పర్వతాన్ని ఎత్తారు అన్నదే కదా గాయనము. వేలు ఇవ్వకపోతే పర్వతం లేవదు. సృష్టిలోని ఆత్మల ఉద్ధరణ చేసి, ఆ పర్వతాన్ని ఎత్తి తర్వాత తోటి తీసుకువెళ్ళాలి. సమూహము ఉంటుంది కదా. అంతిమంలో సమూహంగా అయ్యి అందరితో కలిసి ఉండాలి. ఆరంభంలో సాక్షాత్కారంలో ఎర్రని సమూహాలను చూసాము, అప్పుడు అర్థం కాలేదు కానీ అది ఆత్మల సమూహము, వారిని కూడా మనతో తీసుకువెళ్ళాలన్నది ప్రోగ్రాము అని ఇప్పుడు అర్థమయింది. అందరి సేవను చేయాలి. అచ్ఛా.
ఉదయం లేచి బాబా స్మృతిలో ఉండండి, ఎందుకంటే ఆ సమయంలో బాబా అందరి స్మృతిలో ఉంటారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు కనిపించరు. వెతకాల్సి వస్తుంది. ఒంటరిగా స్మృతి చేస్తుండవచ్చు, కానీ సంగఠనతో పాటు కూడా తప్పకుండా నడుచుకోవాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా బాబాకు సమీపంగా ఉంటారు. బాబాను మర్చిపోతే వాడిపోతారు. బాబాను సదా తోడు పెట్టుకుంటే మర్చిపోరు.
ఓంశాంతి