Search for a command to run...
6 Feb 1969
మహిమను వినడము మానండి, మహాన్గా అవ్వండి
6 February 1969 · తెలుగు
అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారా? చదువు యొక్క సారమైతే అర్థమయ్యింది. ఆ సారాన్ని జీవితంలోకి తీసుకువచ్చి ప్రపంచానికి ఆ రహస్యాన్ని వినిపించాలి. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం అర్థమయింది కదా. ఎంతో విన్నారు, ఇప్పుడు ఏదైతే విన్నారో దాని స్వరూపులుగా అయ్యి అందరికీ చూపించాలి. ఎలా చూపిస్తారు? మీ ప్రతి నడవడికలో బాబా మరియు దాదా చరిత్ర కనిపించాలి. మీ కళ్ళల్లో ఆ బాబానే చూడాలి. మీ వాణితో వారి జ్ఞానాన్నే వినాలి. ప్రతి నడవడికలో, ప్రతి చరిత్ర ఇమిడి ఉండాలి. కేవలం బాబా చరిత్రయే కాదు, బాబా చరిత్రను చూసి పిల్లలు కూడా చరిత్రవంతులుగా అవ్వాలి. మీ చిత్రంలో ఆ అలౌకిక చిత్రాన్ని చూడాలి. మీ వ్యక్త రూపంలో అవ్యక్త మూర్తి కనిపించాలి. ఇటువంటి పురుషార్థం చేసి, బాప్దాదా కష్టానికి ఫల స్వరూపాన్ని చూపించండి. ఎలా అయితే అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది పిల్లలను చూస్తే వారి తండ్రియే కనిపిస్తారు, వారి మాటలు-చూపు అన్నింటిలో తండ్రిలాగే ఉన్నారు అంటారు. ఇదే విధంగా ఎవరైతే అనన్య పిల్లలు ఉన్నారో, వారందరి ద్వారా తండ్రి గుణాలు ప్రత్యక్షం అవ్వాలి, అవుతుంది. ఎలా అవుతుంది? అందుకు చేయవలసిన ముఖ్య ప్రయత్నం ఏమిటి? ఆ విషయాన్ని సాకార రూపం ద్వారా కూడా విన్నారు, అది, స్మృతి యాత్ర, అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి ప్రతి కర్మను చేయాలి.
ఇప్పుడు పిల్లలు చాలా ఎదుర్కోవలసి ఉంది. కానీ సమర్థుడు తోడుగా ఉన్నారు కనుక ఏమీ కష్టం ఉండదు. కేవలం ఒక్క విషయంపై అందరూ శ్రద్ధ వహించాలి, ఎదుర్కుంటూ ఉంటే మధ్యలో ఆటంకం కూడా ఉంటుంది. ఎదుర్కోవడంలో వచ్చే ఆటంకం ఏమిటి? తెలుసా? (దేహ అభిమానము) దేహ అభిమానమైతే మూల విషయము కానీ ఎదుర్కోవడానికి మధ్యలో కామన (కోరిక) విఘ్నం అవుతుంది. ఏ కామన? నా పేరు రావాలి, నేను ఇలా, నా సలహా ఎందుకు తీసుకోలేదు, నాకు విలువ ఎందుకు ఇవ్వలేదు? ఇటువంటి అనేక రకాల కామనలు ఎదుర్కోవడంలో విఘ్న రూపంగా అవుతాయి. నాకు ఎటువంటి కామనలు ఉండకూడదు అన్నది గుర్తు పెట్టుకోండి. ఎదుర్కోవాలి (సామనా). ఏదైనా కామన ఉన్నట్లయితే సామనా చేయలేము, మరియు అవ్యక్త స్థితిలో మహాన్గా అవ్వడానికి, ఎప్పుడూ చెప్తూ ఉండే ఒక్క విషయాన్ని ధారణ చేస్తే చాలా త్వరగా మరియు సహజంగా అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. అది ఏ విషయము? నేను అతిథిని. ఎందుకంటే మీరందరూ కూడా వయా సూక్ష్మవతనం మీదుగా ఇంటికి వెళ్ళాలి. నేను అతిథి(మెహమాన్)ని అని భావించినట్లయితే మహాన్ స్థితిలో స్థితి కాగలరు. మెహమాన్ అని అనుకోవడానికి బదులుగా ఒక్క అక్షరంలో తేడా తెస్తే క్రింద పడిపోతారు. అది ఏ మాట? మెహమాన్ అనుకోండి, మహిమ కావాలి అని అనుకోవద్దు. మహిమలోకి వెళితే మెహమాన్ అవ్వలేరు. మెహమాన్ అనుకుంటే మహాన్గా అవుతారు. చిన్న తేడానే. మెహమాన్ మరియు మహిమ, కానీ ఈ కొద్దిపాటి తేడానే అవస్థను చాలా అలజడిలోకి తెచ్చేస్తుంది.
మీరు అందరికీ ఏ జ్ఞానాన్ని ఇస్తారు? త్రిమూర్తుల జ్ఞానము. ఎలా అయితే త్రిమూర్తుల జ్ఞానాన్ని అందరికీ ఇస్తారో అలాగే మీ వద్ద కూడా మూడు మాటల జ్ఞానాన్ని సదా పెట్టుకోండి. మూడు మాటలను వదిలిపెట్టండి, మూడు మాటలను ధారణ చేయండి. ఈ మూడు విషయాలను విడిచి పెడితే అప్పుడే స్వరూపంలో స్థితి కాగలరు. సేవలో సఫలత కూడా లభిస్తుంది. ఏ మూడు విషయాలను విడిచిపెట్టాలో చెప్పండి. సేవలో విఘ్నం వేసే వాటిని విడిచి పెట్టాలి. ఒకటి – ఎప్పుడూ ఏ సాకు చెప్పకండి. సాకు (బహానా), సేవ కోసం చెప్పించుకోవడము (కహలానా) మరియు సేవలో వాడిపోవడము (మురఝానా) ఈ మూడు విషయాలను విడిచిపెట్టండి. అలాగే ఏ మూడు విషయాలను ధారణ చేయాలి? త్యాగము, తపస్సు మరియు సేవ. ఈ మూడు విషయాలు ధారణ చేయాలి. తపస్సు అనగా స్మృతి యాత్ర. సేవ లేనిదే జీవితం తయారవ్వదు కూడా. ఈ రెండు విషయాల సఫలత త్యాగము లేకుండా జరగదు. కనుక, మూడు విషయాలను విడిచిపెట్టాలి మరియు మూడు విషయాలను ధారణ చేయాలి. ఒకవేళ ఈ మూడు విషయాలు ధారణ జరిగినట్లయితే ఎలా తయారవుతారు? మీ గాయనం ఏదైతే ఉందో ఆ స్వరూపులుగా అయిపోతారు. ఇక్కడ ఆబూలో కూడా మీ గాయనము ఉంది, ఏ రూపంలో మరియు ఏ రూపము మీకు స్మృతిచిహ్నము? తపస్సుతో పాటు మరింకేదైనా ముఖ్య రూపంలో స్మృతి చిహ్నము ఉన్నదా? ఎవరైతే దిల్వాడా మందిరాన్ని శ్రద్ధతో చూసి ఉంటారో వారికి గుర్తుంటుంది. తపస్వీగా కూడా ఉన్నారు మరియు త్రినేత్రిగా కూడా ఉన్నారు. తపస్సుతో పాటు త్రిమూర్తుల స్మృతి ఉంది. త్రినేత్రి అన్న స్మృతిచిహ్నము వలె అవ్వాలి. ఏ మూడవ నేత్రము? జ్ఞానము. జ్ఞానం యొక్క మూడవ నేత్రమే స్మృతిచిహ్నము రూపంలో చూపించారు. తపస్వీ మరియు త్రినేత్రి. మూడవ నేత్రము స్థిరంగా ఉంటేనే తపస్వీగా అవుతారు. ఒకవేళ జ్ఞాన నేత్రము మాయమైపోతే తపస్సు కూడా జరగదు. కనుక ఇప్పుడు త్రిమూర్తి అన్న మాటను కూడా గుర్తుంచుకుని ధారణ చేసినట్లయితే అలా తయారవుతారు. శక్తుల గాయనము, ప్రభావము ఏదైతే గాయనము ఉందో అది కనిపిస్తుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. ఇప్పటివరకు శక్తులు ఎందుకు గుప్తంగా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటివరకు మీ స్వమానము, మీ సేవ మరియు మీ శ్రేష్ఠతలు మీ నుండే గుప్తంగా ఉన్నాయి. మీ నుండే గుప్తంగా ఉన్న కారణంగా సృష్టిలో కూడా గుప్తంగా ఉన్నాయి. స్వయంలో ప్రత్యక్షత వచ్చినప్పుడు సృష్టిలో కూడా ప్రత్యక్షత జరుగుతుంది.
ఇప్పుడు రాబోయే శివరాత్రి పండుగను మరింత ఆడంబరంగా జరపండి. ఎంతో ఉల్లాసము మరియు ఉత్సాహముతో పరిచయాన్ని ఇవ్వండి. ఎందుకంటే తండ్రి పరిచయంలో పిల్లల పరిచయం కూడా వచ్చేస్తుంది. పిల్లలు తండ్రి పరిచయం ఇస్తే అప్పుడు తండ్రి అవ్యక్తంలో పిల్లల పరిచయాన్ని, పిల్లల సాక్షాత్కారాన్ని ఆత్మలకు చేయిస్తారు. మరి ఈ శివరాత్రి నాడు ఏదైనా నవీనత చేసి చూపించండి. ఏ నవీనత చేస్తారు? ఇప్పటివరకు ఏ భాషణ అయితే ఇచ్చారో అది యథా యోగము యథా శక్తి అనుసారంగా చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా శక్తి రూపంగా అయ్యి భాషణ చేయండి. శక్తి రూపంలో ఉండి భాషణ చేయడం అంటే ఏమిటి? గర్జించడము. ఏమని గర్జిస్తారు? మరింత జోరుగా సమయము యొక్క పరిచయాన్ని ఇవ్వండి. బాబా చేసే ఈ కర్తవ్యం ఎక్కువ సమయం ఉండదు అని పదే పదే వినిపించండి. కొంతైతే చేతులనుండి పోగొట్టుకున్నారు, కానీ ఇప్పుడు మిగిలి ఉన్న సమయాన్ని పోగొట్టుకోకండి. ఇంత ఫోర్సుగా సమయం యొక్క పరిచయాన్ని ఇవ్వండి. ఎలా అయితే ఈ రోజుల్లో సైన్సు వారు ఎలాంటి బాంబులను తయారు చేస్తున్నారంటే తమ స్థానంలో కూర్చునే ఎక్కడ బాంబు వేయాలో అక్కడికి గురి పెట్టి దూరంగా కూర్చునే చేయగలుగుతున్నారు. మరి సైన్సు శక్తికన్నా శ్రేష్ఠమైనది సైలెన్సు శక్తి. ఎలా అయితే సైన్సు వారు సైన్సు బాంబులను తయారు చేస్తున్నారో అలాగే ఇప్పుడు శక్తులు సైలెన్సు యొక్క శక్తి బాంబులను విసరండి. ఆరంభంలో శక్తుల గర్జనే జరిగింది. ఇప్పుడు ఆరంభంలో ఉన్న గర్జన లేదు. ఇప్పుడు విస్తారంలోకి వెళ్ళిపోయారు. విస్తారంలోకి వెళ్ళిన కారణంగా గర్జన రూపము గుప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ బీజరూప స్థితిలో స్థితులై గర్జించండి. ఆ గర్జనతో అనేకులలో బీజము పడవచ్చు. కానీ బీజరూప స్థితిలో స్థితులై ఉంటే అనేక ఆత్మలలో సమయాన్ని గుర్తించడము మరియు తండ్రిని గుర్తించడము అనే బీజాలు పడతాయి. ఒకవేళ బీజరూప స్థితిలో స్థితి అవ్వకుండా, కేవలం విస్తారంలోనే ఉంటే ఏమవుతుంది? ఎక్కువ విస్తారం వలన కూడా విలువ ఉండదు. వృధా అయిపోతుంది. కనుక బీజరూప స్థితిలో స్థితులై, బీజరూపుడి స్మృతిలో స్థితి అయ్యి తర్వాత బీజమును వేయండి. అప్పుడు చూడండి ఈ బీజము ఇచ్చే ఫలము ఎంత మంచిగా మరియు సహజంగా వస్తుందో! ఇప్పటివరకు శ్రమ ఎక్కవ జరిగింది, ప్రత్యక్ష ఫలితము తక్కువగా ఉంది. ఇప్పుడు తక్కువ శ్రమ చేయండి, ప్రత్యక్ష ఫలాన్ని ఎక్కువ చూపించండి. స్నేహమైతే అందరికీ ఉంది కానీ స్నేహ స్వరూపాన్ని కూడా కొంచెం చూపించాలి కదా. అసలైతే ఎప్పటికీ ఈ స్థితిలో ఉండాలి కానీ ప్రత్యేకంగా శివ రాత్రి వరకు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏమని భావించాలంటే, ఎలా అయితే ఆరంభంలో పిల్లలకు భట్టీ కార్యక్రమాలు జరిగేవో, అదే విధంగా శివరాత్రి వరకు నేను స్మృతి యాత్ర భట్టీలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. పూర్తిగా అవ్యక్త స్థితిలో స్థితి అవ్వడము, స్వ చెకింగ్ చేసుకోవడముపై శ్రద్ధ వహించండి. అప్పుడు చూడండి ఈ అవ్యక్త స్థితి యొక్క ప్రభావము ఎంత ఉంటుందో! కష్టమేమీ కాదు. చాలా సహజము. కార్య వ్యవహారాలలోకి వస్తూ కూడా భట్టీ చేయవచ్చు. ఇదైతే ఆంతరిక స్థితి. ఆంతరిక స్థితి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది.
అందరూ అమృతవేళ మిలనం చేస్తున్నారా? ఇప్పటి వరకు ఇంకా అటువంటి వాయుమండలం చేరుకోలేదు. ఇప్పటివరకు మధుబనం వారు కూడా స్నేహానికి రుజువును ఇవ్వలేదు. నలువైపులలోని అతి కొద్దిమంది పిల్లలే స్నేహానికి రుజువును ఇచ్చారు. బాబాకు పిల్లలపై ఎంత స్నేహము ఉండినది? ఏమి ఇచ్చారు? గుర్తుందా? తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ఏమి రుజువును ఇచ్చారు? తమ శారీరక స్థితిని కూడా చూడకుండా ఎంతో సమయం ప్రత్యేకంగా సర్చ్ లైట్ ఇచ్చేవారు. స్నేహానికి రుజువు ఎంతో సమయం ఇచ్చారు. శరీరంపై ప్రభావం పడుతుంది అని మీరు చెప్పినాకానీ బాబా తమ శరీరాన్ని చూసుకున్నారా? ఇది స్నేహానికి రుజువు. ఇప్పుడు పిల్లలు కూడా స్నేహానికి రిటర్నుగా రుజువును చూపించాలి. ఏ కర్మను అయితే చేసి చూపించారో అదే చేయాలి. అమృతవేళ ఎలా అయితే సాకార రూపం చేసి చూపించారో అలాగే పిల్లలు కూడా చేయాలి. లేకపోతే ఇప్పటి వరకు ఇదే రిజల్టును చూసాము. లేచాము, కూర్చున్నాము అనే దానిలోనే మీ మనసును సంతోషపెట్టుకుంటున్నారు. కానీ ఆ నషా, శక్తి స్వరూప స్మృతి ఉండటం లేదు. శక్తి రూపానికి బదులుగా ఏమి మిక్స్ అవుతుంది? బద్ధకము. బద్ధకము మిక్స్ అవ్వడం వలన మిలనం చేసుకుంటున్నా కానీ లైన్ క్లియర్గా ఉండటం లేదు, అందుకే మిలనం ద్వారా ఏ అనుభవం అయితే జరగాలో దానిని చేసుకోలేకపోతున్నారు. మిక్స్చర్ ఉంది. ఇక్కడ మొదలు పెడితే మధుబన వాసులను చూసి అందరూ చేస్తారు. మధుబన నివాసులు, ముఖ్యంగా ఎవరైతే స్నేహీలుగా ఉన్నారో వారు ముఖ్యంగా సాక్రిఫైస్ (బలిదానం) చేయాల్సి ఉంటుంది. స్నేహంలో ఎప్పుడూ త్యాగం చేయడం ఉంటుంది. అచ్ఛా!
ఓంశాంతి