Search for a command to run...
17 Nov 1969
నేల నుండి నింగి పైకి వెళ్ళేందుకు యుక్తులు
17 November 1969 · తెలుగు
ఇక్కడ భట్టీకి ఎందుకు వచ్చారు? దేహంలో ఉంటూ విదేహిగా ఉండే అభ్యాసాన్ని చేయడానికి వచ్చారు. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుండే ఈ స్థితి ఉండాలి. ఏ లక్ష్యమునైతే పెట్టుకున్నారో దానిని పూర్తి చేయడానికి అభ్యాసము మరియు అటెన్షన్ కావాలి. బాప్‌దాదా ప్రతి ఒక్కరినీ క్రొత్త విషయం కోసమే పిలిపిస్తారు. అధర్ కుమారులను విశేషంగా పిలిపించాము – ముందుగా మీ గృహస్థ వ్యవహారాన్ని ఏదైతే తయారు చేసుకున్నారో, అందులో మీరెక్కిన తప్పుడు మెట్లనుండి క్రిందకు దింపడానికి పిలిపించాము. తప్పుడు మెట్లనుండి దింపి దేనిపైకి ఎక్కిస్తారు? నేల నుండి నింగికి, మళ్ళీ నింగి నుండి నేల పైకి. తప్పుడు మెట్లకు సంబంధించి ఏదైతే జ్ఞానముందో, ఆ జ్ఞానము నుండి అజ్ఞానిగా చేయడానికి మరియు ఏదైతే సత్య జ్ఞానము ఉందో దాని అవగాహనను ఇచ్చి శాంత స్వరూపులుగా తయారు చేయడానికి పిలిపించాము. ముందు దించాలి తర్వాత ఎక్కించాలి. ఎప్పటివరకైతే పూర్తిగా దిగరో అప్పటివరకు ఎక్కలేరు కూడా. అన్ని విషయాలలో దిగడానికి తయారుగా ఉన్నారా? ఎంత పెద్ద మెట్లనుండి దిగాలి? తప్పుడు మెట్లు ఎంత పెద్దవి? ఇప్పటివరకు చేసిన పురుషార్థంతో పూర్తిగా ఈ తప్పుడు మెట్లను దిగాము అని అనుకుంటున్నారా లేక ఇంకా దిగాలా? పూర్తిగా దిగినప్పుడు ఎక్కడంలో ఆలస్యం అవ్వదు. కానీ దిగుతూ దిగుతూ ఎక్కడో అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు ఏ లక్ష్యంతో పిలిపించామో అర్థమయిందా? 63 జన్మలలో ఏవైతే తప్పుడు మెట్లను ఎక్కారో వాటిని పూర్తిగా దిగాలి. తర్వాత ఎక్కాలి కూడా. దిగడము సహజమా లేక ఎక్కడము సహజమా? దిగడము సహజమేనా లేక దిగడము కూడా కష్టమా? ఇప్పుడు దిగి ఎక్కే పురుషార్థాన్ని చేస్తున్నారా? లేక కేవలం ఎక్కడం చేస్తున్నారా? కొంత తొలగిస్తున్నారు, కొంత తయారు చేసుకుంటున్నారు. రెండు పనులు జరుగుతున్నాయి కదా. దిగవలసిన చివరి మెట్టు ఏమిటో తెలుసు కదా? ఈ దేహ భానాన్ని విడిచిపెట్టాలి. ఎలా అయితే ఏదైనా శరీర వస్త్రాన్ని తీసివేసేటప్పుడు ఎంత సహజంగా తీసివేస్తారు, అలాగే శరీరము అనే వస్త్రాన్ని కూడా సహజంగా తీసేయగలగాలి మరియు సహజంగానే సమయానికి ధారణ చేయగలగాలి. అందరూ ఈ అభ్యాసాన్ని పూర్ణ రీతిలో నేర్చుకోవాలి. కానీ కొందరికి ఈ దేహ అభిమానము ఎందుకు తొలగడం లేదు? ఈ దేహమనే వస్త్రము ఎందుకు సహజంగా వీడటం లేదు? ఎవరి వస్త్రమైనా బిగుతుగా, టైట్‌గా ఉంటే దానిని తీయడం కష్టమవుతుంది. ఇది కూడా అలాగే. ఏదో ఒక సంస్కారానికి ఈ దేహమనే వస్త్రము అంటుకుని ఉంటే అనగా బిగుతుగా, టైట్‌గా ఉంటే అప్పుడు దానిని తీయడం కష్టమవుతుంది. లేకపోతే తీయడము, వేసుకోవడము అనగా దేహ రూపి వస్త్రాన్ని విడిచిపెట్టడము మరియు ధరించడము చాలా సహజం అవుతుంది. స్థూల వస్త్రాన్ని తీయడము మరియు ధరించినంత సహజమవుతుంది. దేహ రూపి వస్త్రము ఏదైనా సంస్కారానికి వ్రేలాడి ఉందా అని చూసుకోండి. ఎప్పుడైతే అన్ని సంస్కారాలనుండి అతీతంగా అవుతారో అప్పుడు అవస్థ కూడా అతీతంగా అయిపోతుంది. అందుకని బాప్‌దాదా కూడా, అన్ని విషయాలలో ఈజీగా ఉండండి అని అనేకసార్లు చెప్పారు. ఎప్పుడైతే స్వయం ఈజీగా ఉంటారో అప్పుడు అన్ని కార్యాలు సహజంగా అయిపోతాయి. స్వయాన్ని టైట్‌గా పెట్టుకున్నప్పుడు పనిలో కూడా టైట్నెస్ ఉంటుంది. అసలైతే ఇంతకాలం నుండి పురుషార్థం చేస్తున్నవారికి ఇప్పుడు కర్తవ్యాలలో చాలా అతీతతనము వచ్చేయాలి. ఇప్పుడు ఈ భట్టీలో, ఉన్న టైట్నెస్ను మరియు ఏవైతే తప్పుడు మెట్లు ఇంకా ఎక్కి ఉన్నారో వాటిని దిగాలి కూడా మరియు లిఫ్టును కూడా ఎక్కాలి. కానీ లిఫ్టులో ఎక్కడానికి ఏమి చేయాలి? లిఫ్టులో ఎవరు కూర్చోగలరు?
బాబాకు, పూర్తి ప్రపంచంలో ఉన్న యోగ్య పిల్లలే శ్రేష్ఠ కానుక. కనుక లిఫ్టులో ఎక్కడానికి బాబాకు కానుకగా అవ్వండి, ఇంకా మీ వద్ద ఉన్నవాటిని బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది. బహుమతిని ఇవ్వాలి కూడా మరియు బాబాకు బహుమతిగా కూడా కావాలి, అప్పుడే లిఫ్టులో ఎక్కగలరు. అర్థమయిందా? ఈ రెండు పనులు చేసారా, కానుకను ఇవ్వడము మరియు కానుకగా అవ్వడము చూస్తాము. బహుమతిని చాలా జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది మరియు బహుమతిని షోకేసులో పెట్టడం జరుగుతుంది. ఎలాంటి కానుకనో అలా దానిని షోకేసులో ముందుకు పెడ్తూ ఉంటారు. మీ అందరూ కూడా స్వయాన్ని ఎటువంటి బహుమతిగా తయారు చేసుకోవాలంటే మీకు లిఫ్టు కూడా లభించాలి మరియు ఈ సృష్టి అనే షోకేసులో అందరికన్నా ముందుండాలి. మరి షోకేసులో అందరికన్నా ముందుండటానికి అధర్ కుమారులు రెండు విషయాలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. షోకేసులో పెట్టే వస్తువు యొక్క విశేషత ఏమి ఉంటుంది? (అట్రాక్టివ్) ఒకటైతే స్వయాన్ని అట్రాక్టివ్‌గా చేసుకోవాలి, రెండు ఏక్టివ్. ఈ రెండు విశేషతలు ప్రత్యేకంగా అధర్ కుమారులు తమలో నింపుకోవాలి. ఈ రెండు గుణాలు వచ్చేస్తే ఇక ఏమీ ఉండదు. అక్కడక్కడ ఏక్టివ్ అవ్వడంలో లోటు కనిపిస్తుంది. మరి ఈ భట్టీ నుండి విశేషంగా ఏ ముద్రను వేయించుకుని వెళ్తారు? ఈ రెండు మాటలనే వినిపించాము కదా – అట్రాక్టివ్ మరియు ఏక్టివ్. ఈ ముద్రను వేయించుకుని వెళితే మీ ఏక్టివిటీ కూడా మారిపోతుంది. ఎంతెంతగా ఈ ముద్రను పక్కాగా వేయించుకుని వెళ్తారో అంతగా ఏక్టివిటీ కూడా పక్కాగా మరియు మారిన విధంగా కనిపిస్తుంది. ఒకవేళ ముద్ర కాస్త ఢీలాగా వేయించుకుంటే ఏక్టివిటీలో మార్పు కనిపించదు. భట్టీకి రావడము అంటే మీ రంగు రూపాన్ని రెండిటినీ మార్చుకోవడము అని విన్నారు కదా.
భట్టీలోకి వచ్చే వస్తువు యొక్క మాలిన్యము అంతా కరిగిపోతుంది. అసలైన రూపము, అసలైన కర్తవ్యమును ఇక్కడినుండి తీసుకువెళ్ళండి. అది ఏ రూపము? ఎలా మారుతారు? ఇప్పుడు రంగులు మారుస్తూ ఉంటారు, తర్వాత ఒకే రంగు పక్కాగా అంటుకుంటుంది. దానిపైన మరే రంగు అంటదు. ఆ రంగును ఎవ్వరూ తీసేయలేరు, ఆ రంగు ఎప్పటికీ పోదు, మరే ఇతర రంగు దానిపై అంటదు. అన్ని విషయాలలో ఏక్టివ్‌గా ఉండాలి. సమయాన్ని బట్టి, సేవనుబట్టి అందులో ఎవరెడీగా ఉండాలి. ఏ కార్యం వచ్చినా కానీ, ఏక్టివ్‌గా ఉండేవారు ఆ కార్యాన్ని వెంటనే అర్థం చేసుకుని సఫలతను పొందుతారు. ఎవరైతే ఏక్టివ్‌గా ఉండరో వారు ముందు కార్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఆలోచిస్తూనే సమయాన్ని వృధా చేసేస్తారు, సఫలత కూడా లభించదు. ఏక్టివ్ అంటే ఎవరెడీ. వారు ప్రతి కార్యాన్ని పరిశీలించగలరు కూడా. అందులో మునిగిపోతారు కూడా మరియు సఫలతను కూడా పొందుతారు. మూడు విషయాలూ వారిలో ఉంటాయి. ఎవరిలో అయితే భారీతనము ఉంటుందో వారిని ఏక్టివ్ అనలేము. పురుషార్థంలో భారీ, సంస్కారాలలో భారీ, వారిని ఏక్టివ్ అనలేము. ఏక్టివ్‌గా ఉండేవారు ఎవరెడీగా మరియు ఈజీగా ఉంటారు. స్వయం ఈజీగా అవ్వడం వలన అన్ని కార్యాలు ఈజీగా, పురుషార్థం కూడా ఈజీగా అయిపోతాయి. స్వయం ఈజీగా అవ్వని కారణంగా పురుషార్థం మరియు సేవ రెండూ ఈజీగా ఉండవు. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. సేవ కష్టం కాదు కానీ తమ సంస్కారాలు, తమ బలహీనతల వలన కష్టంగా కనిపిస్తుంది. పురుషార్థం కూడా కష్టం కాదు. మీ బలహీనతలే కష్టంగా చేస్తాయి. లేకపోతే ఒకరికి సహజంగా, మరొకరికి కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? ఒకవేళ కష్టమే అయితే అందరికీ అన్ని విషయాలు కష్టంగా అనిపించాలి. కానీ అదే విషయము కొందరికి కష్టంగా, కొందరికి సహజంగా ఎందుకు అనిపిస్తుంది? తమలోని బలహీనతలే ఇబ్బందుల రూపంలో వస్తాయి. అందుకని ఈ రెండు విషయాలను ధారణ చేయాలి.
ఎట్రాక్టివ్‌గా అవ్వడానికి కూడా ముందు స్వయంలో విశేషతలు ఉండాలి. ఆకర్షితంగా అవ్వడానికి హర్షితంగా కూడా ఉండాల్సి ఉంటుంది. హర్షితము అంటే అతీంద్రియ సుఖములో ఊగడము. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఉండాలి. దీనిని హర్షితము అంటారు. మనసు, తనువుతో రెండిటితోనూ హర్షితంగా ఉండాలి. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆకర్షితంగా ఉంటారు. ప్రకృతి మరియు మాయకు అధీనం అవ్వకుండా రెండిటినీ అధీనం చేయాలి. అధీనంగా అయిన కారణంగా తమ అధికారాన్ని కోల్పోతారు. కనుక అధీనంగా అవ్వకండి, అధీనం చేసుకోండి అప్పుడు మీ అధికారము ప్రాప్తిస్తుంది. ఎంతగా అధికారాన్ని పొందుతారో అంతగా ప్రకృతి మరియు లోకుల ద్వారా సత్కారాన్ని పొందుతారు. మరి సత్కారాన్ని పొందడానికి ఏమి చేయాలి? అధీనతను విడిచి అధికారాన్ని పెట్టుకోండి. అధికారాన్ని పెట్టుకుంటే అధికారిగా అవుతారు. కానీ అధికారాన్ని విడిచిపెట్టి అధీనులుగా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు అధీనులైపోతున్నారు. మీ రచనకే అధీనమైపోతున్నారు. లౌకిక పిల్లలైతే ఉన్నారు కానీ మీ రచన అంటే మీ సంకల్పాలకు అధీనమైపోతారు. ఎలా అయితే లౌకిక రచనకు అధీనులవుతారో అలాగే ఇప్పుడు కూడా మీ రచన అయిన మీ సంకల్పాలకు కూడా అధీనులు అవుతున్నారు. మీ రచన అయిన కర్మేంద్రియాలకు కూడా అధీనులు అవుతున్నారు. అధీనులుగా అయిన కారణంగా మీ జన్మసిద్ధ అధికారాన్ని కోల్పోతున్నారు. మరి పిల్లలుగా అయ్యారు అంటే అధికారులుగా అయ్యారు అని అర్థం. సర్వదా సుఖము, శాంతి మరియు పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అంటారు కదా. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి – బాబా పిల్లలుగా అయ్యాము అంటే పవిత్రత, సుఖము, శాంతికి అధికారాన్ని పొందామా! ఒకవేళ అధికారము దూరమైతే ఏదో ఒక విషయానికి అధీనులు అవుతారు. మరి ఇప్పుడు అధీనతను విడిచిపెట్టండి, మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందండి. ఎప్పుడు ప్రభావము వెలువడుతుంది అని అడుగుతుంటారు కదా! ఈ ప్రభావము కూడా ఎందుకు రావడం లేదు, అందుకు కారణము ఏమిటి? ఎందుకంటే ఇప్పటివరకు మీరే ఇంకా కొన్ని విషయాలకు ప్రభావితులైపోతూ ఉంటారు. ప్రభావము కావాలంటే ఈ అన్ని విషయాలకు ప్రభావితం కాకండి. అప్పుడు చూడండి, ఎంత ప్రభావం వెలువడుతుందో! మీ ఏక్టివిటీతో అంచనా వేయవచ్చు. ఇటువంటి సౌభాగ్యము పూర్తి కల్పంలో ఒకేసారి లభిస్తుంది. సత్యయుగంలో కూడా లౌకిక తండ్రితో ఉంటారు. పారలౌకిక తండ్రితో కాదు. 84 జన్మలలో ఎంత అలంకారం చేసుకుని ఉంటారు. భిన్న భిన్న రకాల చాలా అలంకారాలు చేసుకుని ఉంటారు. పిల్లలను అలంకరించి షోకేసులో సృష్టి ఎదుటకు తీసుకురావడమే బాప్‌దాదా స్నేహము. ఎప్పుడైతే అందరూ సంపూర్ణంగా అయ్యి షోకేసు అనగా విశ్వం ఎదుటకు వస్తారో అప్పుడు అలంకరింపబడి ఉంటారు. సత్యయుగ అలంకారము కాదు. గుణాలు అనే ఆభరణాలను ధరించాలి.
ఓంశాంతి