Search for a command to run...
26 Jun 1969
శిక్షణ ఇచ్చేందుకు స్వరూపము – తమ స్వరూపముతో శిక్షణ ఇవ్వడము
26 June 1969 · తెలుగు
బాబా ఎవరిని చూస్తున్నారు? పిల్లలను చూస్తున్నారా? ఈరోజు మురళిలో ఏమి విన్నారు? మీరందరూ ఎవరిని గుర్తు చేస్తారు? (తండ్రి, టీచరు, సద్గురువును) అలాగే బాప్‌దాదా కూడా కేవలం పిల్లలనే చూడటం లేదు, మూడు సంబంధాలతో మూడు రూపాలలో చూస్తున్నారు. అందరూ పిల్లలే కానీ టీచరు రూపంలో ఏమి చూస్తున్నాము? నంబరువారీగా ఉన్న విద్యార్థులను చూస్తున్నాము. గురువు రూపంలో ఎవరిని చూస్తున్నాము, తెలుసా? నంబరువారీగా ఫాలో చేసే వారిని చూస్తున్నాము. ఎవరైతే ఫాలో చేసారో మరియు ఎవరైతే ఇప్పుడు ఫాలో చేయాలో, ఇద్దరినీ చూస్తున్నాము. ముఖ్యంగా దేనిని ఫాలో చేయాలి? గురువు రూపంలో ఏవైతే శిక్షణలను ఇస్తున్నారో అందులో ముఖ్యంగా వేటిని ఫాలో చేయాలి? గురువు రూపంలో ముఖ్యంగా దేనిని ఫాలో చేయాలి? (స్మృతి యాత్ర) స్మృతి యాత్ర అయితే ఒక సాధనము. అది కూడా ఎందుకు చేయిస్తాము? ఇతరుల సద్గతిని చేసేందుకు ముందుగా స్వయం ఏమి ఫాలో చేయాల్సి ఉంటుంది? స్మృతి యాత్రను కూడా ఎందుకు నేర్పించాము? గురువు రూపంలో ఇచ్చిన శిక్షణలలో ముఖ్యంగా ఇవే ఫాలో చేయాలి – అశరీరి, నిరాకారి, అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి మరియు అతీతంగా, అశరీరిగా అవ్వడానికే స్మృతి యాత్రను చేస్తున్నారు. అశరీరిగా అయినప్పుడే గురువుతో కలిసి వెళ్ళగలరు. ముఖ్య రూపంలో వీటినే ఫాలో చేస్తున్నారు మరియు చేయాలి.
టీచరు రూపంలో పాత్ర ఇప్పుడు జరుగుతుందా లేక పూర్తయిపోయిందా? రివైజ్ కోర్సు టీచరు చేయిస్తున్నారా లేక మీ అంతట మీరే చేస్తున్నారా? (వారి సహాయం ఉంది) చదువు చదివించడం లేదు కానీ సహాయం ఉంది. రివైజ్ కోర్సు కోసం స్కూలు నుండి సెలవు తీసుకుంటారు, దానినే ఇంటిలో చేసే హోమ్‌వర్కు అంటారు. కానీ టీచరుతో కనెక్షన్ ఉంటుంది. టీచరు పక్కన ఉండరు. కేవలం కనెక్షన్ ఉంటుంది. ఫైనల్ పేపరు వచ్చేంతవరకు కనెక్షన్ ఉంటుంది. రివైజ్ కోర్సు కోసం టీచరు ఎప్పుడూ పక్కన ఉండరు. అలాగే ఇప్పుడు టీచరు దూరం నుండి యోగక్షేమాలను చూస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా కష్టంగా ఉంటే అడగవచ్చు. కానీ చదువు సమయంలో ఎలా అయితే కలిసి ఉన్నామో అలా ఇప్పుడు ఉండము. ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమించి, ఎంత ఉల్లాస ఉత్సాహాలతో రివైజ్ కోర్సును పూర్తి చేస్తున్నారు అన్నది ఇప్పుడు పైన కూర్చుని చక్కగా చూస్తున్నాము. పైన కూర్చుని చూస్తే దృశ్యము చాలా బాగా కనిపిస్తుంది. ఎలా అయితే మీరు ఇక్కడ కూర్చుని (గద్దె మీద) చూడటంలో, క్రింద కూర్చుని చూడటంలో తేడా ఉంటుంది కదా, దీనికన్నా ఇంకా పైన కూర్చుని ఎవరైనా చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. బుద్ధిబలంతో అనుభూతి చేసుకోవచ్చు. ఏమి అనుభవం అవుతుంది? ఈరోజు అనుభవం వినిపిస్తాము. అనుభవం వినడము మరియు వినిపించడమైతే పరంపర నుండి వస్తున్న రీతి. వతనంలో ఉంటూ ఏమి అనుభవం చేస్తాము? వతనంలో ఉన్నప్పటికీ టీచరుగా కనెక్షన్ ఉన్న కారణంగా చూస్తూ ఉంటాము, కొందరు చాలా అలౌకికతనముతో చదువును రివైజ్ చేస్తున్నారు, కొందరు సమయాన్ని వృధా చేస్తున్నారు, మరి కొందరు సమయాన్ని సఫలం చేస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తుండటాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? దయ అయితే కలుగుతుంది కానీ దయతో పాటు పిల్లలతో ఉన్న సంబంధం కూడా లాగుతుంది. ఇప్పుడే బాబా నుండి అనుమతి తీసుకుని సాకార రూపంలో వెళ్ళి వారికి ఆ విషయంపై జాగ్రత్తపరచాలనిపిస్తుంది. కానీ సాకార పాత్ర అయితే పూర్తయిపోయింది, అందుకని దూరంనుండే సకాశ్ను ఇస్తుంటాము. ఎలా అయితే బాబా సాకారంలో ఉన్నప్పుడు ఎర్ర జెండా చూపించేవారు కదా, అలాగే వతనంలో కూడా చూపిస్తారు. కానీ అవ్యక్త రసాన్ని, అవ్యక్త సహకారాన్ని చాలా కొద్దిమందే తీసుకోగలగడాన్ని చూసాము.
ఏ దారినైతే నిర్ణయించుకున్నారో ఆ దారిలో విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలను దాటడానికి కావలసిన ముఖ్యమైన శక్తి ఏమిటి? (సహన శక్తి) సహన శక్తికన్నా ముందు ఏ శక్తి కావాలి? విఘ్నం వేసేది ఏది? (మాయ) విఘ్నాలను ఎదిరించడానికి ముందుగా కావలసినది పరిశీలన శక్తి అని ముందు కూడా వినిపించాము. ఆ తర్వాత నిర్ణయ శక్తి. ఇది మాయనా లేక యథార్థమా, లాభమా లేక నష్టమా, అల్పకాలిక ప్రాప్తియా లేక సదాకాలిక ప్రాప్తియా అని నిర్ణయం తీసుకున్న తర్వాత, నిర్ణయం తర్వాతనే సహన శక్తిని ధారణ చేయగలము. ముందు పరిశీలించాలి, తర్వాత నిర్ణయించాలి. ఎవరి నిర్ణయ శక్తి అయితే పదునుగా ఉంటుందో వారు ఎప్పుడూ ఓడిపోరు. ఓటమి నుండి రక్షింపబడటానికి తమ నిర్ణయ శక్తిని మరియు పరిశీలన శక్తిని పెంచుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ఏ పురుషార్థము చేయాలి? మీరైతే వెంటనే స్మృతి యాత్ర అని చెప్పేస్తారు, కానీ స్మృతి యాత్రకు కూడా బలాన్ని ఇచ్చేది ఏ జ్ఞానము అనగా ఏ వివేకము? అది కూడా స్పష్టంగా బుద్ధిలో ఉండాలి. టోటల్‌గా అయితే చెప్పారు కానీ టోటల్లో అక్కడక్కడ విఘ్నము కూడా వస్తుంది. స్కూలులో కొందరు పిల్లలు ఒకరినొకరు చూసుకుని, టోటల్ వేసేస్తారు కానీ ఆ టోటల్‌ను(మొత్తాన్ని) ఎలా వేసావు అని మాస్టరు అడిగినప్పుడు తికమక పడతారు. అలాగే మీరు కూడా టోటల్‌గా స్మృతి యాత్ర అని చెప్పేస్తారు. ఆ టోటల్ ఏ విధంగా వస్తుందో కూడా తెలుసుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏ విషయం యొక్క ఆవశ్యకత ఉంది? (విచార సాగర మథనము) విచార సాగర మథనము చేస్తూ చేస్తూ సాగరంలోనే మునిగిపోతే? కొందరు విచార సాగర మథనాన్ని చేయడానికి కూర్చుంటారు కానీ అల ఎలా వస్తుందంటే అది వారిని తనతో తీసుకువెళ్ళిపోతుంది. ఎవరికైనా శారీరక శక్తి తక్కువ ఉందనుకోండి, వారికి శక్తిని పెంచేందుకు ఔషధాన్ని ఇస్తారు. అలాగే నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి మందును ముందు కూడా వినిపించాము. అశరీరి, నిరాకారి మరియు కర్మలో అతీతము. నిరాకారి మరియు అశరీరి అవస్థ బుద్ధికి సంబంధించినది, అయితే కర్మలకు అతీతముగా కూడా ఉండాలి మరియు అసాధారణంగా కూడా ఉండాలి, మీ ప్రతి కర్మను చూసి వీరు విలక్షణమైనవారు అని అందరూ అనుకోవాలి. వీరు లౌకికంగా కాదు అలౌకికంగా ఉన్నారు అనాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ఇది చాలా ఆవశ్యకము. ఎంతగా ఈ విషయాలను ధారణ చేస్తారో అంతగా మీ విఘ్నాలను తొలగించుకోగలరు. అలాగే సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షింపబడతారు. శిక్షణ అయితే చాలా లభిస్తుంది కానీ ఇప్పుడు ఏమి చేయాలి? శిక్షణ స్వరూపులుగా అవ్వాలి. శిక్షణ మరియు మీ స్వధర్మము వేరు కాకూడదు. మీ స్వరూపమే శిక్షణతో కూడినదై ఉండాలి. స్వరూపంతో శిక్షణను ఇవ్వాలి. కొన్ని విషయాలలో వాణితో శిక్షణ ఇవ్వకూడదు. మీ స్వరూపంతో శిక్షణను ఇవ్వాలి. మరి ఇప్పుడు శిక్షణ స్వరూపులుగా అయి మీ స్వరూపంతో శిక్షణను ఇవ్వండి. శిక్షణ అయితే చాలా లభించింది. కోర్సు అయితే పూర్తయింది.
ఒక ప్రశ్న అడిగారు – ఇప్పుడు బాప్‌దాదా ఇతర తనువులో వస్తున్నప్పుడు సాకార రూపంలో నడిపించిన విధంగా ఇప్పుడు మురళిని ఎందుకు నడిపించడం లేదు? అలాగే మురళిని నడిపించలేరా? ఎందుకు భాష మారింది, ఎందుకు విధానము మారింది అన్న ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతున్నాయి. మీరు భాషణ చేయగలిగినప్పుడు బాప్‌దాదాకు ఏ తనువు ద్వారానైనా మురళిని వినిపించడం కష్టమవుతుందా? కానీ ఎందుకు నడిపించడం లేదు? (ఇద్దరు ముగ్గురు తమ ఆలోచనలను వినిపించారు) ఏ తనువు ద్వారా అయితే చదివించే పాత్ర ఉండినదో ఆ చదువు యొక్క కోర్సు అయితే పూర్తయింది, ఇప్పుడు మళ్ళీ చదివించడానికి రావడం లేదు. అది కోర్సు, ఆ పాత్ర ఆ తనువుతోటే పూర్తయిపోయింది. ఇప్పుడు కలుసుకోవడానికి వస్తారు, ఆహ్లాదపరచడానికి వస్తారు. ఇంకా ముఖ్య విషయాలు ఏమిటి? అశరీరి, కర్మాతీతంగా అయి ఏమి చేసారు? ఒక్క సెకండులో పక్షిగా అయి ఎగిరిపోయారు. సాకార శరీరం నుండి ఒక్క సెకండులో ఎగిరిపోయారు కదా. అంటే ఇక చదువు పూర్తయినట్లు. ఇక ఒకే కార్యము మిగిలి ఉంది. తమతో తీసుకు వెళ్ళడము. కనుక ఇప్పుడు కేవలం కలవడము, అవ్యక్త శిక్షణలతో ఆహ్లాదపరచడము మరియు ఎగిరించడము ఉన్నాయి. చదువు యొక్క పాయింట్లు, చదువు యొక్క రూపము ఇక ఉండవు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? కోర్సు ఎంత పూర్తయింది? ఎంత వరకు రివైజ్ కోర్సు పూర్తి అయింది అని అందరూ నిర్ణయించాలి. ఇంకా ఎంత సమయం కావాలి? సాకార తనువు యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితితో స్వయాన్ని పోల్చుకోండి. వారిని చూడండి, లక్ష్యాన్ని ముందుంచుకుని స్వయాన్ని చూసుకోండి. అప్పుడు మీరెంత వరకు చేరుకున్నారు అని మీకు తెలుస్తుంది. స్వయాన్ని ఎలా పరిశీలించుకోవాలో లక్ష్యాన్నయితే చెప్పాము, తర్వాత జవాబు చెప్పండి.
రెండవ ప్రశ్న ఇదే అడుగుతున్నారు, మీ హోమ్‌వర్కు అయితే జరుగుతుంది. దానిపై విశేషంగా శ్రద్ధ పెట్టమని చెప్తున్నాము. ఈ పాత్ర ఏదైతే విధి అనుసారంగా జరిగిందో, సాకార రూపాన్ని అవ్యక్తంగా ఎందుకు చేసారు? ఇందుకు కూడా కొన్ని గుహ్య రహస్యాలు ఉన్నాయి. దీని గుహ్యతలోకి వెళ్ళండి. కేవలం సాగరంలోని అలలతోనే ఆడకండి, సాగర లోతుల్లోకి వెళ్ళండి. అప్పుడు ఏ రత్నాలైతే లభిస్తాయో వాటిని తీసుకురండి. డ్రామాలో దీని గుహ్య రహస్యం ఏమిటి అని ఆలోచించండి. పైన ఏదో గుహ్యమైన రహస్యము ఉంది. ఏ రహస్యం లేకుండా ఎటువంటి పని జరగదు. అచ్ఛా, ఇప్పుడు సమయం అయిపోయింది.
ఓంశాంతి