Search for a command to run...
6 Jul 1969
సత్యమైన ఆభరణంగా అవ్వడానికి తమలోని అన్ని లోపాలను తొలగించుకుని స్వచ్ఛంగా అవ్వండి
6 July 1969 · తెలుగు
(టీచర్లను ఉద్దేశించి అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు)
అందరూ ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఒక్కరి స్మృతి ఉన్నదా లేక ఇద్దరి స్మృతి ఉన్నదా? ఒక్కరి స్మృతిలో ఉన్నవారు చేతులెత్తండి. ఇద్దరి స్మృతిలో ఉన్నవారు కూడా చేతులెత్తండి. ఆ ఇద్దరు ఎవరు? అవ్యక్త వతన వాసులా లేక వతన వాసులా? మీరందరూ టీచర్లు కదా. మీ వద్దకు ఎవరైనా జిజ్ఞాసువు వస్తే వారికి ఏ స్థానాన్ని చూపిస్తారు? అందరికీ ఏ టీచింగ్ ఇస్తారు? మీరు టీచర్లు కదా. టీచర్లు తమ టీచరు యొక్క షో చేస్తారు. జిజ్ఞాసువులకు ఏ విధమైన పాలనను ఇస్తారో, ఏ స్థానమును ఇస్తారో, అలా ఆ టీచరు యొక్క షో జరుగుతుంది. ఒకవేళ మీరు, జిజ్ఞాసువు రాగానే వారికి అవ్యక్త వతనం యొక్క స్థానం గురించి చెబితే, ఏ దారి గురించి అయితే వారికి తెలియనే తెలియదో అక్కడికి వారు ఎలా చేరుకోగలరు? అడ్రెసు ముందుగా ఏది ఇవ్వడం జరుగుతుంది? మీరు సంగ్రహాలయంలో ఏమని అర్థం చేయిస్తారు? జిజ్ఞాసువుకు ఏమని పరిచయం ఇస్తారు? వారికి ఏ దారిని, ఏ స్థానం గురించి చెప్తారు? బీజము ఎవరు వేసారు? బీజము బీజమే. ఆ బీజము ఒకవేళ ఎండిపోయినా కానీ సమయం వచ్చినప్పుడు దాని నుండి కొన్ని రెమ్మలు వస్తూ ఉంటాయి. వర్షం పడితే వస్తాయి, మీరు బీజాన్ని మర్చిపోతే దారిని ఎలా చెప్పగలరు? బీజము ఏమిటి?
టీచర్లు యుక్తియుక్తంగా మాట్లాడాలి. చిన్న పిల్లలైతే కాదు కదా. చిన్న పిల్లలకైతే మొదటి నుండి నేర్పించడం జరుగుతుంది. మీరైతే నేర్చుకుని, ఇంత పాలన తీసుకుని ఇదే పరీక్షను ఇవ్వడానికి వచ్చారు. చదువుతారు కూడా, అదే సమయంలో పరీక్షను కూడా వ్రాస్తారు. రెండు పనులు కలిసి జరుగుతాయి. బాబా అవ్యక్త వతనవాసిగా అయితే మీరందరూ కూడా అవ్యక్త వతనవాసిగా అవ్వాలి. వారు ఏ సృష్టిలో ఉండి అవ్యక్తంగా అయ్యారు? మీరు ఎక్కడ అవ్వాలి? (సాకార సృష్టిలో) సృష్టి అయితే ఆల్రౌండ్ గుండ్రంగా ఉంది. సృష్టిలో పూర్తి వృక్షము ఇమిడి ఉంది. కానీ సృష్టికి ఉన్నత స్థానము సంగమము. మీ అందరినీ ఇక్కడకు చేర్చిన సంగమయుగానికి బలిహారము. మీరు మీ స్థానాన్ని మర్చిపోతే ఏమి జరుగుతుంది? స్థానము గురించి చెప్పేవారే ఆ స్థానాన్ని మర్చిపోతున్నారు. స్థానాన్ని పక్కాగా గుర్తు పెట్టుకోండి. బాప్దాదా ద్వారా లభించిన చదువును ధారణ చేయండి. ధారణతో ధైర్యవంతులుగా, అంతర్ముఖులుగా అవుతారు. ఓర్పు వస్తుంది. దీనితో కలియుగ రావణ రాజ్యాన్ని సమాప్తం చేసేస్తారు. కావున ఇప్పుడు చదువుకునే సమయము, అలాగే పరీక్ష వ్రాసే సమయము కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఇది ఒక విషయము.
రెండో విషయము – కొద్దిగా మనసులో పెట్టుకోండి, ఇంత సమయం బాప్దాదా ఒడిలో పెరిగారు, అందులో ఏ పనులు అయితే చేసారో, కొందరు తాము చేసిన పనులను బాప్దాదా వద్ద సిగ్గుతో దాచి పెట్టారు. బాబాను గుర్తించి అంతా బాబా ముందు చెప్పారు అని కూడా కాదు. ఇటువంటి పొరపాట్లు కూడా జరిగాయి అని ఎవరైతే అనుకుంటున్నారో, అంటే చేయాలని మనస్ఫూర్తిగా చేయకపోయినా కానీ నిర్లక్ష్యంతో జరిగిపోతుంటాయి, ఇవన్నీ అందరూ వ్రాయాలి. బాప్దాదాతో ఎవరైతే మాట్లాడారో, వారు కూడా వ్రాయాలి. పూర్తి జన్మ పత్రిక. ఇది అంతిమ సమయం కదా, 84 జన్మల లెక్కాచారాలను ఇక్కడే తీర్చుకోవాలి. సత్యత మరియు స్వచ్ఛత అనే పదాలైతే చెప్తారు కదా. కానీ సత్యత మరియు స్వచ్ఛతలో కూడా ఉన్న తేడా ఏమిటి అని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దాని గుహ్యతలోకి వెళ్ళి మొత్తం వ్రాయండి.
అవ్యక్త వతనం నుండి బాప్దాదా పిల్లల సేవ చేయడానికి మరియు స్వచ్ఛంగా చేయడానికి వస్తారు. బాబా సేవ చేస్తారు. పిల్లలైన మీ అందరికీ బాబా ఆరంభం నుండి అంతిమం వరకు సేవకుడు. సేవ చేయడానికి సదా తయారుగా ఉన్నారు. నా పిల్లలు తలమానికాలు, కంటి తారలు అని బాబాకు ఎంతో గర్వంగా ఉంటుంది. వీరి కోసమే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము. ఆ స్వర్గ వాసులుగా చేయడానికి తయారీ చేస్తున్నాము. మేము లక్ష్మీనారాయణులుగా అవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నా గానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అయినప్పటికీ బాప్దాదా సేవను చేయడానికి వచ్చారు. అంతిమ మతి సో గతి. సమయం లేదు. సమయం చాలా సమీపంగా రానుంది. శివంగి శక్తులైన మీరు భుజాలను తయారు చేయాలి. అప్పుడే శత్రువులతో పోరాడగలరు. ఒకవేళ స్వయం మీదనే ఫేథ్ (విశ్వాసం) లేకపోతే, బాప్దాదా యొక్క పూర్తి పరిచయం లేకపోతే శక్తి సైన్యంగా అవ్వలేరు, శక్తితనపు అలంకారము రాదు. ఒకవేళ శక్తిని మీలో ధారణ చేసుకున్నట్లయితే వచ్చే వారికి పూర్తి స్థానము లభిస్తుంది. వారందరూ కూడా శక్తి సైన్యంలో చేరుతారు. కావున స్వయాన్ని సత్యమైన ఆభరణంగా చేసుకోవడానికి, అన్ని లోపాలను తొలగించుకుని స్వచ్ఛంగా తయారవ్వాలి. బంగారం చాలా రకాలుగా ఉంటుంది, కొన్ని 9 క్యారెట్లు, కొన్ని 12 క్యారెట్లు... ప్యూర్ అయితే ప్యూరే. క్యారెట్ పదం తొలగిపోవాలి. స్వయాన్ని కరెక్టు చేసుకోవాలి. ఇప్పుడు కరెక్షన్ చేసుకునే సమయం లభించింది. ఇది బాగా మనసులో పెట్టుకోండి.
ధరిత్రిని విడిచిపెట్టండి కానీ ధర్మాన్ని కాదు. ఏ ధర్మము, ఏ ధరిత్రి? తెలుసా? ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే, బాప్దాదాకు చేయిని ఇచ్చిన తర్వాత ధర్మాన్ని విడిచి పెట్టకండి. పతివ్రత నారి తన ధర్మంపై పక్కాగా ఉంటుంది. మీరు సత్యమైన సీతలు, సత్యమైన లక్ష్ములు, మహా లక్ష్మిగా అయ్యేవారు. మరి మీ లక్ష్యము ఏమిటి? మీ లక్ష్యం నుండి ఒకవేళ కిందకు వస్తే ఎగిరి మళ్ళీ లక్ష్యంపై కూర్చోండి. బాప్దాదా పిల్లలైన మీ సేవను చేయడానికి శిక్షణను ఇస్తున్నారు. ఆజ్ఞాపించడం లేదు, కానీ శిక్షణను ఇస్తున్నారు. ఎందుకంటే తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. ఒకవేళ పిల్లలకు ఆజ్ఞాపించి, పిల్లలు చేయకపోతే అది కూడా బాగుండదు, అందుకే శిక్షణను ఇస్తారు.
ఈరోజు పునాది పడుతుంది. చిన్న పిల్లలకైతే తిలకం పెట్టడం జరుగుతుంది, ఏమి చేయాలి, ఎలా అవ్వాలి అని వారికి దారి చెప్పవలసి ఉంటుంది. మీ అందరికీ అయితే దారి లభించి ఉంది. మీరందరూ ఇతరులకు దారిని చెప్పేందుకు నిమిత్తంగా అయినవారు. ఒకవేళ ఆ దారిలో ఏదైనా గడబిడ ఉంటే, అయితే-మరి అని ఉంటే వాటిని తీసివేయాలి. ఇప్పుడు కూడా తొలగించకపోతే, మున్ముందు, శక్తులకు ఏవైతే శక్తులు లభించాయో అవి సమాప్తమైపోయినట్లే. ఇలా బాప్దాదాకు అక్కడక్కడ కనిపించాయి. అందుకే సంగఠనలో అందరి మనసులను ఒకటిగా చేయడానికి, పూర్తి దారిని చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాము. మీ అందరికీ సంతోషం ఉంది. చిన్న పిల్లలకు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలంటే చాలా ఇష్టము, అక్కడకు వెళ్ళచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు అనుకుంటారు. మీ అందరూ కొత్త బట్టలు, అలంకారము ఏమి ధరించాలి? ఒక వైపు సేవకులుగా కూడా అవ్వాలి. సేవకులు అనగా పతిత ఆత్మల ఉద్ధరణ చేయడము. ఆ సేవను స్థిరంగా ఉంచండి. మీరందరూ రాబోయే ఆత్మల ఉద్ధరణను ఎలా చేయాలి? ఎలా విఘ్నాలను తొలగించాలి? బాణంలో పదును ఉంటే ఒక్కసారికే పూర్తిగా గురి తగులుతుంది. ఆ ఆత్మ ఉద్ధారము కూడా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఎవరి ఉద్ధారము చేస్తారు? ఏ పర్వతాన్ని ఎత్తారు? పర్వతాన్ని ఎత్తడానికి ఎవరు నిమిత్తులు? గోప గోపికలు. పూర్తి కర్తవ్యాన్ని చేసినప్పుడే గోపిక అనిపించుకుంటారు. అంత బలము ఉన్నప్పుడే పర్వతాన్ని ఎత్తగలరు. ఈ విషయాలన్నింటిలో ప్రకాశాన్ని ఇవ్వడానికి బాబాకు రావలసి వచ్చింది.
ఇకపోతే తిలకము అయితే బాప్దాదా ఒకేసారి పెట్టేసారు. ఎర్ర తిలకమా లేక చందన తిలకమా? ఎర్ర తిలకము ముఖ అందం కోసం పెట్టుకుంటారు. చందన తిలకము ఆత్మ అందం కోసం పెట్టుకుంటారు. మీరు నగలు కూడా ముఖ అందం కోసం వేసుకోకూడదు. వస్త్రాలు కూడా ప్రపంచానికి చూపించడం కోసం ధరించవద్దు. ఆంతరికంగా స్వయాన్ని ఎలా అలంకరించుకోవాలంటే, నగలు ఎటువంటివి వేసుకోవాలంటే లోకప్రియంగా ఉండాలా లేక హృదయ ప్రియంగా ఉండాలా! లోక ప్రియంగా అంటే బాహ్యముఖము. హృదయప్రియము అంటే అంతర్ముఖము. కనుక అంతర్ముఖిగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోండి. లోకప్రియంగా భాషణ చేసారు. సంతోషపరిచారు కానీ భాషలోని రహస్యము, సారము ఒక్కొక్కటి మీ కర్మేంద్రియాలలో ఇమిడిపోవాలి, అప్పుడే శోభాయమానంగా ఉంటుంది. కర్తవ్యాలతో దైవీ గుణాలను షో చేయండి. అలంకరణ కోసం దైవీ గుణాల క్లాసు జరుగుతుంది. ఇలాగే అలంకరింపబడి సంగమాన్ని దాటి వేయండి. తర్వాత మన ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళాలి? అత్తవారింటికి. కన్య అత్తవారింటికి వెళితే, ఆ కన్యకు చదువు, తెలివితేటలు లేకపోతే, ఈ అమ్మాయికి ఎలా నడుచుకోవాలో, ఎలా వ్యవహరించాలో తెలియదు అని అత్తమామలు అంటారు. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్ళాలి. మరి బాబా అయితే ప్రతి అడుగును చూడరు, ప్రతి కర్మేంద్రియాన్ని చూస్తారు. అడుగు అనే పదము మందమైనది, అడుగుతో పదమాలు లభిస్తాయి. అదంతా మీ కళ్యాణము కోసమే. కర్మేంద్రియాలను అలంకరించుకోండి. నగలు ధరించి వ్యవహరించండి. ఇప్పుడు అలంకరించుకోవడానికి ఎవరి వద్దకు వచ్చారు? బాప్దాదా ఇల్లు అంటే మీ ఇల్లు. అలంకరించేవారు ఎవరు? నిశ్చితార్థము జరిగేటప్పుడు అలంకరించేవారు ఒకరు ఉంటారు, ధరింపజేసే వారు మరొకరు ఉంటారు. మరి ఇప్పుడు అలంకరణతో వెళ్ళాలి, అర్థమయిందా!
తెలివైన టీచర్లే మీరంతా. 15 రోజుల రిజల్టు అంటే అంతిమ రిజల్టు. ఇంతటి పురుషార్థం చేసి ప్రావీణ్య(సమర్థ) టీచర్లుగా అందరూ అవ్వాలి. తర్వాత వెళ్ళి మీ సెంటరును సంభాళిస్తే వచ్చే వారికి మీ దృష్టిలో సత్యయుగ సృష్టి కనిపిస్తుంది. ఆభరణాలు సరిగ్గా ధరించినప్పుడే ఇది జరుగుతుంది. ఒకవేళ నిర్లక్ష్యంతో ఏదైనా ఆభరణం క్రింద పడిపోతే నష్టం జరుగుతుంది మరియు అలంకరణ అందం కూడా పోతుంది. కావున శోభ పోకూడదు, ఆభరణాలను తొలగించవద్దు. పెద్ద విషయమేమీ కాదు. చిన్నదిగా భావిస్తే సహజంగా అనిపిస్తుంది. చాలా పెద్ద ఉన్నత జ్ఞానము అంటే ఎవరూ రారు, 7 రోజులలో జీవన్ముక్తి యొక్క ప్రాప్తి అంటే లాటరీని పొందడానికి అందరూ వస్తారు. అందరూ లాటరీ వేస్తారు, ఎవరికైనా లాటరీలో ఏదైనా లభిస్తే అదృష్టంగా భావిస్తారు. కొందరికి పెద్ద లాటరీ లభిస్తుంది, మరి కొందరికి చిన్న లాటరీ లభిస్తుంది. పరీక్ష చివరలో ఉంటుంది. 3 నంబర్లు వెలువడతాయి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతగా నంబరు లభిస్తుంది. అదృష్టాన్ని తయారు చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మరి ఇప్పుడు లాటరీ కోసం ఎదురు చూడకండి, ఏర్పాట్లు చేసుకోండి. మరి యోగంతో ఎలా లక్ష్యం పూర్తవుతుందో తెలిసింది కదా. కానీ నిస్సంకల్పంగా ఉన్న వారినే సత్యమైన యోగి అంటారు. వారు లక్ష్యాన్ని ధారణ చేయాలి. అచ్ఛా.
చాలా ఖజానా లభించింది. ఇప్పుడు దానిని మీ వద్ద జమ చేసుకోండి మరియు ఆవువలె నెమరు వేసుకోండి. మీరందరూ గోవులు కూడా, గోపికలు కూడా. పర్వతాన్ని ఎలా ఎత్తాలి! గోవుగా అయి ఎలా నెమరు వేయాలి, ఈ కర్తవ్యాన్ని ఈ భట్టీలో చేయండి. బహు రూపాలను ధారణ చేసి బహు కర్తవ్యాలను పోషించండి. భట్టీలో అన్నిటినీ అనుభూతి చేయాలి. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా రిజల్టు వస్తుంది. సంపూర్ణ అవస్థను పొందడానికి లక్ష్యము ఏమిటి? సాధన ఏమిటి? ఇది తెలుసుకోవాలి. సాధనము లభిస్తే లక్ష్యాన్ని పట్టుకుంటారు. రత్నాలను కూడా పరిశీలించాలి. ఆభరణం విలువను స్వర్ణకారుడే పరిశీలించగలడు. ఎవరికైతే పరిశీలన రాదో వారికి విలువ ఉండదు. ఆభరణానికి పాలిష్, మెరుపు ఉన్నప్పుడే మీ అందరి విలువ కూడా ఉంటుంది, గుర్తించేవారు మిమ్మల్ని గుర్తించగలరు. మెరుపు లేకపోతే ఎవరు కొంటారు? ఇది సత్యమైనదో, కాదో అంటారు. డబ్బులు కూడా ఇచ్చి, ఆభరణం విలువైనది కాకపోతే లాభమేముంది? కనుక మీ అందరి అలంకరణ పూర్తయితే కొనేవారు కూడా వస్తారు మరియు మీరు వతనవాసులుగా అవుతూ ఉంటారు.
ఓంశాంతి