Search for a command to run...
3 Oct 1969
సంపూర్ణ సమర్పణకు గుర్తులు
3 October 1969 · తెలుగు
ఎవరిని చూస్తున్నారు? ఎవరు, ఎవరిని చూస్తున్నారు? (ఇద్దరు ముగ్గురు తమ తమ ఆలోచనలను వినిపించారు) ఈరోజు బాప్దాదా తమ సంపూర్ణ దీపపు పురుగులను చూస్తున్నారు. ఎంతవరకు దీపపు పురుగులుగా అయ్యారో చూడటానికి వచ్చాము. అసలైతే దీపపు పురుగులు దీపం వద్దకు వెళ్తాయి కానీ ఇక్కడ దీపమే దీపపు పురుగులను కలుస్తుంది. సంపూర్ణ దీపపు పురుగుల లక్షణాలు ఏమి ఉంటాయి, వారి గుర్తులు ఏమిటో మీకు తెలుసా? (అందరూ వినిపించారు) మీరందరూ చెప్పింది యథార్థమే. ముఖ్య సారము ఏమన్నారంటే దీపపు పురుగులు ఒకటైతే దీపానికి స్నేహిగా ఉంటారు, సమీపంగా ఉంటారు మరియు సర్వ సంబంధాలలో ఒక్కరితోటే ఉంటారు. సర్వ సంబంధాలు, స్నేహి, సమీపము మరియు సాహసము. సంపూర్ణ దీపపు పురుగులలో నాలుగు విషయాలు కనిపిస్తాయి. మరి మీ అందరినీ ఇక్కడకు భట్టీకి ఎందుకు పిలిపించడం జరిగింది? ఏవైతే నాలుగు విషయాలను వినిపించామో ఆ నాలుగింటిని సంపూర్ణ శాతంలో ధారణ చేసుకోవాలి. ఒక్క శాతం కూడా తక్కువ కాకూడదు. మేము ఉన్నాము కానీ ఇంత శాతంలో లేము అని కొందరు అంటారు. ఎవరిలో అయితే శాతంలో లోటు ఉందో వారిని సంపూర్ణ దీపపు పురుగు అని అనలేము. ఆ దీపపు పురుగును రెండవ క్వాలిటీ వారు అంటాము, వారు తిరుగుతూనే ఉంటారు. ఒకరు వెంటనే దీపంపై బలిహారమయ్యేవారు, రెండవవారు – ఆలోచించి అడుగు వేసేవారు. ఎవరైతే ఆలోచించి అడుగు వేస్తారో వారిని తిరిగేవారు అంటాము. రెండవ క్వాలిటీ దీపపు పురుగులు అనేక రకాల సంకల్పాలు, విఘ్నాలు మరియు కర్మల చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. ఈరోజు పాండవ సైన్యాన్ని భట్టీకి పిలిచాము. ఎక్కడైనా ఏదైనా మంచి ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీ యొక్క ప్రభావం అందరిపై పడిపోతుంది. ఆ ఫ్యాక్టరీ ముద్ర లేకపోతే ఆ వస్తువు అంతగా అమ్ముడుపోదు. ఇదే విధంగా మీరు కూడా భట్టీకి వచ్చారు, ఇక్కడ ముద్రను వేయించుకోవడానికి వచ్చారు. ట్రేడ్ మార్కు (వ్యాపార చిహ్నము) ఉంటుంది కదా, మరి మీరు ఏ ముద్రను వేయించుకోవడానికి వచ్చారు? సంపూర్ణ సరెండర్ లేక సంపూర్ణ సమర్పణ అన్న ముద్రను వేయించుకోకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? ఎలా అయితే ముద్ర లేని వస్తువుకు తక్కువ విలువ ఉంటుందో అలాగే ఆ ఆత్మలకు స్వర్గంలో తక్కువ విలువ ఉంటుంది. మరి మీ రాజధానిలో సమీపంగా రావడానికి ఈ ముద్రను వేయించుకోవలసిందే. మాతలకైతే నష్టోమోహ మంత్రం లభించింది. పాండవ సైన్యానికి సంపూర్ణ సమర్పణ. కరిగి అంతర్థానమయ్యారు అని పాండవులకే గాయనము ఉంది. పర్వతాలపై కాదు, ఉన్నత స్థితిలో కరిగి స్వయాన్ని నీచత్వము నుండి పూర్తిగా పైన, అవ్యక్త స్థితిలో కలిసిపోయారు, అనగా ఆ అవ్యక్త స్థితిలో సంపూర్ణతను పొందారు. ఇది పాండవుల గుర్తు. ఆ స్మృతిచిహ్నాన్ని గుర్తు చేయడానికి మరియు ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి భట్టీ లభించింది.
సంపూర్ణ సమర్పణ అని దేనిని అంటారు? సంపూర్ణ సమర్పణ అనగా తనువు-మనసు-ధనము-సంబంధాలు-సమయము అన్నింటిలో అర్పణము. మనసును సమర్పిస్తే ఆ మనసును శ్రీమతం లేకుండా ఉపయోగించకూడదు. ఇప్పుడు చెప్పండి, ధనాన్ని శ్రీమతం అనుసారంగా ఉపయోగించడం సహజము, తనువును శ్రీమతం అనుసారంగా ఉపయోగించడం సహజమే కానీ మనసు శ్రీమతం లేకుండా ఒక్క సంకల్పం కూడా ఆలోచించకూడదు – ఈ స్థితిని సమర్పణ అంటారు. అందుకనే మన్మనాభవ అన్నది ముఖ్యమైన మంత్రము. ఒకవేళ మనసు సంపూర్ణంగా సమర్పణ అయి ఉంటే తనువు-మనసు-ధనము-సమయము-సంబంధాలు అన్నీ త్వరగా అటువైపు ఉంటాయి. కనుక మనసును సమర్పణ చేయడము అనగా వ్యర్థ సంకల్పాలు, వికల్పాలను సమర్పణ చేయడమే ముఖ్యమైన విషయము. సంపూర్ణ దీపపు పురుగుల గుర్తులు ఇవే. సంపూర్ణ సమర్పణ అయిన వారి మనసులో వారి(బాప్దాదా) గుణాలు, కర్తవ్యాలు మరియు సంబంధం తప్ప మరేమీ తోచదు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి ముద్ర పడిందా? ఎలా అయితే ఈమధ్య కాలంలో మీరు ఆఫీసులో పని చేస్తూ, మధ్యమధ్యలో ఆఫీసు వస్తువులను మీకోసం ఉపయోగిస్తారు కదా, అలాగే ఏదైతే మీరు సమర్పణ చేసారో అది మీ వస్తువు కాదు. ఎవరికి ఇచ్చారో వారిదైపోయింది. వారి వస్తువును మీరు మీ కార్యం కోసం ఉపయోగించుకోలేరు. కానీ సంస్కారం ఉన్న కారణంగా అప్పుడప్పుడూ శ్రీమతంతోపాటు మన్మతము, దేహ అభిమానపు మతము, శూద్ర మతమును ఉపయోగిస్తున్నారు. అందుకనే కర్మాతీత అవస్థ లేక అవ్యక్త స్థితి సదా ఏకరసంగా ఉండటం లేదు. ఎందుకంటే మనసు భిన్న భిన్న రసాలలో ఉన్నప్పుడు స్థితి కూడా భిన్న భిన్నంగానే ఉంటుంది. ఒకే రసములో ఉంటే ఒక్కటే స్థితి ఉంటుంది. బాప్దాదా పిల్లలను తేలికగా చేస్తుంటే పిల్లలు మాత్రం కావాలని తమపై భారాన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 63 జన్మల వికర్మల భారము, లోక మర్యాదల భారములను మోయడానికి అలవాటు పడిపోయారు. అందుకే భారాన్ని దించిన తర్వాత కూడా మళ్ళీ ఎత్తుకుంటున్నారు. ఎవరికి ఏ అలవాటు ఉంటుందో, వారు ఆ అలవాటులో బలహీనంగా ఉంటారు. ఇలా తమకున్న అలవాట్ల కారణంగా తమ బాధ్యతలను తమపైనే పెట్టుకుంటున్నారు. పాండవులు ఒక్కొక్కరు ఒకవేళ సంపూర్ణ సమర్పణ అయి ఇక్కడనుండి వెళితే ఏమవుతుందో చెప్పండి? పాండవులు తయారైనప్పుడు కౌరవులు మరియు యాదవులు మైదానంలోకి వస్తారు, అప్పుడు ఏమవుతుంది? మీ రాజ్యము మీకు లభిస్తుంది. శ్రీమతం లేకుండా ఏమీ ఆలోచించము, మాట్లాడము, వినము, చేయము అన్న ప్రతిజ్ఞ చేయనంతవరకు ఈ భట్టీ నుండి లాభాన్ని పొందలేరు. ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలనే తీసుకువచ్చారు కదా. తయారయ్యే వెళ్ళాలి, మారే వెళ్ళాలి. ఇలా ఆలోచించే వచ్చారు కదా? గాభరా పడటం లేదు కదా? ఎంతెంతగా లోతుల్లోకి వెళ్తారో అంతగా గాభరా మాయమవుతుంది. లోతుల్లోకి వెళ్ళనంతవరకే ఏ విషయంలోనైనా గాభరా ఉంటుంది. సాగరం యొక్క పైపై అలలను చూస్తే గాభరా కలుగుతుంది కానీ సాగర గర్భంలోకి, లోతుల్లోకి వెళితే ఏముంటుంది? పూర్తి శాంతి, శాంతితో పాటు ప్రాప్తి కూడా. అందుకే గాభరా పెట్టే విషయం ఏదైనా వస్తే లోతుల్లోకి వెళ్ళండి అప్పుడు గాభరా మాయమవుతుంది. ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణము ఏవి ధారణ చేయాలి? ఇందులో ఎవరైతే నంబరువన్గా ఉంటారో వారికి ఏమి ఇస్తాము? భవిష్యత్తులో ఎలాగూ రాజధాని లభిస్తుంది కానీ ఇక్కడ కూడా కానుక లభిస్తుంది. నేను నంబరువన్ వస్తాను అనే విధంగానే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి, రెండవ నంబరువారికి కానుక లభించదు. ఎవరైతే విన్ (గెలుపు) అవుతారో వారే వన్ నంబరును పొందుతారు. విన్ అయ్యే ప్రయత్నం చేస్తే వన్ వస్తారు.
అచ్ఛా, మీకు బిందువు పెట్టాలా లేక బిందు రూపంలోనే ఉన్నారా? ఎన్ని రకాల తిలకాలు ఉంటాయి? ఈరోజు మీకు డబల్ తిలకాన్ని పెడ్తాము. సంగమంలో నిరోగిగా అయ్యేందుకు మరియు భవిష్యత్తులో రాజ్య భాగ్యపు తిలకము. బిందు రూప స్మృతిని పెట్టుకోవడానికి బిందువును పెడుతూ ఉండండి. బిందువును పెడుతూ పెడుతూ బిందువుగా అయిపోతారు. ఏదైనా వ్యర్థ సంకల్పం వస్తే వాటికి బిందువు పెట్టండి, అప్పుడు మీరు బిందువుగా అయిపోతారు.
ఓంశాంతి