Search for a command to run...
28 Sept 1969
పూర్తి కోర్సు యొక్క సారము – మాటలు, చేతలు ఒకటి చేయడము
28 September 1969 · తెలుగు
ఏ రూపంలో మిలనం చేస్తున్నారు? అవ్యక్త రూపంలోనా లేక స్నేహ రూపంలోనా లేక శక్తి రూపంలోనా? తండ్రి రూపంలో అయితే మిలనం చేసుకుంటూనే ఉన్నారు. కానీ స్నేహరూపంగానా లేక శక్తి రూపంగానా లేక అవ్యక్తరూపంగానా? వర్తమానంలో ఏ విశేష రూపము ఉంది? రోజంతటిలో ఈ మూడు రూపాలలో ఎక్కువగా ఏ రూపం ఉంటుంది? ఈ మూడింటిలోకి ఏది శ్రేష్ఠమైనది? (ప్రతి ఒక్కరూ తమ సమాధానాన్ని వినిపించారు) ఇప్పుడు కేవలం ప్రశ్న అడుగుతున్నాము, తర్వాత స్పష్టం చేస్తాము. ఇప్పుడు ఎవరైతే అందరూ ఎక్స్ట్రా ట్రైనింగు కోర్సు తీసుకున్నారో, ఇందులో అన్నిటికన్నా మీరు తీసుకున్న పవర్ఫుల్ పాయింటు ఏమిటి? ఆ పాయింటు రానున్న విఘ్నాలను ఒక్క సెకండులో సమాప్తం చేస్తుంది. ప్రతి ఒక్కరూ భిన్న భిన్న పాయింట్లనైతే వినిపించారు, ఇప్పుడు ఎవరైతే పాయింట్లను వినిపించారో, వారు తమ అనుభవాన్ని వ్రాసి పంపండి- ఏ పాయింటు ఉపయోగించినందువలన ఎంత సమయంలో విఘ్నము దూరమయింది? ఒక మందును ఎవరైనా ఉపయోగించి చూసినప్పుడు అనేకులకు దాని లాభాన్ని పొందడం సహజమవుతుంది. అలాగే ఈ భిన్న భిన్న పాయింట్లు ఏవైతే వెలువడ్డాయో, వాటి సారాన్ని రెండు మాటలలో గుర్తు పెట్టుకోండి, ఈ రెండు మాటలలో మీరందరూ చెప్పిన విషయాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైతే కోర్సు చేసారో దాని ముఖ్య సారాన్ని రెండు మాటలలో గుర్తు పెట్టుకోండి. ఏదైతే చెప్తున్నారో అది చేయాలి. నేను బ్రహ్మకుమారి అని చెప్తారు. మేము బాప్దాదాకు ఆజ్ఞాకారి పిల్లలము, సహయోగులము అంటారు. ఏ ఏ మాటలైతే చెప్తున్నారో వాటిని ప్రాక్టికల్లోకి తీసుకురండి. చెప్పడము అంటే చేయడము. చెప్పడం మరియు చేయడంలో తేడా ఉండకూడదు. ఇదే మీ కోర్సు యొక్క సారము. వికారము చెడ్డది అని మీరు ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నారు, ఇతరులకు కూడా వినిపిస్తుంటారు కానీ మీరే గృహస్థంతో అతీతంగా ఉండి నడుచుకోవడం లేదు. మరి మీ మాటలు, చేతలలోనే తేడా ఉంటుంది. కనుక ఈరోజు నుండి ఈ మాటను గుర్తు పెట్టుకోండి. ఏదైతే చెప్తామో అదే చేస్తాము. ఏదైతే ఆలోచిస్తారో మరియు ప్రపంచానికి ఏదైతే చెప్తారో అది చేసి చూపించండి. కేవలం చెప్పడమే కాదు. చేయాలి. ఇప్పుడు మిగిలి ఉన్న సేవ మాటలతో జరిగేది కాదు. మీ చేతలతో జరుగుతుంది. మాటలు, చేతలు మరియు ఉండటము అంటారు కదా. మాటలు, చేతలు మరియు జీవితము మూడూ ఒకటిగా ఉండాలి అప్పుడు కర్మాతీత అవస్థకు త్వరత్వరగా చేరుకుంటారు. ఏదైతే చెప్తున్నానో అది చేస్తున్నానా అని ప్రతి సమయం పరిశీలించుకోండి. మేము సర్వశక్తిమంతుని పిల్లలము అంటారు, మరి మీరు ఏమి చేస్తున్నారు? బలహీన మాటలు. ఏది చెప్తానో అది చేయాలి అని ఈరోజు నుండి పక్కా చేసుకోండి. ఎవరైతే స్వయం ఇలా అవుతారో వారిని చూసి ఇతరులు కూడా తామంతట తామే చేస్తారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ఇప్పటివరకు ఫిర్యాదులు లభిస్తున్నాయి. ఫిర్యాదులను సమాప్తం చేయాలి. ఫిర్యాదులు సమాప్తమైతే ఎలా అవుతారు? అల్లాహ్ (ఉన్నతంగా) అవుతారు. ఎంతగా అల్లాహ్గా అవుతారో అంతగా, వద్దనుకున్నా పేరు ప్రఖ్యాతి అవుతుంది. మరి చేసిన కోర్సుకు ఈ శిక్షణయే ముఖ్య సారము.
అందరికన్నా ప్రమాదకరమైన మనిషి ఎవరు, వారంటే అందరూ ఎందుకు భయపడతారు? ప్రపంచం విషయాన్ని ప్రపంచంలోనే విడిచిపెట్టండి, ఈ దైవీ పరివారంలో అందరికన్నా ప్రమాదకరమైనవారు, నష్టాన్ని కలిగించేవారు ఎవరంటే లోపల ఒకలా బయట మరో రూపంలో ఉండేవారు. వారు పరనిందకులకన్నా ఎక్కువ ప్రమాదకరమైనవారు. ఎందుకంటే వారు ఎవ్వరికీ దగ్గర కాలేరు. స్నేహితునిగా అవ్వలేరు. వారినుండి అందరూ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ భట్టీలో మీకు ఈ శిక్షణ లభించింది. దీనిని సత్యత, స్వచ్ఛత అంటారు. ఏ విషయంలో స్వచ్ఛత? సత్యత ఎందులో? దీనికి కూడా చాలా పెద్ద గుహ్య రహస్యము ఉంది. సత్యత అంటే ఏది చేస్తారో దానినే వర్ణించండి. ఏది ఆలోచించారో అదే చెప్పండి. కల్పిత రూపము వద్దు. మనసా-వాచ-కర్మణ మూడు రూపాలలోనూ ఉండాలి. మనసులో ఏదైనా సంకల్పం వస్తే అందులో కూడా సత్యత, స్వచ్ఛత ఉండాలి. లోపల ఎటువంటి వికర్మ అను చెత్త ఉండకూడదు. ఎటువంటి భావ స్వభావాల పాత సంస్కారాల చెత్త కూడా ఉండకూడదు. ఇటువంటి స్వచ్ఛత ఉన్నవారే సత్యంగా ఉంటారు. ఎవరైతే సత్యంగా ఉంటారో వారి గుర్తు ఏమిటి? సత్యంగా ఉండేవారు అందరికీ ప్రియంగా ఉంటారు. అందులోనూ ముందుగా వారు ప్రభుప్రియంగా ఉంటారు. సత్యమైనవారిపై సాహెబు కూడా రాజీ అవుతారు. ముందు ప్రభుప్రియులుగా ఉంటారు. తర్వాత దైవీ పరివారానికి ప్రియంగా ఉంటారు. వారిని ఎవ్వరూ అటువంటి దృష్టితో చూడరు. వారి దృష్టిలో, మాటలో, కర్మలో ఎంతటి పరిపక్వత ఉంటుందంటే వారూ అలజడిలోకి రారు, ఇతరులనూ చేయరు. సత్యంగా ఉండేవారు ప్రియంగా ఉంటారు. నేనైతే సత్యంగా ఉంటాను, కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కొందరు అంటారు. సత్యమైన వజ్రము దాగి ఉండగలదా! కనుక, నేను సత్యంగా ఉన్నాను కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని అనడం కూడా సత్యత కాదు. సత్యత ఎప్పుడూ దాగదు. సత్యమైనవారు అందరికీ ప్రియంగా ఉంటారు. మేము సమీపంగా లేము కనుక ప్రఖ్యాతి కావడం లేదు అని కూడా కొందరు అనుకుంటారు. కానీ ఎవరైతే సత్యంగా మరియు పక్కాగా ఉంటారో వారు దూరంగా ఉన్నప్పటికీ వారి లక్షణాలు దాగవు. ఎవరు ఎంత దూరంగా ఉన్నాకానీ బాప్దాదాకు సమీపంగా ఉంటారు. బాబాకు సమీపంగా ఉండేవారు అందరికీ సమీపంగా ఉంటారు. కనుక సత్యంగా అవ్వాలి. స్వచ్ఛతకు రుజువు నడవడికలో కనిపిస్తుంది. కేవలం అర్థం చేసుకోవడమే కాదు, కర్మలో చేసి చూపించాలి. ఏ కర్మ చేసినా అది కూడా ఇతరుల సేవకు నిమిత్తమై చేయాలి. మీ మనసు-వాచ-కర్మణలను పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు ఏమని చెప్పుకుంటారు? బాప్దాదా కూడా మీ అందరికీ ఏ టైటిల్ను ఇచ్చారు, గుర్తుందా? సేవాధారి పిల్లలు. మరి ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉన్నారో వారి ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ సేవయే చేస్తుంది. భాషణ చేయడము, ఎవరికైనా అర్థం చేయించడము, కేవలం ఇదే సేవ కాదు. ఎవరైతే సేవాధారులుగా ఉన్నారో వారు ప్రతి సెకండు సేవయే చేస్తుంటారు. నా ప్రతి సెకండు సేవాధారి నడవడికగా ఉంటుందా అని స్వయాన్ని చూసుకోండి, లేక ఎక్కడైనా డిస్సర్వీసుతో కూడిన నడవడిక ఉంటుందా? సేవాధారి అన్న పేరు ఉన్నప్పుడు కర్మ కూడా అలాగే ఉండాలి. అందుకే ఏది చెప్తున్నారో అది చేయాలి కూడా. ఇది గుర్తుంచుకుంటే పురుషార్థంలో సహజంగా సఫలత లభిస్తుంది. మేము ఇంతమంది జిజ్ఞాసువులకు అర్థం చేయించాము, ఇన్ని భాషణలు ఇచ్చాము, చాలా సేవ చేసాము అని కొందరు చాలా సంతోషపడిపోతుంటారు కానీ అది కూడా హద్దు సేవయే. ఇప్పుడైతే అనంతమైన సేవను చేయాలి. మనసా-వాచ-కర్మణ మూడు రూపాలలో అనంతమైన సేవ జరగాలి – అప్పుడే సేవాధారి అంటాము. నేను సేవాధారిగా అయ్యానా అని ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. ఇటువంటి సేవాధారులు చాలా స్నేహిగా కూడా ఉంటారు. ఇప్పుడు ఇటువంటి ముద్రను అందరూ వేయించుకున్నారా లేక ఇటువంటి ధైర్యమును ఎవరైనా చేస్తున్నారా? చేయవలసిందే అన్నప్పుడు ముద్ర పడవలసిందే. మీపై సందేహం ఎందుకు పెట్టుకుంటున్నారు? పరీక్షలో పాస్ అవుతానో లేదో అని ఎందుకు అనుకుంటున్నారు? తెలివైన విద్యార్థి సదా నిశ్చయంతో, నేను నంబరువన్ లో వస్తాను అంటాడు. ముందునుండే స్వయంపై సంశయం ఉంటే సంశయం రిజల్టు ఏమి ఉంటుంది? అప్పుడు విజయులుగా అవ్వలేరు. కొద్దిగా అయినా సంశయం ఉంటే, నిశ్చయం రానంతవరకు విజయులుగా అవ్వలేరు. వారసత్వము తీసుకునే తీరుతాము అని మీరందరూ ముందు నుండే గట్టిగా చెప్పారు, అంతేనా లేక చూద్దాములే అని అనుకున్నారా? గట్టిగా చెప్పారంటే అయిపోయినట్లే.
స్వయాన్ని నిశ్చయుబుద్ధిగా చెప్తున్నప్పుడు ఏ విషయంలోనూ, తండ్రిలో, తండ్రి జ్ఞానంలో, తండ్రి పరివారంలో ఎందులోనూ సంశయంగానీ వికల్పంగానీ రాకూడదు. మేము శివబాబా సంతానము అన్నప్పుడు సర్వశక్తిమంతుని పిల్లలు నిశ్చయబుద్ధి కలవారుగా ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? సర్వశక్తిమంతుని పిల్లలు చెప్తున్నారు. నిశ్చయం పెట్టుకుంటేనే విజయం లభిస్తుంది. ఒకవేళ నిశ్చయం లేకపోతే మీ కర్మ కూడా అలాగే ఉంటుంది. మేము చేయవలసిందే అని నిశ్చయం పెట్టుకుంటే కర్మ కూడా అలాగే జరుగుతుంది. చూద్దాములే, చేద్దాములే అని అనుకుంటే కర్మ కూడా ఢీలాగానే జరుగుతుంది. ఎప్పుడు కూడా స్వయంలో బలహీనత, సంశయం యొక్క ఫీలింగును రానివ్వకండి. బలహీన సంకల్పాలే సంశయము. ఇప్పుడు ఇంకా ఎప్పటి వరకు ఈ పాత సంస్కారాలు మరియు సంకల్పాలు ఉంటాయి? పాత సంస్కారాలు కూడా ఉండకూడదు. సంస్కారమైతే మందమైన విషయము. కానీ పాత సంకల్పము కూడా సమాప్తం కావాలి. భట్టీ నుండి పరిపక్వమై వెళ్తున్నారు అని అప్పుడు అంటాము. భట్టీ అంటే అర్థము ఏమిటి? భట్టీలో అంతా కాలి సమాప్తమైపోతుంది. రూపమే మారిపోతుంది. ఏదైనా వస్తువును భట్టీలో వేస్తే దాని రూపము, గుణము మొదలైనవన్నీ మారిపోతాయి. మీరు కూడా భట్టీ చేస్తే రూపము, గుణము మారిపోవాలి. ఇటుక కాలినప్పుడు, మొదట్లో మట్టిగా ఉంటుంది, కాలిన తర్వాత దాని రూపము, గుణము మారిపోతాయి. కర్తవ్యము కూడా మారిపోతుంది. ఇదే విధంగా మీ రూపము, గుణము మరియు కర్తవ్యము మూడూ మారిపోవాలి. ఇదే భట్టీ రిజల్టు. ఇప్పుడు చెప్పండి, మారారా? లేక మారుతారా? మీ ఉత్సాహానికి బాబా సహాయం కూడా తోడుగా ఉంటుంది. ఎంతగా మీరు మీపై నిశ్చయాన్ని పెట్టుకుంటారో అంతగా బాప్దాదా కూడా తప్పకుండా సహయోగిగా అవుతారు. స్నేహికి తప్పకుండా సహయోగము లభిస్తుంది. ఎవరినుండైనా సహయోగము తీసుకోవాలంటే స్నేహిగా కావాలి. స్నేహితుడిని సహయోగం కోసం అడగాల్సిన అవసరం ఉండదు. బాప్దాదాకు స్నేహిగా అయితే, పరివారానికి కూడా స్నేహిగా అవుతారు. అప్పుడు అందరి సహయోగము స్వతహాగా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు విషయాలు – నిశ్చయబుద్ధి మరియు నష్టోమోహ – ఈ తిలకాన్ని అయితే మస్తకంపై పెట్టుకున్నారు. స్లోగన్ కూడా గుర్తు పెట్టుకోండి – ఏది చెప్తామో అది చేస్తాము. ఇది మాతలకు అలంకారము. మాతలు అలంకారము ఎక్కువ చేసుకుంటారు కదా. మరి ఈ మాతల అలంకరణను రత్నాలతో చేస్తున్నాము. అన్నిటికన్నా మెరిసే అలంకరణ రత్నాల అలంకరణ. బంగారంలో కూడా రత్నాలు ఉంటే ఎక్కువ మెరుస్తుంది. మరి బాప్దాదా ఈ మాతలను రత్నాలతో అలంకరించారు. ఎందుకంటే సంగమంలో బంగారం కన్నా వజ్రంలా అవ్వాలి. ఎంతెంతగా స్వయాన్ని రత్నాలతో అలంకరించుకుంటారో అంతగా వద్దనుకున్నాగానీ ప్రపంచ దృష్టి మీ వైపు పడుతుంది. మా వైపు చూడండి అని ప్రపంచానికి చెప్పనవసరం లేదు. ఈ జ్ఞాన రత్నాల అలంకరణ దూరంగా ఉండేవారి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. అందుకే ఈ రత్మాల అలంకారము సదా కోసం నిలుపుకుంటాము అన్న నిశ్చయాన్ని ఉంచండి.
ఈరోజు అమృతవేళ కొంతమంది పిల్లలు విశేషంగా గుర్తుకు వచ్చారు, సాకార రూపంలో ఎక్కువ సమయం తోడుగా ఉన్నవారి గుర్తు ఈరోజు విశేషంగా వచ్చింది ఎందుకంటే కలిసి ఉన్నవారి పురుషార్థము ముందుకన్నా ఇప్పుడు చాలా బాగుంది కనుక పురుషార్థపు స్నేహంలో వారి స్మృతి వచ్చింది. వర్తమాన సమయం మధుబనం వారిలో పరివర్తన విశేషంగా కనిపిస్తుంది. ప్రతి రత్నము మెరుపును పొంది ప్రతి స్థానానికి వెళ్తున్నారు. ఒక్కొక్క మెరిసిన రత్నము వెళ్ళి తమ సమానంగా ఎలా చేస్తుందో అన్నదానిని ఇప్పుడు చూద్దాము. ఎప్పుడు కూడా ధైర్యహీనమైన మాటలు మాట్లాడకండి. పురుషార్థహీనంగా మరియు ధైర్యహీనంగా అవ్వడము – ఇప్పుడు ఆ సమయము పోయింది. ఇప్పుడైతే సహయోగిగా కావాలి మరియు అయి చూపించాలి. మేము కూడా త్వరగా వెళ్ళాలి అని అందరి మనసులలో సంకల్పం వస్తుంది. సంగమయుగంలో ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత మంచిది అని మునుపు అనేవారు, ఎందుకంటే సాకారునితోటే పనిలో మనోరంజనము ఉండేది. ఇప్పుడైతే దారి చూపువాడు లేనప్పుడు ప్రయాణికులమైన మనమెందుకు అంటున్నారు. పిల్లలైన మీ నడవడిక వాణికన్నా ఎక్కువ సేవ చేస్తుంది. డబల్ సర్వీసులో సఫలత ఉంటుంది అప్పుడే డబల్ కిరీటము లభిస్తుంది. సింగల్ కిరీటధారిగా అవుతారా లేక డబల్, చెప్పండి? లేక అయ్యే ఉన్నారా? శక్తిరూపంగా అయ్యేందుకు సాధనము ఏమిటి? అవ్యక్త స్థితి ఉన్నప్పుడే శక్తిరూపులుగా అవ్వగలరు. అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలోకి వచ్చినా కానీ సేవార్థమే వస్తారు. సేవ సమాప్తమవ్వగానే అవ్యక్త స్థితిలో ఉండాలి, ఇటువంటి అభ్యాసాన్ని పెట్టుకోండి.
బలి అయ్యేవారికి రిటర్నులో ఏమి లభిస్తుంది? బలి అయినవారికి ఈశ్వరీయ బలం చాలా లభిస్తుంది. ఎవరైతే సంపూర్ణ స్వాహా అవుతారో వారే సదా సౌభాగ్యవతిగా అవుతారు. వారి సౌభాగ్యము ఎప్పటికీ పోదు. ఎవరైతే సదా సౌభాగ్యవతిగా ఉంటారో వారికి అవినాశి బిందువు సదా ఉంటుంది. ఆత్మ స్థితిలో స్థితి అయిన బిందువును అని సదా సౌభాగ్యవతికి ఎల్లప్పుడూ బుద్ధిలో గుర్తుంటుంది. సదా సౌభాగ్యవతుల గుర్తులు ఇంకేమి ఉంటాయి? ఒకటి బిందువు, రెండు కంకణము, అది సంగమము అను కంకణము. రెండిటినీ ఎప్పుడూ తీయరు. సంగమ కంకణాన్ని తీసేస్తే సౌభాగ్యము పోతుంది. ఇప్పుడు విశేషంగా అద్భుతమైన సేవను చేయాలి. మీ సాంగత్యంతో అందరికీ ఎటువంటి రంగును వేయాలంటే ఎప్పటికీ పోకూడదు. మ్యూజియంలో అయితే కేవలం సందేశాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మా సాంగత్యపు రంగు ఎంతగా అవినాశిగా ఉండాలంటే అది ఎప్పటికీ పోకుండా ఉండేలా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు జంప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు వరకు కేవలం నడిచే సమయము. తర్వాత పరిగెత్తే సమయం కూడా వచ్చింది. ఇప్పుడైతే జంప్ చేసే సమయము. పరిగెత్తి చేరుకునే ప్రయత్నం చేస్తే టూ లేట్ (చాలా ఆలస్యము) అయిపోతుంది. జంప్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఏకరస స్థితిలో ఉండటానికి ఒకటే శుద్ధ సంకల్పాన్ని పెట్టుకోండి. ఆ ఒక్కటి ఏమిటి? ఒకటి స్నేహిగా అవ్వాలి, రెండు సేవాధారిగా అవ్వాలి. అంతే. ఇవి కాక వేరే సంకల్పం లేదు. సేవాధారికి సేవ గురించిన ఆలోచనలే వస్తాయి. నేను మారి ఇతరులను మార్చాలి అన్నది భట్టీ లక్ష్యము. ఈ లక్ష్యాన్ని సదా గుర్తుంచుకోండి. ఇది నిశ్చయానికి గుర్తు. మీపై ఏ ముద్ర పడింది? నిశ్చయబుద్ధి, నష్టోమోహ మరియు సేవాధారి. ఈ త్రిమూర్తి ముద్ర పడింది. మీ ఈ గుర్తును నిలుపుకోండి. మీ సమానంగా ఇతరులను మీకన్నా ఉన్నతంగా తయారు చేయండి. తక్కువగా కాదు. మనకన్నా ఉన్నతంగా ఎవరైనా తయారైతే, అది కూడా మన ఉన్నతే కదా. అచ్ఛా.
ఓంశాంతి