Search for a command to run...
16 Oct 1969
పరిశీలన శక్తిని తీవ్రం చేసుకోండి
16 October 1969 · తెలుగు
ఈరోజు విశేషంగా ఏమి చూస్తున్నాము? పరివర్తన ఎలా చూస్తాము? ఈ గ్రూపులో ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చే తెలివైనవారు ఎవరున్నారు? చూసే మరియు పరిశీలించే శక్తి ఎంతవరకు వచ్చాయి? అచ్ఛా – యోగ స్థితిలో నిరంతరం ఉండేవారు ఎవరు? దివ్య గుణాల ధారణలో దివ్యగుణమూర్తిగా ఎవరు కనిపిస్తున్నారు? ఇలా ఎందుకు అడుగుతున్నాము? ఎందుకంటే పరిశీలించే అభ్యాసం ఉంటే ప్రపంచంలోకి కార్యార్థం వెళ్ళినప్పుడు అసుర సాంప్రదాయంతో సంబంధం పెట్టుకోవలసి వస్తుంది, అప్పుడు పరిశీలించే ప్రాక్టీసు ఉంటే చాలా విషయాలలో విజయులుగా అవుతారు. ఒకవేళ పరిశీలన శక్తి లేకపోతే విజయులుగా అవ్వలేరు. మన పరివారంలోనే ఎంతవరకు పరిశీలించగలుగుతున్నారు అని కొద్దిగా గమనించాము. నిజానికి ప్రతి రత్నము ఒకరిని మించిన మరొక శ్రేష్ఠ రత్నము. అయినా కానీ పరిశీలించే అభ్యాసము తప్పకుండా కావాలి. ఈ పరిశీలించే శక్తిని చిన్న విషయంగా భావించవద్దు. దీని ఆధారంగానే నంబరును తీసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి అయినా, ఏ సంకల్పాలు ఉన్న ఆత్మలైనా, వర్తమానము మరియు భవిష్యత్తు రెండు కాలాలను పరిశీలించే అభ్యాసం కావాలి. విశేషంగా పాండవ సైన్యానికి పరిశీలన శక్తి చాలా ఆవశ్యకము. ఎందుకంటే గోపకులైన (అన్నయ్యలు) మీరు ఎన్నో పరిస్థితులను చూస్తారు. వాటిని ఎదుర్కోవడానికి ఈ బుద్ధి చాలా అవసరము. పరిశీలించే శక్తి ఎలా వస్తుంది – అందుకోసం ముఖ్య సాధనము ఏమిటి? పరిశీలించే శక్తిని తీవ్రంగా చేసుకోవడానికి ముఖ్యంగా చేయవలసిన సాధన ఏమిటి? పరిశీలించే తీరు ఎలా ఉండాలి? మీ ఎదురుగా ఎవరైనా వస్తే వారిని పరిశీలించగలరా? (అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు) అందరి రహస్యము ఒక్కటే. అవ్యక్త స్థితి లేక స్మృతి లేక ఆత్మిక స్థితి – మాట ఒక్కటే. కానీ ఆత్మిక స్థితితో పాటు ఎవరి బుద్ధిలో అయితే ఎక్కువ వ్యర్థ సంకల్పాలు రావో వారే యథార్థ రూపంలో పరిశీలించగలరు. వారి బుద్ధి ఒక్కరి స్మృతిలో, ఒక్కరి కార్యంలో మరియు ఏకరసంగా ఉంటుంది. వారు ఇతరులను త్వరగా పరిశీలించగలరు. ఎవరి బుద్ధిలో అయితే ఎక్కువ సంకల్పాలు ఉత్పన్నం అవుతుంటాయో వారి బుద్ధిలో ఇతరులను పరిశీలించడంలో తమలోని వ్యర్థ సంకల్పాల మిక్స్చరిటి (కలగలపు) ఉంటుంది. అందుకే ఎవరు ఎలాంటివారో అలాగే పరిశీలించలేరు. అంటే బుద్ధి స్వచ్ఛత అన్నది ఇందులో ముఖ్యమైన రహస్యము. ఎంతగా బుద్ధి యొక్క స్వచ్ఛత ఉంటుందో అంతగా యోగయుక్త అవస్థలో ఉంటారు. ఈ వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు అవ్యక్త స్థితికి విఘ్నంగా నిలుస్తాయి, పదే పదే ఈ శారీరక ఆకర్షణలోకి వచ్చేస్తుంటారు, అందుకు మూల కారణము బుద్ధి స్వచ్ఛంగా లేకపోవడము. బుద్ధి స్వచ్ఛత అనగా బుద్ధికి ఏ మహామంత్రమైతే లభించిందో అందులోనే బుద్ధి మునిగి ఉండాలి. ఒక్కరి స్మృతిని విడిచిపెట్టి అనేక వైపులకు బుద్ధి వెళ్తున్న కారణంగా శక్తిశాలిగా ఉండటం లేదు. బుద్ధి అనేక కార్యాలలో పరిగెడుతున్నప్పుడు, బుద్ధికి బలహీనత, అలసట అనిపిస్తాయి. అలాగే ఏది ఉన్నా యథార్థ రూపంలో నిర్ణయం తీసుకోలేరు. ఇదే విధంగా వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు కూడా బుద్ధిని అలసిపోయేలా చేస్తాయి. అలసి ఉన్న ఏ ఆత్మ అయినా పరిశీలించలేదు, నిర్ణయం తీసుకోలేదు. ఎంత తెలివైనవారైనా కానీ అలసటగా ఉన్నప్పుడు వారి పరిశీలన, నిర్ణయ శక్తిలో తేడా వస్తుంది. రోజంతా ఇలాంటి సంకల్పాలతోటే బుద్ధి అలసిపోయి ఉన్న కారణంగా నిర్ణయం తీసుకునే శక్తిలో లోపం కనిపిస్తుంది. అందుకే విజయులుగా అవ్వలేకపోతున్నారు. ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణము. బుద్ధి స్వచ్ఛత లేదు. ఎలా అయితే వారికి హస్తలాఘవము (గారడి) ఉంటుందో అలా మీరు బుద్ధి స్వచ్ఛతతో ఏమేమి చేయగలరు! వారు హస్తలాఘవముతో వెంటనే మార్చేస్తారు. ఆలస్యం ఉండదు. అందుకే వారిని ఇంద్రజాలికుడు అంటారు. మీలో కూడా పరివర్తన చెందే గారడి వచ్చేస్తుంది. ఇప్పుడు మారడం నేర్చుకున్నారు, కానీ గారడీ చేసినట్లుగా మారలేకపోతున్నారు అనగా త్వరగా మారలేకపోతున్నారు. సమయం పడుతుంది. ఇంద్రజాలం చేసేవారు ఎంత సమయం వారికి మంత్రం గుర్తుంటుందో అంత సమయం వరకు సఫలమవుతారు. మీకు కూడా ఒకవేళ మహామంత్రం గుర్తుంటే గారడీ సమానంగా పని చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఆలస్యం ఉంది. మరి ఇప్పుడు ఈ భట్టీనుండి ఎలా తయారై వెళ్తారు? (ఇంద్రజాలికుడు) ఒకవేళ ఇంతమంది ఇంద్రజాలికులు భారతదేశ మూలమూలలలోకి వెళితే ఏమయిపోతుంది? ఒక్క నెలలోపు మరో దృశ్యం కనిపిస్తుందా? ఇప్పుడైతే తయారీ చేయాలి కదా. ఇంతమంది ఇంద్రజాలికులు మారే కార్యాన్ని ప్రారంభిస్తే ఏమి చేయాల్సి ఉంటుంది? ఇటువంటి ఏదైనా నవీనతను మీరూ చూడాలనుకుంటున్నారు, బాప్‌దాదా కూడా చూడాలనుకుంటున్నారు. వీరు ఎవరు, ఎక్కడినుండి ప్రత్యక్షమయ్యారు అన్న ధ్వని వెలువడుతుంది. ఒక్కొక్క స్థానంలో ఒక అలౌకిక ఆత్మ అవతరించింది అన్నట్లుగా ఉండాలి. ఒక్క అవతారము ఇంత చేస్తే మీరంతా ఎన్ని అవతారాలు! మేము ఈ శరీరంలో ఈశ్వరీయ సేవ కోసం అవతరించాము అని భావిస్తూ ఇక్కడనుండి వెళ్ళండి. ఈ స్మృతితో వెళ్ళినప్పుడు మీ ప్రతి నడవడికలో అలౌకికత కనిపిస్తుంది. వీరు కొత్తగా వచ్చారు, మారి వచ్చారు అని దైవీ పరివారమువారు, మీ లౌకిక పరివారం భావించాలి. మీరు మారుతున్న అనుభవం అయినప్పుడు మీరు ప్రపంచాన్ని కూడా మార్చగలరు. మీ అందరూ మారుతున్న భావన రాకపోతే ప్రపంచాన్ని మార్చలేరు. స్వయం మారి ప్రపంచాన్ని మార్చాలి. నిమిత్తమాత్రంగా ఈ శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం అప్పుగా కొద్ది రోజుల కోసం తీసుకున్నాను అని ఇలా భావిస్తూ ఉండండి. కార్యం సమాప్తం చేసి తిరిగి వెళ్ళిపోతాను. ఈ స్మృతి, లక్ష్యము, ఇటువంటి స్థితిని తయారుచేసుకుని నడుచుకోండి.
ఇది పూలతోట. బాప్‌దాదా చైతన్య పూలతోటలోకి వస్తారు. కనుక కొంత వాణి ద్వారా సుగంధాన్ని తీసుకుంటారు, కొంత నయనాలతో, కొంత మస్తక మణితో. ప్రతి ఒక్కరి మస్తక మణి యొక్క మెరుపును బాప్‌దాదా చూస్తున్నారు. ఇలాగే ఒకవేళ మీరందరూ కూడా మస్తక మణినే చూస్తున్నట్లయితే ఈ దృష్టి మరియు వృత్తి శుద్ధంగా మరియు సతోప్రధానంగా అయిపోతాయి. చంచలమైన దృష్టికి మూల కారణము – మస్తక మణిని చూడకుండా శారీరక రూపాన్ని చూడటము. రూపాన్ని చూడకండి, మస్తకంలోని మణిని చూడండి. రూపాన్ని చూసినప్పుడు పామును చూస్తున్నట్లుగా భావించండి. పాము మస్తకంలో మణి ఉంటుంది కదా. కనుక మణిని చూడండి, పామును కాదు. శరీర భానంలో చూస్తున్నారంటే పామును చూస్తున్నారని అర్థం. పామును చూస్తే పాము కాటేస్తుంది. పాము తన పని తాను చేస్తుంది. పాములో విషం కూడా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పాములు కూడా ఉంటాయి, వాటికి మణులు ఉంటాయి. గోపకులైన మీరు పామును చంపాలి, అందుకు ఏమి చేస్తారు? మీరు పామును చూస్తూ కూడా చూడకండి. మణినే చూడండి. మణిని చూసినప్పుడు పాము విషము తగ్గుతుంది. ఒకవేళ శరీరము అనే పామును చూస్తే దానిలా అవుతారు, దానిలా అయిపోతారు. మణిని చూస్తే బాప్‌దాదా మాలలో మణిగా అవుతారు. అయితే పాములా కావాలి లేకపోతే మాలలో మణిగా కావాలి. మణిగా కావాలంటే మణినే చూడండి. అప్పుడు ఈ కంప్లెయింట్లు (ఫిర్యాదులు) సమాప్తమై కంప్లీట్ (సంపూర్ణము) అవుతారు. ఎక్కడ కంప్లెయింటు, ఎక్కడ కంప్లీటు అన్నది బుద్ధితో పరిశీలించండి. రాత్రి-పగలుకున్న తేడా ఉంది. అయితే సింధి బాషలో వ్రాస్తే రెండు చుక్కల తేడా మాత్రమే. ఇక్కడ కూడా అలాగే, రెండు బిందువులు, ఒకటి స్వయం, రెండు బాప్‌దాదా. ఈ రెండు బిందువులు గుర్తుంటే కంప్లెయింటుకు బదులుగా కంప్లీట్ అవుతారు. కనుక ఈరోజు నుండి ఈ ప్రతిజ్ఞను స్వయంతో స్వయమే చేయండి. బాప్‌దాదా ఎదురుగా అయితే చాలా ప్రతిజ్ఞలు చేసారు, ఇప్పటినుండి మణిని తప్ప మరేదీ చూడము, స్వయం మాలలో మణిగా అయ్యి పూర్తి సృష్టిలో ప్రకాశిస్తాము. స్వయం మణిగా అయినప్పుడే మెరుస్తారు. ఒకవేళ మణిగా అవ్వకపోతే ప్రకాశించలేరు. ప్రతిజ్ఞ చేసినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. స్వయంతో పూర్ణ రూపంలో ప్రతిజ్ఞను చేయలేకపోతున్నారు అందుకే ప్రత్యక్షత కూడా పూర్ణ రూపంలో జరగడం లేదు. ప్రత్యక్షత తక్కువగా జరగడానికి కారణము స్వయంతో చేసుకునే ప్రతిజ్ఞలో లోటు ఉండటము. ఇప్పుడే అంటారు, ఇప్పుడే మర్చిపోతారు. కానీ ఇప్పుడు ప్రతిజ్ఞతో పాటు ప్రత్యక్షతను కూడా తీసుకువస్తాము అని కూడా గుర్తుంచుకోండి, అప్పుడు మీ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చూపిస్తుంది. పాండవ సైన్యము జ్ఞానీ తూ (స్వరూప) ఆత్మలు, శక్తి సైన్యము స్నేహి తూ ఆత్మలు. స్నేహిగా ఉన్నవారు యోగులుగా కూడా ఉంటారు. ఇప్పుడైతే పాండవులు ఒక్కొక్కరి మస్తకంపై ఉల్లాస ఉత్సాహాలు కనిపిస్తున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు ఎప్పటికీ ఏకరసంగా ఉండాలి. తీసుకున్న శ్రమకు ఫలితం కనిపించాలి. ఇక్కడ తీసుకున్న శ్రమకు ఇక్కడ లెక్క తీర్చకపోతే సత్యయుగంలో ఆ శ్రమకు ఫలితాన్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది, అందుకని ఏదైతే శ్రమను తీసుకున్నారో దానిని నింపి ఇవ్వండి.
ఈ కుమారులైతే అవతరించినవారిగా ఈ పృథ్వి పైకి వచ్చారు అన్న సమాచారం ప్రతి సేవాకేంద్రం నుండి రావాలి. ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఫలితం వెలువడింది అని భావించండి. ఇప్పుడు ఇటువంటి స్థితి యొక్క ఆవశ్యకత ఉంది. ఎలా అయితే బాప్‌దాదా లోన్ (అప్పు) తీసుకుని వస్తారో, ఇప్పుడైతే ఇద్దరూ అప్పు తీసుకుని వస్తున్నారు, కొద్ది సమయం కోసం వస్తారు, ఎందుకని? కలవడానికి. అలాగే మీరందరూ కూడా, మేము లోన్ తీసుకుని కొద్ది సమయం కోసం సేవకు నిమిత్తమై వచ్చాము అని భావించండి. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు బాబా ప్రభావము ప్రపంచం ముందుకు వస్తుంది. రెండు లెక్కలనూ సరి చేసారా? లేక, తీసుకునేది సరి చేసారు గానీ ఇచ్చేది చేయలేదా? 6 నెలల వరకు ఏకరసంగా ఉంటారు కదా లేక 15 రోజుల తర్వాత, అనుకుంటున్నాము కానీ ఏమి చేయాలి, ఇలా అయిపోయింది అనే కంప్లెయింట్లు రాకూడదు! అయితే దీదీ పని చాలా సులువు అయిపోతుంది. మీరు భారీగా ఉంటే అన్ని పనులు భారంగా ఉంటాయి. బాప్‌దాదాకు ఉన్న ఆశ అనండి లేక శుద్ధమైన సంకల్పం అనండి, ప్రతి ఒక్కరూ నంబరువన్‌గా ఉండాలి అన్నది ఉంది, ఉంటుంది. కానీ కల్పమంతటిలో ఎవరైతే ఇప్పుడు స్థితిని తయారు చేసుకుంటారో, ఇప్పటి లెక్క అనుసారంగా వారు నంబరువన్ అవుతారు కదా. అది వాస్తవిక సంపూర్ణ స్థితి. అందుకనే చెప్తున్నాము. మేము నంబరువన్ అవుతాము అని అందరూ లక్ష్యము పెట్టుకోండి. అందరూ ఎలా నంబరువన్ అవ్వగలరు అని ఆలోచించకండి. ఇందులో మహాదానిగా అవ్వద్దు. ముఖ్యంగా రెండు విషయాలను గుర్తుంచుకోండి – ఒకటి మణిని చూడండి, దేహమనే పామును చూడకండి. రెండవ విషయము, స్వయాన్ని అవతరించినవారిగా భావించండి. ఈ శరీరంలోకి అవతరించి కార్యం చేయండి. ఇంకొక స్లోగన్‌ను సదా గుర్తుంచుకోండి – ఏదైతే బాప్‌దాదా చెప్తారో, చేయిస్తారో, ఎలా నడిపిస్తారో, అలాగే చేస్తాము, నడుస్తాము, మాట్లాడుతాము, చూస్తాము. ఇదే పాండవ సైన్యానికి ముఖ్య స్లోగన్. ఏది చెప్తారో అదే ఆలోచించండి, మరొకటి ఆలోచించకండి. ఈ కళ్ళతో మరొకటి చూడకండి. కళ్ళను కూడా ఇచ్చేసారు కదా. పూర్తి దీపపు పురుగులు కదా. దీపపు పురుగులకు దీపం తప్ప ఇంకేమైనా కనిపిస్తుందా? మీ కళ్ళు ఇంకేమి చూస్తాయి? ఇంకేమైనా చూస్తుంటే మోసం జరుగుతుంది. స్వయాన్ని మోసగించుకోవద్దు. ఇందుకోసం దీపపు పురుగులకు దీపం తప్ప మరేదీ కనిపించకూడదు. సంపూర్ణము అంటే పూర్తి దీపపు పురుగులు. ఇదే ముద్ర. రిజల్టు బాగుంది కానీ దానిని అవినాశిగా పెట్టుకోండి. ఎప్పుడు ఎలా కావాలంటే అప్పుడు అటువంటి స్థితిని తయారు చేసుకోగలగాలి. ఇలా మనసుతో డ్రిల్ చేయించండి. ఇది తప్పకుండా ప్రాక్టీసు చేయండి. ఒక్క సెకండులో ధ్వనిలోకి, ఒక్క సెకండులో మళ్ళీ ధ్వని నుండి అతీతంగా. ఒక్క సెకండులో సేవా సంకల్పాలలోకి రండి, ఒక్క సెకండులో సంకల్పాలకు అతీత స్థితిలో స్థితులవ్వండి. ఈ డ్రిల్ చాలా అవసరము. అంతేకానీ శారీరక భానము నుండి బయటకు రాలేకపోతున్నాము అనకండి. ఒక్క సెకండులో కార్యం కోసం శారీరక భానంలోకి రావాలి, మళ్ళీ ఒక్క సెకండులో అశరీరులుగా అయిపోవాలి, ఎవరికైతే ఈ డ్రిల్ పక్కా వస్తుందో వారు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు. ఎలా అయితే శారీరిక డ్రిల్‌ను ఉదయమే చేస్తారో అలాగే ఈ అవ్యక్త డ్రిల్‌ను అమృతవేళలో విశేష రూపంలో చేయండి. రోజంతా చేయాలి కానీ విశేష అభ్యాసానికి అమృతవేళ సమయము అంటున్నాము. ఎప్పుడైనా బుద్ధి బిజీగా ఉంటే ఆ సమయంలోనే ఈ అభ్యాసాన్ని చేయండి. పరిస్థతిలో ఉంటూ కూడా మనం మన బుద్ధిని అతీతంగా చేసుకోవచ్చు. కానీ, ఏదైనా కార్యాన్ని అతీత స్థితిలో ఉండి చేసినప్పుడే అతీత స్థితి అని చెప్పగలము. ఒకవేళ ఆ కార్యంపై మోహము ఉన్నట్లయితే ఒక్క సెకండులో డిటాచ్ అవ్వలేరు. అందుకే ఈ అభ్యాసాన్ని చేయండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎందుకంటే ఫైనల్ పేపరు అనేక రకాల భయానకంగా, వద్దన్నా తమ వైపుకు ఆకర్షించేలా ఉంటాయి. అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు ఏమీ లేనట్లు. రాబోయే అంతిమ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల మధ్య పేపరు రానుంది. ఇందుకు ముందు నుండే తయారీ కావాలి. అందుకే మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు, బుద్ధి స్థూల పనులలో బిజీగా ఉన్నప్పుడు, నలువైపుల ఉన్న పరిస్థితులు మీ వైపుకు లాగుతున్నప్పుడు ఈ అభ్యాసాన్ని చేయండి. అప్పుడు మీరు ఎంత డ్రిల్ చేయగలుగుతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ విషయము కూడా చాలా ఆవశ్యకము. ఈ డ్రిల్‌ను చేస్తూ ఉంటే సఫలతను పొందుతారు. ఒక్కొక్క సబ్జెక్టుకు నంబరు ఉంటుంది. ముఖ్యమైనది ఇదే. ఇందులో బాగుంటే ముందు నంబరు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ సబ్జెక్టులో నంబరు తక్కువగా ఉంటే ఫైనల్ నంబరులో ముందుండలేరు. అందుకే జ్ఞానీ తూ(స్వరూప) ఆత్మతో పాటు స్నేహి తూ ఆత్మగా కూడా అవ్వాలి అని వినిపించాము. స్నేహిగా ఉన్నవారు స్నేహాన్ని పొందుతారు. ఎవరికైతే ఎక్కువ స్నేహము ఉంటుందో, వారు ప్రపంచాన్ని మర్చిపోయారు అంటారు. మర్చిపోవడము అంటే తమ స్వరూప స్మృతిని కూడా మర్చిపోవడము అని అర్థము. బుద్ధి తపన కూడా వారిపై తప్ప ఇంకెక్కడా ఉండకూడదు. ఇలా ఎవరైతే ఉంటారో వారిని స్నేహి అంటారు.
ఈ గ్రూపు యొక్క విశేషత ఇదే – అన్ని విషయాలను నేర్చుకుని, ధారణ చేసి మున్ముందు స్వయాన్ని నడిపించుకోవడంలో ఛాత్రకులుగా ఉన్నారు. ఛాత్రకులుగా అయ్యారు కానీ అలాగే చరిత్రవంతులుగా కూడా కావాలి. ఛాత్రకులుగా ఉన్నారు, ఇది ఈ గ్రూపు విశేషత. కానీ దప్పికతో ఉండటము(ఏదో ఒకటి చేయాలన్న దప్పికతో ఉండటము) ఛాత్రక కార్యము. ఈ చిత్రాన్ని చరిత్రలో చూడాలి, అప్పుడు ఛాత్రకులతో పాటు యోగ్యులు అని కూడా అంటాము. ఇప్పుడైతే ఛాత్రకులుగా ఉన్నారు. రిజల్టు వచ్చిన తర్వాత రెండు టైటిళ్ళు లభిస్తాయి, ఇప్పుడైతే కేవలం ఛాత్రకులు. తర్వాత విజయమాలకు సమీపంగా వచ్చేందుకు కూడా యోగ్యులుగా అవుతారు. ఏదైతే స్లోగన్ వినిపించామో, భట్టీ ముద్ర అని దేనినైతే చెప్పామో దానిని స్థిరంగా పెట్టుకోండి అప్పుడు రెండు గుణాలు వచ్చేస్తాయి. అచ్ఛా!
ఓంశాంతి