Search for a command to run...
2 Apr 1970
సంపూర్ణ స్థితికి గుర్తులు
2 April 1970 · తెలుగు
అందరిలో వినాలన్న సంకల్పము ఉంది. బాప్‌దాదా లోపల ఏ సంకల్పం ఉంది? బాప్‌దాదా వినడము వినిపించడము నుండి అతీతముగా తీసుకువెళతారు. ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతముగా అవ్వడం వస్తుందా? శబ్దంలోకి చాలా సహజముగా మరియు త్వరగా ఏవిధంగా అయితే వస్తారో అలాగే శబ్దం నుండి అతీతంగా కూడా అంతే సహజంగా మరియు త్వరగా వెళ్ళగలరా! స్వయాన్ని ఏమని పిల్చుకుంటారు? మాస్టర్ సర్వశక్తిమాన్. ఇప్పుడు మాస్టర్ సర్వశక్తిమంతుల నషా తక్కువగా ఉంటోంది, కావున ఒక్క క్షణంలో శబ్దంలోని రావడం మరియు ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతంగా వెళ్ళడం ఈ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రకాశము ముఖముపై కనిపించడం లేదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారవుతుందో, ఇప్పుడే శబ్దంలోకి రావడం మళ్ళీ ఇప్పుడే శబ్దం నుండి అతీతంగా వెళ్ళే అభ్యాసం సరళంగా మరియు సహజంగా అయిపోతుందో అప్పుడు సంపూర్ణత వచ్చిందని భావించండి. ఇదే సంపూర్ణ స్థితికి గుర్తు. అప్పుడు పురుషార్థాలన్నీ సరళమైపోతాయి. పురుషార్థంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. స్మృతి యాత్ర మరియు సేవ రెండూ పురుషార్థంలో వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ రెండింటిలోనూ సరళత అనుభవమవుతుందో అప్పుడు సంపూర్ణత యొక్క స్థితి ప్రాప్తించనున్నదని అర్థం చేసుకోండి. సంపూర్ణ స్థితి కలవారు పురుషార్థం తక్కువగా చేస్తారు, సఫలతను అధికంగా పొందుతారు. ఇప్పుడు పురుషార్థము అధికముగా చేయవలసి వస్తోంది, దాంతో పోలిస్తే సఫలత తక్కువగా ఉంది. నేడు బాప్‌దాదా అందరి ముఖంలో ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేసారు, ఇది ఎవరికి టచ్ అవుతుందో చూద్దాము! బాబా ఏ విషయాన్ని చెక్ చేసారు? థాట్ రీడర్స్ సంకల్పాలను క్యాచ్ చేయగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తిమంతులు వాటిని క్యాచ్ చేయలేరా? ఈ భట్టిలోని వారికి పరీక్ష పెట్టలేదు. ఈరోజు పరీక్ష పెడదాము. అందరూ పాసయ్యే ఉన్నారు. ఒకటేమో, పాస్ అవ్వడము, రెండవది, పాస్ విత్ హానర్‌గా అవ్వడం. పాండవ సైన్యం శక్తులకు ముందు ఉంటారు. కొందరు ముందు, కొందరు వెనుక ఉంటారు. (గోపులతో) మీరు శక్తుల ముందు ఉన్నారా లేక వెనుక ఉన్నారా? ఎవరైతే ముందుకు పరిగెడదామనుకుంటారో వారినెవరూ ఆపలేరు. స్వయం యొక్క అవరోధమే వారిని ఆపుతుందిగానీ ఇతరులెవరూ వారిని ఆపలేరు. పాండవులు వెనుక ఉండడమే ముందుకు వెళ్ళడము. వెనుక ఎందుకు ఉంటారు? గార్డ్(కాపలాదారుడు) వెనుక ఉంటాడు. మీరు వెనుక ఉండే గార్డా లేక ముందు ఉండేవారా? ఏ స్థానము మంచిగా అనిపిస్తుంది. గార్డ్ వెనుక ఉంటాడు, గైడ్ (దారిచూపువాడు) ముందు ఉంటాడు. గైడ్ ముందున్నట్లే కదా! పాండవులను గార్డ్‌గా చేసి, శక్తులను రక్షించేందుకు నిమిత్తం చేయడం జరిగింది. పాండవులు వెనుక ఉండి శక్తులను ముందుంచాలి. గైడుగా అవ్వకూడదు, గార్డుగా అవ్వాలి. పాండవులు గైడ్‌గా అయితే గడబిడ అవుతుంది. అందుకే పాండవ సైన్యం గార్డ్‌గా అవ్వాలి. మీరు ఏ పురుషార్థుల లైనులో ఉన్నారు? పురుషార్థుల లైన్లు ఎన్ని తయారయ్యాయి?
ఇప్పుడు బాప్‌దాదా మాస్టర్ సర్వశక్తిమంతులుగా తయారు చేసే ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే, వారి ముఖంతో వారి స్థితి మరియు సంకల్పాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అనుమానం కూడా లేకుండా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది అంతిమ చదువు యొక్క స్థితి. సాకార రూపంలో కొంత దృశ్యాన్ని అంతిమంలో చూపించారు. ఎవరైతే సాకార రూపంలో తోడుగా ఉన్నారో వారు ఇటువంటి అనేక విషయాలను నోట్ చేశారు. ఇటువంటి స్థితియే నెంబరువారీగా పిల్లలందరిదీ ఏర్పడనున్నది. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు అంతిమ స్వరూపము మరియు భవిష్య స్వరూపము పిల్లలైన మీ అందరి ముఖం ద్వారా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటివరకైతే సాక్షాత్తు సాకార రూపంగా అవ్వరో అప్పటివరకు సాక్షాత్కారాలు జరుగవు. కావున ఈ సబ్జెక్టుపై అతి సమీప రత్నాలు శ్రద్ధ వహించాలి. ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా స్వయము స్పష్టంగా ఉంటారు మరియు ఇతరులు కూడా వారి ముందు స్పష్టంగా కనిపిస్తారు. ఎవరి పురుషార్థం ఎంతెంతగా స్పష్టమవుతూ ఉంటుందో అంతంతగా వారి ప్రాలబ్ధం కూడా స్పష్టమవుతూ ఉంటుంది. అలాగే ఇతరులు కూడా వారి ముందు స్పష్టమవుతూ ఉంటారు. స్పష్టత అనగా సంతుష్టత. ఎంతగా సంతుష్టమవుతూ ఉంటారో అంతగానే స్పష్టమవుతారు. స్పష్టమైన పిల్లలను సాకార రూపంలో ఏ పదాలతో సంబోధించేవారు? స్వచ్ఛమైనవారు మరియు సత్యమైనవారు. ఎవరిలోనైతే సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో వారు సదా స్పష్టంగా ఉంటారు. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాఠము భట్టీలోని చదువులో చివరి పాఠము, ఇందులోనే ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి. ఎవరు ఏ విషయంలో ఉదాహరణ మూర్తులుగా అవుతారో వారికి దాని ఫలితముగా పరీక్షలో ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి. నాలుగు సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. ఒకటి, స్మృతి శక్తి, స్నేహశక్తి, సహయోగ శక్తి మరియు సహన శక్తి. ఈ నాలుగు విషయాలు విశేషంగా ఈ భట్టీలోని సబ్జెక్టులు.
ఈ నాలుగు విషయాలలో బాప్‌దాదా ఏ రిజల్టును చూశారు? హర్షించదగ్గ రిజల్టునే చూశాము. అన్ని శక్తులు సమానంగా అయ్యే శాతంలో కొంత లోపము ఉంది. నాలుగు శక్తులు ఉన్నా కానీ ఆ నాలుగింటిలో సమానత ఉండాలి. అందులో శాతంలో లోపం ఉంది. కావున రిజల్టు ఏమిటి? 75 శాతం పాసయ్యారు, మిగిలిన 25 శాతంలో లోపం ఏదైతే ఉందో అది సర్వశక్తులలో సమానత ఉండడంలోనే లోపము ఉంది. కొందరిలో ఒక శక్తి విశేషంగా ఉంటే మరికొందరిలో ఇంకొక శక్తి విశేషంగా ఉంది. నాలుగు శక్తులు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో అప్పుడు సంపూర్ణంగా ఉన్నారని భావించండి. (ఈ స్థితిలో శరీరమును వదలితే భవిష్య రిజల్టు ఎలా ఉంటుంది?) ఎవరైతే ఇటువంటి పురుషార్థులుగా ఉంటారో వారు ఎంతైనా ధైర్యమును ఉంచారు కదా! పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయము చేస్తారు అని బాప్‌దాదా కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. ఇటువంటి ధైర్యమును ఉంచి నడిచేవారు అంతిమం వరకు ఇదే ధైర్యంతో ఉంటే ఇటువంటి ధైర్యవంతులైన పిల్లలకు ఎంతో కొంత సహాయం లభిస్తుంది. అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి అంతిమంలో ఒక్కరి సృతిలో ఉండే పురుషార్థమును ఎవరైతే చేస్తారో వారికి సహాయం లభించిన కారణంగా పురుషార్థము సహజమైపోతుంది. స్కాలర్షిప్ లభిస్తుందా లేదా అన్నది అంతిమం వరకు ధైర్యమును ఉంచడముపై ఆధారపడి ఉంటుంది. ఎంతగా చాలా సమయం నుండి ధైర్యంతో ముందుకు నడుస్తూ ఉంటారో అంతగా వారు బహుకాలము లింక్ (సంబంధము) తెగిపోని కారణంగా త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు కూడా కారణంగానైనా, అకారణంగానైనా చాలాకాలంగా ఉండవలసిన ధైర్యము యొక్క లింకు తెగిపోయినట్లయితే స్కాలర్షిప్ తీసుకోవడం కష్టమవుతుంది. బహుకాలపు లింకు అంతిమం వరకు ఉన్నట్లయితే ఎక్స్ట్రా సహాయం లభించగలదు. కావున ఇప్పుడు ఈ చివరి పాఠమునే పక్కా చేయిస్తున్నాము.
ఇప్పటివరకు టోటల్ రిజల్టులో ఏమి చూశాము? సేవ సబ్జెక్టులో ఇంఛార్జుగా అవ్వడం వచ్చింది కానీ స్మృతి సబ్జెక్టులో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. అర్థమైందా! సాకార రూపంలో అనుభవం చూశారు కదా! సాకార రూపునిపై సేవ యొక్క బాధ్యత అందరికన్నా ఎక్కువగా ఉండేది. పిల్లలలో వారికన్నా ఎంత తక్కువగా ఉంది! పిల్లలకు కేవలం సేవా డ్యూటీయే ఉంది కాని సాకార రూపంలో అయితే అన్ని డ్యూటీలు ఉండేవి! సంకల్పాల సాగరముగా ఉండేవారు, బాధ్యతల సంకల్పాలలో ఉండేవారు అయినా సాగరపు అలలలో చూసేవారా లేక సాగర లోతుల్లో చూసేవారా? పిల్లలకు అలలలో తేలి ఆడడం వస్తుంది కాని లోతులలోకి వెళ్ళడం రావడంలేదు. అందుకు సహజ సాధనము - అభ్యాసము చేయండి అని ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది. ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావడం మళ్ళీ మాస్టర్ సర్వశక్తిమంతునిగా అయి ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతంగా వెళ్ళడం. ఇలా వెనువెంటనే చేసే అభ్యాసము చేయండి. ఎంత కార్య వ్యవహారాలలో ఉన్నా మధ్యమధ్యలో ఒక్క క్షణమైనా కేటాయించి ఎంతగా అభ్యాసం చేస్తారో అంతగా ప్రత్యక్ష రూపము తయారవుతూ ఉంటుంది. ప్రాక్టీసు(అభ్యాసము) తక్కువగా ఉంది, కావుననే ప్రాక్టికల్ రూపం లేదు. కాసేపు సాగర అలలలో ఉంటూ మరికాసేపు సాగర లోతులలో వెళ్ళే అభ్యాసం చేయండి. పిల్లలలో ఎంతైతే, సాహసం ఉందో అంతే సహనశక్తి కూడా ఉందా అన్న విశేషమైన విషయమునే ఈరోజు పరిశీలిస్తున్నారు. సాహసమును ఉంచే శక్తి ఎంత ఉంది మరియు సహన శక్తి ఎంత ఉంది అన్నది చూస్తున్నారు. ఎంతెంతగా స్వయం పురుషార్థంలో సంతుష్టంగా మరియు స్పష్టంగా ఉంటారో అంతగా ఇతరులు కూడా వారి ముందు స్పష్టంగా కనిపిస్తారు. ఇప్పుడు పరీక్ష కూడా జరిగింది, రిజల్టును కూడా వినిపించాము. పాండవుల విషయం మిగిలిపోయి ఉంది. బాప్‌దాదా వద్ద పురుషార్థుల ఎన్ని లైన్లు ఉన్నాయి! ఇతరులను చూడకుండా మీ లైనును మీరు చూసుకుంటుండవచ్చు కదా లేక లైనును కూడా చూడకుండా మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారా? ఒకటి, తీవ్ర పురుషార్థుల లైను, రెండు - పురుషార్థుల లైను, మూడవది - గుప్త పురుషార్థుల లైను, నాల్గవది - ఢీలా పురుషార్థుల లైను. మీరు ఏ లైనులో ఉన్నారో ఇప్పుడు చెప్పండి. మీకే తెలుసు అన్న పదాన్ని వాడవలసిన అవసరం లేని సమయము త్వరలోనే రాబోతోంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు కదా! శక్తులందరూ సమాన రూపంలోనే వెళతారు, తర్వాత మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. బాబాకు అంతటి నిశ్చయము ఉంది. ఎవరైతే నిశ్చయబుద్ధితో ఉంటారో వారు విజయులుగా అవుతారు. బాబాపై మరియు స్వయంపై నిశ్చయబుద్ధి కలిగి ఉన్నట్లయితే విజయము ఎక్కడకు వెళుతుంది? నిశ్చయబుద్ధి కలవారి వెనుకనే విజయము వస్తుంది. వారు విజయము వెనుక పరిగెత్తరు, విజయము వారి వెనుక పరిగెత్తుతుంది. మేము విజయులుగా అవ్వాలి అన్న సంకల్పమును కూడా వారు త్యాగము చేసేస్తారు. ఇటువంటి సర్వస్వ త్యాగులుగా ఉన్నారా? సర్వస్వ త్యాగులు మరియు సర్వ సంకల్పాల త్యాగులు. కేవలం సర్వసంబంధాల త్యాగమే కాదు, సర్వ సంకల్పాల నుండి కూడా త్యాగి. ఇదే సంపూర్ణ స్థితి. బాప్‌దాదా ఏమి చూస్తున్నారు? విజయ సితారను చూస్తున్నారు. అంటే బాప్‌దాదా లిస్టులో మీరు విజయి సితారలు. ఏ విధంగా ఇతర కార్యాలలో పరస్పర సహయోగులుగా ఉన్నారో అలాగే భవిష్యత్తులో కూడా పరస్పర సహయోగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలా అవ్వడం కాదు, అలా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక్కడ శబ్దం చేస్తే మీ వరకు చేరుకునేంత సమీపంలో మీరు ఉన్నట్లుగా అంతే సమీపంగా రావాలి. ఇప్పుడు మీరు అన్ని విషయాలలో కొద్ది సమయంలోనే పూర్తిగా ఫాలో చేయాలి. చేస్తున్నారు మరియు ఇంకా చేస్తూనే ఉంటారు.
మీ మొట్టమొదటి సంగఠన ఏదైతే తయారైందో వారేం చేస్తున్నారు? ఎందుకోసం ఆ సంగఠనను తయారు చేయడం జరిగింది? యజ్ఞాన్ని సంభాళించడంతో పాటు సంగఠనలో ఉండేవారు స్వయాన్ని కూడా సంభాళించుకుంటున్నారా? ఎవరైతే స్వయమును సంభాళించుకుంటారో వారు యజ్ఞమును కూడా సంభాళిస్తారు. ఎవరైతే స్వయమును సంభాళించుకోలేరో వారు యజ్ఞమును కూడా సంభాళించలేరు. ఈ సంగఠనలో ఏమేమి చేయాలి అన్నది వారికి కూడా స్పష్టత లేదు. కావున ఎప్పుడైతే సహజమవ్వగలదో అప్పుడు సహచరులను కూడా పిలవండి. ఎప్పుడు పిలుస్తారో అప్పుడు బాప్‌దాదా వస్తారు. బాప్‌దాదాకు రావడానికి సమయముపట్టదు. మీ గ్రూపును ఎప్పుడైనా పట్టించుకున్నారా? పాండవుల గ్రూపు మరియు శక్తుల గ్రూపు. వీరు సర్వీసబుల్ గ్రూపు. కానీ, పాండవుల గ్రూపు మరియు యజ్ఞ మాతల గ్రూపు యొక్క స్థితిగతులేమిటి? ముఖ్య కేంద్రాలకు సమీపంగా వస్తూ ఉంటే పట్టించుకోగలగుతాము. ఈ గ్రూపుకు తమ కర్తవ్యము ఉంది. కేవలం 8 రోజులది కాదు (సమ్మేళనము రిజల్టు?). భట్టీ రిజల్టును ఏదైతే తెలియజేశామో అదే సమ్మేళన రిజల్టు కూడా. నాలుగు శక్తులు సమానంగా ఉండాలి. వాటిలో 25 శాతం లోటును గూర్చి వినిపించాము కదా! అర్థమైందా! పాస్ విత్ హానర్‌గా అయితే మరి ఏమైపోతుందో తెలియదు! అందరూ సమానంగా (సమీపంగా) వచ్చేస్తారు. ఇప్పుడు కేవలం శబ్దం వినిపించారు, గర్జించలేదు. దీనికోసం నాలుగు శక్తులలో సమానత కావాలి, ఇందుకు అవసరమైన యుక్తిని కూడా తెలియజేయడం జరిగింది. ఒక్కోసారి ఒక్కో శక్తి యొక్క విశేషత, కానీ నాలుగు శక్తులను సమానంగా ఉంచుకొని సేవ చేయడం ద్వారా అది గర్జన అవుతుంది. అలా గర్జన జరగకపోవడానికి కూడా కారణముంది. సమ్మేళనం గూర్చి చెప్పడం లేదు, పూర్తిగా శబ్దం వెలువడుతోంది కానీ గర్జన జరగడం లేదు. శబ్దం వ్యాపిస్తోంది. నిదురించేవారిని లేపలేదు, కేవలం పక్కకు తిప్పారు. ఇలా గర్జన అవ్వకపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి. ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని వారు అంగీకరించనప్పుడే అది గర్జన అవుతుంది. ఇప్పుడేమవుతుంది? అవి స్థూలమైనా లేక సూక్ష్మమైనా, అనేక విషయాలను స్వీకరిస్తున్నారు! ఎప్పుడైతే ఏదైనా సంకల్పంలోనైనా స్వీకరించనప్పుడు, అంగీకరించనప్పుడు అది గర్జన అవుతుంది. ఇప్పుడంతా మిక్స్ అయి ఉంది. అందుకే రిజల్టు కూడా మిక్సయిపోయింది. ఏదైతే కల్పపూర్వం ఫిక్సయిన రిజల్టుగా ఉందో అది ఇప్పుడు లేదు. అలా ఫిక్సయిన విషయం గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మిక్స్ అయి ఉంది. అర్థమైందా! నాది అన్న భావనను కూడా అంగీకరించకండి. నేను ఇది, నేను సర్వీసబుల్ను, నేను మహారథిని, నేను ఇది చేస్తున్నాను, నేను చేశాను... వీటన్నటిలో ఉన్న నేను అన్నది తొలగించి బాబా బాబా అన్న పదం వచ్చినప్పుడు గర్జన జరుగుతుంది. పరమాత్మలోనే పరమ శక్తి ఉంటుంది. ఆత్మలలో యథాశక్తి ఉంటుంది, కావున బాబా అని అనడం ద్వారా పరమ శక్తి వస్తుంది. నేను అని అనడం ద్వారా బలము యథాశక్తిగానే వస్తుంది. కావున రిజల్టు కూడా యథా శక్తిగానే ఉంటుంది.
ఇప్పుడు భాషను కూడా మార్చండి. సాకార రూపుడు అన్నీ చూపించారు. నేను దీనిని నడుపుతున్నాను, నేను మురళి బాగా వినిపించాను అని ఎప్పుడైనా అన్నారా? నేను సేవ చేశాను, నేను పిల్లలకు టచింగ్ ఇచ్చాను అని ఎప్పుడైనా అన్నారా! ఇలాంటిది స్వీకరించడం కూడా అంతమైపోవాలి, దీనినే, చేసిన ప్రతిజ్ఞను నిర్వర్తించడము అంటారు. మీపై బలిహారమవుతాము, మీకోసం మరణిస్తాము... అని మీరు ఒక పాటను పాడేవారు, అది గుర్తుందా! ఇలా మరణించడం అని దేనిని అంటారు? నేను అన్న దానిని అంతం చేయడమే మరణించడము, అంతమవ్వడము. అంగీకరించకపోతే మీరు సింహనాదం చేయగలరు. ఏ విషయమునూ, నింద-స్తుతి, నాది-నీది, నేను-నువ్వు దేనినీ స్వీకరించనప్పుడు అది సింహనాదమవుతుంది. మీరు మనస్సులో సంకల్పమును తరువాత చేస్తారు, మీ మనస్సులో సంకల్పం ఉత్పన్నమవ్వగానే అక్కడకు చేరుకుంటుంది. ఎందుకు ముందే చేరుకుంటుంది? ఇది కూడా గుహ్యమైన చిక్కు ప్రశ్న. మీరు మనస్సులో ఏ సంకల్పమునైతే చేస్తారో అది మీ మనస్సులోకి తరువాత వస్తుంది, అంతకన్నా ముందే బాప్‌దాదా ముందు స్పష్టమైపోతుంది, ఎందుకంటే సంపూర్ణంగా అయినందువలన డ్రామాలోని ప్రతి దృశ్యము స్పష్టంగా కనిపిస్తుంది. కావున డ్రామాలో రచింపబడినదానిని ముందే స్పష్టంగా చూడగలుగుతాము. కావున భవిష్యత్తును చూసి ముందే మాట్లాడుతాము. ముందే చేరుకున్నట్లుగా ఉంటుంది! మళ్ళీ ఎప్పుడైతే మీరు పాత్రను అభినయిస్తారో అప్పుడు బాప్‌దాదా కూడా పాత్రను పోషిస్తారు. మీరు ఆత్మిక సంభాషణ చేసే పాత్రను పోషిస్తారు, అప్పుడు బాప్‌దాదా వినే పాత్రను పోషిస్తారు, అర్థమైందా! ఎవరు ఎలా ఉన్నారో అలా స్వయమును గూర్చి తెలుసుకోలేకపోయినా వారిని గూర్చి బాప్‌దాదా తెలుసుకోగలరు. కావున ఇప్పుడు ఈ నాలుగు శక్తులను సమానతలోకి తీసుకురావాలి, అప్పుడు సాకారుని సమానంగా అయిపోతారు. ఎంతగా సంస్కారాలను సమానతలోకి తీసుకువస్తారో అంతగా సమీపంగా వస్తారు. ఏ సంస్కారాలు? సాకార రూపుని సంస్కారాలు. అతీతంగా మరియు సాక్షీద్రష్టాగా ఉండే సంస్కారాలు సాకారుని సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ఠ లక్షణాలుగా ఉండేవి. ఈ సంస్కారాలలో సమానతను తీసుకురావాలి. ఈ గుణాల ద్వారా సర్వుల హృదయాలపై విజయులుగా అవుతారు. ఎవరైతే సంగమ యుగంలో సర్వుల హృదయాలపై విజయులుగా అవుతారో వారే భవిష్యత్తులో విశ్వమహారాజులుగా అవుతారు. విశ్వంలో సర్వులు వచ్చేస్తారు కావున బీజమును ఇక్కడ నాటాలి, ఫలాన్ని అక్కడ తీసుకోవాలి. అచ్ఛా! ఓం శాంతి.