Search for a command to run...
5 Apr 1970
సర్వ పాయింట్ల సారము – పాయింటు (బిందువు) అవ్వడము
5 April 1970 · తెలుగు
అందరూ వినాలనుకుంటున్నారా లేక సంపూర్ణంగా అవ్వాలనుకుంటున్నారా? సంపూర్ణంగా అయిన తరువాత వినటం ఉంటుందా? మొదట వినటము, తర్వాత సంపూర్ణంగా అవ్వటము. ఇన్ని పాయింట్లు విన్నారు, ఈ అన్ని పాయింట్ల స్వరూపము ఏమిటి? అలా తయారవ్వాలి కదా. విన్న ఈ అన్ని పాయింట్ల స్వరూపంగా ఎలా అవ్వాలి? సర్వ పాయింట్ల సారము లేక స్వరూపము-పాయింటు(బిందువు)గా అవ్వటమే. సర్వ పాయింట్ల సారము కూడా పాయింటులో వస్తుంది కావున పాయింటు రూపంగా అవ్వాలి. పాయింటు అతి సూక్ష్మంగా ఉంటుంది, అందులో అన్నీ నిండి ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన ఏ పురుషార్థం జరుగుతోంది? విస్తారమును సారరూపములోకి తీసుకువచ్చే పురుషార్థము జరుగుతుంది. ఎవరికైతే విస్తారమును సారరూపములోకి తీసుకువచ్చే పద్ధతి వస్తుందో వారే బాప్దాదాకు సమానంగా అవుతారు. ఇముడ్చుకోవటము మరియు సర్దుకోవటముల గురించి మొదట కూడా వినిపించి ఉన్నాము. ఎవరికైతే సర్దుకోవటము వస్తుందో వారికి ఇముడ్చుకోవటము కూడా వస్తుంది. బీజములో ఏ శక్తి ఉంది? వృక్షపు విస్తారమును తనలో ఇముడ్చుకొనే శక్తి ఉంది. మరి ఇప్పుడు ఏ పురుషార్థము చెయ్యాలి? బీజస్వరూప స్థితిలో స్థితి అయ్యే అనగా విస్తారమును సారములోకి తీసుకువచ్చే పురుషార్థము చెయ్యాలి. మరి దీనిని పరిశీలించుకోండి. విస్తారము చెయ్యటము సహజము కానీ విస్తారమును సారములోకి తీసుకురావటము సరళంగా అయిందా? ఈ రోజుల్లో సైన్సువారు కూడా విస్తారాన్ని తగ్గించే పురుషార్థమునే చేస్తున్నారు. సైన్సుశక్తి ఉన్నవారు కూడా సైలెన్సుశక్తి ఉన్న మిమ్మల్ని కాపీ చేస్తారు. సైలెన్సు శక్తి వారు ఏ ఏ విధంగా అయితే పురుషార్థము చేస్తారో అలాగే వారు కూడా పురుషార్థము చేస్తున్నారు. మొదట సైలెన్సు శక్తి సైన్యం ఇన్వెన్షన్ (ఆవిష్కరణ) చేస్తుంది, తర్వాత సైన్సు తన విధంగా ఇన్వెన్షన్ చేస్తుంది. ఎలా ఎలా అయితే ఇక్కడ రిఫైన్ అవుతూ ఉంటుందో అలా అలా అక్కడ సైన్సు కూడా రిఫైన్ అవుతూ ఉంటుంది. వారికి కూడా మొదట అసంభవంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సాధ్యపడుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా అసంభవంగా అనిపించిన విషయాలు సరళంగా, సాధ్యమవుతూ ఉన్నాయి. స్వయాన్ని అందరి సమీపంగా తీసుకురావాలి, ఇప్పుడు ఈ ముఖ్య పురుషార్థాన్నే చేయాలి. శబ్దములోకి రావటము ఎంత సహజమో అంతగానే శబ్దము నుండి దూరంగా వెళ్ళడము కూడా సహజమవ్వాలి. దీనినే సంపూర్ణ స్థితి యొక్క సమీప స్థితి అని అంటారు.
ఇది ఎటువంటి గ్రూపు? ఈ గ్రూపులోని ప్రతి మూర్తిలో తమ తమ విశేషత ఉంది. విశేషత కారణంగానే సృష్టిలో విశేష ఆత్మలుగా అయ్యారు. విశేష ఆత్మలుగా అయితే ఉండనే ఉన్నారు, ఇప్పుడు ఎలా అవ్వాలి? విశేషంగా ఉన్నారు, ఇప్పుడు శ్రేష్ఠంగా అవ్వాలి. శ్రేష్ఠంగా అయ్యేందుకు భట్టీలో ఏం చేస్తారు? ఎవరిలోనూ లేనటువంటి ఒక విశేషత ఈ గ్రూపులో ఉంది. అది ఏ విశేషత? మీ విశేషత గురించి మీకు తెలుసా? పురుషార్థపు స్థాయిలో ఒకరికొకరు సమీపంగా ఉండటాన్ని ఈ గ్రూపు విశేషతగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరి మనసులో ఏదైనా చేసి చూపించాల్సిందే అన్న ఉత్సాహము ఉంది. కావున ఈ గ్రూపుకు బాప్దాదా- కాబోయే దేవతల గ్రూపు మరియు ఆశావాదుల గ్రూపు అన్న పేరును ఇస్తున్నాము. సృష్టికి తమ అసలైన రూపమును ప్రత్యక్షము చేసి చూపించగలగిన గ్రూపు కూడా ఇదే. మైదానములో నిలబడి ఉన్న సైన్యం ఇది. మీరు వెన్నెముక వంటివారు. బాప్దాదా కర్తవ్యమును ప్రత్యక్షము చేసే భుజాలు మీరు. భుజాలకు (చేతులకు) ఏ ఏ అలంకారాలు ఉంటాయో తెలుసా? బాప్దాదా భుజాలు, అలంకారధారులు మీరు. కావున, భుజాలమైన మేము అలంకారధారులుగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ ఏ అలంకారాలను ధరించి మైదానంలో హాజరయ్యారు? అన్ని అలంకారాల గురించి తెలుసు కదా! మరి అలంకారధారులైన భుజాలేనా? అలంకారధారులైన శక్తులే బాప్దాదాను షో (ప్రత్యక్షం) చేస్తారు. శక్తుల భుజాలను ఎప్పుడూ ఖాళీగా చూపించరు. అలంకారాలు నిలిచి ఉన్నప్పుడే గర్జన జరుగుతుంది. మరి బాప్దాదా ఈరోజు ఏం చూస్తున్నారు? భుజాలైన ఒక్కొక్కరి అలంకారాలు మరియు వేగము. ఈ గ్రూపుకు భట్టీలో ఏం చేయిద్దాము? శక్తుల ముఖ్య గుణము ఏమిటి?
ఈ గ్రూపుకు ఒకటేమో, శక్తులలో మొదటి గుణమైన నిర్భయతను మరియు రెండవది విస్తారమును క్షణంలో సర్దుకునే యుక్తిని కూడా నేర్పించాలి. ఐక్యత మరియు ఏకరసము. అనేక సంస్కారాలను ఒక్క శుద్ధమైన సంస్కారంగా ఎలా తయారుచెయ్యాలి అన్నదానిని కూడా ఈ భట్టీలో నేర్పించాలి. తక్కువ సమయము పట్టాలి మరియు తక్కువ మాట్లాడాలి, కానీ సఫలత అధికంగా ఉండాలి. ఈ పద్ధతిని కూడా నేర్పించాలి. వినాలి మరియు స్వరూపంగా అయిపోవాలి. వినటము ఎక్కువగా, స్వరూపంగా అవ్వటము తక్కువగా ఉండకూడదు. వింటూ మరియు తయారవుతూ ఉండాలి. ఇప్పుడు వాచామూర్తులుగా కాక సాక్షాత్కారమూర్తులుగా అయ్యి వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరు చూసినా మీ ఆకారీరూపము మరియు అలంకారీ రూపమును చూడాలి. సెన్సు (వివేకము) చాలా ఉంది, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? జ్ఞాన ఎసెన్సు (సారము) ఏదైతే ఉందో అందులో ఉండాలి. సెన్సును ఎసెన్సులో పెట్టాలి, అప్పుడే బాప్దాదా ఉంచిన ఆశను ప్రత్యక్షముగా చూపిస్తారు. ఎసెన్సు గురించి తెలుసు కదా! ఈ జ్ఞానానికి ఆవశ్యకమైన విషయమేదైతే ఉందో అదే ఎసెన్సు, ఒకవేళ ఆ ఆవశ్యకమైన విషయాలను ధారణ చేసినట్లయితే అన్ని ఆవశ్యకతలు పూర్తి అయిపోతాయి. ఇప్పుడు ఏవో కొన్ని ఆవశ్యకతలు ఉన్నాయి. కానీ ఈ ఆవశ్యకతలను సదాకాలము కొరకు పూర్తి చేసేందుకు రెండు ఆవశ్యక విషయాలు ఉన్నాయి - ఆకారీ మరియు అలంకారీగా అవ్వటము. ఆకారీ మరియు అలంకారీగా అయ్యేందుకు కేవలము ఒక్క మాటను ధారణ చెయ్యాలి. ఆకారీ మరియు అలంకారీ రెండూ వచ్చేసే ఆ పదము ఏది? ఆ ఒక్క పదము - లైట్. లైట్ యొక్క ఒక అర్థము - జ్యోతి, మరొక అర్థము - తేలికతనము. కావున తేలికతనము మరియు ప్రకాశమయము కూడా. అలంకారము మరియు ఆకారము కూడా, జ్యోతి స్వరూపంగా మరియు జ్వాలా స్వరూపంగా కూడా ఉండాలి. తేలికగా, ఆకారీగా కూడా ఉండాలి. మరి, ఒక్క లైట్ అన్న పదంలోనే రెండు విషయాలూ వచ్చేసాయి కదా! ఇందులో కర్తవ్యము కూడా వచ్చేస్తుంది. కర్తవ్యము ఏమిటి? లైట్ హౌస్గా అవ్వటము. లైట్లో స్వరూపము కూడా వస్తుంది, కర్తవ్యము కూడా వస్తుంది.
(టీచర్లు ప్రతి ఒక్కరికీ బాప్దాదా ద్వారా పర్సనల్గా జ్ఞాన రత్నాల కానుక లభించింది)
తిలకము ఎందుకు పెట్టబడుతుంది? తిలకము మస్తకంపైనే పెట్టబడుతుంది, అలాగే ఈ బిందు స్వరూపము కూడా తిలకమే, ఇది ఎప్పటికీ పెట్టబడి ఉండాలి. రెండవది - భవిష్య రాజ్య తిలకము, ఇది కూడా తిలకమే. రెండింటి స్మృతి ఉండాలి. వాటి గుర్తు ఈ తిలకము. గుర్తును చూస్తూ నషా ఉండాలి. ఈ గుర్తు సదాకాలము కొరకు ఇవ్వబడుతుంది. ఏవిధంగా పాయింటు రూపంలో స్థితులయ్యే విధి చెప్పామో అలాగే ఈ తిలకముకూడా పాయింటు. సర్దుకోవటము మరియు ఇముడ్చుకోవటము వచ్చా? సర్దుకోవటము మరియు ఇముడ్చుకోవటము అన్నవి ఇంద్రజాలపు పనులు. ఇంద్రజాలము చేసేవారు ఏ వస్తువునైనా సర్దేసి చూపిస్తారు, అలాగే ఇమిడ్చి కూడా చూపిస్తారు. ఎంత పెద్ద వస్తువునైనా చిన్నదానిలో కూడా ఇమిడ్చి చూపిస్తారు. ఇటువంటి ఇంద్రజాలమును చెయ్యాలి, ఈ అభ్యాసమును చెయ్యండి. విస్తారములోకి వెళ్తూ మళ్ళీ అక్కడే ఇముడ్చుకొనే పురుషార్థమును చెయ్యండి. బుద్ధి చాలా విస్తారములోకి వెళ్ళి ఉంది అని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఈ అభ్యాసమును చెయ్యండి. ఇంతటి విస్తారమును ఇముడ్చుకోగలరా? అప్పుడే మీరు తండ్రి సమానంగా అవుతారు. తండ్రిని ఇంద్రజాలికుడు అని అంటారు కదా! మరి పిల్లలు ఎవరు? శీతల స్వరూపము మరియు జ్యోతి స్వరూపము, ఈ రెండింటి స్వరూపములో స్థితులవ్వటము వస్తుందా? ఇప్పుడిప్పుడే జ్యోతి స్వరూపము, ఇప్పుడిప్పుడే శీతల స్వరూపము. ఎప్పుడైతే రెండు స్వరూపాలలో స్థితులవ్వటము వస్తుందో అప్పుడే ఏకరస స్థితి ఉండగలదు. రెండింటి సమానత కావాలి, ఇదే వర్తమాన పురుషార్థము.
ఈ పుష్పాన్ని ఎందుకు ఇస్తున్నాము? అనేక జన్మలు తండ్రి పూజనేదైతే చేసారో దానికి రిటర్నుగా ఒక్క జన్మలో బాప్దాదా ఇస్తారు. ఎవరైతే అతీతంగా ఉంటారో వారే అతి ప్రియంగా ఉంటారు. ఒకవేళ సర్వులకు అతి ప్రియంగా అవ్వాలంటే అన్ని విషయాల నుండి ఎంత అతీతంగా అవుతారో అంతగానే సర్వులకు ప్రియంగా అవుతారు. ఎంత అతీతతనమో అంత ప్రియతనము. ఇలా ఎవరైతే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారో వారికి బాప్దాదా సహాయము లభిస్తుంది. అతీతంగా అవుతూ ఉండటము అనగా ప్రియంగా అవుతూ ఉండటము, ఒకవేళ ఏ ఆత్మకైనా ప్రియంగా అవ్వలేకపోతున్నారంటే దాని అర్థము – ఆ ఆత్మ యొక్క సంస్కార స్వభావాల నుండి అతీతంగా అవ్వలేకపోతున్నారని అర్థము. ఎంతగా ఎవరినుండైతే అతీతపు అనుభవము కలుగుతుందో అంతగా స్వతహాగనే ప్రియంగా అవుతూ ఉంటారు. ప్రియంగా అయ్యేందుకు పురుషార్థము కాకుండా అతీతంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి. అతీతంగా అయ్యేందుకు ప్రాలబ్ధము - ప్రియంగా అవ్వటము. ఇది ఇప్పటి ప్రాలబ్దము. తండ్రి ఏవిధంగా అందరికీ ప్రియమైనవారో అలా పిల్లలు కూడా మొత్తం జగత్తులోని ఆత్మలందరికీ ప్రియంగా అవ్వాలి. వారి నడవడికలో అతీతత్వమును తేవడమే అందుకు పురుషార్థమని వినిపించాము. జగత్తులో అతీతంగా మరియు జగత్తులో ప్రియంగా అయ్యేందుకు ఈ పుష్పము. ఈ గ్రూపులో హర్షితతనము కూడా ఉంది, ఇప్పుడు హర్షితములో ఏం కలపాలి? ఆకర్షణమూర్తులుగా ఎలా అవుతారు? ఎప్పుడైతే మీ బుద్ధి సర్వ ఆకర్షణల నుండి దూరమైపోతుందో అప్పుడే ఆకర్షణమూర్తులుగా అవుతారు. ఎప్పటివరకైతే ఏదైనా ఆకర్షణ బుద్ధిలో ఉంటుందో అటువంటివారు ఆకర్షితులుగా ఉండరు. ఎవరైతే ఆకర్షణమూర్తులుగా అవుతారో వారే ఆకారీమూర్తులుగా అవుతారు. తండ్రి ఆకారీగా ఉంటూ కూడా ఆకర్షణమూర్తిగా ఉండేవారు కదా! ఎంతెంతగా ఆకారీనో అంతంతగా ఆకర్షణ ఉంటుంది. ఏవిధంగా వారు పృథ్వి నుండి దూరంగా స్పేస్(అంతరిక్షము)లోకి వెళ్ళినప్పుడు భూమి ఆకర్షణ నుండి దూరంగా ఉంటారో, అలా మీరు పాత ప్రపంచపు ఆకర్షణ నుండి దూరంగా వెళ్తారు. అప్పుడిక కోరుకోకపోయినా కూడా ఆకర్షణమూర్తులుగా అయిపోతారు. సాకారములో ఉన్నా కానీ అందరినీ ఆకారీలుగా చూడాలి. సేవ యొక్క బలము కూడా చాలా లభిస్తుంది. ఒకటేమో మీ పురుషార్థపు బలము. మరొకటి ఇతరుల సేవ చేసినందువలన కూడా బలము లభిస్తుంది. కావున రెండు బలాలు ప్రాప్తిస్తాయి. బాప్దాదా స్నేహము ఎలా ప్రాప్తిస్తుందో తెలుసా? ఎంతగా తండ్రి కర్తవ్యములో సహయోగులుగా అవుతారో అంతగా స్నేహము లభిస్తుంది. కర్తవ్యంలో సహయోగము ద్వారా స్నేహము లభిస్తుంది. ఇటువంటి అనుభవము ఉందా? ఏ రోజైతే కర్తవ్యానికి అధిక సహయోగులుగా ఉంటారో ఆ రోజు విశేషంగా స్నేహ అనుభవము ఎక్కువగా ఉంటుందా? సదా సహయోగులు, సదా స్నేహులు. స్వమానము ఎలా ప్రాప్తిస్తుంది? ఎంత నిర్మాణమో అంత స్వమానము. అలాగే, ఎంతగా బాప్దాదాకు సమానంగా ఉంటారో అంతగా స్వమానంలో ఉంటారు. నిర్మాణులుగా కూడా అవ్వాలి, సమానంగా కూడా అవ్వాలి. అటువంటి పురుషార్థమునే చెయ్యాలి. నిర్మాణతలో కూడా తక్కువ ఉండకూడదు, సమానతలో కూడా తక్కువ ఉండకూడదు. ఇంకా స్వమానములో కూడా తక్కువ ఉండకూడదు. మీ స్వమానపు పరిశీలనను సమానతతో చూసుకోవాలి.
బాప్దాదా సాక్షాత్కారము మీ ద్వారా జరగాలంటే మీరు ఎలా అవ్వవలసి ఉంటుంది? ఏ వస్తువు సాక్షాత్కారమైనా ఎందులో జరుగుతుంది? దర్పణములో. కావున మీరు దర్పణముగా అవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే సంపూర్ణముగా అర్పణ అవుతారో అప్పుడే దర్పణంగా అవుతారు. సంపూర్ణ అర్పణమే శ్రేష్ఠ దర్పణము, ఈ దర్పణములోనే స్పష్టంగా సాక్షాత్కారము జరుగుతుంది. ఒకవేళ యథా యోగ్యము, యథాశక్తి అర్పణమైనట్లయితే దర్పణము కూడా యథా యోగ్యము, యథాశక్తిగా ఉంటుంది. సంపూర్ణ అర్పణము అనగా స్వయము యొక్క భానము నుండి కూడా అర్పణము. స్వయాన్ని ఏమని భావించాలి? అందరూ బాప్దాదా సాక్షాత్కారమును చేయించాలి అన్నదే విశేషంగా కుమారీల కర్తవ్యము. కేవలం వాణి ద్వారా కాకుండా తమ ముఖము ద్వారా కూడా సాక్షాత్కారము చేయించాలి. సాకారములో తండ్రి విశేషతలు ఏవైతే ఉండేవో, వాటిని మీలో తీసుకురావాలి. ఇది విశేష గ్రూపు. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు (విజయులు), అల్లా సమానులు అని సాకారములో చెప్పారు కదా, అలా ఈ గ్రూపు కూడా అల్లా సమానంగా అవ్వాలి. ఏవిధంగా మస్తకంలో ఈ తిలకము మెరుస్తూ ఉందో అలాగే ఈ సృష్టిలో స్వయాన్ని కూడా అలా మెరిసేటట్లుగా చేసుకోవాలి. అటువంటి లక్ష్యమును ఉంచాలి. సేవలో సహయోగిగా అయిన కారణంగా బాప్దాదా విశేషమైన స్నేహము కూడా ఉంది. సహయోగము మరియు స్నేహముతో పాటు ఇప్పుడు శక్తినికూడా నింపుకోవాలి. ఇప్పుడు శక్తి రూపంగా అవ్వాలి. శక్తులలో కూడా విశేషంగా ఏ శక్తిని నింపాలి? సహనశక్తి. ఎవరిలో అయితే సహనశక్తి తక్కువగా ఉంటుందో వారిలో సంపూర్ణత కూడా తక్కువగా ఉంటుంది. విశేషంగా ఈ శక్తిని ధారణ చేసి శక్తి స్వరూపంగా అయిపోవాలి. తృప్త ఆత్మగా ఎవరైతే ఉంటారో వారి విశేష గుణము - నిర్భయత మరియు సంతుష్టంగా ఉండటము. ఎవరైతే స్వయం సంతుష్టులుగా ఉంటారో మరియు ఇతరులను సంతుష్టంగా ఉంచుతారో అటువంటి వారిలో సర్వగుణాలు వచ్చేస్తాయి. ఎంతెంతగా శక్తి స్వరూపులుగా ఉంటారో అంతగా బలహీనత ఎదురుగా ఉండజాలదు. కావున శక్తిస్వరూపులుగా అయ్యి వెళ్ళాలి. బ్రహ్మాకుమారీలుగా కూడా కాదు, కుమారీ రూపములో అక్కడక్కడా బలహీనత వచ్చేస్తుంది, కానీ శక్తిరూపములో సంహారశక్తి ఉంది. శక్తులు ఎల్లప్పుడూ విజయులు. శక్తుల మెడలో ఎల్లప్పుడూ విజయమాల ఉంటుంది. శక్తి రూపపు విస్మృతి ద్వారా విజయము కూడా దూరమైపోతుంది కావున ఎల్లప్పుడూ స్వయాన్ని శక్తిగా భావించాలి.
పిల్లలు తండ్రికన్నా పెద్ద ఇంద్రజాలికులు. తండ్రికన్నా పెద్ద ఇంద్రజాలికులు ఎందుకంటే, బాబాను ఎలా కావాలనుకుంటే అలా తయారుచేసేస్తారు. ఏది కావాలనుకుంటే అది తయారుచెయ్యగలరు అని తండ్రిని గూర్చి గాయనము ఉంది. కానీ భగవంతుడినే ఎలా కావాలంటే అలా తయారుచెయ్యగలవారు ఎవరు? పిల్లలు. అవ్యక్తంలో ఉన్నవారిని కూడా వ్యక్తములోకి తీసుకువస్తారు. దీనిని ఇంద్రజాలము అని అనరా? అవ్యక్తమయ్యే రోజు దగ్గరలో ఉంది కాబట్టే అవ్యక్తమయ్యే లిఫ్ట్ లభించింది. జ్ఞానమూర్తులు మరియు స్మృతిమూర్తులు రెండింటిలో సమానంగా అవ్వాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జ్ఞానమూర్తులుగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్మృతిమూర్తులుగా అవ్వాలి. ఎవరైతే స్వయము ఎంతగా స్మృతిమూర్తులుగా అయ్యి ఉంటారో అంతగానే వారు, ఇతరులకు తండ్రి స్మృతిని ఇప్పించగలరు. స్మృతిమూర్తులుగా అయ్యి అందరికీ స్మృతిని కలిగించాలి. సమయము కొరకు ఎదురు చూస్తున్నారా లేక సమయము మీకొరకు ఎదురు చూస్తుందా? సమయము కొరకు మీరు ఎదురుచూడకూడదు. ఎప్పుడు సమయము వచ్చినా రెడీగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఎవరెడీగా ఉంచుకోవాలి. ఎదురుచూడటమును సమాప్తము చేసి ఏర్పాట్లను చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఏర్పాట్లు పూర్తవుతాయో అప్పుడిక ఎదురుచూసే ఆవశ్యకతయే ఉండదు. దీనినే ఎవరెడీ అని అంటారు. అన్నింటిలోనూ ఎవరెడీ. కేవలం సేవలోనే కాదు, పురుషార్థములో కూడా ఎవరెడీ, సంస్కారాలను సమీపముగా చేసుకోవటములో కూడా ఎవరెడీ. విశేషమైన స్నేహము ఉంది. కావున విశేషంగా తయారుచేసే విషయాలు వినిపించబడుతున్నాయి. వృక్షములో తరువాత తరువాత వచ్చే పూలు, ఆకులు ఎలా ఉంటాయి? మొదట వచ్చినవి పాతగా అయిపోతాయి, తరువాత వచ్చినవి చాలా సుందరంగా ఉంటాయి. మరి వీరు కూడా తరువాత వచ్చారు, కానీ చాలా ప్రియమైనవారు. తరువాత వచ్చినవి చాలా కోమలంగా ఉంటాయి. ఇక్కడ కోమలత్వములో ఏముంది? ఎంతటి కోమలత్వమో(నరమ్) అంతటి వేడి (గరమ్). కేవలం కోమలంగా ఉన్నట్లయితే ఎవరైనా పీకేయవచ్చు. కోమలంగా ఉండటముతో పాటు అద్భుతమును కూడా చెయ్యాలి. కోమలత్వము మరియు అద్భుతము-రెండూ కలసి ఉన్నట్లయితే అద్భుతమును చేసి చూపిస్తారు. ఈ మొత్తము గ్రూపువారు అద్భుతమును చేసి చూపించేవారు. ఏదైనా అద్భుతమును చేసి చూపించాలి అన్న లక్ష్యమును ఉంచాలి. అప్పుడు, పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు అల్లా సమానులు అని అంటారు. ఎటువంటి కర్మ చేస్తారో అటువంటి పేరు వస్తుంది. ఒకవేళ శ్రేష్ఠ కార్యము చేసినట్లయితే శ్రేష్ఠమణి అని పేరు వస్తుంది. శ్రేష్ఠమణులు అన్ని కార్యాలనూ శ్రేష్ఠంగా చెయ్యవలసి ఉంటుంది. మనస్సు-వాణి-కర్మలలో సరళత మరియు సహనశీలత, ఈ రెండూ అవసరము. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేనట్లయితే కూడా శ్రేష్ఠులు కారు. కావున సరళత మరియు సహనశీలత రెండూ కలిసి ఉండాలి. ఒకవేళ సహనశీలత లేకుండా సరళత వచ్చినట్లయితే దానిని అమాయకత్వము అని అనబడుతుంది. సరళతతో పాటు సహనశీలత ఉన్నట్లయితే శక్తి స్వరూపులు అని అనబడతారు. శక్తులలో సరళత మరియు సహనశీలత రెండు గుణాలు అవసరము. కొన్నిచోట్ల సహనశీలత అధికంగా ఉంది, మరికొన్ని చోట్ల సరళత అధికంగా ఉండటాన్ని ఇప్పటి రిజల్టులో చూస్తున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా తయారుచేసుకోవాలి. మధురత కూడా కావాలి, శక్తి రూపము కూడా కావాలి. దేవతల చిత్రాలను చాలా చూస్తారు, మరి అందులో ఏమి చూసారు? ఎంతటి జ్వాలనో అంతటి శీతలత. కర్తవ్యము జ్వాలగా ఉంటుంది, ముఖము శీతలంగా ఉంటుంది. ఇదే అంతిమ స్వరూపము.
ఎలా అయితే బుద్ధి నుండి చిన్న బిందువు జారిపోతుందో అలాగే ఈ చిన్న బిందువు కూడా చేతినుండి జారిపోతుంది. ఎంతెంతగా మీ దేహం నుండి అతీతంగా ఉంటారో అంత సమయం విషయాల నుండి కూడా అతీతంగా ఉండాలి. వస్త్రాలు ధరించడం, తొలగించడం సహజమే కదా లేక కష్టమా? అలాగే, అతీతంగా ఉన్నట్లయితే శరీర భానంలోకి రావడము, శరీర భానం నుండి బయటకు రావడము కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే శరీర వస్త్రాన్ని ధరించాలి, ఇప్పుడిప్పుడే తొలగించాలి. ముఖ్య పురుషార్థమైన ఈ విషయం గురించే ఈ రోజు మాట్లాడండి. ఈ ముఖ్య పురుషార్థాన్ని చేసినప్పుడు ముఖ్య రత్నాలలోకి వస్తారు. ఈ బిందువు పెట్టుకోవడం చాలా సహజం, అలాగే బిందు రూపంగా అవ్వడం కూడా సహజము.
బ్రాహ్మణులు ఏమి ఇచ్చిపుచ్చుకుంటారు? స్నేహము తీసుకోవడము, స్నేహము ఇవ్వడము. స్నేహము ఇస్తేనే స్నేహము లభిస్తుంది. స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వలన బాబా స్నేహాన్ని కూడా తీసుకుంటారు, ఇటువంటి స్నేహితులే సమీపంగా ఉంటారు. స్నేహం ఉన్నవారు దూరంగా ఉన్నా సమీపంగా ఉంటారు. బాప్దాదాకు సమీపంగా రావాలంటే స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ సమీపంగా రండి. ఈ ఇచ్చిపుచ్చుకోవడంలోనే రాత్రి పగలు గడపాలి. ఇదే బ్రాహ్మణుల కర్తవ్యం, ఇదే బ్రాహ్మణుల లక్షణం కూడా. స్నేహితునిగా అవ్వడానికి ఏమి చేయాలి? ఎవరు ఎంతగా విదేహిగా అవుతారో అంతగా స్నేహితునిగా అవుతారు. అంటే విదేహిగా అవ్వడము అంటే స్నేహితునిగా అవ్వడం ఎందుకంటే బాబా విదేహి కదా. అలాగే, దేహంలో ఉంటూనే విదేహిగా ఉండేవారు సర్వులకు స్నేహితులుగా అవుతారు. నేను ఎంత విదేహిగా అయ్యాను అన్నదే నోట్ చేసుకోండి. ఇంతటి శ్రేష్ఠ సౌభాగ్యము ప్రాప్తిస్తుందని కలలో అయినా అనుకున్నారా? ఎలా అయితే ఈ విషయం స్వప్నంలో కూడా లేకుండినదో, అలాగే బలహీనతలను కూడా స్వప్నంలోనైనా గుర్తు చేసుకోకండి. ఇటువంటి పురుషార్థము చేయాలి. ఈ బలహీనతలు పూర్వ జన్మవి, అనేక జన్మలవి అని భావించండి, వర్తమాన జన్మలో ఇటువంటి బలహీనతలను ప్రాయఃలోపం చేయాలన్న లక్ష్యం పెట్టుకోండి. మాస్టర్ సర్వశక్తిమంతులేనా? సర్వశక్తిమంతుని పిల్లలు అంటే సర్వశక్తిమంతులే. నేను ఇది చేయలేను అని ఎప్పుడూ అనకండి. అన్నీ చేయగలను. ఏదీ అసంభవం కాదు. కష్టమైన విషయం కూడా సహజమవుతుంది. అటువంటి వారికి ఏదైనా కష్టమైన విషయం ఉంటుందా? ఉండదు. మాస్టర్ సర్వశక్తిమంతులుగా అవ్వండి. ఒక్క శక్తి కూడా తగ్గకూడదు. ఎక్కడైనా ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తే అక్కడ బాబా తోడును అనుభవం చేయండి. ఎక్కడికైనా ఒంటరిగా పంపినా తోడు ఉన్నారని భావిస్తారు కదా. శివబాబా మీకు తోడుగా ఉంటే ఎక్కడైనా మీరు ఒంటరిగా ఉన్నాగానీ ఒంటరితనం అనిపించదు. ఒంటరిగా ఉంటూ కూడా తోడు అనుభవం అవ్వాలి. ఒంటరి అనగా అతీతము. సంగఠన అంటే ప్రేమ. అతీతంగా కూడా ఉండాలి, ప్రియంగా కూడా ఉండాలి. రెండు అభ్యాసాలు ఉండాలి. బాబా ఒంటరిగా ఉంటారా లేక కలిసి ఉంటారా? ఒంటరిగా ఉండటమే తోడుగా ఉండటము. బయటకు ఒంటరిగా, ఆంతరికంగా తోడు ఉన్న భావము. బాహ్యంగా ఎవరైనా తోడు ఉంటే ఒంటరితనాన్ని మర్చిపోతారు కదా, కానీ మీరు బాహ్యంగా ఒంటరిగా ఉన్నాగానీ ఆంతరికంగా ఒంటరిగా లేరు.
అందరికన్నా శ్రేష్ఠమణి ఎవరు అవుతారు? మస్తకమణి ఎవరు అవుతారు? ఎవరైతే మస్తకంలో విరాజమానమై ఉన్న ఆత్మ స్థితిలో ఉంటారో వారే అవుతారు. అటువంటి వారు తక్కువే ఉన్నారు. మస్తకంలో కొద్దిమంది, హృదయంలో చాలామంది ఉన్నారు. ముందుగా దృష్టి ఎక్కడకు వెళ్తుంది? ఇటువంటి మస్తకమణులుగా అవ్వాలి. ఎవరైతే సదా ఆస్తికులుగా ఉంటారో వారే మస్తకమణులుగా అవుతారు. వారు సదా హా (సరే) అంటారు. ఎవరైతే ఆస్తికులు ఉన్నారో వారే మస్తకమణులు. ఏ విషయంలోనూ నా(లేదు, కాదు) అన్న పదం సంకల్పంలో కూడా రాదు. ఇటువంటి గుణం ఉన్నవారు మస్తకంలోకి వస్తారు.
గాయన యోగ్యులుగా ఎవరు అవుతారు, పూజా యోగ్యులుగా ఎవరు అవుతారు? ఒక్క విషయంతో రెండింటికీ యోగ్యులుగా అవుతారా లేక రెండిటికి రెండు విశేషమైన విషయాలు ఉన్నాయా? కొందరు దేవతలకు గాయనము ఎక్కువగా ఉంటుంది కానీ పూజ తక్కువగా జరుగుతుంది, మరికొంతమంది దేవతలకు రెండూ బాగా జరుగుతాయి. ఎవరైతే ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉంటారో వారి పూజ ఏకరసంగా జరగదు. ఎవరైతే సదా తమ స్థితిలో ఉంటారో వారి పూజ కూడా సదా జరుగుతూ ఉంటుంది. ఏకరసంగా ఉండేవారి పూజ ఏకరసంగా జరుగుతుంది. పురుషార్థంలో ‘ఎప్పుడు’ అన్న పదం రాకూడదు. ‘ఎప్పుడు’ పదం వాడకుండా ‘ఇప్పుడు’ పదాన్ని వాడటమే తీవ్ర పురుషార్థుల లక్షణం. ‘ఎప్పుడు’ అని పురుషార్థంలో అనేవారి పూజ కూడా తక్కువ జరుగుతుంది. కనుక, ఏదైనా విషయంలో ‘ఎప్పుడైనా చూద్దాములే’ అని అనకండి. ‘ఇప్పుడు చూపిస్తాను’ అనండి, వీరినే తీవ్ర పురుషార్థి అని అంటాము. సంపూర్ణ స్థితిలో సర్వ శక్తులు సంపన్నంగా ఉంటాయి. సర్వ శక్తి సంపన్నంగా అయితే సర్వ గుణ సంపన్నులుగా అవుతారు. భవిష్యత్తులో సర్వగుణ సంపన్నంగా అవ్వాలి, ఇప్పుడు సర్వశక్తి సంపన్నంగా అవ్వాలి. ఎంతగా సర్వశక్తి సంపన్నంగా ఉంటారో అంతగా సర్వగుణ సంపన్నంగా అవుతారు.
ఎన్ని శక్తులు ఉంటాయి, తెలుసా? ఏ శక్తుల గురించి వినిపించారు? ఒకటి స్నేహ శక్తి, సంబంధ శక్తి, సహయోగ శక్తి, సహన శక్తి. ఈ నాలుగు శక్తులు ఉంటే సంబంధం కూడా సమీపంగా ఉంటుంది. నాలుగు సమానంగా ఉండాలి. సాహసం ఎక్కువగా ఉందా లేక సహనశక్తి ఎక్కువ ఉందా? సాహసము అంటే ధైర్యము. ధైర్యం ఉన్నవారికి సహాయం లభిస్తుంది. సహాయం అడిగితే లభించదు. ధైర్యం ఉంచాల్సి వస్తుంది. పూర్తి ధైర్యం ఉంచితే సహాయం ఎక్కువ లభిస్తుంది. ధైర్యం ఉంటే సర్వ విషయాలలో సహాయం ఉంటుంది. సదా ధైర్యవంతులుగా అవ్వాలి, అప్పుడు బాప్దాదా మరియు దైవీ పరివార సహాయం స్వతహాగనే లభిస్తుంది. స్నేహమూర్తులుగా ఉన్నారా? శక్తిమూర్తులుగా ఉన్నారా? స్నేహము మరియు శక్తి రెండూ అవసరమే. శక్తి రూపంతో విజయము, స్నేహ రూపంతో సంబంధాలలోకి వస్తారు. ఒకవేళ శక్తి లేతపోతే మాయపై విజయాన్ని సాధించలేరు. అందుకనే శక్తి రూపంతో విజయము మరియు స్నేహ రూపంతో సంబంధము కూడా కావాలి. రెండూ కావాలి. బాబాను సర్వశక్తిమంతుడు మరియు ప్రేమ సాగరుడు అని కూడా అంటారు. కావున స్నేహము మరియు శక్తి రెండూ కావాలి.
సితారలు ఎన్ని ఉంటాయి? మీరు స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? బాప్దాదా ఏ పేరు పెట్టారు? లక్కీ సితారలు (అదృష్ట తారలు). స్వయాన్ని లక్కీగా భావిస్తున్నారా? బాబా పిల్లలుగా అయినప్పటి నుండి లక్కీగా అయితే అందరూ ఉన్నారు కానీ లక్కీలో కూడా సదా సఫలత సితారలు. కొందరు సమీప సితారలు, కొందరు ఆశా సితారలు. ఇది అందరికీ తమతమది ఉంది. నేను ఎవరిని అని ఇప్పుడు ఆలోచించండి. స్వయాన్ని సఫలత సితారగా భావించండి. ప్రత్యక్ష ఫలాన్ని ఆపేక్షించని వారు సఫలతను పొందుతారు. అచ్ఛా-