Search for a command to run...
14 May 1970
సమర్పణలోని గుహ్య అర్థము
14 May 1970 · తెలుగు
నేడు వతనం నుండి ఒక కానుకను తీసుకువచ్చాము. చెప్పండి, ఏ కానుకను తీసుకువచ్చామో తెలుసా? చెప్పండి! అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు కానుక కూడా అవ్యక్తంగానే ఉంటుంది కదా! నేడు వతనం నుండి దర్పణం తీసుకువచ్చాము. దర్పణం ఎందుకు తెచ్చాము? మీరందరూ ఏ విశేష కార్యక్రమము కొరకు వచ్చారు, అది ఏమిటి? సమర్పణ చేయించేందుకు వచ్చారా లేక సంపూర్ణమయ్యేందుకు వచ్చారా? అందరి అర్పణమయత అనే ముఖమును చూసేందుకు మరియు చూపించేందుకు వతనం నుండి దర్పణమును తీసుకువచ్చాము. సమర్పణ అయిపోయారా? అందరూ అయిపోయారా? మేము సమర్పణ అయిపోయాము అని ఈ సభలో ఎవరెవరు భావిస్తున్నారు? సమర్పణ అని దేనిని అంటారు? దేహ అభిమానం విషయంలో సమర్పణ అయ్యారా? సమర్పణ లేక సంపూర్ణంగా అర్పణ అయిపోయారా? అవునని లేక కాదని చెప్పండి! దేహ అభిమానం నుండి సంపూర్ణ అర్పణ అయ్యారా? ఇందులో అవును అని ఎందుకు అంటున్నారు? స్వభావాలు అర్పణ అయ్యాయా? (ఇందులో పురుషార్థము జరుగుతుంది). స్వభావ అర్పణ చేసుకునే సమారోహమును ఎప్పుడు చేస్తారు? మీరంతా కన్య యొక్క సమర్పణ సమారోహమును జరిపేందుకు వచ్చారు. కానీ, బాప్‌దాదా ఆ సమారోహము జరపాలని కోరుకుంటున్నారు. దానిని ఎప్పుడు జరుపుతారు? అందుకే దర్పణమును తీసుకువచ్చాము అని అన్నాము. ఇందులో మూడు విషయాలను చూస్తున్నాము. ఒకటి - స్వభావ సమర్పణ, రెండవది – దేహ అభిమాన సమర్పణ మరియు మూడవది - సంబంధాల సమర్పణ. దేహము అనగా కర్మేంద్రియాల ఆకర్షణ యొక్క సమర్పణ. ఈ మూడు విషయాలను దర్పణములో చూస్తున్నాము. ఎప్పుడైతే స్వభావ సమర్పణ సమారోహము జరుగుతుందో అప్పుడు సంపూర్ణమూర్తుల సాక్షాత్కారము జరుగుతుంది. అలాగే కట్నంగా ఏమి లభిస్తుంది? ఎప్పుడైతే ఈ సంపూర్ణ సౌభాగ్యము ప్రాప్తిస్తుందో అప్పుడు శ్రేష్ఠభాగ్యము అనే కట్నం స్వతహాగానే లభిస్తుంది. మీ సౌభాగ్యాన్ని నిలిపి ఉంచుకోవడం ద్వారా భాగ్యము కూడా నిలిచి ఉంటుంది. సౌభాగ్యము, భాగ్యము అని అంటారు కదా! కావున సదా సౌభాగ్యము, సదా భాగ్యము. ఎవరు ఎంతగా సౌభాగ్యవంతులుగా ఉంటారో అంతగానే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు. సౌభాగ్యానికి గుర్తు బిందువు. పాపటి బొట్టు (చిందీ), బిందువు రెండూ ఉంటాయి. కావున ఎవరైతే సదా సౌభాగ్యవంతులుగా ఉంటారో వారికి బిందురూప స్మృతి సదా నిలిచి ఉంటుంది. ఈ బిందురూప స్థితి సదా తోడుగా ఉన్నట్లయితే వారే సదా సౌభాగ్యవంతులు. కావున మీ సౌభాగ్యంతో మీ భాగ్యమును చూడండి. ఎంత సౌభాగ్యమో అంతటి భాగ్యము. అవినాశీ సౌభాగ్యము ఉన్నట్లయితే అవినాశీ భాగ్యము ప్రాప్తిస్తుంది. సదా మీ సౌభాగ్యాన్ని నిలిపి ఉంచుకునేందుకు నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏ నాలుగు విషయాలు? నాలుగు విషయాలలో ఏ ఒక్క విషయమునైనా చెప్పండి! ఏ విధంగా స్థూలమైన కట్నాన్ని తయారు చేసుకొని వచ్చారు కదా!
అలాగే దీని కొరకు ఏ పురుషార్థపు కట్నం కావాలి? ఆ నాలుగు విషయాలు ఏమిటి? ఒకటేమో సదా జీవిత ఉద్దేశ్యము మీ ముందు ఉండాలి, రెండవది బాప్‌దాదా ఆదేశము, మూడవది సందేశము మరియు నాలుగవది స్వదేశము. అంటే, జీవన ఉద్దేశ్యము ఎదురుగా ఉంటే పురుషార్థం తీవ్రంగా జరుగుతుంది. బాప్‌దాదా ఆదేశమును స్మృతిలో ఉంచుకొని పురుషార్థము చేయడం ద్వారా పురుషార్థంలో కూడా సఫలత లభిస్తుంది. అందరికీ సందేశమును కూడా ఇవ్వాలి. దానినే సేవ అని అంటారు. ఇప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? స్వదేశమును గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇది తిరిగివెళ్ళే సమయము. సమయం సమీపంగా వచ్చి చేరుకుంది. ఈ నాలుగు విషయాలలో ఏ విషయములో లోపము ఉన్నా దాని పేరు - బలహీన పురుషార్థము. లోటును నింపుకునేందుకు ఈ నాలుగు పదాలను మీ ముందు ఉంచుకోండి. బాప్‌దాదా పిల్లలకు నేడు ఒక కొత్త టైటిల్ ఇస్తున్నారు, అది లా మేకర్స్ (న్యాయ రచయితలు). వారు పీస్ మేకర్స్ (శాంతి స్థాపకులు) అన్న టైటిల్ ఇస్తారు. కానీ బాప్‌దాదా ఈరోజు పిల్లలందరికీ, మీరందరూ లా మేకర్లు అన్న టైటిల్ ఇస్తున్నారు. సత్యయుగ చట్టాలేవైతే నడువనున్నాయో వాటిని రచించేవారు మీరే. మేము లా మేకర్లము అన్నది స్మృతిలో ఉంచుకున్నట్లయితే ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు. మీరు ఏ అడుగులనైతే వేస్తారో అవి చట్టాలుగా అవుతున్నాయి. ఏవిధంగా జస్టిస్ లేక చీఫ్ జస్టిస్‌లు ఏ విషయములను ఫైనల్ చేస్తారో అవి చట్టాలుగా అయిపోతాయో, అలా ఇక్కడ కూడా అందరూ న్యాయాధిపతులు కూర్చున్నారు, న్యాయ నిర్ణేతలు. కావున అటువంటి కర్మలేవీ చేయకండి. మీరు లామేకర్లు అయినప్పుడు మీరు ఏ సంకల్పములైతే చేస్తారో, మీరు ఏ అడుగులనైతే వేస్తారో మిమ్మల్ని చూసి మొత్తం విశ్వమంతా ఫాలో చేస్తుంది. మీ ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తారు. కావున ఈ విధంగా మిమ్మల్ని మీరు భావిస్తూ ప్రతి అడుగును వేయండి. ఇందులో కూడా నెంబర్లు ఉంటాయి. కానీ అందరూ లా మేకర్లే.
ఈ రోజు బాప్‌దాదా ఈ సభను చూసి హర్షిస్తున్నారు. ఎంతమంది లా మేకర్లు ఒకచోటికి చేరారు! మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తూ నడుచుకుంటున్నారా? మీపై ఇంత పెద్ద బాధ్యత ఉంది అని భావిస్తూ నడుచుకోవడం ద్వారా చిన్న, చిన్న విషయాలు స్వతహాగానే అంతమైపోతాయి. ఏ కర్మనైతే నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అన్న స్లోగన్ కూడా ఉంది. ఈ స్లోగన్‌ను సదా గుర్తుంచుకున్నప్పుడే కార్యాలను సరిగ్గా చేయగలరు. మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి. మీ ఒక్కొక్కరి వెనుక మీ రాజధాని ఉంది. వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. కావున, నేను ఏ కర్మలనైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అన్నది గుర్తుంచుకోండి. దీని ద్వారా అందరి స్వభావ సంస్కారాల సమర్పణ సమారోహము త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సమారోహమును వేదిక పైకి తీసుకువచ్చేందుకు త్వరత్వరగా ఏర్పాట్లు చేయాలి. అచ్చా!
ఇద్దరు కుమారీల సమర్పణ సమారోహము
ఈ రోజు ఏ కార్యం కొరకు పిలిచారు? సత్యయుగంలో మాతాపితలు రాజసింహాసనంపై కూర్చోబెడతారు. సంగమయుగంలో ఏ రాజతిలకము లభిస్తుందో తెలుసా? సంగమయుగపు తిలకమును దిద్దారా లేక దిద్దాలా? సంగమయుగ సింహాసనాధికారులుగా అయ్యారా? సేవా బాధ్యత అన్నది కిరీటము. మరి సింహాసనము ఏది? సంగమయుగపు సింహాసనాధికారులుగా అయిన తరువాతే సత్యయుగ సింహాసనాధికారులుగా అవుతారు. నగలన్నింటితో అలంకరించుకున్నారా లేక అది కూడా చేసుకుంటున్నారా? ఈ సమయంలో నగలతో అలంకరింపబడి ఉన్నారు, సంగమయుగం నుండే ఈ ఆచారాలన్నీ ప్రారంభమవుతాయి, ఎందుకంటే సంగమయుగము అన్ని విషయాల బీజమును వేసే సమయము. బీజాలు నాటే సమయం ఒకటి ఉంటుంది కదా! అలాగే ప్రతి దైవీ ఆచార బీజమును వేసే సమయము ఈ సంగమ యుగము. బీజరూపము ద్వారా అన్ని విషయాలకు బీజం పడుతుంది. ఆ బీజరూపునితోపాటు మీరందరూ కూడా బీజమును వేసే సహాయం చేయండి. ఈరోజు ఏదో అలా సాధారణమైన ఫంక్షన్ జరగడం లేదు. మీరందరూ లామేకర్లు అని మీకు వినిపించడం జరిగింది కదా! ఈ ఆచార వ్యవహారాల బీజమును వేసే రోజు ఇది! మీకు ఇంతటి నషా ఉందా? ఈ ఆచారాలన్నీ బ్రాహ్మణుల ద్వారానే జరుగుతాయి. మీరు ఎంత పెద్ద కార్యమును చేసేందుకు నిమిత్తులు! (విశ్వాన్ని మార్చడము) ఎంత సమయంలో విశ్వాన్ని మార్చేస్తారు! మిమ్మల్ని మీరు ఎంత సమయంలో సిద్ధం చేసుకుంటారు? మీరు ఎవరెడీగా ఉన్నారా? నేడు అందరూ స్వయాన్ని ఏ రూపంలో అనుభవం చేసుకుంటున్నారు? మీరు ఏ రూపంలో కూర్చున్నారు? ఎటువంటి రోజు ఉంటుందో అటువంటి రూపం ఉంటుంది కదా! ఈ సంగమయుగ దర్బారు సత్యయుగ దర్బారు కన్నా ఉన్నతమైనది. నేడు అందరూ స్వయాన్ని సర్వ అలంకరణలతో అలంకరింపబడినవారిగా చూస్తున్నారా లేక ఈ కన్యలను మాత్రమే అలా చూస్తున్నారా? మీ ఒక్కొక్కరి సంగమయుగ అలంకరణ మొత్తం సత్యయుగ అలంకరణ కన్నా శ్రేష్ఠమైనది. కావున బాప్‌దాదా అందరినీ అలంకరింపబడిన మూర్తులుగా చూస్తున్నారు. సత్యయుగ కిరీటము ఈ కీరీటం ముందు విలువలేనిదే! సంగమయుగ కిరీటమును ధరించి ఉన్నారా? ఆ కిరీటము ఈ కిరీటము ముందు విలువలేనిదే! సంగమ కిరీటము మీరు పెట్టుకుని ఉన్నారు కదా! ఈ కిరీటము మరియు సింహాసనము సదా నిలిచి ఉండేందుకు ఏ ప్రయత్నము చేస్తారు? దీని కొరకు మూడు విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ స్వయంవర సమారోహమేదైతే ఉందో, పట్టాభిషేకములో కూడా ఏవైతే పద్ధతులు, ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సంగమయుగములో ఏదో ఒక రూపంలో ఉంటాయి. నేటి ప్రపంచములో ఏ పద్ధతి ఉందో తెలుసా? ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయో తెలుసా! ఒకటేమో బ్రాహ్మణుల ద్వారా, రెండవది కోర్టు ద్వారా, మూడవది మందిరాలు, గురువుల ద్వారా - ఈ మూడు రకాల పద్ధతులకు ఏదో ఒక రూపంలో ఇక్కడ బీజము పడుతుంది. ఈ మధువనము మందిరము కూడా, ఇది చైతన్య మందిరము. ఈ మందిరములో ఆత్మ-పరమాత్మల లగ్నము జరుగుతుంది. దీనితో పాటు కోర్టు పద్ధతి ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడి నుండే మొదలవుతుంది. మీరు లా మేకర్లు అని వినిపించాము కదా, వీరి ఎదుట ఈ ప్రతిజ్ఞను చేస్తున్నప్పుడు ఇది కోర్టు అయిపోయింది కదా! మూడు రకాల పద్ధతులు ఈ సంగమయుగములో అలౌకిక రూపములో జరుగుతాయి. దీని స్మృతి చిహ్నము స్థూలరూపములో జరుగుతూ ఉంటుంది.
అచ్ఛా, ఏ మూడు విషయాలను గుర్తుంచుకోవాలి? ఒకటి స్వయమును ఉపకారిగా భావించి నడుచుకోవడము, రెండవది నిరహంకారి, మూడవది అధికారి. అధికారమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి, నిరహంకార గుణమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి మరియు ఉపకారము చేసే కర్తవ్యమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి. ఈ మూడు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎవరు ఎంతటి అపకారులైనా కానీ మీ దృష్టి మరియు వృత్తి ఉపకారిగా ఉండాలి. అధికారిగా కూడా భావించి నడుచుకోవాలి కానీ నిరహంకారిగా ఉండాలి. ఎంతటి అధికారిగా ఉంటారో అంతటి నిరహంకారిగా ఉండాలి. అప్పుడే ఈ కిరీటము మరియు సింహాసనము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. అర్థమైందా. అచ్ఛా!