Search for a command to run...
2 Feb 1970
ఆత్మిక శక్తి యొక్క పరిశీలన
2 February 1970 · తెలుగు
ఈ రోజు బాప్‌దాదా ప్రతి ఒక్కరి ప్రొజెక్టర్ షోను చూస్తున్నారు. మీరు కూడా ప్రొజెక్టర్ షోను పెడ్తారు కదా! దేని ద్వారా అయితే చిత్రాన్ని చూస్తారో ఆ ప్రొజెక్టర్ ఏది? ప్రతి ఒక్కరి నయనాలు ప్రొజెక్టర్ వంటివి. ఈ ప్రొజెక్టర్ ద్వారా ఎటువంటి చిత్రాన్ని ప్రపంచానికి చూపించగలరు? అది సైన్సు శక్తి యొక్క ప్రొజెక్టరైతే ఇది ఈశ్వరీయ శక్తి యొక్క ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ ఎంతెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అంతగా దృశ్యము కూడా చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అలాగే పిల్లలైన మీ అందరి ఈ దివ్య నేత్రాలు ఎంతెంత స్పష్టంగా అనగా ఆత్మికతతో సంపూర్ణంగా ఉంటాయో అంతగా పిల్లలైన మీ నయనాల ద్వారా అనేక చిత్రాలను చూడగలుగుతారు. ప్రొజెక్టర్ ద్వారా చూసినంత స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఈ నయనాల ద్వారా బాప్‌దాదా మరియు పూర్తి రచన యొక్క స్థూల, సూక్ష్మ, మూల మూడు లోకాల చిత్రాలను చూపించగలరు. మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ మీ నయనాల ద్వారానే సర్వ సాక్షాత్కారాలను పొందగలరు. లైటు ఎంత కాంతివంతంగా ఉంటుందో చిత్రముకూడా అంతే కాంతివంతంగా ఉంటుంది. బల్బు ఎంత శక్తివంతంగా ఉంది అన్న విషయాన్ని బాప్‌దాదా ఎలా చూస్తారో తెలుసా? మీ బల్బు ఎంత పవర్‌తో ఉందో మీరు చూసుకున్నారా? మాకు మా లైట్ యొక్క శాతం తెలుసు, మా లైట్ గురించి మాకు తెలుసు అనేవారు చేతులెత్తండి. మా ఆత్మ ఎంత శక్తిశాలిగా ఉంది అన్నదాని పరిశీలన ఏ ఆధారముతో చేసుకోగలరు? (చార్టు ద్వారా) అదైతే మొత్తానికి చెందిన విషయమైపోయింది. ఏ విషయము ద్వారా మీ పరిశీలన చేసుకోగలరు? లైటులో ఏ విశేషత ఉంటుంది? దానిలోని విశేష గుణము - ఏ వస్తువు ఎలా ఉందో అలాగే అంత స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. అంధకారములో ఏ వస్తువునైనా ఆ వస్తువుగానే చూడటానికి వీలు పడదు. కావున అస్పష్టతను స్పష్టము చెయ్యటము లైటు విశేషత, ఈ విధంగా మీ లైటు శాతాన్ని పరిశీలించుకునే విధానము ఇదే. ఒకటేమో మీ పురుషార్థపు మార్గము స్పష్టమవుతుంది అనగా లైను క్లియరుగా కనిపిస్తుంది. రెండవ విషయము మీ భవిష్య స్టేటస్(హోదా) కూడా కనిపిస్తుంది. మూడవ విషయము - మీరు ఎవరి సేవనైతే చేస్తారో ఆ సమయములో మీ స్వ ప్రకాశము పవర్‌ఫుల్‌గా ఉన్నట్లయితే వారికి కూడా అంతగానే మార్గము సహజంగా మరియు స్పష్టంగా చూపించగలరు. వారు కూడా తమ పురుషార్థములో సహజంగానే నడవగలరు. వారి గమ్యము సహజమైనదిగా వారికి కనిపిస్తుంది. లైటు శాతము ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా అన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ లైటు శాతము తక్కువ అయినట్లయితే స్వయము కూడా పురుషార్థములో స్పష్టంగా ఉండరు మరియు ఎవరికైతే మార్గాన్ని చూపిస్తారో వారు కూడా సహజంగా మరియు స్పష్టంగా తమ మార్గము మరియు గమ్యమును తెలుసుకోలేరు. ఎవరి లైటు అయితే పవర్‌ఫుల్‌గా ఉంటుందో వారు స్వయమూ చిక్కుకోరు, ఇతరులనూ చిక్కుకోనివ్వరు. కావున మీ పురుషార్థమును మీ సేవద్వారా చూసుకోవచ్చు అనగా ఎవరి సేవనైతే చేస్తారో వారి మార్గము స్పష్టముగా ఉంటోందా అన్నదానిబట్టి చూసుకోగలరు. ఒకవేళ మార్గము స్పష్టంగా లేనట్లయితే మీ లైటు శాతము తక్కువగా ఉందని అర్థం. కొందరు అడుగడుగులో దెబ్బలు తింటూ ఉంటారు, వారి రచన కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మాస్టర్ రచయితలు. మాస్టర్ రచయితలు వారి రచనను చూసి కూడా తమ శక్తిని పరిశీలించుకోవచ్చు. బీజము ఎటువంటిదో ఫలముకూడా అటువంటిదే వెలువడుతుంది. ఒకవేళ బీజము శక్తిశాలిది కానట్లయితే అక్కడక్కడా పూలు వస్తాయి, ఫలాలు వస్తాయి కానీ అవి స్వీకరించేందుకు యోగ్యమైనవిగా ఉండవు. చాలా సుందరమైన, సుగంధభరితమైనవేవైతే ఉంటాయో, మంచి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటినే కొంటాము కదా! ఒకవేళ బీజమే శక్తిశాలిగా లేనట్లయితే దానినుండి వచ్చే రచన కూడా స్వీకార యోగ్యంగా ఉండదు. కావున మీ లైటు శాతమును పెంచండి. రోజురోజుకూ అందరి మస్తకము మరియు నయనాలు ప్రొజెక్టర్ షో చేసిన సేవ వలె సేవ చేయాలి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు చిత్రాన్ని మీ నయనాలలో చూస్తారు. నయనాలను చూడగానే బుద్ధియోగము ద్వారా అనేక సాక్షాత్కారాలు కలుగుతాయి. ఇటువంటి సాక్షాత్కారమూర్తులుగా మిమ్మల్ని తయారు చేసుకోవాలి. కానీ ఎవరైతే ఎల్లప్పుడూ సాక్షి స్థితిలో స్థితులై ఉంటారో వారే సాక్షాత్కారమూర్తులుగా అవ్వగలరు. వారి నయనాలు ప్రాజెక్టర్ పని చేస్తాయి. వారి మస్తకము ఎల్లప్పుడూ మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హోలీ తరువాత వేషాలు వేస్తారు కదా! దేవతలను అలంకరించి మస్తకముపై బల్బును వెలిగిస్తారు. ఈ వేషాలను ఎందుకు తయారు చేస్తారు? ఇది ఏ సమయపు ప్రాక్టికల్ రూపము? ఈ సమయముది. వారు మళ్ళీ మీ స్మృతి చిహ్నాలను తయారు చేస్తూ వస్తారు. కావున ఒక్కొక్కరి మస్తకములో లైటు కనిపించాలి. వినాశన సమయములో కూడా ఈ లైటు రూపము మీకు చాలా సహాయము చేస్తుంది. ఎవరు ఎటువంటి వృత్తితో మీ ముందుకు వచ్చినాగానీ వారు ఈ దేహాన్ని చూడకుండా మెరుస్తున్న ఈ బల్బును చూస్తారు. చాలా కాంతివంతమైన లైటు ఏదైతే ఉంటుందో, దానిని ఎప్పుడు చూసినా ఆ కాంతి కారణంగా మిగిలిన అన్ని విషయాలు దాగిపోతాయి. అలాగే మీ అందరి లైటు ఎంతెంతగా కాంతివంతంగా ఉంటుందో అంతగా వారికి మీ దేహమును చూస్తున్నా గానీ కనిపించదు. ఎప్పుడైతే దేహమును చూడనే చూడరో అప్పుడు తమోగుణీ దృష్టి మరియు వృత్తి స్వతహాగనే సమాప్తమైపోతాయి. ఈ పరీక్షలు రానున్నాయి. అన్నిరకాల పరిస్థితులను పాస్ అవ్వాలి.
ఈ గ్రూపు ఏదైతే ఉందో దీనికి తమాషాగా ఒక పేరు పెట్టాము. ఈ రోజు వతనంలో ఈ విషయంపై చిట్ చాట్(సంభాషణ) జరిగింది. ఎవరో తమాషాకు ఇలా అన్నారు - పెద్దక్కయ్యలు మా హెడ్స్ మరియు మేము లెగ్స్ (కాళ్ళు). అప్పుడు బాప్‌దాదా పెద్దవారికి హెడ్స్ అని పేరు పెట్టారు, కానీ వీరు హ్యాండిల్స్. బండికి హ్యాండిల్ లేకపోతే పని జరగదు. హ్యాండిల్ ద్వారానే బండిని ఎటు కావాలంటే అటు తిప్పగలరు. హెడ్స్ కూడా ఈ హ్యాండిల్స్ లేకుండా సేవను హ్యాండిల్ చెయ్యలేరు. ఇది హ్యాండిల్స్ గ్రూపు. వీరు లేకుండా హెడ్స్ ఏమీ చెయ్యలేరు. ఎవరు వచ్చినా ముందుగా వారిని హ్యాండిల్ చేసేది ఈ హ్యాండిల్సే కదా! మరి మీపైన ఇంతటి బాధ్యత ఉంది. ఒకవేళ హ్యాండిల్ అయిన మీరు సరిగా లేనట్లయితే సేవ హ్యాండిలింగ్ కూడా సరిగ్గా జరగదు. అయితే ఒక్క విషయాన్ని పరిశీలించుకోండి – మీరు హ్యాండిల్స్, అయితే హెడ్స్‌ను కూడా హ్యాండిల్ చేయకండి. హెడ్‌కు హ్యాండ్‌గా అయ్యి ఉండాలి. బాబాకు కూడా రైట్ హ్యాండ్స్ (కుడిభుజాలు) ఉన్నారు, లెఫ్ట్ హ్యాండ్స్ (ఎడమ భుజాలు) కూడా ఉన్నారు. ఉండటానికి హ్యాండ్ అయినా కానీ రైట్ హ్యాండుకు ఫుల్ పవర్ ఉంటుంది, అయినా చెయ్యే కదా, హెడ్ కాదు. హ్యాండిల్గా ఉన్నారు కదా, కానీ ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఎలా బాప్‌దాదాకు రైట్ హ్యాండ్‌గా అవ్వాలి, ఇందుకొరకు ఇక్కడకు వచ్చారు. ఈ గ్రూపు ఎటువంటిదంటే ఇందులోని ప్రతి ఒక్కరు అద్భుతాన్ని చెయ్యగలరు. సేవను సఫలత రూపంలోని తీసుకురాగలరు. సేవలో సఫలతను తీసుకువచ్చేందుకు రెండు విషయాలపై శ్రద్ధను ఉంచండి. అన్ని విషయాలలో సహయోగులుగా అయితే ఉన్నారు కానీ సేవలో సఫలతను తీసుకువచ్చేందుకు నిమిత్తమైన విశేష గ్రూపు ఇది. ఇందుకోసం రెండు విషయాలపై విశేషమైన శ్రద్ధను ఉంచండి - ఒకటి- నిషానా(గురి) పూర్తిగా మరియు నషా కూడా పూర్తిగా ఉండాలి. నషా మరియు నిషానా - ఈ రెండు విషయాలు ఈ గ్రూపులో విశేషంగా రావాలి, గురి సరిగ్గా ఉన్నప్పుడు ఒక్క వేటుతో ఎవరినైనా మరజీవులుగా చెయ్యగలరు. మంచి గురికాడు ఒకే బుల్లెటుతో గురి తప్పకుండా కొడ్తాడు. గురి చూసి సరిగ్గా కొట్టడం రాని వ్యక్తి 3-4సార్లు బుల్లెటును వేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ స్థితి యొక్క గురి మరియు ఇతరులకు సేవ చేసే గురి కూడా మంచిగా ఉన్నట్లయితే, వీటితోపాటు నషా కూడా ఎల్లప్పుడూ ఏకరసంగా ఉన్నట్లయితే సేవలో సఫలతను ఎక్కువగా పొందగలరు. ఒక్కోసారి నషా దిగిపోతుంది. ఒక్కోసారి గురి తొలగిపోతుంది. ఈ రెండు విషయాలు సరి అవ్వాలి. ఎవరిలో ఎంతగా స్వయం నషా ఉంటుందో అంతగానే నిషానా సరి చేసుకోగలరు. సేవాధారిగా అయితే ఉన్నారు, కానీ సేవలో ఇప్పుడు ఏ విశేషతను తీసుకురావాలి? ఎవరి ఒక్క క్షణము, ఒక్క సంకల్పము కూడా సేవ లేకుండా జరగదో, ఎవరి ప్రతి క్షణము సేవ గురించే ఉంటుందో అటువంటి వారిని సర్వీసబుల్ అంటాము. అది స్వ సేవ కావచ్చు, ఇతరుల సేవ కావచ్చు. ఉన్నదే సేవాధారిగా అయినప్పుడు సమయము, సంకల్పము సేవలో కాకుండా వేరేగా గడిచిపోకూడదు. ఆజ్ఞాబద్ధుడు అంటే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునేవాడు. నిరంతరం స్మృతిలో ఉండండి అనేదే ముఖ్యమైన ఆజ్ఞ. ఒకవేళ ఈ ఆజ్ఞపై నడవకపోతే ఏమని అంటాము? ఎంతెంతగా ఈ ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకువస్తారో అంతగా ప్రత్యక్ష ఫలితం లభిస్తుంది. పురుషార్థములో నడుస్తున్నప్పుడు సంపూర్ణంగా అవ్వటంలో ఆటంకం వేసేదిగా ఏ విఘ్నము కనిపిస్తుంది? విశేషమైన విఘ్నము వ్యర్ధ సంకల్పాల రూపంలో కనిపిస్తుంది. మరి దీని నుండి రక్షించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఒకటేమో ఎప్పుడూ లోపలి రెస్టు మరియు బయటి రెస్టును తీసుకోకండి. ఒకవేళ రెస్టులో లేనట్లయితే వేస్టుగా పోదు. రెండవ విషయము - స్వయమును ఎల్లప్పుడూ గెస్ట్‌గా (అతిధిగా) భావించండి. ఒకవేళ గెస్ట్‌గా భావించినట్లయితే, రెస్టు తీసుకోనట్లయితే వేస్ట్(వ్యర్ధంగా) జరగదు. అది సంకల్పమైనా, సమయమైనా, ఇదే సహజమైన పద్ధతి. అచ్ఛా, ఇప్పుడు మళ్ళీ సమాప్తినాడు అందరి మస్తకముపై బల్బు ఎంత పవర్ కలిగిఉందో చూస్తాము. శక్తిశాలిగా అయినట్లయితే మాయ ఆ పవర్ ముందుకు వచ్చే సాహసము చెయ్యదు. బల్బు ఎంత పవర్లో ఉంటుందో అంతగా ఎవరూ ఎదిరించలేరు. అటువంటి పవర్ఫుల్ స్థితిని చూస్తారు. సర్వీసబుల్గా ఉన్నారు, ఇప్పుడు పవర్‌ఫుల్‌గా అవ్వండి. ఏక్టివ్‌గా (చురుకుగా) అయితే ఉన్నారు కానీ ఎక్యురేట్గా (సరియైనవారిగా) అవ్వండి. మరి ఈ గ్రూపుకు విశేష ముద్ర ఏది పడాలి? ఎక్యురేట్. ఏ విషయములోనైనా ఎల్లప్పుడూ ఎక్యురేట్. మనసు కావచ్చు, వాచ కావచ్చు, కర్మణ కావచ్చు - మూడింటిలో ఎక్యురేట్. అచ్ఛా -