Search for a command to run...
5 Mar 1970
అభిషేకం చేయడం అనగా ప్రతిజ్ఞ చేయడం
5 March 1970 · తెలుగు
ఈరోజు శివజయంతిని జరుపుకోవటానికి పిలిచారు. ఎలా జరుపుకోవాలని అనుకుంటున్నారు? కలుసుకోవటమే జరుపుకోవటం. బయటివారు కలుసుకోవడానికి జరుపుకుంటారు, కానీ పిల్లలైన మీరు కలుసుకోవటాన్నే జరుపుకోవటంగా భావిస్తున్నారు. అంటే కలిస్తే జరుపుకున్నట్లే. ఇప్పుడిక ఏమి మిగిలి ఉంది? పిల్లలైన మీరు జరుపుకోవటం అంటే ఒకటి, కలుసుకోవటం, రెండు, మీ సమానంగా తయారుచేయటం. అంటే కలుసుకోవటం మరియు తయారుచేయటం ఇదే జరుపుకోవటం. ఈ రోజు ఈ రెండు విషయాలు చేయాలి. మిలనాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నారు. ఇక మీ సమానంగా ఇతరులను తయారుచేయాలి. ఈ రెండు విషయాలు చేయటమే శివజయంతిని జరుపుకోవటం. భక్తులు అభిషేకం చేయడానికి వెళ్తారు, మధ్యలో బ్రాహ్మణులు ఉంటారు కదా, వారి ద్వారా చేయిస్తారు. అలాగే మీరు కూడా బ్రాహ్మణులు. ఎలాగైతే భక్తులు అభిషేకం చేయిస్తారో అలాగే పిల్లలైన మీరు ఆత్మలచే బాబాకు అభిషేకం చేయిస్తున్నారు. నీరు లేక పాలతో అభిషేకం చేసే పద్ధతి ఎందుకు వచ్చింది? అభిషేకం చేసే సమయంలో మనస్సులో ఏ సంకల్పం చేస్తారో తెలుసా? నీరు లేక పాలతో అభిషేకం చేయడంలోని భావార్థం ఏమిటంటే - ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు చేతిలోకి జలాన్ని తీసుకుంటారు, సూర్యుని ముందు నీళ్లు వదులుతూ లోపల ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే మీ దగ్గరకు కూడా ఎవరైనా వస్తే మొట్టమొదట వారి నుండి ప్రతిజ్ఞ అనే నీటిని తీసుకోండి. ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు కదా - ఈరోజు నుండి మేము శివబాబా వారిగా అయ్యే ఉంటాం అని. ఇలా ముందుగా వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు. అందువలనే బయటివారు కూడా లోపల ప్రతిజ్ఞ చేసుకుని సన్ముఖంగా వచ్చి దేవతలకు స్వయం అర్పణ అయిపోతారు. పూర్తిగా భక్తులైన వారు మొత్తం అర్పణ అయిపోవడానికి సిద్ధపడతారు. అదేవిధంగా మీరు కూడా మొదట వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు, వారు పక్కా అయిన తర్వాత సంపూర్ణ స్వాహా చేయిస్తారు. ఇటువంటి సేవ చేయాలి. పూర్తిగా అర్పణ చేయించాలి. మీరు ఎంతమందిని అర్పణ చేయించారు? ఎవరు ఎంతగా స్వయం అర్పణ అవుతారో అంతగానే ఇతరులను అర్పణ చేయించగలరు. స్వయమే సంపూర్ణ సమర్పణ కాకపోతే ఇతరులను కూడా అంతగానే మీ సమానంగా తయారు చేస్తారు. ఇప్పుడు బలిహారం అవ్వటంలో శ్రమ మరియు సమయం పడుతున్నాయి. కానీ కొద్ది సమయం తర్వాత బలిహారమయ్యే వారు క్యూ కడతారు. కాశీ కల్వట్ (కత్తుల బావి)లో దూకి చనిపోయే స్మృతిచిహ్నం ఉంది కదా! ఇష్టపూర్వకంగా చనిపోవడానికి తయారవుతారు. అలాగే ఇక్కడ కూడా తయారవుతారు. మీరు వారికి బలిహారం అవ్వమని కోరిక కలిగించవలసిన శ్రమ కూడా చేయనవసరం లేదు. తమకు తామే తమ ఇష్టంతో జంప్ చేయడానికి సిద్ధపడతారు. ఈ క్యూ రానుంది. ఇప్పుడు ఈ వరుస లేదు. దీనికి కూడా కారణం ఉంది. పిల్లల వద్ద ఇప్పుడు ఏ క్యూ ఉంది? ఎప్పుడైతే ఈ క్యూ సమాప్తమవుతుందో అప్పుడు ఆ క్యూ వస్తుంది. ఇప్పుడు మీకు ఏ క్యూ ఉందో తెలుసా? (సంకల్పాల క్యూ), సంకల్పాలలో కూడా ముఖ్యమైనది ఏది, అదే పురుషార్ధంలో ఢీలాతనాన్ని తెస్తుంది. వ్యర్థ సంకల్పాలకు ముఖ్య కారణం ఏమిటి? పాత సంస్కారాలు ఏ రూపంలో వస్తాయి? వ్యర్థ సంకల్పాలకు బీజం ఏమిటో ఒక్క మాటలో చెప్పండి. వ్యర్థసంకల్పాలు లేదా వికల్పాలు అనేవి ఒకే మాట వలన బుద్ధిలోకి వస్తాయి. ఇది ఎందుకు జరిగింది, ఈ ఎందుకు అనే దాని వలనే వ్యర్ధ సంకల్పాల క్యూ ప్రారంభం అవుతుంది. ఆంగ్లంలో కూడా చూడండి, ఎందుకు అని సూచించే ప్రశ్నార్ధకం అన్నింటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు అనే క్యూ చాలా పెద్దది. ఈ క్యూ సమాప్తి అయిన తర్వాతే సంపూర్ణత వస్తుంది. తర్వాత ఆ క్యూ వస్తుంది. ఎందుకు అనే మాట తొలగినప్పుడే డ్రామా యొక్క నిర్ణయంపై ఏకరసస్థితిలో ఉండగలరు. ఇప్పుడు ఎందుకు అనే వరుసని సమాప్తి చేయాలి, అర్థమైందా! ఎందుకు అనే ఒక్క మాటతో సెకండులో ఎన్ని సంకల్పాలు వస్తాయి? ఎందుకు అనే దాని ద్వారా కల్పన చేయడం ప్రారంభమవుతుంది. బాబా కూడా పిల్లలతో ఈ విషయంలో నీటి అభిషేకాన్ని చేయించడానికి వచ్చారు. ఏదైనా ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఆ నీటిని సాక్షిగా ఉంచి చేస్తారు. ఇప్పుడు ఈ విషయంలో అభిషేకం చేయండి.
మధువనంలో విశేష బాధ్యత పాండవ దళానిది. కనుక ఈ దళంలో ఇప్పుడు బలం ఉండాలి. పాండవ దళంలో బలం ఉంటే ఈ పాండవ భవనంలోకి అసుర సంపద్రాయం కాదు కదా అసుర సంకల్పాలున్న వారు కూడా రాలేరు. ఇంతగా కాపలా ఉండాలి. స్థూలంగా కాపలా ఉండటం సహజం. ఎలాగైతే స్థూల ద్వారం వద్ద రక్షణగా ఉంటున్నారో అలాగే మాయా ద్వారం నుండి కూడా సంభాళించుకోవాలి. అసుర సంస్కారాలను, అసుర సంకల్పాలను కూడా ఈ పాండవ భవనంలోకి రానివ్వకుండా ఉండేలా పాండవ సేన తయారుగా ఉన్నారా? ఇప్పుడు ముందుగా మీలోపల ఈ కాపలా గట్టిగా ఉంటే అప్పుడు పాండవ భవనంలో గట్టితనం తీసుకురాగలరు. ఇలా కాపలా కాస్తున్నారా? ఎవరెవరు మేము పాండవ భవనాన్ని ఇలా రక్షిస్తాము అని ధైర్యం పెట్టుకుంటున్నారు? పాండవులైన మీరు ఇంతగా రక్షిస్తే అప్పుడు పాండవ భవనం ఒక గారడీ ఇల్లులా అవుతుంది. ఎటువంటి ఆత్మ వచ్చినా కానీ వస్తూనే అసుర సంస్కారాలు మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తి అవ్వాలి. ఇలా నిర్వికల్పంగా తయారు చేసే గారడీ ఇల్లు అవుతుంది. ఇటువంటి సేవ చేసినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఒకరి నుండి ఒకరు విని ప్రజలు పరుగు పెట్టుకుంటూ వస్తారు. సమయం ముందుకు వెళ్ళే కొలదీ దు:ఖం, అశాంతి పెరుగుతాయి, అందువలన ప్రతి ఆత్మ సుఖశాంతుల దాహంతో ఉంటుంది. అలా దాహంతో అల్లాడుతున్న ఆత్మలు ఈ పాండవభవనంలోకి రాగానే సెకండులో సుఖశాంతులను అనుభవం చేసుకుంటారు. అప్పుడే ప్రభావం పడుతుంది. ఒకొక్కరు చైతన్యమూర్తుల వలె దర్శనీయమూర్తులుగా అయిపోతారు. ఒకొక్క రత్నాన్ని దర్శించుకోవడానికి దూరదూరాల నుండి దాహంతో ఉన్న ఆత్మలు వస్తారు. కానీ అలాంటి కాపలా ప్రారంభించినప్పుడే ఇలా జరుగుతుంది. సంగఠనా బలం ఉంది, స్నేహ బలం ఉంది, ఒకరికొకరు సహయోగం ఇచ్చుకునే బలం కూడా ఉంది. ఇప్పుడు కేవలం ఒక్క బలం కావాలి. ఆ బలం యొక్క లోపం కారణంగానే మాయ ప్రవేశిస్తుంది. అది సహనశీలత యొక్క బలం. సహనశీలతా బలం ఉంటే మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. కనుక ఈ నాలుగు బలాలు కావాలి.
ఈరోజు బాప్దాదా పుట్టినరోజుతో పాటు పిల్లలందరి పుట్టినరోజు. ఈ జయంతి నాడు ఈ నాలుగు బలాలను మీలో ధారణ చేసుకుంటే అప్పుడు ఈ పాండవ భవనం మొత్తం ప్రపంచంలో చూడవలసిన మరియు అనుభవం చేసుకునే స్థానంగా లెక్కించబడుతుంది. ఈ పాండవ భవనం యొక్క గొప్పతనం మొత్తం విశ్వంలో ఉంటుంది. గొప్పతనం పెంచేవారు ఎవరు? పాండవ సైన్యం మరియు శక్తి సైన్యం, మధువన నివాసులే మధువనం యొక్క గొప్పతనాన్ని పెంచగలరు. తాము చేసిన ప్రతిజ్ఞను ఎప్పుడూ తప్పరు అని పాండవులకు పేరు ఉంది. ఒక్క శాతం లోపం ఉన్నా దానిని లోపమే అంటారు. పాండవసేన ఉదాహరణగా అవ్వాలి. మిమ్మల్ని చూసి ఇతరులకు ప్రేరణ లభించాలి. ఎవరు మధువనానికి వచ్చినా ఈ విశేషతను చూడాలి – అనేకులున్నా కానీ వీరందరూ ఒక్కటే, ఒక్కరి సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉన్నారు. ఇటువంటి దృశ్యం కనిపించినప్పుడే ప్రత్యక్షత జరిగే గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను తీసుకువస్తుంది. కనుక ఈ రోజు ముందుగా ప్రతిజ్ఞ అనే నీటిని వేయండి. ఆ తర్వాత బహుమతి కూడా లభిస్తుంది. ప్రతిజ్ఞకు మూడురేఖలు చూపిస్తారు. అభిషేకంలో ఉపయోగించే బిల్వపత్రానికి కూడా మూడు ఆకులు ఉంటాయి. మరి ఈ రోజు మూడు ప్రతిజ్ఞలు చేయించాము. సహనశీలతా బలాన్ని మాలో ధారణ చేస్తాము, ఎందుకు అనే క్యూను సమాప్తం చేస్తాము మరియు అసుర సంస్కారాలకు కాపలా ఉంటాము. ఇలా మూడు ప్రతిజ్ఞలనే బిల్వపత్రాన్ని వేయాలి. భక్తులైతే ఆట ఆడుతారు కానీ జ్ఞాన సహితంగా ఆట ఆడటం అనేది పిల్లలకే తెలుసు. అందువలనే ఈ రోజు శివరాత్రికి స్మృతి చిహ్నంగా భక్తిలో ఈ ఆచారము రూపంలో జరుగుతుంది. మొదట పిల్లలే జ్ఞానసహితంగా ప్రారంభిస్తారు, తర్వాత భక్తులు అంధశ్రద్ధతో కాపీ చేస్తారు. తప్పకుండా ఎప్పుడో చేసి ఉన్నారు కాబట్టే స్మృతిచిహ్నం తయారయ్యింది కదా.
భగవంతుడు పిల్లలకు వందేమాతరం అంటారు, ఎంత తేడా కదా? ఇంత నషా ఉంటుందా? ఏ తండ్రికైతే అనేక భక్తులు వందనం చేస్తారో, ఆ తండ్రే స్వయంగా వచ్చి వందేమాతరం అని చెప్తున్నారు. ఈ నషాకు గుర్తు ఏమిటి? వారి నయనాలు, ముఖం, నడవడిక, మాట అన్నీ సంతోషంతో ఉంటాయి. ఆ సంతోషం చూసి అనేకుల దు:ఖం తొలగిపోతుంది. ఏ మాతలకు అయితే బాబా వందనం చెప్తున్నారో ఆ మాతల గుర్తు సంతోషం. ముఖమే అనేక ఆత్మలను సంతోషపరుస్తుంది. అజ్ఞానులు ఉదయం లేవగానే ఎవరి ముఖం అయినా చూస్తే వారి ముఖం చూడటం వలన ఇలా జరిగింది అంటారు. మీ హర్షిత ముఖం చూసి అందరికీ లోపల సంతోషం వస్తుంది. ఇలా జరగనుంది. మంచిది. ఎంతగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటూ ఉంటారో అంతగా మార్పు వస్తూ ఉంటుంది. అడుగడుగులో సంకల్పము, కర్మ, సమయము, సంస్కారము ఈ నాల్గింటిని చెక్ చేసుకుంటూ ఉండాలి.