Search for a command to run...
26 Jan 1970
స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి
26 January 1970 · తెలుగు
బాప్‌దాదా కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీరు కూడా కూర్చుని ఉన్నారు. కానీ బాప్‌దాదాకు మీకు ఉన్న తేడా ఏమిటి? ఇంతకముందు కూడా సాకార రూపంలో కూర్చునేవారు, కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది? సాకార రూపంలో ఉన్నప్పుడు బాబా లోన్ తీసుకుని వచ్చారు అనుకునేవారు కదా. అదే విధంగా ఇప్పుడు కూడా అనుభవం అవుతుందా! ఇప్పుడు అతిథిగా వస్తున్నారు. నిజానికి మీరు కూడా స్వయాన్ని అతిథులుగానే భావిస్తున్నారు. మీరు అనుకోవడంలో మరియు బాబా అనుకోవడంలో తేడా ఉంది. వచ్చి వెళ్ళేవారిని అతిథి అంటారు. ఇప్పుడు బాబా వచ్చేది వెళ్ళడానికి. అది బుద్ధియోగంతో చేసే అనుభవం, ఇది ప్రాక్టికల్ అనుభవం. వేరే శరీరంలో ప్రవేశించి కర్తవ్యాన్ని ఎలా చేయాలో, ఆ అనుభవాన్ని బాబా సమానంగా చేసుకోండి. రోజురోజుకూ పిల్లలైన మీ స్థితి చాలావరకు సమానంగా అవుతూ ఉంటుంది. మీరు కూడా అలాగే అనుభవం చేస్తారు. నిజంగానే ఈ శరీరాన్ని లోన్ తీసుకున్నాను, కర్తవ్యం చేయడానికి అతిథిగా వచ్చానని భావిస్తారు. స్వయాన్ని అతిథిగా భావించనంత వరకు అతీత స్థితి రాదు. ఎవరు ఎంత ఎక్కువగా అతీత స్థితిలో ఉంటారో, అటువంటి వారి స్థితిలో ఉండే విశేషత ఏమిటి? వారి మాటలతో, నడవడికతో ఉపరామ స్థితి ఇతరులకు అనుభవం అవుతుంది. ఎంత పైకి స్థితి వెళ్తుందో, అంత ఉపరామంగా అవుతూ ఉంటారు. శరీరంలో ఉంటూ కూడా ఇటువంటి ఉపరామ స్థితికి చేరుకోవాలి. దేహము మరియు దేహి(ఆత్మ) వేరు అన్న భావం పూర్తిగా రావాలి. దానినే స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి అంటారు లేదా యోగం యొక్క ప్రాక్టికల్ సిద్ధి అంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూ అతీత స్థితి ఆకర్షించాలి. మాటలు వింటున్నా విననట్లుగా ఉండాలి. ఇటువంటి భావన ఇతరులకు కూడా కలగాలి. ఇటువంటి స్థితి వచ్చిన దశను కర్మాతీత స్థితి అంటాము. కర్మాతీతము అనగా దైహిక బంధనం నుండి కూడా ముక్తి. కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మల ఖాతా తయారవ్వదు, అతీతంగా ఉన్నట్లుగా ఉంటారు, ఎటువంటి అటేచ్మెంటు ఉండదు. కర్మ చేసేవారు వేరు, చేయించేవారు వేరు – ఇటువంటి అనుభవం రోజురోజుకూ జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఎక్కువ బుద్ధి నడిపించాల్సిన అవసరం కూడా ఉండదు. సంకల్పం రాగానే ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇటువంటి స్థితికి అందరూ రావాలి. మూలవతనానికి వెళ్ళేకన్నా ముందు సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడకు వచ్చి అందరూ కలవాల్సి ఉంటుంది, తర్వాత అక్కడినుండి ఇంటికి వెళ్ళి తర్వాత రాజ్యంలోకి వెళ్తారు. సాకార వతనంలో మేళా జరిగినట్లే సూక్ష్మవతనంలో కూడా జరుగుతుంది. ఆ ఫరిశ్తాల మేళా దగ్గరలోనే ఉంది. కథలు చెప్తారు కదా – ఫరిశ్తాలు కలుసుకుంటాయి, ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది – ఇదే అనుభూతి జరుగుతుంది. ఏ కథలైతే చెప్పుకుంటున్నారో అవి ప్రాక్టికల్‌గా అనుభవమవుతాయి. ఆ మేళా జరిగే రోజుల కోసం వేచి ఉన్నాము.
ఇప్పుడు సేవ కోసం నిమిత్తమై ఉన్నాం. అన్నిటినీ మర్చిపోయి కూర్చున్నాము ఆ అవ్యక్త స్థితిలో, తనువు మరియు మనసు ఈ వ్యక్త దేశంలో ఉన్నాయి, ఇలా అనుభవం అవుతుందా? అచ్ఛా –
స్వయాన్ని ఎక్కడి నివాసులుగా భావిస్తున్నారు? పరంధామ నివాసిగా భావిస్తున్నారా? ఇది ఎంత సమయం గుర్తుంటుంది? నేను పరంధామ నివాసి ఆత్మను, ఈ వ్యక్త దేశంలో ఈశ్వరీయ కర్తవ్యం చేసేందుకు నిమిత్తమై వచ్చాను అన్న ఒక్క విషయం గుర్తుండాలి. మధుబనానికి వచ్చి విశేషంగా ఏ గుణాన్ని తీసుకున్నారు? మధుబన్ యొక్క విశేష గుణం – మధురత. మధు అనగా మధురత. స్నేహి. ఎంతగా స్నేహిగా ఉంటారో అంతగా అనంతమైన వైరాగ్యం ఉంటుంది. ఇదే మధుబన్ అంటే అర్థం. అతి స్నేహి మరియు అంతే అనంతమైన వైరాగ్య వృత్తి. ఒకవేళ మధుబన్ యొక్క ఈ విశేష గుణాన్ని జీవితంలో ధారణ చేసుకుని వెళ్తే సహజంగానే సంపూర్ణంగా అవ్వగలరు. అప్పుడు, ఎవరైనా ఆత్మిక టీచర్లుగా అవ్వాలనుకుంటే వారు నంబర్ వన్ టీచరుగా అవ్వగలరు. ఎందుకంటే మీ ధారణ ఎలా ఉంటుందో అలా ఇతరులను మీరు అనుభవంలోకి తీసుకురాగలరు. ఈ రెండు గుణాలను స్వయంలో ధారణ చేసుకోవాలి. మధుబన్ గీత నుండి బయటకు వెళ్ళే ముందే స్వయంలో పూర్తిగా ఈ గుణాలను నింపుకోండి. ఒకటి స్నేహము, రెండు అనంతమైన వైరాగ్య వృత్తితో ఎటువంటి పరిస్థితులనైనా సహజంగా దాటగలరు. సఫలత సితారలుగా అవ్వడానికి మధుబన్ కానుకలైన ఈ రెండు గుణాలను మీతో తీసుకువెళ్ళండి. ఎక్కడికైనా వెళితే, అక్కడి విశేష వస్తువు ఏమిటి అని అడుగుతారు కదా! ప్రసిద్ధమైన, విశేషమైన వస్తువును తప్పకుండా మీతో తెచ్చుకుంటారు. మరి మధుబన్ యొక్క విశేషమైన ఈ రెండు గుణాలను మీతోపాటు తీసుకువెళ్ళండి. ఎలా అయితే స్థూలమైన మధువును తీసుకువెళ్తారు కదా, అలాగే ఈ సూక్ష్మ మధురత అనే మధువును తీసుకువెళ్ళండి. అప్పుడు సఫలతే సఫలత. అసఫలత మీ జీవితం నుండే తొలగిపోతుంది. సఫలత సితార మీ మస్తకంలో మెరుస్తున్నట్లుగా చూస్తారు.
మీరు సఫలత సితారలా లేక పురుషార్థ సితారలా? ఏమని భావిస్తున్నారు? సఫలత సితారలా? లక్ష్యాన్నిబట్టి లక్షణాలు ఉంటాయి. ఇప్పటికీ ఇంకా నేను పురుషార్థీని అని భావిస్తే, ఇలా అనుకోవడం వలన జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లను మీరు క్షమించేస్తారు. మేము పురుషార్థీలం అని అనుకుంటారు. కావున ఇప్పుడు మీరు పురుషార్థీలు కాదు, సఫలత స్వరూపులుగా అవ్వండి. ఎప్పటివరకు పురుషార్థంలో ఉంటారు! స్వయం సఫలత స్వరూపులుగా అయినప్పుడు ఇతర ఆత్మలకు కూడా సఫలత మార్గాన్ని చెప్పగలరు. స్వయమే చివరి వరకు పురుషార్థీగా నడుస్తుంటే సంగమ ప్రాలబ్ధాన్ని ఎప్పుడు అనుభవం చేస్తారు? ఈ జీవితమంతా పురుషార్థీలుగానే ఉండిపోతారా? ఈ సంగమయుగ ప్రాలబ్ధాన్ని ప్రత్యక్ష రూపంలో పొందరా? సంగమ పురుషార్థం యొక్క ఫలం ఏమిటి? (సఫలత) మరి సఫలత స్వరూపమని నిశ్చయించుకుంటేనే సఫలత వస్తూ ఉంటుంది. నేనున్నదే సఫలత సితారను అని అనుకున్నప్పుడు అసఫలత ఎలా వస్తుంది! సర్వశక్తిమంతుని పిల్లలు ఏ కార్యంలోనూ అసఫలతను పొందలేరు. మీ మస్తకంలో విజయ సితార కనిపిస్తుందా? విజయమైతే నిశ్చితమై ఉంది. విజయము అంటే సఫలత. ఇప్పుడు సమయం మారుతుంది. సమయం మారుతున్నప్పుడు పురుషార్థాన్ని కూడా మార్చాలి కదా. ఇప్పుడు బాబా సఫలత రూపాన్ని చూపించారు కనుక పిల్లలు కూడా రూపంలో వ్యక్త దేహంలో ఉంటున్నప్పటికీ సఫలత రూపాన్ని చూపించరా? స్వయాన్ని సదా సఫలతా మూర్తిగా భావించండి. నిశ్చయాన్ని విజయం అంటారు. విశ్వాసం ఎలా ఉంటుందో అలాగే కర్మలు జరుగుతాయి. నిశ్చయంలో లోటు ఉంటే కర్మలో కూడా లోటు ఉంటుంది. స్మృతి శక్తివంతంగా ఉంటే స్థితి మరియు కర్మ కూడా శక్తివంతంగా ఉంటాయి. కావున ఎప్పుడూ మీ స్మృతిని బలహీనంగా చేసుకోకండి. శక్తిదళము మరియు పాండవులు ఎప్పుడైనా అసఫలతను పొందగలరా? మీకల్పక్రితపు విషయం గుర్తుంది కదా – పాండవులు ఏమి చేసారు? విజయులుగా అయ్యారు. మరి ఇప్పుడు మీ స్మృతిని శ్రేష్ఠంగా చేసుకోండి. ఇప్పుడు సంగమంలో విజయ తిలకం లభిస్తుంది, ఈ విజయ తిలకంతో తర్వాత రాజ్య తిలకం లభిస్తుంది. ఈ విజయ తిలకాన్ని ఎవ్వరూ తుడిపేయలేరు. ఇటువంటి నిశ్చయం ఉన్నదా? ఎవరైతే విజయి రత్నాలున్నారో వారి ప్రతి విషయంలో విజయమే విజయము. వారి ఓటమి జరగదు. అనేక జన్మలు ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఓటమి ఎందుకు కావాలి? ‘‘విజయము మాదే’’ ఇలా, ఒకే బలము ఒకే భరోసా ఉంచండి.
(కూతురు ఒకవేళ జ్ఞానంలో నడవకపోతే ఏమి చేయాలి?) ఒకవేళ ఎవరైనా ఈ జ్ఞానమార్గంలో నడవలేకపోతే పెళ్ళి చేసుకోవలసిందే. వారి బలహీనతను మీపై నుండి తొలగించుకోవాలి. సాక్షిగా అయి, తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది. అది బాధ్యత. మోహం కాదు. బాధ్యతను చేస్తున్నారు. ఒకటి మోహంతో చేయడం, మరొకటి నిమిత్తంగా అయి బాధ్యతను నిర్వర్తించడం. సర్వాత్మలు ఒకేసారి ఈ జన్మసిద్ధ అధికారాన్ని పొందే పాత్ర లేదు. పరిచయం తప్పకుండా లభిస్తుంది, గుర్తిస్తారు కూడా కానీ కొందరి పాత్ర ఇప్పుడు ఉంటే మరి కొందరి పాత్ర తర్వాత ఉంటుంది. బీజాల నుండి కొన్ని వెంటనే ఫలాలను ఇస్తాయి, మరికొన్ని ఆలస్యంగా ఇస్తాయి. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిదీ వారి వారి పాత్ర. బాధ్యత(ఫర్జ్)గా భావించి చేస్తే మాయ కలవదు(మర్జ్ అవ్వదు). లేకపోతే వాయుమండలం యొక్క ప్రభావం పడవచ్చు. కనుక బాధ్యత అనుకుని చేయండి. ఫర్జ్ మరియు మర్జ్లో కేవలం ఒక్క పదమే తేడా. సహయోగులకు సహాయం ఎల్లప్పుడూ లభిస్తుంది. బాబా సహాయం ప్రతి కార్యంలో ఎలా లభిస్తుందో అనుభవం అవుతుందా? ఇతరులలో ఉన్న విశేష గుణాలను చూసి ఇతరులను ముందుంచండి. ఎవరినైనా ముందుంచారు అంటే మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళడమే.
శివ జయంతి నాడు ధ్వనిని వ్యాప్తి చేయడం సహజం, ఎంత ధైర్యం ఉంటే అంత చేయండి. ఎందుకంటే సమయం ఎలా రానున్నదంటే ఈ అవకాశం కూడా తక్కువ లభించవచ్చు. అందుకని ఎంత చేయగలరో అంత చేయండి. పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? దాని గుహ్యతలోకి వెళ్ళండి. ఈ పొరపాటు ఎందుకు జరిగిందని అంతర్ముఖిగా అయ్యి ఆలోచించండి. ఇది మాయ రూపము. నేనైతే రచయిత అయిన తండ్రి సంతానమును. ఇలా స్వయంతో ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకోండి. చైతన్యవంతులుగా అవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీ గుర్తును వదిలాలి, అక్కడినుండి ఏదైనా తీసుకురావాలి. మరి మధుబన్‌లో విశేషంగా ఏ స్మృతిచిహ్నాన్ని విడిచిపెట్టారు? ఒక్కొక్క ఆత్మ వద్ద ఈ ఈశ్వరీయ స్నేహము మరియు సహయోగముల స్మృతిచిహ్నాన్ని విడిచిపెట్టండి. ఎంతగా పరస్పరం స్నేహి సహయోగిగా అవుతారో అంతగా మాయ విఘ్నాలను తొలగించుకోవడంలో సహయోగం లభిస్తుంది. సహయోగం ఇవ్వడం అంటే సహయోగాన్ని పొందడం. ఈ ఇచ్చుపుచ్చుకోవడాల లెక్కను సరిగ్గా పెట్టుకోండి. ఈ సంగమ సమయంలోనే అనేక జన్మల సంబంధాన్ని జోడించాలి. స్నేహము సంబంధాలను జోడించే సాధనము. ఎలా అయితే బట్టలు కుట్టే సాధనము దారము అయిందో అలాగే భవిష్య సంబంధాలను జోడించే సాధనము స్నేహ రూపి దారము. ఇక్కడ ఎలా జోడిస్తారో అక్కడ అలా జోడింపబడి ఉంటారు. జోడించే స్థానము, సమయము ఇది. అనేకులతో స్నేహము సమాప్తమైనప్పుడే ఈశ్వరీయ స్నేహము జోడింపబడుతుంది. మరి ఇప్పుడు అనేక స్నేహాలను సమాప్తం చేసి ఒక్కరితో స్నేహాన్ని జోడించాలి. ఆ అనేక స్నేహాలు కూడా ఇబ్బంది పెట్టేవే. ఈ ఒక్క స్నేహము సదా మిమ్మల్ని పరిపక్వంగా చేస్తుంది. అనేక వైపుల నుండి తెంచండి, ఒక్క వైపున జోడించండి. తెంచకుండా జోడించలేరు. ఇప్పుడు లోటును కూడా పూర్తి చేయండి. ఆ తర్వాత నింపుకునే సమయం కూడా సమాప్తమైపోతుంది. ఇలా భావిస్తూ ప్రతి అడుగును ముందుకు వేయండి.
అందరూ తీవ్ర పురుషార్థీలా లేక పురుషార్థీలా? తీవ్ర పురుషార్థీల మనసులోకి కూడా ఓటమి రాజాలదు. ఇటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. సంకల్పంలో కూడా మాయతో ఓడిపోకూడదు. వీరిని తీవ్ర పురుషార్థీలు అంటాము. వీరు శుద్ధ సంకల్పాలలో ముందునుండే తమ మనసును బిజీగా పెట్టుకుంటారు కనుక ఇతర సంకల్పాలు రావు. పూర్తిగా నిండి ఉన్న కారణంగా ఒక్క చుక్క కూడా ఎక్కువ పడదు, లేకపోతే ప్రవహిస్తుంది. మరి ఇటువంటి సంకల్పాలు మనసులో ఉంటే వ్యర్థ సంకల్పాలు రావడానికి స్థానమే ఉండదు. ఇంతగా స్వయాన్ని బిజీగా పెట్టుకోండి. మనసును బిజీగా పెట్టుకునేందుకు మీకు లభించిన పద్ధతులను మీరు పూర్తిగా ప్రయోగించడం లేదు. అందుకే వ్యర్థ సంకల్పాలు వస్తుంటాయి. ఒక వైపు బిజీగా ఉంటే మరో వైపు నుండి ముక్తులైపోతారు.
మంథన చేయడానికైతే చాలా ఖజానా ఉంది. ఇందులో మనసును బిజీగా పెట్టుకోండి. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది, మరి మీ పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉన్నదా? సమయం వేగంగా, మీ పురుషార్థం ఢీలాగా ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? సమయం ముందుకు వెళ్ళిపోతుంది, పురుషార్థీలు ఉండిపోతారు. సమయం అనే బండి వెళ్ళిపోతుంది. ప్రయాణం చేయాల్సినవారు ఉండిపోతారు. సమయం యొక్క వేగాన్ని ఏ విషయంలో చూస్తున్నారు? సమయానికి గతాన్ని గతంగా చేసే వేగం ఉంది. అదే విషయాన్ని సమయం మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేస్తుంది? మరి పురుషార్థంలో ఎటువంటి లోపాలున్నా కానీ వాటిని గతంగా భావించి ఇక మీదట వచ్చే ప్రతి సెకండులో ఉన్నతిని తీసుకురుండి, అప్పుడు సమయంతో సమానంగా వేగంగా ముందుకు వెళ్ళగలరు. సమయమైతే మీ రచన కదా. రచనలో ఈ గుణముంటే రచయితలో కూడా ఉండాలి. డ్రామా క్రియేషన్ అయితే క్రియేటర్ పిల్లలు మీరు కదా. మరి క్రియేటర్ పిల్లలు క్రియేషన్కన్నా ఢీలాగా ఎందుకు ఉండాలి? కావున, కేవలం ఒక్క విషయంపై శ్రద్ధ పెట్టండి – డ్రామాలో ఎలా అయితే గడిచిన ప్రతి క్షణం గతంలోకి వెళ్ళిపోతుందో, ఏ రూపంలో అయితే గడిచిందో అది అలా మళ్ళీ రిపీట్ అవ్వదు, 5000 సంవత్సరాల తర్వాతే అలా రిపీట్ అవుతుంది. అలాగే బలహీనతలను మీరెందుకు పదే పదే రిపీట్ చేస్తున్నారు? ఒకవేళ ఈ బలహీనతలను రిపీట్ అవ్వకుండా చూసుకుంటే పురుషార్థం వేగంగా అవుతుంది. ఎప్పుడైతే బలహీనతను తొలగిస్తారో అప్పుడు ఆ బలహీనత స్థానంలో శక్తి నిండుతుంది. ఒకవేళ బలహీనతలు రిపీట్ అవుతుంటే శక్తి నిండదు. కావున, గడిచినదంతా గతం, బలహీనతతో నిండిన గత విషయాలను సంకల్పంలోకి కూడా రానివ్వకండి. సంకల్పంలోకి వస్తే అవి వాణి మరియు కర్మలలోకి కూడా వస్తాయి. సంకల్పంలోనే సమాప్తం చేసేస్తే వాణి మరియు కర్మలలోకి రావు. అప్పుడు మనసు వాణి కర్మ మూడూ శక్తిశాలిగా అవుతాయి. చెడు వస్తువును ఎప్పుడూ వెంటనే పారేయడం జరుగుతుంది. మంచి వాటిని ప్రయోగిస్తున్నప్పుడు చెడు విషయాలను, చెడు వస్తువులను పారేసినట్లుగా పారేయండి. అప్పుడు సమయం మీ పురుషార్థంకన్నా వేగంగా వెళ్ళదు. సమయం కోసం మీరు వేచి ఉంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సమయం వస్తే మేము వెళ్ళడానికి సిద్ధం. ఇటువంటి స్థితి వస్తుంది. ఒకవేళ స్వయం తయారుగా లేకపోతే సమయం మా కోసం వేచి ఉంటే బాగుంటుందని కొంచెం అనిపిస్తుంది.
బాంధేలీ(బంధనంలో ఉన్నవారు)ల యోగం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ విషయంలో అయితే ఎవరైనా ఆపితే బుద్ధి అటువైపే వెళ్తుంది. ఇంట్లో కూర్చుని కూడా చరిత్రను అనుభవం చేసుకోవచ్చు. కానీ అంతటి తపన ఉండాలి. అంతటి తపనతో కూడిన అవస్థ ఉన్నప్పుడు బంధనము తొలగుతుంది. ఒక్కరి స్మృతియే అనేక బంధనాలను తొలగిస్తుంది. ఒక్కరితో జోడించాలి, అనేకులతో తెంచాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. ఎంతగా ఎడతెగని స్నేహం ఉంటుందో అంతగా ఎడతెగని సహయోగం లభిస్తుంది. సహయోగం లభించడం లేదు అంటే అందుకు కారణం స్నేహంలో లోపం. ఎడతెగని స్నేహాన్ని పెట్టుకుని ఎడతెగని సహయోగాన్ని పొందండి. కల్పక్రితపు మీ అధికారాన్ని పొందడానికి మళ్ళీ చేరుకున్నారు, ఇలా భావిస్తున్నారా? మేము కల్ప క్రితపు విజయులం అన్న స్మృతి వస్తుందా? ఇప్పుడు కూడా మళ్ళీ మేమే నిమిత్తమవుతాము. ఎవరికైతే ఈ నషా ఉంటుందో వారి ముఖంలో సంతోషం మరియు జ్యోతి రూపం కనిపిస్తాయి. వారి ముఖంలో అలౌకిక అవ్యక్త మెరుపు ఉంటుంది. వారి నయనాలలో, ముఖంలో సదా సంతోషమే సంతోషం చూస్తారు. చూసేవారు కూడా తమ దుఃఖాన్ని మర్చిపోతారు. దుఃఖి ఆత్మ స్వయాన్ని సంతోషపెట్టుకోవడానికి సంతోష సాధనాలను వెతుక్కుంటుంది. అద్దంలో మీ ముఖం కనిపించాలి. మీ ముఖంతో సేవ జరగాలి. మీరు మాట్లాడకపోయినాగానీ మీ ముఖం సేవ చేయాలి. ఈరోజుల్లో ప్రపంచంలో తమ ముఖాన్ని కూడా అలంకరించుకుంటున్నారు కదా. మరి మీ ఆత్మల అందరి ముఖం ఈ విధమైన అలంకరణతో కనిపించాలి. సర్వశక్తిమంతుని తండ్రి పిల్లలు, శక్తి రాకపోవడం అన్నది జరగదు. తప్పకుండా బుద్ధి అనే తీగలో ఏదో లోటు ఉంది. తీగను జోడించడానికి యుక్తులు లభించాయి, వాటిని అభ్యసించండి. తెంచకుండా జోడిస్తుంటారు కాబట్టి పూర్తిగా జోడించలేకపోతారు. కొద్ది సమయం కోసం జోడింపబడుతుంది, తర్వాత తెగిపోతుంది. కావున అనేక వైపుల నుండి తెంచి ఒక్క వైపున జోడించండి. ఇందుకోసం సాంగత్యం కూడా కావాలి మరియు అటెన్షన్ కూడా కావాలి. ప్రతి అడుగులో, సంకల్పంలో అటెన్షన్. వస్తున్న సంకల్పాలను చెక్ చేసుకోండి, ఈ నా సంకల్పం యథార్థమైనదా కాదా? సంకల్పాలపై ఇంతటి అటెన్షన్ ఉన్నప్పుడు వాణి కూడా సరిగ్గా ఉంటుంది, కర్మ కూడా సరిగ్గా ఉంటుంది. సంకల్పం మరియు సమయం రెండూ సంగమయుగం యొక్క విశేష ఖజానాలు. వీటితో ఎంతో సంపాదన చేసుకోవచ్చు. ఎలా అయితే స్థూల ధనాన్ని బాగా ఆలోచించి, ఒక్క పైసా కూడా వృధా అవ్వకుండా ఉండేలా ఖర్చు పెడ్తారో అలాగే ఈ సంగమ సమయం మరియు సంకల్పాలు వృధాగా పోకూడదు. సంకల్పం పావర్ఫుల్గా ఉంటే మీ సంకల్పాల ఆధారంతోటే మీ కోసం సత్యయుగ సృష్టిని తీసుకువస్తారు. మీ సంకల్పాలే బలహీనంగా ఉంటే మీ కోసం త్రేతాయుగ సృష్టిని తీసుకువస్తారు. ఈ ఖజానాలు పూర్తి కల్పంలో మరెప్పుడూ లభించవు. అతి కష్టంగా ఒకేసారి, ఇప్పుడు మాత్రమే లభించే ఈ ఖజానాలను, ఎంతో అమూల్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు తయారవుతారో వారే తయారైనట్లు. తర్వాత తయారయ్యే వారి గురించి చూడాల్సి వస్తుంది. అవ్వలేరు. ఇప్పుడు అవ్వగలరు. అందుకు ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. చాలా గడిచిపోయింది, ఇక కొద్ది సమయమే ఉంది... అని ఇతరులకు చెప్తారు కదా, దీనిని మీకోసం ఉపయోగించుకుంటున్నారా? సమయం కొద్దిగానే ఉంది కానీ చేయాల్సిన పని చాలా ఉంది. స్వయంతో దృఢమైన ప్రతిజ్ఞను చేయండి – ఈరోజు నుండి ఈ విషయాలను మళ్ళీ చేయను. ఈ సంస్కారాలను మళ్ళీ నాలోకి రానివ్వను. ఈ వ్యర్థ సంకల్పాలను ఎప్పుడూ ఉత్పన్నం కానివ్వను. ఇటువంటి దృఢ ప్రతిజ్ఞను చేసినప్పుడు అప్పుడే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఇప్పుడు రోజులు మారుతున్నాయి. కనుక స్వయాన్ని కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఢీలా పురుషార్థం చేసే రోజులు పోయాయి, ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయం. తీవ్ర పురుషార్థం చేసే సమయంలో ఎవరైనా ఢీలా పురుషార్థం చేస్తే ఏమనాలి? కావున ఇప్పుడు ఉత్సాహంలోకి రండి. పదే పదే స్పృహ తప్పకండి. సంజీవని మూలికను మీతోనే పెట్టుకుని ఎప్పుడూ స్పృహలోనే ఉండండి. అంతేకానీ, సరే చేస్తాము, అవుతాములే, చూద్దాములే అనే మాటలు ఇప్పుడు మాట్లాడకండి. ఇటువంటి మాటలు చాలా విన్నాము. సరే బాబా, చేసి చూపిస్తాము అన్న మాటను బాబా ఇప్పుడు వినాలనుకుంటున్నారు.
మీ నడవడికలో అలౌకికతను తీసుకురండి, అప్పుడు నడవడిక యొక్క ఆకర్షణ లౌకిక బంధువులు మొదలైనవారిని ఆకర్షిస్తుంది. లౌకిక సంబంధాలలో వాణి పని చేయదు. నడవడికే ఆకర్షిస్తుంది. ఇప్పుడు చాలా వేగంగా నడవండి. ఇప్పుడు అందరి ముందు ఉదాహరణగా నిలిచేలా మారి చూపించండి. ఇప్పుడు ఒక్క సెకండు కూడా వృధా చేయకండి. మీరు చెక్ చేసుకోగలరు. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. సమయం కూడా అనంతమైన వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేస్తుంది. కానీ సమయంకన్నా ముందే ఎవరైతే తమ కృషితో చేస్తారో వారికి ఫలితం ఎక్కువగా లభిస్తుంది. ఎవరైతే స్వయం చేయలేరో వారికోసం సమయం సహాయం చేస్తుంది. కానీ అది సమయం యొక్క బలిహారం అవుతుంది. స్వయానిది కాదు.
ఎన్నిసార్లు బాప్‌దాదాను కలిసారు? అనేకసార్లు ఇది జన్మసిద్ధ అధికారంగా లభించిందన్న స్మృతి ఉన్నదా? ఎంత పెద్ద అధికారము! అనేక ప్రయత్నాల తర్వాత కూడా లభించనిది ఇప్పుడు సహజంగా ప్రాప్తిస్తుంది అన్న అనుభవం చేసుకుంటున్నారా? సమయం ఎంత మిగిలి ఉంది, పురుషార్థం ఏమి చేసారు? రెండింటి పరిశీలన చేసారా? సమయం తక్కువగా ఉంది మరియు చేయాల్సిన పురుషార్థం ఎక్కువగా ఉంది. ఎవరైనా విద్యార్థి ఆఖరి సమయంలో వచ్చి దాఖలు అయితే అతడు కొద్ది సమయంలోనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సమయం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా మీ పురుషార్థం వెళ్తుందా? ఎప్పుడు అన్న మాటనే తీసేయండి. తీవ్ర పురుషార్థీలు ఎప్పుడు అన్న మాటను ఉపయోగించరు, ఇప్పుడు అంటారు. ఇప్పటి నుండి చేస్తాము. ఈ సంగమ సమయంలోని ఒక్క సెకండు కూడా ఎంతో విలువైనది. ఒక్క సెకండు వ్యర్థంగా పోయినాగానీ ఎంతో సంపాదన వృధాగా పోతుంది. మొత్తం కల్పానికి అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి ఉన్నది ఈ కొద్ది సమయమే. ఒక్క సెకండు పదమాల సంపాదనను చేయిస్తుంది, ఒక్క సెకండు పదమాల సంపాదనను పోగొడుతుంది కూడా. ఇటువంటి సమయాన్ని అర్థం చేసుకుని అడుగులు వేగంగా వేయండి. సమస్యలైతే వస్తూనే ఉంటాయి. స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే పరిస్థితులు మీ స్థితితో మారిపోవాలి. పరిస్థితి ఆధారంగా స్థితి ఉండకూడదు. స్థితి పరిస్థితిని మార్చగలదు ఎందుకంటే సర్వశక్తిమంతుని పిల్లలు మీరు, అలాంటప్పుడు ఈశ్వరీయ శక్తి పరిస్థితిని మార్చలేదా! రచయిత పిల్లలు రచనను మార్చలేరా! రచన శక్తిశాలియా లేక రచయితనా? రచయిత పిల్లలు రచనకు అధీనం ఎలా అవుతారు? అధికారం ఉండాలిగానీ అధీనం అవ్వకూడదు. ఎంతగా అధికారం పెట్టుకుంటారో అంతగా పరిస్థితులు కూడా మారిపోతాయి. వాటి వెనక పడుతూ ఉంటే అవి మరింత ఎదిరిస్తాయి. పరిస్థితుల వెనక పడటమనేది మన నీడను పట్టుకోవడానికి నీడ వెనక పరిగెత్తడమే, ఆ నీడను పట్టుకోగలరా? ఇంకా ముందుకు వెళ్తుంది, దానిని వదిలేయండి. వాయుమండలాన్ని మార్చడం చాలా సహజం. ఇంత చిన్నని అగరబత్తి, సుగంధాన్నిచ్చే వస్తువు కూడా వాయుమండలాన్ని మారుస్తుంది. మరి జ్ఞాన శక్తితో వాయుమండలాన్ని మీరు మార్చలేరా! వాయుమండలాన్ని ఎప్పుడూ శుద్ధంగా ఉంచాలన్న శ్రద్ధ ఉంచండి. లోకులు ఏమైనా మాట్లాడనివ్వండి, ఏ విషయంలో అయితే మీకు శ్రద్ధ లేదో ఆ మాటలను వింటూ కూడా వినకుండా ఉండండి. తనువు అక్కడ ఉన్నప్పటికీ మనసు లేదు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. మనసు ఎక్కడో ఉంటుంది, అక్కడ కూర్చున్నాగానీ మీరక్కడ లేనట్లుగా ఉంటారు. తనువుతో సహయోగాన్ని ఇవ్వండి, మనసుతో కాదు. ఇందుకోసం కేవలం అటెన్షన్ ఉంచండి. ఎప్పటివరకైతే ధైర్యం ఉంచకుండా అడుగు వేయలేదో అప్పటివరకు గమ్యం పెద్దదిగా అనిపిస్తుంది. ఒకసారి అడుగు వేస్తే లిఫ్టు వైపుకు వెంటనే వెళ్తారు. ధైర్యం ఉంచండి అప్పుడు ఎక్కడం కూడా లిఫ్టుగా మారిపోతుంది. కావున ధైర్యం అనే అడుగును వేయండి, చేయగలరు, కేవలం లోకరీతిని త్యాగం చేసి ధైర్యాన్ని ధారణ చేయండి. ఇతరుల నుండి లభించే సహయోగం కూడా పెద్ద లిఫ్టు. పరిస్థితులైతే వస్తాయి కానీ మీ స్థితి శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు సమయాన్నిబట్టి పద్ధతి కూడా టచ్ అవుతుంది. సమయానుసారంగా యుక్తి రాకపోతే యోగబలం లేదని అర్థం చేసుకోండి. యోగయుక్తంగా ఉంటే సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే యథార్థ పురుషార్థీలు ఉన్నారో వారి పురుషార్థంలో ఇంతటి శక్తి ఉంటుంది. ఎక్కువ ఆలోచించకండి. అనేక వైపులలో మోహం ఉంటే మాయా అగ్ని కూడా తగులుతుంది. మోహం ఉండకూడదు. బాధ్యతను నెరవేర్చండి కానీ అందులో మోహం ఉండకూడదు. ఎంతటి శక్తిశాలిగా అవ్వాలంటే ఇతరుల ఎదుట మీరు ఉదాహరణగా అవ్వాలి. వీరెంత నవీనతలోకి వచ్చారని అందరూ చూడాలి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ప్రేరణ పొందేలా మీరు సేవాధారులుగా అవ్వాలి. మొదట్లో వచ్చిన శక్తులు ఎంతోమంది శక్తులను తయారు చేసారు. శక్తులైన మీరు సృష్టిని మార్చండి. ఇంతగా ముందుకు వెళ్ళండి. శక్తులమైన మేము ఈ ప్రపంచాన్ని మార్చి చూపిస్తాము అన్న పాట కూడా ఉంది కదా. సృష్టిని ఎవరు మారుస్తారు? ముందుగా స్వయం మారినవారు. శక్తుల వాహనం సింహంగా చూపిస్తారు. ఏ సింహం? సింహం రూపంలో ఎదిరించడానికి వచ్చిన మాయా సింహాన్ని అధీనపరుచుకుని వాహనంగా చేసుకోవడము అంటే దాని శక్తిని సమాప్తం చేయడం. సింహంపై సవారీ చేసే శక్తులు మీరే కదా. ఇది అందరి చిత్రము. ఇటువంటి సింహంపై సవారీ చేసే శక్తులు మాయను చూసి గాభరా పడరు. మాయే వారిని చూసి భయపడుతుంది. ఇలా మాయాజీతులుగా అవ్వండి. శక్తి లేనిదే బంధనం తొలగదు. యోగం యొక్క శక్తి – ఒక్క బాబా మరెవ్వరూ లేరు. ఇటువంటి సౌభాగ్యము కోట్లలో కొందరికే లభిస్తుంది. ఇంతటి పదమా పదమ భాగ్యశాలిగా స్వయాన్ని భావిస్తున్నారా? శక్తిదళము ఎంతో అద్భుతాన్ని చేయగలదు. ప్రేమగా సేవ చేసేవారికి తండ్రి సహాయం కూడా లభిస్తుంది. ఎవరైతే స్నేహీగా ఉంటారో వారితో తండ్రి కూడా స్నేహంగా ఉంటారు. ఆ పిల్లలే బాబా ముందుకు వస్తారు. ఎవరు ఎంత దూరంలో ఉన్నాగానీ బాప్‌దాదా హృదయానికి సమీపంగా ఉంటారు.
అన్నింటికన్నా మంచి కానుక – మీ ఈ ముఖాన్ని సదా హర్షితంగా చేసుకోవడము. ఎప్పుడూ ఎటువంటి దుఃఖపు గీత కనిపించకూడదు. సంపూర్ణ చంద్రుడు ఎంతో సుందరంగా ఉంటాడు. అలాగే మీ ముఖం కూడా సదా హర్షితంగా ఉండాలి. మీ ముఖం సంతోషంలో ఎంత మెరుస్తూ ఉండాలంటే ఇతరులు మీ ముఖంలో తమ రూపాన్ని చూసుకోవాలి. ముఖం దర్పణంలా అవ్వాలి. అనేక ఆత్మలకు మీ ముఖాన్ని చూపించాలి. ఇప్పుడు పదమాపదమ్ భాగ్యశాలిగా అవ్వాలి. మహాదానిగా అవ్వాలి. దయాహృదయులైన తండ్రి పిల్లలు సర్వులపై దయ చూపాలి. ఈ దయా భావనతో ఎటువంటి ఆత్మలైనా మారుతారు. నేను ఎంత దయాహృదయునిగా అయ్యాను అని రోజంతటిలో పరిశీలించుకోండి. ఎంతమందిపై దయ చూపించాను? ఇతరులకు సుఖమిస్తే మీ సుఖం నిండుతుంది. ఇవ్వడం అంటే తీసుకోవడం. ఇతరులకు సుఖమిస్తే స్వయం కూడా సుఖ స్వరూపులుగా అవుతారు. ఎటువంటి విఘ్నాలు రావు. దానం చేయడం వలన శక్తి లభిస్తుంది. అంధులకు నేత్రాలను ఇవ్వడం ఎంతో మహాన్ కార్యము. మీ అందరి కార్యము ఇదే. అజ్ఞాన అంధులకు జ్ఞాన నేత్రాలను ఇవ్వండి. మీ స్థితి ఎప్పుడూ అచలంగా ఉండాలి. పిల్లలైన మీ స్థితికి గుర్తే ఈ అచల్‌గఢ్. ఎలా అయితే బాప్‌దాదా అచలంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఒక్కరి రసంలోనే ఉన్నప్పుడు ఏకరస స్థితిలో ఉంటారు. అచ్ఛా -