Search for a command to run...
18 Jan 2005
క్షణములో దేహభానము నుండి ముక్తులై జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి మరియు మాస్టర్ ముక్తి-జీవన్ముక్తి దాతలుగా అవ్వండి
18 January 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ (అదృష్టవంతులైన మరియు ప్రియమైన) పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహములో ఇమిడి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము అలౌకిక స్నేహము. ఈ స్నేహమే పిల్లలను బాబాకు చెందినవారిగా చేసింది. స్నేహమే సహజముగా విజయులుగా చేసింది. ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న ప్రతి బిడ్డ తమ స్నేహమనే మాలను బాబాకు ధరింపజేసారు ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తుంది అనేది ప్రతి బిడ్డకు తెలుసు. స్నేహము యొక్క అనుభూతి పరమాత్మ యొక్క అనేక ఖజానాలకు యజమానులుగా తయారు చేసేటువంటిది మరియు పరమాత్మ యొక్క సర్వ ఖజానాలకు బంగారు తాళం చెవిని బాబా పిల్లలందరికీ ఇచ్చారు. తెలుసు కదా! ఆ బంగారు తాళం చెవి ఏమిటి? ఆ బంగారు తాళంచెవి ఏమిటంటే - ‘‘మేరా బాబా’’ (నా బాబా). నా బాబా అని అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు, సర్వ ప్రాప్తుల అధికారముతో సంపన్నులుగా అయిపోయారు, సర్వ శక్తులతో సమర్థులుగా అయిపోయారు, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు. ఇటువంటి సంపన్న ఆత్మల హృదయము నుండి ఏ పాట వెలువడుతుంది? బ్రాహ్మణులైన మా ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు.
ఈ రోజును స్మృతి దివసము అని అంటారు, ఈ రోజు పిల్లలందరికీ విశేషముగా ఆదిదేవ్ అయిన బ్రహ్మా బాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తున్నారు. బ్రహ్మా బాబా బ్రాహ్మణ పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షిస్తున్నారు, ఎందుకు? ప్రతి బ్రాహ్మణ బిడ్డ కోట్లలో ఏ ఒక్కరో అయిన భాగ్యశాలి బిడ్డ. మీ భాగ్యము గురించి తెలుసు కదా! బాప్‌దాదా ప్రతి బిడ్డ యొక్క మస్తకములో మెరుస్తున్న భాగ్య సితారను చూసి హర్షిస్తున్నారు. నేటి ఈ స్మృతి దివసమున విశేషముగా బాప్‌దాదా విశ్వ సేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పించారు. కావున ఈ స్మృతి దివసము పిల్లలైన మీకు రాజ్య తిలకాన్ని దిద్దిన దివసము. పిల్లలకు విశేషముగా సాకార స్వరూపములో విల్ పవర్స్‌ను విల్ (వీలునామా) చేసిన రోజు. కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు అన్న నానుడిని సాకారము చేసిన రోజు. పిల్లలు నిమిత్తముగా అయి చేస్తున్న నిస్వార్థ విశ్వ సేవను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. బాప్‌దాదా కరావన్‌హార్ (చేయించేవారు)గా అయి కరన్‌హార్ (చేసేవారు) పిల్లల యొక్క ప్రతి అడుగును చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేష ఆధారమే – కరావన్‌హార్ (చేయించే) బాబా కరన్‌హార్ (చేసే) ఆత్మనైన నా ద్వారా చేయిస్తున్నారు. ఆత్మనైన నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావము ద్వారా నిర్మాన స్థితి స్వతహాగా ఏర్పడుతుంది. మైపన్ (నేను అనే భావము) ఏదైతే దేహభానములోకి తీసుకువస్తుందో, అది స్వతహాగానే నిర్మాన భావముతో సమాప్తమైపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితములో అన్నిటికంటే ఎక్కువగా విఘ్న రూపముగా అయ్యేది దేహభానము యొక్క మైపన్ (నేను అనే భావము). చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తముగా చేసేవానిగా అయి చేస్తున్నాను, అప్పుడు సహజముగానే దేహాభిమానము నుండి విముక్తులవుతారు మరియు జీవన్ముక్తి యొక్క ఆనందాన్ని అనుభవము చేస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తి అయితే ప్రాప్తి అయ్యేదే ఉంది, కానీ ఇప్పుడు సంగమయుగములోని జీవన్ముక్తి యొక్క అలౌకిక ఆనందము మరింత అలౌకికమైనది. ఏ విధంగా బ్రహ్మా బాబాను చూసారు కదా - కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధనము నుండి అతీతముగా ఉండేవారు. జీవితములో ఉంటూనే కమల పుష్ప సమానముగా అతీతముగా మరియు ప్రియముగా ఉండేవారు. ఇంత పెద్ద పరివారము యొక్క బాధ్యత, జీవితము యొక్క బాధ్యత, యోగీలుగా తయారుచేసే బాధ్యత, ఫరిశ్తాల నుండి దేవతలుగా తయారుచేసే బాధ్యత, ఇవన్నీ ఉన్నా కూడా వారు నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు, అందుకే భక్తి మార్గములో కూడా బ్రహ్మా యొక్క ఆసనముగా కమల పుష్పాన్ని చూపిస్తారు. వారిని కమల ఆసనధారిగా చూపిస్తారు. కావున పిల్లలైన మీ అందరూ కూడా సంగమములోనే జీవన్ముక్తిని అనుభవము చెయ్యాలి. బాప్‌దాదా నుండి ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము ఈ సమయములోనే ప్రాప్తిస్తుంది. ఈ సమయములోనే మాస్టర్ ముక్తి-జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి. తయారయ్యారు మరియు తయారవ్వాలి. ముక్తి-జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతలుగా అయ్యేందుకు విధి ఏమిటంటే - క్షణములో దేహభానము నుండి ముక్తులుగా అవ్వాలి. ఈ అభ్యాసము ఇప్పుడు అవసరము. మనసుపై ఎటువంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలంటే, ఏ విధంగా ఈ స్థూల కర్మేంద్రియాలైన చేతులతో, కాళ్ళతో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేయగలరు, దానికి సమయము ఏమైనా పడుతుందా! చేతిని పైకి ఎత్తాలి అని ఇప్పుడు ఆలోచించారనుకోండి, దానికి సమయము పడుతుందా? చెయ్యగలరు కదా! ఇప్పుడు బాప్‌దాదా చేతిని పైకి ఎత్తండి అని చెప్తే ఎత్తుతారు కదా! ఇప్పుడు చెయ్యమని కాదు, మీరు చెయ్యగలరు. అలా మనసుపై ఎంత కంట్రోల్ ఉండాలంటే, దానిని ఎక్కడ ఏకాగ్రము చెయ్యాలనుకుంటే అక్కడ ఏకాగ్రమైపోవాలి. చేతులు కన్నా, కాళ్ళ కన్నా మనసు సూక్ష్మమైనది కానీ ఎంతైనా అది మీదే కదా! నా మనసు అని అంటారు కదా, నీ మనసు అని అనరు కదా! కావున ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో, అదే విధంగా మనసు-బుద్ధి-సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి, అప్పుడు నంబర్‌వన్ విజయులు అని అంటాము. సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకము వరకే చేరుకోగలరు, ఎక్కువలో ఎక్కువ అయితే గ్రహాల వరకు చేరుకుంటారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకోగలరు. క్షణములో సూక్ష్మ లోకము, నిరాకారీ లోకము మరియు స్థూలములో ఉన్న మధుబన్ వరకు అయితే చేరుకోగలరు కదా! ఒకవేళ మనసుకు మధుబన్కు చేరుకోవాలి అని ఆర్డర్ చేసినట్లయితే క్షణములో చేరుకోగలరా? తనువుతో కాదు, మనసుతో. సూక్ష్మవతనానికి వెళ్ళాలి, నిరాకారీ వతనానికి వెళ్ళాలి అని ఆర్డర్ చేయండి, అలా మూడు లోకాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును చేర్చగలరా? ఆ అభ్యాసము ఉందా? ఇప్పుడు ఈ అభ్యాసము యొక్క అవసరము చాలా ఉంది. బాప్‌దాదా చూసారు, అభ్యాసమైతే చేస్తారు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయము కావాలంటే అంత సమయము ఏకాగ్రమవ్వాలి, అచలంగా అవ్వాలి, అలజడిలోకి రాకూడదు, దీని పట్ల ఇంకా అటెన్షన్ పెట్టాలి. మనసును జయించినవారు జగత్తును జయిస్తారు అని గాయనము ఉంది, కానీ ప్రస్తుతం మనసు అప్పుడప్పుడు మోసము కూడా చేస్తూ ఉంటుంది.
బాప్‌దాదా నేటి ఈ సమర్థ దివసమున ఈ సమర్థత పట్ల విశేషముగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఓ స్వరాజ్యాధికారీ పిల్లలూ, ఇప్పుడు ఈ విశేష అభ్యాసాన్ని నడుస్తూ-తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే సమయమనుసారముగా ఇప్పుడు ‘అకస్మాత్తు’ యొక్క ఆటను చాలా చూస్తారు. దీని కొరకు ఏకాగ్రతా శక్తి అవసరము. ఏకాగ్రతా శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజముగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగానే ప్రాప్తింపజేస్తుంది. కావున విశేషముగా సమర్థ దివసమున సమర్థులుగా అయ్యే ఈ అభ్యాసముపై విశేషముగా అటెన్షన్ పెట్టండి, అందుకే భక్తి మార్గములో కూడా అంటారు - మనసుతో ఓడిపోయినవారు ఓడిపోయినట్లు, మనసును గెలిచినవారు గెలిచినట్లు. మరి నా మనసు అని అన్నప్పుడు, నాది అన్నదానికి యజమానిగా అయ్యి శక్తులు అనే కళ్ళెంతో విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ కొత్త సంవత్సరములో ఈ హోమ్‌వర్క్‌పై విశేష అటెన్షన్ పెట్టండి! యోగిగా అయితే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రయోగిగా అవ్వండి అని అనడం జరుగుతుంది.
ఇకపోతే ఈరోజుటి స్నేహపూర్వక ఆత్మిక సంభాషణ, స్నేహపు ఫిర్యాదులు మరియు సమానముగా అవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాలు, ఈ మూడు రకాల ఆత్మిక సంభాషణలు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహభరితమైన స్మృతులు, స్నేహభరితమైన ప్రేమ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. ఉత్తరాలు కూడా చేరుకున్నాయి, ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది, సందేశాలు కూడా చేరుకున్నాయి, బాప్‌దాదా పిల్లల యొక్క స్నేహాన్ని స్వీకరించారు. రిటర్న్‌లో హృదయపూర్వకమైన ప్రియస్మృతులను కూడా ఇచ్చారు. హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు. ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేము కదా. చాలామంది ఉన్నారు. కానీ మూలమూలల్లో, పల్లె-పల్లెలో, అన్ని పట్టణాలలో అన్ని వైపులా ఉన్న పిల్లల యొక్క, బంధనములో ఉన్నవారి యొక్క, విలపిస్తున్నవారి యొక్క, అందరి ప్రియస్మృతులు చేరుకున్నాయి. ఇప్పుడు బాప్‌దాదా ఇదే చెప్తున్నారు - స్నేహానికి రిటర్న్‌లో ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. ఇప్పుడు స్టేజ్‌పై మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి. మీ సంపన్నత ద్వారా దుఃఖము మరియు అశాంతి సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు ఇక మీ సోదరీ-సోదరులను ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి. ఈ దుఃఖము, అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి. చాలా భయభీతులుగా ఉన్నారు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందో..., అన్న ఈ అంధకారములో భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మలకు ప్రకాశముతో కూడిన మార్గాన్ని చూపించండి. ఉల్లాసము కలుగుతుందా? దయ కలుగుతుందా? ఇప్పుడు అనంతమును చూడండి. అనంతముపై దృష్టి పెట్టండి. అచ్ఛా. హోమ్‌వర్క్ అయితే గుర్తుంటుంది కదా! మర్చిపోవద్దు. ప్రైజ్ ఇస్తాము. ఎవరైతే ఒక్క నెలలో మనసును పూర్తిగా కంట్రోలింగ్ పవర్ ద్వారా పూర్తి నెల అంతా ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకాగ్రము చెయ్యగలరో, ఈ చార్ట్ యొక్క రిజల్ట్‌ను చూసి బహుమతిని ఇస్తాము. సరేనా? ఎవరు బహుమతి తీసుకుంటారు? పాండవులు, ముందు పాండవులు. పాండవులకు అభినందనలు. మరి శక్తులు? ఏ వన్. పాండవులు నంబర్‌వన్ అయితే శక్తులు ఏ వన్. శక్తులు ఏ వన్‌గా అవ్వకపోతే పాండవులు ఏ వన్ అవుతారు. ఇప్పుడు కొద్దిగా వేగాన్ని తీవ్రము చెయ్యండి. విశ్రాంతితో కూడిన వేగము కాదు. తీవ్రగతి ద్వారానే ఆత్మల యొక్క దుఃఖము, బాధ సమాప్తమవుతాయి. దయ అనే ఛత్రఛాయను ఆత్మలపై వేయండి. అచ్ఛా!
సేవ టర్న్ తమిళనాడు, ఈస్టర్న్ మరియు నేపాల్ వారిది:- ఎవరి టర్న్ అయితే ఉందో వారు లేవండి. చాలా పెద్ద గ్రూప్ ఉంది (5 వేలమంది ఉన్నారు) 5 వేల మంది సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్‌ను తీసుకున్నారు. మంచి తెలివిని చూపించారు. 15 రోజులు సేవ చేస్తారు, 21 జన్మల పుణ్య ఖాతాను జమ చేసుకుంటారు. తెలివైనవారే కదా! బాగుంది. బ్రహ్మా బాబా యొక్క ప్రత్యక్షతా భూమి అయితే కలకత్తా ఉండనే ఉంది. కలకత్తావారు చేతులెత్తండి. అచ్ఛా – కలకత్తా వారిపై విశేషమైన బాధ్యత ఉంది, చెప్పమంటారా? అచ్ఛా – బ్రహ్మా బాబా యొక్క ప్రత్యక్షత భూమి కలకత్తా, మరి బాప్‌దాదా ప్రత్యక్షమయ్యే భూమి ఏమిటి? కలకత్తా అవుతుందా? ఏమి చేస్తారు? పెద్ద ప్రోగ్రామ్ అయితే చేసేసారు. ఇప్పుడు ఏమి చేస్తారు? ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఎక్కడినుండైతే ఆది జరిగిందో, అక్కడే సమాప్తి కూడా జరగాలి. అందరూ కలకత్తా భూమికి ప్రణామం చేయాలి, వాహ్! కలకత్తా నివాసులూ! వాహ్! అనేలా ఏదైనా అద్భుతమైన ప్రోగ్రామ్‌ను చేయండి. ఏదైనా క్రొత్తగా చేయండి. మోగా ప్రోగ్రామ్‌లు ఇప్పుడు చాలా అయ్యాయి. ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్రోగ్రామ్‌ను చేయండి. బాగుంది, బాప్‌దాదా పిల్లల పుణ్య ఖాతాను జమ చేసుకునే విధిని చూసి సంతోషిస్తున్నారు. ఇది కూడా గోల్డెన్ ఛాన్స్. బాగుంది. నేపాల్ మరియు తమిళనాడు కూడా ఉంది, చూడండి, కలకత్తాలో ఎప్పుడైతే ప్రవేశత జరిగిందో, నేపాల్‌తో కనెక్షన్ అయితే ముందు నుండే ఉండింది. అందుకే నేపాల్ కూడా అద్భుతం చేయాల్సి ఉంటుంది. నేపాల్ వారు లేవండి. నేపాల్ వారు రాజ్య అధికారులు, రాజ్యవంశ ఆత్మల కళ్యాణము ఎక్కువగా చేయాలి. ఎవరైనా పాత రాజ వంశావళివారు మధుబన్ వరకు చేరుకున్నారా? ఇప్పుడు వారిని మరింత సమీపంగా తీసుకురండి. కనెక్షన్ అయితే బాగుంది కానీ ఇప్పుడు రిలేషన్లోకి తీసుకురండి. బాగుంది. నేపాల్ కూడా సేవ బాగా చేస్తుంది. అచ్ఛా. నేపాల్ వారికి అభినందనలు, సేవను మరింత పెంచుతారు. రాజ వంశీయులను మధుబన్ వరకు తీసుకువస్తారు. అచ్ఛా. తమిళనాడు వారు లేవండి – చాలా వెనుక కూర్చున్నారు. చేయి ఊపండి. తమిళనాడు ఏమి చేస్తుంది? సేవా విస్తారాన్ని అయితే బాగా చేసారు. రోజీ బచ్చీనైతే గుర్తు చేసుకుంటారు కదా! పునాది బాగా వేసారు. ఇప్పుడు దానికి మీరంతా నిమిత్తంగా అయ్యి ముందుకు తీసుకువెళ్తున్నారు. ముందుకు తీసుకు వెళ్తున్నారు కదా! ఏమి చేయలేరు మీరు! ఏది కావాలంటే అది శుభ సంకల్పం చేయండి, అన్నీ చేయగలరు. ధైర్యము మీది సహాయం బాబాది. ధైర్యము ఉన్నవారు. ధైర్యము బాగుంది, బాబా సహాయం కూడా ఉంది. మరింత ధైర్యము ఉంచితే మరింత సహాయం లభిస్తుంది. రోజీ బచ్చీ తర్వాత బాగా సంభాళిస్తున్నారు, ఇక ముందు కూడా పరస్పరం కలిసి రోజీ బచ్చీకి రిటర్న్ ఇవ్వండి. మంచి పునాదిని వేసారు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరైతే సదా సంతోషంగా ఉన్నారో, వారు చేతులెత్తండి. సంతోషంగా కాదు, సదా సంతోషంగా ఉన్నారా? బాగుంది. సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. అచ్ఛా. అస్సాం, ఒరిస్సా, బీహార్ కూడా ఉన్నాయి, బంగ్లాదేశ్ కూడా ఉంది, ఇంతమంది కలిసి ఉన్నారు. ఒరిస్సా వారు కూడా మంచి సేవను చేస్తున్నారు, బీహార్ వారు కూడా చేస్తున్నారు, మరైతే ఈ జోన్ నంబర్‌వన్ వెళ్ళాలి. ఎంతమంది హ్యాండ్స్ ఉన్నారు! 6-7 స్థానాల నుండి హ్యాండ్స్ అంటే ఎంతమంది ఉంటారు! మరి బాప్‌దాదా రైట్ హ్యాండ్స్‌ను చూసి సంతోషిస్తున్నారు. ఎంత పెద్ద జోనో, అంత పెద్ద అద్భుతాన్ని చేసి చూపించాలి. మీరు 6-7 స్థానాలలో ధ్వనిని (సందేశాన్ని) ఇవ్వండి, ఆ ధ్వని తనంతట తానే వ్యాపిస్తుంది. బంగాల్ నుండి ధ్వని రావాలి, ఒరిస్సా నుండి ధ్వని రావాలి, నేపాల్ నుండి కూడా ధ్వని రావాలి, ఇలా అన్ని మూలల నుండి ధ్వని వస్తే ఎంత పెద్ద ధ్వని వస్తుంది! ఏదైనా అద్భుతాన్ని చేయండి. ఇది అన్నిటికన్నా పెద్ద జోన్, ఇందులో చాలా రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లో కూడా ఉన్నాయి, మూడు స్థానాలు (జోన్లు) పెద్దవి, ఇప్పుడు అద్భుతం చేసి చూపించండి.
ఎజ్యుకేషన్ వింగ్:- (200 మంది వచ్చారు) ఎజ్యుకేషన్ వారు ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేసారా? క్రొత్తదేమైనా ఆలోచించారా? మంచిది. ఎజ్యుకేషన్ అయితే విశేషమైనది. ఎజ్యుకేషన్‌లో ఒకవేళ మీరు ఏదైనా స్థానంలో ఏదైనా పూర్తి క్లాస్‌ను పరివర్తన చేసి చూపిస్తే ప్రభుత్వం ఎంతో సంతోషిస్తుంది. ఎలా అయితే గ్రామం వారు ఏదైనా ఒక గ్రామాన్నే దత్తత తీసుకుంటారు కదా, అలాగే మీరు కూడా ఏదైనా యునివర్శిటీ లేక కాలేజీ లేక స్కూలులో క్లాస్‌ను, పూర్తి క్లాస్‌ను పరివర్తన చేసి చూపించండి, మెజారిటీ. కొద్దిమంది మారకపోయినా కానీ, అది వేరే విషయము. ఏదైనా క్లాస్‌ను ఇలా ప్రాక్టికల్‌గా పరివర్తన చేసి చూపించండి అప్పుడు ప్రభుత్వం వరకు సమాచారం వెళ్తుంది. చాలా బాగా చేసారు, అభినందనలు. (ప్లాన్ వినిపించారు)
చాలా బాగుంది, ఇన్ అడ్వాన్స్ అభినందనలు. చూడండి, (సౌథ్ గుజరాత్ వైస్ ఛాన్సలర్‌తో) వీరు అనేక ఆత్మల కోసం నిమిత్తమయ్యారు, మరి మీకెన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! ఏ విద్యార్థి అయితే పరివర్తన అవుతారో వారి ఆశీర్వాదాలు మీరు (షేర్) వాటాగా లభిస్తాయి. అంటే మీరు షేర్ హోల్డర్ అయ్యారు. పరమాత్మ యొక్క షేర్ హోల్డర్, ఆ షేర్ కాదు, మారుతూ ఉండే ఆ షేర్లు కాదు. మంచిగా నిమిత్తమయ్యారు. ఇప్పుడు అద్భుతం చేసి చూపించండి. ఏదైనా పూర్తి క్లాస్‌ను పూర్తిగా పరివర్తన చేసి చూపించండి. బాగుంది, పరస్పరంలో సలహా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఏ సాల్వేషన్ కావాలన్నా, పరస్పరంలో మీటింగ్ చేసుకుని తీసుకోండి. అవుతుంది, చేయాల్సిందే, పెరగాల్సిందే. అచ్ఛా.
డబల్ విదేశీయులతో:- డబల్ విదేశీయులు, బాప్‌దాదా అంటారు - డబల్ విదేశీయులు అనగా డబల్ పురుషార్థములో ముందుకు వెళ్ళేవారు. డబల్ విదేశీయులు అన్న టైటిల్ ఉంది కదా, అది మీ గుర్తు కదా. అలాగే డబల్ విదేశీయులు నంబర్‌వన్ తీసుకోవడములో కూడా డబల్ వేగముతో ముందుకు వెళ్ళేవారు. మంచిది, ప్రతి గ్రూప్‌లో బాప్‌దాదా డబల్ విదేశీయులను చూసి సంతోషిస్తారు ఎందుకంటే భారతవాసులు మిమ్మల్నందరినీ చూసి సంతోషిస్తారు. బాప్‌దాదా కూడా విశ్వకళ్యాణకారులు అన్న టైటిల్‌ను చూసి సంతోషిస్తారు. ఇప్పుడు డబల్ విదేశీయులు ఏ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు? ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థము చేస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషము కలిగింది. కావున మీరందరూ కూడా మీ చుట్టుప్రక్కల మీ సోదరీ-సోదరులు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, వారికి సందేశాన్ని ఇవ్వాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలను ఉంచుకోండి. ఫిర్యాదులు ఉండకూడదు. వృద్ధి జరుగుతూ ఉంది మరియు జరుగుతూనే ఉంటుంది కూడా, కానీ ఇప్పుడు ఫిర్యాదులను సమాప్తము చెయ్యాలి. డబల్ విదేశీయుల గురించి ఒక విశేషతను వినిపిస్తూ ఉంటారు, అదేమిటంటే - భోళా బాబాను సంతోషపెట్టేందుకు సాధనము - సత్యమైన హృదయముపై స్వామి సంతోషిస్తారు, ఇది డబల్ విదేశీయుల విశేషత. బాబాను చాలా తెలివిగా సంతోషపెట్టడము వారికి వస్తుంది. సత్యమైన హృదయము బాబాకు ఎందుకు ప్రియమనిపిస్తుంది? ఎందుకంటే బాబాను సత్యము అనే అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు కదా! కావున బాప్‌దాదాకు స్వచ్ఛమైన హృదయము, సత్యమైన హృదయము కలవారంటే చాలా ప్రియము. అలాగే ఉన్నారు కదా! స్వచ్ఛమైన హృదయము ఉంది, సత్యమైన హృదయము ఉంది. సత్యతయే బ్రాహ్మణ జీవితపు మహానత. అందుకే డబల్ విదేశీయులను బాప్‌దాదా సదా గుర్తు చేస్తారు. భిన్న-భిన్న దేశాలలో ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తులుగా అయ్యారు. చూడండి, ఎన్ని దేశాలవారు వస్తారు? అంటే ఈ అన్ని దేశాల యొక్క కళ్యాణమైతే జరిగింది కదా! ఇక్కడికైతే నిమిత్తులైన మీరు వచ్చారు కానీ నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు, నిమిత్తము అయిన పిల్లలకు బాప్‌దాదా శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి. ఎగిరే కళతో సర్వులకు మేలు జరిగేదే ఉంది. అందరూ రిఫ్రెష్ అవుతున్నారా? రిఫ్రెష్ అయ్యారా? సదా అమరముగా ఉంటుందా లేక మధుబన్లోనే సగం వదిలేసి వెళ్తారా? అది తోడుగా ఉంటుందా, సదా ఉంటుందా? అమర భవ అన్న వరదానము ఉంది కదా! కనుక ఎవరైతే పరివర్తన చేసుకున్నారో వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. అమరులుగా ఉంటారు. అచ్ఛా. బాప్‌దాదా సంతోషముగా ఉన్నారు మరియు మీరు కూడా సంతోషముగా ఉన్నారు, ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. అచ్ఛా.
జ్ఞాన సరోవర్ నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయింది:- అచ్ఛా! మంచిది, జ్ఞాన సరోవర్ ఒక విశేషతను ప్రారంభించింది, ఎప్పటి నుండైతే జ్ఞాన సరోవర్ ప్రారంభమైందో, అప్పటి నుండి వి.ఐ.పి.లు, ఐ.పి.లకు విశేషముగా, విధిపూర్వకముగా ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రతి వర్గానికి సంబంధించిన ప్రోగ్రామ్‌లు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూనే ఉంటాయి. అంతేకాక జ్ఞాన సరోవర్కు వచ్చే ఆత్మల యొక్క స్థూల సేవను మరియు అలౌకిక సేవను చాలా మంచి ఇష్టముతో చేస్తారు అన్నది గమనించటం జరిగింది, అందుకే జ్ఞాన సరోవర్ వారిని బాప్‌దాదా విశేషముగా అభినందిస్తున్నారు, ఏమనంటే - సేవకు ఫలితముగా అందరూ చాలా సంతోషపడి వెళ్తారు మరియు చాలా-చాలా సంతోషముగా తమ సహచరులను మళ్ళీ తమతో పాటు తీసుకుని వస్తారు. నలువైపులా శబ్దము వ్యాపింపజేసేందుకు జ్ఞాన సరోవర్ నిమిత్తమైంది. కనుక అభినందనలు మరియు సదా అభినందనలను తీసుకుంటూ ఉండండి. అచ్ఛా!
ఇప్పుడు ఒక్క క్షణములో మనసును ఏకాగ్రము చెయ్యగలరా? అందరూ ఒక్క క్షణములో బిందు రూపములో స్థితులవ్వండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా - ఇటువంటి అభ్యాసమును నడుస్తూ-తిరుగుతూ చేస్తూ ఉండండి.
నలువైపులా ఉన్న స్నేహి, లవ్లీన ఆత్మలకు, సదా దయార్ద్ర హృదయులుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము, అశాంతి నుండి విముక్తులుగా చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ మనసు-బుద్ధి-సంస్కారాలను కంట్రోలింగ్ పవర్ ద్వారా కంట్రోల్లో పెట్టుకునే మహావీర్ ఆత్మలకు, సదా సంగమయుగము యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవము చేసే బాబా సమానమైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (మోహిని అక్కయ్యతో) వీరు కూడా తమ శరీరాన్ని నడిపించడం నేర్చుకున్నారు. నడుస్తూ ఉంటుంది. (శాంతమణి దాదీతో) వీరు కూడా చాలా బాగా నడిపిస్తున్నారు. (దాదీలందరినీ చూస్తూ) మీరు ఆది రత్నాల శోభ. హాజరవ్వడమే శోభ. ఒకవేళ మీలో ఎవరైనా హాజరవ్వకపోతే ఖాళీ-ఖాళీగా అనిపిస్తుంది. ఆది రత్నాల విశేషత ఇది. ఎక్కడకు వెళ్ళినాగానీ, అక్కడివారికి సంతోషం కలుగుతుంది. మాట్లాడినా, మాట్లడపోయినా కానీ మీ హాజరే సంతోషపెడ్తుంది. ఆరోగ్యాన్ని చూసుకోవడమైతే వచ్చింది. వచ్చింది కదా? అందరి ఆరోగ్యాలు కొంచెం అలజడి చేస్తాయి, అయినాగానీ నడిపించడం వచ్చింది.
దాదీజీతో:- చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. శరీర జ్ఞానం రావడాన్ని బాప్‌దాదా చూసారు. శరీరం ఎలా ఉన్నాగానీ నడిపించడం వచ్చింది, బాప్‌దాదా ఇది చూసి సంతోషిస్తున్నారు. ఆది రత్నాలు తక్కువేమీ కాదు. ఆది రత్నాలు కదా, ఒక్కొక్క ఆది రత్నాలలో విశేషత ఉంది.
నిర్మల్శాంత దాదీతో:- చాలా బాగా పాత్రను పోషిస్తున్నారు. నొప్పి లేదు కదా! (బాబాను కలిస్తే నొప్పి ఉన్నాగానీ అది పోతుంది) మీ పేరు విని అందరూ సంతోషిస్తారు, పర్దాదీ. పర్దాదీ పేరు విని అందరూ సంతోషిస్తారు కదా. చాలా బాగుంది. బాగున్నారు కదా, ఆరోగ్యం బాగుంది కదా! చాలా బాగుంది. ఇప్పుడు చలిని జయించారు. విజయిగా అయిపోయారు. చాలా బాగుంది. అచ్ఛా!
ఓంశాంతి