Search for a command to run...
17 May 1969
మాయా దర్పణము
17 May 1969 · తెలుగు
ఈ అవ్యక్త మిలనం యొక్క విలువ తెలుసా? అవ్యక్త రూపంలో కలుసుకోవడము, వ్యక్త రూపంలో కలుసుకోవడము – రెండింటిలో తేడా ఉంది. అవ్యక్త మిలనం యొక్క విలువ – వ్యక్త భావాన్ని విడిచిపెట్టడము. ఈ మూల్యాన్ని ఎవరు ఎంతగా చెల్లిస్తారో అంతగా వారికి విలువైన అవ్యక్త మిలనము యొక్క అనుభవం జరుగుతుంది. ‘నేను ఎంతవరకు మరియు ఎంత సమయాన్ని చెల్లించాను’ అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో స్థితి అయ్యే ఆవశ్యకతయే ఉంది. కానీ రిజల్టు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరూ స్వయం గురించి తెలుసుకోగలరు. ఇతరుల రిజల్టును కూడా చక్కగా అంచనా వేయగలరు. కనుక, అవ్యక్త స్థితి యొక్క ఆవశ్యకతను పూర్తి చేయండి. అవ్యక్త స్థితి యొక్క ఆనవాళ్ళు(గుర్తులు) మీ జీవితంలో ఎలా ఉంటాయో మీకు తెలుసా? వారి ప్రతి కర్మలో, ఒకటి, అలౌకికత మరియు రెండు, ప్రతి కర్మను చేస్తూ ప్రతి కర్మేంద్రియముతో అతీంద్రియ సుఖము అనుభవం అవుతాయి. వారి నయనాలు, హావభావాలు, వారి నడవడిక అతీంద్రియ సుఖములో ప్రతి క్షణము ఉంటాయి. అలౌకికత మరియు అతీంద్రియ సుఖపు మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తాయి. దీని ద్వారా, ఈ వ్యక్తి, వ్యక్త స్థితిలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. ఈ రెండు మీకు మీ కర్మలలో కనిపిస్తుంటే మీరు అవ్యక్త స్థితిలో స్థితి అయి ఉన్నట్లుగా భావించవచ్చు. ఒకవేళ లేవు అంటే, లోపాన్ని అర్థం చేసుకుని పురుషార్థం చేయవలసి ఉంటుంది.
అవ్యక్త స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి ఆరంభం నుండి ఒక స్లోగన్‌ను వినిపిస్తూ వచ్చాము. అది గుర్తుంటే ఎప్పుడూ మాయ విఘ్నాలలో ఓటమి లభించదు. అటువంటి సర్వోత్తమ స్లోగన్ అందరికీ గుర్తుందా? ప్రతి మురళిలో ఆ స్లోగన్ భిన్న భిన్న రూపాలలో వస్తూనే ఉంటుంది. (మన్మనాభవ, మేము బాబా సంతానము) ఇదైతే ఉండనే ఉంది. కానీ పురుషార్థం చేస్తూ ఉంటే మధ్యలో మాయ విఘ్నాలు వస్తుంటాయి, వాటిపై విజయాన్ని పొందడానికి ఉన్న స్లోగన్ ఏమిటి? ‘‘స్వర్గ స్వరాజ్యము మా జన్మ సిద్ధ అధికారము’’ మరియు ‘‘సంగమ సమయములో బాబా ఖజానా మాకు జన్మ సిద్ధ అధికారము’’. ఈ స్లోగన్‌ను మర్చిపోయారా? అధికారాన్ని మర్చిపోతే ఏమి జరుగుతుంది? మీరు వేటి వేటికి అధికారులు అన్నదైతే తెలుసు కదా! ఇవన్నీ మీకు జన్మ సిద్ధ అధికారంగా లభించాయి. స్వయాన్ని అధికారిగా భావించినప్పుడు మాయకు అధీనులుగా అవ్వరు. అధీనులుగా అవ్వకుండా స్వయాన్ని రక్షించుకోవాలంటే స్వయాన్ని అధికారిగా భావించాలి. ముందుగా, సంగమయుగ సుఖానికి అధికారి, ఆ తర్వాత భవిష్యత్తులో స్వర్గ సుఖాలకు అధికారి. మరి మీ అధికారాన్ని మర్చిపోకండి. మీ అధికారాన్ని మర్చిపోయినప్పుడే ఏదో ఒక విషయానికి అధీనులుగా అయిపోతారు. ఎవరైతే పర అధీనులుగా అవుతారో వారు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు. పరాధీనులు ప్రతి విషయంలో మనసా, వాచ, కర్మణ దుఃఖ ప్రాప్తిలో ఉంటారు. ఎవరైతే అధికారిగా ఉంటారో వారు అధికారం యొక్క నషాలో మరియు సంతోషంలో ఉంటారు. సంతోషం కారణంగా సుఖాల సంపద వారి మెడలో హారంగా అవుతుంది. సత్యయుగ సుఖాల గురించి తెలుసు కదా? సత్యయుగంలో ఆటబొమ్మలు ఎలా ఉంటాయి? అక్కడ రత్నాలతో ఆడుకుంటారు. మీరైతే సత్యయుగ సుఖాల లిస్టును మరియు కలియుగ దుఃఖాల లిస్టును తయారు చేసారు కదా. కానీ సంగమ సుఖాల లిస్టును తయారు చేస్తే వీటికన్నా రెట్టింపు లిస్టు తయారవుతుంది. ఆ సత్యయుగ సంస్కారాలనే ఇప్పుడు నింపుకోవాలి. చిన్న పిల్లలు రోజంతా ఆటలలోనే మునిగి ఉంటారు, వారికి ఏ విషయం గురించిన చింత ఉండదు, అలాగే ప్రతి క్షణము సుఖాల లిస్టును, రత్నాల లిస్టును బుద్ధిలో గుర్తు చేసుకుంటూ ఉండండి మరియు ఈ సుఖాల రూపి రత్నాలతో ఆడుకుంటూ ఉండండి అప్పుడు డ్రామా ఆటలో ఎప్పుడూ ఓడిపోరు. ఇప్పుడైతే ఒక్కోసారి ఓడిపోతున్నారు.
బాప్‌దాదాకు పిల్లలపై ఎంత స్నేహము ఉంది? బాప్‌దాదా స్నేహము అవినాశి అయినది. మరి పిల్లల స్నేహము ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉంటుంది. ఏకరసంగా లేదు. ఒకసారి చాలా స్నేహమూర్తులుగా కనిపిస్తారు, మరోసారి స్నేహమూర్తికి బదులుగా ఏ మూర్తిగా కనిపిస్తారు? అయితే స్నేహి లేకపోతే సంకటమయి. మీ మూర్తిని మీరు చూసుకోవడానికి మీ వద్ద ఏమి ఉండాలి? దర్పణము. దర్పణము(అద్దము) అందరి వద్ద ఉన్నదా? దర్పణము ఉంటే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు, చూస్తేనే లోటును సరి చేసుకోగలరు. అద్దమే లేకపోతే లోటును సరి చేసుకోలేరు. కనుక ప్రతి సమయము మీ వద్ద అద్దాన్ని పెట్టుకోండి. కానీ ఈ దర్పణము ఎటువంటిదంటే, మీరనుకుంటారు అది మీ వద్ద ఉందని, కానీ అప్పుడప్పుడు ఈ అద్దము మాయమైపోతూ ఉంటుంది. మాయా దర్పణము. ఒక్క సెకండులో మాయమైపోతుంది. దర్పణము ఎప్పటికీ అవినాశిగా, స్థిరంగా నిలిచి ఉండాలంటే ఏమి చేయాలి? ఇందుకోసం కావలసిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ (అర్హత) ఏమిటి? ఎవరైతే అర్పణమయమై ఉంటారో వారి వద్ద దర్పణం ఉంటుంది. అర్పణ లేకపోతే దర్పణము కూడా అవినాశిగా నిలవదు. దర్పణమును పెట్టుకోవడానికి ముందుగా అర్పణ చేసుకోవాలి. దీనినే మరో మాటలో సర్వస్వ త్యాగి అంటాము. సర్వస్వ త్యాగి వద్ద అద్దము ఉంటుంది. అవ్యక్త స్థితిలో ఉన్నవారే అవ్యక్త మిలనాన్ని జరుపుకోగలరు.
వర్తమాన సమయము అవ్యక్త స్థితిలో ఎక్కువ లోటు కనిపిస్తుంది. రెండు విషయాలలో అయితే మంచిగా ఉన్నారు, మిగిలిన మూడవ విషయంలో లోటు కనిపిస్తుంది. ఒకటి కథనము, రెండు మథనము. ఈ రెండూ బాగానే ఉన్నాయి. ఈ రెండూ సహజమైనవి. మూడవది సూక్ష్మమైనది. వర్తమాన సమయంలో చూసిన రిజల్టులో మథనముకన్నా కథనము ఎక్కువగా ఉంది. మరి మూడవ విషయము ఏమిటి? ఒకటి మథనము చేయడము. రెండు మగనము అవ్వడము. అదే పూర్తి లవలీన అవస్థ. మరి వర్తమాన సమయంలో మథనముకన్నా ఎక్కువగా కథనము ఉంది. మొదటి నంబరులో విజయులుగా ఉన్నారు. రెండవది మథనము, మూడవ నంబరులో మగ్న అవస్థలో ఉండటము. ఈ అవస్థలో లోటు కనిపిస్తుంది. దీనిని నింపాలి. ఎవరైతే మగ్న అవస్థలో ఉంటారో వారి నడత-నడవడికలో ఏమి కనిపిస్తుంది? అలౌకికత మరియు అతీంద్రియ సుఖము. మగ్న అవస్థలో ఉండేవారి ఈ గుణము ప్రతి నడవడిక ద్వారా తెలుస్తుంది. కనుక, ఈ లోటు ఏదైతే ఉందో దానిని నింపే తీవ్ర పురుషార్థం చేయండి. పురుషార్థీలుగా అయితే ఉన్నారు. అందుకే ఇక్కడకు చేరుకున్నారు. కానీ ఇప్పుడు పురుషార్థీగా అయ్యే సమయము కాదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయము. తీవ్ర పురుషార్థిగా అవ్వాలి, పురుషార్థిగా అయితే ఏమవుతుంది? గమ్యానికి దూరంగా ఉండిపోతారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం జరుగుతుంది. ఈ లాభాన్ని ఎంత కావాలంటే అంత పొందుతున్నారా లేదా అన్నది అందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. అందుకే మీ వద్ద ప్రతి సమయము దర్పణమును పెట్టుకోండి, మీలోని లోటు వెంటనే తెలిసిపోతుంది, అప్పుడు మీ పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండవచ్చు అని చెప్పాము.
అచ్ఛా, ఈరోజు కుమారీలకు సేవా తిలకమును పెట్టే రోజు. ఎలా అయితే మీ మ్యూజియంలో పట్టాభిషేకం చిత్రం చూపించారు కదా, మరి మీ సేవా తిలకము రోజున ఎంత పెద్ద సభ ఉందో చూడండి. అంత సంతోషం ఉంటుందా? ఎంతగా అందరి ముందు తిలకాన్ని పెట్టించుకుంటున్నారో అంతగా అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు అన్నది గుర్తుంచుకోండి. అందరి మధ్యన తిలకము పెట్టడం జరుగుతుంది. ఇది మర్చిపోకండి. ఇంతటి ధైర్యవంతులుగా అవ్వండి. ఈ తిలకం యొక్క పరువును నిలబెట్టాలి. తిలకము యొక్క పరువు అంటే బ్రాహ్మణ కులపు పరువు. బ్రాహ్మణ కుల మర్యాదలు ఏమిటో వినిపించాము కదా. ఇటువంటి పురుషోత్తములుగా ధైర్యాన్ని ఎవరైతే ఉంచుతారో వారు తిలకాన్ని పెట్టించుకోవచ్చు. ఈ తిలకము సాధారణమైనది కాదు. అక్కడ కూడా ఇంత సభను చూస్తారు. కన్యల సేవా తిలకము సందర్భంగా ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారు! సేవ చేసేవారు ఒక విశేష గుణంపై అటెన్షన్ ఉంచాల్సి ఉంటుంది. స్థితి ఎలా ఉన్నాకానీ మీ స్థితిని ఏకరసంగా ఉంచుకునే విషయంపై ఆల్‌రౌండ్ సేవ చేసేవారు విశేషంగా అటెన్షన్‌ను ఉంచండి. అప్పుడే ఆల్‌రౌండ్ సేవకు సఫలత లభిస్తుంది.
జరగబోయే కుమారీల రెండవ నంబరు ట్రైనింగ్ క్లాసు వారికి బాప్‌దాదా తిలకాన్ని పెట్టి నోరు తీపి చేసి ఇలా పలికారు -
ఈరోజు అందరితో నయనాల మిలనము జరిపాము. దూరంగా ఉన్నప్పటికీ యథా యోగ్యత యథా శక్తితో బాప్‌దాదాకు సమీపంగా ఉన్నారు. ఎంత దూరంగా కూర్చున్నప్పటికీ తమ స్నేహముతో బాప్‌దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. అందుకనే కనుపాపలు అన్నాము. కనుపాపలతో ఈరోజు నయనాల మిలనము చేస్తున్నాము. ఒకరిని మించి మరొకరిపై అందరిపై ప్రేమ ఉంది. దూరం నుండే మిలనము చేసుకోవలసిన రోజు కూడా వస్తుంది అని సాకారంలో ఎప్పటికప్పుడు పిల్లలకు సూచన అయితే లభిస్తూనే ఉండినది. ఇప్పుడు ఆ సమయాన్ని చూస్తున్నాము. అందరికీ అనిపిస్తుంది, బాప్‌దాదాకు కూడా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ సమయం మారిపోయింది. సమయంతో పాటు ఆ మిలనపు సౌభాగ్యము కూడా ఇప్పుడు లేదు. కనుక ఇప్పుడు అవ్యక్త రూపంలోనే అందరినీ కలుస్తున్నాము. అచ్ఛా – అందరికీ నమస్తే మరియు వీడ్కోలు.
ఓంశాంతి