Search for a command to run...
18 Sept 1969
త్రినేత్రి, త్రికాలదర్శి మరియు త్రిలోకినాథునిగా అయ్యేందుకు యుక్తులు
18 September 1969 · తెలుగు
ఎవరిని చూస్తున్నారు? ఆకారాన్ని చూస్తున్నారా లేక అవ్యక్తాన్ని చూస్తున్నారా? ఒకవేళ మీదిగానీ లేక ఇతరుల ఆకృతినిగానీ చూడకుండా అవ్యక్తాన్ని చూస్తే ఆకర్షణమూర్తులుగా అవుతారు. ఒకవేళ ఆకృతిని చూస్తే ఆకర్షణమూర్తులుగా అవ్వరు. ఆకర్షణమూర్తులుగా అవ్వాలంటే ఆకృతిని చూడకండి. ఆకృతి లోపల ఉన్న ఆకర్షణీయ రూపాన్ని చూసినప్పుడే స్వయం మరియు ఇతరుల నుండి ఆకర్షణ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ అవ్యక్త సేవయే మిగిలి ఉంది. వ్యక్తంలోకి ఎందుకు వస్తున్నారు? దీని కారణం ఏమిటి? అవ్యక్తంగా అవ్వడం మంచిగా అనిపిస్తుంది, అయినాగానీ వ్యక్తంలోకి ఎందుకు వస్తున్నారు? వ్యక్తంలోకి వచ్చినప్పుడే వ్యర్థ సంకల్పాలు వస్తాయి, వ్యర్థ కర్మలు జరుగుతాయి, అలాంటప్పుడు వ్యక్తం నుండి అవ్యక్తంగా అవ్వడానికి ఎందుకు కష్టమనిపిస్తుంది? వ్యక్తంలోకి త్వరగా వచ్చేస్తున్నారు, అవ్యక్తంలో కష్టంగా నిలుస్తున్నారు. ఇందుకు కారణము ఏమిటి? (మర్చిపోతున్నాము) ఎందుకు మర్చిపోతున్నారు? దేహ అభిమానము ఎందుకు వస్తుంది? వ్యక్తంలో మరియు అవ్యక్తంలో ఉన్న తేడా గురించి మీకు తెలుసు, అనుభవం చేసారు, లాభనష్టాలు ఏమిటో కూడా తెలుసు. మీరు స్మృతిలో కూర్చున్నప్పుడు దేహ అభిమానం నుండి దేహి అభిమానంలోకి ఎలా స్థితులవుతారు? ఏమంటారు? విషయం చాలా సహజమైనది. మీరందరూ చెప్పినది కూడా పురుషార్థం విషయాలే. తెలిసి, ఒప్పుకుని కూడా దేహ అభిమానంలోకి రావడానికి కారణము – దేహ ఆకర్షణ ఉండటము. ఈ ఆకర్షణ నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా లాగే వస్తువు ఉంటే, దాని ఆకర్షణనుండి దూరంగా ఉండటానికి ఏమి చేస్తారు? అయస్కాంతము వైపుకు వద్దనుకున్నా వెళ్ళిపోతారు. మీరు ఎవరినైనా ఆ ఆకర్షణ నుండి దూరం చేయాలంటే ఏమి చేస్తారు? వద్దనుకున్నా ఆ వస్తువు యొక్క ఆకర్షణ వారికి ఉంది, మీరు వారిని ఆ ఆకర్షణ నుండి దూరం చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏమి చేస్తారు? వారినన్నా దూరంగా తీసుకువెళ్తారు లేక మధ్యలో ఆకర్షణ జరగకుండా ఏదైనా వస్తువును పెడతారు. ఈ రెండు విధాలుగా అవుతుంది, వారిని దూరంగానైనా పెట్టండి లేక రెండిటి మధ్య ఏదైనా వస్తువు పెట్టి వారిని దూరం చేస్తారు, ఇదే విధంగా దేహ అభిమానపు ఈ వ్యక్త భావము కూడా అయస్కాంతము వలె వద్దన్నాగానీ దానివైపుకు లాగుతుంది. మధ్యలో ఏమి పెడతారు? స్వయాన్ని తెలుసుకోవడానికి అవసరమైనది ఏమిటి, స్వయం మరియు సర్వశక్తిమంతుడైన బాబాను పూర్తిగా తెలుసుకోవడానికి అవసరమైనది ఏమిటి? ఒకటే పదము. స్వయాన్ని మరియు సర్వశక్తిమంతుడిని పూర్తిగా తెలుసుకోవడానికి సంయమనము (నియమము) కావాలి. ఎప్పుడైతే సంయమనాన్ని మర్చిపోతారో అప్పుడు స్వయాన్ని మరియు సర్వశక్తిమంతుడిని కూడా మర్చిపోతారు. నిర్లక్ష్యపు సంస్కారాలు కూడా ఎందుకు వస్తాయి? ఏదో ఒక నియమాన్ని మర్చిపోయినప్పుడు. కనుక సంయమనము స్వయాన్ని మరియు సర్వశక్తిమంతుడిని సమీపంగా తెస్తుంది. సంయమనంలో లోటు ఉంటే స్వయం మరియు సర్వశక్తిమంతుని మిలనంలో కూడా లోటు ఉంటుంది. కనుక, మధ్యలో పెట్టవలసినది సంయమనము. ఏదో ఒక నియమాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ స్మృతి కూడా దూరమవుతుంది. సంయమనము సరిగ్గా ఉంటే స్వ స్థితి కూడా మంచిగా ఉంటుంది, స్వ స్థితి మంచిగా ఉన్నప్పుడు ఇతర అన్ని విషయాలు సరిగ్గా ఉంటాయి. ఈ దైహిక ఆకర్షణ పదే పదే దాని వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. మధ్యలో ఒకవేళ ఈ సంయమనాన్ని పెట్టినట్లయితే దైహిక ఆకర్షణ ఆకర్షించదు. ఇందుకోసం మూడు విషయాలపై శ్రద్ధ పెట్టండి. ఒకటి స్వయం యొక్క స్మృతి, రెండు సంయమనము మరియు మూడు సమయము. ఈ మూడు విషయాలను గుర్తుంచుకున్నట్లయితే ఎలా అవుతారు? త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకినాథ్. సంగమయుగంలో మీకున్న అన్ని టైటిళ్ళు లభించేస్తాయి. స్వయాన్ని తెలుసుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు మధ్యలోకి వచ్చేస్తారు. కనుక ఈ మూడు విషయాలపై శ్రద్ధ పెట్టండి.
ఏదైనా చిత్రాన్ని చూసినప్పుడు (చిత్రము అనగా శరీరము) చిత్రాన్ని చూడకండి. చిత్రం లోపల ఉన్న చైతన్యాన్ని చూడండి. ఆ చిత్రం యొక్క చరిత్రను చూడండి. చైతన్యము మరియు చరిత్రను చూసినట్లయితే చరిత్ర వైపు శ్రద్ధ వెళ్తుంది కనుక చిత్రము నుండి అనగా దేహ భానము నుండి దూరమవుతారు. ఒక్కొక్కరిలో ఏదో ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణ కుల భూషణులే చరిత్రవంతులు. కేవలం ఒక్క బాబాకే చరిత్ర ఉందని కాదు. బాబాకు సహయోగులైన అందరి నడవడిక చరిత్రయే. కనుక చరిత్రను చూడండి మరియు చైతన్యాన్ని, విచిత్రాన్ని చూడండి. విచిత్రము మరియు చరిత్ర అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ రెండు విషయాలను చూసినట్లయితే, వద్దనుకున్నా ఆకర్షించే దేహ అభిమానము దూరమవుతుంది. వర్తమాన సమయంలో ఈ ముఖ్య పురుషార్థమునే చేయాలి. మేము మారిపోయాము అని మీరు అంటారు కదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మారిపోవాలి. ఇంకా పాత సంస్కారాలు, పాత విషయాలు ఎందుకు? స్వయాన్ని మార్చుకోవడానికి ముందుగా ఈ భావము ఏదైతే ఉందో దానిని మార్చుకుంటే అన్ని విషయాలు మారిపోతాయి. ఆసక్తిలోకి వచ్చేస్తున్నారు కదా. ఆసక్తికి బదులు స్వయాన్ని శక్తిగా భావిస్తే ఆసక్తి సమాప్తమవుతుంది. శక్తి అని భావించనందువలన అనేక రకాల ఆసక్తులు వస్తున్నాయి. దేహము, దైహిక పదార్థాలు ఇటువంటి ఏ ఆసక్తి అయినా ఉత్పన్నమైతే, ఆ సమయంలో నేను శక్తిని అని గుర్తుంచుకోండి. శక్తిలో ఆసక్తి ఉంటుందా? ఆసక్తి కారణంగా ఆ స్థితిలోకి రాలేకపోతున్నారు. కనుక ఆసక్తిని సమాప్తం చేయండి. ఇందుకోసం, నేను శక్తిని అని ఆలోచించండి.
మాతలకు విశేషంగా ఏ విఘ్నము వస్తుంది? (మోహము) మోహము ఎందుకు వస్తుంది? నాది అన్న భావన వలన మోహము వస్తుంది. కానీ మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? ఆరంభంలో మీరందరూ వచ్చినప్పుడు, మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? నేను మీవాడిని, నాదంతా మీదే అన్నారు. చేసిన మొదటి ప్రతిజ్ఞ ఇదే. నేను కూడా మీకే, నాదంతా కూడా మీదే. అలాంటప్పుడు నాది అన్నది ఎక్కడినుండి వచ్చింది? నీదిని నాదిలో కలిపేస్తున్నారు. దీనితో ఏమి రుజువు అవుతుంది? మొదటి ప్రతిజ్ఞనే మర్చిపోయారు. మొదటి ప్రతిజ్ఞలో అందరూ ఇదే చెప్పారు కదా – ఏది చెబితే అది చేస్తాము, ఏది తినిపిస్తే, ఎక్కడ కూర్చోబెడితే... ఈ ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని అవ్యక్త వతనంలో కూర్చోబెడతారు. మరి మీరు వ్యక్త వతనంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు. ప్రతిజ్ఞను సరిగ్గా నెరవేర్చలేదు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాము అని మాట ఇచ్చారు. వ్యక్త వతనంలో కూర్చోమని బాబా అయితే చెప్పలేదు. వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంలో ఉండండి అన్నారు. మొట్టమొదటి పాఠాన్నే మర్చిపోతే ఇక ట్రైనింగ్ ఏమి చేస్తారు? ట్రైనింగ్లో మొదటి పాఠాన్ని పక్కా చేయించండి. చేసిన ప్రతిజ్ఞను పూర్తి చేసి చూపిస్తాము అని గుర్తుంచుకోండి. ట్రైనింగులో వచ్చిన మాతలు, మీరందరూ సరెండరేనా? సరెండర్ అయినప్పుడు ఇక మోహము ఎక్కడినుండి వచ్చింది? ఏదైనా కాలి సమాప్తమైపోతే అందులో ఇంకేమైనా మిగులుతుందా? ఏమీ మిగలదు. ఒకవేళ ఏమైనా మిగిలితే, గురి తగిలింది కానీ సరిగ్గా కాలలేదని అర్థం. మరణించారుగానీ కాలిపోలేదు. రావణుడ్ని కూడా ముందు చంపుతారు, తర్వాత కాలుస్తారు. అంటే మరుజీవులుగా అయ్యారుగానీ కాలి పూర్తిగా బూడిద అవ్వడం ఏదైతే జరగాలో అది జరగలేదు. సరెండర్ అర్థము చాలా పెద్దది. నాది అంటూ ఏమీ లేదు. సరెండర్ అయితే తనువు-మనసు-ధనము అన్నీ అర్పణము. మనసును అర్పించినప్పుడు ఆ మనసులో మీ అనుసారమైన సంకల్పాలను ఎలా ఆలోచిస్తారు? తనువుతో వికర్మలను ఎలా చేయగలరు? ధనాన్ని కూడా వికల్పముగా అనగా వ్యర్థ కర్మలలో ఎలా వినియోగించగలరు? అంటే ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు అని దీనిబట్టి అర్థమవుతుంది. మీ తనువు, మనసు, ధనాన్ని ఇచ్చేసినప్పుడు, మనసులో ఏమి ఆలోచించాలి అన్నదానికి కూడా శ్రీమతము లభించింది, తనువుతో ఏమి చేయాలి అని కూడా మతము లభించింది, ధనముతో ఏమి చేయాలి అని కూడా తెలుసు. ఎవరికి ఇచ్చారో వారి మతం పైనే నడవాలి. మనసును ఇచ్చినవారి స్థితి ఎలా ఉంటుంది? మన్మనాభవ. వారి మనసు అక్కడే ఉంటుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఎవరైతే మన్మనాభవగా ఉంటారో వారిలో మోహము ఉండగలదా? మరి మోహజీతులుగా అవ్వడానికి మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. ట్రైనింగు నుండి వెళ్ళేటప్పుడు ఏ ముద్ర వేయించుకుని వెళ్ళాలి? (మోహజీతులు) ఒకవేళ మోహజీతులు అన్న ముద్ర పడితే నేరుగా పోస్టు చేరుకోవలసిన చోటుకు చేరుకుంటుంది. సరైన ముద్ర లేకపోతే పోస్టు కూడా చేరవలసిన స్థానానికి చేరదు. అందుకని ముద్ర తప్పకుండా వేయించుకోండి. ఈ మాతలదే తర్వాత సమర్పణ సమారోహము చేద్దాము. ముద్ర వేయించుకున్న వారినే అప్పుడు పిలుద్దాము. మోహజీతుల సమ్మేళనము చేద్దాము. కనుక త్వర త్వరగా తయారవ్వండి.
ఓంశాంతి