Search for a command to run...
31 Dec 1970
అమృతవేళ నుండి పరివర్తన శక్తిని ప్రయోగించడము
31 December 1970 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా వర్తమానము మరియు భవిష్యత్తు, రెండు కాలాలలోని రాజ్య అధికారులను అనగా విశ్వ కల్యాణకారి మరియు విశ్వ రాజ్య అధికారి ఈ రెండు రూపాలలో పిల్లలను చూస్తున్నారు. ఎంతెంతగా విశ్వ కల్యాణకారులుగా అవుతారో అంతంతగా విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. ఈ రెండు అధికారాలను పొందేందుకు విశేషంగా స్వ పరివర్తన శక్తి అవసరము. పరివర్తన శక్తిని అమృతవేళ నుండి రాత్రివరకు ఎలా కార్యములో పెట్టాలి అన్న విషయాన్ని ఆ రోజు కూడా వినిపించాము.
మొదటి పరివర్తన – కళ్ళు తెరవగానే నేను శరీరాన్ని కాను, ఆత్మను, ఇదే ఆది సమయపు ఆది పరివర్తనా సంకల్పము, ఈ ఆది సంకల్పముపైనే మొత్తము దినచర్య ఆధారపడి ఉంది. ఒకవేళ ఆది సంకల్పములో పరివర్తన లేనట్లయితే మొత్తము రోజంతటిలో స్వరాజ్యము మరియు విశ్వ కల్యాణములో సఫలమవ్వలేరు. ఆది సమయము నుండి పరివర్తనా శక్తిని కార్యములోకి తీసుకురండి. ఎలా అయితే సృష్టి ఆదిలో బ్రహ్మ నుండి దేవ ఆత్మ, సతోప్రధాన ఆత్మ పాత్రలోకి వస్తుందో, అలా ప్రతిరోజూ అమృతవేళ ఆదికాలము. ఈ ఆదికాల సమయములో లేవటంతోనే తండ్రితో మిలనము చేసేందుకు బ్రాహ్మణ ఆత్మ విచ్చేసారు అన్న మొదటి సంకల్పము స్మృతిలో ఉండాలి. ఈ సమర్థ సంకల్పమే శ్రేష్ఠ సంకల్పము, శ్రేష్ఠ వాక్కు, శ్రేష్ఠ కర్మకు ఆధారంగా అవుతుంది. మొదటి పరివర్తన - “నేను ఎవరిని!” ఈ పునాదియే పరివర్తనా శక్తికి ఆధారము. దీని తరువాత -
రెండవ పరివర్తన - “నేను ఎవరికి చెందిన వాడను” సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి! సర్వ ప్రాప్తులూ ఎవరి నుండి కలుగుతున్నాయి! మొదట దేహ పరివర్తన, తరువాత దేహ సంబంధాల పరివర్తన, తరువాత సంబంధాల ఆధారముతో ప్రాప్తుల పరివర్తన - ఈ పరివర్తననే సహజ స్మృతి అని అంటాము. కావున ఆదిలో పరివర్తనా శక్తి ఆధారముతో అధికారిగా అవ్వగలరు.
అమృతవేళ తరువాత మీ దేహానికి సంబంధించిన కార్యక్రమాలను చేస్తూ ఎటువంటి పరవర్తన అవసరము? దీనిద్వారా నిరంతర సహజయోగిగా అయిపోతారు. ఎల్లప్పుడూ – ‘నేను చైతన్య సర్వ శ్రేష్ఠ మూర్తిని, ఈ దేహము ఒక మందిరము, చైతన్య మూర్తికి ఈ దేహము చైతన్య మందిరము. మందిరాన్ని అలంకరిస్తున్నాను. ఈ మందిరము లోపల స్వయం బాప్‌దాదాకు ప్రియమైన మూర్తి విరాజమానమై ఉంది. ఈ మూర్తి యొక్క గుణాల మాలను స్వయంగా బాప్దాదానే స్మరిస్తారు. ఈ మూర్తిని స్వయంగా బాబానే మహిమ చేస్తారు. అటువంటి విశేష మూర్తికి చెందిన విశేష మందిరము.’ మూర్తి ఎంత విలువైనదిగా ఉంటుందో మూర్తి ఆధారంగా మందిరమునకు కూడా విలువ ఉంటుంది. మరి ఎటువంటి పరివర్తనను చెయ్యాలి? నా శరీరము కాదు, బాప్‌దాదా యొక్క విలువైన మూర్తి ఉన్న మందిరము ఇది. స్వయమే మూర్తి మరియు స్వయమే మందిరమునకు ట్రస్టీగా అయ్యి మందిరాన్ని అలంకరిస్తూ ఉండండి. ఈ పరివర్తనా సంకల్పము ఆధారముగానే మేరాపన్ అనగా దేహభానము పరివర్తన అయిపోతుంది. దీని తరువాత మీ ఈశ్వరీయ విద్యార్థి రూపము సదా స్మృతిలో ఉండాలి. ఇందులో విశేషంగా ఏ పరివర్తనా సంకల్పము కావాలి? దీని ద్వారా ప్రతి క్షణము యొక్క చదువు, ప్రతి అమూల్యమైన వాక్కుల ధారణతో ప్రతి క్షణము వర్తమానము మరియు భవిష్యత్తు, రెండూ శ్రేష్ఠ ప్రాలబ్ధముగా అయిపోతాయి. ఇందుకు కావలసిన పరివర్తనా సంకల్పము - నేను సాధారణ విద్యార్థిని కాను, ఇది సాధారణ చదువు కాదు, డైరెక్టుగా తండ్రే ప్రతిరోజూ దూరదేశము నుండి నన్ను చదివించటానికి వస్తారు. భగవంతుని మహావాక్యాలే నా చదువు. శ్రీ శ్రీ యొక్క శ్రీమతమే మా చదువు. ఈ చదువులోని ప్రతి మాట పదమాల సంపాదనను జమ చేయిస్తుంది. ఒకవేళ ఒక్క మాటనైనా కూడా ధారణ చెయ్యనట్లయితే అది ఒక్క మాటను మిస్ చెయ్యటం కాదు కానీ పదమాల సంపాదనను, అది కూడా అనేక జన్మల శ్రేష్ఠ ప్రాలబ్దము మరియు శ్రేష్ఠ పదవిని పొందటంలో లోటు ఉండటము. ఇటువంటి పరివర్తనా సంకల్పము - ‘భగవంతుడు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాము. నా కోసము తండ్రి టీచరుగా అయ్యి వచ్చారు. నేను ప్రియమైన స్పెషల్ స్టూడెంటును, కాబట్టి నాకోసము వచ్చారు.’ ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు వచ్చారు మరియు ఏమి చదివిస్తున్నారు? ఈ పరివర్తనా శ్రేష్ఠ సంకల్పము ప్రతిరోజూ క్లాసు సమయములో ధారణ చేసి చదవండి. సాధారణ క్లాసు కాదు, వినిపించే వ్యక్తిని చూడకండి. ఎవరి మాటాలను వారు మాట్లాడుతున్నారో వారిని చూడండి. వ్యక్తంలో ఉన్న అవ్యక్త తండ్రి మరియు నిరాకార తండ్రిని చూడండి. మరి ఏ పరివర్తనను చెయ్యాలి అన్నది అర్థమైందా? ముందుకు వెళ్ళండి - చదువు కూడా చదివారు - ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఇప్పుడు సేవా పాత్ర వచ్చింది. సేవలో ఏ విధమైన సేవ అయినా కావచ్చు, అది ప్రవృత్తికి చెందినదైనా, వ్యవహారమునకు చెందినదైనా, ఈశ్వరీయ సేవకు చెందినదైనా, ప్రవృత్తి లౌకిక సంబంధాలదైనా కావచ్చు, కర్మబంధనం ఆధారంగా సంబంధమున్నా గానీ ప్రవృత్తిలో సేవ చేస్తూ ఈ పరివర్తనా సంకల్పమును చెయ్యండి – మరుజీవ జన్మ కలిగింది అనగా లౌకిక కర్మ బంధనాలు సమాప్తమయ్యాయి. కర్మ బంధనంగా భావించి నడుచుకోకండి. కర్మబంధనము, కర్మబంధనము అని ఆలోచించటము, అనటము ద్వారానే బంధింపబడతారు. ఈ లౌకిక కర్మబంధన సంబంధాలు ఇప్పుడు మరుజీవ జన్మ కారణంగా శ్రీమతము ఆధారముతో సేవా సంబంధమునకు ఆధారముగా అయ్యాయి. కర్మ బంధనము కాదు, సేవా సంబంధము. సేవా సంబంధములో వెరైటీ ఆత్మలు అన్న జ్ఞానమును ధారణ చేస్తూ, సేవా సంబంధముగా భావించి నడుచుకున్నట్లయితే బంధనములో అలసిపోరు. అతి పాపాత్మలు, అతి అపకారి ఆత్మలు, కొంగలపై కూడా ద్వేషము రాకూడదు, విశ్వ కల్యాణకారి స్థితిలో స్థితులై దయాహృదయులై దయా భావనను ఉంచుతూ, సేవా సంబంధముగా భావిస్తూ సేవ చేసినట్లయితే, ఎంతటి హోప్లేస్ కేసుకు సేవ చేస్తారో అంతగా ప్రైజ్ (బహుమతి)కు అధికారిగా అవుతారు. ప్రసిద్ధి చెందిన విశ్వ కల్యాణకారులుగా కీర్తింపబడతారు. పీస్ మేకర్ (శాంతి స్థాపకుడు) ప్రైజ్‌ను తీసుకుంటారు. కావున ప్రవృత్తిలో కర్మబంధనకు బదులుగా, ఇది సేవా సంబంధము అన్న ఈ పరివర్తనా సంకల్పమును చెయ్యండి. కానీ సేవ చేస్తూ చేస్తూ అటాచ్మెంట్ (మోహము) లోకి రాకూడదు. ఒక్కోసారి డాక్టరు కూడా రోగి మోహంలోకి వచ్చేస్తాడు.
సేవా సంబంధము అనగా త్యాగము మరియు తపస్వీ రూపము. త్యాగము మరియు తపస్సే సత్యమైన సేవా లక్షణాలు. అలాగే వ్యవహారములో కూడా డైరెక్షన్ ప్రమాణంగా నిమిత్త మాత్రముగా శరీర నిర్వాహణ చెయ్యాలి, కానీ ముఖ్య ఆధారము ఆత్మ నిర్వహణ. శరీర నిర్వహణ చేస్తూ చేస్తూ ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు. వ్యవహారము చేస్తూ శరీర నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ, రెండింటి బ్యాలెన్సు ఉంచాలి. బ్యాలెన్సు లేకపోతే వ్యవహారము మాయాజాలమైపోతుంది. ఇటువంటి వలను ఎంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా చిక్కుకొనిపోతారు. ధనవృద్ధిని చేసుకుంటూ కూడా స్మృతి విధిని మర్చిపోకూడదు. స్మృతి విధి మరియు ధన వృద్ధి రెండూ కలిసి ఉండాలి. ధనవృద్ధి వెనుకపడి విధిని వదిలెయ్యకూడదు. లౌకిక స్థూల కర్మను కూడా కర్మయోగి స్టేజ్‌లోకి పరివర్తన చేసుకోవటము అని దీనిని అంటాము. కేవలం కర్మ చేసేవారు కాదు, కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము, యోగము అనగా పరమార్థము. పరమార్థము అనగా పరమపిత సేవార్థము చేస్తున్నారు. కావున వ్యవహారము మరియు పరమార్థము, రెండూ కలిసి ఉండాలి. శ్రీమతముపై నడిచే కర్మయోగులు అని వీరినే అంటాము. వ్యవహారము చేసే సమయములో ఏ పరివర్తనను తీసుకురావాలి? నేను కేవలము వ్యవహారినే కాదు, వ్యవహారిని మరియు పరమార్థిని అనగా ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవార్థము చేస్తున్నాను. వ్యవహారి మరియు పరమార్థి రెండు రూపాలూ కంబైండుగా ఉన్నాయి. ఈ పరివర్తనా సంకల్పము సదా స్మృతిలో ఉన్నట్లయితే మనస్సు మరియు తనువు డబల్ సంపాదన చేస్తూ ఉంటాయి. స్థూల ధనము కూడా వస్తూ ఉంటుంది మరియు మనస్సు ద్వారా అవినాశి ధనము కూడా జమ అవుతూ ఉంటుంది. ఒకే తనువు ద్వారా ఒకే సమయములో మనస్సు మరియు ధనముల డబల్ సంపాదన జరుగుతూ ఉంటుంది. నేను డబల్ సంపాదన చేసేవాడిని అని సదా గుర్తుండాలి. ఈ ఈశ్వరీయ సేవలో నిమిత్తమాత్రము యొక్క మంత్రము మరియు నేను చేసేవాడిని అన్న స్మృతి సంకల్పము సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకూడదు. అప్పుడు సేవలో సదా నిర్మాణమే నిర్మాణము జరుగుతుంది. అచ్ఛా ...
ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళేకొద్దీ అనేక రకాల వ్యక్తులు మరియు వైభవాలు, అనేక రకాల వస్తువులతో సంపర్కము ఉంటుంది. ఇందులో కూడా సదా వ్యక్తిలో వ్యక్త భావానికి బదులుగా ఆత్మిక భావమును ధారణ చెయ్యండి. వస్తువులు మరియు వైభవాలలో అనాసక్త భావమును ధారణ చేసినట్లయితే వైభవాలు మరియు వస్తువులు అనాసక్త వ్యక్తి ముందు దాసి రూపములో ఉంటాయి. ఆసక్తి భావము కలిగినవారి ముందు అయస్కాంతము వలె బంధించేవిగా ఉంటాయి. వదిలించుకోవాలన్నా కూడా వదలవు. కావున వ్యక్తి మరియు వైభవాలలో ఆత్మ భావము మరియు అనాసక్త భావముల పరివర్తనను చెయ్యండి.
ఇంకా ముందుకు వెళ్ళండి - పాత ప్రపంచానికి చెందిన ఏదైనా ఆకర్షించే దృశ్యమును చూసినప్పుడుగానీ, అల్పకాలిక సుఖాన్నిచ్చే సాధనమును ఉపయోగించినప్పుడుగానీ ఆ సాధనాలు లేక దృశ్యములను చూసి ఒక్కోసారి సాధనను మరిచి సాధనాలలోకి వచ్చేస్తారు. సాధనాలకు వశమవుతారు. సాధనాల ఆధారంతో సాధన చెయ్యడమంటే ఇసుక పునాదిపై భవనమును నిర్మిస్తున్నట్లుగా భావించండి. ఆ భవనము పరిస్థితి ఎలా ఉంటుంది? పదేపదే అలజడిలో ఊగుతూ ఉంటుంది. ఇక పడిపోతుందేమో అన్నట్లుగా దాని పరిస్థితి ఉంటుంది. కావున సాధనాలు వినాశి అయినవి మరియు సాధన అవినాశి అయినది అని పరివర్తన చేసుకోండి. వినాశి సాధనాల ఆధారముపై అవినాశి సాధన జరగజాలదు. సాధనాలు నిమిత్తమాత్రమైనవి, సాధన నిర్మాణమునకు ఆధారము. కావున సాధనాలకు మహత్వమును ఇవ్వకండి, సాధనకు మహత్వమునివ్వండి. నేను సిద్ధి స్వరూపమునే కానీ సాధనాల రూపమును కాను అనే ఎల్లప్పుడూ భావించండి. సాధన సిద్ధిని ప్రాప్తింప చేస్తుంది. సాధనాల ఆకర్షణలో సిద్ధి స్వరూపమును మర్చిపోకండి. ప్రతి లౌకిక వస్తువును చూస్తూ, లౌకిక విషయాలను వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లౌకికమును అలౌకికములోకి పరివర్తన చెయ్యండి, అనగా జ్ఞాన స్వరూపులై ప్రతి విషయము నుండి జ్ఞానమును తీసుకోండి. విషయాలలోకి వెళ్ళకండి, జ్ఞానములోకి వెళ్ళండి, ఏ పరివర్తనను చెయ్యాలి అన్నది అర్థమైందా మరి! అచ్ఛా...
ఇంకా ముందుకు వెళ్ళండి - ఇప్పుడు ఇంకేమి మిగిలింది! ఇప్పుడు నిద్రించడము ఉండిపోయింది. సోనా (నిద్రించటము) అనగా సోనా (బంగారు) ప్రపంచములో నిద్రించటము. నిద్రించటాన్ని కూడా పరివర్తన చెయ్యండి. పరుపుపై నిద్రించకండి, మరి ఎక్కడ నిద్రించాలి? బాబా స్మృతి అనే ఒడిలో నిద్రించాలి. ఫరిస్తాల ప్రపంచములో స్వప్నములో షికారు చెయ్యండి, ఇలా స్వప్నమును కూడా పరివర్తన చెయ్యండి మరియు నిద్రించటాన్ని కూడా పరివర్తన చెయ్యండి. ఆది నుండి అంతిమము వరకు పరివర్తనను చెయ్యండి. ఎలా పరివర్తన శక్తిని ఉపయోగించాలి అన్న విషయము అర్థమైందా?
ఈ క్రొత్త సంవత్సరానికి కానుక - పరివర్తనా శక్తి యొక్క కానుక. స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన, ఈ గిఫ్టు (బహుమతి) అనే లిఫ్టు ద్వారా విశ్వ పరివర్తనా సమయమును సమీపంగా తీసుకువస్తాము. క్రొత్త సంవత్సర శుభాకాంక్షలనైతే అందరూ ఇస్తారు, కానీ బాప్‌దాదా క్రొత్త సంవత్సరములో సదా తీవ్ర పురుషార్థిగా అయ్యే నవీనత యొక్క శుభాకాంక్షలను ముందుగానే ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరము, క్రొత్త సంస్కారము, క్రొత్త స్వభావము, క్రొత్త ఉల్లాస-ఉత్సాహాలు, విశ్వాన్ని క్రొత్తగా చేసే శ్రేష్ఠ సంకల్పము, సర్వులకు ముక్తి-జీవన్ముక్తిని వరదానముగా ఇచ్చే సదా శ్రేష్ఠ సంకల్పము - ఇటువంటి నవీనతకు శుభాకాంక్షలు, అభినందనలు. పాత సంస్కారాలు, పాత నడవడిక, పాత వ్యవహారము, పాతవాటికి వీడ్కోలు ఇస్తున్నందుకు అభినందనలు. అచ్ఛా!
ఇలా ప్రతి కర్మలో పరివర్తనా శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తనను చేసేవారికి, ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మనూ క్రొత్తదిగా అనగా గోల్డెన్ ఏజ్‌గా చేసుకునే శ్రేష్ఠులు అనగా సతోప్రధానంగా చేసుకునే వారికి, నూతన సంవత్సరములో స్వయములో మరియు విశ్వములో నూతన చమత్కారమును చూపించేవారికి, స్వయము పట్ల మరియు విశ్వము పట్ల దేనినైతే అసంభవముగా భావిస్తున్నారో ఆ అసంభవమును సహజముగా సంభవము చేసే ఇటువంటి సదా సఫలతామూర్త శ్రేష్ఠ సిద్ధి స్వరూప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
ఓంశాంతి