Search for a command to run...
23 Mar 1970
హోలీని సత్యంగా జరుపుకోవడం అంటే గతం గతః అని భావించడం
23 March 1970 · తెలుగు
బాప్‌దాదా ఏమి చూస్తున్నారు, మీరందరూ ఏమి చూస్తున్నారు? చూడటమైతే మీరూ చూస్తున్నారు, బాప్‌దాదా కూడా చూస్తున్నారు, కానీ మీరు ఏమి చూస్తున్నారు, బాప్‌దాదా ఏమి చూస్తున్నారు? తేడా ఉందా లేక ఒకటేనా? ఆత్మిక పిల్లలను చూస్తూ ఈరోజు విశేషంగా ఏ విషయాన్ని చూస్తున్నారు? ప్రతి నడవడికకు విశేషత ఉంటుంది కూడా. కనుక ఈరోజు మిలనంలో విశేషంగా ఏ విషయాన్ని చూస్తున్నారు? ఈరోజు ప్రత్యేకమైన విషయాన్ని చూస్తున్నారు, దానిని చూసి బాబా సంతోషిస్తున్నారు. బాప్‌దాదా ప్రతి ఒక్కరి పురుషార్థం యొక్క వేగాన్ని (స్పీడ్) మరియు స్థితి యొక్క ఉత్సాహాన్ని (స్పిరిట్) చూస్తున్నారు. ఎంతెంత ఉత్సాహం ఉంటుందో అంతంత వేగం ఉంటుంది. ఇది చూసి సంతోషిస్తున్నారు. వేగం తీవ్రంగా ఉన్నప్పుడు సేవలో సఫలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు హోలీని ఎలా జరుపుకున్నారు? (సూక్ష్మవతనంలో జరుపుకున్నాము) వతనంలో కూడా ఎలా జరుపుకున్నారు? కేవలం వతనంలోనే జరుపుకున్నారా లేక ఇక్కడ కూడా జరుపుకున్నారా? కేవలం అవ్యక్తరూపంలోనే జరుపుకున్నారా? హోలీ జరుపుకోవటం అంటే జరిగిందేదో జరిగిపోయింది అనే పాఠాన్ని ఈరోజు పక్కా చేసుకోవాలి, హోలీ జరుపుకోవటం అంటే ఇదే. మీరు కూడా హోలీ యొక్క అర్థం చెప్తారు కదా! హోలీ అంటే ఏ విషయైతే జరిగిపోయిందో, గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేయాలి. గతం గతః అని భావించి ముందుకు వెళ్ళటమే హోలీ జరుపుకోవటం అనగా హోలీ యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకురావాలి. ప్రతిరోజూ పురుషార్థాన్ని పెంచుకోవడానికి ఏదో ఒక విషయాన్ని ముందుకు తీసుకురావాలి. ఈ ప్రతిజ్ఞ చేయటమే హోలీ జరుపుకోవటం. గడిచిన విషయం చాలా పాతదిగా, ఏదో జన్మలోని విషయంగా అనిపించాలి. ఎప్పుడైతే ఈ విధమైన స్థితి తయారవుతుందో అప్పుడే పురుషార్థం యొక్క వేగం తీవ్రం అవుతుంది. పురుషార్ధం యొక్క వేగాన్ని ఢీలా చేసే ముఖ్యమైన విషయం ఇదే - జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం. తమ యొక్క జరిగిపోయిన విషయాల గురించి లేదా ఇతరుల యొక్క జరిగిపోయిన విషయాల గురించి చింతన చేయటం మరియు మనస్సులో పెట్టుకోవటం. ఒకటి - మనస్సులో పెట్టుకోవటం, రెండు - చింతనలోకి తీసుకురావటం. మనస్సులో కూడా పెట్టుకోకూడదు, చింతనలోకి కూడా రాకూడదు. మూడవది - వర్ణన చేయటం. మరి ఈ రోజు బాప్‌దాదా హోలీ జరుపుకునేందుకు వచ్చారు. హోలీ జరుపుకునేందుకే పిలిచారు కదా! కనుక ఈ రంగుని పక్కాగా వేసుకోవటమే హోలీ జరుపుకోవటం. హోలీ రోజున ఒకటి, రంగులు చల్లుకుంటారు, ఇంకా ఏమి చేస్తారు? ఒకరోజు ముందు కాలుస్తారు, మరుసటి రోజు జరుపుకుంటారు. కాల్చిన తర్వాత జరుపుకుంటారు. జరుపుకునేటప్పుడు మిఠాయి తింటారు. ఇక్కడ మీరు ఏ మిఠాయి తింటారు? ఏ రంగు వేసుకోవాలో చెప్పాము. ఇప్పుడు మిఠాయి ఎందుకు తింటున్నారు?
ఎప్పుడైతే ఈ రంగు అంటుకుంటుందో అప్పుడు మధురత అనే గుణం స్వతహాగానే వస్తుంది అని అర్థం. మీ యొక్క మరియు ఇతరుల యొక్క జరిగిపోయిన విషయాలను చూడకుండా ఉండటం ద్వారా సరళచిత్తులుగా అయిపోతారు. ఎవరైతే సరళచిత్తులుగా అవుతారో వారిలో ప్రత్యక్ష రూపంలో ఏ గుణం కనిపిస్తుంది? మధురత. వారి నయనాలలో మధురత, మాటలో మధురత మరియు వారి నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఈ రంగు ద్వారా మధురత వస్తుంది కావుననే మిఠాయి తినే నియమం ఉంది. హోలీ రోజు ఇంకేమి చేస్తారు? (మంగళ మిలనము) మంగళ మిలనము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మంగళ మిలనము ఎలా జరుపుకుంటారు? మధురత వచ్చిన తర్వాత ఏ మంగళ మిలనము జరుగుతుంది? సంస్కారాల మిలనము ఉంటుంది. రకరకాల సంస్కారాల కారణంగానే ఒకరికొకరు దూరమవుతారు. ఎప్పుడైతే ఈ రంగు వేసుకుంటారో, మధురత వస్తుందో అప్పుడు ఏ మిలనం జరుగుతుంది? మీరందరూ సమ్మేళనం చేసి వచ్చారు కదా! బాప్‌దాదా ఈ భట్టీ ఏదైతే పెట్టారో అది సంస్కార మిలనం కోసం పెట్టారు. ఈ సంస్కార మిలనం జరిగినప్పుడు, ఈ సమ్మేళనం జరిగినప్పుడు, అప్పుడు ఆ సమ్మేళనం యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. మీరు సమ్మేళనం చేశారు, బాప్‌దాదా సంస్కార మిలనం చేస్తున్నారు. కనుక ఈ సంస్కార మిలనానికి గుర్తే ఈ మంగళ మిలనము. బాప్‌దాదా మరియు పిల్లల మిలనమైతే జరుగుతుంది కాని అన్నింటికంటే అతి పెద్ద మిలనము ఈ సంస్కార మిలనము. ఎప్పుడైతే ఈ సంస్కార మిలనము జరుగుతుందో అప్పుడు జేజేలు వస్తాయి. దేవతలు అందరికీ సిద్ధిని ప్రసాదిస్తారు అన్న పేరుంది కదా. ఎవరైనా రిద్ధి సిద్దిని(సుఖసమృద్ధిని) పొందాలనుకుంటే ఎవరిని అడుగుతారు? రిద్ధి సిద్దిని ఇచ్చేవారు ఎవరు? దేవతలు. ఎప్పుడైతే పురుషార్ధం యొక్క విధి సంపూర్ణం అవుతుందో అప్పుడు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. ఎప్పుడూ సిద్ధిని పొందడానికి బాప్‌దాదా వద్దకు రారు, దేవతల వద్దకు వెళ్తారు.
దేవతలు స్వయం సిద్ధి స్వరూపులు. అందుకే ఇతరులకు రిద్ధి సిద్ధిని ఇవ్వగలరు. సంస్కార మిలనం జరిగినప్పుడే మీ పురుషార్థానికి కూడా సిద్ధి లభిస్తుంది. అందరికంటే ఎక్కువగా భక్తుల క్యూ ఎవరి వద్ద ఉంటుంది? (దేవతల వద్ద ఉంటుంది). హనుమంతుని మందిరంలో లేక దేవతల మందిరాలలో ఎక్కువ గుంపు ఉంటుంది అంటే దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది? సాకార రూపంలో కూడా క్యూ ఎవరు చూస్తారు? ప్రత్యక్షత తర్వాత వచ్చే క్యూ ఎవరు చూస్తారు? పిల్లలే చూస్తారు. బాప్‌దాదా గుప్తంగా ఉంటారు, పిల్లలే ప్రత్యక్షరూపంలో చూస్తారు. దీనికి స్మృతి చిహ్నంగానే ప్రత్యక్ష రూపంలో కూడా పిల్లల ముందే ఎక్కువ క్యూ ఉంటుంది. కానీ ఈ క్యూ ఎప్పుడు ఉంటుంది? సంస్కారాలు కలవటంలేదు అనే ఒక్క మాట తొలగిపోయినప్పుడే ఈ క్యూ వస్తుంది. ఈ భట్టిలో మరే ఇతర విషయాలను నేర్చుకోవలసిన అవసరం లేదు, అంతిమ సిద్ధి స్వరూపంగా అయ్యి చూపించండి. ఈ సంగఠన సంస్కారాల కలయిక కొరకు ఉంది. ఒక వస్తువును మరో వస్తువుతో కలపాలంటే ఏమి చేయాలి? ఒకదానికొకటి సమీపంగా తీసుకురావాలంటే వాటిని కలపవలసి ఉంటుంది. అదేవిధంగా సంస్కారాలను కలుపుకునేందుకు మనసులను కలపవలసి ఉంటుంది. మనసులు కలిస్తే సంస్కారాలు కూడా కలుస్తాయి. సంస్కారాలను కలుపుకోవాలంటే మర్చిపోవటం, తొలగించటం మరియు ఇముడ్చుకోవటం ఈ మూడు విషయాలు చేయాలి. కొన్ని తొలగించవలసి ఉంటుంది, కొన్ని మరిచిపోవలసి ఉంటుంది, కొన్ని ఇముడ్చుకోవలసి ఉంటుంది, అప్పుడే సంస్కారాలు కలుస్తాయి. అంతిమ సిద్ధి స్వరూపంగా అవ్వటం అంటే ఇదే. ఇప్పుడు అంతిమ స్థితిని సమీపంగా తీసుకురావాలి. ఒకరి విషయాలను ఒకరు స్వీకరించాలి మరియు గౌరవం ఇవ్వాలి. స్వీకరించడం మరియు గౌరవించడం ఈ రెండు విషయాలు వచ్చేస్తే సంపూర్ణత మరియు సఫలత రెండూ సమీపంగా వస్తాయి. కేవలం ఈ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టండి, రెండు విషయాలనూ సమీపంగా తీసుకురావాలి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడమే భవిష్య అధికారం తీసుకోవటం. ఇది ఎవరి భట్టీయో తెలుసా? ఈ భట్టీ పేరు ఏమిటి? మీకు తిలకానికి బదులు వేరేది ఇస్తాము. మిగిలినవారందరికీ తిలకం పెట్టాము. ఈ భట్టీలోని వారికి చిందీ (పెద్ద బొట్టు) పెట్టాలి. తిలకం చిన్నగా ఉంటుంది, చిందీ పెద్దగా ఉంటుంది. పెద్దరికానికి గుర్తు చిందీ. తిలకమైతే చిన్నవారు కూడా పెట్టుకుంటారు, కానీ చిందీ పెద్దవారు పెట్టుకుంటారు. ఎప్పటినుండైతే మీపై బాధ్యత పెట్టుకునే ధైర్యం పెట్టుకున్నారో అప్పటి నుండి చిందీ పెట్టుకున్నారని అర్థం. మరి తిలకం బాగుందా లేక చిందీనా? మీరందరూ సర్వుల శుభచింతకులు, సేవాధారులు అంటే శుభచింతకులు. ఈ శుభచింతకుల గ్రూపుకు గుర్తు – చిందీ, పేరు - శుభచింతకుల గ్రూపు.
మీరు శుభచింతకులుగా అవ్వటం ద్వారా అందరి చింతలు తొలగిపోతాయి. మీరు అందరి చింతలను తొలగించే శుభచింతకులు. మీ స్లోగన్ ఏమిటి? ఎలా అయితే వారు ఆత్మ సో పరమాత్మ అంటారు కదా, అలా ఈ గ్రూప్ యొక్క స్లోగన్ ఏమిటి? బాలక్ సో మాలిక్. ఇదే ఈ గ్రూప్ యొక్క స్లోగన్. ఇప్పుడు పేరు కూడా లభించింది, స్లోగన్ కూడా లభించింది, పని కూడా లభించింది. ఇక ఈ భట్టీలో ఏమి చేయాలి? సంస్కార మిలనం ఎలా జరుగుతుంది అనే విషయంపై క్లాసు చేయండి. ఈ భట్టీలో ఇదే అద్భుతం చేయాలి – ఒక్కరు, అనేకులను సంస్కారాలలో తమ సమానంగా తయారు చేయాలి. సంపూర్ణ సంస్కారాలు, మీ సంస్కారాలు కాదు. ఒక్కరు అనేకులను సంపూర్ణ సంస్కారాలు కలిగిన వారిగా తయారు చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది? సమాప్తి అవుతుంది. ఈ గ్రూప్ సమాప్తి చేసేవారు, అలాగే స్థాపన చేసేది కూడా ఈ గ్రూపే. వేటిని సమాప్తి చేయాలి, వేటిని పాలన చేయాలి మరియు వేటిని స్థాపన చేయాలి? ఈ మూడు విషయాలనే ఈ భట్టీలో స్పష్టం చేయాలి. అందువలన త్రిమూర్తి చిందీలను పెడుతున్నాము. స్థాపన, పాలన మరియు సమాప్తి అంటే వినాశనం.
ఏమేమి చేయాలి అనేది సరళ రీతిలో మరియు స్పష్టంగా వివరించండి, అవి ప్రత్యక్షరూపంలోకి రాగలగాలి, కేవలం వర్ణన వరకే కాదు, ప్రాక్టికల్‌గా రావాలి, ఇతరులతో కూడా చేయించగలగాలి – ఇటువంటి విషయాలను స్పష్టం చేయండి. కానీ బిందురూపంగా అయినప్పుడే ఈ మూడు కర్తవ్యాలు సఫలం చేయగలరు. అందువలనే మీ కర్తవ్యానికి గుర్తుగా ఈ చిందీని ఇస్తున్నాము - ఈ స్మృతిచిహ్నంలో స్మృతి, స్థితి, కర్తవ్యం మూడూ ఉన్నాయి. విశేషమైన గ్రూపులో విశేషమైన విషయాల ప్రస్తావన ఉంటుంది. మీరందరూ హోలీ జరుపుకోవడానికి వచ్చారా లేక ఈ గ్రూపుయొక్క సెరిమనీ (వేడుక)ను చూడటానికి వచ్చారా? మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే, ఎలా అయితే ఈ గ్రుపుకు సాకారంలో సమీపంగా వచ్చారో అలాగే సంబంధంలో కూడా సమీపంగా రావాలి. చూసేవారు కూడా తక్కువేమీ కాదు. చూసే ఆత్మలు కూడా శ్రేష్ఠమైనవారు మరియు సమీపంగా ఉన్నవారు. బాప్‌దాదా మనసుకు నచ్చిన రత్నాలు. ముందుగా ఎవరు వస్తారు? బాప్‌దాదా అందరినీ ఒకే వేగంలో చూస్తున్నారు. అందువలనే ఒకటి, రెండు అని నెంబర్ చెప్పలేకపోతున్నారు. ఈ సమయంలో అందరూ ఒక్కరి స్మృతిలో నంబర్ వన్‌గా ఉన్నారు.
మీరు కూడా స్పిరిట్ (ఉత్సాహం) మరియు స్పీడ్(వేగం)లో ఈ గ్రూపుకు సమీపంగా వచ్చినప్పుడు మీ వేడుక కూడా చేస్తాము (తర్వాత పెద్దక్కయ్యలందరికీ బాప్‌దాదా చిందీ పెట్టారు, ఆత్మిక సంభాషణ చేసారు)
దీదీ:- బాలకులే మాలికులు కావున సమానంగా సింహాసనంపై కూర్చోబెట్టడం జరిగింది (గద్దెపై). వ్యక్త రూపంలో అయితే ఈ వేడుకను చేస్తున్నాము కానీ అవ్యక్త రూపంలో ఇటువంటి వేడుక జరుగుతుందా? బాలకులను మాలికులుగా చేసాము, ఇప్పటినుండే సింహాసనాధికారులుగా చేస్తున్నాము. సాకారంలో ఉన్నది హృదయ సింహాసనం, ఇప్పుడు వచ్చినది సేవ యొక్క సింహాసనం, భవిష్యత్తులో వచ్చేది రాజ్య సింహాసనం. సంగమంలో సింహాసనాధికారులుగా ఇప్పుడు అవుతున్నారు. డ్రామాలో ఫిక్స్ అయిన పాత్ర ఎంతో రహస్యమయమైనది. దీనిని రోజురోజుకూ స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. స్నేహంకన్నా ఒక్కోసారి బాధ్యత మనల్ని బంధనంలో బంధిస్తుంది. స్నేహం ఎలా ఒక బంధనమో అలా కర్తవ్యం కూడా ఒక బంధనమే. ఇది కర్తవ్య బంధనం. కర్తవ్య బంధనంలో అవ్యక్త రూపంలో ఉన్నాము. స్నేహ బంధనంలో సాకార రూపంలో ఉండినాము.
కుమారకా దాదీ:- అవ్యక్తరూపం ద్వారా సింహాసనాధికారులుగా అవుతామని కలలో అయినా అనుకున్నారా? సింహాసనాధికారిగా ఎవరు అవుతారు? ఎవరైతే సదా నషాలో మరియు నిషానా (గురి) ఎక్యురేట్గా ఉన్నవారు. నషా మరియు నిషానా, యోగము మరియు జ్ఞానము. ఇటువంటి పిల్లలే మూడు సింహాసనాలకు అధికారులుగా అవుతారు. త్రిమూర్తి సింహాసనాలు కదా. ఒక సింహాసనానికి అధికారిగా అయితే మూడింటికీ అవుతారు. సింహాసనాధికారి పిల్లలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వీరు యోగ్యులైన పిల్లలు అని బాప్‌దాదాకు కూడా నషా కలుగుతుంది.
జానకీ దాదీ:- ఇప్పటివరకు వాణిమూర్తిగా అయ్యారు, తర్వాత సాక్షాత్కారమూర్తిగా అవుతారు. ఇప్పుడు వాణితో ఇతరులకు సాక్షాత్కారం జరుగుతుంది కానీ తర్వాత సైలెన్సు ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది. అలా అయినప్పుడు అందరి నోటి నుండి ఏమని వెలువడుతుంది? అందరూ పరమాత్ముని రూపాలే అన్న గాయనము సంగమయుగంలోనే ప్రాక్టికల్‌గా జరుగుతుంది. భక్తిమార్గంలో జరిగే విషయాలలో సంగమ విషయాలను కలిపేసారు. అంతిమంలో మీకు ఈ స్థితి వస్తుంది, అప్పుడు అందరిలో సాక్షాత్తూ బాప్‌దాదా మూర్తిని అనుభవం చేసుకుంటారు. వీరైతే సాక్షాత్తూ బాప్‌దాదా మూర్తిగా ఉన్నారు అని అందరి నోటినుండి వస్తుంది. సాక్షాత్ రూపంగా అయినప్పుడు సాక్షాత్కారం జరుగుతంది. చివరి సమయంలో అందరూ సాక్షాత్తు రూపాలుగా కనిపించడాన్ని భక్తిలో అందరిలో పరమాత్మ రూపం ఉంది అనేసారు. బాబా సమాన స్థితిని పరమాత్మ రూపం అనేసారు. ఈ విషయాలన్నీ ఇక్కడివే. మరి సాక్షాత్కారమూర్తులుగా అవ్వడానికి సాక్షాత్తూ బాప్‌దాదా సమానంగా అవ్వాలి. ఇప్పుడు ఏ చెకింగ్ చేసుకోవాలి? సమానత యొక్క చెకింగ్ చేసుకోవాలి, ఆ చెకింగ్ కాదు. అదైతే చిన్నతనం. ఇప్పుడు ఈ చెకింగ్ చేసుకోండి. ఎంతగా సమానతనో అంతగా స్వమానం లభిస్తుంది. సమానతతో మీ స్వమానము ఎలా ఉందో తెలుస్తుంది. సమానత ఎంత వచ్చింది, ఎక్కడ సమానతను తీసుకురావాలి, ఇదే చెకింగ్ చేసుకోవాలి మరియు చేయించాలి. ఇది కూడా టాపిక్. ఎవరిలో ఎంత సమానతను చూస్తారో అంతగా వారు సమీపంగా ఉన్నారని భావించండి. సమీప రత్నాల గుర్తు సమానత.
చంద్రమణి దాదీ:- మీరు సూర్యమణా లేక చంద్రమణా? చంద్రమణుల నివాస స్థానము ఎక్కడ, సూర్యమణుల నివాస స్థానము ఎక్కడ? మీరు ఏ మణి? (రెండూ) శక్తి రూపం కూడా మరియు శీతల రూపం కూడా. అందుకే సూర్యమణిని కూడా, చంద్రమణిని కూడా అంటున్నారు. ఇప్పుడు నాలెజ్ అయితే వచ్చింది కానీ స్థితి లేదు కదా. నాలెజ్‌తో లైట్ వస్తుంది. ఇప్పుడు మైట్ రాలేదు. లైట్ మరియు మైట్ రెండింటిలో ఏకరసంగా ఉంటే అప్పుడు నంబర్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇతరులకు కూడా నాలెజ్ అనే లైట్‌ను ఇవ్వగలుగుతున్నారు కానీ మైట్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే సఫలత కూడా అదే విధంగా లభిస్తుంది. అందరికీ లైట్ అనగా ప్రకాశం వస్తుంది అంటే వీరి జ్ఞానం ఏమిటి అని తెలుస్తుంది కానీ లైట్ యొక్క ప్రభావం తక్కువగా ఉంది, సగం కార్యం ఇంకా మిగిలి ఉంది. మైట్ ఇవ్వడంలో వీరు నంబర్ వన్ అవుతారు. కొందరి నంబర్ లైట్ ఇవ్వడంలో ముందుంది, కొందరి నంబర్ మైట్ ఇవ్వడంలో ముందుంది, కొందరు రెండింటిలో ఉన్నారు. మూడు క్వాలిటీవారున్నారు. (బాప్‌దాదా చిందీ పెడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు) సత్యయుగంలో సన్నాయిలు మ్రోగుతాయి. ఇప్పుడు చప్పట్లు మోగుతున్నాయి.
నిర్మలశాంత దాదీ:- తనువు రోగంపై విజయాన్ని పొందుతున్నారు. సంగమంలో కిరీటం, తిలకము, సింహాసనం మరియు సౌభాగ్య భాగ్యము అన్నీ లభించాయి. ఒకే సమయంలో సర్వ ప్రాప్తులు బాప్‌దాదా ఇస్తున్నారు. ఈ ఒక్క జన్మలో ఇచ్చినవి అనేక జన్మల వరకు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా అనేక జన్మల లెక్కాచారాలను ఒక్క జన్మలో తీర్చుకోవాలి. ఈ ఒక్క జన్మది అనేక జన్మలు ఉంటుంది. అదైతే అనేక జన్మలది ఒక్క జన్మలో సమాప్తమైపోతుంది, అనేక జన్మల లెక్కాచారాము ఒక్క జన్మలో సమాప్తమైన కారణంగా అప్పుడప్పుడూ అది ఫోర్సుగా రూపాన్ని ధరిస్తుంది. బాప్‌దాదా ఈ యుద్ధాన్ని చూస్తూ ఉంటారు. మీరు కూడా మీది మరియు ఇతరుల ఈ యుద్ధాన్ని చూస్తున్నారా? సాక్షిగా అయ్యి చూసినప్పుడు ఈ వ్యాధి మారి ఆటలా అవుతుంది. బాప్‌దాదా సాక్షిగా అయి చూస్తారు కూడా మరియు వారి సాహసానికి హర్షితులవుతారు కూడా. అలాగే సహయోగిగా కూడా ఉంటారు. అలసిపోవడం లేదు కదా! (లేదు) మీరు అలసట లేని బాబా సంతానము, మీరు కూడా నిర్విరామంగా, అవినాశిగా ఉండండి. ఇప్పుడేమి చేయాలో తెలుసా? ఇప్పుడు అంతిమంలో సాక్షాత్కారమూర్తిగా అవ్వాలి. ఎంత ఎక్కువగా సాక్షి అవస్థ ఉంటుందో అంతగా సాక్షాత్కారమూర్తిగా అవుతారని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ అంతిమ పురుషార్థం మిగిలి ఉంది. సాక్షాత్కారమూర్తిగా అయ్యి బాప్‌దాదా యొక్క సాక్షాత్కారము మరియు మీ సాక్షాత్కారమును చేయించండి.
శాంతమణి దాదీ:- శ్రేష్ఠతను తీసుకురావడానికి ముఖ్యమైన గుణం ఏమి కావాలి? ఎంతగా స్పష్టత ఉంటుందో అంతగా శ్రేష్ఠత వస్తుంది. ఎవరైతే స్పష్టంగా ఉంటారో వారు సరళంగా మరియు శ్రేష్ఠంగా ఉంటారు. స్పష్టత శ్రేష్ఠతకు సమీపంగా ఉంటుంది. ఎంతగా స్పష్టత ఉంటుందో అంతగా సఫలత కూడా ఉంటుంది. సఫలత ఇంత సమీపంగా తీసుకువస్తుంది. సమీప రత్నాల గుర్తు ఎలా తెలుస్తుంది? సమానతతో. బాప్‌దాదా యొక్క సంస్కారాల సమానతతో సమీపత తెలుస్తుంది. మరి సమానత సమీపతకు గుర్తు. ఆది రత్నము మీరు. ఆది సో అనాది. ఆది రత్నాలు, వారు అనాది గాయన యోగ్యులుగా అవుతారు. ఎందుకంటే ఆది దేవ్‌తో కలిసి సహయోగులుగా అయ్యారు. ఆది రత్నమే సృష్టి కర్తవ్యానికి ఆధారము.
రతన్మోహినీ దాదీ:- మీరు స్నేహియా సహయోగియా? (రెండూ) స్నేహి మరియు సహయోగి రెండూ సమానంగా ఉన్నాయి. ఎవరు ఎంత స్నేహిగా ఉంటారో అంతగా సహయోగిగా ఉంటారు. స్నేహి సహయోగి లేకుండా ఉండలేరు. ఎంతగా స్నేహియో అంతగా సహయోగి. అంతే శక్తిరూపం కూడా. స్నేహము, సహయోగము మరియు శక్తి మూడూ సమానంగా ఉన్నప్పుడు సమాప్తి జరుగుతుంది. ఈ సమయంలో డబల్ కిరీటధారులుగా ఉన్నారా లేక భవిష్యత్తులో అవుతారా? సంగమంలో డబల్ కిరీటధారులుగా ఉన్నారా? ఏ రెండు కిరీటాలు ఉన్నాయి? ఒకటి స్నేహము మరియు రెండు సేవ. సేవా కిరీటము అంటే బాధ్యతా కిరీటము. అది స్థూలమైనది, అది సూక్ష్మమైనది. స్నేహ కిరీటము సూక్ష్మమైనది. ఇక్కడ డబల్ కిరీటధారులైన వారు అక్కడ కూడా డబల్ కిరీటధారులుగా అవుతారు. బాప్‌దాదా డబల్ కిరీటాన్ని ఇస్తున్నారు. నంబరువారీ కిరీటాలైతే ఉంటాయి కదా. ఇక్కడ కూడా నంబరువారీ పురుషార్థం అనుసారంగా కిరీటధారులను చూస్తాము.
మనోహర్ దాదీ:- సాకారుని సమయంలో ఏదైనా అవ్యక్త ప్రోగ్రాము జరిగితే అలంకరించుకుని కూర్చునే వారు. ఈరోజు కూడా అలంకరింపబడిన చిత్రాలను చూస్తున్నారు. సర్వులకు స్నేహి మరియు సర్వులకు సహయోగిగా అవ్వడము – ఇది విశేషత. ఎవరైతే సర్వులకు సహయోగులుగా అవుతారో వారికి సర్వులనుండి స్నేహం కూడా లభిస్తుంది. సర్వులకు స్నేహిగా ఎవరు అవుతారు? సర్వస్వ త్యాగీలు. సర్వస్వ త్యాగీలు సర్వులకు స్నేహిగా మరియు సహయోగిగా అవుతారు. ఇటువంటి శ్రేష్ఠ సంకల్పాలు కలిగినవారు శ్రేష్ఠ పదవికి అధికారులుగా అవుతారు. సంకల్పంలో కూడా సర్వుల కళ్యాణ భావన ఉండాలి. కేవలం స్వయం కోసమే కాదు. అలాగే సర్వ ప్రాప్తులకు అధికారిగా అవుతారు. ఇటువంటి వారికి బాప్‌దాదా మరియు సర్వుల నుండి సత్కారము లభిస్తుంది. సత్కారము యొక్క అధికారాన్ని పొందడం ఇది కూడా చాలా పెద్ద విషయం. అచ్ఛా.