Search for a command to run...
18 Jan 2006
సంకల్పాలు, సమయము మరియు మాటల పొదుపు పథకం ద్వారా సఫలతా మహోత్సవాన్ని జరుపుకోండి, నిరాశలో ఉన్న ఆత్మలలో ఆశా దీపాన్ని వెలిగించండి
18 January 2006 · తెలుగు
ఈరోజు స్నేహము యొక్క రోజు. నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ సాగరునిలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహము సహయోగులుగా తయారుచేసేటువంటిది. స్నేహము అన్ని ఇతర ఆకర్షణల నుండి దూరం చేసేటువంటిది. స్నేహము యొక్క వరదానము పిల్లలైన మీ అందరి జన్మ యొక్క వరదానము. స్నేహములో పరివర్తన చేయించే శక్తి ఉంది. ఈ రోజున నలువైపులా రెండు రకాల పిల్లలను చూసాము. అందరూ లవ్లీ (ప్రియమైన) పిల్లలే కానీ ఒకరు లవ్లీ పిల్లలు, మరొకరు లవలీనమై ఉన్న పిల్లలు. లవలీనమై ఉన్న పిల్లలు ప్రతి సంకల్పములో, ప్రతి శ్వాసలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వతహాగానే తండ్రి సమానముగా సహజముగా ఉంటారు, ఎందుకని? పిల్లలకు తండ్రి సమర్థ భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. నేటి ఈ రోజును స్మృతి దివసము మరియు సమర్థ దివసము అని అంటారు, ఎందుకని? తండ్రి ఈ రోజున స్వయాన్ని బ్యాక్ బోన్ (వెన్నెముక)గా చేసుకున్నారు మరియు లవలీనమై ఉన్న పిల్లలను విశ్వమనే స్టేజ్‌పై ప్రత్యక్షము చేసారు. వ్యక్తములో పిల్లలను ప్రత్యక్షము చేసారు మరియు స్వయం అవ్యక్త రూపములో సహచరునిగా అయ్యారు.
నేటి ఈ స్మృతి సో సమర్థ దివసము నాడు బాప్‌దాదా పిల్లలను బాలక్ సో యజమానులుగా చేసి సర్వశక్తిమంతుడైన తండ్రిని మాస్టర్ సర్వశక్తిమంతులై ప్రత్యక్షము చేసే కార్యాన్ని పిల్లలకు ఇచ్చారు మరియు తండ్రి చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే యథా యోగము తథా శక్తితో పిల్లలందరూ తండ్రిని ప్రత్యక్షము చేసే కార్యములో అనగా విశ్వ కళ్యాణము చేసి విశ్వ పరివర్తన చేసే కార్యములో నిమగ్నులై ఉన్నారు. తండ్రి ద్వారా సర్వ శక్తుల వారసత్వము ఏదైతే లభించి ఉందో, దానిని స్వయం కొరకు మరియు విశ్వాత్మల కొరకు కార్యములో వినియోగిస్తున్నారు. బాప్‌దాదా కూడా ఇటువంటి మాస్టర్ సర్వశక్తిమంతులకు, తండ్రి సమానముగా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేటువంటి ఆల్‌రౌండ్ సేవాధారులకు, నిస్వార్థ సేవాధారులకు, అనంతమైన సేవాధారీ పిల్లలకు మనస్ఫూర్తిగా పదమా పదమాల రెట్లు అభినందనలను తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు. దేశములోని పిల్లలు కూడా తక్కువైనవారేమీ కారు మరియు విదేశాలలోని పిల్లలు కూడా తక్కువైనవారేమీ కారు. బాప్‌దాదా ఇటువంటి పిల్లలను మనసులోనే మహిమ కూడా చేస్తారు మరియు వాహ్ పిల్లలూ వాహ్! అని పాటను కూడా పాడుతారు. మీరందరూ వాహ్ వాహ్ పిల్లలు కదా! చేతులు ఊపుతున్నారు, చాలా మంచిది. బాప్‌దాదాకు పిల్లల విషయములో శుద్ధమైన గర్వము ఉంది - నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారీ రాజులే అని అనేటువంటి తండ్రి మొత్తము కల్పములో ఎవ్వరూ ఉండరు. మీరందరూ అయితే స్వరాజ్య అధికారీ రాజులే కదా! ప్రజలైతే కారు కదా! చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు - మేము భవిష్యత్తులో ఏమవుతామో ఆ చిత్రాన్ని మాకు చూపించండి అని అంటారు. బాప్‌దాదా ఏమంటారు? జగదాంబ తల్లి ప్రతి ఒక్కరికీ చిత్రాన్ని ఇచ్చేవారు, కనుక మాకు కూడా చిత్రాన్ని ఇవ్వండి అని పాత పిల్లలైతే అంటారు. బాప్‌దాదా అంటారు, పిల్లలు ప్రతి ఒక్కరికీ తండ్రి ఒక విచిత్ర దర్పణాన్ని ఇచ్చారు, ఆ దర్పణములో - నేను ఎవరిని అన్న మీ భవిష్య చిత్రాన్ని చూడగలరు. తెలుసా, ఆ దర్పణము మీ వద్ద ఉందా? అది ఏ దర్పణమో తెలుసా? మొదటి లైన్ వారికైతే తెలిసే ఉంటుంది కదా! తెలుసా? ఆ దర్పణము ఏమిటంటే - వర్తమాన సమయములోని స్వరాజ్య స్థితి యొక్క దర్పణము. వర్తమాన సమయములో ఎంతగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో, దాని అనుసారముగా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు దర్పణములో చూసుకోండి - స్వరాజ్య అధికారులుగా సదా ఉన్నారా? లేదా అప్పుడప్పుడు అధీనులుగా, అప్పుడప్పుడు అధికారులుగా ఉంటున్నారా? ఒకవేళ అప్పుడప్పుడు అధీనులుగా, అప్పుడప్పుడు అధికారులుగా అవుతున్నారంటే, ఒకసారి కళ్ళు మోసగిస్తాయి, ఒకసారి మనసు మోసగిస్తుంది, ఒకసారి నోరు మోసగిస్తుంది, ఒకసారి చెవులు కూడా మోసం చేసేస్తాయి, వ్యర్థమైన విషయాలను వినాలనే అభిరుచి కలుగుతుంది, ఇలా ఒకవేళ ఏ కర్మేంద్రియమైనా మోసం చేస్తుందంటే, పరవశులుగా(పరాధీనులుగా) చేస్తుందంటే, దాని బట్టి నిరూపణ అవుతుంది - తండ్రి ద్వారా సర్వ శక్తులు ఏవైతే వరదానముగా లభించాయో లేక వారసత్వముగా లభించాయో, ఆ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ లేవు అని ఋజువు అవుతుంది. కనుక ఆలోచించండి, ఎవరైతే స్వయముపైనే పరిపాలన చేయలేకపోతున్నారో, వారు విశ్వాన్ని ఎలా పరిపాలించగలరు! మీ వర్తమాన స్థితిని స్వరాజ్య అధికారీ దర్పణములో చెక్ చేసుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా? దర్పణము లభించింది అంటే చేతులు ఎత్తండి. దర్పణముపై ఏవైనా మరకలైతే పడలేదు కదా? దర్పణము స్పష్టముగా ఉందా?
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ స్వరాజ్య అధికారి అన్న స్వమానాన్ని ఇచ్చారు. మాస్టర్ సర్వశక్తిమంతులు అన్న టైటిల్ పిల్లలందరికీ తండ్రి ద్వారా లభించి ఉంది. మాస్టర్ శక్తిమంతులు కారు, సర్వశక్తిమంతులు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమంటూ ఉంటారంటే - బాబా, మీరైతే సర్వ శక్తులను ఇచ్చారు కానీ ఈ శక్తులు అప్పుడప్పుడు అవసరమైన సమయములో పని చెయ్యటం లేదు. అవి అవసరమైన సమయములో ఇమర్జ్ అవ్వటం లేదు, సమయము గడిచిపోయిన తర్వాత ఇమర్జ్ అవుతున్నాయి అని రిపోర్ట్ చేస్తారు. మరి కారణమేమిటి? ఏ సమయములో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ సమయములో చెక్ చేసుకోండి, నేను యజమాని అనే సీట్‌పై సెట్ అయ్యి ఉన్నానా? ఒకవేళ ఎవరైనా సీట్ పై సెట్ అయి లేకపోతే, సీట్ లేనివారి ఆర్డరును ఎవ్వరూ పాటించరు. నేను స్వరాజ్య అధికారిని, మాస్టర్ సర్వశక్తిమంతుడిని, తండ్రి ద్వారా వారసత్వానికి మరియు వరదానానికి అధికారిని, ఈ సీట్ పై సెట్ అయ్యి అప్పుడు ఆర్డర్ చేయండి. ఏం చేయను, ఎలా చేయను, అవ్వటం లేదు, సీట్ నుండి కిందకు దిగి, సీట్ నుండి కింద కూర్చుని ఆర్డరు చేస్తే, మరి ఎలా పాటిస్తాయి! ఈ కాలములో కూడా ఒకవేళ ఎవరైనా ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, వారు సీట్లో ఉంటే అందరూ పాటిస్తారు కానీ సీట్ నుండి దిగిపోయారు అంటే ఎవరైనా పాటిస్తారా? మరి చెక్ చేసుకోండి – సీట్‌పై సెట్ అయ్యి ఉన్నానా? అధికారిగా అయ్యి ఆర్డరు చేస్తున్నానా? తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరికీ అథారిటీని ఇచ్చారు, ఇది పరమాత్మ అథారిటీ, ఈ అథారిటీ ఆత్మ నుండి లభించినదేమీ కాదు, మహాత్ముల అథారిటీ లభించలేదు, ఇది పరమాత్మ అథారిటీ, కనుక అథారిటీ మరియు అధికారము అన్న ఈ స్థితిలో స్థితులై ఏ శక్తినైనా ఆర్డర్ చేయండి, అది జీ హజూర్, జీ హజూర్ (చిత్తం ప్రభూ) అని అంటుంది. సర్వ శక్తుల ముందు ఈ మాయ, ప్రకృతి, సంస్కారాలు, స్వభావము అన్నీ దాసీగా అయిపోతాయి. యజమాని, ఏదైనా ఆర్డరు చేయండి అని అవి యజమాని అయిన మీ కొరకు ఎదురుచూస్తాయి.
ఈ రోజు సమర్థ దివసము కదా, కావున పిల్లల్లో ఏయే సమర్థతలు ఉన్నాయి అన్నదానిని బాప్‌దాదా రివైజ్ చేయిస్తున్నారు. అండర్లైన్ చేయిస్తున్నారు. అవసరమైన సమయములో శక్తిహీనులుగా ఎందుకు అయిపోతారు? బాప్‌దాదా చూసారు, మెజారిటీ పిల్లలలో లీకేజ్ ఉంది, లీకేజ్ అవుతున్న కారణముగా శక్తులు తక్కువైపోతున్నాయి మరియు లీకేజ్ అనేది విశేషముగా రెండు విషయాలలో ఉంది - ఆ రెండు విషయాలు ఏమిటంటే - సంకల్పాలు మరియు సమయము వ్యర్థముగా పోతున్నాయి. చెడు ఉండదు కానీ వ్యర్థము ఉంటుంది. సమయానికి చెడు కార్యాన్ని చెయ్యరు కానీ అలాగని జమ కూడా చేసుకోవడం లేదు. ఈ రోజు చెడు ఏమీ చేయలేదు కదా అని చూసుకుంటారే కానీ మంచి ఏం జమ చేసుకున్నాను? పోగొట్టుకోలేదు కానీ సంపాదించుకున్నానా? దుఃఖాన్ని ఇవ్వలేదు కానీ ఎంతమందికి సుఖాన్ని ఇచ్చాను? ఎవరినీ అశాంతపరచలేదు కానీ శాంతి వైబ్రేషన్లను ఎంతవరకు వ్యాపింపజేసాను? శాంతిదూతగా అయి వాయుమండలము ద్వారా లేక నోటి ద్వారా లేక వైబ్రేషన్ల ద్వారా శాంతిని ఎంతమందికి ఇచ్చాను? ఎందుకంటే ఈ కొద్ది సమయమే పురుషోత్తమ కళ్యాణకారీ సమయమని, జమ చేసుకునే సమయమని మీకు తెలుసు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ ఉండదు, ఇది ప్రతి ఘడియ గుర్తుండాలి. అయిపోతుందిలే, చేసేస్తాములే... ఇలా కాదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. బ్రహ్మా బాబా యొక్క తీవ్రగతితో కూడిన పురుషార్థము ఇదే, అందుకే నంబర్ వన్ అనే గమ్యాన్ని చేరుకున్నారు. కావున తండ్రి ఏవైతే సమర్థతలను ఇచ్చారో, అవి ఈ సమర్థ దివసము రోజున గుర్తుకొచ్చాయి కదా! పొదుపు స్కీమ్‌ను(పథకాన్ని) తయారుచెయ్యండి. సంకల్పాల పొదుపు, సమయము యొక్క పొదుపు, వాణి యొక్క పొదుపు, ఏవైతే యథార్థమైన మాటలు కావో, ఆ అయథార్థమైన, వ్యర్థమైన మాటల యొక్క పొదుపు చేయాలి.
బాప్‌దాదా పిల్లలందరినీ సదా అథారిటీ యొక్క సీట్‌పై సెట్ అయినటువంటి స్వరాజ్య అధికారీ రాజా రూపములో చూడాలనుకుంటున్నారు. ఇష్టమేనా? ఈ రూపము ఇష్టమే కదా! ఎప్పుడైనా బాప్‌దాదా ఏ పిల్లలనైనా టి.వి.లో చూస్తే, అప్పుడు ఈ రూపమే చూడాలి. బాప్‌దాదా వద్ద నేచురల్ టి.వి. ఉంది, స్విచ్ ఆన్ చేయవలసిన అవసరముండదు. ఒకే సమయములో నలువైపులా చూడగలరు. ప్రతి ఒక్క బిడ్డను, మూలమూలల్లో ఉన్నవారిని చూడగలరు. మరి వీలవుతుందా? రేపటి నుండి. టి.వి. చూస్తే ఎలా కనిపిస్తారు? ఫరిశ్తా డ్రెస్‌లో. ఫరిశ్తాల డ్రెస్ అంటే మెరుస్తున్న లైట్ యొక్క డ్రెస్. ఈ శరీర భానము యొక్క మట్టితో కూడిన డ్రెస్‌ను వేసుకోకండి. మెరుస్తున్న డ్రెస్ ఉండాలి, సఫలతా సితారగా ఉండాలి, ప్రతి ఒక్కరినీ ఇటువంటి మూర్తిగా బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. ఇష్టమే కదా! మట్టితో కూడిన డ్రెస్‌ను ధరిస్తే మట్టికి చెందినవారిగానే అయిపోతారు కదా! తండ్రి అశరీరిగా ఉన్నారు, బ్రహ్మా బాబా మెరిసే డ్రెస్‌లో ఉన్నారు, ఫరిశ్తాగా ఉన్నారు. కనుక తండ్రిని అనుసరించండి. స్థూలముగా చూడండి, మీ డ్రెస్‌కు ఏదైనా మట్టి అంటుకుంటే, మరకలు ఏర్పడితే అప్పుడు ఏం చేస్తారు? మార్చేసుకుంటారు కదా! అలాగే చెక్ చేసుకోండి - సదా మెరుస్తూ ఉన్న ఫరిశ్తా డ్రెస్ ఉందా? పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని తండ్రికి ఏదైతే శుద్ధ నషా ఉందో, ఆ స్వరూపములోనే ఉండండి. రాజాగా అయ్యి ఉండండి. అప్పుడు ఈ మాయ మీకు దాసిగా అయిపోతుంది మరియు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది, అర్థకల్పము కొరకు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది, దాడి చెయ్యదు. బాప్‌దాదా సదా అంటుంటారు - తండ్రిపై బలిహారమయ్యేవారు ఎప్పుడూ ఓడిపోలేరు. ఒకవేళ ఓటమి జరిగింది అంటే బలిహారమవ్వలేదు అని అర్థము.
ఇప్పుడు మీ అందరిదీ మీటింగ్ జరగబోతుంది కదా, మీటింగ్ డేట్ ఫిక్స్ అవుతుంది కదా. మరి ఈ సారి బాప్‌దాదా కేవలం సేవా ప్లాన్ల యొక్క మీటింగ్‌ను మాత్రమే చూడాలనుకోవటం లేదు, సేవా ప్లాన్లను కూడా తయారుచేయండి కానీ మీటింగ్‌లో సఫలతా మహోత్సవానికి ప్లాన్ తయారుచేయండి. చాలా మహోత్సవాలను జరుపుకున్నారు, ఇప్పుడు సఫలతా మహోత్సవానికి డేట్‌ను ఫిక్స్ చేయండి. అలా అందరూ ఎలా తయారైపోతారు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. బాప్‌దాదా అంటారు, కనీసం 108 రత్నాలైతే సఫలతామూర్త్ యొక్క మహోత్సవాన్ని జరుపుకోవాలి. ఉదాహరణగా అవ్వాలి. ఇది వీలవుతుందా? చెప్పండి, మొదటి లైన్ వారు చెప్పండి, వీలవుతుందా? జవాబు చెప్పే ధైర్యము చేయడం లేదు. చేస్తామో లేదో తెలియదు అని ఆలోచిస్తున్నారు. ధైర్యముతో అన్నీ సంభవమవుతాయి. దాదీ, చెప్పండి - 108 మంది సఫలతామూర్తులు తయారవ్వగలరా? (తప్పకుండా తయారవ్వగలరు, సఫలతా మహోత్సవము వీలవుతుంది). చూడండి, దాదీలో ధైర్యము ఉంది. మీ అందరి తరఫు నుండి ధైర్యాన్ని పెడుతున్నారు కనుక సహయోగులుగా అవ్వండి. మరి ఈ మీటింగ్ ఏదైతే జరగబోతుంది కదా, అందులో బాప్‌దాదా రిపోర్ట్ తీసుకుంటారు. పాండవులూ, చెప్పండి కదా, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకని మౌనంగా ఉన్నారు? ఈ ధైర్యాన్ని ఎందుకని పెట్టరు? చేసి చూపిస్తారా? అలానా? మంచిది, ధైర్యమైతే ఉంచుకోగలరు కదా? మేమైతే ధైర్యము ఉంచే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేస్తారా? ఏ సంస్కారము ఉండిపోదు కదా? ఏ బలహీనతా ఉండిపోదు కదా? మంచిది, మధుబన్ వారు కూడా చేతులెత్తుతున్నారు. వాహ్! అభినందనలు, అభినందనలు. మంచిది, 108 మందైతే ఇక సహజముగా తయారైపోతారు. ఇంతమంది చేతులెత్తారు అంటే ఇక 108 మంది అనేది ఏమంత పెద్ద విషయము. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? అయితే, జానకి దాదీ వింటున్నారు, నేను మాట్లాడాలి అని వారికి ఉల్లాసము కలుగుతూ ఉంది. విదేశీయుల మాలను కూడా చూస్తాము, సరేనా? చేతులెత్తండి, సరేనా? మంచిది, ఈ రోజు వీళ్ళు (డబల్ విదేశీయులు) ఎంతమంది కూర్చుని ఉన్నారు? (200 మంది). వీరిలో నుండి 108 మంది అయితే తయారైపోతారు! సరే కదా! ఈ విషయములో ‘మొదట నేను’ అని అనుకోవాలి. ఈ విషయములో ఇతరులను చూడకండి, మొదట నేను. వేరే విషయాలలో నేను, నేను అని అనకండి, కానీ ఇందులో నేను అని తప్పకుండా అనండి. బాప్‌దాదా ఇంకా వేరే పని కూడా ఇస్తున్నారు.
ఈరోజు సమర్థ దివసము కదా, అంటే సమర్థత ఉంది. బాప్‌దాదా ఒక విచిత్రమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. మీరైతే దీపావళిని చాలా సార్లు జరుపుకున్నారు కానీ బాప్‌దాదా విచిత్రమైన దీపావళిని జరపాలని అనుకుంటున్నారు, వినిపించాలా? మంచిది. వర్తమాన సమయాన్ని అయితే చూస్తూనే ఉన్నారు, రోజురోజుకు నలువైపులా ఉన్న మనుష్యాత్మలలో నిరాశ ఎంతగానో పెరుగుతూ ఉంది. కనుక మనసా సేవ అయినా చెయ్యండి, వాచా అయినా చెయ్యండి, సంబంధ-సంపర్కములోనివారి సేవ అయినా చెయ్యండి, కానీ బాప్‌దాదా నిరాశకు లోనై ఉన్న మనుష్యులలో ఆశా దీపాలను వెలిగించాలని కోరుకుంటున్నారు. నలువైపులా మనుష్యాత్మల మనసులలో ఆశా దీపాలు వెలగాలి. ఈ ఆశాదీపాల దీపావళిని బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. వీలవుతుందా? వాయుమండలములో కనీసం ఈ ఆశా దీపాలు వెలగాలి అప్పుడిక విశ్వ పరివర్తన జరిగిపోయినట్లే, స్వర్ణిమ ప్రభాతము వచ్చేసినట్లే. ఏమీ జరగదు, ఏమీ జరగదు అన్న ఈ నిరాశ సమాప్తమైపోవాలి. ఆశా దీపాలు వెలగాలి. చెయ్యగలరు కదా. ఇదైతే సహజమే కదా లేక కష్టమా? సహజమేనా? ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. చేస్తారా? ఇంతమంది అందరూ దీపాలను వెలిగిస్తే దీపావళి అయితే జరిగిపోతుంది కదా! వైబ్రేషన్లను ఎంతటి శక్తిశాలిగా చేసుకోండి అంటే, వాళ్ళకు ఎదురుగా చేరుకోలేకపోవచ్చు కానీ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయ్యి దూరాల వరకు వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యండి. సైన్స్ అనేది లైట్ హౌస్ ద్వారా దూరాల వరకు లైట్‌ను ఇవ్వగలిగినప్పుడు మరి మీరు వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యలేరా! చెయ్యాల్సిందే అని కేవలం దృఢ సంకల్పాన్ని చెయ్యండి. బిజీ అయిపోండి. మనసును బిజీ పెట్టుకుంటే స్వయానికి కూడా లాభము మరియు ఆత్మలకు కూడా లాభము జరుగుతుంది. విశ్వ కళ్యాణము చెయ్యాల్సిందే అని నడుస్తూ-తిరుగుతూ దీనినే వృత్తిలో పెట్టుకోండి. ఈ వృత్తి వాయుమండలాన్ని వ్యాపింపజేస్తుంది ఎందుకంటే సమయము అనేది అకస్మాత్తుగా వస్తుంది. మీరు మాకు ఎందుకు చెప్పలేదు అని మీ సోదరసోదరీలు ఫిర్యాదు చేసే విధంగా జరగకూడదు! కొందరు పిల్లలు, అంతిమ సమయానికల్లా చేసేస్తాము అని అనుకుంటారు, కానీ అంతిమముకల్లా చేసినా కూడా మీపై ఫిర్యాదు చేస్తారు. మాకు కొద్ది సమయం ముందు చెప్పుంటే ఎంతోకొంత తయారుచేసుకునేవాళ్ళము కదా అని ఈ ఫిర్యాదు చెస్తారు, అందుకే ప్రతి సంకల్పములో బాప్‌దాదా స్మృతి ద్వారా లైట్‌ను తీసుకుంటూ ఉండండి, లైట్ హౌస్‌గా అయ్యి లైట్‌ను ఇస్తూ ఉండండి. సమయాన్ని వృధా చేయకండి. చాలా యుద్ధము చేస్తున్నారు అన్నది బాప్‌దాదా చూసినప్పుడు, బాప్‌దాదాకు మంచిగా అనిపించదు. మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు, మరి యుద్ధము చేస్తున్నారా! కనుక రాజుగా అవ్వండి, సఫలతామూర్తులుగా అవ్వండి, నిరాశను సమాప్తము చేసి ఆశాదీపాలను వెలిగించండి. అచ్ఛా!
అన్ని వైపుల నుండి పిల్లల స్నేహపూర్వకమైన స్మృతి యొక్క మాలలైతే ఎన్నో చేరుకున్నాయి. స్మృతులను పంపినవారిని బాప్‌దాదా సమ్ముఖముగా చూస్తూ స్మృతికి జవాబుగా మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలను, మనస్ఫూర్వకమైన ప్రేమను ఇస్తున్నాము. అచ్ఛా.
సేవ టర్న్ కర్ణాటక వారిది, కర్ణాటక వారు 5 మెగా ప్రోగ్రాములు చేసారు:- అచ్ఛా, చాలామంది వచ్చారు. మంచిది, మెగా ప్రోగ్రాములు చేసారు, అభినందనలు. కానీ ప్రతి మెగా ప్రోగ్రాము నుండి ఎంతమంది విద్యార్థులు తయారయ్యారు అన్న రిజల్ట్‌ను తయారు చేసారా? ఎందుకంటే సందేశాన్ని ఇవ్వడానికి మెగా ప్రోగ్రాము బాగుంటుంది, ఫిర్యాదు లభించదు. ఒక పని అయితే మంచిగా అయింది. కానీ మెగా ప్రోగ్రాము తర్వాత అడ్రెసు అయితే ఉంటుంది కదా! ఏ ఆత్మల అడ్రెసు అయితే ఉంటుందో వారిని ఎప్పటికప్పుడు మీ సెంటరుకు పిలుస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి, ఎందుకంటే జోన్ స్థాయిలో ఇది వీలవ్వదు, వారికి దగ్గరలో ఉన్న సెంటర్లకు వారు వెళ్ళగలరు. అందులో నుండి వెలువడుతారు. కర్ణాటక సంఖ్య ఎక్కువగా ఉంది. బాగుంది. సేవ చేసారు కనుకనే సంఖ్య పెరిగింది కానీ ఇప్పుడు ఎటువంటి పుష్పగుచ్ఛాన్ని తయారు చేయండి అంటే మైక్ మరియు మైట్‌గా అయ్యి సందేశాన్ని ఇవ్వడంలో మీకు సహచరులుగా అవ్వాలి. ఇటువంటి గ్రూపును తయారు చేయండి. మెజారిటీ అన్ని పెద్ద పెద్ద జోన్లు మెగా ప్రోగ్రాములు చేసాయి, కానీ సందేశం ఇవ్వడంలో ఫలానావారు మైక్ అయ్యి సహయోగిగా అయ్యారు అన్న సమాచారమైతే ఇంకా రాలేదు. ఎందుకంటే విశ్వాత్మలు ఇంకా చాలామందే మిగిలి ఉన్నారు. మరి కర్ణాటక సంఖ్య ఎంత ఉందో, ప్రతి స్థానంలో ఇటువంటి లిస్టు ఉండాలి కదా! బాప్‌దాదా వద్దకు ఆ పేర్లు రావాలి. రిజల్ట్ రావాలి. మధుబన్కు తీసుకురానవసరం లేదు, ముందు రిపోర్ట్ వ్రాసి ఇవ్వండి- ఎంతమంది వెలువడ్డారు, ఏ రకమైనవారు! విదేశీయులు కావచ్చు, దేశంవారు కావచ్చు. మంచిది, ప్రోగ్రాము చేసారు, ఇందుకు అభినందనలు. ఇప్పుడు ఇటువంటి లిస్ట్‌ను పంపించండి, ప్రతి సెంటరు ఈ లిస్ట్‌ను పంపండి. సరేనా! మంచిది, ఇప్పుడు కర్ణాటకలో ఏదైనా కమాల్ (అద్భుతం) చేసి చూపించండి. ప్రతి సెంటరు నిర్విఘ్న స్వరాజ్య అధికారిగా అవ్వగలదా? వీలవుతుందా? మూడు నెలలు ఇచ్చాము, నిర్విఘ్నము, కేవలం మూడు నెలలు కాదు, సదా కోసం విఘ్నము సమాప్తము. ఒకవేళ ఎప్పుడైనా సంకల్పంలో సంస్కారము ఇమర్జ్ అయినాగానీ దానిని అక్కడే సమాప్తం చేసేయండి. కర్మలోకి, మాటలోకి తీసుకురాకండి. మరి ఇటువంటి రిజల్ట్‌ను చూపిస్తారా - కర్ణాటక నంబర్‌వన్ నిర్విఘ్నము. చేస్తారా? చేయాలి. ఒకరికొకరు సహయోగిగా అయ్యి, సహాయం చేసైనా తయారు చేయాలి ఎందుకంటే 2-4 మంది అయినా నిర్విఘ్నంగా అవ్వకపోతే సర్టిఫికేట్ ఎలా లభిస్తుంది? కర్ణాటక నిర్విఘ్నము అన్న సర్టిఫికేట్ అయితే లభించదు కదా. కావున సహయోగిగా అయ్యి, ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుని చేయాల్సి ఉంటుంది. టీచర్లు తయారుగా ఉన్నారా? చేయాల్సి ఉంటుంది. చూడండి, టి.విలో వస్తుంది. కర్ణాటక టీచర్లందరూ చేతులెత్తుతున్నారు. మంచిది, చూస్తాము. ముందుగా అభినందనలు ఇస్తున్నాము, తర్వాత చూస్తాము. సరేనా! చేయాలి. మీ సంస్కారాలను ఇమర్జ్ అవ్వనివ్వకండి. సంకల్పంలోనే పరివర్తన చేసేయండి. మంచిది. సంఖ్య ప్రకారంగా చూస్తే చాలా చేయవచ్చు. మంచిది, సేవ యొక్క బంగారు అవకాశం లభించింది. కొద్ది రోజులలోనే మీ పుణ్యాన్ని జమ చేసుకున్నారు. యజ్ఞ సేవ అంటే పుణ్య ఖాతాను జమ చేసుకోవడము. మంచి ధైర్యాన్ని ఉంచి వచ్చారు, ఇక ముందు కూడా ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు.
మెడికల్ వింగ్:- ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేసారా? (స్వస్థతలో విలువలను ఎలా పెంపొందించాలి అన్న అంశంపై సంవత్సరమంతా ప్రోగ్రాములు చేస్తాము) ఇప్పుడు ప్లాన్ తయారు చేసారు, ఇక ప్రాక్టికల్ చేయాలి. దీనితో కూడా సందేశం చేరుతుంది కదా! ఎవరైతే వచ్చారో, కేవలం మీటింగ్ మాత్రమే చేయడం కాదు, ప్రాక్టికల్‌గా చేయాల్సిందే. మీకైతే డబల్ లాభము ఉంది. డబల్ ఆశీర్వాదాలు లభిస్తాయి. తనువు సరిగ్గా అవుతుంది, అందుకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. మనసు సంతోషపడుతుంది కాబట్టి అందుకు కూడా ఆశీర్వాదాలు. అందరిలో ఉల్లాసము ఉంది కదా. చాలా మంచిది. మెడికల్‌లో హార్ట్‌కు సంబంధించి కూడా బాగా జరుగుతుంది. బాంబే హాస్పిటల్ రిపోర్ట్ కూడా బాగుంది. ఆటోమేటిక్‌గా వి.ఐ.పీలు వస్తూ ఉంటారు ఎందుకంటే ఆరంభంలో బ్రహ్మా కుమారీలు సమాజ సేవ చేయరు అని భావించేవారు, ఇప్పుడైతే బ్రహ్మా కుమారీల సేవ వలన మంచి రిజల్ట్ ఉంది అని అంటున్నారు. ఆబూలో గ్లోబల్ హాస్పిటల్ తయారైనప్పటి నుండి వాయుమండలంలో ఈ తేడా కనిపిస్తుంది. ఆబూ వారు కూడా మారుతున్నారు. మంచిది, మీ డిపార్టుమెంట్లో, స్థూల సేవ చేసినా, మందులు ఇచ్చినా కానీ, బ్రహ్మా కుమారీలు డబల్ సేవను చేయగలరు అన్న మాట వ్యాపిస్తుంది. మంచిగా చేస్తున్నారు, చేస్తూ ఉండండి. మూలమూలన మీ మెడికల్ ద్వారా అందరి మనసులలో సంతోషము, ఆశా దీపాలను వెలిగిస్తూ ఉండండి. మంచిది, అభినందనలు.
ఎడ్యుకేషన్ వింగ్:- ఈ విధి (మీటింగ్ విధి) బాగా తయారు చేసారు, కలుసుకోవడం కూడా జరుగుతుంది, కాన్ఫరెన్సు కూడా జరుగుతుంది. బాగుంది, బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు, నెమ్మది నెమ్మదిగా ఎడ్యుకేషన్‌లో కూడా అవకాశాలు లభిస్తూ ఉంటాయి మరియు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్రూఫ్ (రుజువు)ను తయారు చేయండి, ఎక్కడ సేవ చేసినా అక్కడ ఒక స్పష్టమైన ఉదాహరణ తయారవ్వాలి, ఆ ఉదాహరణను ఇతర దేశాలలో కూడా రిజల్ట్‌ను చూసి ముందుకు తీసుకువెళ్ళాలి. ఎడ్యుకేషన్ మరియు మెడిసన్ రెండూ చాలా అవసరము. ప్రతి వర్గంవారు తమ వర్గ సేవలను మంచిగా చేయడాన్ని బాప్‌దాదా చూసారు. ధైర్యాన్ని ఉంచుతున్నారు. సహయోగులు కూడా తయారవుతున్నారు కానీ ఇప్పుడు మరి కొంత తీవ్రతరం చేయండి ఎందుకంటే సమయం సమీపిస్తుంది. ప్రతి వర్గానికి తన తన విశేషత ఉంది. మా వర్గానికైతే మీరు సందేశాన్ని ఇవ్వలేదు అన్న ఫిర్యాదునైతే కనీసం సమాప్తం చేసారు. ఇప్పుడు విస్తారము పెరుగుతూ ఉంటుంది. మరి మంచిగా ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా ప్రభుత్వ భారం తగ్గుతుంది కదా. యూత్ గ్రూపు మంచిగా అయితే ప్రభుత్వం కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు అంటుంది. బాగా చేస్తున్నారు, అభినందనలు, ఇక మీదట కూడా చేస్తూ ఉండండి. అచ్ఛా.
ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేవండి. మంచిది, ప్రతి టర్న్‌లో చూసాము, మెజారిటీ కొత్తవారు ఉంటారు. అంటే సర్వీసును పెంచినట్లు కదా, ఇంతమందికి సందేశమును ఇచ్చారు. ఏ విధంగా మీకు సందేశము లభించిందో, అదే విధంగా మీరు కూడా ఇంకా రెండింతలుగా, రెట్టింపుగా సందేశాన్ని ఇవ్వండి. యోగ్యులుగా తయారుచెయ్యండి. మంచిది. ప్రతి సబ్జెక్ట్‌లో ఇంకా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి. మంచిది.
అచ్ఛా - ఇప్పుడు లక్ష్యము పెట్టుకోండి, నడుస్తూ-తిరుగుతూ మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా ద్వారానైనా సేవ లేకుండా కూడా ఉండకూడదు మరియు స్మృతి లేకుండా కూడా ఉండకూడదు. స్మృతి మరియు సేవ ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. స్మృతిలో కూడా, సేవలో కూడా స్వయాన్ని బిజీగా పెట్టుకోండి. ఖాళీగా ఉన్నట్లయితే మాయకు వచ్చేందుకు అవకాశము ఉంటుంది. ఎంత బిజీగా ఉండండి అంటే దూరం నుండే మాయకు వచ్చేందుకు ధైర్యము చాలకూడదు. అప్పుడు తండ్రి సమానముగా అవ్వాలి అన్న లక్ష్యమునేదైతే పెట్టుకున్నారో, అది సహజమైపోతుంది. శ్రమ చేయాల్సిన అవసరముండదు, స్నేహీ స్వరూపులుగా ఉంటారు. అచ్ఛా.
ఈరోజైతే స్నేహము ఎగిరించి తెచ్చింది. స్నేహమనే విమానము ఎంత వేగవంతమైనది? స్నేహంలో ఎగిరి వచ్చారు, స్నేహంలో ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూస్తున్నారు, అందరి మనసులలో ఈ సమయము 100 శాతం ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి, చేసి చూపిస్తాము. ఏమంత పెద్ద విషయము కాదు, జరగాల్సిందే. కానీ ఇప్పుడున్న ఉల్లాస ఉత్సాహాలను మరియు దృఢ సంకల్పాన్ని మీతో సదా పెట్టుకోండి.
బాప్‌దాదా నయనాలలో ఇమిడి ఉన్న కనుపాపలైన పిల్లలకు, తండ్రి యొక్క సర్వ సంపదలకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలైన పిల్లలకు, సదా ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగురుతూ ఉండే మరియు ఎగిరింపజేస్తూ ఉండే మహావీరులు, మహావీరనీలు అయిన పిల్లలకు, ఒక్క తండ్రియే ప్రపంచము అనే ఈ తపనలో నిమగ్నమై ఉండే లవలీన పిల్లలకు, లవలీనమవ్వటమంటే తండ్రి సమానంగా సహజముగా అవ్వడమనే ఇటువంటి ప్రియమైన మరియు లవలీన పిల్లలకు ఇరువురికీ చాలా, చాలా, పదమాపదమా రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా – పూలతో అలంకరణ చేసినవారు ఎవరు, ముందుకు రండి.
దాదీజీతో:- మీ ధైర్యాన్ని చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. శరీర లెక్కను శరీరం సమాప్తం చేస్తుంది, మీ ధైర్యంతో ఎగురుతున్నారు. బాగున్నారు. (దాదీలతో) మీరందరూ కూడా అందరికీ ధైర్యాన్ని ఇచ్చేందులో నిమిత్తంగా ఉన్నారు. మేము కూడా చెయ్యగలము అని మిమ్మల్ని చూసి అందరికీ ఉల్లాసం కలుగుతుంది. మంచిగా నిమిత్తమై ఉన్నారు. (మోహిని అక్కయ్యతో) నిమిత్తంగా ఉన్నారు కదా! (ఈషూ దాదీతో) తోడును నిభాయించడంలో నంబర్‌వన్ మీరు. (మున్నీ అక్కయ్య) ఎంతగా బాబాపై ప్రేమ ఉందో అంతగా యజ్ఞంపై కూడా చాలా ప్రేమ ఉంది. మంచిగా సంభాళిస్తున్నారు. యజ్ఞం నిండుగా ఉంది, నిండుగా ఉంటుంది. అచ్ఛా. (నిర్మల్శాంత దాదీతో, కలకత్తా వారు పూల అలంకరణ చేసారు) గద్దెకు యజమానులు మీరు. మంచిగా శరీరానికి యజమానిగా అయ్యి నడిపిస్తున్నారు. శరీరాన్ని నడిపించడం నేర్చుకున్నారు. మీ ముఖం సేవ చేస్తుంది. బాగుంది. గ్రూప్ కూడా బాగుంది. సేవా ఉల్లాసము ఉంది, విశాల హృదయము ఉంది. యజ్ఞానికి అలంకరణ అవుతున్నారు. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో, దాని వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. పూలనుండి కూడా వైబ్రేషన్లు వస్తాయి. అందరికీ ఉల్లాస ఉత్సాహాల వైబ్రేషన్లు వస్తాయి. మంచిగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంకా మంచిగా చేయడాన్ని, ఉల్లాసంగా చేయడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు, ఇందుకు అభినందనలు. మంచి స్మృతిలో చేస్తారు. రెస్పాండ్ ఇచ్చారు కదా. స్మృతిని పంపారు కదా. చాలామంది స్మృతిని పంపారు. ఎవరు కలిసినా, మా స్మృతిని ఇవ్వండి అని అంటారు. సందేశికి స్మృతిని ఇస్తూ ఉంటారు, మా స్మృతిని ఇవ్వండి అంటారు. వారికి బాప్‌దాదా పేరుతో పర్సనల్‌గా స్మృతికి రెస్పాంస్ను పంపుతున్నారు. మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు మరియు మరింత మంచిగా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న అందరూ, తమ స్మృతిని ఇస్తున్నారు, అందరికీ స్మృతి లభిస్తూ ఉంది. (అమెరికా నుండి అంకుల్, ఆంటీ కూడా స్మృతిని పంపారు) ఈరోజు అయితే ఒక్కొక్క బిడ్డ యొక్క ప్రియస్మృతులు ఒక్కొక్క పట్టణము(దేశము) నుండి లభించాయి. ప్రియస్మృతులు పంపని దేశమేదీ లేదు. అచ్ఛా!
ఓంశాంతి