Search for a command to run...
3 Feb 2006
పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క ఎటువంటి స్థితిని తయారు చేసుకోండంటే అందులో వ్యర్థము యొక్క నామరూపాలు ఉండకూడదు
3 February 2006 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ ప్రభు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తము విశ్వములోని కోట్లలో ఎన్నుకోబడిన కొద్దిమంది ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమనే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను మొత్తము కల్పములో ఈ సమయములోనే అనుభవము చేస్తారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహాన్ ఆత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవము చేసారు కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయ్యారు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమంటారు? తండ్రి అయిన పరమాత్మ అయితే మాతోనే ఉన్నారు, మేము వారితోనే ఉంటాము. పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు మరియు మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము. ఇంతటి ప్రేమను అనుభవము చేస్తున్నారు. వారు మా మనసులో ఉంటారు మరియు మేము వారి మనసులో ఉంటాము అని నషాతో కూడిన గర్వముతో అంటారు. ఇటువంటి అనుభవీలే కదా! అనుభవీలేనా? మనసులో ఏమనిపిస్తుంది? మేము అనుభవీలము కాకపోతే ఇంకెవరు అవుతారు! తండ్రి కూడా ప్రేమకు అధికారులైన ఇటువంటి పిల్లలను చూసి హర్షిస్తారు.
పరమాత్మపై ప్రేమకు గుర్తు - ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి కోసం అంతా బలిహారము చేయడానికి సహజముగా తయారైపోతారు. అలాగే మీరందరూ కూడా ఏదైతే తండ్రి కోరుకుంటున్నారో - పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా అవ్వాలని, ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి ప్రత్యక్షముగా కనిపించాలని, ఆ విధంగా తయారయ్యారు కదా? బాప్‌దాదా మనసుకు ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసు కదా! బాబా మనసుకు ఇష్టమైన స్థితియే సంపూర్ణ పవిత్రత. ఈ బ్రాహ్మణ జన్మ యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రతయే. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పము మరియు స్వప్నములో కూడా ఏ మాత్రమూ అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకపోవడము. బాప్‌దాదా నేటి సమయము యొక్క సమీపత అనుసారముగా పదే-పదే అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - సంపూర్ణ పవిత్రత లెక్కలో చూస్తే వ్యర్థ సంకల్పాలు ఉండటము కూడా సంపూర్ణత కాదు. కనుక చెక్ చేసుకోండి, వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా? ఏ రకమైన వ్యర్థ సంకల్పమైనా సంపూర్ణత నుండి దూరమైతే చెయ్యటం లేదు కదా? ఎంతెంతగా పురుషార్థములో ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగా రాయల్ రూపములోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృధాగా సమాప్తము చెయ్యటం లేదు కదా? రాయల్ రూపములోని అభిమానము మరియు అవమానము అనేవి వ్యర్థ సంకల్పాల రూపములో దాడి అయితే చెయ్యటము లేదు కదా? ఒకవేళ పరమాత్మ యొక్క ఏ కానుకనైనా అభిమానములోకి వచ్చి తమ విశేషతగా భావించినట్లయితే ఆ విశేషతకు చెందిన అభిమానము కూడా కిందకు తీసుకువచ్చేస్తుంది, అది విఘ్న రూపముగా అవుతుంది. అభిమానము అనేది కూడా సూక్ష్మ రూపములో ఏ విధంగా వస్తుందో అది తెలుసు కూడా - నాది అన్న భావము వస్తుంది, నాకు పేరు, గౌరవము, ప్రతిష్ఠ ఉండాలి, ఈ నాది అన్న భావము అభిమానము రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి ఎందుకంటే బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే - స్వమానములో ఉండాలి, అభిమానము ఉండకూడదు, అవమానము కలగకూడదు. వ్యర్థ సంకల్పాలు రావడానికి ఇవే కారణాలు అవుతాయి.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ డబల్ యజమానత్వము యొక్క నిశ్చయము మరియు నషాలో చూడాలనుకుంటారు. డబల్ యజమానత్వము అంటే ఏమిటి? ఒకటేమో, తండ్రి యొక్క ఖజానాలకు యజమానులు మరియు రెండవది, స్వరాజ్యానికి యజమానులు. రెండింటికీ యజమానులే ఎందుకంటే అందరూ బాలకులు కూడా మరియు యజమానులు కూడా. కానీ బాప్‌దాదా ఏం గమనించారంటే, అందరూ అయితే బాలకులే ఎందుకంటే అందరూ ‘నా బాబా’ అని అంటారు. మరి ‘నా బాబా’ అంటే బాలకులే. కానీ బాలకులుగా అవ్వటముతోపాటు రెండు రకాల యజమానులుగా ఉండాలి. ఆ యజమానత్వములో నంబరువారుగా అయిపోతారు. నేను బాలకుడిని మరియు యజమానిని కూడా. వారసత్వ ఖజానా ప్రాప్తించింది కనుక బాలకతనము యొక్క నిశ్చయము మరియు నషా ఉంటుంది, కానీ యజమానత్వములో ప్రాక్టికల్‌గా నిశ్చయము యొక్క నషా ఉండటములో నంబరువారుగా అయిపోతారు. స్వరాజ్యాధికారి యజమానిగా అవ్వడములో విశేషంగా విఘ్నము కలిగించేది మనసు. మనసుకు యజమానిగా అయ్యి ఎప్పుడు కూడా మనసుకు పరాధీనమవ్వకూడదు. స్వరాజ్యాధికారులము అని అంటారు, మరి స్వరాజ్యాధికారి అనగా రాజు, ఏ విధంగా బ్రహ్మా బాబా ప్రతి రోజూ చెకింగ్ చేసుకుని మనసుకు యజమానిగా అయ్యి విశ్వ ఆధిపత్యము యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో అదే విధంగా ఈ మనస్సు, బుద్ధి అనేవి రాజు లెక్కలో చూసినట్లయితే ఇవి మంత్రులు, ఈ వ్యర్థ సంకల్పాలు కూడా మనసులో ఉత్పన్నమవుతాయి, అప్పుడు మనసు వ్యర్థ సంకల్పాలకు వశమైపోతుంది. ఒకవేళ ఆర్డరు అనుసారముగా నడిపించకపోతే మనస్సు చంచలముగా అయిన కారణముగా పరవశం చేసేస్తుంది. కనుక చెక్ చేసుకోండి. మామూలుగా కూడా మనస్సును గుర్రం అని అంటారు, ఎందుకంటే అది చంచలమైనది కదా! కానీ మీ వద్ద శ్రీమతమనే కళ్ళెము ఉంది. ఒకవేళ శ్రీమతమనే కళ్ళెము ఏ కొంచెమైనా ఢీలా (లూజ్) అయినట్లయితే మనస్సు చంచలమైపోతుంది. కళ్ళెము ఎందుకని ఢీలా అవుతుంది? ఎందుకంటే ఎక్కడో ఒక చోట సైడ్ సీన్స్‌ను (మార్గమధ్యములో వచ్చే దృశ్యాలను) చూడటములో నిమగ్నమైపోతారు. కళ్ళెము ఢీలా అయినట్లయితే మనస్సుకు అవకాశము లభిస్తుంది. కనుక నేను బాలకుడిని మరియు యజమానిని అనే ఈ స్మృతిలో సదా ఉండండి. చెక్ చేసుకోండి, ఖజానాలకు కూడా యజమానిగా, అలాగే స్వరాజ్యానికి కూడా యజమానిగా, డబల్ యజమానిగా ఉన్నారా? ఒకవేళ యజమానత్వము తక్కువైతే బలహీన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. సంస్కారాన్ని ఏమంటారు? నా సంస్కారమే అటువంటిది, నా స్వభావమే అటువంటిది, కానీ నిజానికి ఇవి నావా? అనటానికైతే నా సంస్కారము అనే అంటారు కానీ ఇది నాదా? నా సంస్కారము అని అనటము రైటా? రైటా? అది నాదా లేక రావణుడి ఆస్తినా? బలహీన సంస్కారము రావణుడి ఆస్తి, దానిని నాది అని ఎలా అనగలరు. నా సంస్కారము ఏది? తండ్రి సంస్కారము ఏదైతే ఉందో అదే నా సంస్కారము. మరి తండ్రి సంస్కారము ఏమిటి? విశ్వ కళ్యాణము. శుభ భావన, శుభ కామన. కనుక ఏ బలహీన సంస్కారమునైనా నా సంస్కారము అని అనడమే తప్పు. మరియు నా సంస్కారము అని ఒకవేళ మనస్సులో కూర్చోబెట్టారు అంటే అశుద్ధమైన వస్తువును మనసులో కూర్చోబెట్టినట్లు. నా వస్తువు అన్నదానిపై అయితే ప్రేమ ఉంటుంది కదా! కనుక నాది అని అనుకున్నట్లయితే మీ మనస్సులో దానికి స్థానము ఇచ్చినట్లు, అందుకే చాలాసార్లు పిల్లలు చాలా యుద్ధము చెయ్యవలసి వస్తుంది ఎందుకంటే అశుభము మరియు శుభము, రెండింటినీ మనస్సులో కూర్చోబెట్టారు, ఇక ఆ రెండూ ఏమి చేస్తాయి? యుద్ధమే చేస్తాయి కదా! నా సంస్కారము అన్నది సంకల్పములో కూడా వస్తుంది, వాణిలో కూడా వస్తుంది. కనుక చెక్ చేసుకోండి, ఈ అశుభ సంస్కారము నా సంస్కారము కాదు. సంస్కార పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ నడవడిక మరియు ముఖము ద్వారా పదమా పదమారెట్ల భాగ్యవంతులుగా చూడాలనుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అంటారు, భాగ్యవంతులుగా అయితే అయ్యాము కానీ నడుస్తూ-తిరుగుతూ భాగ్యము ఇమర్జ్ అయి ఉండాలి, అది మర్జ్ అయిపోతుంది. బాప్‌దాదా ప్రతి సమయము, ప్రతి బిడ్డ మస్తకముపై మెరుస్తూ ఉన్న భాగ్య సితారను చూడాలనుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని చూసినా సరే మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా మీరు భాగ్యవంతులుగా కనిపించాలి, అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది, ఎందుకంటే వర్తమాన సమయములో మెజారిటీ అనుభవం చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా ఈ రోజుల్లోని సైన్సు ప్రత్యక్ష రూపములో చూపిస్తుంది కదా! అనుభవము చేయిస్తుంది కదా! వేడిని కూడా అనుభవము చేయిస్తుంది, చల్లదనాన్ని కూడా అనుభవము చేయిస్తుంది, అలాగే సైలెన్సు శక్తి ద్వారా కూడా అనుభవము చేయాలని కోరుకుంటారు. ఎంతెంతగా స్వయం అనుభవములో ఉంటారో, అంతగా ఇతరులకు కూడా అనుభవము చేయించగలరు. ఇప్పుడు కంబైండ్ సేవ చెయ్యండి అని బాప్‌దాదా సూచించారు కూడా. కేవలం వాచా ద్వారానే కాదు, కానీ వాచాతో పాటు అనుభవీమూర్తులుగా అయి అనుభవము చేయించే సేవను కూడా చేయండి. ఏదో ఒక అనుభవము, శాంతి యొక్క అనుభవము, సంతోషం యొక్క అనుభవము, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవము..., అనుభవము ఎటువంటిదంటే ఒక్కసారి అనుభవమైనా సరే ఇక వదలలేరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవము చెందిన విషయాన్ని మర్చిపోరు. అది అనుభవము చేయించినవారికి సమీపముగా తీసుకువస్తుంది.
ఇప్పుడు భవిష్యత్తులో ఏ నవీనతను చెయ్యాలి అని అందరూ అడుగుతుంటారు. బాప్‌దాదా చూసారు, సేవనైతే అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు, ప్రతి ఒక్క వర్గమువారు కూడా చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా వర్గాలవారు వచ్చారు కదా! మెగా ప్రోగ్రాములు కూడా చేసేసారు, సందేశాన్ని అయితే ఇచ్చేసారు, మీపై ఉన్న ఫిర్యాదును తొలగించుకున్నారు, ఇందుకు అభినందనలు. కానీ ఇప్పటివరకు - ఇది పరమాత్మ జ్ఞానము అన్న శబ్దం వ్యాపించలేదు. బ్రహ్మా కుమారీలు మంచి కార్యము చేస్తున్నారు, బ్రహ్మా కుమారీల జ్ఞానము చాలా బాగుంది అని అంటారే కానీ ఇదే పరమాత్ముని జ్ఞానము, పరమాత్ముని కార్యము నడుస్తూ ఉంది అన్న ఈ ధ్వని వ్యాపించాలి. మెడిటేషన్ కోర్స్ కూడా చేయిస్తారు, ఆత్మకు పరమాత్మతో కనెక్షన్‌ను కూడా జోడిస్తారు, కానీ ఇప్పుడు పరమాత్ముని కార్యమును స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అన్నదానిని చాలా తక్కువమంది అనుభవము చేస్తున్నారు. ఆత్మ మరియు ధారణలు, ఇవి ప్రత్యక్షమవుతున్నాయి, మంచి కార్యము చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతారు, మంచిని నేర్పిస్తారు అని అంటారు, ఇంతవరకు బాగుంది. జ్ఞానము బాగుంది అని కూడా అంటారు కానీ ఇది పరమాత్ముని జ్ఞానము... అన్న ఈ ధ్వని తండ్రికి సమీపముగా తీసుకువస్తుంది మరియు ఎంతగా తండ్రికి సమీపముగా వస్తారో అంతగా అనుభవము స్వతహాగానే చేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి ప్లాన్‌ను తయారుచెయ్యండంటే మరియు భాషణలలో ఎటువంటి పదునును లేక శక్తిని నింపండంటే, దానితో పరమాత్మకు సమీపముగా వచ్చేయాలి. దివ్యగుణాల ధారణ పట్ల అటెన్షన్ వెళ్ళింది, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు, పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారు అని ఈ మాట అంటారు, కానీ పరమాత్మ వచ్చేసారు, పరమాత్ముని కార్యాన్ని స్వయం పరమాత్మ నడిపిస్తున్నారు, ఈ ప్రత్యక్షత ఆయస్కాంతములా సమీపముగా తీసుకువస్తుంది. మీరు కూడా, తండ్రి లభించారు మరియు తండ్రిని కలవాలి అని ఎప్పుడైతే భావించారో అప్పుడే సమీపముగా వచ్చారు. స్నేహీలుగా మెజారిటీ అవుతారు, వాళ్ళు ఏమని భావించి అలా అవుతారు? వాళ్ళు ఏమనుకుంటారంటే - కార్యము చాలా బాగుంది, ఏ కార్యమునైతే బ్రహ్మా కుమారీలు చేస్తున్నారో, ఆ కార్యాన్ని ఇంకెవ్వరూ చెయ్యలేరు, వీరు పరివర్తన చేయిస్తారు అని అనుకుంటారు. కానీ పరమాత్మ మాట్లాడుతున్నారు, పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని ఇంత సమీపముగా రావటము లేదు, ఎందుకంటే బ్రహ్మాకుమారీలు ఏం చేస్తున్నారు, వీరి జ్ఞానము ఏమిటి అన్నది ఇంతకుముందు అర్థం చేసుకోలేదు కాదు కానీ అది ఇప్పుడు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. కానీ పరమాత్ముని ప్రత్యక్షత జరగాలి. ఇది పరమాత్ముని జ్ఞానము అని ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే వారు ఆగగలరా! ఏ విధంగా మీరు పరుగెత్తుకుని వచ్చేసారు కదా, అదే విధంగా వారు పరుగెత్తుకుని వస్తారు. కనుక ఇప్పుడు అటువంటి ప్లాన్‌ను తయారుచెయ్యండి, అటువంటి భాషణను తయారుచెయ్యండి, పరమాత్మ అనుభూతి యొక్క అటువంటి ప్రాక్టికల్ ఋజువుగా అవ్వండి, అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతము ‘బాగుంది’ అన్నంతవరకు చేరుకున్నారు కానీ ‘బాగా తయారవ్వాలి’ అన్న ఈ అల పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతితో జరుగుతుంది. కనుక అనుభవీమూర్తులుగా అయ్యి అనుభవము చేయించండి. ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారుచెయ్యండి. అచ్ఛా.
సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది:- చేతులు ఊపండి. మంచిది, ఏ జోన్‌కు టర్న్ లభిస్తే వారు చాలా పెద్ద మనసుతో వస్తారు. (పంజాబ్ జోన్ నుండి 4000 మంది వచ్చారు) ప్రతి జోన్ వారు సేవా ఛాన్స్‌ను మంచిగా తీసుకుంటారు అని బాప్‌దాదాకు కూడా సంతోషము కలుగుతుంది. పంజాబ్‌ను అందరూ మామూలుగా కూడా సింహము అని అంటారు, పంజాబ్ సింహము. బాప్‌దాదా అంటారు, సింహము అంటే విజయి. కనుక సదా పంజాబ్ వారు తమ మస్తకము మధ్యలో విజయ తిలకాన్ని అనుభవము చెయ్యాలి. విజయ తిలకము లభించి ఉంది. మేమే కల్పకల్పానికి విజయులము అన్నది సదా స్మృతిలో ఉండాలి. విజయులుగా ఉండేవారము, ఇప్పుడూ ఉన్నాము మరియు కల్ప-కల్పము అలా తయారవుతాము. మంచిది. పంజాబ్ వారు కూడా వారస క్వాలిటీ వారిని బాబా ఎదురుగా తీసుకువచ్చేందుకు ప్రోగ్రామ్‌ను తయారుచేస్తున్నారు కదా! ఇప్పుడు బాప్‌దాదా ఎదురుగా వారస క్వాలిటీ వారిని తీసుకురాలేదు. స్నేహీ క్వాలిటీ వారిని తీసుకువచ్చారు, అన్ని జోన్లవారు స్నేహీ, సహయోగీ క్వాలిటీ వారిని తీసుకువచ్చారు, కానీ వారస క్వాలిటీ వారిని తీసుకురాలేదు. ఏర్పాట్లు చేస్తున్నారు కదా! అన్ని రకాలవారు కావాలి కదా! వారసులు కూడా కావాలి, స్నేహీలు కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి, మైకులు కూడా కావాలి, మైట్ కూడా కావాలి. అన్ని రకాలవారు కావాలి. మంచిది, సెంటర్లలో వృద్ధి అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉల్లాస-ఉత్సాహాలతో సేవలో వృద్ధి చేస్తున్నారు కూడా. అయితే, పరమాత్మ వచ్చేసారు అన్న ఈ ప్రత్యక్షత ఏ జోన్లో జరుగుతుందో ఇప్పుడు చూస్తాము. తండ్రి యొక్క ప్రత్యక్షతను ఏ జోన్ చేస్తుంది అన్నదానిని బాప్‌దాదా చూస్తున్నారు. విదేశాలవారు చేస్తారా? విదేశీయులు కూడా చెయ్యగలరు. పంజాబ్ వారు నంబర్‌ను తీసుకోండి. తీసుకోండి, మంచిదే. అందరూ మీకు సహయోగము ఇస్తారు. ‘ఇదే, ఇదే, ఇదే’... అన్న ఈ ధ్వనిని వ్యాపింపజేసేందుకు చాలా సమయము నుండి ప్రయత్నము చేస్తున్నారు. ప్రస్తుతమైతే - ‘ఇది కూడా ఒకటి’ అన్నట్లు ఉంది, కానీ ‘కేవలం ఇదే’ అన్నది లేదు. మరి పంజాబ్ వారు ఏం చేస్తారు? ‘ఇదే, ఇదే’...అన్న ఈ ధ్వని వ్యాపించాలి. టీచర్లు సరేనా? ఎప్పటికల్లా చేస్తారు? ఈ సంవత్సరములో చేస్తారా? కొత్త సంవత్సరము ప్రారంభమైంది కదా! మరి క్రొత్త సంవత్సరములో ఏదైనా నవీనత ఉండాలి కదా! ‘ఇది కూడా ఒకటి’ అన్న మాటనైతే చాలానే విన్నాము. ఏ విధంగా మీ మనసులో కేవలం ‘బాబా, బాబా, బాబా’ అన్నది స్వతహాగా గుర్తుంటుందో, అదే విధంగా వారి నోటి నుండి ‘మా బాబా వచ్చేసారు’ అన్నది రావాలి. వారు కూడా, ‘నా బాబా, నా బాబా’ అని అనాలి - ఈ ధ్వని నలుమూలల నుండి వెలువడాలి, కానీ మొదలైతే ఒక మూల నుండి అవుతుంది కదా. మరి పంజాబువారు అద్భుతము చేస్తారా? ఎందుకు చెయ్యరు! చెయ్యాల్సిందే. చాలా మంచిది, ముందుగానే అభినందనలు. అచ్ఛా.
ఈ గ్రూపులో 6 వర్గాల మీటింగ్ జరుగుతుంది:- (సైన్స్ ఎండ్ ఇంజినీర్ వింగ్, బిజినెస్ వింగ్, ధార్మిక వింగ్, సమాజ సేవా విభాగము, మీడియా విభాగము, సురక్షా విభాగము). అందరూ లేవండి. (అందరూ తమ తమ వర్గాల బ్యానర్‌ను చూపిస్తున్నారు) అచ్ఛా, అందరూ బిజీ అయిపోయారు, సేవలో బిజీ అయినందుకు అభినందనలు. ప్రతి ఒక్కరూ తమ తమ విధిని పాటిస్తున్నారు. చూడండి, సైన్స్ ఇంజినీర్ బ్యానర్‌ను చూస్తున్నాము, సైన్స్ ఎలా అయితే ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తుందో అలాగే సైలెన్సు శక్తి యొక్క అనుభవాన్ని ఎంతగా ప్రాక్టికల్‌గా వ్యాప్తి చేయండంటే ప్రతి ఒక్కరి నోటి నుండి, సైన్సు అయితే సైన్సే కానీ సైలెన్సు అపరమపారమైనది అనాలి ఎందుకంటే ధర్మం వారికి మరియు సైన్స్ వారికి ఇద్దరికీ ప్రాక్టికల్‌గా సైలెన్సు యొక్క చమత్కారాన్నే కాదు సైలెన్సు కార్యాన్ని సిద్ధి చేసి చూపించాల్సి ఉంటుంది. పరమాత్మ ఒక్కరే, పరమాత్మ కార్యం జరుగుతుంది అని ప్రాక్టికల్‌లో ధర్మంవారికి సిద్ధి చేసి చూపించాల్సి ఉంటుంది. అనేక వైపుల నుండి బుద్ధి తొలగి ఒక్క వైపే నిలవాలి. ఏకాగ్ర బుద్ధి అవ్వాలి. ఏ వింగ్ వారైనాగానీ, కార్యాన్ని అయితే అందరూ చేస్తున్నారని బాప్‌దాదా చెప్పి ఉన్నారు, ప్లాన్ కూడా మంచి మంచిగా తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు సమయం యొక్క వేగం వేగంగా వెళ్తుంది, సమయం అనుసారంగా అందరి బుద్ధిలో ఒక్క పరమాత్మ తప్ప మరేదీ నిలవకూడదు, ఇటువంటి ఏదైనా ప్లాన్‌ను తయారు చేయండి. మెజారిటీ యొక్క నోటి నుండి ‘బాబా’, ‘బాబా’ అన్న మాట రావాలి. ప్లాన్ కూడా మంచిగా తయారు చేసారు, బాప్‌దాదా విన్నారు. కానీ ఇప్పుడు ఫాస్ట్‌గా చేయాలి. సైన్సు కూడా చూడండి, సమయాన్ని, వస్తువులను బాగా సూక్ష్మంగా చేస్తూ ఉంది. అలాగే సైలెన్సు శక్తి ఎంత శక్తిశాలిగా చేస్తుందో అనుభవం చేయించండి. ఏ వర్గాలవారైతే వచ్చారో, అందరికీ బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మీడియా మరియు మెడికల్ కూడా ముందుకు వెళ్తున్నాయి. మీడియా కూడా విస్తారాన్ని పొందడాన్ని బాప్‌దాదా విన్నారు. ఎవరి చేతిలో వార్తాపత్రిక ఉంటుందో, ఎవరైతే రేడియో స్విచ్ ఆన్ చేస్తారో, టి.వి స్విచ్ ఆన్ చేస్తారో, ఇదే మాట రావాలి, ‘మా బాబా వచ్చేసారు’. వేరే వర్గంవారు చేయడంలేదని కాదు, అందరూ చేస్తున్నారు కానీ ఏ వర్గం నంబర్‌వన్ నిమిత్తంగా అవుతుందో బాప్‌దాదా చూస్తారు. ఏ జోన్ నంబర్‌వన్ నిమిత్తం అవుతుందో చూస్తాము. సరే, అన్నీ విడిచిపెట్టండి, ఎక్కడైతే ప్రోగ్రాము చేస్తారో ఆ ప్రోగ్రాముకు వచ్చినవారంతా ‘నా బాబా వచ్చేసారు’ అని అనాలి. ఇదైతే మొదలవ్వాలి. మేము ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము, త్వరత్వరగా సంపన్నంగా అయిపోతాము అని మీరంటే ఈ కార్యము కూడా జరిగిపోతుంది ఎందుకంటే కనెక్షన్ ఉంది, మీరు సంపన్నంగా అవ్వడానికి మరియు ప్రత్యక్షతా జెండా ఎగరడానికి సంబంధం ఉంది. బాప్‌దాదా వినిపించి ఉన్నారు, వ్యర్థ ఆలోచనలు ఇంకా వస్తున్నాయి, రాయల్ రూపంలో కూడా వస్తున్నాయి, సాధారణ రూపంలో కూడా వస్తున్నాయి. అందరూ మనసుకు యజమానిగా అవ్వాలి, పరమాత్మ బాలకులు సో యజమానులు. మరి ఇటువంటి యజమానులుగా అవుతారా? (అందరూ చేయి ఊపారు) అచ్ఛా – అభినందనలు, అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు అన్నిటికన్నా ముందు మధుబన్కు చాలా పెద్ద అలంకారము అని బాప్‌దాదా అంటారు. ఎంత మంచిగా అనిపిస్తుంది! దేశవిదేశాలు ఏకమతంతో ఏకాగ్ర బుద్ధితో విశ్వ సేవను చేస్తున్నారు. ఒకే స్టేజీపై అందరూ అంతర్జాతీయులు ఉంటారు, నల్లవారు, తెల్లవారు అన్ని రకాలవారు ఒకే స్టేజీపై కూర్చుంటారు, కూర్చుని ‘ఒక్క బాబా మరెవ్వరూ లేరు’ అని అంటారు. అంతే కదా? లేక ఇంకెవరైనా ఉన్నారా? వ్యర్థ సంకల్పాలు వచ్చినా కూడా మరెవరో ఉన్నట్లే. ఈరోజు బాప్‌దాదా అన్ని సంకల్పాల విధిని ఒకే శుభ సంకల్పంగా చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మనసు యొక్క సంకల్పాలలో చాలా సమయం నుండి ఏ బలహీనత అయితే ఉంటుందో, అందులో మనసు బుద్ధిని కూడా సహయోగిగా చేసుకుంటుంది. ఏ కారణం చేతనైనా మనసు-బుద్ధిలో ఒకవేళ బలహీన సంకల్పాలు వస్తే, అవి సంస్కారంగా అయిపోతాయి. ఎందుకంటే చాలా సమయం వస్తాయి కదా, అప్పుడు అవి సంస్కార రూపంలోకి మారిపోతాయి. కానీ ‘నా సంస్కారము’ ఇప్పుడిక అనకండి. ఒకవేళ నా సంస్కారము అని అన్నారంటే వీరికి రావణుని ఆస్తిపై ప్రేమ ఉంది అని బాప్‌దాదా మరియు బ్రాహ్మణులు అనుకుంటారు. మరి డబల్ విదేశీయులైతే వీడ్కోలు ఇచ్చేసారు కదా. ఇచ్చేసారా? వ్యర్థము స్టాప్. సమర్థుడైన తండ్రి, సమర్థుడైన నేను, వ్యర్థము సమాప్తము. సరేనా! విదేశీయులకున్న ఒక విశేషత బాబాకు మంచిగా అనిపిస్తుంది, అది ఏమిటి? లోపల పెట్టుకోరు, అన్నీ చెప్పేస్తారు, మెజారిటీ దాచిపెట్టరు. మెజారిటీ ఇలా ఉన్నారు. ఏ సంకల్పమైతే దృఢంగా చేసారో, దానిని ప్రాక్టికల్‌గా చేసే అలవాటు కూడా ఉంది కావున డబల్ విదేశీయులారా, దృఢ సంకల్పము - వేస్ట్ సమాప్తము – బెస్ట్ అన్నది ప్రారంభించండి. సరేనా? చేస్తారా డబల్ విదేశీయులు? చేస్తారా? మీలో సంస్కార రూపంలో కూడా ఉంది, ఏ సంకల్పం చేస్తారో అది చేసి చూపిస్తారు. అయితే పూర్తి విదేశంలో వేస్ట్ యొక్క నామరూపాలు ఉండకూడదు. వేస్ట్ టైమ్ లేదు, వేస్ట్ మాటలు లేవు, వేస్ట్ సంకల్పాలు లేవు, వేస్ట్ కర్మలు లేవు, వేస్ట్ సంబంధ సంపర్కాలు లేవు. సరేనా? ఇష్టమేనా? అచ్ఛా. ఉదాహరణగా అవుతారు కదా! అయితే ఈ రిజల్ట్ ఎప్పటివరకు వస్తుంది? మూడు నెలలలోనా లేక ఒక సంవత్సరమా? టీచర్లు ఏమనుకుంటున్నారు? (దాదీ జానకి ఇలా అన్నారు, ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఇప్పుడే చేస్తాము, బాబా అన్నారంటే జరిగిపోతుంది) మంచిది, చూడండి, దృఢ సంకల్పం పెట్టారు, చేయాల్సిందే, ఏమి జరిగినాగానీ చేయాల్సిందే. (అందరూ శివ జయంతికల్లా జరుగుతుంది అన్నారు) అభినందనలు, లక్ష లక్ష అభినందనలు. చాలా మంచిది. మీ అందరి నోటిలో గులాబ్‌జామ్. అచ్ఛా.
ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళాలనుకునేవారు ముందుకు వెళ్ళవచ్చు. అంతేకానీ డబల్ విదేశీయులు చేతులెత్తారు కదా అని కాదు, మరైతే ఇండియావారు ఏమి చేస్తారు? నంబర్‌వన్ అయితే తీసుకోవాలి కదా! మేము చెప్పలేదు కానీ చేసి చూపిస్తాము అని అందరి మనసులలో రావాలి. మరి ఇండియా వారు ఇలా చేస్తారా? ధైర్యము చూపిస్తారా?
మధుబన్ వారు కూడా చేస్తారా? మధుబన్ వారు చేతులు పెద్దగా ఎత్తండి. పొయ్యి దగ్గర ఉండే వారు మనసులో ఉంటారు (జో చుల్ పర్ సో దిల్ పర్) అని బాప్‌దాదా మధుబన్ వారి కోసం అంటారు. మధుబన్ వారికి చాలా పెద్ద లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్‌లో ముందుకు వెళ్ళాలనుకుంటే చాలా త్వరగా సంపన్నంగా అవ్వగలరు. అందరూ మధుబన్కు వస్తారు, మీరైతే మధుబన్లోనే ఉంటారు. కేవలం సోమరిగా అవ్వకండి, అంతే. లిఫ్ట్‌ను విడిచి మెట్లు ఎక్కకండి. ఇకపోతే బాప్‌దాదా మధుబన్ వారికి ప్రతి సీజన్‌కు అభినందనలు తెలుపుతారు. సేవ బాగా చేస్తారు. కానీ... కానీ అనేది ఉంది. ఆ కానీ ఏమిటో చెప్పమంటారా లేక ప్రైవేటుగా చెప్పమంటారా? మధుబన్ వారు చాలా తెలివైనవారు, బాబా ఏమి చెప్పాలనుకుంటున్నారో లోపలైతే అర్థమైపోయింది, అందుకే వద్దు అంటున్నారు. చూడండి, మధుబన్ వారికి ప్రతి సంవత్సరం, ప్రతి సీజన్లో సమ్ముఖంలో మురళిని వినే అవకాశం లభిస్తుంది, వేరేవారికి లభించదు. కావున మధుబన్ వారు అందరినీ చిరునవ్వుతో కలుస్తూ తమ ముఖం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయవచ్చు. ఎవరైతే ‘నా బాబా’ అంటారో, వారు నా బాబా యొక్క ముఖాన్ని నడవడికలో చూపిస్తారు. చేస్తున్నారు కూడా, చేయడం లేదని కాదు, చేస్తున్నారు. ఇప్పుడు మరి కొంత ఫాస్ట్‌గా చేయండి. చేస్తున్నారు. మధుబన్ పేరు వింటే, ఎక్కడకు మీరు వెళ్ళినా మధుబన్ వారు, మధుబన్ వారు అంటారు కదా. చూడండి, ఎంత గౌరవంతో చూస్తారో! మధుబన్పై ప్రేమ ఉంది అంటే మధుబన్ నివాసులపై కూడా ప్రేమ ఉంది. అచ్ఛా, ఈరోజైతే కలిసాము కదా మధుబన్ వారితో. ఈరోజు మధుబన్ వారితో కలవాలని ఎవరో చెప్పారు, అందుకే కలిసాము. అచ్ఛా.
అన్నివైపులా ఉన్న ఆత్మిక గులాబీలైన పిల్లలందరికీ, సదా తండ్రికి అతి ప్రియమైనవారు మరియు దేహ భానము నుండి అతి అతీతమైనవారికి, బాప్‌దాదా హృదయములోని ప్రియమైన పిల్లలకు, సదా ఒక్క తండ్రే అంటూ ఏకాగ్రమైన మనస్సుతో మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న-భిన్న సమయాలలో, భిన్న-భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్సు యొక్క సాధనాల ద్వారా మధుబన్కు చేరుకున్నవారికి, సమ్ముఖముగా చూస్తున్నవారికి, ప్రియమైనవారందరికీ, సికీలధే అయినవారికి, కల్ప-కల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారీ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమా రెట్లు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి మరియు దానితో పాటు డబల్ యజమాని పిల్లలకు బాప్‌దాదా యొక్క నమస్తే.
దాదీజీతో:- మీరు మధుబన్ యొక్క హీరో యాక్టర్, సదా జీరో స్మృతి ఉంటుంది. శరీరము నడవకపోయినా కానీ, కొంచెం నెమ్మది-నెమ్మదిగా నడిచినా కానీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి. తండ్రి యొక్క ఆశీర్వాదాలైతే ఎలాగూ ఉన్నాయి కానీ అందరివీ ఉన్నాయి. అందరూ దాదీని చాలా ప్రేమిస్తారు కదా! చూడండి, అందరూ - దాదీలు కావాలి, దాదీలు కావాలి, దాదీలు కావాలి... అని ఈ మాటే అంటారు. మరి దాదీల విశేషత ఏమిటి? దాదీల విశేషత ఏమిటంటే - తండ్రి శ్రీమతమనుసారముగా ప్రతి అడుగు వేయడము. మనసును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పణ చేయడము. మీరందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు కదా! మనసును సమర్పణ చేయండి. బాప్‌దాదా చూసారు, మనసు చాలా అద్భుతము చేసి చూపిస్తుంది. అద్భుతము ఏం చేస్తుంది? చంచలత చేస్తుంది. మనసు ఏకాగ్రమవ్వాలి, ఏ విధంగా జెండా ఎగురవేస్తారు కదా, అదే విధంగా మనసు యొక్క జెండా శివబాబా, శివబాబా అన్నదానిపై ఏకాగ్రమవ్వాలి. వస్తూ ఉంది, ఆ సమయము సమీపముగా వస్తూ ఉంది. అప్పుడప్పుడు బాప్‌దాదా పిల్లల యొక్క చాలా మంచి-మంచి సంకల్పాలను వింటారు. అందరి లక్ష్యము చాలా బాగుంది. అచ్ఛా. చూడండి, హాల్ యొక్క శోభ ఎంత బాగుంది. మాలలా అనిపిస్తుంది కదా! మరియు మాల మధ్యలో మణులు కూర్చున్నారు. అచ్ఛా!
ఓంశాంతి