Search for a command to run...
31 Dec 2005
క్రొత్త సంవత్సరములో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మము చేసి బ్రహ్మా తండ్రి సమానముగా త్యాగము, తపస్య మరియు సేవలో నంబరువన్‌గా అవ్వండి
31 December 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్నవారికి, వారు సమ్ముఖములో ఉన్నా లేక దూరములో కూర్చుని హృదయానికి సమీపముగా ఉన్నా, అందరికీ మూడు అభినందనలు ఇస్తున్నారు. ఒకటి - క్రొత్త జీవితానికి అభినందనలు, రెండు - క్రొత్త యుగానికి అభినందనలు మరియు మూడు - నేటి ఈ రోజున క్రొత్త సంవత్సరానికి అభినందనలు. మీరందరూ కూడా క్రొత్త సంవత్సరానికి అభినందనలను ఇవ్వటానికి మరియు అభినందనలను తీసుకోవటానికి వచ్చారు. వాస్తవానికి సత్యమైన హృదయము యొక్క సంతోషపు అభినందనలను బ్రాహ్మణ ఆత్మలైన మీరు తీసుకుంటారు కూడా, ఇస్తారు కూడా. నేటి ఈ రోజుకు మహత్వము ఉంది. వీడ్కోలు కూడా మరియు అభినందనలు కూడా. ఇది వీడ్కోలు మరియు అభినందనల సంగమయుగము. నేటి ఈ రోజును సంగమము యొక్క రోజు అని అంటాము. సంగమము యొక్క మహిమ చాలా గొప్పది. సంగమయుగానికి ఉన్న మహిమ కారణముగానే ఈ రోజుల్లో పాత మరియు క్రొత్త సంవత్సరము యొక్క సంగమమును ఎంతో వైభవముగా జరుపుకుంటున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. సంగమయుగానికి ఉన్న మహిమ కారణముగానే ఈ పాత-క్రొత్త సంవత్సరముల సంగమానికి మహిమ ఉంది. ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో, సంగమము జరుగుతుందో, దానికి కూడా మహిమ ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువ మహిమ ఈ సంగమయుగానిది, ఈ పురుషోత్తమ యుగానిది, ఇక్కడ భాగ్యవాన్ ఆత్మలైన బ్రాహ్మణులైన మీరు కూర్చుని ఉన్నారు. ఈ నషా ఉంది కదా! ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని - మీరు ఏ సమమయులో ఉన్నారు, మీరు కలియుగములో ఉంటున్నారా లేక సత్యయుగములో ఉంటున్నారా అని ప్రశ్నిస్తే, మీరు వెంటనే ఏమంటారు? మేము ఈ సమయములో పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము అని అంటారు. మీరు కలియుగానికి చెందినవారు కారు, మీరు సంగమయుగవాసులు. ఈ సంగమయుగానికి విశేష మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల యొక్క మిలనము జరుగుతుంది. ఏ యుగములోనూ జరగని మేళా జరుగుతుంది, మిలనము జరుగుతుంది. మరి మేళాను జరుపుకునేందుకు వచ్చారు కదా! మీరు మిలనమేళాను జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. డ్రామాలో ఆత్మనైన నాకు ఇటువంటి భాగ్యము కూడా నిశ్చితమై ఉంది అని ఎప్పుడైనా స్వప్నములోనైనా అనుకున్నారా! ఆత్మకు పరమాత్మతో కలిసే భాగ్యము ఇంతకుముందు ఉంది మరియు ఇప్పుడూ ఉంది. తండ్రి కూడా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు - వాహ్! భాగ్యవాన్ పిల్లలూ వాహ్! మీ భాగ్యాన్ని చూసుకుని హృదయములో మీ గురించి మీరు - వాహ్ నేను వాహ్! వాహ్ నా భాగ్యము వాహ్! వాహ్ నా తండ్రి వాహ్! వాహ్ నా బ్రాహ్మణ పరివారము వాహ్! ఈ వాహ్ వాహ్ అన్న పాటలను ఆటోమేటిక్‌గానే హృదయములో పాడుకుంటూ ఉంటారు కదా!
మరి ఈరోజు ఈ సంగమ సమయములో, ఏయే విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీలోపల ఆలోచించుకున్నారా? అందరూ ఆలోచించారా? సదాకాలము కొరకు వీడ్కోలు ఇవ్వాలి, ఎందుకంటే సదాకాలము కొరకు వీడ్కోలు ఇవ్వటం ద్వారా సదాకాలికమైన అభినందనలను జరుపుకోగలరు. ఎటువంటి అభినందనలను ఇవ్వండి అంటే, మీ ముఖాన్ని చూసి ఏ ఆత్మ మీ ఎదురుగా వచ్చినా సరే, వారు కూడా అభినందనలను పొంది సంతోషించాలి. ఎవరైతే హృదయపూర్వకముగా అభినందనలను ఇస్తారో మరియు తీసుకుంటారో, వారు సదా ఎలా కనిపిస్తారు? సంగమయుగ ఫరిశ్తా. బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా మరియు ఫరిశ్తా నుండి దేవత, అందరిదీ ఇదే పురుషార్థము కదా! ఎందుకంటే తండ్రికి అన్ని రకాల సంకల్పాలను, ప్రవృత్తికి చెందిన, కర్మలకు చెందిన భారము ఏదైతే ఉందో, దానిని ఇచ్చేసారు కదా! భారాన్ని ఇచ్చేసారా లేక ఇంకా కాస్త ఉండిపోయిందా? ఎందుకంటే కొంచెము భారము ఉన్నా కానీ అది ఫరిశ్తాగా అవ్వనివ్వదు. అంతేకాక తండ్రి పిల్లల భారాన్ని తీసుకునేందుకు వచ్చినప్పుడు మరి భారాన్ని ఇవ్వటము కష్టమా! కష్టమా లేక సహజమా? భారాన్ని తండ్రికి ఇచ్చేసాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇచ్చేసారా? చూసుకోండి, ఆలోచించి చేతులు ఎత్తండి. భారాన్ని ఇచ్చేసారా? అచ్ఛా, ఇచ్చేసినట్లయితే చాలా అభినందనలు. మరి ఎవరైతే భారాన్ని తండ్రికి ఇవ్వలేదో వారు ఎందుకని తమ వద్ద ఉంచుకున్నారు? ఆ భారము పట్ల ప్రీతి ఉందా ఏమిటి? భారము మంచిగా అనిపిస్తుందా? చూడండి, బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఏమంటారు? ఓ నా నిశ్చింత చక్రవర్తులైన పిల్లలూ అని అంటారు. మరి భారము ఉంటే దానికి సంబంధించిన చింత ఉంటుంది కదా! ఆ భారాన్ని తీసుకునేందుకు తండ్రి వచ్చారు ఎందుకంటే తండ్రి చూస్తున్నారు, 63 జన్మల నుండి భారాన్ని మోస్తూ-మోస్తూ పిల్లలందరూ చాలా భారీతనము కలవారిగా అయిపోయారు. అందుకే తండ్రి పిల్లలకు భారాన్ని ఇచ్చేయండి అని ప్రేమగా చెప్తున్నారు, అయినా కూడా ఎందుకని పెట్టుకుని ఉన్నారు? భారము పెట్టుకోవటము మంచిగా అనిపిస్తుందా? అన్నింటికంటే సూక్ష్మమైన భారము - పాత సంస్కారాల భారము. ఈ సంవత్సరము పూర్తయిపోతుంది కదా, అందుకని బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరిదీ ఈ సంవత్సరము యొక్క చార్టును చూసారు. మీరందరూ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి మీ మీ చార్ట్‌ను చెక్ చేసుకునే ఉంటారు కదా? బాప్‌దాదా ఏం చూసారంటే - చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచముపై ఆకర్షణ తగ్గింది, పాత సంబంధాల ఆకర్షణ కూడా తగ్గింది, కానీ పాత సంస్కారాలు, వీటి భారము మెజారిటీ పిల్లలలో ఉండిపోయి ఉంది. ఏదో ఒక రూపములో, మనసులో అశుద్ధ సంకల్పాలు కాకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారము ఇప్పుడు కూడా పర్సెంటేజ్లో కనిపిస్తూ ఉంది. వాచలో కూడా కనిపిస్తూ ఉంది. సంబంధ-సంపర్కాలలో కూడా ఏదో ఒక సంస్కారము ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది.
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరికీ అభినందనలతోపాటు ఏ సూచనను ఇస్తున్నారంటే - మిగిలిపోయి ఉన్న ఈ సంస్కారము సమయానికి కూడా మోసం చేస్తుంది మరియు అంతిమములో కూడా మోసం చేయడానికి నిమిత్తముగా అవుతుంది, అందుకే ఈరోజు సంస్కారానికి అంతిమ సంస్కారము చెయ్యండి. ప్రతి ఒక్కరికీ తమ సంస్కారము గురించి తెలుసు కూడా, వదలాలని అనుకుంటారు కూడా, విసిగిపోయి కూడా ఉన్నారు, కానీ సదా కోసం పరివర్తన చేసుకోవటంలో తీవ్ర పురుషార్థులుగా లేరు. పురుషార్థము చేస్తున్నారు కానీ తీవ్ర పురుషార్థులుగా లేరు. కారణమేమిటి? తీవ్ర పురుషార్థము ఎందుకు జరగదు? కారణము ఏమిటంటే - రావణుడిని హతమార్చారు కూడా, కానీ కేవలము హతమార్చడమే కాదు, కాల్చేసారు కూడా. ఇలా హతమార్చడానికి పురుషార్థము చేస్తారు, అప్పుడు ఆ సంస్కారము కాస్త స్పృహ కోల్పోతుంది కూడా, కానీ కాల్చలేదు కావున స్పృహ కోల్పోయిన స్టేజ్ నుండి మధ్యమధ్యలో మళ్ళీ లేచేస్తూ ఉంటుంది. అందుకే పాత సంస్కారాల అంతిమ సంస్కారము చేయడానికి ఈ క్రొత్త సంవత్సరములో వాటిని యోగాగ్ని ద్వారా కాల్చాలి అనే దృఢ సంకల్పము పట్ల అటెన్షన్ పెట్టండి. ఈ క్రొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి అని అడుగుతారు కదా. సేవ విషయము వేరు, కానీ ముందుగా స్వయము యొక్క విషయము చూసుకోవాలి. యోగము చేస్తారు, పిల్లలు యోగములో అభ్యాసము చేస్తుండటాన్ని బాప్‌దాదా చూస్తారు. అమృతవేళ కూడా చాలా పురుషార్థము చేస్తారు, కానీ యోగ తపస్యను తపస్య రూపములో చెయ్యరు. తండ్రిని ప్రేమతో తప్పకుండా గుర్తు చేస్తుంటారు, ఆత్మిక సంభాషణను కూడా ఎంతగానో చేస్తుంటారు, శక్తిని తీసుకునే అభ్యాసాన్ని కూడా చేస్తారు, కానీ, వీడ్కోలు ఇవ్వాలి అన్న సంకల్పము చేస్తే వీడ్కోలు జరిగిపోగలిగేంతగా స్మృతిని అంత శక్తిశాలిగా తయారుచేసుకోలేదు. యోగాన్ని యోగాగ్ని రూపములో కార్యములో పెట్టరు, అందుకే యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ఏకాగ్రతా శక్తి విశేషముగా సంస్కారాలను భస్మము చేయడానికి అవసరము. ఏ స్వరూపములో ఏకాగ్రము అవ్వాలనుకుంటే ఆ స్వరూపములో, ఎంత సమయము ఏకాగ్రము అవ్వాలనుకుంటే అంత సమయము ఏకాగ్రము అవ్వగలగాలి, అటువంటి ఏకాగ్రత కావాలి, సంకల్పము చేయగానే అది భస్మమైపోవాలి. దీనిని యోగాగ్ని అని అంటాము. నామరూపాలు సమాప్తమవ్వాలి. కేవలం హతమారిస్తే శవమైతే ఉండిపోతుంది కదా. కానీ భస్మము అయిన తర్వాత ఇక నామరూపాలు అన్నీ అంతమైపోతాయి. కనుక ఈ సంవత్సరము యోగాన్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురండి. మాస్టర్ సర్వశక్తిమంతులు ఏ స్వరూపములో ఉండాలనుకుంటే ఆ స్వరూపాన్ని ఆజ్ఞాపించండి, సమాప్తము చేసే శక్తి మీ ఆజ్ఞను పాటించకపోవటమనేది జరగదు. మీరు యజమానులు. మాస్టర్ అని పిలవబడతారు కదా! మరి మాస్టర్ ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరు అవ్వకపోతే మరి వారు మాస్టరేనా? బాప్‌దాదా చూసారు, పాత సంస్కారానికి చెందిన ఎంతో కొంత అంశమాత్రము ఇప్పుడు కూడా ఉండిపోయి ఉంది మరియు ఆ అంశము మధ్యమధ్యలో వంశానికి కూడా జన్మనిస్తుంది, అప్పుడు అది కర్మలలోకి కూడా వచ్చేస్తుంది. యుద్ధము చెయ్యాల్సి వస్తుంది. బాప్‌దాదాకు సమయమనుసారముగా పిల్లల యొక్క యుద్ధ స్వరూపము నచ్చటం లేదు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ యజమాని రూపములో చూడాలనుకుంటారు. ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరైపోవాలి.
మరి విన్నారా, ఈ సంవత్సరములో స్వయము కోసం ఏం చెయ్యాలో? మీరు శక్తిశాలులు, నిశ్చింత చక్రవర్తులు, ఎందుకంటే అందరి లక్ష్యము ఏమిటి అని ఎవరిని అడిగినా ఏమని అంటారు? మేము విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము, రాజ్య అధికారులుగా అవుతాము అని అంటారు. స్వయాన్ని రాజయోగిగా చెప్పుకుంటారు. మీరు ప్రజాయోగులా? ఈ మొత్తము సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? రాజయోగులు కాకుండా ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? టీచర్లూ, అటువంటివారు ఎవరైనా ఉన్నారా? మీ సెంటర్లో ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? రాజయోగులము అనే అందరూ చెప్పుకుంటారు. ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ చేతులెత్తరు. మంచిగా అనిపించదు కదా! అంతేకాక తండ్రికి కూడా నషా ఉంది. బాప్‌దాదా నషాతో అంటారు - సంగమములో కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని. నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేరు. కానీ బాప్‌దాదా అంటారు, నా ప్రతి బిడ్డ స్వరాజ్య అధికారి రాజా బిడ్డనే. ప్రజాయోగులు ఎవరు అంటే అందులో అయితే చేతులెత్తలేదు కదా, అంటే రాజులనే కదా! కానీ శక్తిని ఆజ్ఞాపించినా కానీ అది రాకపోవటము అనేటువంటి ఢీలా-ఢీలా రాజులుగా అవ్వకండి. బలహీనమైన రాజులుగా అవ్వకండి. వెనుక ఉన్నవారు ఎవరు? మేము రాజయోగులము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. పైన కూడా కూర్చుని ఉన్నారు (గ్యాలరీలో కూర్చుని ఉన్నవారు చేతులు ఊపుతున్నారు, ఈ రోజు హాల్లో 18,000 మంది సోదరీ-సోదరులు కూర్చుని ఉన్నారు). బాప్‌దాదా చూస్తున్నారు, పైన ఉన్నవారు చేతులెత్తండి.
ఇప్పుడు ఈ చివరి టర్న్‌లో ఇది ప్రారంభమవుతుంది. బాప్‌దాదా మూడు నెలలను ఇస్తున్నారు, సరేనా, ఇవ్వాలా? హోమ్‌వర్క్ ఇస్తున్నాము, ఎందుకంటే మధ్యమధ్యలో చేసే ఈ హోమ్‌వర్క్ కూడా చివరి పరీక్షలో జమ అవుతుంది. మూడు నెలలలో ప్రతి ఒక్కరూ తమ చార్టును చెక్ చేసుకోండి - నేను మాస్టర్ సర్వశక్తిమంతునిగా అయ్యి ఏ కర్మేంద్రియానికైనా, ఏ శక్తికైనా ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు, ఏది ఆజ్ఞాపిస్తే అది, ప్రాక్టికల్‌గా అవి ఆజ్ఞను పాటిస్తున్నాయా లేదా? చెయ్యగలరా? మొదటి లైన్లో ఉన్నవారు చెయ్యగలరా? చేతులెత్తండి. అచ్ఛా! ఈ మూడు నెలలు ఏ పాత సంస్కారము దాడి చెయ్యకూడదు. నిర్ల్యక్షులుగా అవ్వకండి, ‘అయిపోతుందిలే...’ అనే రాయల్ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. బాప్‌దాదాతో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతారు. తండ్రీ, మీరు చింతించకండి, నేను అలా తయారైపోతాను అని అంటారు. బాప్‌దాదా ఏం చేస్తారు? విని నవ్వుకుంటారు. కానీ బాప్‌దాదా ఈ మూడు నెలలలో అటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. మీకు అంగీకారమైతే చేతులెత్తండి. మనస్ఫూర్తిగా చేతులెత్తండి, సభలో ఉన్నామన్న కారణముగా చేతులెత్తవద్దు. చెయ్యాల్సిందే. ఏది సహనం చెయ్యాల్సి వచ్చినా, ఏది వదలాల్సి వచ్చినా, ఏమీ ఫర్వాలేదు. చెయ్యాల్సిందే. పక్కానా? పక్కానా? పక్కానా? టీచర్లు చేస్తారా?
అచ్ఛా, కిరీటాన్ని ధరించిన ఈ చిన్నారి పిల్లలు ఏం చేస్తారు? (చిన్న పిల్లలు కిరీటాన్ని ధరించి ఎదురుగా కూర్చున్నారు). కిరీటాన్ని అయితే మంచిగా ధరించారా? మరి చెయ్యాల్సి వస్తుంది. అచ్ఛా! చూడండి, పిల్లలు చేతులెత్తుతున్నారు. ఒకవేళ మీరు చెయ్యకపోతే మరి ఏం చెయ్యాలి? అది కూడా చెప్పండి. అప్పుడు బాప్‌దాదా సీజన్లో ఒకసారికి రానివ్వము, ఎందుకంటే బాప్‌దాదా చూస్తున్నారు, సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. మీరు సమయము కోసం ఎదురు చూసేవారు కారు, మీరు ఏర్పాట్లు చేసుకునేవారు, సమయము మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రకృతి కూడా, సతోప్రధాన ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. కనుక మూడు నెలలలో మీ శక్తిశాలి స్థితిలో మిగిలిపోయి ఉన్న సంస్కారాలను పరివర్తన చేసుకోండి. ఒకవేళ మూడు నెలలు అటెన్షన్ పెట్టినట్లయితే ఇక దాని తర్వాత సమయానికి కూడా అది అభ్యాసమైపోతుంది. ఒక్కసారి పరివర్తనా విధి వచ్చింది అంటే ఇక అది చాలా పనికొస్తుంది. ఎప్పుడు వినాశనమవుతుంది, ఎప్పుడు వినాశనమవుతుంది అని సమయం కోసం మీరు ఎదురు చూడకండి. ఆత్మిక సంభాషణలో అందరూ అడుగుతుంటారు, పైకి అనరు కానీ లోపల ఇలా అనుకుంటారు-ఎప్పుడు వినాశనమవుతుందో తెలియదు, రెండు సంవత్సరాలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా, ఎన్ని సంవత్సరాలలో అవుతుంది అని? కానీ మీరెందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు, సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. తండ్రిని అడుగుతుంటారు - తారీఖు చెప్పండి, ఏ సంవత్సరమో కొంచెం చెప్పండి, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
బాప్‌దాదా పిల్లల్ని ప్రశ్న అడుగుతున్నారు - మీరందరూ తండ్రి సమానముగా అయిపోయారా? పరదా తెరవమంటారా లేక పరదా తెరిస్తే కొందరు తల దువ్వుకుంటూ, కొందరు ముఖానికి క్రీమ్‌ను పెట్టుకుంటూ ఉంటారా? ఒకవేళ ఎవరెడీగా ఉన్నట్లయితే, సంస్కారాలు సమాప్తమైపోయినట్లయితే ఇక బాప్‌దాదాకు పరదాను తెరవటానికి ఆలస్యమెందుకు అవుతుంది. ఎవరెడీగా అయితే అవ్వండి కదా! ఎవరెడీగా అయిపోతాము, అయిపోతాము అని అంటూ తండ్రిని చాలా సమయము సంతోషపరిచారు. ఇప్పుడు అలా చెయ్యకండి, అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. తండ్రి సమానముగా అవ్వాలి అన్నదానిలోనైతే అందరూ చేతులెత్తుతారు. చేతులెత్తే అవసరము లేదు. బ్రహ్మా తండ్రిని చూడండి, సాకారములో అయితే బ్రహ్మా తండ్రిని ఫాలో చేయాలి కదా! బ్రహ్మా తండ్రి త్యాగమును, తపస్యను మరియు సేవను చివరి క్షణము వరకు సాకార రూపములో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. తమ డ్యూటీని, శివ తండ్రి ద్వారా మహా వాక్యాలను ఉచ్ఛరించే తమ డ్యూటీని చివరి రోజు వరకు నిర్వర్తించారు. చివరి మురళి గుర్తుంది కదా? మూడు పదాల వరదానము, గుర్తుందా? (నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారిగా అవ్వండి) ఎవరికైతే ఇది గుర్తుందో, వారు చేతులెత్తండి. అచ్ఛా, అందరికీ గుర్తుంది, అభినందనలు. త్యాగము కూడా చివరి రోజు వరకు చేసారు, తమ పాత గదిని వదలలేదు. పిల్లలు ఎంత ప్రేమగా బ్రహ్మా తండ్రికి చెప్పినా కానీ వారు వినలేదు, అవి పిల్లల కోసం తయారుచెయ్యటం జరిగింది అని అన్నారు. వాటిని స్వయం కోసం ఉపయోగించలేదు. మరియు సదా 2.30 లేక 3.00 గంటలకు లేచి స్వయము కొరకు తపస్య చేసారు, సంస్కారాలను భస్మము చేసుకున్నారు, అప్పుడు కర్మాతీతముగా, అవ్వక్తము అయ్యారు, ఫరిశ్తాగా అయ్యారు. ఏది ఆలోచించారో దానిని చేసి చూపించారు. చెప్పటము, ఆలోచించటము మరియు చెయ్యటము, మూడూ సమానముగా ఉన్నాయి. ఫాలో ఫాదర్. చివరి వరకు తమ కర్తవ్యములో వారు సంపూర్ణులుగా ఉన్నారు. ఉత్తరాలు కూడా వ్రాసారు, ఎన్ని ఉత్తరాలు వ్రాసారు? సేవ కూడా మానలేదు. ఫాలో ఫాదర్ చెయ్యండి. అఖండ మహాదానిగా ఉన్నారు, మహాదాని కాదు, అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చూపించారు, అంతిమము వరకు చూపించారు. చివరి వరకు కూడా ఎటువంటి ఆధారము లేకుండా తపస్వీ రూపములో కూర్చున్నారు. ప్రస్తుతమైతే పిల్లలు కింద కూర్చోవటానికి ఆధారాన్ని తీసుకుంటారు కదా. కానీ బ్రహ్మా తండ్రి ఆది నుండి అంతిమము వరకు తపస్వీ రూపములో ఉన్నారు. కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకోలేదు. ఇది సూక్ష్మ శక్తి. నిరాధారము. శరీరము పాతది, రోజురోజుకు ప్రకృతి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి, అందుకే బాప్‌దాదా మిమ్మల్ని, మీరెందుకు క్రింద కూర్చోవటానికి ఆధారము తీసుకుంటారు, ఎందుకు కళ్ళద్దాలు పెట్టుకుంటారు అని అడగరు, పెట్టుకోండి, ఫర్వాలేదు పెట్టుకోండి, కానీ శక్తిశాలి స్థితిని తప్పకుండా తయారు చేసుకోండి. మొత్తము విశ్వ కార్యమును సమాప్తము చేసారా? బాప్‌దాదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు - విశ్వ కళ్యాణ కార్యము పూర్తయిపోయిందని మీరందరూ సంతుష్టముగా ఉన్నారా? విశ్వ కళ్యాణ కార్యము సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఒక్కరు కూడా లేరా? మరైతే వినాశనము అవుతుందా అని మీరు ఎలా అడుగుతున్నారు? పనినైతే పూర్తి చెయ్యలేదు.
అందరూ నూతన సంవత్సరంలో ఏమి చేయాలి అని అడుగుతుంటారు. ఈ క్వెశ్చన్ ఉంది. బాప్‌దాదా అంటారు, సందేశాన్ని ఇచ్చే మెగా ప్రోగ్రాములను అయితే చాలా చేసారు, బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు, చేసారు, బాగా చేసారు కానీ సందేశాన్ని ఇచ్చారు, అనుభవం చేయించలేదు. ఇందుకోసం ఎలా అయితే ఇక్కడ ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చుకుంటారో లేక ఉల్లాస-ఉత్సాహాలను చూసి కూడా ఉల్లాస-ఉత్సాహాలతో చేసారు, రిజల్ట్ కూడా మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఎటువంటి ప్లాన్ తయారు చేయండంటే అందులో రాయల్ ప్రజలు తయారవ్వాలి. రాయల్ ప్రజలు అంటే సమీప కనెక్షన్‌లోకి వచ్చేవారు. సంబంధ-సంపర్కంలో ఉన్నారు, ముందైతే 9 లక్షలను తయారు చేయండి, ఇప్పుడు 9 లక్షలు తయారయ్యారా? అయ్యారా? 9 లక్షలు తయారయ్యారా? లిస్ట్ ఎవరు తయారు చేస్తారు? (లిస్ట్ ఇప్పుడు వస్తుంది, గత సంవత్సరం అయితే 8 లక్షల 12 వేల మంది ఉన్నారు) కానీ 9 లక్షలు ఒకవేళ తయారైనా ఏ రకంవారు తయారయ్యారు? సమీప రాయల్ ప్రజలలోకి వెళ్ళే యోగ్యులేనా? ఇది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది కదా. అచ్ఛా, ఇప్పుడు లెక్కాపత్రాన్ని తయారు చేయండి. ఒకటైతే 9 లక్షలు మొదటి జన్మకు ప్రజలు, రాయల్ ఫ్యామిలీ అయితే కావాలి కదా. ఒకవేళ వినాశనాన్ని రేపు చేస్తే రాయల్ ప్రజలు తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? లేక తయారు చేయాలా? అలా చూస్తే 9 లక్షలు దొరికేస్తారు, కానీ క్వాలిటీ కూడా కావాలి, సంబంధ సంపర్కం వారిని కలిపితే 9 లక్షలు అయిపోతారు. కానీ బాప్‌దాదా అంటారు, మొదటి జన్మలో వచ్చే ప్రజలైతే మంచి నంబర్ వారే ఉంటారు కదా ఎందుకంటే వారికి కూడా అంతా వన్ వన్ నంబరు లభిస్తుంది, వన్ నంబరు, తారీఖు వన్, సంవత్సరము వన్, రాజ్యము వన్. కావున, ఇటువంటి క్వాలిటీ వారు 9 లక్షల మంది తయారయ్యారా అని ముందు చెక్ చేసుకోండి. రాయల్ ప్రజలు తయారయ్యారా? రాయల్ ఫ్యామిలీ అయితే తయారవ్వాలి, ఉన్నారు కూడా, ఈ సంవత్సరం కొంచెం సంస్కారాలను సమాప్తం చేయాలి. బాప్‌దాదాకు ఉన్న సంకల్పం ఏమిటంటే, ప్రతి సెంటర్ ఈ యోగ అభ్యాసాన్ని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్‌గా తమ-తమ సెంటర్లలో పెట్టాలి మరియు ఒకే తారీఖున దేశవిదేశాల సమయాన్ని కలుపుతూ చేయాలి. బ్రహ్మాకుమారీలు ఇన్ని సెంటర్లలో ఒకే సమయంలో ఒకే ప్రోగ్రామ్‌ను చేస్తున్నారు అని వార్తాపత్రికల్లో రావాలి. కేవలం కామెంట్రీతో యోగం చేయించకండి, అనుభవం చేయించాలన్న లక్ష్యం పెట్టుకోండి. అనుభవం పక్కాగా తయారు చేస్తుంది. ఒకే సమయంలో ప్రతి సెంటర్లో ఒకే ప్రోగ్రామ్ జరగాలి. తర్వాత ప్రతి సెంటర్ యొక్క అనుభవం ఏమిటి అన్న రిజల్ట్‌ను వ్రాయండి. 3 రోజుల ప్రోగ్రామ్ కావచ్చు, ఒక్క రోజు ప్రోగ్రామ్ కావచ్చు కానీ అందరూ నలువైపులవారు కలిసి, ఎలా అయితే మూడవ ఆదివారం అన్ని స్థానాలలో చేస్తారు కదా, అలాగే ఇప్పుడు అనుభవం చేయించే ప్రోగ్రామ్ నలువైపుల జరగాలి. ఒకే సమయంలో ఒకే లక్ష్యము నలువైపుల ఉండాలి. అప్పుడు దేశంవారు కూడా విశ్వ శాంతి కోసం ఇంతమంది కలిసి ఒకే సమయంలో ప్రోగ్రామ్‌ను పెట్టారు అని అర్థం చేసుకుంటారు. అనుభవీలుగా చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. కేవలం విని వెళ్ళిపోవడం కాదు, ఏదైనా అనుభవం చేసుకుని వెళ్ళాలి. మీరు బాబా పిల్లలుగా ఎలా అయ్యారు? ఏదో ఒక అనుభవాన్ని పొందారు కదా, ప్రేమను అనుభవం చేసి ఉండవచ్చు, టోలీ తిని కూడా ప్రేమను అనుభవం చేసి ఉండవచ్చు. సోదరీల వ్యవహారాన్ని అనుభవం చేసి ఉండవచ్చు, సోదరీల చిరునవ్వు, ఆతిథ్యం పొందిన అనుభవాన్ని పొంది ఉండవచ్చు, ఇలా ఏదో ఒకటి అనుభవం చేసారు కాబట్టే బాబా వారిగా అయ్యారు. అలాగే వారిని అనుభవీలుగా చేయండి, ఇప్పుడు అఖండ సేవను చేయండి. చాలా సేవ మిగిలి ఉంది. అచ్ఛా.
ఈరోజు అయితే అభినందనలను ఒకరికొకరు ఇచ్చుకున్నారు కదా. వేరేవారు ఏమి చేస్తారు? కానుకలను ఇస్తారు. బాప్‌దాదా వద్దకు కూడా ఎన్నో కానుకలు వచ్చాయి, చాలా కార్డులు వచ్చాయి, చాలా సుందరమైన కానుకలను పంపారు, మీరు లేచి చూడండి. వాస్తవానికి మీ వద్దకు ఎవరు వచ్చినా కానీ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మనసు ద్వారా శక్తులను ఇచ్చే కానుకను ఇవ్వండి, వాణి ద్వారా జ్ఞాన కానుకను ఇవ్వండి, కర్మల ద్వారా గుణాల కానుకను ఇవ్వండి. కానీ సంబంధ-సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ కానుకను తప్పకుండా ఇవ్వండి. ఖాళీ చేతులతో పంపకండి. మీరు మాస్టర్ దాతలు, మాస్టర్ దాతల వద్దకు వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళడము అనేది జరగకూడదు. అఖండ మహాదానులుగా అవ్వండి. అఖండంగా చేస్తున్నారు, ఏదో ఒక సేవను చేస్తూ ఉండండి, మనసా చేయండి, వాణి ద్వారా చేయండి, కర్మల ద్వారా చేయండి లేక సంబంధ సంపర్కం ద్వారా సేవను చేయండి, అఖండ సేవాధారి.
కొందరు పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఇలా వినిపిస్తారు, అమృతవేళ కొంచెం బద్దకం యొక్క వైబ్రేషన్లు వస్తున్నాయి అంటారు. లేస్తారు తప్పకుండా కానీ పవర్ఫుల్ శక్తిశాలి రూపంతో స్వ కోసం మరియు విశ్వం కోసం శక్తులను ఇవ్వడం, అక్కడ కొంచెం అలసట రేఖలు ఉంటున్నాయి. ఆ సమయంలో, మేము మా సెంటర్లోని యోగ గదిలో కూర్చున్నాము అని భావించకండి, బాబా గదిలో కూర్చున్నా, క్లాసు రూములో కూర్చున్నా, విశ్వ స్టేజీపై కూర్చున్నట్లుగా భావించండి. హీరో పాత్రధారిని, విశ్వ స్టేజీపై కూర్చున్నాను. ఒకవేళ హీరో పాత్రధారి అలసిపోయి పాత్రను పోషిస్తే ఎలా పోషిస్తాడు? వాయుమండలం ఎలా వ్యాపిస్తుంది? కావున అమృతవేళను కూడా పవర్‌ఫుల్‌గా చేయండి. నియమాలు మంచిగా పాటిస్తున్నారు కానీ వినిపించాము కదా – ఇప్పుడు యోగము సర్వ శక్తులతో పవర్‌ఫుల్‌గా ఉండాలి, యోగ అగ్ని ఉండాలి, జ్వాలాముఖి ఉండాలి. మరి ఈ మూడు నెలలు విశేషంగా అమృతవేళను కూడా నోట్ చేసుకోండి. మాటలు చాలా మంచి-మంచిగా చెప్తారు. ప్రేమ స్వరూపంలో కూడా ఉంటారు కానీ జ్వాలారూపం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సంస్కారాల అంశ మాత్రము కూడా ఉండకూడదు, అప్పుడే జ్వాలా రూప యోగి తూ ఆత్మ అంటాము. దీనితోపాటు ఈ నూతన సంవత్సరంలో ఏవైతే ఖజానాలు ఉన్నాయో, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా, ఒకటైతే సఫలం చేయండి మరియు రెండు, జమ చేసుకోండి. జమ కూడా చేసుకోండి, సఫలం కూడా చేయండి ఎందుకంటే మీ టైటిల్ ఉంది, వరదానము ఉంది – సఫలత సితారలు. ఉంది కదా మీ టైటిల్ – సఫలత సితారలు? సఫలత మా కంఠహారము అని అందరూ గర్వంగా చెప్తారు. సఫలత మా జన్మసిద్ధ అధికారము అంటారు. మరి సఫలతామూర్తులు మీరు, సఫలం చేయండి మరియు జమ కూడా చేసుకోండి. సేవ ఎంత చేసినా కూడా జమ ఖాతా అయిందా అవ్వలేదా, ఇందుకు గుర్తు లేక ఇందుకు బంగారు తాళం చెవి – నిమిత్త భావము, నిర్మాన భావము మరియు నిర్మల వాణి. మూడూ ఉన్నాయా? మూడింటిలో ఒక్కటి తక్కువ ఉన్నా, సేవ ఎంత చేసినాగానీ జమ ఖాతా అవ్వదు. చాలా కొద్దిగా, నామమాత్రంగా జమ అవుతుంది. సేవ అయితే చాలా చేస్తున్నారు కానీ జమ ఖాతా ఎంత అవ్వాలో అంతగా జరగడం లేదు అన్న విషయాన్ని బాప్‌దాదా గమనించారు. అందుకు కారణం ఏమిటి? కారణం అయితే తెలుసు కదా! ఒకటైతే మూడు విశేషతలు, నిమిత్త భావంలో నేను అన్న భావం మిక్స్ అవుతుంది. నేను అన్నది వచ్చిందంటే జమ అవ్వలేదు అని అర్థం. ఎంత కష్టపడినాకానీ, రాత్రింబవళ్ళు పరిగెత్తినా, బుద్ధిని నడిపించినాగానీ నిమిత్త భావము, నిర్మాన స్వభావము, నిర్మల వాణి, ఈ మూడూ లేకపోతే జమ అవ్వదు. గరిష్ఠంగా 5 శాతం అవుతుంది. కావున జమ ఎంత అయింది అన్నది కూడా చెక్ చేసుకోండి. బాప్‌దాదా ఇందుకు చాలా సహజమైన మార్గాన్ని చెప్తున్నారు, ఎవరితోటైనా సంబంధ-సంపర్కంలోకి వచ్చినప్పుడు, లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు ముందుగా మీ యొక్క శుభ భావన, శుభ కామన యొక్క వృత్తిని చెక్ చేసుకోండి. ఎవరిని కలిసినా, సదా ఆత్మను చూసి మాట్లాడండి, ఆత్మతో మాట్లాడుతున్నాను, అలౌకిక పరివారంలోని వారితో మాట్లాడుతున్నప్పుడు, వీరు కల్ప క్రితంవారు, ప్రతి కల్పము తమ భాగ్యాన్ని తయారు చేసుకునే కోట్లలో కొద్దిమందిలోని ఆత్మ అన్న సంతోషం ఉండాలి. ఈ భావంతో చూడండి. పురుషార్థంలో నడిచేవారు అయినాగానీ కోట్లలో కొద్ది మందిలోని ఆత్మ కదా. నా బాబా అనైతే అంటున్నారు. క్రోధి అయినాగానీ, స్వభావం మంచిగా లేకపోయినాగానీ మీరు మీ స్వభావాన్ని శ్రేష్ఠంగా పెట్టుకోండి. మీరు వారిని శ్రేష్ఠ రూపంలో చూడండి, శ్రేష్ఠ ఆత్మ స్వరూపంలో చూడండి, అప్పుడే కార్యం మంచిగా జరుగుతుంది, జమ అవుతుంది. ఈ సంవత్సరం హోమ్‌వర్క్ చాలా లభించింది. అందరూ అడుగుతారు కదా – ఏమి చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయాలి... చాలా హోమ్‌వర్క్ లభించింది. ఏ పిల్లలైతే ఈ హోమ్‌వర్క్‌లో నంబర్‌వన్‌గా పాస్ అవుతారో, వారికి బాప్‌దాదా బహుమానాన్ని ఇస్తారు. వేల సంఖ్యలో ఉన్నాగానీ ఇస్తాము, బహుమానాలను తయారు చేయిస్తాము. కానీ సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. అంతేగానీ మీరు చెప్పేస్తే బాబా ఒప్పుకోరు. మీ సహచరుల నుండి సర్టిఫికేట్‌ను కూడా తీసుకుంటాము. ముందుగా మీ మనసు నుండి సర్టిఫికేట్, తర్వాత బ్రాహ్మణ పరివారం యొక్క సర్టిఫికేట్, మూడు, బాబా నుండి సర్టిఫికేట్. మరి సర్టిఫికేట్లు తీసుకుంటారు కదా. ధైర్యము ఉంది కదా! మేము సర్టిఫికేట్లు తప్పకుండా తీసుకుంటాము, దృఢ నిశ్చయము ఉంది అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా – యూథ్ కూడా చేతులెత్తుతున్నారు. బాగుంది. డబల్ విదేశీయులు కూడా ఎత్తుతున్నారు. చేతులు పెద్దగా ఎత్తండి, చేసి చూపిస్తారా? (అందరూ చేతులెత్తారు) అయితే చాలా బహుమానాలను తయారు చేయించాల్సి వస్తుంది. మీ తయారీలతో పోలిస్తే బహుమానాలను తయారు చేయించడం ఏమంత పెద్ద విషయం కాదు. ముందైతే పరమాత్మ హృదయ సింహాసనం లభిస్తుంది. కానీ బహుమానాలను కూడా ఇస్తాము. అచ్ఛా. ఇప్పుడు ఏమి చేయాలి?
సేవ టర్న్ – ఈస్టర్న్, నేపాల్ మరియు తమిళనాడు జోన్ వారిది:- బాప్‌దాదా ఏమి చూసారంటే, ఏ జోన్‌కు టర్న్ లభిస్తుందో, ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో మరియు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు, సంతోషంగా ఉంటుంది, గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది కదా. చూడండి, ఎంతమంది ఉన్నారో! సగం సైన్యం హాల్లో వారే ఉన్నారు. (మూడు జోన్లు కలిపి 5 వేల మంది ఉన్నారు) చూడండి, ఏరియా కూడా పెద్దది. 7 వేరువేరు రాష్ట్రాలు కలిసి ఒక జోన్ అయింది. అచ్ఛా, ఎంతమంది ఉన్నాగానీ ఈస్టర్న్ జోన్ యొక్క విశేషత – సూర్యుడు ఈస్ట్ (తూర్పు)న వస్తాడు. వస్తాడు కదా? మరి జ్ఞాన సూర్యుడి ప్రవేశత కూడా ఈస్ట్‌లోనే జరిగింది. అచ్ఛా, ఇప్పుడు ఇక ఏమి చేయాలి? ఒక పని మిగిలిపోయింది. రెండు పనులు అయితే జరిగాయి, సూర్యుడు కూడా ఉదయించాడు, జ్ఞాన సూర్యుడు కూడా ఉదయించాడు, కానీ ప్రత్యక్షత జెండా ఈస్టర్న్ నుండి ఎగరాలి. అందుకోసం ఏమైనా చేయండి. ఎటువంటి ప్లాన్ తయారు చేయండంటే ప్రత్యక్షత జెండా ఈస్టర్న్ నుండే ఆరంభమవ్వాలి, విశ్వంలో ఎలాగూ వ్యాప్తి అవుతుంది. ఏమి చేయాలి అని ఇక్కడ కూర్చుని మీటింగ్ చేసుకోండి. ప్రత్యక్షతా జెండాను ఎగురవేయడానికి మేము నిమిత్తంగా అవుతాము అని ప్రతి జోన్ అనుకుంటుంది. చేయండి, అందరూ ప్రయత్నించండి కానీ బాప్‌దాదా అంటారు, ఈస్టర్న్ నంబర్‌వన్ వెళ్ళాలి. వెళ్తారా? ప్రత్యక్షం చేయవలసి ఉంటుంది. ధ్వనిని వ్యాప్తి చేయాల్సి ఉంటుంది. మంచిది, చేయగలరు. ఒక్కొక్క రాష్ట్రంలో గ్రూపులను తయారు చేయండి. వారు మనసు, వాణి, కర్మ, సంబంధ-సంపర్కంలో తీవ్ర పురుషార్థీలుగా ఉండాలి. తర్వాత వారి సంగఠనను ఏర్పాటు చేయండి. పరస్పరంలో సలహాలను ఇచ్చిపుచ్చుకోండి అప్పుడు జరిగిపోతుంది. చేయవలసిందే. తీవ్ర పురుషార్థం చేయాల్సి ఉంటుంది. బాగానే జరుగుతుంది, జిజ్ఞాసువులు వస్తున్నారు అంటే సరిపోదు. ప్రత్యక్షత జెండాను ఎగురవేసేందుకు విశేష ప్రోగ్రామ్‌ను తయారు చేయండి. ఇదేమీ మెగా ప్రోగ్రామ్ కాదు, అదైతే చేసేసారు, చాలా బాగా చేసారు. కానీ ప్రత్యక్షతా జెండా ఎగరాలి. చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అందరూ కలిసి చేయగలరు. ఎవరపైతే వచ్చారో, అందరూ చేస్తారా? ఎంత సమయంలో చేస్తారు? ప్లాన్ అయితే తయారు చేయండి. బాప్‌దాదా ప్లాన్‌ను చూస్తారు కదా. ఢిల్లీవారు కూడా ఢిల్లీ నుండే ప్రత్యక్షతా జెండా ఎగరాలని భావిస్తారు. ధరణి కూడా ఉంది. కానీ ప్లాన్‌ను తయారు చేయండి. ప్రత్యక్షతా జెండాను ఎలా ఎగురవేయాలి, అందుకోసం ఏమి ఆలోచించారు? ప్రోగ్రాములైతే చేస్తారు, అవైతే చేయవలసిందే కానీ ధ్వని వ్యాపించాలి, రేడియో పెట్టినా, టి.వి స్విచ్ ఆన్ చేసినా ఇదే ధ్వని వినిపించాలి, ‘‘మన శివబాబా వచ్చేసారు’’, అప్పుడు ప్రత్యక్షతా జెండాను ఎగురవేసారు అని చెప్తాము. అచ్ఛా, మేము చేస్తాము అని మీడియావారు ఆలోచిస్తున్నారు. ఎవరైనా చేయండి కానీ అన్ని రేడియోలలో, విదేశాలలో, దేశంలో ఎక్కడ స్విచ్ ఆన్ చేసినా ఇదే ధ్వని వినిపించాలి. దీనిని ప్రత్యక్షతా జెండా ఎగరడము అంటాము. ఎవరు చేస్తారు? విదేశము చేస్తుందా, విదేశంలో జరుగుతుందా? చేయండి, ఎవరైనా చేయండి, ఫస్ట్ ప్రైజ్ తీసుకోండి. వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అన్న మాటే వినిపించాలి. మంచిది, సంఖ్య అయితే చాలా ఉంది, ఇప్పుడు అద్భుతం చేసి చూపించండి. ఫస్ట్ నంబర్ తీసుకోవడం మంచిదే కదా. సెకండ్, థర్డ్‌లో ఏమీ మజా లేదు. ఫస్ట్. అచ్ఛా. చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. ఒకరికొకరు మంచి సహయోగులుగా అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అక్కడ ఒకరికొకరు సహయోగులుగా అయ్యి కార్యాన్ని సఫలం చేస్తున్నారు అన్న సమాచారం లభించింది, ఇందుకు బాప్‌దాదా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు జల్వాను చూపించండి. మీదొక పాట ఉంది కదా – జల్వా దేఖా వహ్ తేరా హో గయా... ఇప్పుడు ఈ పాట నోటి నుండి రావాలి, ప్రపంచం పాడాలి. అచ్ఛా.
జ్యూరిస్ట్ వింగ్:- అచ్ఛా, ప్లాన్ తయారు చేసారా? (గీతా భగవంతుడిని సిద్ధి చేస్తాము) ప్లాన్ చాలా బాగుంది కానీ గీతా భగవంతుడిని సిద్ధి చేయడానికి ముందుగా పరస్పరంలో సలహాలను తీసుకోండి, పాయింట్లను తయారు చేయండి, ఇది బాగుంది, కానీ ఎవరైనా అథారిటీ వారిని కూడా మీకు తోడుగా పెట్టుకోండి. ముందు వారిని తృప్తిపరిచి వారిని మీతో పెట్టుకోండి. ఇద్దరు నలుగురు ఇటువంటి సహచరులు ఉండాలి, ఈ విషయాన్ని నిరూపించడంలో మీకు తోడుగా నిలవాలి. గీతలో అథారిటీ ఉన్నవారిని తోడుగా పెట్టుకోండి. (ఇందుకోసం ఇద్దరు జడ్జ్‌లు తయారుగా ఉన్నారు) మంచిది, ప్లాన్ తయారు చేయండి, తర్వాత చూపించండి.
డబల్ విదేశీయులు 45 దేశాలనుండి వచ్చారు:- అచ్ఛా, పిల్లలు కూడా వచ్చారు, యూథ్ కూడా వచ్చారు. డబల్ విదేశీయులకు బాప్‌దాదా డబల్ తీవ్ర పురుషార్థులు అన్న టైటిల్‌ను ఇస్తున్నారు ఎందుకంటే విదేశీయుల సంస్కారం ఏమిటంటే, ఏదైతే అనుకుంటారో అది చేస్తారు, అది మంచిదైనా, చెడ్డదైనా. చేయడంలో ధైర్యాన్ని ఉంచుతారు. మరి ఈ ధైర్యాన్ని ఆధ్యాత్మిక పురుషార్థంలో మరియు సేవలో వినియోగించండి. ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి లక్ష్యాన్ని మంచిగా పెట్టుకోవడాన్ని బాప్‌దాదా చూసారు. ఇండియాను మేలుకొల్పడానికి విదేశం నుండి ధ్వని వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశం యొక్క ధ్వని ఇండియాకు వచ్చే అవకాశం కూడా ఉంది కదా! ఆరంభంలో ఇండియాలో పెద్ద ప్రోగ్రాములు జరిగేటప్పుడు విదేశం నుండి ఎవరో ఒక అథారిటీ వారు వచ్చేవారు, భాషణ చేసేవారు అని బాప్‌దాదాకు గుర్తుంది. ఈ విషయం వార్తాపత్రికలలో వచ్చేది. ఇప్పుడు చాలా కాలం నుండి ఇలా విశేషంగా సభలోకి రాలేదు. విడిగా వచ్చారు. రిట్రీట్లు జరుగుతున్నాయి, ప్రోగ్రాములు కూడా జరుగుతున్నాయి కానీ ఎలా అయితే మొదట్లో విశేష ఆత్మలు సంగఠనలో మాట్లాడేవారో, ఇలా బాగుంటుంది. ఇప్పుడు 70 సంవత్సరాల ప్రోగ్రామ్‌ను చేస్తారు కదా, అందులో ప్రయత్నించండి ఎందుకంటే వార్తాపత్రికలవారు ఆసక్తితో తీసుకుంటారు. ఇకపోతే వృద్ధి మంచిగా జరుగుతుంది, ప్రోగ్రాములు కూడా మంచిగా చేస్తున్నారు, ఇందుకు అభినందనలు. మొదట్లో సంఖ్య అక్కడ కూడా తక్కువగా వచ్చేది, ఇప్పుడు సంఖ్య బాగుంది. మంచి మంచి వారస క్వాలిటీవారు కూడా తయారవుతున్నారు. కానీ మూడు నెలలలో విదేశాలవారు నంబర్‌వన్ తీసుకుంటారా? ఫస్ట్ నంబర్ తీసుకుంటారా? ఎవరైతే తీసుకుంటాము అంటారో వారు చేతులెత్తండి. మూడు సర్టిఫికేట్లను తీసుకోవాలి. ధైర్యము ఉంచండి. వీరి కల్చర్ వేరు కదా అని విదేశీయుల గురించి అనుకుంటారు కానీ విదేశాలవారు ఇండియావారికన్నా ముందు నంబర్ తీసుకోవచ్చు. మహాన్ తపస్వీగా అవ్వడంలో నంబర్‌వన్. వీలవుతుంది కదా! అవ్వాల్సిందే. వీలవుతుంది. ఎందుకంటే విదేశీయులలో దృఢత యొక్క సంస్కారం ఉంది, ఇప్పుడు ఇందులో కేవలం దృఢత యొక్క సంస్కారాన్ని యూజ్ చేయండి, అయిపోతుంది. సరేనా! నంబర్‌వన్ తీసుకోవాలి కదా! అచ్ఛా. విదేశీయులు ప్రతి టర్న్‌లో వస్తారు, అప్పుడు సభ అలంకరింపబడుతుంది, ఇంటర్నేషనల్ అయిపోతుంది కదా! చాలా మంచిది. అచ్ఛా, ముందు ఉన్న ఈ గ్రూప్ (సింధీ గ్రూప్) ఏమి చేస్తుంది? లైన్‌గా అయితే మంచిగా నిల్చున్నారు, వృద్ధి కూడా బాగా జరుగుతుంది ఇందుకు అభినందనలు. అచ్ఛా, బాప్‌దాదా అడుగుతున్నారు, కొంత సమయం క్రితం ఈ గ్రూపే చెప్పింది, మేము ఒక్కొక్కరము ఒకరిని ఇలా తయారు చేసి తీసుకువస్తాము, గుర్తుందా? ఒక్కొక్కరు ఒకరిని తయారు చేసారా, మీకన్నా ముందు? ఎవరైతే చేసారో వారు చేతులెత్తండి. ఇక్కడివరకు తీసుకు వచ్చారా, వారు చేతులెత్తండి. అచ్ఛా, మాట నిలబెట్టుకున్నారు, అందుకు చాలా-చాలా అభినందనలు, కానీ ఇప్పుడు ఇంకా కూడా తీసుకు రావాల్సి ఉంటుంది. వృద్ధి అయితే కావాలి కదా. ఎక్కడైతే సింధ్‌లో బాబా వచ్చారో, అక్కడి దేశవాసులు తమ తోటివారిని మేలుకొలపాలి కదా! జాలి కలుగుతుంది కదా! శివబాబా సింధ్‌లో వచ్చారు అని మీరు గర్వంగా చెప్తారు కదా. మరి చేయండి, అద్భుతాన్ని చేసి చూపించండి. మంచి మంచివారు ఉన్నారు, చేయగలరు. ఏమంటారు? (బాబా యొక్క చాలా-చాలా ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా చేస్తాము) బ్రాహ్మణ పరివారంలో టోటల్ ఎంతమంది సింధీలు ఉంటారు? లెక్క ప్రకారం కొద్దిమందే ఉన్నారు. (ఈ గ్రూప్‌లో 32మంది వచ్చారు) ఇప్పుడు కనీసం 100 మందినైనా తీసుకురండి. 100 మందిని తీసుకురాలేరా? (108 మందిని తీసుకువస్తాము) చిన్న పిల్లలు, చిన్న పిల్లలు తమ స్నేహితులను తీసుకురావాలి. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ధైర్యం ఉంచుతున్నారు మరియు సహాయం కూడా లభిస్తుంది. అందుకని మీకు కూడా సంతోషము, బాబాకు కూడా సంతోషము.
కల్చరల్ వింగ్:- ఏ ప్లాన్ తయారు చేసారు? ఎవరి ధ్వని వ్యాపిస్తుందో అటువంటి వారిని తయారు చేయండి. ప్రతి గ్రూప్ వారు మైక్, మైట్ ఉన్నవారిని తయారు చేయాలి. అయిపోతుంది ఎందుకంటే ఈరోజుల్లో నలువైపుల కల్చరల్ చాలా బాగా జరుగుతుంది, అందరికీ ఇంట్రెస్ట్ కూడా ఉంది. కేవలం ఈ విధంగా ధ్వనిని వ్యాపింపజేసే వారు ఎవరైనా నిమిత్తంగా అవ్వాలి అప్పుడు అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఇకపోతే అంతా బాగుంది, ప్రోగ్రాములు తయారు చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఎంత ప్రేమగా చేస్తున్నారో అంత బాగా జరుగుతుంది, రిజల్ట్ కూడా బాగుంది. ఇప్పుడు ఎటువంటి మైక్‌ను తయారు చేయాలంటే, వారి ధ్వని విని అనేకుల కళ్యాణం జరగాలి. చాలా మంచిది, ముందుకు వెళ్తూ ఉండండి.
ఇంటర్నేషనల్ యూథ్ గ్రూప్:- అచ్ఛా, యూథ్ కూడా ధ్వనిని వ్యాపించడానికి ప్రోగ్రామ్ మంచిగా చేస్తున్నారు. స్వ పురుషార్థం కోసం కూడా మంచి ప్రోగ్రామ్‌లను తయారు చేస్తున్నారు. బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు, శుభవార్త కూడా విన్నారు – పరివర్తన చేసాము, ఇకమీదట కూడా ఈ పరివర్తనను నిలబెట్టుకుంటాము అన్నారు. ఫరిశ్తా స్వరూప ధారణకు సమీపంగా వస్తున్నాము అన్నారు. మరి ఏదైతే మీలో పరివర్తన తీసుకువచ్చారో, అది అక్కడకు కూడా వెళ్ళి ఉంటుందా లేక కొద్ది-కొద్దిగా తగ్గుతుందా? ఉంటుంది. సదా ఉంటుంది అని భావించేవారు, చేతులెత్తండి. ఎందుకంటే పరివర్తన, రియలైజేషన్ బాగా చేసారు అన్న సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు. యూథ్ గ్రూప్ సదా కోసం ఇలా అయితే విశ్వంలో ఎంతో పేరును తెచ్చుకుంటారు. మంచి ఉల్లాస-ఉత్సాహాలను చూపించారు. బాప్‌దాదా పిల్లల ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే సదా ఒక్క మాటను గుర్తుంచుకోండి. బ్రాహ్మణ ఆత్మలు ఏది కావాలంటే అది చేయగలరు. ఇప్పుడైతే బాప్‌దాదా హోమ్‌వర్క్‌ను ఇచ్చారు, ఎంతమంది యూథ్ గ్రూప్ ఇందులో నంబర్ తీసుకుంటారో, ప్రైజ్ తీసుకుంటారో చూస్తాము. ప్రైజ్ తీసుకుంటారు కదా? అచ్ఛా. (33 దేశాల నుండి 150 మంది యూథ్ రిట్రీట్‌లో పాలుపంచుకున్నారు. బాగుంది. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, ఇది చాలా బాగుంది. ముందుకు వెళ్తున్నారు, ఇది కూడా బాగుంది. మంచిగా శ్రమ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ చిల్డ్రెన్ గ్రూప్:- బాబా ఆప్నే కమాల్ కియా అన్న పాటను పిల్లలు పాడారు) మీరు కూడా అద్భుతం చేసి చూపించారు. బాబా అయితే అద్భుతం చేసారు, ఇప్పుడు మీరు చేయండి.
తమిళనాడు జోన్ కూడా సేవకు వచ్చింది:- బాగుంది, చిన్నదే అయినా కానీ శక్తి బాగుంది. తమిళనాడు ఒక వి.ఐ.పిని తయారు చేసింది, తయారు చేసింది అయితే తమిళనాడు, వారు ఈరోజు ప్రెజిడెంట్, వారైతే తమిళనాడు నుండే కనెక్షన్‌లోకి వచ్చారు, మరి బాగుంది, ఎలా అయితే వీరిని తయారు చేసారో అలా ఇంకా కొంతమందిని నిమిత్తంగా తయారు చేయండి. వారి ధ్వని కూడా ఎంతోకొంత పని చేస్తుంది కదా. ఈవిధంగా నిమత్తంగా తయారు చేస్తూ ఉంటే ఛోటా సుభానల్లా అయిపోతుంది. సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది, సంఖ్య బాగుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు? (12 వేలమంది సోదరసోదరీలు ఉన్నారు) బాగుంది, చిన్నవారే అయినా కానీ కమాల్ మంచిగా చేసారు, బాప్‌దాదాకు నచ్చింది. ప్లాన్ తయారు చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. సేవలో కూడా సహయోగాన్ని మంచిగా ఇచ్చారు. గోల్డెన్ ఛాన్స్‌ను తీసుకున్నారు మరియు గోల్డెన్ ప్రపంచాన్ని తీసుకురావడానికి నిమిత్తంగా అవ్వవలసిందే. చాలా బాగుంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లల కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా, భిన్న-భిన్న సాధనాల ద్వారా అభినందనల సమాచారం అందింది. బాప్‌దాదా, ఎవరెవరైతే శుభాకాంక్షలు పంపారో, వారందరికీ పదమ పదమారెట్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాప్‌దాదా అయితే దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను సమ్ముఖంగా చూస్తున్నారు. ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో తమ-తమ స్థానాలలో కూర్చున్నారు, వింటున్నారు. ఇది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు, పిల్లలు కూడా సంతోషిస్తున్నారు, అభినందనలు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. రాత్రిని కూడా పగలుగా చేసి సేవ చేస్తారన్న సమాచారం బాప్‌దాదా విన్నారు. మరి ఇటువంటి పిల్లలకు ఎన్నిసార్లు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు ప్రేమను ఇవ్వాలి! ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, ఇంకా మంచిగా ఉంటాయి. ఇప్పుడు దూరంగా కూర్చున్నవారు అందరూ ప్రైజ్‌ను తీసుకోవడంలో నంబర్‌వన్ తీసుకోండి. అచ్ఛా.
ఎవరైతే మొదటిసారి వచ్చారో, వారు లేవండి. బాగుంది, బాప్‌దాదా పిల్లలందరినీ చూసి చూసి సంతోషిస్తున్నారు. ఎవరైతే క్రొత్తవారు వచ్చారో, వారు మరింతగా లాస్ట్ సో ఫాస్ట్, ఫస్ట్ వెళ్ళి చూపించాలి. బాగుంది, వృద్ధి అయితే జరుగుతుంది. ప్రతి టర్న్‌లో క్రొత్త-క్రొత్త వారు వస్తున్నారు. ఇప్పుడు కేవలం అమరులుగా ఉండి, అమర భవ వరదానాన్ని సదా మీకు మీరు ఇచ్చుకుంటూ ఉండండి. అచ్ఛా. మాతలు ఎక్కువమంది ఉన్నారు, సంగమంలో మాతలది టర్న్. పాండవులు కూడా తక్కువేమీ కాదు, మంచిది. అచ్ఛా, పాండవులు కూర్చోండి, మాతలు నిల్చోండి. మాతలు ఎక్కవమంది ఉన్నారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారికి, సదా ధైర్యము ఉంచి బాప్‌దాదా నుండి పదమారెట్ల సహాయాన్ని తీసుకునేందుకు పాత్రులైన పిల్లలకు, సదా విజయీ రత్నాలకు, ప్రతి కల్పములో విజయులుగా అయ్యారు, ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు మరియు ప్రతి కల్పములోనూ విజయులుగా ఉండనే ఉన్నారు, ఇటువంటి విజయి పిల్లలకు, సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించేవారికి, ప్రపంచ ఆకర్షణ లేకుండా, సంస్కారాల ఆకర్షణ లేకుండా, రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా తండ్రి సమానమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీజీతో) అందరినీ దృష్టి ద్వారా, మీ యోగయుక్త స్థితి ద్వారా సంతుష్టం చేస్తారు. అందరూ కొద్ది సమయంలోనే సంతోషపడి వెళ్తారు. బహుకాలం నుండి ఏదైతే సంపాదనను జమ చేసుకున్నారో, దాని ఫలం లభిస్తుంది. (వేలాదిమంది నుండి లభిస్తుంది) మంచి పాత్రను పోషిస్తున్నారు. (మోహిని అక్కయ్య మంచిగా అవుతూ ఉన్నారు) అవ్వవలసిందే. (పర్దాదీతో) మీ జోన్ అన్నిటికన్నా పెద్దది. మంచి జోన్ చాలా భాగ్యశాలి జోన్. (ఎవరి కూతుర్ని మరి!) వీరికి నషా ఉంది. అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మీ సంతోషాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. మిమ్మల్ని మూర్తి రూపంలో చూస్తారు. చాలా బాగుంది. (శాంతమణి దాదీతో) అందరూ తమ-తమ పాత్రను మంచిగా పోషిస్తున్నారు. ఏమీ చేయకపోయినా కానీ, మీ హాజరు అన్నీ చేసేస్తుంది. బాబా రూపం కనిపిస్తుంది కదా, మీ ద్వారా అందరూ సంతోషిస్తారు. (మనోహర్ దాదీ మౌనాన్ని ధారణ చేసారు) చాలా భాషణ చేసారు, ఆల్‌రౌండ్ సేవలో ముందుగా వీరి పేరే ఉంది. బాప్‌దాదా మురళీలలో కూడా వినిపించారు. కొద్దిగా ట్రీట్మెంట్ చేయించుకోండి, మంచిగా అయిపోతారు. అది ఏమంత పెద్ద విషయం కాదు. అందరూ గుర్తు అయితే చేస్తారు, మీవంటి విశేష పాత్ర మరెవ్వరూ చేయలేరు. మీరు వినిపించినట్లుగా హిస్టరీని మరెవ్వరూ వినిపించలేరు. మీ పాత్రను పోషించండి. అంతా మంచిగా అయిపోతుంది, ఏమీ కాదు. (రతన్మోహిని దాదీతో) వీరు చక్రం తిప్పే చక్రవర్తి, మంచి పాత్రను పోషిస్తున్నారు, ఎందుకంటే ఆది రత్నము కదా, ఆది రత్నము యొక్క విలువ ఉంటుంది. మీరు హాజరు అవ్వడమే బాప్‌దాదా స్మృతిని తెప్పిస్తుంది.
2006 సంవత్సరం యొక్క శుభ ఆగమనం సందర్భంగా రాత్రి 12 గంటలకు ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా నూతన సంవత్సరం కోసం పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు
పిల్లలందరూ చాలా-చాలా ప్రేమతో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. జరుపుకున్నారు కూడా మరియు సంస్కారాలను తొలగిస్తాము అని మాట కూడా ఇచ్చారు. అంటే తొలగించాలి కూడా మరియు అందరినీ శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వైబ్రేషన్లతో కలవాలి కూడా. తొలగించడం, కలవడం మరియు జరుపుకోవడం. అన్ని విషయాలు వచ్చేసాయి. ఇప్పుడు బాగా ఈ పూర్తి సంవత్సరమంతా హర్షితంగా ఉండండి మరియు అందరినీ హర్షితంగా చేయండి. నేను సంతుష్ట ఆత్మను, సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి. ఇదే జరుపుకోవడము, ఇదే తండ్రి ప్రేమ, ఇదే ఆశీర్వాదాలు. ఇదే ప్రియస్మృతులు. అందరికీ నమస్తే. అచ్ఛా!
ఓంశాంతి