Search for a command to run...
9 Nov 1969
భవిష్యత్తును తెలుసుకునేందుకు యుక్తులు
9 November 1969 · తెలుగు
(దీపావళి శుభ సందర్భంగా ప్రాణప్రదమైన అవ్యక్త బాప్దాదా ఉచ్ఛరించిన మధుర మహావాక్యాలు)
బాప్దాదా ఒక్కొక్క దీపాన్ని ఏక కాల (సమయము) దృష్టితో చూస్తున్నారా లేక మూడు కాలాలు చూస్తున్నారా? బాబా మాత్రమే త్రికాలదర్శియా లేక దాదా కూడా త్రికాలదర్శియా? మీరు కూడా త్రికాలదర్శులేనా లేక అవుతున్నారా? ఒకవేళ మీరు త్రికాలదర్శులు అయితే మీరు మీ భవిష్యత్తును చూస్తున్నారా మరియు తెలుసుకున్నారా? నేను ఏమి అవుతాను అని తెలుసుకున్నారా? పాండవ సైన్యము మీ భవిష్యత్తును తెలుసుకున్నారా, ఏమి అవుతాను అని మీకు స్పష్టంగా తెలుసా? మరియు ఎవరి రాజధానిలో వస్తాను, లక్ష్మీనారాయణులుగా కూడా ఏ నంబరులో అవుతాను? (అందరూ తమ ఆలోచనను వినిపించారు). ఎలా అయితే మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అలా మీ భవిష్య నామ-రూప-దేశ-కాలములు నాలుగూ స్పష్టమవుతూ ఉంటాయి, ఏ దేశంలో రాజ్యం చేయాలి, ఏ పేరుతో, ఏ రూపంతో, ఏ సమయంలో, మొదటి రాజధానిలో ఏమవుతాము? రెండవ రాజధానిలో ఏమవుతాము? ఈ పూర్తి జన్మపత్రిక ఒక్కొక్కరికీ మీ లోపల స్పష్టమవుతుంది. బాప్దాదా ఎప్పుడు ఎవరిని చూసినాకానీ మూడు కాలాలను చూస్తారు. ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఏమి అవ్వబోతున్నారు. మరి ఒక్కొక్క దీపములో ఈ మూడు కాలాలను చూస్తాము. మీకు రెండు కాలాలు అయితే స్పష్టంగా తెలుసు. ముందు ఎలా ఉండేవారిమి, ఇప్పుడు ఎలా అయ్యాము, కానీ భవిష్యత్తులో ఎలా అవుతాము అన్నది మీరు ఎంతెంతగా యోగయుక్తంగా ఉంటారో అంతగా భవిష్యత్తు స్పష్టమవుతూ ఉంటుంది. వర్తమానం స్పష్టంగా ఉన్నంతగా భవిష్యత్తు స్పష్టంగా ఉంటుంది. వర్తమానంలో ఎప్పుడు కూడా ఉన్నానా లేదా అన్న ఆలోచన రాదు. ఏమిటో తెలియదు అన్న సంకల్పం రాదు. ఇదే విధంగా భవిష్యత్తు కూడా స్పష్టంగా ఉంటుంది. ఇంతటి స్పష్ట నషా ప్రతి ఒక్కరి బుద్ధిలో నంబరువారీగా వస్తూ ఉంటుంది. ఎలా అయితే సాకార రూపంలో ఉన్న తల్లి-తండ్రి ఇద్దరికీ వారి భవిష్యత్తు స్పష్టంగా ఉండినది, పేరు కూడా, రూపం కూడా, దేశం కూడా మరియు కాలము కూడా స్పష్టంగా ఉండినది. ఏ సంబంధంలోకి వస్తాము అన్నది కూడా స్పష్టంగా తెలుసు. సంబంధాలు కూడా స్పష్టంగా ఏ రూపంలో ఎదురుగా వస్తాయి అని కూడా తెలుసు. ఇప్పుడు మనసులో కొద్దిగా ఎవరికైనా వస్తుండవచ్చు. కానీ కొంత సమయం తర్వాత, ఇది జరగాల్సిందే అని నిశ్చయబుద్ధితో అంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినాకానీ ఇతరులు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కానీ కొంత సమయం తర్వాత మీ నడవడిక, మీ పురుషార్థము మీ భవిష్య చిత్రాన్ని ప్రసిద్ధం చేస్తాయి. ఇప్పుడు, పురుషార్థము మరియు భవిష్యత్తుకు కొంత తేడా ఉంది. కానీ ఎలా ఎలా అయితే సమయము మరియు మీ పురుషార్థము సమానంగా అవుతూ ఉంటాయో అంతగా ఆ సంకల్పాలు ఉత్పన్నం అవ్వవు.
మీరందరూ దీపమాలను జరుపుకున్నారు. దీపావళినాడు ఏమి చేస్తారు? ఒక దీపంతో అనేక దీపాలను వెలిగిస్తారు, అంటే అనేకులకు ఒక్కరిపై ప్రేమ పెరుగుతుంది, ఇదే దీపమాల. ఒకవేళ ప్రతి ఒక్క దీపానికి ఒక్క దీపంపై ప్రేమ ఉన్నట్లయితే ఇదే దీపమాల. దీపంలో ఏముంటుంది? అగ్ని. ప్రేమ ఉంటే అగ్ని కూడా ఉంటుంది. ప్రేమ లేకపోతే అగ్ని కూడా ఉండదు. దీపమునైన నేను ప్రేమతో అగ్నిగా అయ్యానా అని చూసుకోండి. ఎన్ని రకాల దీపాలు ఉంటాయి? అవి ప్రపంచంలో కూడా ప్రసిద్ధము. (అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు) ఒకటి, చీకటిని తొలగించి ప్రకాశాన్నిచ్చే మట్టితో చేసిన స్థూల దీపము, రెండు, ఆత్మ దీపము, మూడు కుల దీపము, మరి నాల్గవది? ఆశా దీపము అంటారు కదా. తండ్రికి పిల్లలపై ఆశ ఉంటుంది. కనుక నాల్గవది ఆశా దీపము. ఈ నాలుగు రకాల దీపాల గాయనము ఉంది. ఇప్పుడు ఈ నాలుగు దీపాలలో అందరూ ఎన్ని దీపాలను వెలిగించారు? బాప్దాదాకు పిల్లలపై ఉన్న ఆశలు ఏవైతే ఉన్నాయో, ఆ దీపాలను వెలిగించారా? మట్టి దీపాలనైతే అనేక జన్మలు వెలిగిస్తూ వచ్చారు. ఆత్మ దీపము వెలిగిందా? ఈ నాలుగు రకాల దీపాలు వెలిగినప్పుడు దీపావళి జరుపుకున్నట్లుగా భావించండి. కుల దీపము ఆరిపోయేలా ఎటువంటి కర్మను చేయకండి. బాప్దాదా పిల్లలపై పెట్టుకున్న ఆ ఆశాదీపాలు ఆరిపోయే విధంగా నడుచుకోకండి. ఏకరసంగా, అచలంగా, నిశ్చలంగా అన్ని దీపాలు వెలుగుతున్నాయి కదా? ఎవరి స్వయం యొక్క దీపం వెలిగి ఉంటుందో వారు ఇతరుల దీపాన్ని వెలిగించకుండా ఉండలేరు. బాప్దాదాకు పిల్లలపై ముఖ్యంగా ఏ ఆశలు ఉన్నాయి? బాప్దాదాకు పిల్లలందరిపై ఇదే ఆశ ఉంది, పిల్లలు ప్రతి ఒక్కరూ మొదటి నంబరులోకి వెళ్ళాలి అనగా ప్రతి ఒక్కరూ విజయులుగా అవ్వాలి. విజయి రత్నము యొక్క గుర్తులు ఏమిటి? మీరందరూ ఏదైతే విన్నారో అదే చెప్పారు, అందుకనే సరిగ్గానే చెప్పారు. ఎవరైతే విజయిగా ఉంటారో వారి లక్షణాలనైతే మీరందరూ వినిపించారు అలాగే విజయి అని ఎవరిని అంటాము అంటే – స్వయం విజయాన్ని ప్రాప్తి చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా తమకన్నా ముందుంచి విజయులుగా చేసేవారు. ఎలా అయితే బాప్దాదా పిల్లలను తమకన్నా ముందుంచేవారు కదా! అలాగే ఎవరైతే విజయి రత్నంగా ఉంటారో వారు తమ సాంగత్య రంగును అందరికీ అంటిస్తారు, ఇదే వారి విజయ లక్షణము. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారు విజయులుగా అవ్వవలసిందే. ఇటువంటి విజయి రత్నాలు విజయ మాలలో ఏ నంబరును తీసుకుంటారు? స్వయమైతే విజయులుగా అయ్యే ఉంటారు, వారి సాంగత్యపు రంగుతో ఇతరులను కూడా విజయులుగా చేస్తారు. ఈ సేవయే మిగిలి ఉంది. అంతేకానీ కోట్లలో కొద్దిమందే విజయులు అవుతారని కాదు. ఎవరు ఎలా ఉంటారో అలాగే ఇతరులను తయారు చేస్తారు. ఇలా అనేకులను విజయులుగా తయారు చేసేవారే మాలలో ముఖ్య పూసగా అవుతారు. కనుక, ఇతరులను తమ సమానంగా విజయులుగా తయారు చేయడము విజయుల లక్షణము. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. అనేకులను విజయులుగా తయారు చేయాలి, కేవలం స్వయం మాత్రమే కాదు. దీపమాలలో పూర్తి దీపమాల వెలిగి ఉంటుంది. దీపమాల అని అంటున్నప్పుడు అనేక వెలిగి ఉన్న దీపాల మాలను అందరూ మెడలో ధరించారా? ఇటువంటి వెలిగి ఉన్న దీపాల మాలను ప్రతి రత్నము ఎప్పుడైతే తమ మెడలో వేసుకుంటుందో అప్పుడే విజయ ఢంకా మ్రోగుతుంది. ఎలా అయితే దివ్య గుణాల మాలను మీ మెడలో వేసుకున్నారో అలా అనేక వెలిగి ఉన్న దీపాల మాలను మీ మెడలో వేసుకోండి. ఇక్కడ ఎన్ని దీపాల మాలను మీ మెడలో వేసుకుంటారో అంతగా అక్కడ ప్రజలు తయారవుతారు. కొన్ని మాలలు చాలా పొడవుగా ఉంటాయి. కొన్ని కేవలం మెడ వరకే ఉంటాయి. మరి ఎటువంటి మాలను వేసుకుంటారు? చాలా పెద్దది. ఇటువంటి మాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని దీపాల మాలను వేసుకున్నారు? లెక్కపెట్టగలరా లేక లెక్కలేనన్ని ఉన్నాయా? బాగా వెలిగే దీపాలే మంచిగా అనిపిస్తాయి. మిణుకు మిణుకుమనే దీపాలు మంచిగా అనిపించవు. అచ్ఛా.
మధుబనంలోని పూలలో ఏ విశేషతలు ఉండాలి? పేరే మధుబన్. కనుక మొదటి విశేషత మధురత. మధురత ఎటువంటిదంటే ఎవరినైనా హర్షితం చేస్తుంది. మధురతను ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహాన్గా ఉంటారు, అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురత ఉన్నవారిని అందరూ మహాన్ రూపంలో చూస్తారు. కనుక ఈ మధురత అను విశేష గుణం ఉండాలి. మధురతతోటే మధుసూదనుడి పేరును ప్రసిద్ధి చేస్తారు. దీని పేరు మధువన్. మధు అనగా మధురత, వన్ అంటే అందులోని విశేషత ఏమిటి? వనంలోకి వైరాగ్య వృత్తి ఉన్నవారు వెళ్తారు. కనుక అనంతమైన వైరాగ్య వృత్తి కూడా కావాలి. దీనితో మిగతా అన్ని విషయాలు వచ్చేస్తాయి. మిమ్మల్నందరినీ కాపీ చేయడానికి అందరూ ఇక్కడకు వస్తారు. వీరు ఇలా ఎలా అయ్యారు అని అందరూ అనుకుంటారు. మధువనం అంటే మధువనమే అని అందరి నోటి నుండి వస్తుంది. కనుక ఈ రెండు విశేషతలను ధారణ చేసుకోవాలి – మధురత మరియు అనంతమైన వైరాగ్య వృత్తి. మరో మాటలో చెప్పాలంటే స్నేహము మరియు శక్తి. మీ అందరికీ అందరిపై చాలా స్నేహము ఉంది కదా! (బాప్దాదాతో) బాప్దాదాకు మధుబన్ వారిపై విశేష స్నేహము ఉంటుంది ఎందుకంటే ఎలా ఉన్నప్పటికీ సర్వస్వ త్యాగి అయ్యారు. అందుకనే ఆకర్షిస్తారు. కానీ సర్వస్వ త్యాగితో పాటు ఇప్పుడు స్నేహము మరియు శక్తిని కూడా నింపుకోవాలి. ఏ విశేషతను నింపుకోవాలో ఇప్పుడు అర్థమయిందా?
కుమారీలు కమాల్ (అద్భుతము) చేసి చూపించాలి. కుమారీల ప్రతి కర్తవ్యము కమాల్ యోగ్యంగా ఉండాలి. సంకల్పము, వాణి మరియు కర్మ కమాల్ చేయాలి. కుమారీలు పవిత్రంగా ఉన్న కారణంగా తమ ధారణను తీవ్రం చేసుకోవచ్చు. వీరి కర్తవ్యం అద్భుతంగా ఉంది అని ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చేలా అద్భుతమైన పనిని చేసి చూపించండి. ఎలా అయితే బాప్దాదా చెప్పే ప్రతి మాటను వింటూ, ఈరోజు మురళి అయితే అద్భుతంగా ఉంది అంటారు కదా, అలాగే కుమారీల ప్రతి కర్మ అంతటి అద్భుతంగా ఉండాలి. బాప్దాదాను ఫాలో చేయాలి. ప్రయత్నం చేస్తాము అని అనవద్దు. ప్రయత్నం (కోశిశ్) చేస్తున్నంతవరకు ఆకర్షణ (కశిశ్) ఉండదు. ఒకవేళ ఆకర్షణను ధారణ చేయాలంటే ప్రయత్నము అన్న పదాన్ని సమాప్తం చేయండి. ఇప్పుడు ఆకర్షణ రూపంగా అవ్వండి. ఫాలో ఫాదర్ చేయండి. బాప్దాదా ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాము అన్నారా! మరి మీరెందుకు ప్రయత్నం చేస్తాము అంటారు! కుమారీలు కమాల్ చేస్తే తోటివారు కూడా మీకు సహాయం చేస్తారు, లేకపోతే తోటివారు సాక్షిగా అయిపోతారు. అందుకని సహచరుడిని తోడు పెట్టుకోండి లేకపోతే సాక్షిగా అయిపోతారు. సాక్షిగా మంచిగా అనిపిస్తుందా లేక తోడుగా ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఏదైతే కష్టపడుతున్నారో దాని ఫలితం కూడా ఇక్కడే లభిస్తుంది. ఈ స్నేహము మరియు భవిష్య పదవి లభిస్తాయి. అందరికీ స్నేహిగా అవ్వడానికి కష్టపడాలి. ఎవరు ఎంత కష్టపడతారో అంతగా వారు స్నేహిగా అవుతారు. సమయం వచ్చినప్పుడు స్నేహితుడే గుర్తుకువస్తారు. కొన్ని విషయాలలో కష్టం గుర్తుకు వస్తుంది. బాబా కూడా ఎందుకు గుర్తుకు వస్తారు? కష్టపడ్డారు కాబట్టి స్నేహము ఉంది కదా. కష్టపడేవారి నుండి స్నేహిగా అవ్వాలి. ఎంత ఎక్కువగా కష్టమో అంత ఎక్కువగా అందరికీ స్నేహిగా అవుతారు. కష్టానికి ఫలితము స్నేహము. ఎవరైతే కష్టపడతారో వారిని అందరూ స్నేహ దృష్టితో చూస్తారు. ఎవరైతే కష్టపడరో వారిని స్నేహ దృష్టితో చూడరు. టీచరు గుణాన్ని విద్యార్థి తప్పకుండా ధారణ చేసుకోవాలి. స్నేహమే సంపూర్ణంగా చేస్తుంది. స్నేహంతో పాటు శక్తి కూడా కావాలి. రెండూ కలిసినప్పుడు స్నేహము మరియు శక్తి ఉన్న స్థితి అతి అతీతంగా మరియు అతి ప్రియంగా ఉంటుంది. ఎవరి మీదైతే స్నేహము ఉంటుందో వారి సమానంగా అవ్వాలి. ఇదే స్నేహానికి రుజువు. సమానతలో మేము ఎంతవరకు సమీపంగా ఉన్నాము అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎంతెంతగా సమానతలో సమీపంగా ఉంటారో అంతగా కర్మాతీత స్థితికి దగ్గరగా అవుతున్నారని అర్థం చేసుకోండి. ఇదే సమానతకు మీటరు. మీ కర్మాతీత స్థితిని పరిశీలించుకోండి. కేవలం స్నేహం ఉంటే కూడా సంపూర్ణంగా అవ్వలేరు. స్నేహంతోపాటు శక్తి కూడా కావాలి, అప్పుడు స్వయం సంపూర్ణంగా అయ్యి ఇతరులను కూడా సంపూర్ణంగా చేయగలరు. ఎందుకంటే శక్తితో ఆ సంస్కారాలు నిండుతాయి. కనుక ఇప్పుడు స్నేహంతో పాటు శక్తిని కూడా నింపుకోవాలి.
అందరి మనసులను జయించాలంటే ఏ గుణాలను పొందాలి? అందరినీ సంతుష్టపరచాలి. బాబాలో ఈ విశేష గుణము ఉండినది. అదే ఫాలో చేయండి. అందరూ మధుబన్ లిస్టులో ఉన్నారా లేక ఆల్రౌండర్ లిస్టులో ఉన్నారా? ఒకటి హద్దు లిస్టు, రెండు అనంతమైన లిస్టు. ఆల్రౌండర్ మరియు ఎవరెడీ. ఈ లిస్టులోనే ఏమి చేయాలో తెలుసా? ఒక్క సెకండులో తయారవ్వాలి. సంకల్పాలను కూడా ఒక్క సెకండులో ఆపివేయాలి. మిలిట్రీవారి పెట్టె- బేడ ఎప్పుడూ తయారుగా ఉంటుంది. అలాగే సంకల్పాల పెట్టెను కూడా మూసి ఉంచాలి. పెట్టె ఎప్పుడూ ఎవరెడీగా ఉండాలి. ఎవరెడీ అయ్యేవారి సంకల్పాల పెట్టె తయారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా కానీ దానిని ఎదిరించడానికి పెట్టె-బేడ తయారుగా ఉండాలి. అచ్ఛా.
ఆత్మిక పిల్లలూ! ఆత్మలైన మీరు వాణి నుండి అతీతంగా అయి మీ ఇంటికి వెళ్ళే పురుషార్థాన్ని చేయాలి. అందుకే ఈ పాత ప్రపంచంలో ఉంటూ దేహము మరియు దైహిక సంబంధాల నుండి ఉపరామచిత్తంతో ఉండండి. పతిత ప్రపంచంలో ఉంటూ కూడా పవిత్రంగా అయ్యే శక్తిని బాబా ఇస్తారు. పురుషార్థం చేసి మీరు సదా పవిత్రంగా అవ్వాలి.
పిల్లలూ! సదా గుణగ్రాహకులుగా అవ్వండి. స్తుతి-నింద, లాభము-హాని, జయము-అపజయము అన్నింటిలో సంతుష్టంగా అయి నడుచుకోండి మరియు దయాహృదయులుగా అవ్వండి. అచ్ఛా!
ఓంశాంతి