Search for a command to run...
25 Oct 1969
మాలలో పూసగా అవ్వడానికి విజయులుగా అవ్వండి
25 October 1969 · తెలుగు
బాప్‌దాదా పిల్లలను చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఏ విషయాన్ని చూస్తారు? ప్రతి రత్నము తమలో ఎంతెంత పరివర్తనను తీసుకువచ్చింది అన్నది చూడటానికే ఈరోజు వచ్చాము. అంటే ఈరోజు పరివర్తనను చూడటానికి వచ్చాము. ప్రతి ఒక్కరూ యథాశక్తి పరివర్తననైతే తీసుకువచ్చారు. కానీ బాప్‌దాదా ఏ పరివర్తనను చూడాలనుకుంటున్నారు? అది కూడా తెలుసు కదా? బాప్‌దాదా, పరివర్తనతో పాటు పరిపక్వతను కూడా చూడాలనుకుంటున్నారు. పరివర్తననైతే చూసాము కానీ పరివర్తనతో పాటు స్వయంలో పరిపక్వతను తీసుకువచ్చారా? తండ్రిని, ‘అవినాశి సత్యము’ అని అంటారు కదా, మరి తండ్రితోపాటు అటువంటి అవినాశి పరివర్తనను మీరూ తీసుకువచ్చారా? మీకు లభించే ఖజానాలు కూడా అవినాశియే, లభించే ప్రాలబ్ధాలు కూడా అవినాశియే. అలాంటప్పుడు పరివర్తనను కూడా అవినాశిగా తీసుకువచ్చారా లేక తిరిగి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని అనుకుంటున్నారా! ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏమో, పరిపక్వంగా ఉండగలమో లేదో, ప్రతిజ్ఞ అయితే చేసి వెళ్తున్నాము కానీ ఎంతవరకు నిలుపుకుంటామో చూద్దాము అని అనుకుంటున్నారా? ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు. రెండవవారు నిశ్చయబుద్ధి కలవారు, వారికి బాబాతోపాటు తమపై కూడా నిశ్చయం ఉంది, ఏదైతే పరివర్తన తీసుకువచ్చామో దానిని ఎప్పటికీ నిలుపుకుంటాము అనుకునేవారు. చేసిన ప్రతిజ్ఞను చేసి చూపిస్తాము అంటారు. వారు సంపూర్ణ నిశ్చయ బుద్ధి. మరికొందరైతే ధైర్యాన్ని దారణ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఇప్పటివరకు కూడా ఒకవేళ ఇలాగే చేసుకుంటూ వెళితే అంతిమం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారా? ఇటువంటి పురుషార్థిని ఒక్క దెబ్బకు మరణించినవారు (ఝాట్కూ) అని అనగలమా? దేవతలకు బలి ఇచ్చేటప్పుడు శక్తులు మరియు దేవతలు, బలి ఒక్క దెబ్బకు మరణించకపోతే స్వీకరించరు, మరి బాప్‌దాదా ఇలాంటివారిని స్వీకరించాలా? ఒకవేళ ఇక్కడ స్వీకరించకపోతే స్వర్గంలో ఉన్నత పదవి యొక్క స్వీకృతి లభించదు. అందుకే, ఏది ఆలోచిస్తారో అదే చెప్పండి, ఏది చెప్తారో అదే చేయండి అని చెప్పాము. ఆలోచించడము, చెప్పడము మరియు చేయడము, మూడూ ఒకేలా ఉండాలి. కానీ వర్తమాన సమయంలో కొంతమంది చాలా ఆలోచించేవారిగా ఉన్నారు, చాలా చెప్తుంటారు కానీ చేసే సమయంలో తక్కువగా చేస్తారు. అందుకే, ఈ భట్టీలో పక్కాగా అయి వెళ్ళండి అనగా పక్కాగా ప్రతిజ్ఞను చేసి వెళ్ళండి అని చెప్పాము. ముందుగా, ప్రతిజ్ఞ చేయడానికి ధైర్యము ఉందా లేక ధైర్యాన్ని ఇంకా ధారణ చేయాలా? ధైర్యవంతులైన పిల్లల లక్షణాలు ఏమిటి? వారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ మీరందరూ ధైర్యవంతులే అయితే తప్పకుండా మీరు ఈరోజు నుండి ఓడిపోరు. చాలా సమయం నుండి ఎవరైతే విజయులుగా అవుతున్నారో వారే విజయమాలలో పూసగా అవుతారు. ఒకవేళ విజయమాలలోకి రావాలనుకుంటే విజయులుగా అయ్యేలా పరివర్తనను తీసుకు రావలసి ఉంటుంది. పరివర్తనలోని ముఖ్యమైన విషయాలను చెక్ చేసుకోండి. చాలా సహజము.
రెండు మాటలు గుర్తుంచుకోండి. ఒకటి ఆకర్షణమూర్తులుగా అవ్వడము, రెండు హర్షితముఖులుగా అవ్వడము. ఆకర్షణ చేసేది ఆత్మ. ఆత్మిక స్థితిలోనే ఇతరులను ఆకర్షించగలరు. ఒకవేళ ఈ రెండు విషయాలను స్వయంలో ధారణ చేసుకున్నట్లయితే సంపూర్ణ విజయులుగా అవుతారు. మెజారిటీ పిల్లలలో ఉన్న ముఖ్య విషయమేమిటో కూడా ఈరోజు వినిపిస్తాము. నిశ్చయబుద్ధిగా అయితే ఉన్నారు, అందుకే ఇక్కడకు వచ్చారు. బాబాపై నిశ్చయము ఉంది, జ్ఞానముపై కూడా నిశ్చయము ఉంది కానీ స్వయంపై నిశ్చయం అక్కడక్కడ కదిలిస్తుంది. కంట్రోలింగ్ పవర్ (నియంత్రణ శక్తి) లేకపోవడమే ముఖ్యమైన లోపము. ఇది లేని కారణంగా అన్నీ అర్థం చేసుకున్నా, ఆలోచిస్తున్నా, స్వయాన్ని అనుభవం చేస్తూ కూడా మళ్ళీ అదే మాట అంటుంటారు. ఇక్కడ కంట్రోలింగ్ పవర్ అవసరం ఉందని అర్థం. మనసులో కూడా, వాచలో, కర్మణలో కూడా, వీటితోపాటు లౌకిక సంబంధాలు మరియు దైవీ పరివారపు సంబంధాలలోకి వచ్చేటప్పుడు కూడా. ఏది ఎంతవరకు చేయాలి, ఏమి మాట్లాడాలి, ఏమి అనకూడదు. ఏది చేయకూడదో అక్కడ కంట్రోల్ ఉండాలి – ఈ పూర్తి పవర్ లేని కారణంగా సఫలతను పొందలేకపోతున్నారు. మరి కంట్రోలింగ్ పవర్ యొక్క లోపాన్ని ఎలా తొలగించుకుంటారు? కొన్నిసార్లు ఏదైనా వస్తువును చాలా బాగా కంట్రోల్ చేయాలంటే కూడా కొన్నిటిని తేలికగా విడిచిపెట్టాల్సి ఉంటుంది అన్న విషయాన్ని గోపకలు(అన్నయ్యలు) చూసి ఉంటారు. గాలిపటాన్ని ఎప్పుడైనా ఎగురవేసారా? గాలిపటాన్ని కంట్రోల్ చేయడానికి మరియు పైకి ఎగురవేయడానికి ఏమి చేస్తారు? ఇది కూడా అలాగే. మీ బుద్ధిని కంట్రోల్ చేయడానికి కొన్ని విషయాలను తేలికగా వదిలివేయాలి. అన్నిటికన్నా తేలికైనదేమిటి? ఆత్మ (బిందువు) కనుక స్వయాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు స్వయాన్ని పూర్తిగా తేలికైన బిందు రూపంలో స్థితి చేసుకోండి. కంట్రోల్ చేసుకోవడానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. మీరు కూడా బిందువు పెట్టండి. గడిచినదానిని పూర్తిగా మర్చిపోండి. చూడండి, చేయండి కానీ తర్వాత దానిని పూర్తిగా సమాప్తం చేసేయండి. సమాప్తం చేయడము అంటే బిందువు, ఫుల్ స్టాప్ పెట్టడము. కామా (,) పెట్టడం వచ్చు, ప్రశ్న చిహ్నం (?) పెట్టడం కూడా వచ్చు, ఆశ్చర్య చిహ్నం (!) కూడా వచ్చు, కానీ ఫుల్ స్టాప్ పెట్టడం రాదు. కాగితంపై గుర్తులు పెట్టడమైతే సహజమే కదా కానీ కర్మలపై ఈ గుర్తులు పెట్టడం ఎందుకు కష్టమవుతుంది? కాగితంపై గుర్తులు పెడతారు కదా. ఏ గుర్తు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడ్తారు, దీనినే ప్రావీణ్యము అంటారు. ఒకవేళ కామాకు బదులు ఫుల్స్టాప్ పెడితే ప్రవీణులు అని అనరు. ఎక్కడ ప్రశ్న చిహ్నము పెట్టాలో అక్కడ ప్రశ్న చిహ్నము పెట్టకపోతే ప్రవీణులు అనరు. ఇక్కడ కూడా ఏ విషయంలో ప్రశ్న, ఆశ్చర్యము ఏ విషయంలో, ఫుల్ స్టాప్ ఎందులో పెట్టాలి, ఈ పూర్తి అవగాహన లేని కారణంగా ప్రవీణులుగా అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అర్థమయిందా కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారో. ఎందుకంటే ఆ సమయంలో జ్ఞాన పెట్రోల్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ జ్ఞానమనే పెట్రోల్ ఉంటే కంట్రోల్ ఉంటుంది. అందుకని మీ బుద్ధి అనే ట్యాంకులో పెట్రోల్‌ను జమ చేసి పెట్టుకోండి. మైనస్ మరియు ప్లస్ లెక్కను నేర్చుకున్నారా? బ్యాలెన్సు పెట్టుకోవడం కూడా నేర్చుకున్నారా? కేవలం జోడించాము, కట్ చేసాము అంటే కాదు, జమ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఒకవేళ జమ అవ్వకపోతే ఇతరులకూ ఇవ్వలేరు, స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళలేరు. ఇతరులకు ఇవ్వడానికి, అవసరమైనప్పుడు స్వయం కోసం ఉపయోగించుకోవడానికే జమ చేయడం జరుగుతుంది. కనుక ఎంత జమ చేసుకున్నాను అని చూసుకోవాలి? కేవలం సంపాదించాను, తినేసాను అంటున్నారా లేక జమ చేసుకుంటున్నారా? ఎప్పుడైనా లెక్క వేసారా? 25శాతం జమ అయితే చాలా తక్కువ. ఒకవేళ 25 శాతమే జమ అయి ఉంటే, ఇప్పటి లెక్క ప్రకారంగా బాప్‌దాదా ఏ బాధ్యతను ఇస్తారు? ఇప్పటినుండి ఎక్కువ స్మృతిని ఎన్ని రోజులలో చేస్తారు? తీవ్ర పురుషార్థి ఎప్పుడూ వినాశనం తారీఖు గురించి ఆలోచించరు. బహుకాలం నుండి సంపూర్ణత సంస్కారాలు ఉంటేనే అంతిమంలో కూడా సంపూర్ణంగా కాగలరు. ఒకవేళ చివరలో అయితే బాప్‌దాదా కూడా చివరలో కొద్దిగా మాత్రమే ఇస్తారు. ఎవరైతే ఇప్పుడు చేస్తారో వారిని బాప్‌దాదా కూడా సత్యయుగ ఆరంభంలోకి ‘రండి’ అంటారు. వీరు అనేకులను ఆశావాదిగా చేస్తారు అని బాప్‌దాదాకు ప్రతి రత్నంపై ఆశ ఉంది. అనేకులకు ఆశాదీపమైన వారు స్వయం కోసం అంతిమ సమయాన్ని ఆశగా ఎలా పెట్టుకోగలరు? అచ్ఛా.
ఈ గ్రూపు భట్టీ కూడా పూర్తయింది. సమాప్తమయిందా లేక ఆరంభమయిందా? ఈ గ్రూపుకు పరీక్ష పెట్టలేదు. మీరు చూసిన ఎగ్జాంపుల్ (ఉదాహరణ)ను సదాకాలం కోసం నిలుపుకుంటూ వస్తే అప్పుడు పరీక్ష పెడతాము. ఏదైనా వస్తువును గట్టిగా చేయాలంటే ఏమి చేస్తారు? పునాదిని గట్టిగా ఉంచడానికి లోతు ముఖ్యము. ఎంతెంత లోతుకు వెళ్తారో అంత గట్టిగా అవుతుంది. పైపైనే పునాదిని వేస్తే గట్టితనం ఉండదు. ఎంత లోతుగా జ్ఞానాన్ని ధారణ చేస్తే ఉంటారో అంతగా గట్టితనం వస్తుంది. అందరూ ఏంతో కొంత పరివర్తనను అయితే తీసుకువచ్చారు, ఎంతో కొంత అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే ప్రాక్టికల్లోకి తెచ్చినప్పుడే ఫైనల్ సర్టిఫికేటును ఇస్తాము. ఇప్పుడు సర్టిఫికేటు ఇవ్వము. పిల్లలందరూ ఉల్లాస ఉత్సాహాలతో తమ పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎంతో తత్పరులై ఉన్నారని చూసి ఇప్పుడు మేము హర్షితంగా ఉన్నాము. కానీ ప్రాక్టికల్‌లో రిజల్ట్ అవుట్ అయినప్పుడే సర్టిఫికేటును ఇస్తాము. భట్టీ సమాప్తం అయిందనుకోకండి, ఆరంభమయింది. ఇప్పుడు వినడము అయింది, ఇక చేయాలి. చేసిన తర్వాత సర్టిఫికేటు లభిస్తుంది.
ఈ గ్రూపులోని ముఖ్యమైన విశేషత – ఐకమత్యము(ఏకత)ను చూసాము. ఏకతతోపాటు ఇప్పుడు మరో పదాన్ని కూడా జోడించండి. ఏకతతో పాటు ఏకాంతప్రియంగా కూడా అవ్వాలి. ఎలా అయితే ఏకత్వంలో నంబరువన్‌గా ఉన్నారో అలాగే ఏకాంతంలో ఉండటంలో కూడా నంబరువన్ రావాలి. ఇది ధారణ చేయండి, అప్పుడు ఈ గ్రూపు అనేకులకన్నా ముందుకు వెళ్ళగలదు. ఏకతతో పాటు ఏకాంతవాసిగా ఎలా కావాలో, ఇది కూడా స్వయంలో నింపుకోవాలి. అనేక వైపుల నుండి బుద్ధియోగము తెగి ఉన్నవారే ఏకాంతప్రియులుగా, ఒక్కరి పైనే ప్రేమతో ఉంటారు. ఒక్కరే ప్రియులుగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. అనేకులపై ప్రేమ ఉంటే ఒక్కరి స్మృతి ఉండలేదు. అనేక వైపుల నుండి బుద్ధియోగము తెగి ఉండాలి. ఒకవైపుకు జోడింపబడి ఉండాలి అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు అన్న స్థితిలో ఎవరైతే ఉంటారో వారు ఏకాంతప్రియులుగా ఉండగలరు. లేకపోతే ఏకాంతంలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నాగానీ అనేక వైపులకు బుద్ధి భ్రమిస్తుంది. ఏకాంతంలోని ఆనందాన్ని అనుభవం చేయలేరు. సర్వ సంబంధాలు, సర్వ రసాలు ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంతప్రియులుగా అవుతారు. ఒక్కరి నుండి సర్వ రసాలు ప్రాప్తిస్తున్నప్పుడు అనేక వైపులకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కానీ ఎవరైతే ఒక్కరి నుండి సర్వ రసాలను పొందే అభ్యాసిగా ఉండరో వారు అనేక వైపుల నుండి రసాలను తీసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక్కటి కూడా ప్రాప్తించదు. ఒక్క బాబా వైపు పెట్టినప్పుడు అనేక ప్రాప్తులు కలుగుతాయి. కేవలం ‘ఒక్క’ అన్న మాటను గుర్తుంచుకున్నా కానీ అందులో పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది, స్మృతి కూడా వచ్చేస్తుంది, సంబంధం కూడా వచ్చేస్తుంది, స్థితి కూడా వచ్చేస్తుంది. అలాగే ఏదైతే ప్రాప్తి కలుగుతుందో అది కూడా ‘ఒక్క’ అన్న పదంతో స్పష్టం అవుతుంది. ఒక్కరి స్మృతి, స్థితి ఏకరసంగా మరియు జ్ఞానం కూడా పూర్తిగా ఒక్కరి స్మృతియే లభిస్తుంది. లభించే ప్రాప్తి కూడా ఏకరసంగా ఉంటుంది. ఈరోజు చాలా సంతోషము, రేపు దుఃఖము ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రాప్తి ఉండదు. అతీంద్రియ సుఖము కూడా ఏకరసంగా ఉండదు. ఒకసారి ఎక్కువ, మరోసారి తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఏకరస స్థితిలో స్థితి అయ్యే పేపరు రాసేందుకు వెళ్తున్నారు. పేపరులో ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూస్తాము. ఇతరులకు చేసి చూపించాలి అని ఎప్పుడూ ఈ ప్రయత్నమే చేయండి. మన కర్మ మరియు మన నడవడిక ఇతరులకు చదువు కావాలి. ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వకండి, ఇందుకోసం సహజమైన విషయాన్ని నేర్పిస్తున్నాము. కనుక ఎందులోనూ ఫెయిల్ అవ్వకండి, ఇందుకోసం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి – ఫాలో ఫాదర్. సాకార రూపంలో ఏదైతే చేసి చూపించారో దానిని ఫాలో చేయండి, అప్పుడు ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. ఫెయిల్ అయ్యే సందర్భం ఏదైనా వచ్చినా కానీ, నేను ఫాలో ఫాదర్ చేస్తున్నానా అని గుర్తు పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలు సాకార రూపంలో ఉండి ఏ కర్మలనైతే చేసారో, ఆ ఒక్క మాటను మీ ముందుకు తీసుకురండి. ఇలా ఎప్పుడైతే ఫాలో ఫాదర్ చేస్తారో, ఒకవేళ అలాంటి ఇలాంటి కర్మలు అవుతుంటాయో వాటికి బ్రేక్ పడుతుంది, ఈ కర్మను నేను చేయవచ్చా అని నిర్ణయించుకోగలుగుతారు. ఫాలో ఫాదర్. ఫాదర్ అంటే అందులో ఇద్దరూ వచ్చేస్తారు. ఫాలో ఫాదర్ గుర్తుంటే ఫెయిల్ అవ్వరు. ఫ్లాలెస్ (మచ్చలేకుండా) అవుతారు. బాప్‌దాదా పిల్లలను దోషరహితంగా చేయాలనుకుంటున్నారు. మాలలో సమీపంగా తీసుకురావడానికి ఈ సహజమైన యుక్తిని చెప్తున్నాము. చూడండి, మీకు యుక్తిని వినిపించాము, మీకన్నా ముందే ఎవరూ ప్రయోగించకుండా చూసుకోండి. బాప్దాదాకైతే ప్రతి సితారపై ఆశ ఉంది. అందుకే ఆశావాది సితారలు అంటాము.
విశేష స్నేహము ఉంది కనుకనే ఇటువంటి సమయంలో వచ్చారు. త్యాగము కూడా ఉంది కదా. మీ నిద్రను కూడా త్యాగం చేసారు, ఇది కూడా స్నేహమే. బాప్‌దాదా స్నేహానికి రిటర్ను ఇస్తున్నారు. ఇప్పుడిక వెళ్ళిన తర్వాత రిజల్టును చూస్తాము. రావడానికే వెళుతున్నారు. వెళ్ళడము మరియు రావడము. వెళ్ళవలసిందే. కానీ వెళ్ళేది రావడానికే. ఎంతెంతగా అవ్యక్త స్థితి యొక్క అనుభవీగా అవుతారో అంతగా అవ్యక్త మధుబన్ వైపుకు ఆకర్షితమవుతూ ఉంటారు. ఇప్పుడు వ్యక్త మధుబన్ కాదు. అచ్ఛా.
ఓంశాంతి