Search for a command to run...
25 Feb 2006
ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తులుగా ఉండే వ్రతాన్ని చేపట్టండి, దయార్ద్రహృదయులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి, కలిసి వెళ్ళాలంటే సమానముగా అవ్వండి
25 February 2006 · తెలుగు
ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహీ పిల్లల యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో బాప్‌దాదా జన్మదినానికి చెందిన ఉల్లాసముతో కూడిన శుభాకాంక్షలు నిండి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషముగా ఈ రోజు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారా లేక తీసుకోవడానికి వచ్చారా? బాప్‌దాదా కూడా చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరికీ వారి జన్మదినం సందర్భముగా పదమాల, పదమాల, పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఈ రోజుకు ఉన్న విశేషత మొత్తము కల్పములో ఏ రోజుకూ ఉండదు, ఈ రోజు తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకేసారి జరుగుతుంది. దీనిని విచిత్ర జయంతి అంటాము. మొత్తము కల్పమంతా తిరిగి చూడండి, ఇటువంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా! కానీ ఈ రోజు బాప్‌దాదా పిల్లల జయంతిని జరుపుతున్నారు మరియు పిల్లలు బాప్‌దాదా జయంతిని జరుపుతున్నారు. పేరైతే శివజయంతి అని అంటారు కానీ ఇది ఎటువంటి జయంతి అంటే, ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము బాబాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చాము మరియు బాబా మాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు అని మీ అందరికీ కూడా చాలా సంతోషము కలుగుతూ ఉంది కదా, ఎందుకంటే తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిపి ఒకేసారి జరగటమంటే, ఇది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా బాబా ఏమీ చెయ్యలేరు మరియు బాబా లేకుండా పిల్లలు ఏమీ చెయ్యలేరు. జన్మ కూడా కలిపే జరిగింది మరియు సంగమయుగములో ఉండటము కూడా కలిసే ఉంటారు, ఎందుకంటే బాబా మరియు పిల్లలు కంబైండ్‌గా ఉన్నారు, విశ్వ కళ్యాణ కార్యాన్ని కూడా కలిసే చేస్తారు, కేవలం బాబా ఒక్కరే కూడా చెయ్యలేరు, కేవలం పిల్లలు ఒక్కరే కూడా చెయ్యలేరు, కలిసే ఉన్నారు, అంతేకాక బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే - కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము. కలిసే వస్తాము కదా! ప్రతిజ్ఞ ఉంది కదా! తండ్రి మరియు పిల్లల మధ్యన ఇంతటి ప్రేమ ఉండటాన్ని చూసారా? చూసారా లేక అనుభవం చేస్తున్నారా? అందుకే ఈ సంగమయుగానికి మహత్వము ఉంది మరియు ఈ మిలనము యొక్క స్మృతిచిహ్నమునే రకరకాల మేళాలలో తయారుచేసారు. ఈ శివజయంతి రోజున భక్తులు - భగవంతుడా రండి అని పిలుస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు... అని ఆలోచిస్తున్నారు, కానీ మీరు వారితో మిలనము జరుపుకుంటున్నారు.
బాప్‌దాదాకు భక్తులపై స్నేహము కూడా ఉంది మరియు దయ కూడా కలుగుతుంది. భగవంతుని కోసం ఎంతగా ప్రయత్నము చేస్తుంటారు, ఎంతగా వెతుకుతుంటారు. మీరు వెతికారా లేక బాబా మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే చుట్టూ భ్రమిస్తూనే ఉన్నారు. కానీ బాబాను చూడండి, పిల్లలు ఏ మూలలో తప్పిపోయి ఉన్నా కానీ వెతికి పట్టుకున్నారు. ఈరోజు కూడా చూడండి, భారత్‌లోని అనేక రాష్ట్రాల నుండైతే వచ్చారు, కానీ విదేశాలు కూడా తక్కువగా ఏమీ లేవు, 100 దేశాల నుండి వచ్చారు. కానీ దీని కోసం చేసిన శ్రమ ఏమిటి? బాబాకు చెందినవారిగా అవ్వడానికి ఏ శ్రమ పడ్డారు? శ్రమ పడ్డారా? చేసారా శ్రమ? ఎవరైతే బాబాను వెతకటానికి శ్రమపడ్డారో వారు చేతులెత్తండి. భక్తిలో చేసారు, కానీ ఇప్పుడు బాబానే మిమ్మల్ని వెతికినప్పుడు, ఇక మీరు శ్రమ పడ్డారా? చేసారా శ్రమ? క్షణములో ఒప్పందము కుదుర్చుకున్నారు. ఒక్క పదముతో ఒప్పందము కుదిరిపోయింది. ఆ ఒక్క పదము ఏమిటి? ‘‘మేరా’’. పిల్లలు ‘‘మేరా బాబా’’ (నా బాబా) అని అన్నారు, బాబా ‘‘మేరే బచ్చే’’ (నా పిల్లలు) అని అన్నారు. అంతే, అలా అయిపోయారు. ఇది సులువైన వ్యాపారమా లేక కష్టమైనదా? సులువైనదే కదా! కొంచెం, కొంచెం కష్టము అని అనుకునేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు అయితే కష్టమనిపిస్తుంది కదా! లేక అనిపించటం లేదా? వాస్తవానికి సహజమైనదే కానీ మీ బలహీనతలు కష్టముగా ఉన్నట్లు అనుభవం చేయిస్తాయి.
బాప్‌దాదా కూడా చూస్తుంటారు, భక్తులలో కూడా సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, స్వార్థ భక్తులు కాదు, సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు. వారు కొద్దిరోజుల కోసం వ్రతాన్ని పెట్టుకుంటారు, కానీ మీరందరూ ఎటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారంటే, ఇప్పుడు చేసే ఈ ఒక్క వ్రతము 21 జన్మలకు స్థిరముగా నిలిచిపోతుంది. వారు ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు, వ్రతము పెట్టుకుంటారు. మీరు కల్పములో ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు, దీని వలన 21 జన్మల కోసం ఇక మనసుతో గాని, తనువుతో గాని వ్రతాన్ని పెట్టుకోవలసిన అవసరముండదు. వ్రతమైతే మీరు కూడా చేపడతారు, ఏ వ్రతాన్ని చేపట్టారు? పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితము యొక్క వ్రతాన్ని చేపట్టారు. జీవితమే పవిత్రముగా అయ్యింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమనే కాదు, జీవితములో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారాలు అన్నీ పవిత్రముగా ఉండాలి. ఇటువంటి వ్రతాన్నే చేపట్టారు కదా? చేపట్టారా? తల ఊపండి. చేపట్టారా? పక్కాగా చేపట్టారా? పక్కానా లేక కాస్త కాస్త కచ్చాగా కూడా ఉందా? అచ్ఛా, ఒక మహాభూతము కామము, ఈ విషయములోనే వ్రతాన్ని చేపట్టారా లేక మిగిలిన నాలుగు భూతాల గురించి కూడా వ్రతాన్ని చేపట్టారా? బ్రహ్మచారులుగా అయితే అయ్యారు, కానీ వెనుక ఉన్న నాలుగు భూతాల విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా? క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా లేక దానిని మినహాయించారా? క్రోధము చేయడానికి అనుమతి లభించిందా? అది రెండవ నంబర్ కదా, అందుకే ఏమీ ఫర్వాలేదులే అనైతే అనుకోవటము లేదు కదా? ఎలా అయితే కామాన్ని మహాభూతముగా భావించి మనసా, వాచ, కర్మలలో పక్కా వ్రతాన్ని చేపట్టారో, అలాగే క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా? మేము క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టాము అని ఎవరైతే భావిస్తున్నారో, దాని వెనుక లోభము, మోహము, అహంకారము అనే పిల్లా పాపలు కూడా ఉన్నాయి, కానీ బాప్‌దాదా ఈరోజు క్రోధము గురించి అడుగుతున్నారు. క్రోధమనే వికారము విషయములో ఎవరైతే సంపూర్ణ వ్రతాన్ని చేపట్టారో, వారు మనసులో కూడా క్రోధము లేకుండా, హృదయములో కూడా క్రోధము యొక్క ఫీలింగ్ లేకుండా ఉన్నారా? ఈరోజు శివ జయంతి కదా! ఈరోజు భక్తులు వ్రతము పెట్టుకుంటారు కావున బాప్‌దాదా కూడా వ్రతము గురించి అడుగుతారు కదా! మాకు స్వప్నములో కూడా క్రోధము యొక్క అంశము రాజాలదు అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. రాజాలదు. వస్తుందా? రాదా? రాదా? (కొద్దిమంది చేతులెత్తారు). అచ్ఛా, ఎవరైతే చేతులెత్తారో వారి ఫోటో తియ్యండి ఎందుకంటే బాప్‌దాదా మీరు చేతులెత్తినంత మాత్రాన ఒప్పుకోరు. మీ సహచరుల నుండి కూడా సర్టిఫికేట్ తీసుకుంటారు, అప్పుడు ప్రైజ్ ఇస్తారు. ఇది మంచిది. ఎందుకంటే బాప్‌దాదా చూసారు, క్రోధము యొక్క అంశము కూడా ఉంటుంది, ఈర్ష్య, ద్వేషము, ఇవి కూడా క్రోధానికి పిల్లాపాపలు వంటివి. కానీ మంచిది. ఎవరైతే ధైర్యము పెట్టారో, వారికి బాప్‌దాదా ఇప్పుడైతే అభినందనలను ఇస్తున్నారు కానీ సర్టిఫికేట్ లభించిన తర్వాత బహుమతి ఇస్తాము, ఎందుకంటే బాప్‌దాదా హోమ్‌వర్క్‌ను ఏదైతే ఇచ్చారో, దాని రిజల్ట్‌ను కూడా బాప్‌దాదా చూస్తున్నారు.
ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు, మరి పుట్టినరోజు నాడు ఏం చేస్తారు? ఒకటేమో కేక్ కట్ చేస్తారు. మరి ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది, ఇప్పుడింకా ఒక నెల మిగిలి ఉంది, ఈ రెండు నెలలలో మీరు వ్యర్థ సంకల్పాలు అనే కేక్‌ను కట్ చేసారా? ఆ కేక్‌ను అయితే చాలా సహజంగా కట్ చేస్తారు కదా, ఈ రోజు కూడా కేక్ కట్ చేస్తారు. కానీ వ్యర్థ సంకల్పాలనే కేక్‌ను కట్ చేసారా? కట్ చెయ్యాలి కదా! ఎందుకంటే కలిసే వెళ్దాము అన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా! కలిసే ఉన్నాము, కలిసే వెళ్దాము అన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా! మరి కలిసి వెళ్ళాలి అంటే సమానముగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా! ఒకవేళ ఎంతో కొంత మిగిలిపోయి ఉన్నా కానీ ఇప్పటికి రెండు నెలలైతే పూర్తయిపోయాయి. ఈ రోజు పుట్టినరోజును జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. విమానములో కూడా వచ్చారు, ట్రైన్లో కూడా వచ్చారు, కార్లలో కూడా వచ్చారు. పరుగు పరుగున వచ్చారు అని బాప్‌దాదాకు సంతోషముగా ఉంది. కానీ పుట్టినరోజు నాడు ముందుగా బహుమతిని కూడా ఇస్తారు, మరి ఒక్క నెల మిగిలి ఉంది కదా, అలాగే హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా కాల్చటం జరుగుతుంది. కనుక కొద్దో గొప్పో వ్యర్థ సంకల్పాల బీజము ఏదైతే ఉందో, ఒకవేళ బీజము ఉండిపోయినట్లయితే ఎప్పుడైనా దాని నుండి మళ్ళీ కాండము కూడా రావచ్చు, ఒక్కోసారి శాఖలు కూడా వస్తాయి. కనుక నేటి ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా (మనసులోని ఉల్లాస-ఉత్సాహాలు, నోటి నుండి రావటం కాదు, మనసు నుండి రావాలి, మనసు యొక్క ఉల్లాస-ఉత్సాహాలు) మనసులోనైనా, వాణిలోనైనా, సంబంధ-సంపర్కములోనైనా కొద్దో గొప్పో ఏదైతే మిగిలిపోయి ఉందో, దానిని ఈ రోజున, బాబా పుట్టినరోజు సందర్భముగా బాబాకు ఈ బహుమతిని ఇవ్వగలరా? మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా ఇవ్వగలరా? లాభమైతే మీకే. బాబా అయితే చూస్తుండాలి. ఎవరైతే ఉల్లాస-ఉత్సాహాలతో ధైర్యము ఉంచుతారో, చేసే చూపిస్తాము, బెస్ట్‌గా తయారయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వదలాల్సి ఉంటుంది, ఆలోచించుకోండి. మాటలలో కూడా రాకూడదు. సంబంధ-సంపర్కములో కూడా ఉండకూడదు. అంత ధైర్యము ఉందా? ఉందా ధైర్యము? మధుబన్ వారిలో కూడా ధైర్యము ఉంది, విదేశాలవారిలో కూడా ఉంది, భారతవాసులలో కూడా ఉంది, ఎందుకంటే బాప్‌దాదా యొక్క ప్రేమ ఉంది కదా, కనుక బాప్‌దాదా భావిస్తున్నారు - అందరూ కలిసే వెళ్ళాలి, ఎవ్వరూ మిగిలిపోకూడదు. కలిసే వెళ్తాము అన్న ప్రతిజ్ఞ చేసినప్పుడు మరి సమానముగా అయితే అవ్వాల్సే ఉంటుంది. ప్రేమ ఉంది కదా! కష్టముగా అయితే చేతులు ఎత్తలేదు కదా?
బాప్‌దాదా ఈ సంగఠనను, బ్రాహ్మణ పరివారాన్ని బాబా సమానమైన ముఖము కలవారిగా చూడాలనుకుంటున్నారు. కేవలం దృఢ సంకల్పము చేసే ధైర్యము పెట్టుకోండి, ఇది కష్టమైన విషయమేమీ కాదు, కానీ దీని కొరకు సహనశక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలోనైతే సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఉన్నాయో, ఈ రెండు శక్తులు ఉన్నాయో, వారు క్రోధముక్తులుగా సహజముగానే అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాప్‌దాదా సర్వ శక్తులను వరదానముగా ఇచ్చారు. మీ టైటిలే మాస్టర్ సర్వశక్తిమాన్. కేవలం ఒక్క స్లోగన్‌ను గుర్తుంచుకోండి, అంతే. ఒకవేళ ఒక్క నెలలో సమానముగా అవ్వాల్సిందే అని అనుకుంటే ఒక స్లోగన్‌ను గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రతిజ్ఞ, అదేమిటంటే - దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. కొందరు, ఈ రోజున ఎవరికీ దుఃఖము ఇవ్వలేదు కదా అన్నదానిని చెక్ చేసుకుంటారు కానీ దుఃఖాన్ని తీసుకోవటమైతే చాలా సహజముగా తీసుకుంటారు, ఎందుకంటే తీసుకునేటప్పుడు ఇతరులు ఇచ్చారు కదా అని అంటూ స్వయాన్ని సమర్థించుకుంటారు. నేనేమైనా చేసానా, వారు ఇచ్చారు అని అంటారు, కానీ ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నది మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు పొరపాటు చేసారు, దాని లెక్కచారము బాబాకు మరియు డ్రామాకు తెలుసు, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? బాప్‌దాదా రిజల్ట్‌లో ఏమి చూసారంటే, దుఃఖము ఇచ్చే విషయములోనైతే ఎంతోకొంత ఆలోచిస్తారు, కానీ తీసుకోవటమైతే చాలా త్వరగా తీసుకుంటారు, అందుకే సమానముగా అవ్వలేకపోతారు. ఎవరు ఎంత దుఃఖము ఇచ్చినా కానీ తీసుకోకూడదు, లేదంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది, అందుకే ఒకవేళ చిన్నచిన్న విషయాలలో ఫీలింగ్ పెరుగుతుంటే వ్యర్థ సంకల్పాలు సమాప్తమవ్వలేవు అని అర్థం, మరి అప్పుడు బాబాతో కలిసి ఎలా వెళ్ళగలరు! బాబాకు ప్రేమ ఉంది. బాబా మిమ్మల్ని వదల్లేరు, తమతో పాటు తీసుకునే వెళ్ళాలి. అంగీకారమేనా? ఇష్టమే కదా? ఇష్టమైతే చేతులెత్తండి. వెనుక వెనుక అయితే రాకూడదు కదా! ఒకవేళ కలిసే వెళ్ళాలంటే కానుకను ఇవ్వాల్సే ఉంటుంది. ఒక నెల అందరూ అభ్యాసము చేయండి - దుఃఖము తీసుకోకూడదు, దుఃఖము ఇవ్వకూడదు. నేను దుఃఖాన్ని ఇవ్వలేదు, వారే తీసుకున్నారు అని అనవద్దు. ఏదో ఒకటి జరుగుతుంటుంది. పరదర్శనము చెయ్యకూడదు, స్వ దర్శనము చేసుకోవాలి. హే అర్జున్‌గా నేనే అవ్వాలి.
చూడండి, బాప్‌దాదా రిపోర్ట్ చూసారు, ఇప్పుడు మెజారిటీలో సంతుష్టతా రిపోర్టు లేదు, అందుకే బాప్‌దాదా మళ్ళీ ఒక నెల కోసం అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకవేళ ఒక నెల అభ్యాసము చేసినట్లయితే అది అలవాటైపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇలా అవుతూనే ఉంటుంది, ఈ మాత్రమైతే నడుస్తుందిలే... అని తేలికగా వదిలేయకండి. ఒకవేళ బాప్దాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం కేవలం ఒక్క క్రోధమనే వికారాన్ని బలిహారము చెయ్యలేరా? బలిహారము చేయడానికి గుర్తు ఏమిటంటే, ఆజ్ఞను పాటించేవారిగా ఉండటము. వ్యర్థ సంకల్పాలు అంతిమ ఘడియలో చాలా మోసగించగలవు ఎందుకంటే నలువైపులా దుఃఖపూరిత వాయుమండలము, ప్రకృతి వాయుమండలము మరియు ఆత్మల వాయుమండలము తమ వైపుకు ఆకర్షించేవిగా ఉంటాయి. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ వ్యర్థములోనే చిక్కుకుపోతారు. ఈ రోజు బాప్‌దాదాకు విశేషముగా ధైర్యముతో కూడిన ఈ సంకల్పము ఉంది, అదేమిటంటే - విదేశాలలో ఉండేవారైనా, భారత్‌లో ఉండేవారైనా, అందరూ ఒక్క బాప్‌దాదా పిల్లలే, కనుక నలువైపులా ఉన్న పిల్లలు ధైర్యము మరియు దృఢతతో సఫలతామూర్తులుగా అయ్యి విశ్వములో ఈ విషయాన్ని అనౌన్స్ చెయ్యాలి - మాలో కామము లేదు, క్రోధము లేదు, మేము పరమాత్ముని పిల్లలము. ఇతరులలో ఉన్న మద్యపానం తాగే అలవాటు, బీడీని కాల్చే అలవాటును మాన్పిస్తారు. కానీ బాప్‌దాదా ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరికీ క్రోధ ముక్తులుగా, కామవికార ముక్తులుగా అయ్యే ధైర్యాన్నిచ్చి వారిని విశ్వ వేదికపై చూపించాలనుకుంటున్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మొదటి వరుసలోనివారికి ఇష్టమేనా? మధుబన్ వారికి ఇష్టమేనా? మధుబన్ వారికి కూడా ఇష్టమే. విదేశాలవారికి కూడా ఇష్టమేనా? మరి ఇష్టమైనది చెయ్యటము ఏమంత పెద్ద విషయము కాదు. బాప్‌దాదా కూడా ఎక్స్ట్రా కిరణాలను ఇస్తారు. వీరు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణ పరివారము అన్నది చూపించాలి ఎందుకంటే సమయము కూడా పిలుస్తూ ఉంది, బాప్‌దాదా దగ్గరైతే అడ్వాన్స్ పార్టీ వారి హృదయపు పిలుపు కూడా ఉంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయి ఉంది. ఇప్పుడు నాకు కూడా ముక్తిని ఇవ్వండి అని అది కూడా కోరుకుంటుంది. ముక్తిని ఇస్తారు కానీ మధ్యమధ్యలో దానితో కాస్త స్నేహము చేస్తారు, ఎందుకంటే 63 జన్మలు స్నేహితురాలిగా ఉంది కదా! బాప్‌దాదా అంటున్నారు, ఓ మాస్టర్ ముక్తిదాతలారా, ఇప్పుడు అందరికీ ముక్తిని ఇవ్వండి, ఎందుకంటే మొత్తము విశ్వానికి ఏదో ఒక ప్రాప్తిని కానుకగా ఇవ్వాలి, దాని కోసం ఎంత పని చెయ్యాలి, ఎందుకంటే ఈ సమయములో సమయము మీకు సహచరునిగా ఉంది, సర్వాత్మలు ముక్తిలోకి వెళ్ళాల్సిందే, ఇది ఆ సమయమే. ఇతర సమయాలలో ఒకవేళ మీరు పురుషార్థము చేసినా కానీ సమయము ఉండదు, అందుకే మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయము ఉంది, అందుకే బాప్‌దాదా అంటున్నారు - ముందు స్వయానికి ముక్తిని ఇచ్చుకోండి, ఆ తర్వాత విశ్వములోని సర్వాత్మలకు ముక్తిని ఇచ్చే బహుమతిని ఇవ్వండి. వారు పిలుస్తూ ఉన్నారు, మీకు ఆ దుఃఖితుల పిలుపు వినపడటం లేదా? ఒకవేళ మీరు మీదానిలోనే బిజీగా ఉంటే వారి పిలుపు వినపడదు. దుఃఖితులపై దయ చూపించండి... అని పదే పదే పాట పాడుతున్నారు. ఇప్పటినుండే దయాళు, కృపాళు, దయార్ద్ర హృదయము కల సంస్కారాలను బహుకాలము నుండి నింపుకోకపోతే, మీ జడ చిత్రాలలో దయార్ద్ర హృదయము, కృప, దయతో కూడిన వైబ్రేషన్లు ఎలా నిండుతాయి.
డబల్ విదేశీయులు ఇలా అనుకుంటున్నారా, మీరు కూడా ద్వాపరములో దయార్ద్ర హృదయులై మీ జడ చిత్రాల ద్వారా అందరికీ దయ చూపిస్తారు కదా! అవి మీ చిత్రాలే కదా లేక ఇండియావారివేనా? అవి మా చిత్రాలు అని విదేశీయులు భావిస్తున్నారా? మరి చిత్రాలు ఏమిస్తాయి? చిత్రాల వద్దకు వెళ్ళి ఏమడుగుతారు? దయ. దయ కావాలి అని కోరుకుంటారు. ఇప్పుడు సంగమములో మీరు మీ ద్వాపర, కలియుగాల సమయము కోసం జడ చిత్రాలలో వాయుమండలాన్ని నింపుతారు, అప్పుడు మీ జడచిత్రాల ద్వారా వాటిని అనుభవము చేస్తారు. భక్తుల కళ్యాణమైతే జరుగుతుంది కదా! భక్తులు కూడా మీ వంశావళి వారే కదా! మీరందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌కు సంతానము. భక్తులు దుఃఖముతో ఉన్నారు, కానీ వాస్తవానికి వారు మీ వంశావళివారే కదా! మరి మీకు దయ కలగటం లేదా? కలుగుతుంది కానీ కొద్దికొద్దిగా ఇంకెక్కడెక్కడో బిజీ అయిపోతారు. ఇప్పుడు మీరు మీ పురుషార్థములో ఎక్కువ సమయాన్ని పెట్టకండి. ఇవ్వటములో పెట్టండి, అప్పుడు ఇవ్వటం తీసుకోవటముగా అయిపోతుంది. చిన్న చిన్న విషయాలలో చిక్కుకోకండి. ముక్తిరోజును జరుపుకోండి. ఈ రోజును ముక్తిరోజుగా జరుపుకోండి. సరేనా? మొదటి వరుసలోని వారు సరేనా? మధుబన్ వారు సరేనా?
ఈ రోజు మధుబన్ వారు చాలా ప్రియముగా అనిపిస్తున్నారు ఎందుకంటే మధుబన్ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. ప్రతి విషయములోనూ మధుబన్ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. మరి మధుబన్ వారు ముక్తిరోజును జరుపుకున్నట్లయితే అందరూ ఫాలో చేస్తారు. మధుబన్ నివాసులైన మీరందరూ మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వాలి. అవ్వాలా? (అందరూ చేతులెత్తుతున్నారు) మంచిది. చాలామంది ఉన్నారు. అచ్ఛా, చాలా మంచి మంచి వారున్నారు. ఆశావాదులు ఉన్నారు ఎందుకంటే మధుబన్ వారు నియరెస్ట్ (సమీపంగా ఉన్నవారు), మరి నియరెస్ట్ వారు డియరెస్ట్గా (ప్రియమైనవారిగా) కూడా ఉంటారు. మధుబన్ వారు నియరెస్ట్ కదా! నియరెస్ట్ మరియు డియరెస్ట్గా ఉన్నారు. మీరు కాదు అని కాదు. మీరు కూడా డియరెస్ట్ ఉన్నారు, కానీ వీరు నియరెస్ట్గా ఉన్నారు. మరి ఇక్కడ ఉండటంలో లాభము ఉంది కదా. మరి చేయడంలో కూడా లాభాన్ని తీసుకుంటారు కదా.
అచ్ఛా. టీచర్లు చేతులెత్తండి. చాలామంది టీచర్లు ఉన్నారు. టీచర్లను బాబా గురుభాయి అంటారు. మరి గురుభాయి ఏమి చేస్తారు? ఫాలో. అచ్ఛా.
ఈనాటి జన్మదినానికి నలువైపుల నుండి వచ్చిన వారు, కార్డులు పంపినా, కంప్యూటర్ ద్వారా పంపినా, ఈమెయిల్ ద్వారా పంపినా, ఎవరెవరైతే జన్మ దినానికి అభినందనలు పంపారో, వారందరికీ ఒక్కొక్కరికీ పేరు సహితంగా, ఎవ్వరూ మీ పేరును మర్చిపోకండి, అందరి పేర్లు బాప్‌దాదా హృదయంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమకిచ్చే రెస్పాంస్ను చాలా చాలా పెద్ద మనసుతో స్వీకరించండి. బహుమతులు కూడా చిన్నవిపెద్దవి పంపారు, కొందరైతే 70-70 వస్తువులు కూడా పంపారు. పెద్ద మనసుతో జరిపారు, వారందరికీ 70 సార్లు ఏమిటి, 70 పదమారెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్‌దాదా యొక్క హృదయ ఆశీర్వాదాలను అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు స్వీకరించండి. అచ్ఛా.
సేవ టర్న్ యు.పి జోన్ వారిది, అలాగే బనారస్ క్షేత్రం యొక్క నేపాల్ కూడా ఉంది:- అందరూ లాభాన్ని పొందుతున్నారు. జోన్ వారీగా టర్న్ లభించినప్పుడు పెద్ద మనసుతో సేవ చేయడానికి వస్తారు. అందరికీ ఎప్పటికప్పుడు సేవా అవకాశం లభిస్తున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మరి సేవలో బాగా మజా వచ్చిందా? సంపాదన జమ చేసుకున్నారా? ఎన్ని జన్మలకు సంపాదనను జమ చేసుకున్నారు? 21 జన్మలకు సంపాదనను జమ చేసుకున్నారా? మంచిగా అవకాశాన్ని తీసుకుంటారు. యు.పి. ఆది సెంటర్లలో ఒకటి. ఆరంభంలో సేవాకేంద్రాలు తెరవబడ్డప్పుడు, ఎన్నుకోబడ్డ పెద్ద సెంటర్లలో యు.పి సెంటరు కూడా ఒకటి. ఇప్పుడు ఒక జోన్‌గా అయింది. ఒక సెంటరు నుండి జోన్‌గా అయింది. ఇప్పుడు యు.పి ఏ అద్భుతాన్ని చేస్తుంది? యు.పిలో సాధుసన్యాసులు, మహాత్ములు చాలామంది ఉన్నారు. ఒకవైపు యాత్రికులు, మరోవైపు మహాత్ములు. ఒక మహాత్ముల సంగఠనను తయారు చేయండి, కొంత కాలం క్రితం హరిద్వార్ నుండి ఒక గ్రూపు వచ్చింది, కొద్దిమందే ఉన్నారు కానీ వారంతా మహామండలేశ్వరులు, అలా యు.పి మరియు బనారస్ వారు అటువంటి గ్రూపును తయారు చేయండి, ఆ గ్రూపు మధుబన్కు రావాలి. (అందరికంటే ముందు బనారస్ నుండే గ్రూపు వచ్చింది) కొద్దిమందే వచ్చారు కదా, ఇప్పుడు గ్రూపును తయారు చేసి తీసుకురండి. యు.పి వారందరినీ కలిపి మంచి గ్రూపుగా తయారు చేసి తీసుకురండి, వారి స్నేహ మిలనం జరపండి. ఇదైతే వీలవుతుంది కదా! అయితే ఎప్పటిలోపు తీసుకువస్తారు? ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. ఇప్పుడైతే ఒకే సమయంలో మూడు రకాల సేవలనూ చేయాలి. మనసా కూడా, వాణి కూడా మరియు సంబంధ సంపర్కం ద్వారా అనగా ముఖము ద్వారా కూడా సేవను చేయండి. ఈ విధంగా ఫాస్ట్ సేవ చేసినప్పుడు విశ్వము మీ గుణగానము చేస్తుంది. మరి యు.పి వారు ఏమి చేయాలో విన్నారా? పాండవులు వింటున్నారా? పాండవులు చాలామంది ఉన్నారు, చేతులెత్తండి. అయితే ఏదైనా అద్భుతాన్ని చేయండి. అద్భుతాన్ని చేసి చూపించండి. ఇకపోతే వృద్ధి మంచిగా అవుతుంది, ఇక ముందు కూడా వృద్ధి జరుగుతుంది.
అచ్ఛా – అందరినీ సంతుష్టపరిచే పుణ్యాన్ని జమ చేసుకున్నారు. సంతుష్టత ద్వారా చాలా పుణ్యం జమ అవుతుంది. కావున సంతుష్టంగా ఉండటము, సంతుష్టం చేయడము, సేవ చేయడము మరియు పుణ్యము జమ చేసుకోవడము. అయితే అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఫాస్ట్ పురుషార్థం కదా, స్లో (నిదానం) కాదు, ఫాస్ట్. అచ్ఛా. బాప్‌దాదాకు నచ్చింది. ఇంతటి సంగఠనలోకి వచ్చారు మరియు సంతుష్టపరిచారు. ఇందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీయులు 100 దేశాల నుండి 1500 మంది వచ్చారు:- డబల్ విదేశీయులది అద్భుతము! చూడండి, విదేశంలో స్థాపన జరిగినప్పుడు కేవలం 5 మంది జిజ్ఞాసువులే వస్తున్నారు అనేవారు, ఎక్కువ వచ్చేవారు కాదు కదా. ఇప్పుడు ఎంత వ్యాపించింది! మొత్తం విదేశాలలో ఎన్ని సేవాకేంద్రాలు ఉన్నాయి? (500) జిజ్ఞాసువులను ఎలా తయారు చేయాలి, వి.ఐ.పీలు ఎలా వస్తారు అని ఇప్పుడు ఆలోచించడం లేదు కదా. ఇప్పుడు ఇలా పిలిస్తే వచ్చేస్తున్నారు. ఇప్పుడు వి.ఐ.పీ ఏమిటి, సంబంధంలోకి తీసుకురండి, వి.ఐ.పీలు వచ్చేస్తారు. ఎందుకంటే వి.వి.వి.ఐ.పీలు అయిపోయారు కదా. అలాంటప్పుడు ఈ వి.ఐ.పీలు ఏమంత పెద్ద విషయము! భిన్న భిన్న దేశాలు అనే వృక్షం యొక్క కొమ్మలు ఒకే చందన వృక్షానికి చెందినవిగా అయ్యాయి. ఇప్పుడు 500 సంస్కృతులు ఉన్నాయా! ఒక్కటే కదా! పరివారాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇన్ని దేశాల నుండి ఒకేసారి రావాలి అన్న సంకల్పం పూర్తయింది. బాప్‌దాదా సేవతో సంతోషంగా ఉన్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. చాలా పెద్ద ప్రోగ్రామును చేయబోతున్నారని బాప్‌దాదా విన్నారు. టాపిక్ కూడా బాప్‌దాదాకు నచ్చింది. పరస్పరంలో ఏవైతే మీటింగులు చేసుకున్నారో వాటి సారాన్ని కూడా బాప్‌దాదా విన్నారు. మంచి ధైర్యాన్ని పెడ్తున్నారు, ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. ప్లాన్లు చాలా బాగా తయారు చేసారు, ఇది కూడా బాగా చేస్తారు. చూడండి, సభ మధ్యలో కుమారీల గ్రూపు అలంకరించుకుని ఉంది. (కుమారీలు కిరీటము ధరించి ఉన్నారు) ఇలా నిల్చుంటే అందరూ చూస్తారు. ఎంత మంచిగా అనిపిస్తున్నారో అందరూ చూడండి. ఈ గ్రూపు యొక్క సేవ కూడా బాగా జరుగుతుంది. కుమారీలు కిరీటధారులుగా మంచిగా అనిపిస్తున్నారు. ఇండియాలో ఫారెన్ కుమారీల గ్రూపు ఏదైనా ప్రత్యక్షత చేసి చూపించాలి, ఈ అద్భుతాన్ని చేయండి. ఎందుకంటే విదేశీ కుమారీలు మరియు కుమారులు యూత్ అయ్యారు కదా. విదేశీ కుమారీలు మరియు కుమారులు కూడా ఇంతమంది పరివర్తన అయ్యారు అన్న విషయాన్ని ఒక ఫైల్‌గా తయారు చేసి ఇక్కడి వి.ఐ.పీలకు చూపించండి. ఎలా అయితే ఇక్కడ యూత్ పుస్తకాన్ని తయారు చేసారు కదా, ఇక్కడ బాగా తయారు చేసారు, అది చూడండి. దానికన్నా మంచిగా తయారు చేయండి. కానీ వీరిని బాగా తయారు చేసారు అన్నది స్పష్టమవుతుంది. ప్రాక్టికల్ పరివర్తన, మళ్ళీ వారు మారిపోకూడదు. ఈరోజు పరివర్తన యొక్క అనుభవాల ఫైల్‌ను వి.ఐ.పీలకు చూపించిన తర్వాత వారు మునుపటిలా మారిపోకూడదు, ఇలా చేయకండి. పక్కా, నిశ్చయబుద్ధి విజయులు, ఇటువంటి గ్రూపును తయారు చేయండి, ఫైల్‌ను తయారు చేయండి. అది బాగా సేవ చేస్తుంది. ఎందుకంటే బాప్‌దాదా మరియు బ్రహ్మా బాబాకు ఆదిలో ఒక సంకల్పం ఉండేది – విదేశాలు దేశాన్ని మేల్కొపుతారు. మరి అద్భుతాన్ని చేస్తారు మీరు. ఇకపోతే బాప్‌దాదా సేవతో సంతోషంగా ఉన్నారు, ఇంకా పెంచండి. ఆఫ్రికావారు చేసినట్లుగా చేయండి. ఇలా మీ చుట్టుప్రక్కల ఏరియాలలో కూడా కళ్యాణం చేస్తూ వెళ్ళండి. ఎవరైతే నిమిత్తమయ్యారో, ఆఫ్రికావారు, బాప్‌దాదా వారికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. సేవ గురించి మంచి ప్లాన్లను తయారు చేస్తున్నారు మరియు ముందుకు వెళ్తున్నారు. అందుకు చప్పట్లు కొట్టండి. మంచిగా ముందుకు వెళ్తున్నారు, సదా ముందుకు వెళ్తుంటారు. అచ్ఛా.
ఎవరైతే మొదటి సారి వచ్చారో వారు లేవండి. దేశం వారు కావచ్చు, విదేశంవారు కావచ్చు, మొదటి సారి వచ్చినవారు లేవండి. చాలా మంచిది, మీ ఇంటికి వచ్చారు, ఉల్లాస ఉత్సాహాలతో ఈనాటి ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు, జరుపుకుంటున్నారు. పిల్లలందరికీ, ఒక్కొక్కరికీ చాలా చాలా అభినందనలు, అభినందనలు. చివరగా వచ్చినాగానీ ఫాస్ట్‌గా వెళ్ళాలి, ఫస్ట్ రావాలి అన్న లక్ష్యాన్ని అందరూ పెట్టుకోండి. ఇటువంటి అద్భుతాన్ని చేసి చూపించండి. మంచిది.
ఈ గ్రూపు కూడా మంచిగా వచ్చింది. (జపాన్ నుండి కొంతమంది వి.ఐ.పీలు వచ్చారు) ఫారెన్ సేవ మొదట్లో ఇక్కడే ప్రారంభమయింది – జపాన్ వారు లక్కీ. ఆరంభంలో బ్రాహ్మణ పరివారము జపాన్‌లోనే వచ్చింది. దాదీకు గుర్తుంది కదా. సేవకు ఆది స్థానముగా జపాన్ అయింది. ఎంత అదృష్టము. మీకు అందరూ కలిసి అభినందనలు తెలుపుతున్నారు. చాలా బాగుంది. అచ్ఛా- ఇప్పుడు ఏమి చేయాలి?
ఇప్పుడు బాప్‌దాదా ఇక్కడ సమ్ముఖములో కూర్చుని ఉన్నవారికి, దేశ-విదేశాలలో దూరముగా కూర్చుని వింటున్నవారికి, చూస్తున్నవారికి, పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీ అయ్యారు. అన్ని సంకల్పాలను మర్జ్ చేయండి. ఇప్పుడు ఒక్క క్షణములో మనసు బుద్ధి ద్వారా మీ స్వీట్‌హోమ్‌కు చేరుకోండి... ఇప్పుడు పరంధామము నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి... ఇప్పుడు సూక్ష్మవతనము నుండి స్థూల సాకార వతనానికి, మీ రాజ్యమైన స్వర్గములోకి చేరుకోండి... ఇప్పుడు మీ పురుషోత్తమ సంగమయుగానికి చేరుకోండి... ఇప్పుడు మధుబన్కు చేరుకోండి. ఇలాగే పదే-పదే స్వదర్శన చక్రధారిగా అయ్యి తిరుగుతూ ఉండండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు, సదా స్వరాజ్యము ద్వారా స్వపరివర్తనను చేసుకునే రాజా పిల్లలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు, సదా సంతోషముగా ఉండే అదృష్టవంతులైన పిల్లలకు, బాప్‌దాదా యొక్క నేటి ఈ పుట్టినరోజుకు, బాబా మరియు పిల్లల పుట్టినరోజుకు చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు, ఇటువంటి శ్రేష్ఠమైన పిల్లలకు నమస్తే.
దాదీలతో:- జన్మదిన శుభాకాంక్షలు. (మీకు అందరి శుభాకాంక్షలు) దాదీలను చూసి అందరూ సంతోషిస్తారు. దాదీలు ప్రియంగా అనిపిస్తారా? ఎందుకంటే మీ అందరికీ ప్రేమతో సహయోగాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. బాబా పిల్లలందరూ బాబా ఎదుట ఎంతో ఉన్నాతాతి ఉన్నతంగా కనిపించాలి అన్నది దాదీల సంకల్పము. సంగఠన యొక్క సహయోగము లభిస్తుంది. సహయోగము కూడా యోగమే కదా. మీకు దాదీలు మీ ఉల్లాస-ఉత్సాహాలను పెంచినప్పుడు మీకు ఎవరు గుర్తుకు వస్తారు? బాబా, మరి యోగమే కదా ఎందుకంటే బాబా స్మృతి కలుగుతుంది. మరి మీ అందరికీ ఎందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి! 21 జన్మలకు ఆశీర్వాదాలు వచ్చేసాయి. వచ్చేసాయి కదా! 63 జన్మలు ఆశీర్వాదాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎవరి నుండి దీవెన కోరుకుంటారు? మీనుండే కోరుకుంటారు కదా భక్తులు. కేవలం డ్రామాను చూడండి, బాబాను చూడండి మరియు సదా వాహ్ బాబా! వాహ్ డ్రామా అంటూ ఉండండి. సరేనా? పాత శరీరాలను అందరూ నడిపిస్తున్నారు. పాత శరీరము చాలా విలువైనది. మరి అందరూ చూడండి, దాదీలందరూ తమ పాత శరీరాలను నడిపిస్తున్నారు. మీ అందరికీ కూడా వీరిని చూసి ధైర్యము వస్తుంది కదా, మేము కూడా చేయాలి అనిపిస్తుంది. అచ్ఛా.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు, పిల్లలందరికీ 70వ త్రిమూర్తి శివ జయంతి శుభాకాంక్షలను తెలిపారు:
ఈ జెండాను ఏదైతే ఎగురవేసామో ఇది లోకుల సేవ కోసం ఎగురవేసాము. మీ హృదయాలలో అయితే బాబా ప్రత్యక్షతా జెండా ఎగురుతూ ఉంది, అది ఎప్పటికీ ఎగురుతూ ఉంటుంది. మీ మనసులలో ప్రభు ప్రేమకు గుర్తుగా ఏ జెండా అయితే ఎగురుతుందో అది పూర్తి విశ్వంలో మీ మనసు యొక్క వాయుమండలాన్ని వ్యాప్తి చేస్తుంది. మీ మనసు యొక్క వాయుమండలం అందరికీ అయస్కాంతంలా పని చేసే రోజు కూడా వస్తుంది, అప్పుడు అందరూ తమ నోటితో వచ్చేసారు, వచ్చేసారు, మా బాబా వచ్చేసారు అని అంటారు. ఇప్పుడైతే ఈ జెండాను ఎగుర వేసాము, ఇప్పుడు త్వరగా ప్రత్యక్షతా జెండాను ఎగురవేస్తాము. ఎందుకంటే బాబాపై పిల్లలందరికీ హక్కు ఉంది మరియు బాబా కూడా పిల్లలకు ఏదో ఒక ప్రాప్తిని ఇవ్వవలసిందే. మరి మీకు జీవన్ముక్తి, వారు ముక్తితోటే సంతోషిస్తారు, మీరు జీవన్ముక్తితో సంతోషిస్తారు. మీకు డబల్, జీవితము కూడా ఉంది, ముక్తి కూడా ఉంది, వారికి కేవలం ముక్తి మాత్రమే ఉంటుంది. హృదయంలో ఇటువంటి బాబా ప్రేమ జెండాను ఎగురవేసే నలువైపుల ఉన్న పిల్లలకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!
ఓంశాంతి