Search for a command to run...
14 Mar 2006
పరమాత్మ మిలనము యొక్క అనుభూతి కొరకు తప్పుడు రూపములోని ‘నేను అన్న భావన’ను కాల్చే హోలీని జరుపుకోండి, దృష్టి అనే పిచికారీ ద్వారా సర్వ ఆత్మలపై సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును చిలకరించండి
14 March 2006 · తెలుగు
ఈరోజు హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) తండ్రి తమ పవిత్రమైన పిల్లలతో మిలనము జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న హోలీ (పవిత్రమైన) పిల్లలు దూరముగా కూర్చుని ఉన్నా కానీ సమీపముగా ఉన్నారు. బాప్‌దాదా ఇటువంటి హోలీ అనగా మహా పవిత్రులైన పిల్లల మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఇటువంటి మహా పవిత్రులుగా మొత్తము కల్పములో మరెవ్వరూ అవ్వరు. ఈ సంగమ యుగములో పవిత్రతా వ్రతమును తీసుకునే భాగ్యశాలి పిల్లలు భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా ఉంటారు, శరీరము కూడా పవిత్రముగా మరియు ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది. మొత్తము కల్పమంతా తిరిగి చూడండి, ఎంతమంది మహానాత్మలు వచ్చినా కానీ శరీరము కూడా పవిత్రముగా మరియు ఆత్మ కూడా పవిత్రముగా ఉండే ఇటువంటి పవిత్రులుగా ధర్మాత్మలూ అవ్వలేదు, మహాత్ములూ అవ్వలేదు. బాప్‌దాదాకు పిల్లలైన మీ విషయములో గర్వంగా ఉంటుంది - వాహ్ నా మహా పవిత్రులైన పిల్లలూ వాహ్! డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ అవ్వరు, డబల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబల్ పవిత్రమైన, డబల్ కిరీటధారీ స్వరూపము ఎదురుగా వస్తూ ఉంది కదా! అందుకే ఈ సంగమయుగములో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితము ఏదైతే తయారైందో, ఆ జీవితములోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతిచిహ్నాన్నే ప్రపంచములోని వారు ఉత్సవము రూపములో జరుపుకుంటుంటారు.
ఈరోజు కూడా మీరందరూ స్నేహమనే విమానములో హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! మీరందరూ మీ జీవితములో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచములోనివారు స్థూల రూపాన్ని ఇచ్చారు, ఎందుకంటే దేహ అభిమానము ఉంది కదా! మీరు ఆత్మ అభిమానులు, ఆధ్యాత్మిక జీవితము కలవారు మరియు వారు దేహ అభిమానము కలవారు, అందుకే అన్నిటికీ స్థూల రూపాన్ని చూపించారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ-సంస్కారాలను భస్మము చేసారు, కాల్చేసారు మరియు ప్రపంచములోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యపు రంగు అంటుకోదు, అలాగే పరమాత్మ మిలనపు అనుభవాన్ని పొందలేరు. మీ జీవితానికి ఎంతటి విలువ ఉందంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవము రూపములో జరుపుకుంటారు. ఎందుకని? మీరు మొత్తము సంగమయుగము అంతటినీ ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన జీవితముగా తయారుచేసుకున్నారు. మీ జీవితము యొక్క స్మృతిచిహ్నాన్ని వారు ఒక్క రోజు యొక్క ఉత్సవముగా జరుపుకుంటారు. మరి అందరిదీ ఇటువంటి సదా ఉత్సాహము, ఉల్లాసము, సంతోషము కల జీవితమే కదా! సదానా లేక అప్పుడప్పుడూనా? సదా ఉత్సాహము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? మేము సదా ఉత్సాహములో ఉంటాము, సంతోషములో ఉంటాము, సంతోషము మా జీవితానికి విశేషముగా పరమాత్మ ఇచ్చిన కానుక, ఏమి జరిగినా కానీ బ్రాహ్మణ జీవితములోని సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము పోవు అని ఇలా ఎవరైతే భావిస్తున్నారో, ఇలా ఎవరికైతే అనుభవమవుతుందో వారు చేతులెత్తండి. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని సదా సంతోషమయంగా చూడాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా మరెవ్వరూ అవ్వలేదు కూడా, అవ్వలేరు కూడా. భిన్న-భిన్న వర్గాలవారు కూర్చుని ఉన్నారు. మరి ఇటువంటి అనుభవీమూర్తులుగా అయ్యేందుకు స్వయము కొరకు ఏదైనా ప్లాన్‌ను తయారుచేసారా?
ఈరోజు ఫలానా, ఫలానా వర్గాలవారు వచ్చారని బాప్‌దాదా సంతోషిస్తున్నారు, స్వాగతము. వచ్చినందుకు అభినందనలు. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, కానీ ముందుగా స్వయము కొరకు ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాలవారు ప్లాన్లు ఒకరిని మించి మరొకరు తయారుచేస్తారు మరియు చాలా మంచి-మంచివి తయారుచేస్తారు అన్నది బాప్‌దాదా చూసారు, కానీ వాటితో పాటు స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారుచెయ్యటము చాలా అవసరము. బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి వర్గమువారు స్వ ఉన్నతి కొరకు ప్రాక్టికల్ ప్లాన్లు తయారుచెయ్యాలి మరియు నంబరు తీసుకోవాలి. సంగఠనలో అందరూ కలుసుకుంటారు కదా. విదేశాలవారు, ఈ దేశమువారు అందరూ మీటింగ్ పెట్టుకుంటారు, ప్లాన్లు తయారుచేస్తారు, ఆ విషయములో బాప్‌దాదా సంతోషిస్తున్నారు, కానీ ఎలా అయితే ఉల్లాస-ఉత్సాహాలతో సంగఠిత రూపములో సేవా ప్లాన్లను తయారుచేస్తున్నారో, అలా అంతే ఉల్లాస-ఉత్సాహాలతో స్వ ఉన్నతిలో నంబరును ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టి తీసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గమువారు స్వ ఉన్నతి కొరకు చేసుకున్న ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు అన్నదానిని బాప్‌దాదా వినాలనుకుంటున్నారు. ఏయే వర్గాలవారైతే వచ్చారో, అన్ని వర్గాలవారు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. 5-6 వర్గాలవారు వచ్చారని విన్నాము. చాలా మంచిది. మంచిది వచ్చారు. ఇప్పుడు చివరి టర్న్ ఒక్కటి మిగిలి ఉంది. బాప్‌దాదా అయితే హోమ్‌వర్క్‌ను ముందే ఇచ్చేసారు. బాప్‌దాదా అయితే ప్రతి రోజూ రిజల్టును చూస్తారు. బాప్‌దాదా చివరి టర్న్‌లో లెక్క తీసుకుంటారు అని మీరనుకుంటారు కానీ బాప్‌దాదా ప్రతి రోజూ చూస్తారు, ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు ఉన్నాయి, ఈ 15 రోజులలో ప్రతి వర్గమువారికీ, ఇక్కడకు వచ్చినారికీ, ఇక్కడకు రాకపోయినా కానీ వర్గాలకు నిమిత్తమైన పిల్లలందరికీ బాప్‌దాదా ఇదే సూచనను ఇస్తున్నారు - ప్రతి వర్గము వారు తమ స్వ ఉన్నతి కొరకు ఏదో ఒక ప్లాన్‌ను తయారుచేయండి, విశేషముగా ఏదైనా ఒక శక్తి స్వరూపముగా అయ్యేందుకు లేక విశేషముగా ఏదైనా గుణము యొక్క గుణమూర్తులుగా అయ్యేందుకు లేక విశ్వ కళ్యాణము కొరకు ఏదో ఒక రకముగా లైట్-మైట్‌ను ఇచ్చేందుకు ప్రతి వర్గము వారు పరస్పరములో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి. వర్గములో ఎవరైతే సభ్యులుగా అయ్యారో, సభ్యులుగా అయ్యి మంచి పని చేసారు, కానీ ప్రతి సభ్యుడు నంబర్‌వన్ అవ్వాలి. ఫలానా వర్గములోని సభ్యుడు అని పేరు నమోదు కావటం కాదు, ఫలానా వర్గములో స్వ ఉన్నతి చేసుకునే సభ్యుడు అని అనాలి. ఇది వీలవుతుందా? వర్గానికి నిమిత్తమైన వారు, ఆ నిమిత్తులు లేచి నిలబడండి. విదేశాలలో కూడా నలుగురైదుగురు ఎవరైతే నిమిత్తంగా అయ్యారు, వారు కూడా లేచి నిలబడండి. బాప్‌దాదాకు అయితే వీరందరూ చాలా శక్తిశాలీ మూర్తులుగా అనిపిస్తారు. చాలా మంచి మూర్తులు. ఈ 15 రోజులలో ఏదైనా చేసి చూపిస్తాము అని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, వీలవుతుందా? (పూర్తిగా పురుషార్థము చేస్తాము). మిగతావారు చెప్పండి, వీలవుతుందా? (అడ్మినిస్ట్రేషన్ వింగ్ వారు ఎవరము కోప్పడము అని ప్లాన్ తయారుచేశారు) వారి గురించి ఎంక్వయిరీ కూడా చేస్తుంటారా? అక్కయ్యలు (టీచర్లు) - 15 రోజులలో ఎంక్వయిరీ చేసి రిజల్టును తెలుపగలము అన్న ధైర్యాన్ని పెడతారా? విదేశీయులైతే చేస్తామని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? వీలవుతుందా? భారత్ వారు చెప్పండి, వీలవుతుందా? బాప్‌దాదాకు అయితే మీ అందరి ముఖాలను చూస్తుంటే రిజల్టు బాగుంది అని అనిపిస్తుంది. ఒకవేళ ఈ 15 రోజులైనా అటెన్షన్ పెట్టే పురుషార్థము చేస్తే ఈ అభ్యాసము మున్ముందు కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఎటువంటి మీటింగ్ చెయ్యండంటే, ఏదైనా గుణము విషయములో, ఏదైనా శక్తి రూపములో లక్ష్యము తీసుకోవాలి, ఇందులో బాప్‌దాదా నంబర్ ఇస్తారు. స్వ సేవలో ఎవరెవరు నంబర్‌వన్ వర్గమువారు అన్నదానిని బాప్‌దాదా అయితే చూస్తుంటారు, ఎందుకంటే బాప్‌దాదా చూసారు, ప్లాన్లు అయితే చాలా మంచి-మంచివి తయారుచేస్తుంటారు, కానీ సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండు ఒకవేళ కలిసి-కలిసి లేనట్లయితే సేవా ప్లాన్లలో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు, అందుకే సమయము యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవను మరియు స్వ ఉన్నతిని కంబైండ్‌గా పెట్టుకోండి, కేవలం స్వ ఉన్నతే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి కానీ స్వ ఉన్నతి స్థితితో సేవలో సఫలత ఎక్కువగా కలుగుతుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతకు గుర్తు ఏమిటంటే, రెండింటిలో స్వయానికి స్వయమూ సంతుష్టముగా ఉండాలి మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టతా అనుభవము కలగాలి. ఒకవేళ స్వయానికైనా లేక ఎవరి సేవకైతే నిమిత్తమవుతారో వారికైనా సంతుష్టతా అనుభవము కలగకపోతే సఫలత తక్కువ లభిస్తుంది, శ్రమ ఎక్కువ చెయ్యాల్సి వస్తుంది.
సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతను సహజముగా ప్రాప్తి చేసుకునేందుకు బంగారు తాళం చెవి ఏదో మీ అందరికీ తెలుసా? అనుభవమైతే అందరికీ ఉంది. బంగారు తాళం చెవి ఏమిటంటే, నడవడిక, ముఖములో, సంబంధ-సంపర్కములో నిమిత్త భావము, నిర్మాన భావము, నిర్మల వాణి. ఉదాహరణకు బ్రహ్మా బాబా మరియు జగదాంబను చూసారు కదా! ఇప్పుడు అక్కడక్కడ సేవ సఫలతలో పర్సెంటేజ్ వస్తుంది, దానికి కారణము ఏమిటి? ఏదైతే కోరుకుంటారో, ఎంతైతే చేస్తారో, ఎంతగానైతే ప్లాన్లు తయారుచేస్తారో, అందులో పర్సెంటేజ్ ఎందుకు వస్తుంది? బాప్‌దాదా మెజారిటీలో ఈ కారణాన్ని చూసారు, అదేమిటంటే సఫలత తక్కువగా రావటానికి కారణము ఒక్కటే పదము, అది ఏమిటి? ‘‘నేను’’. నేను అన్న పదమును మూడు రకాలుగా ఉపయోగిస్తారు. దేహీ-అభిమానములో కూడా నేను ఆత్మను, అని ‘నేను’ అన్న పదము వస్తుంది. దేహ-అభిమానములో కూడా నేను ఏదైతే చెప్తానో, ఏదైతే చేస్తానో అదే కరెక్ట్, నేను తెలివైనవాడిని... ఇది హద్దు యొక్క నేను. ఇలా దేహ-అభిమానములో కూడా నేను అన్నది వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశకు లోనైనా కూడా ‘నేను’ అన్నది వస్తుంది. నేను ఇది చెయ్యలేను, నాలో ధైర్యము లేదు, నేను ఇది వినలేను, నేను ఇది ఇముడ్చుకోలేను... మరి బాప్‌దాదా ఈ మూడు రకాల నేను, నేను అన్న పాటను చాలానే వింటుంటారు. బ్రహ్మా బాబా, జగదాంబ నంబర్ తీసుకున్నారు కదా, దాని వెనుక ఉన్న విశేషత ఏమిటంటే, తప్పుడు రూపములోని ‘నేను అన్న భావము’ వారిలో ఉండేది కాదు, ఆ విషయములో వారు అవిద్యులుగా ఉన్నారు. బ్రహ్మా బాబా ఎప్పుడూ కూడా, నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా, బాబా... బాబా చేయిస్తున్నారు, నేను చెయ్యటం లేదు. నేను మేధావిని కాను, పిల్లలే తెలివైనవారు అని అనేవారు. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండి ఉండవచ్చు. జగదాంబ ఇదే అనేవారు - ‘‘ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు’’, నేను కాదు, నడిపించే బాబా నడిపిస్తున్నారు, చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానానికి చెందిన నేను అన్నదానిని సమాప్తము చేసి ముందుకు వెళ్ళండి. న్యాచురల్‌గానే (సహజముగానే) ప్రతి విషయములోనూ బాబా, బాబా అని రావాలి. సహజముగా రావాలి ఎందుకంటే బాబా సమానముగా అవ్వాలన్న సంకల్పాన్ని అయితే అందరూ తప్పకుండా తీసుకున్నారు. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క ‘రాయల్ నేను’ అన్నదానిని కాల్చేయండి. అచ్ఛా, క్రోధము కూడా చెయ్యవద్దు. క్రోధము ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అన్న భావము వస్తుంది.
హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా? మరి హోలీలో ముందుగా ఏం చేస్తారు? కాలుస్తారు. వాస్తవానికి అందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, బాబా ఆశల దీపాలు, కేవలం ఈ కాస్త నేను అన్నదానిని కట్ చెయ్యండి. రెండు రకాల నేను అన్నదానిని కట్ చెయ్యండి, ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి. ఎందుకని? బాప్‌దాదా చూస్తున్నారు, మీ అనేకమంది సోదరీ సోదరులు, బ్రాహ్మణులు కాదు, అజ్ఞానీ ఆత్మలు, వారు తమ జీవితములో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యమనే రెక్కలను ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా ఆధారము లేనివారిగా అయిపోయారు, ఏ ఆశా లేనివారిగా అయిపోయారు. కనుక ఓ దయా హృదయులారా, కృప, దయను చూపించేవారా, విశ్వ ఆత్మలకు ఇష్టదేవులారా, మీ శుభ భావన, దయా భావన, ఆత్మ భావన ద్వారా వారి భావనను పూర్తి చెయ్యండి. దుఃఖము, అశాంతితో కూడుకున్న వారి వైబ్రేషన్లు మీ వద్దకు రావటం లేదా? మీరు నిమిత్త ఆత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షము యొక్క కాండమువంటివారు, పునాదివంటివారు. మా రక్షకులు ఎక్కడకు వెళ్ళారు, మా ఇష్టదేవులు ఎక్కడకు వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకైతే వారి పిలుపులు చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న-భిన్న శక్తుల సకాష్ను ఇవ్వండి. ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా, దృష్టియే మీ పిచికారీ, కనుక మీ దృష్టి అనే పిచికారీ ద్వారా సుఖమనే రంగును వెయ్యండి, శాంతి రంగును వెయ్యండి, ప్రేమ రంగును వెయ్యండి, ఆనందమనే రంగును వెయ్యండి. మీరైతే పరమాత్మ సాంగత్యపు రంగులోకి వచ్చారు, ఇతర ఆత్మలకు కూడా కాస్త ఆధ్యాత్మిక రంగును అనుభవము చేయించండి. పరమాత్మ మిలనాన్ని, మంగళ మిలనాన్ని అనుభవము చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయము యొక్క మార్గాన్ని తెలియపరచండి.
కనుక స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారుచేసుకుంటారు కదా. ఇందులో స్వయం యొక్క చెకర్లుగా అయ్యి చెక్ చేసుకోండి - ఈ రాయల్ నేను అనేది అయితే రావటం లేదు కదా, ఎందుకంటే ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. కనుక బాప్‌దాదా ఇదే సంకల్పాన్ని ఇస్తున్నారు - ఈరోజు దేహ-అభిమానము మరియు అవమానముకు చెందిన నేను అనేది ఏదైతే వస్తుందో, నిరాశతో కూడుకున్న నేను అనేది ఏదైతే వస్తుందో, దానిని కాల్చే వెళ్ళాలి, మీతోపాటు తీసుకు వెళ్ళకూడదు. దేనినైనా కాలుస్తారు కదా! అగ్నితో కాలుస్తారా? జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించటం వస్తుందా? జ్వాలాముఖి యోగము, ఇది వస్తుందా లేక సాధారణ యోగము వస్తుందా? జ్వాలాముఖిగా అవ్వండి. లైట్-మైట్ హౌస్. మరి ఇది ఇష్టమేనా? అటెన్షన్ ప్లీజ్, నేను అన్నదానిని కాల్చేయండి.
బాప్‌దాదా నేను-నేను అన్న ఈ పాటను విన్నప్పుడు స్విచ్‌ను ఆపేస్తారు. వాహ్, వాహ్ అన్న పాటలు వచ్చినప్పుడు సౌండ్‌ను పెంచుతారు, ఎందుకంటే నేను-నేను అన్నదానిలో పెనుగులాట చాలా ఉంటుంది. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదు అని ప్రతి విషయములోనూ పెనుగులాట సృష్టిస్తారు. పెనుగులాట కారణముగా ఒత్తిడి మొదలవుతుంది. బాప్‌దాదాకు లగావ్, తనావ్, స్వభావ్ (ఆకర్షణ, ఒత్తిడి, స్వభావము) అనగా నెగెటివ్ స్వభావము మంచిగా అనిపించవు. వాస్తవానికి స్వభావము అన్న పదము చాలా మంచిది. స్వ భావము అనగా స్వయము యొక్క భావము. కానీ దానిని తప్పుగా మార్చేశారు. విషయాలలోనూ పెనుగులాట సృష్టించకండి, అలాగే మీ వైపుకు ఎవరినీ లాగకండి. అది కూడా చాలా టెన్షన్‌ను సృష్టిస్తుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ మీ వైపుకు మాత్రం లాగకండి. విషయాన్ని సాగదీయకండి, మీ వైపుకు ఎవరినీ లాగకండి, పెనుగులాట సమాప్తమైపోవాలి. బాబా, బాబా మరియు బాబా. ఇష్టమే కదా! కనుక నేను అన్న విషయములో తప్పుడు భావమును ఇక్కడ వదిలేసి వెళ్ళండి. మీతోపాటు తీసుకువెళ్ళకండి, ట్రైన్లో బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నావారు అన్న మీ పాట ఉంది కదా. అవును కదా! ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి, రెండు, నేను అన్నవాటిని సమాప్తము చెయ్యండి. మరి హోలీని జరుపుకున్నారా, సంకల్పములో కాల్చేశారా? ఇప్పుడు సంకల్పము చేస్తారు. సంకల్పము చేశారా? చేతులెత్తండి. చేశారా లేక కొంచెం, కొంచెం ఉండిపోతుందా? కొంచెం, కొంచెం ఉండటానికి అనుమతినివ్వాలా? కొంచెం, కొంచెం ఉండడానికి అనుమతి కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కొంచెం అయితే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే ఎంతో సాహసవంతులు. అభినందనలు. సంతోషములో నాట్యము చెయ్యండి, పాడండి, అంతేకానీ ఒత్తిడిలో కాదు, పెనుగులాటలో కాదు. అచ్ఛా! ఈరోజు హోలీ కదా. అందుకే బాప్‌దాదా కూడా కాల్చమని చెప్తున్నారు. ఇప్పుడు ఏమి చేయాలి?
సేవ టర్న్ రాజస్థాన్‌ది, భోపాల్ వారు కూడా సహయోగిగా ఉన్నారు:- బాప్‌దాదాకు ఒక విషయంలో సంతోషంగా ఉంది, ఏ జోన్ యొక్క టర్న్ ఉంటుందో, వారు తృప్తిగా వస్తారు. మంచిది. ఛాన్స్ లభిస్తుంది, ఛాన్స్ తీసుకోవడము కూడా చాలా మంచి విషయము. ఎక్స్ట్రా సేవ మరియు స్మృతి యొక్క వాయుమండలము, సహాయం లభిస్తాయి. మీ జీవిత కథలో ఈ రోజులను విశేషమైన ప్రాప్తి రోజులుగా గుర్తుంచుకోండి. మధుబన్‌లో ఎన్ని రోజులు ఉన్నారో, విఘ్నాలు వచ్చాయా? ఎవరికైతే విఘ్నాలు వచ్చాయో వారు చేతులెత్తండి. మాతలు కూడా. ఒకవేళ విఘ్నాలు రాలేదంటే జమ ఖాతా ఎంత చేసుకున్నారు? విఘ్నాలు రానందుకు అభినందనలు కానీ మీకు జమ చేసుకునే ఛాన్స్ లభించింది. గోల్డెన్ ఛాన్స్. ఎంత జమ చేసుకున్నారు అన్నది చెక్ చేసుకున్నారా? ఎక్స్ట్రా సంపాదన జమ అయిందా? ఎవరికైతే అయిందో వారు చేతులెత్తండి. జమ అయిందా? ఈ రోజులను, గోల్డెన్ రోజులను, జమ అయిన ఈ రోజులను సదా మీ జీవితంలో విశేష స్మృతి చిహ్నంగా పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా విఘ్నము వచ్చినాగానీ ఈ రోజును గుర్తు తెచ్చుకోండి. ట్రైన్ టికెట్ లేకుండానే (బుద్ధి ద్వారా) మధుబన్కు చేరుకోండి ఎందుకంటే ఇక్కడ బాప్‌దాదా యొక్క కర్మల వాయుమండలం ఉంది. క్యాచ్ చేసుకోవడము మీ పని. మధుబన్ అంటే బాప్‌దాదా కర్మల కిరణాల వాయుమండలం. ఇంత పెద్ద మహారథులు ఉన్నారు, ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో, వారి కర్మ రేఖలు కూడా మధుబన్‌లో వాయుమండలం రూపంలో ఉన్నాయి. అందుకే గోల్డెన్ ఛాన్సలర్లుగా అయ్యారు. రాజస్థాన్ కూడా అద్భుతాన్ని చేయాల్సిందే కదా. రాజస్థాన్ ఆత్మ అయితే అద్భుతాన్ని చేసింది కానీ ఆబూ వాయుమండలం అద్భుతాన్ని చేసింది. జ్ఞాన సరోవరానికి నిమిత్తము రాజస్థాన్ గవర్నర్ అయ్యారు. రాజస్థాన్ వారైనాగానీ మధుబన్ వాయుమండలం ప్రభావం పడ్డది. అయినాగానీ సగం లాభం అయితే రాజస్థాన్‌కు కూడా లభిస్తుంది. స్వయం సహయోగాన్ని ఆఫర్ చేయాలి, అటువంటి సహయోగులను తయారు చేయండి ఎందుకంటే రాజస్థాన్ నుండి ఇక్కడకు రావడానికి ఎటువంటి సాకులు లేవు. ఎంత పెద్ద వి.ఐ.పీ అయినాగానీ, రాజస్థాన్ నుండి విమానంలో రావడం కష్టమేమీ కాదు, స్పెషల్ విమానము. ఇప్పుడు చేసి చూపించండి. టీచర్లు చాలామంది ఉన్నారు. బాప్‌దాదా అయితే ఒక్కొక్కరి విశేషతను చూస్తున్నారు. ఇప్పుడు మీ విశేషతతో విశేషంగా స్నేహి సహయోగులను మరియు వారస క్వాలిటీని తయారు చేయండి. ఢిల్లీవారు రాష్ట్రపతిని సేవలో సహయోగిగా చేసారు, సమీప సహయోగి కాదు కానీ సేవలో సహయోగిగా చేసారు. బ్రహ్మా కుమారీలు ఏ కార్యమైతే చేస్తున్నారో అది చాలా బాగుంది అన్నది వారి మనసులోని మాట. కానీ కొద్దికొద్దిగా సహయోగిగా తయారు చేసారు, ఇప్పుడు మరింత సహయోగిగా చేయండి. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌కు ఒకరు నిమిత్తమయ్యారు, ఇలా ఎవరినైనా నిమిత్తంగా చేయండి, ఏ కార్యం కోసమైనా నిమిత్తంగా చేయండి. ఇలా ఎవరైనా నిమిత్తంగా అయ్యారా? అచ్ఛా. గోల్డెన్ ఛాన్సును మర్చిపోకండి. ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండండి. భోపాల్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు. భోపాల్ వారు నిమిత్తంగా తయారు చేసారా? (ఈరోజు మధ్య ప్రదేశ్ గవర్నర్ వచ్చారు) వచ్చారు, చాలా మంచిది, కానీ ఏదైనా కార్యంలో సహయోగిగా అవ్వాలి, సహయోగిగా అన్నా చేయండి లేక స్నేహిగా లేక వారసులుగా అయినా చేయండి. మూడింటిలో ఏదో ఒకటిగా తయారు చేయండి. అన్ని జోన్లవారికి బాప్‌దాదా ఈ విషయాన్ని చెబుతున్నారు. ఎవరైనా ముందుకు రావచ్చు. ఇప్పుడు వారస క్వాలిటీ వారి లిస్ట్ రాలేదు. స్నేహీల లిస్ట్ వస్తుంది, వారసుల లిస్ట్ రాలేదు. అచ్ఛా.
1000 మంది డబల్ విదేశీయులు 60 దేశాల నుండి వచ్చారు:- డబల్ విదేశీయులు మధుబన్కు అలంకారము. అనేక దేశాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఇప్పుడు ఏమయ్యాయి? ఒకే బ్రాహ్మణ సంస్కృతి. ఇష్టమేనా? బ్రాహ్మణ కల్చర్ ఇష్టమేనా? లేక కొంచెం కష్టంగా అనిపిస్తుందా? కష్టంగా అనిపించడం లేదు కదా? స్థాపన జరిగినప్పుడు, బోర్డింగ్ పెట్టినప్పుడు, అందరిదీ కలిపి ఒక చందన వృక్షాన్ని తయారు చేయాలి అని బ్రహ్మా బాబా అనేవారు. మరి, ఇప్పుడు అన్ని వైపుల నుండి వచ్చిన విదేశీయులు ఇప్పుడు బ్రాహ్మణ వృక్షానికి ఒకే ఆకుగా అయ్యారు. సేవార్థంగా భిన్న భిన్న దేశాలలో ఉన్నారు, కానీ అసలైతే ఎక్కడివారు? పర్మనెంట్ అడ్రెస్ ఏమిటి? మధుబన్, పక్కా? మంచిది. స్వ కోసం మరియు సేవ కోసం కూడా భిన్న భిన్న గ్రూపులుగా తయారయ్యి పురుషార్థము బాగా చేస్తున్నారన్న సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు. ఇది కుమారుల గ్రూపు. మాతల రిట్రీట్ కూడా జరుగుతుంది కదా. ఐ.టి గ్రూప్ చేతులెత్తండి. మంచి ధైర్యాన్ని పెట్టారన్న సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు. అందరూ మనవారు, అంతా మనదే. ఈ ధైర్యాన్ని బాగా పెట్టారు. ఇప్పుడు ఈ ఐ.టీ గ్రూపు తమ సాధనాల ద్వారా ప్రత్యక్షతా జెండాను ఎక్కడెక్కడ ఎగుర వేస్తారో బాప్‌దాదా చూస్తారు. అలాగే శివశక్తి మాతలు ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారు? కుమారులు ఏ జల్వా చూపిస్తారు? బాగుంది. అందరూ వేరువేరు గ్రూపులలో ఉండి, పురుషార్థం గురించి మంచి మంచి విషయాలను వెలికి తీస్తున్నారు. కేవలం బాప్‌దాదా ఒక్క పదాన్ని అండర్లైన్ చేయించాలని భావిస్తున్నారు, ఆ పదము – దృఢంగా ఉండటము. దృఢ పురుషార్థీగా ఉండాలి. ఢీలా చేయకండి. ఎవరు ఎంత కదిలించినాగానీ కదలకండి. అచలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. దృఢత్వము బ్రాహ్మణ జీవితానికి ధైర్యము అనే హస్తము, ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. మధుబన్‌లో చాలామంచి శోభ వచ్చేస్తుంది. వీరు విశ్వ కళ్యాణకారులు అని ఎవరైనా విన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. కేవలం భారత కళ్యాణకారులు కాదు, అందుకే అభినందనలు, అభినందనలు, అభినందనలు.
6 వింగ్‌లు వచ్చాయి:- (గ్రామ వికాసము, స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్, మహిళ, ప్రశాసక, స్పార్క్ వింగ్) వింగ్స్‌కు పని ఇచ్చేసాము, ఇప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాము. అచ్ఛా, పిల్లలు కూడా వచ్చారు (5 వికారాల మల్ల యుద్ధాన్ని చూపించారు) అచ్ఛా. స్పోర్ట్స్ వింగ్ ఉంది. మాయ యొక్క ఆటనైతే తెలుసుకున్నారు కదా. అందులో ధైర్యవంతులే కదా! ఆడేవారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. అలాగే మాయాజీతులుగా అవ్వడంలో కూడా ధైర్యవంతులే కదా! ఎప్పుడూ ఓడిపోకూడదు(హార్). బాప్‌దాదా మెడలో హార్ (హారము)గా కావాలి. హార్ పొందకూడదు. ఇటువంటి పక్కావారే కదా! ధైర్యవంతులేనా? ధైర్యవంతులేనా, వాహ్! చాలా మంచిది. అయితే మాయాజీతులుగా అవ్వడం కూడా నేర్పిస్తారు కదా. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క క్షణములో మీ మనసులో నుండి అన్ని సంకల్పాలను సమాప్తము చేసి ఒక్క క్షణములో బాబాతోపాటు పరంధామములో ఉన్నతోన్నతమైన స్థానములో, ఉన్నతోన్నతమైన బాబాతోపాటు ఉన్నతమైన స్థితిలో కూర్చోండి, మరియు బాబా సమానముగా మాస్టర్ సర్వ శక్తిమంతులై విశ్వములోని ఆత్మలకు శక్తుల కిరణాలను ఇవ్వండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న అతి పవిత్రమైన, అతి ఉన్నతమైన పిల్లలకు, విశ్వ కళ్యాణకారీ విశేష ఆత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, హృదయపూర్వకమైన ప్రేమ మరియు నమస్తే.
దూరదూరాల నుండి వచ్చిన ఉత్తరాలు, కార్డులు, ఈ-మెయిల్స్, కంప్యూటర్ ద్వారా సందేశాలు బాప్‌దాదాకు లభించాయి మరియు బాప్‌దాదా ఆ పిల్లలను సమ్ముఖములో చూస్తూ పదమాల రెట్లు ప్రియస్మృతులను ఇస్తున్నారు. హోలీ అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
దాదీలతో:- చాలా బాగుంది, జన్మ దినానికి కూడా చాలా చాలా అభినందనలు, అలాగే హోలీ శుభాకాంక్షలు కూడా. డబల్ హోలీగా అయినందుకు అభినందనలు. (దాదీజీతో) బాగుంది, ప్రకృతిజీత్గా అయ్యారు కదా. ప్రకృతిని నడిపించడం వచ్చేసింది. యజమానిగా అయ్యి ప్రకృతిని నడిపిస్తున్నారు మరియు అందరినీ సంతోషపరుస్తున్నారు. మీరు సంతోషంగా ఉంటారు కదా అందుకనే అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. సభను చూసి అందరూ సంతోషిస్తారు. (ఈరోజు సభలో 21 వేలమంది సోదరసోదరీలు ఉన్నారు) ఇంత పెద్ద పరివారాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. మంచిది, కల్పంలో ఒక్కసారి మాత్రమే యథార్థ పరిచయంతో కలుస్తారు. 5 వేల సంవత్సరాల తర్వాత పరస్పరంలో కలుసుకున్నాము, ఇలా ప్రతి కల్పం కలుసుకుంటూ ఉంటాము. ఆనందమే ఆనందము కదా. ఎంతటి ఆనందమయ జీవితాన్ని జీవిస్తున్నారు! మీవలె ఆనందంగా జీవించేవారు మరెవ్వరూ లేరు. ఆనందాల యుగము. ఆనందాల జీవితము. సదా అందరికీ ఆనందాన్ని అనుభవం చేయించేవారు మీరు. అచ్ఛా.
ముగ్గురు పెద్దన్నయ్యలతో:- బాగుంది, నాలుగు వైపుల జరుగుతున్న కార్యాన్ని గమనించుకుంటూ ఉండండి. స్వయాన్ని నిమిత్తంగా భావించి అందరిలో సంతుష్టతా అలను వ్యాప్తి చేయండి. సంతుష్టత బాబా సమీపతను అనుభవం చేయిస్తుంది. కనుక, నలువైపుల సంతుష్టతా అలను బాగా వ్యాప్తి చేయండి. అచ్ఛా!
ఓంశాంతి