Search for a command to run...
2 Feb 1969
అవ్యక్త మిలనాన్ని అనుభవం చేసుకునే విధి
2 February 1969 · తెలుగు
ప్రేమ స్వరూప పిల్లలూ, జ్ఞాన సహితంగా ఉండే ప్రేమయే యథార్థం అవుతుంది. మీ అందరి ప్రేమరసము బాప్దాదాను కూడా ఆకర్షిస్తుంది. పిల్లలందరి మనసులలో ఒక ఆశ కనిపిస్తుంది. అది ఏమిటి? మాకు కూడా మీరు అవ్యక్త వతన అనుభూతిని చేయించండి అని కొంతమంది పిల్లలు సందేశాన్ని పంపారు. పిల్లలందరి కోరిక పూర్తి కాబోయే సమయం ఆసన్నమయింది. అంటే, అందరూ సందేశిగా అయిపోతారా అని మీరు అడుగుతారేమో! కానీ కాదు. అవ్యక్త వతనం యొక్క అనుభవాన్ని పిల్లలందరూ చేసుకుంటారు. కానీ దివ్య బుద్ధి ఆధారంగా ఇప్పుడు ఏ అలౌకిక అనుభూతులైతే మీరు చేసుకుంటారో అవి దివ్య దృష్టి ద్వారా జరిగేవాటికన్నా లాభదాయకమైనవి, అలౌకికమైనవి మరియు అద్భుతమైనవి. కనుక, ఎవరైతే అవ్యక్త బాబాను కలవాలని అనుకుంటున్నారో వారు చేయవచ్చు. ఎలా చేయవచ్చు, ఇందుకు పద్ధతి ఇదే – అమృతవేళ స్మృతిలో కూర్చోండి, ఇప్పుడు నేను అవ్యక్త బాప్దాదాను కలుసుకోవాలి అన్న ఒక్కటే సంకల్పం చేయండి. ఎలా అయితే సాకారంలో, కలిసే సమయం తెలిసినప్పుడు నిద్ర వచ్చేది కాదు కదా ఆ సమయంలో, అంతే కాకుండా సమయం కన్నా ముందు నుండే బుద్ధి ద్వారా ఈ అనుభవంలోనే ఉండేవారు. అలాగే ఇప్పుడు కూడా అవ్యక్త మిలనం యొక్క అనుభూతిని పొందాలనుకుంటే అందుకు చాలా సహజమైన పద్ధతి ఉంది - అవ్యక్త స్థితిలో ఉండి ఆత్మిక సంభాషణ చేయండి. అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతున్నాము అన్న అనుభవం జరుగుతుంది. ఈ ఆత్మిక సంభాషణలోనే, సందేశీలకు ఎలా అయితే అనేక దృశ్యాలను చూపిస్తామో అలాగే చాలా గుహ్యమైన, గోపనీయ రహస్యాలను బుద్ధియోగం ద్వారా అనుభవం చేసుకుంటారు. ఈ అనుభవానికి ఒక్క విషయము ఆవశ్యకము. అది ఏమిటి? తెలుసా? ఎవరైతే రోజంతా అవ్యక్త స్థితిలో మరియు అంతర్ముఖి స్థితిలో స్థితులై ఉంటారో వారే అమృతవేళలో కూడా అవ్యక్త స్థితిలో స్థితి కాగలరు. వారే అమృతవేళలో ఈ అనుభవాన్ని చేసుకోగలరు. కావున స్నేహము ఉంటే, కలవాలన్న ఆశ ఉంటే ఇది సహజమైన పద్ధతి. చేయాలనుకున్నవారు చేయవచ్చు మరియు మిలనపు అద్భుత అనుభూతిని పొందవచ్చు.
వతనంలో కూర్చుని ఉన్నా కానీ అనేకమంది పిల్లల మనసులోని మాట చేరుతూ ఉంటుంది. శివ బాబా చాలా కఠోరమైనవారు అని మీరు అనుకుంటుండవచ్చు కానీ ఏది జరుగుతుందో అందులో రహస్యము, కళ్యాణము ఉన్నాయి. అందుకే ఏ మాటలు అయితే చేరుతున్నాయో అవి విని నవ్వుకుంటాము. బాప్దాదా నిర్మోహియా? పిల్లలందరూ నిర్మోహిగా ఉన్నారా? నిర్మోహిగా అయ్యారా? మరి బాప్దాదా నిర్మోహి మరియు పిల్లలలో ఏమో శుద్ధమైన మోహము ఉంటే మిలనము ఎలా జరుగుతుంది? బాప్దాదాకు శుద్ధ మోహము ఉందా? (సాకార బాబాకు పిల్లలపై శుద్ధ ప్రేమ ఉండినది). శివబాబాకు లేదా? బాప్దాదాకు ఉందా? (మాకు ఉన్న విధంగా లేదు) శుద్ధ మోహము పిల్లలకన్నా ఎక్కువగా ఉంది. కానీ బాప్దాదా మరియు పిల్లలలో ఒక తేడా ఉంది. వారు శుద్ధ మోహంలోకి వస్తూ కూడా నిర్మోహిగా ఉంటారు, పిల్లలేమో శుద్ధ మోహంలోకి వస్తారు మరియు కొంత స్వరూపంలోకి కూడా వస్తారు. అయితే ప్రియంగా అవుతారు లేక అతీతంగా అవుతారు. కానీ బాప్దాదా అతీతంగా మరియు ప్రియంగా రెండు విధాలుగానూ ఉంటారు. ఈ తేడా ఏదైతే ఇప్పుడు మిగిలి ఉందో దీనిని ఇప్పుడు తొలగించండి, అప్పుడు ఎలా అవుతారు? అంతర్ముఖము, అవ్యక్తము, అలౌకికము. ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం లౌకికతనము కూడా కలుస్తుంది. కానీ ఈ తేడాను సమాప్తం చేస్తే పూర్తిగా అలౌకికంగా మరియు అంతర్ముఖిగా, అవ్యక్త ఫరిశ్తాగా కనిపిస్తారు. ఈ సాకార వతనంలో ఉంటూ కూడా ఫరిశ్తాగా అవ్వగలరు. మరి మీరు వతనానికి వెళ్ళి ఎందుకు ఫరిశ్తాగా అయ్యారు, ఇక్కడే అయ్యి ఉండవచ్చు కదా అని మీరు అడగవచ్చు. కానీ ఇలా కాదు. పిల్లల పని పిల్లలకే శోభిస్తుంది. బాబా కార్యం బాబానే చేస్తారు. పిల్లలు ఇప్పుడు చదువును ప్రత్యక్షం చేయాలి. టీచరు చదువును ప్రత్యక్షం చేయరు. టీచరు చదువును చదివిస్తారు. విద్యార్థి చదువును ప్రత్యక్షం చేయాల్సి ఉంటుంది. షో కేసులో శక్తులు మరియు పాండవులు ఉంటారు. బాప్దాదా అయితే గుప్తమైనవారు కదా.
ఇప్పుడు పిల్లలందరి మనసులో ఒకటే సంకల్పం వస్తుంది, ఇప్పుడిక త్వరత్వరగా డ్రామా దృశ్యాలు వచ్చి సమాప్తమైపోవాలి అని, కానీ త్వరగా అవుతుందా? వీలవుతుందా? అవుతుందా, వీలవుతుందా? తయారై ఉన్న విధి ఇది, అదైతే తయారై ఉన్నది తయారవుతూ ఉంటుంది. కానీ తయారై ఉన్న విధిలో ఏమి కనిపిస్తుందంటే, ఒకవేళ కల్ప క్రితం వలె ఈ సంకల్పం వస్తుందంటే సంకల్పంతో పాటు తప్పకుండా ముందు కూడా పురుషార్థం తీవ్రంగా చేసి ఉండవచ్చు. అయితే డ్రామాలోని దృశ్యాలు త్వరగా పూర్తయి అందరూ అవ్యక్త వతనవాసులుగా అవ్వాలి అన్న సంకల్పం వస్తుంది. అలా అవ్వవలసిందే. కానీ అవ్యక్త వతనాన్ని కూడా ఆకర్షించి క్రిందకు వ్యక్తంలోకి తీసుకురాగల శక్తి మీలో ఉంది. అవ్యక్త వతన పటాన్ని వ్యక్త వతనంలో తయారు చేయగలరు. అందరికీ ఆశలైతే చాలా ఉన్నాయి. మీ ఆశలన్నీ మాకు చేరుకుంటూ ఉంటాయి, ఇక్కడ సాకార ప్రపంచంలో ఒక పెద్ద ఆఫీసులో టెలిఫోన్ మరియు టెలిగ్రామ్ ద్వారా చేరినట్లు మీ అందరి శుద్ధ సంకల్పాల ఉత్తరాలు వతనంలోకి చేరుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఏమి చేయాలి? కొంతమంది పిల్లలకు లోకసంగ్రహ ప్రశ్నలు కూడా ఉన్నాయి, అవి కూడా చేరుకున్నాయి. సాకారం ద్వారా సూక్ష్మ వతనం అనేది లేదు అని చెప్పించారు కదా, మరి బాబా ఎక్కడకు వెళ్ళినట్లు, పిల్లలను కలవడానికి ఎక్కడి నుండి వస్తున్నారు, ఈ సందేశాలు ఎక్కడకు పంపుతారు? ఎందుకు భోగ్ పెడుతున్నారు అని కొంతమంది పిల్లలు తికమక పడుతున్నారు. దీనికి కూడా ఒక రహస్యము ఉంది. అలా ఎందుకు చెప్పడం జరిగింది? దీనికి ముఖ్య కారణము ఏమిటంటే, ఒక్కోసారి చిన్న పిల్లలు ఏదైనా కావాలని మారాం చేస్తే, ఆ వస్తువు మంచిదైనా కానీ, హద్దుకు మించి దాని వెంట పడితే అప్పుడు ఏమి చేస్తారు? ఆ వస్తువు వారి కంటికి కనిపించకుండా దాచేసి, అది లేనేలేదు అని చెప్తారు కదా. ఆ వస్తువుపై ఏర్పడిన ఎక్స్ట్రా ఆకర్షణను సరి చేయాలన్న ఉద్దేశంతోనే అలా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వర్తమాన సమయంలో కొంతమంది పిల్లలు ఈ విషయాలకే అంటుకుని ఉన్నారు. వారిని దాని నుండి విడిపించడానికి, సూక్ష్మ వతనం అంటూ ఏమీ లేదు అని సాకారంలో చెప్పారు. పిల్లల బుద్ధిని దాని నుండి తొలగించడానికి ఇలా చెప్పడం జరిగింది. పిల్లల ముందు వస్తువు దాచి పెడితే అసలు అది లేదని దాని అర్థం కాదు కదా. అంటుకుని ఉన్న వస్తువు నుండి విడిపించడానికి ఇది ఒక యుక్తి మాత్రమే. అలాగే ఇది కూడా ఒక యుక్తి. ఒకవేళ నిజంగా సూక్ష్మవతనం లేకపోతే భోగ్ ఎక్కడ పెడ్తారు? ఈ ఆచారాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఏదైనా కార్యం జరగబోతుంటే మీరే సందేశి ద్వారా అడిగిపిస్తారు కదా. అలాంటప్పుడు సూక్ష్మవతనం లేదని కాదు కదా. సూక్ష్మ వతనం ఉంది. అయితే ఇప్పుడిక సూక్ష్మ వతనానికి రావడం వెళ్ళడం కాకుండా మీరే సూక్ష్మ వతనవాసులుగా అవ్వాలి. ఇదే పిల్లల పట్ల బాప్దాదాకు ఉన్న ఆశ. రావడము-వెళ్ళడము ఎక్కువ ఉండకూడదు. ఇది యథార్థము. సంపాదన ఎందులో ఉంది? మరి తండ్రి పిల్లల సంపాదనను చూస్తున్నారు మరియు సంపాదనకు యోగ్యులుగా చేస్తున్నారు. అందుకే ఈ రహస్యాలన్నీ చెప్తున్నారు. అలా ఎందుకు చెప్పారు, ఏమి ఉంది అని ఇప్పుడు అర్థమయిందా? సూక్ష్మవతనపు అవ్యక్త అనుభవాన్ని అనుభవం చేయండి. సూక్ష్మ స్థితిని అనుభవం చేయండి. రావడము- వెళ్ళడము అన్నది అల్పకాలికమైనది. అల్పకాలం కోసం కాకుండా స్వయాన్ని సదా కోసం సూక్ష్మవతన వాసిగా ఎందుకు చేసుకోకూడదు? సూక్ష్మవతనవాసిగా అయితేనే వండర్ఫుల్ అనుభవాలు జరుగుతాయి. ఈ అనుభవాలు మరియు సందేశీల అనుభవంలో ఎంత తేడా ఉందో మీరే వర్ణిస్తారు, అందులో సంపాదన ఉండదు. ఇదైతే సంపాదన కూడా మరియు అనుభవం కూడా. మరి ఒకే సమయంలో రెండు ప్రాప్తులు జరగడం మంచిదా లేక ఒకటే కావాలా?
కొంతమంది పిల్లలలో ఈ ప్రశ్న కూడా వస్తుంది, బాప్దాదా అయితే అందరినీ తమతో తీసుకువెళ్తాము అంటారు, ఇప్పుడు వారేమో వెళ్ళిపోయారు, తమతో తీసుకువెళ్తారో లేదో అని ఆలోచిస్తున్నారు. కానీ వారు వెళ్ళిపోయారా? పిల్లలు మరియు ఊరేగింపు లేకుండా ముక్తిధామానికి అయితే వెళ్ళలేరు. ఊరేగింపు లేకుండా ఒంటరిగా వెళ్ళగలరా? ఊరేగింపు తయారుగా ఉన్నదా? ఊరేగింపుతోటే వెళ్తారు అనే ఇప్పటి వరకు విన్నాము. ఊరేగింపు ఇంకా తయారవుతుంటే ఒంటరిగా ఎలా వెళ్ళగలరు? ఇప్పుడైతే సూక్ష్మవతనంలోనే అవ్యక్త రూపం ద్వారా స్థాపనా కార్యం జరుగుతూ ఉంటుంది. స్థాపనా కార్యం సమాప్తమవ్వనంత వరకు, కార్యం పూర్తవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళడం ఉండదు, కలిసే వెళ్తాము, కలిసి వెళ్ళి ఏమి చేస్తాము? ఏమి చేస్తామో తెలుసు కదా? తెలుసా – ఏమి చేస్తాము? కలిసి వెళ్తాము మరియు కలిసి ఉంటాము. కలిసే సృష్టి మీదకు వస్తాము. ఎప్పుడూ చేయి మరియు తోడు వీడదు అన్న మీ పాట ఉంది కదా, మరి పిల్లలు ప్రతిజ్ఞ చేసినట్లే తండ్రి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాబా తమ మాటను మార్చరు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎలాగైనా ఎప్పటికప్పుడు అన్నీ స్పష్టమవుతూ ఉంటాయి. జన్మ జరుగుతుందో లేదో అని కూడా కొంతమంది మనసులలో ఉంది. జన్మ జరుగుతుందా? మీ మమ్మా జన్మ ఎలా అయితే జరిగిందో అలా జరుగుతుందా? పిల్లల వివేకము ఏమి చెప్తుంది? డ్రామాలోని విధిని చూడగలరా? కొంచెం కొంచెం చూడగలరా? మేము త్రికాలదర్శి తండ్రి పిల్లలము అని మీరు అందరికీ చెప్తారు కదా, మరి రాబోయే కాలం గురించి తెలుసుకోలేరా? మీ మనసు యొక్క వివేకము అనుసారంగా ఏమి జరగాలి? అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి అవును లేక కాదు అని చెప్పండి. అప్పుడు జవాబు వస్తుంది. (ఈ విధంగా బాబా ఇద్దరు ముగ్గురుని అడిగారు) చాలావరకు అందరూ జన్మ జరగదు అనే అంటున్నారు. ఇందుకు జవాబు ఈరోజే కావాలా లేక తర్వాతనా! అలజడి జరగడం లేదు కదా! ఇది కూడా ఒక ఆట రచించడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు నదిలో రాళ్ళు విసిరి అందులో వచ్చే అలలతో ఆడుకుంటారు. అలాగే ఇది కూడా ఒక ఆట. బాబా మీ అందరి విచార సాగరంలో ప్రశ్నలు అనే రాళ్ళను విసిరి మీ బుద్ధి రూపీ సాగరంలో అలలను ఉత్పన్నం చేస్తున్నారు. ఆ అలల ఆటనే బాప్దాదా చూస్తున్నారు. ఇప్పుడు మీ అందరితో కలిసి అవ్యక్త రూపంలో స్థాపనా కార్యంలోనే ఉంటారు. స్థాపనా కార్యం ఎప్పటి వరకైతే జరుగుతుందో అప్పటి వరకు అవ్యక్త రూపం ద్వారా మీ అందరితో ఉంటారు. అర్థమయిందా?
వతనంలో మమ్మాను కూడా ఇమర్జ్ చేసుకున్నాము. ఏ చర్చ జరిగిందో తెలుసా? బాబా, మీరు కూర్చోండి, మేమంతా కలిసి పని చేస్తాము అని సాకార వతనంలో మమ్మా అనేవారు కదా, అలాగే వతనంలో కూడా మమ్మా ఇదే అన్నారు, మేమంతా కలిసి స్థాపనా కార్యాన్ని చేస్తాము, మీరు పిల్లలను కలిసి పిల్లలను ఆహ్లాదపరచండి అన్నారు. ఇలాగే సాకారంలో అనేవారు కదా. అటువంటి ఆత్మిక సంభాషణే వతనంలో జరిగింది. మా మమ్మా ఎక్కడకు వెళ్ళారు అని మీ అందరి మనసులలో ఉంది కదా. ఇప్పుడు ఈ రహస్యాన్ని స్పష్టం చేసేది కాదు. వారు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అన్నది కొంత సమయం తర్వాత వినిపిస్తాము. స్థాపనా కార్యంలో కూడా సహయోగిగా ఉన్నారు కానీ భిన్నమైన నామము, రూపముతో. అచ్ఛా – ఇప్పుడు సమయం అయిపోయింది.
ఈరోజు వతనంలో దూరం నుండే సుగంధం వస్తూ ఉంది. ఎంతో స్నేహంతో ఎలా తయారు చేస్తున్నారు అన్నది చూస్తుండినాము. మీరు చూసారా, భండారాకు వెళ్ళారా? వస్తువుల సుగంధం కాదు, స్నేహ సుగంధం వస్తుంది. ఈ స్నేహమే అవినాశిగా అవుతుంది. అవినాశి స్నేహము ఉంది కదా? అందరి స్మృతి చేరుకుంటుంది, అందుకు రెస్పాండ్ పొందడానికి అవస్థ కావాలి. రెస్పాండ్ అయితే వెంటనే లభిస్తుంది. సాకారంలో పిల్లలు బాబా అనగానే పిల్లలకు రెస్పాండ్ లభించేది కదా. ఇప్పుడు కూడా రెస్పాండ్ వెంటనే లభిస్తుంది కానీ మధ్యలోనున్న వ్యక్త భావాన్ని విడిచి పెట్టవలసి ఉంటుంది అప్పుడే ఆ రెస్పాండ్ను వినగలరు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా నలువైపుల సేవ చేసే అనుభవం జరుగుతుంది. ఇప్పుడు అవ్యక్తమైన కారణంగా మరో క్వాలిటీ పెరిగింది. ఏమిటది? తెలుసా? ఇంతకముందు బాహర్యామిగా ఉండేవారిమి, ఇప్పుడు అంతర్యామిగా అయ్యాము. అవ్యక్త స్థితిలో, తెలుసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. స్వతహాగానే ఒక్క సెకండులో అందరి పటాన్ని చూడగలము. అందుకే, ఇంతకుముందు కన్నా మరొక గుణం పెరిగింది అన్నాము. అవ్యక్త స్థితిలో అయితే సుగంధంతోటే పొట్ట నిండిపోతుంది. మీకు తెలుసా?
ఒక ముఖ్యమైన శిక్షణ పిల్లలకు ఇస్తున్నాము. ఇప్పుడు సేవ అయితే చేయవలసిందే, ఇదైతే పిల్లలందరి బుద్ధిలో లక్ష్యము ఉంది, లక్ష్యాన్ని పూర్తి చేస్తారు కూడా కానీ ఈ లక్ష్యాన్ని పూర్తి చేసే మధ్యలో ఒక ముఖ్య విఘ్నము వస్తుంది. అది ఏమిటో తెలుసా? సేవలో ఆటంకం వేసే ముఖ్య విఘ్నము ఏమి వస్తుంది? అందరి ముందుకు కాదు, మెజారిటీ ముందుకు వస్తుంది. అది ఏ విఘ్నము? ముందుగానే చెప్పేస్తున్నాము. సేవ చేస్తూ, నేను ఇది చేసాను, నేనే ఇది చెయ్యగలను, ఈ నేను అన్నది రావడాన్నే జ్ఞాన అభిమానము, బుద్ధి అభిమానము, సేవా అభిమానము అంటాము. ఈ రూపాలలో మున్ముందు విఘ్నాలు రానున్నాయి. కానీ ముందునుండే ఈ విఘ్నాన్ని రానివ్వకండి. ఇందుకోసం ఒక్క మాటను గుర్తు పెట్టుకోండి – నేను నిమిత్తుడిని. నిమిత్తంగా అయితేనే నిరాకారి, నిరహంకారి, నమ్రచిత్తము, నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు.
ఒకవేళ, నేను చేసాను, నేను-నేను అనేది వస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నిమిత్తంగా అవ్వడం వలన నిరాకారి, నిరహంకారి, నిస్సంకల్ప స్థితి తయారవుతున్నట్లుగా నేను నేను అనేది వస్తే అహంకారము, వాడిపోవడము, కృంగుదల వస్తాయి. దాని రిజల్టు ఏమిటి? చివరకు దీని రిజల్టు ఏమవుతుంది అంటే నడుస్తూ నడుస్తూ జీవిస్తూ కూడా మరణిస్తారు. అందుకే, నేను నిమిత్తుడిని అన్న ముఖ్యమైన శిక్షణను మీతో సదా పెట్టుకోండి. నిమిత్తంగా అవ్వడం వలన అహంకారం ఉత్పన్నం అవ్వదు. లేకపోతే నేను అనేది వస్తే అభిప్రాయ భేదాల చక్రంలోకి వచ్చేస్తారు. కావున ఈ అనేక వ్యర్థ చక్రాల నుండి రక్షింపబడటానికి స్వదర్శన చక్రాన్ని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎలా ఎలా మహారథిగా అవుతూ ఉంటారో అలా అలా మాయ కూడా మహారథి రూపంలో వస్తుంది. సాకార రూపంలో అంతిమం వరకు కర్మ చేసి చూపించారు. ఏ కర్మను చేసి చూపించారు? గుర్తుందా? ఏ శిక్షణ ఇచ్చారు? నిరహంకారి మరియు నిర్మాణచిత్తులై పరస్పరం ప్రేమ, స్నేహంతో నడుచుకోవడాన్ని నేర్పించారు. ఒక మాతల సంగఠనను తయారు చేయండి. కుమారీల ట్రైనింగ్ క్లాసు ఏర్పాటు చేసినట్లుగా సహయోగి మాతల సంగఠనను మధుబనంలో పెట్టండి. కుమారీలతో పాటు మాతల సంగఠనను కూడా పెట్టండి. సంగఠన సమయంలో మళ్ళీ రావలసి ఉంటుంది.
స్నేహాన్ని చూస్తే డ్రామా గుర్తుకు వస్తుంది. డ్రామా మధ్యలో వచ్చినప్పుడు సైలెన్సు అయిపోతాము. స్నేహంలోకి వస్తే పరిస్థితి ఏమిటి! నది అయిపోతారు. కానీ అలా కాదు, డ్రామా. ఏ కర్మ మనం చేస్తామో అదే అందరూ చేస్తారు, కనుక సైలెన్సు. ఒకవేళ అందరూ ఉండి ఉంటే అంతిమ కర్మాతీత అవస్థ యొక్క అనుభవం ఏదైతే జరిగిందో అది డ్రామా అనుసారంగా మరోలా ఉండేది. కానీ అలా జరిగేది లేదు కనుకనే కొద్దిమంది మాత్రమే ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉన్నప్పటికీ ఎదురుగా లేనట్లుగా ఉండినది. స్నేహము అయితే వతనంలో కూడా ఉంది, ఉంటుంది. అవినాశి కదా. కానీ వినిపించాము కదా, స్నేహాన్ని డ్రామా సైలెన్సు చేసేస్తుంది. ఈ సైలెన్సు, శక్తిని తీసుకువస్తుంది. తర్వాత అక్కడ సాకారంలో మిలనం జరుగుతుంది. ఇప్పుడు అవ్యక్త రూపంలో కలుస్తాము. తర్వాత సాకారంలో సత్యయుగంలో కలుస్తాము. ఆ దృశ్యమైతే గుర్తుకు వస్తుంది కదా. ఆడుకుంటాము, పాఠశాలకు వెళ్తాము, కలుస్తాము. కనుపాపలైన మీరు సత్యయుగ దృశ్యాలను వతనంలో చూస్తూ ఉంటారు. ఏదైతే బాబా చూస్తుంటారో అది పిల్లలు కూడా చూస్తారు మరియు చూస్తూ ఉంటారు.
ఇప్పుడు జ్వాలా రూపంగా అవ్వాలి. మీ యొక్క జ్వాలా రూపమే స్మృతి చిహ్నముగా ఉంది. జ్వాలా దేవి కూడా ఉంది, తెలుసా? వారు ఎవరు? ఈ శక్తులందరూ జ్వాలారూప దేవీలుగా అవ్వాలి. ఇటువంటి జ్వాలను ప్రజ్జ్వలితం చేయాలి. ఈ జ్వాలలో కలియుగ ప్రపంచము కాలి భస్మమైపోతుంది. అచ్ఛా!
వీడ్కోలు సమయంలో బాప్దాదా మహావాక్యాలు –
అన్ని సెంటర్లలో అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్న కనుపాపలు బాబా మరియు దాదా యొక్క అవ్యక్త ప్రియస్మృతులను స్వీకరించండి. అలాగే ఏదైతే సూచన ఇవ్వడం జరిగిందో దానిని తర్వగా జీవితంలోకి తీసుకువచ్చే తీవ్ర పురుషార్థం చేయండి. అచ్ఛా. గుడ్ నైట్. శివ శక్తులు మరియు పాండవులు అందరికీ బాబా యొక్క నమస్తే.
ఓంశాంతి