Search for a command to run...
23 Jul 1969
సఫలతకు ఆధారము – పరిశీలన శక్తి
23 July 1969 · తెలుగు
బాప్‌దాదా ప్రతి ఒక్కరినీ చూస్తున్నప్పుడు ఏమి చూస్తారు? బాప్‌దాదా ప్రతి ఒక్కరిలో నాలుగు విషయాలను చూస్తున్నారు. ఆ నాలుగు విషయాలు ఏవి? (అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు) ఒకటైతే కిరీటాన్ని (తాజ్) చూస్తున్నారు. రెండు సింహాసనము (తఖ్త్), మూడు పురుషార్థము (తదబీర్), నాలుగు అదృష్టము (తకదీర్). ఈ నాలుగు విషయాలనే ప్రతి ఒక్కరిలో చూస్తున్నాము. సంగమ కిరీటము ఏమి ఉంటుంది? తెలుసా? ఈరోజు బాప్‌దాదా సింహాసనాధికారులు, కిరీటధారులున్న వత్సల సభలోకి వచ్చారు. కిరీటధారులను మాత్రమే ఈ సంగఠనలోకి పిలిచాము. కానీ ప్రతి ఒక్కరి కిరీటము వేరుగా మరియు యథాశక్తిగా ఉంది. ఈ సంగమంలో ఎవరెవరు కిరీటధారులై, సింహాసనాధికారులై కూర్చుని ఉన్నారని చూస్తున్నాము. కొందరు పెద్ద కిరీటాన్ని ధరిస్తే మరికొందరు చిన్నది పెట్టుకున్నారు. అలాగే కిరీటాన్ని సదా తలపై పెట్టుకుని నడుస్తున్నారా లేక అప్పుడప్పుడూ కిరీటాన్ని ప్రక్కన పెడ్తున్నారా?
మీ అందరికీ మీ గురించి తెలుసు కదా. ఎందుకంటే అందరూ ఎంచుకోబడ్డ రత్నాలు, కనుక ఇంత పరిశీలన అయితే తప్పకుండా ఉంటుంది. మీ తదబీర్ మరియు తకదీర్ను గుర్తించగలరా? మీరు మిమ్మల్ని పూర్తిగా పరిశీలించుకోగలరా? ఉదాహరణకు, మీరు ఎడ్వాన్స్ పార్టీకి వెళ్ళారనుకోండి, మీ పురుషార్థము అనుసారంగా మీ అదృష్టం ఎలా ఉండబోతుంది? మీ వర్తమాన పురుషార్థము మరియు అదృష్టము గురించి తెలుసా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగినప్పుడే ఇతరులను పరిశీలించగలరు. ఇది తెలుసుకోవడము కూడా అవసరము. ఎందుకంటే పరిశీలన శక్తి యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది, అటువంటి సమయమే రాబోతుంది. సేవలో సఫలత పొందడానికి ముఖ్య సాధనమే ఇది. ఎంతెంతగా పరిశీలన శక్తి తీవ్రమవుతుందో అంతంతగా సఫలత కూడా లభిస్తుంది. పరిశీలన పూర్తిగా లేనందున వారికి ఏమి కావాలో, ఏ రూపంలో వారి అదృష్టం మేలుకుంటుందో ఆ రూపం వారికి లభించడం లేదు. అందుకనే సేవలో సఫలత తక్కువగా లభిస్తుంది. తక్కువ సేవ చేసేవారి రిజల్టులో ప్రజలు అయితే చాలామంది తయారవుతున్నారు కానీ వారసులు తక్కువగా తయారవ్వడం చూసాము. వారసులు తక్కువగా తయారవ్వడము అంటేనే వారి స్వభావాన్ని పూర్తిగా గుర్తించలేదని అర్థం. రోగిని పూర్తిగా పరిశీలించినప్పుడే సరైన ఔషధం లభిస్తుంది కదా. అప్పుడు రోగం కూడా సమాప్తమవుతుంది. ముఖ్యంగా, నిమిత్తమైన పాండవులకు భవిష్యత్తులో రానున్న విషయాలలో పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి ఉండటము అవసరము. నిర్ణయం తర్వాత నివారణ శక్తి కూడా ఉండాలి. అప్పుడే ఎదుర్కోగలరు, ఎదుర్కున్న తర్వాత యజ్ఞం యొక్క ప్రత్యక్షతలో సఫలత లభిస్తుంది.
మిమ్మల్ని బాబా ఎందుకు పిలిపించారు? లెక్క వేయడం జరుగుతుంది కదా. మెట్లు ఎక్కడము మరియు దిగడము యొక్క జ్ఞానాన్ని నేర్పించడానికి పిలిపించామా? ఇప్పుడు ఏ విషయంలో దిగాలి మరియు ఏ విషయంలో ఎక్కాలి? పెద్దరికాన్ని అయితే పట్టుకున్నారు, కానీ పెద్దరికము ఉంటుండగానే ఎక్కడ చిన్నతనము అను మెట్లు దిగాలో అక్కడ వెంటనే దిగలేకపోతున్నారు. ఒక్క సెకండులో యజమాని మరియు ఒక్క సెకండులో బాలకతనము యొక్క ఆవశ్యకత ఉంది. ఎక్కడ బాలకులుగా అవ్వాలో అక్కడ యజమానితనము కూడా కొంచెం కనిపిస్తుంది. సమయాన్నిబట్టి స్వరూపమును ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా నేర్పించడానికి పిలిపించాము. ఉదాహరణకు, మీరు ఎక్కడైనా సంగఠన మధ్యలో ఉన్నారనుకోండి, సంగఠనలో ఏదైనా విషయం జరిగితే, అక్కడ మీ ఆలోచనను ఇచ్చేటప్పుడు యజమానిగా అయ్యి ఆలోచనను ఇవ్వడం చాలా మంచిది. కానీ సంగఠన విషయంలో అక్కడి నిమిత్త సోదరసోదరీలు ఏదైనా ఫైనల్ చేస్తే, ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా బాలకతనములోకి తీసుకువెళ్ళాలి. బాలకతనము యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉంటుంది? అక్కడే ఫోర్సుగా మాట్లాడుతారు, అక్కడే మళ్ళీ నిస్సంకల్పంగా అయిపోతారు, ఈ విధంగా సంగఠన మధ్యలో నిమిత్తంగా అయి ఉన్న వారి ఎదురుగా యజమానిగా అయ్యి తమ సలహాను ఇచ్చిన తర్వాత వెంటనే బాలకతనపు బుద్ధిని తయారు చేసేసుకోవాలి. ఇందులోనే లాభము కూడా ఉంది. అయితే ఎక్కడ యజమానితనము ఉంటుందో దాని రిజల్టు ఎలా ఉంటుంది? ఒకటి సమయం పాడవుతుంది, శక్తి కూడా వృధా అవుతుంది. పరస్పరంలో పెరగాల్సిన స్నేహము తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఎలా అయితే బాధ్యతలను తీసుకుంటూ ఉంటారో అలాగే మీరు ఈ మెట్లను ఎక్కడము మరియు దిగడాన్ని నేర్చుకోవలసిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ ఎడ్వాన్స్‌గా భవిష్య సేవా సఫలతకు శిక్షణను ఇస్తున్నాము. మీరందరూ అనుభవీలు కదా. ఎప్పటికప్పుడు చిన్న, పెద్ద ప్రతి ఒక్కరూ తమ శక్తి మరియు స్వమానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోనుపోను ఈ సమస్య కాస్త ఎక్కువగానే మీ ముందుకు వచ్చేది ఉంది కనుక ఎవరైతే నిమిత్తంగా అయి ఉన్నారో వారు చాలా నిర్మాణచిత్తముగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్మాణము అంటే తమ గౌరవాన్ని కూడా త్యాగము చేయడము. త్యాగముతో మళ్ళీ మరింత భాగ్యము లభిస్తుంది. ఎంతగా మీరు త్యాగం చేస్తారో అంతగా మీకు స్వమానము లభిస్తుంది. ఎంతగా మీ స్వమానాన్ని ఇతరులతో నిలుపుకునే ప్రయత్నం చేస్తారో అంతగా స్వమానాన్ని పోగొట్టుకునేందుకు కారణం అవుతారు. కనుక బాలక మరియు యజమానితనము అను మెట్లను త్వరత్వరగా దిగండి మరియు ఎక్కండి, ఈ అభ్యాసాన్ని పెంచండి. ఇందుకే మిమ్మల్ని పిలిపించాము. పరిస్థితిని పరిశీలించినప్పుడే ఇందులో సఫలత లభిస్తుంది. పరిస్థితిని పరిశీలించినప్పుడు పరిణామము కూడా సరిగ్గా వస్తుంది. పరిశీలించకపోతే పరిణామము సరిగ్గా ఉండదు.
పరిశీలన శక్తిని పెంచుకునేందుకు ఏ పురుషార్థము చేయాలి? మనసు స్వచ్ఛతకన్నా ఈ విషయంలో బుద్ధి స్వచ్ఛత ఎక్కువ అవసరము. సంకల్ప శక్తికి బ్రేక్ వేసే శక్తి కావాలి. మనసులోని సంకల్పము లేక బుద్ధి ద్వారా తీర్పు అనైనా అనండి. మరి మనసు మరియు బుద్ధి – రెండిటికీ శక్తిశాలి బ్రేక్ కావాలి. రెండు, మల్చుకునే శక్తి కూడా కావాలి. ఈ రెండు శక్తుల అవసరము చాలా ఉంది. దీనినే స్మృతి శక్తి లేక అవ్యక్త శక్తి అంటాము. ఒకవేళ బ్రేక్ వేయలేకపోతే కూడా సరి కాదు. ఒకవేళ టర్న్ చేయలేకపోతే కూడా సరి కాదు. కనుక బ్రేక్ వేయడము మరియు టర్న్ చేసే శక్తి ఉన్నప్పుడు బుద్ధి యొక్క శక్తి వృధాగా పోదు. శక్తి వృధా అవ్వకుండా జమ అవుతుంది. ఎంతగా జమ అవుతుందో అంతగా పరిశీలన, నిర్ణయ శక్తులు జమ అవుతాయి. భట్టీలో ఈ అభ్యాసాన్ని కూడా చేయాలి. మరి మీ మనసు మరియు బుద్ధికి ఎంత బ్రేక్ వేయగలుగుతున్నారు, మల్చుకోగలుగుతున్నారు? స్వయాన్ని పరిశీలించుకోండి. ఏదైనా విషయంలో యాక్సిడెంటు జరగడానికి కూడా ఈ రెండు కారణాలే. ముఖ్యంగా పాండవుల కోసం బాప్‌దాదా ఇచ్చే విశేష సూచన ఇది. అచ్ఛా.
భట్టీలో అయితే చాలా విని ఉంటారు, చాలా వినడం వలన బిందు స్వరూపంలో ఉండటం కష్టమవ్వడం లేదు కదా? బిందు రూపంలో స్థితి అవ్వలేకపోవడానికి కారణము – మొదటి పాఠములోనే కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్నారు. కర్మ చేస్తూ కూడా స్వయాన్ని అశరీరి ఆత్మగా అనుభవం చేయండి. దీనిని రోజంతా చాలా అభ్యాసం చేయండి. ప్రాక్టికల్‌లో అతీతంగా ఉంటూ కర్తవ్యాన్ని చేయండి. ఇది ఎంతెంతగా అనుభవం చేస్తారో అంతగా బిందు రూపంలో స్థితులవుతారు. కానీ ఈ అటెన్షన్ తక్కువగా ఉంటుంది. సమయం లభించడం లేదు అని మీరంటారు కానీ సమయాన్ని కేటాయించవచ్చు. లక్ష్యము ఉంటే, ఎలా అయితే ఎవరైనా విశేష కార్యము కోసం వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకుని సమయాన్ని కేటాయిస్తారు కదా. సంగమంలో మిగిలి ఉన్న కొద్ది సమయంలో చేయవలసిన విశేష కార్యము ఇదే. విశేష కార్యముగా భావించి మధ్యమధ్యలో సమయాన్ని కేటాయిస్తే సమయం లభించగలదు. కానీ అభ్యాసం లేదు కనుక ఆలోచించడంలోనే సమయం చేతులనుండి జారిపోతుంది. మీరు శ్రద్ధ పెడితే, ఎటువంటి పరిస్థితియో ఆ విధంగా మీ అభ్యాసాన్ని పెంచగలరు. ఈ అభ్యాసంలో అయితే పిల్లలందరూ కచ్చాగా ఉన్నారు.
వాస్తవానికి బిందు రూపంలో స్థితి అవ్వడము పెద్ద కష్టమేమీ కాదు. ఎంతెంతగా అతీతంగా అవుతారో అంతగా, బిందు రూపమైతే ఉన్నదే అతీతమైనది. నిరాకారము కూడా. మరి అతీతంగా కూడా, మీరు కూడా నిరాకారి మరియు అతీత స్థితిలో ఉంటే బిందు రూపాన్ని అనుభవం చేయగలరు. నడుస్తూ, తిరుగుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలరు. అభ్యాసం ఎంత సహజమైపోతుందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్యక్త స్థితిలో ఉండగలరు. ఒక్క సెకండు యొక్క అనుభూతిలో ఎంతో శక్తిని మీలో నింపుకోవచ్చు. అది కూడా అనుభవం చేసుకుంటారు. బ్రేక్ వేయడము మరియు టర్న్ అయ్యే శక్తులు కూడా అనుభవంలోకి వస్తాయి. కావున బిందు రూపము యొక్క అనుభవము పెద్ద కష్టము కాదు. సంకల్పమే క్రిందకు తెస్తుంది, సంకల్పానికి బ్రేక్ వేసే శక్తి ఉంటే ఎక్కువ సమయము అవ్యక్త స్థితిలో స్థితి కాగలరు. స్వయాన్ని ఆత్మగా భావించి ఆ స్వరూపంలో స్థితి కావాలి. స్వ స్థితిలో స్థితి అయినప్పుడు కూడా మీ గుణాలు అనుభవం అవుతాయి. ఏ స్థానానికి చేర్చడం జరుగుతుందో వారికి గుణాలు వద్దనుకున్నా అనుభవం అవుతాయి. మీరు ఏదైనా శీతల స్థానానికి వెళితే వద్దన్నా కూడా శీతలత అనుభవం అవుతుంది. ఇది కూడా అలాగే. ఆత్మ అభిమాని అంటే తండ్రి స్మృతి. ఆత్మిక స్వరూపంలో బాబా స్మృతిలో లేకపోతే ఇది వీలవ్వదు. ఎలా అయితే బాప్ దాదా ఇరువురూ వేరువేరు కారో అలాగే ఆత్మిక నిశ్చయ బుద్ధితో బాబా స్మృతి కూడా వేరు కాదు.
ఒక్క సెకండులో స్వయాన్ని బిందు రూపంలో స్థితి చేసుకోలేరా? ఇప్పుడు ఈ డ్రిల్‌ను చేయండి అని అందరికీ చెబితే చేయగలరా? బిందు రూపంలో స్థితి అవ్వడంవలన ఒకటైతే అతీతతనము అనుభవం అవుతుంది మరియు ఆత్మ యొక్క వాస్తవిక గుణము కూడా అనుభవం అవుతుంది. ఇది కూడా ప్రాక్టీసు చేయండి ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. చేయవలసిన కార్యం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సమయం ఎక్కువగా మరియు పని తక్కువగా చేస్తున్నారు. రాబోయే సమయం ఎలా ఉంటుందంటే మీరంతా ఎంతో బిజీ అయిపోతారు. సమయం చాలా తక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది. రాత్రి పగలు కేవలం రెండు గంటలవలె అనిపిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేయడం ఇప్పటి నుండే నేర్చుకోండి. సమయాన్ని సఫలం చేయడం కూడా చాలా పెద్ద శక్తి. ఎలా అయితే మీ ఎనర్జీని వృధా చేయడం సరైన పని కాదో అలాగే సమయాన్ని వృధా చేయడం కూడా సరైన పని కాదు. ఒక్కొక్కరి ప్రజలు ప్రఖ్యాతి చెందుతారు. ప్రజలు ప్రఖ్యాతి చెందినప్పుడు పదవి కూడా ప్రఖ్యాతి అవుతుంది, ప్రతి ఒక్కరి ప్రజలు మరియు భక్తులు ప్రఖ్యాతి చెందుతారు. భవిష్య పదవికన్నా ముందే సంగమ సేవలో సఫలతా స్వరూప స్మృతిచిహ్నము ప్రఖ్యాతి అవుతుంది. భవిష్య పదవి ప్రఖ్యాతి అవుతుంది. రాబోయే సమయంలో మీరు మీ కోసం సంపాదించుకోలేరు, ఇతరుల కోసమే బిజీ అయిపోతారు. ఇప్పుడు మీ సంపాదన కోసం కొంత సమయమే ఉంది. తర్వాత ఇతరుల సేవ చేయడంలోనే మీ సంపాదన ఉంటుంది. ఇప్పుడు లభించిన ఈ కొద్ది సమయం నుండి పూర్తి లాభాన్ని తీసుకోండి. లేకపోతే ఈ సమయమే గుర్తుకు వస్తూ ఉంటుంది. కనుక, ఎలా ఉన్నా, ఎక్కడున్నా కానీ – పరిస్థితులు మారవు. కష్టాలు కొద్దిగా తగ్గితే సంపాదన చేసుకుంటాను అని అనుకోకండి. ఇవైతే రోజురోజుకీ విశాల రూపాన్ని ధరిస్తాయి. వీటిలో ఉంటూ కూడా మీ స్థితి పరిపక్వంగా ఉండాలి. అందుకనే సమయంపై శ్రద్ధ, మీ స్వరూపం యొక్క స్మృతి, ఆ తర్వాత స్థితి – వీటిపై శ్రద్ధ పెట్టాలి. అచ్ఛా!
బాధ్యతా కిరీటము గురించి చెప్పాము. సింహాసనము ఏమిటి? నమ్రచిత్తము అను సింహాసనము. దానిపై విరాజితమవ్వగానే అన్ని పనులు సరిగ్గా చేయగలరు. శక్తి సైన్యానికి ఒకే విధమైన సింహాసనాన్ని ఇచ్చాము. పాండవ సైన్యానికి నిర్మాణచిత్తము అను సింహాసనాన్ని ఇచ్చాము. దానిపై కూర్చుని, బాధ్యతా సింహాసనాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి దిగకండి. దీనిపై కూర్చోగానే కార్యము సఫలం అవుతుంది. చూడండి, రోజంతటిలో మీరు పనులు చేసేటప్పుడు మీ వెంటే ఉండే నాలుగు విషయాలు ఏమిటి? సాధారణమైన మరియు స్థూల విషయాన్ని అడుగుతున్నాము. ఒకటి కుర్చీ ఉంటుంది, రెండు పెన్ను, మూడు ఫైల్, నాలుగు పరుగులాట. ఈ నాలుగింటిని లౌకికం నుండి అలౌకికంలోకి మార్చండి. కుర్చీపై కూర్చున్నప్పుడు సింహాసనాన్ని గుర్తు తెచ్చుకోండి. పెన్ను(కలమ్) పట్టుకుంటే కమల పుష్పాన్ని గుర్తు తెచ్చుకోండి. కమల పుష్పమై కలమును వాడండి. ఫైలును చూసి మీ లెక్కను గుర్తుకు తెచ్చుకోండి, నా ఫైలులో ఇప్పుడు బాప్‌దాదా ఏమని సంతకం చేస్తుండవచ్చు! పరుగులాట అంటే మెట్లు ఎక్కడము మరియు దిగడము – ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధిని పెట్టాలనుకుంటున్నారో అక్కడ బుద్ధి నిలుస్తుందా, నిలవడంలేదా! మీ పాదాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెడ్తారు కదా, అలాగే మీ బుద్ధి కూడా పాదము వలె అయిపోతుంది. ఇప్పుడు బుద్ధిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేయండి. అప్పుడు అవస్థలో కూడా పరివర్తన వస్తుంది.
ఈ సంగఠనలోని రత్నాల ప్రత్యేక విశేషత ఏమిటి? ఒకటైతే అందరూ స్నేహీలు; రెండు, మెజారిటీ సరెండర్ బుద్ధితో ఉన్నారు. మూడు, సేవ కోసం ప్రతి సమయం తయారుగా ఉంటారు. అందుకే ఎవరెడీ. ఇప్పుడు లభించిన బాధ్యత అను కిరీటంలో ఈ అన్ని విశేషతలను రత్నాలవలె పొదగండి. అప్పుడే బాధ్యతను పూర్తిగా నెరవేర్చగలరు. ఈ గుణాలు కిరీటంలోని మణులవంటివి అనగా శోభ. వీటిని స్థిరంగా నిలుపుకోండి. మీరు ఏ కర్మ చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ ఫాలో చేస్తారు. ఇంకో స్లోగన్‌ను గుర్తు చేసుకోవడము చాలా అవసరము. చిన్నవారిని ప్రేమించండి మరియు పెద్దలకు రిగార్డు(గౌరవం)ను ఇవ్వండి. ప్రేమ ఇవ్వాలి, గౌరవాన్ని తీసుకోవాలి. ఇది ఎప్పుడూ మర్చిపోకండి. ఈ సంగఠన బంగారం వంటిది కానీ బంగారానికి మెరుగులు అద్దడం జరుగుతుంది. అందుకోసం మధ్యమధ్యలో మధుబన సంగఠన స్థానము ఉండాలి. నిమిత్తంగా ఉన్న సోదరీల సలహా మేరకే ఎప్పటికప్పుడు సంగఠనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రదర్శనిలో కూడా కొంత నవీనత రావాలి. ఇప్పుడైతే ఇక్కడి జ్ఞానం బాగుంది అని మాత్రమే అనుకుంటున్నారు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, వారు అడక్కుండానే చూసినంతనే, మాకు ఈ సహజ దారి లభించింది అని అనిపించాలి. ఈ లక్ష్యాన్ని పెట్టుకుని ప్రదర్శనిని తయారు చేసే ప్రయత్నం చేయండి. టాపిక్ కూడా ఆకర్షణీయంగా ఉండాలి. పరమాత్మ పరిచయంపై పెట్టవచ్చు. దూరంగా వెళ్ళేవారిని సమీపంగా తీసుకురావాలి. తర్వాత అందులో ధర్మపరమైన ఆలోచనలు ఉన్నవారుగానీ, మరొకరుగానీ అందరినీ సమీక్షిస్తూ ఉండండి. తదుపరి సమీక్ష లేకపోతే సఫలత ఉండదు. మ్యూజియం సేవ చేసారు, అక్కడ కూడా సమీక్ష చేయాలి. వారితో సంపర్కంలో ఉండండి. ఎప్పటికప్పుడు పిలుస్తూ ఉండండి. ఇది వారి పరివారము అని అనిపించేలా చక్కని సంబంధాలు పెట్టుకోండి. అప్పుడే సేవలో సఫలత ఉంటుంది. అచ్ఛా.