Search for a command to run...
25 Jun 1970
వ్యక్త మరియు అవ్యక్తవతన భాషలోని అంతరము
25 June 1970 · తెలుగు
వ్యక్త లోకములో ఉంటూ అవ్యక్త వతనపు భాషను తెలుసుకోగలరా? అవ్యక్త వతనములో ఏ భాష ఉంటుంది? ఎప్పుడైనా అవ్యక్త వతనపు భాషను విన్నారా? ఇప్పుడైతే అవ్యక్తుడు వ్యక్త లోక నివాసుల కొరకు అవ్యక్త ఆధారమును తీసుకొని వ్యక్త దేశం యొక్క పద్ధతి ప్రకారం మాట్లాడవలసి వస్తోంది. అక్కడ అవ్యక్త వతనములో అయితే ఒక్క క్షణములో చాలా రహస్యాలు స్పష్టమైపోతాయి. ఇక్కడ మీ ప్రపంచములో చాలా మాట్లాడిన తరువాత స్పష్టమవుతుంది. ఇదే వ్యక్త భాషలోని అంతరము. ఈ రోజు బాప్‌దాదా ఏమి చూస్తున్నారు అన్నదానిని అవ్యక్త బాప్‌దాదా సంకేతాల ద్వారా తెలుసుకోగలరా? సైన్స్ ద్వారా ఎక్కడెక్కడి విషయాలనో, ఎక్కడెక్కడి దృశ్యాలనో క్యాచ్ చెయ్యగలరు. అలాగే మీరు అవ్యక్త స్థితి ఆధారముతో సమ్ముఖములోని విషయాలను క్యాచ్ చెయ్యలేరా? మూడు విషయాలను చూస్తున్నాము. అవి ఏవి? ప్రతి ఒక్కరూ ఎంతవరకు చెకర్(పరిశీలించేవారి)గా అయ్యారు మరియు చెకర్తో పాటు ఎంతవరకు మేకర్(తయారుచేసేవారి)గా అయ్యారు అన్నదానినే బాప్‌దాదా ఈ రోజు చూస్తున్నారు. ఎవరైతే ఎంతగా చెకర్‌గా అవుతారో అంతగా మేకర్‌గా కూడా అవ్వగలరు. ఈ సమయములో మీరు లా మేకర్ కూడా మరియు నూతన ప్రపంచ మేకర్ కూడా మరియు పీస్ మేకర్ కూడా. కానీ మేకర్‌తో పాటు చెకర్‌గా కూడా తప్పకుండా అవ్వాలి. విశేషంగా దేనిని చెక్(పరిశీలన) చేసుకోవాలి? ఇప్పుడు ఈ సేవే మిగిలి ఉంది, దీనితోనే పేరు ప్రసిద్ధమవ్వాలి. ఆ చెకర్స్ ఏం చెక్ చేస్తారు? కల్తీ(అడల్టరేషన్) మరియు అవినీతి(కరప్షన్). ఈ సేవయే ఇప్పుడు మిగిలి ఉంది. అవినీతి మరియు కల్తీ చేసేవారు ఎవరైతే ఉంటారో వారి వద్దకు ఆల్మైటీ గవర్నమెంటు తరఫున చెకర్లుగా అయ్యి వెళ్ళండి. ఏవిధంగా ఆ గవర్నమెంటు చెకర్స్ గానీ లేక ఇన్స్పెక్టర్లు గానీ ఇటువంటి వారెవరి వద్దకైనా వెళ్ళినట్లయితే వారు తమ గుట్టును చెప్పరు. ఇదే విధంగా పాండవ గవర్నమెంటు అథారిటీ నుండి చెకర్లుగా అయ్యి వెళ్ళండి, వారు మిమ్మల్ని చూడటంతోనే వారి అవినీతి, కల్తీతో గాభరా పడిపోతారు, తల వంచేస్తారు. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది, దీనితోనే పేరు ప్రసిద్ధమవ్వాలి. ఒక్కరు తల వంచినా అనేకుల తలలు వంగిపోతాయి. పాండవ గవర్నమెంటు అథారిటీలుగా అయ్యి వెళ్ళాలి, సవాలును విసరాలి. ఇప్పుడు అర్థమైందా! స్వయముపై కూడా చెకర్‌గా అవ్వాలి మరియు సేవలో కూడా చెకర్‌గా అవ్వాలి. ఎవరు ఎంతగా చెకర్‌గా మరియు మేకర్(తయారుచేసేవారి)గా అవుతారో వారే మళ్ళీ రూలర్(పాలకులు)గా కూడా అవుతారు. మరి, ఎంతవరకు చెకర్లుగా అయ్యారు, ఎంతవరకు మేకర్లుగా అయ్యారు మరియు ఎంతవరకు రూలర్లుగా అయ్యారు అన్న విషయాలను ప్రతి ఒక్కరిలో చూస్తున్నాము.
ఎప్పుడైతే స్వయాన్ని ఈ మూడు రూపాలలో స్థితి చేసుకుంటారో అప్పుడిక చిన్న చిన్న విషయాలలో సమయము వృధా అవ్వదు. మీరు ఉన్నదే ఇతరుల కరప్షన్, అడల్టరేషన్ను చెక్ చేసేవారిగా అయినప్పుడు మీవద్ద కరప్షన్, అడల్టరేషన్ ఉండగలవా? కావున మేము ఈ మూడు స్థితులలో ఎంతవరకు స్థితులమై ఉండగలుగుతున్నాము అన్న నషా ఉండాలి. రూలర్స్గా ఎవరైతే ఉంటారో వారు ఎవరి అధీనములోనూ ఉండరు. అధికారులుగా ఉంటారు. వారు ఎప్పుడూ ఎవరి అధీనములోనూ ఉండజాలరు. మరి ఇక మాయ అధీనములో ఎలా ఉంటారు? అధికారమును మర్చిపోయినందు వలన అధికారిగా భావించరు. అధికారిగా భావించనందువల్ల అధీనమైపోతారు. ఎంతగా మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారో అంతగా ఉదారచిత్తులుగా తప్పక అవుతారు. ఎవరు ఎంతగా ఉదారచిత్తులుగా అవుతారో అంతగానే వారు అనేకులకు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు. ఉదారచిత్తులుగా అయ్యేందుకు అధికారిగా అవ్వవలసి ఉంటుంది. అధికారి అన్న మాటకు అర్థమే అధికారము ఎల్లప్పుడూ గుర్తుండటము. అప్పుడు ఉదాహరణ స్వరూపంగా అవుతారు. బాప్‌దాదా ఏవిధంగా ఉదాహరణ స్వరూపులుగా అయ్యారో అలా మీరందరూ కూడా అనేకులకు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు. ఉదారచిత్తులుగా ఉన్నవారు ఉదాహరణగా కూడా అవుతారు మరియు అనేకుల ఉద్ధారము కూడా సహజంగానే చెయ్యగలరు. అర్థమైందా!
ఎవరిలోనైనా మాయ ప్రవేశించినప్పుడు మొదటగా ఏ రూపములో మాయ వస్తుంది? (ప్రతిఒక్కరూ వారి వారి ఆలోచనలను వినిపించారు) మొదటగా మాయ భిన్న భిన్న రూపాలలో సోమరితనాన్ని తీసుకువస్తుంది. దేహ అభిమానములో కూడా మొదటి రూపముగా సోమరితనాన్ని ధారణ చేస్తుంది. ఆ సమయములో శ్రీమతాన్ని తీసుకొని వెరిఫై చేయించుకొనేందుకు సోమరితనము వస్తుంది, మరల దేహాభిమానము పెరుగుతూ ఉంటుంది. ఇతర విషయాలన్నింటిలో భిన్న భిన్న రూపాలతో మొదట సోమరితనపు రూపము వస్తుంది. సోమరితనము, బద్ధకము మరియు ఉదాసీనత, ఇవన్నీ ఈశ్వరీయ సంబంధము నుండి దూరము చేసేస్తాయి. సాకార సంబంధము నుండి లేక బుద్ధి సంబంధము నుండి లేక సహయోగము తీసుకొనే సంబంధము నుండి దూరము చేసేస్తాయి. ఈ బద్ధకము వచ్చిన తరువాత ఏ భయంకర రూపము వస్తుంది? దేహ అహంకారములోకి ప్రత్యక్ష రూపములో వచ్చేస్తారు. మొదట ఆరవ వికారము నుండి మొదలవుతుంది. జ్ఞానీ ఆత్మలైన పిల్లలలో మాయ చివరి నెంబరు నుండి అనగా బద్ధకము రూపములో మొదలవుతుంది. బద్ధకములో ఎటువంటి సంకల్పాలు ఉత్పన్నమవుతాయి? వర్తమాన సమయములో ఈ రూపములో మాయ ప్రవేశిస్తుంది. ఈ విషయముపై చాలా శ్రద్ధ వహించాలి. ఈ ఆరవ రూపంలో మాయ భిన్న భిన్న ప్రకారాలతో వచ్చేందుకు ప్రయత్నము చేస్తుంది. బద్ధకమునకు కూడా రకరకాల రూపాలు ఉంటాయి. శారీరక, మానసిక, రెండు సంబంధాలలో కూడా మాయ రాగలదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా దీనిని చేద్దాములే, తొందరేముంది అని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఇలా-ఇలా చాలా రాయల్ రూపాలలో మాయ వస్తుంది. అవ్యక్త స్థితి ఈ పురుషార్థి జీవితములో 6-8 గంటలు ఉండడమనేది ఎలా జరుగగలదు? ఇది అంతిమములోనే జరుగగలదు అని కూడా కొందరు ఆలోచిస్తారు, ఇది కూడా బద్ధకపు రాయల్ రూపము. తరువాత చేస్తానులే, ఆలోచిస్తానులే, చూస్తానులే... ఇవన్నీ బద్ధకములే. ఇప్పుడు వీటిని పరిశీలించుకోండి. ఎవ్వరినీ మాయ తన రాయల్ రూపముతో వెనక్కి తప్పించడం లేదు కదా? ప్రవృత్తిని తప్పక పాలన చేయవలసిందే, కానీ ప్రవృత్తిలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉండాలన్నది మరచిపోతారు. సగం విషయము గుర్తుంటుంది, సగం విషయమును వదిలివేస్తారు. చాలా సూక్ష్మ సంకల్పాల రూపములో మొదట బద్ధకము ప్రవేశిస్తుంది, ఆ తరువాత పెద్ద రూపాన్ని ధరిస్తుంది.
ఒకవేళ అదే సమయములో దానిని తీసేసినట్లయితే ఎక్కువగా ఎదుర్కోవలసిన అవసరము ఉండదు. కావున ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అవ్వటంలో లేక హైజంప్ చేయటంలో ఏ రూపంలో మాయ బద్ధకస్తులుగా చేస్తుంది అన్నదానిని పరిశీలించుకోవాలి. మాయ యొక్క బయటి రూపమేదైతే ఉందో దానిని పరిశీలించుకుంటారు కానీ ఈ రూపాన్ని చెక్ చేసుకోవాలి. ఫిక్స్ సీట్లు తక్కువ కదా అని కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. కావున ఇతరులు పురుషార్థములో ముందుకు వెళ్ళటం చూసి మేమైతే ఇంత ముందుకు వెళ్ళలేము, ఈమాత్రం చాల్లే అని తమ బుద్ధిలో ఆలోచిస్తారు. ఇది కూడా బద్ధకము యొక్క రూపమే. కావున ఈ అన్ని విషయాలలో మిమ్మల్ని మార్చుకోవాలి, అప్పుడే లా మేకర్స్ లేక పీస్ మేకర్స్‌గా అవ్వగలరు మరియు న్యూ వరల్డ్(కొత్త ప్రపంచపు) మేకర్లుగా అవ్వగలరు. మొదట స్వయమునే న్యూగా చేసుకోనప్పుడు న్యూ వరల్డ్ మేకర్లుగా ఎలా అవ్వగలరు? మొదట అయితే స్వయమును తయారుచేసుకోవాలి కదా! పురుషార్థములో తీవ్రతను తీసుకువచ్చే పద్ధతి తెలిసినప్పుడు మరి అందులో ఎందుకు నిలవడం లేదు? ఎప్పటివరకైతే మీతో మీరు ప్రతిజ్ఞను చేసుకోరో అప్పటివరకు పరిపక్వత రాజాలదు. ఎప్పటివరకైతే ఇక్కడ ఫిక్స్ అవ్వరో అప్పటివరకు అక్కడ సీట్లు ఫిక్స్ అవ్వవు. మరి ఇప్పుడు చెప్పండి, పురుషార్థములో తీవ్రతను ఎప్పుడు తీసుకువస్తారు? (ఇప్పటినుండే) ‘ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు’ అన్న స్లోగన్‌ను మ్యూజియంలో మరియు ప్రదర్శినీలలో ఏదైతే అందరికీ వినిస్తుంటారో దానిని మీకొరకు కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి చేస్తాములే అని ఆలోచించవద్దు. ఇప్పుడు తయారై చూపించాలి. ఎంతగా ప్రతిజ్ఞను చేస్తారో అంతగా పరిపక్వత మరియు ధైర్యము వస్తాయి, సహయోగము కూడా లభిస్తుంది.
మీరు పాతవారు, కావున మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని అర్థం చేయిస్తున్నాము. ఎదురుగా ఎవరిని ఉంచటం జరుగుతుంది? ఎవరైతే స్నేహీలుగా ఉంటారో వారినే ముందు ఉంచుతాము. స్నేహీలకు చెప్పటానికి ఎటువంటి సంకోచము కలుగదు. ప్రతి ఒక్కరూ అటువంటి స్నేహీలు. బాబా పెద్దగా ఎందుకు మాట్లాడరు అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ బహుకాలపు సంస్కారము వలన అవ్యక్త రూపము నుండి వ్యక్తములోకి వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడటము మంచిగా అనిపించదు. పిల్లలైన మీరు కూడా నెమ్మది నెమ్మదిగా శబ్దము నుండి దూరమై సంకేతాల ద్వారా కార్య వ్యవహారమును నడిపించాలి, ఈ అభ్యాసమును చెయ్యాలి. అర్థమైందా? బాప్‌దాదా బుద్ధి డ్రిల్లును చేయించటానికి వస్తారు, దీనివలన పరిశీలించే మరియు దూరదేశులుగా అయ్యే అర్హత ఇమర్జ్ రూపములో వస్తుంది ఎందుకంటే ముందు ముందు ఎటువంటి సేవ ఉంటుందంటే, అందులో దూరదృష్టిగల బుద్ధి మరియు నిర్ణయ శక్తి చాలా అవసరముంటుంది, కావున ఈ డ్రిల్లును చేయిస్తున్నాము. అప్పుడిక పవర్‌ఫుల్‌గా అయిపోతారు. డ్రిల్ చేస్తే శరీరము కూడా శక్తివంతంగా అవుతుంది. ఈ బుద్ధి డ్రిల్ ద్వారా బుద్ధి శక్తిశాలిగా అయిపోతుంది. ఎంతెంతగా మీ సీటును ఫిక్స్ చేసుకుంటారో, సమయాన్ని ఫిక్స్ చేసుకుంటారో అప్పుడు మీ ప్రవృత్తి కార్యమును కూడా ఫిక్స్ చేసుకోగలరు. రెండు లాభాలూ ఉంటాయి. బుద్ధి ఎంతగా ఫిక్స్ అవుతుందో ప్రోగ్రాములు కూడా అన్నీ ఫిక్స్‌గా ఉంటాయి. ప్రోగ్రాము ఫిక్స్ అయినట్లయితే ప్రోగ్రెస్ (అభివృద్ధి) కూడా ఫిక్స్ అవుతుంది. ప్రోగ్రెస్ కదిలిందంటే ప్రోగ్రాము కూడా కదులుతుంది. ఇప్పుడు ఫిక్స్ చెయ్యటమును నేర్చుకోండి. ఇప్పుడు సంపూర్ణంగా అయ్యి ఇతరులను కూడా సంపూర్ణంగా తయారుచేయటము మిగిలి ఉంది. ఎవరైతే తయారవుతారో వారు మళ్ళీ దానికి ఋజువును కూడా ఇస్తారు. ఇప్పుడు తయారు చేయించే ప్రమాణమును ఇవ్వాలి. కావుననే ఈ కార్యము కొరకు వ్యక్త దేశములో ఉండాలి. అచ్ఛా!
ఓంశాంతి