Search for a command to run...
15 Dec 2005
నూతన సంవత్సరంలో స్నేహము మరియు సహయోగము యొక్క రూపురేఖలను స్టేజ్‌పైకి తీసుకురండి, ప్రతి ఒక్కరికీ గుణాలు మరియు శక్తుల బహుమానాన్ని ఇవ్వండి
15 December 2005 · తెలుగు
ఈరోజు పరమాత్మ తండ్రి తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది విశ్వములో కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ నిస్వార్థ ప్రేమ, ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రియే నిరాకారుడు, నిరహంకారి. మనుష్య ఆత్మలు శరీరధారులు అయిన కారణముగా ఏదో ఒక స్వార్థములోకి వచ్చేస్తారు. పరమాత్మ తండ్రియే తమ పిల్లలకు ఇటువంటి నిస్వార్థమైన ప్రేమను ఇస్తారు. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారము. అది బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము వంటిది. ఒకవేళ బ్రాహ్మణ జీవితములో పరమాత్మ ప్రేమ యొక్క అనుభవము తక్కువగా ఉన్నట్లయితే, మరి ప్రేమ లేకపోతే జీవితము రమణీకముగా ఉండదు, నిస్సారమైన జీవితమైపోతుంది. పరమాత్మ ప్రేమయే జీవితములో సదా తోడును కూడా అందిస్తుంది మరియు ఆ ప్రేమయే సహచరునిగా అయ్యి సదా సహయోగిగా ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, తోడు ఉంటుందో, అక్కడ అన్నీ చాలా సహజముగా మరియు సరళముగా అవుతాయి, కష్టము అనుభవమవ్వదు. అటువంటి అనుభవము ఉంది కదా! పరమాత్మ ప్రియులు ఏ వ్యక్తి లేక ఏ సాధనాల ఆకర్షణలోకి రాలేరు, ఎందుకంటే పరమాత్మ ఆకర్షణ, పరమాత్మ ప్రేమ ఎలాంటి అనుభవము చేయిస్తుందంటే, వారు సదా ప్రేమ కారణముగా లవలీనముగా ఉంటారు, దీనినే పరమాత్మలో లీనమైపోవటము అని మనుష్యులు భావిస్తారు. అలా పరమాత్మలో లీనమవ్వరు, కానీ పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతారు.
బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తారు - పరమాత్మ ప్రియులుగా అయితే అందరూ అయ్యారు, కానీ ఒకరేమో లవ్లీ (ప్రియమైన) పిల్లలు, ఇంకొకరు లవలీనులైన పిల్లలు. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - అందరూ లవ్లీగా అయితే ఉన్నారు, కానీ లవలీనులుగా ఎంతవరకు ఉంటున్నారు? లవలీనులైన పిల్లల గుర్తు ఏమిటంటే - వారు సదా పరమాత్ముని ఆజ్ఞపై సహజముగా నడుస్తారు. ఆజ్ఞలో(ఫర్మాన్) కూడా ఉంటారు మరియు దేహభానము నుండి బలిహారమై(కుర్బాన్) కూడా ఉంటారు ఎందుకంటే ప్రేమలో బలిహారమవ్వటమనేది కష్టము కాదు. అన్నింటికన్నా మొదటి ఆజ్ఞ - యోగి భవ, పవిత్ర భవ. బాబాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణముగా పిల్లలు కష్టపడటాన్ని బాబా చూడలేరు, ఎందుకంటే బాబాకు తెలుసు - పిల్లలు 63 జన్మలు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఈ అలౌకిక జన్మ కష్టపడటము నుండి ముక్తులై అతీంద్రియ సుఖము యొక్క ఆనందాన్ని అనుభవించే జన్మ. మరి ఆనందాన్ని అనుభవిస్తున్నారా లేక కష్టపడాల్సి వస్తుందా? ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞపై నడవటము కష్టమనిపించదు. ఒకవేళ కష్టపడాల్సి వస్తుందంటే ప్రేమ యొక్క శాతము తక్కువగా ఉందని అర్థము. ఎక్కడో అక్కడ ప్రేమలో ఏదో ఒక లీకేజ్ ఉంది. రెండు విషయాలలో లీకేజ్ శ్రమ చేయిస్తుంది - ఒకటేమో పాత ప్రపంచపు ఆకర్షణ, ప్రపంచము అనగా సంబంధాలు, పదార్థాలు అన్నీ వస్తాయి. మరియు రెండవది - పాత సంస్కారాల ఆకర్షణ. ఈ పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలు తమవైపుకు ఆకర్షిస్తాయి కనుక పరమాత్మ ప్రేమలో శాతము వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకోండి - ఈ రెండు లీకేజీల నుండి ముక్తులుగా ఉన్నారా? గుర్తు చేసుకోండి - ఆత్మలైన మీ అనాది సంస్కారాలు మరియు ఆది సంస్కారాలు ఏమిటి మరియు ఇప్పుడు అంతిమములోని బ్రాహ్మణ జీవితపు సంస్కారాలు ఏమిటి? అనాదిలో కూడా, ఆదిలో కూడా మరియు అంతిమములో కూడా శ్రేష్ఠ సంస్కారాలు ఉన్నాయి. ఈ పాత సంస్కారాలు మధ్యకాలములోవి, ఇవి అనాదిలోవి కావు, ఆదిలోవి కావు, అంతిమములోవి కావు. కానీ అందరి లక్ష్యము ఏమిటి? పిల్లలు ఎవరిని అడిగినా వారు ఒకే సమాధానమిస్తారు - బాబా సమానముగా అవ్వడమే లక్ష్యము. ఇదే కదా! ఇదే అయితే చేతులెత్తండి. ఇదే లక్ష్యమా, పక్కానా? లేక మధ్యమధ్యలో మారిపోతుందా?
బాబా మరియు దాదా, వీరిరువురిలో ఉన్న సమాన సంస్కారాలు ఏవి అని బాబా పిల్లలను అడుగుతున్నారు. బాబా సదా ప్రతి ఆత్మ పట్ల ఉదారచిత్తులుగా ఉన్నారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహముగా ఉంటూ, గౌరవ స్వరూపములో సహయోగిగా ఉన్నారు. ఇలానే మీరు కూడా స్వయాన్ని ప్రతి ఆత్మ పట్ల సహయోగిగా అనుభవము చేస్తున్నారా? సహయోగము ఇస్తే సహయోగిగా అవుతాము అని కాదు, స్నేహము ఇస్తే స్నేహీగా అవుతాము అని కాదు. ఏ విధంగా బ్రహ్మా బాబా పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల సహయోగిగా అయ్యారో, స్నేహీగా అయ్యారో, అదే విధంగా సర్వులకు సదా స్నేహీగా మరియు సహయోగీగా ఉండటము, దీనినే సమానముగా అవ్వటము అని అంటాము. ఒకవేళ పిల్లలు ఎవరికైనా సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో కష్టమనిపిస్తుందంటే దానికి కారణమేమిటి? బ్రహ్మా బాబా తనపై అటెన్షన్ పెట్టుకున్నారు, కానీ కష్టపడలేదు. సంస్కార పరివర్తనలో కష్టపడటానికి కల కారణము ఏమిటంటే - లవ్లీగా అయ్యారు కానీ లవలీనులుగా అవ్వలేదు.
బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ లవ్లీ పిల్లలుగా భావిస్తారు. వారికి తెలుసు కూడా, ప్రతి ఒక్కరి జన్మపత్రిక తెలుసు, అయినా కూడా ఏమంటారు? లవ్లీ (ప్రియమైనవారు) గా ఉన్నారు అని అంటారు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఒకే చదువును, ఒకే పాలనను, ఒకే వరదానాన్ని సదా ఇస్తారు. వీరు చివరి నంబర్లోని వారు అని తెలిసినా కూడా బాప్‌దాదా ఏ బిడ్డలోని అవగుణాన్ని, బలహీనతను సంకల్పములో కూడా పెట్టుకోరు. ప్రియమైన బిడ్డ, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన బిడ్డ, మధురాతి మధురమైన బిడ్డ... అన్న ఈ దృష్టి, వృత్తితోనే చూస్తారు ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు, ఏమనంటే - ఇటువంటి వృత్తి మరియు శ్రేష్ఠ దృష్టి ద్వారానే బలహీనముగా ఉన్నవారు మహావీరులుగా అయిపోతారు. అలాగే మీ శ్రేష్ఠ వృత్తి మరియు శుభ భావన, శుభ కామనల ద్వారా ఎవరినైనా పరివర్తన చెయ్యగలరు. ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తాము అని మీరు ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆత్మల పరివర్తనను చెయ్యలేరా! ప్రకృతిజీతులుగా అవ్వగలిగినప్పుడు ఆత్మ అనే శ్రేష్ఠ భావన ద్వారా, కళ్యాణ కామన ద్వారా ఆత్మను పరివర్తన చెయ్యలేరా!
ఇప్పుడు క్రొత్త సంవత్సరము ప్రారంభమవ్వబోతుంది కదా - కనుక క్రొత్త సంవత్సరములో అనంతమైన పూర్తి బ్రాహ్మణ పరివారంలో, ఒకరి పట్ల మరొకరు తమ శుభ భావన, శ్రేష్ఠ కామన ద్వారా ప్రతి ఒక్కరూ ఇతరులను పరివర్తన చెయ్యటంలో సహయోగిగా అవ్వండి. ఎదుటివారు బలహీనమైనవారైనా, వారి సంస్కారములో ఫలానా బలహీనత ఉంది అని తెలిసినా కానీ మీరు స్నేహము మరియు సహయోగ శక్తి ద్వారా సహయోగులుగా అవ్వండి. ఒకరితో ఒకరు సహయోగము అనే చేతిని కలపండి. ఈ సహయోగం యొక్క చేతులు కలపటమనే దృశ్యము ఎలా తయారవుతుందంటే, చేయి, చేయి కలిపి స్నేహ మిలనం చేయడం, సహయోగం లభించటం, తద్వారా మాల తయారవుతుంది. కేవలం శిక్షణను ఇవ్వకండి, స్నేహముతో నిండిన సహయోగాన్ని ఇవ్వండి. అతీతముగా అవ్వకండి, పక్కకు వెళ్ళిపోకండి, ఆధారముగా అవ్వండి ఎందుకంటే మీ స్మృతిచిహ్నము విజయమాల. ప్రతి ఒక్క మణి మరొక మణితో సహచరునిగా, సహయోగిగా ఉంది, అందుకే మాల చిత్రము తయారైంది.
అందరూ బాప్‌దాదాను అడుగుతారు - క్రొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి? సందేశము ఇచ్చే కార్యమునైతే ఎంతగానో చేసారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు సందేశ వాహకుల సహయోగము మరియు స్నేహము యొక్క రూపురేఖలను స్టేజ్‌పైకి తీసుకురండి. మహాదానులుగా అవ్వండి, మీ గుణాలతో సహయోగిగా అవ్వండి, సహయోగులుగా తయారుచెయ్యండి. ఇలా మీ గుణాలతో, వాస్తవానికి అవి పరమాత్ముని గుణాలే, కానీ ఏ గుణాలనైతే మీరు మీలో అలవరచుకున్నారో, ఆ గుణాల శక్తితో వారిలోని బలహీనతను దూరం చెయ్యండి. ఇది చెయ్యగలరా? చెయ్యగలరా లేక కష్టమా? టీచర్లు చెప్పండి, చెయ్యగలరా? చెయ్యగలరా లేక చెయ్యాల్సిందేనా? చెయ్యాల్సిందే. ఎవరూ బలహీనముగా ఉండకూడదు, ఎందుకంటే కోట్లలో కొద్దిమందే కదా! చివరి పూస అయినా కానీ, వాస్తవానికి వారు కోట్లలో కొద్దిమంది అయినవారే. మీకు ఉన్న టైటిల్ - మాస్టర్ సర్వశక్తిమాన్. మరి సర్వశక్తిమంతుల కర్తవ్యము ఏమిటి? శక్తిని ఇచ్చి-పుచ్చుకోవటము. బాబా ద్వారా లభించిన గుణాలను పరస్పరంలో ఇచ్చి-పుచ్చుకోండి. ఈ సహయోగమనే కానుకనే ఒకరికొకరు ఇచ్చుకోండి. క్రొత్త సంవత్సరములో ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు కదా! అలా ఈ సంవత్సరములో ఇతరులకు గుణాలనే కానుకను ఇవ్వండి. ఒకవేళ కళ్యాణ భావనను ఉంచుకున్నట్లయితే, భాషణ చేసి వాణి ద్వారా సందేశాన్ని ఇస్తారు కదా, అలా మీ కళ్యాణ భావన ద్వారా, కళ్యాణ వృత్తి ద్వారా, కళ్యాణ వాయుమండలము ద్వారా ఈ గుణాల కానుకను ఇవ్వండి, శక్తుల కానుకను ఇవ్వండి. బలహీనమైనవారికి సహయోగాన్ని ఇవ్వటము, ఇది అవసరమైన సమయములో కానుకను ఇవ్వటము లాంటిది. పడిపోయినవారిని ఇంకా పడెయ్యకండి, లేపండి, పైకి లేపండి. వీరు ఇలా, వారు అలా... ఇలా అనకండి. వీరు ప్రభువు ప్రేమకు పాత్రులైనవారు, కోట్లలో కొద్దిమంది అయినవారు, విశేష ఆత్మలు, విజయులుగా అయ్యే ఆత్మలు అన్న ఈ దృష్టిని పెట్టుకోండి. ఇప్పుడు వృత్తి, దృష్టి, వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. ఏదైనా నవీనత చెయ్యాలి కదా! బలహీనతను చూస్తూ కూడా చూడకండి, ఉల్లాసాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. ఇటువంటి బ్రాహ్మణ సంగఠనను తయారుచేసినట్లయితే బాప్‌దాదా ఆ విజయానికి చప్పట్లు కొడతారు. మీరు కూడా పదే-పదే చప్పట్లు కొడతారు కదా, బాప్‌దాదా కూడా శుభాకాంక్షలు, అభినందనలు మరియు గ్రీటింగ్స్... అనే చప్పట్లను కొడతారు. మీరు కూడా చప్పట్లు కొడతారు కదా. ఇప్పుడు చప్పట్లు కొట్టారు, బాగుంది, కానీ విశ్వమంతటి ముందు చప్పట్లు మ్రోగాలి. మా ఇష్టదేవతలు వచ్చారు, మా పూజ్యులు వచ్చారు అని అందరి నోటి నుండి ఈ శబ్దము వెలువడాలి. లక్ష్యము పక్కాగా ఉంది కదా! పక్కాగా ఉందా లక్ష్యము? చెయ్యాల్సిందే కదా? లేక చూస్తాములే, ప్లాన్ తయారు చేస్తాములే అంటారా! చెయ్యాల్సిందే, ప్లాన్ ఆలోచించడము ఏమిటి, చెయ్యాల్సిందే. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు వారి ఎదురుచూపులను సమాప్తము చెయ్యండి. ప్రత్యక్షమయ్యేందుకు ఏర్పాట్లు చెయ్యండి. చూడండి, ప్రకృతి కూడా ఇప్పుడు ఎంతగా విసిగిపోతూ ఉంది, కనుక ప్రకృతిని కూడా శాంతపరచండి. మీరు ప్రత్యక్షమైతే ఇక విశ్వశాంతి స్వతహాగానే జరుగుతుంది. అచ్ఛా!
ఈసారి కూడా క్రొత్త-క్రొత్త పిల్లలు చాలా మంది వచ్చారు. బాగుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, మూలమూలల నుండి దాగి ఉన్న కల్పక్రితపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు చేరుకుంటున్నారు. ఇప్పుడు చివర వచ్చినవారు కూడా ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి – సమయం తక్కువగా ఉంది, కావున తీవ్ర పురుషార్థము ద్వారా ముందు నంబర్‌ను తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా టూలేట్ బోర్డ్ రాలేదు, లేట్ బోర్డ్ పెట్టడం జరిగింది. కావున ఎంత పురుషార్థం చేయాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా. అందరూ, ఎవరైతే చేతులెత్తారో, తీవ్ర పురుషార్థం చేయాలి కదా! ఇప్పుడు ఢీలా పురుషార్థం చేసే సమయం అయిపోయింది, నడిచే సమయం అయిపోయింది, ఇప్పుడు ఇది ఎగిరే సమయము. అందుకే డబల్ లైట్‌గా అయ్యి ఎగరండి. ఏది కావాలనుకుంటే అది అవ్వవచ్చు. బాబా, మమ్మల్ని చివరలో పిలిపించారు అని ఫిర్యాదు చేయకండి. ఇప్పుడు కూడా డబల్ లైట్‌గా అయ్యి ఎగరవచ్చు. అంతటి ఉల్లాసము ఉందా? ఎవరైతే చేతులెత్తారో, ఇంత ఉల్లాసము ఉందా? ఎవరికైతే ఇంతటి ఉల్లాసము ఉందో, ముందుకు వెళ్ళి చూపిస్తాము అనేవారు చేతులెత్తండి. బాప్‌దాదా అయితే ఇన్‌అడ్వాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
గుజరాత్ వారిది సేవ, గుజరాత్ వారే మిలనం చేసుకోవడానికి వచ్చారు:- ఎవరైతే గుజరాత్ వారున్నారో, మిలనం కోసం వచ్చినవారు కావచ్చు, సేవకు వచ్చినవారు కావచ్చు, వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు, చాలా మంచిది. మంచి ఛాన్స్‌ను తీసుకున్నారు. గుజరాత్ గురించి బాప్‌దాదా ఏమంటారంటే, సింధీలో ఒక సామెత ఉంది, జో చుల్ పర్ సో దిల్ పర్ (పొయ్యి దగ్గర ఉండేవారు మనసులో ఉంటారు) అందరికంటే దగ్గరగా ఉండేది గుజరాత్. దగ్గరగా ఉండేవారు, వారిని షడ్పంథ్ (సమీపంగా) అంటాము. ఇలా పిలవగానే ఇలా చేరుకుంటారు. మరి గుజరాత్ వారు ఇలా ఎవరెడీగా ఉన్నారు కదా – ఎప్పుడు పిలిచినాగానీ వచ్చేస్తారు కదా? అంతేనా? పరివారం వారు ఏమి చేస్తారు అని కూడా చూడరు, వచ్చేస్తారు. ఎవరెడీ. బాగుంది, గుజరాత్ సాకార బ్రహ్మా యొక్క ప్రేరణతో స్థాపన అయింది. గుజరాత్, గుజరాత్‌కు ఆహ్వానించలేదు, బ్రహ్మా బాబా గుజరాత్‌ను తెరిచారు. అంటే గుజరాత్‌పై బ్రహ్మా బాబా యొక్క విశేషమైన దృష్టి ఉంది. గుజరాత్ పురుషార్థం కూడా చేసింది, మంచి సెంటర్లు కూడా తెరుచుకున్నాయి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి? (300 సేవాకేంద్రాలు, ఉపసేవాకేంద్రాలు మరియు 3 వేల గీతా పాఠశాలలు ఉన్నాయి) అచ్ఛా, అన్నిటికన్నా ఎక్కువ సెంటర్లు ఏ జోన్ వారికి ఉన్నాయి? (ముంబయి-మహారాష్ట్రకు) అచ్ఛా – మహారాష్ట్ర వారు వచ్చారా? (ఈరోజు రాలేదు) గుజరాత్ వారు సేవ అయితే బాగా చేస్తున్నారు, గుజరాత్ విస్తారం కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏమి చేయాలి? విస్తారం అయితే ఉంది, విస్తారమైతే మంచిగా చేసారు. ఇప్పుడు గుజరాత్ వారు నంబర్‌వన్ వారసులను తయారు చేయండి. కనీసం ఏవైతే పెద్ద సేవాకేంద్రాలు ఉన్నాయో, పాత వారసులు ఎవరైతే ఉన్నారో, వారైతే ఉన్నారు కానీ క్రొత్త వారసులను తయారు చేయండి. కనీసం ఒక్కొక్కరిని తయారు చేయండి, ఎందుకంటే ఎవరైతే వారస క్వాలిటీ వారు ఉంటారో వారే మాలలో పూసగా అవుతారు. మరి మాలనైతే తయారు చేయాలి కదా! 16108 మాల కూడా తయారై ఉంది. ఇప్పుడు ఒకవేళ 108 మాలను తయారు చేయండి అని బాప్‌దాదా అంటే, తయారు చేయగలరా? దాదీలు చెప్పండి, 108 మాల తయారవ్వగలదా? (అవ్వగలదు అని దాదీజీ చెప్పారు) తయారుగా ఉన్నారా? 108 మాల తయారయిందా? (హా బాబా, తయారయింది) అచ్ఛా, వ్రాసి చూపించండి. తయారుగా ఉంటే చాలా మంచిది, అభినందనలు. అచ్ఛా, 16108 మాల సగమన్నా తయారయిందా? (సగం ఏమిటి, అంతకన్నా ఎక్కువే తయారయింది) మంచిదే కదా. చూడండి, గుప్త రూపంలో తయారయింది మరియు మీ దాదీ చూసేసారు. మంచిది. నా పేరు మాలలో ఉందా అని ఇప్పుడు అందరూ మిమ్మల్ని అడుగుతారు. మంచిది. ఇటువంటి శుభ భావనలు, శుభ ఆశలే తయారు చేసేస్తాయి. ఇప్పుడు అందరూ విన్నారు కదా, నేను ఆ మాలలో ఎవరెడీగా ఉన్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అచ్ఛా. ఇప్పుడు ఏమి చేయాలి?
క్యాడ్ గ్రూప్ (హార్ట్ పేషెంట్ల గ్రూప్) వచ్చింది:- మంచిది, ధ్వనిని వ్యాప్తి చేయడానికి ఈ సాధనము కూడా చాలా బాగుంది ఎందుకంటే ప్రాక్టికల్ రుజువును చూసినప్పుడు, ఖర్చు లేకుండా మెడిటేషన్ ద్వారా నయమవ్వడం, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా దీనిని వృద్ధి చేస్తూ ఉండండి. వృద్ధి చేస్తున్నారని విన్నాము మరియు సఫలత కూడా లభిస్తుంది, ఇంకా కూడా లభిస్తూ ఉంటుంది. ఇకపోతే బాప్‌దాదా ఈ కార్యం కోసం నిమిత్తమైన వారికి అభినందనలు ఇస్తున్నారు. అఫీషియల్‌గా గవర్నమెంట్ వద్దకు రిజల్ట్ చేరుకుంటుంది. మరింత వ్యాప్తి చేస్తూ ఉంటే మెడిటేషన్ యొక్క మహత్వం పెరుగుతూ ఉంటుంది. బాప్‌దాదాకు ఈ విధి నచ్చింది. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులైతే సదా డబల్ పురుషార్థం చేస్తుండవచ్చు కదా! పాత ప్రపంచం మరియు పాత సంస్కారాల నామరూపాలు ఉండకూడదు, ఇదే డబల్ పురుషార్థము. మరి ఇటువంటి డబల్ పురుషార్థం జరుగుతుందా? జరుగుతుందా? తల అయితే ఊపండి. ఈ డబల్ పురుషార్థంపై ఎవరి అటెన్షన్ అయితే ఉందో వారు చేతులెత్తండి. అచ్ఛా, అయితే ప్రత్యక్షత విదేశం నుండి జరుగుతుంది. డబల్ పురుషార్థం చేసేవారి విజయము ప్రత్యక్షము అవుతుంది. డబల్ విదేశీయులు సేవ మరియు పురుషార్థం రెండింటిపై అటెన్షన్ ఇస్తూ ముందుకు వెళ్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ముందుకు వెళ్తున్నారు, ఇందుకు అభినందనలు కానీ ఇక మీదట ఈ అటెన్షన్‌పై మరింత తీవ్రతను తీసుకురండి. ఏ సెంటరుకు వెళ్ళినా అక్కడ మధుబన్ వాయుమండలం అనుభవం అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్క స్థానము ఇటువంటి వాయుమండలాన్ని అనుభవం చేయించాలి. ఎలా అయితే మధుబన్కు ఎవరు వచ్చినా, ఏదో ఒక విషయానికి ప్రభావితమవుతారో అలాగే సెంటర్లకు ఏ ఆత్మ వచ్చినా, పదే పదే రావాలి, ముందుకు వెళ్తూ ఉండాలి అనిపించేలా ఏదో ఒక విషయంలో ప్రభావితమవ్వాలి. అటెన్షన్ ఉంది, పురుషార్థం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది, ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఎలా ప్రభావితమవ్వాలంటే ఎవ్వరైనా రాకుండా ఉండలేరు, అవ్వకుండా ఉండలేరు. బాగుంది, ప్రతి టర్న్‌లో విదేశీయులు వస్తున్నారు, వీరి వలన కూడా మధుబన్ చాలా సుందరంగా అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ అవుతుంది కదా! విజయులు మరియు విజయి తిలకము సదా మీ మస్తకంపై ప్రత్యక్షంగా కనిపించాలి, ఈ విజయ తిలకాన్ని మరికాస్త స్పష్టం చేయండి. ఎవరు చూసినా విజయ తిలకము మెరుస్తూ కనిపించాలి. ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? అనేకసార్లు అయ్యారు, ఇప్పుడు కూడా అయ్యారు, తర్వాత కూడా అవుతూ ఉంటారు. మరి రెండు విషయాలలో విజయి భవ యొక్క వరదానము నడవడిక మరియు ముఖములో కనిపించాలి. నిశ్చయము మరియు నషా అయితే ఉండనే ఉన్నాయి! మేము కాకపోతే ఇంకెవరు విజయులుగా అవుతారు, ఈ నషా అయితే ఉంది కదా! నిశ్చయము కూడా ఉంది, నషా కూడా ఉంది. ఇప్పుడు ఒకరికొకరు సహయోగిగా అయ్యి విజయ పతాకాన్ని విశ్వంలో ఎగురవేయండి. ఎందుకంటే ఏది చేయాలనుకుంటారో అది పూర్తిగా చేస్తారు, సగం సగం చేయరు, ఇది డబల్ విదేశీయుల విశేషత. మరి ఇందులో సంపన్నంగా అవ్వవలసిందే. బాగుంది. పక్కా కదా! కచ్చా అయితే కాదు కదా! అచ్ఛా.
ఈ రోజుల్లో విశ్వములో రెండు విషయాలు విశేషముగా జరుగుతున్నాయి – ఒకటి, ఎక్సర్సైజ్ (వ్యాయామము) మరియు రెండు, భోజనముపై అటెన్షన్ పెట్టడము. మరి మీరు కూడా ఈ రెండింటినీ చేస్తున్నారా? మీ ఎక్సర్సైజ్ ఏమిటి? శారీరక ఎక్సర్సైజ్ అయితే అందరూ చేస్తారు కానీ మనసు యొక్క ఎక్సర్సైజ్ ఏమిటంటే - ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలు మరియు ఫరిశ్తాల నుండి దేవతలు. ఈ మనసా డ్రిల్ యొక్క అభ్యాసాన్ని సదా చేస్తూ ఉండండి మరియు శుద్ధ భోజనము అంటే మనసులోని శుద్ధ సంకల్పాలు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్ సంకల్పాలు నడిచినట్లయితే అవి మనసు యొక్క అశుద్ధ భోజనము. కనుక మనసులో సదా శుద్ధ సంకల్పాలు ఉండాలి. మరి ఈ రెండూ చెయ్యటము వస్తుంది కదా! ఎంత సమయము కావాలంటే అంత సమయము శుద్ధ సంకల్పాల స్వరూపముగా అయిపోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన విశేష ఆత్మలకు, సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యే బాబాకు స్నేహీ మరియు సహయోగీ ఆత్మలకు, సదా విజయులు మరియు విజయ పతాకాన్ని విశ్వములో వ్యాపింపజేయాలి అనే ఈ లక్ష్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే విజయి పిల్లలకు, సదా ఈ పాత ప్రపంచము మరియు సంస్కారాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే బాబా సమానమైన పిల్లలకు మనోభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీజీతో) మంచి శుభవార్తను వినిపించారు. (మోహిని అక్కయ్యతో) మంచిది, ముక్తులై వచ్చారు. సహజంగా అయిపోయింది కదా! బ్రాహ్మణులందరి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. శూలం నుండి ముల్లుగా చేసుకుని వచ్చారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, మీ మనసా శక్తి యొక్క ప్రమాణము బాగుంది.
దాదీజీతో:- చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. మిమ్మల్ని చూసి అందరికీ ఫరిశ్తా జీవితము గుర్తుకొస్తుంది. అతీతమైనవారు మరియు ప్రియమైనవారు.
గుజరాత్ యొక్క ముఖ్యమైన 13 మంది అక్కయ్యలతో:- మంచి మంచి మహావీరులు. మహావీరుల పని - విజయులుగా అయ్యి విజయులుగా తయారు చెయ్యటము. అందరూ మంచి సేవను చేస్తున్నారు మరియు ఇకముందు కూడా సేవ జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. గుజరాత్లో మంచిగా వ్యాపింపజేస్తున్నారు మరియు ఇక ముందు కూడా వ్యాపింపజేస్తూ ఉంటారు. బాప్‌దాదాకు పిల్లలందరూ ఆశా దీపాలుగా అనిపిస్తున్నారు. మంచిది. సంగఠన కూడా బాగుంది. ప్రతి ఒక్కరికీ విశేషత ఉంది. అచ్ఛా! సంతోషంగా ఉండేవారు, సంతోషాన్ని పంచేవారు. (సరళ దీదీ అడుగుతున్నారు, మాలలో దాదీ ఎవరిని పెట్టారు?) మీరేమనుకుంటున్నారు? నేనైతే తప్పకుండా ఉంటాను అని అనుకుంటున్నారా? ఒకరికొకరు కొంచెం సహయోగాన్ని ఇచ్చుకోండి, ఇక ఏదైనా మిగిలి ఉంటే, అది సమాప్తమైపోతుంది. అందరూ బాబా సమానంగా అయ్యేవారే. (ఏ నవీనతను చెయ్యాలి) వినిపించాము కదా - ప్రతి ఒక్క సెంటరు కనీసం ఒక వారసుడిని తయారుచెయ్యాలి. ఈ సంవత్సరము వారిని తీసుకురండి, 21 వారసులనైతే తీసుకురండి. ఇది ప్రారంభించండి. మొదటి నంబర్‌లోకి రండి. అందరూ సరే అని అంటున్నారు. వారసుల అర్హత తెలుసు కదా. మీరు అందరినీ బాబాకు చెందినవారిగానే తయారు చేస్తారు కదా, మీ వారిగా అయితే తయారు చెయ్యరు కదా. అచ్ఛా.
ఓంశాంతి