Search for a command to run...
18 Jan 2007
ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా కండి
18 January 2007 · తెలుగు
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్‌దాదా నలు వైపుల ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. రెండు రకాల పిల్లలను చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. ఒకరు లవ్లీన్ పిల్లలు, మరొకరు లవ్లీ పిల్లలు. ఇద్దరి స్నేహపు అలలు అమృతవేళ కంటే ముందు నుండే బాబా వద్దకు చేరుకుంటున్నాయి. పిల్లల ప్రతి ఒక్కరి హృదయాల నుండి స్వతహాగా ‘‘నా బాబా’’ అనే గీతము వినిపిస్తుంది. బాప్‌దాదా హృదయం నుండి కూడా ‘‘నా పిల్లలు, గారాల పిల్లలు, బాప్‌దాదాకు శిరోకిరీటాలు’’ అని గీతము వినిపిస్తుంది.
ఈరోజు స్మృతి దివసము అయిన కారణంగా అందరి మనసులలో స్నేహపు అలలు ఎక్కువగా ఉన్నాయి. అనేక పిల్లల స్నేహపు ముత్యాల మాలలు బాప్‌దాదా మెడలోకి వస్తున్నాయి. బాబా కూడా తమ స్నేహమనే భుజాల మాలను పిల్లలకు వేస్తున్నారు. అనంతమైన బాప్‌దాదా యొక్క అనంతమైన భుజాలలో ఇమిడిపోయారు. ఈరోజు అందరూ విశేషంగా స్నేహము అనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. దూర దూరాల నుండి మనసు అనే విమానంలో అవ్యక్త రూపంలో, ఫరిశ్తా రూపంలో చేరుకున్నారు. ఈనాటి స్మృతి దివసము సో సమర్థ దివసానికి బాప్‌దాదా పిల్లలందరికీ కోటానురెట్లు స్మృతిని తెలుపుతున్నారు. ఈ దివసము ఎన్ని స్మృతులను కలిగిస్తుంది! ఈ ప్రతి స్మృతి ఒక్క క్షణంలో సమర్థవంతంగా చేస్తుంది. స్మృతుల లిస్టు క్షణంలో స్మృతికి వస్తుంది కదా! స్మృతి ఎదురుగా వచ్చిన వెంటనే సమర్థత యొక్క నషా వస్తుంది. మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా! బాబా పిల్లలుగా అయినప్పుడు బాబా మీకు ఏమి స్మృతి తెప్పించారు? మీరు కల్ప క్రితపు భాగ్యశాలి ఆత్మలు. ఈ మొదటి స్మృతితో ఎటువంటి పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి? ఆత్మ అభిమానిగా అయినందువలన పరమాత్మ తండ్రి యొక్క స్నేహపు నషా కలిగింది. ఎందుకు నషా కలిగింది? స్నేహం కారణంగా మనస్ఫూర్తిగా వచ్చిన మాట ఏమిటి? ‘‘నా మధురమైన తండ్రి’’. ఈ ఒక్క సువర్ణ శబ్దం వచ్చిన వెంటనే ఏ నషా కలిగింది? నా బాబా అనగానే, బాబాను తెలుసుకోగానే, ఒప్పుకోగానే పరమాత్ముని సర్వ ప్రాప్తులు మీ ప్రాప్తులుగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా! నా బాబా అన్న వెంటనే ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి! ఎక్కడ ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి చెయ్యాల్సిన అవసరం ఉండదు. స్వతహాగా, సహజంగానే స్మృతి ఉంటుంది. ఎందుకంటే బాబా ఖజానా నా ఖజానాగా అయిపోయింది. నావి అనుకున్నవాటిని స్మృతి చెయ్యరు. స్వతహాగానే స్మృతిలో ఉంటాయి. నాది అనుకున్నదానిని మర్చిపోవడం కష్టమవుతుంది, స్మృతి చెయ్యడం కష్టమనిపించదు. ఎలా అయితే నా శరీరం అన్నప్పుడు దానిని మర్చిపోతారా? మర్చిపోవడానికి కష్టపడాలి, ఎందుకు? నాది కదా! కనుక ఎక్కడ నాది అన్న భావన ఉంటుందో అక్కడ సహజంగానే స్మృతి ఉంటుంది. మరి స్మృతి సమర్థవంతంగా తయారు చేసింది. ఒకే మాట - నా బాబా. భాగ్య విధాతను, తరగని ఖజానాల దాతను నావాడిగా చేసుకున్నారు. అంతటి అద్భుతాన్ని చేసే పిల్లలు మీరు! కల్పంలో కేవలం ఒక్కసారి మాత్రమే లభించే పరమాత్మ పాలనకు అధికారులుగా అయ్యారు మీరు, ఆత్మల మరియు దేవ ఆత్మల పాలన అయితే లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మలోనే లభిస్తుంది.
మరి ఈనాటి స్మృతి సో సమర్థ దివసము నాడు పరమాత్మ పాలన యొక్క నషా మరియు సంతోషము సహజంగానే స్మృతిలో ఉన్నాయి కదా! ఎందుకంటే నేటి వాతావరణము సహజ స్మృతిది. మరి ఈరోజు సహజయోగులుగా ఉన్నారా లేక ఈరోజు కూడా స్మృతి కోసం యుద్ధం చెయ్యవలసి వచ్చిందా? ఈరోజు స్నేహపు రోజు అని అంటారు కదా, మరి స్నేహము కష్టాన్ని తొలగించేస్తుంది. స్నేహము అన్ని విషయాలనూ సహజంగా చేసేస్తుంది. మరి అందరూ ఈరోజు విశేషంగా సహజయోగులుగా ఉన్నారా లేక కష్టమనిపించిందా? ఎవరికైతే ఈరోజు కష్టంగా స్మృతి వచ్చిందో వారు చేతులు ఎత్తండి. ఎవ్వరికీ కష్టంగా అనిపించలేదా? అందరూ సహజయోగులుగా ఉన్నారా! అచ్ఛా, ఎవరైతే సహజయోగులుగా ఉన్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా, సహజయోగులుగా ఉన్నారా? ఈరోజు మాయకు సెలవు ఇచ్చేసారా? ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకు సెలవు ఇచ్చేసారా? అచ్ఛా, ఈరోజు అయితే సెలవు ఇచ్చారు, అందుకు అభినందనలు. ఒకవేళ ఇదే విధంగా స్నేహంలో ఇమిడి ఉంటే మాయకు ఎల్లప్పటికీ వీడ్కోలు చెప్పవచ్చు. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఈ సంవత్సరాన్ని బాప్‌దాదా న్యారా సంవత్సరము (అతీత సంవత్సరము), సర్వులకు ప్యారా (ప్రియమైన సంవత్సరము), శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరము, సమస్యల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు. మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమేనా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి, ముక్తిదాత అయిన తండ్రితో కలిసి అనేక దుఃఖీ ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి. మరి మాస్టర్ ముక్తిదాతలు స్వయం ముక్తి అయినప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకోగలరు కదా! ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులై అనేకులకు ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులు. ముక్తిని ఇప్పించడానికి బదులు బంధనంలో బంధించేది, సమస్యకు అధీనం చేసే ఒకే భాష - ఇలా కాదు, అలా. అలా కాదు, ఇలా. సమస్య వచ్చినప్పుడు ఇలా జరిగి ఉండకపోతే ఇలా జరిగేది కదా. ఇలా కాకుండా అలా జరగాలి అని అంటారు కదా. ఇది సాకులు చెప్పే ఆట.
బాప్‌దాదా అందరి ఫైళ్ళను చూసారు. ఫైల్లో ఏమి చూసారు? మెజారిటీ పిల్లల ఫైళ్ళు ప్రతిజ్ఞల కాగితాలతో నిండి ఉన్నాయి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేస్తారు. ఆలోచిస్తారు కూడా కానీ ఇప్పటి వరకు బాప్‌దాదా ఏమి చూసారంటే ఫైలు పెద్దదవుతుందే కానీ ఫైనల్ కావడం లేదు. దృఢ ప్రతిజ్ఞ కోసం ఇలా చెప్తారు - ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. మరి బాప్‌దాదా ఈరోజు అందరి ఫైళ్ళను చూసారు. ఎన్నో మంచి మంచి ప్రతిజ్ఞలు అందులో ఉన్నాయి. మనసులోనూ ప్రతిజ్ఞ చేసుకున్నారు, వ్రాసి కూడా ప్రతిజ్ఞ చేసారు. మరి ఈ సంవత్సరము ఏమి చేస్తారు? ఫైలును పెంచుతారా లేక ప్రతిజ్ఞను ఫైనల్ చేస్తారా? ఏమి చేస్తారు? మొదటి లైనులో కూర్చున్నవారు చెప్పండి. పాండవులు చెప్పండి, టీచర్లు చెప్పండి. బాప్‌దాదా వద్ద పెరుగుతూ పోతున్న ఫైళ్ళను ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైల్లో కాగితాలను జత చేస్తూ ఉంటారా? ఏమి చేస్తారు? పాండవులు చెప్పండి? ఫైనల్ చేస్తారా? వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ పరివర్తన చెంది తీరుతాము అని అనుకునేవారు చేతులెత్తండి. చూడండి, టి.వీలో అందరి ఫోటో వస్తుంది. అందరి ఫోటోను తియ్యండి. 2-4 టి.వీలు ఉన్నాయి కదా, అన్ని వైపుల నుండి ఫోటో తియ్యండి. ఈ ఫోటోను రికార్డులో ఉంచండి. బాబాకు ఒక ఫోటోను ఇవ్వండి. టి.వీ వారు ఎక్కడ ఉన్నారు? ఫైళ్ళ లాభాన్ని బాప్‌దాదాను కూడా తీసుకోనివ్వండి. అభినందనలు, అభినందనలు. మీ కొరకు కూడా మీరు చప్పట్లు కొట్టుకోండి.
చూడండి, ఒకవైపు సైన్సు, రెండవ వైపు భ్రష్టాచారము, మూడవ వైపు పాపాచారము, అన్నీ తమ తమ కార్యాలలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఎన్నో కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తూ ఉన్నాయి. మరి మీరు సృష్టికర్త యొక్క పిల్లలు. వరల్డ్ క్రియేటర్‌కు పిల్లలైన మీరు ఈ సంవత్సరం ఎంతటి నవీనతను చూపించండి అంటే మీ ప్రతిజ్ఞ దృఢంగా అయిపోవాలి. ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. ఎంతో ఖర్చు చేస్తున్నారు, ఎన్నో చోట్ల పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రతి వర్గంవారూ బాగా కృషి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏ సేవ చేసినా, ఉదాహరణకు, నోటితో సేవ చేస్తే కేవలం వాచా సేవయే కాక మనసా, వాచా మరియు స్నేహ సహయోగ రూపి కర్మ, ఒకే సమయంలో మూడు సేవలూ జరగాలి. వేరు వేరుగా జరుగకూడదు. ఒకే సేవలో ఇవన్నీ ఉండే సేవను బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు, అది జరగడం లేదు. ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు, ఈ రిజల్టు బాగా ఉంది. ముందు కన్నా మంచి రిజల్టు ఉంది. అందరూ బాగుంది, మంచిది, చాలా బాగుంది అని చెప్పి వెళ్తున్నారు. కానీ మంచిగా కావడము అంటే ప్రత్యక్షత జరగడము. ఇప్పుడు ఒకే సమయంలో మనసా వాచా కర్మణలో స్నేహి సహయోగిగా కావాలి. మీ తోటివారు బ్రాహ్మణ ఆత్మ అయినా కానీ, లేక సేవకు బయటివారు నిమిత్తమైనా కానీ సహయోగాన్ని, స్నేహాన్ని కర్మలలో అందించినప్పుడే నంబరు తీసుకుంటారు. వీరిలా చేసారు కాబట్టి నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది అనే భాషను మాట్లాడవద్దు. స్నేహపూరితంగా కాక కొన్ని మాటలు అనవలసి వచ్చింది అనకండి. ఆ మాటలేమిటో బాబా చెప్పరు. ఇలా చెయ్యాల్సిందే, అనాల్సి వస్తుంది, ఇలా చూడాల్సి వస్తుంది.... ఇలా చెయ్యకండి. ఇన్ని సంవత్సరాల నుండి చూస్తూ వచ్చారు, బాప్‌దాదా ఊరుకున్నారు. ఇలా కాక అలా చేస్తూ వచ్చారు. కానీ ఇలా ఎప్పటి వరకు? ఆత్మిక సంభాషణలో అందరూ బాబాను పరదా ఎప్పుడు తెరుచుకుంటుంది, ఎప్పటి వరకు ప్రపంచం ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. బాప్‌దాదా కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - ఈ పాత భాష, పాత నడవడిక, సోమరితనము, కఠినత్వము ఎప్పటి వరకు? బాప్‌దాదా కూడా ఎప్పటి వరకు అని ప్రశ్నిస్తున్నారు. మీరు దీనికి సమాధానము చెబితే బాప్‌దాదా కూడా వినాశనం ఎప్పుడు అవుతుందో చెప్తారు. ఎందుకంటే వినాశనం యొక్క పరదాను బాప్‌దాదా తలుచుకుంటే ఈ క్షణమే తెరువగలరు. ఈ క్షణమే. కానీ మొదట రాజ్యం చేసేవారు అయితే తయారు కావాలి కదా. కనుక ఇప్పటి నుండి అందరూ సమాప్తిని సమీపంలోకి తీసుకు వచ్చేందుకు తయారీలు చేస్తారు. ఎటువంటి బలహీన విషయంలోనూ కారణాన్ని చూపించవద్దు, నివారణ చెయ్యండి. బాప్‌దాదా రోజంతా పిల్లల ఆటను చూస్తూనే ఉంటారు, పిల్లలపై ప్రేమ ఉంది కదా, అందుకే పిల్లల ఆటను చూస్తూ ఉంటారు. బాప్‌దాదా టి.వీ చాలా పెద్దది. ఒకే సమయంలో పూర్తి విశ్వం కనిపిస్తుంది. నలు వైపుల ఉన్న పిల్లలు ఒకేసారి కనిపిస్తారు. అమెరికా అయినా, గుర్గావ్ అయినా అన్నీ కనిపిస్తాయి. బాప్‌దాదా ఎన్నో ఆటలను చూస్తూ ఉంటారు. తప్పించుకునే భాషను చాలా బాగా మాట్లాడుతారు. దీనికి ఇది కారణము, బాబా నా తప్పు లేదు, వారు ఇలా చేసారు కదా. వారు చేసారు సరే, మరి మీరు సమాధానము చేసారా? కారణాన్ని కారణంగానే మిగిల్చారా లేక కారణాన్ని నివారణలోకి మార్చారా? బాబా, మీ ఆశ ఏమిటి అని అందరూ అడుగుతారు కదా? ఇప్పుడు బాప్‌దాదా తమ ఆశను వినిపిస్తున్నారు. కారణము సమాప్తమైపోయి నివారణ కనిపించాలి- ఇదే బాప్‌దాదాకు ఉన్న ఒకే ఒక్క ఆశ. సమస్య సమాప్తం కావాలి, సమాధానం కలుగుతూ ఉండాలి. వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైను వారు వీలవుతుందా? తలలన్నా ఊపండి. వెనుక ఉన్నవారు, వీలవుతుందా? వీలవుతుందా? అచ్ఛా. అయితే రేపు టీ.వీ పెట్టినప్పుడు, విదేశీయులైనా, భారతవాసులైనా, చిన్న గ్రామంలోని వారైనా, పెద్ద రాష్ట్రంలోని వారైనా కానీ, ఎక్కడ కూడా కారణం కనిపించదు కదా? పక్కా? ఇందులో సరే అని అనడం లేదు. చేతులెత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్‌దాదా సంతోషపడిపోతారు. చేతులెత్తడం కూడా ఎంత అద్భుతమైన విషయము. సంతోషపెట్టడం పిల్లలకు బాగా వచ్చు. ఒక్కసారి ఆలోచించండి - కోట్లలో కొద్ది మంది, కొద్ది మందిలో కూడా అతి కొద్ది మంది అయిన మీరు నిమిత్తులయ్యారు, ఇప్పుడు ఈ పిల్లలకన్నా మరి ఎవరు చెయ్యగలరు? మీరే కదా చెయ్యవలసింది. బాప్‌దాదాకు మీపై నమ్మకం ఉంది. ముందు ముందు వచ్చే వారు మీ అవస్థను చూసే వారు కుదుట పడిపోతారు, వారికి శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. మీరు తయారు కండి, చాలు. ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకున్న వెంటనే ఏమని ప్రతిజ్ఞ చేసారు - తోడుగా ఉంటాము, బాబా సహచరునిగా ఉంటాము, తోడుగా వెళ్తాము మరియు బ్రహ్మా బాబాతో పాటు రాజ్యంలోకి వస్తాము. ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? తోడుగా ఉంటూ, తోడుగా నడుస్తున్నప్పుడు సేవలో కూడా మీరు సహచరులే కదా!
మరి ఇప్పుడు ఏమి చేస్తారు? చేతులైతే చాలా బాగా ఎత్తారు, బాప్‌దాదా సంతోషపడ్డారు కానీ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే ఈరోజు, ఈ తారీఖు, ఈ సమయాన్ని గుర్తు చేసుకోండి. మేము చేతులెత్తాము అని గుర్తు చేసుకోండి, అంతే సహాయం లభిస్తుంది. మీరు అయితే ఎలాగూ తయారు కావలసిందే. ఇప్పుడిక త్వరగా తయారు కండి. మేమే కల్ప క్రితం ఉన్నాము, ఇప్పుడూ ఉన్నాము, ప్రతి కల్పంలోనూ మేమే ఉంటాము అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇదైతే పక్కా కదా. లేక రెండు సంవత్సరాలు ఉంటాము, మూడవ సంవత్సరం ఉంటామో లేదో అని అనరు కదా. అలాగే మేమే నిమిత్తులము, మేమే కోట్లలో కొద్దిమందిమి, ఆ కొద్దిమందిలో కూడా అతి కొద్ది మందిమి అని సదా గుర్తుంచుకోండి. కోట్లలో కొద్దిమంది అయితే వస్తారు కానీ మీరు ఆ కొద్దిమందిలో కూడా అతి కొద్ది ఆత్మలు.
ఈరోజు స్నేహ దివసము. స్నేహంలో ఏదీ కష్టమనిపించదు. అందుకే బాప్‌దాదా ఈ రోజే అందరికీ స్మృతి తెప్పిస్తున్నారు. బ్రహ్మా బాబాపై పిల్లలకు ఉన్న ప్రేమ చూసి శివబాబా చాలా సంతోషిస్తారు. నలు వైపుల చూస్తే, 7 రోజుల పిల్లలైనా, 70 సంవత్సరాల వారైనా కానీ, ఈరోజు ప్రేమలో మునిగిపోతారు. బ్రహ్మా బాబాపై పిల్లలకు ఉన్న ప్రేమ చూసి శివబాబా చాలా హర్షితమవుతున్నారు.
ఈరోజు గురించి ఇంకా సమాచారాన్ని వినిపించమంటారా! ఈరోజు అడ్వాన్సు పార్టీవారు కూడా బాప్‌దాదా వద్ద ఇమర్జ్ అయ్యారు. బాబాతో కలిసి ఎప్పుడు ముక్తిధామ ద్వారాలను తెరుస్తారు అని వారు కూడా మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఈరోజు మాకు తారీఖును చెప్పండి అని అడ్వాన్సు పార్టీ వారందరూ బాప్‌దాదాను అడుగుతున్నారు. మరి ఏమి జవాబు ఇవ్వాలి? ఏ జవాబు చెప్పాలో చెప్పండి. జవాబు ఇవ్వడంలో ఎవరు తెలివైనవారు? అతి తొందర్లోనే అయిపోతుంది అని బాప్‌దాదా జవాబు చెబుతున్నారు. కానీ ఇందులో పిల్లలైన మీ సహయోగము బాబాకు కావాలి. అందరూ తోడుగా ఉంటారు కదా! తోడుగా నడిచేవారా లేక ఆగి ఆగి నడిచేవారా? తోడుగా నడిచేవారే కదా! తోడుగా నడవడం ఇష్టమే కదా? సమానంగా అయితే కావాలి కదా? తోడుగా నడవాలి అంటే సమానంగా కావలసిందే. సామెత ఏమిటి? చేతిలో చేయి వేసి కలసి నడుద్దాం. చేతిలో చేయి అంటే సమానము. మరి దాదీలు చెప్పండి, తయారీ జరుగుతుందా? దాదీలు చెప్పండి. దాదాలు (పెద్దన్నయ్యలు) చేతులెత్తండి. మిమ్మల్ని పెద్ద అన్నయ్య అని అంటారు కదా. మరి దాదీలు, దాదాలు చెప్పండి, ఏదైనా తారీఖు ఉందా? (ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు) ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు తయారుగానే ఉన్నారు కదా? జవాబు అయితే చాలా బాగా చెప్పారు. దాదీలు? పూర్తి కావలసిందే. ప్రతి ఒక్కరూ స్వయాన్ని బాధ్యులుగా భావించండి. ఇందులో చిన్న, పెద్ద అంటూ ఏమీ లేదు. 7 రోజుల పిల్లవాడు కూడా బాధ్యుడే. తోడుగా నడవాలి కదా! ఒంటరిగా ఒక్క బాబాయే వెళ్ళదలుచుకంటే వెళ్ళవచ్చు, కానీ బాబా అలా వెళ్ళలేరు. తోడుగా ఉండాలి, తోడుగా ఉంటాము అన్న ప్రతిజ్ఞను బాబా కూడా చేసారు, పిల్లలు కూడా చేసారు. ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలి కదా? మధువనంవారు కూర్చుని ఉన్నారు కదా.
మధువనంలో ఎవరైతే చార్జీ (డిపార్టుమెంటు) హెడ్ ఉన్నారో, చార్జస్ అయితే చాలా ఉన్నాయి కదా శాంతివనం, జ్ఞాన సరోవరం, పాండవ భవనము అన్ని చోట్ల ఉన్నాయి. చార్జ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారి లిస్టును బాబాకు ఇవ్వండి. వారి నుండి లెక్క తీసుకుంటాము. అలాగే ఇన్ఛార్జ్ టీచర్లందరూ సెంటరు ఇన్ఛార్జులైనా, జోన్ ఇన్ఛార్జులైనా, వారిని ఒకసారి పిలుద్దాం, లెక్క తెలుసుకందాం. ఎందుకంటే బాప్‌దాదా వద్దకు ఎంతో దుఃఖము మరియు అశాంతి యొక్క ధ్వని చేరుకుంటుంది. చింతలలో ఉన్న ధ్వని వినిపిస్తుంది. మీకు వినిపించడం లేదా? మీకు కూడా భక్తులు ఉంటారు కదా! మరి భక్తుల మొర ఇష్ట దైవాలైన మీ వద్దకు రావడం లేదా? టీచర్లకు భక్తుల మొర వినిపిస్తుందా? అచ్ఛా.
మహారాష్ట్ర జోన్, ముంబయి మరియు ఆంధ్రప్రదేశ్ సేవాధారులతో:- అచ్ఛా. అందరూ మంచి ఛాన్సును తీసుకుంటున్నారు. పేరే మహారాష్ట్ర. మంచి సంఖ్య వచ్చింది. మహారాష్ట్ర అనగా మహాన్ ఆత్మలు ఉండే రాష్ట్రము. మహారాష్ట్రలో బాప్‌దాదా యొక్క మహాన్ పిల్లలు ఎంతో మంది ఉండటం బాప్‌దాదా చూసారు. ఎందుకంటే బాప్‌దాదా దృష్టి మహారాష్ట్రలోని ముంబయి మరియు ఢిల్లీపై ఎక్కువగా ఉంటుంది. ముంబయి నర్దేసావర్ (షాహుకారు) అయితే ఢిల్లీ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు నిమిత్తమైనది. డ్రామానుసారంగా మహారాష్ట్రలోని ముంబయి మరియు దగ్గరలో ఉన్న ఢిల్లీ రెండింటికీ బ్రహ్మా బాబా మరియు జగదాంబల పాలన లభించింది. విశేషమైన పాలన లభించింది. ఏ కార్యము వచ్చినా బాప్‌దాదా మహారాష్ట్రను, ఢిల్లీని గుర్తు చేస్తారు. ఇక మిగతావారు తప్పకుండా తోడుగా నిలుస్తారు. మిగతావి చిన్న చిన్న జోన్లు కావు, అవి కూడా పెద్ద పెద్ద జోన్లు. కానీ సాకార పాలన కొరకు బాప్‌దాదా ఢిల్లీ మరియు ముంబయిలను గుర్తు చేస్తారు. చిన్న జోన్లు కూడా అద్భుతాన్ని చేసి చూపించవచ్చు. చిన్నవారి గురించి బాప్‌దాదా ఎప్పుడూ ఇలా చెబుతూ ఉంటారు - పెద్దవారు అయితే పెద్దవారు, చిన్నవారు బాబా సమానులు. ఇప్పుడు మహారాష్ట్రవారు కొన్ని మహా కార్యాలను చెయ్యాల్సి ఉంది. కొత్త కార్యాన్ని కనిపెట్టి చాలా కాలం అయింది. వర్గీకరణ కార్యం కూడా ఇప్పుడు చాలా కాలం నడిచింది. కాన్ఫరెన్సులు కూడా జరిగాయి, యువ యాత్రలు కూడా జరిగాయి, ఇప్పుడు మరేదైనా కొత్త సేవా విధానాన్ని ఆలోచించండి. దాని ద్వారా సహజంగా సందేశం వ్యాపించాలి. ఇప్పటి వరకు ఏదైతే చేసారో, ఆ సేవా ప్లాన్లు బాప్‌దాదాకు నచ్చాయి, వాటి వల్ల వృద్ధి కూడా జరిగింది. కానీ ఇటువంటి ప్రోగ్రాములు చాలా కాలం జరిగాయి. ఇప్పుడేదైనా కొత్త ఇన్వెన్షన్‌ను ఆలోచించండి. ఎవ్వరైనా చెయ్యండి, చిన్నవారైనా చెయ్యండి. అందుకు ముందుగానే అభినందనలు. బాగుంది, మహారాష్ట్రలో కూడా వృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర టర్న్ కదా, మరి నంబర్ వన్ అయి బాబా స్నేహానికి మహారాష్ట్ర ఎందుకు రిటర్న్ ఇవ్వకూడదు? బాప్‌దాదా స్నేహానికి రిటర్న్ స్వయాన్ని మరియు విశ్వాన్ని టర్న్ (పరివర్తన) చెయ్యడము. రిటర్న్ అనే మాటలో రి తీసేస్తే టర్న్ అయిపోతుంది. బాప్‌దాదాకు పిల్లలమీద చాలా చాలా మంచి మంచి ఆశలు ఉన్నాయి. ఆశావాదులు కదా. మరి మహారాష్ట్ర ఏమి చేస్తుంది? రిటర్న్ ఇస్తుందా? బాగుంది, మంచి మంచి మహారథులు మహారాష్ట్రలో ఉన్నారు. సంగఠిత రూపంలో మీటింగు పెట్టుకోండి, మహారాష్ట్రలో నలు వైపులా ఆశావాదం ఉన్న సితారలు ఉన్నారు. ఏది తలుచుకుంటే అది చెయ్యగలరు. ఇలా సంగఠిత రూపంలో ప్రోగ్రాము చెయ్యండి, కొత్త ప్లాన్లను ఆలోచించండి. చెయ్యగలరు. మహారాష్ట్ర చెయ్యగలదు. చేస్తారు కదా! అరే, పేరే మహారాష్ట్ర అయినప్పుడు మహాన్ కార్యాలు చెయ్యాల్సిందే కదా! పాండవులు ఏమంటారు? చేస్తారా? పాండవ సైన్యం చేస్తారా, శక్తి సైన్యం చేస్తుందా? టీచర్లు చాలా మంది ఉన్నారు. చాలా బాగుంది.
డబల్ విదేశీయులు:- బాప్‌దాదా ముందు కూడా చెప్పారు, డబల్ విదేశీయులు వస్తే మధువనం అలంకృతమవుతుంది. డబల్ విదేశీయులంటే అందరికీ ఇష్టము. మీ గ్రూపును చూసినప్పుడు అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే మీరు కూడా కోట్లలో కొద్ది మంది, కొద్ది మందిలో కూడా అతి కొద్ది ఆత్మలు. ఈ మధ్య విదేశ సేవలో కూడా మంచి సమాచారము ఉంటుంది. ముస్లిం ధర్మంలో కూడా మంచి మంచి సందేశాలను ఇస్తున్నారు. డబల్ విదేశీయుల గురించి ఒక విశేషత చాలా గాయనము ఉంది - డబల్ విదేశీయులు పనిలో సరే అంటే సరే, కాదు అంటే కాదు అన్నట్లుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా కార్యం మొదలు పెడితే అందులో తప్పకుండా విజయులవుతారు. మీరు ఏ గ్రూపులో ఉన్నా కానీ అది విజయి గ్రూపు కదా! విజయి తిలకము ఉంది కదా! సేవలో వృద్ధి కూడా జరుగుతుంది, సందేశమును ఇస్తున్నారు, దయా హృదయులై ఆత్మలకు సందేశాన్ని ఇవ్వడము - ఇది బాబా సమానంగా సేవాధారిగా కావడము. ఈరోజు వినిపించాము కదా, ఇప్పటి నుండి ఒక సమయంలో ఒకే సేవను చెయ్యకండి. మూడు సేవలూ కలిసి జరగాలి, అప్పుడు దాని ప్రభావము ఎక్కువగా ఉంటుంది. మీ ముఖము ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా సేవ చెయ్యవచ్చు. నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా కండి. మ్యూజియంలో లేదా ప్రదర్శనిలో భిన్న భిన్న చిత్రాలు ఉన్నట్లుగా తమ నయనాలు, తమ మస్తకము, చిరునవ్వు చిందిస్తున్న మీ పెదవులు ఈ భిన్న భిన్న సాధనాలతో సేవను చెయ్యండి. బాప్‌దాదాకు పిల్లలు ధైర్యవంతులుగా కనిపిస్తున్నారు, ఇప్పుడు కేవలం సూక్ష్మంలో రియలైజేషన్ జరగాలి. రియలైజ్ అవుతారు, ఇప్పుడు కొంచం సూక్ష్మ రూపంలో రియలైజేషన్‌ను పొంది నంబర్ వన్‌గా కండి. విన్ అవ్వండి మరియు వన్, రెండవ నెంబరు కాదు, వన్. సరేనా! వన్ కదా, టూ, థ్రీ కాదు కదా. వన్ నంబర్ కదా? తల ఊపండి. అచ్ఛా. బాగుంది, విదేశీయుల గ్రూపు మధువనానికి వస్తూ ఉండటం, ఇది బాప్‌దాదాకు నచ్చుతుంది. మధువనం అలంకరింపబడుతుంది. అచ్ఛా.
ఇండియన్ యూథ్ గ్రూపు:- యూథ్ గ్రూపు వచ్చింది కదా. ఇండియన్ యూథ్ గ్రూపు లేవండి. ఇండియా యొక్క యూథ్ గ్రూపు ఏమి అద్భుతం చేస్తుంది? సందేశాన్ని ఇవ్వడంలో, నలు వైపులా వ్యాప్తి చెయ్యడంలో యూథ్కు డబల్ శక్తి ఉంది. టాపిక్ చాలా మంచిది పెట్టుకున్నారు అని బాప్‌దాదా విన్నారు. విక్టరీ (విజయము). అంతేకదా. మరి సదా విజయులుగా అయి, ఇతరులనూ విజయులుగా తయారు చెయ్యండి. ఈ సంవత్సరం బాప్‌దాదా ఇచ్చిన హోమ్‌వర్కును పూర్తి చేసి ఉదాహరణగా నిలిచినప్పుడే విజయులుగా అవుతారు. యూథ్ గ్రూపు విజయులు అనగా నిర్విఘ్నులు అని అందరూ అనాలి. ఇటువంటి సంకల్పం తీసుకున్నారు కదా? ఎటువంటి కారణమూ చెప్పరు కదా? అలా, ఇలా అని అనరు కదా? నేను పరివర్తన చెందాల్సిందే. నేను అడ్జస్ట్ కావాలి. నేను సహయోగము అందించాలి. నేను స్నేహాన్ని ఇవ్వాలి. ముందు నేను, ఇందులో ముందు నేను అనుకోండి, ఫర్వాలేదు. బాగుంది, ఫారెన్వారు పరస్పరం కలిసారు, ఇండియా వారూ చేస్తున్నారు. బాగుంది, అభినందనలు. ముందుకు ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
బాప్‌దాదా వద్దకు పూల అలంకరణ చేసే గ్రూపు నుండి కూడా ప్రియస్మృతులు అందాయి (కలకత్తా సోదర సోదరీలు). ఆ గ్రూపు లేవండి. చూడండి, అందరికీ పూల అలంకరణ బాగుంది కదా. పూల అలంకరణ అయితే సాధారణ విషయమే. లోకులు కూడా చేస్తారు కానీ మీ అలంకరణలో, వారి అలంకరణలో తేడా ఉంది. మీరు స్నేహ స్వరూపులై అలంకరించుకున్నారు. వారు డ్యూటీ అనుకుని అలంకరించుకుంటారు. మీరు స్నేహంతో చేసారు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ పుష్పాల సుగంధము మరియు అలంకారము మరింత సుందరంగా ఉంటుంది. స్నేహము చూడండి, కలకత్తా నుండి ఇక్కడకు తీసుకు వచ్చారు. స్నేహము అనే విమానంలో తీసుకు వచ్చారు. ట్రైనులో తీసుకు రాలేదు. స్నేహము అనే విమానములో తీసుకు వచ్చారు. బాగుంది. రాబోయే మీ సోదర సోదరీలు కూడా ఇది చూసి సంతోషిస్తారు, వాహ్! అద్భుతం, అద్భుతం. మీరందరూ ఏ స్నేహం కారణంగా అలంకరించుకున్నారో, బాప్‌దాదా అందుకు కోటాను రెట్లు మీకు తిరిగి స్నేహాన్ని ఇస్తున్నారు. అభినందనలు. అచ్ఛా.
నలు వైపుల నుండి ఉత్తరాలు, స్మృతి పత్రాలు, ఈ మెయిల్స్, ఫోన్లు చాలా వచ్చాయి. ఇక్కడ మధువనానికి కూడా వచ్చాయి, వతనానికి కూడా వచ్చాయి. ఈరోజు విశేషంగా బంధనంలో ఉన్న మాతల స్నేహభరిత హృదయపూర్వక స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. ఇటువంటి స్నేహి పిల్లలను బాప్‌దాదా చాలా గుర్తు కూడా చేస్తారు మరియు దీవెనలను కూడా ఇస్తారు. ఈ మధ్యలో అందరూ దూర దూరంగా కూర్చుని ఉన్నా కానీ ఎంతో సంతోషంగా సమీపంగా ఉన్నట్లు అనుభవం చేస్తుండటం బాప్‌దాదా చూసారు. కానీ మధువనానికి సమ్ముఖంలో రావడం, తమ ఒడిని నింపుకోవడం, ఇంత పెద్ద పరివారముతో కలవడము, ఈ పరివారము తక్కువైనది కాదు, ఏ విధంగా చూసినా కానీ సమ్ముఖంలో పరివారాన్ని చూసి ఎంతో సంతోషం కలుగుతుంది కదా, ఎందుకంటే 5 వేల సంవత్సరాల తర్వాత కలిసారు. ఆ అనుభవం వేరు. కానీ మధుబన్ నివాసిగా కావడము - ఈ బంగారు అవకాశం చాలా సహయోగాన్ని అందిస్తుంది. అందరూ అనుభవం చేసుకుంటున్నారు కూడా. కానీ అందరికీ మురళిపై ప్రేమ ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మురళిపై ప్రేమ అనగా మురళీధరునిపై ప్రేమ. ఎవరైనా మురళీధరునిపై ప్రేమ ఉంది కానీ మురళిని అప్పుడప్పుడూ వింటాము అంటే వారి ప్రేమను ప్రేమగా భావించము అని బాప్‌దాదా అంటారు. ప్రేమను నెరవేర్చడం వేరు, ప్రేమించడము వేరు. ఎవరికైతే మురళిపై ప్రేమ ఉంటుందో వారు ప్రేమను నెరవేర్చేవారు, మురళిపై ప్రేమ లేకపోతే ప్రేమించేవారి లిస్టులో ఉంటారు కానీ ప్రేమను నెరవేర్చేవారు కాదు. మధువనంలో మురళీగానం వినిపించింది అని మధువనం యొక్క గాయనం ఉంది. మధువన ధరిత్రిలోనే మహత్వం ఉంది. అచ్ఛా.
నలు వైపుల ఉన్న స్నేహి పిల్లలకు, లవ్లీ మరియు లవ్లీన్ పిల్లలకు, సదా బాబా శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగులో కోటానురెట్ల భాగ్యాన్ని జమ చేసుకునే నాలెజ్ఫుల్, పవర్ఫుల్ ఆత్మలకు, సదా స్నేహిగా కూడా, స్వమానధారిగా కూడా, సమ్మానధారిగా కూడా, ఇలా సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయి ఆత్మలకు, సదా బాబా అడుగులో అడుగు వేసే సహజయోగి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈరోజు వతనంలో అడ్వాన్సు పార్టీలోని పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్పారు మా తరఫున కూడా అందరికీ, నలు వైపుల ఉన్న పిల్లలకు మా ప్రియ స్మృతులను అందించండి మరియు మేము వారి కోసం ఎదురు చూస్తున్నాము, మీరు అతి త్వరగా తయారీలు చెయ్యండి అన్న మా సందేశాన్ని కూడా అందించండి. విశేషంగా మీ అందరి ప్రియమైన తల్లి, దీదీ, భావూ విశ్వ కిషోర్, ఇంకా అడ్వాన్సు పార్టీలోని వారందరూ మీకు ప్రియస్మృతులను తెలిపారు. వీరితో పాటు మధురమైన మీ తల్లి ఇలా అన్నారు - ఇప్పుడు విజయులుగా అయి దుఃఖ శోకాలను దూరం చేసి తొందర తొందరగా ముక్తిధామ ద్వారాలను తెరిచేందుకు బాబా సహచరులుగా కండి. ఎవరైతే సాకారంలో బ్రహ్మా బాబాను చూడలేదో, మరి బ్రహ్మాబాబా కూడా విశేషంగా మీ అందరికీ ఎంతో హృదయపూర్వకమైన ప్రియస్మృతులను ఇచ్చారు. ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీ రతన్ మోహిని మరియు దాదీ మనోహర్ ఇంద్రతో) చూడండి, మీరు కూడా ఆల్‌రౌండ్ పాత్రను పోషిస్తున్నారు కదా. ఎంత వీలైతే అంత సేవ చేసారు, అయినా నంబర్ వన్‌లో ఉన్నారు. మీరైతే ముందు నుండే నంబర్ వన్. బ్రహ్మా బాబా హృదయంలో మీ పేరు ఉంది. ఏమి జరిగినాగానీ చేస్తూ ఉండండి, మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ధైర్యం వస్తుంది. చేయించేవారు మీకు తోడుగా ఉండనే ఉన్నారు.
దాదీజీతో:- చాలా బాగుంది, మీరు నవ్వితే అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు ఒక్క పని చెయ్యండి, చేస్తారా? పక్కాగా చేస్తారా? ఇప్పుడు భోజనం బాగా తీసుకోండి. కళ్ళు తెరచి ఉంచుకొని భోజనం చెయ్యండి. మూసుకోకండి ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుంటే ఏమి జరిగింది, ఏమి జరిగింది అని అందరి సంకల్పాలు నడుస్తాయి. కనుక ఇప్పుడు భోజనాన్ని ప్రేమతో స్వీకరించండి. ఇప్పుడిక కళ్ళు మూసుకోకండి. చేస్తారు కదూ. వీరు చాలా సంతోషిస్తారు. తప్పకుండా చేస్తారు. చెయ్యాల్సిందే, చెయ్యాల్సిందే.
దాదీ శాంతమణి:- అరే వాహ్! మీకు గుర్తుంది కదా, మీకు బాప్‌దాదా ఒక స్పెషల్ టైటిల్‌ను ఇచ్చారు (సచలీ కౌడీ) బాప్‌దాదా విశేషంగా సచలీ కౌడీ అని టైటిల్‌ను ఇచ్చారు. ఆ రోజుల్లో కౌడీకి (గవ్వ) మహత్వం ఉండేది.
అందరికీ దాదీలను చూస్తే సంతోషం కలుగుతుంది. ఏ పాటను పాడుతారు? వాహ్! దాదీలు వాహ్! ఈ వాహ్! వాహ్! లేకపోతే మీరు కూడా ఉండేవారు కాదు. అచ్ఛా.
ఓంశాంతి