Search for a command to run...
31 Dec 2006
నూతన సంవత్సరానికి నవీనత - దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అన్న పదాలకు వీడ్కోలు ఇచ్చి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి
31 December 2006 · తెలుగు
ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ పిల్లలకు నూతన సంవత్సరము మరియు నూతన యుగము, రెండింటికీ అభినందనలు తెలపడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు కూడా అభినందనలు తెలపడానికి చేరుకున్నారు. కేవలం నూతన సంవత్సరానికి అభినందనలను తెలపడానికే వచ్చారా లేక నవయుగానికి కూడా అభినందనలు తెలపడానికి వచ్చారా? ఏ విధంగా నూతన సంవత్సరానికి సంబంధించి సంతోషము ఉంటుంది మరియు సంతోషాన్ని ఇస్తారు కదా, అలా బ్రాహ్మణ ఆత్మలైన మీకు నవయుగము కూడా అంతగానే గుర్తుందా? నవయుగము కళ్ళ ముందుకు వచ్చేసిందా? ఏ విధంగా నూతన సంవత్సరము విషయములో, అది ఇప్పుడిక వచ్చేసినట్లే అని మీ హృదయములో అనిపిస్తుందో అలాగే మీ నవయుగము కొరకు కూడా అది ఇప్పుడిక వచ్చేసినట్లే అని అనుభవం చేస్తున్నారా? ఆ నవయుగ స్మృతి అంతే సమీపముగా వస్తుందా? మీ ఆ శరీరము అనే డ్రెస్ మెరుస్తూ మీ ముందు కనిపిస్తోందా? బాప్‌దాదా డబల్ అభినందనలు తెలియజేస్తున్నారు. పిల్లల మనసులో, నయనాలలో నవయుగము యొక్క దృశ్యాలు ఇమర్జ్ అయి ఉన్నాయి. మన నవయుగములో తనువు, మనసు, ధనము, జనము ఎంత శ్రేష్ఠముగా ఉన్నాయి, అక్కడ సర్వ ప్రాప్తుల భాండాగారము ఉంది. ఈ రోజు మేము పాత ప్రపంచములో ఉన్నాము, మళ్ళీ ఇప్పటికిప్పుడే మా రాజ్యములో ఉంటాము అన్న సంతోషము ఉంది! మీ రాజ్యము గుర్తుందా? ఏ విధంగా ఈ రోజు డబల్ కార్యము కొరకు వచ్చారు, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికి మరియు క్రొత్త సంవత్సరానికి అభినందనలు తెలపడానికి వచ్చారు, అలాగే కేవలం పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా లేక పాత ప్రపంచపు పాత సంస్కారాలకు, పాత స్వభావానికి, పాత నడవడికకు, వాటికి కూడా వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడమనేది సహజమే, కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు ఇవ్వడము కూడా అంతే సహజముగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మాయకు కూడా వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా లేక కేవలం పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా? వీడ్కోలైతే ఇవ్వాలి కదా! లేక మాయ అంటే కొద్దిగా ప్రేమ ఉందా? మాయను కొద్ది కొద్దిగా ఉంచుకోవాలనుకుంటున్నారా?
బాప్‌దాదా ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల ద్వారా పాత సంస్కార-స్వభావాలకు వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. ఇవ్వగలరా? ధైర్యము ఉందా లేక వీడ్కోలు ఇవ్వాలనుకుంటున్నాము కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఈ రోజున దృఢ సంకల్ప శక్తితో పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి నవయుగ సంస్కారాలకు, జీవితానికి అభినందనలు ఇచ్చే ధైర్యము ఉందా? ఉందా ధైర్యము? ఇది జరగగలదు అని ఎవరైతే భావిస్తున్నారో, ఇది జరగగలదా లేక జరగవలసిందేనా, మీరు ధైర్యవంతులేనా? ధైర్యము ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ధైర్యము ఉందా? అచ్ఛా, ఎవరైతే చేతులెత్తలేదో, వారు ఆలోచిస్తున్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తారు. ఎవరిలోనైతే ధైర్యము ఉందో, వారు చేతులెత్తండి, అందరూ కాదు. అచ్ఛా, డబల్ విదేశీయులైతే చురుకైనవారు, అందుకే డబల్ నషా ఉంది. చూడండి, బాప్‌దాదా ప్రతి నెల రిజల్ట్ చూస్తారు. పిల్లలు ధైర్యవంతులు అని బాప్‌దాదాకు సంతోషము ఉంది. పిల్లలు చతురతతో జవాబిస్తారు. ఎందుకని? ఎందుకంటే పిల్లలకు తెలుసు, మేము ధైర్యముతో ఒక్క అడుగు వేస్తే బాబా నుండి వేలాది అడుగుల సహాయము లభించవలసిందే. మీరు అధికారులు. వేలాది అడుగుల సహాయానికి అధికారులు. కేవలం మాయ ధైర్యాన్ని చలింపజేసేందుకు ప్రయత్నిస్తుంది. ధైర్యాన్ని బాగా ఉంచుతున్నారు అన్నది బాప్‌దాదా చూస్తుంటారు, దానికి బాప్‌దాదా హృదయపూర్వకముగా అభినందనలు కూడా తెలియజేస్తారు. కానీ ధైర్యాన్ని ఉంచుతూ దానితోపాటు తమ లోలోపల వ్యర్థ సంకల్పాలను ఉత్పన్నము చేస్తారు. చేయడమైతే చేస్తున్నాము, మరి జరగడమైతే జరగాలి, చేయడమైతే తప్పకుండా చేస్తాము కానీ ఏమవుతుందో తెలియదు... ఈ ‘ఏమో తెలియదు’ అన్న సంకల్పము రావడము, ఇది ధైర్యాన్ని బలహీనము చేస్తుంది. ‘మరి, మరి’ అన్నది వచ్చేస్తుంది కదా, మరి చేయడమైతే చేస్తున్నాము, మరి చేయాల్సిందే కదా, మరి ముందుకు ఎగరాల్సిందే కదా... ఈ ఆలోచనలు ధైర్యాన్ని చలింపజేస్తాయి. కావున ఇలా ఆలోచించకండి. చేయాల్సిందే, ఎందుకు అవ్వదు అని ఆలోచించండి! బాబా తోడుగా ఉన్నప్పుడు బాబాతోపాటు ఈ ‘మరి, మరి’ అన్నది రాదు.
మరి ఈ క్రొత్త సంవత్సరములో ఏ నవీనతను తీసుకువస్తారు? ధైర్యము అనే పాదాన్ని దృఢముగా చేసుకోండి. ధైర్యము అనే పాదాన్ని ఎంత దృఢముగా చేసుకోండి అంటే మాయ స్వయము చలించాలే కానీ పాదము చలించకూడదు. కావున ఈ క్రొత్త సంవత్సరములో క్రొత్తదనాన్ని తీసుకువస్తారా లేక కాసేపు చలిస్తూ, కాసేవు దృఢముగా ఉంటూ... ఇలాగైతే చేయరు కదా! మీ అందరి కర్తవ్యము లేక వృత్తి ఏమిటి? మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. విశ్వకళ్యాణకారులు, విశ్వపరివర్తకులు - ఇదే మీ కర్తవ్యము కదా! బాప్‌దాదాకు అప్పుడప్పుడు మధురమైన చిరునవ్వు వస్తుంది. విశ్వపరివర్తకులు అన్న టైటిల్ అయితే ఉంది కదా! మీరు విశ్వ పరివర్తకులేనా? లేక లండన్ పరివర్తకులా లేక ఇండియా పరివర్తకులా? మీరందరూ విశ్వ పరివర్తకులే కదా? ఒక పల్లెలో ఉన్నా లేక లండన్‌లో ఉన్నా లేక అమెరికాలో ఉన్నా, మీరు విశ్వకళ్యాణకారులే కదా? అవునంటే తల ఊపండి. పక్కా కదా! లేక 75 శాతమే అలా ఉన్నారా. 75 శాతము విశ్వ కళ్యాణకారులు మరియు 25 శాతము లేకపోయినా ఫర్వాలేదు అని భావిస్తున్నారా? మీరు చేసిన ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా పరివర్తన చేయాల్సిందే అని ప్రకృతిని కూడా ఛాలెంజ్ చేసారు. కావున మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. వాస్తవానికి ఇలా చేయకూడదు కానీ జరిగిపోతోంది అని అప్పుడప్పుడు స్వయము కోసము కూడా ఇలా ఆలోచిస్తుంటారు. మరి విశ్వపరివర్తకులు మరియు ప్రకృతి పరివర్తకులైనవారు, స్వపరివర్తకులుగా అవ్వలేరా? శక్తి సైన్యము ఏమి ఆలోచిస్తున్నారు? ఈ సంవత్సరములో విశ్వ పరివర్తకులు అన్న మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. స్వయము పట్ల మరియు మీ బ్రాహ్మణ పరివారము పట్ల కూడా పరివర్తకులుగా అవ్వండి, ఎందుకంటే మొదటైతే దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది కదా! కావున మీ కర్తవ్యము యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రత్యక్షము చేస్తారు కదా! ఏ స్వ పరివర్తననైతే మీరు స్వయము కూడా కోరుకుంటున్నారో మరియు బాప్‌దాదా కూడా కోరుకుంటున్నారో, అదేమిటో తెలుసు కదా! బాప్‌దాదా అడుగుతున్నారు, పిల్లలైన మీ అందరి లక్ష్యము ఏమిటి? అప్పుడు మెజారిటీ ఒకటే జవాబు ఇస్తారు - బాబా సమానముగా అవ్వాలి. అంతే కదా! బాబా సమానముగా అవ్వవలసిందే కదా, లేక చూస్తాము, ఆలోచిస్తాము అని అంటారా...! కనుక బాబా కూడా ఇదే కోరుకుంటున్నారు, ఈ క్రొత్త సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, ఇప్పుడు 71వ సంవత్సరములో ఏదైనా అద్భుతము చేసి చూపించండి. అందరూ సేవ పట్ల ఎంతో ఉత్సాహముతో భిన్న-భిన్న ప్రోగ్రాములను తయారుచేస్తూ ఉంటారు, అందులో సఫలతను కూడా పొందుతూ ఉంటారు. ఏదైతే కష్టపడతారో అందుకు సఫలత కూడా లభిస్తోంది అని బాప్‌దాదాకు సంతోషము కూడా కలుగుతుంది. అదేమీ వ్యర్థమవ్వదు కానీ సేవ ఎందుకు చేస్తారు అని అడిగితే ఏం జవాబు ఇస్తారు? బాబాను ప్రత్యక్షము చేయడానికి అని చెప్తారు. కావున బాబా ఈ రోజు పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు, అదేమిటంటే - బాబాను ప్రత్యక్షమైతే చేయవలసిందే మరియు చేస్తారు కూడా, కానీ బాబాను ప్రత్యక్షము చేసేకంటే ముందు స్వయాన్ని ప్రత్యక్షము చేసుకోండి. శివశక్తులు చెప్పండి, ఈ సంవత్సరము శివశక్తి రూపములో స్వయాన్ని ప్రత్యక్షము చేస్తారా? చేస్తారా? జనక్ చెప్పండి? చేస్తారా? (చేయవలసిందే). తోడుగా ఉన్నవారు, మొదటి లైన్లో, రెండవ లైన్లో కూర్చున్న టీచర్లు, ఈ సంవత్సరము చేసి చూపించబోతున్నవారు చేతులెత్తండి. చేస్తాము అని అనడం కాదు, చేసి చూపించవలసిందే. అచ్ఛా - టీచర్లందరూ చేతులెత్తారా లేక ఎవరైనా ఎత్తలేదా.
అచ్ఛా - మధుబన్ వారు. చేయవలసిందే, చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మధుబన్ అయితే దగ్గర ఉంది కదా. తారీఖును నోట్ చేసుకోండి. ఈ రోజు 31వ తారీఖు. టైమ్ కూడా నోట్ చేసుకోండి (9 గంటల 20 నిమిషాలు). మరి పాండవ సైన్యం, పాండవులు ఏం చూపించాలి? విజయి పాండవులు. అప్పుడప్పుడు విజయులుగా కాదు, మీరు ఉన్నదే విజయి పాండవులు. కావున ఈ సంవత్సరములో ఇలా తయారై చూపించండి. లేదా - ఏం చేయాలి, మాయ వచ్చేసింది కదా, మేం కావాలనుకోవడం లేదు కానీ అది వచ్చేసింది అని అంటారా! బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - మాయ తన చివరి సమయము వరకు రావడము ఆపదు. కానీ మాయ పని రావడము, మరి మీ పని ఏమిటి? విజయులుగా అవ్వడము. కావున ఇలా అలోచించకండి – మేము అలా అవ్వాలనుకోవడం లేదు కానీ మాయ వచ్చేస్తుంది, అలా అయిపోతోంది... ఇప్పుడు బాప్‌దాదా ఈ సంవత్సరముతో పాటుగా ఈ పదాలకు కూడా వీడ్కోలు ఇప్పించాలనుకుంటున్నారు. 12 గంటలకు ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారు కదా! కావున ఏ గంటలనైతే మ్రోగిస్తారో, ఈ రోజు గంటలు మ్రోగించేటప్పుడు దేని గంటలు మ్రోగిస్తారు? ఈ రోజుకా, ఈ సంవత్సరానికా లేక మాయకు వీడ్కోలు తెలిపే గంటలు మ్రోగిస్తారా? రెండు విషయాలు ఉన్నాయి - ఒకటేమో పరివర్తన శక్తి, అందులో లోపముంది. ప్లాన్లు చాలా బాగా తయారుచేస్తారు, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము... అని. చాలా మంచి ప్లాన్లు తయారుచేసారు అని బాప్‌దాదా కూడా సంతోషపడతారు కానీ పరివర్తనా శక్తి యొక్క లోపము ఉన్న కారణముగా కొంత పరివర్తన అవుతుంది, కొంత పరివర్తన అవ్వదు. రెండవ లోపము, దృఢత యొక్క లోపము. సంకల్పాలు మంచి-మంచివి చేస్తారు. ఈ రోజు కూడా చూడండి, ఎన్నో కార్డులను, ఎన్ని ప్రమాణాలను, ఎన్ని ప్రతిజ్ఞలను చూసారు, బాప్‌దాదా చూసారు. చాలా మంచి-మంచి ఉత్తరాలు వచ్చాయి. (కార్డులు, ఉత్తరాలు అన్నీ స్టేజ్ పైన అలంకరించి ఉంచారు). కావున చేస్తారు, చూపిస్తారు, జరగవలసిందే, తయారవ్వవలసిందే, పదమాల, పదమాల రెట్లు ప్రియస్మృతులు, అన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. మీరు ఎవరైతే సమ్ముఖముగా కూర్చున్నారో మీ హృదయములోని ధ్వనులు కూడా బాబా వద్దకు చేరుకున్నాయి. కానీ బాప్‌దాదా ఈ రెండు శక్తులపైన అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకటేమో, దృఢతలో లోపము వచ్చేస్తుంది. ఆ లోపానికి కారణమేమిటంటే - నిర్లక్ష్యము, ఇతరులను చూడడము. అయిపోతుందిలే, చేయడమైతే చేస్తున్నాము కదా, చేస్తాములే, తప్పకుండా చేస్తాములే....
బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ సంవత్సరము ఒక్క పదానికి సదా కొరకు వీడ్కోలు ఇవ్వండి. అది ఏమిటి? చెప్పమంటారా, చెప్పనా? మరి వీడ్కోలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సంవత్సరము బాప్‌దాదా ‘కారణము’ అన్న పదానికి వీడ్కోలు ఇప్పించాలనుకుంటున్నారు. నివారణ ఉండాలి, కారణము సమాప్తమవ్వాలి. సమస్య సమాప్తమవ్వాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి. స్వయము యొక్క కారణమైనా, తోటివారి యొక్క కారణమైనా, సంగఠన యొక్క కారణమైనా, ఏదైనా పరిస్థితి కారణమైనా, బ్రాహ్మణుల డిక్షనరీలో కారణము అన్న పదము, సమస్య అన్న పదము పరివర్తన అవ్వాలి, సమాధానము మరియు నివారణ జరగాలి, ఎందుకంటే చాలామంది ఈ రోజు అమృతవేళ కూడా బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణలో - క్రొత్త సంవత్సరములో ఏదైనా నవీనతను తీసుకురావాలి అని ఇదే మాట్లాడారు. కావున బాప్‌దాదా కోరుకుంటున్నారు, ఈ క్రొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోండంటే, ఈ రెండు పదాలు సమాప్తమైపోవాలి. పరోపకారులుగా అవ్వండి. స్వయమే కారణమైనా లేక ఇతరులెవరైనా కారణమైనా కానీ పరోపకారీ ఆత్మగా అయి, దయార్ద్ర హృదయ ఆత్మగా అయి, శుభ భావన, శుభ కామన యొక్క హృదయము కలవారిగా అయి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని తీసుకోండి.
మరి ఈ క్రొత్త సంవత్సరానికి ఏ పేరు పెడతారు? పూర్వము ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెట్టేవారు, గుర్తుంది కదా? కావున బాప్‌దాదా ఈ సంవత్సరాన్ని శ్రేష్ఠ శుభ సంకల్పాల, దృఢ సంకల్పాల, స్నేహ సహయోగ సంకల్పాల సంవత్సరము అని అంటున్నారు, ఇది పేరు కాదు, కానీ ఇలా చూడాలనుకుంటున్నాము. దృఢత శక్తిని, పరివర్తన శక్తిని సదా సహచరులుగా చేసుకోండి. ఎవరు ఎంత నెగిటివ్ ఇచ్చినా కానీ, ఏ విధంగా మీరు ఇతరులకు నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చండి అని కోర్సు చెప్తారో, అలా మీరు స్వయం నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చలేరా? ఇతరులు పరవశమై ఉంటారు, పరవశమైనవారిపై దయ చూపించడం జరుగుతుంది. మీ జడచిత్రాలు మీ చిత్రాలే కదా. భారత్‌లో డబల్ విదేశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి, అవి పూజింపబడతాయి. దిల్వాడా మందిరములోనైతే మీ చిత్రాలను చూసారు కదా! చాలా మంచిది. మీ జడ చిత్రాలు దయార్ద్ర హృదయము కలిగి ఉంటాయి. ఎవరైనా చిత్రాల ముందుకు వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? దయ చూపించండి, కృప చూపించండి, దయ చూపించండి, దయ, దయ... అని కోరుకుంటారు. కావున సదా మొదట స్వయముపై దయ చూపించుకోండి, ఆ తర్వాత బ్రాహ్మణ పరివారముపై దయ చూపించండి. ఒకవేళ ఎవరైనా పరవశులైతే, సంస్కారాలకు వశమైతే, బలహీనులైతే, ఆ సమయములో వివేకహీనులుగా అయిపోతారు, అందుకే క్రోధము చేయకండి. క్రోధము యొక్క రిపోర్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. క్రోధము కాకపోయినా దాని పిల్లా-పాపలపై ఎక్కువ ప్రేమ ఉంది. ఆవేశము వస్తుంది, ఈ ఆవేశము క్రోధము యొక్క సంతానము. ఏ విధముగానైతే పరివారములో పెద్ద పిల్లలపై ప్రేమ తగ్గిపోతుంది మరియు మనవళ్ళు, మనవరాళ్ళపై ఎక్కువ ప్రేమ ఉంటుందో అలాగే క్రోధము తండ్రి లాంటిదైతే ఆవేశము, తప్పుడు నషా, ఇవి సంతానము... నషా కూడా భిన్న-భిన్న రకాలుగా ఉంటుంది, బుద్ధి యొక్క నషా, డ్యూటీ యొక్క నషా, సేవ యొక్క నషా, ఏదైనా విశేష కర్తవ్యము యొక్క నషా, ఇదంతా పెత్తనం చలాయించడమే... కావున దయాళువుగా అవ్వండి, కృపాళువుగా కండి. చూడండి, క్రొత్త సంవత్సరములో ఒకరికొకరు మిఠాయితో నోటిని తీపి చేసుకుంటారు. అభినందనలు తెలియజేస్తారు, అలాగే నోటిని కూడా తీపి చేసుకుంటారు కదా! కావున ఈ సంవత్సరమంతా చేదును చూపించవద్దు. వారు నోటిని మాత్రమే తీపి చేస్తారు, మీరు కేవలం నోటిని మాత్రమే తీపి చేయరు, కానీ మీ ముఖము కూడా తీయగా ఉండాలి. సదా మీ ముఖము ఆత్మికతతో కూడిన స్నేహము కలదిగా ఉండాలి, చిరునవ్వుతో కూడిన ముఖముగా ఉండాలి. చేదుతనము ఉండకూడదు. బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మెజారిటీ తమ గురించి సత్యంగా వినిపిస్తారు, వేరేవారు ఎవరూ వినరు కదా. మెజారిటీ యొక్క రిజల్టులో ఇతర వికారాల కన్నా క్రోధము లేక క్రోధము యొక్క పిల్లా-పాపల రిపోర్ట్ ఎక్కువగా ఉంది.
బాప్‌దాదా ఈ క్రొత్త సంవత్సరములో ఈ చేదుతనాన్ని తీసివేయాలని అనుకుంటున్నారు. మేము కావాలనుకోవడం లేదు కానీ అది వచ్చేస్తోంది అని చాలామంది తమ ప్రతిజ్ఞను కూడా వ్రాసారు. కావున బాప్‌దాదా, ఇదంతా దృఢతలో లోపము వలన జరుగుతోంది అని కారణాన్ని వినిపించారు. బాబా ఎదురుగా సంకల్పము ద్వారా ప్రమాణము కూడా చేస్తారు. దృఢత అనేది ఎటువంటి శక్తి అంటే, ప్రపంచములోనివారు కూడా అంటుంటారు కదా, శరీరము పోయినా కానీ ఇచ్చిన మాట తప్పకూడదు అని. మరణించవలసి వచ్చినా, తలవంచవలసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, తాము ఇచ్చిన మాటలో దృఢముగా ఉండేవారు ప్రతి అడుగులోనూ సఫలతామూర్తులుగా ఉంటారు, ఎందుకంటే దృఢత సఫలతకు తాళంచెవి. ఈ తాళంచెవి అందరి వద్దా ఉంది కానీ అవసరమైన సమయానికి మాయమైపోతుంది. మరి మీరు ఏమి అనుకుంటున్నారు?
క్రొత్త సంవత్సరములో నవీనతను తీసుకురావలసిందే - స్వయం యొక్క, సహయోగుల యొక్క మరియు విశ్వ పరివర్తన యొక్క నవీనతను తీసుకురావలసిందే. వెనుక ఉన్నవారు వింటున్నారా? మరి చెయ్యాలి కదా. మొదటైతే పెద్దవారు చేస్తారు కదా, మేమైతే చిన్నవారము కదా అని ఆలోచించకండి. చిన్నవారు తండ్రి సమానమైనవారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా యొక్క అధికారులు. మీరు మొదటిసారి వచ్చినా కానీ ‘నా బాబా’ అని అన్నారంటే మీరు అధికారులే. శ్రీమతముపై నడవడములో కూడా అధికారులు మరియు సర్వ ప్రాప్తులకు కూడా అధికారులు. టీచర్లు పరస్పరము ప్రోగ్రామ్‌ను తయారుచేయండి. విదేశీయులు కూడా తయారుచేయండి. భారత్వారు కూడా కలిసి తయారుచేయండి. బాప్‌దాదా ప్రైజ్ ఇస్తారు, ఏ జోన్ వారైనా, అది భారత్ వారైనా, విదేశాల వారైనా, ఏ జోన్ నంబర్‌వన్ తీసుకుంటే, వారికి బంగారు కప్ ఇస్తాము. కేవలం మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడమే కాదు, మీ తోటివారిని కూడా తయారుచేయాలి, ఎందుకంటే బాప్‌దాదా చూసారు, పిల్లల పరివర్తన జరగకపోవడం వల్ల విశ్వ పరివర్తన కూడా ఢీలా అవుతుంది మరియు ఆత్మలు క్రొత్త-క్రొత్త రకాల దుఃఖాలకు పాత్రులుగా అవుతున్నారు. దుఃఖము, అశాంతికి క్రొత్త-క్రొత్త కారణాలు తయారవుతున్నాయి. బాబా ఇప్పుడు పిల్లల యొక్క దుఃఖపు పిలుపును వింటూ పరివర్తన కోరుకుంటున్నారు. కావున, ఓ మాస్టర్ సుఖదాతలైన పిల్లలూ, దుఃఖితులపై దయ చూపించండి. భక్తులు కూడా భక్తిని చేసి-చేసి అలసిపోయారు. భక్తులకు కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించండి. మీకు దయ కలుగుతోందా లేదా లేక మీ సేవలోనే, మీ దినచర్యలోనే బిజీగా ఉన్నారా? మీరూ నిమిత్తులే, అంతేకానీ పెద్దవాళ్ళు మాత్రమే నిమిత్తులు అని కాదు. ‘నా బాబా’ అని అన్న ఒక్కొక్క బిడ్డ మరియు అలా భావించిన ప్రతి ఒక్కరూ నిమిత్తులే. క్రొత్త సంవత్సరములో ఒకరికొకరు కానుకలు కూడా ఇచ్చుకుంటారు కదా. కావున మీరు భక్తుల ఆశలను పూర్తి చేయండి. వారికి కానుకను ఇప్పించండి. దుఃఖితులను దుఃఖము నుండి విడిపించండి, ముక్తిధామములో శాంతిని ఇప్పించండి - ఈ కానుకను ఇవ్వండి. బ్రాహ్మణ పరివారములో ప్రతి ఆత్మకు హృదయపూర్వకమైన స్నేహము మరియు సహయోగము యొక్క కానుకను ఇవ్వండి. మీ వద్ద కానుకల స్టాక్ ఉందా? స్నేహము ఉందా? సహయోగము ఉందా? ముక్తిని ఇప్పించే శక్తి ఉందా? ఎవరివద్దనైతే స్టాక్ చాలా ఉందో వారు చేతులెత్తండి. ఉందా స్టాక్? స్టాక్ తక్కువగా ఉందా? మొదటి లైన్లో ఉన్నవారి వద్ద స్టాక్ తక్కువగా ఉందా? ఈ బృజ్‌మోహన్ చేయి ఎత్తడం లేదు. స్టాక్ అయితే ఉంది కదా, స్టాక్ ఉందా? అందరూ చేతులెత్తారా? స్టాక్ ఉందా? మరి స్టాక్ ఉంచుకుని ఏమి చేస్తున్నారు? జమ చేసుకుని ఉంచుకున్నారు! టీచర్లు, స్టాక్ ఉంది కదా? మరి ఇవ్వండి కదా. విశాల హృదయులుగా అవ్వండి. మధుబన్ వారు ఏం చేస్తారు? ఉందా స్టాక్? మధుబన్‌లో ఉందా? మధుబన్లోనైతే నలువైపులా స్టాక్ నిండి ఉంది. కావున ఇప్పుడు దాతగా అవ్వండి. కేవలం జమ చేసుకోవడమే కాదు. దాతగా అవ్వండి, ఇస్తూ వెళ్ళండి. సరేనా.
అచ్ఛా – బాప్‌దాదా చూస్తారు, ప్రతి వారము, ప్రతి జోన్, తమ రిజల్ట్‌ను ఓ.కే లేక ఓ.కే మధ్య గీత గీసి పంపించండి. ఒకవేళ ఓ.కే కాకపోతే మరింకేదీ వ్రాయకండి, కేవలం ఓ.కే మధ్య గీత పెట్టి పంపండి చాలు, ఉత్తరాలు ఎవ్వరూ చదవరు. చాలా పెద్ద ఉత్తరాలు పంపిస్తే చదివే తీరిక ఎవ్వరికీ ఉండదు అందుకని కేవలం ఓ.కే అని లేక ఓ.కే కాదు అనడానికి మధ్యలో లైన్ గీసి పంపండి, అంతే. దానితో ఇప్పుడింకా మార్జిన్ ఉంది అని అర్థమైపోతుంది. జోన్ కాకపోయినా ప్రతి సెంటర్ వ్రాయండి, సేవలో భక్తులది, దుఃఖితులది, పరస్పరంలో బ్రాహ్మణులు, మూడు సేవలలో ఓ.కే లేక గీత ఉందా అని అందరూ వ్రాసి పంపండి. పరివర్తన శక్తి, దృఢత శక్తి బాగా ఉపయోగించండి. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ, ఆగ్రా వారిది:- బాగుంది, చూడండి, స్థాపనా కార్యంలో నిమిత్తంగా ముందుగా ఢిల్లీ అయింది, బాంబే కూడా కొద్ది కొద్దిగా ఉండింది, కానీ ఢిల్లీ స్థాపన కార్యంలో నిమిత్తంగా అయింది, మరి స్థాపన వారు గోల్డెన్ కప్ తీసుకోవడంలో కూడా నిమిత్తంగా అవుతారా? అవుతారా? ఈసారి బాప్‌దాదా గోల్డెన్ కప్‌ను తయారు చేయిస్తున్నారు, ఎంతమంది తీసుకుంటారో చూస్తాము. కానీ ఢిల్లీ నంబర్‌వన్ రావలసిందే, అంతే కదా! రావాలి కాదు, రావలసిందే. సరిగ్గా చెప్తుంటే చేతులు ఎత్తండి. నంబర్‌వన్ రావలసిందేనా లేక చూస్తాము, ఆలోచిస్తాము, ము... ము... అని అనేవారిగా లేరు కదా? ధైర్యవంతులు. చూడండి, బాప్‌దాదా మరియు మీ మమ్మా డైరెక్ట్ ఢిల్లీ మరియు బాంబేకు పాలన ఇచ్చారు. ఇతర ప్రదేశాలకు కొద్దికొద్దిగా వెళ్ళారు కానీ ఢిల్లీ మరియు బాంబేలో డైరెక్ట్‌గా బాప్‌దాదా మరియు మమ్మా పాలనను ఇచ్చారు. మరి ఢిల్లీ వారికి ఈ నషా ఉందా? ఇందులో కూడా నంబర్‌వన్, ఏమి జరగదు! దృఢ నిశ్చయము, నిశ్చిత విజయిగా చేస్తుంది. దృఢతను తక్కువగా ఉపయోగిస్తారు, చూస్తాములే, చేస్తాములే, అవుతుందిలే, ఈ లే... లే... వచ్చేస్తుంది. బాగుంది, ఢిల్లీ వారు ఎగ్జాంపుల్‌గా అవ్వాలి, ఎవరైతే ఎగ్జాంపుల్‌గా అవుతారో వారికి ఫైనల్ పరీక్షలో ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి. మరి మార్కులు తీసుకునేవారే కదా? టీచర్లు తీసుకుంటారా? అచ్ఛా. ఇప్పుడు ఉత్తరంలో ఏమి వస్తుంది? ఓ.కే లేక గీత ఉంటుందా? గీత ఉన్నది పంపకండి. ఓ.కే అని పంపండి ఎందుకంటే ఢిల్లీపై అందరి దృష్టి ఉంది. ఢిల్లీలో రాజ్యం చేయాలని బ్రాహ్మణులందరికీ ఉంది. మరి ఢిల్లీ అయితే ముందు పూర్తి చేయాలి కదా. బాగుంది.
అచ్ఛా, ఢిల్లీవారు ఇంకేమి చేస్తారు? ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేసారా? ఎందుకంటే ఢిల్లీ మరియు బాంబే రెండూ ఆది నుండి ఇప్పటి వరకు ఏదో ఒక నవీనతను తీసుకురావడంలో నిమిత్తంగా అవుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఢిల్లీవారు షార్ట్‌కట్ మరియు ఎక్కువ సఫలత ఉండేలా ఏదైనా ప్లాన్‌ను ఆలోచించండి, అది అందరూ చేసి చూపించాలి, చేయగలగాలి. షార్ట్‌గా కూడా ఉండాలి, సఫలతామూర్తులుగా కూడా అవ్వాలి. అచ్ఛా, సగం సభ ఢిల్లీవారే ఉన్నట్లుగా ఉంది. సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి గోల్డెన్ కప్ తీసుకునేవారే కదా. బాప్‌దాదా, మొదటి నంబర్ వారు అని పేరు పెట్టవచ్చా? వెనుక ఉన్నవారు ఏమంటారు, పెట్టమంటారా? అందరూ సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా వచ్చేది స్వ పరివర్తన, తర్వాత తోటివారి పరివర్తన, తోటివారు అంటే పరస్పరం ఉండే 4-5 మంది కాదు, తోటివారు అంటే ఢిల్లీ నివాసులు. తర్వాత విశ్వ పరివర్తన, సహయోగము ఇవ్వాలి. బాగుంది. ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుంటూ, మనస్ఫూర్తిగా ప్రేమను పంచుతూ ముందుకు తీసుకువెళ్ళండి, ఎగిరిస్తూ ఉండండి. బాగుంది. ఢిల్లీవారిలో ధైర్యము ఉంది కానీ సంగఠిత రూపంలో ధైర్యాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. అందరి దృష్టి ఢిల్లీ వైపు వెళ్తుంది. అచ్ఛా. సేవ పట్ల ఆసక్తి చూపారు, ఇందుకు అభినందనలు. మీ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. అచ్ఛా.
సింధీ గ్రూప్:- సింధీ గ్రూప్ లేవండి. మీకు ఒక స్పెషల్ నషా ఉంది, ఉందా నషా? మంచి నషా, చెడు నషా కాదు. మంచి నషా ఏమిటంటే బాప్‌దాదా కూడా సింధ్‌లో రావలసి వచ్చింది. అంటే సింధీలకు ఏదో భాగ్యము ఉందని అర్థం కదా. ఆది రత్న్, ఆది స్థాపన సింధ్‌లో జరిగింది, ఈ గ్రూప్‌ను చాలా బాగా తయారు చేసారు. అనుకున్నట్లుగా చేసారు. ప్రతి సంవత్సరము ఒక గ్రూప్‌గా అయ్యి రావడాన్ని బాప్‌దాదా చూసారు. విశేషంగా ఒకరికొకరు ఉల్లాసాన్ని ఇచ్చుకునే వారిగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు మీ గ్రూప్ ఏమి చేస్తుంది? విశేషంగా సింధీ గ్రూప్ ఏమి చేస్తుంది? ఏమి చేస్తారు? ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి కదా. సింధీ సమ్మేళనము అయితే చేస్తుంటారు. మీ గ్రూప్ బాగుంది. ఈ గ్రూప్‌లోని ఒక్కొక్కరూ ఒక విశేష కార్యానికి నిమిత్తంగా కాగలరు ఎందుకంటే మెజారిటీ యుగళ్స్ ఉన్నారు, ఒంటరిగా ఉన్నవారు తక్కువగా ఉన్నారు. ఎక్కడైతే యుగళ్స్ ఉంటారో, ఏకమతం ఉంటుందో, అక్కడ సేవ చాలా బాగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ కదా. మీరు విడిచిపెట్టలేదు, పరివారంలో ఉంటారు, ఏకమతంతో నడుచుకుంటారు కావున మీరు కొద్దిగా చెప్పినాగానీ అది సేవ అవుతుంది. ఇప్పుడు మీ గ్రూప్‌ను కొంచెం పెంచండి. ఇప్పుడు చిన్న గ్రూప్ అని కూడా కాదు, మధ్య రకంగా ఉంది, ఇప్పుడు ఇంకొంచెం పెంచండి. ఉల్లాస-ఉత్సాహంలోకి తీసుకురండి. ఎలా అయితే ఒక సంవత్సరంలో ఒకసారి వచ్చినట్లుగా, సేవకు నిమిత్తం కాగలిగిన ప్రసిద్ధమైన వ్యక్తులను మీ గ్రూపులో ఏడ్ చేసి తీసుకురండి. (దాదీ జానకి వినిపించారు, చాలావరకు దాదారామ్ మరియు దాదా రతన్‌చంద్ పరివారాలు పూర్తి విశ్వంలో వ్యాపించి ఉన్నాయి) అవును, ఇవి ప్రసిద్ధ పరివారాలు. చూడండి, రెండు పరివారాలకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో, రతన్‌చంద్ యొక్క విశేషత – ఏమీ ఆలోచించలేదు, మొత్తం స్వాహా. ఉల్లాస ఉత్సాహాలను చూపించారు. బ్రహ్మా బాబాను ఫాలో చేసారు. ఈరోజు వారి పరివారం ఆ ఆశీర్వాదాలతో చాలా బాగా ఉంది మరియు రామ్ సావిత్రి మనస్ఫూర్తిగా సేవకు నిమిత్తమయ్యారు. సమయానికి గుప్త సహయోగిగా అయ్యారు, ఆ ఆశీర్వాదాలు పరివారానికి ఉన్నాయి. పని తాను చేసి పేరు మాత్రం పరివారానికి ఇచ్చారు. ఇది వారి త్యాగము. వారి త్యాగము యొక్క భాగ్యము మీకు ప్రాప్తిస్తుంది. సంగఠన బాగుంది, మీ గ్రూప్ బాప్‌దాదాకు ఇష్టము. అచ్ఛా. అభినందనలు. పరివారం అందరి తరఫున, బాప్‌దాదా తరఫున కూడా అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీ పిల్లల రిట్రీట్ జరుగుతుంది:- (పిల్లలు పాట పాడారు – బాబా కా బచ్చోం సే, బచ్చోంకా బాబా సే ప్యార్ హై) బాగుంది. ఎలా అయితే పిల్లలు ఉల్లాస ఉత్సాహాలతో తమ ప్రోగ్రామును ఇక్కడ చేస్తున్నారో అలాగే తమ తమ పట్టణాలలో కూడా పిల్లల గ్రూప్‌ను పెంచండి. ఎవరైతే పిల్లల గ్రూప్‌ను ఎక్కువగా పెంచుతారో వారికి కానుక ఇస్తాము. బాప్‌దాదాకు కూడా పిల్లలు మంచిగా అనిపిస్తారు ఎందుకంటే పిల్లలకు సత్యమైన మనసు ఉంటుంది. అచ్ఛా – పిల్లలూ, ఎప్పుడూ కోపం రావట్లేదు కదా? అప్పుడప్పుడూ కోపం వస్తుందా? కొద్దికొద్దిగా కోపం చేస్తున్నారా? మరి ఈ సంవత్సరం మీ మీ సెంటర్లలో మీ రిజల్ట్‌ను వ్రాయించండి, తర్వాత ఆ టీచర్ వ్రాసి పంపిస్తారు – ఈ పిల్లలు సంవత్సరమంతా కోపం చెయ్యలేదు అని. ఇంకా బాగా పురుషార్థం చేస్తే అందుకు కూడా బహుమతి ఇస్తాము. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- ఫారెనర్లు వృద్ధి కూడా చేస్తున్నారు మరియు మిగిలి ఉన్న భిన్న భిన్న దేశాలలో ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రాక్టికల్‌గా దయా హృదయులుగా అయ్యి ఆత్మలపై దయను చూపిస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. సేవ యొక్క ఉత్సాహం కూడా ఉంది మరియు సేవ యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు డబల్ తీవ్ర పురుషార్థాన్ని చేసి ఫారెన్ వారు గోల్డెన్ కప్‌ను తీసుకోండి. తీసుకోగలరు. అందరి తరఫున మీ ఈ మెయిల్ వస్తుంది – ఓ.కే. ఓ.కే అని, ఎక్కువేమీ రాదు. మీరు చదవాల్సి ఉంటుంది కదా. (దాదీ జానకితో) కేవలం ఓ.కే, బాబా కూడా ఓ.కే వారికి గుప్తంగా ఎంతో స్నేహపూర్వక ఆశీర్వాదాల వర్షాన్ని కురిపిస్తారు. వాహ్! పిల్లలూ వాహ్! పాటను పాడుతాము. భారత్ వారు కావచ్చు, విదేశాలవారు కావచ్చు, కొందరు పిల్లలు గుప్తంగా తీవ్ర పురుషార్థం చేస్తున్నారు, బాప్‌దాదా వద్ద ఆ లిస్ట్ కూడా ఉంది, భారత్‌లో కూడా ఉన్నారు, విదేశాలలో కూడా ఉన్నారు కానీ బాప్‌దాదా ఇప్పుడు బహుకాలాన్ని చూడాలనుకుంటున్నారు, చేస్తున్నారు కానీ బహుకాలం కావాలి. బహుకాలాన్ని బాప్‌దాదా నోట్ చేస్తున్నారు, ఎవరెవరు బహుకాలపు తీవ్ర పురుషార్థీలు అని నోట్ చేసుకుంటున్నాము. మధ్య-మధ్యలో ఒకవేళ ఢీలా పడితే బహుకాలం కట్ అయిపోతుంది కదా. అందుకే బాప్‌దాదా లిస్ట్‌ను తయారు చేస్తున్నారు, చాలా కొద్దిమందే ఉన్నారు. అవ్వాల్సింది అందరూ. భారత్ వారు కూడా అవ్వాలి, విదేశాల వారు కూడా అవ్వాలి కానీ కొంతమంది గుప్తంగా ఉన్నా మంచిగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఇలా ఉన్నారని బాప్‌దాదా లెక్కపెడుతూ ఉంటారు. ఇప్పుడు బహుకాలంపై అటెన్షన్ పెట్టండి ఎందుకంటే బహుకాలపు విజయులు బహుకాలము పూర్తిగా అంటే అర్థ కల్పము పూర్తిగా రాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఒకవేళ మధ్య-మధ్యలో చేస్తే, సగం సమయం చేస్తే, ముప్పావు సమయం చేస్తే ప్రాప్తి అయిన రాజ్య భాగ్యం కూడా అంతే ఉంటుంది. అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయులకు ఉన్న అటెన్షన్‌కు థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ మధ్య-మధ్యలో టెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు టెన్షన్ సమాప్తము, అటెన్షన్. ఈ విధంగా బహుకాలపు తీవ్ర పురుషార్థపు లిస్ట్‌లోకి రండి. అప్పుడప్పుడూ వారిగా కాదు, నిరంతరం. సరేనా. మీ అందరినీ ఆశా సితారలుగా బాప్‌దాదా చూస్తున్నారు. ప్రాక్టికల్ స్టేజీపైకి వచ్చేస్తారు. సరేనా! ఆశా సితారలే కదా! బాబా ఆశల సితారల పిల్లలు. అచ్ఛా. అభినందనలు, అభినందనలు.
ఇంటర్నేషనల్ యూత్ గ్రూప్:- యూత్ గ్రూప్ యొక్క ప్రసిద్ధమైన విశేషత – యూత్ ఏది కావాలంటే అది చేయగలరు. మరి ఈ సంవత్సరం యూత్ గ్రూప్ అయిన మీరు ఏ సంకల్పాన్ని పూర్తి చేస్తారు? బాప్‌దాదా చెప్పినది యూత్ గ్రూప్ చేసి చూపిస్తుందా! చేస్తారా? నివారణ స్వరూపము. కారణము కాదు, నివారణ స్వరూపము. సమాధాన స్వరూపము. పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తారు కదా. బహుకాలము సమాధాన స్వరూపంగా అయ్యి ఎగరాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకునే ఇక్కడి నుండి వెళ్ళండి. కారణాలు వస్తుంటాయి కానీ యూత్ అయిన మీలో శక్తి ఉంది, కారణాన్ని నివారణలోకి ఛేంజ్ చెయ్యగలరు. ఏమి చేయాలి, కారణము ఉంది కదా, ఈ మాటలు యూత్ చెప్పకూడదు. శక్తిమంతులు మీరు. సరేనా, ఈ హోమ్‌వర్క్ చేస్తారా? చేస్తారా హోమ్‌వర్క్? మంచి రిజల్ట్‌ను వ్రాస్తూ ఉండండి. ఓ.కే ఓ.కే అన్న రిజల్ట్‌ను వ్రాయండి. మంచిది. బాప్‌దాదాకు యూత్ గ్రూప్‌పై చాలా మంచి ఆశలు ఉన్నాయి. చేస్తున్నారు, ప్లాన్లు తయారు చేస్తున్నారు, ఇప్పుడు ప్రాక్టికల్‌లో చేసి చూపించండి. మిమ్మల్ని ఎవరు చూసినా , వీరైతే ఫరిశ్తాగా ఉన్నారు అనాలి. ఫరిశ్తా ఫరిశ్తా కనిపించాలి. ఫరిశ్తాల గతి ఎగిరే కళ. పైకి క్రిందకు కాదు. ఎగిరేవారు మరియు ఎగిరించేవారు. బలహీనులను కూడా ఎగిరించగలరు. క్రిందకు వచ్చేవారు కాదు. మరి ఇటువంటి ప్లాన్ తయారు చేసారా! ఇలా ఆలోచించారా? ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఇకపోతే అంతా బాగుంది, ప్రతి సంవత్సరం కలుస్తారు, ఇది చాలా బాగుంది. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. ఇప్పటి రిజల్ట్‌ను కూడా విన్నాము, ఒకటి తయారు చేసారు కదా, చిట్టీలు వ్రాసారు, అది కూడా విన్నాము. ఇది బాగా చేసారు. మంచి పురుషార్థం చేసారు. ఇప్పుడు అందరి చిట్టీలు క్రింద పడిపోయి అంతా బాగుంది అని రావాలి. శాతంలో కాదు, చాలా బాగుంది అని రావాలి. వీలవుతుంది, ఏమంత పెద్ద విషయం కాదు. అచ్ఛా (మేము బాబా ఆశను పూర్తి చేస్తాము, విదేశము మరియు భారతము రెండు చోట్ల కలిపి సేవ చేస్తాము అన్న సంకల్పం ఉంది, ఇందుకు ప్లాన్ తయారు చేస్తాము అని అందరూ ప్రతిజ్ఞ చేసారు) మంచిది.
అచ్ఛా – మధుబన్కు మీరు అలంకారము. చూడండి, మీరు మధుబన్కు వచ్చినప్పుడు మధుబన్ ఎంతగానో అందంగా తయారవుతుంది. మధుబన్కు రావడం మంచిగా అనిపిస్తుంది కదా లేక కష్టంగా ఉందా? కష్టంగా అనిపిస్తుందా? కష్టంగా ఉంటుందా లేక సంతోషంగా ఉంటుందా?
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తమ మనసుకు యజమానులుగా అనుభవం చేసి ఒక్క క్షణములో మనసును ఏకాగ్రము చేసుకోగలరా? ఆర్డర్ చేయగలరా? ఒక్క క్షణములో మీ మధురమైన ఇంటికి చేరుకోండి. ఒక్క క్షణములో మీ రాజ్యమైన స్వర్గములోకి చేరుకోండి. మనసు మీ ఆర్డర్‌ను పాటిస్తుందా లేక అలజడి చేస్తుందా? యజమానులు ఒకవేళ యోగ్యులుగా, శక్తివంతులుగా ఉన్నట్లయితే మనసు మాట వినకపోవడమనేది జరగదు. కావున ఇప్పుడు అభ్యాసము చేయండి - ఒక్క క్షణములో అందరూ మీ మధురమైన ఇంటికి చేరుకోండి.
ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మధ్యమధ్యలో చేసే అటెన్షన్ ఉంచండి. మనసు యొక్క ఏకాగ్రత స్వయాన్ని కూడా మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా చేస్తుంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వుల అతి స్నేహీ ఆత్మలకు, సర్వుల సహయోగులైన శ్రేష్ఠాత్మలకు, నలువైపులా ఉన్న విజయీ పిల్లలకు, నలువైపులా ఉన్న పరివర్తనా శక్తి కల పిల్లలకు, నలువైపులా ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షము చేసి బాబాను ప్రత్యక్షము చేసే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులైన విశ్వపరివర్తకులైన పిల్లలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక దీవెనలను స్వీకరించగలరు. దానితోపాటు పిల్లలందరికీ, ఎవరైతే బాబాకు కూడా శిరోకిరీటముగా ఉన్నారో, ఇటువంటి శిరోకిరీటాల వంటి పిల్లలకు బాప్‌దాదా యొక్క నమస్తే.
దాదీలతో:- (దాదీజీతో) నవ్వుతున్న మీ ముఖాన్ని అందరూ చూడాలనుకుంటున్నారు. చూడండి, అందరూ చిరునవ్వుతో ఉన్నారు, మిమ్మల్ని చూసి అందరూ చిరునవ్వును చిందిస్తున్నారు. బాగుంది, అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక స్నేహాన్ని ఇచ్చారు, అందుకే అందరి హృదయ స్నేహము మీకు ఉంది. ఈ స్నేహము లిఫ్ట్ వలె ముందుకు తీసుకు వెళ్తుంది. మెట్లు ఎక్కేవారు కాదు, లిఫ్ట్‌లో చేరుకుంటారు. దాదీలు అందరినీ చూసి సంతోషిస్తారు కదా ఎందుకంటే దాదీలు నిస్వార్థ సేవను చేసారు. ప్రతి ఒక్కరి పాలనను హృదయం యొక్క ఆశీర్వాదాలతో చేసారు. తమతో కలిసి ఉండేవారు కావచ్చు, దూరంగా ఉండేవారు కావచ్చు, ఆశీర్వాదాలతో, స్నేహంతో పాలన చేసారు. ఒక్క సెకండు యొక్క ఆశీర్వాదాల దృష్టి మరియు ఆశీర్వాదాలు నిండిన సంకల్పము పాలన చేస్తాయి. దాదీల దృష్టి లభించాలి, దాదీల దృష్టి లభించాలి అని మీ అందరికీ అనిపిస్తుంది కదా. దాదీలు మీకు ఇచ్చిన విశేషతతో మీరు కూడా ఇతరులకు స్నేహాన్ని ఇచ్చి సంతోషపరచండి. ఎవరు ఎలా ఉన్నాగానీ హృదయపూర్వక స్నేహము ఉండాలి, కేవలం మాటల వరకే కాదు, బాహ్యములోనే కాదు, హృదయపూర్వక స్నేహము ఎవరినైనా స్నేహిగా చేస్తుంది. ఎలా అయితే దాదీలు తొందరగా నిరాశ చెందరో – వీరు మారరు, ఇది జరగనే జరగదు అని అనరు, సదా శుభ ఆశను పెట్టారు, బాప్‌దాదాను ఫాలో చేసారు. బాప్‌దాదా వద్దకు మీరు మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? 63 జన్మల పాపంతో వచ్చారు, కానీ బాప్‌దాదా మిమ్మల్ని ఆశా దీపంగా భావించి మెరుస్తున్న సితారగా చేసేసారు. ద్వేషం లేదు, నిరాశ లేదు. ఇలా మీరు కూడా ఈ సంవత్సరం ఎవ్వరినీ చూసి నిరాశ చెందకూడదు, అలసిపోకూడదు, స్నేహము మరియు సహయోగమును ఇస్తూ ఉండాలి. పాజిటివ్‌లోకి పరివర్తన చేస్తూ ఉండండి, నెగిటివ్‌ను చూడకండి. అప్పుడు చూడండి, ఈ సంవత్సరంలోనే సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. ఎక్కడ కూడా, ఎవ్వరి పట్ల కూడా ఎవ్వరిపైనా మరో భావం ఉండకూడదు, కేవలం శుభ భావన – శుభ కామన. క్రింద పడి ఉన్న పరవశ ఆత్మలకు మీ సహయోగాన్ని అందించి పైకి లేపండి. అందరూ లేచి ఎగురుతారు. ఫరిశ్తాలే ఫరిశ్తాలు తిరుగుతుండటం అందరికీ కనిపిస్తుంది. ఈ సాక్షాత్కారం జరుగనుంది. ఈ ఫరిశ్తాల గుంపు మమ్మల్ని పైకి ఎత్తడానికి ఈ భూమి మీదకు వచ్చింది అని అనుభవం చేసుకుంటారు. ఒకరినొకరు ఫరిశ్తాగానే చూసుకోండి. వీరు ఫలానా, వీరు ఫలానా, ఇలా కాదు, ఫరిశ్తా. సరేనా! దాదీల నుండి ఇది నేర్చుకోండి. శుభ భావన, శుభ కామనలను ఇవ్వండి. మీ వద్ద స్టాక్ ఉంది, కానీ ఇవ్వడంలో దాతగా తక్కువగా అవుతారు. నెగిటివ్ చూడకండి, వినకండి, మాట్లాడకండి, ఆలోచించకండి. ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగరండి-ఎగిరించండి. మంచిది, దాదీలు స్టేజీపైకి వస్తే అందరి ముఖాలలో చిరునవ్వు కనిపిస్తుంది. అచ్ఛా.
(దాదీజీ బాబాతో చెప్తున్నారు – బాబా, మీరంటే అందరికీ ఎంతో ప్రేమ) మీరంటే కూడా అందరికీ వేయిరెట్లు ఎక్కువ ప్రేమ ఉంది.
ముగ్గురు పెద్దన్నయ్యలతో:- వీరు దాదీలను ఫాలో చేసేవారు అని పాండవులైన మిమ్మల్ని చూసి అందరికీ అనిపించాలి. ఫాలో బాబానే చేస్తారు కానీ నిమిత్తమైన మీ నుండి ఈ ఫీలింగ్ రావాలి – వీరు మాకు సహయోగాన్ని ఇచ్చేవారు, హృదయపూర్వక స్నేహాన్ని ఇచ్చేవారు. ఎవరైనా నిరాశతో ఉంటే వీరు నాకు సహయోగాన్ని ఇస్తారు అనిపించాలి. ఇప్పుడు ఈ రూపాన్ని ప్రత్యక్షం చేయండి. లోపల ఉంటుంది కానీ ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. సరేనా! అద్భుతం చేస్తారు, పాండవులు తక్కువేమీ కాదు. పాండవుల గాయనము కూడా విశేషంగా ఉంటుంది. తోడుగా ఉన్న పాండవులుగా చూపించారు. శక్తులను మైదానంలో చూపించారు, కానీ పాండవులు తోడుగా ఉండేవారిగా చూపించారు. సహయోగాన్ని ఇచ్చేవారు కూడా మరియు తోడుగా నిలిచేవారు కూడా, బాబాతో పాటు ఉండేవారు మరియు సర్వులకు సహయోగాన్ని ఇచ్చేవారు. సరేనా.
(రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం బాగుందా, సంభాళించుకోండి. (గోలక్ అన్నయ్యతో) అలసట లేకుండా ఉన్నారా లేక అలసిపోతున్నారా? అలజడి జరుగుతుంది కానీ అలజడిని సంతోషం రూపంలో పరివర్తన చేయండి. మాల కదా. నంబర్‌వన్‌కు మరియు లాస్ట్ వారికి తేడా అయితే ఉంటుంది కదా, అందరూ ఒకలా ఉండరు కదా. మంచిది. మంచిగా జరుగుతుంది.
2006 సంవత్సరానికి వీడ్కోలు మరియు 2007కు శుభాకాంక్షలు (రాత్రి 12 గంటల తర్వాత బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు)
అందరికీ నూతన సంవత్సరానికి పదమా పదమాల రెట్లు శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు మనోభిరాముడి మనసు యొక్క ప్రియస్మృతులు కూడా. సదా ఈ నూతన సంవత్సరంలో ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. సర్వాత్మలకు తమ మనసులోని కామనలను పూర్తి చేసే దాత పిల్లలు మాస్టర్ దాతలుగా అయ్యి సుఖము, శాంతి, ప్రేమ, ఆశీర్వాదాలను ఇస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉండండి. అచ్ఛా – వీడ్కోలు మరియు అభినందనల సంగమానికి విశేష ప్రియస్మృతులు. అచ్ఛా!
ఓంశాంతి