Search for a command to run...
20 Feb 2005
హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి
20 February 2005 · తెలుగు
ఈరోజు భాగ్యవిధాత అయిన బాప్‌దాదా తమ పిల్లలందరి మస్తకము మధ్యలో భాగ్య రేఖలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో మెరుస్తున్న దివ్య సితారల యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నాము. నోటిపై శ్రేష్ఠ మధుర వాణి యొక్క రేఖను చూస్తున్నాము. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయములో హృదయాభిరాముడి స్నేహములో లవలీనమై ఉన్న రేఖను చూస్తున్నాము. చేతులపై సదా సర్వ ఖజానాల సంపన్నత యొక్క రేఖను చూస్తున్నాము. పాదాలపై ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నాము. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మొత్తము కల్పములో మరెవ్వరికీ ఉండదు, పిల్లలైన మీకు ఈ సంగమ యుగములో భాగ్యము ప్రాప్తించింది. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆత్మిక నషాను అనుభవము చేస్తున్నారా? హృదయములో స్వతహాగా - వాహ్ నా భాగ్యము! అనే పాట మ్రోగుతుంది. ఈ సంగమ యుగములోని భాగ్యము అవినాశీ భాగ్యముగా అయిపోతుంది. ఎందుకని? అవినాశీ బాబా ద్వారా అవినాశీ భాగ్యము ప్రాప్తించింది. కానీ అది ఈ సంగమములోనే ప్రాప్తిస్తుంది. ఈ సంగమ యుగములోనే అనుభూతి చేస్తారు, విశేషమైన ఈ సంగమయుగ ప్రాప్తి అతి శ్రేష్ఠమైనది. మరి ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము యొక్క అనుభవము సదా ఇమర్జ్ అయ్యి ఉంటుందా లేక అప్పుడప్పుడు మర్జ్ అయ్యి (గుప్తమై), అప్పుడప్పుడు ఇమర్జ్ అయ్యి (ప్రత్యక్షమై) ఉంటుందా? అంతేకాక దీని కోసము చేసిన పురుషార్థము ఏమిటి? ఇంతటి గొప్ప భాగ్యము యొక్క ప్రాప్తి కొరకు పురుషార్థము ఎంత సహజమైనది. కేవలము హృదయపూర్వకముగా తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు ‘‘నా బాబా’’ అని తమవారిగా చేసుకున్నారు. నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అని హృదయపూర్వకముగా గుర్తించారు. నా వారు అని అంగీకరించటము అనగా అధికారిగా అయిపోవడము. అధికారము కూడా ఎంత పెద్దది! ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా ఏమేమి లభించాయి అని అడిగితే, అప్పుడు ఏమంటారు? పొందాల్సినదేదైతే ఉందో అది పొందేసాము. పరమాత్ముని ఖజానాలో అప్రాప్తి అనే వస్తువు ఏదీ ఉండదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవము చేసారా లేక చేస్తూ ఉన్నారా? భవిష్యత్తు విషయము వేరు, ఈ సంగమయుగములోని ప్రాప్తి స్వరూపముదే అనుభవము ఉంటుంది. ఒకవేళ సంగమయుగములో అనుభవము చేయకపోతే భవిష్యత్తులో కూడా అనుభవము అవ్వదు. ఎందుకని? భవిష్యత్తు ప్రారబ్ధము, కానీ ఆ ప్రారబ్ధము ఈ పురుషార్థము యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా తయారవుతుంది. చివరిలో అనుభవ స్వరూపులుగా అయిపోతాము అని కాదు. సంగమయుగములో బహుకాలము ఈ అనుభవము ఉండాలి. జీవన్ముక్తి యొక్క విశేష అనుభవము ఈ సమయానిదే. నిశ్చింత చక్రవర్తులుగా అయ్యే అనుభవము ఇప్పుడే ఉంది. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులేనా లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయ్యారా లేక అవుతూ ఉన్నారా? అయ్యారు కదా! ఏ చింత ఉంది? దాత పిల్లలుగా అయిన తర్వాత ఇక ఏ చింత మిగిలి ఉంది? నా బాబా అని అంగీకరించారు మరియు చింత యొక్క అనేక గంపల భారము దిగిపోయింది. ఏదైనా భారము ఉందా? ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ ఆటను కూడా చూస్తారు కానీ నిశ్చింత చక్రవర్తులై, సాక్షిగా అయి ఆటను చూస్తారు. ప్రపంచములోనివారైతే - ఏం జరుగుతుందో ఏమో తెలియదు అని భయపడతారు! మీకు భయము ఉందా? భయపడతారా? ఏమి జరిగినా అది చాలా, చాలా మంచిగానే జరుగుతుంది అన్న నిశ్చయము ఉంది మరియు అది నిశ్చితము. ఎందుకని? త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈ రోజు ఏమిటి, రేపు ఏమి జరుగనున్నది, దీనిని బాగా తెలుసుకున్నారు, మీరు నాలెడ్జ్‌ఫుల్ కదా! సంగమము తర్వాత ఏమి జరుగనున్నది, అది మీ అందరి ఎదురుగా స్పష్టముగా ఉంది కదా! నవ యుగము వచ్చేదే ఉంది. ప్రపంచములోని వారు - ‘వస్తుందా?’ అని అంటారు, వారికి ‘వస్తుందా’ అన్న ప్రశ్న ఉంది. మరి మీరేమంటారు? తప్పకుండా వచ్చి తీరుతుంది అని అంటారు. అందుకే ఏమి జరుగుతుంది అనే ప్రశ్నే లేదు. స్వర్ణ యుగము వచ్చేదే ఉంది అన్నది తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు సంగమము ప్రభాత సమయము, అమృతవేళ, అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే. నిశ్చయము ఎవరికైతే ఉంటుందో, వారు నిశ్చింతగా ఉంటారు, ఏ చింత ఉండదు, నిశ్చింతగా ఉంటారు. విశ్వ రచయిత ద్వారా రచన గురించిన స్పష్టమైన జ్ఞానము లభించేసింది.
పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కము యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు అన్నదానిని బాప్‌దాదా చూస్తున్నారు. బాప్‌దాదా స్నేహి పిల్లలకు, సహయోగి పిల్లలకు, సంపర్కములోని పిల్లలందరికీ తమ అధికారము తీసుకునేందుకు తమ ఇంటికి చేరుకున్నందుకు అభినందనలను తెలుపుతున్నాము. అభినందనలు, అభినందనలు. బాప్‌దాదాకు పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉందా లేక పిల్లలకు బాప్‌దాదా పట్ల ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరి ప్రేమ ఎక్కువ? మీదా లేక బాబాదా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబా అంటారు. చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కావుననే ఎక్కడెక్కడి నుండో చేరుకున్నారు కదా! ఎన్ని దేశాల నుండి వచ్చారు? (50 దేశాల నుండి) 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే ఎక్కువ దూరము నుండి ఎవరు వచ్చారు? అమెరికావారు దూరము నుండి వచ్చారా? మీరు కూడా దూరము నుండి వచ్చారు కానీ బాప్‌దాదా అయితే పరంధామము నుండి వచ్చారు. దానితో పోలిస్తే అమెరికా ఎంత! అమెరికా దూరమా లేక పరంధామము దూరమా? అందరికంటే దూరదేశి అయినవారు బాప్‌దాదా. పిల్లలు గుర్తు చేస్తారు మరియు బాబా హాజరైపోతారు.
ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? బాబా ఏమి కోరుకుంటారు అని అడుగుతారు కదా. మరి బాప్‌దాదా మధురాతి మధురమైన పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - ఒక్కొక్క బిడ్డ స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి. అందరూ రాజులే కదా? స్వరాజ్యము ఉందా? స్వయముపై రాజ్యమైతే ఉంది కదా! స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. దుఃఖము, అశాంతి నుండి దూరం అవ్వాలని 63 జన్మలు చాలా శ్రమ చేసారు అని బాప్‌దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. కావున బాబా ఏమి కోరుకుంటున్నారంటే, ప్రతి బిడ్డ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వాలి, మనసు-బుద్ధి-సంస్కారాలకు యజమానిగా అవ్వాలి, రాజుగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, మనసు-బుద్ధి-సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ ఫ్రీ జీవితము యొక్క అనుభవము సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి. కానీ అది అప్పుడప్పుడు మర్జ్ కూడా అయిపోతోంది అనేది బాప్‌దాదా చూస్తున్నారు. ఇది చెయ్యకూడదు, ఇది ఒప్పు, అది తప్పు అని ఆలోచిస్తారు. ఆలోచిస్తారు కానీ స్వరూపములోకి తీసుకురారు. ఆలోచించడము అనగా మర్జ్ అయి ఉండడము, స్వరూపములోకి తీసుకురావడము అనగా ఇమర్జ్ అవ్వడము. సమయము కొరకైతే ఎదురుచూడడం లేదు కదా! అప్పుడప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, అప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే - సమయము వచ్చినప్పుడు బాగైపోతాములే. కానీ సమయమనేది మీ రచన. మీరు మాస్టర్ రచయిత కదా! మరి మాస్టర్ రచయిత, రచన యొక్క ఆధారముపై నడవరు. సమయము యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపముగా తీసుకురావాలి.
ఒక్క క్షణములో మనసుకు యజమానిగా అయ్యి మనసును ఆర్డర్ చేయగలరా? చేయగలరా? మనసును ఏకాగ్రము చేయగలరా? ఫుల్స్టాప్ పెట్టగలరా లేక పెట్టడమేమో ఫుల్స్టాప్ పెడతారు కానీ అక్కడ ప్రశ్నార్థకము పడుతుందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేంటి, అదేంటి, ఆశ్చర్యార్థకము కూడా పెట్టకూడదు. ఫుల్స్టాప్, క్షణములో పాయింట్ (బిందువు) అయిపోండి. ఇంకే శ్రమ లేదు, ఒక్క పదాన్ని కేవలం అభ్యాసములోకి తీసుకురండి ‘‘పాయింట్’’. పాయింట్ (బిందు) స్వరూపముగా అవ్వాలి, వ్యర్థానికి పాయింట్ (బిందువు) పెట్టాలి మరియు మహావాక్యాలు ఏవైతే వింటారో, ఆ పాయింట్లపై మననము చెయ్యాలి, వేరే ఏ కష్టమూ లేదు. పాయింట్లు గుర్తు పెట్టుకోండి, ఫుల్స్టాప్ పెట్టండి, బిందువుగా అవ్వండి. ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మధ్య-మధ్యలో చేయండి, ఎంత బిజీగా ఉన్నా కానీ ఇది ప్రయత్నించండి, ఒక్క క్షణములో పాయింట్‌గా అవ్వగలరా? ఒక్క క్షణములో పాయింటు పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసము పదే-పదే జరుగుతుందో, అప్పుడే రాబోయే అంతిమ సమయములో ఫుల్ పాయింట్లు తీసుకోగలరు. పాస్ విత్ ఆనర్లుగా (గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా) అవుతారు. ఇదే పరమాత్ముని చదువు, ఇదే పరమాత్ముని పాలన.
మరి ఎవరైతే వచ్చారో, మొదటిసారి వచ్చినవారు కావచ్చు, మొదటిసారి మిలనాన్ని జరుపుకునేందుకు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది వచ్చారు. వెల్కమ్. ఏ విధంగా ఇప్పుడు మొదటిసారి వచ్చారు కదా, అలా మొదటి నంబరు కూడా తీసుకోవాలి. ఛాన్స్ ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మా కంటే ముందున్నవారు ఎంతోమంది ఉన్నారు అని మీరు ఆలోచిస్తారు, కానీ డ్రామాలో నిశ్చితమై ఉన్న అవకాశము ఏమిటంటే - చివరిలో వచ్చినా వేగముగా వెళ్ళగలరు మరియు వేగముగా వెళ్ళి మొదటి నంబరును తీసుకోగలరు. ఛాన్స్ ఉంది మరియు ఛాన్స్ తీసుకునేవారిని బాప్‌దాదా ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్‌గా అవ్వండి. ఛాన్సలర్‌గా అవ్వాలా? ఛాన్సలర్‌గా అవ్వాలా? ఛాన్సలర్‌గా అవుతాము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఛాన్సలర్‌గా అవుతారా? వాహ్! అభినందనలు. బాప్‌దాదా చూసారు, ఇక్కడకు ఎవరైతే వచ్చారో వారందరూ చేతులెత్తుతున్నారు, మెజారిటీ ఎత్తుతున్నారు, అభినందనలు, అభినందనలు. వచ్చినటువంటి మధురాతి-మధురమైన, ప్రియాతి-ప్రియమైన పిల్లలైన మీ అందరినీ బాప్‌దాదా విశేషంగా గుర్తు చేసుకున్నారు, ఎందుకు గుర్తు చేసుకున్నారు? (ఈ రోజు సభలో దేశ-విదేశాలకు చెందిన చాలామంది వి.ఐ.పి.లు కూర్చుని ఉన్నారు) ఆహ్వానము ఎందుకు ఇచ్చారు? తెలుసా? చూడండి, ఆహ్వానమైతే ఎంతోమందికి లభించింది, కానీ మీరే చేరుకున్నారు. బాప్‌దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - ఎవరైతే వచ్చారో వారు స్నేహి, సహయోగి నుండి సహజయోగిగా అయ్యే క్వాలిటీ కలవారు. ఒకవేళ ధైర్యము పెట్టినట్లయితే మీరు సహజయోగులుగా అయ్యి, ఇతరుల కొరకు కూడా సహజయోగము యొక్క మెసెంజర్లుగా అయ్యి మెసేజ్‌ను ఇవ్వగలరు. మెసేజ్ ఇవ్వడము అనగా ఈశ్వరీయ మెసెంజర్లుగా అవ్వడము, ఆత్మలను దుఃఖము, అశాంతుల నుండి విడిపించడము. ఎంతైనా వారు మీ సోదరీ-సోదరులే కదా! కనుక మీ సోదరులకు లేక సోదరీలకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడము అనగా విముక్తులుగా చేయడము. ఇందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మనైనా దుఃఖము, అశాంతి నుండి విడిపించినందుకు ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు లభించటము ద్వారా అతీంద్రియ సుఖము, ఆంతరిక సంతోషము యొక్క ఫీలింగ్ ఎంతగానో కలుగుతుంది. ఎందుకని? ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా, సంతోషాన్ని పంచటము వలన సంతోషము పెరుగుతుంది. అందరూ సంతోషముగా ఉన్నారా? విశేషముగా బాప్‌దాదా అతిథులను కాదు, అధికారులను అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు అతిథిగా భావించకండి, మీరు అధికారులు. మరి అందరూ సంతోషముగా ఉన్నారా? అయితే, వచ్చిన మీ అందరినీ అడుగుతున్నాము, అనటానికి అతిథులు అని అంటారు కానీ మీరు అతిథులు కారు, మీరు మహానులుగా అయ్యి మహానులుగా తయారుచేసేవారు. మరి సంతోషముగా ఉన్నామా అని ప్రశ్నించుకోండి. సంతోషముగా ఉన్నట్లయితే చేతులు ఊపండి. అందరూ సంతోషముగా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి ఏమి చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా! అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది, సరేనా. అచ్ఛా - బాగా చప్పట్లు కొట్టండి. (అందరూ బాగా చప్పట్లు కొట్టారు) ఏ విధంగా ఇప్పుడు చప్పట్లు కొట్టారో, అలా సదా సంతోషపు చప్పట్లు ఆటోమేటిక్‌గా మ్రోగుతూ ఉండాలి. అచ్ఛా.
సేవ టర్న్ భోపాల్ జోన్ వారిది:- భోపాల్ వారు లేవండి. సేవ ఛాన్స్‌ను తీసుకుని కదమ్‌లో అనగా అడుగు అడుగులో ఎన్ని పదమాలను జమ చేసుకున్నారు? జమ చేసుకున్నారా? ఎందుకంటే ఇక్కడైతే సేవ మరియు యజ్ఞ పిత యొక్క స్మృతి ఉంటుంది. యజ్ఞ సేవ చేస్తున్నప్పుడు యజ్ఞ పిత యొక్క స్మృతి స్వతహాగా వస్తుంది. ఇక్కడ ఏమి చేసారు? రెండు పనులు ఉన్నాయి కదా, అంతే, ఇంక వేరే పనులేమీ లేవు. బాబాను గుర్తు చేయడము మరియు సేవ చేయడము, ఇంకేమైనా డ్యూటీ ఉండిందా? ఇవే కదా! సేవ చేయడం అంటే శక్తిశాలి మేవాను తినడము. మరి చాలా బాగా సేవను చేసారు, మీ కోసం కూడా దీవెనలను జమ చేసుకున్నారు మరియు ఇతరులకు కూడా సౌకర్యాన్ని ఇచ్చారు అనగా బాబా స్మృతిని కలిగించారు. మంచి గోల్డెన్ ఛాన్స్‌ను తీసుకున్నారు, ఇక్కడ జమ చేసుకున్నది అక్కడకు వెళ్ళి స్వయం కోసం పెంచండి మరియు ఇతరులకు పంచండి. మంచిది. ఇందులో ఉన్న టీచర్లు చేతులెత్తండి.
బాప్‌దాదా సదా టీచర్లకు చెప్తుంటారు, టీచర్స్ అనగా వారి ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ కనిపించాలి (లక్షణాల ద్వారా భవిష్యత్తు కనిపించాలి). అటువంటి టీచర్లే కదా! మిమ్మల్ని చూసి స్వర్గ సుఖము యొక్క ఫీలింగ్ కలగాలి, శాంతి యొక్క అనుభూతి కలగాలి. నడుస్తూ-తిరుగుతున్న ఫరిశ్తాలుగా కనిపించాలి. అటువంటి టీచర్లే కదా! మంచిది, ప్రవృత్తిలో ఉన్నవారైనా, సేవకు నిమిత్తముగా ఉన్నవారైనా, అందరూ బాప్‌దాదా సమానముగా అయ్యే నిశ్చయబుద్ధి విజయులు. అచ్ఛా.
మీడియా వింగ్:- (బ్యానర్ చూపిస్తున్నారు – ‘‘విలువల ఆధారిత మీడియా, సత్యత, నిర్భయత, దివ్యత, పరమాత్మ ప్రత్యక్షత’’) మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు, మీడియా అంటే బాప్‌దాదా యొక్క ప్రత్యక్షతా ధ్వనిని వ్యాప్తి చేసేవారు, ప్రత్యక్షతకు విశేషమైన సాధనము మీడియా ఎందుకంటే మీ ధ్వని ఇంకా అందరికీ చేరుకోలేదు అని అంటుంటారు. మీడియా ఎటువంటి సాధనము అంటే దీని ద్వారా నలు వైపులకు ధ్వని వెళ్ళగలదు. ఇప్పుడు కొంచెం కొంచెం ధ్వని వ్యాప్తి చేసారు, ఇప్పుడు మీడియాలోని ప్రతి సాధనము వారు మాకు ఏదైనా సేవ ఇవ్వండి అని తామే స్వయాన్ని ఆఫర్ చేసుకునేలా వాయుమండలాన్ని తయారు చేయండి. కనెక్షన్ అయితే పెట్టుకుంటున్నారు కానీ కనెక్షన్ వారిని రిలేషన్ వారిగా తయారు చేసుకోండి, దీనితో మా బాధ్యత కూడా ఉంది అని వారు భావించాలి. చేస్తున్నారు, చేస్తూ ఉంటారు మరియు తప్పకుండా ధ్వని వ్యాపించవలసిందే. వ్యాప్తి చేసేవారు తెలివైనవారు అయినప్పుడు వ్యాపిస్తుంది కదా! ఆరంభించారు, మంచిగా చేసారు, ఇప్పుడు దీనిని పెంచండి (ఒక కోటి మందికి సందేశం అందాలి అన్నది దాదీగారి కోరిక, మరి ఈ శివ జయంతికి సందేశం అందరికీ చేరాలి, అటువంటి ప్లాన్‌ను తయారు చేసాము, ఇలా ఇంకా కొన్ని ప్లాన్లను బాప్‌దాదాకు వినిపించారు) అభినందనలు. ప్రాక్టికల్‌గా చేసినప్పుడు కానుకను ఇస్తాము, ఇప్పుడు అభినందనలు.
సైంటిస్ట్ – ఇంజినీర్ వింగ్:- (బ్యానర్ చూపించారు – నిమిత్తము, నిర్మానతతో నవ నిర్మాణము, జ్ఞాన విజ్ఞాన జాగృతి సేవ) మంచిగా తయారు చేసారు. సైంటిస్ట్ ఇంజినీర్ డిపార్టుమెంట్ వారు ఇప్పుడు ఎలా చేయాలంటే సైలెన్స్ శక్తి సైన్స్ శక్తిని కూడా రిఫైన్ చేయగలదు, ప్రగతిలోకి తీసుకువెళ్ళగలదు అన్నది ప్రజలకు తెలియాలి. సైన్స్ మరియు సైలెన్స్ మిలనము ఏమేమి చేయగలదు అన్నదాని గురించి విశేషమైన పాయింట్లను తయారు చేయండి, ఆ తర్వాత ఆ పాయింట్లను అందరికీ చేర్చండి. సైలెన్స్ మాకు ఏ విధంగా సహాయపడగలదు, ఎటువంటి ఉన్నతి జరగగలదు అన్న విషయం సైన్స్ వారికి తెలియాలి, ఇటువంటి అనుభవాన్ని స్వయం కూడా చేయండి మరియు చేయించండి. బాగుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ప్రతి వర్గం వారు పని చేస్తున్నారు. మననం చేయడం ప్రారంభించారు, ఇప్పుడు మననం నుండి వెన్న తీయండి. ఏదైనా ఒక విశేషమైన అనుభవాన్ని వారి ముందు పెట్టండి ఎందుకంటే ఈరోజుల్లో ప్రాక్టికల్ అనుభవం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాపిక్‌పై ప్రసంగం చేస్తారు కానీ ప్రసంగంలో కూడా విశేషంగా ప్రాక్టికల్ అనుభవాన్ని వినిపించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇకపోతే మంచిగా చేస్తున్నారు, బాగుంది, ఇది కూడా ఛాన్స్ లభిస్తుంది, విధి మంచిగా తయారు చేసారు. అచ్ఛా – అభినందనలు, చేసారు, అందుకు కూడా అభినందనలు, ఇకముందు కూడా చేస్తారు, ఇందుకు ఇన్‌అడ్వాన్స్ అభినందనలు. (ఈ వింగ్ వారు ముఖ్యంగా రెండు గుణాల ధారణను విశేషంగా పెట్టుకున్నారు – నిమిత్త భావము మరియు నిర్మానము) చాలా బాగా పెట్టుకున్నారు, చేస్తూ ఉండండి మరియు లక్ష్యాన్ని పక్కాగా పెట్టుకోండి.
ప్రశాసక వర్గము:- మీరు కూడా మంచి ప్లాన్‌ను తయారు చేసారు, చేస్తూ ఉంటారు. బాగుంది, ఒకవేళ ప్రశాసకులు పరివర్తన అయితే అందరూ పరివర్తన అయిపోతారు ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అని అంటారు కదా. ఒకవేళ ఇప్పుడు అన్ని వైపుల ఉన్న ప్రశాసకులు తమ జీవితంలో పరివర్తన తీసుకువస్తే వారు ఇతరుల పరివర్తనకు కూడా నిమిత్తం కాగలరు, ఎందుకంటే ప్రతి దేశంలో ప్రశాసన చేసే వారైతే ఉండనే ఉంటారు. ప్రతి దేశంలో విశేషంగా వారికి పరివర్తన యొక్క సందేశాన్ని ఇచ్చి ఇతరులనూ పరివర్తన చేసే యోగ్యులుగా తయారు చేయండి. ఇకపోతే మంచిగా సేవను చేస్తున్నారు, చాలామందికి లాభాన్ని ఇవ్వగలరు. ఒక్కరు అనేకులకు నిమిత్తంగా అవ్వవచ్చు, చేస్తున్నారు, ఇంకా, ఇంకా కూడా తీవ్రగతితో పరివర్తన యొక్క ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురండి, ఈ వర్గం యొక్క ఆవశ్యకత ఉంది. అందరి దృష్టి ఈరోజు ఈ వర్గంపైనే ఉంది. మరి నిమిత్తంగా అయ్యారు, నిర్మాణం చేస్తారు. అచ్ఛా.
డబల్ విదేశీయులతో:- డబల్ విదేశీయులు విశ్వంలోని మూలమూలలో సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని చాలా బాగా చేస్తున్నారు. 50 దేశాల నుండి వచ్చారని బాప్‌దాదా విన్నారు. అంటే 50 దేశాలలో సందేశవాహకులు కూర్చుని ఉన్నారు. సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ప్లాన్ కూడా బాగా చేస్తున్నారు. ఎక్కడైతే సందేశం అందలేదో అక్కడ నిమిత్తంగా అవ్వవలసిందే. చేస్తున్నారు కదా, ఇది కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంటుంది, ఇప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. ఎక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. డబల్ విదేశీయులు ఎవరు? సఫలతా సితారలు. అంతే కదా! సఫలతా సితారలు. బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరి మనసు యొక్క ధ్వని బాప్‌దాదాకు చేరుకుంటూ ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. సఫలత జరగవలసిందే. మీ పాదాలలో, మెడలో సఫలత ఉండనే ఉంది. మీ అందరినీ చూసి అందరూ సంతోషిస్తారు. డబల్ విదేశీయులు తప్పకుండా ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తారు. గారాల పిల్లలు అయిపోయారు కదా! చాలా బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. ఎగురుతూ ఉన్నారు, ఎగిరిస్తూ ఉంటారు. టీచర్లు అందరూ చాలా ఉల్లాసంలో ఉన్నారు కదా! చూడండి, మీ ఉల్లాస-ఉత్సాహాలతో ఈ మహాన్ అధికారి ఆత్మలు కూడా చేరుకున్నారు. మంచి గ్రూప్‌ను తీసుకు వచ్చారు. ఎవరైతే తీసుకువచ్చారో వారికి అభినందనలు. మంచి క్వాలిటీ వారిని తీసుకువచ్చారు. ఇప్పుడు తప్పకుండా మరింత ధ్వని వ్యాపిస్తుంది. అచ్ఛా, అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
నలువైపులా ఉన్నవారు, సాకార రూపములో ఎదురుగా ఉన్నా లేక దూరంగా కూర్చుని కూడా మనసుకు సమీపముగా ఉన్నవారు, ఇటువంటి సదా శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలకు, సదా నిమిత్తులుగా అయ్యి నిర్మాణ కార్యాన్ని సఫలము చేసే విశేష ఆత్మలకు, సదా బాబా సమానముగా అయ్యే ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు, సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే ప్రపంచములోకెల్లా చాలా-చాలా పదమాల రెట్ల ధనవంతులకు, నిండుగా ఉన్న ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీ మరియు దాదీ జానకితో:- మీరు (దాదీ) రూప్ అయితే వీరు (దాదీ జానకి) బసంత్. మీరు దృష్టితోటే పని చేసేస్తారు. ఇలా చేయి పైన పెట్టి నాట్యం చేస్తారు కదా. బాగుంది. (అందరినీ తేలిక చేసేస్తారు) మంచిది, మీ తోటివారు కూడా బాగున్నారు కదా. మంచిది, వాయుమండలాన్ని తయారు చేయడం, ఇది కూడా చాలా పెద్ద సేవ. ఆది రత్నాలైన మీ ద్వారా వాయుమండలం తయారవుతుంది. మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ వాయుమండలాన్ని తయారు చేసేవారు మీరు. బాగుంది, (మున్ని అక్కయ్యతో) బిజీగా ఉంటారు, బిజీగా పెట్టడంలో కూడా తెలివైనవారు. (నీలూ అక్కయ్యతో) చాలా మంచిగా పాత్రను పోషిస్తున్నారు. (ఈషూ దాదీతో) వీరు గుప్తంగా ఉంటారు కానీ వైబ్రేషన్లు బాగా తయారు చేస్తారు) చాలా బాగుంది. (నిర్మల్శాంత దాదీతో) మీరైతే ప్రకృతిజీత్గా అయిపోయారు. ఇప్పుడు ప్రకృతికి వశం కాదు, ప్రకృతిజీత్. చూడండి, సంగఠనలో ఎంత మంచిగా ఉన్నారో! అందరికన్నా ఫ్రెష్‌గా మీరే ఉన్నారు. అందరికీ చేయి ఊపండి. (రుక్మిణి అక్కయ్యతో) మంచిగా ఉన్నారా, సేవ ప్రేమగా చేస్తారు.
నిమిత్తులైన డబల్ విదేశీ పెద్ద అక్కయ్యలతో:- సేవ యొక్క మంచి ఋజువును ఇస్తున్నారు. దీని ద్వారానే ధ్వని వ్యాపిస్తుంది. అనుభవము వినిపించడము ద్వారా ఇతరులకు కూడా అనుభవము పెరుగుతుంది. కనుక బాప్‌దాదా సంతోషిస్తున్నారు, విదేశీ సేవలో నిమిత్తమైనవారు మంచి ఉల్లాస-ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. దేశము నుండే వెళ్ళారు కానీ విదేశీయుల సేవను ఎలా నిమిత్తమై చేస్తున్నారంటే అక్కడివారే అన్నట్లుగా చేస్తున్నారు. వీరు నా వారు అన్న అనుభూతిని కలిగిస్తున్నారు, అంతేకాక వీరు అన్నివైపులవారు, కేవలం ఒకవైపు వారే కాదు, లండన్‌కు చెందినవారో లేదా అమెరికాకు చెందినవారో కాదు, వీరు అనంతమైన సేవాధారులు అనే అనుభూతిని కలిగిస్తున్నారు. బాధ్యత అయితే మొత్తము విశ్వము యొక్క బాధ్యత ఉంది కదా. కావున బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. చేస్తున్నారు, మున్ముందు ఇంకా చాలా బాగా ఎగురుతూ మరియు ఎగిరేలా చేస్తూ ఉంటారు. అచ్ఛా.
డబల్ విదేశీ అతిథులతో:- బాప్‌దాదా మీ అందరినీ ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకు? ఎందుకంటే మీరు గాడ్లీ మెసంజర్లుగా అవ్వాలి. మెసేజ్ అయితే అర్థం అయింది కదా! మెసేజ్ ఏమిటో గుర్తు తెచ్చుకోండి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉండండి, అంతే. సహజమే కదా. కష్టంగా అనిపించడం లేదు కదా? స్మృతిలో ఉండండి మరియు స్మృతి ఇప్పిస్తూ ఉండండి. చేరుకున్నారు, చాలా మంచి పని చేసారు.
2. స్వయాన్ని తండ్రి అనగా పరమాత్మ ఇచ్చే జన్మ సిద్ధ అధికారానికి అధికారులము అని భావిస్తున్నారా? భావిస్తున్నారా? పూర్తి అధికారాన్ని తీసుకునేవారే కదా. హాఫ్ (సగం) కాదు. మీరు అతిథులు కాదు, మహాన్‌గా అయ్యి మహాన్‌గా తయారు చేసేవారు. సంతోషం ఉంది కదా! సంతోషంగా ఉన్నారా? ఎవర్హ్యాపీ? ఇప్పుడిక ఎవర్హ్యాపీగానే ఉండండి, సంతోషాన్ని పోగొట్టుకోకండి. సదా చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వుతో ఉండటం మంచిదే కదా. ఓ.కే, ఎవర్హ్యాపీ గ్రూప్, వెరీ గుడ్. చాలా మంచిది.
3. అందరూ హోలీ మరియు హ్యాపీ హంసలు. హంస పని ఏమిటి? హంసలో నిర్ణయ శక్తి చాలా ఉంటుంది. కావున మీరు కూడా హోలీ, హ్యాపీ (పవిత్రమైన, సంతోషకరమైన) హంసలు, వ్యర్థాన్ని సమాప్తము చేసేవారు మరియు సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారుచేసేవారు. అందరూ ఎవర్హ్యాపీనేనా (సదా సంతోషముగా ఉండేవారేనా)? ఎవర్-ఎవర్ హ్యాపీ (సదా సదా సంతోషముగా ఉండేవారు). ఇప్పుడు ఇక ఎప్పుడూ దుఃఖాన్ని రానివ్వకండి. దుఃఖానికి విడాకులు ఇచ్చేసారు, అప్పుడే కదా ఇతరుల దుఃఖాన్ని నివారించగలరు! కావున సుఖంగా ఉండాలి మరియు సుఖము ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా! ఇక్కడి నుండి ఏ సుఖమైతే లభించిందో దానిని జమ చేసుకుని ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే - బాబా, మధురమైన బాబా, దుఃఖాన్ని తీసేసుకోండి అని అనండి, మీ వద్ద ఉంచుకోకండి. చెడు వస్తువు ఏదైనా ఉంచుకోవడం జరుగుతుందా ఏమిటి? మరి దుఃఖము అనేది చెడు వస్తువే కదా! కనుక దుఃఖాన్ని తీసేసెయ్యండి, సుఖంగా ఉండండి. మరి ఇది సుఖంగా ఉండే గ్రూపు మరియు సుఖాన్ని ఇచ్చే గ్రూపు. నడుస్తూ-తిరుగుతూ సుఖాన్ని ఇస్తూ ఉండండి. మీకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఈ గ్రూపు ఆశీర్వాదాలకు యోగ్యమైన గ్రూపు. మరి అందరూ సంతోషముగా ఉన్నారు కదా! ఇప్పుడు చిరునవ్వు నవ్వండి. అంతే, చిరునవ్వుతోనే ఉండండి. సంతోషములో నాట్యము చెయ్యండి.
సేవ చేసిన ముఖ్యమైన డబల్ విదేశీ సోదరసోదరీలు:- అందరూ చాలా బాగా సేవను చేసారు, అందుకు చాలా-చాలా అభినందనలు. ఇలాగే సేవ చేస్తూ ఉండండి. మంచి గ్రూప్.
(ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాము) బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు. మంచిగా అందరికీ మహావాక్యాలు లభిస్తాయి, మహాన్‌గా అయిపోతారు. ఇందులో ఒక గారడీని నింపేయండి, ఎవరు పుస్తకం తెరిచినా గారడీ జరిగిపోవాలి. సంతోషంతో నాట్యం చేసేయాలి. బాగా కష్టపడుతున్నారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఆఫ్రికా యొక్క ముఖ్యమైన సోదరసోదరీలు అక్కడి సేవా సమాచారాన్ని వినిపించారు:- చాలా మంచిది. బాప్‌దాదా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్లాన్ చాలా బాగుంది. అభినందనలు. అచ్ఛా, వీరు నిమిత్తమయ్యారు, ఇద్దరూ మంచిగా నిమిత్తమయ్యారు. ఇంతమంది కళ్యాణం చేసారు, ఇది కూడా చాలా పెద్ద పుణ్యము. పుణ్యాత్మగా అయ్యారు. మీ తోటి ఉండే ఇద్దరూ మంచిగా ఉన్నారు. చాలా బాగుంది. (వేదాంతి అక్కయ్యతో) వీరు కూడా మంచిగా సహయోగాన్ని ఇస్తున్నారు. (జయంతి అక్కయ్యతో) వీరు వెన్నెముక. అచ్ఛా!
ఓంశాంతి