Search for a command to run...
3 Mar 2007
పరమాత్మ సాంగత్యములో జ్ఞానమనే గులాల్, గుణాలు మరియు శక్తులనే రంగును వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటము
3 March 2007 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా చాలా అదృష్టవంతులు మరియు చాలా పవిత్రులు అయిన తమ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచములోనివారైతే ఏ ఉత్సవమునైనా కేవలము జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు కేవలము జరుపుకోరు, జరుపుకోవటము అనగా తయారవ్వటము. కనుక మీరు హోలీగా అనగా పవిత్ర ఆత్మలుగా అయిపోయారు. మీరందరూ ఎటువంటి ఆత్మలు? హోలీ అనగా మహా పవిత్ర ఆత్మలు. ప్రపంచములోనివారైతే శరీరానికి స్థూలమైన రంగును పూసుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మకు ఎటువంటి రంగును వేస్తారు? అన్నిటికంటే అతి మంచి రంగు ఏది? అవినాశి రంగు ఏది? మీరందరు పరమాత్మ సాంగత్యమనే రంగుని ఆత్మకు అంటించుకున్నారు, దీనివలన ఆత్మ పవిత్రతా రంగులో రంగరించబడింది అని మీకు తెలుసు. పరమాత్మ సాంగత్యము అనే ఈ రంగు ఎంతటి గొప్పది మరియు ఎంతటి సహజమైనది! పరమాత్మ సాంగత్యము యొక్క మహత్వము ఇప్పుడు అంతిమంలో కూడా సత్సంగము యొక్క మహత్వముగా ఉంది. సత్సంగము అన్నదాని అర్థమే పరమాత్మ సాంగత్యములో ఉండటము, ఇది అన్నిటికంటే సహజమైనది మరియు ఉన్నతోన్నతమైనది, ఇటువంటి సాంగత్యములో ఉండటము కష్టమా? ఈ సాంగత్యమనే రంగులో ఉండటం వలన పరమాత్మ ఏవిధంగా ఉన్నతోన్నతమైనవారో పిల్లలైన మీరు కూడా అలా ఉన్నతోన్నతమైన పవిత్ర మహానాత్మలుగా, పూజ్య ఆత్మలుగా అయ్యారు. ఈ అవినాశీ సాంగత్యపు రంగు ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా! ప్రపంచములోనివారు ఎంత ప్రయత్నం చేస్తారు, పరమాత్మ సాంగత్యము సంగతి వదిలేయండి కానీ కేవలము వారిని గుర్తు చేయడానికి కూడా ఎంత కష్టపడ్తారు! కానీ మీరు బాబాను తెలుసుకున్నారు మనస్ఫూర్తిగా మేరా బాబా(నా బాబా) అని అన్నారు. బాబా కూడా మేరే బచ్చే(నా పిల్లలు) అని అన్నారు, అంతే రంగు అంటుకుంది. బాబా ఏ రంగుని వేసారు? జ్ఞానమనే గులాల్ (పరిమళపు పొడి)ని వేసారు, గుణాల రంగును వేసారు, శక్తుల రంగును వేసారు, ఈ రంగు ద్వారా మీరు దేవతలుగా అయిపోయారు, ఇప్పుడు కలియుగ అంతిమము వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతున్నాయి. పవిత్ర ఆత్మలుగా చాలామంది అవుతారు, మహానాత్మలుగా చాలామంది అవుతారు, ధర్మాత్మలుగా కూడా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత, దేవ ఆత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు ఆత్మతోపాటుగా శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. ఇంతటి శ్రేష్ఠ పవిత్రత కలవారిగా ఎలా అయ్యారు? కేవలము సాంగత్యమనే రంగు వలన అయ్యారు, పరమాత్మ ఎక్కడ ఉంటారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే దానికి సమాధానం మీరు వెంటనే చెప్తారు. పరంధామములో అయితే తప్పకుండా ఉన్నారు కానీ ఇప్పుడు సంగమయుగములో పరమాత్మ మీతోటి ఎక్కడ ఉంటారు? మీరు ఏమని జవాబిస్తారు? పరమాత్మకైతే ఇప్పుడు పవిత్ర ఆత్మలమైన మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అని అంటారు. అలానే చెప్తారు కదా? మీ మనసులో బాబా ఉంటారు, మీరు బాబా మనసులో ఉంటారు. ఎవరైతే ఉంటారో వారు చేతులెత్తండి. ఉంటారా? (అందరూ చేతులెత్తారు) మంచిది. చాలా మంచిది. పరమాత్మకు నా మనసులో తప్ప మరెక్కడా మంచిగా అనిపించదు అని వెంటనే చెప్తారు, ఎందుకంటే కంబైండ్‌గా ఉంటారు కదా! కంబైండ్‌గా ఉంటారా? చాలామంది పిల్లలు కంబైండ్‌గా ఉంటాము అని చెప్తూ కూడా సదా బాబా కంపనీ(తోడు) నుండి లాభాన్ని పొందరు. కంపానియన్‌గా(సహచరుడిగా) అయితే చేసుకున్నారు, ఇది పక్కా. మేరా బాబా అని అంటూ కంపానియన్‌గా అయితే చేసేసుకున్నారు , కానీ ప్రతి సమయము ఆ కంపనీని అనుభవము చెయ్యటము, ఇందులో తేడా వచ్చేస్తుంది. ఈ విషయంలో నంబరువారీగా లాభాన్ని పొందుతారు అన్నదానిని బాప్‌దాదా చూస్తారు. కారణమేంటి? కారణం మీ అందరికీ బాగా తెలుసు.
బాప్‌దాదా ముందు కూడా వినిపించారు, ఒకవేళ మనసులో రావణునికి చెందిన ఏ పాత సంపద అయినా పాత సంస్కారాల రూపంలో ఉండిపోయినట్లయితే రావణునికి చెందిన వస్తువు అంటే అది పరాయి వస్తువు కదా! పరాయివాళ్ళ వస్తువును ఎప్పుడూ కూడా తమ వద్ద ఉంచుకోరు. తీసేస్తారు. కానీ బాప్‌దాదా ఏం చూసారంటే, ఆత్మిక సంభాషణలో వింటారు కూడా, పిల్లలు ఏమంటారంటే, బాబా, నేనేం చేసేది, నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు. ఇది మీ సంస్కారమా? నా సంస్కారము అని ఎవరంటారు? ఇది నా పాత సంస్కారము, నా నేచర్ అని ఇలా అనటము రైటేనా? రైటా? రైట్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎవ్వరూ ఎత్తటం లేదు. మరైతే ఎందుకని అలా అంటారు? పొరపాటున అంటారా? మరుజీవులుగా అయిపోయినప్పుడు, ఇప్పుడు మీ అందరి ఇంటి పేరు ఏమిటి? పాత జన్మకు చెందిన ఇంటి పేరా లేక బి. కె. అన్నది ఇంటి పేరా? మీ ఇంటి పేరును ఏమని వ్రాస్తారు? బి. కె. అనా లేక ఫలానా, ఫలానా... అని వ్రాస్తారా? మరుజీవులుగా అయిపోయినప్పుడు మరి పాత సంస్కారాలు నా సంస్కారాలుగా ఎలా అయ్యాయి? పాతవైతే పరాయి సంస్కారాలు అయిపోయాయి, నావైతే కావు కదా! హోలీలో కాలుస్తారు కదా! హోలీలో కాలుస్తారు కూడా మరియు రంగును కూడా వేస్తారు, మరి మీరందరూ ఈ హోలీకి దేనిని కాలుస్తారు? నా సంస్కారము అన్న ఈ మాటను బ్రాహ్మణుల డిక్షనరీ(నిఘంటువు) నుండి తీసెయ్యాలి. జీవితము కూడా ఒక డిక్షనరీ కదా! ఇక ఎప్పుడూ స్వప్నములో కూడా దీని గురించి ఆలోచించకూడదు, సంకల్పంలోకి రావటమనే విషయాన్నే వదిలేయండి, పాత సంస్కారాలను నా సంస్కారాలు అని అనుకోవటము గురించి స్వప్నములో కూడా ఆలోచించకూడదు. ఇప్పుడైతే బాబా సంస్కారము ఏదో అదే మీ సంస్కారము, బాబా సమానంగా అవ్వటము మా లక్ష్యము అని అందరూ అంటారు కదా, మరి మీతో మీరు దృఢ సంకల్పముతో కూడిన ఈ ప్రతిజ్ఞను మీ మనసులో చేసుకున్నారా? పొరపాటున కూడా నాది అనకూడదు. నాది-నాది అంటుంటారు కదా, అప్పుడు పాత సంస్కారాలేవైతే ఉన్నాయో అవి లాభాన్ని పొందుతాయి. నాది అన్నప్పుడు అవి మీ వద్దే కూర్చిండిపోతాయి, బయటకు వెళ్ళను.
బాప్‌దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలని ఆశిస్తారు? అది మీకు తెలుసు, అంగీకరిస్తారు కూడా. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ భృకుటి సింహాసనాధికారులుగా, స్వరాజ్య అధికారులైన రాజా పిల్లలుగా, అధీన పిల్లలు కాదు, రాజా పిల్లలు, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలవారిగా, మాస్టర్ సర్వ శక్తిమంతుల స్వరూపములో చూస్తున్నారు. మీరు మీ రూపాన్ని ఎలా చూసుకుంటున్నారు? ఇలాగే కదా, రాజ్య అధికారులు కదా! అధీనులైతే కారు కదా? మీరందరూ అధీన ఆత్మలను అధికారులుగా తయారుచేసేవారు. మీరందరూ ఆత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి వారిని కూడా అధీనుల నుండి అధికారులుగా తయారుచేసేవారు. మీరందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా?
అందరూ స్నేహమనే విమానములో చేరుకున్నందుకు బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. అందరివద్ద విమానము ఉంది కదా! బాప్‌దాదా ప్రతి బ్రాహ్మణునికి వారు జన్మించినప్పుడే మనసు విమానమును కానుకగా ఇచ్చారు. మరి అందరివద్ద ఈ మనసనే విమానము ఉందా? విమానములో పెట్రోల్ సరిగ్గా ఉందా? రెక్కలు బాగున్నాయా? దానిని స్టార్ట్ చేసేందుకు ఆధారము సరిగ్గా ఉందా? చెక్ చేసుకుంటారా? ఇటువంటి విమానములో మూడు లోకాలకూ క్షణంలో వెళ్ళగలరు. ఒకవేళ ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలనే రెండు రెక్కలు యథార్థంగా ఉన్నట్లయితే ఒక్క క్షణంలో స్టార్ట్ అయిపోగలదు. స్టార్ట్ చేసేందుకు తాళపుచెవి ఏది? మేరా బాబా. మేరా బాబా(నా బాబా) అని అన్నట్లయితే మనసు ఎక్కడకు చేరుకోవాలనుకుంటే అక్కడకు చేరుకోగలదు. అయితే రెండు రెక్కలూ సరిగ్గా ఉండాలి. ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఎందుకని? బాప్‌దాదా యొక్క ప్రమాణము ఉంది, వరదానము ఉంది, ధైర్యముతో మీరు ఒక్క అడుగు వేస్తే బాబా నుండి వెయ్యి అడుగుల సహాయము లభిస్తుంది. ఎటువంటి కఠిన సంస్కారమైనాగానీ ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. కారణమేంటి? సర్వ శక్తిమంతుడైన బాబా సహాయకారిగా ఉన్నారు, కంబైండ్‌గా ఉన్నారు, సదా హాజరై ఉన్నారు. మీరు ధైర్యంతో సర్వ శక్తివంతుడు, కంబైండ్‌గా ఉన్న బాబాపై అధికారాన్ని ఉంచండి, జరగాల్సిందే, బాబా నావారు, నేను బాబా వాడిని అని దృఢంగా ఉండండి, ఈ ధైర్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి, అప్పుడు ఏమవుతుంది? ఎలా చేసేది అన్న ఆలోచన వస్తుంది కదా, ఆ ‘ఎలా’ అన్న మాట మారిపోయి అది ‘ఇలా’ అయిపోతుంది. ఎలా చేసేది, ఏం చెయ్యను అని అనుకోకూడదు, ఇలా జరిగేదే ఉంది అని అనుకోవాలి. అనుకుంటున్నాము, చేస్తున్నాము, అవుతుందా, అవ్వాలి కదా, బాబా సహాయన్ని అయితే ఇస్తారు... జరిగే తీరుతుంది. దృఢ నిశ్చయబుద్ధి కలవారికి సహాయం చేసేందుకు బాబా బంధింపబడి ఉన్నారు. కానీ మీరు కేవలము కాస్త రూపాన్ని మార్చుతారు, బాబాపై హక్కు పెట్టుకుంటారు కానీ రూపాన్ని మార్చేస్తారు. బాబా, మీరైతే సహాయం చేస్తారు కదా! మీరైతే బంధింపబడి ఉన్నారు కదా! ఇలా కదా, కదా అని అంటారు. నిశ్చయబుద్ధి కలవారికి విజయము నిశ్చితమయ్యే ఉంటుంది ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ వారు జన్మించినప్పుడే వారి మస్తకముపై విజయ తిలకాన్ని దిద్దారు. దృఢతను మీ తీవ్ర పురుషార్థమునకు తాళపుచెవిగా చేసుకోండి. చాలా మంచిగా ప్లాన్ చేస్తారు. బాప్‌దాదా ఆత్మిక సంభాషణను వింటున్నప్పుడు, ఆత్మిక సంభాషణనైతే చాలా మంచి ధైర్యంతో చేస్తారు, ప్లాన్లను కూడా చాలా మంచి శక్తిశాలివైనవిగా తయారుచేస్తారు కానీ ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినప్పుడు వాటిని ప్లెయిన్ (స్వచ్ఛమైన) బుద్ధి కలవారిగా అయ్యి చెయ్యరు. వాటిల్లో కొద్దిగా అయితే చేస్తున్నాము, అవ్వాలి, కానీ... ఇలా స్వయములో నిశ్చయముతో కూడిన సంకల్పాలు కాకుండా వ్యర్థ సంకల్పాలను కలిపేస్తారు.
ఇప్పుడు సమయానుసారంగా ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయ్యి సంకల్పాలను సాకార రూపములోకి తీసుకురండి. ఏ కొంచెము బలహీన సంకల్పాలను కూడా లోపల ఉంచుకోకండి. ఈ ఒక్కసారే చెయ్యటం లేదు, అనేకసార్లు చేసినదానిని కేవలము రిపీట్ చేస్తున్నాము అని ఇప్పుడు స్మృతిలో ఉంచుకోండి. కల్పకల్పము ఎన్నిసార్లు విజయులుగా అయ్యాము అన్నదానిని గుర్తు తెచ్చుకోండి. అనేకసార్లు విజయము పొందినవారు, మాకు విజయము అనేక కల్పాల జన్మసిద్ధ అధికారము అన్న ఇటువంటి అధికారముతో నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి దృఢత అనే తాళం చెవిని పెట్టండి. విజయము బ్రాహ్మణ ఆత్మలైన మీవద్దకు కాకుండా మరెక్కడకు పోతుంది! విజయము బ్రాహ్మణ ఆత్మలైన మీకు జన్మసిద్ధ అధికారము, మెడలోని హారము. నషా ఉంది కదా? అవుతుందా, అవ్వదా అని ఇలా అనుకోకూడదు. అయ్యే తీరుతుంది. ఇంతటి నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ప్రతి కార్యమును చెయ్యండి, విజయము నిశ్చితమయ్యే ఉంది. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు మీరు. విజయము తప్పకుండా ఉంటుంది, ఉంటుందా, ఉండదా అని కాదు, తప్పకుండా ఉంటుంది అన్న ఈ నషాను పెట్టుకోండి. ఇటువంటివారిగా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు తరువాత కూడా ఉంటారు. మరి ఇటువంటి పవిత్రులు కదా! హోలీయెస్ట్గా అయితే ఉండనే ఉన్నారు. బాప్‌దాదాతో జ్ఞానమనే గులాల్ (పరిమళపు పొడి)తో ఆడుకున్నారు, ఇప్పుడు ఇంకేం ఆట ఆడ్తారు?
ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇదైపోతుంది అని మెజారిటీవారిలో చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఇందుకు బాప్‌దాదా కూడా చాలా సంతోషిస్తారు కానీ ఈ ఉల్లాస ఉత్సాహాలు ఎల్లప్పుడు ఇమర్జ్ అయ్యి ఉండాలి, కానీ అప్పుడప్పుడు మర్జ్ అయిపోతాయి, అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతాయి. మర్జ్ అవ్వకూడదు(గుప్తమైపోకూడదు), ఇమర్జ్ అయ్యి (ప్రత్యక్షమై) ఉండాలి ఎందుకంటే మొత్తము సంగమయుగమంతా మీ ఉత్సవమే. వారైతే చాలా సమయము టెన్షన్లో ఉంటారు కనుక అప్పుడప్పుడు ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు, ఉత్సాహంగా ఆడుకుంటూ, పాడుకుంటా, తింటూ ఉంటే కాస్త మార్పు ఉంటుంది అని అనుకుంటారు. కానీ మీరైతే ప్రతి క్షణము ఆడుకుంటూ, పాడుకుంటూనే ఉంటుంటారు. మీరు మనసులో ఎల్లప్పుడు సంతోషంలో నాట్యం చేస్తుంటారు కదా! లేక చెయ్యరా! నాట్యం చేస్తారు, సంతోషంలో నాట్యం చెయ్యటం వస్తుంది కదా? నాట్యం చెయ్యటం వస్తుందా? ఎవరికైతే వచ్చో వారు చేతులెత్తండి. నాట్యం చెయ్యటం వస్తుంది, మంచిది. నాట్యం చెయ్యటం వస్తే అభినందనలు. మరి ఎల్లప్పుడు నాట్యం చేస్తుంటారా లేక అప్పుడప్పుడు చేస్తుంటారా?
బాప్‌దాదా ఈ సంవత్సరానికి హోమ్‌వర్క్ ఇచ్చి ఉన్నారు - సమ్‌టైమ్(అప్పుడప్పుడు), సంథింగ్(ఏదో ఒకటి) అన్న ఈ రెండు మాటల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు - ఇది చేసారా? లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అని అంటారా? సమ్‌థింగ్, సమ్‌టైమ్ అనేవి సమాప్తము. ఈ నాట్యంలో అలసిపోయే విషయమే లేదు. పడుకుని ఉన్నా, పని చేసుకుంటున్నా, నడుస్తున్నా, కూర్చుని ఉన్నా సంతోషపు డ్యాన్స్నైతే చెయ్యగలరు మరియు బాబా నుండి లభించిన ప్రాప్తుల గీతాన్ని కూడా పాడగలరు. పాడటం వస్తుంది కదా, ఈ పాటైతే అందరికీ వస్తుంది. నోటి ద్వారా పాడే పాట అయితే కొందరికి వస్తుంది, కొందరికి రాదు కానీ బాబా ఇచ్చిన ప్రాప్తుల, గుణాల పాట అయితే అందరికీ వస్తుంది కదా. కనుక ప్రతి రోజూ ఉత్సవమే, ప్రతి క్షణమూ ఉత్సవమే, అంతే, కనుక సదా ఆడుతూ ఉండండి, పాడుతూ ఉండండి, వేరే పనైతే ఇవ్వనేలేదు. ఈ రెండు పనులే కదా - ఆడండి, పాడండి. ఎంజాయ్ చెయ్యండి. భారాన్ని ఎందుకు పెట్టుకుంటారు? ఎంజాయ్ చెయ్యండి, ఆడండి-పాడండి, అంతే. అచ్ఛా, హోలీనైతే జరుపుకున్నారు కదా! ఇప్పుడు రంగులతో చేసుకునే హోలీని కూడా జరుపుకుంటారా? అచ్ఛా, భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తారు కదా! మీరు భగవంతునితోటి హోలీ ఆడితే భక్తులు కూడా దేవతలైన మీలో ఎవరో ఒకరితో ఆడుకుంటుంటారు. అచ్ఛా.
ఈరోజు చాలామంది పిల్లల నుండి ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి, ఉత్తరాలు కూడా వచ్చాయి, ఫోన్లు కూడా వచ్చాయి. సాధనాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా హోలీకి అభినందనలను పంపారు, మీరు సంకల్పము చేసిన క్షణములోనే బాప్‌దాదా వద్దకైతే చేరిపోతాయి. నలువైపుల ఉన్న పిల్లలు విశేషంగా స్మృతి చేస్తారు మరియు స్మృతి చేసారు కూడా, బాప్‌దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికీ కోటానుకోట్లుగా ఆశీర్వాదాలను మరియు కోటానుకోట్లుగా మనస్ఫూర్వకమైన ప్రియస్మృతులను రిటర్న్‌లో ప్రతి ఒక్కరికీ పేరు సహితంగా, విశేషతా సహితంగా ఇస్తున్నారు. సందేశీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తమవైపు నుండి ప్రియస్మృతులను ఇస్తారు, ఇవ్వనివారు కూడా బాప్‌దాదా వద్దకు చేరుకున్నారు. ఇదే పరమాత్మ ప్రేమ విశేషత. ఈ ఒక్కొక్క రోజు ఎంతటి ప్రియమైనది! గ్రామాలలో ఉన్నా, పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్నాగానీ, సాధనాలు లేకపోయినాకూడా గ్రామాలలోనివారి స్మృతి బాప్‌దాదా వద్దకు చేరుకుంటుంది ఎందుకంటే బాప్‌దాదా వద్ద స్పిరుచ్యువల్(ఆధ్యాత్మిక) సాధనాలైతే చాలానే ఉన్నాయి కదా!
అచ్ఛా – అందరూ దాదీ స్మృతిని చాలా చాలా ఇచ్చారు. దాదీ చాలా త్వరగా మన మధుబన్కు చేరుకోవాలి అన్నదే అందరి సంకల్పము. బాప్‌దాదా కూడా కోరుకుంటున్నారు. దాదీ మాట్లాడటం లేదు కానీ మనసులో సంకల్పంలో మధుబన్ స్మృతి, బ్రాహ్మణుల స్మృతి, తమకున్న బేహద్ సేవా బాధ్యతలు గుర్తున్నాయి. మీరందరూ ప్రేమతో దాదీని చాలా గుర్తు చేస్తున్నారు. బాప్దాదాపై అయితే అందరికీ ప్రేమ ఉంది, అలాగే దాదీపై కూడా తక్కువ ప్రేమ లేదు. ప్రేమతో కూడిన స్మృతి దాదీ వరకు చేరుకుంటుంది. ఇప్పుడు పవర్ఫుల్ మందులు ఇస్తారు కదా, మందులలో కూడా పవర్లో తేడా ఉంటుంది కదా! మీరందరూ స్నేహమనే మందునైతే పంపించారు. ఇప్పుడు అందరూ కలిసి శక్తిశాలి ఆరోగ్య భవ అన్న దృఢ సంకల్ప కిరణాలను పంపండి, ఆ కిరణాలు వాటి పనిని మొదలుపెడతాయి. కొంత సమయమైతే పడుతుంది, కానీ బ్రాహ్మణులందరూ హృదయంతో ఇచ్చే ఈ సహయోగ కిరణాలు తమ పనిని చూపిస్తాయి. అక్కడ గది యొక్క వాయుమండలం కూడా మనసుతో శక్తిశాలి వైబ్రేషన్లు ఉండాలి. ఏమయింది, ఏమి జరుగుతుంది, వద్దు. బాగా జరుగుతుంది, అవ్వవలసిందే, ఈ ఉల్లాస ఉత్సాహాల వాయుమండలం ఇంత శక్తిశాలిగా ఉండాలి. సర్వ బ్రాహ్మణులు, ఏ సేవలో ఉన్నవారైనా కావచ్చు, మీ అందరి హృదయపూర్వక ప్రేమ వైబ్రేషన్లు బాప్‌దాదా వద్దకు కూడా చేరుకుంటాయి. ఏ సేవాధారి ఏ సేవకు నిమిత్తమైనా కానీ, వారి నుండి సదా ఈ వైబ్రేషన్లే రావాలి, నిశ్చయబుద్ధిగా అయ్యి శక్తిశాలి కిరణాల స్పిరిచువల్ శక్తిని సదా ఇస్తూ ఉండండి. సేవ మనస్ఫూర్తిగా చేస్తున్నారు, భావన చాలా బాగుంది, ఇప్పుడు శక్తిశాలి సంకల్పాలతో కూడిన ఆశీర్వాదాలను ఇవ్వండి. ఎటువంటి వ్యర్థ సంకల్పాలను మనసులోకి తీసుకురాకండి, ఏమవుతుంది అని అనకండి. అంతా మంచిగా అవ్వవలసిందే. అచ్ఛా!
సేవ టర్ను గుజరాత్ వారిది, గుజరాత్ నుండి 6500 మంది వచ్చారు:- గుజరాత్ నుండి ఆరున్నర వేలమంది వచ్చారు. మంచిది. తప్పక రండి. గుజరాత్లో గీతా పాఠశాలలు ఎక్కువ ఉండటాన్ని మరియు వాటిని నడిపించడానికి హ్యాండ్స్ కూడా ఎక్కువగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. గుజరాత్లో సేవ కూడా ఎక్కువే, సేవాధారీ హ్యాండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ ఏమి చేస్తుంది? సేవాధారులు చాలామంది ఉన్నారు, సేవ కూడా చాలా ఉంది, ఇప్పుడు క్రొత్త సేవ ఏమి చేస్తారు? ఎవ్వరూ చెయ్యనిది, అటువంటి ప్లాన్ ఏదైనా చేసారా? ఎవ్వరూ చెయ్యని దానిని గుజరాత్ చేసి చూపించాలి. ప్లాన్ తయారు చేసారా? (కొంత ఆలోచించాము, పరస్పరం కలిసి చేస్తాము) మీరు స్పీచ్ ఇవ్వకండి, మీ తరఫున ఎటువంటి స్పీకర్ మాట్లాడాలంటే వారి ధ్వని, పరపతి ఎక్కువగా ఉండాలి. వారిని చూసి అనేకుల కళ్యాణం జరగాలి. అలాంటివారు ఉన్నారు, ప్రతి జోనులో ఉన్నారు, కానీ స్టేజీ మీదకు రాలేదు. బ్రాహ్మణులు ఇప్పుడు బ్యాక్‌బోన్‌గా అవ్వాలి, ముందుకు ఎటువంటి ఆత్మలు నిమిత్తమవ్వాలంటే వారి మాటలు విని అనేకుల మనసులలో వారి మాటలు నిలిచిపోవాలి అన్నది ఇప్పుడు బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా, ప్రతి జోన్, ఏ విధితో సేవ చేసినాగానీ, బాగా చేసారు, సేవకు నిమిత్తమైన పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి కూడా బాప్‌దాదా సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు నవీనత కావాలి. ఎవరైనా తామంతట తామే నిమిత్తం అయ్యి ఇలా-ఇలా చేయవచ్చు అని ప్లాన్ ఇవ్వాలి ఎందుకంటే వర్గీకరణ సేవ మొదలై కూడా చాలా సమయం అయింది. ప్రతి వర్గంలో ఇటువంటి స్పీకర్ తయారవ్వాలి. మీరు టాపిక్ ఇస్తే వారు మాట్లాడటం కాదు. వారే ఉల్లాసం వచ్చి మాట్లాడాలి. ఇటువంటి దాని కోసం ఏదైనా ప్లాన్ ఆలోచించండి. అందుకు ఆధారము, స్వయంగా నిమిత్తంగా అయ్యేవారు వేస్ట్‌ను సెకండులో సమాప్తం చేసి బెస్ట్ యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాప్తి చేస్తారు. వేస్ట్ ఇప్పటికీ ఉంది అందుకే మనసు ద్వారా చేసే సేవ యొక్క రెస్పాన్స్ తక్కువగా ఉంది. స్థాపన ఆరంభ సమయంలో బ్రహ్మా బాబా యొక్క మనసా వైబ్రేషన్లతో ఎంతోమందికి ఇంట్లో కూర్చునే సాక్షాత్కారాలు జరిగేవి, ఎవరో వచ్చారు వెళ్ళండి అన్న మాటలు వినిపించాయి. ఇటువంటి బెస్ట్ ఆలోచనల వాయుమండలాన్ని సమీపంలోకి తీసుకురాగలవు. ఎటువంటి విస్తారంలోకీ వెళ్ళకండి, షార్ట్. కార్య వ్యవహారాల గురించి అయితే మాట్లాడవలసి ఉంటుంది, కానీ ఎంత వీలైతే అంత విస్తారాన్ని షార్ట్ చేస్తూ మనసా శక్తిశాలి సేవను పెంచండి. తెలివైన వేటగాడు ఎలా వేటాడుతాడంటే పక్షి బాణంతో సహా వచ్చి కాళ్ళ దగ్గర పడిపోతుంది, అలాగే ఇక్కడ మనసా సేవ కూడా ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఆత్మలకు ప్రాప్తి యొక్క అనుభూతి కలగాలి, ఉండలేకపోవాలి. శక్తిశాలి మనసుతో మనసా సేవ యొక్క సిద్ధి ప్రాప్తిస్తుంది. మరి గుజరాత్ ఏమి చేస్తుంది? మనసా సేవలో నంబర్‌వన్ అయి చూపించండి. ఇది అందరి కోసము. అయితే ఇప్పుడు గుజరాత్ టర్న్ కావున గుజరాత్‌కు చెప్తున్నాము. స్వయం యొక్క మనసు శక్తిశాలిగా ఉండటం ద్వారా మనసా సేవ యొక్క రిజల్టు ఎదురుగా వస్తుంది. వాచ సేవ మొదట్లో లేదు, అయితే ఇప్పుడు దాని రిజల్టు ముందుకు వస్తుంది కదా. శ్రమ చాలా చేస్తున్నారు. శ్రమకు నిమిత్తమైనవారికి బాప్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు. సమయం ఫాస్టుగా ఉంది, ఇప్పుడు కూడా సమయం చాలా ఫాస్టుగా(వేగంగా) వెళ్తుంది. అచ్ఛా. అభినందనలు. స్థానం ప్రకారం చూసుకుంటే గుజరాత్ ఎలా అయితే సమీపంగా ఉందో అలాగే బాబా హృదయంలో కూడా సమీపంగా ఉంది. మంచి-మంచి వారున్నారు, మొదటినుండి చూస్తే పాండవులు మరియు శక్తులు మంచి మంచివారు వెలువడ్డారు. ఇప్పుడు ఇటువంటి స్పీకర్‌ను తయారు చేయండి. మీరు సకాశ్ ఇవ్వాలి, వారు భాషణ ఇవ్వాలి. అచ్ఛా, చాలా మంచిది. పదమారెట్లు అభినందనలు.
98 దేశాల నుండి 1200మంది విదేశీ సోదరసోదరీలు వచ్చారు:- అచ్ఛా, విదేశీయులు లేవండి. చేయి ఊపండి. (ఈరోజు సభలో షుమారు 20 వేలమంది సోదర సోదరీలు ఉన్నారు. విదేశీ పిల్లలు అందరూ కలిసి స్వ ఉన్నతి మరియు సేవా వృద్ధి రెండింటి కోసం ప్లాను తయారు చేస్తున్నప్పుడు బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే విదేశాలలో అయితే వేరువేరుగా ఉంటారు, ఇక్కడైతే ఫ్రీగా ఉంటారు మరియు సంగఠన కూడా మంచిగా ఉంటుంది, కావున స్వ ఉన్నతి మరియు భవిష్య ప్లాను మంచిగా వేస్తారు. బాప్‌దాదా వద్దకైతే రిపోర్టు వస్తుంది, సమాచారము చేరుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న గ్రూపులలో కూర్చోవడం వలన అటెన్షన్ ఉంటుంది, సమీపంగా వచ్చే అవకాశం లభిస్తుంది. ఇలా గ్రూపును తయారు చేసి సేవ చేయడం బాగుంది. ఇప్పుడు డబల్ విదేశీయులలో పురుషార్థ వేగం కూడా బాగా ఉంది కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. పురుషార్థం వైపు అటెన్షన్ బాగుంది, అటెన్షన్ ఇప్పించడం కూడా బాగా చేస్తారు, కేవలం దానిని అవినాశిగా చేసుకోవడానికి ఇక్కడ పొందిన రిఫ్రెష్మెంట్ అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా పెరుగుతూ ఉండేలా ఏదైనా ప్లాన్ ఆలోచించండి. సేవా సాధనాలు కూడా మంచివి తయారు చేస్తున్నారు, వి.ఐ.పి మరియు ఇతర భిన్న భిన్న రకాల సేవల ప్లాన్లు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఈ సీజన్ ముగియబోతుంది, మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు ఈ రిజల్టు కనిపించాలి – అందరూ మనసా సేవ, వాచా సేవ, సంబంధ సంపర్కము ద్వారా కర్మణ సేవ, ముఖము మరియు నడవడిక ద్వారా సేవ చేయడంలో ఎంత బిజీగా ఉండాలంటే వేస్ట్ విషయాలు వచ్చే అవకాశమే ఉండకూడదు. ఫుల్ బిజీ. బిజీగా ఉంటున్నారు కానీ ఫుల్ బిజీ. మాయ రావడానికి ఎటువంటి మార్జిన్ ఉండకూడదు. సంకల్పాలలో కావచ్చు, ఇతరులకు సహయోగమును ఇవ్వడంలో కావచ్చు, ఇటువంటి రిజల్టు రాగలదా? ఇలా వీలవుతుందా? ఇంతగా బిజీగా ఉండగలరా? అవ్వగలరా లేక సమయం కావాలా? ఒక సంవత్సరం ఉంది. బాప్‌దాదా అయితే ఇండియాలో కూడా ఇది కోరుకుంటున్నారు, విదేశాలలో కూడా ఇది కోరుకుంటున్నారు – మాయ రావడం లేదు అన్న మాట వినిపించాలి. కష్టపడే అవసరం లేదు. ఏ జోన్ చేస్తుందో చూద్దాము. బాప్‌దాదా ముందుగానే చెప్పి ఉన్నారు – బాప్‌దాదా డైమండ్ కప్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ప్రాబ్లమ్ ప్రూఫ్‌గా అవ్వాలి. ప్రాబ్లమ్(సమస్య) అంటే ఏమిటో కూడా దాని నామరూపాలు కూడా ఉండకూడదు. (బాబా చెప్పారంటే జరిగే ఉంది) చూడండి, ఇది జరిగేదే ఉంది. మీరు కాకపోతే ఇంకెవరు అవుతారు! జరగాల్సిందే. కేవలం దానిని సమీపంగా తీసుకురండి. సరేనా – డబల్ విదేశీయులు? డైమండ్ కప్ తీసుకుంటున్నారా? బాప్‌దాదా అయితే సదా ఆఫర్ చేస్తారు. ఒకరికొకరు తోడుగా ఉండండి, నేను మంచిగా ఉన్నాను, చాలు అనుకోకండి. అందరూ బాగుండాలి. (భారత దేశము మరియు విదేశము అందరూ కలిసి కప్ తీసుకుంటాము) మీ నోటిలో గులాబ్‌జామూన్. జరగాల్సిందే. కేవలం సమయాన్ని దగ్గరగా తీసుకురండి. రిజల్టు బాగుంది. రిజల్టులో ముందుకున్నా బాగా మార్పు ఉంది, ఇందుకు అభినందనలు, కానీ ఇప్పుడు ఫుల్ అవ్వలేదు, కొద్ది కొద్దిగా ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఫుల్ అయిపోతారు. బాప్‌దాదా వతనం నుండి చాలా మంచి ఫరిశ్తాతనపు బహుమతిని ఇస్తారు. నేను ఫరిశ్తాను, మెరుస్తున్నాను అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటారు. జరగాల్సిందే. అచ్ఛా!
ఈరోజుల్లో డాక్టర్లు మందులు వదలండి, ఎక్సర్సైజ్(వ్యాయామం) చెయ్యండి అని అంటున్నారు. మరి బాప్‌దాదా కూడా యుద్ధం చెయ్యటాన్ని వదలండి, కష్టపడటాన్ని వదలండి, రోజంతటిలో 5-5 నిమిషాలు మనసు ఎక్సర్సైజ్ను చెయ్యండి అని అంటారు. ఒక్క నిమిషంలో నిరాకారి, ఒక్క నిమిషంలో ఆకారి, ఒక్క నిమిషంలో అన్నిరకాల సేవాధారిని అన్న ఈ 5 నిమిషాల మనసు ఎక్సర్సైజ్ను మొత్తము రోజులో వేరు వేరు సమయాలలో చేయండి. అప్పుడు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు, కష్టపడటము నుండి రక్షింపబడతారు. వీలవుతుంది కదా! మధువనమువారు చెప్పండి, వీలవుతుందా? మధువనము పునాది, మధువనములోని వైబ్రేషన్లు నలువైపులకు వద్దనుకున్నాగానీ చేరుకుంటాయి. మధువనములో ఏదైనా విషయము జరిగితే అది మొత్తము భారతదేశములో, ప్రతిచోటకూ మరుసటిరోజు చేరిపోతుంది. మధువనములో ఎటువంటి సాధనము ఉందంటే, ఏ విషయమూ దాగదు, అది మంచిదైనా, పురుషార్థానికి చెందినదైనాకూడా. కనుక మధువనమువారు ఏది చేస్తే అది, ఆ వైబ్రేషన్లు స్వతహాగా మరియు సహజంగా వ్యాపిస్తాయి. ముందుగా మధువన నివాసులు వ్యర్థ సంకల్పాలను ఆపెయ్యాలి, వీలవుతుందా? వీలవుతుందా? ముందు ముందు కూర్చున్నవారు, మధువన నివాసులు చేతులెత్తండి. వ్యర్థము సమాప్తమయ్యేందుకు మధువన నివాసులు పరస్పరములో ఏదైనా అటువంటి ప్లాన్‌ను తయారుచెయ్యండి. సంకల్పాలనే ఆపెయ్యండి అని బాప్‌దాదా అనటం లేదు. వ్యర్థ సంకల్పాలు ఫినిష్(అంతమైపోవాలి) అవ్వాలి. వాటివల్ల లాభమే లేదు. టెన్షనే ఉంటుంది. వీలవుతుందా? పరస్పరము కూర్చుని మీటింగ్ పెట్టుకుని దీనిని చేస్తాము అని మధువన నివాసులెవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేస్తాము, చెయ్యాలి అని అనుకునేవారు బాగా పైకి చేతులెత్తండి. రెండు చేతులూ ఎత్తండి. అభినందనలు. బాప్‌దాదా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. శుభాకాంక్షలను తెలుపుతున్నారు. మధువనమువారిలో ధైర్యము ఉంది కనుక ఏది అనుకుంటే అది చెయ్యగలరు. చేయించగలరు కూడా. మధువన అక్కయ్యలు కూడా ఉన్నారు, అక్కయ్యలు చేతులెత్తండి. బాగా పైకి చేతులెత్తండి. మీటింగు చెయ్యాలి. దాదీలు మీటింగు చేయించాలి. చూడండి, అందరూ చేతులెత్తుతున్నారు. ఎత్తిన ఈ చేతి పరువును ఇప్పుడు నిలపండి. అచ్ఛా.
బ్రహ్మా బాబా చివర్లో వరదానమును ఇచ్చారు - నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, ఇది బ్రహ్మా బాబా యొక్క చివరి వరదానము, పిల్లల కొరకు ఇది చాలా పెద్ద కానుక. అయితే ఇప్పుడిప్పుడే క్షణంలో బ్రహ్మా బాబా ఇచ్చిన కానుకను మనసు ద్వారా స్వీకరించగలరా? బాబా కానుకను సదా ప్రాక్టికల్ జీవితములో తీసుకురావాలి అని దృఢ సంకల్పము చెయ్యగలరా? ఎందుకంటే ఆదిదేవుని కానుక తక్కువైనది కాదు. బ్రహ్మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అటువంటివారు ఇచ్చిన కానుక తక్కువైనది కాదు. కనుక నేటి ఈ హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో, హో లీ, అయిపోయింది అని మీ మీ పురుషార్థము ప్రమాణంగా సంకల్పము చెయ్యండి. కానీ ఇప్పటినుండి కానుకను పదే పదే ఇమర్జ్ చేసుకుని బ్రహ్మా బాబాకు సేవ యొక్క రిటర్న్ ఇస్తారు. చూడండి, బ్రహ్మా బాబా అంతిమరోజు వరకు, అంతిమ సమయము వరకు సేవ చేసారు. బ్రహ్మా బాబాకు పిల్లల పట్ల ఉన్న ప్రేమకు, సేవ పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనము కనుక బ్రహ్మా బాబాకు రిటర్న్ ఇవ్వాలి అనగా ఇచ్చిన ఈ కానుకను పదే పదే జీవితములో రివైజ్ చేసుకుని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. కనుక అందరూ తమ తమ మనసులలో బ్రహ్మా బాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే సంకల్పమును దృఢతరం చెయ్యండి, ఇదే బ్రహ్మా బాబా యొక్క స్నేహ కానుకకు రిటర్న్ ఇవ్వటము. అచ్ఛా!
నలువైపుల ఉన్న అతి అదృష్టవంతులు, అతి పవిత్రులైన పిల్లలకు, దృఢ సంకల్పమనే తాళం చెవిని సదా ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ధైర్యశాలి పిల్లలకు, సదా తమ మనసును రకరకాలైన సేవలలో బిజీగా ఉంచుకునేవారికి, అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే పిల్లలకు, సదా ప్రతి రోజు ఉత్సాహములో ఉండేవారికి, ప్రతి రోజును ఉత్సవముగా భావించి ఉత్సవమును జరుపుకునే పిల్లలకు, సదా అదృష్టవంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మోహిని అక్కయ్య, ఈషూ అక్కయ్యతో:- ఇప్పుడు అక్కడ కూడా (హాస్పిటల్లో కూడా) ప్రోగ్రాము తయారు చేయండి. గదిలో కూర్చున్నాగానీ బయట కూర్చున్నాగానీ అక్కడ మరే విషయాలు వద్దు. ఎలా అయితే వారు సాధనాల ద్వారా గది యొక్క వాతావరణాన్ని తయారు చేస్తారో అలాగే అక్కడ పూర్తిగా శక్తిశాలి వాయుమండలం ఉండాలి, ఎవరు వచ్చినా వారు ఒక్క సెకండులో అశరీరి స్థితిని అనుభవం చేసుకోవాలి. దీనికన్నా ఈ మందు శక్తిశాలిది. (కొన్ని రోజులు ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ తర్వాత ఏదో ఒకటి అవుతుంది) ఇప్పుడైతే ఆట జరుగుతుంది కదా, ఇప్పుడు ఈ వాయుమండలం, దవాయీ(మందు) మరియు దువా (ఆశీర్వాదాలు) అన్నీ కలిసి ఉండాలి. (నలువైపులలోని సెంటర్లలో కూడా యోగం జరుగుతుంది) అన్ని వైపుల విశేషంగా యోగంలో కూర్చోండి, ఒకవేళ బిజీగా ఉన్నాగానీ లక్ష్యం మాత్రం ఇదే ఉండాలి. నేను ఈ సేవను చేయాలి అని భావించండి. ప్రేమకు రిటర్న్ ఇదే.
దాదా విశ్వ రతన్ 26 ఫిబ్రవరి నాడు అకస్మాత్తుగా తమ పాత శరీరాన్ని విడిచి పెట్టారు:- ఎందుకంటే డ్రామాలో కొందరు ఆత్మలు అకస్మాత్తు మరియు ఎవరెడీ పాఠాన్ని పక్కా చేయించాల్సి ఉంటుంది. చూడండి, చంద్రమణి శరీరం విడిచిపెట్టినప్పుడు కొంత సమయం తపస్సు యొక్క అల మంచిగా ఉండింది. అందరూ అకస్మాత్తు పాఠంలో పక్కాగా ఉన్నారు, తర్వాత నెమ్మది నెమ్మదిగా చల్లబడిపోయారు. మళ్ళీ డ్రామాలో ఈ పాత్ర ఏదైతే జరిగిందో ఇది వాయుమండలంలో అకస్మాత్తు మరియు ఎవరెడీ పాఠాన్ని మళ్ళీ పక్కా చేయించేందుకు నిమిత్తమయింది. విశ్వరతన్కు నిరాకారి స్థితిపై అటెన్షన్ మంచిగా ఉండింది, గుప్తంగా వారు ఈ పాఠంలో పక్కాగా అయ్యారు. అందుకే త్వరగా సెకండులో పాత్ర పూర్తయిపోయింది. ఈ సమయం కూడా అందరికీ అటెన్షన్ ఇప్పించడానికి నిమిత్తమవుతుంది. అందరూ ఇప్పుడు కొద్దికొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడింకా సమయము ఉంది అన్న ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. ఎవరెడీగా ఉండాలి ఎందుకంటే బహుకాలపు అటెన్షన్ కూడా కావాలి. అచ్ఛా.
దాదీలతో:- మీ గ్రూపు అటెన్షన్ ఉంచే గ్రూపే కదా. అటెన్షన్ ఉంటుంది కదా. అచ్ఛా. మీ అటెన్షన్ అయితే ఉంటుంది కదా, ఎవరెడీ కదా?
దాదా సేవాధారి మనోజ్‌తో:- డ్రామాను చూసి సంతోషంగా ఉన్నారు కదా, డ్రామాలో ఏది జరిగినా మంచికే జరుగుతుంది. (దాదా చాలా గుర్తుకు వస్తున్నారు) గుర్తు రావచ్చు, వారి గుణాలు మరియు వారి కర్తవ్యాలు గుర్తుకు రావాలి, వాటిని ఫాలో చేయండి. గుర్తుకైతే వస్తారు కదా. ఫాలో చేయండి అన్నది మాత్రమే ఆజ్ఞ. సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి.
నిర్వైర్ అన్నయ్య దాదీగారి సమాచారాన్ని వినిపించారు మరియు అందరి స్మృతిని ఇచ్చారు:- అందరికీ సేవకు అభినందనలు మరియు స్మృతిని ఇవ్వండి. (మున్నీ అక్కయ్య స్మృతిని ఇచ్చారు, దాదీగారిని త్వరగా మధుబన్కు తీసుకురావలన్నది కోరిక) తొందర పడకండి. తొందరగా అన్న సంకల్పం చేయకండి. అంతే. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయండి. ఇప్పుడు ఈ సంకల్పం చేయనే చేయకండి. బాగుంది, బాగుంది, బాగుంది అన్న సంకల్పమే చేయండి. జరిగిపోతుంది, పెద్ద విషయం కాదు.
రమేష్ అన్నయ్యతో:- బాంబే ఏమి చేస్తుంది? ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేయండి. వర్గీకరణ కార్యక్రమాలైతే జరుగుతూనే ఉంటాయి. ప్రత్యక్షంగా కనిపించేలా ఏదైనా చేయండి. చేసారు, వెళ్ళారు, సేవ మొదలు పెట్టారు అనేలా త్వరిత దానము మహా పుణ్యమును చేయండి.
చంద్రహాస్ దాదాతో:- ఆరోగ్యం బాగుందా! మంచిది, మీ ఆరోగ్యాన్ని మీరే అర్థం చేసుకుని నడిపిస్తూ ఉండండి. అందరికంటే పెద్ద డాక్టరు స్వయమే.
డా. కర్సన్ భాయి పటేల్(ఛైర్మెన్, నిర్మా గ్రూప్):- ఇప్పుడు ఎలా అయితే మీ లౌకిక వ్యాపారంలో ఉన్నతిని పొందుతున్నారో, అలా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక బిజినెస్ కూడా చేయండి. పరమాత్మతో బిజినెస్ చేయండి, చాలా ఈజీ. ఇది అవినాశిగా ఉంటుంది. ఆ బిజినెస్ అయితే ఒక్క జన్మ ఉంటుంది కానీ ఇది 21 జన్మలకు గ్యారంటీ ఉన్నది. 21 జన్మలు ఏమీ చేయనవసరం లేదు. కేవలం తినాలి, త్రాగాలి, ఆనందంగా ఉండాలి. ఇటువంటి బిజినెస్ చేయండి. చేయాలనుకుంటున్నారా? నిమిత్తంగా అవ్వండి. మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉత్సాహం వస్తుంది. ఇక్కడి వరకు చేరుకున్నారంటే తప్పకుండా ఏదో భాగ్యము దాగి ఉంది, అందుకే చేరుకున్నారు. ఈ భాగ్యమే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నిమిత్తమైతే ఎవరో ఒకరు అవుతారు కదా! వెళ్ళాలి, వెళ్ళాలి అని ఎన్నోసార్లు అనుకుని ఉండవచ్చు, కానీ ఈరోజే ఎలా వచ్చారు? మీ భాగ్యమే మిమ్మల్ని తీసుకువచ్చింది. చాలా మంచి పని చేసారు.
స్వామి సంపూర్ణానంద గిరిగారు, పూరి:- చాలా మంచిది. కలిసి చేస్తే ధ్వని మారుమ్రోగుతుంది. మారుమ్రోగే శబ్దం చాలామంది చెవులకు చేరుతుంది. మంచిది. అన్ని ధర్మాల నేతలు కలిసి చేస్తే ధ్వని త్వరగా వ్యాపిస్తుంది. ఇది కూడా జరుగుతుంది. కొద్దిగా సమయం పడుతుంది కానీ జరుగుతుంది. అందరూ కలిసి ఒకే జెండాను ఎగురవేస్తారు.
రాకేశ్ మెహతా, ఐ.ఏ.ఎస్, విద్యుత్తు బోర్డు, ఢిల్లీ:- ఇక్కడ కూడా చూడండి, ఆత్మ లైట్, లైట్ హౌస్‌గా అయ్యి లైట్ ఇవ్వాలి. డబల్ లైట్ జ్ఞానాన్ని తీసుకునే భాగ్యశాలి ఆత్మ మీరు! ఆ లైట్ కూడా కావాలి, ఈ లైట్ కూడా కావాలి. ఇప్పుడు నిమిత్తంగా అయ్యి దుఃఖి ఆత్మలకు సుఖాన్ని ఇవ్వండి. టెన్షన్ ఫ్రీ జీవితాన్ని తయారు చేసుకోండి. అచ్ఛా!
ఓంశాంతి