Search for a command to run...
15 Feb 2007
నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పుట అనే నిద్ర నుండి మేలుకోవడమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ
15 February 2007 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా విశేషంగా నలువైపుల ఉన్న తమ అతి ప్రియమైన, చాలా కాలం తర్వాత కలిసిన, పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలను కలుసుకోవటానికి మరియు విచిత్రమైన తండ్రీ పిల్లల జన్మదినాన్ని జరుపుకోవటానికి వచ్చారు. మీరందరూ కూడా ఈరోజు విశేషంగా విచిత్రమైన జన్మదినాన్ని జరుపుకోవటానికి వచ్చారు కదా! ఇటువంటి జన్మ దినం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజు ఉండటం ఎప్పుడూ విని కూడా ఉండరు. మరి మీరందరూ తండ్రి జన్మ దినాన్ని జరుపుకోవటానికి వచ్చారా లేక పిల్లలది కూడా జరుపుకోవటానికి వచ్చారా? ఎందుకంటే పూర్తి కల్పంలో పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మధ్య ఎంతటి అపారమైన ప్రేమ ఉందంటే జన్మ కూడా ఇద్దరిదీ ఒకేసారి జరుగుతుంది. తండ్రి ఒక్కరే విశ్వ పరివర్తనా కార్యాన్ని చెయ్యరు, పిల్లలు కూడా కలిసి చెయ్యాలి. కలిసి ఉండే ఈ ప్రేమ, సహచరులుగా అయ్యే ఈ అలౌకిక ప్రేమ ఈ సంగమంలోనే అనుభవం చేసుకుంటారు. తండ్రీ పిల్లల ప్రేమ ఎంత గాఢమైనదంటే జన్మ కూడా కలిసే జరుగుతుంది. మీరు ఉండటం కూడా ఎక్కడ ఉంటారు? ఒంటరిగా ఉంటారా లేక కలిసి ఉంటారా? మేము బాబాతో కంబైండ్‌గా ఉంటాము అని పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతో ఉల్లాసంతో అంటారు. కంబైండ్‌గా ఉన్నారు కదా! ఒంటరిగా ఉండటం లేదు కదా! జన్మ కలిసి జరుగుతుంది. కలిసి ఉంటారు, అలాగే భవిష్యత్తుకు ఏమని ప్రతిజ్ఞ ఉంది? కలసి ఉన్నాము, కలసి ఉంటాము, తమ మధురమైన ఇంటికి కలసి వస్తాము. తండ్రీ పిల్లల మధ్య ఇంతటి ప్రేమ మరెక్కడైనా చూసారా? పిల్లలు ఎవరైనా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కానీ కలసి ఉన్నారు. కలిసే వెళ్ళేది ఉంది. మరి ఇటువంటి విచిత్రమైన మరియు ప్రియాతి ప్రియమైన జన్మదినాన్ని జరుపుకోవటానికి వచ్చారు. సమ్ముఖంలో జరుపుకుంటున్నా, దేశ విదేశాలలో అయినా కానీ నలు వైపులా ఒకే సమయంలో కలసి జరుపుకుంటున్నారు.
పిల్లలందరూ ఉల్లాస ఉత్సాహాలతో మనసులోనే వాహ్ బాబా! వాహ్ బాబా! వాహ్ జన్మ దినము! అని పాటను పాడుకోవటము బాప్‌దాదా నలు వైపులా చూసారు. స్విచ్ ఆన్ చెయ్యగానే నలు వైపుల నుండి మాటలు, మనసు యొక్క మాటలు, ఉల్లాస ఉత్సాహాల మాటలు బాప్‌దాదా చెవులకు వినిపిస్తున్నాయి. పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి బాప్‌దాదా పిల్లలకు తమ దివ్యజన్మ సందర్భంగా పదమ - పదమ పదమారెట్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వాస్తవానికి ఉత్సవము అనగా ఉల్లాస - ఉత్సాహాలలో ఉండటము అని అర్థము. మీరందరూ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు శివరాత్రి అని పేరు పెట్టారు.
ఈరోజు బాప్‌దాదా ఆ భక్త ఆత్మకు, మీ ఈ విచిత్రమైన జన్మ దినాన్ని జరుపుకోవడంలో, మీరు జ్ఞానము మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు మరియు ఆ భక్త ఆత్మ భావన, శ్రద్ధ రూపంలో మీరు జరుపుకునేదాన్ని కాపీ బాగా చేసింది, కాపీ చెయ్యడంలో మంచి పాత్రను వహించిన ఆ భక్త ఆత్మకు ఈరోజు బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. చూడండి, ప్రతి విషయాన్ని కాపీ చేసారు. కాపీ చెయ్యటానికి కూడా తెలివి కావాలి కదా! ముఖ్యంగా ఈరోజు భక్తులు కూడా వ్రతాన్ని పాటిస్తారు. వారు ఆహార పానీయాల విషయంలో వ్రతాన్ని పాటిస్తారు. భావనతో వృత్తిని శ్రేష్ఠంగా చేసుకునేందుకు వ్రతాన్ని పాటిస్తారు. వారు అయితే ప్రతి సంవత్సరం వ్రతాన్ని పెట్టుకుంటారు. మీరు ఏ వ్రతాన్ని పాటిస్తున్నారు? మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు, ప్రతి సంవత్సరం వ్రతాన్ని తీసుకోరు. ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు. అందరూ పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు, పక్కాగా తీసుకున్నారా? ఎవరైతే పక్కాగా తీసుకున్నారో వారు చేతులెత్తండి, పక్కా, కొంచెం కూడా కచ్చాగా ఉండకూడదు. పక్కా? అచ్ఛా. రెండవ ప్రశ్న కూడా ఉంది. వ్రతాన్ని తీసుకున్నందుకు అభినందనలు. కానీ అపవిత్రతకు ముఖ్యంగా ఐదు సహచరులు ఉన్నారు. కదా! తల ఊపండి. అచ్ఛా, మరి ఐదింటి వ్రతాన్ని తీసుకున్నారా? లేక రెండు మూడింటికి మాత్రమే తీసుకున్నారా? ఎందుకంటే పవిత్రత ఉన్న చోట అపవిత్రత అంశమాత్రమైనా ఉన్నట్లయితే సంపూర్ణ పవిత్ర ఆత్మ అని పిలువబడతారా? బ్రాహ్మణ ఆత్మలైన మీకు పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ప్రాపర్టీ (ఆస్తి), పర్సనాలిటీ (వ్యక్తిత్వము), రాయల్టీ (హుందాతనము). కనుక పరిశీలించుకోండి- సంపూర్ణ పవిత్రతలో, ముఖ్యంగా కేవలం పవిత్రత మీదనే అటెన్షన్ ఉంది కానీ సహచరులను తేలికగా వదిలేయడం లేదు కదా? చిన్నవాటిపై (అపవిత్రత సహచరులు) ప్రేమను పెట్టుకుని పెద్దదాన్ని మాత్రమే సరి చేసారా? మిగతా నాలుగింటిని పెట్టుకోవచ్చునని బాబా అనుమతిని ఇచ్చారా? పవిత్రత కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మాచారీ, బ్రహ్మాచారీగా కావడము అనగా పవిత్రతా వ్రతాన్ని పాటించడము. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమని అంటారంటే, ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా, చాలా మధురంగా మాట్లాడుతారు. బాబా, ముఖ్యమైనదాని పాలన అయితే బాగా ఉంది కదా, ఇక చిన్న చిన్నవైతే అప్పుడప్పుడూ మనసా సంకల్పాలలో వస్తాయి. మనసులో వస్తాయి, వాచలో రావు. మనసును అయితే ఎవరూ చూడరు కదా! చిన్న చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటుంది అని అంటారు కదా, అలాగే ఈ నాలుగింటితో కూడా ప్రేమ ఉంటుంది. క్రోధము వస్తుంది. మోహము వస్తుంది, రావాలని అనుకోవడం లేదు, కానీ వచ్చేస్తున్నాయి. ఏదైనా వచ్చింది అంటే అది రావటానికి మీరు తలుపును తెరచి ఉంచినప్పుడే వస్తుంది కదా! మరి తలుపును ఎందుకు తెరిచారు అని బాప్‌దాదా అడుగుతున్నారు? బలహీనత అనే తలుపును తెరవడము అనగా ఆహ్వానించడము.
మరి ఈనాటి జన్మ దినము అయితే తండ్రి మరియు పిల్లలది జరుపుకుంటున్నారు. కానీ జన్మించగానే వ్రత ప్రతిజ్ఞను చేసారా? మొట్టమొదటగా తండ్రి ఏ వరదానమును ఇచ్చారు. గుర్తుందా? జన్మ దినపు వరదానము గుర్తుందా? ఏమి ఇచ్చారు? పవిత్ర భవ, యోగి భవ. అందరికీ ఈ వరదానము గుర్తుంది కదా? గుర్తుందా, మర్చిపోలేదు కదా? పవిత్ర భవ అనే వరదానము ఒక్కదాని కోసం ఇవ్వలేదు, ఐదింటికీ ఇచ్చారు. మరి ఈరోజు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? జన్మదినాన్ని జరుపుకోవటానికి వచ్చారు. తండ్రి జన్మ దినాన్ని జరపటానికి కూడా వచ్చారు. శివరాత్రిని జరుపుకోవటానికి వచ్చారు. మరి జన్మ దినానికి బహుమతిని తీసుకు వచ్చారా లేక ఖాళీ చేతులతో వచ్చారా? స్థాపన జరిగి 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. 70 సంవత్సరాలు, ఆలోచించండి. మీరు తరువాత వచ్చినా కానీ స్థాపన జరిగి 70 సంవత్సరాలు అవుతుంది కదా! ఇప్పుడు వచ్చినా కానీ, స్థాపనా కార్యంలో మీ అందరూ కలసి ఉన్నారు కదా? కలసి ఉన్నారు కదా? ఈ రోజే మొదటి సారి ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. ఎవరైతే మధువనానికి మిలనం కోసం మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. అచ్ఛా, మీరందరూ వచ్చి ఒక సంవత్సరం అయినా, రెండు సంవత్సరాలు అయినా కానీ స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారి అని పిలుచుకుంటారా లేక పురుషార్థ కుమార్ అని పిలుచుకుంటారా? ఏమని పిలుచుకుంటారు? ఎవరైనా స్వయాన్ని పురుషార్థీ కుమార్ అనుకుంటారా? బ్రహ్మాకుమార్ అనే సైన్ (గర్తు)ను పెట్టుకుంటారు కదా! అందరూ బి.కె. అని వ్రాసుకుంటారా లేక పి.కె అని వ్రాసుకుంటారా? పురుషార్థీ కుమార్? మరి చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము, కంబైండ్ ఉంటాము, మరి కంబైండ్‌గా ఉండాలంటే సమానత కావాలి కదా!
70 సంవత్సరాల ఉత్సవాన్ని అయితే జరుపుకుంటున్నారు. ఏ జోన్ యొక్క టర్న్ వస్తుందో వారు 70 సంవత్సరాలను జరుపుకోవడం బాప్‌దాదా చూసారు. సమ్మాన సమారోహమును జరుపుకుంటున్నారు. అందరూ జరుపుకుంటున్నారు కదా! కేవలం చిన్న చిన్న బహుమతులను ఇస్తున్నారు అంతే. కానీ ఈరోజు ఒకటి, జన్మ దినాన్ని జరుపుకోవటానికి వచ్చారు కదా, పక్కా కదా? రెండు, 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సమ్మాన సమారోహము కూడా జరుపుకుంటున్నారు. జన్మ దినాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఏ బహుమతిని ఇస్తారు? ట్రే ఇస్తారా? దుప్పట్లు ఇస్తారా? ఏ బహుమతిని తెచ్చారు? సరే, వెండి గ్లాసును ఇస్తారు! కానీ ఈరోజు బాప్‌దాదాకు తమ శుభ దీపకులైన పిల్లల మీద ఒక శుభమైన ఆశ ఉంది. చెప్పమంటారా, మొదటి లైనులో కూర్చున్నవారు చెప్పండి, చెప్పడము మరియు వినడము అంటే అర్థము ఏమిటి? ఒక చెవితో విని దానిని మనసులో నింపుకోవడము, అంతేనా? బయటకు అయితే పంపించరు, కానీ మనసులోనే నింపుకుంటారు. మరి ఈరోజు, మొదటి లైనులో కూర్చున్నవారు ఏమంటారు, చెప్పమంటారా? తల ఊపండి. టీచర్లు తల ఊపండి. ఊపుతున్నారు. డబల్ విదేశీయులు, చెప్పమంటారా? ఆ మాటకు స్వయం కట్టుబడి ఉండాలి, అప్పుడే సరే అని చెప్పండి. లేకపొతే లేదు. ఎందుకంటే చూడండి. 70 సంవత్సరాలుగా బాప్‌దాదా కూడా నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పడం - ఈ ఆటను 70 సంవత్సరాలు చూసారు. సరే, 70 సంవత్సరాలు కాకపోతే 50, 40, 30, 20 కానీ ఇంత సమయమూ పిల్లలలో ఈ మూడు ఆటలనూ బాబా బాగా చూసారు. ఈరోజు భక్తులు జాగరణ చేస్తారు, నిద్రపోరు. మరి పిల్లలైన మీ జాగరణ ఏమిటి? ఎటువంటి నిద్రలోకి మాటిమాటికీ జారుకుంటారు? నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పడము అనే నిద్రలోకి వెళ్ళి హాయిగా నిదురిస్తారు. మరి ఈరోజు బాప్‌దాదా ఈ మూడు విషయాలలో సదా జాగరణను చూడాలని ఆశిస్తున్నారు. క్రోధము వస్తుంది, అభిమానము వస్తుంది, లోభము వస్తుంది. ఇందుకు కారణము ఏమిటని చూడండి. బాప్‌దాదాకు ఒకే ఒక ట్రేడ్‌మార్క్ కనిపిస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా కానీ ఏమని అంటారు. ఇలా జరుగుతూనే ఉంటుంది, దీనిని ఎవరు చేసారు? ఇలా అవుతూనే ఉంటుంది, ఇది కొత్త విషయమేమీ కాదు అని అంటారు. ఇది ఏమిటి? నిర్లక్ష్యము కాదా? వీరు కూడా చేస్తున్నారు కదా, చాలా సార్లు క్రోధము నుండి కాపాడుకోవటానికి ఇలా చేసాను, అప్పుడే ఇలా జరిగింది అని అంటారు కానీ నేను చేసింది తప్పు అని అనరు. ఇలా జరిగింది కదా, ఇలా చేసారు కదా, అందుకే జరిగింది. ఇతరులపై దోషమును పెట్టడము చాలా సహజము. వీరు అలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు అని అంటారు. మరి బాబా అన్నది జరుగలేదు కదా? వారు అలా చేస్తే ఇది వీలవుతుంది అంటారు, బాబా శ్రీమతముపై నడిచి క్రోధాన్ని సమాప్తి చేసుకోలేరా? ఈరోజుల్లో క్రోధము యొక్క సంతానము ఆవేశము, ఆవేశము కూడా భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. మరి ఈరోజు ఈ నాలుగింటి వ్రతాన్ని తీసుకుంటారా? ఎలా అయితే మొదటి విషయంలో మెజారిటీ పిల్లలు దృఢంగా సంకల్పము తీసుకున్నారు కదా, అలాగే మిగతా నాలుగింటి సంకల్పము తీసుకోండి. వారు అలా చేసారు కాబట్టి నేను ఇలా చేసాను అని సాకులు చెప్పకండి. మరి బాబా మాటిమాటికీ చెప్పేవి గుర్తుండవా? వారు చేసింది గుర్తుంది! ఇది సాకులు చెప్పడమే కదా! నాలుగింటిని బలహీనపరిచే ఈ మూడు విషయాలను ఈరోజు బాప్‌దాదా జన్మదిన బహుమతిగా కోరుకుంటున్నారు. సంస్కారాలను అయితే ఎదుర్కోవలసిందే. సంస్కారాలను ఎదుర్కోవడము కాదు, ఇది పరీక్ష. ఒక్క జన్మ చదువు మరియు పూర్తి కల్పానికి ప్రాప్తి, అర్థ కల్ప రాజ్య భాగ్యము, అర్థ కల్పము పూజ్యులుగా. పూర్తి కల్పానికి ఒక్క జన్మలో ప్రాప్తి. అది కూడా చిన్న జన్మ, పూర్తి జన్మ కాదు, చిన్న జన్మ. మరి ధైర్యము ఉందా? తప్పకుండా ధైర్యమును ఉంచుతాము అని ఎవరైతే భావిస్తున్నారో, పురుషార్థము చేస్తాము, అటెన్షన్ పెడ్తాము.....ము, ము కాదు. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కారు, 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. 3 - 4 నెలల పిల్లలు ము, ము అని అంటారు, మీరైతే బాబా తోడుగా ఉన్నారు. విశ్వ కళ్యాణకారులు. 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. బాప్‌దాదా చేతులు ఎత్తమని చెప్పడం లేదు, ఎందుకంటే చేతులెత్తిన తరువాత కూడా ఒక్కోసారి సోమరితనంగా ఉండటము బాప్‌దాదా చూసారు. కానీ, ఏమి జరిగినా కానీ, పర్వత సమానమైన పరీక్ష వచ్చినా కానీ పర్వతాన్ని కూడా ఆవగింజ సమానంగా చేసేస్తాము అని దృఢ సంకల్పం తీసుకునేవారు చేతులెత్తండి. ఎందుకంటే సంకల్పాలైతే చాలా బాగా చేస్తారు, బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. కానీ 70 సంవత్సరాలను తేలికగా వదిలేసారు. సమయంపై ఎటువంటి నమ్మకము లేదు, జ్ఞానం అనుసారంగా పురుషార్థం యొక్క ప్రతి విషయంలోనూ బహుకాలపు లెక్క ఉండాలి. ఎందుకంటే అందరూ ఎటువంటి ప్రాప్తిని కోరుకుంటారు? ఇప్పుడు చేతులు ఎత్తిస్తాము, రాముడు, సీతగా ఎవరైనా అవుతారా? రాముడు, సీతగా కాదలుచుకున్నవారు చేతులు ఎత్తండి. రాజ్యం లభిస్తుంది. ఎవరో చేతులు ఎత్తుతున్నారు. రాముడు, సీతగా అవుతారా, లక్ష్మీ నారాయణులుగా కారా? ఎత్తుతున్నారా? చూడండి. మీరు చూడండి, ఎత్తుతున్నారు. విదేశీయులు ఎత్తుతున్నారా? డబల్ విదేశీయులలో ఎవరైనా ఎత్తుతారా? బహుకాలపు భాగ్య ప్రాప్తిని పొందాలనుకున్నప్పుడు, లక్ష్మీ నారాయణులుగా కావడము అనగా బహుకాలపు రాజ్య భాగ్యాన్ని పొందడము. అంటే బహుకాలపు ప్రాప్తి. మరి బహుకాలపు లెక్క కావాలి కదా! ఇప్పుడు 63 జన్మల బహుకాలపు లెక్క ఉంది కదా. అందుకే సంకల్పాలలో దృఢత్వము లోపిస్తుంది అని బాప్‌దాదా అంటున్నారు. అయిపోతుందిలే....జరుగుతుంది, జరగనివ్వు, ఎవరు తయారయ్యారు. అందరికీ చాలా బాగా వచ్చిన మరో విషయము ఏమిటంటే, బాప్‌దాదా నోట్ చేసారు. తమకు ధైర్యం లేనప్పుడు మహారథులు కూడా ఇలాగే చేస్తారు, మేము చేస్తే ఏమయింది అని అంటారు. కానీ మహారథులైనా తప్పు చేసినప్పుడు వారు మహారథులా అని బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు? మరి మహారథి అన్న పేరును ఎందుకు పాడు చేస్తారు? ఆ సమయంలో వారు మహారథి కానే కాదు, మరి మహారథి అని చెప్పుకుని స్వయాన్ని బలహీనంగా చేసుకోవడము - ఇది స్వయాన్ని మోసగించుకోవడము. ఇతరులను చూడటము సహజంగానే ఉంటుంది, స్వయాన్ని చూసుకోవటానికి కొంచెం ధైర్యం కావాలి. ఈరోజు బాప్‌దాదా లెక్క అడగటానికి వచ్చారా? లెక్కల ఖాతా సమాప్తి చేసే బహుమతిని తీసుకోవటానికి వచ్చారు. బలహీనత మరియు సాకులు చెప్పడం యొక్క లెక్కల ఖాతా, చాలా పెద్ద పుస్తకము. దానిని సమాప్తము చెయ్యాలి. మేము చేసి చూపిస్తాము, చెయ్యాల్సిందే, వంగాల్సిందే, మారాల్సిందే, పరివర్తనా సెరిమనీను జరుపుకోవలసిందే, సంకల్పము చేస్తాము అని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. దృఢంగానేనా లేక దాటవేసే తెలివితోటా? దాటవేసే తెలివితో చేసే సంకల్పాలు కూడా ఉంటాయి మరియు దృఢ సంకల్పాలు కూడా ఉంటాయి. మీరందరూ దృఢంగానే చేతులెత్తారు కదా? దృఢంగా ఎత్తారా? దృఢంగా ఎత్తారా? మధువనంవారు చేతులు పెద్దగా ఎత్తండి. చిన్నగా కాదు. ఇక్కడ మధువనంవారు కూర్చున్నారు. చాలా దగ్గరగా కూర్చునే అవకాశము దొరికింది. మధువనంవారైతే ఎదురుగానే కూర్చున్నారు. మొదటి సీటు మధువనం వారికి లభిస్తుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ముందు కూర్చున్నారు, ముందే ఉండండి.
ఈనాటి బహుమతి చాలా బాగుంది కదా! బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరొక్కరే కాదు. మీ వెనుక మీ రాజధానిలోకి మీ రాయల్ ఫామిలీ, మీ రాయల్ ప్రజలు, ఆ తరువాత ద్వాపరంలో మీ భక్తులు, సతో రజో తమోగుణీ, మూడు రకాల భక్తులు, మీ వెనుక పెద్ద లైను ఉంది. మీరు ఏమి చేస్తారో మీ వెనుక ఉన్నవారూ అదే చేస్తారు. మీరు సాకులు చెబితే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. బ్రాహ్మణ పరివారం కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి చెడుగా కాపీ చెయ్యడంలో తెలివైనవారిగా అవుతారు కదా! కనుక ఇప్పుడు దృఢ సంకల్పం చెయ్యండి, సంస్కారాల ఘర్షణ ఉన్నా, స్వభావాల మతభేదాలు ఉన్నా, మూడవ విషయము బలహీనతది, ఎవరైనా ఎవరి గురించి అయినా అబద్ధము చెబితే, అప్పుడు ఆ అబద్ధం విని మాకు చాలా క్రోధము వస్తుంది అని చాలా మంది పిల్లలు అంటారు. కానీ సత్యమైన తండ్రితో వెరిఫై చేయించారా, సత్యమైన తండ్రి మీతో ఉన్నారు. పూర్తి అసత్య ప్రపంచం ఒకవైపు ఉంటుంది మరియు ఒక్క బాబా మీతో ఉంటారు, మీ విజయము నిశ్చితముగా జరిగే ఉంది. మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకంటే బాబా మీతో ఉన్నారు. అబద్ధము అని అంటున్నారు కదా, మరి అబద్ధాన్ని అబద్ధం చేసెయ్యండి, ఎందుకు పెంచుతారు! ఈరోజు బాబాకు సాకులు చెప్పడం నచ్చదు. ఇది జరిగింది, ఇది జరిగింది. ఇది జరిగింది.... ఇది, ఇది అనే పాట సమాప్తం కావాలి. మంచి జరిగింది, మంచి జరుగుతుంది. మంచిగా ఉంటాము, అందరినీ మంచిగా చేస్తాము. మంచి, మంచి అనే పాటను పాడండి. మరి నచ్చిందా? నచ్చిందా? సాకులు చెప్పటాన్ని సమాప్తం చేస్తారా? చేస్తారా? రెండు- రెండు చేతులను ఎత్తండి. అచ్ఛా. బాగా ఊపండి. అచ్ఛా, చూస్తున్నవారు కూడా చేతులు ఊపుతున్నారు. ఎక్కడ నుండి చూస్తున్నాకానీ, చేతులు ఊపండి. మీరైతే ఊపుతున్నారు. అచ్ఛా, ఇప్పుడు క్రిందకు దించండి, ఇప్పుడు మీలో రాబోయే పరివర్తనకు చప్పట్లు కొట్టండి. (అందరూ బాగా గట్టిగా చప్పట్లు కొట్టారు) అచ్ఛా.
ఈరోజు, ఈ సమయము, ఈ సంగఠన చిత్రము సదా మీ ముందు ఉంచుకోండి. ఎప్పుడైనా బలహీనత వస్తే, రానివ్వకండి, తలుపును మూసెయ్యండి. తలుపు ఏదో తెలుసు కదా! మూసెయ్యండి. డబల్ మూసెయ్యండి, డబల్ తాళం వెయ్యండి. ఈరోజుల్లో సింగల్ తాళం సరిపోదు. ఒకటి స్మృతి, మరొకటి మనసును సేవలో బిజీగా పెట్టుకోవడము. ఈ రెండు ఆల్మైటీ తాళాలను వెయ్యండి. గాడ్రేజ్ తాళం కాదు, గాడ్ ఇచ్చిన తాళం వెయ్యండి. పక్కాగా జాగరణ చెయ్యండి. పక్కాగా వ్రతాన్ని పాటించండి.
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై అమితమైన ప్రేమ ఉంది. లాస్ట్ నంబరువారైనా కానీ బాప్‌దాదాకు ఆ సంతానముపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఎందుకు? ఇటువంటి పిల్లలు ఏ తండ్రికైనా లభించారా? ఒక్క బాప్దాదాకే బ్రాహ్మణ పిల్లలు లభిస్తారు. ఎటువంటి మహాత్మ అయినా, మహామండలేశ్వరుడు అయినా, ధర్మపిత అయినా- ప్రతి ఒక్కరూ నా బాబా అని అనే ఇటువంటి పిల్లలు ఎవరికైనా లభించారా? ఉన్నారా ఎవరైనా చరిత్రలో? అందుకే బాప్‌దాదాకు పిల్లల ప్రతి ఒక్కరి మహత్వము తెలుసు. వాహ్ బాబా వాహ్! అనే పాటను పాడుతాము అని పిల్లలు అంటారు. పిల్లలకన్నా 100రెట్లు ఎక్కువగా వాహ్ పిల్లలు వాహ్! అని బాబా పాటను పాడుతారు. అంతే కదా. వాహ్ వాహ్ పిల్లలు కదా! మధువనంవారు వాహ్ వాహ్ పిల్లలు కదా. వెనుక కూర్చున్న వారూ వాహ్ వాహ్ పిల్లలు కదా! అచ్ఛా.
సేవ టర్న్ భోపాల్ జోన్ వారిది:- జెండా ఊపండి, అప్పుడు తెలుస్తుంది. బాగుంది, భోపాల్ కూడా మధ్య ప్రదేశ్‌లో ఉంది. మధ్యప్రదేశ్ చాలా పెద్దది. సేవ అయితే చేసారు, ఆరంభంలో మంచి మంచి గవర్నర్లు, వి.ఐ.పీలను తీసుకు వచ్చారు కానీ ఇప్పుడు అంతగా తీసుకురావడం లేదు. తీసుకువచ్చారు. కానీ గవర్నర్ లేదా విశేషమైనవారిని తీసుకురాలేదు. కనుక భోపాల్‌కు బాప్‌దాదా విశేషంగా రెండు సేవలను ఇవ్వదలుచుకున్నారు. టీచర్లు శ్రద్ధతో వినండి. అవి ఏమిటో చెప్పమంటారా? రాజస్థాన్ గవర్నర్ వచ్చారు, ఇది దైవీ పరివారము అని బాగా అనుభవము చేసుకుని వెళ్ళారు. అంతేకాక సేవా బాధ్యతను కూడా తీసుకు వెళ్ళారు. అలాగే అటువంటి విశేషమైన వి.ఐ.పీలు మధ్యప్రదేశ్‌లో ఉన్నారు, బాప్‌దాదాకు తెలుసు, దాగి ఉన్నారు. కేవలం వారిని మైదానంలోకి తీసుకురావలసి ఉంది. రెండవది, మీరు వేటినైతే పెద్ద సేవాకేంద్రాలు అని అంటారో వాటి లిస్టును ఇవ్వండి. ఆ పెద్ద సెంటర్లన్నీ కనీసం ఒక్క సంవత్సరం లోపల, చాలా సమయాన్ని ఇస్తున్నాము, అంత ఇవ్వకూడదు. కానీ ఒక్క సంవత్సరం లోపల పెద్ద సెంటరు తమ వారస క్వాలిటీని ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నా కానీ, యజ్ఞంలో ఆ వారస క్వాలిటీ పిల్లలు ప్రసిద్ధమవ్వాలి. చాలా సెంటర్లు మా వద్ద వారస క్వాలిటీవారు ఉన్నారు అని అంటారు. కానీ వారసులు దాగి ఉండలేరు. వారసుల క్వాలిటీ ఉన్నట్లయితే వారు దాగి ఉండరు. బాప్‌దాదా గుప్త వారసులను ఒప్పుకోరు. వారి కనెక్షన్, వారి రిలేషన్ నియమం అనుసారంగానే ఉండాలి. ఇటువంటి వారసుడిని ప్రతి ఒక్క పెద్ద సెంటరు ముందుకు తీసుకు రావాలి. పెద్ద సెంటర్లు తీసుకురాగలవు కదా? మేము చిన్నవారము కదా అని అనవద్దు. ఇందులో చిన్నగా కావద్దు. చిన్నవారు కూడా పెద్దవారిగా కండి. సరేనా టీచర్లూ? సరిగ్గానే చెప్పాము కదా? చిన్నవారము పెద్దగా అయి చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి, జెండా ఊపండి. మనసుతో ఊపుతున్నారు కదా! అయితే ఈ రెండు కార్యాలు భోపాల్వారు చెయ్యాలి. సరేనా. భోపాల్వారూ, మీలోనే ఒకరు వారసులు అవుతారు కదా. అయితే చూస్తాము. నిజానికి 6 నెలలలోనే తయారు కావాలి, అయినా కానీ బాప్‌దాదా ఒక్క సంవత్సరం సమయాన్ని ఇస్తున్నారు. సరేనా. ఇకపోతే, సేవ యొక్క బంగారు అవకాశం లభించింది, ఇది మంచిది. ఇది స్వ ఉన్నతికి మంచి అవకాశము అని బాప్‌దాదా సదా వినిపిస్తారు. ఎందుకంటే సేవా బాధ్యత వేరు కాదు, యజ్ఞ సేవ యొక్క బాధ్యత. అక్కడ అయితే సమయము మరియు అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడైతే స్వ ఉన్నతి లేదా యజ్ఞ సేవ మీదనే అటెన్షన్ ఉంటుంది. యజ్ఞ సేవ యొక్క పుణ్యమును ప్రతి సమయము జమ చేసుకున్నట్లయితే మీ పుణ్య ఖాతా చాలా చాలా త్వరగా వృద్ధి కాగలదు. కనుక మంచి పని చేసారు, సంఖ్య కూడా బాగా వచ్చింది. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇక రిజల్టును చూస్తాము. అచ్ఛా.
60 దేశాలనుండి 700 మంది డబల్ విదేశీయులు వచ్చారు:- బాప్‌దాదాకు డబల్ విదేశీయులను చూసి ఒక విషయంలో విశేషంగా సంతోషం కలుగుతుంది, ఎక్స్ట్రా సంతోషం కలుగుతుంది. అది ఏమిటంటే, ఆరంభంలో డబల్ విదేశీయులు వచ్చినప్పుడు, టీచర్లకు గుర్తుండి ఉంటుంది. భిన్న భిన్న కల్చర్ల నుండి ట్రాన్స్ఫర్ కావటానికి ఎంతో కష్టపడ్డారు, కానీ ఆ చర్చ అంతగా ఇప్పుడు జరగడం లేదు అని బాప్‌దాదా చూసారు. అందుకు కారణము ఏమిటి? ఎందుకంటే ఒకరినొకరు చూసుకుని సంగఠన బాగా వృద్ధి చెందింది కదా! మెజారిటీ పిల్లలు తమ తమ సమీప ప్రదేశాలలో సందేశాన్ని ఇవ్వటానికి ఏదో ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. సందేశమును ఇవ్వాలన్న ఉల్లాసము చాలా బాగుంది. దాని రిజల్టుగా ప్రతి టర్న్‌లో విదేశీయుల గ్రూపు తక్కువగా ఏమీ ఉండటం లేదు. క్వాలీటీ కూడా బాగుంది మరియు క్వాన్టిటీ కూడా పెరుగుతూ ఉంది. అందుకే ఒక చందన వృక్షంలా అయ్యారు. ఈ చందన వృక్షాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారము అయితే చేరుకుంటుంది. మీరు ఈ-మెయిల్ ద్వారా పంపినా కానీ బాప్‌దాదా వద్దకు ఆ కాపీ ముందుగానే చేరుకుంటుంది. సేవా ఉల్లాసము బాగుంది. ఇప్పుడు ఇక కేవలము ఈనాటి వ్రతాన్ని పక్కా చేసుకోండి. విదేశీయులు నంబర్‌ను తీసుకుంటారు కదా? నంబరు తీసుకుంటారా? ఏ నంబరు? మొదటి నంబరా లేక రెండవ నంబరైనా ఫర్వాలేదా? (మొదటి నంబరు) ఎవరికైతే ఒక్క బాబాపై ప్రేమ ఉంటుందో వారు ఒకటే సమానంగా మొదటి నంబరునే తీసుకుంటారు. ఒక్క బాబాయే ప్రపంచము అని స్లోగన్ ఉంది కదా, ఉన్నదే ఒక్క ప్రపంచమైనప్పుడు నంబరు కూడా ఒక్కటే కదా. మీకు డబల్ విదేశీయులు అని టైటిల్ ఉంది కదా. అలాగే పురుషార్థంలో, సంకల్ప దృఢత్వంలో కూడా డబల్ ఫోర్సు యొక్క పురుషార్థాన్ని చేసి చూపించండి. అటెన్షన్‌ను ఉంచుతారు, కానీ తేడా ఎక్కడ వస్తుంది? తీవ్రతతో కూడిన దృఢత్వం లోపిస్తుంది, ప్రోగ్రాములు చాలా బాగా చేస్తారు. బాప్‌దాదా కూడా టాపిక్ వింటారు, ప్రతి గ్రూపు యొక్క పురుషార్థ అంశము విని చాలా సంతోషిస్తారు. కానీ టాపిక్‌ను ప్రారంభించినప్పుడు లేదా లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు చాలా ఫోర్సుతో చేస్తారు కానీ ఏదో ఒక పరీక్ష అయితే వస్తుంది, రావలసిందే. పరీక్ష లేకుండా పాస్ కాలేరు. అందులో దృఢత్వము లోపిస్తుంది మరియు సాధారణ పురుషార్థంగా మారిపోతుంది. సదా దృఢత్వం కలిగి ఉండటంలో లోపం ఉంటుంది. కనుక అన్నింటిలో డబల్ పురుషార్థులు. చేసి చూపిస్తాము, తయారై చూపిస్తాము. సరేనా. ఇంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి కదా. ఉన్నాయి, కేవలం దృఢత్వమును పరిశీలించుకుంటూ ఉండండి. మాటలలోకి వెళ్ళకండి. దృఢత్వమును చూడండి. అచ్ఛా.
డబల్ విదేశీ కుమారీల గ్రూపు:- అచ్ఛా, ఈ బ్యానర్‌ను చేసారు. చేతులు ఊపండి. ఇది బాగా చేస్తారు ఎందుకంటే మధువన వాతావరణ ప్రభావం కూడా పడుతుంది. దాదీల ప్రేమ మరియు వృత్తుల వాయుమండలం తోడుగా ఉంటుంది. మీరు పెట్టుకున్న విశేష అంశము, పరస్పర చర్చల ద్వారా విశేషమైన సహాయం లభిస్తుంది. సహాయం లభిస్తుందా? అచ్ఛా, ఈ నషా ఎంత సమయం వరకు ఉంటుంది? 6-8నెలలు ఉంటుందా లేక సదా ఉంటుందా? దీనిని రివైజ్ చెయ్యండి, మనసులో రివైజ్ చేసుకోండి మరియు రియలైజ్ కండి. జ్ఞాన విషయాలను రివైజ్ కూడా చెయ్యండి మరియు రియలైజ్ కూడా కండి. శిక్షణా పాయింట్లు లేక నషా మరియు సంతోషానికి సంబంధించిన ఒక్కొక్క పాయింటును రియలైజ్ చేసుకోండి. ప్రతి విషయము అనుభవములోకి వచ్చిందా అని స్వయాన్ని రియలైజ్ చేసుకోండి. అనుభవం చేసారా లేక జ్ఞానం ఆధారంతో కేవలం ఆలోచించారా, విన్నారా, వర్ణించారా? దేశంలో కానీ, విదేశంలో కానీ, ప్రతి పాయింటును గాఢంగా అనుభూతి చేసుకోవడంపై అటెన్షన్ తక్కువగా ఉండటాన్ని బాప్‌దాదా మొత్తంగా చూసారు. వినడము మరియు వినిపించడములో అటెన్షన్ బాగుంది, అందులో నంబర్‌వన్‌గా ఉన్నారు, కానీ అనుభవీమూర్తులుగా కావడము, నడుస్తూ తిరుగుతూ ఆత్మానుభూతి కలగడము, తండ్రి యొక్క కంబైండు రూపాన్ని అనుభవం చేసుకోవడము, అనుభవములో లోపము ఉన్నది. అందుకే రియలైజ్ కండి, అప్పుడు రియల్ గోల్డ్ అవుతారు. ఇకపోతే బాప్‌దాదా సంతోషిస్తున్నారు. టీచర్లు కూడా అటెన్షన్‌ను పెడుతున్నారు, మీ దాదీ (జానకి దాదీ) చాలా అటెన్షన్ ఇస్తారు. వీరు మీ పై ఎంత అటెన్షన్ అయితే ఇస్తారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, అంతగా ప్రతి ఒక్కరూ స్వయంపై ఉంచాలి. బాబా ఆశలపై అటెన్షన్ పెట్టినట్లయితే నంబర్‌వన్‌గా అయ్యే ఉన్నారు. మీ లోపాన్ని రియలైజ్ కూడా చేసుకుంటారు కానీ పరివర్తన చేసుకోవడంలో లోపం ఉంటుంది. అందులో ఒకటి, దృఢత్వంలో లోపము మరియు రెండవది మనసును ఏకాగ్రం చేసే విశేషత, ఏ క్షణం కావాలనుకుంటే ఆ క్షణం మనసు ఏకాగ్రం కావాలి, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఏకాగ్రం కావాలి, అందులో లోపమును బాప్‌దాదా చూసారు. దేశం వారైనా, విదేశీయులైనా దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి. దృఢత్వము మరియు ఏకాగ్రత ఇప్పటివరకూ వ్యర్థంగా పడి ఉన్నాయి. ఎకానమీ లేదు. సంకల్పము, వాణి, సంబంధ - సంపర్కంలో కూడా, ప్రతి స్వభావ సంస్కారంలో కూడా ఎకానమీతో ఖర్చు చెయ్యండి. ఎకానమీ కూడా అవసరము. యజ్ఞము యొక్క ఎకానమీ, ఎంతగా సంకల్పాల ఎకానమీను చేస్తారో అంతగా యజ్ఞము యొక్క ఎకానమీని చెయ్యకుండా ఉండలేరు. యజ్ఞము యొక్క ఎకానమీ చెయ్యడం రావడం లేదు, సంస్కారాలు ఇమర్జ్ కావడం లేదు అంటే సమయము మరియు సంకల్పాల ఎకానమీని చేసే అలవాటు లేదు అని అర్థం చేసుకోండి. అందుకే యజ్ఞం కొరకు ఎకానమీ సంస్కారాలు ఇమర్జ్ కావడం లేదు. కనుక దృఢత్వము, ఏకాగ్రత మరియు ఎకానమీ. సరేనా. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు, సేవా ప్లాన్లలో కూడా సంతోషంగా ఉన్నారు. సేవ బాగా చేస్తున్నారు కదా. ఎదురుగా గాయత్రి కూర్చున్నారు కదా. సేవా ఉల్లాసము చాలా ఉంది కదా.
ఇంటర్నేషనల్ మదర్ గ్రూపు:- చిత్రాలు చాలా చక్కగా వేస్తారు. ఇది వీరి విషేశత. బాగా వేస్తారు. చూడండి. ఇంతమంది మాతలు, ఒకవేళ ఒక్కొక్క మాత జగన్మాతగా అయితే, వృత్తితో ప్రతి సమయము, ప్రతి సంకల్పంలో ప్రతి మాత జగన్మాత స్వరూపంలో స్థితి అయితే విశ్వానికి ఎన్ని వైబ్రేషన్లు లభిస్తాయి. ఎందుకంటే తల్లి భావన త్వరగా చేరుకుంటుంది. కనుక ఇక్కడ నిలబడి ఉన్న మాతలందరూ, ప్రతి సమయము జగత్తులోని తమ పిల్లలకు, సోదరులకు వైబ్రేషన్లను ఇస్తూ ఉండండి. ఎలా అయితే తల్లి ప్రేమతో పిల్లలకు పాలన ఇస్తుందో, అలాగే మీరూ అందరినీ పిల్లలుగా భావించి పాలనను ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాప్తి చేయండి. సరేనా. రోజంతటిలో ప్రతి మాత జగన్మాతగా అయి వైబ్రేషన్లను ఇచ్చారా అని ఇప్పుడు చూస్తాము. ఇందులో స్వ ఉన్నతి స్వతహాగా ఉంది. ఇది చేసి చూపించండి. మాతలు బాగున్నారు, బాప్‌దాదా దృష్టిలో ఉన్నారు, చెయ్యగలరు. ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.
రష్యావారు ప్రాజెక్టును తయారు చేసారు. అందులో 50 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని నిర్ధారించి 150 పట్టణాల సేవను చేస్తారు:- బాగుంది, బాప్‌దాదా బచ్చీ ద్వారా కూడా సమాచారాన్ని విన్నారు. బాప్‌దాదాకు ఒక విషయం నచ్చింది. ఓ.కే. అన్న మాటలో రిజల్టును పంపండి అని బాప్‌దాదా చెప్పిన మాట అనుసారంగా బాగా పంపారు, అందుకు అభినందనలు. ఈ ప్లాను గురించి కూడా విన్నారు. మంచి ఉల్లాస ఉత్సాహాలతో తయారు చేసారు. విధి కూడా సహజమైపోతుంది. ఉల్లాస ఉత్సాహంలో విజయము ఇమిడి ఉంది. హ్యాండ్స్ కూడా బాగా ఉన్నారు. సంఖ్య కూడా బాగుంది. బాప్‌దాదాకు నచ్చింది. అందరి శుభ కామనలు. ఇప్పుడు అందరూ వింటున్నారు కాబట్టి అందరి శుభ భావనలు కూడా మీ ఈ ప్రోగ్రాముకు ఉంటాయి, అభినందనలు.
మోహిని అక్కయ్య ఇలా వినిపించారు - బాంబే నుండి దాదీజీ మరియు తోడుగా ఉంటున్న సేవా సహయోగులందరూ చాలా చాలా స్మృతులను పంపారు:- దాదీ అయితే అందరి మనసులకు ప్రియమైన దాదీ. అందరూ మనస్ఫూర్తిగా తమ ప్రేమపూర్వక శుభ అలలను పంపుతున్నారు. దాదీ పేషెంటుగా ఉన్నారు అని అంటున్నా కానీ, బాప్‌దాదా కూడా ముందు వినిపించారు, వీరు పేషంట్ కాదు, పేషంస్ (సహనము)లో ఉండేవారు, పేషంట్‌గా ఉన్నప్పటికీ పేషంస్ యొక్క స్వరూపమేమిటో వీరు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. దాదీకి ఏమైనా అవుతుందేమో అని మీకు అనిపిస్తుండవచ్చు కానీ మీరు దాదీని అడిగితే ఏమీ లేదు అని అంటారు. కనుక వీరు పేషంట్ కారు, పేషంస్ స్వరూపాన్ని చూపిస్తున్నారు. రోగము ఉన్నా కానీ అతీతముగా మరియు ప్రియంగా ఉన్నారు. రోగం ఉంది కానీ వీరు తమ ఆనందంలో ఉన్నారు. ఈ శరీరము ప్యూరిఫై (పవిత్రం) అవుతుంది. తమ అంతిమ స్థితి, భవిష్య మరియు భక్తి యొక్క స్థితి తయారవుతుంది. వర్తమాన జీవితంలో ఉంటూ కూడా ముక్తి అవస్థలో ఉండటము, అంతిమ సమయంలో అష్ట దేవీగా ప్రసిద్ధి కావడము మరియు భక్తిలో ఇష్ట దైవముగా కావడము. మూడు సంస్కారాల పాత్రలను చేస్తున్నారు. ఇకపోతే సేవ చేసే సేవాధారులంతా మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కేవలం వారి కోసం కాదు, వారైతే రాత్రిపగలు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కానీ బ్రాహ్మణ పరివారంలో కూడా ఎటువంటి వ్యర్థ సంకల్పాలను చెయ్యకండి. దాదీ మీవారు, మీవారిగానే ఉంటారు. బ్రహ్మా బాబా అవ్యక్తమయ్యే సమయంలో, దాదీకి దృష్టిని ఇచ్చినప్పుడు ఆ దృష్టి యొక్క విల్ పవర్ (మనో ధైర్యం) సర్వులకు చాలా స్నేహీగా, సర్వ సమర్థంగా, సర్వ కార్యకర్తగా, నిమిత్తంగా మరియు నిర్మాణంగా కావటంలో బ్రహ్మా బాబాను పూర్తిగా ఫాలో చేస్తూ పూర్తి బ్రాహ్మణ పరివారములో శక్తిని నింపారు. బాప్‌దాదాను తమకు తోడుగా పెట్టుకుని, దాదీలంరితో కలిసి కలిసి ఉండి చాలా మంచి పాత్రను నిర్వహించారు, ఇప్పుడు సూక్ష్మంగా మీతో పాటు పాత్రను నిర్వహిస్తున్నారు. బాప్‌దాదా కూడా దాదీ అద్భుతాన్ని పాడుతారు. అందరినీ సంగఠనా బంధనంలో, స్నేహము మరియు సహయోగము ఆధారముతో బంధించారు. ఇది అమర వరదానము. అందరి ప్రేమ బాగుంది. ఇది చూసి కూడా బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఇకపోతే బాప్‌దాదా చూస్తున్నారు - ఎవరైతే కార్డులు, ఉత్తరాలు, గ్రీటింగ్స్ పంపారో వాటిని బాప్‌దాదా స్వీకరించారు మరియు రిటర్న్‌లో ఒక్కొక్కరికీ పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు దీవెనలను ఇస్తున్నారు. ఎవరైతే కార్డులు మరియు ఉత్తరాల ద్వారా కాక మనసుతో, సంకల్పంతో కూడా తమ ఉల్లాస ఉత్సాహాలను పంపారో, ఆ పిల్లలందరికీ కూడా చాలా చాలా కోటానురెట్ల ప్రియస్మృతులు మరియు తండ్రి యొక్క హృదయ దీవెనలు.
మీరందరూ సమ్ముఖంలో కూర్చున్నారు. సమ్ముఖంలో ఉండే ఆనందమే వేరు. సైన్సు సాధనాల ద్వారా ఎంత స్పష్టంగా అయినా కానీ, ఎంత బాగా అనిపించినా కానీ, సమ్ముఖంలో మధువనంలో తమ ఉన్నతి యొక్క ద్వారము అనుభవము అవుతుంది. అచ్ఛా, ఇప్పుడు బాప్‌దాదా ఏదైతే చెప్పారో - ప్రతి ఒక్కరూ ఒక్క క్షణము దృఢ సంకల్ప స్వరూపంలో కూర్చోండి - సోమరితనము, నిర్లక్ష్యమును ప్రతి సమయము దృఢ సంకల్పము ద్వారా సమాప్తం చేసి బహుకాలపు లెక్కను జమ చేసుకోవలసిందే. ఏమి జరిగినా కానీ, ఏదీ చూసేది లేదు. బాబా హృదయ సింహాసనాధికారులుగా కావలసిందే, విశ్వ రాజ్య సింహాసనాధికారులుగా కావలసిందే. ఈ దృఢ సంకల్ప స్వరూపులుగా అందరూ కూర్చోండి. అచ్ఛా.
నలు వైపుల సదా ఉల్లాస ఉత్సాహాల అనుభవాలలో ఉండేవారికి, సదా సఫలతకు తాళం చెవి అయిన దృఢతను కార్యంలోకి తీసుకువచ్చేవారికి, సదా తండ్రి తోడు మరియు ప్రతి కార్యములో సహచరునిగా అయి ఉండేవారికి, సదా ఎకానమీ మరియు ఏకనామీ, ఏకాగ్రతా స్వరూపంలో మున్ముందుకు ఎగిరేటువంటి వారికి, బాబా యొక్క అతి ప్రియమైన, చాలా కాలం తరువాత కలిసిన విశేషమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- ఇప్పుడు దాదీలు కూడా చాలా ప్రియమైనవారు అయిపోయారు. లెక్క పెట్టుకునేంతగా తక్కువైపోయారు. ప్రియమైనవారిగా అయ్యారు కదా. ఇంతటి ప్రేమను ఎవరు అందిస్తారు అనే పాటను పాడుతూ ఉండండి! పిల్లలు ఇంత చేస్తున్నారు, బాబా అంటారు, పిల్లలు లేకపొతే బాబా ఏమి చేస్తారు. పిల్లలు లేకపోతే బాబా అని ఎవరు అంటారు. (జానకి దాదీ అన్నారు - బాబా సంసారమైతే ఉంది, కానీ సంస్కారంలోకి రావాలి, బాబా ఇది చెయ్యండి). కానీ బాబా చేస్తే మరి పొందేది ఎవరు? ఇది కూడా బాబా చేస్తే మరి బాబాకైతే ఫలితాన్ని పొందేది లేదు. సహయోగము చెయ్యడము బాబా కర్తవ్యము, చేతినీ అందిస్తారు, కాలిని అందిస్తారు కానీ నడవాల్సింది అయితే పిల్లలు స్వయమే కదా. అచ్ఛా. చాలా బాగుంది.
ముగ్గురు పెద్దన్నయ్యలతో:- తండ్రి మరియు పిల్లల జన్మదినానికి స్మృతి చిహ్నము ఈ శివరాత్రి. తండ్రి కూడా ఒంటరిగా ఏమీ చెయ్యలేదు. పిల్లలతోటే ప్రతీ కార్యాన్ని చేసారు. కనుక సంగఠన శక్తిని మళ్ళీ స్టేజీ మీదకు తీసుకు రావలసి ఉంది. ఒకరు చెబితే మరొకరు చెయ్యాలి. ఇతరుల విషయాలను చూడకుండా సంగఠనను కలపండి, ఇదే అవసరము. నిమిత్త ఆత్మలైన మీ పని ఇది. సంగఠనను స్టేజీ మీద ప్రత్యక్షం చెయ్యండి. ఇదే అవసరము. సరేనా!
భోలీ దాదీ 9 ఫిబ్రవరి నాడు శరీరమును విడిచి పెట్టారు:- భోలీ అంటే కూడా అందరికీ ప్రేమ. ఆరోగ్యం ఎలా ఉన్నా కానీ భండారాను విడిచి పెట్టలేదు. బ్రహ్మా బాబా భండారాలో కూర్చోబెడితే అంతిమం వరకు భండారాను విడిచిపెట్టలేదు. వీరు కూడా కర్మణలో విశేష దేవి. అందుకే అందరికీ ఆంతరిక ప్రేమ చాలా ఉంది. (ఇప్పుడు మీరా కూడా బాగా చేస్తుంది) ఎందుకు చెయ్యరు, తప్పకుండా చేస్తారు. మంచి పాలనను తీసుకున్నారు కదా. అచ్ఛా.
బాప్‌దాదా డైమండ్ హాల్ స్టేజి మీద తమ హస్తాలతో శివజెండాను ఎగురవేసి అందరికీ అభినందనలు తెలిపారు:-
అందరూ ఎంతో ప్రేమతో తండ్రి జన్మదినాన్ని మరియు తమ జన్మ దినాన్ని జరుపుకున్నారు. ఇందుకు పదమ పదమ పదమారెట్లు అభినందనలు, శుభాకాంక్షలు. బాబా చిహ్నము ఉన్న జెండాను ఎగురవేసి పూలు కురిపించినట్లుగా ఆత్మ యొక్క మనసులో బాబా స్మృతి అనే జెండాను ఎగురవేయండి. మీ మనసులో అయితే ఉండనే ఉన్నారు కానీ ఇప్పుడు సర్వుల హృదయాలలో బాబా జెండా అనగా స్మృతి జెండాను ఎగురవేయండి అప్పుడు పూర్తి విశ్వము పూలతోటలా మారిపోతుంది. ముళ్ళ అడవి సమాప్తమై పూలతోట వస్తుంది. చెయ్యాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది, కేవలం నిమిత్తంగా కావాలి అన్న సంకల్పాలను మనసులో ఇమర్జ్ చేసుకోండి. అచ్ఛా.
ఓంశాంతి