Search for a command to run...
18 Mar 2008
కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్ ముక్తిదాతలుగా కండి, అందరికీ తండ్రి సాంగత్యము అనే రంగును వేసి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి
18 March 2008 · తెలుగు
ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్‌దాదా తమ నలు వైపుల ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి, ఇది చూసి హర్షిస్తున్నారు. ఖజానాలు అయితే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా లభించాయి, అయినప్పటికీ జమ ఖాతా పిల్లలందరిదీ వేరువేరుగా ఉంది. సమయ ప్రమాణంగా ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చూడాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఇప్పుడు ఒక్క జన్మ కోసం కాదు, ఈ అవినాశీ ఖజానాలు అనేక జన్మలు తోడుగా నిలువనున్నాయి. ఈ సమయంలోని ఖజానాల గురించి అయితే పిల్లలకు తెలుసు. బాప్‌దాదా ఏ ఏ ఖజానాలు ఇచ్చారో వాటి గురించి చెప్పగానే అవి అందరి ముందుకు వచ్చేసాయి. అందరి ఎదుట ఖజానాల లిస్టు ఇమర్జ్ అయిపోయింది కదా! ఎందుకంటే బాప్‌దాదా ముందుగానే వినిపించి ఉన్నారు, ఖజానాలు అయితే లభించాయి కానీ వాటిని జమ చేసుకునేందుకు విధి ఏమిటి? ఎవరు ఎంతగా నిమిత్తంగా మరియు నిర్మానంగా అవుతారో అంతగా ఖజానాలు జమ అవుతాయి. కావున పరిశీలించుకోండి - నిమిత్తంగా మరియు నిర్మానంగా అయ్యే విధితో మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి? ఎంతగా ఖజానాలు జమ అయి ఉంటాయో, నిండుగా ఉంటాయో, వారి నడవడిక మరియు ముఖము నుండి నిండుతనము ఉన్న ఆత్మ యొక్క ఆత్మిక నషా స్వతహాగా కనిపిస్తుంది. వారి ముఖముపై సదా ఆత్మిక నషా మరియు శుద్ధ గర్వము మెరుస్తూ ఉంటాయి. ఎంతగా శుద్ధ గర్వము ఉంటుందో అంతగా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఆత్మిక శుద్ధ గర్వము అనగా ఆత్మిక నషా నిశ్చింత చక్రవర్తికి గుర్తు. కావున, నా ముఖము మరియు నడవడికలో నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయము మరియు నషా ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా! అయితే హృదయము అనే దర్పణంలో మీ ముఖాన్ని పరిశీలించుకోండి. ఏ విధమైన చింత అయితే లేదు కదా? ఏమవుతుంది! ఎలా అవుతుంది! ఇలా అయితే జరుగదు కదా! ఏ సంకల్పమూ ఉండిపోలేదు కదా! ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిది మరియు ఏదైతే జరుగనున్నదో అది చాలా చాలా మంచిది అన్న సంకల్పము నిశ్చింత చక్రవర్తులకు ఉంటుంది. దీనినే శుద్ధ గర్వము అని అంటారు, ఆత్మిక శుద్ధ గర్వము అనగా స్వమానధారి ఆత్మ. వినాశీ ధనంగలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగా సమయం అనుసారంగా చింతలో ఉంటారు. మీకు మీ ఈశ్వరీయ ఖజానాల గురించి చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారు కదా! ఎందుకంటే ఎవరైతే ఖజానాలకు యజమానులుగా మరియు పరమాత్మకు సంతానముగా ఉంటారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలు మాకు తోడుగా నిలువనున్నాయి, ఉంటాయి అని వారికి నిశ్చయము ఉంటుంది. అందుకే వారు నిశ్చయబుద్ధి నిశ్చింతులుగా ఉంటారు.
మరి ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల జమ ఖాతాను చూస్తున్నారు. విశేషంగా మూడు విధాల ఖజానాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరు అని ముందు కూడా వినిపించి ఉన్నాము. ఒకటి - తమ పురుషార్థం అనుసారంగా ఖజానాలు జమ చేసుకోవడము. ఇది ఒక ఖాతా. రెండవ ఖాతా - దీవెనల ఖాతా. దీవెనల ఖాతా జమ అయ్యేందుకు సాధనము - సదా సంబంధ సంపర్కం మరియు సేవలో ఉంటూ సంకల్పము, మాట మరియు కర్మ మూడింటిలో స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా మరియు ఇతరులు కూడా సర్వులు మరియు సదా సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత దీవెనల ఖాతాను పెంచుతుంది. మరియు మూడవ ఖాతా - పుణ్య ఖాతా. పుణ్య ఖాతాకు సాధనము - ఏ సేవ చేసినా, మనసు ద్వారా కానీ, వాణి ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ, సంబంధంలో కానీ, సంపర్కంలోకానీ సదా నిస్వార్థంగా మరియు అనంతమైన వృత్తి, స్వభావము, భావము మరియు భావనతో సేవ చేయడము. దీనితో పుణ్య ఖాతా స్వతహాగానే జమ అయిపోతుంది. కావున పరిశీలించుకోండి - పరిశీలించుకోవడమైతే వచ్చు కదా? వచ్చా? ఎవరికైతే రాదో వారు చేతులెత్తండి. ఎవరికైతే రాదో, ఎవ్వరూ లేరు అంటే అందరికీ పరిశీలించుకోవడము వచ్చు. మరి స్వ పురుషార్థం యొక్క ఖాతా, దీవెనల ఖాతా, పుణ్య ఖాతా మూడూ ఎంత శాతంలో జమ అయి ఉన్నాయి అని పరిశీలించుకున్నారా? పరిశీలించుకున్నారా? ఎవరైతే పరిశీలించుకుంటారో వారు చేతులెత్తండి. పరిశీలించుకుంటూ ఉంటారా? మొదటి లైనువారు చెయ్యరా? పరిశీలించుకోరా? ఏమంటారు? చేస్తారు కదా! ఎందుకంటే ఇప్పుడు సమయము యొక్క సమీపత తీవ్రగతితో ముందుకు సాగుతుంది అని బాప్‌దాదా అయితే వినిపించి ఉన్నారు, సూచనను ఇచ్చి ఉన్నారు. కావున మీ చెకింగ్‌ను పదే పదే చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజా పిల్లలుగా, రాజయోగి సో రాజా పిల్లలుగా చూడాలని ఆశిస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు రాజా పిల్లలు అని పరమాత్మ తండ్రికి ఆత్మిక నషా ఉంది. పరమాత్మ సంతానము స్వరాజ్య అధికారి సో విశ్వ రాజ్యాధికారి.
ఖజానాలైతే బాప్‌దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను జమ చేసుకునేందుకు చాలా సహజమైన విధి - విధి అనండి లేక తాళం చెవి అనండి, అది తెలుసు కదా! జమ చేసుకునేందుకు తాళం చెవి ఏమిటి? తెలుసా? మూడు బిందువులు. అందరి వద్ద ఈ తాళం చెవి ఉంది కదా? మూడు బిందువులను పెట్టండి మరియు ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. మాతలకు తాళం వేయడం వచ్చు కదా, తాళం చెవులను జాగ్రత్తపరచడంలో తెలివైనవారు. మరి మాతలందరూ ఈ మూడు బిందువులు అనే తాళం చెవిని జాగ్రత్తగా పెట్టుకున్నారా, తాళం వేసారా? చెప్పండి, మాతలు తాళం చెవి ఉన్నదా? ఎవరి వద్ద అయితే ఉందో వారు చేతులెత్తండి. మాతలు లేవండి. తాళం చెవి దొంగతనం కావడం లేదు కదా? ఇంట్లోని ప్రతి వస్తువు యొక్క తాళం చెవిని జాగ్రత్తపరచడం మాతలకు చాలా బాగా వచ్చు కదా. మరి ఈ తాళం చెవి కూడా సదా మీ తోడుగా ఉంటుందా!
వర్తమాన సమయంలో బాప్‌దాదా ఇదే ఆశిస్తున్నారు - ఇప్పుడు సమయము సమీపిస్తున్న కారణంగా బాప్‌దాదా ఒక్క మాటను పిల్లలందరి నుండి, సంకల్పంతో, మాటతో మరియు ప్రాక్టికల్ కర్మలో పరివర్తన చూడాలని ఆశిస్తున్నారు. ధైర్యముందా? ఒక్క మాట, ఇదే బాప్‌దాదా పిల్లలందరిలో పరివర్తన చూడాలని ఆశిస్తున్నారు. తీవ్ర పురుషార్థి నుండి నిర్లక్ష్య పురుషార్థిగా చేసే ఒకే ఒక్క మాట, ఇప్పుడు సమయం అనుసారంగా ఎటువంటి పురుషార్థం కావాలి? తీవ్ర పురుషార్థము. తీవ్ర పురుషార్థీల లైనులో రావాలని అందరూ ఆశిస్తారు కానీ ఒక్క మాట నిర్లక్ష్యంగా చేసేస్తుంది. అదేమిటో తెలుసా? పరివర్తన చేసుకోవడానికి తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చేతులెత్తండి, తయారుగా ఉన్నారా? చూడండి, మీ ఫోటో టి.విలో వస్తుంది. తయారుగా ఉన్నారా, అచ్ఛా, అభినందనలు. అచ్ఛా - తీవ్ర పురుషార్థంతో పరివర్తన చెందాలా లేక చేద్దాములే, చూద్దాములే... అని అనడం లేదు కదా? ఆ ఒక్క మాట ఏమిటో తెలిసిపోయే ఉంటుంది, ఎందుకంటే అందరూ తెలివైనవారే కదా, ఆ ఒక్క మాట, ‘కారణము’ అనే మాటను పరివర్తన చేసి ‘నివారణ’ అన్న మాటను ముందుకు తీసుకురండి. కారణాన్ని ఎదురుగా తీసుకు వచ్చినప్పుడు లేక కారణం గురించి ఆలోచించడం ద్వారా నివారణ జరుగదు. కావున బాప్‌దాదా సంకల్పం వరకు, కేవలం మాటల వరకే కాదు కానీ సంకల్పం వరకు కూడా ఈ కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చెయ్యాలని ఆశిస్తున్నారు ఎందుకంటే కారణాలు భిన్న భిన్న విధాలుగా ఉంటాయి. ఆ కారణము అన్న మాట ఆలోచనలో, మాటలో, కర్మలో తీవ్ర పురుషార్థం ముందు బంధనంగా అవుతుంది ఎందుకంటే మీరందరూ బాప్‌దాదాతో వాగ్దానం చేసి ఉన్నారు, స్నేహంతో వాగ్దానం చేసి ఉన్నారు - మేమందరమూ బాబాకు విశ్వ పరివర్తన కార్యంలో తోడుగా ఉంటాము అని. తండ్రికి తోడుగా ఉన్నారు, తండ్రి ఒంటరిగా చెయ్యడంలేదు, పిల్లలను తోడుగా తెచ్చుకుంటారు. కావున విశ్వ పరివర్తన కార్యంలో మీ కార్యము ఏమిటి? సర్వ ఆత్మల కారణాన్ని కూడా నివారణ చెయ్యడము ఎందుకంటే ఈరోజుల్లో మెజారిటీ దుఃఖంతో, అశాంతితో ఉన్న కారణంగా ఇప్పుడు ముక్తిని కోరుకుంటున్నారు. దుఃఖ అశాంతితో, సర్వ బంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తిదాత ఎవరు? బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ముక్తిదాతలు. మీ జడ చిత్రాల నుండి ఈనాటి వరకు ఏమి కోరుకుంటారు? ఇప్పుడు దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండటం చూసి అందరూ మెజారిటీ ఆత్మలు ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి. హే ముక్తిదాత, ముక్తిని ఇవ్వండి అని మనసులో దుఃఖంతో అలమటిస్తున్నారు. మీకు ఆత్మల దుఃఖ అశాంతుల ఆర్తనాదం వినిపించడం లేదా? కానీ ముక్తిదాతలుగా అయి ముందుగా ఈ ‘కారణము’ అనే మాటను ముక్తి చెయ్యండి. అప్పుడు స్వతహాగా ముక్తి యొక్క శబ్దం మీ చెవులలో మ్రోగుతుంది. ముందుగా మీలోపల నుండి ఈ మాటతో ముక్తులైతే ఇతరులను కూడా ముక్తి చెయ్యగలరు. ఇప్పుడైతే రోజురోజుకీ మీ ముందు ముక్తిదాత, ముక్తిని ఇవ్వండి అనే క్యూ రానుంది. కానీ ఇప్పటివరకు తమ పురుషార్థంలో భిన్న భిన్న కారణములు అనే మాట కారణంగా ముక్తి ద్వారం మూసుకుని ఉంది. ఈ మాటతోపాటు మరిన్ని బలహీన మాటలు కూడా ఉంటాయి. విశేషమైనది కారణము తర్వాత అందులో కూడా చాలా బలహీన మాటలు ఉంటాయి - ఇలా, అలా, ఎలా, ఇవి కూడా దీనితో ఉండే మాటలు, ద్వారము మూసుకుని ఉండటానికి ఇవి కూడా కారణము.
మరి ఈరోజు అందరూ హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. అందరూ పరుగు పరుగున వచ్చారు. స్నేహము అనే విమానంలో ఎక్కి వచ్చారు. బాబాపై స్నేహము ఉంది కాబట్టి బాబాతోపాటు హోలీ జరుపుకోవడానికి చేరుకున్నారు. అభినందనలు, విచ్చేయండి. బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు, కుర్చీతో నడిచేవారు, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నవారు కూడా ధైర్యముతో చేరుకున్నారు. బాప్‌దాదా ఈ దృశ్యాన్ని చూస్తారు, ఇక్కడకు క్లాసులోకి వస్తారు కదా. ప్రోగ్రాములోకి వస్తే కుర్చీ సహాయంతో వచ్చి సహచరుడిని పట్టుకుని వచ్చేస్తారు. మరి దీనిని ఏమని అంటారు? పరమాత్మ ప్రేమ. బాప్‌దాదా కూడా ఇటువంటి ధైర్యశాలి, స్నేహి, హృదయపూర్వక స్నేహి పిల్లలకు చాలా-చాలా హృదయపూర్వక దీవెనలు, హృదయపూర్వక ప్రేమను విశేషంగా ఇస్తున్నారు. ధైర్యమును ఉంచి వచ్చారు. తండ్రి మరియు పరివారము యొక్క సహకారము ఉండనే ఉంది. అందరికీ స్థానం మంచిగా లభించిందా? లభించిందా? ఎవరికైతే స్థానం మంచిగా లభించిందో వారు చేతులెత్తండి. విదేశీయులకు మంచిగా లభించిందా? మేళా, ఇది మేళా. అక్కడ మేళాలో దుమ్ము కూడా ఉంటుంది, భోజనము కూడా జరుగుతూ ఉంటుంది. మీకు బ్రహ్మా భోజనము మంచిగా లభించిందా, లభిస్తుందా? మంచిగా చేతులూపుతున్నారు. నిదురించడానికి మూడడుగుల భూమి లభించింది. ఇటువంటి మిలనము మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత సంగమంలోనే జరుగుతుంది. మరెప్పుడూ జరుగదు.
పిల్లలందరి జమ ఖాతాను చూడాలని ఈరోజు బాప్‌దాదాకు సంకల్పం కలిగింది. చూసారు కూడా, ఇక ముందు కూడా చూస్తారు ఎందుకంటే జమ ఖాతాను జమ చేసుకునేందుకు సమయము ఇప్పుడు సంగమయుగము అని బాప్‌దాదా పిల్లలకు ముందు కూడా సూచనను ఇచ్చి ఉన్నారు. ఈ సంగమయుగంలో ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే, పూర్తి కల్పానికి కావలసిన ఖాతాను ఇప్పుడు జమ చేసుకోవచ్చు. తర్వాత జమ ఖాతా ఉండే బ్యాంకు మూసుకుపోతుంది. అప్పుడు ఏమి చేస్తారు? బాప్‌దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. పిల్లలు నిర్లక్ష్యం కారణంగా ఒక్కోసారి మర్చిపోతారు, అవుతుందిలే, చూద్దాములే, చేస్తున్నాము కదా, నడుస్తున్నాము కదా అని అనుకుంటారని బాప్‌దాదాకు తెలుసు. మీకు కనిపించడం లేదా, మేము చేస్తున్నాము, అవును నడుస్తున్నాము, ఇంకేమి చెయ్యాలి అని ఎంతో మజాతో అంటారు. కానీ నడవడంలో మరియు ఎగరడంలో ఎంత తేడా ఉంది! నడుస్తున్నారు, అందుకు అభినందనలు. కానీ ఇప్పుడు నడిచే సమయము సమాప్తము అయిపోతుంది. ఇప్పుడు ఎగిరే సమయము. అప్పుడే గమ్యానికి చేరుకోగలరు. సాధారణ ప్రజలలోకి రావడము, భగవంతుని పిల్లలు మరియు సాధారణ ప్రజలు! శోభిస్తుందా?
ఈరోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, మరి హోలీ యొక్క అర్థము - గడిచిపోయినదేదో గడిచిపోయింది. మరి బాప్‌దాదా ఇదే ఆశిస్తున్నారు. హోలీ జరుపుకోవడానికి వచ్చారు, గడిచిపోయినదేదో గడిచిపోయింది. ఏ కారణం చేతనైనా కానీ ఏదైనా బలహీనత ఉండిపోయినట్లయితే ఇప్పుడు గడిచిపోయినదేదో గడిచిపోయింది అని తమ చిత్రాన్ని స్మృతిలోకి తీసుకురండి, స్వయమే చిత్రకారులుగా అయి తమ చిత్రాన్ని గీయండి. తెలుసా - బాప్‌దాదా ఇప్పుడు కూడా పిల్లల ఎటువంటి చిత్రాన్ని ముందుకు తీసుకు వస్తున్నారు? ఏ చిత్రాన్ని చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు మీరందరూ కూడా మీ చిత్రాన్ని గీయండి. చిత్రమును గీయడము వచ్చు కదా! శ్రేష్ఠ సంకల్పము అనే కలముతో తమ చిత్రాన్ని ఇప్పుడే మీ ఎదుటకు తీసుకురండి. ముందు అందరూ డ్రిల్ చేయండి, కర్మేంద్రియాల డ్రిల్ కాదు, మనసుతో డ్రిల్ చేయండి. రెడీ, డ్రిల్ చెయ్యడానికి రెడీగా ఉన్నారా! తల ఊపండి. చూడండి, అన్నింటికన్నా శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన చిత్రము - కిరీటము, సింహాసనము మరియు తిలకధారి చిత్రము. మరి మీ చిత్రమును మీ ముందుకు తీసుకురండి. మిగతా అన్ని సంకల్పాలను ప్రక్కన పెట్టి చూడండి, మీరందరూ బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులు. సింహాసనము ఉంది కదా! ఇటువంటి సింహాసనము మరెక్కడా లభించదు. కాబట్టి ముందుగా నేను విశేష ఆత్మను, స్వమానధారి ఆత్మను, బాప్‌దాదా యొక్క మొదటి రచన శ్రేష్ఠ ఆత్మను, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని అన్న చిత్రమును వెయ్యండి. సింహాసనాధికారులుగా అయిపోయారు! అంతే కాక పరమాత్మ రచనను, ఈ వృక్షం యొక్క వేర్లలో కూర్చుని ఉన్న పూర్వజ మరియు పూజ్య ఆత్మను, ఈ స్మృతి కలిగి ఉన్న తిలకధారిని. స్మృతి అనే తిలకము పెట్టుకున్నారు! దీనితో పాటు నిశ్చింత చక్రవర్తులు, చింతల భారాన్నంతటినీ బాప్‌దాదాకు అర్పించేసిన డబల్ లైట్ కిరీటధారిని. కిరీటము, తిలకము మరియు సింహాసనాధికారి, తండ్రికి ప్రియమైన, పరమాత్మకు ప్రియమైన ఇటువంటి ఆత్మను.
మరి తమ ఈ చిత్రాన్ని గీసారు కదా. సదా ఈ డబల్ లైట్ యొక్క కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ ధారణ చెయ్యవచ్చు. ఎప్పుడైనా తమ స్వమానాన్ని స్మృతి చేసుకున్నట్లయితే ఈ కిరీటము, తిలకము మరియు సింహాసనాధికారి ఆత్మను, తమ ఈ చిత్రాన్ని దృఢ సంకల్పం ద్వారా ఎదుటకు తీసుకు రండి. గుర్తుందా - ఆరంభంలో మీ అభ్యాసము పదే పదే ఒక్క మాటను గుర్తు తెచ్చుకోవడంలో ఉండేది - ఆ ఒక్క మాట - నేను ఎవరు? ఈ నేను అనేది ఎవరు? ఈ మాటను పదే పదే స్మృతికి తెచ్చుకోండి మరియు తమకున్న భిన్న భిన్న స్వమానాలు, టైటిల్స్, భగవంతుడి ద్వారా లభించిన టైటిల్స్‌ను గుర్తు చేసుకోండి. ఈరోజుల్లో లోకులకు, మనుష్యుల నుండి మనుష్యులకు టైటిల్ లభిస్తేనే ఎంత గొప్పగా భావిస్తారు. మరి పిల్లలైన మీకు తండ్రి ద్వారా ఎన్ని టైటిల్స్ లభించాయి? ఎన్ని స్వమానాలు లభించాయి? స్వమానాల లిస్టును సదా తమ బుద్ధిలో మననము చేస్తూ ఉండండి. నేను ఎవరు? లిస్టును తీసుకురండి. ఇదే నషాలో ఉన్నట్లయితే కారణము ఏదైతే ఉందో ఆ మాట మర్జ్ అయిపోతుంది మరియు నివారణ ప్రతి కర్మలో కనిపిస్తుంది. ఎప్పుడైతే నివారణ స్వరూపులుగా అయిపోతారో అప్పుడు సర్వాత్మలకు నిర్వాణధామం, ముక్తిధామంలోకి వెళ్ళే సహజ మార్గాన్ని చెప్పి ముక్తులుగా చేస్తారు.
మరి దృఢ సంకల్పం చేయండి - దృఢ సంకల్పం చేయడం వచ్చా? దృఢత్వము ఉన్నప్పుడు దృఢత్వము సఫలతకు తాళం చెవి వంటిది. కొంచెం కూడా దృఢ సంకల్పంలో లోటును తీసుకు రాకండి ఎందుకంటే మాయ పని ఓటమిపాలు చెయ్యడము, మరి మీ పని ఏమిటి? మీ పని - బాబా మెడలో హారముగా కావడము, మాయతో ఓడిపోవడము కాదు. నేను సదా తండ్రి మెడలో విజయమాలను అన్న సంకల్పాన్ని అందరూ చేస్తూ ఉండండి. మెడలో హారమును. మెడలోని హారము విజయ హారము.
మీరు ఏమవుతారు అని బాప్‌దాదా చేతులెత్తిస్తే మీరు ఏమని జవాబు ఇస్తారు? మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము, సీతారాములు కాదు అని అందరూ ఒకే జవాబు చెప్తారు. మరి లక్ష్మీనారాయణులుగా అయ్యేవారు మేము బాప్‌దాదా విజయ మాలలో పూసను, పూజ్య ఆత్మను అని అనుకుంటూ మాలలోని పూసను అని జపిస్తూ జపిస్తూ తమ సమస్యలను సమాప్తం చేస్తారు. ఇంతటి శ్రేష్ఠమైన మణులు మీరు. మరి ఈరోజు బాప్‌దాదాకు ఏమి ఇస్తారు? హోలీకు ఏదో ఒక బహుమతిని ఇస్తారు కదా! ఈ కారణము అనే మాట, అయితే, అయితే, ఈ తే, తే అంటూ ఉంటే తోతా (చిలుక)లా అయిపోతారు కదా. తే, తే కూడా వద్దు, ఇలా, అలా అని కూడా వద్దు, ఎటువంటి కారణము వద్దు, నివారణ.
ఈరోజు, హోలీను సదా బాప్‌దాదా సాంగత్యములో ఉండి, కంబైన్డుగా ఉండే హోలీను జరుపుకున్నారా? అన్నింటికన్నా పక్కా సాంగత్యములో ఉండటమే కంబైన్డు రూపము. తోడుగా ఉన్నవారు ముందు వెనుకగా ఉండవచ్చు కానీ కంబైన్డు సదా కలిసి ఉంటారు. కావున హోలీ అనగా తండ్రి సాంగత్యము అనే రంగులో ఉండటము. తండ్రి రంగును వేసుకోవడము అంటే సమానంగా కావడము. మరి కంబైన్డుగా ఉన్నారా లేక అప్పుడప్పుడూ ఉన్నారా! కొంతమంది పిల్లలు పురుషార్థము చేసి కొంత అలసిపోయినప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, ఎవరి తోడును ఇష్టపడరు, ఒంటరిగా ఉండటము, ఒంటరిగా ఆలోచించడము, ఈ ఒంటరితనము కూడా మంచిది కాదు, ప్రభు పరివారము ఇది. ప్రభు పరివారము యొక్క సహచరులు ఒంటరిగా ఎలా ఉండగలరు! ఇది మాయ యొక్క తెలివి. ముందుగా ఒంటరిగా చేసి తర్వాత దాడి చేస్తుంది. మాలలో చూడండి, ముత్యం ఒంటరిగా ఉంటుందా? మాలలోని విశేషత ఏమిటి? ఒక ముత్యం మరో ముత్యంతో సమీప సంబంధాన్ని కలిగి ఉంటుంది. కొంచెం కూడా మధ్యలో ఉన్న దారం కనిపించదు. స్నేహి, సహయోగి, సహచరులు - ఇదే మీ స్మృతిచిహ్నము. మరి హోలీ జరుపుకున్నారా? తండ్రి సమానంగా కావడము అంటే సాంగత్యపు రంగులో వచ్చేయడము. మరి అందరి సంకల్పము ఏమిటి? సమానంగా కావాలి కదా! బాబాకు సంతోషంగా ఉంది, బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ సమానంగా అయ్యేందుకు, శ్రేష్ఠ సంకల్పాలు చేసేందుకు పదమ పదమారెట్లు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. మా అంతటి పదమాపదమ్ అదృష్టవంతులు ఇంకెవరు ఉన్నారు అని నషా ఉంది కదా? ఇదే నషాలో ఉండండి.
మొదటిసారి కలవడానికి వచ్చినవారు లేవండి. మొదటిసారి ఏ పిల్లలైతే ధైర్యమును ఉంచి వచ్చారో వారికి విశేషంగా బాప్‌దాదా ఈ సంగఠనలోని మజాను ఆనందిస్తున్నందుకు అభినందనలు ఇస్తున్నారు మరియు వరదానము కూడా ఇస్తున్నారు - ఆ వరదానము అమర భవ. ఈ వరదానము సదా అమృతవేళ మిలనమును జరుపుకున్న తర్వాత రోజంతటి కోసం పదే పదే గుర్తు చేసుకోండి. అమరుడను, అమరుడైన తండ్రి సంతానమును, అమర పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మను. జన్మ మరొకటి తీసుకున్నా కానీ సుఖశాంతులు అమరంగా ఉంటాయి. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ, ఆగ్రా వారిది:- ఏ టర్న్‌కు సేవ లభించినా కానీ వారు పెద్ద మనసుతో, మనస్ఫూర్తిగా అందరికీ అవకాశాన్ని ఇవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. బాగుంది, డబల్ లాభం జరుగుతుంది. ఒకటి యజ్ఞ సేవ. యజ్ఞ సేవ యొక్క పుణ్యము చాలా గొప్పది. ఒకటికి లక్షింతలు ఫలితం లభిస్తుంది. యజ్ఞ మహిమ తక్కువేమీ కాదు. ఎవరు వచ్చినా కానీ వారికి చాలా లాభము ఉంటుంది. ఒకటి యజ్ఞ సేవ యొక్క పుణ్యము జమ అవుతుంది మరియు రెండవది ఇంతటి శ్రేష్ఠ ఆత్మల కలయిక మధువనంలోనే అవుతుంది. పాండవులు కావచ్చు, దాదీలు కావచ్చు, మహారథి సోదర సోదరీలు కావచ్చు, ఇంతటి అనంతమైన పరివారము ఒకే చోట ఎక్కడ లభిస్తుంది మీకు! సత్యయుగంలో కూడా చిన్న పరివారము ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? (17,500 సోదర సోదరీలు వచ్చారు, ఇందులో 500మంది పిల్లలు ఉన్నారు.) 500మంది పిల్లలు ఉన్నారు అంటే వారు ఎంత అదృష్టవంతులు. ఇంతటి వేలాది సంఖ్యలో ఉన్న పరివారము సత్యయుగంలో లభించదు, త్రేతాలో లభించదు, ద్వాపర కలియుగాలలో లభించదు. ఇటువంటి పరివారము, 17 వేల మందితో ఉన్న పరివారము, ఎప్పుడైనా విన్నారా! సంభాళించడమే కష్టమైపోతుంది. కానీ ఇక్కడ చూడండి అందరూ మజా మజాతో ఉంటున్నారు. మరి ఎంత లాభముంది. పరివారముతో కలవడము ఎప్పుడూ జరగదు. అంతేకాక ఇది విశేషంగా భగవంతుని పరివారము.
అచ్ఛా, ఢిల్లీవారు ఢిల్లీని భవిష్య రాజధానిగా తయారు చెయ్యాలి కదా! పక్కా కదా! తయారుగా ఉన్నారు కదా! మరి ఇది చాలా పెద్ద పరివారము. అందరూ మీ ఢిల్లీలోకి వస్తారు. మీరు తోడుగా అవుతారా? మరి తయారీలు కూడా చెయ్యాలి కదా. మరి ఢిల్లీ తయారు చేసుకుందా? అందరినీ ఆహ్వానించారా? ఇప్పుడైతే ఢిల్లీ గందరగోళంగా ఉంది. రోజూ వార్తలు వింటే ఏమని వార్తలు వస్తున్నాయి? అలజడి, గందరగోళం. ఇప్పుడు ఏమి తయారవుతుంది? ఎటువంటి ఢిల్లీ తయారవుతుంది? బంగారు ఢిల్లీ అవుతుంది. అందరికీ స్థానమును ఇస్తారు కదా. అందరినీ రాజధానిలోకి పిలుస్తారు కదా. మరి ఢిల్లీవారు ముందుగా ఢిల్లీని తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వస్తారు కదా అందరూ. ఢిల్లీవారిలో విశేషతలు ఉన్నాయి. ఢిల్లీవారు ఎన్నో విశేషమైన సేవలను ఇమర్జ్ చేయడము బాప్‌దాదా చూసారు. అందుకు నిమిత్తమయ్యారు. ఢిల్లీని బంగారు ఢిల్లీగా మార్చేందుకు ఎటువంటి ప్లాన్‌ను తయారు చేయండి అంటే అందరి హృదయాల నుండి వాహ్! నిమిత్తమైన ఢిల్లీవారు, మీరు మాకు స్వర్గ రాజ్య భాగ్యాన్ని అందించారు అని రావాలి. ఎందుకంటే ఢిల్లీలోనే స్వర్గం తయారు కానుంది. స్థాపన అయితే అక్కడ జరుగనుంది. బాగుంది, సంగఠన కూడా బాగుంది మరియు సేవ ప్లాన్లను తయారు చేయడంలో కూడా విశేష ఆత్మలు. ఢిల్లీపై సాకార బ్రహ్మా, జగదాంబ మరియు నిమిత్తమైన సర్వ దాదీలకు ప్రేమ ఉంది. ఏ దాదీ అయినా ఢిల్లీకు వెళ్ళకుండా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఇప్పుడు సేవలో కూడా ఏదైనా క్రొత్త ప్లాన్‌ను ఆలోచించండి. ఇప్పుడు అన్ని జోన్లు నవీనతను కోరుకుంటున్నాయి, ఎందుకంటే ఎంతో చేసి ఉన్నారు. ఇప్పుడు అమృతవేళ ప్రత్యేకంగా కూర్చుని ఏదైనా క్రొత్త ప్లాను గురించి ఆలోచించండి, ఆలోచన వస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే సేవ చేస్తున్నారో అది మంచిగానే చేస్తున్నారు. అన్ని జోన్లు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. బాప్‌దాదా విన్నారు - ఎక్కడైతే బాప్‌దాదా పిల్లలకు సేవ కోసం బహుమతిగా స్థానాన్ని ఇచ్చారో, ఢిల్లీ ఓ.ఆర్.సి కావచ్చు, హైదరాబాదులో కావచ్చు, హైదరాబాదు సోదరి ఎక్కడ (కుల్దీప్ అక్కయ్యతో) ఇప్పుడు అక్కడ కూడా మంచి సేవ అల ప్రారంభమయింది. మంచి ధైర్యాన్ని ఉంచారు, ధైర్యానికి బాప్‌దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. ఢిల్లీలో కూడా భిన్న భిన్న రకాల స్థానాలను బిజీగా పెట్టడంలో మంచి శ్రమను చేస్తున్నారు. బాప్‌దాదా వద్దకు అన్ని జోన్లు భిన్న బిన్న రూపాలలో చేస్తున్న సేవలు కావచ్చు, గుజరాత్వారు యూత్ సేవ చేస్తున్నారు, గ్రామాలలో అయినా కానీ యూత్ సేవ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క జోను తమ తమ వంతుగా సేవపై మంచి అభిరుచిని చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి జోనులో భిన్న భిన్న వర్గాలు ఉన్న కారణంగా వర్గీకరణ సేవ సహజంగా అవుతుంది. సమాచారమైతే బాప్‌దాదా వద్దకు వస్తూ ఉంటుంది, బాప్‌దాదా సంతోషపడ్తారు కానీ ఇప్పుడు కావాలి, ఎలాగైతే ఆరంభంలో చిన్న చిన్న బెల్‌ను మ్రోగించి అడ్వర్టైజ్ చేసారు, మరి కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఢోలును మ్రోగించేవారు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇటువంటి ప్రతధ్వనించే గొంతుకు పెద్ద డోలును మ్రోగించండి. చిన్న చిన్న డోలు మ్రోగుతున్నాయి. శివరాత్రి అప్పుడు వచ్చేసారు, వచ్చేసారు అన్న బోర్డులు కొందరు పెట్టడం కూడా బాప్‌దాదా చూసారు, కానీ అందరి హృదయాల వరకు అది చేరుకోలేదు. మా బాబా వచ్చేసారు అన్న మాట అందరి నోటి నుండి రావాలి.
మరి ఏ జోను ముందుగా చేస్తుంది? ఏ జోను అయినా చేయండి, బాప్‌దాదా అందరికీ అవకాశాన్ని ఇస్తారు. కనీసం ఏ వర్గం సేవ అయితే చేస్తున్నారో, ఆ సభలో వచ్చిన వారందరూ మనస్ఫూర్తిగా వచ్చేసారు, వచ్చేసారు అని హృదయపూర్వకంగా అనాలి, నినాదాలు చేయడం కాదు, హృదయంతో మా బాబా వచ్చేసారని అనాలి. కొందరు మాట్లాడుతారు, కొందరు భావిస్తారు కానీ పూర్తి సభ తమ ఉల్లాస ఉత్సాహాలతో వచ్చేసారని అనాలి. ఇదైతే చేయగలరు. పూర్తి సభను తయారు చేయండి. రానైతే వస్తున్నారు, కానీ ఒప్పుకోవాలి.
సమయమైతే సమీపంగా వస్తూనే ఉంది, మరి ఢిల్లీవారికి అభినందనలు. ఎందుకంటే ఢిల్లీవారికి చాలా పెద్ద బాధ్యత ఉంది. మొట్టమొదట సేవ యొక్క స్థాపన నియమ ప్రమాణంగా, ఈరోజుల్లోని నియమానుసారంగా సెంటరు కాదు, కానీ సేవ యొక్క ఆరంభము ఢిల్లీ నుండి జరిగింది. మరి ఇప్పుడు మరింత అద్భుతము చేసి చూపించండి. ఎవరి బుద్ధిలోనైనా ప్లాను రావచ్చు. అచ్ఛా - అభినందనలు.
ఆగ్రా వారు లేవండి:- కొద్దిమంది ఉన్నారు. అయినప్పటికీ ఆగ్రావారు విశేష సేవను చేస్తున్నారు. ఈరోజుల్లో ఉన్న ప్రభుత్వంతో ఆగ్రాలో సేవ జరుగుతోంది, అంతకన్నా ఎక్కువగా ఆల్మైటీ ప్రభుత్వం ద్వారా సేవ జరగాలి. ఆల్మైటీ ప్రభుత్వం యొక్క పేరు ప్రసిద్ధి చెందేలా ఇప్పుడు ఆగ్రావారు ప్లాను తయారుచెయ్యండి. మరోసారి వచ్చినప్పుడు సేవ యొక్క ప్లాను అంతా పరస్పరం చర్చించుకుని ఎవరినైనా సహచరుని చేసుకుంటారో, ఎవరి సహాయమైనా తీసుకోవాలంటే సహాయమును కూడా తీసుకుని బాబా ఈ సంవత్సరం ఈ ఈ సేవలు విశేషంగా జరిగాయి అని బాప్‌దాదాకు ప్రాక్టికల్‌గా చెప్పాలి. టీచర్లు ఎక్కడ ఉన్నారు? మరి చేస్తారా? పూర్తి ప్లానును తయారు చేసుకుని రండి. ఎక్కడెక్కడ సేవ చేసారు, ఏ నవీనతను తీసుకువచ్చారు, ఎంతవరకు సందేశం వ్యాపించింది, ఈ రికార్డును తీసుకురండి. సరేనా. కొద్దిమందే ఉన్నారు కానీ 5 పాండవులు ఏమి చెయ్యలేదు! మరి మీరు ఈ అద్భుతాన్ని చేసి చూపించండి, సంఖ్య తక్కువ మరియు సేవ అన్నింటికన్నా ఎక్కువ. సరేనా. బాగుంది. బ్రహ్మా బాబాకు అయితే ఆగ్రాపై విశేషమైన శ్రద్ధ ఉండేది. మరి బ్రహ్మా బాబాకు ఋజువును చూపించండి. అచ్ఛా. బాగుంది, సేవ ఛాన్సును తీసుకున్నారు. చాలా మంచిది.
డబల్ విదేశీయులు 50 దేశాల నుండి 700మంది సోదరసోదరీలు వచ్చారు:- అంకుల్‌గారు కూడా వచ్చారు, వాహ్! ఈ యుగళ్ను చూస్తే, పరివారాన్ని చూస్తే బాప్‌దాదాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణ పరివారంలో నియమానుసారంగా మొట్టమొదటి వి.ఐ.పి నిమిత్తమయింది మీరే. చప్పట్లు కొట్టండి. మరో అద్భుతము ఏమిటంటే డ్యూటీలో ఉంటూ ప్రభుత్వ డ్యూటీలో ఉంటూ కూడా సెంటరును స్థాపించారు మరియు అనేక వి.ఐ.పీలను పరిచయం చేసారు. గయానాలో తెరచినా కానీ, గయానాయే అమెరికా సేవకు నిమిత్తమయింది. కావున కేవలం గయానాకు మాత్రమే కాదు, అమెరికా సేవకు కూడా నిమిత్తులు. అందుకే బాప్‌దాదా మనస్ఫూర్తిగా దీవెనలు, హృదయపూర్వక ప్రియస్మృతులు కూడా పదమా పదమారెట్లు ఉన్నాయి. ఆంటీ ఎక్కడ ఉన్నారు? పిల్లలు కూడా వచ్చారు కదా. గారాల సంతానము, పరివారానికి కూడా గారాల సంతానము మరియు బాప్‌దాదాకు కూడా గారాల సంతానము కదా. అచ్ఛా.
డబల్ విదేశీయులకు బాప్‌దాదా ఏమని టైటిల్ ఇచ్చారు? డబల్ తీవ్ర పురుషార్థి. డబల్ విదేశీయులైతే బాప్‌దాదా యొక్క విశ్వ పరివర్తకుడు అన్న టైటిల్‌ను సిద్ధి చేసారు అని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. లేకపోతే అందరూ భారత కళ్యాణకారి అని అనేవారు, విదేశాల కారణంగా ప్రాక్టికల్‌గా విశ్వ కళ్యాణకారిగా అయ్యారు. ప్రతి సీజనులో డబల్ విదేశీయుల సంఖ్య పెరగడం బాప్‌దాదా చూసారు మరియు విశేషమైన పరివర్తన ఏమిటంటే మొదట్లో మా కల్చర్, భారతదేశ కల్చర్ అని వినిపించేది ఇప్పుడు లేదు. పరివర్తన జరిగిపోయింది. ఇప్పుడు అందరిదీ ఒకే కల్చర్ అయిపోయింది, బ్రాహ్మణ కల్చర్. ఇష్టమే కదా. బ్రాహ్మణ కల్చర్ ఇష్టమే కదా. ఇష్టమే, అందుకే బాప్‌దాదాకు డబల్ విదేశీయులైన మీరంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే విశేషత ఏమిటంటే ఏదైనా కార్యము చేస్తే పూర్తిగా చేస్తారు. ధైర్యమునుంచి అవును అంటే అవును, లేదు అంటే లేదు. ఇందులో తెలివైనవారు. కానీ మెజారిటీ హా జీ, హా జీ అనే అంటున్నారు. మధురమైన బాబా, మధురమైన దాదీలు, మధురమైన పరివారము, హా జీ, హా జీ అని అంటూ బాగా ముందుకు వెళ్తున్నారు. స్టూడెంట్లు పెరగడం కష్టము అని అనేవారు. ఇప్పుడు కష్టంగా ఉందా? ఇప్పుడు వస్తున్నారు కదా. ఇప్పుడు వి.ఐ.పీలు కూడా సంబంధ సంపర్కంలోకి వస్తున్నారు. మరి మీ అందరి హృదయాలలోని ఉల్లాస ఉత్సాహాలు మిమ్మల్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయి, సేవను కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయి. ముందుకు వెళ్తున్నారు కదా? వెళ్తున్నారు కదా? సంతుష్టంగా ఉన్నారు కదా! బాగుంది, ఆబూలో మీరు చేసే సంగఠన అందరిలో బలాన్ని నింపుతుంది. అందుకే తప్పకుండా ప్రతి సీజనులో వస్తూ ఉండండి, వస్తూ ఉండండి, యజ్ఞము యొక్క శోభను పెంచుతూ ఉండండి. వీరు ఏదైతే ప్రోగ్రాములు పెడతారో, మీటింగులు చేస్తారో, డైలాగ్ కావచ్చు, సమయపు పిలుపు కావచ్చు అవి బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తాయి. అచ్ఛా, అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
మాతలందరూ చేతులెత్తండి:- (10 వేల మంది మాతలు వచ్చారు) చేతులు బాగా కనిపిస్తున్నాయి. బాప్‌దాదా కూడా చేయి ఊపుతున్నారు. విశేషంగా మాతలు ఏ సెంటరులో అయితే మంచి పురుషార్థిగా, స్నేహిగా ఉంటారో, బాప్‌దాదా వరదానము ఏమిటంటే ఎక్కడ మాతలుంటారో అక్కడ యజ్ఞ భండారా మరియు భండారీ సదా నిండుగా ఉంటాయి. బాగుంది. మాతలు స్నేహంతో చేసే యజ్ఞ సేవలో నిండుదనము ఉంటుంది. నిండుదనం ఉన్న కారణంగా భండారా మరియు భండారీ కూడా నిండుగా ఉంటాయి అందుకే మాతలకు బాప్‌దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
పాండవులు చేతులెత్తండి:- పాండవులు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, పాండవులు లేకుండా సెంటరు సేవలో ఉన్నతి లభించదు. పాండవులు ఒకటి - సేవా ప్లాన్లు చాలా మంచిగా చేస్తారు, పాండవులకు ఈ వరదానము లభించి ఉంది. సేవ యొక్క క్రొత్త క్రొత్త ప్లాన్లు మంచిగా తయారు చేస్తారు మరియు శక్తులను చూసుకునేవారు. సదా పాండవులు ఇలా భావించండి - ఎక్కడ ఉన్నా కానీ, సెంటరులో ఉన్నాకానీ, ఇంట్లో ఉన్నా కానీ శక్తులను చూసుకునేవారు. ఎవ్వరికీ కూడా చెడు దృష్టి పోకూడదు. ఇటువంటి సేవాధారులు. ఒకవేళ పాండవులు రాకపోతే, ఈ శ్రేష్ఠ జ్ఞానంలోని నవీనత ఏమిటంటే ఇక్కడ ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా, పరివారంలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా, మోహజీత్ నష్టోమోహులుగా ఉండటము. ఒకవేళ పాండవులు లేకుండా కేవలం శక్తులే ఉన్నట్లయితే ఎలా నడిచేది! అందుకే ఒకచోట శక్తుల మహిమ ఉంది, మరోచోట పాండవుల మహిమ ఉంది, ఇందుకు చిత్రము చతుర్భుజుడు. పాండవులు లేకుండా కూడా బాబా కార్యము ముందుకు సాగదు మరియు శక్తులు లేకుండా కూడా బాబా కార్యము పూర్తి కాదు. అందుకే పరివారం యొక్క ఆవశ్యకత ఏమిటి, మహత్వము ఉంది. చిన్న పిల్లలు కూడా తక్కువేమీ కాదు, చిన్న పిల్లలను చూసి అందరూ సంతోషిస్తారు. చిన్న పిల్లలు చేతులెత్తండి. చేతులూపండి. మిమ్మల్ని ఏమని అనాలి? వాహ్! పిల్లలు వాహ్! పిల్లల మహిమ కూడా ఉంది, ఒకవేళ పిల్లలు లేకపోతే ప్రవృత్తి అని అనగలమా! ప్రవృత్తిలో పిల్లలు కూడా కావాలి, పాండవులు కూడా కావాలి, శక్తులు కూడా కావాలి. మరి విన్నారా, పిల్లలు కూడా రిట్రీట్ చేసారు. కుమారుల రిట్రీట్ జరిగింది, కుమారీల రిట్రీట్ కూడా జరిగింది. ఎవరి రిట్రీట్ అయితే జరిగిందో వారు లేవండి. అధర్కుమారులు కూడా లేవండి, యూత్ కూడా లేవండి.
బాప్‌దాదా వద్దకు పూర్తి సమాచారము వస్తుంది. మీరు ఏదైతే పురుషార్థము చేసారో, కుమారులు కావచ్చు, అధర్కుమారులు కావచ్చు, మధుబన్ వాతావరణంలోకి వచ్చి తమ స్థితిని, తమ పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళినందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మరెక్కడా లభించదు. ఇప్పుడు యూత్ కుమారులు కావచ్చు, అధర్కుమారులు కావచ్చు, ఎవరైతే ఇక్కడ తీవ్ర పురుషార్థము యొక్క అనుభూతిని పొందారో, తీవ్ర పురుషార్థాన్ని అనుభవం చేసారా? దానిని అమరంగా పెట్టుకోండి. అమరభవ అనే వరదానాన్ని సదా గుర్తు పెట్టుకోండి. అంతే కానీ అక్కడకు వెళ్ళగానే తీవ్ర పురుషార్థి కాదు, పురుషార్థి అని అనకండి. మేమింకా ఎగిరే కళలో ఎగురుతున్నాము అని చెప్పండి. సరేనా. ఇటువంటి రిజల్టును తీసుకురండి. చాలా బాగా చేసారు. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క సెకండులో బ్రాహ్మణులందరూ తమ రాజయోగమును అభ్యసిస్తూ మనసును ఏకాగ్రం చేసే యజమానులుగా అయి మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయము, ఎలా కావాలంటే అలా ఇప్పుడిప్పుడే మనసును ఏకాగ్రం చెయ్యండి. మనసు ఎక్కడ కూడా అక్కడిక్కడ చంచలతలోకి రాకూడదు. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా ఈ స్నేహము యొక్క సాంగత్యపు రంగుతో ఆధ్యాత్మిక హోలీను జరుపుకోండి. (డ్రిల్). అచ్ఛా.
నలువైపుల ఉన్న శ్రేష్ఠమైన విశేషమైన హోలీ మరియు హైయెస్ట్ పిల్లలకు, సదా స్వయమును తండ్రి సమానంగా సర్వ శక్తులతో సంపన్నంగా సర్వశక్తిమంతునిగా అనుభవం చేసుకునేవారికి, సదా ప్రతి బలహీనత నుండి ముక్తులై ఇతర ఆత్మలకు కూడా ముక్తినిచ్చే ముక్తిదాత పిల్లలకు, సదా స్వమానము అనే సీట్‌పై సెట్ అయ్యేవారికి, సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి, నలువైపుల ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎదురుగా కూర్చుని ఉన్నా కానీ, దూరంగా కూర్చుని స్నేహంలో ఇమిడిపోయిన పిల్లలకు ప్రియస్మృతులు మరియు తమ ఉల్లాస-ఉత్సాహము, పురుషార్థము యొక్క సమాచారము ఇచ్చేటువంటి వారికి బాప్‌దాదా నుండి చాలా-చాలా హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక పదమాపదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి మరియు రాజయోగి సో రాజ్య అధికారి పిల్లలందరికీ నమస్తే.
మోహిని అక్కయ్యతో:- (ఆరోగ్యం గురించి సమాచారం వినిపించారు) సమయానికి పూర్తి చేసుకుని వచ్చి మంచి పని చేసారు. ఇది బుద్ధి యొక్క తెలివి. చాలా మంచిది.
దాదీ జానకితో:- మజా వస్తుంది కదా. (ఏమని చెప్పను, ఎలా చెప్పను) కళ్ళతో. ఇది బాగుంది. నడిపించేవారు నడిపిస్తున్నారు. (వయస్సులో అందరికన్నా పెద్దదాన్ని) అభినందనలు. (అందరూ బాప్‌దాదాను చూడాలి) ఈ కళ్ళు చూడాలి కదా, బాబా ఏమి చేస్తారు, ఎలా చేస్తారు అని ప్రపంచం చూడాలి. అచ్ఛా.
దాదీలతో:- అందరూ మంచిగా ఉన్నారా! అందరూ ఆది రత్నాలు. చాలా మంచిది. ఎగురుతున్నారు. అచ్ఛా. మంచిది, కూర్చోండి. పాత వస్తువులు చాలా విలువైనవిగా ఉంటాయి, వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.
రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్య, డా.అనిల అక్కయ్యతో:- చాలా మంచిగా చేసారు. వీరు ఆది రత్నాలు. సేవ ఆది రత్నము. జగదాంబ ఉన్నటువంటి మొదటి పరివారము. లక్కీ పరివారము. (ఉష అక్కయ్యతో) మంచి పాత్రను వహించారు. కానీ వీరి నేచర్ ఎలా ఉందో దాని అనుసారంగా చాలా-చాలా-చాలా మంచి పాత్రను వహించారు. అందుకే అందరి ప్రేమ ఉంది మరియు మంచి పాత్రను వహించారు అని అందరూ సంతోషంగా ఉన్నారు. డైరెక్టు పాలన తీసుకునేవారు. ఇది ఆది పరివారము. వీరు సాకార బాబా పాలనను కూడా సమీపం నుండి పొందారు మరియు సేవలో పాత్రను వహించారు. (డా.అనీల అక్కయ్యతో) వీరికి కూడా వరదానము ఉంది.
శాంతి అక్కయ్య (సిరిఫోర్టు)తో:- శరీరం యొక్క లెక్కాచారాన్ని పాస్ కావడంలో ఇప్పుడు మెజారిటీ పాస్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. మీరు కూడా పాస్ సర్టిఫికేట్‌ను తీసుకున్నారు. చాలా మంచి పాత్రను వహించారు. ఈరోజుల్లో డాక్టర్ల సేవ చాలా జరుగుతుంది. వారు తేడాను చూస్తున్నారు కదా, ప్రాక్టికల్ జీవితము, దాని ప్రభావము పడుతుంది. (సేవ చేసే అక్కయ్యలతో) వీరు చాలా గారాల సంతానము. ఈ చిన్నది చాలా గారాల సంతానము. మనస్ఫూర్తిగా సేవ చేసారు. మనసుతో చేసే సేవకు చాలా మహత్వము ఉంటుంది. సేవ అందరూ చేస్తారు కానీ ఎవరైతే మనసుతో చేస్తారో దాని మహత్వము ఉంటుంది. వీరు పురుషార్థంలో చాలా ముందుకు వెళ్తున్నారు. చాలా మంచిది.
డా.అనిలా అక్కయ్యతో:- బాబాతో హృదయపూర్వక స్నేహము, పరివారముతో హృదయపూర్వక స్నేహము, కావున పరివారము యొక్క దీవెనలు మరియు తండ్రి నుండి కూడా దీవెనలు.
ముఖ్యమైన విదేశీ సోదర సోదరీలతో:- బాగుంది, మధువనంలో ఉండే ఛాన్సు కూడా మరియు సేవ యొక్క విశేషమైన ఛాన్సు కూడా. అయినప్పటికీ చూడండి సేవకు నిమిత్తమైన రెండో గ్రూపుకు ముఖ్య యాక్టర్లు మీరు. ఆది సమయము యొక్క గ్రూపు అయితే ఇక్కడ కూర్చుని ఉంది కానీ సేవలో ఆది రత్నాలు, సేవా సహచరులుగా అయి సహచరునిగా చేసుకునే గ్రూపు మీది. బాప్‌దాదా ఎంతగా వీరి మహిమ చేస్తారో, ఆది స్థాపన రత్నాలను, అంతగా ఆది సేవా సహచరులను కూడా మహిమ చేస్తారు. విదేశాలలో ఉన్నా కానీ మీరు నిమిత్తమయ్యారు. మెజారిటీ అందరూ సేవా స్థాపన రత్నాలు. మరి మీకు కూడా మంచి అవకాశం లభించింది. తప్పకుండా శ్రమ చెయ్యవలసి ఉంటుంది ఎందుకంటే వారి జీవితము, కల్చర్ అన్నీ భిన్నంగా ఉంటాయి. వారిని ఒక్క కల్చర్‌లో జోడించడము - ఇందుకు మీకు అభినందనలు. మంచి శ్రమ చేసారు. శ్రమ అయితే చెయ్యవలసి వచ్చింది కానీ సఫలత కలిగింది. శ్రమ వృధా కాలేదు, ఇప్పుడు రెస్పాన్సు మంచిగా లభిస్తుంది. విదేశీయులు కూడా సేవలో సహచరులుగా మంచిగా అవుతున్నారు. ప్రతి సెంటరులో మీకు సహాయాన్ని అందించేవారు అయితే ఉన్నారు. ఉన్నారు కదా! బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికీ పదమ పదమారెట్ల అభినందనలు, అభినందనలు.
చంద్రహాస్ బాబూజీతో:- బాగున్నారా! మనసు గట్టిగా ఉంది కదా. మనసు గట్టిగా ఉంటే తనువు మంచిగా అయిపోతుంది. మనసు సదా సంతోషంతో నాట్యంచేస్తూ ఉండాలి. స్ట్రెచర్‌పై పోవాల్సి వచ్చినా కానీ మైండ్ డ్యాన్స్ జరుగుతూ ఉండాలి. చింత అయితే ఏమీ లేదు కదా. నిశ్చింత చక్రవర్తి. అచ్ఛా!
ఓంశాంతి